కూసుమంచి గణపేశ్వరాలయం/గ్రామంలో చెప్పుకునే కథ
గ్రామంలో చెప్పుకునే కథ
ఈ బృహత్తర ఆలయం గణపతిదేవుని కాలంలో ఆయన గురువు విశ్వేశ్వరస్వామి నిర్వహణలో కట్టించబడిందని, గణపతిదేవుడు తనకు అనేక విజయాలను ప్రసాదించిన శివుడికి భక్తిపూర్వక కృతజ్ఞతగా నిర్మించిన అనేక ఆలయాలలో ఇదొకటని చెపుతారు. కూసుమంచి గ్రామం ఆ కాలంలో కూడా చాలా చిన్న ఊరుకావడంతో దేవాలయ నిర్మాణానికి ఓరుగల్లు ప్రాంతం నుంచి అనేక మంది నిపుణులను, కూలీలను రప్పించారని. వారి పనిని పర్యవేక్షించే నిర్వాహకుడికి ఒక కన్ను ఒక చేయి ఒకకాలు వుండేదని. అతనికి రోజు తల్లి భోజనం తీసుకుని వచ్చి ఇచ్చి వెళుతుండేదట. భోజనం అందజేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లమని ఇతను కోరాడట. ఆమె రోజూ అలాగే చేస్తూ వుండేది. దేవాలయ నిర్మాణం దాదాపు చివరికి వచ్చింది. అసలు ఇలా వెనక్కి తిరిగి చూడొద్దని ఎందుకన్నాడా అనే అనుమానం ఆమెను నిరంతరం పీడించేది. ఈ ఉత్కంఠతను తట్టుకోలేక ఒకరోజు భోజనం అందజేసి వస్తూ వస్తూ ఈ విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంతో వెనక్కి తిరిగి చూసిందట. ఆ మరుక్షణమే అతడు రక్తం కక్కుకుంటూ చనిపోయాడనీ చెప్పుకుంటారు.
కథలో అతని ఆకారం విచిత్రంగా వుండటాన్నిబట్టి ఈ బృహత్తర ఆలయ నిర్మాణంలో గ్రహాంతర వాసుల సహకారం వుందేమోననే అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తంచేస్తున్నారు. ఒక మహత్తర యాంత్రిక,తాంత్రిక లేదా మాంత్రిక శక్తి పనిచేయనిదే ఇంతటి బరువైన రాళ్ళను అంత ఖచ్చితంగా చెక్కుకుంటూ ఇంటర్ లాకింగ్ విధానం ద్వారా పిల్లలు లెగోబ్రిక్స్ (వివిధ ఆకారాలలో వున్న ముక్కలను వేర్వేరు పద్దతులలో కలపటం ద్వారా నిర్మాణాలను తయారుచేసుకునే పిల్లల ఆటవస్తువు పేరు ఇది, లెగో అనే కంపేనీ తయారు చేసిన ఇటుకల వంటివి కనుక వీటికి లెగోబ్రిక్స్ అంటారు) ను బిగించినట్లు బిగించుకుంటూ రావడం, సరిపడకపోతే మరోసారి తీసి సరిచూసుకోవడం మామూలు మానవశక్తికి సాధ్య పడేది కాదు అంటుంటారు. కథల్లోనూ, వ్యాఖ్యానాల్లోనూ ఎంత నిజం ఎంత కల్పితం వుందనేది నిర్ధారించలేకపోయినప్పటికీ చరిత్రను అర్ధం చేసుకునేందుకు ఏ చిన్న ఆధారమైనా విలువైనదే. ఈ కథ మొత్తంలో క్రేన్లూ, ప్రొక్లెయిన్లూ లేని ఆ కాలంలో కేవలం మానవ శక్తితో ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఇంతదాకా ఎలా తరలించారు? వాటిని ఒక వరుసలో చెక్కముక్కలు పేర్చినంత సులభంగా, సున్నితంగా, ఖచ్చితంగా వీటిని ఎలా పేర్చారు అనేది అతి పెద్ద ఆశ్చర్యమే. నిశితంగా పరిశీలించినపుడు మరికొంత ఫినిషింగ్ పనులు పూర్తికాకముందే ఏవో బలమైన కారణాల వల్ల ఆలయ నిర్మాణం అర్ధంతరంగా ఆపివేసి వుంటారేమో అనే అనుమానం కలుగుతుంది.