స్థలము 8 : రాజమందిరము.

_________

[రాజు ఖిన్నమానసుఁడై, సోఫాపై కూర్చుండి యుండును]

రాణా : ఇంతవఱకె యీ యపవాదము నగర మెల్లెడల మాఱు మ్రోగుచుండును. పనిపాటులేని సోమరిపోతులు రచ్చకొట్టములలోఁ గూర్చుండి గోరంత కింవదంతిని కొండంత సత్యముగ పెంచి వితర్కించుచు, ఆనందించుచు ప్రొద్దు ప్రుచ్చుకొనుచుందురు కాఁబోలు ! ఇంకను ఆ కళంక వతిని బ్రతుకనిచ్చి నందులకు రాజపుత్ర యువకులు నన్ను దూషించుచుందురు. నా బ్రతుకు నగుఁబాట్ల పాలైనది. - ఎంత సాహసవతి ! తన దుష్కార్యమును గప్పిపుచ్చుటకు అసత్య మాడుచున్నది!

[మంత్రులు ప్రవేశింతురు.]

రాణా : [చిత్తోద్వేగము నడచుకొని] అమాత్యులారా, మీరా ఒక దేవత యనియు, సత్యవ్రత యనియు, మీరు విశ్వసించి యుంటిరి. మీ విశ్వాసము మూఢభక్తియనియు అస్థానికమనియు ఆ దుశ్చరితయొక్క యసత్య వాదనమె నిరూపించుచున్నది - వేయినోళ్ళ ఘోషించుచున్నది.

శ్యామ : రాణిగా రేమిచెప్పిరి?

రాణా : పూజ్యురాలైన మీరాణిగారు అంత:పురమునకు నిన్న వైద్యులెవ్వరును వచ్చియుండలేదని సెలవిచ్చిరి.

మాధ : అది యెట్లు ?

రాణా : ఎట్లో బుద్ధిమంతులు మీరే యోచింపుఁడు.

మాధ : [సంశయముగ] రాణిగా రేల యబద్ధ మాడవలయును ? రాణా : ఏలనో కనుగొండు. ఇప్పటికైనఁ దెలియవచ్చినదా మీ రాణిగారి పూజ్య ప్రవర్తనము ?

శ్యామ : [ఆలోచించి] మహాప్రభూ, రాణిగా రేమియు నసత్యమాడలేదు. వైద్యులు వచ్చిన సంగతియే యామె యెఱిగియుండదు.

రాణా : శ్యామలరావ్, మంచి వూఁతమాటలు ! మీరా ప్రాణరక్షణోద్యమము ప్రశంసనీయ మైనను మాకుగల గౌరవమును బలి యీయ నెంచుట నింద్యము.

శ్యామ : పరాభిప్రాయమునించుక సహించుఁడు. నిజము తేలఁగలదు. భక్రిపరవశురాలైన రాణిగారికి వైద్యులు వచ్చునప్పటికి నిహలోక జ్ఞానమంతరించి యుండినది.

మాధ : ఉండవచ్చును.

రాణా : [గంభీరముగ] నా యదికారము నెల్లిదము సేయుటకు మీరు కృతనిశ్చయులైనట్లున్నది. - కానిండు.

శ్యామ : తప్పదలఁచితిరి. మేము న్యాయైక పక్షపాతులము. నిరంతరమును దేవరవారి మేలుగోరు మంత్రులము. మా విధిని నిర్వర్తించుచున్నాము.

రాణా : ఏల యీ వ్యర్థప్రసంగము? నానమ్మకము అవిచార మూలకముగాదు. సత్యము నూహించితిని. నిజ మెఱిఁగిన వెనుక నాకర్తవ్యమును అనుకూలముగ మఱచునంతటి భీరువునుగాను - స్వార్థపరుఁడనూ గాను. నా సంకల్పము న్యాయ్యము. నా న్యాయ్యసంకల్పము శాసనము. నా శాసనము పొల్లుపోవక కొనసాఁగి తీఱవలయును.

శ్యామ : మీ యాజ్ఞ కేలము ధర్మబాహ్యము. మా యంతరాత్మకు విరుద్ధమైన కార్యము మేము చేయఁజాలము. మమ్ము నుద్యోగ విముక్తులను గావింపుఁడు.

రాణా : [ఆశ్చర్య కోపములతో స్తంభితుఁడై చూచి] ఏమీ ? నాయాజ్ఞకు మాఱు పల్కుటయా ? - మీకు మతిభ్రమణము కలిగినదా ? లేక నేను కుంభ రాణా యను సంగతి మఱచితిరా ? మమ్ము పదభ్రష్టుల గావించుటయేగాదు వధ్యశిలయొద్దకు మరణదండనము మీవెనువెంట నంటివచ్చును పొండు. మీ సర్వస్వము మా సైన్యాధిపతి జప్తిచేసి కోశాగారమున కర్పించును.

శ్యామ : సత్యమేవ జయతి. [నిష్క్రమించును]

మాధ : [అనుసరించును]

రాణా : [క్రోధముతో] పాదాన్వితములైన రాజద్రోహ పిండములు నడచిపోవుచున్నవి - ద్రోహులు - తేనెపూసిన కత్తులు - నట్టనడియేట పుట్టిముంచు పాతకులు - వారికి చెడుకాలమునకు బుద్ధి పెడదారి పట్టినది కాఁబోలు ! ఏమివారి అపూర్వప్రవర్తనము ! - ఓరీ.

భటు : స్వామి -

రాణా : పరుగెత్తుము. పొమ్ము. మాసేనాధిపతిని పిలుచుకొనిరమ్ము.

భటు : ఆజ్ఞ. [నిష్క్రమించును.]

రాణా : [ఉద్రిక్త చిత్తుఁడై అటునిటు తిరుగుచు] ఈ యమాత్యుల విపరీత ప్రవర్తనము నాకు బోధపడకున్నది. నన్ను ప్రతిఘటించుటకుఁ దగిన ధైర్యము వారి కెట్లువచ్చెను? ఆ ! యీ ధిక్కారము నేను సహింపఁజాలను.

[సేనాధిపతి ప్రవేశించును.]

సేనాధిపతి : జయము, జయము !

రాణా : ధర్మసింహా, నీవు గుఱ్ఱపు రౌతుల వెంటఁబెట్టుకొనిపోయి అమాత్యుల భవనములను ముట్టడించి, వారి స్థిర చరాస్తులను జప్తిచేసి కోశాధిపతి యాధీనము చేయుము. వారిరువురకు మరణదండనము విధించితిని. ఆజ్ఞా పత్రముగొని దానిని నిర్వహింపుము. సేనా : [ఆశ్చర్యముతో] మరణ దండనమా ! ఎందులకు ?

రాణా : [కోపముతో] ఏమీ? యీ యాజ్ఞా విమర్శన మహామారి యందఱకు వ్యాపించి నట్లున్నది ! - అది నాయుత్తరువు.

సేనా : అమాత్యు లంతటి యపరాధ మేమిచేసిరి?

రాణా : [కోపము నడచుకొనుచు] ఆ విచారము నీ కనవసరము నా పనుపు సేయుము, పొమ్ము.

సేనా : నిరపరాధులను నేను హత్య చేయఁజాలను.

రాణా : ఇది హత్యకాదు. దండనము.

సేనా : నిర్హేతుకమైన దండనము బలాత్కార హత్య.

రాణా : [విసుగుతో] ఇంక వేఱేమి హేతువు కావలయును? సతీత్వమర్యాదను అతిక్రమించిన మీరాకు మరణశిక్ష విధించితిని. అమాత్యులు నాయాజ్ఞను తిరస్కరించిరి.

సేనా : అపరాధ మొనరించినది అగ్బరు, అతఁడు దండ్యుఁడు.

రాణా : [కోపముతో] నీవు నాకు ధర్మోపదేశము చేయునంతటి పండితుఁడవైతివా? అమాత్యులయొద్ద శిక్షపొందితివా ?

సేనా : అపరాధులే దండ్యులగుట న్యాయమని మనవి చేసితిని.

రాణా : ఇరువురును దండ్యులె. ఆ అగ్బరును మాత్రము వదలిత నను కొంటివా ? ఆ దురాత్ముని రక్తపూరము మాయంత:పురమునఁ జల్లించి అంటు వాపెదను. మీరాను శిక్షింపనిదే లోకము సంతృప్తిపడదు - ఈ యనవసర కాలయాపన మెందుకు ? - నాయాజ్ఞను నిర్వహించెదవా? లేదా? - ఒక్కమాట.

సేనా : సంగ్రామభూముల విరోధికంఠ నాళముల నిష్కరుణముగ చెండాడితిఁగాని, ఎన్నడును నిరపరాధులను హత్యగావించి యెఱుఁగను. మీరు నన్ను నిర్భందించుదురేని ఇదిగో! నాయధికార చిహ్నమునకు మీకు సమర్పించుచున్నాను [కత్తిని రాజుపాదములకడ వైచి నిష్క్రమించును.] రాణా : [కోపస్తంభితుఁడై అట్టె కొంతవఱకుచూచి] ఆ! - వీరందఱకు సంఘాతమరణము విధింపవలయును. - అందఱు స్వామిద్రోహులు - ఈవిప్లవకారులు నా నీడయందె పన్నాగించుచున్న యీకుట్రను నేనుశంకింప లేకపోయితిని. అందఱు లంచగొండెలు. అగ్బరుచే లంచములను దీసికొని నా యుప్పుపులుసునకు ద్రోహముచేసిరి ! - వీరిని ముక్కలుముక్కలుగ తఱిగించి గ్రద్దలకు వెదచల్లించినను నాకసి దీఱదు. - ఎవఁడురా అక్కడ? [పలుకరు]

[అటునిటు నాలుగుతట్టుల తిరుగుచు] ఓరీ - [పలుకరు] - ఏమీ? ద్వారపాలకుఁడును లేఁడా? నా జీవితమునం దెప్పుడును ఇటువంటి యాజ్ఞా తృణీకరణము ననుభవించి యుండలేదు. - నా కన్నులయెదుటనే నా పాలనాదండము భగ్నమై పోయినదా ? ఈధిక్కార మసహ్యము ! ఉదయపూర్ రాజ్యాధిపతి ఒక్కక్షణములో నిస్సహాయుఁడయ్యెనా ? - ఇది స్వప్నము కాదుకదా ! [కలయంజూచి] అహో! యిది నగ్న సత్యము ! - కుమార సింహా, నీవును విశ్వాసఘాతుకుఁడవైతివా ?

[కుమారసింహుఁడు ప్రవేశించును]

కుమారసింహుఁడు : మహాప్రభూ, నేను విశ్వాస ఘాతుకుఁడను గాను. స్వామి యాజ్ఞకై వేచియున్నాను.

రాణా : [అతురతతో కౌఁగిలించికొని] కుమారా, నీవొక్కఁడవే నాకు స్నేహస్పదుఁడవు. తక్కినవార లందఱు విప్లవకారులు. స్వామిద్రోహులు. అమాత్యులతోడ నందఱును వెడలిపోయిరా ? ఇది దీర్ఘాలోచితమైన కుట్రగానున్నది. వారి కంత పలుకుబడియుండుట యెప్పటికైన నపాయకరమె.

కుమా : రాణిగారిపై ఆబాల వృద్ధముగ నందఱికిని భక్తి విశ్వాసములు కలవు. ప్రజలును అట్టివారె. దివాణమున నుండిన ఎవ్వరైన మీ యాజ్ఞను నిర్వర్తింపవలసి వచ్చు నేమో యని యందఱు వెడలిపోయిరి. రాణా : నాప్రజలు నన్ను త్యజించిరా ?

కుమా : రాణిగారిని విశ్వసించుచున్నారు.

రాణా : నా సైన్యములు?

కుమా : రాణిగారి సతీత్వము ననుమానింపవు.

రాణా : [యోచనా మగ్నముగ] అమాత్యులు, ప్రజలు, సైన్యములు మీరా సతీత్వము సంశయింపరు ! - నే నేమైన పొరపడితినా ?

కుమా : ఎట్టి వివేకవంతులైనను పొరపడుట కలదు.

రాణా : [యోచించుచు హఠాత్తుగ తలయెత్తిచూచి] కుమారా, నేను పొరపడలేదు. న్యాయమని నాకు తోఁచినయెడల ప్రపంచమునకు ప్రతి స్పర్ధిగ నైన నిలువఁగలను - లోకులు మూఢభక్తులు, గతాను గతికులు; అమాత్యులు దుర్బల హృదయులు, సైనికులు వివేక శూన్యులు. ప్రత్యక్ష సాక్ష్యము మీరా యపరాధమును నిరూపించుచున్నది. - ఇపుడేమి కర్తవ్యము ? - ఎవ్వరును లేరా ?

కుమా : రాజప్రసాద మంతయు నంధకార కులాయముగా నున్నది.

రాణా : [కోపముతో] మీరా రక్తజ్వాలలతో మన ప్రాసాదము మరల నుద్దీప్తము కాఁగలదు. కుమారా, నీవు విశ్వాసపాత్రుఁడవని నే నెఱుంగుదును. నాయాజ్ఞను నిర్వహింపుము. నీవె నాకుఁ గడపటి పట్టుగొమ్మవు. మీరాకు మరణదండన పత్రమును వ్రాసితెమ్ము.

కుమా : రాణిగారిని శిరచ్ఛేదన మొనరించుట కొక్క కటికవాఁడైన నొప్పుకొనఁడు.

రాణా : నీవో -

కుమా : [వెఱగుపడి ఒకయడుగు వెనుకకు పెట్టుచు] నేనా? -

రాణా : అట్లయిన మీరాయె స్వప్రాణ హంతకి కావలయును. అటులనే వ్రాసితెమ్ము. కుమా : [స్వగతము] రాజాజ్ఞ అనుల్లంఘనీయము. [నిష్క్రమించును.]

రాణా : [సంక్షుబ్ధ చిత్తుఁడై గద్గదస్వరముతో] మీరా, నీవు చావవలయునా ? నీ కీ దుర్బుద్ధి పుట్టకయున్న నీ విట్టి చావు చావవుగదా ! భర్తయే భార్యకు మరణదండనము విధించుట ! హా ! ప్రళయం కరోద్యోగము. అసహ్యమైన మానసిక సంఘర్షణము! - నేను రాక్షసుఁడను. - [దు:ఖించును.]

[ఇంతలో కుమారసింహుఁడు ఆజ్ఞాపత్రము వ్రాసికొని తెచ్చి, నిలుచుండి వేచియుండును.]

రాణా : [కొంతసేపటికి తలయెత్తి స్వప్నములోవలె] తెచ్చితివా?

కుమా : [ఆజ్ఞాపత్రమును చేతికిచ్చును.]

రాణా : [చేవ్రాలు చేయఁబోవునప్పుడు, చేయి వడకును, కొన్ని యక్షరములు వ్రాసి నిలుపును. ఎట్లో చేవ్రాలు పూర్తిచేయును.] ఈ పత్రికను మీరాహస్తమునఁ బెట్టుము. ఎంత వేడికొన్నను నాదర్శన మిప్పింపకుము. ఆ కాంత ప్రాణపరిత్యాగము గావించుకొనువఱకు నీ వంగరక్షకుఁడవుగ నుండుము. పొమ్ము.

కుమా : [స్వగతము] అకటా ! నే నీ సతీతిలకముయొక్క యాత్మహత్యకు సాక్షిగ నుండవలయునా ? ఘోరము ! ఘోరము! [నిష్క్రమింపఁబోవును]

రాణా : ఏదీ, పత్రిక నిటుదెమ్ము. చక్కగ చేవ్రాలు చేసితినో లేదో చూతము.

కుమా : [ఇచ్చును.] రాణా : [పత్రికను చూచిచూచి యొక్క బాష్పకణము కార్చిరి. కుమారసింహుని చేతికిచ్చును]

కుమా : [నిష్క్రమించును]

రాణా : [దు:ఖ గద్గదస్వరముతో] మీరా. నీ యపరాధమునకు మరణముకన్న నల్పదండనము వేఱొండులేదు. ఇంకొక్క నిమిషములో చిరపరిచితమైన నీ మోహనస్వరూపము, ఏడెనిమిది సంవత్సరములు నా జీవితమున కమృతంపువర్తియైన నీ ముఖేందుబింబము, మర్త్యలోకమునుండి సమ్మార్జితము కాఁగలదు. నా యాశలు నిరాశలైనవి. నా సంసారము నిస్సారమరు ప్రదేశమైనది. - మీరా,...చచ్చితివి....చచ్చితివి...

[సోఫాలో నొరగఁబడును]

[తెరజాఱును]