కాశీయాత్ర

నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యావహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరముల నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను "తుద కబ్బెరా తురకభాష" అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందఱు నిందింతురని నాకు తెలిసిన్నీ నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయుటయే నా ముఖ్యోద్దేశ్యము. ఇదిన్నీ గాక, ఈ భాషకు చోటివ్వదగిన కబ్బము లెట్టివో సూచించుటకుగూడ నేనిప్పుడీ పనికి తలపెట్టినాను. ఇప్పుడే కాదు, ఇంతకు పూర్వము కూడా నేనిట్టి పట్టుల నిట్టి భాషనే ఉపయోగించి యుంటిని. పల్లెటూళ్ల పట్టుదలలులోనైనవి చదివినవారి కీసంగతి విశదమే. కావున విస్తరింపక ప్రస్తుతము ప్రారంభిస్తాను. ఇప్పుడు నేను వ్రాయబోయే విషయము అంతో యింతో ‘జాతకచర్య అను పొత్తములో స్పృశించి విడిచిందేకాని క్రొత్తది కాదు. అయితే మరల యెందుకు వ్రాయాలంటే, అందులో నెత్తికొన్నవిషయాలొక్కొక్కటి విడదీసి వ్రాసేయెడల యెంతెంత గ్రంథము పెరుగునో చదువరుల కెఱుకపడే నిమిత్తమే కాని వేఱుకాదు.

గణపతి నవరాత్రములు

నేను ఆయా గురువరుల సమక్షమున అక్షరములు, బడి చదువు, ఫ్రెంచి, సంగీతము, భారవి వఱకు కావ్యములున్నూ చదువు కొని, కొంచెము లఘకౌముది చదివి - బ్రl| శ్రీ|| చర్ల బ్రహ్మయ్యశాస్తులవారి సన్నిధికి విద్యాభ్యాసమునకు వెళ్లేటప్పటికి నాకు పద్దెనిమిదో వత్సరము దాటవచ్చింది. శ్రీ శాస్రులవారి వద్ద సిద్ధాంత కౌమది ప్రారంభించిన మాసం దాటునంతలో - గణపతి నవరాత్రములు సమీపించినవి. అపుడు గురువుగారు శిష్యులనుద్దేశించి, “ఈ గణపతిపూజ విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. కాశీలో దీనిని మిక్కిలి శ్రద్ధాభక్తులతో విద్యార్థులు చేస్తూ వుంటారు, కాబట్టి మీరు కూడా చేస్తే మీకు సకల శ్రేయస్సులున్నూ కలుగుతవి” అని ప్రస్తావించి నారు. అప్పటికి శ్రీ శాస్రులు గారు కాశీనుండి వచ్చి కొలదికాలమే అగుటచే విద్యారులు నలుగురైదుగురికంటే లేరు, అందులో నేనొకడను. శాస్త్రములో నాకంటె తక్కిన విద్యార్థులు ఎక్కువవారే కాని, సంస్కృతము మాటెటులున్ననూ, తెలుగులో కవిత్వము చెప్పటయందేమి, పురాణము చెప్పటయందేమి, నేను "అల్లుల్లో మల్లు పెద్ద" అన్నట్లున్నాను. గణపత్యుత్సవాలకు కొంత ధనార్జన కావాలి గనక, నన్ను శాస్తుల వారు ఆ విద్యార్థులలో పెద్దచేసి సంపాదనార్ధం పంపించినారు.

శాస్త్రులవారి గ్రామము తాడేపల్లిగూడెమునకు ఉత్తరంగా సుమారు రెండు క్రోసుల దూరములో నున్న కడియెద్ద అనే పల్లెటూరు. ఈ యూరికి రెడ్డిసీమ కడు దగ్గఱ. ఇప్పుడెటు లున్నను, అప్పటికి ఎవరేని యాచకులు వెళ్లేయెడల, ఆ రెడ్డి సీమలో ෂටර්‍ම පුංෂී డబ్బు సంపాదన కావడము నిస్సంశయము. అప్పటికి బ్రాహ్మణులంటే, అందులో చదువుకొన్నవారంటే, పట్నాల్లోనేమి పల్లెటూళ్లలోనేమి, గృహస్థులు మిక్కిలిగా ప్రేమించేవారు. ఎప్పుడోకాని బ్రాహ్మణుడు కనుపడని రెడ్డిసీమను గూర్చి చెప్పేదేమిటి ఆ సీమలో "లక్కవరం" అనే గ్రామం పెద్దది. ఆ వూల్లో కోమట్లు విస్తరించి వున్నారు. కోమట్లున్నచోట సర్వసాధారణంగా ధనలక్ష్మికూడా వుంటుందని చెప్పనక్కరలేదుగదా, ధనమున్నచోట, సర్వత్రా కాకున్ననూ, నూట నాటనైనా దాన ముండకపోదు. మేము ఈ సంగతి మనస్సులో పెట్టుకొని ఆ వూరు వెడితిమి. ఆయూరి వర్తకులు మమ్మల్ని ఆదరించి మాచేత పురాణము చెప్పించి, విని మాప్రయత్నానికి యథాశక్తిని తోడ్పడినారు. తరువాత, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మొదలైన వూళ్లు కూడా వెళ్లి ప్రయత్నించినాము. కామవరపుకోటలో పెద్దకోమటి యిచ్చిన చీటీ పుచ్చుకొని ప్రతిదుకాణం గోరుముష్టి కూడా యెత్తేము. కాని లక్కవరంలోవలె యొక్కువగా లాభించిలేదు. అంతలో గణేశ్వర చతుర్థి సమీపించినది. గురువుగారి సన్నిధికి వచ్చి సంపాదించిన - స్వల్ప ద్రవ్యమును వారికి నివేదించితిమి. వారు "చలినీళ్లకు వేడినీళ్లు తోడు” అన్నట్లు మటికొంత ద్రవ్యమును జేర్చి ఆ వుత్సవమును సర్వోత్తమంగా జరిగించిరి. ఆ తొమ్మిదిరోజుల్లో విద్యార్థులకు పాఠములుండవుకాని, శాస్త్రములో పూర్వపక్షములు కొందఱు చేస్తే మటి కొందఱు సిద్ధానములు' చేయడం మొదలైన వ్యాసంగ ములు గురువుగారు దగ్గఱ నుండి జరిపించడము కాశీలో ఆచారము గనుక ఇక్కడ కూడా ఆలాటి సందర్భాలు గురువుగారు చేయించేవారు. దీనివల్ల శిష్యుల సభాకంపము పోయి గండ్రతనం కలుగుతుందని గురువుగారు సెలవిచ్చేవారు. ఇక నొకటి : ఈ గణేశ్వరుని పూజించడముకు విద్యార్థులలో బ్రహ్మచారిని గురువుగారు నియమించేవారు. ఒకయేడు పూజించిన విద్యార్థి మఱియొక యేటికి పనికిరాడు. కారణమేమంటే : ఆ విద్యార్థి మఱుచటి యేటికి ఈ పూజాకారణంవల్ల గృహస్థయి తీరుతాడు. గృహస్టుకు బ్రహ్మచారియైన గణపతిని పూజించుటకు అర్హతలేదని గురువుగారు చెప్పేవారు.

కాశీ వెళ్లడానికి వూహ

ఈ రీతిగా గురువుగారివద్ద కడియెద్దలో చదువుకొంటూ వుండగా నాకు కాశీ వెళ్లడానికి వూహ కలిగింది. చక్కగా అన్నము పెట్టి చదువు చెప్పుతూ వున్న గురువును వదలి కాశీ వెళ్లడమెందుకని చదువరులకు శంక కలుగవచ్చును. కారణం వ్రాస్తూ వున్నాను. తఱుచు గురువుగారు కాశీవిశేషాలు ముచ్చటిస్తూ వుండేవారు. అవి విని విని వుండడమువల్ల, ఆయా విశేషాలు చూదామని అభిలాషయొకటి. ఇంకొకటి, నా చిన్నతనము సుమారు పదియేండ్ల వఱకు జన్మస్థానమైన కడియంలో వెళ్లినప్పటికి, తరువాత యానాములో వుండుట తటస్థించింది. కడియము పల్లెటూరు, యానామో, పట్నవాసము. అందుచేత కొంచెము నాగరకతకు సంబంధించిన అభ్యాసములకు అలవాటు పడ్డాను. ఆ అభ్యాసంలో ప్రతిరోజున్నూ తమల పాకులు వేసికొనుట ఒకటి. అది మిక్కిలి పల్లెటూరగు కడియెద్దలో దుర్లభమయినది." కాశీలో సత్రాల్లో భోజనము పెట్టుటయేకాక ప్రతిరోజున్నూతాంబూలముకూడా విధిగా యిస్తారని వినియుండుటచే కాశీ వెడదామని బలవత్తరమైన కోరిక వుదయించింది. అయితే అది ద్రవ్య సాధ్యమవుటచే, వెంటనే సాగలేదు. ద్రవ్యము లేకుండా బయలుదేరితే యేమవుతుందో యింతకు ముందొక పర్యాయము వేటౌకని ప్రేరేపణ మీద బయలుదేరి విశాఖపట్నము వఱకును వెళ్లి పయిని వెళ్లలేక తిరిగివచ్చిన నాకు పూర్తిగా తెలిసేవుంది గనుక, తొందరపడి బయలుదేరలేదు. ఈ లోపున శాస్తులవారు ఆయీ విద్యార్థులనెల్ల పోషించడానికి అప్పుడప్పుడు కొన్ని గ్రామాలు సంచారం చేస్తూ వుండడములో, అక్కడక్కడ కొందఱు సంపన్నగృహసులు మా గురువుగారిని “మీ విద్యారులలో నెవరైనా పురాణం చెప్పేవారున్నారా" అని అడుగుచుండేవారు. వారికి మా గురువుగారు నన్ను చూపేవారు. నా వలన ఆ గృహస్టులు పురాణం విని, నాకు పదో, అయిదో రూపాయలిచ్చి పంపుచుండేవారు. ఆ ద్రవ్యాన్ని నేను మా గురువుగారి వద్దనే దాచుకొనే వాడను. ఏలాగైతేనేమి ఆయీ బాపతు సొమ్మ నా తాలూకు మా గురువుగారి వద్ద సుమారు యాభై రూపాయల వఱకున్నూ నిలువ వుంది. ఈ సొమ్ముతో నేను కాశీకి వెళ్లవచ్చునను ధైర్యము కలిగింది. అప్పటికి రైలు బెజవాడ వఱకు వచ్చింది. బెజవాడనుండి కాశీకి సుమారు పద్దెన్మిది రూపాయీలు రైలు చార్జీ, అయితే యీ సొమ్ము గురువుగారి నేమనియడుగుదును? కాశీ వెళ్లేదనని వారితో చెప్పవీలులేదు గదా, ఏదో వంక పెట్టి పుచ్చు కోవాలి. ఇట్లుండగా గురువుగారు కిర్లంపూడి వార్షికానికి బయలుదేరినారు. అక్కడ జమీందారులు వార్షికము అరవై రూపాయిలున్నూ ఇచ్చినారు. వారిని సొమ్ము అడిగి పుచ్చుకొని, స్వగ్రామము వెళ్లివస్తానని మనవిచేసి, కాశీకి వెడదామని ఆలోచించుకొని, విరోధి సంl (క్రీ.శ 1889) మార్గశీర్షశుద్ధ తదియనాడు ముహూర్తము బాగున్నదని మనసులో పెట్టుకొని వున్నాను. సొమ్ము అడగడమే తరువాయి గాని, వారు ఇవ్వడానికి లేశమున్నూ అభ్యంతరము లేదు. అంతలో ఆ గ్రామంలో వుండగానే నాకు పెండ్లి తటస్థించి ఆ ప్రయాణ ముహూర్తము పెండ్లి ముహూర్తంగా పరిణమించింది. దాని సందర్భం టూకీగా వ్రాస్తాను.

పెండ్లి మాటలు

కిర్లంపూడికి సమీపములో - గెద్దనాపల్లి అనే పల్లెటూరిలో శ్రీ శాస్రులవారి అన్నగారి అల్లుడు రామడుగుల వేంకటాచలముగారు స్కూల్ మాస్టరుగా ఉన్నారు. సమీపమగుటచే కిర్లంపూడికి ఆయన పినమామగారి దర్శనానికి వచ్చారు. ఆయనతో సుప్రసిద్దులు నూకల సోమనాథ శాస్త్రులు గారి కుమారుడు వేదశాస్త్ర పండితుడు వేంకట కృష్ణశాస్త్రిగారుకూడా అప్పుడు అత్తవారింటికి వచ్చియుండుటచే గెద్దనాపల్లి నుండి శాస్రులవారి దర్శనానికి వచ్చారు. వారిరువురున్నూ శ్రీవారి దర్శనానికి వచ్చే సమయానికి, శాస్రులవారి సన్నిధిని నేను తప్ప ఇతర విద్యార్ధులెవ్వరున్నూ లేరు. తక్కిన విద్యార్థులందఱున్నూ ఆ సమీపంలోనే వున్న ధర్మవరపు పాఠశాలా పండితులగు తనికెళ్ల నరసింహశాస్తుల వారి దర్శనం నిమిత్తం వెళ్లారు. అట్టి సమయంలో గెద్దనాపల్లి నుండి వచ్చిన యిరువురిలో పండితుడని యింతకుముం దుదహరించిన వేంకటకృష్ణ శాస్త్రి గారు నన్ను ఏవో కొన్ని ప్రశ్నలు వ్యాకరణంలో అడిగారు. నాకు తోచిన సమాధానాలు చెప్పి అంతతో వూరకుండక నేను ఆయన్నీ మళ్లా ప్రశ్నించడానికి మొదలుపెట్టినాను. అది గురువుగారు అంగీకరించక, "అబ్బాయీ! ఆయన నీకన్న సర్వాత్మనా పెద్దలు, నీవు ఆయనను ప్రశ్నించకూడదు," అని నన్ను గట్టిగా మందలించారు. విద్యార్థి అవస్థలో నుండుటచే నేను “వారి పెద్దఱికమునకు నేనేమి లోటు గలిగించాను. నన్ను వారడిగారు, నాకు తోచినవి చెప్పినాను, నేను మళ్లా అడిగాను” అనియొక మోస్తరు వినయముగా గురువుగారికి ఉత్తరము చెప్పినాను. అంతతో ప్రస్తుత విషయము ఎట్లో ఆగింది.

నన్ను ప్రశ్నించిన పండితుడున్నూ, నాకు కాబోయే మామగారున్నూ ఆ రోజు అక్కడనే ఉండిపోయిరి; పిమ్మట జామురాత్రి తెల్లవారువేళ మా గురువుగారితో నన్ను గూర్చి కాబోయే మామగారు ముక్తసరిగా ఈక్రింది మాటలను మాట్లాడినారు. “మీరు నా కొమార్తెను మీ బావమఱదికి ఇమ్మని ఇదివఱలో నాతో చెప్పుతున్నారు. ఆ వరుడు వయస్సులో కొంత ముదురు. అందుచేత నాకు సంశయముగా వుంది. ఈవేళ నాతో వచ్చిన వేంకట కృష్ణయ్య శాస్తులుగారితో ప్రసంగించిన పిల్లవాని కివ్వవలెనని నాకు వుద్దేశము హఠాత్తుగా కలిగింది. నగలు వగయిరాలతో నాకేమి పనిలేదు. ఎట్లో బొమ్మల పెండ్లి మోస్తరుగా పెండ్లి చేసి పంపుతాను. అతనితో మీరీమాట చెప్పి అంగీకరిస్తాడేమో కనుక్కోండి". ఈ మాటలకు గురువుగారు సమ్మతించారు. ఉదయము వారంతా కూర్చుని నన్ను పిలిచి యీ విషయము చెప్పినారు. చెప్పి దీన్ని గూర్చి మీ గ్రామము వెళ్లి మీ తల్లిదండ్రులతో ఆలోచించి ఏదో అభిప్రాయము తేల్చమన్నారు. దానిమీద నేను మా గురువుగారితో "మీకన్న మా తల్లిదండ్రులెక్కువ వారు కారు, తమ యిష్టమునకు వారు మాఱు చెప్పరు. కాబట్టి తమ చిత్తము వచ్చినట్లు జరిగింపవచ్చు" నని నేను ప్రత్యుత్తరము చెప్పితిని. ఇక్కడ నిక నొకటి చెప్పవలసియున్నది. ఏమిటంటే, నాకు అప్పటికి కాశీ వెళ్లి అక్కడ అధమం పండ్రెండేండ్లేనా వుండి గొప్ప పాండిత్యం సంపాదించి దేశానికి వచ్చిన పిమ్మటగాని పెండ్లి చేసుకోవాలని సుతరామున్నూ లేదు. అట్టి స్థితిలో గురువుగారు ఈ ప్రస్తావన తేవడంతోనే అంగీకరించడానికి కారణమేమంటే నాకు అప్పుడు వుద్దేశించిన కన్యక నే నెరిగినదే కాని క్రొత్తదికాదు. నే ననుకొన్నంతకాలమున్నూ కాశీలోనున్నను భార్య ప్రతిబంధక మేమిన్నీ వుండదని వూహించుకొన్నాను. ఆ తరువాత నా తరఫున గురువుగారు తల్లిదండ్రులై తథాస్తు అన్నారు. ఆ వేళ కార్తీక బహుళ త్రయోదశి; మార్గశీర్ష శుద్ధ తదియ సుముహూర్తము అనుకొన్నారు.

వివాహ సన్నాహం

వెంటనే గురువుగారు సంస్థానం వారికి కబురుచేయుటకయి మళ్లా దివాణంలోనికి ప్రయాణమయినారు. వార్షికము ముట్టినది కదా, ఏమి, మరల శాస్రులవారు దయచేయుచున్నారని వుద్యోగస్టులు ఆశ్చర్యంగా చూడ మొదలిడినారు. వారివారితో ప్రస్తుతము శ్రుతపఱచి గురువుగారు శ్రీ బుచ్చి సీతయ్యమ్మగారి ముఖ్యపరిచారికను కామాక్షిని పిల్చి, అమ్మగారితో ఈ సంగతిని మనవి చేయమని చెప్పినారు. బుచ్చి సీతమ్మగారనగా, అపుడు కిర్లంపూడి జమీను అనుభవించుచున్న శ్రీ యినుగంటి బుచ్చి తమ్మయ్య, చిన్నరావు గార్లకు మాతామహి. ఎస్టేటు మనుమలిద్దరికి వశపరచి చాలాకాలమైనది. ఆమెకు మనుమ లిద్దఱున్నూనెల 1టికి రు.500-0-0' చొప్పున మాత్రము గౌరవార్థం ఇచ్చుచున్నారు. ఈ అయిదువందలును ఆమె తన ముఖ్య పరిచారికయగు కామాక్షి చేతులో పోసి ధర్మఖర్చు చేయవలసినదని చెప్పచుండేది. ఈ పరిచారిక, అమ్మగారంత వృద్దు కాకపోయినా, సుమారు షష్టిపూర్తికి దాదాపు వయస్సులో వుంది. మిక్కిలి దేవ బ్రాహ్మణ భక్తిపరురాలు. జమీందారులవద్ద మెలగు చుండుట చేతనో, పూర్వపుణ్యవశంచేతనో ఉదారమైన గుణసంపత్తి కలది. ఎట్టిదియును గాకున్న ఆ జమీందార్లు బుచ్చి తమ్మయ్య చిన్నరావు గార్లు అందఱు దాసీలతోపాటుగాగాక, ఈ పరిచారికను కామన్నప్ప' అని వరుసవావులతో పిలవడం తటస్థింపదుగదా? ఈ పరిచారిక యెవరి నవుకరో ఆ బుచ్చిసీతయ్యమ్మగారిని గూర్చి కొంచమిచట తెలుపవలసియున్నది. ఈమె శ్రీ రావు నీలాద్రి రాయనింగారికి కోడలు. శ్రీ నీలాద్రిరాయనింగారి ప్రథమభార్యా పుత్రుడగు శ్రీ బుచ్చితమ్మయ్య గారి భార్య. ఈ బుచ్చితమ్మయ్య గారు శ్రీ పిఠాపుర సంస్థానము" ఏలవలసిన వారయ్యను, తలి దండ్రులకు తాత్కాలికముగా కలిగిన మనఃకలహంవల్ల కోటలోని చరాస్తిని మాత్రము గైకొన్న తల్లిగారివల్ల కోట వదలి బాల్యమున నీవలికి రావలసినవారైరి. ఆపిమ్మట అక్కడినుండి తెచ్చిన ధనమువలన ఈ కిర్లంపూడి యెస్టేటు తల్లిగారే పెద్దాపురం సంస్థానమువారివద్ద కొన్నారు. ఈ బుచ్చితమ్మయ్యగారి తల్లిదండ్రులకు తాత్కాలికంగా కలిగిన మనఃకలహంవల్లనే కాట్రావులపల్లె, జగ్గంపేట యెస్టేటులు గూడా యేర్పాటయినాయి. ఇంతకన్న ఈ విషయమునకు ఇక్కడ చోటు చాలదు. కావున ప్రస్తుత ముపక్రమిస్తాను. ఈ బుచ్చి సీతయ్యమ్మగారు మహాధర్మాత్మురాలు. ధర్మవరములో పాఠశాల, అన్నవరంలో ధర్మసత్రము లోనైన ధర్మకార్యాలు పెక్కులు ఈమె చేసినారు. అట్టి ధర్మాత్మురాలిని సేవించే దాసికి మాత్రం మంచిబుద్ధి యేల కలుగదు? కలగడం న్యాయమే. భాగవతములో శ్రీ పోతరాజుగా రేమన్నారు? “అధముడైన వాని కాలగుకంటె నత్యధికునింట దాసి యగుట మేలు" అని కదా! అదియటులుందే. గురువుగారు అమ్మగారితో మనవి చేయమంటే మనవి చేయుటకు వెడుతూ, ఈ వివాహము అమ్మగారి సెలవుమీద తానే జరిగించవలెనని ఆ పరిచారిక వూహించుకొని, సంతోషముతో అమ్మగారితో శాస్రులవారు చెప్పిన మాటలు మనవిచేసి, తన కోరికను గూడా వినయంగా మనవి చేసికొన్నది. అమ్మగారున్నూ తన దాసి బుద్ధికి మిక్కిలి సంతసించి అట్లే కానిమ్మన్నారు. దాసి సంతోషించి శాస్రుల వారితో మనవి చేసుకొన్నది. అంగీకరించారు. సలక్షణంగా అయిదు రోజులున్నూ కామాక్షి ద్రవ్యంతో వివాహం జరిగింది.

తేజోమూర్తుల అన్నపూర్ణమ్మగారు

ఇక నొకటి ఇక్కడ వ్రాయక తీరదు. మా గురువుగారు కాశీలో నున్న కాలంలో ఈ కిర్లంపూడినుండి తేజోమూర్తుల అన్నపూర్ణమ్మ అనే ఆవిడ తీర్థయాత్రకు వెళ్లింది. కాశీకాక ఇంకా ఉత్తరదేశ యాత్రలు చేయునప్పుడు మా గురువుగారు కూడా కాకతాళీయంగా ఆమె వెళ్లునప్పుడే యాత్రార్థం దయచేసినారు. ఆ పరిచయంవల్ల, దేశానికి వచ్చిన పిమ్మట, ఈ కిర్లంపూడి వచ్చినపుడు జమీందారుల ద్రవ్యముతో దినబత్తెం జరుపవలసియున్ననూ, అన్నపూర్ణమ్మగారి ద్రవ్యమునే గురువుగారు సవిద్యార్థికంగా వుపయోగించేవారు. జమీందార్లు కూడా యిందుకు సమ్మతించేవారు. ఆ అన్నపూర్ణమ్మగారు శాస్రులవా రెన్నినాళ్లున్నను బహు భక్తిశ్రద్ధలతో స్వయంగా వండి మాకందఱకీ షడ్రసోపేతంగా నిత్యసంతర్పణ జరిగించేది. నా వివాహము వీరి యింటనే నిశ్చయమయింది. నిశ్చయించేటప్పుడే ఈమె, స్నాతకము' మాత్రము మా యింటనే నా ఖర్చుమీదనే జరుగవలెను, అని కోరినది. “అట్లే" అని గురువుగారంగీకరించారు. స్నాతకం చ్చే క్రాని అన్నపూర్ణమ్మగారి గృహమునుండియే పెండ్లికి తరలివెడితిమి. స్నాతక సమయానకు మాత్రము మా తలిదండ్రులు రాలేదు. కారణం, అపుడు వర్షాధిక్యముచే ఏలేళ్లు పొంగి మార్గాలు అరికట్టినాయి. చుట్టుమార్గం ద్వారా వచ్చేటప్పటికి ఇక్కడ స్నాతకము వేశ్రాక్ర పుణ్యదంపతులు కూర్చుని జరిగించినారు. ఆ దంపతులు అన్నపూర్ణమ్మ శాఖవారే, కాసలేయులు' ఆయన పేరు బుల్లినారాయణ సోమయాజులు. స్నాతకపు పీటలమీద నుండి లేచేవేళకు మా తలిదండ్రులు వచ్చి కలిసికొన్నారు. వారికప్పుడు, ఏకపుత్ర విషయంలో మనకిది ప్రాప్తిలేకపోయిందికదా అని కొంత విచారమున్నూ, తలవనితలంపుగా బీదలమగు మన కుబ్జవాడికి పెండ్లి జరుగుచున్నదిగదాయని కొంత సంతోషమున్నూ కలిగింది. ఆయీ సందర్భములను నానారాజ సందర్శనములో" - సీ|| పరదేశములు దివ్యతర దేశములు గాంగ|| అను సీసములో సూచించియున్నాను.

ప్రయాణ ముహూర్తమే పెండ్లి ముహూర్తం

ఇక నొకసంగతి జ్యోతిష శాస్త్రజ్ఞలు ఇచట గమనింప వలసియున్నది. నేను త్రికరణశుద్ధిగా కాశీకి వెళ్లవలెనని ముహూర్తము పెట్టుకొంటిని. ఆ ముహూర్తము పెండ్లి ముహూర్తముగా మాఱుటచే, నా యుద్దేశమునకు వ్యతిరేకమేయైననూ స్నాతకములో కాశీయాత్ర అనుపేర నేవో కొన్ని యడుగులు నడచుట కొంత ఆచారమై యుండుటచే, అనుకొన్న వుద్దేశముకూడ నెఱవేటినట్లు సంతసింపవచ్చును. మటియూ నీవివాహ సందర్భములో అప్పుడు జమీందార్లుగానున్న శ్రీ బుచ్చితమ్మయ్య, చిన్నరావు గార్లమీద నాచే కొన్ని పద్యములు చెప్పి వినిపింపబడ్డవి. అందొకటి మాత్రమిచ్చట ఉదాహరిస్తాను.

ఉ. అంచితులౌ భవజ్జనకు లాదర మొప్పగం గాశిలోన జె
ప్పించిన సర్వశాస్త్రములఁబెంపుగనధ్యయనం బొనర్చి రా
ణించెడు చర్ల వంశవరనీరధిశారదచంద్రు సార్థతో
దంచిత బ్రహ్మయాభిధబుధాగ్రణిశిష్యుండ వేంకటాఖ్యుడన్

ఆఱణాల మూడుడబ్బులతో ప్రయాణం

వివాహం జరిగిన తర్వాత, పదహారు రోజుల పండుగ ముగియకుండగానే, మరల గురువుగారి సాన్నిధ్యమునకు వెళ్లి చదువుతూ వుండగా, గురువుగారితో జల్లిసీమ' ప్రయాణం తగిలింది. ఆ ప్రయాణంలో తిరుపతిశాస్త్రిగారి గ్రామం యెండగండి మకాంలో గురువుగారు వుండగా గురువుగారి తల్లి శత వృద్ధురాలు స్వర్గస్టురాలైనది. ఆ కారణంచే గురువుగారు స్వగ్రామం దయచేసినారు. వెళ్లునప్పుడు శిష్యులతో, అంతకుముందు పాఠశాల నిమిత్తం ఆ చుట్టుపట్ల గ్రామస్టులు చందాగా నిచ్చిన ధాన్యమును ఏకత్రకు చేర్చి కడియెద్దకు చేర్చే యేర్పాటు చేయవలసినదిగా చెప్పినారు. ఆ వసూలు చేయుటలో నాకున్నూ ఒకవూరు వంతు వచ్చింది. ఆ వూరిపేరు ಹಿಂದಿುಲ್ಟು. నేనున్నూ, నాకు కొలది దినముల క్రిందటనే సహాధ్యాయిగా నేర్పడిన కందుకూరి కృష్ణశాస్త్రి గారున్నూ ఉందుఱు వెళ్లవలసివచ్చింది. “నీకు తిరుపతి శాస్త్రి సహాధ్యాయి గదా! కృష్ణశాస్త్రిగా రెవరని చదువరులడుగవచ్చును. వినండి, నేను గురువుగారి దగ్గఱ ప్రవేశించునప్పటికే తిరుపతిశాస్త్రి ప్రవేశించి చదువుచూ వున్నాడు. అందుచే ఒకటి రెండు మాసముల గ్రంథం అతనికి కౌముదిలో ఎక్కువ అయింది. ఆ కారణంచే ఇప్పటికింకను తిరుపతి వేంకటేశ్వరులకు సతీర్ధ్య భావమే కాని, సహాధ్యాయిత్వము లేదని తెలియగోరెదను. కృష్ణశాస్త్రి గారున్నూ నేనున్నూ ఉందులు వెళ్ళక పూర్వమే స్నానానికి వెళ్లి కాలువ వొడ్డున ఇట్లు ఆలోచించు కొన్నాము. ఏమని యంటే : "శాస్రులుగారు కొన్నాళ్ల వఱకున్నూ మనకు పాఠములు చెప్ప వీలుకాదు. ఈ సందర్భములో మనకు విద్యావిఘ్నమెట్లున్నూ తప్పదు. కాబట్టి కాశీకి వెళుదుమా' అని యొకరితో నొకరము యోజించుకొనుచున్నాము. యోజించుకోవడమే తడవుగా, “శుభస్యశీఘ్రం" కనుక, తప్పక నేడే వెడదామని కూడా నిశ్చయించుకొన్నాము. త్రోవఖర్చులకు నీవద్ద నేమున్నదంటే నీవద్దనేమున్న దని ప్రశ్నించుకోవడములో, నా వద్ద మూడు డబ్బులున్నూ ఆయనవద్ద ఆఱు అణాలున్నూ" నిలువ తేలింది. బెజవాడనుండి కాశీకి మనిషి వక్కంటికి పద్దెన్మిది రూపాయిలు సమారు టిక్కెట్టుకు కావలెను గదా? "యెట్లాగంటే యెట్లాగ" అని అనుకొని "బెజవాడ వెళ్లేలోపున సంపాదించలేక పోతామా" అని ధైర్యం తెచ్చుకొన్నాము.

కవిత్వపు గడబిడ

స్నానమైంది. ఎట్లో తొందరగా భోజనమున్నూ చేశాము. ఎండగండినుండి బయలుదేరి ఉందుఱు గ్రామము వెళ్లి ధాన్యం వసూలు చేసి ఆ బస్తాలు తిరుపతిశాస్త్రి గారింటికి చేర్చే ఉపాయం చేసి, ఆ మఱునాడు కాశీప్రయాణపు సన్నాహంతో ఆ సమీపమున నున్న గణపవరం వెళ్లినాము. కాశీప్రయాణానికని చెప్పలేదు గాని యేదో కొంత యాచన కారంభించినాము. ఏమిన్నీ పలికినట్లు జ్ఞాపకంలేదు. ఆ వూళ్ళో ఒక సాహిత్య పండితుడు వుండగా, ఆ రోజున వారింట్లో భోజనం చేశాము. ఆయనే కాకుండా, ఆయన ధర్మపత్ని కూడా సాహిత్యపరురాలు. ఈ విషయము కడు మృగ్యమగుటచే, ఆ పుణ్యదంపతుల దర్శనము మాకొక విధ మైన సంతోషమును కలిగించి, భవిష్యత్సందర్భమునకు మంగళ సూచకముగ కన్పట్టింది. ఆ మఱునాడు నిడమలు అనేవూరు వెళ్లాము. ఆ గ్రామము శ్రీ శనివారప్పేట" సంస్థానములోనిది. బారజల్లీ' అనే సీమలో ప్రధానగ్రామాల్లో వకటి. అక్కడ జమీందారుల ఠాణా ఆఫీసు వున్నది. ఆ సమయానికి ఆ యెస్టేటు మేనేజరు శ్రీ దుగ్గిరాల రామదాసుగారు అక్కడనే వున్నారు. మేము ముందుగా ఠాణా కచ్చేరీలోకి వెళ్లి కొంత గడబిడ కవిత్వంతో చేయ మొదలుపెట్టినాము. ఎవరేనా ఏదేనా అడిగితే, కవిత్వంతోటే మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి, ఆ వుద్యోగస్థు లన్నారుకదా, "అయ్యా, మీరెవరో చాలా గొప్పవారుగా ఉనారు. మిమ్మల్ని మా యజమానిగారు చూస్తే వదిలిపెట్టరు. కానీ వారిప్పుడు వక కార్యంలో చిక్కుకొని యున్నారు. రాత్రిగాని వారికి లేశమున్నూ తీరిక కాదు. ఈవేళ చాలా వయస్సు గతించిన వారి యప్పగారి ద్వాదశాహస్సు. ఇది అంత విచారకరమైనది కాకున్ననూ, మీకు దర్శనం మాత్రం ఇవ్వడానికి అవకాశ ముండదు. మీరు వకటి రెండు రోజులు వుంటే తప్పక వారు మిమ్మల్ని చూచి ఆదరిస్తారని చెప్పగా, మేము ఎట్లో ఈ రాత్రే సభ జరిగే వుపాయం చేయవలసినదని పద్యాలతో ఆ ఠాణా ఆఫీసర్లను కోరితిమి. అట్లు కోరుటకు కారణమేమంటే, ఆ రోజున ఆయా గ్రామములనుండి పెక్కుమంది బ్రాహ్మణులు సంభావనకు వచ్చి యుంటారు. వారిలో నూటికి పదిమందియైనా పండితులుంటారు. వారి సమక్షంలో మనము కవిత్వం చెప్పడం మొదలెడితే అది ఆయనకు బాగా నచ్చుతుంది. అలా నచ్చినట్లయితే కాశీకి వెళ్లడానికి యావత్తు ఖర్చున్నూ ఆయనే యివ్వవచ్చును. ఈవేళ తప్పితే ఈ పండితవర్గము ఇక్కడ తటస్థింపదు అని, మాకు వూహ కలిగింది. మా వూహకు అనుగుణంగా ఆ ఠాణా వుద్యోగసులు ఆ రామదాసుగారితో చెప్పి అనుసంధానం చేస్తామన్నారు.

మొదటి అష్టావధానం

ఇది అంతా అయేటప్పటికి సుమారు జామున్నర ప్రొద్దు ఎక్కింది. ఆ వేళ వూల్లో అందఱూ అక్కడికే భోజనానికి వెడతారు. కాబట్టి ఎక్కడా వంటలు లేవు. ఏనాలుగు గంటలకో అయిదు గంటలకో మేముకూడా ఆ సంతర్పణలోనే భోజనం చేయాలి. ఈలోగా చేసే పనేమిటి? సభలో చేసే కార్యానికి తగు కట్టుబాట్లు చేసికోవాలి. కాబట్టి ఇద్దరమున్నూ గ్రామానికి సమీపంలో వుండే ఒక పొలంలో నీరు తోడుకొనే యేతం గుంటలో స్నానం చేసికొన్నాము. నేను చిత్తెకాగ్రతకోసం గాయత్రీ జపానికి మొదలు పెట్టాను. ఆ సభలో వట్టి కవిత్వంకాక అష్టావధానం చేదామని నాకుతూహలం. అయితే యింతవఱకెవరేనా చేస్తూ వుండగా దానిని చూడనూలేదు, నేను చేయనూ లేదు. వారు చేశారు, వీరు చేశారని వినడం మాత్రం కలదు". దానివల్ల నేమి తెలుస్తుంది? ఇప్పుడు క్రొత్తగా మొదలు పెట్టాలి. దాని విధానంకూడా తెలియదు. కవిత్వం మట్టుకు అప్పుడప్పుడు పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులను కూర్చోపెట్టి వారివారి కోరిక ననుసరించి చెప్పుట కలదు. ఇట్టిస్థితిలో పెద్దసభలో అవధానం చేయడమంటే మాటలా? పోనీ, యెవరు చేయమన్నారు, ఏదో చేతనైనంతలో నాలుగు పద్యాలు చెప్పి వూరుకోరాదా, అంటే, అంతమాత్రానికి కాశీప్రయాణానికి సరిపడ్డ ద్రవ్యం వూడిపడుతుందా? పడదు. అందుకోసం జపం ప్రారంభించాను. కూడా వున్న కృష్ణశాస్త్రిగారికీ కవిత్వప్రవేశం లేదు. లేకపోయినా, నాకంటే ఆయన సభకు తగిన లక్షణాలు తేజస్సు వగయిరా కలవాడు. వ్యాకరణం చదువుచున్నాడు. స్మిత పూర్వాభిభాషి. జాతకభాగంలో చక్కని ప్రవేశం కలదు. అంతకుముందే నా జాతకం చూచి “నీది సభలలో పేరుపొందే జాతకమయ్యా" అని చెప్పేవాడు. నాడు కూడా ఆ మాటలే చెపుతూ నాకు ప్రోత్సాహం కలిగించాడు కాని, పిఱికిమందు మాత్రం పోయలేదు.

నేను అదే దీక్షగా గాయత్రీజపం సాగించి అందఱున్నూ మళ్లు గట్టుకొని భోజనాలకు వెళ్లేవేళకు సుమారు మూడు గంటలు దాటే వేళకు ముగించాను. ఇరువురము ఆ అలవేళ (సాయంకాల సమయం) ఆ సంతర్పణలో భోజనం చేశాము. భోజనానంతరం ఆయన బ్రాహ్మణాశీర్వచనం పుచ్చుకొనే సమయంలో మా ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆ రామదాసుగారు సభాస్తారులైన పండితులను, “అయ్యా, ఈరాత్రి వీరెవ్వరో కవీశ్వరులు సభ చేస్తారు కాబట్టి, మీరందఱున్నూ ఆగి రేపట దయచేయవలసిందని కోరారు. 'ఇంతకన్నా వుందా, అని ఆయా పండితులు ఆమోదించారు. పెద్ద కుంకుమబొట్టుతో నేను సభలో కూర్చుని అవధానమునకు మొదలుపెట్టి "అయ్యా? మీలో నెవరేనా శాస్తార్ధానకు’ వకరు దయచేయవలసిందని వినయంగానే కోరితినిగాని, నా కుంకుమ బొట్టుకు జంకియో, యేమోగాని, నాకన్న ననేకరెట్లు గొప్పవారా సభలో నుండిన్నీ నాయెదుటికివచ్చి వకరేనా కూర్చోలేదు. అపుడు కూడావున్న కృష్ణశాస్త్రిగారే శాస్తార్థం చేశారు. తక్కిన పద్యాలు వగయిరాలు అన్నీ యథోచితంగా చెప్పితినిగాని, అందొక లోటు చేశాను. ఎనమండుగురినీ కూర్చో పెట్టి పద్యాలు చెప్పుటకు బదులు, ఒక్కరినే కూర్చోపెట్టి ఒకటి అయిన తరువాత వేటొకటిగా ఎనిమిది పద్యాలు మాత్రం చెప్పి ముగించాను. ఇందులో ధారణ కష్టం లేదు. సభ్యులు ఈ రహస్యం కనిపెట్టినట్లు లేదు. ఈ సభనాటికి ఈ యవధానములను గూర్చి లోకులంతగా యెఱుగరు. కాబట్టి, మేము ఆడినదాట పాడినదిపాటగా సాగింది. గుర్వనుగ్రహమున సమస్తమున్నూ సమకూరుతుంది. సభ్యులు సంతసించారు. రామదాసుగారు సంతసించారు. మా కాశీ ప్రయాణమును గూడ రామదాసుగారికి దెల్ఫితిమి. ఇరువురికిన్నీ యెంత ఖర్చగునో రమారమిగా అంతయు రామదాసుగారు మాకు బహుమానంగా యిచ్చారు.

కాశీ ప్రవేశం

అటనుండి గుండుగొలను గ్రామం వెళ్లితిమి. అక్కడ కూడ చిన్నసభ జరిగినట్లు జ్ఞాపకము. అటనుండి ఏలూరుద్వారా బెజవాడకు వెళ్లి అట రైలెక్కినాము. బోనగల్లు స్టేషనులో దిగి వత్సవాయి గ్రామంద్వారా జగ్గయ్యపేటకు వెళ్లితిమి. వత్సవాయిలో నొకరోజు ఆగితిమి. అక్కడ జొన్నన్నమును భుజింపవలసి వచ్చెను. ఆ కారణముచే, వకపూటే గాని రెండోపూట భోజ నముతో పనే లేకపోయింది. జగ్గయ్యపేటలో కోమట్లు చాలా ధర్మపరులు కలరని మా గురువుగారు అప్పుడప్పుడు ప్రస్తావించుచుండగా వినివుండడం చేత ఆ వూరికి వెళ్లడం తటస్థించింది. తదనుగుణంగా, ఆ వూల్లో శ్రీరామ రాజన్న అనే వైశ్యవృద్దుడు మాచే పురాణం చెప్పించి వక వారంరోజులాపి తగుమాత్రంగా మమ్మును సన్మానించాడు. అటనుండి మళ్లీ రైలుస్టేషనుకు బోనగల్లు వెళ్లునపుడు త్రోవలో మక్కపేటలో నీలకంఠయ్యగారు అనే ఒక రాజయోగిని సందర్శించితిమి. ఆయన బ్రాహ్మణుడేకాడని కొందఱు, బ్రాహ్మణుడేయని కొందరు ఇటీవల తగవులాటలు పెట్టుకొని ఒకరి నొకరు వెలివేసి కొన్నట్లు పిమ్మట వింటిమి కాని, ఆయన జాతికి యెవరైననూ సిద్ధపురుషుడనుటలో సందేహం మాత్రం లేదు. ఆయనకూడా మమ్మల్ని సమ్మానించాడు. పిమ్మట సికింద్రాబాదులో దిగినాము. రాత్రి తొమ్మిదిగంటలవేళ దిగినప్పటికి, స్వగృహమునకు వెళ్లినప్పటికంటే అనేకరెట్లు అధికముగా వేడినీళ్లు స్నానము లోనైన ఉపచారాలతో పుచ్చా లక్ష్మయ్య గారు ఆతిథ్యమిచ్చారు. ఆ నిరతాన్నదాత గృహమునందే మటి వారం రోజులు ఆ ಏಟ್ಟಣಂ చూస్తూ ఆగినాము. వెళ్లేటప్పుడు ఆ గృహస్టు నాకు వారింట్లో యెప్పటినుంచో నిలవవున్న సిద్ధాంత కౌముదిని కూడా యిచ్చినాడు. అక్కడ రైలెక్కి వాడీ స్టేషనులోనున్నూ మళ్లా ధోండు, జబ్బలపూరు స్టేషనులోనున్నూదిగి, మహారాష్ట్రుల హోటలులో భోంచేసి, అటు పిమ్మట ప్రయాగలో దిగి, త్రివేణీసంగమ స్నానం చేసికొని, ఆనాడే రాత్రి సుమారు పన్నెండుగంటలవేళ కాశీలో దిగినాము. ఎవరో రైలులో కలిగిన పరిచయంవల్ల ఏదో ఒక మేడమీదకు తీసుకువెళ్లినారు. అక్కడనే మిగిలిన రాత్రిని గడిపితిమి.

రోగనివృత్తికై కవిత్వం

నాకు అప్పటికప్పుడే తలతిప్ప వ్యాధి కొంచెం వుండేది. అది యెకాయెకీని రైలు ప్రయాణం చేయడంచేత కొంత విస్తరించి నిద్ర పట్టనేలేదు. అదిన్నీ కాక, అంతకుపూర్వం మా గురువుగారు చెపుతూ వుండే మాటలు కొన్ని జ్ఞప్తికి వచ్చాయి. కాశీ గంగ క్రొత్తగా వచ్చినవాళ్లని పరీక్ష చేస్తుందనిన్నీ ఆ పరీక్ష కాగినవాళ్లనే అక్కడ వుండనిస్తుందనిన్నీ ఆగనివాళ్లని కొద్ది రోజుల్లోనే వెళ్లగొడుతుందనిన్నీ చెపుతూ వుండేవారు. ముఖ్యంగా ఆ పరీక్ష గ్రహణివ్యాధి" రూపంగా కనుపడుతుందని కూడా వారే చెప్పేవారు. అప్పుడామాట జ్ఞప్తికివచ్చి, చేతనైన పనిగనుక గంగాదేవిమీద కవిత్వం చెప్పడానికి మొదలు పెట్టాను. నాకు చిన్నప్పటినుండిన్నీ రోగనివృత్తికై కవిత్వం చెప్పడం అభ్యాసం అని పలువు రెఱిగినదే కావున విస్తరింపనవసరం ඒක. ఆ కవిత్వం కాళికాది స్తోత్రమాలలో అచ్చుపడే వున్నది. కాని అప్పటి శైలిని తెలుపుట కిక్కడ నొకదాన్ని మాత్రముదాహరిస్తాను.

శ్లో || అంగోద్భవాహితజటాపటలప్రసంగే
రంగత్తరంగ కనదుత్తమ హంస సంఫేు
తుంగాఘసంఘ శమనప్రకటాంగసంగే
గంగే కృపాం మయి విధేహి కృపాంతరంగే.

రాత్రిభోజన సదుపాయం

తెల్లవారిన తరువాత తెలుగుదేశపు విద్యార్థులు తఱచుగా నివసించే నారద ఘట్టానికి" వారివారి సహాయంమీద వెళ్లగలిగితిమి. ఆ ఘట్టానికి వెళ్లేవరకే మాకు అయోమయంగా వున్నదిగాని, వెళ్లింది మొదలు అందఱూ స్వదేశీయులే కనుక స్వదేశములో వున్నట్లే వున్నది. వెళ్లిన మఱునాడే నాకు రాత్రిభోజనం కూడా కుదిరింది. కాశీలో పూర్వం చదువుకొన్న మహాపండితులందఱున్నూ వంటిపూట తిని చదువుకొన్న వారే. అనేక సత్రాలు వున్నాయిగాని, ఆయా సత్రాల్లో వకపూట మాత్రమే పగలు పెడతారు. రాత్రి శుద్ధశూన్యమే. అయితే గోధుమ రొట్టెలు వేయడం ఆచారం గనుక, ఆ రొట్టెలు అలవాటయి పడడం మొదలుపెడితే రాత్రికి ఆకలే వెయ్యదనిన్నీ అందుచేతనే వత్సరాల కొలది పూర్వం పండితులు యేకభుక్తంతోవుండి చదువుకోగల్గినారనిన్నీ చెప్పగా విన్నాను. దానికి తథ్యంగా ఇంకొక్కటికూడా మా గురువుగారు చెప్పేవారు. మంథెన్న ఘనాపాఠీలు" ముఖ్యంగా యాచనే జీవనంగా కలవారు; ఆ కారణంచే తఱచు పరవాసం చేస్తూవుంటారు. పరవాసానికి బయలుదేరింది మొదలు మళ్లాయింటికి వెళ్లేవరకున్ను ఏకభుక్తమే చేస్తారు. ఆ కారణం చేతనే పరవాసంలో వారి ఆరోగ్యం చెడకుండా వుంటుంది. అని గురువుగారు చెప్పగా వింటిని. ఇది నిజమే కావచ్చును. కాని నాకు మాత్రం వెళ్లిన మఱునాడే రాత్రి భోజనం కుదిరింది గాని, లేనిచే నేనచ్చట వుండనే లేకపోదును. ఈ రాత్రిభోజన సదుపాయం ఇటీవల తెలుగు విద్యార్థులకు మాత్రమే కాకినాడ కాపురస్థుడు శ్రీ పైడా వెంకన్నగారు ప్రతి దినమున్నూ ముప్పదిమందికి ఏర్పాటు చేసినాడు. ఈయన సత్రం సాగించడం" మొదలు పెట్టిన తరువాత కొందఱు నలుగురికీ అయిదుగురికీ పెట్టడానికి ఏర్పరచారు గాని, ఏమైనా అవిచ్ఛిన్నంగా ఈ వెంకన్నగారి సత్రమే జరిగేది. అంతత్వరలో నాకు రాత్రిభోజన సదుపాయం కుదరడానికి కారణం కవిత్వమే. ఆ నారద ఘట్టములో పలువురు తెలుగుదేశపు విద్యార్థులు వున్నా ఒక్కరున్నూ కవిత్వం చెప్పేవారు ඒජා. శాస్త్రంలో కొంతమంది ప్రవేశం కలవారున్నా సంస్కృతంలోనైనా మంచి సాహిత్యం కలవారు లేరు. తెలుగులో ప్రవేశం కలవారు లేరని చెప్పనే అక్కఱలేదు. ಇಟ್ಟಿ స్థితిలో నన్ను చూచేటప్పటికి మన దేశస్టులందటికీ ఎక్కడలేని ప్రేమా కలిగింది. వీళ్లందఱున్నూ నన్ను వెంటబెట్టుకొని వెళ్లి అంతవాడు, ఇంతవాడు, పైగా అష్టావధాన శతావధానాలు చేస్తాడు’ అని వున్నవి కొన్నీ లేనివి కొన్నీ చెప్పేటప్పటికి, ఆ సత్రాధికారికి నామీద ప్రేమ పుట్టి వెంటనే నాకు రాత్రి భోజనం ఏర్పాటు చేశాడు.

ఇక నాతో వచ్చిన కృష్ణశాస్త్రికి రాత్రిభోజనం కుదరాలి. ఏదోవక వారం పది రోజులలో కుదురుస్తామని విద్యార్థులు చెపుతూ వున్నారు. మధ్యమధ్య ఆ పోస్టులు కూడా కాళీ అవుచుండడం తటస్థిస్తూ వుంటుంది. ఆ కాళీలో క్రొత్తవారిని ప్రవేశ పెటుతూ వుండడం జరుగుతూ వుంటుంది. అందుకోసం నిరీక్షిస్తూ వుండగా కృష్ణ శాస్త్రిగారికి గంగచేసే పరీక్ష ప్రత్యక్షమయింది. ఆ కారణంచేత, ఆయనకు రాత్రి భోజనం మాటట్టే వుండగా, పగటి భోజనంతో కూడా పనే లేకపోయింది. ఆ అనారోగ్యంతో సుమారు ఇరవై రోజులు శ్రమపడి, తుదకు ఆయన స్వదేశగమనానికి సిద్ధమయి, త్రోవఖర్చులకు సొమ్మపంపమని అన్నగారి పేర వ్రాసుకొన్నాడు. నావలెనే ఆయనకూడా బీదకుటుంబములో వాడే అగుటచేత, కొంత ఆలస్యంగా ఆయన అన్నగారు సొమ్మ పంపినారు. సౌమ్మ వచ్చేటప్పటికి దైవకృపవల్ల కృష్ణశాస్త్రి గారికి ఆరోగ్యం కుదుటబడ్డది. ఆ కారణంచేత, వెడదామా, మానదామా? అని తటపటాయిస్తూ ఆయన తుదకు స్వదేశానికి వెళ్లక కాశీలోనే వుండి భాష్యాంతం చదివికొని పిమ్మట కొన్ని సంవత్సరాలకు స్వదేశానికి వెళ్లినారు.

విద్యా వ్యాసంగం

ఇక నేనో, గంగని ప్రార్ధించడం వల్లనో, నాయందా కాశీవిశ్వేశ్వరునికి దయే కలిగిందో చెప్పలేను గాని, స్వదేశంలో కన్న మంచి ఆరోగ్యముతో వుండడం తటస్థించింది. జిల్జన చీదని స్థితిలో వుండి కావ్యపాఠం చదివికొనే యిద్దఱు విద్యార్థులకు గురుత్వం చేస్తూ, శ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్రులవారి వద్ద వ్యాకరణం తరువాయి చదవడానికి మొదలు పెట్టాను. నాకు అప్పటికి దేశంలో కౌముది పూర్వార్ధం సమాస ప్రకరణం కొంతవఱకున్నూ ఉత్తరార్థం తిజంతం కొంతవఱకున్నూ అయినది. అంతేకాకుండా, ఎవరేది చదువుతూంటే అది విని అంతో యింతో గ్రహించే శక్తి వుండడంవల్ల, తత్త్వబోధినిలో నేమి, మనోరమలోనేమి, శేఖరంలో నేమి, కొన్ని కొన్ని సంగతులు కూడా శ్రీ బ్రహ్మయ శాస్రులుగారి కృపవల్లనే తెలిసికోగలిగాను. ఈ కారణంచేత, కాశీలో శ్రీ సుబ్రహ్మణ్యశాస్రులవారి వద్ద పరిభాషేందుశేఖరంలో అదివఱకు విన్న తరువాయి నుంచి, అనగా యదాగమపరిభాష వద్దనుంచి మొదలు పెట్టి కౌముదితోపాటు దానిని కూడా చదువుతూ వుండేవాడను. చదువు దేశంలోకన్న విశేషంగా జరగడం లేదుగాని, కాశీమహాపట్టణములో నివాసము, అనేక చిత్రములు, అనేక ఉత్సవములు, అనేక సభలు, క్రొత్తదేశము, క్రొత్త ఆచారములు, ఇవన్నీ మనస్సును ఆకర్షించి, అక్కడవున్న కాలమంతా బహుచక్కగా, ఉల్లాసంగా జరిగింది. చదువుమాత్రం స్వదేశంలో జరిగినట్టు కాశీలో జరుగదు. అనధ్యయనాల చిక్కు కాశీలో చాలా ఉంది. మాట్లాడితే ఏదో వంక పెట్టి అనధ్యయనం." పండితులేనా, పూర్వకాలంలో ఎప్పుడోగాని నేను కాశీ వెళ్లేటప్పటికి మన దేశంలో, కాశీలో చదివి అక్కడనే పేరు ప్రతిష్టలు పొంది వచ్చినవారు చాలామంది వున్నారు. ఒకటి మాత్రం ఉంది. ఒక్క ప్రదేశంలో అంతమంది, అన్నిశాస్త్రాలలోనూ కావాలంటే మాత్రం దొరకరు. ఏమైనా, మా విద్యార్థిదశ నాటికి కాశీనుంచి వచ్చిన పండితుడంటే వక పెద్దపర్వతం లాగు మా మనస్సుకు తట్టేవాడు. ఈ దేశంలో చదివినవాడంటే వారికన్న యెంత గొప్పవాడైనా మా మనస్సుకు ఎంతో తక్కువగా కనుపడేవాడు. తెలివితేటలు వుండాలి, తగిన గురుశుశ్రూష వుండాలి, వ్యాసంగం వుండాలి; అంతే కాని దేశంలో చదివినా వకటే కాశీలో చదివినా వకటే. అయితే మాత్రం ఇంత విచారణ చేసేదెవరు? కాశీలో యన్ని యేళ్లున్నారంటే, యిన్ని యేళ్లున్నారంటే చెప్పుకొనే మాటలమీద గౌర వించేవారే కాని. పాండిత్యమెట్టిదనే మాట జనసామాన్యానికి అక్కఱ లేదుగదా! ఎవరోవకరు ప్రాజ్ఞతను బట్టి విచారించేవారున్నూ పూర్వకాలమందున్నట్టు ఈ శ్లోకపాదం వల్ల మనము తెలిసికోవచ్చు "కాశీ గమనమాత్రేణ నాన్నంభట్టాయతే ద్విజాః". ఏమైనా, వ్యాకరణానికి కాశీ, తర్కానికి నవద్వీపము," మీమాంసకు దక్షిణ దేశము, వేదానికి కృష్ణాగోదావరీతీరాలు అనాదిగా ప్రసిద్ధి. ఈలా వున్నను, వేద శ్రాతాలు" తప్ప తక్కినవన్నీ కాశీలో మనదేశముకన్న నెక్కువగానున్న వనుటలో నతిశయోక్తిమాత్రం లేదు.

తాంబూలం - భోజనం

నేనప్పుడు చదివికోదలచినది వ్యాకరణం మాత్రమే. దానికి స్వదేశంలోనే బోలెడు గురువులు కలరు. కాశీకి వెళ్లనే అక్కఱలేదు. కాని నేను అనుకున్న తాంబూలపు చిక్కు దేశంలో వదలడం, అందులో మా గురువుగారి వూట్లో వదలడం యెట్లు? అది కాశీలో వదలింది. రోజు వకటి రెండు మూడు సార్లే కాకుండా, ఎన్నిసార్లో తాంబూలం, సురితీ (సున్నము కలిపి నలిపిన పొగాకు) సహితంగా అందఱున్నూ వేస్తారు. ఎవరింటికి వెళ్లినా ముందుగా తాంబూలపు సామాను యెదుటబెట్టిగాని, రెండోమాట మాట్లాడరు." అది ఆ దేశపు ఆచారం, తాంబూలం సంగతి యిట్టిది కదా! ఇక భోజనమో? ఉదయం ఎనిమిదిగంటలు మొదలు రెండుగంటల వఱకున్నూ నిరభ్యంతరంగా సత్రాలున్నాయి ఎనిమిదింటికి రామరాజు (అనంతపురం) సత్రం," పదింటికి తంజావూరు రాణీ సత్రం, పన్నెండింటికి తంజావూరురాజా సత్రం, పన్నెండున్నరకు అన్నపూర్ణ సత్రం, (దీనినే శ్రీమంతుడు" పెట్టించినట్లు చెపుతారు. ఇది మేము నివసించే నారదఘట్టానకు మిక్కిలి దగ్గఱ. ఇందులో చాలామంది సన్యాసులకు భిక్ష జరుగుతుంది.) రెండు గంటల ప్రాంతంలో సింధ్యాసత్రం." ప్రతి సత్రంలోనున్నూ కానో అర్ధణో దక్షిణ, భార్యాసహితంగా చదివికొనే విద్యార్థులకు కూడా ఆయా సత్రాల్లో అన్నం పెడతారు. ఒకటి మాత్రమున్నది. మగవాడు ప్రత్యేకించి వెడితే అన్నం పెడతారుగాని, ఆడది అట్లా వెడితే పెట్టరు. మగవానితో కూడ వెడితే ప్రశ్నించరు. భార్యాభర్తలనే అనుకుంటారన్నమాట, తండ్రీకూతుళ్లు, అన్నాచెల్లెళ్లు, వెడితే అన్నం పెడతారో లేదో నాకు అప్పటికి తెలియదు. కాని, ఆలోచిస్తే, వాళ్లకు కూడా ఆక్షేపణ వుండదనే తోస్తుంది. వితంతువులకు మాత్రము పెట్టరని యెఱుగుదును. ఇంకొకటి; లింగధారి బ్రాహ్మణులకు బొత్తిగా సత్రాల్లో అన్నం పెట్టరు. కారణం, ఉర్లాం జమీందారు బసవరాజుగారు" కాశీ వెళ్లినపుడేదో పండితులను సమ్మానించడంలో అనుచితం జరిగిందనిన్నీ దానిమీద పండితులు ఆ జమీందారుగారి సమ్మానమును నిషేధించి, వారితోనే కాదు, ఆ జాతివారితో భోజన ప్రతిభోజనాలు వర్జితం చేసి, సత్రాల్లో తగిన కట్టుదిట్టం చేశారనిన్నీ మా గురువుగారి వల్లనే మన దేశంలోనే విన్నాను. అందుకు తథ్యంగా, నాతో వచ్చిన కృష్ణశాస్త్రిగారి యింటిపేరు కందుకూరు అనే కారణం వల్ల కొంత చిక్కుకూడా వచ్చింది. కాని అది తుట్టతుదకు బ్రహ్మిష్ణోబ్రహ్మం మీద అనేక పెద్దల సాక్ష్యంమీద వారించుకోడం తటస్థించింది, ఈ చిక్కుతెచ్చిపెట్టినవారు శ్రీ దండిభొట్ల విశ్వనాథశాస్రులుగారు." వీరు మన దేశము వారే అయినను, కాశీలో చదివి మహావిద్వాంసులై అక్కడి పండితులతోపాటు పేరు ప్రతిష్టలు కలిగి, అక్కడనే సకుటుంబంగా నివసించేవారు. ఆయన పైకి పిచ్చివారుగా కనపడేవారు గాని, పూర్తిగా పిచ్చివారు మాత్రం కాదు. ఒక రోజున క్రొత్తవిద్యార్థులను విచారించేటప్పుడు కృష్ణశాస్త్రిగారింటి పేరు కందుకూరి వారు అని తెలిసేటప్పటికికందుకూరివారు వెల్నాటి బ్రాహ్మణులని ఆయన యెఱిగి యుండవలసినదే అయిననూ - "వీడు పాషండుడురోయి" అని మొదలు పెట్టినారు. తరువాత యెట్లో ఆయనను నమ్మించి ఆ చిక్కు వదల్చుకొన్నాము.

కాశీని తిట్టడానికి తగిన కాలం

నేను కాశీవెళ్లి యిప్పటికి సుమారు 44 సంవత్సరములు" దాటవచ్చింది. ఇటీవల కాశీలో అయి అన్నసత్రములలో కొన్ని కూడ లేవనియు, విద్యార్థులకు ఏవిధమైన ఆనుకూల్యము లేదనిన్నీ విని ఎంతో విచారము పొందితిని. బహుశః ఆయా సత్రములన్నియు ఆయా పుణ్యపురుషులచేత యేర్పరచబడడానికి కారణము, కాశీఖండంలో వ్యాసులవారు కాశీలో ఒకనాడు భిక్ష దొరకక కాశీని పట్టుకొని తిట్టిన ఘట్టమే అని నేననుకొంటాను. ఇప్పుడు మళ్లా ఆ వ్యాసులవారి వంటి వారెవరేనా కాశీని తిట్టవలసి వచ్చేయెడల, తగినకాలం వచ్చినట్లు తోస్తుంది. కాని ఆ వ్యాసులవారి వంటివారేరీ? ఆ కాలంలో వున్నంతమంది మహా పండితులు కూడా యిప్పుడు కాశీలో వున్నట్లు వినము. అబ్బో.! అప్పుడు గంగాధరశాస్రులుగారు, శివకుమార పండిజీవారు, కర్ణాట సీతారామ - శాస్రులుగారు దామోదరశాస్త్రులు | గారు యింకా, యెుందeటో వున్నారు. ద్రావిడ సుబ్రహ్మణ్య శాస్రులు గారికి శ్రీ దర్భాంగ వువహారాజా లక్షల కొలది పెట్టికట్టించిన దశాశ్వవేుధ ఘట్టంలోని మహా సౌధమును నివాసముగాఇచ్చి, నెలకు నూఱు రూపాయిలు జీవనార్థం పంపిస్తూ, అప్పుడప్పుడు వచ్చి తామే దర్శనం చేస్తూ సమ్మానించే కాలమది." ఈకాలమునకు ఆకాలమునకును గల భేదమును చదువరులు గుర్తింతురు గాక.

సుబ్రహ్మణ్యశాస్త్రులు గారు

సుబ్రహ్మణ్యశాస్రులవారు వేదాంతశాస్త్రములో బంగాళాదేశ పండితుల నెల్ల జయించిన వారు, దక్షిణదేశీయులు. వీరు మా గురువుగారు బ్రహ్మయ్య శాస్రులవారికి వేదాంతశాస్త్ర గురువులు. అడివి శంకరరావు గారు నన్ను గూర్చి వ్రాసిన చరిత్రలో, నేను కాశీలో వీరివద్ద వ్యాకరణం చదివినట్లు వ్రాసినది పొరపాటు. వీరు నాకు గురు గురువులు. వీరు వ్యాకరణ పండితులు కారు, వేదాంత పండితులు. నేను కాశీలో నున్న రోజులలో ఈ శాస్రులవారి కొమార్తకు వివాహం జరిగినది. అప్పుడు ක්‍ෂීග්‍රාහ්” నున్న శ్లోకము మాత్రము నేను రచించినది. ఆ శ్లోక ముదాహరించినచో నేను కాశీలో విద్యార్థిగానున్న కాలము స్పష్టమగునుగాన, దాని నిట లిఖించుచున్నాను.

శ్లో || మన్య్యంకేందువర్నే గుణగణమహితే రాధమాసే వళక్షే
పక్షేఖ_నంగస్య తిథ్యా మసురగురుదినే మత్సుతాయా వివాహః

ప్రాతర్భావీ బుధేంద్రామహాఇహభవతాం యాచతే సన్నిధానం
సుబ్రహ్మణ్యశాస్త్రీ ద్రవిడకులభవ స్స్వాహితాగ్నిర్వినీతః

శాస్త్రజ్ఞలలో నెక్కడో కాని కర్మఠులుండరు. వీరు అహితాగ్నులు." ఇంతకూ వీరికి నేను ప్రశిష్యుడ నగుదునుగాని, శిష్యుడను గాననునది ప్రకృతాంశము.

కూనిరాగపు గాలిసంగీతం

అడవి శంకరరావుగారు, నేను ప్రత్యేకించి విజయనగరము సంగీతము నభ్యసించుటకు వెళ్లినట్లు వ్రాసియున్నారు. అదికూడా పొరపాటే. చాలవలకు దేశాటనం చేసి అవధానాదులొనర్చిన తరువాత, విజయనగరం మహారాజా వారి సందర్శనానికి వెళ్లినప్పట్లో, శ్రీవారి దర్శనమునకు కొన్ని విఘ్నములు * రావడంచేత, సుమారు రెండుమాసములకంటె యొక్కువరోజులు విజయనగరంలో వుండవలసి వచ్చింది. అప్పుడు వృథాగా కూర్చోవడ మెందుకని సాలగ్రామ గోపాలంగారి వద్ద ఫిడేలు మీద సరళిస్వరాలు మట్టుకు కృషిచేశాను. ఇంతకున్నూ చదువరులు తెలిసికో దగ్గది నేను సంగీతము నేర్చుకొన్నవాడను కాననే విషయము. కొంచెము పద్యము రాగ ధోరణిమీద చదివిననూ, అంతమాత్రంచేత నేను సంగీతపాటకుడను గాను. ఆ చదవడమేనా, నేను పదకొండు పండ్రెండు సంవత్సరముల వయస్సులో నున్నప్పుడు, తోలుబొమ్మలాటలో పాల శంకరుని మేళంలో ఒకానొకడు పాడే మోస్తరును అనుకరించి నేర్చుకొన్న పాటగాని నాది స్వరా దులకు సంబంధించినది కాదు. నేను తఱచుగా రేగుప్తి, లేక మోహన, ఈ రాగాలమీద పద్యములను చదువుతానని పలువురు శ్రోతలనగా వినియున్నాను, కాని నా చదివేచదువు రేగుప్తిన్నీ కాదు, మోహన రాగమున్నూ కాదు, ఇంకేమిటంటే, ఈ రెండు రాగములేకాక, శ్రీ, సారంగ, మధ్యమావతి, నాటకురంజి, కాంభోజి. ఇంకా ఆయా రాగములతో అంతో యింతో చుట్టరికం గల రాగములన్నీ నా చదువులో చేరుతాయి. అందుచేత అనమ్మరాగేణ గీయతే' అన్నట్టుంటుంది. సంగీతపాఠకులు కూడా నా చదువును అభిమానించడం కలదుకాని, నా రాగ ధోరణి శాస్త్రీయమని మాత్రం వారు వొప్పుకోరు. నాకు స్వతస్సిద్ధమైన లయజ్ఞానము కలదు. అదిన్నీ పండితులొప్పదగిన విశేషములతో సంబంధించింది కాదు. గురుశుశ్రూష చేసి చెప్పికొంటే నేనొక పాటకుడ నగుదునని గాయకులు నన్ను అభిమానించే వారనడం కలదుగాని నాకు అట్టి నమ్మకం లేదు. నా బుద్ధిబలము నాకు తెలుసును. వినేటప్పటికెంత వస్తుందో అంతేకాని, యత్నంమీద రాదగ్గది నా కేదిన్నీ రాదు. ఇది అనుభవంమీద వ్రాసినమాట. నేను ఇంగ్లీషులో ప్రవేశించలేదుగాని, అందు లెక్కలలో నాకు సైఫరు తప్పదు. విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లివచ్చిన పిమ్మట, అనగా ఇరువదియైదు వత్సరముల ప్రాయములో (1895), ఇంకా నాకు సంసారభారం తలమీద పడనప్పుడు, మైసూరు వెళ్లి సంగీత మభ్యసిద్దామని బుద్ధిపుట్టి ప్రయాణసన్నాహం చేసాను. కాని తిరుపతి శాస్త్రి కొంచెం వెనుదీయడంచేత అది సాగిందికాదు. అంతో యింతో మా తండ్రిగారు గాలిపాట పాడేవారు. యానాములో వుండే కాలంలో, దేవుడు గుళ్ళోసేవ లయేటప్పుడు, మా తండ్రిగారితో గుల్లోకి వెళ్లి, అక్కడ పాడే సేవమోభాపాటలు వినడం వకటిన్నీ తోలుబొమ్మలు దీక్షగా చిన్నప్పుడు చూడడం వకటిన్నీ నా బాల్యంలో తఱచుగా యానాములో శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమిందారు “గారి మేడయెదుట జరిగే వీధి నాటకాలు, రామనాటకం, ప్రహ్లాద నాటకం, తదేకదృష్టితో చూడడం వకటిన్నీ నేను శ్రీ కానుకుర్తి భుజంగరావు పంతులు" వారి వద్ద రఘవంశం చదువుకొనేటప్పుడు శ్రీ తోట్లవల్లూరి సంస్థానము నుండి వచ్చిన వక వైష్ణవుడు నృసింహాచార్యులు" అనే గాలి సంగీతపాటకుడు నాకు సహాధ్యాయిగా తటస్థించుట వకటిన్నీ నే నంతోయింతో కూనిరాగం తీయగల్గుటకు హేతువులు. అంతేకాని నేను సంగీత శాస్త్రజ్ఞడను కాను అన్నది యిట సారాంశము.

వేషధారణ ప్రయత్నం

ఆ వైష్ణవుని సహవాసమువల్లనే నాకు ఈ కూనిరాగపు సంగీతంతోపాటు ముక్కుపొడుము పీల్చుట కూడా అభ్యాసం అయినది. ఇంకా వ్రాస్తే ఆ వయస్సులో వ్రాయవలసినవి చాలా కలవు. వకటి రెండు టూకీగా వ్రాసి మళ్లా కాశీలోకి వస్తాను. ఆ ఆచార్యులు మంచి సౌందర్యవంతుడు; స్త్రీ వేషమునకు బాగా వుంటాడు. అందుచేత ఆయన చిత్రాంగి, నేను సారంగధరుడను, నీలపల్లె స్కూలులో నేను బడిచదువు చదువుకొనేటప్పుడు నా క్లాసులోనే చదివిన యొక వేశ్యబాలిక రత్నాంగి, ఈ రీతిగా పాత్రలు ఏర్పాటుచేసి యొక చాత్తాని వైష్ణవుడు నాటకం అంతా తయారు చేశాడు. అప్పటికి నేనింకా రఘువంశం మొదలుపెట్టలేదు. ఆ కాలంలో వీధినాటకాలకే లోకంలో యొక్కువ ప్రచారం వున్నది. కంపెనీలింకా రాలేదు. నీలపల్లె సీతారామస్వామివారి గుడియెదుట మా నాటకం మొట్టమొదట ప్రదర్శనం జరగడానికి సర్వసంసిద్ధం అయింది కాని, మా తండ్రిగారి భయంచేత తుదకు నేను అంతా వర్లించిన్నీ వెనుదీయడంచేత యావత్తు ఆగిపోయింది. ఏవియెట్లయినా, ఆయినా సందర్భాలు నన్ను అంతో యింతో కూనిరాగం తీసేవాణ్ణిగా చేయగలిగాయని నేననుకొంటాను. కంపెనీ నాటకాలు వచ్చిన తరువాత, వీరేశలింగం గారి శాకుంతలం ప్రదర్శించడానికి యానాంలో కొందరు ప్రముఖులు చాలా ప్రయత్నించి దీనిలో వేంకటాచలం కూడా వుంటే బాగుంటుందని అనుకొని నాకు కబురు చేశారు. అప్పటికి నేను సామర్లకోటలో మాధుకరం యెత్తుకుంటూ లఘుకౌముదిన్నీ భారవిన్నీ' చదువుచున్నాను. అప్పటికి నాపేరు వేంకటాచలమే. ఇంకా నేను బ్రహ్మయ్య శాస్రుల వారి సన్నిధికి చేరలేదు. చేరిన పిమ్మటనే నాకు శ్రీ శాస్రులవారు వేంకటశాస్త్రి అని శాస్త్రి బిరుదమును దయచేశారు. వారుమాత్రం అప్పుడప్పుడు వేంకటాచలం అని కూడా పిల్చుచుండుట కలదు. కాని యేమైనా వారి నామకరణం చేసింది మొదలు వేంకటాచలం పేరు వెనుకబడి శాస్త్రి పేరే వాడుకలోకి వచ్చింది. ఆ శాకుంతల నాటకంలో నేను కణ్వుడను. యావత్తున్నూ సిద్ధమయినది, పెద్దపాక వేశారు. ఆ యానాము ఫ్రెంచి గ్రామమగుటచే రిపబ్లికు ఆచారమును బట్టి మాలమాదిగలకు కూడ పబ్లికు సందర్భములలో అవకాశమియ్యక తీరదు. అట్లి చ్చుటకు ఆ కాలములో ప్రజలొప్పుకోరుగదా. ఆ కారణముచే అందులోకూడా నేను వేషం వేసి నటించే దుర్యోగమో సుయోగమో నాకు తప్పిపోయింది. కానీ యివి అన్నీ యేదో కొంచెం సంగీతాన్ని తెలుగులో కొంత భాషా జ్ఞానాన్ని కలిగించాయని మాత్రం చదువరులు తెలియగోరుతారు. నాకు తెలుగునకు ఇంతకన్న గురుశుశ్రూష లేశమున్నూ లేదు. నేను గురుశుశ్రూష చేసి అభ్యసించినది సంస్కృతము మాత్రమే. అందులో వ్యాకరణం మాత్రమే కొంత కష్టపడి శ్రద్ధచేసి చదివితిని. ఆ చదువుటయైనా శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్రులవారి యొద్దనే, దేశంలోనే. కాశీలో వూరకే మొదలుపెట్టి యే కొంచెమో చదివినా, అది లెక్కలోది కాదు. మళ్లా దేశానికి వచ్చి దేశంలో మొదటి గురువుగారి వద్దనే తక్కిన గ్రంథాలు తిరుపతిశాస్త్రిని సహాధ్యాయిగా చేసికొని చదువుకొన్నాను.

బ్రాహ్మణార్థపు ధనసంపాదన

కాశీనుంచి దేశానికి వచ్చే సందర్భం యిక వ్రాస్తాను. మా తల్లిదండ్రులకు నా కాశీగమన వృత్తాంతం తెలిసింది. వారు మా గురువు గారి వద్దకు వెళ్లి యెట్లో రప్పించకపోతే తాము కూడా కాశీకి వెడతామని గట్టిగా పట్టుపట్టారు. దానిమీద గురువుగారు నాపేర వృత్తరం వ్రాశారు. వినయంగా తమ సెలవు ప్రకారం బయలుదేరి వస్తున్నానని జవాబు వ్రాశాను. కాని కాశీనుండి బయలుదేరడముకు కాళ్లు రావు. రేపూ, ఎల్లుండీ, ఇట్లా అనుకుంటూ కాలం జరుపుతూ, అక్కడి వుత్సవాలు బుడ్వామంగళ్ లోనైనవి చూస్తూకాల యాపన చేస్తూ వున్నాను. బుడ్వామంగళ్ అనగా పడవల మీదనే మేళతాళాలతో జనులు వక వారంరోజులు వుండి గంగలో జరిపే వక వుత్సవం. అది యేటా వేసవిలో జరుగుతుంది. బహురమ్యంగా వుంటుంది. ఆయినా సంతోషములతో కాలం జరుపుతూ వుండగా మావాళ్లు త్రోవ ఖర్చులకు ముప్పది రూపాయలు పంపినారు. ఇంకా కొంత కాశిలో దొరకిన బాపతు నావద్ద నిల్వయున్నది. కాశీలో మహామహావాళ్లకే దిక్కులేదుగదా? అట్టి స్థితిలో విద్యార్థిగా వెళ్లిన నీకు ధన సంపాదన మెట్లు జరిగిందని శంక కలుగవచ్చును. నిజమే; కాశీలో సత్రాలలో భోజనం దొరకుటే లేనిచో, ముష్టి యెత్తుకుంటే ముష్టి కూడా దొరకదు. మాధుకర మంతకుముందే లేదు. పండితులకు యాత్రార్ధమై వచ్చిన గృహస్టులు సభలు చేసి యేమైనా సమ్మానించడం కలదు. కానీ అదిన్నీ చాలా అరుదే, యెట్లో యాత్ర చేసికొని స్వదేశానికి వెళ్లేవారేకాని పండితులకు సభలు చేసి సమ్మానం చేయదగు గృహసులు యొందలో వుండరుగదా? ఈ సభలు పెద్ద పండితులకు, బాగా పేరు మోగినవారికేగాని ఒక మోస్తరుగా వుండే పండితులకే తటస్థింపవు. అట్టి స్థితిలో విద్యార్థులకెక్కడ తటస్థించుతవి? ఇక విద్యార్థులకు తీర్ధవిధి బ్రాహ్మణార్థాలు తప్ప అంతో యింతో ధనార్జన కాదగ్గ వుపాయం లేదు. నాకు ఆ బ్రాహ్మణార్థాలు ఇతర విద్యార్ధులకంటె కొంచము ఎక్కువగా తగిలేవి. కారణమేమంటే, నేనక్కడ వున్న రోజుల్లోనే గోదావరి డి రామచంద్రపురం తాలూకా దంగేరు గ్రామ కాపురస్టులు వేదశాస్త్ర పండితులు వుప్పలూరి భీమన్న శాస్రులు గారి కుమాళ్లల్లో వకరు శంభుసోమయాజులు గారు కాశీలో వున్నారు. ఆయనకు అప్పటికి ఘనాంతం స్వాధ్యాయం అయింది. పైగా ఆబ్దికమంత్రం వగయిరా చిల్లరలుకూడా వచ్చును. ఆయన తీర్ధవిధికి భోక్తగా కుదిరితే పితృదేవతలు మజీత్వరలో తరిస్తారని ప్రతివారున్నూ వచ్చి ఆయనను ప్రార్థించే వారు. ఆయనకున్నూ నాకున్నూ మైత్రి యొక్కువ. కాబట్టి నేను రెండోబ్రాహ్మణుడను కావడం తటస్థించేది. భంగుఖర్చూ, యజ్ఞోపవీతపుఖర్చూ కాక ಅಧ್ಯ, పావులా, దక్షిణ కూడా దొరకేది. ఈ బాపతు ఖర్చుకాగా మిగిలింది కొంత నావద్ద నిల్వయున్నది. మావాళ్లు పంపినదీ, ఇదీ కలిపి నలభై రూపాయలు తేలినవి.

భంగు పానయోగం

ఈ సొమ్మలో కొంత గంగ పట్టడానికిన్నీ కాశీకావిడికిన్నీ కాలార్థకం చేసుకోవడానికిన్నీ ఖర్చయినాయి. కాలార్థకమంటే, కాలభైరవ ప్రీతికి చేసే సంతర్పణ. ఆ సంతర్పణనాడు భంగుకూడా చేయక తప్పదు. భంగంటే, గంజాయిన్నీ ఏలక్కాయల పైనుండే తొక్కలున్నూ ఎండిన గులాబీపువ్వుల రేకులున్నూ, సోపున్నూ కలిపి నూరి ముద్దచేసి నీళ్లలో కలిపి తాగే మత్తుపదార్ధము. కాశీ దేశంలో ఈ భంగును ఈ రీతిగా సేవిస్తే లేశమున్నూ తప్ప లేదు. గంజాయి పొగరూపంగా పీలిస్తే చాలా తప్ప. ఒక్కొక్క దేశములో ఒక్కొక్క ఆచారము. మన దేశాన్నుంచి వెళ్లిన ప్రతివిద్యార్థిన్నీ దీనిని అభ్యాసం చేస్తాడు. ఎవడో నాబోటి పైత్యప్రకృతిగలవాడు అభ్యాసం చేయకపోతే వాడికికూడా బలవంతముగా ఎట్లో అంతో యింతో పోస్తారుగాని, వూరుకోరు. నేను కాలార్థకం చేసిన రోజున నాకు ఒక ఔన్సు రమారమీ ఈ భంగును బలవంతంగా తాగించినారు. దానిమీద నాకు మత్తు అపారంగా యొక్కినది. ప్రాణాపాయం కలుగుతుందేమో అన్నంతదాకా వచ్చి తుదకు కొన్ని విరుగుళ్లు ఇవ్వడంవల్ల కొన్ని గంటలకు తిక్క దిగింది కాని, ఈ విరుగుళ్ల వల్ల శీతలించి గ్రహణిలోనికి దింపింది. నాకు ఇది పడదని ఆయా విద్యార్థులెఱుంగరేమో అంటే, పూర్తిగా యెఱుగుదురు. సుమారింతకు నెలరోజులనాడు కాశీలో వక "యజ్ఞోపవీతం" జరిగింది. యజ్ఞోపవీతమంటే జందెము వున్న పంచద్రావిడులు యావన్మందికిన్నీ కాశీలో నున్నవారికి నాకు ఒక రూపాయి దక్షిణతో పంచపక్వాన్నములతో సంతర్పణ చేయడము. దశవిధ బ్రాహ్మణులలో పంచద్రావిడులు, పంచ గౌడలు అని రెండు తెగలు. ఇందులో పంచద్రావిడులలో ఘూర్జరులు తప్ప తక్కిన నాలు తెగలకు, అనగా, ఆంధ్ర ద్రవిడ కర్ణాణ మరాటులకు, సర్వ సామాన్యంగా పంక్తిభోజనం కలదు, గౌడలకో “ఎవరికివారే యమునాతీరే” అంతేకాని, పంక్తిభోజనాచారము వారిలో వారికే లేదు. పైగా వారు మత్స్య భుక్కులు కూడాను. అందులో వారీ యజ్ఞోపవీతంలో చేరరు. సత్రభోజనమేనా పై జెప్పిన తెగలవారికేగాని గౌడలకు లేదు." స్వయంపాకము చేసికొంటూ చదువుకోవడమేగాని గౌడలు, వేటౌక సదుపాయం వారికెప్పుడున్నూ లేదు. ఆ యజ్ఞోపవీతంనాడు మా ఘట్టంలో విద్యార్థులు వారివారి తాహతు ననుసరించి సేరు సేరున్నరా రెండు సేర్లు ఈ రీతిని భంగు పట్టించి భోజనానికి బయలుదేరారు. పడదని యెంతచెప్పినా వినక ఏ కొంచెమో నాకుకూడా పోశారు. మేము రెండోపాళీ వేళకు వెళ్లితిమిగాని, జనమెక్కువగా వుండటంచేత కొందర్ని మూడోపాళీదాకా దిగద్రొక్కినారు.

ఆ కారణంచేత అధమం గంట గంటన్నర ఆలస్యమయింది. ఇంతలో నాకు నోరెండుకుపోవుట మొదలైన అవలక్షణాలు బయలుదేరాయి. "సభలో అంతా గొల్లలే", అన్నట్లు యెవరితో చెప్పికొన్నా లాభములేదు. అంతా భంగుమత్తుమీదున్నవారే. నా మొర వినేదెవరు? ప్రతిక్రియ చేసేదెవరు? వారు ఆ మత్తును ఆపుకోగలవారు, నేను ఆపుకోలేని వాడను; ఇంతే భేదము గాని, ప్రకృతిలోనున్నవారు ఆ జట్టులో నొక్కరున్నూ లేరు. పైగా నేనొకవేళ ప్రాణం పోతోందని మొరపెట్టుకొన్ననూ లాభము లేదు. చూచారు కాదూ, భారతంలో దేవయాని శుక్రాచార్యునితో కచుణ్ణి గూర్చి రాక్షసులు చంపేశారేమో అని యేడువసాగినప్పుడు, “సుగతికి జనుగాక యేల శోకింపంగన్" అని జవాబు చెప్పినాడు! అది ಹೆಣ) మాహాత్మ్యం? మద్యపు మాహాత్మ్యమే కదా! మద్యపానము దుఃఖమును తెలియనీయదనే కారణం చేతనే వైష్ణవ మతస్థులలో వామాచారులు" బంధుమరణములలో తుట్టతుద రోజున 'తొళ్లకు" మనేపేరుతో పూర్తిగా త్రాగుతారు. వైద్యశాస్త్రగ్రంథమగు రోలంబ రాజీయములో, దుఃఖము పోవుటకౌషధ మేమని ప్రశ్నించినప్పుడు సురాపాన మని జవాబు చెప్పినాడు. " సురకన్నను భంగు ప్రమాదకరమైన వస్తువు కాని, ఆ దేశములో ఇది పరమ పవిత్రము. పితృకార్యాలలో కూడా భోక్తలకు ముందుగా వీని నిచ్చియే భోజనం పెడతారు. అది యుటులుండె. ఆవేళకూడా చాలా శ్రమ పడినానన్న సందర్భము వారెరిగిన్నీ నాకు మళ్లా ఈ వస్తువును పట్టించారన్న విషయము ప్రస్తుతము. ఒకటి మాత్రం వున్నది. నేను దాని మత్తును లేశము కూడా భరింపలేకపోయినా, ఆ మత్తు పూర్తిగా దిగిన తరువాత, అనగా భంగు పుచ్చుకొన్న ఇరవై నాలుగు గంటల పిమ్మట, ఏపురాణం చదవడానికో మొదలు పెడితే బాగా వుంటుందని, ఆ ఘట్టంలో విద్యారులే కాకుండా, పండితులైన శ్రీ శోభనాద్రి శాస్రులుగారు కూడా అనేవారు. ఈ శోభనాద్రి శాస్తులుగారు మన దేశస్టులు. కాకరపర్తి దగ్గర అజ్జరం గ్రామం వీరి కాపురస్థలము. వీరి సోదరులందఱూ కాశీలోనే తర్కం చదివి పండితులై పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఈయన మహారాష్ట్ర కన్యకనే వివాహం చేసికొని కాశీలోనే కాపురమున్నారు. ఈయనకు నేనంటే చాలా అభిమానం. బలవంతపెట్టి నాకు సిద్ధానచంద్రోదయం అను వ్యాఖ్యానముతో తర్క సంగ్రహమును" ఈ మహానుభావుడే వుపదేశించిన పుణ్యాత్ముడు. నాకు కొంచెం ధర్మ ధర్మి భావం తెలియడానికేమి, ఎక్కడేనా వ్యాకరణంలో ఆర్థికం వస్తే ఇటీవల అది సులభంగా బోధపడడానికేమి, నాకు ఈయన చెప్పిన ముక్కలే కారణం.

మత్సద్మనిస్థియతాం

కాలార్థకంనాడు భంగు ప్రసంగంలోనుంచి ఇంతదాకా వచ్చాము. కాలార్ధకం చేసికోవడముకు పూర్వమే కాళికాష్టకములోనైనవి ఆయా దేవతలను దర్శించునపుడు రచించాను. పైకి ఆ కవిత్వం డాబుగా వున్నప్పటికీ, అందులో అర్థగాంభీర్యం మిక్కిలి తక్కువ యని విమర్శకులు గ్రహిస్తారుగాని, సామాన్యులో - "నాళీకజాద్యదితిజాళీ" అనే శ్లోకాలు చదివి మిక్కిలిగా మెచ్చుకొంటారు. ఎంత అర్ధప్రధానంగా తేలికగా కవిత్వం చెప్పేవాళ్లేనా, మొట్టమొదట కొంత కఠినంగానే కవిత్వాని కుపక్రమిస్తారేమో అని నేనను కొంటూను. దానికి నా వెుదటి కవిత్వానికీ యిటీవలి కవిత్వానికీగల భేదమే నాకు ప్రమాణం. కాశీనుండి వచ్చేముందు ఏదో కొంతసొమ్ము కట్టే యెడల, శ్రీ అన్నపూర్ణా మహాదేవిని స్వయంగా పూజ చేయనిస్తారని విని, ఒకరోజున ఆ విశాలాక్షిని సొమ్మకట్టి స్వయంగా పూజచేసి నాను. అప్పుడే ఆ యంబిక పై నొక యుష్టకమును రచించినాను, అందొకచో "మత్సద్మని స్టీయతామ్" అని ప్రయోగించితిని. ఆ వాక్యమున కర్థము, అమ్మా ! ఓ యన్నపూర్ణమహాదేవి ! నిన్ను నే నేకోరికనూ విశేషించి కోరేది లేదు గాని, నీవు మా యింట నివసించవలసినది. ఇదే నా ముఖ్య కోరిక అని. అది మొదలు ఇప్పటి వఱకు అనగా సుమారు నలుబదియైదు వత్సరముల నుండియు నా యింట దినదినాభివృద్ధిగా అన్నపూర్ణ తాండవించుచున్నట్లే నేను తలంచు చున్నాను. అట్లు తాండవించుటకు కారణము, నేను నాడు శ్లోకముద్వారా అట్లు వరమడుగుటయే యని నా విశ్వాసము. నేను అది మొదలు ఇంతవఱకు నవరాత్రములలో పూజించు విగ్రహము, అపుడు కాశీనుండి కొని తెచ్చిన చిన్న అన్నపూర్ణ ప్రతిమయే. ఆ ప్రతిమ హస్తమందు ఒక గరిటె యుండును." భవిష్యత్కాల మందు కూడా తరతరముల వఱకూ శ్రీమదన్నపూర్ణా విశాలాక్షి మాయింట యిదివఱలో వలెనే నాట్యము సల్పుగాక యని ప్రార్థించుచూ మరల ప్రకృతముపక్రమించుచున్నాను.

నిర్జలైకాదశి

కాశీనుండి బయలుదేరుటకు త్రోవఖర్చులకు సౌమ్మ వచ్చినప్పటికీ, Ο Α)ΟS" బయలుదేరినట్లు వ్రాయ మొదలిడనేలేదు. మాటలా, కాశీ నుండి బయలుదేరడం! ఆ మహాక్షేత్రం వదిలిపెట్టడానికి యెంత మూర్ఖుడికీ సుఖసుఖాల మనస్సు వొప్పదు. వెడదామనుకొంటూ వుండగా, అనగా యింకా కాలార్ధకం చేసుకోవడానికి పూర్వం, "నిర్జలైకాదశి" వచ్చింది. జ్యేష్ఠ బహుళ యేకాదశిని కాశీలో నిర్ణలైకాదశి" అంటారు. ఆ రోజున గంగ యిటునుండి అటూ, అటునుండి యిటూ, ఈదడం ఒక ఆచారం, నేనూ, కృష్ణశాస్త్రిగారూ, తర్కసంగ్రహపు గురువు శోభనాద్రి శాస్రులవారి తమ్ముడు శేషశాస్త్రిగారూ, ఈ ముగ్గురమూ సామాన్యమైన మట్టికుండల నాధారము చేసికొని గంగలో నీదుచూ ఆవలికి వెళ్లి తిరిగీ అదే ప్రకారం ఇవతలికి ఈదుకొంటూ వస్తున్నాము. మాతోపాటు మావలెనే ఘటహస్తుడై పల్నాటిసీమనుండి కొలదికాలము క్రిందటనే వచ్చిన వేడొక విద్యార్థి కూడా వచ్చినాడు. వెళ్లేటప్పుడు బాగానే చేరినాడు. తిరిగి వచ్చేటప్పుడు నడిమికి వచ్చేటప్పటికి ఆతడాధారంగా నేర్పరచుకొన్న కుండ నీరు పోసుకున్నది. ఆ కారణంచే అతడు కెక్కుకెక్కు మని మునగడానికి సిద్ధమైనాడు, నేను సామాన్యంగా ఈదేవాడనేగాని, అలాంటి సమయంలో వేటొకని ప్రాణం రక్షించడానికి తగ్గంత గజీతగాణ్ణి కాను. నాతోవున్న కృష్ణశాస్త్రి, శేషశాస్త్రిగార్లిద్దరూ మంచి గజీతగాళ్లు. తమ రెండు కుండల్లో వక కుండ అతనికిచ్చి అతని కుండను తామిరువురున్నూ చెటో చేతితో పట్టుకొని ఆ నీళ్లను పారబోసి అతని ప్రాణం రక్షించడమే కాకుండా తాము కూడా అనాయాసంగా వడ్డును చేరగలిగారు. ఆ కష్ట సమయంలో ఆ విద్యార్థి నూలు కొబ్బరికాయలు విశ్వేశ్వరుని యెదుట కొట్టడానికి మొక్కుకొన్నాడు. వడ్డుకు వచ్చిన తర్వాత, “ఏమయ్యా? బొత్తిగా ఈతరానివాడవు, గంగనీదడానికి యేలా బయలుదేరావు” అంటే, “నాకేం తెలుసును, మీరు కుండ పట్టుకు బయలుదేరితే నే కూడా కుండపట్టుకు బయలుదేరా" నని జవాబు చెప్పినాడు. ఏమాత్రమూ లోకజ్ఞానం లేని యిట్టివాళ్లు పలువు రా క్షేత్రమునకు విద్యాభ్యాసానికి వచ్చి కొందఱు పూర్వపుణ్యవశంచేత చిరకాలానికి మహాపండితులై దేశానికి వచ్చి అనేకులను శిష్యులను పండితులను జేయుటా కలదు. కొందఱు అక్కడనే సత్రాల్లో పొట్ట పోసుకొంటూ యావత్కాలమున్నూ గడుపుటా కలదు. అందుచేతనే, ఆ కాలంలో నేమి, అంతకు పూర్వకాలంలో నేమి, రైలుసాయం లేకుండినా యెట్లో కష్టపడి పలువురు కాశీకి చదువుకని వెళ్లిన వారిలో ప్రజ్ఞావంతులై వచ్చినవారి పేళ్లు పరిమితంగానే మనకు వినబడతాయి. భాగవతుల హరిశాస్రుల వారు, పుల్లెల దక్షిణామూర్తి శాస్రుల వారు, మార్కొండపాటి చతుష్టయంలో యిద్దఱు, దండిభట్ల విశ్వనాథ శాస్రులుగారు, మా గురువుగారు, మంత్రవాది లక్ష్మీ నారాయణశాస్రులుగారు, కొవ్వూరు గోపాల శాస్రులు గారు, శ్రీపాద రామశాస్తులుగారు, ఇంద్రగంటి గోపాలశాస్రులుగారు లోనైనవారి పేరులే అందఱూ యెఱుగుదురు. ఇందులో కొందఱు నలుబది యేండ్లు, ముప్పదియేండు కూడా కాశీలో నివసించినవారు. ఒక శాస్త్రవేు కాక, చతుశ్శాస్త్రములున్నూ వచ్చినవారు. ఒక శాస్త్రమే చిరకాలం ఒకసారి చదివి, తెలియక, మళ్లా తిరుగదోడి అంతా చదివి గొప్పవారైనవారు కొందఱు. కొందఱు చిరకాలం చదివి పండితులై దేశానికి వస్తూ ఏ సంస్థానంలోనో వాదంలో వోడిపోయి మళ్లా కాశీకి వెళ్లినవారు. వీరిని గూర్చి ప్రత్యేకించి వ్రాయవలసినదేకాని, యిక్కడ వ్రాయడముకు స్థలం చాలదు, ఇందులో శ్రీ హరి శాస్రులవారిని శ్రీ విజయనగరం మహారాజులుంగారు స్వయంగా ప్రార్ధించి కాశీనుండి తీసుకువచ్చి తమ సంస్థాన పండితులుగా నేర్పఱచుకొన్నట్లు వింటాను. శ్రీ కొవ్వూరి గోపాలశాస్త్రిగారనే వారు షడ్డర్శనీపారగులగుటేకాక, మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యక్షం చేయడానికి తగ్గంత నిష్టాపరులు, కాశీలో దుర్గను గూర్చి వీరు ప్రత్యేకించి పండ్రెండేళ్లు తపస్సు చేసి ప్రత్యక్షం చేసికొన్నట్లు చెప్పుకుంటారు. వీరిని కూడా శ్రీ విజయనగరం మహారాజులుంగారు ప్రార్ధనపూర్వకంగా తమ సంస్థానమునకు రప్పించి నిల్పుకొనడమే కాకుండా, శ్రీ హరిశాస్రులుగారి కెట్టి గౌరవము లేర్పరచినారో అట్టి గౌరవములనే ఈ శాస్రులుగారికి కూడా ఏర్పరచినట్లు వినికిడి. ఈ గౌరవప్రపత్తులకు అంతకు పూర్వం సంస్థానములో వుండే పండితులు సహింపక వక యుక్తిచేసి, గోపాలశాస్త్రిగారు మంత్రశాస్త్రంలో మహాగొప్పవారని చెప్పగా చెప్పగా, మహారాజావారు వారి శక్తి మనకేలా తెలుస్తుందని అన్నారనిన్నీ దానిమీద పండితులు, "మహాప్రభో దేవరవారు కోరితే శాస్రులవారు ప్రత్యక్షంగా వారి శక్తిని చూపిస్తారని జవాబు చెప్పినారనిన్నీ పిమ్మట నెప్పుడో మహారాజావారు, గురోజీ, మంత్రశాస్త్రంలో మీ ప్రజ్ఞ మాకొకమారు చూపించాలని కోరినారనిన్నీ చిత్తం అని చెప్పి శాస్రులవారు, నేను ఈ రోజు జపం చేసికొని వస్తాను, అప్పటికి బాగా నిమ్మకాయంత బంగారపు ముద్దను సిద్ధంచేసి వుంచవలసినదిగా చెప్పినారనిన్నీ శ్రీమహారాజావారు అట్లే సిద్ధంచేయగా శాస్రులవారు ఆ బంగారం మీద మంత్రోదకం ప్రోక్షించేటప్పటికి ఆ ముద్ద రెండు ముక్కలుగా పగిలిందనిన్నీ ఆ పిమ్మట మహారాజావారికి లోపల భయంకలిగి ఎప్పుడైన ఈయనకు మనమీద కోపం కలిగితే ఇదే మోస్తరుగా మంత్రోదకం ప్రోక్షించడం తటస్థింపవచ్చును, అప్పుడు మనపని కూడా దీనితోపాటే కావచ్చును, అని వుపాయంగా వారిని సంస్థానంలో నుండి తప్పించి గోదావరీతీరంలో కొవ్వూరులో వుండేటట్లు ఏర్పరచి, వారికి నెల నెలకూ ఇచ్చే భృతకం కొవ్వూరుకే పంపేవారనిన్నీ గురువుగారి వల్ల విన్నాను. విజయనగర సంస్థానంలో ఇప్పటికి వెనుకటి ప్రభువులందఱున్నూ తమ సంస్థానంలో వున్న యెవరిని గాని తొలగింపవలసి వచ్చినప్పుడు, తొలగించిన వారికిచ్చే జీతం పంపించడమే ఆచారము. ఇక మళ్లా దర్శనం మాత్రం తొలగించినవారికివ్వక పోవడమే కాదు, వారి వంశస్టులుకూడా, వీరికేకాదు, వీరి వంశస్టులక్కూడా యివ్వరు. శ్రీ హరి శాస్రులవారి విషయంలో ఈ సందర్భం అంతా యెఱిగినదే కావున విస్తరింప బనిలేదు.

కలకత్తా ఆతిథ్యం

ప్రసక్తానుప్రసక్తంగా కథ. యొక్కడికో పోతూవున్నది. ఈలాంటి మహాపండితు లందఱూ కాశీలో తయారై వచ్చి మన దేశాన్ని అలంకరించేవారన్నది ప్రధానాంశము. అట్టి కాశీ యిపుడు ఏదో మాదిరి స్థితిలో నున్నట్టు వింటాము, ఆ కాశీనుండి నేను దేశానికి రాబోవుచూ, సహాయం కోసము చూస్తూవుండగా మన దేశస్టుడే రెడ్డిసీమలోని లక్కవరము నుండి వచ్చిన వందనపు నర్సయ్య ෂබී కోమటిబిడ్డ నావలెనే సహాయం కోసము వెతుక్కుంటూ నాకు దొరికినాడు. నేనతనికి దొరికాను, ఇరువురము తల్లిదండ్రులు కలవాళ్లమే కావున మాకు గయకు వెళ్లవలసిన ప్రసక్తి లేశమున్నూ లేకపోయినప్పటికీ, పోనీ రాకరాక వస్తిమిగదా, విష్ణు పాద సందర్శనం చేసికొని పోదామని గయకు కూడా వెళ్లాము. అక్కడ విష్ణుపాదమును పూజించుకొని కలకత్తాకు టిక్కట్టు పుచ్చుకొన్నాము. 144వ నెంబరుగల గృహములో మన తెలుగు దేశీయు లున్నారు. అక్కడికి తీసుకువెళ్లమంటే జట్కావాడే తీసుకువెడతాడు, అని కాశీలో ವಿದ್ಯ್ಗೆಲು చెప్పినారు. అది జ్ఞాపకం పెట్టుకొన్నాముగాని, ఆ జట్కావాడు మమ్మలిని మోసం జేసి యొక్కడో వాడికి తోచినచోట దింపి బాడుగ తేతెమ్మన్నాడు. వాడితో పోట్లాడలేక వాడిదివాడికిచ్చి ఆ సమీపంలో వున్న ధర్మశాలలో దిగినాము. అది సకల అల్లరిచిల్లరి జనంతో ఎంతో సంకులంగా వున్నది. అయితే యేం చేయము? ఆ మహాపట్టణములో మమ్మల్ని చూచేదెవరు? అది ఆషాఢమాసము, తొలకరివానల కారంభమయింది. విరుద్ధమైనగాలి, వంటకు మొదలుపెడితే, పొయ్యి మీద పాత్ర వుంటే మంట యొక్కడో వుండడం. ಅಜ್ಜಿ స్థితిలో చేతగాని నేను వంటేమి చేయగలను? సహాయుడు కోమటిగదా? వంట మట్టుకు నేను చేస్తే తక్కిన యావత్తు పనులను అతడు సవరణ చేయగలడు. ఎట్లాగయితేనేమి, బజారువెళ్లి రొట్టెలు కొనుక్కొని తెచ్చుకొని తింటూ వారం రోజులు కాలక్షేపం చేశాము ఆ కలకత్తాలో వారం రోజులున్నా మాకేమి నిల్వనీడ దొరకనేలేదు.

బంగాలీవాని మోసం

ధర్మశాలలో జనంవల్ల అక్కడినుండి జగన్నాథానికి వెళ్లడానికి త్రోవ మాత్రం తెలిసింది. ఆ త్రోవ కొంత సముద్రం మీద, కొంత కాలువలమీద, కొంత మెట్టను, ఈలాగునవున్నది. ఎట్లో బయలుదేరి పోతే తప్ప ఆ కలకత్తాలో బజారు రొట్టెలతో ఎన్నాళ్లుపవాసాలు చేయడం? కాలార్థకంనాడు భంగు పుచ్చుకొన్న దోషంవల్ల కల్గిన గ్రహణి మఱింత హెచ్చ మొదలు పెట్టింది. అందుచే ఆ కలకత్తానుండి బయలుదేరుట కయి స్టీమరుకు టిక్కెట్టు తేవడానికి కోయిల్ ఘాటుకు బయలుదేరాను. కోమటి బసలో కాశీకావిళ్ల వద్దనే వున్నాడు. అతడు వీధిలోకి వెళ్లినప్పుడల్లా త్రోవతప్పి పావలా అర్ధా లంచం ఇచ్చి అతి కష్టంమీద బసకు చేరుతూ వుండేవాడు, నేను మాత్రం వెళ్లిన త్రోవ జ్ఞాపకం పెట్టుకొని, అవధానం చేసినంత పని చేసి బసకు చేరుతూ వుండే వాడను. అందుచే టికట్టుకోసము పదహారు రూపాయలు పుచ్చుకొని నేను బయలుదేరాను. ఒక ఫర్గాంగు వెళ్లాను. కోయిల్ ఘాటు కనబడుతూవుంది. అంతలో ఒక బంగాలీవాడు నా వాలకం కనిపెట్టాడు. వీడెవడో తెలుగువాడురా అనుకొన్నాడు. ప్రీతిపూర్వకంగా వాడిభాషతో ఎక్కడకు వెడతావు భద్దీ అని ప్రశ్నించాడు. కోయిల్ ఘాటుకు అని వచ్చీరాని హిందీతో జవాబు చెప్పాను. దానిమీద వాడికి మటీ లోకువ చిక్కింది. ఒకమాట చెప్తాను వింటావా అన్నాడు. చెప్పమన్నాను. కోయిల్ ఘాటులో కన్న తక్కువ సొమ్మకు టిక్కెట్టు ఒక బంగాళీబాబు ఇస్తున్నాడు. నేను కూడా జగన్నాథం వచ్చేవాడనే. నేనక్కడనే పుచ్చుకొంటాను. నాతోకూడావస్తే నీక్కూడా తేలికగా టిక్కెటు యిప్పిస్తాను రమ్మన్నాడు. వాడిమాటలవల్లనే యెంత తెలివితక్కువవాడికైనా మోసగాడని తెలుస్తోంది కదా. అట్టి స్థితిలో అంతో ఇంతో లోకజ్ఞానం కల నాకు తెలియదనడానికవకాశం లేదుగాని, తెలిసినా, వాణ్ణి నేనెల్లా తప్పించుకోగలను? ఎట్లో నావద్ద నున్న సొమ్ము కాజేయడానికి వాడు సంకల్పించాడు. ఆ సొమ్ముతో నన్ను వదిలితే అదే చాలునని నేననుకొన్నాను, వానితో కూడా తోడేలుతో వెళ్లే మేకలాగు రాజవీధిలో పోతూవున్నాను. కొంతదూరం వెళ్లిన మీదట ఒక పెద్ద మేడ గుమ్మడికాయవాటంగా ఉన్నది కనుపడ్డది. దాని మెట్లత్రోవ ఒక చిన్న వీధంత వెడల్పుగా వుంది. ఆ త్రోవని మేడమీదికి త్రోవ తీశాడు. ఇక అయిదాఱు మెట్లల్లో పైకి వెడతామన్నప్పుడు నన్ను జూచి, సొమ్ము నాచేతికియ్యి, నువ్విక్కడేకూర్చో, నిన్ను చూస్తే ఎక్కువ తెమ్మంటాడు, నావద్దనున్న పదహారురూపాయిలున్నూ పుచ్చుకొని పైకి వెళ్లాడు.

తెలివితక్కువవాడెవడు?

“బ్రతుకుజీవుడా’ అని కొంత సంతోషంతో అయిదు నిమిషములకన్న తక్కువ కాలమే నేనక్కడ కూర్చున్నాను. పూర్తిగా సంతోషమేల కలుగలేదని చదువరులు శంకింతురేమో. వాడు నన్ను చంపే వుద్దేశ్యంలో లేడని స్పష్టపడుటచే కొంత సంతోషమున కవకాశం కనపడుతూనే వుందికదా. ఇక కొంత విచారమెందుకంటే తిరిగివచ్చి తీసుకుపోయి దేవీ నవరాత్రులదాకా వాళ్ల టోళాలలో దాచి, అమ్మవారికి బలి వేస్తాడేమో అని కొంతవిచారం. ఏం వ్రాయను? అప్పుడు నా మనస్సులో నెన్ని రసాలకేనా అవకాశం కలిగింది. అంతా ఎంతసేపు, అయిదు నిమిషాలలోపు మళ్లా నాకు ఏం తోచిందో, తరువాయి మెట్లు ఎక్కి మేడమీదికి వెళ్లాను. నాలుగు దిక్కులు చూచాను. బాబూ లేదు, గీబూ లేదు. ఏమోగాని, వక్క నవుకరు కూడా లేడు. మేడమీద కూడా ఒక వీధిలాగున్నది. కొంతవఱకు వెళ్లాను. మళ్లా ఇదివఱలో మేమెక్కిన మోస్తరువే మెటూ, త్రోవా, వకటి కనుపించింది. అక్కడికి వెళ్లేటప్పటికి ఆ మెట్లు ఏమాత్రమో తరువాయిలో ఆ మోసగాడు కనిపించాడు. పోనీ పోతున్నాడు, అనుకొన్నాను, మళ్లా వెనక్కి చూశాడు నేను కనుపడ్డాను. “బాబు లేడు, ఎక్కడికో వెళ్లాడు, నీ సొమ్ము ఇదిగో తీసికో" అని వెనక్కి వచ్చి నాచేతికిచ్చేశాడు. ఏమిటో ఈ చిత్రము! సొమ్మెందు కియ్యాలి! ఇయ్యకపోతే నేనేం చేస్తాను? తాను మోసగాడు కాడని నే ననుకోవడాని కనుకొందునా? ఇట్లు నన్ను నమ్మించడం వల్ల వానికి కలిగే లాభమేమిటి? నా దగ్గఱ నున్న సొమ్మింతేకదా! అది యిది వఱకే ఇచ్చితినే! ఏమో నాకప్పుడే కాదు, ఇప్పటికిన్నీ వాని ఆంతర్యం తెలిసిందేకాదు. నన్ను వాడేమో తెలివి తక్కువవాణ్ణిగా వూహించాడుగాని, వాడి చేష్టలను ಬಜ್ಜಿ ಸೆಸ್ వాణ్ణి తెల్వితక్కువ వాడని ఢంకామీద దెబ్బకొట్టి చెప్తాను. కారణం చదువరులే విచారించుకొందురుగాక, నే నీ కథాభాగములో వ్రాసిన సంగతులలో చదువరులకు నమ్మతగని దీ కథాభాగమే. దీన్ని గుఱించి యిప్పటికిన్నీ నాకు నమ్మకం లేదు, ఇతరులను గూర్చివ్రాయడ మెందుకు? ఇది కల మాత్రం కాదు. నిజంగా జరిగింది.

సొమ్మిచ్చి మళ్లా నన్ను వెంటబెట్టుకొని కొంతదూరం త్రిప్పినాడు. ఆ తోడేలు వెంట ఈ మేక యథాప్రకారమే నడుస్తూ వుంది. మళ్లా అటు తిప్పి, ఇటు తిప్పి, ఆ మేడవద్దకే, ఆ మెట్ల వద్దకే తీసుకు వెళ్లాడనుకొన్నాను. లేదా అలాటి మేడ మటొకటుందేమో? మళ్లా ఎక్కడం మొదలు పెట్టాడు. వెనకాల నేనున్నూత్రాటితో దబ్బనంగా ఎక్కుతున్నాను. సరిగా ఇంక ఐదుమెట్లే తరువాయి. అక్కడ ఆగి, సౌమ్మ పుచ్చుకొని, వానిచేతులో వున్న పదహారు బెత్తాల గుడ్డ గొడుగు సరిక్రొత్తది నాచేతికిచ్చి, పైకి రావద్దు నేవచ్చేదాకా, ఇక్కడే కూర్చో' అని మర్యాదగా చెప్పి పైకి వెళ్లాడు. నేను అయిదాఱు నిమిషాలు కూర్చుని పైకి వెనుకటిలాగే వెళ్లి నాలుగు దిక్కులూ చూచి రెండో త్రోవను దిగి తల తడుముకుంటూ బసలోకి వచ్చాను, జరిగిన సంగతి స్నేహితుడు కోమటితో చెప్పితిని. అతడు నేను బ్రతికి వచ్చి తనకు కనుపడ్డందుకు మిక్కిలిగా సంతోషించి నన్ను యెంతో మెచ్చుకొన్నాడు. పద హారు రూపాయిలకు పదహారుబెత్తాల గొడుగు వచ్చిందన్నాడు. నేను శ్రీ విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లినప్పడు ఇటీవల రచించిన పద్యాల్లో వక సీసపద్యంలో "పడవలె పడరాని పాటులెల్ల" అని వ్రాశాను. ఆపాట్లు, ఆయినా పాట్లే అని చదువరులు తెలిసికొందురుగాక. లాక్షణికులు “ఆహా భారోగురుః కవేః" అని వూరకే వ్రాయలేదు. దేశాటనం వల్ల ఎన్ని కష్టసుఖాలు వంటబడతాయో చదువరులు గుణితింతురుగాక.

క్షుధా తురాణాం నరుచిర్నపక్వం

పిమ్మట మఱునాడు జాగ్రత్తగా కోయిల్ ఘాటుకే వెళ్లి టికట్టు తెచ్చుకొని స్టీమరెక్కేము. ఆ స్టీమరు మఱునాడు ఉదయం 9 గంటలకు చాందిని వాలా అనే వోధ్ర గ్రామము వెళ్లవలసినదైనా సముద్రంలో త్రోవదప్పి రాత్రి 9 గంటలకుగాని గమ్యస్థానానికి చేరింది కాదు. చేరటంతోటే, ఏదోనది వొడ్డున దిగడం గనుక, క్రొత్తగా వచ్చిన ఆ బురదనీళ్లలో స్నానంచేసి వూల్లోకి చేరి అందరమూ వక సావిట్లో మకాం చేశాము. అది వక దుకాణదారుని యింటిసావిడి. దానినిండా రెండేసి గజాలకు వొక్కొక్కటి చొప్పున చాలా వండుకొనే పొయిలున్నాయి. పొయి వక్కంటికి అర్ధణా వంతున బాడుగ యివ్వడం యేర్పాటు. తురకా, దూదేకులు, కోమటి, బ్రాహ్మడూ, అందఱూ అక్కడే వండుకోవడం. బియ్యం పప్పూ, వగైరాలు ఆ దుకాణంలోనే కొనుక్కోవడం. ఉప్పుడు బియ్యం తప్ప దొరకవు. చింతపండు ఆ దేశస్టులు వాడరు. దానికి బదులు లేతమామిడికాయల తాలూకు యెండబెట్టిన చీలికలు దొరు కుతాయి. ఎట్లాగయితేనేమి రాత్రి సుమారు పన్నెండులోపున అన్నం వండాను. పెసరపప్పు వండాను. అరటిపళ్లు కొనుక్కున్నాము. మజ్జిగ మాత్రం మంచిదే దొరికింది. "కాలే కడుపునకు మండే బూడిదె, అన్నట్లు పొట్ట నిండించుకొన్నాము. గయ వదలి నాటికి సుమారు పదిరోజులు దాటింది. ఈలోపున మాకు ఏ రొట్టో తప్ప అన్నం లేదు. ఆ హేతువుచేత ఆ వుప్పుడు బియ్యం అన్నం అమృతోపమానంగా వుంది. క్షుధాతురాణాం న రుచిర్న పక్వం' అక్కడే అంతా పరున్నాం.


తెల్లవారింది. ముందు ప్రయాణం ఎప్పడంటే ఎప్పుడని కనుకోగా, పగలు రెండు గంటలకు స్టీమరు వెనుక కట్టిన కంకర పడవలవంటి పడవల మీద యొక్కడ మున్నూ, మరునాడు వుదయానికి కటకం చేరడమున్నూ అని వాకబుమీద తెలిసింది. మళ్లా పెందలకడ వంట మొదలెట్టి పదిగంటలలోగా వకమాటు తిని, ప్రయాణం అయేటప్పుడు రెండోమాటుకూడా తిన్నాం. దృష్టి దోషంగాని మటొకదోషంగాని అక్కడ భోజనంలో లేశమున్నూ මීක්‍ෂ. ෂ యిల్లు బహుశః ఆ దేశంలో కోమటివర్ణము నకు చెందినదై యుండునేమో. ఆ దేశాన్నే కీకటమని శాస్త్రజ్ఞలు వ్యవహరిస్తారు. "దితిజాధిప కీకటంబు దేవాపగయున్" అని దేవీభాగవతము. ఈ దేశాల్లో తీర్థయాత్రకు తప్ప ఇతర కారణంమీద ప్రయాణం చేసేయెడల ద్విజులు తిరిగీ వుపనయనం చేసికో వలసినదని ధర్మశాస్త్రములు తెల్పుతున్నవి. "తీర్థయత్రాం వినా గచ్ఛేత్పువస్సంస్కార మర్ధతి" తిరిగీ వుపనయనం చేసికొంటే పవిత్రు డవుతాడని ధర్మశాస్త్రాలు యెందుకు వ్రాసేయో కాని, నా అభిప్రాయం అప్పుడు కూడా పవిత్రత్వం కలగదనే. పడవ యొక్కేము. కంకర రాళ్లవలెనే మనుష్యులున్నూ దానిమీద వున్నారు. అంతే కాని యెండకు గాని వానకుగాని ఏమీ ఆచ్ఛాదనం లేదు. అయినా క్రొత్త దేశం, క్రొత్త ప్రకృతి చిత్రాలు చూడడం మొదలైన కారణాలచేత కొంత ఆనందంగానే వుంది ఎండ కాస్తున్నప్పటికీ దగ్గర గుడ్డగొడుగు కొంత ఆ బాధలేకుండా చేసింది. అంతలో యొండ బాధ దానంతట అదే తగ్గింది.

ఈతకు సార్థక్యం

ఇంతలో కొన్ని చిక్కులు. నేను గ్రహణివ్యాధితో కాశీనుండి బయలుదేరినానని యిదివఱకే వ్రాసియున్నాను. త్రోవలో అది తగ్గుటకు సాధన మేమున్నది? పైగా మేము తినే ఆహారము దాన్ని హెచ్చు చేసేదేగాని తగ్గించేది కాదు. ఇక దాన్ని తట్టుకోవడానికి ఆధారము పడుచుతనం తప్ప వేఱులేదు. కొంచెం నల్లమందు వేసికొందామంటే, అదిమాత్రం యెంతసేపు ఆపుతుంది? పడవ స్టీమరు వెనుక కట్టబడ్డది. దాన్ని మనకోసం అప్పుడప్పుడు వడ్డుకు పట్టమనడానికి మనమున్నచోట నియామకులులేరు. ఔరా దురవస్థ ఏమి చేయాలి? విషయం రసాభాసమైననూ వ్రాయవలసి వ్రాస్తున్నాను. మటౌకలాగు తలవకండి. చిన్నప్పుడు నేర్చికొన్న యీత అప్పుడు కొంత పనికి వచ్చింది. మృచ్ఛకటికలో శర్విలకుడుగాడు యజ్ఞోపవీతానికి సార్ధక్యం చెప్పినట్లు," నేను అప్పుడు ఈతకొట్ట నేర్చియుండు, అని చదువు కొన్న బాలబోధలో వాక్యానికి సార్ధక్యం వూహించుకొన్నాను. కాలువకు అక్కడక్కడ లాకులు వుంటాయి గదా? ఆ లాకుల దగ్గఱ ఎంతత్వరగా వెళ్లే స్టీమరుకైనా కొంత ఆలస్యం తప్పదు. లాకు ఇక వక అరమైలులోపుగా వుందన్నప్పుడు, నేను గభాలున కాలువలో దూకి ఈదుకొని వడ్డుకు వెళ్లి తరువాయి దీర్చికొని లాకు దగ్గర పడవను కలిసికొనే వాడను. ఇలా రెండుమూడుసార్లు చేయవలసివచ్చింది. ఈ చేయడంలో వక పర్యాయము నెత్తికి చుట్టుకొన్న బట్ట తీసివేయడం మరచినాను, దానితో మునిగి పయికి తేలడం కొంత కష్టమయింది. వ్రాయమఱచాను. చదువుకొంటూ వున్నది శాస్త్రం, పుట్టింది బ్రాహ్మణకులం, చేసిన శుశ్రూష మహా పండితులది, కాశీగంగతో సహా స్వదేశానికి వస్తూవున్నాను. ఇట్టిస్థితిలో జరిగినంతలో అనాచారంగా యెట్లు వర్తించడం? కనుక కాలువలో దూకేటప్పుడు చెంబోక్కటి ముందుగా గట్టుకు విసిరేసి తరువాత దాన్ని పుచ్చుకొనేవాణ్ణి. ఈలా చేయడంవల్ల "అపాత్రత్వం" వుండదని నావూహ. కాని ఒకసారి ఆ చెంబు దొర్లి నేను వడ్డుకు చేరడానికి పూర్వమే కాలువలో పడి మునిగి పోయింది. నాకు సంభవింపవలసిన గండం చెంబుని కొట్టుకు పోయిందని నా మిత్రుడు కోమటి సంతోషించాడు.

త్రివిక్రమావతార సాదృశ్యం

ఏలాగో యీలాటి గండాలతో కటకం చేరినాము. అక్కడ మన తెలుగు దేశస్టులు, నిరతాన్న దాతలు, ఇంటి పేరు మరచాను - వేంకటాచలం పంతులు గారింట్లో ప్రవేశించాము, బహు ఆదరంగా వారు మన దేశస్టులకు అన్నోదకాలిచ్చి ఆదరిస్తారు. వారం రోజులు బాబాకరంగా వారింటిలోనుండి కాశీ వదలింది మొదలు అన్నంలేని లోపాన్ని పోగొట్టుకొన్నాము. నాతో ఉండడంచేత కోమటికి కూడా వారు ఆతిథ్యం ఇచ్చారు. తరువాత త్రోవలోకి ఇంత గోంగూరపచ్చడి వగయిరాలు కూడా ఇచ్చాయి. నా అనారోగ్యం కూడా కొంత తగ్గింది. పిమ్మట కటకాన్నుంచి యొడ్లబండి చేసికొని బయలుదేరాము. కాకులు కూసేటప్పటికి వూరి వెలుపలికి వస్తిమి. అక్కడ ఒక ఇసుకమయమైన నదివున్నది. సుమారు మూడు ఫర్లాంగులమేర బండ్లేమి, మనుష్యులేమి దానిలో నడచి వెళ్లవలసిందే. వందలకొలదిగా బళ్లు వెళుతూవున్నాయి. ఏచంటి పిల్లలో తప్ప, සටයීෂ්ඨ మనుష్యులు దిగి నడుస్తూ వున్నారు. ఈలాటి సందర్భంలో కొంచెము నీరు నురుగలతో ప్రవహించడాని కారంభమయింది. మధ్య త్రోవలో వున్న బళ్లు యెట్లో ఆవలివొడ్డుకు చేరాయి, అంతకన్న వెనుకవున్నవి తిరిగీ వెనక్కి వచ్చేశాయి. వక పావుగంటలో మోకాలిలోతు నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. అరగంటయ్యేటప్పటికి ఇంకచెప్పేదేమిటి? త్రివిక్రమావతారంలాగు "ఇంతింతై వటుడింతయై" అన్నట్లు పొంగి మిన్ను ముట్టుచూ పాము మీసం తెగగొట్టుచూ తన్నే చూడమని ఆ నది పరాక్రమించింది. మాబండీ మేమూ వడ్డునే వున్నాము, సూర్యోదయం అయింది. దంతధావనాది కాలకృత్యాలు నెఱవేర్చుకున్నాము. అంతలో ఎక్కడ నుండివచ్చాయో రెండు పెద్ద బల్లకట్లు వచ్చాయి. ఆవలిబండ్లను ఈవలికి, ఈవలి బండ్లను ఆవలికి దాటించడానికి మొదలుపెట్టాయి. ఎక్కడ తెములుతుంది, వకటా? రెండా? వందలకొలది బండ్లున్నా యి. కీకటానికి తూర్పుప్రక్కను మహానది వున్నది. అది జీవనది. గోదావరి, కృష్ణ వీట్లవంటిదే. వెడల్పులో ఇది ఆ మహానదికి తీసిపోదుగాని, జీవనది మాత్రం కాదు. పడమటి దిక్కున ఇది వున్నది. ఈలాటివి, ఇంతింత కాకున్నను ఇంతకంటె చాలాచిన్నవి అయిన సెలయేళ్లు త్రోవలో ఎన్నో తగులుతవి. బొత్తిగా చిన్నవియైతే రోడ్డుబాటకు అడ్డం తగులకుండా ఏదో తూము కట్టివున్నారు. కాని ఈ బాపతులు అప్పటికింకా కట్టబడివుండలేదు. ఇవి అప్పుడప్పుడు చాలా ప్రయాణీకులకు మోసం కల్పించడ మున్నూ కలదు. ఆ రోజున ప్రమాదం మాత్రమేమీ జరుగలేదు కాని, మాబండీ మేమూ ఆవలికి దాటేటప్పటికి రాత్రి యెనిమిది గంటలు దాటింది అప్పుడు మాకు బసయెక్కడ, బండలెక్కడ?


“ఊరు నాకు క్రొత్త, ఊరికినే క్రొత్త." ఒక వోడ్ర పండితుడు ఆవలి వొడ్డునకు దిగిన సమయంలో తటస్థించాడు. ఆయనకు సంస్కృతం వచ్చును. పాపమాయనే మమ్ము "శాస్త్రిణః కుత ఆగచ్ఛంతి? కుతోవాగచ్ఛంతి?" అంటూ ప్రశ్నించాడు. తత్కాలోచితమైన జవాబును చెప్పి నేటి రాత్రి మా గతి యేమి అని అడిగితిని. ఆయన తనతో తీస్కునివెళ్లి వంట వగయిరాలకు సదుపాయం కల్పించి ఆదరించాడు.


తెల్లవారుజామున మళ్లా బయలుదేరి వకటిరెండు మకాములు వెళ్లేటప్పటికి బండియెదొకటి పడుక్కోవడం మొదలు పెట్టింది. అప్పుడు మటౌక బండెక్కడ దొరుకుతుంది? ఆ యొద్దుకు బదులు బండివాడు కాడి బుజాన్ని బెట్టుకు నడవడం, ఎద్దు వెనుక రావడం, వీలునుబట్టి మేముకూడా నడవడం, ఈలాగు రెండు మూడు మకాములు ప్రయాణం జరిగింది. ఎట్లాగయితేనేమి, శ్రీజగన్నాథ క్షేత్రమునకు వచ్చి చేరుకొన్నాము. స్వామివారిమీద చేతనైనది వక అష్టకం "జగన్నాథం నాథం సరిదిన సుతాయా భజమనః" అనే మకుటంతో రచించినాను. సముద్రస్నానం వగయిరా సందర్భాలనుభవిస్తూ అక్కడ వారంరోజులవఱకూ వున్నామని జ్ఞాపకం.

గంజాం - బర్హంపురం

అక్కడ నుండి మళ్లా బండి చేసుకొని గంజాముకు బయలుదేరినాము. చిలక సముద్రం త్రోవనైతే పడవలమీద ప్రయాణం చేయాలి, మధ్యమధ్య తిప్పలమీద వండు కోవాలి, కొంచెం చుట్టుగాని మెట్టమార్గం అంతకంటె వీలని కొందఱు చెప్పారు. ఆమాటమీద చుట్టయినా మెట్టమార్గం మేలన్నారని మెట్టమార్గానే బయలుదేరాము. కాని త్రోవలో పోలీసుజవానుల సాయముతో బయలుదేరిన తహస్సీల్గారుగారినే రాళ్లు రువ్వి దొంగలు చీకాకు పఱచినట్లోక మకాములో తెలిసింది. ఇక అప్పుడేం చేయము? కొన్ని బళ్ల సహాయముతో యెల్లెట్లో చిన్న చిన్న ప్రయాణాలతో గంజాం చేరాము. కలకత్తా బయలుదేరినది మొదలు కటకంలో తప్ప గంజాం వఱకున్నూ స్వహస్త పాకమే. ఒకప్పుడు బండిక్రింద వంట చేసుకోవలసి వచ్చేది. ఎందుచేతనంటే : "ఆడి చినుకూ పొడిచినుకూ" వానపడేటప్పుడు, ఏ చెట్టు క్రిందో మకాం పెట్టినప్పుడు అంతకన్న గతియేమి? ఎట్లో వుడికీవుడకని మెతుకులు దిని గాలికి చాటుగా బండి సర్జించుకొని దానిమీద నిద్రించడం, బండివాడు బండిక్రింద పరుండడం ఇట్లా ప్రయాణం సాగిస్తూ గంజాం చేరాము. అక్కడి నుండి సత్రాలలో భోజనం దొరకడం మొదలు వంటబాధ తప్పింది. గంజాం రాత్రిపూట ప్రవేశించాము. సత్రంలో తిని పరున్న తరువాత నాకు అపారంగా చెవిపోటు మొదలుపెట్టింది. అక్కడ దిక్కెవ్వరు? దగ్గఱ తమలపాకులు సున్నము నిల్వ వున్నది. అవి రెండూ కల్పిన రసం వల్ల ఆ బాధ నివర్తించింది. తాంబూలము కాశీయాత్ర చేయించడానికే కాకుండా చెవిపోటు వైద్యానిక్కూడా పనికివచ్చిందని నాలో నేననుకొన్నాను. అటునుండి తెలుగుదేశమే అనుకోదగిన సీతారాంపురం మొదలైన గ్రామాలద్వారా దేశానికి వస్తూ బర్హంపురంలో (బరంపురం) మాత్రం వారం రోజులు ఆగినాము. కారణం నాతో వచ్చిన కోమటన్నాడుకదా, ఇక నా చేతిలో సొమ్ములేదు. ఈ పైన మనము కాలినడకమీదనే వెళ్లాలన్నాడు. అలాగయితే ఈ వూళ్ళో నేను అవధానం చేసి సంపాదిస్తానని చెప్పి ఆగమన్నాను. ఆగేడు. అవధానమున కంతా ప్లీడర్లు సిద్ధం చేశారు. కాని అంతలో వారిలో నెవరికో ఆపత్తు వచ్చి మఱికొన్నాళ్లుండవలసి వచ్చింది. కోమటికి ఇంటికెప్పుడు వెడదామా అన్నంత తొందరగా వున్నది. అందుచేత, అతడు, మీరుండండి నేను వెడతానన్నాడు. దానిమీద, నీకుమాత్రం బండి ఖర్చెక్కడిది? మన యిద్దరికీ కూడా సరిపడ్డ సొమ్ము ఇక్కడ వస్తుంది వుండమన్నాను. తగిన ప్రత్యుత్తరం లేక ఆగినాడు కాని, ఏమైనా వాని మనస్సిక్కడ లేదు. ఆ కారణంచేత వున్న యథార్థం చెప్పవలసి వచ్చింది. “సొమ్ము అంతో యింతో వుంది, ముందే జాగ్రత్తపడడం మంచిదని ఆలా అన్నాను, కనుక వెడదాం పదండి" అన్నాడు. సరేనని బయలుదేరాము.

కాశీ కావడి మోత

అయితే మేమిద్దరమున్నూ కాశీకావళ్లు పూర్వులతో పాటు కట్టించుకొన్నామే గాని, యిదివఱకు వక మకామైనా మోయలేదు. ఇక్కడనుండి మోయడానికి మొదలెడ దామని బుద్ధి పట్టింది. భుజాలమీద కావిళ్లు పెట్టుకొని బయలుదేరాము. గోవిందపురం సత్రానికి రాత్రిపూటకు వెళ్లాలి. అయిదు కోసుల మకాము. రోడ్డు మార్గము. ఒకటి రెండు కోసులు నడిచేటప్పటికి నా భుజము సహించింది కాదు. కోమటి చిన్నప్పటి నుండి వ్యవసాయంలో నలిగినవాడు. అంతేకాక లావుపాటి వెదురుబొంగు అతడు కట్టించుకొన్నాడు. అదేమో బలువుగా వుంటుందనుకొని నా తాహతుకు సరిపోయే సన్నపు వెదురు నేను కట్టించుకొన్నాను. కోమటంత కాకపోయినా విద్యార్థి దశలో నేనున్నూ కొంచెం నీళ్ల కావిళ్లకు అలవాటైనవాడనే అయినప్పటికీ, ఈ సన్నము నన్ను బాధించడానికి మొదలు పెట్టింది. ఆ రహస్యము అప్పుడు కోమటి నాకు చెప్పి, నా కావిడి అతడెత్తికొని ఆతడి కావిడి నాకిచ్చాడు. ఎట్లో ఆ మకాం సూర్యాస్తమయానికి చేరుకున్నాము. కాని, త్రోవలో శీతాఫలప్పళ్లున్నూ జీడిపప్పున్నూ తిని ఒక సెలయేటిలో నీళ్లు త్రాగినాము. కాలంగాని కాలంలో ఆషాఢ మాసంలో శీతాఫలం దొరకడం అత్యద్భుతంగా కనపడి ఈ చపలత్వానికి నన్ను పురికొల్పింది. రాత్రికి జ్వరం ప్రారంభించింది. ఆ సత్రంలో రెండు లంఘనాలు చేసి మూడోరోజున పథ్యం పుచ్చుకొన్నాను. ఆ సత్రం అడవిలో వుంది. గోవిందపురం అక్కడికి రెండు మైళ్లలో వుందట. ఆ సత్రం పెట్టించిన పుణ్య పురుషుడు సమయానికి అక్కడనే వుండడంచేత నా అనారోగ్యం ఆయనకు తెలిసింది. అనారోగ్యంలో నున్ననూ ఏవో కొన్ని శ్లోకాలు నావల్ల ఆయన వినడంవల్ల నాయందపారమైన భక్తికలిగి అక్కడ నున్న రోజులలో నాకు ఆయన చేయించిన సదుపాయము వర్ణనాతీతము. ఒక నెలరోజులైనా అధమం అక్కడ వుండి మంచి ఆరోగ్యమును పొందినపిమ్మట వెళ్లవలసినదని ఆయన మిక్కిలిగా నిర్బంధించాడు. కాని కోమటికి క్షణమొక యుగంగా వుంది. క్రొత్తగా కాపురమునకు వచ్చిన భార్యను వదలి వచ్చిన వాడతడు. నేను క్రొత్తగా వివాహమైన వాడనే అయినను, బ్రహ్మచారివంటివాడనే. కోమటి నాతో పాటెట్లుండగలడు?

ఒక్కొక్కరి హస్తవిశేషం!

ప్రయాణం కావడానికి మొదలుపెట్టాడు. నాకాతని సాయం వదలడం ఇష్టం లేదు. ఎట్లో మూడోరోజన పథ్యము పుచ్చుకొని బండి కుదుర్చుకొని బయలుదేరాము. ఆ రాత్రికి - పై మకాము పేరు మఱచినాను. అక్కడ కూడా సత్రం వుంది. ఆ సత్రానికి వెళ్లాలి. చులాగ్గా వెళ్లవలసిందే కాని, బండివాడు నిద్దరోతూంటే యెడ్లు వాటికిష్టం వచ్చిన రోడ్డు మార్గం పట్టాయి. మాకేం తెలు సును? ఆ రోడ్లే సరియైన దనుకొన్నాము. అది ఒక పల్లెటూరి దగ్గిరకు తీసుకువెళ్లింది. ఆపైని రోడ్డు లేదు. అప్పుడు వాణ్ణి లేపేము. లేచి చూచాడు. వీటి తల్లి సిగదరగా, తోవదప్పించాయన్నాడు. ఇప్పుడేం చేదామన్నాము. ఈ వూల్లో ఆగుదామన్నాడు. ఇక్కడ అన్నం దొరుకుతుందా అన్నాను. బ్రాహ్మలు లేరన్నాడు. వున్నవూరు తీసుకు వెళ్లమన్నాను. మంచిదని యేదో పొలాలత్రోవను వొక చిన్న అగ్రహారంలోకి తీస్కు వెళ్లేడు. ఆ వూళ్ళో గోడలకు బదులు ముళ్లకంచెలే విస్తారం కనపడ్డాయి. వీధులు తెలియడమే లేదు. జామురాత్రికి లోపుగా అయింది. నాకు ఆకలి అపారంగా వేస్తూ వుంది. కొన్ని యిళ్లకి వెళ్లి అడిగేను కాని, భోజనాలయిపోయినా యన్నారు. ఒక యిల్లాలు మాత్రం, నాయనా! అన్నముందికాని, యిప్పుడే చల్లి కుండలో పడేశానన్నది. 'అమ్మా! అది అయితే మరీ మంచిదన్నాను. అలా అయితే రండి నాయనా అని వడ్డించింది. తృప్తిగా ఇద్దరమూ భోంచేసినాము. జ్వరపడియున్న నాకు రాత్రివేళ ఆ భోజనం విధిగా జబ్బు చేయవలసిందే కాని, ఆ చేతి మాహాత్మ్యమేమో లేశమున్నూ జబ్బు చేయనేలేదు. ఆ రాత్రి ఆ యిల్లాలు అన్నము పెట్టకపోతే నేను యేమగుదునో యిప్పుడు వ్రాయజాలను.

యోగ్యుల వూహలు కూడా వకప్పుడు లోకాపకారకాలు

ఈ రీతిగా కొన్ని వూళ్లలో భుక్తల గృహాల్లోనూ (తూర్పు దేశంలో అగ్రహారీకులను భుక్తలంటారు) కొన్ని వూళ్ళల్లో సత్రాలలోనూ భోంచేస్తూ, కొంత నడకమీదా కొంత బండిమీదా మార్గం అతిక్రమిస్తూ, త్రోవలో కొంచెం కొంచెం రోడ్డుకు దూరంగా వున్నప్పటికీ శ్రీకూర్మం, సింహాచలం, వుప్పమాక, మొదలైన క్షేత్రాలు సేవించుకుంటూ ఎట్లాగయితేనేమి తుని చేరాము. గంజాం వచ్చినది మొదలు స్వయంగా వండుకోవడం తప్పిందని యిదివఱకే వ్రాశాను. త్రోవలో చాలవఱకు సత్రాలన్నీ శ్రీ మహారాజులుం గారివే." ఆ సత్రాలు సదుపాయంగా అన్నోదకా లివ్వడానికే అసలు ద్రవ్యదాత లేర్పరచి వున్నారట. కాని యిటీవల ఆ సంస్థానానికి దివాన్గిరీ చేసిన శ్రీ పెనుమత్స జగన్నాథ రాజుగారు వక్క సత్రం తాలూకు సొమ్ముతో రెండేసి సత్రాలు పెట్టి ఆ సదుపాయం పూర్తిగా తగ్గించారని మా గురువుగారు చెప్పగా విన్నాను. నాకు ఈ ప్రయాణంలో గురువుగారు చెప్పినమాట అనుభవంలోకి వచ్చింది." దివాన్ జీ జగన్నాథరాజు గారు కూడా మహాయోగ్యుడే కాని, వారి వుద్దేశ్యం, ఏదో ఆపూట తిని వెళ్లేవాళ్లకి సదుపాయ మెందుకు? అసలు లేకపోవడం కంటే, ఇంత చారునీళ్లు అన్నం వుంటే చాలదా, అనియట. మంచి యోగ్యులకు తోచే వూహలు కూడా వకప్పుడు లోకాపకారకా లవుతాయి అన్నందులకీ సత్రాలే వుదాహరణం. దివాన్జీగారు వకటి రెండుచేస్తే, దానిలో గుమాస్తాలూ, వంటబ్రాహ్మలూ మరికొంత తగ్గిస్తే, తుదకు నీళ్లలో వుప్ప మాత్రం వేసి తీసిన తోటకూర, సుద్ద కల్పిన నీళ్లవంటి మజ్జిగ - ఈ రీతిగా భోజనం ఏర్పాటవుతుందని వేఱే వ్రాయనక్కఱలేదు. ఈ భోజనం అప్పుడే చూచాను, మళ్లా ఈ మధ్య నాలుగేండ్లనాడు (1931లో) విజయనగరం విద్యార్థులు భోంచేసే సత్రంలో చూచాను. చూడడమంటే చూడడం కాదు, తిని చూచాను. మీరీ రోజులలో సత్రభోజనాని కెందు కెళ్లారని శంకింతురేమో. బొబ్బిలి పట్టాభిషేకం కృతియిచ్చి వచ్చేటప్పుడు" ఇదివఱలో నావద్ద చదివిన విద్యార్థులు కొందఱి కోరిక మీద విజయనగరంలో ఆగవలసి వచ్చింది. ఆ విద్యార్థులు నాక్రోసమేదో పెద్ద ప్రయత్నం చేయబోతే, “అబ్బాయీ! మీరంతా యెక్కడ భోంచేస్తే అక్కడే భోంచేస్తాను. ఒకపూట కేమిటి, మీ విద్యార్థుల పంక్తిని భోంచేయడం నాకు పరమసంతోషం" అన్నాను. దానిమీద ఆ సత్రాధికారితో చెప్పి యేదో సదుపాయం కల్పించాలని అనుకున్నారు కాని, నేను దానికీ అంగీకరించక, నాపేరు చెప్పనేవద్దు. నేను వచ్చినట్టు విజయనగరంలో యెవ్వరికిన్నీ తెలియనే కూడదు, అలాగైతేనే నేను వస్తాను, లేకుంటే రానేరాను, అని ఖండితంగా చెప్పేటప్పటికి, విధిలేక వాళ్లు అందుకే అంగీకరించారు. ఆ కారణంచేత ఆ విద్యార్థుల సత్ర భోజనం నాకు అనుభవానికి వచ్చింది. ద్రవ్యదాతల లోపముందేమో అంటే, రోజు వకంటికి పన్నెండు రూపాయలు కూరలకే యిస్తారట. ಇట్టి స్థితిలో పైని వర్ణించిన రీతిగా భోజనం వుండటానికి కారణం మధ్యవాళ్ల చౌర్యమే కాక మఱేమి? ఇంకొక్క విశేషం. ఈ సత్రాధికారి ఎవరో సామాన్యుడు కాక వేదం వచ్చిన కుటుంబంలో పుట్టి వేదం చెప్పికొన్న శ్రోత్రియుడని కూడా విన్నాను. అందుకే కాబోలును, ఇంత శ్రోత్రియంగా విద్యార్థుల భోజనం వుందనుకోవలసి వచ్చింది. ఇట్టి సత్రభోజనాల మీద మళ్లా జిహ్వచచ్చి ఎట్లో తుని చేరినాము. అక్కడ మాకు చుట్టాలు లేరుగాని చుట్టాలవంటి వారున్నారు. వారింటికి వెడితే ఈలోపున చచ్చినజిహ్వ లేచి మళ్లా మనుష్యలోకంలో చేరదగిన భోజనం దొరికింది. ఇటీవల నెన్నెన్ని రాజయోగపు విందులనుభవించిననూ నాటి వంకాయ కూరలో శతాంశమునకు కూడ పోలవని సిగ్గువిడిచి వ్రాస్తున్నందుకు చదువరులు మన్నించాలి. ఇంకొకటి. వంట యొక్క రుచి కేవలం వండేవారియందే వుండదు, పదార్ధమందున్నూ వుండదు, తినేవాడి అవస్థనుబట్టి కూడా వుంటుంది.


సరే, తునినుండి కొన్ని మజిలీల మీద పిఠాపురం వచ్చి అక్కడ సత్రంలో సహపంక్తి చేసి కావిళ్లు భుజానపెట్టి చామర్ల కోటదాకా వచ్చినతరువాత కోమటి ఆ కాలువ పడవెక్కి వెళ్లిపోయాడు. నేను కాకినాడద్వారా యానాముకు వెళ్లాను. యానాం ప్రవేశించకపూర్వం సమీప గ్రామం నీలపల్లె దేవాలయంలో కాశీకావిడి సహితం ఆగినాను. ఆగి యింటికి కబురు పంపిన మీదట మావాళ్లు బాజాబజంత్రీలతో వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్లారు." అప్పటికింకా కాశీనుండి గంగకావిడి తెచ్చిన వాళ్లకీ మర్యాదలున్నాయి.

గంగా సంతర్పణ వృత్తాంతము

ఇక్కడితో కాశీయాత్ర సమాప్తి అయినప్పటికీ దీనికే సంబంధించిన గంగా సంతర్పణ వృత్తాంతం వ్రాయడం అంత అనుచితం కాదనుకుంటాను. గంగా సంతర్పణ కొంత నా తాహతుకు ఎక్కువగా చేదామని నా సంకల్పము, ఎక్కువంటే మరేమీలేదు గాని, పిండివంట మిఠాయి చేయించాలని నా కుతూహలం." యానాములో విస్తరించి విస్తళ్లు లేవుగాని, సమీప గ్రామము వింజరం వుంది గనుక నూరింటికి తక్కువ గాకుండా బ్రాహ్మణ్యము వస్తారు. ఇంకా బంధువులు వగయిరాలతో రెండు వందలకు యత్నం చేయాలి. ఇది సంపన్నులకయితే లెక్కలోది కాదుగాని అప్పుచేసి త్రోవ ఖర్చులకు మనియార్డరు చేసిన మా తల్లిదండ్రులు భరించగలరా? కాబట్టి నేను సంపాదించాలి, నాకు మాత్రం యెవరిస్తారు? నాకివ్వరు కాని, కవిత్వానికిస్తారు. ఇంకా ఇప్పటిలాగు అప్పటికి కవిత్వమంటే ఈసడింపు కలుగలేదు అని నా తలంపు. రుద్రాక్షతావళం, దర్భాసనం, గంగాయమునాచెంబు. విభూతి పెండికట్లు, నీరుకావి ధోవతులు, నేనూ కోనసీమకు ప్రయాణమయినాము. అప్పటికి నేనే విద్యార్థిని, కాబట్టి నాకు ఒక్క విద్యార్టీ అలంకారంగా లేడు. పండితవేషానికిది మాత్రమే లోటుగాని తక్కిన లక్షణాల్లో లోపము లేశమున్నూ లేదు. మురమళ్ల పోలవరమూ, క్రొత్తపల్లె, కేశనకులు, ఈ గ్రామాల్లో కొంత ప్రచారం చేశానుగాని, యేదో పది అయిదూ తప్ప త్రోవ పడలేదు. ఆపైని వృద్ధ గౌతమి (గోదావరి పాయ) దాటి ముమ్మిడివరం ప్రవేశించాను. త్రోవలో ఊరువెలుపల కొబ్బరితోటల్లో కొందరు గృహస్థులు కాపురమున్నారు. అందులో పండిత సంప్రదాయమున్నూ కవి సంప్రదాయమున్నూస్వతః పండితులునూ అయిన వక్కలంక వీరభద్రయ్యగారు నన్ను బహూకరించి అక్కడ వున్నంతకాలమూ మిక్కిలి ఆదరముతో ఆతిథ్యమిచ్చినారు. గ్రామకరణం కామరాజుగారు బహు పలుకుబడి కలవాడు. ఆయన నాచేత అష్టావధానం సభ చేయించి నూటపదహార్లు ఇచ్చే వూహతో నున్నాడు. ఈలోగా ఆయన పినతండ్రి అమ్మిరాజుగారున్నూ, వెంపరాల వెంకట శాస్రులు గారున్నూ నన్ను పరీక్ష చేయడానికి అప్పుడప్పుడు ఏవో వారికి తోచిన శంకలు శంకిస్తూ వుండేవాడు. నా స్థితి అప్పటికప్పుడే ఆలాటి సామాన్య పండితులకు లొంగేటట్టు లేదు. కౌముది ప్రధానభాగాలు అయినాయి, పరిభాషేందు చాలమట్టుకు అయింది." ఇతర వ్యాఖ్యానాల్లో విశేషాలు కొన్ని తెలుసును. ఈ స్థితిలో వున్న నేను కేవల సాహిత్యం మాత్రం వున్నవారికేలా లొంగుతాను? అదిన్నీ కాక వారిరువురున్నూ విద్యావయోవృద్దులే అయినను నన్ను అడిగే ప్రశ్నలు శుద్ధ అవ్యక్తముగా నున్నాయి.


మాదిరికి వక్కటి వుదాహరిస్తాను, దానివల్ల వారి పెద్దతనమున్నూ నా చిన్నతనమున్నూ మీకే తెలుస్తుంది. నేను అన్నపూర్ణాష్టకంలో అమ్మవారిని మత్సద్మని స్థీయతామ్, అని కోరినాను, దానికర్థ మింతకు పూర్వం వ్రాసే వున్నాను. ఈ స్థలంలో వారి శంక "అబ్బాయీ, అమ్మవారిని మీయింటిలో నుండమన్నావు కదా? అయితే మీ యిల్లు తాటాకులయిల్లా? లేక పెంకుటిల్లా” అని. నా సమాధాన మేమిటంటే, మాయిల్లు మీరన్న రెండు విధములలో నొక్కటియుగాదు, గడ్డియిల్లు, అని. పాండిత్యంతో పాటు నాకు పెంకెతనమున్నూ లోటులేదు. కనుక పెడసరంగా జవాబిచ్చాను. పైగా వయస్సుముదిరిన వారి ధోరణి యెంత పెడత్రోవ నున్నదో చదువరులు పరికింతురుగాక. దానిమీద వారు నన్ను ఏదో విధంగా గేలిచేయ మొదలిడినారు. నేను "కార్యార్థినః కుతోగర్వ” గనుక, ముందవధానం చేయవలసి వుంది, వీరితో మనకు పోట్లాట తగదు, ఇందులో వకరు సభ చేయించేవారి కత్యావశ్యకులు, ఇప్పుడేమైనా వైరస్యం కలిగితే వీరి ద్వారా కాబోయే కార్యం చెడవచ్చునని వూహించి, వారికి వోడిపోయినట్లు నటిస్తూ కాలక్షేపం చేసేవాడను.

చందా ముష్టి

అంతలో సభ జరిగింది. నిడమఱ్ఱులో మోస్తరుగా ఏవిధమైన కమ్మీలు కృత్రిమాలూ లేకుండా దివ్యంగా అష్టావధానం పూర్తి చేశాను. సభ్యులు సంతోషించారు. గ్రామము చాలా పెద్దది. నూటపదహారు వఱకు చందా కాగితంమీద పడ్డది. వసూలు చేసి వారంలోగా సమ్మానించి పంపాలని కరణంగారి నిజమైన వూహ, ఈ స్థితిలో పినతండ్రి అమ్మిరాజుగారు, ‘నీవు వసూలు చేసేదేమిటి? ఆ కాగితం ఆయనకిస్తే ఆయనే వసూలు చేసికొంటాడని మెల్లగా ఆయన బుద్ధి తిప్పేశాడు. దానిమీద ఆయన నాకు చందాకాగితం చేతికిచ్చి వసూలు చేసికొమ్మన్నాడు. నాకు పట్టరాని కోపం వచ్చింది. అవసరాన్ని బట్టి దిగమ్రింగినాను. వసూలుకు తిరగడానికి మొదలు పెట్టాను. స్నాన సంధ్యాద్యనుష్టానాలు ముగించుకొని బయలుదేరి వెళ్లాటప్పటికి వక గృహస్టును చూడడం అయ్యేది. అంతలో భోజనానికి కనిపెట్టుకుంటారని బసకు రావలసి వచ్చేది. ఆ వెళ్లే యిళ్లు అక్కడా అక్కడా కొబ్బరితోటల్లో వున్నాయి. చాలవఱకు రాజుల పద్దులే. ఆ రాజు లెవ్వరో తప్ప పొలాల్లో కాపురమున్నవారే. కౌశికకు (గోదావరి పాయ) ఈవలి యొడ్డుకంటె ఆవలి యొడ్డున నెక్కువగా నున్నాయి. బాడీబందతో (బాగా బురుదగా అడుసులాగా ఉంది అనే భావాన్నిచ్చే జాతీయం) వున్న ఆ కౌశిక మాటిమాటికి దిగడం, వెళ్లడం, అక్కడ పులిచార్ల కుక్కలు కఱవరావడం, ఎవరో వారించడం, ఈలాటి చిక్కులతో ఎట్లో ముప్పది రూపాయిరాల పై చిల్లర వసూలు చేశాను. అంతలో విసుగుపుట్టింది. భోజనంచేసి పరుండడంతోటే ఒక ఆలోచన పుట్టింది. ఈలా తిరిగి ముప్టెత్తుకొనే యెడల సభచేయడం యెందుకు? అసలాయన మంచివాడయినా పినతండ్రిగారి దుర్బోధవల్ల ఆయన ಬುದ್ಧಿ చెడిపోయింది, గంగా సంతర్పణకు ఈవూరు కాకపోతే ఇంకోవూరవుతుంది, ఏలడానికి వూళ్లు లేకపోవచ్చు గాని, యెత్తుకు తినడానికి వుండకపోవు, 'సాహసేలక్ష్మీః' అన్నాడు, అని లేచి, దర్భాసనం కట్టి, నన్ను మిక్కిలిగా ఆదరించుచున్న వీరభద్రయ్యగారి వద్దకు వెళ్లి, నా మనస్సులో వుదయించిన కోర్కె యిట్టిదియని యథార్థం చెప్పి, ఈ సందర్భం కొద్దిరోజులవఱకూ యెవరికీ తెలియనీయవద్దని కూడా ఆయనతో మనవిచేసి, ఇదివఱలో వసూలైన సొమ్మ ముప్పై రూపాయల పై చిల్లరయున్నూ అణాపైసలతో గంగా యమునా చెంబులో పోసికొని, హోరున వర్షం కురుస్తూ వుండగా బయలుదేరి, గ్రామంలోకి వచ్చి కరణంగారిని మామూలుగా దర్శించినట్టే దర్శించి, ఏదో పిచ్చాపాటీ మాట్లాడి, 'అయ్యా, ఈరోజున మధ్యాహ్నము నేను పరున్నప్పుడు నిద్రలో మీ గ్రామములో కేశవ స్వామివారు కలలో కన్పడి, “ఏమిరా! నీ కవిత్వ సంపాదన ప్రస్తుతం మరమ్మత్తగుచున్న నా ఆలయా ని కివ్వలేవుట్రా? అని వీపుమీద చరిచినట్లయింది, నేను చేసే కార్యమేనా గంగా సంతర్పణగదా, అదిన్నీ దేవతా కార్యమే, ఇదీ దేవతాకార్యమే కనుక ఈ అవధానసభ నూటపదహారున్నూ ఆలయానికి అర్పణ చేశాను, ఇదుగో వసూలైన మట్టుకు సొమ్ము మీకు ఇస్తున్నాను, తక్కినది యావత్తూ శ్రద్ధగా వసూలు చేసి స్వామివారి గుడికి సమర్పించవలసింది" అని అధికారంతో ఆయనకు విధించి, ఆ వర్షంలోనే అయినాపురం గ్రామానికి ప్రయాణమై గుబ్బగొడుగు విప్పుతూవుండగా పాపము, ఆ కామరాజు గారు నేనెంత గంభీరంగా మనోవికారాన్ని తెలియనీయక పోయినా, లౌక్యుడు కనుక, అనుమానపడి, "ఈ పూటమట్టుకు మా యింట ఆగి వెళ్లండి, వరము, త్రోవలో చిక్కుపడతారు,” అని మిక్కిలిగా బ్రతిమాలినాడు. నేనూ వినయంగానే, “నాకు సెలవియ్యండి, సంతర్పణకు ఏర్పరచుకొన్న రోజు దగ్గఱకు వస్తూ వున్నది" అని మాట్లాడుతూ ప్రయాణం చేశాను.


ప్రొద్దు గ్రుంకేటప్పటికి అయినాపురం ప్రవేశించాను. ఎవరో గృహస్టులింట దర్భాసనం దింపాను. వచ్చిన సంగతి చెప్పాను. ఆ గృహస్టు, ఇక్కడ ప్రస్తుతం వున్న డెల్టా సూపరింటెండెంటు గారు బహు యోగ్యులు, పండితులంటే ప్రాణమిస్తారు, అని చెప్పి, వారిబసకు వెంటబెట్టుకొని తీసుకువెళ్లేరు. నన్ను ఆయన మిక్కిలి గౌరవించి భోజనాలయిన తరువాత ఆ రాత్రే అష్టావధాన సభ జరిగించి గౌరవించాడు. మరునాడు సాయంకాలంలోగా యేభై అరవై చాపులు, రమారమి నూరు రూపా యీలు తటస్థమయినాయి. వెంటనే గిర్రున మళ్లి యింటికి వచ్చి, గంగా సంతర్పణ జరిగించుకొని, పెండ్లి అయిన కొద్ది రోజులలోనే కాశీ వెళ్లడంచేత తరువాయిగా వున్న మనుగుడుపు నిమిత్తం అత్తవారింటికి వెళ్లి, అక్కడినుంచి తిరిగి గురువుగారి వద్దకు వెళ్లి వారి వద్దనే వ్యాకరణం తరువాయి తిరుపతిశాస్త్రితో సహాధ్యాయిత్వమును గైకొని చదివితిని. ఇదివఱకు తిరుపతిశాస్త్రి నాతో విశేషమైత్రిగా వుండకున్నను. కాశీ వెళ్లి వచ్చినది మొదలు అవధానాది కారణములచే నాపేరు కొంత పైకి రావడం మొదలుపెట్టడం చేత, విశేషమైత్రిగా వుండ మొదలిడినాడు. కాని మధ్య మధ్య పోట్లాటకూడా ఆడుతుండేవాడు. అంతటో మా తల్లిదండ్రులు త్రోవ ఖర్చులకోసం అప్పుచేసి పంపించిన ముఫ్పె రూపాయలు తీర్చుకోవలసి నేనెక్కడికో సంపాదనకు బయలుదేరబోవుచుండగా, గురువుగారు, "అబ్బాయీ, నీకు యితడుకూడా వుంటే చాలా శోభగా వుంటుంది, గనుక ఇతన్ని కూడా తీసుకు వెళ్లవలసింది," అన్నారు. వారు ఈలా సెలవిచ్చేటప్పటికి, నాకూ తిరుపతిశాస్త్రికీ యేవో మనః కలహాలున్నాయి." దానిమీద నేను "ఆతడు వస్తే నా అభ్యంతరం లేదన్నాను. "రాకేం చేస్తాడు తప్పకుండా వస్తాడని గురువుగారని, “ఏమయ్యా, అతడూ నువ్వూ కలిస్తే బాగావుంటుందన్నారు. మంచిదన్నాడు, వచ్చాడు. కాకినాడ వెళ్లేము. అక్కడ జరిగిన శతావధానం" వగయిరా జాతకచర్యలో వున్న విషయమేకదా! ఈ కాశీయాత్ర మాత్రము జాతకచర్యలో లేనిదా అంటే, ఉన్నదే కాని, విస్తరింప వలసిన పుణ్యగాధ కనుక, నేనీమధ్య షష్టిపూర్తి జరిగినది మొదలుకొనిన్నీ అంతకు పూర్వం నుంచిన్నీ మిక్కిలి జబ్బుస్థితిలో వుండి, నిన్న నేటినుండి కొంచెం తేరుకుంటూ, ఈ రచన యిహపరసాధకమని చెప్పి దీనిని కొంత విస్తరించి వ్రాశాను. కాకినాడ, అమలాపురం వగయిరా అవధానములకున్నూ కాశీయాత్రకున్నూ సంబంధముండ నేరదు గనుక, వాటిని గూర్చి యిందు వ్రాయవలసింది లేదు. ఒక్కటి మాత్రం వ్రాసి తీరాలి. ముమ్మిడివరం కరణం, మాచిరాజు కామరాజుగారు మేము అమలాపురంలో గొప్ప గౌరవములు పొందుచూవున్న సమయంలో వచ్చి, వెనుక జరిగిన లోటు తీర్చుకొనే వుద్దేశ్యంతో వక పర్యాయం వారి గ్రామం రావాలని మిక్కిలి బలవంతంగా కోరారు. ఆయన యోగ్యతను బట్టి త్రికరణయా వెళ్లాలనే నేను అనుకొన్నాను గాని, యెందుచేతనో సాగిందికాదు. “బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా."


ఏ గురువుగారి వద్ద చదువుకొంటూ, తీరికూర్చుని అయితే నేమి, నేను కాశీకి వెళ్లానో, మళ్లా ఆ గురువుగారి దగ్గఱకు వచ్చాను గనుక, ఇక దీన్ని ముగించుట యుక్తంగా వుంటుంది, యీ కాశీయాత్రన్నది నా జాతకరీత్యా, చంద్రమహా దశలో శుక్రాంతరంలో తటస్థించింది. వివాహం కూడా దానిలోనే. జాతక విషయం తెలిసిన వారికి, ఆయీ విశేషాలు ఏయే గ్రహస్థితులను ಬಜ್ಜಿ సంఘటించాయో తెలిసికొనే నిమిత్తం, నా జాతకం కూడా వుదాహరించి మటీ ముగిస్తాను. ఈ శుక్రాంతరం విరోధి (1889) సం|| వైశాఖ బహుళ త్రయోదశి మొదలుకొని, వికృతి (1890) ξόοι పుష్య బహుళ త్రయోదశి వఱకును అని తెలియగోరినాను. వివాహము జరిగినరోజు ఇదివఱలో వ్రాసియేయున్నాను. కాశీకి బయలుదేరినది పుష్యశుద్ధ తదియ యని జ్ఞాపకము. అటనుండి దేశానికి వచ్చినది ఆషాఢ మాసము. కోనసీమకు సంపాదనకు వెళ్లినది భాద్రపదమాసము. వివాహం నాటికి నా వయస్సు పందొమ్మిది సంవత్సరముల మూడు మాసముల యిరువదియొక్క రోజులు. కాశీ ప్రయాణం నాటికి ఇక నొక్కమాసం కలుపుకొంటే సరిపోతుంది. ఇంత డిటైలుగా యెందుకు వ్రాస్తున్నానంటే, నా జాతకమందు కొంత యితర పాపగ్రహ సంబంధం వున్నప్పటికీ శతమంజరీ యోగాల లోని "కుసుమయోగము" అనే మొట్టమొదటియోగము పూర్తిగా పట్టింది కూడా ఆ యోగము పట్టిన జాతకమునకు ఇరువదియేండ్లు దాటిన తర్వాత యోగమారంభ మవుతుందని దైవజ్ఞలు వ్రాశారు. దానికి తథ్యంగా, కాకినాడలో సంపూర్ణ శతావధానం చేసి పెద్దగా గౌరవము పొందినది ఖర (1891) సం|| ఆశ్వయుజ బహుళములో గనుక, అప్పటికి నా వయస్సు ఇరువదియొక్క సంవత్సరమూ రెండు మాసముల పై చిల్లర అగుటచే జాతకము చక్కగా దృష్టాంతం ఇచ్చినట్లే తజ్ఞలు అనుకోవచ్చును. ఈ కాకినాడ అవధానం నాటికి కుజమహాదశలో కుజాంతరం జరుగుతూవున్నది. యత్మించిద్యోగము కాశీ ప్రయాణానికి ముందే ఆరంభమయింది కనుక చంద్రునిలో శుక్రాంతరంలోనే యోగానికందిచ్చి నట్టున్నూ, దానిని కుజుడు ప్రబలం చేసినట్టున్నూ అనుకోవచ్చును. కుసుమ యోగాన్ని వుదాహరించి, యిక దీనిని ముగిస్తాను. జాతక చక్రములు జాతకచర్యా గ్రంథమున చూడగోరెదను.

కుసుమ యోగము

శ్లో లగ్నాత్సప్తమగే చంద్రే, చంద్రాదష్టమగే గురౌ,
   గురుణా సంయుతే లగ్నే యోగః కుసుమ సంజ్జితః !
   కుసుమాఖ్యేతు సంజాతో భూపాలో బంధురక్షక:
   వింశత్యబాత్పరం గ్రామపురకర్తా భవిష్యతి ||

ఇంత చక్కగా ఋజువిచ్చుచున్ననూ, ఇప్పటివారనేకులు జాతక విషయమున విశ్వాసము లేనివారుగానున్నారు.

అపసవ్య చక్రము

ప్రమోదూత సం|| శ్రావణశుద్ధ ద్వాదశి సోమవారం, (8-8-1970) రాత్రి 25-8 విగడియలవేళ, మిధునలగ్నమందు జననము.

లగ్నభుక్తి 3-45 శేషం 1-30 పూర్వాషాధా చతుర్థ చరణభుక్తిపోగా శేషము 14-21. ఋక్షాద్యంతము 57–50. పాదప్రమాణం 14-27 జననకాల శుక్ర మహాదశా శేషము సం 4-మా 11-రో 16.

జాతక పరిశీలకులకు ఈ చూపిన ఆధారములు చాలునుగాన విస్తరింపను.

ముమ్మిడివరంలో వితండవాదం మొదలుపెట్టిన పండితులకు నేను లిఖిత పూర్వకంగా యిచ్చిన సదుత్తరమును లిఖించి విరమిస్తాను. “మత్సద్మని స్టీయతా మిత్యత్ర, అన్నపూర్ణాంబికాయా భక్తగృహనివాసోక్తి ర్నదోషాయ, కుతః, తస్యాభక్తపరాధీన త్వాత్, తథాచ, శ్రీసూక్లే, మమవసతుగృహే సర్వమాంగళ్యయుక్తే త్యుక్తత్వాచ్చ.”

ఇందింకనూ మఱికొన్ని శంకాసమాధానాలున్ననూ విస్తర భయముచే దిబ్మాత్రముగా నుదాహరించి విరమించుచున్నాను. ఇదేనా, మీ యిల్లు తాటాకులిల్లా? పెంకుటిల్లా? అంటే, బెడిదంగా రెండూ కాదు గడ్డింుల్లని మాత్రమే జవాబు చెప్పానంటే, చదువరులు నిజమైన జవాబేమి అని అనుకోక మానరని వ్రాయవలసి వచ్చింది. అప్పుడు యానాములో మేము కాపురమున్న యిల్లు గడ్డిల్లయిన మాటా సత్యమే. జాతకచర్యలో ఏవో కొన్ని పంక్తులలో టూకీగా వుదాహరించిన నా కాశీయాత్ర పూర్తిగా కాకున్ననూ కొంత విస్తరించి వ్రాస్తే ఇంత పెరిగింది. ఇంకా ఇందులో బుచ్చి మనుమరాళ్ల పెండ్లి వగయిరాలు వ్రాస్తే యెంత పెరిగేదో! కొంతమంది పండితుల నామములు మాత్రం ఇందుదాహరించినాను. ఇంకా యెందటినో వ్రాయవలసివున్నది. అందు మా గురుపరంపర మట్టుకు వ్రాసి విరమిస్తాను. కాశీనాథశాస్రులుగారు, వీరి శిష్యులు రాజారామశాస్రులుగారు, (వీరు శ్రీ భాగవతుల హరిశాస్రులవారికి సహాధ్యాయిలు) వీరి శిష్యులు మా గురువులు శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్రులుగారు. అస్మచ్చ్రీ గురుచరణారవిందాభ్యాం నమోనమః.


సమస్త సన్మంగళాని భవంతు