కూసుమంచి గణపేశ్వరాలయం/ఉపాలయాలు

ఉపాలయాలు

ముక్కంటేశ్వరాలయం

గణపేశ్వరాలయానికి దక్షిణదిశలో ప్రధానాలయానికి దగ్గరలో ఈ ముక్కంటేశ్వరాలయం వుంది. దీనిలో ఒకే నిర్మాణంలొ పక్కపక్కనే మూడు అంతరాలయాలు ఒకే రంగమంటపం ద్వారా కలపబడి వుంటాయి. రంగమండపానికి ఒక్కో వరుసకు పది స్థంభాల వంతున మూడు వరుసల్లో ముప్పై స్థంభాలున్నాయి. ఇవిగాక ఆలయానికి ఉత్తర దిశగా ప్రధాన ఆలయం వైపుకు తోరణం (పోర్టికో) లాగా మరో రెండు స్తంభాలున్నాయి. వీటితో కలిపి మొత్తం 32 స్తంభాల ఈ మండపం చూసేందుకు చాలా అందంగా వుంది. వరుసగా వున్న మూడు అంతరాలయాల్లో మధ్యలో వున్న గర్భాలయం ప్రధానమైనది అని సూచిస్తున్నట్లుగా వుంటుంది. దాని ముందున్న నాలుగు స్థంబాలు ప్రత్యేకమైన శిల్ప నిర్మాణాన్ని కలిగివున్నాయి. ప్రధానాలయంలోని శిల్పం కంటే ఇక్కడి ఆలయంలోని శిల్పరీతి ఆకర్షణీయంగా వుంటుంది. మండపంలోని అందమైన హంసలవంటి శిల్పాలలోనూ, ఇతర శిల్పాలలోనూ సునిశితమైన పనితనం కనిపిస్తుంది. మూడింటి మధ్యలోని గర్భాలయానికి ఎదురుగా వున్న నాలుగు స్తంభాల మధ్య రంగమండపం వుంది. రెండు అంతరాలయాల్లో నిర్మాణపరంగా ఏమాత్రం దెబ్బతినని శివలింగాలు వున్నాయి. అవి ఈనాటికీ పూజకు నోచుకోలేదు.

ఈ ఆలయం ఉత్తర దిశకు తిరిగి వుండటం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలో చేర్చారు. అయినప్పటికీ మండపం పైన పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగివున్నాయి. స్తంభాలూ, మండపమూ మరింతగా కూలిపోకుండా వుండేందుకు రక్షణ చర్యలు తీసుకుంటున్న ఛాయలు కనిపించడంలేదు. కనీసం చుట్టూ కంచె లేదా సరిహద్దుల ఏర్పాట్లేమీ లేవు. ఈ మధ్యకాలంలోనే ఈ గుడిలోని రంగమండపాన్ని యంత్రాలను ఉపయోగించి పగలగొట్టారు. అడుగుకు పైగా మందం వున్న బండను కత్తిరించి లోపల తవ్వకం చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగితే ఈ ఆలయం త్వరలోనే పూర్తిగా శిథిలం అయ్యే అవకాశాలున్నాయి. కేవలం ప్రధాన ఆలయం వరకే స్థలాన్ని సేకరించి దానివరకు మాత్రమే ఒక సరిహద్దుగోడను నిర్మించారు. అందువల్ల ఇటువైపు ఇంత ప్రాముఖ్యత వున్న ఉప ఆలయాలు వున్నట్లే సందర్శకులకు తెలియడం లేదు. శిధిలాలయ ఆవరణమంతా పిచ్చిమొక్కలతో నిండి వుండటం వల్ల ఆలయరూపమే కనిపించడంలేదు. పైగా ఇటువైపు రావాలంటే భయపడేలావుంది.


వేణుగోపాల స్వామి ఆలయం

ప్రదాన ఆలయం మరియు ముక్కంటేశ్వరాలయాలకు మరింత దక్షిణాన చిన్నదిగా కుదురుగా వున్న ఈ ఆలయం అత్యంత శిధిల స్థితిలో వుంది. దీనిలో ప్రధాన గర్భగుడికి ముందు ఒక్కో వరుసలో 4 స్తంభాల లెక్కన నాలుగు వరుసలుగా పదహారు స్తంభాల ఆలయమండపం వుంది. ఇవిగాక తూర్పున మరో రెండు స్తంభాలు పోర్టికోలాగా అమర్చివుంటాయి. వాటితో కలిపి 16+2 మొత్తం పద్దెనిమిది స్తంభాల మండపంతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ పదహారు స్తంభాలలో కూడా ప్రధాన ఆలయానికి ముందున్న నాలుగు స్తంభాలు ముక్కంటేశ్వరాలయంలో మాదిరిగానే ప్రత్యేక శిల్పరీతిని కలిగివున్నాయి.

చాలా కాలం క్రిందటి వరకూ మురళిని వాయిస్తున్న వేణుగోపాలుడి విగ్రహం ఇందులో వుండేదట. ఈ ఆలయం చుట్టుపక్కలున్న పొలాలకు చెందిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని చూసినట్లు వారి అనుభవాన్ని పేర్కొన్నారు. వేణుగోపాలుడు వైష్ణవ సంబంధమైన దేవుడు. శైవాలయ ప్రాంగణంలో వుండటం ఒక విశేషం. ఒకే ఆలయ ప్రాంగణంలో హరిహరులిద్దరూ ప్రాధాన్యత కలిగివుండటం కాకతీయుల మతసామరస్యానికి ప్రతీక. ఈ పద్దతిలో హరిహరాద్వైతాన్ని చాటిచెప్పేనిర్మాణాల ఉదాహారణలు చాలా వున్నాయి. వరంగల్ లోని కాశీబుగ్గలో శ్రీరంగనాథ ఆలయంలో ఈశ్వరుని పానవట్టము మీద శ్రీరంగనాథ స్వామి విగ్రహము చెక్కబడివుంది. ఓరుగల్లు సమీపంలోని శాయంపేట హవేలీలోని పాంచాలరాయ స్వామి దేవాలయంలో కూడా పానవట్టం మీదనే పాంచాలరాయ స్వామి విగ్రహం చెక్కబడింది. వరంగల్ కోటలో ఒక పాడుబడిన దేవాలయంలో పానవట్టం మీదనే శ్రీదేవీ భూదేవీ సహిత విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్టింపబడింది. వేయిస్తంభాల గుడి త్రికూటాలయంలో శివ-వాసుదేవ-సూర్యాలయాలను నిర్మించారు. అక్కడే నృత్యనృసింహుని విగ్రహాన్ని చెక్కించారు. పాలంపేట దేవాలయంలో సైతం శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు రంగమంటపం పైభాగంలో చెక్కిన క్షీరసాగర మధనం వంటి అనేక విష్ణులీలలు కనిపిస్తాయి. ఇవన్నీ కాకతీయులు శైవ-వైష్ణవ మతాలను సమన్వయ పరచుతూ ప్రజలలో సామరస్యాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలుగా అర్ధం చేసుకోవచ్చు. ఇదే పద్దతిని పోతన,శ్రీనాథాదులు పాటిస్తూ తమ రచనలలో ‘హరిహరనాథ సృష్టి’ చేసారు. కాకతీయ ప్రోలరాజు సామంతుడైన వేమబోల మల్లినాయకుడు మాటేడులో అలాంటి త్రికూటాలయాన్ని నిర్మించాడు. కాకతి రుద్రదేవుడు అనమకొండ(హన్మకొండ) లో వేయిస్తంభాల గుడిని అదే పద్దతిలో కట్టించాడు. పిల్లలమఱ్ఱి రామిరెడ్డి తన పేరుతోనూ తన తల్లిదండ్రుల పేరుతోనూ త్రికూటాలయాలను నిర్మించాడు. ఐనవోలు, కుందారం, కారపాములు, కొండపాక, నాగులపాడు, పానగల్లు మొదలైన చోట కూడా ఇలాంటి త్రికూటాలయాలు కనిపిస్తాయి.

వేణుగోపాలస్వామి ఆలయం దక్షిణ దిశకు ఎందుకు తిరిగి వుంది?

సాధారణంగా దేవాలయాలు తూర్పుదిశగానే తిరిగి వుంటాయి. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి. యమలోకాధిపతి కూడా! ప్రతిప్రాణి యొక్క పాప పుణ్యాలను తరచి చూసి శిక్షలు అమలు జరిపే ధర్మ దేవత! ఈ లక్షణమే, ఈ ధర్మమే, ఈయనకు మిగతా దేవతల కంటే ఉగ్రమైన రూపాన్ని ఇచ్చింది. అందుకేనేమో యమదిశగా చూస్తున్నట్లు సాధారణంగా దేవాలయాల నిర్మాణం చేయరు. కానీ ఈ ఆలయ సముదాయాలలోని వేణుగోపాల స్వామి ఆలయం మాత్రం దక్షిణ దిశగా తిరిగి వుంది. గర్భాలయంలోని మూల విరాట్టు దక్షిణ దిశలోకి దృష్టిని సారించేలా వున్న నిర్మాణాలు మేథో దక్షిణామూర్తి ఆలయాల్లోనూ, కొన్ని మృత్యుంజయ నరసింహాలయాల్లోనూ, చిరంజీవి అయిన ఆంజనేయస్వామి ఆలయాల్లో తప్ప అరుదుగా చూస్తాం. అటువంటి అరుదైన ఆలయమే గణపేశ్వరాలయానికి ఉపాలయంగా వున్న ఈ వేణుగోపాల స్వామి ఆలయం కూడా. మరి ఈ వేణుగోపాలుడు దక్షిణ దిశను చూడటంలో ప్రత్యేకత ఏమిటి? అనేదానికి సమాధానంగా మరో ధర్మసూక్ష్మంలా వాస్తు, శాస్త్ర కోణాన్ని కూడా చూడవచ్చు. శివకేశవాలయాలు ఒకే ప్రాంగణంలో వుంచాల్సి వచ్చినపుడు వాటి శక్తిపాతం సన్నగిల్లకుండా వుండేందుకు అనువుగా వాటి దిశానిర్ణయం చేస్తారు. ఇక్కడ ఆలయాల సమిష్టి ప్రాంగణంలో శివాలయం ప్రాథమికంగా వుంది కాబట్టి, ఆ ఆలయానికి మధ్యలో ముక్కంటేశ్వరాలయం దానికి వెనుకగా అన్నట్లు వేణుగోపాలుడు వున్నాడు. భౌగోళిక వాస్తురీత్యా దక్షిణ దిశను చూస్తున్నట్లు వుంటాడు కానీ, ఆలయ సముదాయపు దృష్టితో చూస్తే త్రికూటాలయదిశకు వ్యతిరేకంగా అవతలి దిశను చూస్తున్నట్లుంటాడు. మరోలా చెప్పాలంటే త్రికూటాలయం వెనుక భాగం వేణుగోపాలుడి సంరక్షణలో వుంటే, వేణుగోపాలుడి వెన్నుకాస్తున్నట్లు త్రికూటాలయం వుంటుంది. ఇక్కడ మరో చమత్కారం ఏమిటంటే వేణుగోపాలుడు చూస్తున్న దిశగా భక్తుల ప్రవేశంకాక సాధారణ ఆలయాలలో మాదిరి గానే తూర్పుదిశనుంచి ఆలయంలోకి ప్రవేశించే పద్దతిలో మంటప నిర్మాణం చేపట్టారు.

ఈ సంక్లిష్ట నిర్మాణం సౌందర్యం ఈ ఆలయ ప్రత్యేకత. దీనిని ఆలయనిర్మాణ పద్దతులను అధ్యయనం చేసిన వారు పరిశీలిస్తే దీనిగురించి మరెన్నో కొత్త సంగతులు బయటకు వచ్చే అవకాశం వుంది. ఈ వేణుగోపాలుడి ఆలయం ఇప్పటికీ రక్షిత కట్టడాల జాబితాలోకి రాలేదు. ఇప్పటికే ఒక మూలగా వున్న స్తంభం దాదాపు విరిగి పడిపోయే దశలో వుంది. దానిని కాపాడేందుకు తగిన ఆధారాన్నివ్వడమో లేదా మరో స్తంభం వాడి పునర్నర్మించడమో చేయకపోతే మొత్తం ఆలయమే శిథిలం అవుతుంది. ఆ ఒక్క స్తంభం కూలితే మొత్తం కాకతీయ నిర్మాణ శైలిని ప్రతిబించించే మండపమే చేజారిపోతుంది. అందుకే ప్రభుత్వమే కాకున్నా స్థానికులైనా ఈ విషయంలో కొంత శ్రద్ధను చూపించ గలిగితే ఆలయాన్ని రక్షించుకోగలం. అదే విధంగా ఈ ఆలయసముదాయానికి కూడా ప్రధానాలయానికి అనుబంధంగా సందర్శన మార్గాన్ని ఏర్పరచాలి. రక్షణగోడను కూడా నిర్మించాల్సివుంది.

నలుదిక్కులా విస్తరించిన ఆలయశోభ

కూసుమంచిలో గణపేశ్వరాలయం నిర్మించే సమయంలోనే గణపతి మహారాజు ఆనాటి పండితుల సూచనల మేరకు ఆలయం చుట్టూ మరిన్ని దేవాలయాలను నిర్మించారని చెబుతారు. గణపేశ్వరాలయానికి సుమారు 5 కి.మీ. దూరంలో నాలుగు దిక్కులా వివిధ ఆలయాలు ఉన్నాయి. దక్షిణదిశగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంటే, ఈశాన్యం మూలన జీళ్ళ చెరువు గ్రామంలో శివాలయం ఉంది. ఆగ్నేయంలో పెరిక సింగారం గ్రామంలో, వాయవ్యం వైపున పాలేరు గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి. అయితే, నైరుతిలోని వేణుగోపాల స్వామి ఆలయం మాత్రం వెలుగులోకి రాలేదు. జీళ్లచెరువు గ్రామంలో శివాలయం, పెరిక సింగారం గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలోని దేవుళ్లు ప్రస్తుతం పూజలందుకుంటున్నారు. పాలేరు గ్రామంలోని ఆలయం శిథిలావస్థకి చేరటంతో గ్రామస్తులు నూతన ఆలయాన్ని నిర్మించారు. గణపేశ్వరాలయ ప్రాంగణంలోని ఈశాన్య మూలలో నవగ్రహాల ఆలయం, ఆగ్నేయంలో ఆంజనేయస్వామి ఆలయాలను ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల గుడిలోనూ, రామప్ప గుడిలో కూడా రుద్రుని చిత్రించి చుట్టూ రుద్రశిల్పీకరణకు అనువైన చిత్రాలను చెక్కారు. బహుశా ఏదైనా ప్రత్యేక పద్దతిలో రుద్రుని ఆలయం చుట్టూ కూడా ఇటువంటి దేవాలయాలను నిర్మించారేమో.

రుద్రరూపధ్యాన శ్లోకం రుద్రాధ్యాయంలో ఇలా వుంది.

అథ శ్రీ రుద్రరూపాన్ ధ్యాయేత్-
శుద్ధస్పటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రగం
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం
నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోపవీతినం...
దిగ్దేవతాసమాయుక్తం సురాసుర సమస్కృతం
నిత్యం చ శాశ్వతం శుభ్ర ధ్రువ మక్షర మవ్యయం
సర్వవ్యాపిన మీశానం రుద్రవై విశ్వరూపిణం-

రుద్రుని చుట్టూ వుండే అష్ట దిక్పాలకుల వివరాలు ఇవి. రుద్రుడు, రుద్రాలయాల చుట్టూ సాంప్రదాయకంగా వుండే శిల్పాలు, ఆలయాల గురించి అర్ధం చేసుకునేందుకు ఇది కొంతమేరకు సహకరిస్తుంది.

చెరువు గట్టున గంగాదేవి ఆలయం, వీరగల్లు పూజ

గంగామాత ఆలయంగా ఇప్పటికీ ప్రజలు కొలుస్తున్న ఒక ఆలయం గణపేశ్వరాలయానికి దగ్గరలో గంగాదేవి చెరువు గట్టుపై వుంది. ఈ ఆలయం పక్కనే నిలబెట్టిన మూడు వీరగల్లు

లున్నాయి. వీరగల్లు అంటే ఒక్కప్పటి స్థానిక వీరుల స్మారక శిలావిగ్రహరూప శాసనాలు. అప్పటి చరిత్రను అర్ధం చేసుకోవడానికి ఇవి ప్రధానమైన ఆధారాలు.

యుద్ధాల్లో మరణించిన వీరుల జ్ఞాపకార్థం గ్రామాల పొలిమేరల్లో ప్రతిష్టించిన ఇటువంటి రాళ్లు రాష్ట్రమంతటా గ్రామ గ్రామంలో దొరికాయి. మరణించిన తరువాత కూడా ఆ వీరులు భైరవ, వీరభద్ర రూపాల్లో గ్రామాలని రక్షిస్తారని గ్రామస్థులు నమ్మి, వాళ్లకు ఊరిబయట గుళ్లు కట్టి పూజలూ, బలులూ ఇచ్చే ఆచారం చాలాచోట్ల ఈనాటికీ ఉంది. ఆ రాళ్ళపై వాళ్ల వీర కృత్యాలు, యుద్ధంలో ఘట్టాలు బొమ్మలుగా చెక్కి, వాళ్ళు చేసిన సాహసాల గురించి రాసారు. వీరగల్లు శాసనాలు ఆనాటి పరిస్థితులకి అద్దం పడతాయి. చిన్నచిన్న రాజ్యాలు, నలువైపులా శత్రువులు, అలివిమాలిన పన్నుల భారం, యుద్ధాలు, దోపిడీలు, పశువుల మందలపై దాడులు, సామాన్య ప్రజలకి రక్షణలేని కాలం కొన్నాళ్ళు నడిచింది. మధ్యయుగంలో భారతదేశంలోనే గాక ప్రపంచమంతా భుక్తి కోసం యుద్ధం చేసే మెర్సినరీ
రీ యోధుల ప్రస్తావనలు కనిపిస్తాయి. వ్యవసాయం నమ్మకంలేని పరిస్థితిలో కత్తి పట్టడం వచ్చిన క్షత్రియులు కానప్పటికీ ఇతర వర్ణాల యువకులు ఎందరో ఆ దారిపట్టారు. స్వతంత్రంగా ఏ రాజుకూ లోబడక వీరభోజ్యంతో కడుపు నింపుకునే తెలుగు వీరులను ‘‘ఒంటర్లు, ఎక్కట్లు’’ అని పిలిచారు. ఈ పదాలే సాహిత్యంలో సంస్కృతీకరించబడి ఏకాంగ వీరులుగా మారాయి. ఏకాంగవీరుల ప్రసక్తి క్రీడాభిరామం, భీమేశ్వరపురాణం, పల్నాటి వీర చరిత్రలలో చూస్తాం.
గంగామాత ఆలయం, పక్కనే వీరగల్లులు

యుద్ధంలో ఓడి ఆత్మహత్యకి పాల్పడిన వీరులు చాలా మంది ఉన్నారు. వీరగల్లులపై గండకత్తెర వేసుకొని, కొండచరియ దూకి ప్రాణాలు విడిచిన వీరుల కథలు జపాన్ సమురాయ్ సంస్కృతిలోని సెప్పుక్కు, హరాకిరీ వంటి ఆచారాలు తలపిస్తాయి. అలాగే ‘పెండ్లాల తలచుక బిట్టేడ్చువారు’ అని యుద్ధంలో ఆయుధం పారవేసి గడ్డికరిచి మొత్తుకునే పిరికిపందల గురించి పల్నాటి వీర చరిత్రలో శ్రీనాథుడు చెప్పాడు. అంతే కాదు ఓడిన శత్రువుల తలలతో బంతులాటలు ఆడటం (శిరఃకందుక క్రీడావినోదం), వారి రక్తమాంసాలతో ఉడికించిన అన్నం కావలి దేవతలకి ఊరి చుట్టూ పొలిజల్లడం (రణంకుడుపు) వంటి రాక్షస సంస్కృతి వీరగల్లుల్లో సాహిత్యంలో కనిపిస్తుంది. ఇలా యుద్ధాలలోనూ, తిరుగుబాట్లలోనూ పాల్గొన్నవారి విగ్రహాలే కాక, ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడిన ఉదాత్తులకూ, సతీసహగమనం చేసిన స్త్రీ మూర్తులకు కూడా వీరశిలలను ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని చాటుకునే వారు. చెరువు కట్టలు వర్షానికి తెగిపోయి గ్రామమంతా మునగకుండా వుండేందుకు తమ దేహాలనే కట్టలుగా అడ్డంకట్టి గ్రామస్థులను కాపాడిన వారికి పూజలందటం (వరంగల్ జిల్లా గణపురంలోని గణపసముద్రం చెరువు దగ్గర గౌండ్లదానిగండి), తరతరాలు వారి పేరును చెప్పుకోవడం ఇప్పటికీ మనం అనేక కథలలో వింటుంటాం. మరి ఈ గంగాదేవి గంగానదికి మారు పేరుగా పెట్టుకున్న దేవతపేరు కాకపోవచ్చనిపిస్తుంది. మరెవరైనా ఉదాత్తచరిత గల మహిళ చేసిన సాహసకృత్యమో, త్యాగపూరితమైన కథ వుండివుంటుంది. ఈ మూడు వీరగల్లులను పరిశీలిస్తే కేశాలంకరణగా పెద్దకొప్పు వుంది, ఎడమ చేతిలో డాలు, కుడిచేతిలో శూలం వంటి ఆయుధాన్ని ధరించారు. మొలలో చురకత్తి లేదా కత్తివంటిది వుంది. ఈ వీరగల్లులు ఏదో పోరాట చరిత్రను గుర్తుకు చేసుకుంటూ ఏర్పాటు చేసినవి అయివుంటాయి. వందల సంవత్సరాలు నిలిచే సాహసమో, త్యాగమో చేసిన ఆ స్త్రీమూర్తికి వందనం.