కువలయాశ్వచరిత్రము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

కువలయాశ్వచరిత్రము

పంచమాశ్వాసము

క. శ్రీకర సవరము తిమ్మధ, రాముకగర్భజలధిరాకాచంద్రా

లోకనుతగానగుణసం, ధాకర్ణసమాన నారణ నరేంద్రమణీ.1

గీ. అవధరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁదొడఁగె

నమ్మదాలసతో మనోహరసుధా, విధానధానవచోరీతిఁ దారపలికె.2

వ. అవ్విధంబున నమరావతీపురంబుఁ జేరి నలకూబరుండు.3

మ. తననీటుల్ మెఱయించు జేన పొడవుం దాల్మింటి యందంపుఁ గుం

దనపుందల్కులు గ్రుమ్మరించు చిరుసానాకత్తి చిమ్ముం గళం
బున గోరొత్తుల పేరి యారజుపు సొమ్ముల్ మోవి పైఁ గెంపు ని
గ్గును మీసంబులు దిద్దినాడికొను జగ్గుల్ మీర నావీథులన్.4

సీ. చూచి దిగ్గున లేచు సుదతిఁ గూర్చుండవే యనుచోట మొగమున నలరు కులుకు

రంభసేమము వేఁడు రమణీమణి మొగంబుఁ జూచుచో నవ్వులో సొలయు హొయలు
నెదురుగాఁ జనుదెంచు నింతి మ్రొక్కుల నందికొనుచోటఁ జూపులోఁ గులుకు సొగసు,
కని యందలము డిగ్గు వనితతోఁ బరిహాస మాడుచో మాటలో నందగింపు
బుడత లందిచ్చు తెలనాకు మడపుపంట, నందికొనునీటు నుడువులో నారజంపు
బిత్తరపుపాట రొమ్ములో బిగువు నెగడ, నేఁగు నాకారివెంట నయ్యెమ్మెకాడు.5

ఉ. చక్కదనాల కేమి నెఱజాణవు నే కద తప్పుగాదు లే

టెక్కుల రంభభాగ్యము కడింది సుమీ యిటువంటినాయకున్
దక్కఁ బెనంగెఁ జూడు మనినం బిగువెత్తెదు నీకు రోసమా
యెక్కడిదో యటంచుఁ గలహింతురు నాథులతోడ నచ్చరల్.6

చ. అలిగెడుతీరు వేడికొను నందముఁ బొందికలోని పారువా

పలుకుల భేదముల్ సురతబంధములుం గళలంటు వైఖరుల్
వలపులు రేఁచు పేర్చు నెరవాదులతో వివదించు కట్టుఁగొంగు
లముడివీఁడ నచ్చరలు గుంపయి పొంచు వినన్ ముదంబునన్.7

చ. వెలుపలిరచ్చ నొక్కయెడ వేలుపుసానికి వన్నెకానికిం

గలహము కల్లెనేని జతనంబునఁ జేరఁగ వచ్చి రోసపుం
బలుకుల వాదు రేపి శిగపట్లకు దగ్గరఁజేసి క్రొవ్వునం
గలకల నవ్వువాఁడు చవుక ట్లసియాడ రుమాలు వీడఁగన్.8

సీ. సంగీతమేళ ముప్పొంగఁ దేజీ నెక్కి కంప మంటుచు రవగాలు చూపు

పగటుపానలు మెట్టి బట్లు కైవారముల్ జోడింప హరిగెల నీడ కేగు
విచ్చుకత్తులవారు వెంటరా నందలంబును నిబ్బరంబుగాఁ బోవనిచ్చు
డేగను బూని మాష్టీని సుద్దులు చెప్పికొనుచు నెచ్చెలికాండ్రఁ గూడి యరుగు
పికిలిపిట్టల కొట్లాటఁ బెట్టి చూచు, దిట్టతనమునఁ జెఱకు పందెంబు లాడు
డీకొనఁగఁజేసి యనికిఁ బొట్టేళ్ళ విడుచు, రంభచుట్టంబు వైభవప్రాభవమున.9

సీ. అమ్మకచెల్ల చోచ్యము గాక నామీఁద మనసు పుట్టునె వాని కను మృగాక్షి

యెన్ని మాయలు గుత్తకున్నదాని దొరంగి యవల మాటాడునే యను లతాంగి
కాక మరేమి రంభాకాంతతోడి కయ్యాన కెవ్వతె యోర్చు నను వధూటి
అనువుకాడయి తనయక్కర దీరిన నచటికే చనుగదా యను మిటారి
యైరి గుజగుజలాడుచు నాత్మవిటులు, కొసరుఁబల్కులతోఁ గ్రుచ్చిగ్రుచ్చియడుగ
నేమి లేదని మాటి సారేందువదన, లాతఁ డడిగింప నిజగృహాభ్యంతరముల.10

ఉ. నంటున నొక్కవేళ సురనాథకుమారునిఁ దోడికొంచు మా

యింటికి వచ్చి సిగ్గువడి యేఁ జన నానలు వెట్టి పిల్చి క్రేఁ
గంటనె నన్నుఁ జూచి యరుగుంగ యేమిటికో యతండు చొ
క్కంటఁగ మోవి నొక్కికొని యౌదల యూచు నొయార మేర్పడన్.11

ఉ. అంతట మేళవించిన యొయారపుతంబుర చేతి కిచ్చి యే

వింతపదంబుఁ బాడఁ బదివేలవిధంబుల మెచ్చికొంచు మే
మింతటఁ బోయి రావలవదే యని దుప్పటిఁ తెచ్చి కప్పుచోఁ
గొంత కరంబుగీరుఁ గొనగోర ననున్ నునుమేను జుమ్మనన్.12

క. అది మొదలుగ నితరవధూ, హృదయంబులఁ దన్ను నిలువనీయనికతనన్

మదనుఁడు నామదిలోపల, సుదతీమణి తనబలంబుఁ జూపందొడఁగెన్.13

క. నానాటఁ బాటలాధర, యేనాటలు పాట లుడిగి యినుమడికోర్కుల్

లోనాటఁగఁ దద్రూప, ధ్యానాట మనోంబుజాతనై వర్తిలుదున్.14

చ. కలికితనంబుఁ జేర నయగారము మీరు జయంత యేమిరా

పలుకవు వింతచో మనను బారెనొ యేమిటఁ బ్రొద్దుపోదురా
యల నలకూబరుం బిలువనంపర యంచును బిల్వఁ బంచి సొం
పులఁ గడకంటిచూపులనె ముచ్చట తీరఁగఁ జూతు నాతనిన్.15

ఉ. జవ్నని యించుకే మొగము చాటున నుండఁ గుబేరసూతి యా

దవ్వులనుండి నాపెదవి తప్పక కన్గొన నే నెఱింగి లో
నువ్విలులూర ముద్దుమొగి యూరక తా బయలానినందుకే
నవ్వఁగఁ దాను నవ్వి సురనాథకుమారునిఁ బిల్తునా యనున్.16

సీ. వానిఁ యొయారంపుఁ బావలు తెప్పించి సిబ్బంపుఁజనుఁదోయిఁ జేర్చుకొందు

క్రేవఁ దప్పక చూచి ఠీవిగా వాడంత ననుఁ జూడఁ జూపు గ్రక్కున మరల్తు
వానిపైఁ బద్య మెవ్వరు లేనివేళఁ బాంచాల శయ్య పొసంగఁ జదివికొందుఁ
బరులతో నర్మోక్తి పలుక నే నెఱిఁగి లేనగవుతో వానినెమ్మొగముఁ జూతు
మఱియు నొక్కొకవేళ సుమాళ మొదవఁ, బరిమళంబుల బాగాలు పలక నుంచి
నే నొసంగగఁ గొంకిన దాని కరణిఁ, బ్రియునిచేతనె వాని కిప్పింతునమ్మ.17

చ. అలికచ జోలి తప్పునటు లయ్యెడు నాదువికార మంతయున్

దెలుపఁగ వచ్చినన్ వినఁగదే మఱియంతట నొక్కనాడు నె
చ్చెలుల మొరంగి కేళిగృహసీమ జయంతుఁడు లేనివేళ గు
బ్బలపయిఁ బైటజారఁ బువుపాన్పుపయిం బడి నెమ్మనంబునన్.18

సీ. ఇది యేమి చోద్యము మదిలో వితావితా నలకూబరునిమీఁద నాటెఁ బ్రేమ

దొర కుమారుండును దురుసు కటారి గా డీజయంతుఁడు బాయనీఁడు నన్ను
వాడైన మఱిఁ గొంచెకాఁడు మాష్టీని జోకలు జూపఁదగు పగకాఁడు కాని
యందఱిలో మున్నె యగడౌట చాలదే యింక గొహారు వాదేల తనకు
నేటికి గొహారు తనకు నాకేల వెఱవ, నౌర యిల్లాలనా వారివారికరణి
కంటికింపైన వానితోఁ గలసి మెలఁగ, నన్నుఁ గన్నాఁడు మావార్ధినాయకుండు.19

ఉ. ఒక్కటి రంభ యేమను నొకో యని లోఁగుట యంతె కాక నా

కెక్కడి యాజ్ఞ యాసరసిజేక్షణకైనఁ బనేమి యెమ్మెకా
డొక్కతె సొమ్ముగా నిలుచునే యది యేలికసానియే యిదే
మక్కట యైన గాని నిలయంబున నుండఁగ హత్తుకొంటినో.20

ఉ. అందుల కేమి యప్పటికి నైనటు లయ్యెడు గాని నేను వా

రందరు గానకుండఁగ ధనాధిపుపుత్రునిఁ దెచ్చి కూర్చువా
రిందు మఱెవ్వ రిట్టిపని యెవ్వరితో నెఱిగింతుఁ గూడ దీ
యందము లెస్సయం చొకయుపాయముఁ గాంచి సునిశ్చయంబుగన్.21

ఉ.అంగజుసన్నిభుండగు ధనాధిపసూతికిఁ దార మ్రొక్కి చే

యంగల విన్నపంబు మదనాతురనైతి మదీయమందిర
ప్రాంగణవృక్షవాటికి రయంబున రావలె రాకయున్న నీ
యంగన యైన రంభ పదమాన యటం చొకచీటి వ్రాయుచున్.22

గీ. ఒక్కసంపంగి బంతిలోఁ జెక్కి వింత, యంద మిది లెస్స చూచికొమ్మని కుబేర

పుత్రునకు నిచ్చిరమ్మన్న బోఁటి పైఁట, బొదివికొని ముద్దునడలతో బోవునపుడు.23

ఉ. చెక్కిటఁ జేయిఁ జేర్చి ననుఁ జెందెడు కోర్కుల నూడిగంపు వా

డొక్కడుఁ దాను నుండి యతఁ డోచెలి రమ్ము నరేంద్రనందనుం
డెక్కడ నుండెఁ దార యిపు డేమి యొనర్చుచు నున్నదంచు పె
న్మక్కువ నాదరించి బహుమానము సేయఁగ డాయ నేఁగుచున్.24

గీ. అయ్య మా బావ తమయవ్వ యాచరించు, విష్ణుపూజల కఱిగె నెవ్వేళ రాడు

వనిత యీబంతి మీచెంత కనిచె వింత, చెలువు గూర్పంగ గలదని చేతికొసఁగ.25

చ. కనుఁగొని మోవిఁగ్రోల్గతి మొగంబునఁ జేర్చుచుఁ బల్చకుం బలెం

గనుఁగవఁ దార్చుచుం జెలికిఁ గప్రపువీడె మొసంగి పంచి యి
చ్చిన తమిచెండు విచ్చి యటఁ జెక్కిన చీటి పఠించి చూచి యే
మని కొనియాడెనో తెలియ దంతట నిచ్చల నేను గ్రక్కునన్.26

ఉ. ఇంతకు వచ్చునో యతని కీపనికిన్ మనసొగ్గదో శచీ

కాంతునియొద్ద కీయళుకు గాంచునొ చూతమటంచు వెంట నే
కాంతయు రాకయుండఁ దిరుగందిరుగం గనుఁగొంచు మద్వన
ప్రాంతముఁ జేరి యందొక లతాంతనికుంజముఁ జేరబోయినన్.27

క. మొలవంక పెద్దకత్తియు, చెలువగు చేలమ్ము గట్టి చెరగులు బురుసా

తళుకు రుమాలువు మించఁగ, నలకూబరుఁ దద్గృహంబునం గనుఁగొంటిన్.28

గీ. అప్పు డేమందు నాదు సిగ్గమ్మలార, వెనుకడుగుగాగఁ దలవంచికొనఁగఁ జేసె

కాంచి వాడును నిలువునఁ గౌగలింపఁ, బొంది పైఁ బడితిని బైడిబొమ్మవోలె.29

మ. అకృతానందనివాసదీనవచనం బప్రాప్తచేషావిధా

నకమజ్ఞాతనఖక్షతాంకుర మసందష్టాధరోష్ఠంబ పే
తకపోతారవ మప్రయుక్తగురుబంధప్రౌఢిమంబైన ద
ర్పకజన్మంబున గేస్తురాల నయితిం బ్రావీణ్యహైన్యంబునన్.30

చ. విడువని కౌఁగిలింత పురివిచ్చని మచ్చిక తన్పు లేని సం

దడి కొసవింత చూపు మరునాటికి రమ్మని మ్రొక్కు తోడిత్రొ
క్కుడు వగ మాట నీటొలయ గూడని నెమ్మది గల్గి యొక్క కై
వడిఁ నెడఁ బాసి యింటికిని వచ్చితి నాతఁడు నేఁగునంతటన్.31

క. దినదినమున్ వనమున ముం, దనజనముం గను మొరంగి ధనరాట్సుతుతో

ఘనరాగము దనరారఁగ, ననరాళక్రీడ నోలలాడుచునుందున్.32

ఉ. అక్క యిదేమొ కాని తెలియంబడ దాతఁడు వీధి థివెంట బల్

టక్కులతోడ రాఁ బొది గిటన్ నిలువంబడి తొంగి చూచుచో
దక్కిన చేష్టలున్నవెకదా మఱి యెక్కడనుండి వచ్చునో
పక్కున నవచ్చునమ్మ చలపాది మిటారపునవ్వు తొక్కటన్ ,.33

క. తనువు జయంతుని క్కన్, మనసాధన రాజవరకుమారునిచెంతన్

జొనుపుదుఁ గోరకదశ'నా, ననదసెనాజోదు దురమునం బెనఁగునెడన్.34

సీ. చెలరేఁగి వలరాచవెలుపుల పెనుకతల్ వినిపించునప్పు డూకొనెడుదారి

ఎటుఁ బోయి తన నిట్టి యెడకంచుఁ బొసగింపఁ బోవుచోఁ దడఁబడుబొంకుమాట
వ్రేకఁటి యలుక కల్పించి మంచముకోఁడు గౌఁగలించుచొ కమ్ముగాని వింత
యల్లయాచెలి మంచిదని మెచ్చుచోఁ కోపగించక మైకోలు గాంచు నేర్పు
నించువిలుకానిజగడాన నెంతతడవు, చాలునను పల్కు నిన్నాళ్ళసరణి రాజ
రాజతనుజాతుఁ దలప కూరకయ యుంటఁ, దెలిసి దేవేంద్రసుతుడు సందియముఁ జెందె.35

గీ. అంత నచ్చట రంభామృగాయతాక్షి, యేమొ నలకూబరుం డంటి యిరవుకొనియె

నౌర యంటినఁ గమ్మకు మారుకమ్మ, యంపఁ డెంతటి దొరతనం బనుచుఁ బలికి.36

సీ. విననింపుగా మేళవించి యుంచినయట్టి యల్లవీణియ యుంచి నట్లెయుండ

వెరబొంత గౌసెన వేసి మూసినయట్టి యరలపెట్టియ మూసినట్టెయుండ
నెఱికగాఁ బెట్టి దండెముమీఁద వైచిన యంగదట్టము వైచినట్లయుండ
నెరపుగా నూరి గిన్నియల నించినయట్టి యరిదికుంకుము నించినట్లయుండ
నెందుపై నిచ్చలేక యేమేమొ తలఁచు, కొనుచుఁ జెలులను జంకించుకొనుచు జిలుక
కొసరుమాటకుఁ గట్టిగాఁ గసరుకొనుచుఁ, దాళగూడని వింతవిరాళి యెత్తి.37

గీ. చికిలిలోపలనే చీమ చిటుకుమన్నఁ గనకననకూయు బకదారి కవలకడన

మరుని వెరళించు మల్లంటు విరులకడనఁ, బడుకయిలు మాని విరహతాపంబు బూని.38

సి. నీనాయకుఁడు వచ్చెనేయన్న విసువుగా నతఁ డేమిటికి వచ్చునమ్మ యనుచు

సొలవకు మదిగొ వచ్చునటన్నఁ బోలి వాఁ డిటు వచ్చి యెంత రా కొంతయనుచు
గాకున్న వాని గోరకుమన్న నయ్యెఁబో నవ్వానిఁ గోర నా కేల యనుచు
యదె వచ్చె నన లేచి యంద రౌనౌననఁ జిల్కను బిల్వవచ్చితినటంచు
చెలుల కాత్మీయవిరహంబు తెలియనీఁక, మాటిమాటికి నిలిచినచోట నిలువ
చాల కాతన్వి మది జాలిమాలికొనుచు, నతనికడ కేగు తమి నున్న యవసరమున.39

సీ. కైటభాదినిశాటఝాటఖండనపాటవాటోపకరుమీఁది పాటలమర

రాజతాచలరాజు రాజహంసవిరాజి, తంబగు తనుకాంతి యోజమెరయ
తోయజినీప్రాణనాయకరుచిధాయకాయతంబగు జటాచ్ఛాయ వెలయ
సామజఘనసారసోమకల్పకభూమధామకంబగు నక్షదామ మొలయ
ఆలములు లేమి డొక్క వెన్నంటికొనఁగ, దెలివిగలకన్నుఁదోయి గుంటలు
బొంచికొని జెట్టిమాట లాలించుకొనుచు, నచ్చటికి వచ్చె వేలుపు గచ్చకాడు.40

గీ. వచ్చి యచ్చరప్రోయాల వచ్చి వెనుక, మ్రొక్కుదువు గాని కొమ్ము నీముద్దుమగని

యొద్దనుండినదని వీణ యొరగులోని, చీటి వడి నిచ్చి చనిన నచ్చెరువు దోఁప.41

క. అది చదివి కొంతసే పా, మదవతి నివ్వెరఁగుకతన మ్రాన్పడి మఱియుం

జదివికొని యదిర తారా, మదిరేక్షణ కింతభోగమా కావలెనే.42

సీ. మఱచెనో సంగీతమర్మకర్మములు నావలన నొక్కొకవేళఁ దెలిసికొనుట

యెఱుగదో తాను నాయింటికి వచ్చి నే నీదాన జుమ్ము మన్నించు మనుట
కానదో యూర్వసీకాంతకుఁ తనకు వా దెచ్చిన నేను వహించుకొనుట
తలఁపదో సురరాజు కొలువులోఁ దనపాట వినిపించుమని నన్ను వేఁడికొనుట
యేటి కీపని తనచెల్మి వీటివోవ, నిన్నఁగదవమ్మ వింతవన్నియలవంచు
సురటు లంతటఁ బల్లటీజోడు లనిపె, నింతలోనన యీగర్వమేల వచ్చె.43

సీ. దేవేంద్రుఁ గనఁ బోవుచో వానిచెంగటఁ జెలుల నమ్మక దాని నిలిపిపోదు

వాఁడు నేనును వింతవగలఁ గూడిన పొందికల దారి దానితోఁ బలికికొందు
దీని నేటికి నిందుఁ దెచ్చితి వన వానిదిక్కు వీక్షించి గద్దించి వైతు
వాఁడు నామది మెచ్చవలసి తెచ్చిన మంచికానుకల్ వెసదాఁచి దానికిత్తుఁ
గపట మింతేనిఁ దెలియదు కనుక మేక, వన్నెపులియయి యిందు రమ్మనఁగ నిల్లు
గైకొనుట గానలేక యాకాపురాలఁ, గారవింతునె నమ్మీ నే వీరిడైతి.44

గీ. అప్పుడే వాని బావ బా వనుచు మేర, మీరి నడువంగఁ గని మందెమేల మనుచు

నోర్చుకొనియుంటిఁ గాక యీయుత్పలాక్షి, గురువులకు బొమ్మవెట్టుట యరయనైతి.45

గీ. ఇపుడు సైతము దానిపై నీసు లేదు, నమ్మికయె గాని యాతందనాల తపసి

కడుపు సాకంగవలసి యీకరణిఁ జీటి, నేను గినియంగ గల్పించెనేమొ కాని.46

మ. అకటా కాదిది తారవ్రా లవును జుమ్మా కన్నె యావన్నెకా

నికిఁ దా నంపినదేమొ చీటి మఱి వానిం జూడఁగాఁబోయి మౌ
నికులాగ్రేసరుఁ డేమరించి వడి దీనిం గైకొనంబోలుఁ గా
నుకగాఁ దెచ్చునె కానిచో నతఁడు నన్నుం జౌకగాఁ జూచునే.47

శా. ఔనే తార శబాసు మెచ్చవలె నాహానీగుణం బింకిటన్

వానిం జూచిన నీకు నిన్నుఁ గనుఁగొన్నన్ వానికిన్ శోకసం
ధానం బొందఁగఁ జేసినప్పుడుగదా, నా కూచి లేకున్నచో
నేనే రంభనె యచ్చరల్ బొగడఁగా, నీ పేరునం బిల్వవే.48

క. అని నిశ్చయించి రోషం, బినుమడి గాఁ జీటి యిచ్చి యేమేమో మం

తనమాడి పొమ్ము పొమ్మని, తనబోటిం బనుపఁ ఘనపదస్ఫుటగతియై.49

చ. అది చనుదెంచి నందనవనాననిఁ జప్పుడు కాకయుండఁ గెం

పొడవిన చూడ్కితోఁ బరిజనోత్కరముం జడ మర్లి చూచుచున్
గుదిగొన సూటి గాగఁ గనుఁగొంచు మెఱుంగుల నంట వింట బె
ట్టిదముగ గువ్వతండము వడిం బడవేయు జయంతుచెంతకున్.50

గీ. చేరి మారంభ వనిచె నీచీటిఁ జూచి, కొమ్ము నీవంటివానికిఁ గొదవగాదె

యాట దానికి నింతమత్తా యిదేటి, మోహమయ్య యటంచు నమ్ముదిత వలుక.51

క. ఆచీటిఁ జూచి వేలుపురాచూలి మెఱుఁగు కలకరాఁ జేటి దెసన్

జూచి వినుమింతె విటులకు, మీ చెలికిన్ జూడు నేఁడు మెచ్చు ఘటింతున్.52

గీ. అని గిఱుక్కునఁ దిరిగి యయ్యమరనాథ, పుత్రుఁ డందఱి నిండ్లకుఁ బోవబనిచి

సురగ దురదుర నాయింటి కరుగుదెంచి, యేమి చెప్పుదుఁ బొదరింటి కేగుదెంచె.53

మ. అపుడే క్రొవ్విరులంది యీయ ధనరాజాపత్య మచ్చంపు ని

క్కపుఁబ్రేమన్ జడయల్ల నే మడు పొసంగం బట్టి చేనొక్కి నే
రుపుతో నిచ్చినఁ గాని యొల్ల నని మార్మో మైన నేనంతఁ బ
ల్కుపరాకింద మటంచు మర్ల యొసగం గోపంబు దీపింపఁగన్.54

క. ఔనన్నా నరకూబర కానీమన్నా యటంచు గ్రక్కునఁ దిరిగెన్

దానుంజనె నర్థేంద్రజుఁ డేనున్ భయ మొదవ నింటి కేగితి నంతన్.55

క. సూరెలను నింద్రజుఁడు కో, లారిక మందిన నతండు లలితోల్లాసం

బారంగఁ గొదవడెనా యీరీతియు మంచిదని ప్రియంబునఁ బలుకెన్.55

సీ. ముడిపువ్వుటొత్తులు మూడువేళల దెచ్చియిచ్చువారల యిష్టమెల్ల గలిగెఁ

జనువుతో దారికట్టును మొనకట్టును దెలుపువారల మనువులు ఫలించె
నింతమాత్రమునకు నీ వేల నే బూనికొనియెదననివారి కోర్కు లొదవె
కైపంట వింతగా గైసేయు నూడిగంబులవారి యాప్తవిస్ఫురణ మించె
ఔర దాతలరాయ బ్రహ్మాయు ననెడు, వారికెల్లను ధనము లవ్వారియయ్యె
నొంటిపోట్లాట తత్తరంబునన మేని, వాంఛ యంజక వర్తించువారివలన,.56

సీ. బొక్కసంబుల బీగములు ఇచ్చి సొమ్మెల్ల వెఱ్ఱి యెత్తినరీతి వెచ్చబెట్టి

గెలిచిన నౌనెకా తలఁప వేఱొకటైన దయ యుంచుఁడనుచుఁ బెద్దలకఁ దెలిపి
వడిరోస మెత్తి పైఁబడ కెచ్చరించి చెంగట నిల్వుఁడని నేస్తకాండ్రఁ బలికి
చెల్లుగా మనసువచ్చిన పదార్థములెల్ల నరతన్వి తీరంగ ననుభవించి
యోర్వరిద్దరు తమలోన యెవనికొక్కొ, యీ చెలి యటంచు మదిలోన హెచ్చరించె
పొగలపెట్టెలు నునుధట్టిపొరల సరళ, తెల్లవారక మును బయల్ దేరుటయును.57

వ. అప్పు డత్యాశ్చర్యచర్యాధుర్యంబగు నక్కార్యంబు చారణులు విని కిన్నరు లాలించి

విద్యాధరులు చెవినిడి కిన్నరు లాకర్ణించి వెరగుపడం దదాప్తపరంపరానువాక్యంబుల
నెక్కడెక్కడ యని తత్తరంబునఁ బరువెత్తువారును నే మేమి యని యడిగిన వి
స్తరింపక జయంతనలకూబరులఁట యనుచుం బరుచువారును తారనిమిత్తంబున నెం
త పుట్టెం గంటిరే యెంత గయ్యాళి యనుచుం జనువారును నింద్రనందనునకు బందా
కోరైన యీరాజవదన కుబేరకుమారునకు లోనైన యప్పుడే వివాదంబు సిద్ధంబను
వారును వెలకొమ్మలమనంబులు నమ్మవచ్చునే యనుచు నరుగువారును నిట్టి యెడంబు
ట్టిన రసంబులు వారింప నెవ్వరితెరం బనుచుఁ దమయేలికలకు నెప్పటిసమాచారం
బు లప్పటికిఁ జీటులు వ్రాయుచుఁ గ్రక్కునం జనవలెఁ జుమ్మీ యనుచు వేగులవారి
నెచ్చరించుచుఁ బోవు నియోగులును ఘొల్లునఁ గేకలు వైచి కేరుచుఁ జంగునఁ దా
టుచు నేఁడుగదా వేఁడుక చూడఁగలిగెఁ గదా యనుచు గమకించు కోడేకాం
డ్రును గాయంబులు గట్టుటకు మందుసంచులు బుజంబుల వేలాడ బొజ్జలదరంజ
ను వేలుపువెజ్జులును చేటికావిదితతదీయవృత్తాంతంబు విని యమ్మక్క యీచక్క
నిదొరల కెక్కడనుండి వచ్చెనే యనుచు మేడ లెక్కి కనుఁగొను నవరోధగిరి ప
యోధరులును గన్నుంగని యెంతసిగ్గరివి తలయెత్తవే నంగనాచి యనుచు మూతు
లు పొడుచువారును నింకమీఁద మురిపెంబులు చెల్లునే యనుచుఁ దలఁ బంకించు న
చ్చరమెఱుంగుబోడులును నై యమరావతీపురంబువారందఱును సందడింబడఁ బురం
దరుండు హెగ్గడికత్తియలవలన విని డిగ్గున లేచి శచీమత్తకాశిని దుఃఖాయత్త
చిత్తంబుతో నచ్చటికి వత్తుననుచుఁ దత్తరింప బొమముడితో నతిరూక్షుంబగు వీ
క్షణంబున నిలువరించి నగరు వెలువడి తమకంబునఁ బైటికిం జనుదెంచె నంత నంత
యు విని యఖిలదిక్పాలకులును బ్రహ్మాదిదేవతలు నేతెంచి రట్టియెడ.58

సీ. మన కేమి పని చూచికొనియుంద మీ వేమి యనఁబోకుమీ యని యనుసరించి

నీపున్నె మిచ్చట నీపగ్గె నెరయించి బోరు దీర్పకుమంచుఁ బొందుపఱచి
మనచేతఁ గాదు వీరిని శాంతుల నొనర్ప నూరకుండెదమంచు నొద్దనిలచి
నానోటి కడికి విఘ్నముఁ జేసినపుడె శపింతుఁ జుమ్మీయని బెదరఁజేసి
వారి వైరంబుఁ బురికొల్పఁ జేరి నార, దుండు వీణగవిశనను దొలఁగఁజేసి
మెట్లు తడఁబడఁ దుడుకుగా మేళవించి, నిలువ వారిద్దరును రణోన్నిద్రులైన.59

క. హరిహయుఁడుఁ గుబేరుఁడు ని, ద్దటరు నొగి నన్నలువ యడగుఁ దమ్ముల వ్రాలన్

గరుణించి సకలదేవో, త్కరములతో నతఁడు నిలచి తన్మధ్యమునన్.60

గీ. వలదనిన వారిలో డుస్సి వైచినట్టి, కైదువుల జూచి బలికె నే కన్మొరంగ

నొరుల వైతురె యంచు నొందొడ్డికొనుచు, నవునెకద యంచు నతఁ డుండు నవసరమున.61

శా. అయ్యా కావరె యాడుదానవలనన్ హా యెవ్వరిం గాన నా

కుయ్యాలింపరె నన్ను నెత్తికొని దిక్కుల్ చూచుచుం బారెడిన్
దయ్యం బీతని నెవ్వరేని నిజఖడ్గప్రోద్యదుగ్రాగ్నికిం
ధాయ్యం జేయక యాడుదీవెనలఁ బొందం లేరె నే మ్రొక్కెదన్.62

క. అని యెడు నాడు మొరల్ విని, ననజుఁ డిది తాళకేతువర్తన మరయన్

మును దేవగురుఁడు శపియిం, చినచందము నిట్టిదనుచుఁ జింతించునెడన్.63

క. ధనరాజసుతు జయంతుం, గనుఁగొని యాచాయ వచ్చు క్రవ్యాదుని వ్రే

లునఁ జూపి వీని నిద్దరు, దునుముఁడు పొండనినఁ జండదోర్మండునులై.64

క. డేగ వెరచూపు నిగుడెడు, వేగంబున నిగుడు దనుజవీరుని బుజముల్

ప్రోగువడఁ బంచికొనుచు వి, భాగించిరి తనువుతోడఁ బాసి చనంగన్.65

వ. అంత.66

సీ. నిగనిగనిగని పెన్నెఱి గెంపు ముడి వీడి తనదీర్ఘరీతి యందఱికి దెలుప

నడరుపాటునఁ జూచు చదురుచూపులవల్లఁ గలువ వసంతంబు గలయఁజల్ల
నుడుగక గుండెయుఁ దడఁదడమనుటఁ గెంపుల దండ జనుఁదోయి పుటము లెత్త
గడగడమను మేను గలిగెఁ దోడుగనంచు నసియాడు కౌను సంతసము జెంద
వీడుపయ్యెద వసివాళ్ళువాఁడుమోము, నడుగు దడఁబాటు నెమ్మేనఁ బొడము చెమట
మెఱయు రక్కసుచే వీడి మీననయన, యచ్చరలగుంపుఁ జేరంగ ననుసరించె.67

గీ. అంత దేవతలెల్ల, జయంతధనద, పుత్రకుల నొక్కటిగఁ జేసి పొంకపఱచి

నెలవులకు నేగఁ జాలు నానింద తప్పె, ననుచు నేదానిఁ దోడ్కొని యఱుగుదెంచి.68

క. నాయింట నునిచి మఱి య, త్తోయజముఖి తనకు నాఁడుఁ దోడుగఁ జెలిమిం

జేయుచునుండఁగ నొకనాఁ, డాయమ ననుఁ జూచి వికసితానన యగుచున్.69

సీ. వినవమ్మ కుండల యనుదాన నలవిభావసుకుమారిక మదాలసయు నేను

గ్రీడింపఁ బాతాళకేతుండు గొనిపోయి మందరభూధరం బందు నిల్ప
నచటికిఁ గువలయాశ్వాధీశుఁ డేతెంచి దనుజేంద్రు ఘోరయుద్ధమున ద్రుంచి
మముఁ దోడికొనిపోవ మఱి వానియనుజుండు తాళకేతుఁడు మహోత్తాలలీల
మాయచే మమ్ము దోకొనిపోయి మేరు, మందిరములందు నునుప నమ్మందగమన
గాన కొకనాఁటిరాత్రి నక్కాంతఁ దలఁచి, తలఁచి పొగులుచునున్న నద్దనుజుఁ డెఱిఁగి.70

గీ వెనుక వచ్చెన నీ వేగు మనుచు దాని, మున్ను గానంపఁబోలు నీవన్నెలాఁడి

మోసపోయిన నిదియును మొరఁగిపోవు ననుచు నొకయాగ్రహముఁ దెచ్చుకొని యతండు.71

క. వేఱొకతావున నుండం, గోరికి మై నన్ను నెత్తికొని చనుదేఱన్

మీరల్ చూడఁగ నైనది, మీ ఱెఱుఁగుదు రింక నేల మీదటివార్తల్.72

క. నాకత యిత్తెఱఁ గయ్యెన్, వ్యాకులమున నింత కమ్మదాలస నెటకుం

దోకొనిపోయెనొ దనుజా, నీకంబులచేత నెంత నెగులొందునొకో.73

చ. తనువులె రెండుగాని వనితా మఱి ప్రాణము లొక్కటమ్మ మా

కని పలుకంగ సిగ్గు దళుకయ్యెడు నట్టిప్రియాళిఁ బాసి యీ
యనువునఁ బ్రాణముల్ నిలిపినట్టి కతంబున దానిఁ జూడకుం
డిన నిమిషంబు తాళఁగలనే! మఱి యెచ్చటికేని నేగెదన్.74

గీ. అనిన నూరార్చి యవ్వార్త నరసివత్తు, నుండుమని దాని నాయింట నునిచి యేను

బుడమిపై డిగ్గి వచ్చుచో నడుమఁ గంటి, నారదునిచేత నీదు చందంబులెల్ల.75

క. విని యిచ్చటి కరుదెంచితి, మనముచ్చటలెల్లఁ దీరె మనకుండలనుం

గొనివచ్చెద నని తారా, వనజేక్షణ చనియె నిజనివాసంబునకున్.76

ఉ. ఆసమయంబునం దొకవయస్య చలత్కుబరీవినిర్గళ

త్కౌసుమపుంజముల్ చరణకంజము జాడల రాలి మారుఁడా
యాసముతో వశీకృతికినై రజమెత్తఁగఁ బూజవెంబడిం
జేసిన రీతి మించి యతిచిత్రజవంబున వచ్చి మచ్చికన్.77

క. అక్క ఋతధ్వజుఁ డఁట యతఁ, డిక్కడి కేతెంచెనఁట ఫణీశ్వరుఁ డతనిం

గ్రక్కున నెదుర్కొనంజనె, ఢక్కాపటుపటహతమ్మటధ్వను లొలయన్.78

క. నగరికిఁ జని కేంపులపని సొగసులుగల మేడ యెక్కి చూతమె యనినన్

మగువ సిగమిన్న యరిగెన్, మొగమలరం జేటికాసమూహము గొలువన్.79

ఉ. అంత భుజంగపుంగవుఁ డుదారతురంగశతాంగకోటితో

దంతిఘటాఘటాగ్రబహుథావిగళన్మదధార మార్గసీ
మాంతరమందు జల్లు కలయంపులకుం బునరుక్తి నింప న
త్యంతముదంతరంగుల నిజాత్మజులం గనుఁగొంచు వచ్చినన్.80

గీ. అచట మున్నె తరుచ్ఛాయ నాశ్రయించి

యున్న యానరలోకమాన్యుండు నప్పు
డెదురుగాఁ జని తోడ్కొని యేఁగి యచట
నుచితకృత్యంబు నడుప నయ్యురగవిభుఁడు.81

గీ. లేచి నిలుచున్న మంత్రులఁ జూచి రాజు, గారి గుణకథనంబు లవ్వారిగాఁగఁ

దెలుప విన్నందులకు మేము పిలువనంపి, నపుడె వచ్చినయందుల కనుగుణంబు.82

క. అని సన్నుతించి విడిదికిఁ జనుఁదెండని కుంభినీంద్రజంభారిం దో

డ్కొని చని యట నులుపా నిం, డిన యొకగేహమున విడిది నియమించె వెసన్.83

చ. అతనికి నమ్మదాలస యుదారకథాభ్యుదయంబుఁ దెల్పి యో

క్షితివర పెండ్లి యిచ్చటనె చేయుతలంపున నిన్నుఁ బిల్వఁబం
చితినని సంబరం బొదవఁజేసి ఫణీంద్రుఁడు పట్టనం బలం
కృతముగఁ జేయఁబంచె బహురీతి ముహూర్తము నిశ్చయించుచున్.84

క. అంతఁ గుండలఁ దోడ్కొని యరుగుడెంచి, తార యంతయు విని మోదవారిరాశి

మగ్నమై తద్వివాహసంభ్రమముఁ జూచు, తలఁపు బొడమిన నచ్చోట నిలిచె నంత.85

క . ఎలమి నల చిలువరాఱే, చెలిచెల్వుఁడు పెండ్లికొడుకు సింగారింపన్

జెలులను బనిచిన ననిచిన, తలఁపుల వారరిగి వస్తుతతు లింపొసఁగన్.86

చ. పనిహరువుం బెనఁగొనిన బంగరునిద్దఁపుఁ బెండ్లిపీఁటపై

జనపతి నుంచి యొక్కయెలజవ్వని మేల్ బురుసా రుమాలు గుం
దనపుమెఱుంగుపైఁ గవఁగఁ దాయతుచేరుల నిండఁ దావి ఘ
మ్మను విరిపువ్వుటెత్తుల నొయారముగా సడలించునంతటన్.87

మ. తళుకుం బాపటబొట్టు చందమున నృత్యంబాడు నాసామణిం

బలె నర్తించు సరంబురీతి నటనప్రావీణ్యముం జూపు గు
బ్బల హసద్వయకంకణధ్వనుల సేబాసంచు మెచ్చం దమిం
దలయంటెం దరళాక్షి యొక్కతె ధరానాథాన్వయస్వామికిన్.88

క. ముందుగ నిగ్గులనీలము, లొందింపక చిక్కువడక యుండ న్నెఱులన్

గందపుటటక లిడియెనొక, యందపునెఱవన్నెలాఁడి యన్నరపతికిన్.89

మ. జలముల్ తెచ్చిన పైఁడిబిందియల మెచ్చంబోని ఘర్మాంబుకం

దళపుం జన్నులమిన్న లీయ లత లానందమ్మునం దేనెసో
నలు వంచన్ నలువొందు తుమ్మెదలనన్ రాజిల్లఁగాఁ బెన్నెఱుల్
జలకం బార్చిరి కొందఱింగుముఖు లాసర్వంసహానేతకున్.90

చ. చలువ లొసంగి వేడుక పొసంగ మెఱుంగుపరంగిపీఁట న

న్నెలఁతలు రాచఱేమగని నిల్పి కురుల్ తడియార్చి గోరులం
గలయఁగ దువ్వుచున్ హొయలుగా సిగ వైచి మెఱుంగుముత్యమున్
గులికెడు బాసికంబు దగఁగుట్టి రుమాలువు గట్టి రంతటన్.91

గీ. కలికి యొక్కతె పెద్దచౌకట్లు పెట్టె, ముదిత యొక్కతె నీలంపుమురువు నిలిపె

రమణి యొక్కతె పచ్చతురా యమర్చెఁ, గాంత యొక్కతె తెలిపతకంబు లిడియె.92

క. ఈరీతిఁ జెలులు నృపు సిం, గారించి యనంతభుజగకాంతుపనుపునం

దార మొదలైనవా రొ, య్యారిం గైసేయ నిర్భరానందమునన్.93

వ. భుజంగపుంగవుం డభంగురత్వరాయత్తచిత్తంబుతో బడిబడిం బనుపఁ బుడిబుడిం

జనుదెంచి యమాత్యులు ముహూర్తం బాసన్నం బయ్యెనంచుఁ విన్నవించినం బ్ర
సన్నవదనంబుతోఁ జిన్నివెన్నెలతో సరిమన్నెఱికం బుప్పళించు కప్పురంబులతోడి
విడియంబు లొసఁగి గద్దియ డిగ్గి ముద్దియలొసంగు కైదండఁ గొని విడిది వెలువడి
యుద్దండగండమదధారావిభ్రమద్భ్రమరీమండలంబగు వేదండంబు నెక్కి వామ
హస్తంబునం బ్రశస్తమణిగణోత్కీర్ణంబగు నంకుశంబునం గుంభంబు లూఁది వెనుకం
దగునూడిగంపుఁ జేడియ లందియిచ్చు పావడకుం దెలనాకుమడుపులకుం జాచు ద
క్షిణకరంబునం బొసంగు నుంగరంబులం జైలంగు మగఱాల డాలు పరిచారకులపై
వెలిపావడలతో వీడుజోడాడ నిజ ప్రకల్పితతరంగతురంగమోన్నిద్రుం డగుటకు
మెచ్చి తరణి యనిపిన కిరణసహస్రంబులనం బెంపుఁగను కరదీపనికాయంబులు త
లతలనం బ్రతిఫలించి గజాంబుధిరాజపుత్రికారాత్రికంబు సవరింపం బరంపరలై బా
రు దీరు ప్రతాపాంకురంబులనం బరఁగుఁ బురుసలతోఁ గురుంజులపైఁ దిరుగు నురగ
కరిగమనల వలయాకారపరిభ్రమచ్చిరోమణీనికాయంబులకు సంగడీలై తురంగ
లింప రంగదుత్తుంగభర్మ్యహర్మ్యాంగనావికీర్ణలాజాసమాజంబులు భానుకల్పితం
బులగు ముత్తెంపుఁ దలఁబ్రాలునకు స్మారకంబులై రకంబుఁ జూప వింతకోపుల
నాఁడు వెలచేడియల మైసిరియెడం దళుకుతళుక్కుమనం బిక్కటిల్లిన వెన్నెలల
క్షీణమణిగవాక్షంబులవలనం జూచు నవరోధగిరి పయోధరల మొగంబుల ముద్దు
బట్టబయలు చేయ సర్వసన్నాహంబు మెఱసి యరుగుదెంచిన కువలయాశ్వు నశ్వత
రోరగేశ్వరుం డెదుర్కొని నీరాజనాద్యుపచారంబులు నడిపించి తోడ్కొని చని
వివాహవేదికాంతరంబున సుఖసమాసీనుం జేసిన యనంతరమున.94

చ. వరుస మెఱుంగు బాసికపు వజ్రపుఁ గుచ్చుల గచ్చుపైఁ బరా

బరి యొనరించు ముత్తియపు బావిలినిగ్గు పరాకుఁ దెల్ప ని
బ్బరమగుఁ గొంకుఁజూపు దొరపాదనఖద్యుతిమీఁది నేర మే
యరయ వివాహవేదికడ కల్ల మదాలస వచ్చినిల్చినన్.95

సీ. తరుణులు వెలిపట్టు తెరవట్టఁగా నశ్వతరుఁడు దేవిపసిండి తళుకుగిండిఁ

బన్నీరు వంప భూపాలు పాదాబ్జముల్ కడిఁగి కన్నియమాట కరణిఁ దనరు
...........................మొసగి క్రొంజిగికట్టు, ప్రాలపుట్టికలపైఁ బతియు సతియు
నిలిచిన ముద్దుగుమ్మల సోబనపుఁబాట నిజపురోహితవేదనినద మఖిల
వాద్యఘోషంబు ఘనవైభవంబు మెఱయ, దారవోసెను పదపడి వారుకొంకు
సిగ్గు తమకంబుఁ జిఱునవ్వుఁ దొంగలింప, నొండొరులమాట వీక్షింప నుచితరీతి.96

మ. కులుకున్ సందిటఁ జెందు మైలతిక కొంగల్ రంగులీనంగఁ గ

మ్మలడాల్ చెక్కిటఁ బల్లటీలు గొనఁ గొమ్మల్ చేరి పోయించఁగా
బలుఠీవుల్ పచరించు చూపుజిగితో వాదించు ముత్తెంబులం
దలఁబ్రా ల్వోసె వధూటి భూధవసుధాధామోత్తమాంగంబునన్.97

క. అంగాంగసంగతిని దన, ముంగై చెమరింపఁ గంఠమున సతికిన్ రా

జాంగజుఁడు కట్టె మణిమయ, మంగళసూత్రంబు జాయమామోత్సుకుఁడై.98

క. తాలిమిఁ బురోహితుఁడు మం, త్రాళుల్ చదువంగ నిర్భరానందమునం

గీలిఁ దగ దంపతుల్ మఱి, వేలిమి గావించి రుచితవిధమున నంతన్.99

గీ. మంత్రము లెసంగ సన్నికల్ మట్టఁజేసి, రప్పుడు పురోహితచయంబు లంత నురగ

కాంతు లందఱుఁ గట్టువర్గములగములు, వరుసఁ జదివించి రవ్వధూవరుల కెలమి.100

వ. ఇవ్విధంబున వివాహమహోత్సవంబు ప్రవర్తిల్లినం దినచతుష్టయానంతరంబునం బ్ర

తిప్రయాణోన్ముఖుండైన కువలయాశ్వునకు నశ్వతరుం డనేకవస్తువు లరణం బొసంగి
మదాలసావిలాసవతికిఁ బుద్ధులు గఱపి కుమారద్వయంబును దారాకుంతలాదివేదం
డగమనలను వెంటం గూర్చి యనిపిన రథారూఢులై వారు గోమతీనదీముఖంబునఁ
బాతాళలోకంబు నిర్గమించి శోభనాలంకారాకారంబగు నయోధ్యాపురంబుం బ్ర
వేశించి గృహప్రవేశంబు గావించియున్న మఱునాఁడు దినాంతసమయంబున.101

ఉ. ముంగల నుబ్బచప్పరము ముత్తెపుముగ్గులుఁ బూలమేలుక

ట్లుం గొదలేనిచిత్తరువులున్ బురుసాపనితోడిమంచముం
జెంగట బీరువాగముల చెల్వము గల్గిన కేళిగేహసీ
మంగమనీయవేషమున మానవనాయకుఁ డుండు నయ్యెడన్.102

గీ. తారాకుండల మొదలైన తలిరుఁబోఁడు, లమ్మదాలసఁ జూచి రావమ్మ నీకు

వరశుభప్రాప్తి చేకూరవలయు ననుచు, ననుచు వేడుకఁ దమలోన నవ్వుకొనుచు.103

చ. జలకముఁ దీర్చి పావడ కళల్ వడిమార్ముడి వైచి జాలువా

వలిపెముఁ గట్టి గుబ్బల జవాది యలంది తురాయిరీతిగా
నలరులు గొప్పునం దుఱిమి హారము లుంచి పిసాలికస్తురిం
దిలకము ముద్దుగా నుదుట దిద్ది గుముల్ గొని వార లత్తఱిన్.104

సీ. అన్నియుఁ దెలిసిన వన్నెలాఁడికి నీకు దెలిపెడి దేమమ్మ కలువకంటి

వినవమ్మ మగవాని మనసు చూడఁగఁ గంచుఁబదనువంటిది సుమీ పద్మగంధి
యిన్నాళ్ళవలెఁ దోడియింతులతోడి యాటలు గావుగద యిదితలిరుఁబోఁడి
యిదిపతి మన మెట్టు లెసయించెదో నేఁడు నీనేర్పు చూతము నీరజాక్షి
యిక్కడనె యింత సిగ్గైన హృదయనాథు, నెట్లు గరఁగింపనేర్చెదే యిందువదన
భావ మెఱిఁగినజాణవుగా వెసమయ, మెఱిఁగి తఱితీపు సేయుమీ యిగురుఁబోణి.105

గీ. అనుచుఁ దోతేఱ నప్పు డవ్వనజవదన, సిగ్గు వెనుకకుఁ దిగువ నెచ్చెలులఁ జుఱుకు

మాట ముందఱి కీడ్వంగ మందగమన, మినుమడింపఁగఁ, జని కేళిగృహముఁ జేర.106

క. వనజాక్షులంద ఱొక్కొక, పనినెపమున జరుగ సరసఁ బగడపుఁ గంబం

బును జాఁటుగాఁ గొనుచు ని, ల్చినతరుణిఁ జూచి విభుఁడు చిఱున వ్వెలయన్.107

గీ. లేచి నిలువుననే కౌఁగిలించుకొనుచు, విరులపాన్పున నుంచి పెన్నెఱులు దువ్వి

కప్పురపుఁదావి గుప్పు బాగా లొసంగి, పొదలి తమకంబు రెట్టింపఁ బుజ్జగించి.108

సీ. అలరులానిన తుమ్మెదలొ నిక్కపున్రంగొ తరుణి చూత మటంచుఁ గురులు దువ్వి

కమ్మబంగరు సిగ్గొ కలిగినపలుడాలొ చెలువ చూతమటంచుఁ జెక్కు నొక్కి
ముక్కఱ ముత్తి యంపు మెఱుంగొ లేనవ్వొ ముదిత చూతమటంచు మోవి పుడికి
కుంకుము జిగియొ నెక్కొను గుంపుదండయో కొమ్మ చూతమటంచు గుబ్బలంటి
తెలివియై మీరు నూగారుదీప్తియొక్కొ, మేలిమొలనూలినీలమో మెఱుఁగుఁబోఁడి
చూతమని పోకముడి విప్పి సుదతిఁ గరఁచి, యించువిలుకానిసామ్రాజ్య మేలి విభుఁడు.109

క. అంతట వేఁగిన ధరణీ, కాంతుఁడు సంధ్యాదికములు గావించి ప్రజన్

సంతసమునఁ బాలింపుచు, నింతింగవఁ గూడి సౌఖ్య మెనయుచు నుండెన్.110

వ. మునీంద్రా! మార్తాండదత్తంబగు కువలయాశ్వంబు చలనం జయం బందుటం జేసి ఋ

తధ్వజుండు కువలయాశ్వుం డనం బరఁగె ననిన సంతోషధుర్యుండై జైమినిముని యవ్వి
హంగమములం బూజించి సుఖంబుండె నంత.111

క. ఈకువలయాశ్వచరితముఁ గైకొని చదివినను వినినఁ గారుణ్యసుధా

శ్రీకరుడు కృష్ణుఁ డొసగున్, శ్రీకరముగఁ బుత్రపౌత్రచిరవిభవంబుల్.112

శా. పూర్వగ్రస్తవినిర్మలత్వబహిరుద్భుద్ధారకీర్త్యంకురా

ఖర్వచ్చాయ కరస్థఖడ్గ, సబలాకారేఖ మేఘోల్లస
త్సర్వాశౌఘతమిస్రఘస్మరమహాసౌదామినీసూతికా
గుర్వర్థార్పణహృష్టయాచకజనా కోదండలీలార్జునా.113

క. ధాటీకరటి ఘటారథ, కోటీక్షిప్తారికుంభికుంభతటమణీ

కోటీవైవాహికము, క్తాటీకనవిజయమాశ్రితకరాంబురుహా.114

మాలిని. పరిధృఢభుజతేజా భానుమద్బింబభానూ

ద్భవహరిదబలాంగ స్థాయిఘర్మోదబిందూ
భవదనభిముఖాసి భ్రామ్యధైభాగ్రహస్తా
ప్రవివృతబలతేజా ప్రౌఢకీర్తిప్రకాశా.115

గద్య

ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమన్వయా

భరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద సంచలన్మా
నసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర రూపరేఖాజి
త చైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధాయక చిననారాయణ
నాయకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రంబను మహాప్రబంధమునందు సర్వంబు
ను బంచమాశ్వాసము.

సమాప్తము.