కాశీమజిలీకథలు/మొదటి భాగము/అవతారిక
శ్రీరస్తు.
అవతారిక.
శ్లో॥ వాగర్థా వివసంపృక్తౌ వాగర్థప్రతిపత్తయె।
జగతఃపితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ॥
శా. శ్రీమూర్తిత్రితయంబునన్భువనసృష్టిత్రాణనాశక్రియా
సామర్థ్యంబు గుణత్రయంబునను నిచ్ఛామాత్రతం జూపుచున్
నామాకారగుణక్రియారహితుఁడైనం గల్గిన ట్టొప్పుఱేఁ
డామోదంబున సామినేని నరసింహారాయునిన్ బ్రోవుతన్.
చ. సురుచిరనీలనీరదవిశోభితమైన మెఱుంగుభంగి సుం
దరు నెదఁబొల్చి భక్తులను దత్పరతం గరుణావిలోకనాం
కురములఁ బ్రోచు పాల్కడలికూన సుదర్శనపాణిరాణి యా
సిరి కృప సామినేని నరసింహునియింట వసించు నిచ్చలున్.
సీ. ఏమానినీరత్న మెన లేని నిష్ఠమై
మెప్పించి మగని సామేన నిలిచె
నేకళావతి శర్వరీకాంతరేఖావ
తంసంబు గై సేయు ధవునిరీతి
నేవధూమణిఁ గాంచెఁ బావనస్థితిఁ దుషా
రోర్వీధరాన్వయసార్వభౌముఁ
డేపాటలాధరి మైపూతపసపున
వేదండవదనుఁ డావిర్భవించె
గీ. నమ్మహాదేవి భక్తలోకైకనిరత
గౌరి శర్వాణి జగదంబ కలుషదమన
సర్వమంగళ రక్షించు సంతతంబు
సామినేని నృసింహు విశ్వాస మెసఁగ.
గీ. కవులపాలింటి మరుదనోకహము మగని
మొగమునందున నెలకొన్న ముద్దుగుమ్మ
పద్మభవురాణి వల్లకీపాణి వాణి
సామినేని నృసింహుని సాకుఁగాత.
శా. జోహారంచు భజింతు నాత్మ విలసచ్చుభ్రాంశుభూషుం దుషా
రాహార్యేంద్రసుతాతనూభవు మదేభాస్యు న్సురస్తుత్యుఁ బ్ర
త్యూహధ్వాంతసభోమణి న్గణసనాథు న్విఘ్ననాథు న్మహో
త్సాహం బొప్పఁగ సామినేనికులజుం సాకన్నృసింహాహ్వయున్.
ఉ. చిత్రములైన మోములు నశేషవిభాతిశయప్రభా లస
ద్గాత్రము జారు బాహువులు గల్గి తలన్ శశిరేఖ వెల్గ లో
కత్రయపూజ్య భక్తజనకల్పకవల్లియునై తనర్చు గా
యత్రిపదంబులం దలఁతు నాత్మఁ గృతీశు మహేశుఁ జేయఁగన్.
ఉ. ఆది నొకండుగా వెలయు నాగమము ల్విభజించి యంత న
ష్టాదశసత్పురాణములు స్కాందముఖంబులు జేసి లోకర
క్షాదరణంబుతోడ వనజాక్షుఁ డన న్బ్రభగాంచినట్టి వి
ద్యాదయితు న్బరాశరమహామునినాథసుతు న్భజించెదన్.
గీ. మ్రొక్కి వల్మీకభవుపదంబులకు భక్తిఁ
గాళిదాసుకవిత్వవిక్రమముఁ బొగడి
నన్నపార్యాదికవికీర్తి సన్నుతించి
వరుస సేవింతు నాంధ్రగీర్వాణకవుల.
క. నతిజేయుదు ననుఁ గొమరుని
గతిఁ జూచుచు నెనరుమీర గా నురువిద్యా
న్వితుఁ జేసినట్టి సుగుణక
లితమతి కివటూరి నాగలింగార్యునకున్.
వ. అని కృతిముఖోచితవర్ణంబు గావించి మదన్వయక్రమం బించుక వర్ణించెద.
సీ. ఆత్రేయగోత్ర విఖ్యాతమౌ మధిరవం
శాబ్ధి జన్మించె సుబ్బయ్యసూరి
అతనికి సుతులు సుబ్బయ్య గోవిందయ్య
యనఁగ నిద్దరు పుట్టి రమలకీర్తు
లందగ్రజుండు బుచ్చమ్మనాఁదగు సాధ్విఁ
బరిణయంబగుచు నాపడఁతియందు
సుబ్బయాహ్వయపుత్త్రు సూరిజనస్తుత్యుఁ
గనియె నాతఁడును వెంకమ్మయందుఁ
గీ. గాంచె బుచ్చన్ననాము బంగారయాఖ్యు
సుతుల నిరువుర నందగ్రజునకు రామ
యాహ్వయుండ వరజునకు జగ్గయ్యయును జ
నించి రం దిల జగ్గయ్య నీతిశాలి.
మ. ఆజగ్గయ్య యొనర్చె భక్తి బహుసప్తాహంబులన్ విప్రులం
బూజించె న్విమలాన్నదానముల సంపూర్ణంబుగాఁ దీర్థయా
త్రాజాతవ్రతదీక్ష వేలుపుల నారాధించె దాతృత్వవి
భ్రాజత్తేజు డటంచు నర్థులు నుతింపంబొల్చె సత్కీర్తితోన్.
గీ. విశ్వనాథ మనఁగ వెలయు మత్సుతుఁ బెంచు
కొనఁగ నిచ్చినాఁడఁ గులము వెలయఁ
దాత తండ్రు లన్నదమ్ములై కూటస్థు
డరయఁ దాత తాత యగుట మాకు.
మఱియు
క. మావంశము కూటస్థుం
డై వెలసిన సుబ్బయార్యున వరజసుతుఁ డా
గోవిందయ్య వివాహం
బై వెంకమయనెడు కన్య నభిమతమాన్యన్.
క. ఆనాతియందుఁ గనె ల
క్ష్మీనారాయణుఁ డనంగఁ జెన్నొందు సుతున్
జ్ఞానదయామతికలితు న
నూనకళాలలితు సజ్జనోత్తమవినుతున్.
గీ. అతఁడు వెంకమ్మయను సాధ్వియందుఁ గనియెఁ
దనయు ననుజాతకరుణావితరణవినయు
నయకళాభూషుఁ గొండయాహ్వయవిశేషు
ననవగతదోషు నన్నదానాభిలాషు.
క. ఆకొండయార్యవర్యుఁడు
జేకొనియెన్ రేకపల్లి సీతారామా
ఖ్యాకలితయజ్వ సుత సీ
తాకల్పన్ సోమిదేవి ధర్మయువతిగాన్.
సీ. శ్రీకాంతు నేకాదశీవ్రతాంతరముల
నారాధనము జేసె నతులనిష్ఠ
సేవించె భూసురశ్రేష్ఠుల నన్నసం
తర్పణంబులను ద్వాదశులయందు
వెలిఁగించె వేల్పుకోవెలలందు దీపమా
లిక లర్చనలను గార్తికములందుఁ
గావించె బహుళోపకారముల్ ద్రవ్యప్ర
దానంబున సుధీవతంసములకు
గీ. హితుల మన్నించె బంధుసంతతులఁ బ్రోచె
రిపుల నిర్జించె గడియించె విపులధనము
వర్తకంబునఁ గొండయాహ్వయఘనుండు
ధృతి సమార్జితమర్థిసాత్కృతము జేసె.
గీ. ఆతఁడు సోమిదేవియందు మమ్మిరువుర
సుతులఁ గాంచె నందు సుబ్బారాయుఁ
డగ్రజుండు నేను ననుజుండ సుబ్బన
దీక్షితాహ్వయుండ ధీరనుతుఁడ.
చ. శుభకరవారిజాసవసుక్షితిభృచ్ఛకోల్లస
ద్విభవసమాసుమార్గసితదీపితమౌ విదియన్ జనించితిన్
ద్రిభువనవంద్యవేదజననీకరుణావిలసద్విలోకన
ప్రభవకవిత్వవైభవుఁడ భవ్యకవీంద్రవచోవిధేయుడన్.
చ. చదివితి నాగలింగగురుసన్నిధిఁ గాటవరంబునందు శ్రీ
పదకులకృష్ణమూర్తి కవివర్యునితో నల కావ్యనాటకా
ద్యుదితరసప్రబంధము లనూనగతిం గృతిలక్షణంబు గౌ
ముది విదితార్థయుక్తిఁ బరిపూర్ణవివేకగురుప్రసక్తితో.
గీ. మొదట రఘువంశకావ్యంబు జదువునపుడె
కవితజెప్పంగ వేడుక గలిగె నంతఁ
బూని కావించి యష్టావధానములను
గృతులఁ బడసితి మున్ను సత్కృతులఁ గొన్ని
గీ. ఊర్మి గోదావరీమహాత్మ్యోత్తరప్ర
భాగమును భద్రగిరిరామభద్రచరిత
సప్తసాగరమహిమ పుష్కరమహత్వ
మాదిగాఁగల పద్యకావ్యములఁ జేసి.
చ. పదముల గుంభనల్ వెలయఁ బ్రౌఢి రచించిన పద్యకావ్యము
ల్గొదవరిపండితోత్తములకుంబలె నయ్యవి పామరాళికి
న్ముద మొనరింప వెల్లరకు మోదము గూర్చెడు గద్యకావ్యము
ల్విదితముగా రచింపనని వేడుకఁజెందుచు వానియం దిలన్.
చ. కథలన నెల్లవారలకుఁ గౌతుకమౌఁగద యందుఁ బల్మనో
రథమునఁ గాశికావసథరమ్యకథల్ రసయుక్తముల్ జగ
త్ప్రథితములంచు నే నవి ప్రబంధముఖంబునఁ గాక లోకవా
క్పథమున నుండుట న్వచనపద్ధతిగా రచియింపనెంచుచున్.
మ. అరయం బిట్టకథ ల్ప్రబంధముగ జేయకన్ సార్ధకంబేమి శం
కరునింగాని రమేశుఁగాని పొగడంగా నొప్పునంచు న్నను
న్నిరసింపందగ దార్యులార! ఇదియున్ నీతిస్ఫురత్కాశికా
పురయాత్రాంతరవాసజల్పితకథాపూతంబు శ్రోతవ్యమౌ.
గీ. కాశి కేగెద నట నుందుఁ గాపురంబ
టన్నఁ నప్పురవాసపుణ్యంబు గలుగఁ
దత్ప్రభావము మున్నుగాఁ దనరుకథల
నొప్పుటను బూతమిదియని చెప్పనేల?
అని తలంచి యేతత్ప్రబంధరచనాయత్తచిత్తుండనై.
సీ. ఏవిభుఁ డస్మదష్టావధానక్రియా
వ్యస్తాక్షరీచిత్రవైఖరులకు
సభ మెచ్చి తొలుఁదొల్త సంతసంబున భర్మ
వలయోర్మికాదిభూషల నొసంగె
నల్లంతదవ్వున నరసి నన్నసదు న
వ్వెసఁగ మన్నించుఁ దానే ప్రభుండు
జనులెల్ల మెచ్చ నేసాధువు సద్వృత్తి
యమరంగ నధికార మాచరించెఁ
గీ. గృతియనం గడు కుతుక మే పతికి నట్టి
సామినేని కులాంబోధిచంద్రుఁడైన
నారసింహున కీప్రబంధంబు కృతినొ
సంగఁ దలఁచితి మతిఁగృతజ్ఞత దలిర్ప.
ఉ. అంబుజనాభుపద్వనరుహంబునఁ బుట్టిన వంగడంబులో
నం బరమప్రభావమున నల్వువహించిన సామినేని వం
శాంబుధి నుద్భవించిరి గుణాకరు లాశ్రితజాతపారిజా
తంబులు వంశచంద్రులు వదాన్యమణు ల్పురుషాగ్రణు ల్మహిన్.
క. గోపాలరావు తత్కుల
దీపకుఁడై యుదయమందె దీనప్రజర
క్షాపరతంత్రుం డగుచుఁ బ్ర
తాపకృపాశీలసంస్తుతవ్రతుఁ డగుచున్.
మ. గురుతేజోమహిమంబునం దనరు నా గోపాలరా వర్చితా
మరసీమంతవతీకదంబయగు నమ్మాణమ్మయందు న్మనో
హరచేతోగుణశీలశాలి నరసింహాఖ్యాప్రవిఖ్యాతు శ్రీ
కరనారాయణపాదపద్మనిరతుం గాంచె న్సుతు న్సద్ర్వతున్.
చ. ఘనమతియైన తల్లి పసికారున నుగ్గున రంగరించి యా
తని నునుబొజ్జలో సుగుణతారజ మొయ్యనఁ బోయఁబోలునే
ర్పున మఱి కానిచోఁ గొరత బూనక బాల్యమునుండియుం దిరం
బున నరసింహునందు గుణపుంజము లాగతి నుండనేటికిన్.
సీ. అధికారగర్వ మింతైనఁ జెందఁడుకదా
బాలురతోనైనఁ బలుకుచుండు
భవభూతి యయ్యు దర్పమును సేయఁడుకదా
యాహారశయ్యావిహారగతుల
నొవ్వనాడఁడుగదా నోరెత్తి పరిచార
కుల నైన నపరాధముల గణించి
పరిహాసమునకైనఁ బలుకనేరఁడుగదా
పరుషతీవ్రాసత్యభాషణముల
గీ. సదయు డనురాగగుణవర్తి శాంతమూర్తి
నిత్యసత్యవ్రతుం డతినిర్మలాత్ముఁ
డతని కాతండె సాటి యౌరా యటంచుఁ
బొగడుచుందురు నరసింహు భూమిప్రజలు.
గీ. సాత్వికం బచ్చముగఁ దీసి శాంతరసము
పదునుపడఁబోసి నెనరుతో మెదిపి దాన
వానిమతి జేసె భారతీజాని, కాని
నాఁడు నిల్చునె యన్నిగుణంబు లచట.
మ. నరులెల్లం దనశాంతభావమును నానాభంగి గీర్తింపఁగా
నురుకీర్తిప్రభుతానురక్తిగల యుద్యోగంబుతో ధర్మత
త్పరుఁడై యొప్పెడువానికిం బొడమునంతం దల్లిదండ్రుల్ భళీ
నరసింహంబని పేరుపెట్టుట బుధానందంబుగాదే తుదిన్.
క. ఆతని యర్ధశరీరము
పాతివ్రత్యప్రభావపరిహసితసతీ
వ్రాతవినిర్మలమతి వి
ఖ్యాతసుగుణ సుందరమ్మ యనఁ బొల్చుఁ దగన్.
సీ. పరుల నెన్నఁడు నోటఁ బరుషంబుఁ లాడదు
అలుగదు దాదులయందునైన
పెద్దలఁ బొడఁగన్నఁ దద్దయు భయభక్తి
వినయవిశ్వాసము ల్బెనఁగొనంగ
నమ్రయై మ్రొక్కి చెంతకుఁ జేరి తద్విశే
షములెల్ల నల్లన సంగ్రహించు
నెప్పుడు సద్గోష్ఠియే కల్గి వర్తించు
వేదాంతవార్తల వినఁగ దివురు.
గీ. అర్థిజనులనుఁ గడుబ్రీతి నాదరించు
బంధుసత్కారములు వింతపగిదిఁ జేయు
నొరులు గుడిచినఁజాలు దా నొందుఁ దృప్తి
తరమె పొగడ నృసింహుసుందరమగుణము.
సీ. ధర్మక్రియాఢ్య యే తరుణీలలామంబు
కరుణాలవాల యే కంబుకంఠి
సజ్జనమిత్ర యే సారసాయతనేత్ర
విజ్ఞానహృదయ యే విద్రుమోష్టి
ఘనసతీనీతివేదిని యే భ్రమరవేణి
సద్గుణసదన యేచంద్రవదన
దీనలోకావనాధీన యే కనకాంగి
భగవత్కథాప్త యేపద్మగంధి
గీ. యట్టిసుందరమే కొనియాడఁదగిన
దన్యలను జెప్పవచ్చునే యన్నిగతుల
పతిపదాయత్తచిత్తసంభావ్యధైర్య
మందిర మ్మలనరసింహుసుందరమ్మ.
క. అనురూపకులవయోగుణ
ఘనమతియై యొప్పునట్టి కాంతామణి భ
క్తిని సతతము సేవింపఁగ
ననితరసామాన్యవిభవహర్షితుఁ డయ్యెన్.
క. నరసింహున కమితశుభా
కరసంహునకు గదర్యకరిసింహునకున్
నిరసితఘోరాంహునకున్
నరసన్నుత సామినేని నరసింహునకున్.