కుటుంబ నియంత్రణ పద్ధతులు/గర్భం ఎలా వస్తుంది?
22. గర్భం ఎలా వస్తుంది ?
లీల నెలతప్పిందని తెలియగానే అందరికీ ఎంతో సంతోషం కలిగింది. ఎందుకంటారేమో దాదాపు ఒక పుష్కరం తరువాత తిరిగి వాళ్ళ యింటిలో పసిపాప కేరింతలు వినబడతాయని, బి.యస్సీ. జంతుశాస్త్రం స్పెషల్ సబ్జక్టుగా పాస్ అయిన లీలలో తాను గర్భవతి కాగానే అనుకోకుండా పిండోత్పత్తి గురించి అనేక ఆలోచనలు రాసాగాయి. జంతువులలో లాగానే తనలో కూడా ఎన్నో మార్పులు కలుగుతూ పిండం పెరుగుతూ వుంటుంది కదా! ఇలా పిండం పెరగడానికి చాలా చిన్నదిగా వుండే గర్భాశయం నెల నెలకి అంత పెద్దదిగా ఎలా పెరుగుతుంది? ఇలా ఎన్నోవిషయాల గురించి ఆసక్తితో కూడిన ఆలోచనలు రాసాగాయి. అంతకంటే మరింత ఎక్కువ జిజ్ఞాసతో లీల భర్త సునీల్ గర్భధారణ ఎలా జరుగుతుందని ఆలోచించసాగాడు. అండంతో సంయోగం పొందడానికి ఒక్క వీర్యకణం చాలు కదా! అన్ని వీర్యకణాలు ఎందుకు? అండంతో వీర్యకణాల కలయిక అండవాహికల్లోనే ఎందుకు జరగాలి? గర్భాశయంలో ఎందుకు జరగకూడదు? ఒకసారి విడుదలయిన వీర్యకణాలు అండంతో కలియడానికి ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ఆలోచనలెన్నో సునీల్‌లో మెదలసాగాయి.
లీలలోగాని, సునీల్‌లోగానీ, గర్భం, గర్భధారణ గురించి కలిగిన జిజ్ఞాస ఎంతో మెచ్చుకోదగ్గది. వీర్యస్కలనం జరిగినప్పుడల్లా కొన్ని మిలియన్ల వీర్యకణాలు యోని మార్గంలోకి ప్రవేశిస్తాయి. కాని అండంతో ఒక్కటంటే ఒక్కటే వీర్యకణం కలయిక పొందుతుంది. మరి అటువంటప్పుడు ఇన్ని వీర్యకణాల అవసరం ఏమిటనే సందేహం సమంజసమైనదే. కాని అండంతో కలయిక పొందడానికి ఇన్ని వీర్యకణముల అవసరం తప్పక ఉంది. ఎందుకంటారేమో, ఈ వీర్యకణముల హైలూరూనడైజ్ (Hyaloronidase) అనే పదార్ధాన్ని తయారుచేస్తాయి. ఈ పదార్ధం వీర్యకణములకి అండం దరికి చేరడానికి దారి ఏర్పరుస్తుంది. పైగా ముందు అండాన్ని చేరిన వీర్యకణములు తమలో తయారయిన ఈ పదార్ధం ద్వారా అండం వీర్యకణంతో తేలికగా కలయిక పొందడానికి సిద్ధంగాచేసి వుంచుతాయి. తరువాత వచ్చిన వీర్యకణముల్లో ఒకటి తేలికగా అండంతో కలయికపొంది అండాన్ని పిండంగా మార్చివేస్తుంది.
అందుకని వీర్యకణములు ఎంత తక్కువ ఉంటే, హైలూరూనడైజ్ అంత యెక్కువగా లభ్యమై గర్భధారణకు అంత యెక్కువ అవకాశాలు లభ్యమవుతాయి. ఇక్కడ మరొక విషయము గమనించాలి. యోని మార్గంలోనికి విడుదలయిన వీర్యకణములన్నీ పయనించి అండవాహికల్లోకి ప్రవేశించలేవు. చాలావరకు యోని మార్గంలోనే ఉండిపోతాయి. యోని మార్గంలోనే ఉండిపోయిన వీర్యం వీర్యకణములు ఏమయిపోతాయని సందేహం కలగవచ్చు. ఎక్కువభాగం వీర్యం రతి పూర్తి అవగానే పురుషాంగం బయటకు ఉపసంహరించుకునేటప్పుడు గాని, యోనిమార్గంలోని కండరాలు ముడుచుకొని పోబట్టిగాని బయటకు వచ్చేస్తుంది. కొంతభాగము యోని మార్గంలోనే వుండి వాతావరణము సరిపోక నశించిపోతాయి.
అండంతో వీర్యకణాల కలయిక
వీర్యకణం అండం కలయిక అండవాహికల్లో జరుగుతాయి. గర్భకోశంలో ఈ కలయిక జరగదు. అండానికి విడుదలయిన తరువాత ఒక రోజువరకే వీర్యకణంలో కలయిక పొంది పిండంగా మారే శక్తి ఉంటుంది. అండం విడుదలయి, ఆ అండం అండవాహికలద్వారా పయనించి గర్భాశయానికి చేరాలంటే చాలా రోజులు పడుతుంది. అసలు గర్భాశయానికి చేరకముందేఅండం తనశక్తిని కోల్పోతుంది. అందుకని అండం పిండంగా మారాలంటే అండవాహికల్లోనే వీర్యకణముతో కలయిక జరిగిన అండం పిండంగా మారి శక్తిని పుంజుకుంటుంది.
ఈ పిండము నిదానంగా గర్భాశయం వైపునకు బయలు దేరుతుంది. అండము వీర్యకణముతో కలయిక పొందిన తరువాత గర్భాశయానికి చేరడానికి మూడునుంచి నాలుగు రోజులు పడుతుంది. గర్భాశయంలోనే ఇది పెరిగి రకరకాలుగా మార్పులు చెందుతుంది. ఈ పిండము గర్బాశయానికి చేరేటప్పటికి గర్భాశయము క్రొత్త టిస్యూలతోను, క్రొత్తరక్తంతోనూ, సిద్ధంగా ఉండి పిండము ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కలిగించి ఉంటుంది. గర్భాశయానికి చేరిన పిండము గర్భాశయపు గొడలకి గట్టిగా అంటుకుని ఉండిపోయి, అక్కడే శిశువుగా పెరిగి చివరికి నెలలు నిండిన తరువాత జననము జరుగుతుంది.
అండం విడుదల
అండము విదుదలకి ఏదైనా నిర్ణీతమైన రోజు ప్రకారమే కాకుండా సమయం కూడా ఉంటుందా?
ప్రతీ స్త్రీలోనూ సాధారణంగా బహిష్టు రావడానికి పధ్నాలురోజులు ముందు అండము విడుదల అవుతుంది. అండము విడుదలనేది పగలు-రాత్రి అనే సమయంబట్టిగాని సంయోగము జరిగే సమయమునుబట్టిగాని ఆధారపడి లేదు. ఏ సమయములోనైనా అండము విడుదల అవవచ్చు. ఒకసారి విడుదలైన అండానికి ఇరవైనాలుగు గంటలు మాత్రమే వీర్యకణముతో కలయిక పొందే సామర్ధ్యము ఉంటుంది. అండం విడుదల - సంయోగం
అండం విడుదల సంయోగము సమయములోనే అవుతుందా? సంయోగము జరగకపోతే అండము విడుదల ఉండదా? అండము వీర్యకణములతో కలయిక యోని మార్గములో జరుగుతుందా? గర్భాశయంలో జరుగుతుందా? అసలు అండము అంటే రక్తమా లేక కణమా?
సంయోగము జరగడానికి అండము విడుదలకి సంబంధములేదు. అండము విడుదల సంయోగముతో సంబంధము లేకుండా ఎప్పుడైనా విడుదల అవ్వచ్చు. అండముతో పురుష బీజకణం కలయిక గర్భాశయానికి రెండుప్రక్కలా ఉండే అండవాహికపైన ట్యూబుల్లో ఏదో ఒక దానిలో జరుగుతుంది. కాని యోని మార్గంలో కాదు, గర్భాశయములోనూ కాదు పురుష బీజకణముతో కలయికపొందిన అండము గర్భాశయానికి చేరి పిండముగా ఎదగడము జరుగుతుంది. అండము రక్తము కాదు, అది స్త్రీ అండాశయము నుంచి విడుదలయ్యే బీజకణము.
గర్భం రాకపోవడానికి కారణాలు
సరిగ్గా లెక్కకట్టి అండము విడుదలయ్యే దినాల్లో రతిలో పాల్గొన్నా, యెంతకాలానికి కొందరికి గర్భం రాక పోవడానికి కారణము ఏమిటి? పెళ్ళి అయి ఎంతకాలము అయినా గర్భము రాలెదంటే స్త్రీ పురుషులలో ఏదో ఒక లోపము వుండి వుంటుంది. అటువంటప్పుడు ముందు పురుషుని వీర్యం పరీక్ష చేయాలి. ఇటివంటి సందర్భాలలో చాలామంది పురుషులలో వీర్యకణాలు లేకపోవడము జరుగుతుంది. లేదా చాలా తక్కువ సంఖ్యలో వీర్యకణాలు ఉండటం జరుగుతుంది. ఇక స్త్రీల విషయము తీసుకుంటే సాధారణంగా అండము ప్రయాణించే ట్యూబులు మూసుకొనిపోయి ఉండడమో, గర్భాశయము చిన్నదిగా వుండడమో జరుగుతుంది. కొందరు స్త్రీలలో అసలు అండము నెలనెలా సక్రమముగా విడుదల అవుతూ వుండదు. ఇవికాక మరెన్నో కారణాలు గర్భం రాకపోవడానికి ఉన్నాయి. అందుకని గర్భం దాల్చని దంపతులు డాక్టరుచేత అన్ని పరీక్షలు చేయించుకొని దానికి తగిన విధముగా చికిత్స పొందాలి.
పిండం పెరుగుదల
వీర్యకణముతో కలయిక పొందే సమయానికి అండము సైజు అంగుళములో ఇరవైయవవంతుమాత్రమే వుంటుంది. కాని ఒక అండము పిండముగా మారిన 14 రోజులకే దీనికి పదిరెట్లు సైజు పెరిగిపోతుంది. నెలా పది రోజులకి అండము పొడుగు దాదాపు ఒక అంగుళము వుంటుంది. పైగా ఈ సమయానికి అండానికి కాస్త శిశుపోలికలు ప్రారంభము అవుతాయి. పిండానికి అక్కడక్కడ కొన్ని నల్లటి మచ్చలు కనబడతాయి. ఈ నల్లటి మచ్చలే తరువాత కళ్ళు, ముక్కు, నోరుగా మారుతాయి. దాదాపు ఇదే సమయానికి వెన్నుపూసకి సంబంధించిన సూచనలు కనబడతాయి. నెలా పది హేను రోజుల పిండానికి కాళ్ళు, చేతులు ఇతర అంగాలు ఒక మాదిరిగా ఏర్పడతాయి ఇదే సమయములో సెక్స్ తేడాలు కూడా ఏర్పడే సూచనలు వుంటాయి. ఒకవేళ శాస్త్రజ్ఞులు పిండము యొక్క సెక్సునే తారుమారు చేసే స్థితికి రాగలిగితే ఈ దశలోనే ప్రయత్నం జరిగితీరాలి. లేక పోతే నెలా పదిహేను రోజులు దాటిన తరువాత పూర్తిగా సెక్సు భేదాలు ఏర్పడిపోతాయి. పిండానికి రెండునెలలు నిండేసరికి శరీరంలోని అన్ని అంగాలు తయారవుతాయి. కళ్ళరెప్పలు, చిన్న ముక్కు, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు, గుర్తించే స్థితిలో వుంటాయి. పిండము మూడవనెల నిండే సరికి పిండము మూడు అంగుళాల పొడవు వుంటుంది.
నాలుగవ నెల నిండేసరికి గర్భములోని శిశువు కాళ్ళతో తన్నుతున్నట్లుగా తల్లి గుర్తించడం జరుగుతుంది. అయిదవనెల నిండేసరికి గర్భములోని శిశువు బరువు 6 నుంచి 8 ఔన్సులు వుంటుంది. పొడవు 7 నుంచి 8 అంగుళాలు వుంటుంది. చేతిగోళ్ళు పెరగడము ప్రారంభిస్తుంది. ఇక్కడ నుంచి గర్భము శిశువు చాలా వేగముగా పెరగడం ప్రారంభిస్తుంది. ఈ శిశువు ఏడవనెలలో 3 పౌన్లు, ఎనిమిదివనెలలో 4 పౌన్లు దాదాపు 16 అంగుళాల పొడవు వుంటుంది. 9 వ నెలలో శిశువు 6 నుంచి 8 పౌన్లు వుంటుంది. కొంతమంది పిల్లలు ఏడవనెలలో పుడతారు. ఏడవనెలలో పుట్టినా, ఆడపిల్లలు చాలావరకు ఎటువంటి ప్రమాదం లేకుండా పెరగ గలుగుతారు. ఏడవనెలలో కాకుండా ఎనిమిదవ నెలలో కాన్పు అయిన పిల్లలు బ్రతకటం కష్టమని భావిస్తారు. కాని అది పొరబాటు అభిప్రాయం మాత్రమే. తొమ్మిది నెలలూ నిండకుండా ఏడవనెలలో కాన్పు అయినా, ఎనిమిదవ నెలలో కాన్పు అయినా శిశువు నిలద్రొక్కుని బతకడం యెన్నడైనా ఒక్కటే.
* * *