చేటిక : ఓయమ్మో. ఇంకేముంది - [అంటూ నిష్క్రముంచును.]

[తెఱజాఱును.]

________

స్థలము 4 : ఉదయపురము.

________

[పాంథశాల. కొందఱు యాత్రికులు కునికిపాట్లు పడుచుందురు, కొందఱు నిద్రించుచుందురు. ఒక ముసలియవ్వ కాళ్ళుచాపుకొని కూర్చుండి మేలుకొలుపులు పాడుచుండును. ఈసందడికి వెంకటదాసు ముందుగాలేచును.]

వెంకటదాసు : ఏమండోయ్, గోకులదాసూ, లెగండి, లెగండి, ఎంత మొద్దునిద్రయ్యా మీకు ! పొద్దున్నే ప్రయాణమంటే నాకు రాత్రంతా నిద్రపట్టదు. ఏమండోయ్, బృందావనానికి పొయ్యేబండ్లు కదిలిపోతున్నాయి; ఈసమయం తప్పితే మనకింక మంచి దారితోడుదొరకదు. లెగండయ్యా లెగండి.

[ఒక ఫకీరు ఈకేకలకు నిద్రమేల్కొనును.]

ఫకీరు : అయ్! ఏకోన్ రే తెలంగిముసాఫిర్, రాత్రిహంతా దివానా మాద్రి పుకార్ శేస్తాడ్ ? ఈ హడావుడీమే మాకి హొక్క ఛనంకూడా నీంద్‌వుందిలేదు. హొక్డుముసాఫిర్ వస్తాడ్ హరిబోలో హరిబోలో శెప్తాడ్, ఇంకాహొక్డు బైరాగివస్తాడ్ జయ్‌సీతారాంబోల్తాడ్. తుత్తెరీ గడ్బడా హింద్వాలోగ్. [కోపముతో జోలె గొంగడి జవురుకొని పోవును.]

వెంకటదాసు : నీదేంటోయ్ ? పక్కీరి, కీసరపాసర మంటావు, కట్టెపుచ్చుకోని నీబుఱ్ఱ బద్దలు చెయ్యనా యేంటి.

[ఇంతలో యిద్దరు యాత్రికులు తూఁగుకన్నులతో లేచి కూర్చుండి "పట్టుకో పోనియ్యవద్దు, దొంగలు, దొంగలు" అని అరతురు.]

వెంకట : ఏఁటీ ఆవెఱ్ఱి కలవరింపు ? పట్టుకోవడమేంటి !

యాత్రికుడు : నీవు మఱి బుఱ్ఱ బద్దలుకొట్టమన్నది దొంగల్ని కాదూ ?

వెంకట : (పకాయించి నవ్వును.)

[ఈసందడికి యాత్రికులందఱు లేచి మూటా ముల్లె సవరించుకొందురు. ఇంతలో అగ్బరు తాన్‌సేనులు హిందూ యాత్రికుల వేషములతో ప్రవేశింతురు.]

అగ్బరు : వారుచెప్పిన పాంథశాల యిదియేకాఁబోలు.

తాన్‌సేన్ : ఈరాత్రి మనమిచ్చటనే నిదురించి వేఁగుజామున లేచి కృష్ణమందిరమునకు పోవచ్చును. అగ్బ : అట్లేకానిమ్ము.

తాన్ : అయ్యో! మీరీ వట్టినేల యెట్లు నిద్రింతురు ?

[మూటలోని గుడ్డనుతీసి పడక వేయును.]

అగ్బ : [పడకపై కూర్చుండి] ఆహా ! యీపాంథశాల యెంత గభీర సత్యమును బోధించుచున్నది. ఉమ్రఖయ్యాము రుబాయిని తలంపునకు తెచ్చు చున్నది.

                    అంతములేని యీభువనమంత పురాతన పాంథశాల, వి
                    శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగులవాకిళుల్; ధరా
                    క్రాంతులు పాదుషాలు, బహరాం జమిషీదులు వేనవేలుగాఁ
                    గొంత సుఖించి పోయిరెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్.

ఇచట; నున్నంతవఱకె మనదనియెడి భ్రాంతి. తరువాత సుకృత దుష్కృతములు తప్ప వేఱొండు మనల నంటిరాదు. ఇట్లయ్యును జీవితాశ సహజముగ నుండుట వింతగదా ?

తాన్ : భగవంతుఁడు బ్రాంతియనెడు పుష్పహారముచే విశ్వసంసారమును బంధించి యున్నాఁడు.

అగ్బ : కావుననే బంధము గూడ ప్రియమైనది.

[పాంథాశాలలోని యాత్రికులు వెడలుచుందురు]

వెంకట : [తాన్‌సేన్ తట్టుతిరిగి] ఏమండోయ్, మీరింక సుఖంగా పండుకోవచ్చును. మేము వెళ్ళుతున్నాం.

తాన్ : అయ్యా. మీరేదేశస్థులు ?

వెంక : [స్వగతము] తస్సాదియ్యా, బాగా డాబుసరిగా చెబుతాను. [ప్రకాశముగ] నేనా ? ఆంధ్రుణ్ణి. తాన్ : చాలాదూరము యాత్రచేసినారు.

వెంక : అయ్యో! మాదురదృష్టం యిక్కడికి గూడా తరుముకొచ్చిందండి. ఆపరమభక్తురాలిని మీరాబాయమ్మగారిని దర్శనంచేసుకోని ఆమె కృష్ణమందిరంలో పాడుతుంటె విని మా పాపిష్టి జన్మాలు కృతార్థం చేసుకోడానికి యింతదూరం ఎండనక వాననక కొండంత ఆశతో యీ పట్నంచేరినాము.

అగ్బ : [ఆతురతతో] ఏమీ ? ఆమెదర్శనము మీకు లభింపలేదా ?

వెంక : మీ ఆత్రం చూస్తే మీరుకూడా ఆభక్తురాలి దర్శనానికి వచ్చినట్లుంది.

అగ్బ : అవును.

వెంక : ఆతల్లి దర్శనమైతే యింత మనస్తాప మెందుకు ? ఆమెకు పిచ్చిపట్టిందట ! రాణాగారు ఆమెను అంత:పురములోవుంచి చికిత్స చేయిస్తున్నాడట.

తాన్ : తన యవివేకమునకు చికిత్సచేయించుకొనిన బాగుగ నుండెడిది.

వెంక : పిచ్చికుదిరి కృష్ణమందిరానికి వస్తుందని పది దినాలు కనిపెట్టుకొని వుండినాము. ఆమెకు దినదినం పిచ్చి హెచ్చుతున్నదని విని ఇక యింతదూరము వచ్చినవాళ్ళము బృందావనమైనా సేవించుకొని పోదామని బయలుదేర్నాము. మీరేమైనా వస్తారా ?

అగ్బ : [ఆలోచనా నిమగ్నుఁడై యుండును.]

తాన్ : మేమిప్పుడే యిచ్చటకు వచ్చితిమి. పట్టణముచూడ వలయును.

గోకు : అబ్బబ్బా, యీ వెంకటదాసుతో వేగేది కష్టంగావుంది. ఎవరడిగినా ఆంధ్రుణ్ణి ఆంధ్రుణ్ణి అని బలే డాబుసరిగా మాట చెబుతాడు. కార్యంమాత్రం బండిసున్న. దారిలోమనిషి కనపడ్డ పాపానికి తలవిసిగి బట్ట కట్టేవరకు వుపన్యాసంచేస్తాడు - ఏమోయ్ వెంకటదాసూ, బండ్లుకదిలి పోతున్నాయి రావయ్యా, మాటలెట్టుకోని పెద్దదొర కొడుకులాగా నిలుచున్నావు ?

వెంక : ఏమోయి, మనం దొరకొడుకులంగాక, రామరాజు ప్రభువు రాజ్యంచేసేవఱకు ఆంధ్రుడికుండే జబర్దస్తి పాచ్చావుకు కూడాలేదు, మన దెబ్బంటే గోల్కొండ అబ్బా అంటుంది!

గోకు : ఆఁ! యిట్లా యెగనిక్కినవాళ్ళే కిందపడేది. ఆఁ - ఇక చాలురావయ్యా ప్రసంగం.

వెంక : [కోపముతో] ఏమంత పుట్టుమునిగిపోయిందా యేంటి ? మనిషి కనబడితే మాట్లాడనియ్యవు, నీబోటి శకునాలపక్షితో కూడా వస్తే యింతేకదూ మఱి.

యాత్రికులు : హా ద్వారకీవాసా, శ్రీకృష్ణా, జయరమారమణ గోవిందోహరి. [మూటముల్లె లెత్తుకొని కదలుదురు.]

అగ్బ : మనము దైవముచే వచింపఁబడితిమి; మందభాగ్యులము. ఆ పరమ భక్తురాలి వైరాగ్యమును ధ్యానపారవశ్యమును ఉన్మాదముగా శంకించి విషయలోలుఁడైన రాణా ఆమెను అంత:పురమున బంధించి యుండవచ్చును. ఇఁక మనమెట్లు దర్శింపఁగలము?

తాన్ : మనలను ప్రేరించి యింతదూరము ఈడ్చుకొనివచ్చిన యాభగవంతుఁడు మన కేదైన సదుపాయము చూపింపకపోవునా ?

అగ్బరు : మిత్రమా, కోకిల పంజరమున బంధింపఁబడియు గానము మానదుగదా ?

తాన్ : గానమున కప్పుడే యెక్కుడావశ్యకత. వేదనా మృదులమైన గానము మఱింత మధురమై భువనేశ్వరుని హృదయ ద్వారముకడ అతిథియై నిల్చి తలుపుఁదట్టగలదు. - ఇఁక విశ్రమించెదము.

అగ్బ : మీరాబాయిని దర్శించువఱకు నాకెక్కడి విశ్రాంతి ?

[తాన్‌సేను మూటవిప్పి అగ్బరునకు పడకపఱచును. ఇరువురును గుడ్డలు కప్పుకొని పండుకొందురు. తాలారి మురళీదాసు కట్లకఱ్ఱతోను చేతిలాందరుతోను ప్రవేశించును.]

మురళీదాసు : ఎవరు ముసాఫిర్‌ఖానాలో బాటసార్లు ? మూటా ముల్లెజాగర్తగా తలకిందపెట్టుకోండి. దొంగలు దోచుకుంటె మా జబాబుదారీలేదు. హుషార్. హుషార్,

[అగ్బరు తాన్‌సేనులు గుడ్డకప్పుకొని లేచికూర్చుండుదురు.]

తాన్ : అయ్యా, నీవెవ్వఁడవు ?

మురళి : నేను గస్తితిరిగే తలారివాణ్ణండి.

అగ్బ : బాటసారులను నిదురలేపుటతోడనే జవాబుదారితనము తీఱినట్లున్నది !

మురళి : ఏమి చెయ్యమంటా రండి బాబు ? ఎవరుబాటాసార్లో యెవరు వేషధార్లో కనుక్కొనేది కనాకష్టం.

[అగ్బరు తాన్‌సేనులు చిఱునవ్వుతో అర్థగర్భితముగ పరస్పరము చూచు కొందరు.]

మురళి : దొంగలుకూడా యాత్రికుల్లాగా వచ్చి నెమ్మదిగా పండుకొంటారు. అందరిని నిద్రపోనిచ్చి దొరికినవరకు చంకలోపెట్టుకొని పెద్దమనుష్యుల్లాగా వెళ్ళిపోతారు.

అగ్బ : అవును ! లోకము బహువిధము.

తాన్ : నీపేరేమి ?

మురళి : మురళీదాసండి. అగ్బ : పేరు వినుటకు సొంపుగనేయున్నది.

మురళి : నవుకరిమాత్రం బలే గడుసుగా వుందండి కడుపునిండా కూడులేదు. కంటినిండా నిద్రలేదు. కట్టుగుడ్డకు గూడా కరువు. ఇట్లాంటి కక్కురితి నవుకరి చేసేదానికంటె మీమాదిరి బైరాగులై "జై సీతారాం" మంటూ నాలుగిళ్ళకుపోయి నాలుగు పిడికెళ్ళు బియ్యంతెచ్చుకొని సుఖంగా పొట్టగడుపుకొంటూ కాలుమీద కాలువేసికొని ఏసత్రపుగోడకో ఆనుకొని దొరకొడుకు ఎట్టాండి వాడ్రా అనుకొంటూ కాలచ్చేపం చెయ్యడమే మేలుగా తోస్తుంది నాబుద్ధికి. మారాజులుకూడా సోమారిపోతుల్నే ఆదరిస్తారు. మాబోటి కష్టపడే వాళ్ళకు కూడులేదు యీకాలంలో. మావూళ్ళోవుండే రామాంజయ్యగోరు పొద్దున్నే మొగాన యెంటికపోసంత సందూ కూడాలేకుండా నామాలుపెట్టుకోని గుమ్మడికాయతపిలె నెత్తిన పెట్టుకోని అచ్చాపాత్రకొస్తాడు. సాయంత్రం పూలదండలమ్ముతాడు. నెలకి రెండు మోరీల అచ్చాపాత్రబియ్యం అమ్ముతాడు. సారాయంగడికి దినమ్మూ తప్పడు. మల్లీ పెళ్ళానికి బంగారు మురుగులు రాళ్ళకమ్మలు చెయ్యించాడు. ఇదంతా అచ్చాపాత్రడబ్బె ! ఇంక నేను నెలపొడుగుతూ నవకరిచేస్తే కల్లు తాక్కుండా బిగబట్టుకొని వుంటేగింటే పెళ్ళాం బిడ్దలకు దినానికి రెండు పూటలు కూడుదొరికేది కనాకష్టం. నాపెళ్ళాంగూడా బిచ్చమెత్తి మురుగులు చేయించిపెట్టమని దినమ్మూ తగువు. నాకు అదేతేలిగ్గా వుందిబాబు.

అగ్భ : దానము దుర్వినియోగమగుటయేతప్ప, బిచ్చ మెత్తుటవలన బీదతనము పోదు, ఎంతటివానికైనను కాలుసేతులు చక్కగానుండు నంతవఱకు యాచించుట నీచము.

మురళి : కడుపునకు చాలీచాలని నవుకరి అంతకంటె నీచంగా తోస్తుందండి. యాత్రకువచ్చిన పల్లెటూరివాండ్లను అదిలించి బెదిలించి, కొంచెము డాబుసరి మణుసులను యాచించి బేడా పాతికా సంపాయించుకొని కాలం గడుపుతూ వుండినాను. ఇప్పుడు మాకూట్లో రాయిపడిందండిబాబు. అగ్బ : ఏమీ ?

మురళి : రాణిగోరి వల్లనే యీపట్నం యాత్రాస్తళమైంది. ఆ తల్లికి పిచ్చిపట్టి అంతప్పురములోనే చెరపెట్టినప్పటినుంచి యాత్రికులందరు మెల్లింగా సళ్ళుకొంటున్నారు. మాకొక్క దమ్మిడీ యిచ్చేవాళ్లు కూడా కనబడరు.

తాన్ : ఈ పిచ్చికథను సామాన్య జనులందరు నమ్ముచున్నట్లే యున్నది - ఈయూరిలో విశేషము లేవియైనఁ గలవా?

ముర : రాణిగోరికి పిచ్చిపట్టిందొక పెద్ద విసేసం. ఆలుబిడ్డల్ని పెట్టుకొని గుట్టుగా కాపరంచేస్తుండే సంసార్లకు మతాలు వైరాగ్యాలు నేర్పించి కుటుంబాల్లో కలహాలుపెట్టే గురువుల్ని సన్నాసుల్ని రాజ్యంలోనుండి యెళ్ళగొడ్తారని మొన్నదొరగారు పట్నమంతా తుడుమెయ్యించారు. ఈది బళ్ళల్లో యేమితెలియని పిల్లకాయలికి యేలాంటి మతాలు మాయమాటలు చెప్పకూడదనీ యిందుకు తప్పినట్లయితే వురిసిచ్చని చాటించారు. వూరంతా కూడుడికినట్లు వుడికిపోతుంది. గురువులంతా వొక కట్టుగట్టి సీసువుల్ని పిసువురాండ్లని యెగదోల్తున్నారు.

తాన్ : అయితే మీయూరిలో చాలావిశేషములు గలవు.

ముర : ఇంకా వకటండి - ఆ - మరేంగలిస్తే - మీకేమైనా పిచ్చికి వైయిద్దం తెలుసునాండి? అట్లయితే దివాణంలో కొంచెం సంభావన ముట్తుంది. గోసాయిచిట్కాలంటే అందరు నమ్ముతారు.

అగ్బ : రాణిగారి పిచ్చి కుదుర్చుటకా ?

ముర : అవునండి.

తాన్ : సంస్థానపు వైద్యులులేరా ?

ముర : ఎందుకులేరు ! వుండాడు కండోజీరావు. ఆయన రాణీగోరిని సూశి దణ్ణంపెట్టి ఈరోగానికి నాకు మందు తెలియదని వెళ్ళిపోయాడంట !

అగ్బ : ఆతఁడు వివేకి తాన్ : అంత:పురములోనికి ఇతరులను రానిచ్చెదరా ?

ముర : ఆ - వైద్దుగులైతే రావచ్చును. అంతప్పురాధికారి బలవంతరావుగోరి వుత్తరువు తీసుకొని రాణమ్మగారికి వైద్దెం చేయవచ్చును. కుదిరితే మీకు బలే పేరుంటుంది. వూళ్ళోవాళ్ళందరు మిమ్మల్నే పిలస్తారు.

అగ్బ : [చిఱునవ్వుతో] మీయూరి వారికందఱకు ఇట్టి పిచ్చియే పట్టి యున్నదాయేమి ?

ముర : కాదండి. ముందుగా రాజోరి నగళ్ళల్లోపేరుతెచ్చుకుంటే ఆయెనక యాడబట్టినా చెల్లాకె.

తాన్ : మేము రాణిగారియొద్దకు పోవలసియున్న రాణాగారివద్దకు పోవలసిన యవసరములేదా ?

ముర : ఇదంతా బలవంతరావుగారిమీదనే వదలి పెట్టేశిన లాగుంది. ప్రెబువుగా రిప్పుడు కొలువుకచ్చేరిలోకి రావటంలేదు. దొరగారు ముందటిమాదిరి కాదు. [నలుప్రక్కలుచూచి రహస్యము చెప్పువానివలె నటించి] ఎవ్వురు ఏమీ అనుకోడానికి కూడా జంకుతారు. బంగారమంటి దొర యీలాగై పొయ్యాడని పెద్దచిన్నా అందరు అనుకొంటున్నారు [దుప్పటిమడచి క్రిందవేసికొని కూర్చుండి] అయ్యా చలిపుడ్తూవుంది. మీదగ్గిర చిలిమివుంటే వొక్క దమ్మిస్తారా ?

అగ్బ : మేము బైరాగులముకాము. బంగి త్రాగము. ఇదిగో! యిటురమ్మ, నీవు చాలామంచి వాఁడవుగా నున్నావు. ఈరూక తీసికొనుము.

ముర : [లేచి సంతోషముతో చేయిచాపి] దైశెయ్యండి బాబు, మీపేరు చెప్పుకోని పిల్లాపిసుగు రెండుదినాలు కమ్మంగా కారంగా కడుపు నిండా గెంజితాగుతాము. నేను కల్లంగడికి పోనేపోనండి. [రూకతీసికొనును.]

తాన్ : [మెల్లఁగా] రేపటి మన యెత్తుగడకు అవలంబము దొఱకినది.

అగ్బ : అంతయు దైవేచ్ఛ. [గుడ్డకప్పుకొని పరుండును] ముర : [రూకను చేతిలాందరు వెలుఁగున చూచుకొని] అబ్బో! ఇదిరూకగాదురో! మోరియ్య! - ఇట్టాధర్మంచేసే బైరాగుల్ని నేను పుట్టిబుద్దెరిగినాక ఎప్పుడూ చూళ్ళేదు. [మరల లాందరు వెలుఁగున చూచుకొని] అబ్బో! యీమోరియ్య గిన్నెలో సారాయిలాగ చకచక మెరుస్తుంది.

[అటునిటు పరిక్రమించుచు]

              గేయము - బంగారు మోరియ్య బయమేసుతుంది
                            శేతులో మెరుపట్ల శెదిరీపోతుంది.
                            కనబడని దేవుండు గరడావాహనుడు
                            పెత్తేక్షదైవంబు బంగారుమోరి;
                            పిశినారివాడింట పెరిగే నంటుంది
                            మాబోటివారిండ్ల మారిపోతుంది;
                            పెళ్ళాన్కి సూపిస్తె ప్రియమాడుతుంది
                            పిలిశి ముద్దెట్టి నన్ వలపించుతుంది.

               దాని తస్సాదియ్యా, దానికి సూపించను సూపించను.

                            సారాయమ్మేబాబు సల్లంగావుంటె
                            నవుకర్కి శెలవిచ్చి నవ్వుకొంటాను;
                            బంగారు మోరియ్య బయమేసుతుంది
                            శేతులో మెరుపట్లు శెదరీపోతుంది.

                                                      [నిష్క్రమించును]

[తెరజాఱును.]

________