కుటుంబ నియంత్రణ పద్ధతులు/నూతన గర్భనిరోధక పద్ధతులు
12 నూతన గర్భనిరోధక పద్ధతులు
కుటుంబ నియంత్ర్రణ కొరకు రోజూ మాత్రలు మింగుతున్న సంధ్యకు కొన్ని రోజులయ్యేసరికి వాటిని గుర్తువుంచుకుని వేసుకోవాలంటే విసుగుగా అనిపించడం జరుగుతోంది. దానికి తోడు అవి వేసుకుంటే కడుపులో త్రిప్పినట్లు, కాళ్ళు పీకినట్లుగా వుండటంతో మాత్రలు మింగడానికి విరక్తి కలుగుతోంది. అందుకని ఓ సంధ్యా సమయాన సంధ్య డాక్టరు దగ్గరికి వెళ్ళి "డాక్టర్, రాత్రి అవుతోందంటేనే మాత్ర గురించి గుర్తు పెట్టుకోవడం, అది మింగి బాధ పడడం తప్పడం లేదు. ఇలా బాధపడకుండా ఇంకా తేలికైన పద్ధతులు కొత్తవేమీ కనిపెట్టలేదా?" అంటూ ప్రశ్నించింది.
సంధ్య అడిగిన దానిలో తప్పేమీ లేదు అందుకనే రోజురోజుకీ కుటుంబనియంత్రణ పద్ధతుల్లో తేలికగా అమలు పరచగల వాటి గురించి పరిశోధనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మార్కెట్టులో లభ్యమవుతున్న కుటుంబ నియంత్రణ మాత్రల్లో ఈస్ట్రోజన్ - ప్రొజస్టిరోన్ హార్మోన్లు రెండూ కలిసి వుంటున్నాయి. వీటిలో ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉండబట్టే కడుపులో వికారం, కాళ్ళతీపులు మొదలైన లక్షణాలు వస్తున్నాయి. అందుకని కేవలం ప్రొజస్టిరోన్ తొనే తయారుచేసిన కుటుంబనియంత్రేణ మాత్రలు ప్రయోగాత్మకంగా వాడటం జరుగుతోంది. వీటివల్ల ఎటువంటి వికారం కడుపులో లేకపోయినా, ఈ మాత్రల కుండవలసిన ఇబ్బందులు మరొక రకంగా వుంటున్నాయి. ఈ ప్రొజస్టిరోన్ మాత్రలు వాడే వాళ్ళలో బహిస్టులు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. మామూలుగా వాడే మాత్రలవల్ల అండము విడుదలంటూ వుండదు.
క్రొత్తరకం మాత్రలతో క్రొత్త ఇబ్బందులు
కాని ఈ కొత్తరకం బిళ్ళలు వాడే వాళ్ళలో అండం విడుదల మామూలుగానే ఉంటుంది. కాని వీర్యకణాలతో కలయిక పొంది పిండంగా ఎదగడం జరగదు. ఈ క్రొత్త మాత్రలు వాడేవాళ్ళు, ఏ ఒక్కరోజు అయినా మాత్ర వాడటం మరిచిపొతే వెంటనే గర్భం రావడానికి అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అండం విడుదల వుండి కూడా ఈ మాత్రలు వాడుతూ వుంటే గర్భము రాకుండా ఎలా వుంటుందని అనుమానం కలగవచ్చు. ఈ మాత్రలు వాడుతున్నప్పుడు గర్భాశయ కంఠంలో చిక్కని ద్రవంలాటిది ఎక్కువగా తయారవుతూ ఉండి గర్భాశయ కంఠాన్ని మూసివేసి వుంచుతుంది. ఇలా ఆ చిక్కని ద్రవంవల్ల గర్భాశయానికి దారి అడ్దుపడి ఉండబట్టి వీర్యకణాలు గర్భాశయం లోకి ప్రవేశించలేవు. ఈ మాత్రలు వాడుతున్నప్పుడు గర్భాశయం లోపలి పొరకూడా అండము ఎదుగుదలకి అనుకూలంగా లేకుండా తయారవుతుంది. అందుకని ఒక వేళ ఏదో ఒక విధంగా వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అటుపై న అండవాహికల్లో అండంతో కలయిక పొంది గర్బాశయంలోకి పిండంగా ఎదగడానికి చేరినా గర్భాశాయము అందుకు అనుకూలంగా ఉండదు. కడుపులో వికారం లాంటిది కలగకపోయినా బహిస్టుల విషయములో అస్తవ్యస్తత ఎక్కువగా కలగడంవల్ల, ఈ బిళ్లలు కూడా రోజూ వేసుకోవలసి ఉండటంవల్ల ఈ క్రొత్త మాత్రలకి తగిన ప్రోత్సాహం లభించటం లేదు.
చిన్న గుళీకతో సంతాన నిరోధం
ప్రొజస్టిరోన్ తయారుచేసిన మందు గుళిక ఒకదానిని ఒకసారి చేతి దగ్గర చర్మం లోపలికి ఎక్కించేసినట్లయితే రోజూ మాత్రలు మింగే పని లెకుండా పోతుంది. ఇలా చర్మం లోపలికి పంపిన గుళికనుంచి నిదానంగా మందు వదలబడుతూ గర్బం రాకుండా అరికట్టుతుంది. ఈ గుళిక పెన్సిల్ మొన అంత చిన్న సైజులో ఉండి ఒక పెద్ద సైజు సూదిద్వారా చర్మం క్రిందకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. తిరిగి ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడు ఆ గుళికని బయటకు తీసివేయవచ్చు. ప్రయోజనాత్మకంగా వున్న ఈ పద్ధతి చాలా తేలికగా వున్నా, దీనివల్ల కూడా బహిస్టులు సరిగ్గా ఉండకపోవడం, ఆరోగ్యంలో కొన్ని చికాకులు రావడం ఉంటున్నాయి. ఈ ఇబ్బందులను సరిదిద్దకలిగినట్లయితే ఈ పద్దతి కూడా వీలుగా ఉంటుంది.
యోని మార్గంలో రింగు పద్ధతి
నెలకి ఒక్కటే బిళ్ళ లేక ఒక్కటే ఇంజక్షన్
ఈస్ట్రోజన్, ప్రొజస్టిరోన్‌తో కలిపి తయారుచేసి ఎక్కువ మోతాదు గల బిళ్ళ నెలకు ఒకసారే వేసుకుంటే సరిపోయే విధంగా తయారు చేయడం జరిగింది. కాని ఈస్ట్రోజన్ హార్మోనులవల్ల కలిగే వికారాలు ఈ మాత్రలో కూడా తీసివేయకపోవడం, ఇతర ఇబ్బందులవల్ల ఈ మాత్ర యింకా పరిశోధనాలయంలోనే ప్రయోగాల మధ్య ఉండిపోయింది. అదే విధంగా నెలకి ఒక ఇంజక్షన్‌గా ప్రొజస్టిరోన్ హర్మోను ఉపయోగించినా, దీనవల్ల కూడా అంతగా సంతృప్తికర ఫలితాలు కనబడలేదు.
మగవాళ్ళలో వీర్యకణాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిరోధించే పద్దతి గురించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవే విజయవంతమయినట్లయితే యిక స్త్రీలు మాత్రలు వేసుకోవడం మానివేసి, భర్తని రోజూ మాత్ర మింగావా లేదా అని సంజాయిషీ చేయవచ్చు.
వా క్సి న్
మశూచి, కలరా రాకుండా ఏ విధంగా వ్యాధి నిరోధక ఇంజక్షన్స్ వున్నాయో అదే విధంగా సంయోగ సమయలో యోని మార్గంలోకి ప్రవేశించిన వీర్యకణాలని నిర్మూలించేందుకు వాక్సీను తయారుచేయాలని కృషి ప్రారంభం అయింది. వాక్సీను వల్ల శరీరంలో యాంటీబాడిస్ తయారయి, వీర్యకణాలని అండంతో కలయిక పొందకుండా నిర్మూలించడం చేయవచ్చు. ఇటువంటి వాక్సీన్ తయారు చేయడంలో వైధ్య శాస్త్రజ్ఞులు విజయం సాధించగలిగినట్ల యితే కుటుంబనియంత్రణ విషయంలో ఎంతో ప్రగతి సాధించినట్లే అవుతుంది. ఈ నాడు గర్భనిరోధక ప్రక్రియలుగా కొత్తగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా అవన్నీ యింకా ఆచరణలో అంత ఉపయోగకరంగా లేకుండా వున్నాయి.
క్రొత్త పద్ధతులు క్రొత్త ఆలోచనలు
పై విధంగా చూసినట్లయితే కుటుంబనియంత్రణకి సంబంధించిన అనేక క్రొత్త పద్ధతులు, క్రొత్త ఆలోచనలు వస్తున్నాయి.
గర్భాశయంలో ప్రవేశపెట్టే సంతాన నిరోధ సాధనాల్లో లీస్సీస్ లూప్, కాపర్ -టి లూప్ లే కాకుండా సిల్వర్ లూప్ లు, ప్రొజిస్టేషనల్ స్టిరాయిడ్స్ ప్రయోగాల్లో ఉన్నాయి.
ముక్కుకి సంబంధించిన మ్యూకస్ పొరల్లో సంతాన నిరోధానికి స్టిరాయిడ్స్ అమర్చి సంతానం కలగకుండా చేసే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయోగాలు కోతుల విషయంలో జరపగా చక్కని ఫలితాలు కనబడ్డాయి. సంతాన నిరోధానికి నోటిద్వారా తీసు కునే మాత్రలకంటే ముక్కు పొరల్లో అమర్చిన ప్రొజస్టిరోస్ సెరెబ్రోయినల్ ఫ్లూయిడ్‌లో 10-100 రెట్లు కనబడింది. ఈ ఫలితాలే మానవ ప్రయోగాల్లోకూడ విజయవంతమైనట్లయితే చాలా తక్కువ మోతాదులో హార్మోన్లు సరిపోతాయి. తక్కువ మోతాదులో హార్మోన్లు సరిపోయినపుడు వాటి దుష్పలితాలు కూడా చాలా తక్కువ ఉంటాయి.
ప్రోస్టాగ్లాండిన్స్ E2, F2 అల్ఫాకాంపౌండ్సు గర్భస్రావానికి తోడ్పడతాయి. ప్రోస్టాగ్లాండిన్స్‌కూడా ఏ విధంగా తోడ్పడతాయనే విషయంలో విస్త్రుత పరిశోధన జరుగుతోంది.
ఇమ్యునొలాజికల్ పంధా కూడా ఫామిలీ ప్లానింగ్ విషయంలో ఆలోచించడం జరుగుతోంది. ఫాలికుల్ స్టిమ్సు లేటింగ్ హార్మోను మగవాళ్ళల్లో వీర్యకణాల ఉత్పత్తికి, వృద్ధికీ తోడ్పడుతుంది. అందుకని ఈ హార్మోనుకి యాంటీగా (వ్యతిరేకంగా) పదార్ధాలని శరీరంలో ప్రవేశపెట్టినట్లయితే వీర్యకణాల ఊత్పత్తి లేకుండా చేయవచ్చుననే ఒక ఆలోచన ఉంది.
శాశ్వత సంతాన నిరోధ పద్ధతులుగా వాసెక్టమీ, ట్యూబెక్టమీ పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. ఆపరేషనుతో సంబంధం లేకుండా, ఆయా ట్యూబులని కత్తిరించకుండా శరీరంలోకి ఒక ప్రత్యేక పదార్ధం ఇంజేక్ట్ చేసి ఆ ట్యూబులు మూసుకుని పోయే విధంగా చేయాలని ఒక ఆలోచన ఉంది. అయితే అలా చేయడం వలన ఆ ట్యూబులకి సంబందించిన మొత్తం మార్గాలు మూసుకుని పోతాయి. దానివల్ల ఎప్పుడైనా సంతానం కావాలనుకున్నప్పుడు రీకెనలైజేషన్ ఆపరేషను చేయడానికి అవకాశం లేకుండా పోతుంది.
ట్యూబులు మూసుకుని పోయే ద్రవం బదులుగా వీర్యవాహికలకిగాని, అండవాహికిలకి గానీ క్లిప్పులు, రింగ్‌లు బిగించే పద్ధతి గురించి కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సంతానం తిరిగి కావాలనుకున్నప్పుడు ఈక్లిప్పులని, రింగులని తీసివేస్తే సంతానం కలిగే అవకాశం ఉండవచ్చు. ఈ విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి.
* * *