కుటుంబ నియంత్రణ పద్ధతులు/కుటుంబ నియంత్రణ ఈనాటి దంపతుల తక్షణ కర్తవ్యం

కుటుంబ నియంత్రణ

ఈనాటి దంపతుల తక్షణ కర్తవ్యం

"మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని" మనకొక సామెత ఉంది. ఒక కుటుంబ విషయంలో ఇది ఎంత నిజమో, ఒక దేశం విషయంలోనూ అంతగానే నిజం. పరిమితికి మించి సంతానం కలిగితే కుటుంబంలో ఎన్ని సమస్యలు తలెత్తుతాయో అంతకంటె రెట్టింపుసమస్యలు దేశం విషయంలో కలుగుతాయి.

"పిండి కొద్దీ రొట్టె" దేశంలో ఆహారోత్పత్తికి తగిన వనరులు లేనపుడు, ఉండటానికి తగున వసతులు లేనపుడు, ఉద్యోగాలకి తగిన ఖాళీలు లేనపుడు, రోగులకి తగినంత మందులు లేనప్పుడు లెక్కకు మించి జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సమస్యలు ఎదురవక ఏమవుతాయి ? అందరికీ అన్ని సౌకర్యాలు ఒనగూర్చాలంటే కుదిరేపనా ?

అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, రష్యా, జపాను, ఇంగ్లండు, స్విట్జర్లాండు వంటి దేశాల్లోని ప్రజలు సకలసౌకర్యాలతో సుఖంగా ఉన్నారంటే వారు జనాభా పెరుగుదలని పూర్తిగా అరికట్టడం వల్లనే. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆయా దేశాల జనాభా పెరగకుండా నిలకడగా ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందవలసిన దేశాల విషయం తీసుకుంటే ఎటువంటి హద్దూ, అదుపు లేకుండా జనాభా పెరిగిపోతుంది. అందుకనే ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజల సౌకర్యం కోసం ఎన్ని పనులు చేసినా, ఎన్ని అవకాశాలు కల్పించినా ఏమీ చేయనట్టే అనిపిస్తుంది.

ఈనాడు ప్రపంచ జనాభా సుమారు 500 కోట్లు. ఏటా 75 నుండి 80 మిలయన్ల జనాభా పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న ఈ వేగం బట్టి చూస్తే ఇంకో పాతిక సంవత్సరాల్లో ప్రపంచ జనాభా ఇపుడు ఉన్న జనాభాకి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.

అంతవరకెందుకు పెరుగుతున్న మన భారతదేశ జనాభానే చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది. 1981 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 68 కోట్ల 50 లక్షలు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆనాటి దేశ జనాభా 54 కోట్లు, అంటే పది సంవత్సరాల వ్యవధిలోనే 14 కోట్లు జనాభా పెరిగిపోయింది.

మన దేశ జనాభా ఎంత విపరీతంగా పెరిగి పోతోందంటే ఈ శతాబ్దం ఆరంభంలో 23 కోటల 80 లక్షలు. మరి 1981 సంవత్సరం వచ్చేనాటికి 68 కోట్ల యాభై లక్షలు అయిపోయింది. అంటే కేవలం 80 సంవత్సరాల్లో దేశ జనాభా మూడు రెట్లు అయిపోయింది. మరో మాటలో చెపాలంటే 80 సంవత్సరాల్లో 45 కోట్ల జనాభా పెరిగిపోయింది. మళ్ళీ నాలుగేళ్ళలో తీసే జనాభా లెక్కల్లో ఇంకెన్ని కోట్ల జనాభా పెరిగిపోతుందో ! సంవత్సరానికి సగటున ఒక కోటి 30 లక్షల చొప్పున పెరుగుతున్న మన దేశ జనాభా 1990 నాటికి 82 కోట్లు అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ శతాబ్దాంతానికి 95 కోట్లు దాటుతుంది.

1600 సంవత్సరంలో మన దేశ జనాభా ఉజ్జాయింపుగా 13 కోట్లు ఉండేది. క్రిందటి శతాబ్ధం చివరినాటికి దేశ జనాభా 23 కోట్లు అయింది. అంటే మూడు వందల సంవత్సరాలకి కేవలం 10 కోట్ల జనాభాయే పెరిగింది. 300 సంవత్సరాలకి కేవలం 10 కోట్ల జనాభాయే పెరిగితే ఈనాడు 1971 నుంచి 1981 నాటికి 10 సంవత్సరాల వ్యవధిలోనే 14 కోట్లు జనాభా పెరిగిపోయింది. దీనికి కారణం వైద్యశాస్త్రం గణనీయంగా అభివృద్ధి చెందడమే. పూర్వకాలం మశూచి, కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులతో లక్షలాది మంది మరణించినారు. అలాగే ఎన్నో ప్రసూతి, శిశు మరణాఅలు ఉండేవి. మరి ఈనాడు అటువంటి భయంకర అంటువ్యాధులూ లేవు. వైద్యశాస్త్ర అభివృద్ధివల అంటువ్యాధులన్ని అరికట్టి జీవన ప్రమాణాన్ని ఎంతో పెంచుకున్నపుడు, అదే సమయంలో హద్దూ పద్దూ లేకుండా పెరిగి పోతున్న జనాభాని అరికట్టకపోతే మరికొన్ని క్రొత్త సమస్యలు రాక మానవు. పెరిగిపోతున్న జనాభావల్ల బాధలు కలుగక మానవు.

ప్రపంచ దేశాల్లో అధిక జనాభా రీత్యా చూస్తే చైనా ప్రధమ స్థానం ఆక్రమిస్తుంది.

దాని తరువాత భారతదేశం

అధిక జనాభారీత్యా భారతదేశానికి రెండవస్థానమే అయినా భూభాగం వైశాల్యంరీత్యాచూస్తే చైనాకి ఉన్న భూభాగంలో ఏడవవంతే. అలాగే ప్రపంచ జనాభాలో 15 శాతం జనాభా మన దేశంలోనేఉంది. కాని ప్రపంచ భూభాగం రీత్యా చూస్తే మనకి 2.4% మాత్రమే భూభాగం ఉంది. అమెరికాతో పోల్చి చూస్తే మన దేశ భూభాగం అయిదింట రెండుమాత్రమే ఉంది. అయితే జనాభా రీత్యా చూస్తే అమెరికా జనాభాకి మన దేశ జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంది.

ఇంకొక విషయమేటంటే మన దేశ జనాభాలో 42 శాతం మంది 15 సంవత్సరాలలోపు వారు. అదే 40 సంవత్సరాల లోపు వారిని తీసుకుంటే మనదేశ జనాభాలో 75 శాతం పైగా ఉన్నారు. ఒక స్త్రీ 17 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకొని ఏ రకంగానూ కుటుంబ నియంత్రణని పాటించకపోతే తన సంతాన సాఫల్యత కాలంలో 13 మంది బిడ్డలని కనగలదు. మన దేశములో కుటుంబనియం త్రణ పాటించకపోయినట్లయితే ప్రతీ స్త్రీకి తన సంతాన వృద్ధి కాలంలో సగటున 6 గురు లేక 7 గురు పిల్లలు పుడతారు. ఈవిషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే కుటుంబనియంత్రణని పాటించకపోతే జనాభా ఎంత విపరీతంగా పెరిగిపోతుందో అర్ధమవుతుంది. మన దేశంలో సాధారణంగా ఆడపిల్లలకి 15 - 19 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇంతకంటే తక్కువ వయస్సులో కూడా పెళ్ళిళ్ళు అయిపోయే ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. మనదేశంలో 18 సంవత్సరాల లోపు ఉన్న 60 శాతం మంది ఆడపిల్లలకి ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయని జనాభా లెక్కలలో తేలింది. మరొక విశేషమేమిటంటే 14 - 16 సంవత్సరాలలోపు వివాహం చేసుకున్న స్త్రీలకి సంతానం చాలా త్వరగా కలుగుతుంది. అంతే కాకుండా పిల్లలు వెంట వెంటనే పుట్టుతారు. 17 - 19 సంవత్సరాల వయస్సులో కూడా దాదాపు వెంట వెంటనే పిల్లలు పుట్టటం జరుగుతుంది. అదే 19 సంవత్సరాలు దాటిన తరువాత అయితే అంత వెంట వెంటనే పిల్లలు పుట్టటంగాని, పెళ్ళి అవగానే గర్భం రావడంగాని ఉండదు. అదే ఇంకా 25-30 సంవత్సరాలు దాటితే పిల్లలు వెంట వెంటనే కలగటం ఉండదు. అందుకని జనాభా పెరగకుండా అదుపు చేయాలంటే వివాహ వయస్సుని పెంచడం అవసరం. అదుపు లేకుండా జనాభా పెరిగి పోవడంతో దేశం ప్రగతికి ఎంతో అవరోధం ఏర్పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పెరుగుదలని అరికట్టుకుని, సకలసౌకర్యాలు కలిగించుకుని హాయిగా ఉంటే, తక్కిన దేశాలు జనాభా విపరీతంగా పెరిగిపోతున్నందున తినడానికి సరైన తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక, ఉండటానికి సరైన వసతిలేక బాధపడుతున్నారు. ప్రభుత్వం ఏదో తమకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలని అనుకోవడంకాక, ఎవరిమట్టుకు వారు ఒకరు ఇద్దరు పిల్లలలతో కుటుంబాన్ని పరిమితం చేసుకోవాలి. చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబం అని తెలుసుకోవాలి. పరిమితికి మించి సంతానాన్ని కని ఆ సంతానానికి తగిన తిండి పెట్టలేక, తగిన సౌకర్యాలు కలిగించలేక అనారోగ్యంగా, అశక్తులుగా తయారు చేసే కంటే కన్నటువంటి ఒకరిద్దరి పిల్లలని ఆరోగ్యంగా పెంచడం, చక్కగా వృద్ధిలోనికి తీసుకుని రావడం ప్రతీ తల్లీ - తండ్రి చేయవలసిన పని. అలాగే ఆడపిల్ల తక్కువ అనీ, మగపిల్లవాడు ఎక్కువగా భావించి మగపిల్లవాడు పుట్టేంతవరకు పిల్లలని కంటూ పోవడం తప్పు. అలా కనడంవల్ల ఒరిగేదేమీ లేదు సరికదా కష్టాలని కోరి తెచ్చిపెట్టుకోవడమే !

ఆడపిల్ల అయినా ఒకటే, మగ పిల్లవాడు అయినా ఒకటే. ఆలోచన లేకుండా పిల్లలని కంటూ ఉంటే ఆ తల్లి దండ్రులు ఇబ్బందులపాలు అవడమే కాకుండా దేశానికి అనేక సమస్యలు తెచ్చి పెట్టడమే అవుతుంది. అదుపు లేకుండా జనాభా పెరిగినట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుంది. మురికివాడలు పెరిగిపోతాయి.

వాతావరణ కాలుష్యం విపరీతమై పోతుంది. సంఘవిద్రోహశక్తులు ఎక్కువైపోయి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు పెరిగిపోతాయి.

విపరీతంగా జనాభా పెరిగిపోతున్న దృష్ట్యా, దాని వల్ల తలెత్తుతున్న అనేక విషమ సమస్యల దృష్ట్యా, కుటుంబ నియంత్రణని పాటించడం, ఒకరిద్దరి పిల్లలతో సంతానాన్ని పరిమితం చేసుకోవడం ఈనాటి దంపతుల తక్షణ కర్తవ్యం.

* * *

పురుష జననేంద్రియాలు

1.) పొత్తి కడుపు కండరాలు

2.) వీర్యవాహిక

3.)ఎపిడిడిమిన్ (వీర్యవాహిక మొదటి భాగం)

4.)వృషణం

5.) పురుషాంగం

అంతర పురుష జననేంద్రియాలు


1.శిశ్నం

2. మూత్రనాళం

3. పురుషాంగం

4. వీర్యవాహిక (వాస్ డిఫెరెన్స్)

5. మూత్రకోశం

6. శుక్రకోశాలు

7. వీర్యాన్ని విడుదల చేయు నాళము

8. ప్రొస్టేటు గ్రంధి

9. కౌపర్స్‌గ్రంధి

10. మలద్వారం

11. ఎపిడిడిమిస్

12. వృష్‌ణం (టెస్టికల్)

13 బీజకోశం (స్కోటం)