కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/26వ మజిలీ

శ్రీరస్తు

శుభమస్తు ఆవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

మూడవ భాగము

ఇరువదియాఱవ మజిలీ

అందు మణిసిద్ధుండు జపము చేసికొనుచుండగా వింతలంజూడబోయిన గొల్లవాడు వడిగావచ్చి యాయనంజూచి స్వామీ! మీ జపము వేగము కానిండు. మంచి వింతజూచి వచ్చితిని. దాని వృత్తాంతము చెప్పవలయునని తొందరబెట్టుటయు నెట్టకేలకు జపము ముగించి యతం డేమిరా? ఎన్నిసారులు చెప్పినను నీకు దెలియకున్నది. జపాంతరమున నంతరాయము సేయవద్దని చెప్పలేదా? నేమి మునింగినది. చెప్పుమని యడిగెను.

అప్పుడు వాడించుక గొంకుచు స్వామీ ఈ యూరిలో చెఱువుగట్టునొద్ద రెండి నుపకంబము లున్నవి నేనచ్చోటికి బోయి వింతలం జూచుచుండ బ్రాయములో నున్న చిన్నవాండ్ర చిత్రపటముల రెంటిని దీసికొనివచ్చి యా స్తంభములకుం గట్టి రాజభటులు కశలం తీసికొని దెబ్బలంగొట్టిరి. మఱియొక యాడుదాని విగ్రహము నచ్చటనే నిలువంబెట్టి పదువురు మొగముమీద నుమిసిరి. ఇంతలో మఱికొందరు వచ్చి వారికొరకు చింతించుచు వానికట్టుల విప్పించి తీసికొనిపోయిరి. వాని వృత్తాంతమేమియో చెప్పవలయు. నిందులకే మిమ్ము దొందరబెట్టితినని పలుకగా విని భుజించిన వెనుక నంతయుం జెప్పెదనని వాని నొప్పించి భోజనానంతరమున మణివిశేషము వలన నా వృత్తాంతమంతయు దెలిసికొని యా కథ యిట్లని చెప్పం దొడంగెను.

వీరప్రతాపుని కథ

సిందుబా యను నగరంబున వీరప్రతాపుండను రాజు కలడు. అతడు మొదట బద్మిని యను కాంతం బెండ్లియాడి యామెయందు సంతానము గానక క్రమంబున సంతానకారణంజేసి కమలిని కుముదిని మాలిని యనువారలం బెండ్లి యాడి వారివలనను సంతానము పొందడయ్యెను.

అతడు దక్షిణనాయకుడగుట నందఱును సమభావంబునం జూచుచుండెను. కోటలో నలువురకు నాలుగు దెసల దివ్యసౌధంబులం గట్టించి యనల్ప వస్తుపూర్ణములు గావించి నియంతకాలంబున వారియొద్దకు బోవువాడు. మణిభూషాంబరమాలికాదులలో నొక భార్య కేది యిచ్చిన దక్కువారికిగూడ నట్టిదే యిచ్చువాడు. ఈ రీతి సమభావముగా జూచుచు గొన్నిదినంబులు గడిపి సంతానవిహీనచింతచే గృశించుచుండ నొకనాడు మంత్రసిద్ధుడను యోగివచ్చి యతనిచేత నర్చితుండై యందు గొన్నిదినంబులుండెను. ఆ సిద్దుడతని విచారకారణంబు దెలిసికొని దయవచ్చి యా రాజుచే నొకహోమము గావింపజేసి హోమావశిష్టమగు చెరువు భార్యల కిమ్మని చెప్పెను. ఆ సిద్ధుని మంత్రసిద్దివలన నా పాయసము భక్షించిన కొలది కాలములోనే గర్భవతులై యా రాజుభార్యలు నలువురు పదియవమాసంబున నొక్క దిసముననే పుత్రులు గనిరి.

అప్పుడా రాజు పాఱుల కపారముగా షోడశమహాదానములం గావించి జాతకర్మాదివిధుల నిర్వర్తించి విజయభాను రామచంద్రులని నలువురకు సమముగా నేకనామమే యుంచి సంజ్ఞాగ్రహణార్ధమై విజయుడు, భానుడు, రాముడు, చంద్రుడు అని యంతర్నామములు వచ్చునట్లు నామకరణము చేసెను.

అబ్బాలురు పలువురు శుక్ల పక్షశర్వరీపాలునివలే దినదినాభివృద్ధి బడయుచుండిరి. కుమారులు నలుగురికి నించుకేని సంతరము లేకుండిన సమమైన యలంకారములం బెట్టించి వారికల్లు లొండొరులు కలహింపకుండునట్లు చూచుచుండెను. విద్యాభ్యాసకాలమున వారికి వేఱువేఱు విద్యామందిరములం గట్టించి వారి తల్లులచే ననుమోదింపబడిన యుపాధ్యాయులచే విద్య గరపింపజేసెను.

ఆ రాజకుమారులు సమరూఢయౌవనులై విద్యాప్రభావంబున నధికులైరని ఉపాధ్యాయుల వలనం దెలిసికొని యా రాజువారికి వివాహములు సేయ నిశ్చయించి యుత్తమరాజకన్యల చిత్రపటంబులందేర నలుమూలలకు దూతలం బంపెను. వారు పోయి దేశములన్నియుం దిరిగి వారు చూచినవారిలో రూపయౌపనసంపన్నుల నుత్తమరాజకన్యకల చిత్రపటంబులు నాలుగు తీసికొనివచ్చిరి. యాఱేనికి జూపిరి.

తదీయ కులశీలనామంబులు విమర్శించి యా రాజు తన కుమారుల కనుకూలు లగు భార్యలు లభించిరని మిగుల సంతసించుచు వారి చిత్రపటములం గైకొని పెద్దభార్య యొద్దకుంబోయి యిట్లనియె.

బోటీ! ఈ పాటలగంధులు నలుగురు రూపయౌవనవిద్యాసంపన్నులు. సత్కుల ప్రసూతలు అని వారివారి చరిత్రలు వేఱువేఱు చెప్పి వీరిలో నీకుమారున కెవ్వతెం జేసికొందువని యడిగెను. అప్పు డప్పద్మిని పెక్కుగతుల నాలోచించి పద్మగంధినిం గోరుకొనెను. ఆ రాజపుత్రి చిత్రఫలక మా పద్మినికిచ్చి తరువాత నారాజు రెండవభార్య కమలిని యొద్దకుంబోయి యా చిత్రఫలకముల వృత్తాంతము చెప్పి ఈ మువ్వురిలో నీ కుమారున కెవ్వతెం గోరుకొనెదవని యడిగెను. అప్పు డమ్మగువ వానిని విమర్శించి నాలుగవది యేదియని యడిగెను అది పద్మిని కుమారునకు నిశ్చయించి యామె కిచ్చితినని యతండు చెప్పెను బాగుబాగు మంచి రాజపుత్రిక నిష్టముగలభార్య కొడుకునకు బెండ్లిచేయ నిశ్చయించి యీ కొరమాలిన కన్యలం జూపించి యెవతెకావలయునని యడుగుచుంటిరా? వీరి మువ్వురిలో నొక్కతెయు నాకక్కర లేదు. ఇష్టముండిన నా పద్మగంధినే నా కుమారునికి బెండ్లి చేయుడు. లేకున్నమానివేయుడని చెప్పినది.

అప్పుడా రాజు కాంతా! నీవేమియు నెఱుంగవు? పద్మగంధికంటె వీరు తక్కువవారుకారు. నామాటవిని వీరిలో నొకపాటలగంధి గోరుకొమ్మని పెక్కుగతుల బ్రతిమాలుకొనెను. గాని యానాతి సమ్మతించినది కాదు. అప్పుడతండు కానిమ్ము పద్మిని దీనికంటె గుణవంతురాలు. దానినెట్లో సమాధాన పఱుపవచ్చునని యాత్మగతంబున నిశ్చయించి యువతీ! నీ కుమారునకు బద్మగంధి నిచ్చిన సంతసింతువుగదా యనుటయు, నామె సమ్మతింతునని యుత్తరమిచ్చినది.

ఆమాటవిని రాజు వెండియు బెద్దభార్యయొద్దకు బోయి సానునయముగా నిట్లనియె. ప్రేయసీ! ఇటుచూడుము. ఇమ్మత్స్యగంధి విద్యలలో నసమానురాలట. నీవు కోరుకొనిన పద్మగంధికి విద్యాగంధమంతయులేదని నాకు రహస్యముగా దెలిసినది. రూపముగూడ సామాన్యమేనట. రంగులచే నట్లు మెరయజేసిరి. ఈరహస్యము నాకొక గూఢచారునివలన దెలిసినది. కావున నీకుమారున కదితగదు ఈ మత్స్యగంధిని బెండ్లి చేసికొనుము. నీయందుగల మక్కువచే నింత చెప్పితినని పలికిన విని యక్కలికి నాథా! మీరు చెప్పినది యథార్థమే. కపటముకాదుగదా? నాకుమారుడు మీకుమారుడు కాడా? ఎవ్వతెయైన నొకటెయని మత్స్యగంధి ప్రతికృతిం గైకొని పద్మగంధి చిత్రఫలక మతినికిచ్చినది.

దానింగైకొని యారాజు రెండవభార్యవద్దకు బోయి, ముదితా! ఇదిగో నీవు కోరిన మదవతి చత్రపటము దీసికొనివచ్చితిని గైకొనుమని పలికెను. పెద్ద భార్య యొద్ద జరిగిన సంవాదము గూఢచారిణికతన వినియున్న కతంబున మొగము ముడుచుకొని యాపడతి చాలు చాలు నీ ప్రేమానుబంధము తెలిసినది. చెప్పినమాటలన్నియు నిజములే యనుకొనుదానను విద్యలేని పశువును గురూపిణి బెండ్లియాడి నాకుమారుడానక బరితపింపనేల? నాకుమారుడు బ్రహ్మచారిగానే యుండును. మంచికన్యకల నీప్రియకుమారులకు బెండ్లిచేసికొనుడని పలికి తలవాల్చుకొని కన్నీరు విడువంజొచ్చినది అప్పుడు స్త్రీ హృదయముకన్న క్రూరమైనది వేఱొకటి లేదుకదా? యని నిశ్చయించుకొని అతివా? నేనేమి లోపము చేసితిని. నీవు కోరిన చిన్నదానినే తీసుకొనివచ్చితిని. ఇప్పుడు నన్నూరక నిందించుచున్న దానవు. నీయభిప్రాయమేమి ? నీవెట్లు చెప్పిన నట్లు నడచువాడను నీయభిలాష మెఱింగింపుమనిన నత్తన్వి ఏమో? మీమాటలు నిజమని పద్మగంధిని గోరితిని. కపటముచే యనిపించిరని యెవ్వరికి దెలియును? పోనిండు మత్స్యగంధినే నాకుమారునకిండు అనిపలికిన విని యారాజు బోటీ! ఈమాటయైన నిక్కువమేనా? చెప్పుమనుటయు నానాతి యిందు మఱేమియునుం గపటము లేదుగదా? మీమాటలెవ్వరు నమ్ముదురు? అని పలికినది.

నిన్ను మోసపుచ్చి నీకుమారున కొకవెర్రిదాన్ని గట్టిపెట్టవలెనని నాకున్నది. వాడు నీకేగాని నాకు గుమారుడు కాడుకాబోలు. చాలులే ? స్త్రీ చాపల్యంబునం బలికెద వని యాక్షేపించుచు గానిమ్ము పద్మగంధిని పద్మిని కుమారునికిని మత్స్యగంధిని కమిలినీ కుమారునకును బెండ్లి చేయుటకు నిశ్చయించి పద్మిని తానెట్లు చెప్పిన నట్లు వినునదికావున నప్పటి కప్పడతియొద్దకు బోక మూడవభార్య యొద్దకు బోయి యామెకా చిత్రపటంబులజూపి యీమూటిలో నేబోటి నీకుమారున కనుకూలించునో చెప్పుమని యడిగెను. అంతకుపూర్వమే యంతఃపురచారిణుల వలన వెనుకటి సంవాద మంతయు తెలిసికొనియున్న కతంబున కుముదిని చురచురం జూచుచు నిట్లనియె.

ఇప్పుడు నాకుమారునకు వివాహమవసరములేదు. బ్రతికియుండిన బెండ్లి కాకయుండునాయేమి? మీ ప్రియపుత్రులకుం జేసికొనుడు దీని నాకు జూపనవసరం లేదని త్రోసివేసినది. ఆప్పుడతడయ్యో! నిదేమి పాపము కారణములేకయే కోపింతు వేల. నీకుమారున కేమిలోపము చేసితినని యిట్లంటివని పలికిన నచ్చెలువ అగునగు లోపము చూపవలయునా? దేశములనుండి నాలుగు చిత్రఫలకములు వచ్చియుండ మంచిది, యిచ్చవచ్చిన మచ్చకంటి కిచ్చి తక్కినవి చూపుట లోపముకాదు కాబోలును. దానిందెచ్చి చూపిన సంతసింతుముగదా? అని పలికినది.

అప్పుడారాజు దేవీ! అది వీనికన్న మంచిదికాదు. ఒకరుకోరినం దానినిం గోరిన నేమి చేయుదును? అందఱు నొక్కదానినే కోరిననెట్లు? ఈ నలుగురు కన్యకలు ఇంచుకభేదము లేనివారని వినియుంటి కావున నీకొక రహస్యము చెప్పెద. వీరిలో పుష్పగంధి మిక్కిలి తెలివిగలదట. దాని నీకుమారునకుం జేసికొనుము. నామాట వినుమని బ్రతిమాలుకొనెను. ఎంతజెస్పినను నాకాంత యామువ్వురిలో నొక్క దానిని సమ్మతింపక మత్స్యగంధినే కోరుకొనెను. అప్పుడతండు విసిగికొనుచు నాలుగవభార్య యొద్దకు బోయి యాపటముల మూడింటినిజూపి మునువోలె నడిగిన నప్పడంతియును లోపలివార్తల దెలిసికొనియున్నది కావున మత్స్యగంధినే కోరుకొనియెను.

అప్పుడారాజు వీరందరికన్న బుష్పగంధి నెక్కుడు విద్యావతియు రూపవతియునని నమ్మిక పుట్టునట్లుచెప్పి పుష్పగంధించేసికొనుటకు మాలిని నొప్పించెను. ఆ రహస్యము వారెట్లో తెలిసికొని వెండియు నడుగుటలో పుష్పగంధియే కావలయునని కోరిరి. మఱియొకమారు అందరు కమలగంధి కావలయునని కోరిరి. ఒక్క మాటయు స్థిరముగా జెప్పక యెవరు కోరినదానినే తక్కినవారు కోరుచు తుదకా నృపోత్తముని చిత్తము వ్యసనాయత్తము గావించిరి.

అట్లు కొన్నిదినంబు లారాజు వారితో బ్రసంగించి యెవ్వరి మనస్సును దృప్తిపరుపలేక విసిగి యొకనా డాత్మగతంబున నిట్లు తలంచెను. సీ! స్త్రీహృదయము కన్న వక్రమైనది మఱియొకటి లేదుగదా? ఎట్టిపనినైన జేయవచ్చునుగాని స్త్రీ చిత్తము చక్కపఱుపజాలము. బ్రహ్మసృష్టిలో హెచ్చుతగ్గులు లేకుండునా? వీ రేమియుం దెలిసికొన సాపత్నీమాత్సర్యమునం జేసి నన్ను వేపుచున్నవారు. ఇక నాదక్షిణనాయకత్వము నిలువదు. వీరిని నేను సమాధానపఱుపలేను. ఎవరియిష్టము వచ్చిన కన్యను వారే పెండ్లి చేసుకొందురుగాక. నాకీ శ్రమయేలనని తలంచి యప్పుడే కుమారుల నల్వుర రప్పించి యిట్లనియె.

వత్సలారా ! మీకు వివాహము చేయవలయునని యుత్తమ రాజపుత్రికల చిత్రపటంబుల నేరితెప్పించితిమి మీతల్లులు నొకతె కోరినదే తక్కిన మువ్వురు గోరుచు దేనికిం దృప్తిపొందిరిగారు వారిని సమాధానపఱుప బ్రహ్మవశముకాదు. ఇదివరకు మీకు నలువురకు సమానముగా వస్తువాహనాదు లేర్పరచితిని. స్త్రీలలో నించుకభేదము లేక యొక్క పోలికగా నుందురా? కావున మీ వివాహములు నేను చేయజాలను. మీకు కావలసినంత ద్రవ్యమిచ్చెద మీరు దేశాటనము చేసికొని మీ యిష్టమువచ్చిన కాంతను బెండ్లియాడిరండు. పొండని పలికెను.

ఆ మాటలకు నారాజపుత్రులు సంతసించుచు తండ్రియాజ్ఞ ననుసరించి తల్లులకు చెప్పి పెక్కుద్రవ్యము సంగ్రహించుకొని శుభముహూర్తంబున దేశాటనమునకు వెడలిరి వారు వెడలునపుడు సంవత్సరమున కొకసారి కలిసికొని మాటలాడుటకు దగిన నెలవుల నిరూపణము జేసికొనిరి.

విజయుని కథ

అందు శుభముహూర్తంబున విజయుడు ఇల్లుతరలి, తురగారూఢుడై ప్రధానాయుధంబుల ధరించి తూరుపుముఖముగా బోవుచు బదిదినంబుల కనేకదేశములు కడచి యొకనాడు సాయంకాలమున కొకపట్టణమునకు బోయెను.

అప్పటికి జీకటిపడినది గ్రామములో నెచ్చటికి బోవలయునో తెలియక తన కప్పటి కొకచోట గనంబడిన చావడిలోదిగి గుర్రమును గట్టివైచి యా రాత్రియందు వేగింపదలంచి నేల శుభ్రపరచుకొని కూర్చుండెను. డామూల జాడవెలుతురు గనంబడుటయు నందు మనుష్యులుందురను ధైర్యముతో నెద్దియో యడుగుటకై యచటికిం బోయెను ఆ వెలుతురొక శ్మశానమై యున్నది సగము దగ్ధమైన శవముతో వెలుగుచున్నది. అందెవ్వరునులేరు. అతండు వెఱువక యాలాటి కాటిమంటలు రెండుమూడుచూచి యోహో! ఇది శ్మశానభూమి. తెలియక నిందు నివసించితిని. ఈచావిడి యిందు ప్రేతకర్మల నిమిత్తము గట్టియుండబోలు. కానిమ్ము దీనికి వెఱువ నేల అని ధైర్యమే తనకు సహాయముగానుండ నాచావడిలో గూర్చుండి నిద్రబోక ప్రొద్దుపొడుపున కెదురు చూచుచుండెను.

అట్టు కొంతసేపుండ నొకమూల గుభేలుమని చప్పుడైనది. ఆధ్వని విని యతం డదరిపడుచు నాదెసం బరికింప నొకమందస మందు బడియున్నది. దానింజూచి యతడు లేచి దాపునకుంబోయి యోహో! ఇది కోటగోడలాగున్నది. దీనిలోమండ యీ మందస మిందువైచిరి. ఇది చోరులపనికావచ్చును. దీనిలో నేమియున్నదో చూచెదంగాక యని మండుచున్న శ్మశానములోని కొఱవి నొక దానిం దీసికొని యా పెట్టెమూత విడదీసి చూడ నందొకసుందరి మూర్చ జెందియున్నది.

ఆయగ్ని వెలుంగున నాయంగన మొగముజూచి వెరగుపడుచు ఆహా! ఇట్టి కాంతను నిందు బారవైచిన కఠినాత్ముడెవ్వడో? ఈ సుందరికి బ్రాణము లింకను కంఠమునందున్నట్లు పొడగట్టుచున్నది. ఈ పెట్టెయందిమిడ్చి నొక్కుటచే బ్రతుకుట దుర్లభమని తోచుచున్నది. కానిమ్ము నాకుదోచిన చికిత్సఁ జేసి చూచెదనని మెల్లననందుండి యా సుందరిం బైకితీసి నిలువ బెట్టిన స్మృతిలేనిదగుటచే నిలువక నేలకొరగినది. అప్పుడతడు భుజముల నానుకొని సందిటంబట్టి యాచావడిలోనికి దీసుకొనిపోయి పరుండబెట్టి యుపచారము సేయుచుండెను.

ఎంతసేపటికిని నాయువతికి స్మృతి రామిఁజేసి తెల్ల వారుచుండ నికనిందుండ రాదని యయ్యండజయానను దనగుఱ్ఱముపై బరుండబెట్టి మెల్లననడిపించుచు నొక బ్రాహ్మణుని యింటికింజని పుణ్యాత్మా ! మేము విదేశస్థులము. ఇది నా భార్య రోగగ్రస్థురాలై యున్నది. రెండు దినంబు లిందుండి చికిత్స జేసికొనియెదను. కొంచెము తావిత్తురాయని యడిగిన నా యింటి యజమానుడు సమ్మతించి తన యింటిలో నొక మూలగది జూపెను.

అందులో నాసుందరిం బరుండబెట్టి యా రాజకుమారు డుపచారముల జేయుచుండ నాటి సాయంకాలమునకు నాయింతికి స్మృతివచ్చి కన్నులు తెరచి వెరచుచు హా! తల్లీ! ఇప్పటికి నీయుల్లము చల్లగానున్నదిగదా? దుష్టబుద్ధివైన నిన్ను నమ్మి నందులకు మంచి పనిచేసితివి. అని పలవరింపుచు మఱికొంతసేపటికి తెప్పరిల్లి నలుమూలలు చూచి యతని మొగము విమర్శింపుచు నిట్లనియె.

అనఘా! నీ వెవ్వడవు? ఈ గృహమెవ్వరిది? నేనిచ్చటికెట్లువచ్చితిని? చెప్పుమని యడిగిన నతండు యింతీ? అంతయుంజెప్పెద కాని నీ ముద్దుమో మెవ్వరికన్నులకు వెగటైనది? నీతళ్కు చూపులు జూచి యెవ్వడోర్వలేక బోయెను? నీ మృదుగాత్రంబులు గట్టి పెట్టెలో బెట్ట నెవ్వరికి జేతులాడెను. నిన్ను మూర్ఛముంచిన క్రూరుం డెవ్వడు? నేను వీరప్రతాపుని కుమారుండ. దేశాటనముసేయుచు నిన్నటిరాత్రి తెలియక నీవీటి స్మశానవాటికలో నివసించితిని. అర్థరాత్రమున నొకపెట్టెతో నెవ్వరో నిన్ను స్మశానవాటిలో బడవైచిరి. అది నేను చూచి నిన్ను జీవించియున్నట్లు నిశ్చయించి యిచ్చటికిం దీసికొని వచ్చితినని యా వృత్తాంతమంతయు జెప్పెను.

ఆ మాటలువిని యప్పాటలగంధి కన్ను లెత్తి చూచుచు ఆర్యా! నా వృత్తాంతం వినుము. నేనీ పట్టణపురాజు బలవర్థనుండను వానికూతురను నాపేరు హేమ. నాచిన్నతనమున మా తల్లి స్వర్గస్థురాలాయెను. మా తండ్రి వెండియు వినీతియనునాతిం బెండ్లి యాడెను. ఆమెకు సంతానము లేదు. దానంజేసి నాయం దీసుబూని యుండునది. నా తండ్రి నన్ను మిక్కిలి గారాబముగా బెంచుచు నాకు సకల విద్యలను నేర్పించెను. నేను సంపూర్ణయౌవననై యున్నతరి నాతండ్రి నాకు వివాహముసేయ ప్రయత్నించెను. ఈ రాజ్యమునకు నేనకర్తనగుదునని మత్సరముజెంది వినీతి నా వివాహప్రయత్నమున కెద్దియో విఘ్నము సేయుచుండునది. ఇట్లుండ మొన్నటిదినంబున మా తండ్రి వేటకు జనియెను. అతండరిగినది మొదలు నన్ను జూడవలయునని పెక్కువార్తల నంపినది. విసిగి తుదకు నేను భయపడుచు నామె మేడకు నిన్నటి సాయంకాలమునం బోయితిని. నన్నుజూచి కడు ననురాగము కలదానివలె కౌగిలించు కొనుచు బీఠంబున గూర్చుండబెట్టి కొంత సేపు మంచిమాటలచే గడపి యెద్దియో ఫలహారము దీసికొనివచ్చి తినుమని చెప్పినది. నాకనుమానము గలిగి యిప్పుడు సైచదనిచెప్పి తినక మూట గట్టికొంటిని. అంతటితో విడువక గంధము పూయించి పుష్పమాలికలువైచి పువ్వులు తురిమి వాసన జూడుమని యెద్దియో పరిమళద్రవ్యముతీసుకొనివచ్చి ముక్కు నొద్ద బెట్టినది. ఆ తావి యాఘ్రాణించినతోడనే నామేను వివశత్వము జెందినది తరువాత నేమి జరిగినదో నేనెఱుగను. నిన్నటి రాత్రియే యీ పని జరిగినది. దేవరకటాక్షవీక్షంబునం బ్రతికితిని నీవు కన్యార్దివై యరుగుచున్నాడవుగదా? నేను మీ పాదసేవజేసికొని జీవించెద నన్ను భార్యగాగైకొమ్మని ప్రార్థించినది.

ఆ మాటలువిని యా రాజకుమారుండు మిక్కిలి విస్మయమందుచు ఔరా! స్త్రీ సాహసము? ద్రవ్యాశయెట్టి పనులం గావించునో! ఆహా! యని ధ్యానించుచుగానిమ్ము దైవము నాకయత్నోపలబ్దముగా నీ చిన్నదాన సమకూర్చెను ఇది రూపంబున దేవకన్యకలం దిరస్కరింపుచున్నది. ఇంతకస్న గావలసినది యొండెద్ది యున్నదని తలంచి యమ్మించుబోడి కభయహస్తమిచ్చి రెండుమూడు దినంబులలో నక్కాంతను స్వస్థతగలదానిగా జేసెను.

మఱియొకనాడు సాయంకాలమున నారాజకుమారుడా చిన్నదియున్న గదిలోనికివచ్చి మెల్లన నిట్లనియె.

తన్వీ! నేనిందాక నంగడికిబోవ నచ్చట నిన్ను గుఱించి జనులెల్లరు నద్బుతముగా జెప్పుకొనుచున్న వారు, రాజుగారు లేని సమయంబున నీవెవ్వరినో తీసికొని పోయితివని నీ సవతితల్లి వేటనుండి వచ్చిన తరువాత రాజుతో జెప్పెనట అప్పుడు మిక్కిలి కోపించుచు నతండు నలుదిక్కులకు దూతలం బంపెనట. అట్టివారిం బట్టి యిచ్చిన వారికి బారితోషికమిత్తునని ప్రకటించెనట. ఈ మాటలే అల్లకల్లోలముగా గ్రామమంతయు జెప్పుకొనుచున్నవారు ఎట్టి కల్పితము చేసెనో చూడుము మన మిందుండుట నెవ్వరేని వినినచో బ్రమాదము రాగలదు. ఇప్పుడు నిజము చెప్పినను నమ్మరు. కావున నెందేని బోవలయు నేమనియెద వనిన నాకదియే యుత్తమమని తోచినదని యాచిన్నది చెప్పినది.

నాటి యర్ధరాత్రంబున నతండాయింతిని తురగముపై నెక్కించుకొని యతి వేగముగా నొకమార్గమున బడి పోయిపోయి కొన్నిదినములకు మఱియొకపట్టణము చేరెను.

అందు సత్రములో బసజేసి మార్గాయాసము వాయ రెండు మూడు దినము లుండెను రాత్రి సత్రమువీథి యరుగుపయిం బండుకొని చీకటిలో నాబోటి యతనితో నార్యా! మన మెన్నిదినము లిట్లు చిక్కులు పడవలయును. మన మెన్నటికైన సుఖపడుదుమా? అని ప్రస్తావముగా బలికినది అప్పుడతండు కాంతా! నీపు జింతింపకుము ఈ పట్టణపురాజు మిక్కిలి సరసుడట. రే పాయనం జూడబోయెదను. ఆయనదర్శన మయినంతనే నీ మేనంతయు బంగారమయము చేసి యేడంతరములు మేడపయిని హంసతూలికాతల్పంబున నిన్ను గూర్చుండబెట్టనా? చూడు నాప్రభావంబని యోదార్చెను.

అట్టి సమయంబున నా పట్టణపురాజు భీమవర్మయనువాడు మాఱువేషము వైచికొని పట్టణవిశేషముల దెలిసికొన గ్రుమ్మరుచు వారి మాటలు విని వెరంగుపడి వీడెవ్వడో మిక్కలి నేర్పరిలాగున దోచుచున్నాడు . నన్ను జూచినంతనే యెక్కుడు సిరిసంపాదించునట ఇది యదార్థమో డాంబికమో చూచెదంగాకయని యప్పటికింటికి బోయి మఱునాడుదయమున సభజేసి సత్రములో విదేశదంపతులు ప్రవేశించి ఉన్నవారు. అందు మగవానిని సగౌరముగా దీసికొనిరండని కింకరుల సంపెను.

వారు వెదకికొనుచుబోయి యవ్వార్త విజయునికి జెప్పిన ముప్పిరిగొను సంతసముతో నతండప్పుడే భార్యకుంజెప్పి గొప్పవేషముతో నాకింకరులవెంట రాజసభకు బోయెను. అతనిం జూచి యానృపతి యేమియు మాటాడక తనదాపుననున్న పీఠంబుపై గూర్చుండ సంజ్ఞమాత్రము చేసెను అతడా పీఠంబునం గూర్చుండి యెవ్వరితోడను మాటలాడక సభాభవనవిశేషములం జూచుచుండెను.

ఆ రాజు మధ్యాహ్నమువరకు సభచేసి పిమ్మట సింహాసనమునుండి లేచెను. సభవారందఱు నాయనతోడనే లేచిరి. విజయుడును నిలువబడియెను. అక్కడనే కొందఱు రాజుగారి సెలవు దీసికొని వెళ్ళిపోయిరి. రాజుగారు తనమేడలోనికి బోవునపుడు మొదటియంతరమున గొందఱు రెండవయంతరమున గొందఱు మూడవయంతరంబున గొందఱు సెలవు పుచ్చుకొనిరి మంత్రి నాలుగవయంతరమువఱకు బోయి యచట నిలువబడి రాజాజ్ఞ పుచ్చుకొనెను. విజయుడు మాత్రము విడువక ఆరవయంతరమువరకు బోయి యందు దేవా! అనుజ్ఞ యిత్తురేని బోయివత్తునని యడిగిన మంచిదని యా రాజు పలికి యేడవయంతరమునకు బోయెను మంత్రిసామంతాదిపరిజన మతనిపోక జూచి యోహో! యెవ్వరు నయిదంతరములకన్న బైకిబోవువారులేరు. ఈతడు రాజుగారి కెట్టియాప్తుడో యని యాలోచించుకొనుచు మొదటియంతరమున నిలువబడియున్న సమయంబున విజయుడు వడిపడి నామెట్ల అన్నింటిని దిగివచ్చి గంభీరస్వరముతో మంత్రి యెవ్వరని యడిగెను. ఆ మాటలకు మంత్రి జడియుచు నేను నేనని మెల్లంగా పలికెను. నీవేనా మంత్రివి. కానిమ్ము మాకిప్పుడు వేగుర ఖననసాధనములతో నున్న కూలివాండ్ర నిప్పింపవలయు, మఱియు నూఱుగజముల గొలుసుతో మున్నూఱురక్షకభటులను దత్క్షణము మాకు సహాయముగా బంపవలయును. ఈ పట్టణములో గొన్ని క్రొత్తవీథు లేర్పఱచవలయునని రాజశాసనమైనది. దీనిలో నేమాత్ర మాలస్యమైనను మీయుద్యోగములు నిలువవు. అని పలికిన భయపడుచు నది నిక్కువమనుకొని చిత్తము చిత్తము మీరు చెప్పినరీతిగా రెండుగడియలలో సమకూర్తు ననియొప్పుకొని యామంత్రి యట్లు సమకూర్చి పంపెను.

ఆరాజకుమారుడు వారినెల్లర వెంటబెట్టుకొని యిరువీథులందు మంచిమేడలు గనంబడిన చోటునకుంబోయి మేడమీదుగా గొలుసులాగించి దీనిమీదుగా గ్రొత్తవీథి వేయవలయు నిందున్నవారెవ్వరు? తత్క్షణమే లేచిపోవలయునని పలికిన నా యజమానుండు వెలుపలికి వచ్చి యా జనమునంతయు జూచి తన యిల్లు త్రవ్వుటకు సిద్ధముగానుండుట దెలిసికొని అయ్యో? క్రొత్తగా గట్టికొంటి పెక్కురొక్కము వ్యయమైనది ఇట్టి మేడ గూలద్రోయింతు మన్న నేమి సేయుదును. అని మొరవెట్టు కొనెను.

అది మాకు దెలియదు. లేచిపోయెదవా? పొమ్ము లేకున్న నిప్పుడే త్రవ్వింతు అడ్డము వచ్చిన బందీగృహమునం బెట్టింతు వీనితో మనకేల త్రవ్వుడు త్రవ్వుడని విజయుడు పనివాండ్ర దొందరబెట్టెను.

అప్పుడు మొఱ్ఱోయని యాయజమాను డేడ్చుచు నతిని పాదంబులం బడిన వట్టిమాటలకు గార్యములు కావని యతడు పలికెను. ఆసూచన గ్రహించి యా యజమానుడు విజయుని దనమేడమీదికి దీసికొనిపోయి గుజగుజలాడి చివరకు నాయింటివిలువలో కొంతసొ మ్మతని కిచ్చున ట్లొడంబడి యప్పుడే యట్లు చేసెను.

అక్కడినుండి వెడలి వేఱొకమేడయొద్దకు బోయి పగ్గము నింటిమీదకు లాగించునంతలో నాయజమానుడును వెనుకటివార్త విని పెక్కురొక్కమిచ్చి యితని సమాధానపఱచుకొనెను ఆ వార్త గ్రామమంతయు మ్రోగినది. కావున విజయు డాజనముతో తమయింటియొద్దకు వచ్చినతోడనే పౌరులు తత్తమగృహాధిక్యమునుబట్టి ద్రవ్యము సమర్పించుచుండిరి. అట్లు సాయంకాలముదనుక తిరుగువరకు నపారమైన ధనము ప్రోగుపడినది.

ఆ ధనమంతయు నొకయింటిలో దాచి యాపనివాండ్రం బిలిచి యీయూరిలో నందఱు మూర్ఖులుగా గనబడుచున్నవారు. ఎక్కడ వీథి వేయుదమన్నను దమయిల్లు పోవునని యేడ్చుచుండిరి. నేను మిక్కిలి భూతదయగలవాడను. ఒకరు చింతించుచుండ నే పనియుజేయజాల గావున నీదినమునకుం బొండు వేఱొకప్పు డాలోచించు కొందమని చెప్పి వాండ్రకందఱుకు కానుకలిచ్చి యంపెను.

అమ్మరునాడే యాయూరిలో నేడంతరములుగల యొకసౌధము వెలకు దీసికొని యేడంతరములయందును అద్దములు పటములు బంగారుమయములుగా నిండించి యేడవయంతరమున హంసతూలికతల్ప మమరించి అందు భార్యతో వినోదముగా గూర్చుండి కాలక్షేపము జేయుచుండెను.

భీమవర్మ నెలకొకసారి రాత్రులయందు మాఱు వేషముతో గ్రామసంచారము చేయును గావున మఱియొకనాడు రాత్రి గ్రామములో ofరుగుచు నొకచోట నద్భుతదీపకాంతులచే బ్రకాశింపుచున్న విజయుని సౌధము జూచి యది యపూర్వమని గ్రహించి యోహో యిది యల్లనాడు సత్రములో బురుండియున్న పురుషుడు చెప్పినరీతి గట్టినమేడ కాదుగద! అయ్యో! ఆతండు తరువాత నేమయ్యెనో విమర్శింప మరచితిని. నాతో నాఱవయంతరమువరకువచ్చి సెలవుపుచ్చుకొనిపోయెను. ఈమేడ యతనిదే యయినచో యింత ప్రజ్ఞావంతు డీపుడమిలోలేడని చెప్పవచ్చును. ఇంతద్రవ్య మత డింతలో నెట్లు ప్రోగుచేయగలడు. కానిమ్ము. రేపు విమర్శించెదంగాక యని యామేడ గురుతు చూచుకొని యింటికి బోయెను.

మఱునాడుదయంబున లేచి మంత్రింబిలిచి సచివా! అల్ల దేవాలయము వీథిలో కుడిప్రక్కగానున్న మేడ యెవ్వనిదో యెఱుంగుదువా? యని యడిగిన నతండు యెఱుగకేమి? యది దేవరవారి ప్రియమిత్రునిదే యని చెప్పెను. నేనెరుంగని ప్రియమిత్రుడెవ్వడనుటయు నల్లనాడు దేవరవారితో నైదంతరములు దాటి పైకి వచ్చినవాడని మంత్రి చెప్పెను.

వానికింతధన మెట్లువచ్చినదని యానృపతి యాశ్చర్యమందుచుండ నయ్యమాత్యుం డితడు చేసినకృత్యములన్నియు నానృపతి కెఱింగించెను అప్పుడా రాజు ముక్కుపయి వ్రేలిడుకొని ఆయ్యారే! వాడెంత నేర్పరి వాని నే నెఱుంగను నన్ను వాడెరుంగడు వాడు వాని భార్యతో ననినమాట యథార్థమో డాంబికమో చూడ వలయునని రప్పించితిని. వాడు చెప్పినంత చేసె. దీన వాని బుద్ధిసూక్ష్మతయు నీదు బుద్ధిమాంద్యమమును తెల్లమగుచున్నది. నాయాజ్ఞయైనదని చెప్పినప్పుడు ఆజ్ఞాపత్రిక యేదియని యడుగక యతని కోరిక ప్రకారము కావించిన నీకంటే మూర్ఖుడీ పుడమిలో లేడు మఱియొకడు వచ్చి నేనిమ్మంటినని చెప్పినచో నెద్దియైన నిత్తువని మంత్రిని బెద్దతడవు మందలించిన గడగడవణంకుచు నతండిట్లనియె.

దేవా! వానికి మీరు వార్తనంపించితిరి. నాకన్న పయియంతరమునకు మీతో వచ్చెను. ఎట్టివాడు గాక యంతదూరము పోవునాయని యతండు చెప్పిన మాటల నమ్మితిని. అంత మోసగాడని యెవరికి దెలియును? అతండు నామీద చేసిన యధికారము మీరయిన నెప్పుడును జేయలేదు. మీ యాజ్ఞాపత్రిక లేక వానికట్టి యధికార మిచ్చుట నాది తప్పని యామంత్రి యొప్పుకొనెను.

అమ్మఱునాడు భీమశర్మ మంత్రిసామంతాదిపరిజనములతో గూడుకొని యతనియొద్దకు బోయిన విజయుడు వారినందఱ నుచితసత్కారంబుల గారవించి యాగమన కారణం బడిగిన నమ్మహారాజిట్లనియెను.

ఆర్యా! మీ కులశీలనామంబులం దెలియగోరి యిచ్చటికి వచ్చితిమి. మీయనన్య చాతుర్యమునకు మెప్పువచ్చె. మిమ్ము బ్రధానమంత్రినిగా జేసికొనుటకు దాత్పర్యముగా నున్నది. నీబుద్ధిబలంబున సురరాజ్యమునయినను సంపాదింపవచ్చును. నీ యందు రాజ్యభారమిడి కొన్నిదినంబులు హాయిగా సుఖించెద. నీయభీష్టమేమని యడిగిన నతండభినందించుచు దన వృత్తాంతమంతయు నారాజున కెఱింగించెను.

అతనిచరిత్రము విని యమ్మహీకళత్రుండు మిగుల సంతసించుచు నప్పుడే యతనికి బ్రధానమంత్రిత్వాధికారమిచ్చి తనముద్రికల నతనియధీనము గావించెను. అదిమొదలు విజయుండు రాజాస్థానమునకు బోవుచు రాజ్యాంగముల జక్కగా భద్రపరచి ప్రజలు మిక్కిలి సంతసించునట్లు తానే రాజ్యము గావించుచుండెను.

ఒకనాడా రాజకుమారుండు తనపేరిట గట్టబడిన సత్రములో బ్రాహ్మణు లెందఱు భుజించుచుండిరోయని భోజనసమయంబున నాసత్రమునకుబోయియి సంతృప్తిగా భుజియించు బ్రాహ్మణులపంక్తుల నడుమదిరుగుచు వారివారి యభీష్టము లడుగుచుండ నందులోఁ దన తమ్ముడైన భానుడు భుజియించుచుండఁ గాంచి గుఱుతుపట్టి యతని వికృతవేషమునకుం గుందుచు భోజనానంతరమున తనయింటికిం దీసికొనిపోయి యేకాంతముగా నిట్లనియె -

తమ్ముడా? నీవిట్లుంటివేమి? సొమ్మంతయు నేమయినది? ఏకాంతనైన బెండ్లి చేసికొనలేదా. పేదబ్రాహ్మణునివలె సత్రంబుల వెంబడి గ్రుమ్మరుచు క్షత్రియధర్మము నీట గలిపితివేమి? ఈదైన్యమేల? ఇంటికి బోయితివికావేమి? నేను నీ యన్నను, విజయుడనని తన వృత్తాంతమంతయు జెప్పెను.

అప్పుడు భానుడు తెల్లబోయి కన్నీరు విడుచుచు అన్నా! నాదైన్యస్థితినేమని చెప్పుదును? నేనట్లు పట్టణంబువదలి క్రమంబున ననేక జనపదంబులం గడిచి యొకనాటి సాయంకాలమునకు గుంభకోణమునకుం బోయితిని అందొక సత్రంబునం బసచేసియున్న సమయంబున గొందరు ధూర్తులు నాయొద్దకువచ్చి నన్నాపాదమస్తకము శోధించి వినయంబుతో మీవృత్తాంతమేమని యడిగిరి.

నేను వారితోఁ గన్యార్థినయి వచ్చితిని ఉత్తమకన్యక లీపట్టణమున నెందేని గలరా? వలసినంత ద్రవ్యమిచ్చెదనని చెప్పితిని. అప్పుడు వాండ్రు నాయొద్ధ ధనమున్నట్లు గ్రహించి మంచిది నీయభీష్టము వచ్చిన కన్యకం దెచ్చెదము కొన్ని దినంబులిందు వేచియుండుమని చెప్పి యది మొదలు నాకెన్నియేని యుపచారములు సేయదొడంగిరి. దానికి నేను మిక్కిలి యానందించుచు వారినెల్ల పరమాప్తులుగా నెంచి మన్నించుచుంటిని.

మఱి నాలుగుదినంబులు గడిచినవెనుక నొకనాడొక చక్కని యువతిని నా యొద్దకు దీసికొనివచ్చి యీపోలిక మచ్చకంటి నీకు గావలయునా? అని యడిగిరి. అమ్ముదితయు నాయెదుట నెన్నేని శృంగారచేష్టల వ్యక్తపరచినది. దానిచూపుల చేతనే నాచేతనము పరాయత్తమైనది. ఆ కాంత నాచెంత నున్నంతసేపు నాకేమియు మాటవచ్చినది కాదు. వాండ్రు కొంతసేపు నాచెంత నాయింతినునిచి యంతలో దీసి కొనిపోయి మరలవచ్చి మిత్రమా! ఏమియు మాటలాడవేమి? ఆ రీతినాతి నీకు బ్రీతియేని చెప్పుము. అనుటయు నాకు లోకానుభవము లేమింజేసి వారికిట్లంటి.

మిత్రులారా : ఆజవ్వని యెవ్వతె? దానిని నేను పెండ్లియాడగూడదా దానిపోలిక బోటిమాట యేటికని అడిగినవాండ్రు అబ్బో! అబ్బిబ్పోకవతి నెన్ని ప్రయత్నములు చేసి తీసికొని వచ్చితిమనుకొంటివి: సాధారణముగా వశ్యమగునా? ఆబోటి కోటీశ్వరులకుగాని వశముగాదు నీవట్టివాడవయితేని చెప్పుము. అప్పడతితో మాటాడెదమని పలికిన విని నాయొద్దనున్న ధనమంతయు లెక్క చూచుకొని కోటికంటె నెక్కుడుగా నుండుటచే వారితో నేనానాతిం భరింపగలనని చెప్పితిని. అప్పుడు వాండ్రు ఆరొక్క మంతయు తమ చేతికిమ్మని యడిగిరి. కాని యాకాంతను నావశముచేయక యియ్యనని చెప్పితిని.

ఆమాటవిని ఆదుష్టులు నన్నొకనా డాకాంతామణి మేడమీదికి దీసికొనిపోయి యొక తల్పంబునం గూర్చుండబెట్టిరి. అంతలో నా కాంత నా చెంతకువచ్చి నా మెడలో బుష్పమాలిక వైచి నన్ను వరించితినని చెప్పినది అప్పుడు నేను సంతోషసముద్రమున మునుంగుచు నాధనమంతయు దానియధీనము చేసితిని. అది మొదలు కొన్ని దినంబులు దానితో హాయిగా వెళ్ళించితిని ఇది పగలు రాత్రి యనుభేదము నాకేమియుం తెలిసినదికాదు. ఎల్లకాల మట్లు సుఖింతుననుకొంటిని. మఱికొన్నిదినంబులు కడచినవెనుక దానితల్లి యట ముసలిది నన్ను జీరి అబ్బాయీ! నీవుపెక్కుదినములనుండి మా యింటవసియించి సుఖించుచుంటివి నీయిచ్చిన సొమ్మంతయు నీ పూవులకు తాంబూలములకు పన్నీటికి నత్తరులకు సరిపోయినది. ఇక మేమెట్లు బ్రతుకువారము. నీ యొద్ద సొమ్మేమయిన నున్న దెమ్ము. లేకున్న బొమ్ము మాపిల్ల మఱియొక వల్లభునిం జూచుకొనునని పలికిన నులికిపడి నేనయ్యో? ఇది నాభార్య కాదా? మఱియొకని నెట్లుకోరుకొనును? ఆధూర్తులు మొదట నాతోనిట్లుచెప్పలేదే? ఇంక నాయొద్ద సొమ్మెక్కడిది? సొమ్మంతయు మొదటనే యిచ్చివేసితినని పలికితిని.

అప్పుడది మేలు మేలు? మేము వేశ్యలము. మావృత్తి నీ వెఱుంగవు కాబోలు మాకు ద్రవ్యమే భర్త ఆధూర్తులు చెప్పిన దినముల కన్న నెక్కడుగా నిన్నిందుండ నిచ్చితివిు. ఇక బొమ్ము . అని నన్ను వీథిలోనికి ద్రోసి తలుపువైచుకొనినది.

వస్త్రావశేషుడైన ఆ ధూర్తులనరయుచు వీథులవెంబడిం దిరుగుచుండ నొకచోట వారు గనంబడిరి వారితో ముసలిది చేసిన కృత్యమంతయు నెఱంగించిన నవ్వుచు మేమేమి చేయుదుమని నామాట వినిపించుకొనక యెక్కడికో పోయిరి అప్పుడు నేను మిక్కిలి దుఃఖించుచు నింటికిబోయిన నందఱును బరిహసింతురని వెఱచికూడుగుడ్డలకు మొగమువాచి యిట్లు తిరుగుచున్నవాడ. మొన్నటిదినము మీయూరు వచ్చితిని. ఇదియే నా వృత్తాంతమని చెప్పెను.

అప్పుడా విజయుడు తమ్మునియవస్థకు మిక్కిలి పరితపించుచు నూత్నాంబ తాభరణంబు లొసంగి కొన్నిదినంబులు తనయొద్ద నుంచుకొని యొకనా డిట్లనియె తమ్ముడా! మన మిల్లువెడలి సంవత్సరము దాటినది. మొదటి సంవత్సరమున కొకసారి కలసికొందుమని నియమము జేసికొంటిమి. మన తమ్ము లచ్చటికి వచ్చి మనకై వేచియుందురు. కావున మన మిప్పు డక్కడకు బోవలయును. ఈ విషయ మిదివరకు మరచితిని. నిన్ను జూడ జ్ఞాపకము వచ్చినదని పలికి యా వార్త భార్యకుం జెప్పిన నాకాంతయు తాను గూడ వత్తునని వేడుకొనినది. అప్పుడు మువ్వురు పోవుటకు నిశ్చయించుకొనిరి. విజయుడు స్వదేశము జూచి వచ్చుటకై రాజునొద్ద సెలవుపుచ్చుకొని యెక్కుడు డాంబికముతో బోయినచో దేశవిశేషములనడుమ దెలిసికొనుట కష్టమని సామాన్యపు ప్రయత్నముతో వెడలి నడుమ జనపదంబులందు వసియించచు దేశవిశేషంబులం దెలిసికొనుచు కొన్ని పయనంబులం గావించెను.

ఒకనా డొకతోటలో బసజేసి విజయుడును భార్యయును గూర్చుండి వినోదముగా మాటలాడికొనుచుండ జూచి భాను డోర్వలేక ఆహా! మేమిద్దరము నొక్కచక్రవర్తికే జనియించితిమి వీనికట్టివైభవము పట్టనేల? నేనిట్టి హీనస్థితి ననుభవించు చుండనేల? దైవమెంత యన్యాయము చేసెను? ఆలాటి బోటితో మాటలాడికొనుచు హాయిగా కాలక్షేపముచేయు భాగ్యము నాకు లభింపకపోయెనే! నేను భార్యలేక నేకాకినై దుఃఖించుచుండ నావంత విమర్శింపక నితండు భార్యతో నెట్లానందించుచున్నాడో? కానిమ్ము? వీడు నిద్రించుచుండ వీని జంపి యీ కాంతను స్వాధీనముచేసికొనెదను. ఇంతకన్న సుఖించుటకు వేఱొక ఉపాయము లేదని తలంచి వారు నిద్రించువరకు పొంచియుండెను.

ఆదంపతులా రాత్రి గొంతసేపు యిష్టాగోష్టి వినోదములచే బ్రొద్దుబుచ్చి యంతలో నిద్రబోవుటయు నట్టిసమయమున భానుడు మెల్లగాలేచి యొక కత్తిదీసికొని యన్యోన్యాలింగుతులై యున్న యా దంపతులంగాంచి యన్నగారి మెడ గుఱిచూచి యాకత్తితో మెడమీదవేసెను ఆవ్రేటుదిని యావిజయుం డమ్మోయనియరచి చేతనములబాపెను. ఆరోదమువిని హేమ యడలుచులేచి నలుమూలలంజూచి మగనిమెడపైబడియున్న యడిదము విమర్శించుచు గుండెలు బాదుకొనుచుండ నప్పుడు భాను డామెను బిగియం బట్టుకొని బోటీ! నీవేటికి జింతించెదవు? మాయన్న పరలోకగతుడయ్యెను వగచిన రాడుగద? నేను నిన్నంతకన్న నెక్కుడుగా సుఖపెట్టెదను. నాతో రమ్మని పలికిన నక్కలికి పెద్దయెలుంగున నేడ్చుచు హా! దుష్టాత్మా! ఎంతపని చేసితివిరా? మిత్రద్రోహీ? సీ మీయన్న నీకేమి యపకారము జేసెనురా? కామాతురుండవై యిట్టి క్రూరకర్మమున కొడిగట్టుకొందువా? నేను నీవశ మగుదునను కొంటివా? నన్నుగూడ నాకత్తితోడనే నరకుము. పుడమి జిరకాలము సుఖింపగలవని నేలంబడిమూర్చిల్లినది. ఆ సమయములో భానుండయ్యిందువదనను సందిటబట్టి యొక గుర్రముపై నెక్కించుకొని వేగముగా నెక్కడికో తోలుకొనిపోయెను.

అంత మఱునా డుదయంబున దూరముగా బరుండియున్న పరిచారకు లచ్చటి కిఁబోయి చచ్చినట్లున్న విజయునుంజూచి తక్కినవారి నెవ్వరింగానక యందుండినచో నాయపరాధము తమమీద బడునని వెఱచుచు నెవ్వరికింజెప్పక తలయొకదారిం బారిపోయిరి.

అంతట దైవికముగా కొంత ప్రొద్దెక్కినతరువాత నాదారి నొక వైద్యుఁడు బోవుచు గత్తివ్రేటుదిని జీవితముల బాయక యందు బడియున్న యా రాజకుమారునిం జూచి విమర్శించి యావైద్యుడా ప్రాంతమునకుఁబోయి కొన్ని మూలికల యాకులం దీసికొని వచ్చి యా గాయమునందు పసరుబిండి యాకత్తిదీసెను.

ఆ పసరుమహిమ యెట్టిదో వెంటనే కుత్తుక యత్తుకొన నతండు నిద్రలేచినట్లులేచెను. అప్పుడా వైద్యుడు విజయునిజూచి నీవెవ్వండవు? నిన్నెవరిట్లు చంపిరి? నీ యాయువు దృఢమైనది నాకుగాక యీ వైద్యము మఱియెవ్వరికిం దెలియదు. దైవనియోగంబున నిన్ను వ్రేసిన వారాకత్తియందుంచిరి. కాని తీసినచో నప్పుడే చచ్చిపోవుదువు. నీవిట్లు దిక్కుమాలి యొక్కరుఁడ నీచెట్టుక్రిందంబడి యుండితివేల అని యడిగిన నతం డతనికి నమస్కరింపుచు దనవృత్తాంత మంతయు జెప్పి మహాత్మా! నిన్ను నాభాగ్యదేవతగా దలంచెదను. నీయుపకృతికేమియు బ్రతికృతి గావింపనేర? యావజ్జీవము నిన్ను స్మరించుకొనుచుందు. నీకతంబున జీవింపగలిగితి. నన్ను జంపినవాడు నా సోదరుడు కావలయు. వానికి నాయందింత అసూయ యుండుటకుగారణము కనంబడదు. ప్రాణప్రియురాలై న భార్య యిట్టిపని చేయునా ఏమనుటకుం దోచకున్నది. ముందు నిజము దైవమే చెప్పునని పలికి మిక్కిలి విలువగల తనవ్రేలి యుంగర మా వైద్యునకు గానుకగా నొసంగి యంపి తాను మొదటబోవ నిశ్చయించుకొన్న తావునకు బదిదినములకు బోయెను.

అందొకచోట తన నిమిత్త మెదురుచూచుచున్న కడపటి తమ్ముడు చంద్రుడు గనంబడుటయు కౌగిలించుకొని తమ్ముడా? ఇక్కడకువచ్చి యెంతకాలమైనది? మా కొరకు వేచియుంటివి కాబోలు. రాముడు కనబడెనా? ఎందెందు దిరిగితివి? ఏమేమి వింతలంగంటివి. వివాహమాడితివా? నేను నిన్ను జూడకయే పోదును. దైవనియోగంబున బ్రతికితినని తాను పురము వెడలినది మొదలు నాటి తుదవరకు జరిగిన కధ యంతయు జెప్పెను.

ఆ కధవిని హర్షసంభ్రమశోకంబులు మనంబునం బెనగొన చంద్రుడు యేమీ! మన భాను డెంత జేసెను. అన్నా వాడు సేయకున్న నందుండకపోవునా? జాతివైర మూరకపోవదు. నా వృత్తాంతములు సవిస్తరముగా జెప్పెద నాకర్ణింపుమని యిట్లు చెప్పదొడంగెను.

చంద్రుని కథ

అన్నా మనమందర మొక్కసారియేకదా పట్టణము వదలిపోయితిమి. నేను మొదట నుత్తరదేశమునకుబోయి అందు బ్రసిద్ధములయిన పట్టణములందు విమర్శిం చితి యుత్తమలక్షణములుగల రాజకన్యకలవార్తల దెలియక నటనుండి పశ్చిమదేశంబునకుం బోయితిని. ఆచ్చటను నామదికెక్కిన రాజపుత్రికల చారిత్రంబులు వినబడ లేదు. ఒకనాడు కొందరు సిద్దులు మహాశివరాత్రికి శ్రీశైలమునకుం బోవుచుండ నేనును వారిం గలిసికొని శ్రీశైలమునకుఁ బోయితిని. మహాశివరాత్రి దినంబున పాతాళగంగలో స్నానము చేసి మల్లిఖార్జున మహాదేవుని లింగంబు పాతాళ గంగాంబువులచే నభిషేకము గావించి బిల్వదళంబులం బూజించి భక్తివిశ్వాసములతో నందొకచోట గొందఱు భక్తు లప్పర్వతప్రభావంబు జదువుచుండ నాదండం గూర్చుండి సాంగముగా నా వృత్తాంతమంతయు నాలకించితిని.

ఆ కథలో శ్రీశైలంబునం గల గుహావిశేషంబులు మార్గంబులు చక్కగా వ్రాయబడియున్నవి. వానిలో వామనగుహావృత్తాంతంబు స్వాంతంబున గుఱుతుపెట్టుకొని యమ్మఱునాఁ డుదయంబున బాతాళ గంగానదీకూలము వెంబడి తూరుపుగా గొంతదూరము నడచి పురాణములో జెప్పినగుఱుతులఁ జూచికొని పై కెక్కి కొంత దూరము బోయి చూడ నొకబిలము గనంబడినది

దానిముఖంబున వామనమూర్తి విగ్రహముండుట జూచి యిదియేగదా వామనబిలమని నిశ్చయించి సాహసముతో నందు బ్రవేశించితిని. అది కొంతదూరం నడచిపోవునంత విశాలముగానున్నది. క్రమంబున జిన్నదగుచుండుటచే వంగి కొంత దూరము నడువవలసివచ్చినది. మఱికొంతదూరము చేతులతో నానిపోయితిని. గాఢాంధకారములో నేమియు గనఁబడకుండుటచే జేతులతో దడిమికొనుచు దైర్యము చెదరనీయక మెల్లగా మఱికొంతదూరము పోయితిని దివారాత్రిభేదము తెలియమి నెన్నిదినములు పోయితినో తెలియదు. పోయినకొలంది యాబిలము చిన్నదగుచు మెలికలుగా నుండుటచే నతిప్రయత్నముతో దాటి కొంతమేర బరుండియే ప్రాక దొడంగితిని. అట్లతిషముగా గొంతదూరము ప్రాకి పిమ్మట నిటునటు కదలుట కవకాశముగానక తొట్రుపడుచు మనంబున బెదరుదోప వచ్చిన పయనంబంతయు నిష్ఫలంబయ్యెనని చింతించుచు నక్కటా! నేనక్కడక్కడ గ్రుమ్మరి యింటికింబోక నీ శ్రీశైలంబున కేమిటికి వచ్చితిని? వచ్చితివిబో పురాణవచనంబులు విన గుహాప్రవేశాభిలాషయేల కలుగవలయును? ఇట్టి మార్గంబులుండిన నందఱు బోవుచునే యుందురు నాకీ గుహాంతరంబున మరణంబు విధియించి యున్నవాడు కాబోలును. అన్నా వెనుకకు బోవుదమన్నను శక్యముగాక యున్నది. ఊపిరి వెడలుటకైన నవకాశములేదు ఇక రెండుమూడు గడియలకన్న బ్రాణంబులు నిలువవు. భగవంతుని ధ్యానించుటకంటె వేఱొక చింత లెన్నకాదని కన్నులు మూసికొని భగవంతుని ధ్యానించుచు బ్రాణోత్క్రమణసమయ నరయుచుంటిని.

అట్లు కొంతసేపు ధ్యానించునంతలో నా చెవులకు మనోహరమైన వీణాగాన మొకటి వినవచ్చినది. అప్పుడు నేను గన్నుల దెఱచి చూచుచు అయ్యో! నేనింకను బ్రతికేయుంటిని. ఈగాన మెచ్చటినుండి వచ్చుచున్నదో? మరణావసరంబున నిట్టి నాదంబులు వినంబడునేమో? అని తలంచుచుండ నాధ్వని మఱియు విపులమగుట నాబిలములోనుండి వచ్చుచున్నట్లు తెలిసికొంటిని.

అప్పుడు నాకు వెండియు జీవితాశ పొడమినది. చేతులు రెండును బైకిసాచి గుహకుడ్యనివరంబుల వ్రేళ్ళంజొనిపి జయపరమేశ్వరా! యని కాళ్ళచే నెగద్రోసితిని. ఆ త్రోపువలన బారెడు పైకి బోవ శక్యమైనది. అది భగవంతుని కటాక్షము వలన గలిగిన యవకాశమని సంతసించుచు నాపైన రెండుబారలు సులభముగా డేకితిని. పిమ్మట కొంచెము బిలము పెద్దదిగా గనంబడుటచే సులభముగా మఱికొంతదూరముపోవ శక్యమైనది. అంతకంత కాబిలము విశాలముగా నొప్పుచుండుటచే తుదకు నిలువంబడి కొంతదూరము నడిచితిని.

అప్పుడొక వెలుతురు నాకన్నులకు దారిజూపినది పిమ్మట జక్కగా నూపిరి విడచుచు నరకకుహరంబు దాటినట్లు సంతసించుచు నిం దేవేని విశేషము లుండక మానవని యా గాననాదంబు లేతెంచిన జాడ నరయంగోరి తదభిముఖముగా బోవుచుండ గొంతసేపటికి నానినాదము వినంబడినదికాదు. నేను వెఱగుపడుచు దైర్యమే తోడుగా గొంతదూరము వోయినంత విశాలమగు కదళీవనంబు గసంబడినది. అందెవ్వరునులేరు సూర్యబింబము గనంబడలేదు. అద్భుతమైన తేజంబొకటి పట్టపగలు లాగున దృష్టులకు సహాయము చేయుచుండెను. దానంజేసి యందు నిర్భయముగా విహరింప శక్యమయ్యెను. నాకు మిక్కిలి యాకలియగుచుండెను. పండియున్న కదళీఫలంబుల దృప్తిగ భక్షించి యందున్న తటాకజలంబులం గడుపునిండ జలంబుగ్రోలి యొక చెట్టుక్రిందం బండుకొని గుహాగమనాయాసము వాయ గొంతసేపు గాఢముగా నిద్రబోయితిని.

అంతలో లేచి యేమియుం దోచక యాకదళీవనంబంతయు దిరుగుచుండ నొకమూల మార్గంబొండు గనింబడినది. దానంబడి కొంతదూరము పోయితిని. అక్కడ వేఱొక యావరణము దానిలోని కొకద్వారమునుం గనంబడుటయు నిర్భయముగా నాద్వారమునుండి యా యావరణములో బ్రవేశింప నందున్న రత్నకాంతులు నా కన్నులకు మిఱుమిట్లు గొల్పినవి.

అప్పుడు నేను గన్నులమూసికొని కొంతసేపటికి మెల్లగా దెరచిచూడ విశాలమగు స్ఫటికశిలామంటపం బొండు కన్నులపండువ గావించెను. అందు బిల్వదళాళిచే నర్చింపబడిన స్ఫటికలింగం బొకటి విరాజిల్లుచున్నది. ఆ ప్రాంతమందు వీణయొకటి మేళగించియున్నది. మఱియు నందు బూజాపాత్రంబు లెన్నియేని యమరింపబడి యున్నవి ఆ మంటపమునకు తూర్పుభాగమున రత్నసోపానములచే మెఱయుచున్న తటాకంబొకటియున్నది. అట్టి విశేషములన్నియుంజూచి నేను నివ్వెరపడుచు నిది దేవభూమి కాబోలును, ఎవరో యీస్వామిని నర్చించిపోయిరి. ఇందాక నాకు వినిపించిన గాననాదం బీ వీణెవలనం బుట్టియుండవచ్చును. అమానుషంబులగు విశేషంబులం జూడంగంటి. నాజన్మమున కిదియే చాలును. నేనును నిమ్మహాలింగంబు నర్చించుచు నిందు ముక్తిం బడసెదను. మహాత్ము లెవ్వరో యిందు గ్రుమ్మఱుచున్నవా రని తలంచుచు హర్షపులకితగాత్రుఁడనై యచ్చటి విశేషంబులం జూడ నందందు విహరింప దొడంగితిని.

వేఱొకమూల మఱియొక ద్వారము గనంబడినది. దానింజూచి దెలిసినది. ఎవరో యీ మార్గమునవచ్చి యీ లింగమును బూజించుచున్నారు కానిమ్ము. వారి వృత్తాంతము తెలిసికొని వచ్చెద జూచిరి. నంతమాత్రముననే శపియింతురా? కఠిన హృదయులై యెవ్వరేని శపియించిన బడియెదగాక. పూర్వకృత్యములు తప్పునాయని యూహించి యా ద్వారమార్గంబున బడి యతిసాహసముతో గొంతదూరము పోయితిని.

అచ్చట గుడియెడమలకు రెండుద్వారము లున్నవి. దేనివలన బోవలయునని కొంతసేపు ధ్యానించి యెడమవైపుదారిం బోవలయునని తలంపు పుట్టినందున నట్లు పోవబోవ నాదారి యొక కొండశిఖరము మీదికి దీసికొని పోయినది. వెనుకకు దిరిగి చూడ నేను వచ్చిన గుహాముఖద్వారము గనంబడినదికాదు. అప్పుడు నేను మిక్కిలి పరితపించుచు అయ్యో! నేనా గుహాంతరమున నుండక యిట్లు రానేల? ఆ రెండవదారింబోయిన నుచితముగా నుండును. నా కిట్టిబుద్ధి యేమిటికి బుట్టవలయును ఇక నాజన్మమున కట్టి వింతలంజూచు భాగ్యముగలుగునా? ఆహా! ఆ కదళీవననివాససౌఖ్యంబు లెన్నిజన్మములకైన మఱువనగునా? అమ్మణిమంటపశోభ లెప్పుడో విమర్శించి చూచెదంగాక యని యపేక్షించితి ఏదియు లేకపోయెను.

నా కాయకష్టమంతయు నీయడవికైనది, ఇచ్చటినుండి యెక్కడికిబోవుదును. తెరువెద్దియుం గానంబడదు. సీ యిక నాకు జీవితముతో బనియేమి? ఇచ్చటనే పడి యుండెదను. ఏ క్రూరసత్వమో నన్ను భక్షించుగాక యని తలంచుచు నందొకచెట్టు క్రింద జతికిలంబడితిని.

అంతలో నా ప్రాంతమునుండి యొక యేనుగు కనకకలశంబు తొండమునం బట్టుకొని క్రిందికి బోవుచున్న యది. దానిజూచి నేను వెఱుగుపడుచు నిది యడవి యేనుగు కానియట్లది ధరించిన కలశంబు తప్పక చెప్పుచున్నది. ఇది యెవ్వరిదై యుండును? పెంపుడుదై నను నియంత యుండవలయును. ఇది జలానయనార్ద మగుచున్నట్లు తోచుచున్నయది. ఇది దేవభూమి కావున నమానుషప్రభావంబు లుండక మానవు. దీని పోయెడిరీతి నరసెదంగాక యని యించుక యెడముగా దానివెంట నడువ దొడంగితిని.

అది క్రమంబున నా కొండదిగి పాతాళగంగ యొడ్డునకుబోయెను. అందు గొంతదూరము పాతాళగంగలోనికి సోపానములు గట్టబడియుండెను. అమ్మాతంగము మెల్లగా నా పాతాళగంగలోనికిం దిగి యా కలశంబు నిండించుకొని తిరుగా వచ్చుచున్న సమయంబున నేనతి సాహసముతో నెదుర నిలువంబడితిని. అప్పుడది నన్ను జూచి బెదరక, అలుగక యట్టె నిలువంబడుటయు నాకు నేనుగుల నెక్కుపాటవము గలిగియున్నందున దాపునకుబోయి తొండముదట్టుచు నది యూతగాబూని దానిపయి కెక్కి కూర్చుంటిని. నా సాహసము దలంచుకొన నాకే యబ్బురముగా నున్నయది.

ఆ కొండ కడు నునుపుగా నుండుటచే నెక్కుట కడుదుర్ఘటమయినను నా వేదండం బతిపాటవముగా దృటిలో నెక్కినది. అది యెక్కడికిఁబోవునో యను తలంపుతో నేను జూచుచుండ నేమును వచ్చిన గుహముఖంబున బ్రవేశించినది. బ్రవేశించినతోడనే నాకు గుఱుతు తెలిసినది నేనప్పుడు మితిలేని యానందంబు జెందుచు బరమేశ్వరుని కరుణావిశేషంబునం దిరుగా నచ్చటికి బోవ దటస్థించినదని యుబ్బుచుండ విశాలమగు నాగుహలో నాగజము వడిగా నడచుచు నేను మొదట జూచిన స్ఫటికశిలామండపంబున నాకలశంబు దింపినది.

నేనును అందు దిగితిని. అప్పుడా గజము కదళీవనములోనికిం బోయినది. పిమ్మట నేనందున్న తటాకములో స్నానముచేసి యమ్మహాలింగముపై దజ్జలంబు అభిషేకంబు జేసి యందుండు పూవులచే నర్చించి ధ్యానించుచున్నంతలో నమానుషంబయిన పరిమళమొండు నాకు నాసాపర్వము గావించుటయు నెవ్వరో వచ్చుచున్నారని యూహించిలేచి యాప్రాంతమున నొకమూల దాగియుంటిని.

అప్పుడు కొందఱు సుందరులు గుహద్వారంబునుండి వచ్చిరి. వారి జూచి నంత నామేను వణకజొచ్చినది. ఎట్టకేలకు మనస్సు దృఢపరుచికొని వారి యాకార విశేషమునకు నాశ్చర్యమొందుచు నం దణగియుండి వారేమి చేయుదురో యని చూచుచుంటిని.

అప్పు డాకొమ్మలు పుట్టంబులు విప్పి గట్టునబెట్టి యత్తటాకంబులో గొంతసేపు జలకేళిం దేలి వినోదముగా మాటలాడికొనుచు వెండియుం బట్టలందాల్చి యమ్మంటపంబున లింగంబుచుట్టునుం గూర్చుండిరి. వారిలో నొకతె యందున్న విపంచి ధరించి కంఠస్వరంబు దంత్రీనాదంబుతో మేళగించి హాయిగా బాడుచుండ వేఱొకతె పూజాపాత్రంబులు సవరింప మఱొకతె గంథాక్షతాదు లందియ్య నొకసుందరి యాలింగంబు నిర్మాల్యంబుల దీయుచు నబ్బురముతో జూచి బోటులారా? ఈ నిర్మాల్యం బిటులున్న దేమి? యిది మును నేజేసిన పూజాద్రవ్యము కానియట్లున్నది క్రొత్తవారెవ్వరేని వచ్చి పూజించిరా? అని పలికిన నచ్చేడియ లిచ్చటి కెవ్వరు వత్తురు . నీవు మరచి యట్లనుచున్ దానవు. నిర్మాల్యమునకు గుఱుతులేమి తెలియునని పలికిరి.

అప్పు డమ్మగువ మీరట్లనిన నేమిచెప్పుదును. నాపూజ నాకు గుఱుతుకాదా. కానిండు? తరువాత విమర్శింతమని పలుకుచు నా నిర్మాల్యమును దీసి కనకకలశంబునగల జలం బాలింగమున కభిషేకము చేసినది. ఇంతలో మునుపటి మాతంగంబు పెక్కురకముల పూవులును, బత్రియు దీసికొనివచ్చి యందుంచిపోయినది కొందరు చేడియ లాపత్రి నందించుచుండ శివనామముల బఠింపుచు నాకలకంఠి యా స్వామి నర్చింపదొడంగినది.

తరువాత ధూపము దీపముల నిచ్చి తద్గజానీతంబులగు కధళీఫలముల నైవే ద్యంబు గావించినది. ఆ రీతి నానాతి యాలింగమునకు షోడశోపచారపూజలం గావించినది. తరువాత నయ్యంగనలెల్ల కలిసి పికస్వరములతో హాయిగా సంగీతప్రసక్తిచే నా స్వామిని గీర్తించిరి.

అట్లు కొంతసేపు మృత్యుంజయుని వినుతించి మించిన సంతసముతో వచ్చినదారి నమ్మచ్చెకంటులెల్లరు నరిగిరి. వారరిగిన కొంచెముసేపునకు నేను వెలుపలకు వచ్చి విచ్చలవిడి యాయావరణలో గ్రుమ్మఱుచు నాకొమ్మల సోయగము, పలుకులు గానం, తలచితలచి హృదయంబున విస్మయంబు నావేశింపనయ్యారే! నాకు వింతల పై వింతలు గనంబడుచున్నవి. ఇది మహర్షుల యాశ్రమమనుకొంటిని. ఈవాల్గంటులు తెరగంటి నెలంతుకలు కావలయు, లేనిచో నీజవ్వనము నీసోయగము నీలావణ్యము నితర వనితలకుండునా? వీరు నిత్యము నిచ్చిటికి వచ్చుచుందురని తలంచెదను. కానిమ్ము మఱికొన్ని దినములు పోనిచ్చి విమర్శించెదగాక యని నిశ్చయించి కదళీఫలంబులచే నాకలి యడంచుకొనుచు నందు నివసించి యుంటిని.

సూర్యదర్శనాభావంబునం జేసి యందు పవలిది రాత్రి యిది యను భేదమించుకయు దెలియదు. ఎండకును వెన్నెలకును భిన్నమయిన తేజమొకటి సతతము నచ్చట బ్రకాశింపుచుండును.

నేను బ్రాతఃకాలమని తోచిన సమయంబున నా సరస్సులో స్నానము జేసి యమ్మహాలింగమునకు నభిషేకాదిపూజావిధానములు గావించి భక్తిపూర్వకముగా ధ్యానించుచున్న సమయంబున మునుపటిపరిమళము గొట్టుటయు నమ్మచ్చెకంటులు వచ్చుచున్నారని తలంచి సత్వరముగా లేచి మునుపటిచోటనే దాగి వారికృత్యములు చూచుచుంటిని.

ఇంతలో మునువచ్చిన చిగురుబోడు లాగుహలోనుండి వచ్చి యాతటాకములో గొంతసేపు జలక్రీడలదేలి యా మంటపము మీదికి వచ్చి యెవ్వరిపని వారు సేయందొడంగిరి. అప్పుడు శివలింగమును బూజించిన యించుబోణి నిర్మాల్యమును గుఱుతుజూచి బోటులారా? ఇటుజూడుడు. నిన్నను నామాట త్రోసివేసితిరి. నిన్నటి పూవులు మీకు జూపితినిగదా? ఇట్లు మారుటకు గారణమేమియో యూహింపుడని పలికినది.

అప్పుడు మఱియొక చిన్నది భర్తృదారిక చెప్పిన మాటలు సత్యమే. నేనుంచిన పూజాపాత్రలు మాఱి మఱియొకచోట నున్నవి. ఎవ్వరో క్రొత్తవారువచ్చుచున్నారు. విమర్శింపవలసినదే యని పలికినది. మఱియొకతె అయ్యో! నావీణ త్రిప్పబడి యున్నదేమి తంతృలిట్లు సవరించిన వారెవ్వరని నుడివినది. ఈరీతి నందరు తమ పనులు మారుటచే నేకవాక్యముగా గ్రొత్తవారెవ్వరో వచ్చినారని విశ్చయించి యందు నలుమూలలు వెదకవలయునని నిశ్చయించి కానిండు రేపు తర్కింతము, ఈ దివసంబున బ్రొద్దుబోయినదని చెప్పుకొని యా దినంబున యథాప్రకారము నా స్వామి నర్చించి యథాగతముగా వెళ్ళిరి.

అప్పుడు నేను దైర్యముతో మంటపము మీదికి వచ్చి మనంబున నిట్లు తలంచితిని. ఆహా! యీ మోహనాంగులు సౌందర్యమునకు దుదివారు. ఈ లావణ్యవతుల యౌవనము సుపమానభూతముగా జేసికొనవచ్చును. ఇట్టివారి జూచుటచే నాకన్నుల కలిమి సార్థకమయినది. వీరిలో నీశ్వరు నారాధించిన యువతి ప్రధానురాలుగా గనబడుచున్నది. భర్తృదారిక యని పిలచుటచే రాజపుత్రి యని యూహించెదను. వీరి మాటలచే కులశీలనామంబులు తెలియంబడలేదు. దివ్యాంగనలగుట నిక్కువము. వీరీ గుహామార్గంబునం బోయిరి గదా! దీనిఁబడిపోయి నేనును వీరి నివాసం బరసి వచ్చెదంగాక యని నిశ్చయించి యమ్మార్గంబునం బడిపోయినంత గొంతదూరములో మునుపటి రెండు దారులు గనంబడినవి.

ఎడమప్రక్కదారి యెఱింగినదే కావున గుడిప్రక్క మార్గంబునంబడి పోయితిని. కొంతదూరము పోయినంత మఱియొకచోట రెండు ద్వారములు గనంబడినవి. అక్కడ నిలువంబడి యోహో! మునుపొకసారి మోసపోయితిని. ఇప్పుడే దారింబోవలయునో తెలియదు. ఎడమ ప్రక్కదారులు గంతవ్యములు కావని నిశ్చయించి కుడి దెసనున్న ద్వారము ననుసరించి పోయితిని. ఆ దారి పోయిపోయి యొక పర్వతము కొనలోనికి దీసికొనిపోయినది పెద్దతడవు నేను గుహవిడిచినదే ఎరుంగక యొకమూలను సూర్యబింబము కనంబడినతోడనే అయ్యో! నేను బయటకి వచ్చితిని. గుహాముఖ మెందున్నది. ఎంతమోసము జెందితిని. సీ! నావంటి మూర్ఖుడులేడు. ఒకసారి యనుభవించియు బ్రమాదమును బొందువాడుండునా? ఆమంటపమును విడువక నివసింతునని తలంచి యిట్టి ప్రయత్న మేమిటికి జేయవలయును. అయ్యిందుముఖులు ప్రతిదినము వచ్చుచుందురు. పరమనిర్భాగ్యుండ, నాకీ ప్రాయశ్చిత్తము కావలసినదే. మునుపు మాతంగము మూలమున నచ్చటికిం బోయితిని. ఇప్పుడెట్లుపోవుదు ఇందు జావవలసినదే యని యనేక విధముల నిందించుకొనుచు నక్కోనలో గ్రుమ్మరు చుంటిని.

అక్కోనయంతయు బిల్వవృక్షములచేత నావృతమై యున్నది. అందు ఫలములం దిని సెలయేరులోని జలములం గ్రోలి యాకలి యడంచుకొని రెండు మూడు దినములు గడపితిని. ఆ గుహముఖమెందేని గనంబడునేమోయని యా యరణ్య మంతయు గ్రుమ్మఱు చుంటిని. ఏదియు గనంబడినది కాదు. మునుపటివలెనే యే జంతుచయిన లోపలినుండి వచ్చునేమోయని యరయుచుంటిని. యే యాధారముగనంబడక యెక్కడికి బోవుటకును దారి తెలియక గుందుచు నొకనాడు ప్రాణములు పోగొట్టుకొనదలంచి యున్నతమయిన యొక మారేడు చెట్టు చిట్టచివరకెక్కి యొక పెద్దపాషాణము గుఱిచూచుకొని దాని మీదబడి శిరము వ్రయ్యలుచేసికొనదలంచిహా! పరమేశ్వరా! భక్తపరాధీన! కరుణాతరంగితాంతరంగా ఏనిప్పుడు భవదాయత్తదత్తుండ నయి మేను బాయుచున్నవాడ. తరువాత జన్మంబుననైనను స్ఫటికశిలా మంటపమున నిన్ను బూజించెడి యించుబోణి నాకు భార్యగా జేయుదుని పలికి ధ్యానించి భూమిదిక్కు. మొగంబయమును జూచిన పాషాణమున జూడ నేదియు గనంబడినదికాదు.

అప్పుడు నలుమూలలు జూడ నన్నావృక్షమెచ్చటికో తీసికొనిపోవుచున్నట్లు పొడగట్టినది. శ్రీశైలమందు సంచారవృక్షములున్నవని పురాణములో వినియున్న వాడ గావున నది సంచారవృక్షమనియు నన్నెచటికో తీసికొనిపోవుచున్నదనియు దలంచి విధివియోగమునకు విస్మయము జెందుచు నాచెట్టుకొమ్మను బిగ్గరగా బట్టుకొని కన్నులుమూసికొని యాస్ఫటికశిలామంటపమునే ధ్యానింపుచుంటిని. ఆహా! యంత్రస్యందనములును విమానములును పుష్పకములు తన్మహనీయతకు సాటివచ్చునా! కుదుపేమియులేదు. నడచినట్లే యుండదు. వేగమును గొనియాడుచున్నంతలో నాకు మనుష్యుల కోలాహాలము వినంబడుటయు గన్నుల దెరచి చూచితిని.

అప్పుడు మహోన్నతములైన మేడలచే నొప్పుచున్న యొక పట్టణము నడుమ నొక దేవాలయముపొంత నాపాదపము నిలువంబడినట్లు కనంబడినది. ఆ దేవాలయములోనున్న శివలింగమున కనేకులు నానావిధాభిషేకపూజానమస్కారములు గావించుచుండిరి. అవినోదము చూచి నేను మిక్కిలి వెరగందుచు నది యే దేశమో యాస్వామి పేరెయ్యదియో తెలిసికొనవలయునని తలంపుగలిగి యా చెట్టు దిగ బ్రయత్నించునంతలో, అయ్యో! యీతరువు నేను దిగి తిరిగి వచ్చువరకు నిందుండునా? కామగమనము గలది. అదియునుం గాక దీని వదలితినేని యగోచర మగునని తలంచి యావృక్షమును విడువక యందున్న జనుల ప్రార్థనల నాలింపుచుండ నిట్లు విననయ్యె. జయవిశ్వనాథాై! వారణాశీకృతవాస! అన్నపూర్ణా! మనోహరా! భాగీరధీ జలాభిషేకసంతుష్టాంతరంగ! జయహర! హరఃమహాదేవ! శంభో! శంకర ! పాహియని కోలాహలముగా స్తుతిజేయుచున్న నినాదము లాలించి పులకితాంతుండయిన కాశీపట్టణము భక్తజనరక్షకుండైన విశ్వనాధుని బొడగంటిని. కృతార్థుండనైతినని సంతసించుచున్న సమయంబున నంతలో నాగుడి యంతర్దానము నొందినది. తద్వియోగమునకు గుందుచు నలుమూలలు బరికింపుచున్నంతలో నా ప్రాంతమందు బ్రాకారగోపురాదులచే నలంకృతంబగు మఱియొక దేవాలయము జూడనయ్యెను. దాని నిరూపించి చూచి విశ్వనాథు దేవళము కాని యట్లు నిశ్చయించి యది యయ్యెదియో యని విమర్శింపుచున్నంత నాప్రాంతమందలి జనుల స్తోత్రపాఠములచే నది రామలింగేశ్వరునియాలయంబై నట్లు తెల్లమైనది. తదీయ ప్రాకారాదుల విమర్శించునంతలో నాయాలయ మగోచరమై వేఱొక కోవెల గన్నుల పండువు గావించినది. అది మునుపటిరీతి గేదారేశుని నివేశమని యెఱింగి యంతరంగ ముప్పొంగ నప్పరమ శివలింగము నుతియింపుచున్నంత నదియు నంతర్ధాన మైనది. పెక్కులేని నీరీతి క్షణమునకొక యాలయము గనంబడ దొడంగినది. కొన్నిటి నామంబులు తెలిసినవికావు. భూమిలో బ్రసిద్ధములైన క్షేత్రంబులన్నియు నర్థయామమాత్రంబులో వీక్షింపగల్గెగావున నావృక్షరాజమును ప్రత్యక్షదైవమునుగా దలంచుచు నది యెంతవేగముగా బోవునో చూడవలయునని కన్నులం దెరచికొని యున్నాను తద్వేగవిశేషంబుననో మహిమాతిశయంబుననో కాని యేమియుం గనంబడినదికాదు. దిక్కులన్నియు నలికికొనిపోయినట్టుండునవి.

మఱియు నత్తరువరంబు ప్రతిక్షేత్రంబునను నిలిచినప్పుడు దళంబుల విదల్పనవి పతితంబులై వాతాహృదంబులట్ట తత్తల్లింగంబులంబడునవి. అట్టి విశేషములన్నియు జూచుచు నేనానందసాగరమగ్న హృదయుండనై యాహా! అయత్నోపలబ్దముగా నాకఖిలదివ్యక్షేత్రాలోకనసుకృతము గలుగజేసిన మదీయపురాతనభాగదేయంబేతాదృశంబే! సుఖము దుఃఖమునకు దుఃఖము సుఖమునకు నొక్కొక్కప్పుడు కారణంబులగునని చెప్పిన యార్యవచనంబులు యథార్థములగును. నాకిప్పుడు వారణోద్యోగంబే యీయద్భుత విశేషముల జూడజేసినది. ఇంక ముందేమికానున్నదో యెఱుకపడదు నిట్టూర్పు విడచుటకై నను బురుషుడు స్వతంత్రుడుకాడుకదా! ఏదియెట్లయినను వెండియు నొకసారి స్ఫటికశిలామంటపంబున ముక్కంటి నర్చించు నావాల్గంటి గంటినేని గృతార్ధుండ నగుదునని తలంచెద తద్భాగ్యము నాకీజన్మంబున గల్గునాయని ధ్యానించుచుండ నాతరుప్రకాండం బొకకొండప్రక్కను ప్రవహింపుచున్న నదియెడ్డునకుంబోయి నిల్చుటయుం జూచి యందున్న సోపానంబులు గురుతుపట్టి మును పాతాళగంగాజలనయనార్థ మరుదెంచిన మాతంగంబు నెక్కిన చోటిదియేకదా యని తలంచుచు నేనత్యంతసంతోషంబుతో నాబిల్వవృక్షము మెల్లనం దిగితిని అంతలో నది యగోచరంబయినది. తల్లిబాసిన పిల్లవలె నుల్లంబు దల్లడిల్లుచు బెదతడవు దానింగానక వగచితిని.

అందావృక్ష మాగుటకుం గతంబేమని యరయుచుండ నాదండ బాతాళగంగాజలంబుల మట్టంబున గట్టుదెస దట్టంబుగ దీగెలచే జుట్టుకొనబడిన గుజందున బిల్వదళార్చితంబగు శివలింగం బొండు బొడగట్టుటయు బట్టరాని కౌతుకముతో నేనప్పుడు తెప్పున దీర్ధములాడి యాలింగమున కభిషేకము గావించి యాసోపానంబులం గూర్చుండి చూచిన విశేషంబులన్నియు దలంచుకొనుచు మునువచ్చిన వేదండము మరలవచ్చు నేమో యను నా సహృదయమునకు నుదుటు గలుగజేయ గొంత కాలక్షేపము జేసితిని.

అంతలో దైవవశంబున మునుపటి ఏనుగు కనకకలశంబు గైకొని యక్కొండ దిగి యచ్చటికి వచ్చినది. దానింజూచి నేను పెన్నిదింగన్న నిరుపేదయుంబో లె జెలంగుచు నించుక కెలంకువకు దొలంగి యామాతంగము జలంబు ముంచుకొని మెట్లెక్కుచున్న సమయంబుననే నెదురుగాబోయి యది తొండము వంచినంత బైకెక్కితిని. అదియు బూర్వమువలె దృటిలో నా స్ఫటికశిలామంటపము సమీపమున నిలువంబడినంత నేలకుందిగి కన్నులు కరవుదీరునట్లు తద్విశేషములు చూచుచుండ మునుపటి వరిమళము గొట్టగా నేను మునుపటిమాటున దాగి యాదెస దృష్టినిడి కూర్చుంటిని.

అప్పుడప్పడతులు శృంగారగమనంబుల నయ్యావరణలోనికి వచ్చి పెచ్చుపెరుగు సంతసముతో చమత్కారవచనంబులు పలుకుకొనుచు మునువోలె నత్తటాకంబున జలకేళిందేలి యనంతర మమ్మహాలింగమును నిర్మాల్యవ్యత్యయము లేమిం జేసి మునుపొందిన సందియము నొందక పూజించిరి. పూజావసానమున వారిలో నీశ్వరు నర్చించిన చిన్నది కొందరు సఖులతో గదళీవనవిలోకనార్థ మరుగుటయు నప్పుడమ్మంటపమున గూర్చుండి యిరువురు తరుణులిట్లు సంభాషించుకొనుచుండిరి.

తమాలిక - మల్లికా! మన భర్తృదారిక భువనమోహనసుందరియై యనురూపభర్తృగామిని కాకుండుటచే సహకరసంపర్కంబు గాంచని మాధవీలతయు బోలె వెలితిపడియున్నది సుమా! యీపరువ మిట్లడవి వెన్నెలజేయుటకు గారణ మేమి?

మల్లిక -- ఇది గోప్యమయిన వృత్తాంతము. చారుమతివలన మొన్ననే నేనీ కథ వింటిని. నీవెఱుంగవు కాబోలు.

తమాలిక - అది నేనెఱుగను. మనకును గోప్యమున్నదియా? చెప్పుము చెప్పుము.

తమాలిక .... మొన్న సాయంకాలమున నేనును భర్తృదారికియగు చారుమతియు నలకాపుర బాహొద్వానవనంబున విహరింపుచు నలకూబరుండు రంభాసహితుండై విమానమెక్కి, యెక్కడికేని బోవుచుండ వీక్షించితిమి.

తమాలిక - అగు నతండెప్పుడును రంభను విడిచియుండడు తరువాత?

మల్లిక - వారింజూచి నేను ముచ్చటపడుచు బడతీ! నీకిలాటి మనోహరుండు లభించిన జక్కగానుండును సుమీ అని పలికితిని

తమాలిక - చారుమతి నామాటవిని యించుక సిగ్గభినయించుచు నలుమూలలు జూచి కన్నులు మూసుకొనుచు మందహాసముతో సుందరీ! నానివాహవృత్తాంతము నీ వెఱుంగవు కాబోలు గౌరీనాథుని యనుగ్రహమువలన నింతకన్న చక్కనివాడే దొరకకూడదా? అని పలికినది

తమాలిక - మంచిమాట చెప్పినది. తరువాత ?

మల్లిక ఆమాటవిని నేను సఖి! నీకెప్పుడు పెండ్లియగునని గంపెడాశతో నుంటిమిగదా! క్రొత్తవిశేషములు వినినప్పుడు మాకు జెప్పుకున్నది యుచితమే? యని పలికితిని.

తమాలిక – మనయొద్ద గోప్యము చేయునా? సిగ్గుచే చెప్పలేదనుకొనియెదను పిమ్మట నేమన్నది?

మల్లిక - ఆమాటయే సూచించుచు నిట్లని చెప్పినది నలకూబరుడు నన్ను వరించి దూతిముఖముగా మాతండ్రికి దెలియంజేసిన నతడు మాతల్లితో వితర్కించి నలకూబరుండు రూపంబున మనోహరుండయినను సతతము రంభాసక్తుండు గావున నతనికిచ్చితిమేని మనపుత్రిక సాపత్నీపరిభవభేదం బనుభవింపవలసివచ్చును. రాచబిడ్డండు కోరిన నీయకపోరా దేమిచేయుదమని యభీష్టదేవతయిన హటకేశ్వరుని ధ్యానించి రాత్రి నిద్రవోయిన నాభక్తవత్సలుండు స్వప్నంబున బొడసూపి యర్ధయామములో బుడమిగల దివ్యక్షేత్రంబుల దిరిగివచ్చిన వానికిగాక నితరునికి నీ పుత్రిక నీయవలదని చెప్పి యంతర్హితుడయ్యెనట. ఆమాటయే మజ్జనకుండయిన మాణిభద్రుడు నలకూబరునికి తెలియజేయ నప్పని సేయనేరక యతడు నాయందు విముఖుండయ్యెను. దానంజేసి యనేక యక్షకుమారులు వచ్చి నన్నడిగినను మాణిభద్రుడు తన శపథప్రకార మెఱింగించిన నెవ్వరు నప్పని కొడంబడరయిరని తనకథయంతయు జెప్పినది.

తమాలిక - ఓహో యిదియా కారణము అగుంగాక ప్రభావసంపన్నుడుగాక యట్టిపని సేయనేరడు అట్టివాడు సుందరవంతుడగునో కాడోయని వెరచుచున్నదాన రూపప్రభావంబు లొక్కచో నుండుట దుర్గటముగదా?

మల్లిక - "యతాకృతి స్తత్రగుణాభవంతీ"యను నార్యోక్తి వినియుండ లేదా? రూపమున్న చోటనే ప్రభావముండును. అదియునుంగాక భగవద్వచనము రిత్త పోవునదియే ?

తమాలిక - ఆమాట నిజమగును అదిగో చారుమతి కదళీవనంబునుండి వచ్చుచున్నది. పూజాభావంబుల సవరింపుమా.

చారుమతి - (ప్రవేశించి) సఖులారా? నన్ను జూచి నవ్వుచున్నా రేమి?

మల్లిక - నలకూబరునిం బరిహసించు మనోహరుం బడయుదువని సంతసించుచున్నవారముకాని నవ్వుకాదు.

చారుమతి — నాకు రాత్రివచ్చిన స్వప్నమే యథార్థమైనచో నలకూబరుని వెక్కిరింపవచ్చును.

మల్లి -- అదియేమి?

చారుమతి — ఒకమనుష్యుని బెండ్లి యాడినట్లు కలగంటి.

తమాలిక - ఇదియేకదా?

చారుమతి - మనుష్యులనిన దక్కువగా బలుకుచుంటివి. దేవకాంతలు మనుష్యుల వరించినట్లు వినియుండలేదా. త్రిలోకసుందరియగు నూర్వశి పురూరవుని వరించినది. మఱచితివి కాబోలు. దేవతలను మన యక్షులకు మించిన సోయగము గల రాచకుమారులు మనుష్యులలో వేనవేలున్నారు.

మల్లిక - బోటీ! నీమాటవలన జ్ఞాపకమువచ్చినది. మొన్నను శివరాత్రికి నేను శ్రీశైలము పోయినప్పు డొకచోట బురాణము వినుచున్న యొక చిన్నవానిం బొడగంటి. ఆహా! అటువంటి సొగసుకాని నేనెందును గనివినియెరుంగ. గుణశీలనామంబులు దెలిసికొనవలయునని పెద్దతడవా ప్రాంతమందు నివసించితిని. కాని పదు గురిలో నుండుటచే వీలుబడినదికాదు మన చారుమతికిట్టి మనోహరుని లభింపజేయుమని మల్లికార్జునదేవున కనేక నమస్కారములు జేసితిని కావున నీవన్నమాట యధార్ధమగును.

తమాలిక - మనసఖురాలి కల తెరంగరయ శోభనదినములు సమీపించున్నట్లు తోచుచున్నది.

చారుమతి - పోనిండు. వేళ యతిక్రమించుచున్నది. పోవుదము లెండని పలికిన నందఱు నిష్క్రమించి యా గుహామార్గమునంబోయిరి.

ఆ మాటలువిని నేను అమృతసాగరంబున మునింగిన యట్లు పరవశుండనై యొక్కింతవడి యేమియుం దెలియక మత్పురాకృత సుకృతపరిపాటు కచ్చెరువు నొందుచు దైవ సంఘటితము మెచ్చుకొనుచు నమ్మచ్చెకంటుల మాటలచే నబ్బోటి మాణిభద్రుని అభీష్ట దేవతయయిన హటకేశ్వరుడని నీస్ఫటికశిలామంటపమున నొప్పుచున్న శివలింగము అనియు వివాహాపేక్షం జేసి యా చిన్నది ప్రతిదినము నీస్వామి నారాధింపు చున్నదనియుం దెలిసికొని బిల్వవృక్షము పుడమింగల తీర్థములన్నియుం ద్రిప్పిన సుకృతంబునకు ఫలమిదియని నిశ్చయించి మే నుబ్బి గొబ్బున నా మంటపమునకుంజని నిర్భయముగా విహరింపుచు గదళీఫలంబులు దిని నీరుగ్రోలి యత్యంత సంతోషముతో నారేయి గడపితిని.

మరునా డుదయకాలమని తోచిన సమయమున నత్తటాకమున స్నానముజేసి జపావసానమున నమ్మంటపము నున్న పూజాపాత్రము లన్నియు దారుమారుగా నునిచి నిర్మాల్యము తటాకజలంబునం బడవైచి యాలింగమున కభిషేకము జేసి మనోజ్ఞములైన బూవులచేత సహస్రనామార్చనంబు గావించి యా హటకేశ్వరుని బెక్కుతెఱగుల వినుతించితిని.

మఱియు నందెక్కుదించి యుంచిన విపంచి గైకొని చక్కగా మేళగించి గళరవంబు నెలంగ గొంతసేపు మంగళగీతంబులం బాడితిని.

అంతలో నక్కాంతల మేని పరిమళము నాసాపర్వము గావించుటయు మించినతత్తరముతో చేనుత్తరపు దెసనున్న పూవులతోటలోనికింబోయి యందలి వింతలం జూచుచు విహరింపుచుంటిని.

పిమ్మట నాకొమ్మలు నచ్చటికివచ్చి పుష్పార్చితంబైన యా లింగమును జూచి వెరగుపడచు వింతవారెవ్వరో వచ్చుచున్నారని నిశ్చయించి తలయొకమూలకుంబోయి వెదకదొడగిరి.

వారిలో మల్లిక యనునది నేనున్న తోటలోనికివచ్చి యబ్బురపాటుతో నన్ను జూచి యేగినది. అయ్యెలనాగ యేగినకొంతసేపటికి మఱికొందరు సుందరులు వచ్చి దూరదూరముగా నిలచి పరిశీలించిపోయిరి. ఎవతె వచ్చినను దూరముగానుండి చూచుటయేకాని దాపునకు వచ్చి పల్కరించుటలేదు. అప్పుడు వారిట్లు మాటాడికొనిరట.

మల్లిక - సఖీ! నేను శ్రీశైలములో చూచినవాడితండే నాకు బాగుగ జ్ఞాపకమున్నది. ఎంత సొగసుగా నున్నవాడో యీ వసంతిక నడుగుము.

వసంతిక - నిజమేనమ్మా! నేను దాపుగాబోయి జూచితిని. అన్నా, ఆ సౌందర్యమేమని చెప్పుదును. మొగము చంద్రబింబమే. అవి కన్నులు గిన్నులుకావు. యువతీజనహృదయాకర్షితములైన మరుని మంత్రమత్స్యములని తలంచెదను. అట్టివాని కౌగిటలో జిక్కిన చక్కెరబొమ్మ భాగ్యమే భాగ్యము.

తమాలిక - వయస్యా! మనము నలకూబరు నెరుంగుదము గదా. వీని ముందర నతడేపాటివాడు. పెక్కులేల కంతుడో వసంతుడో జయంతుడో గావలయు లేకున్న భవదీయ భాగ్యదేవత యని తలంచెదను.

చారుమతి - మీరంతగా వర్ణించున్నారు. మాటాడినారా ?

మల్లిక - లేదు లేదు దాపునకుబోయి పల్కరించవలయునని ప్రయత్నించితినికాని కంపముచే మాటవచ్చినది కాదు

చారుమతి - అట్లయిన మల్లి కా! నీవువోయి యప్పురుషోత్తముని కులశీలనామంబుల దెలిసికొని ప్రసన్నతగా నుత్తరమిచ్చెనేని దీసికొని రమ్ము. సౌందర్య మేపాటిదో చూతము.

వసంతిక - చూచిన తరువాత విడువవు. నీవరవృత్తాంతము జ్ఞాపకము జేసికొని పిలిపింపుము.

చారుమతి - నేనంత బేలననుకొంటివా ? జగన్మనోహరంబైన వస్తువునుజూచి యానందించుటకుగాని మఱియొకటికాదు.

వసంతిక - కానిమ్ము. పిమ్మట నే యడిగెదనులే. నీ ధైర్యమేపాటిదో చూతము

అని యొండొరులు వితర్కించి యనుషంగా మల్లిక మెల్లగా నా యొద్దకు వచ్చినది. నేను దానింజూచి యా పుష్పవనములో దూరదూరముగా బోదొడంగితిని. అదియు బుష్పములు గోయునట్లభినయించుచు క్రమగ్రమంబున నాయొద్దకు వచ్చి నమస్కరింపుచు నైపుణ్యముగా నిట్లనియె.

ఆర్యా! మీరెవ్వరు? ఏదేశము? ఈ ఏకాంతగుహాంతరమున కేమిటికి వచ్చితిరి? ఇది మాణిభద్రుని కూతురు చారుమతి యను యక్షకన్యక విహారవనము, నేనా జవరాలి సఖురాలిని, నా పేరు మల్లిక మిమ్ములను మొన్నటి శివరాత్రినాడు శ్రీశైలమునందు బరివ్రాజకసంఘములో బురాణము వినుచుండ జూచినట్లు జ్ఞాపకమున్నది. మీ రప్పటి కచ్చటికి వచ్చితిరా? అని వినయగంభీర్యచాతుర్యంబు లేర్పడబలికిన విని నేను సానురాగముగా దానిం జూచుచు నిట్లంటిని.

అగునగు శ్రీశైలము వచ్చితిని. పురాణములను వింటిని. కాని నిన్నుజూచిన జ్ఞాపకములేదు. నేనొక రాజకుమారుడను. నాపేరు చంద్రుడందురు. మల్లికార్జునదేవు ననుగ్రహమే నన్నిచ్చటికి దీసికొనివచ్చినది. నారాకవలన మీకపకారము కాదుకద! అటులైన నిప్పుడేపోయెదను మాకిందొక ప్రయోజనములేదని యతి గాంభీర్యముగా బలికినవిని యక్కలికి యించుక నవ్వుచు నిట్లనియె.

మీ రమానుష ప్రభావసంపన్నులు కూకుండిన నిచ్చట కెట్లువత్తురు? ఆత్మీయ నివాసమున కరుదెంచిన మహాత్ముల సత్కరించుట గృహస్థధర్మము. కావున మీరు పూజార్హులయి యున్నారు. మా సకురాలా స్పటికశిలామంటపమున నున్నది. మీరాక విని మిమ్ములను దోడితేర నన్ను బుచ్చినది మిమ్ములనుంజూడ మిగుల వేడుక పడుచున్నదని క్రమంబున బరిచయము గలుగజేసి యచ్చట జరిగిన వృత్తాంతమంతయుం జెప్పి నన్నచటికి రమ్మన నిర్బంధపెట్టెను.

అప్పుడు నే మేమియు బలుకక పూజనంగీకరించుటకు బోలె దానివెంట నా మంటపమునకు బోయితిని. నన్నుజూచి యెల్లరులేచి నిలువంబడిరి నే నెవ్వరివంకను జూడక వారినందరం గూర్చుండుడని హస్త సంజ్ఞ చేసి మల్లికచేగూర్చుంటిని.

అప్పుడు-

సీ. చైతన్యమొందిన చక్కని చిత్రంబు
               చిఱునవ్వు మఱఁగిన చిరుగుబొమ్మ
    నడుగాడనేర్చిన నవకంపునునుదీగ
              మురిపెంబుబూరిన నిరులయొత్తు
    పంకవాఁయఁగబెట్టి వచ్చిన క్రొన్నెల
              బలుకభ్యసించిన పసిడిమెమ్మ
    నిలుకడవడసిని తొలుకాఱుమెఱుఁగెల్ల
              గైసేసి తెచ్చిన కామునలుగు
గీ. నాగ నభిరామభూరి సౌందర్యవిభ్ర
   మప్రభాస్ఫూర్తిదగు చారుమతి మదీయ
   నికటమున నోరగానల్లనిల్చి మ్రొక్కి
   తళుకుచెక్కులనవ్వు మొల్కలు సెలంగ.

ఉ. ఇంచుకనాపయిం బరపు నిండుకళావళిముంచి తెచ్చి పై
     వంచిపోల్కెఁ బువ్వువలవైచిన చాడ్పునఁగ ల్వదండసా
     రించిన లీలఁ దమ్మివిరిఁ ద్రిప్పినభంగి మెఱుంగుతీగెఁ గు
     ప్పించినమాడ్కి వాలుజళిపించిన నడినిరలి నేత్రముల్.

ఆతళ్కు చూపులచేత నపహృత ధైర్యుండనై మేను వివశత్వము నొంద నొండెరుంగక వెండియుం దదీయ రూపం బక్షులం గ్రోలువాడువలెజూడ దొడంగితిని అప్పుడు మాయిరువుర మేనులం బొడమిన సాత్విక భావవికారముల జూచి యందున్న సుందరు లొండొరుల జూచుకొని నవ్వుకొన దొడంగితివి.

అప్పుడు మల్లిక నావృత్తాంతమంతయు నక్కాంత కెఱింగించినది. వారందఱు నెద్దియో గుజగుజలాడుకొనం దొడంగిరి. కాని తదీయరూపాయత్తచిత్తుండ నగుటచే నాకేమియు నెఱుకపడినదికాదు. దూరముగానుండి చూచుటచే మొదట నమ్మదవతి సౌందర్యమంతగా నాకు దెల్లమైనదికాదు. అప్పుడు స్ఫుటముగా జూచుట తటస్థించినది. అయ్యారే?

క. కన్నులకు మొగముచాలదు
   చన్నులకు నురస్థలంబు చాలదు వెన్నుం
   బెన్నెరివేణికిఁ జాలదు
   కన్నియ చెలువంబు బొగఁడఁగా నాతరమే.

భూలోకములో మనము చూచెడు స్త్రీలు లోకసుందరులని ప్రసిద్ధినొందినవారు తత్పరిచర్యకయినం దగరని రూఢిగ జెప్పగలను. అట్టి సౌందర్యవతిని నా యెదుట నునిచిన యుపకృతికి గృతజ్ఞత జూపుచు దదంగసౌష్టవము తనివి తీరక చూచుచున్న సమయంబున చారుమతి యొకపుష్పమాలిక తెచ్చినా మెడయందు వైచినది.

అప్పుడు మల్లిక మఱియొక పుష్పమాలిక నా చేతి కందిచ్చి ఆర్యా! ఈ చారుమతి చేసినదానికి బ్రతిచేయవలదా? అని పలుకుచు నాకలికిని నాముందరకుం దీసికొనివచ్చి తలవంచి పూవులదండ మెడలో వేయుము వేయమని పరిహాసగర్భితముగా బలికిన నేనంగంబున బులకలుప్పతిల్ల దెప్పున నిదిగో నా హృదయము నీ కర్పించుచున్న వాడనని సూచించుచున్నట్టు యప్పడంతి మెడలో గుసుమమాలిక వైచితిని అట్టి సమయమున నందున్న సుందరులెల్లరు మా యిరువురిపైని శ్వేతపుష్పంబులం జల్లిరి. అవియే తలంబ్రాలుగా మా శిరంబుల శోభిల్లినవి. ఆప్పుడు నేను మల్లికతో దరుణీ! మీరు నాకు గావించిన యపూర్వ సత్కారములకు మిక్కిలి సంతసించితిని. కృతజ్ఞతజూపుట గాక దీనికి బ్రతి యేమియు జేయనోప నీయక్షనందన పేరురంబున సతతము దాల్చియుండెదనని పలికిన చిఱునగవుతో చారుమతి మల్లికా! అదియే మనకు పదివేలు. అంతకన్న వేఱొక యుపచారముతో పనిలేదని పలికినది.

అప్పుడు వసంతిక నవ్వుచు జవ్వనీ! నీవిందాక నా మాటకేమని యుత్తరమిచ్చినవో జ్ఞాపకమున్నదా యనుటయు తమాలిక యపూర్వసత్కారంబుల నతిథిం బూజించినది. కొరవయేమి వచ్చినదని పలుకుచు నప్పు డూరకొమ్మని దానికి సంజ్ఞ చేసినది.

పిమ్మట వారందరు జనాంతికముగా నెద్దియో యాలోచించుకొనిరి. తరువాత మల్లిక నాతో ఆర్యా! అలకాపురీదర్శనోత్సుకత్వము మీకు గలిగియుండపోదు. మా సకురాలికి మిమ్ము నచ్చటికి దీసికొనిపోవలయునవి యభిలాషగానున్నయది అది దేవభూమి కావున శుచులయి రావలయు, తత్తటాకంబున జలకమాడి వత్తురుగాక రండని పలికిన నేను వల్లెయని యాపల్లవపాణి వెంటనరిగితిని.

అదియు నన్నొక పుష్పవాటికిలో నొప్పుచున్న సరసి దఱికిం దీసికొనిపోయి యనఘా! యిందు గ్రుంకితిరేని యలకాపురి కరుగవచ్చును. శుచులయ్యెదరని పలికిన నేను సంతసించుచు మెల్లన తటాకములో దిగి మొలబంటి జలములో నిల్చి చేతులచే నీరు చిమ్ముచు ముమ్మారు మునింగి లేచినంతలో ౼

మ. కులుకుం గుబ్బలు వాలుగన్నులును దళ్కుంజెక్కులింపౌపిరుం
     దులు మేలౌనడ లొప్పలౌతొడలు బల్‌తోరంపు కీల్గంటిఁజి
     ల్కల పల్కుల్ నునుతళ్కు చూపులసదౌకానందమౌ పిక్కలున్
     వలపుం బ్రాయము గల్గుకల్కి నయితి న్వ్యామోహమేపారంగన్ .

అట్టిరూపముతో నొప్పుచున్న నన్ను జూచి యాయన్నువ చిన్నదానా! యింకను స్నానముకాలేదా యిటురమ్ము. పోవుటకు మా సఖురాలు తొందరపడుచున్నదని పలికిన విని నేనాడుదాననగుట యెరుంగక యెవ్వరినో పల్కరించుచున్న దనుకొని నలుమూలలు చూచితిని. అప్పుడప్పడతి వెండియు నట్లు పలికిన గలికీ! యెవ్వతెను వేగముగా రమ్మని చీరుచున్న దానవని పలికితిని. అప్పు డది పడఁతీ! నిన్నే పిలుచుచుంటిని వడిగారమ్మనుడు వెరగుపడి నన్ను బడఁతీ! యనియెదవేల యని పలుకుచు నన్ను జూచికొంటి గబ్బిగుబ్బలు నాకన్నుల బడినవి. మదీయస్త్రీత్వము చూచుకొని శోకావేశములో అయ్యో! నన్ని యక్షకాంతలు మోసముచేసిరి యక్షిణి యన మాయయని యిందుమూలముననే కాబోలు పేరు వచ్చినది. యిప్పుడేమిచేయుదును. వీరిమాటలు యథార్థమనుకొంటిని తృణచ్చన్నకూపములని యెరుగనైతినని పెక్కుగతుల జింతింపుచున్న సమయంబున నాన్నాయతిన నాతి! వేగము రావేమి విచారింపుచుంటి వేమి! యని పలికిన నేను అయ్యో! నేనిట్లాడుదాననై తినేమి? దీని వలన మీకు లాభమేమియున్నది అలకాపురికి బోవలయునని చెప్పి యిట్లుచేయుట యుచితమా? యడిగిన యది యిట్లనియె.

వనితా! నీవేమిటికి బరితాపముఁ జెందెదవు? ఇందు మునింగినవా రంగన లగుదురు. నిన్నీ రూపముతో నలకాపురికిం దీసికొనిపోవలయునని తలంచి యిట్లు చేయించినది. వెండియు నిన్ను బురుషుం గావింపగలదు. పోదము రమ్మని పలికిన సంతసించుచు దానివెంట నమ్మంటపము నొద్దకుంబోయితిని.

నన్నుజూచి యెల్లరు నవ్వుచు బరిహాసవాక్యములచే నాకు సిగ్గు గలుగజేసిరి. అప్పుడు నేను వారివాక్యములకేమియు నుత్తరమీయక తలవంచుకొని నిలువంబడి నంతఁ జారుమతి కొమ్మా! మాయింటికిఁ బోదము రమ్మని పలికి నాచేయిపట్టుకొని లాగికొనిపోయినది. ఆవాల్గంటుల వెంట నాగుహావిశేషములు చూచుచు నేనలకాపురి కరిగితిని. ఎఱిగినవారికిగాఁక పరబ్రహ్మ కాగుహలో నఱుగుట శక్యముగాదు. నన్నుఁ జెలికత్తెలతోఁ జేర్చి యక్కాంత యేకాంతనిశాంతమునకుఁ దీసికొనిపోయినది కావున నన్నెవరు గుఱుతుపట్టలేదు. ఆహా! అలకాపట్టణము సౌరీతీరుననున్న దని చెప్పలేను. మేడలమాట యటుండనిమ్ము. వీథులలోనే రతనంపుఁబలకలు స్థాపింపబడియున్నవి. మృత్తుకకంటె బంగారము మెండుగా గనంబడుచుండును తొమ్మిదినిధుల కధికారము గలిగిన ప్రభువు పాలించు వీటి మేటిదనం బెన్న నేల? పరమేశ్వరుని సృష్టియనెడు రాజ్యము కది ధనాగారమని చెప్చనోపు

గీ. రాజమార్గము లెల్లెడల రత్నములనె
   మలచి స్థాపించి రొగి రాతిపలకలట్లు
   మాటలేటికి నవ్వీట మన్నుకన్న
   చవకసుమ్మన్న! పైఁడి యేచక్కి చూడ.

గీ. భూములనిరెయు బంగారు భూములనినఁ
   జెప్పనేటికి సౌధవిశేషగరిమ
   నవనిధులుగల్గి పొలుపొందు నగరమందు
   గల యొయారముఁజెప్ప నాకలవియగునె

అది యట్లుండె చారుమతి యంతఃపురంబునఁగల వింతలఁజూచి యది యింద్రజాలమని తలంచితి. అచ్చటివిశేషములు సంక్షేపముగా జెప్పినను సంవత్సరము పట్టకమానదు.

చారుమతి నాతో నేకశయ్యాసముల మెలంగుచు భోజనభాజనములందు నన్ను మిక్కిలి గారవమిగాఁ జూచుచుండెను. నేనుఁదల్పగతుండనైనప్పుడు నిద్రించు చున్నానని తలంచి యయ్యించుబోడులిట్లు సంభాషించుకొనిరి.

చారుమతి - మల్లి కా! యిక్కుమారీరత్నమును జూచినంతనే నాస్వాంతము వికారము నొందినది. ఆ సోయగము తనివిదీరఁ జూడకయే యాడుదానిం గావించితిమి. మాతండ్రిచేసిన నియమమెట్లు సాద్గుణ్యము నొందును. తదాకృతి వేగముగాఁ చూడ వేడుకయగుచున్నది.

మల్లిక - సౌందర్యైకపక్షపాతియగు కందర్పునిచేత నిట్లయితివి నీవేమి చేయుదువు? ఎదియుం గూర్చువాఁడు విధియేకదా. పురుషునిం గావించుకొనుము .

చారుమతి - మాతండ్రి యెఱింగెనేనిఁ బ్రమాదము కాదా.

మల్లిక - తెలియకుండ నడుపువారము మేముండ నీకేమి కొదవ? అదియునుంగాక నీయందుగల ప్రేముడియే నీతల్లిదండ్రులను సమాధానము పెట్టగలదు.

చారుమతి - తరువాత నేమైనను సరియేకాని యిమ్మనోహరుని విడువజాలను కావున వేళయైనది, పోదములెండు. కేళీగుహాంతరమునందే యని మాట్లాడుకొనుచున్న సమయమున నేను లేచితిని. అప్పుడందరము మునుపటి గుహామార్గంబున స్ఫటికశిలామంటపమున కరిగితిమి.

అప్పుడు మల్లిక నన్ను బుష్పవనములోనున్న వేఱొకతటాకములో తీర్థమాడించినంత నేను యథాప్రకారము పురుషుండనైతిని నన్నుఁజూచి యాచిగురుబోడి లజ్జా విభ్రమములతో నొప్పుచున్నంత సఖురాండ్రు సూటిమాటలచే నబ్బోటి నెత్తి పొడుచుచు నొకలతామంటపమునఁ బుష్పశయ్య కల్పించి యందు మా యిరువురను గూర్చుండజేసి మనోభవక్రీడాయోగ్యంబులైన వినోదము లనేకములు గావించిరి. అన్నా! యికజెప్పనేల? అప్పుడాసుందరితో నిర్వాచ్ఛమైన యానందమనుభవించితిని.

అట్లక్కాంతతో గొన్నిదినంబులందు సుఖముగా గడిపితిని. నేనా గుహాంతరమున నివసించియుండ జారుమతియు, శివపూజాకైతవమున వచ్చి పెద్దతడ వచ్చటనే యుండి యేగునది, ఒకనాడెద్దియో ప్రస్తావముమీద మీనిమిత్తము తండ్రిచేసిన నియమమతి క్రమించితినని చెప్పగా నన్ను బిల్వవృక్షము క్షేత్రములన్నియుం ద్రిప్పిన వృత్తాంతమంతయుం జెప్పితిని. అప్పు డపారసంతోషముఁ జెందుచు నయ్యిందువదన తన తల్లిదండ్రుల కత్తెఱంగెఱిగింపఁ దలంచిన మల్లిక వారించుచు వారు నీకు వివాహప్రయత్నము చేయునప్పుడు చెప్పవచ్చునని యుపాయము సెప్పినది.

ఇంతలో మీవృత్తాంత మంతఃకరణంబునఁ దోచిన నొకనాఁడాచిగురుబోఁడిం జూచి పైదలీ? నాసోదరులతో వత్తునన్నకాలము మించియుండవచ్చును. నీగుహలో ప్రవేశించినది మొదలు నాకు దినరాత్రి భేదము తెలియుటలేదు. మేము నలువురము సోదరులము నలుదిక్కులకు గన్యాగ్రహణార్దమై పోయితిమి. సంవత్సరము మితి ఏర్పరచుకొంటిమి కావున నమ్మితిని నేను బోవలయును. వారు నారాక వేచి యుందురు. వారెట్టి భార్యలను స్వీకరించిరో తెలియవలయును. పోవ ననుగ్రహింపుమని నావృత్తాంతమంతయు జెప్పితిని.

అప్పు డప్పడంతి సంతసించుచు దనకప్పటికి నెలదప్పెను గావున బతిసంపర్కంబు దూష్యమగుట నేనరుగుట కెట్టకేలకు సమ్మతించి యొక వీణె నాకిచ్చి యపూర్వరాగంబొండు సూపి మీరేకాంతముగాఁ గూర్చుండి యీవీణమీద నీరాగము నెప్పుడు పాడుదురో యప్పుడు మీయొద్దకు నేనువత్తును. మేము యక్షకాంతలమగుటచే నట్టి సామర్ధ్యముమాకు గలిగియున్నది. ఈ రహస్యం బెవ్వరికినిఁ దెలియనీయకుడుఁ కావలసినప్పుడు రప్పించుకొండని పలికిన సంతసించుచు నేనావిపంచి పుచ్చుకొని మచ్చకంటీ! నేనీ గుహాంతరమునుండి యెట్లుపోవుదును? మొదట నతిప్రయత్నముమీద వచ్చితిని. అమ్మార్గము దలంచుకొన వెరపగుచున్నది. మరియొకదారిని నన్ను జనపదంబుల కనుపుమని కోరిన నా నారీరత్నము నవ్వుచు మల్లికంజూచి కనుసన్న చేసినది

అప్పుడామల్లిక నన్ను రమ్మని యొక గుహామార్గమునం దీసికొనిపోయి రెండుగడియలలో శ్రీశైలములో విడిచి యనుజ్ఞ పుచ్చుకొని ఏగినది. ఆ మార్గము వారికిగాక యితరులకు దెలియదు. నేను శ్రీశైలమున మల్లికార్జునదేవు నారాధించి యందుఁ గదలి యనేకజనపదంబులు గడచి యుజ్జయినికిం బోయితిని.

అందు విక్రమార్కస్థాపితంబయిన సత్రంబున కరిగి యరయ నరయ నొక గదిలో మనరాముడు గనంబడెను. అతండేమిటికో విచారింపుచు నన్ను విమర్శింప డయ్యె. నేనతనిం గౌఁగిలించుకొని అన్నా ! నన్ను గురుతుపట్టలేక పోయితివా? నేను నీ తమ్ముండ చంద్రుండ. నీవిచ్చటికివచ్చి యెన్నిదినములైనది. ఎచ్చటెచ్చటికిఁ బోయితివి? ఏమేమి వింతలం జూచితివి? మన సోదరులు వచ్చియున్నారా? సొమ్మంతయు నేమిచేసితివి? భార్యను స్వీకరించితివా? నీవృత్తాంతము చెప్పుమని యడిగిన నన్ను జూచి సంతసించుచు స్వాగతమడిగి తన కథ యిట్లు చెప్పందొడంగెను.

రామునికథ

తమ్ముడా! మనమందర మొక్క సారియేకదా పట్టణము విడిచితిమి. నేను ధనమంతయు గుఱ్ఱములమీద నెక్కించుకొని పశ్చిమదేశమున కేగితిని. అందొక అరణ్యమార్గమున బోవుచుండగా దొంగలగుంపు మాపై బడి మమ్ము బ్రాణావశిష్టులనుజేసి సొమ్మంతయు దోచికొనిపోయినది. అప్పుడు నేనొక్కరుఁడ నొకమార్గంబునం బాఱిపోయి యాయడవిలో నడువ నడువ నొకపల్లె గనంబడినది. అందొక రెడ్డియింటికి బోయి యన్నంబు యాచించితిని ఆ రెడ్డి నన్ను మన్నించి నావృత్తాంతమంతయు విని కనికరముతో నన్ను గొన్ని దినంబులు తన ఇంట నుంచుకొని యుపచారములు గావించెను. ఆరెడ్డి దొంగలకురాజు. ఆ దేశములోనున్న దొంగలు ప్రతిదినమువచ్చి దోచుకొనివచ్చిన సొమ్ములు తెచ్చి ముందుంచిననవి యందరకు బంచియిచ్చుచుండును. మఱియు నాయదారులు కొట్టుమనియు నాయూరులు దోచికొమ్మనియు నాలోగిళ్ళకు గన్నములు వేయుమనియు నందరకు నియమించుచుండ నాపనులం జేసికొనివచ్చు మ్రుచ్చు లెల్ల నారెడ్డికు జరిగిన కథలన్నియు జెప్పుచుందురు.

సీ. కళలనేయుచు నెఱుంగ మెఱుంగ మనుమాటఁ
            బలుకగాఁ గఱపుఁ బిడ్డలకు నొకటఁ
    గోలలూతగఁబూని గురుకుడ్యములదాఁటు
            నేరుపు దీరుగా నేర్చునొకటఁ
    గన్నముల్ ద్రవ్వించి కనుబ్రామివస్తువుల్
            దెచ్చు పాటవము బోధించు నొకట
    నడచిపట్టిన మారువడి విడిపించుకో
            గల లాఘవంబులఁ దెలుపునొకటఁ
గీ. నెదుటఁబడువారి కనులలో నిలువల్లు
    బోలిఁ బైఁ బడువారిపై రాలరువ్వు
    టాదిగాఁగల చోరవిద్యా ప్రసక్తి
    ననుదినము వాఁడు బోధించు జనులకందు

తమ్ముడా! నీయొద్ద దాచనేల? పదిదినములలో నామాటలు వినుచుండ సులభ ముగా నాకావిద్యయంతయుఁ బట్టుబడినది. నాయందు నమ్ముకకలిగి యారెడ్డి నాబుద్ధి సూక్ష్మత కనిపెట్టి నన్నుగూడ చౌర్యమునకు దగినవారితో నంపిన నేనును నైపుణ్యముగా గన్నములువైచి బంగారును వెండియు దస్కరించి తెచ్చి యా రెడ్డి కిచ్చువాడను. దొంగతనమువంటి లాభకరమయినపని మఱియొకటిలేదుకదా!

ఇట్లు తస్కరుండనై వానియింటం గొన్ని దినంబులు వసించితిని. ఆరెడ్డికి రుచిరయను కూతురుగలదు. పదియారేడుల ప్రాయముగల యాచిన్నదానిని నారెడ్డి తన మేనల్లునకిచ్చి వివాహము సేయ బ్రయత్నింపుచుండగా నాయువతి నాయందు బద్ధానురాగయై తన మనోరథము నాకెఱింగించినది. నేనును సంతసించుచు నమ్మించుబోడితో రహస్యముగా గ్రీడింపుచుంటిని.

ఇంతలో నక్కన్యకు వివాహముహూర్తము సమీపించినంత మేమిరువురము నాలోచించుకొని యొకనాడర్ధరాత్రంబున మణిభూషణాంబరములు కొన్ని సంగ్రహించుకొని యెవ్వరికి దెలియకుండ నరణ్యమార్గంబునంబడి పాఱిబోయితిమి రుచిర తస్కరవిద్యలో మిక్కిలి గడిదేరినదగుటచే నాయరణ్యములో నడుచునప్పు డించుకేనియు నాయాసముబూనక లాఘవముగా నడకలో నన్నే యాక్షేపించునది. ఆరీతి బోవుచు గ్రమంబున ననేక జనపదములంగడచి యొకనాడు రాత్రి కీయూరు సేరితిమి.

ఈ వీటిలో నేనాబోటితో గొన్నిదినంబులు రాత్రింబగళ్ళు వివక్షత తెలియకుండ సుమశరక్రీడాకౌశలంబున మెరయ హాయిగా గాలక్షేపము జేసితిని. మేము తెచ్చినసొమ్ము స్వేచ్చగా వ్యయపెట్టుచుండ నెలదినములకు సరిపడినది. తరువాత సొమ్ములేక నేను విచారింపుచుండ రుచిర నన్ను జూచి యెకిమీడా! మనయిరువురకు జోరవిద్యచక్కగా దెలిసియున్నది. కన్నము త్రవ్వితిరేని లోనికింబోయి యెంత భద్రముగా దాచిన వస్తువులయిన సంగ్రహించి తేగలను. దీనికై మీరింత చింతింప నేల? పెక్కులేల? నేడమవస ఈ రాత్రియే యీ పట్టణము రాజుగారి ఇంటికి బోవుదమురండని బోధించిన నేను సంతసించుచు జీఁకటిపడినతోడనే మేమెల్ల మసిబూసుకొని సమురు బ్రామి కాసికోకలు బిగియించి చౌర్యసాధనంబుల గైకొనిపోయి యా కోటగోడ లాఘవముతో లంఘింఛి భవనాంతరము లరసి సౌధంబులెక్కి గదులు విమర్శించి వెదకి వెదకి విక్రమార్క మహారాజు శయనించియున్న యంతఃపురమునకు గన్నమువైచి లోపల ప్రవేశించితిమి.

అట్టి సమయమున విక్రమార్కునితో భార్య యెద్దియో ప్రస్తావించుచు దేవా? దేవకిరాతకజౌర్యమర్మము లన్నియుం దెలియునని చెప్పితిరి. ఎరిగిన వారికైనను దాము దాచినవస్తువులను దీపము లేని ఇంటిలో దెలిసికొనుట కష్టము దొంగలుపెక్కు చిక్కు గల రహస్యస్థలములో ప్రవేసించి చీకటిలోనున్న వస్తువుల నతిలాఘవముగా సంగ్రహింతురు. ఇది యెట్టిశక్తి యనియడిగిన నమ్మహారాజు నవ్వుచు జవ్వనీ! అదియే తస్కరశక్తి అది యంజనప్రభావము. ఇప్పటి కాలములో నట్టి ప్రభా వముగల తస్కరులు విరళముగా నున్నారు. రెడ్డియను వాడొకడు దీనిలో గండడని వాడుక యున్నది. వానింబట్టుకొనవలయునని పెక్కుతెఱంగుల బ్రయత్నింపచున్నవాడ. వానిజాడ యేమియుఁ దెలియకున్నది. అని చౌర్యరహస్యవిశేషంబులన్నియు భార్య కెరింగింపుచుండెను.

అట్టిసమయమున నేనును రుచిరయు వారి మంచంక్రింద దూరి మెల్లగా నా మంచమెత్తి గదిలోనుండి యవ్వలికి దీసికొనిపోయి యందు దించి గదిలోనున్న వస్తువులు సంగ్రహించి యరుగనున్న సమయములో నందొకచో సవరింపబడి యున్న వీణెయొకటి నాకన్నులఁ బడినది. దానిజూచి నేనూరకొనలేక వెళ్ళిపోవు సమయములో వ్రేలితో నాపెట్టె మీట మ్రోగించితిని.

ఆనాదము వినినతోడనే విక్రమార్కుండు తటాలునలేచి తమప్రమాదమును తెలిసికొని బ్రవేశించి యాగదిలోనున్న రుచిరం బట్టుకొనియెను. నేను దొరకక వచ్చిన వివరములంబడి బడి పాఱిపోయి గోడలంఘించి కడువేగముగా నచ్చటికి వచ్చితిని. నా ప్రాణములన్నియు రుచిరమీదనే యున్నవి. వానింబట్టుకొని యారాజు నీవెవ్వతెవు? నీతోవచ్చినవాఁడెవ్వడు? నీ వృత్తాంతము చెప్పుము నిజము సెప్పిన నిన్ను విడిపింతునని యెంతయడిగినను మూగదానివలె మాటాడక వ్రేలితో నాకసమువంక జూపుచున్నదట. రాజసభలో దానినిఁ దర్జనభర్జనాదులచే రాజభటులు పరిభవింపక బ్రయత్నించిన స్త్రీయగుటచే నట్టిపని వలదని యతిదయాళుండై విక్రమార్కమహారాజు వారించెనట.

ప్రతిదినము విక్రమార్కుడు దాను సభజేయునప్పుడు రుచిరను నెదురుగా నిలువంబెట్టి నీవృత్తాంతము సెప్పవాయని యడుగుచుండ మొదటఁజూపిన వ్రేలే యాకసమువంకఁ జూపుచున్నదట. ఈ నౌరాంగనను మాటాడించిన వారికిని బారిపోయిన గజదొంగను బట్టి యిచ్చినవారికిని మంచి పారితోషిక మిప్పింతునని మొన్నటిదినం బారాజు చాటింపఁజేసెను.

ఈ సత్రములోనికి వచ్చి కొత్తువాలు క్రొత్తవారిని విచారించెను. కాని నా గౌరవాకారమునుబట్టి నన్నేమియు విమర్శింపలేదు తమ్ముడా! ఇదియే నావృత్తాంతము. ఇంతలో దైవములాగున నీవు వచ్చితివి నీకు తరువాత జెప్పెదను కాని నా ప్రాణనాయకి నెట్లయిన విడిపించుకొని వచ్చు నుపాయము చెప్పితివేని నేను బ్రతికెదను. లేకున్న నీవు చూచుచుండగనే ప్రాణములు విడిచెదను. ఆహా!

శా. ఆమోమందము నాకనుంగవ బెడం గామోవిసింగారమా
    గోముంజన్గవపొంకమా గొనబునిగ్గుల్ మీరు నూగారుసా
    రామించుందొడజగ్గు లానడల యొయ్యారంబు లయ్యారుయా
    భామారత్నము చూచి చూడవలెగా పద్మాక్షి నింకొక్కెతెన్.

ఉ. చక్కదనాలకేమి రుచి సంపదఁ జిత్తురుబొమ్మయుం గడుం
     జక్కనగాదె యంత వెఱజాణతనం బొకచోట గానఁగా
     మక్కువ లోకమందె సహి మాటలపోడిమి దాని కేతగున్
     దక్కిన భామినీమణులు దాని శతాంశము బోలనేర్తురే.

అని పల్కుచు గన్నీరు విడచినం జూచి నేని వెరగుపడుచు అయ్యో! వీఁడుత్తమవంశంబునంజన్మించి కొరగాని చోరకృత్యములకు బూనుకొనుటయు నీచజాతి యువతిం గూడికొనుటయు చూడ మాతృదోషంబని తలంచెదను. ఈతఁ డా రుచిరయందు బద్ధానురాగుడై యున్నవాడు. వీనిదుర్వృత్తి నిప్పుడు మరలింప వశము గాదు. ముందు విచారించెదంగాక యిప్పుడెట్లయిన రుచిరను విడిపించుకొనివచ్చుటయే యుచితమని నిశ్చయించి అన్నా! నీవు విచారింపకుము రెండుమూడు దినములలో నిన్ను రుచిరతోఁ గూర్చెదనని శపథముఁజేసి యతని నోదార్చితిని.

అమ్మఱునాఁ డుచితకాలంబున విక్రమార్కుని యాస్థానమున కరిగితిని అందు రాజపీఠమున కనతిదూరములోనున్న రుచిరంజూచి యెంత సౌందర్యవతియో యనుకొంటిని. సామాన్యులలో సామాన్యగా నున్నది. దాని యౌవనప్రాబల్యమే వాని నాకర్షించినది. యథాప్రకారము నీవెవ్వతెవు? నీవృత్తాంతము చెప్పుము చెప్పకున్న నిన్ను దండింపక మానమని రాజభటులు తర్ఖింపుచుండ నాప్రోడ యేమియుం బలుకక మూగదానివలె నొక వ్రేలాకసమువంక జూపినది.

అట్టిసమయమున నేనులేచి రాజుదిక్కు మొగంబై దేవా! యీకాంతను మాటాడించినవారికి బారితోషిక మిప్పించితునని చాటి పించితిరి. నేను మాటాడించెదను. నాకిచ్చు పారితోషికమెద్దియా చెప్పుడని యడిగిన విక్రమార్కుడు నన్ను చూచి పరిశీలించుచు నీవెవ్వరి వాడవని యడిగిన నావార్తయంతయు బిమ్మట చెప్పెదను. కనుకమాట ముందు తెలుపుండని నేనొడివిని కానిమ్ము నీవేమికోరిన నదియే యిత్తునని ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు నేను సంతసించుచు నాకాంతయొద్దకు బోయి చెవులో నేను నీమఱిదిని. మాయన్న రాముఁడు నన్ను నిన్ను విడిపించుకొని రమ్మని యంపెను నీకేమియు భయములేదు. నీవిముక్తియే నేను రాజును వర మడిగెదను. ఇతండాడి తప్పువాడు కాడని నమ్మునట్లాకొమ్మకు బోధించి రాజు గారితో మీరీ యతివ నేమనియడిగెదరో యడుగుడని పలికితిని. అప్పుడు విక్రమార్క మహారాజు అప్పడంతి నిట్లడిగెను.

రాజు -- నీవెవ్వతెవు?

రుచిర - ఆఁడుదానను.

రాజు - ఎవ్వని కూతురవు ?

రుచిర - జనకుని కూఁతురను.

రాజు - ఎవ్వని భార్యవు ?

రుచిర -- జగదభిరాముని భార్యను. ఆమాటలు విని విక్రమార్కుడు తదీయశ్లోషోక్తులను సంతసించుచు వెండియు నెద్దియో యడుగబోవు సమయములో నేను లేచి దేవా! నేనీ పూవుబోడిని ముందు మాటాడించితిని నాయభీష్టము తీరుపరా? వేగము పోవలసిన పనియున్నది. అని యడిగిన నన్నరపతి మంచిది నీ కోరిక యెద్దియో చెప్పుము. తీర్చియే తరువాత పని గావించుకొనియెదమని పలికెను.

అప్పుడు నేను దేవా! ఈ కాంతను మఱియేమియు నడుగక విడిచిపెట్టుటయే నాయభీష్టము, అట్టివరమిచ్చి మీమాట నిలుపుకొనుడనియు నారాజు సంతసించుచుఁ గానిమ్ము నీ యిష్టము చొప్పున నిప్పడంతిని విడిపించెదము కాని మేము నీవెవ్వతెవని యడిగినప్పుడు మిన్నుదెసకు వ్రేలుచూపి చేయిం ద్రిప్పునది. దానియర్థమేమియో మాకు విడిపోయినదికాదు. ఆపరిభాషకర్దము దెలిసికొని వదలింతుము. తెలిపింపుమని నొడివిన నేనయ్యర్ద మారుచిర వలన దెలిసికొని యిట్లంటిని.

దేవా! మఱియేమియులేదు. ఇప్పుడు నేను మీచేతిలోఁ జిక్కితిని. నన్ను రక్షించువాడు భగవంతు డొక్కడుతక్క మఱియెవ్వరును లేరు. అతడే నన్ను విడిపించుగాక యని వ్రేలాకసమువంక చూపినదట. ఇదియే దీని పరిభాషయని చెప్పిన మెచ్చుకొనుచు నాభూపాలుం డయ్యంగనకు నూత్నాంబరాభరణాదు లొసంగియంపిన నేనయ్యంగనను సత్రములోనికిఁ దీసుకొనివచ్చి రామున కప్పగించితిని. వారిరువురు పరస్పరవియోగదుఃఖములఁ దెలుపుకొనుచు నాదివసము గడిపిరి.

నేను మఱునాడు రాముని నేకాంతముగాఁ జీరి అన్నా! సహవాసదోషంబున నెట్టివారికి దుర్గుణములు సంక్రమింపకమానవు. చోరపరిచయంబునంగదా నీకీ చోర బుద్ధి పుట్టినది. మనము గొప్పవంశంబునఁ జనియించితిమి. నీచకృత్యములకు పూనుకొనరాదు ఈ రుచిర చతురమతియైనను నీచజాతిని జనించినదగుట దమకార్యంబుల త్రోవబోవుచుండును అదియునుంగాక యుత్తమజాతియువతివలన గలిగిన సంతాన ముత్తమముగానుండును. ఈ రుచిరను పుట్టినింట విడిచిరమ్ము. నీకు దేవకాంతం బెండ్లిచేసెదను. మల్లికయను యక్షకాంత యొక్కతె రూపంబున నసామాన్యమై యున్నది. ఆ యువతి నేచెప్పినట్లు వినునదని, నేను శ్రీశైలమున కరిగినది మొదలు వానిం చూచువరకు జరిగిన కథయంతయు చెప్పితిని.

నావృత్తాంతము విని సంతసించుచున్న ట్లభినయించుచు రాముడు తమ్ముడా? ఏది నీవీణామాహాత్మ్యము చూతము. ఈరాత్రి చారుమతి నిచ్చటికి రప్పింపుమని అడిగిన వాని యభిలాష నిజమనుకొని యారాత్రి ఏకాంతప్రదేశమున కూర్చుండి యావీణపై నారాగము పాడినఁ జారుమతి యచ్చోటికి వచ్చినది.

అప్పుడు రామునికి సన్నచేసిన నతడు మేమున్నగదిలోనికి తలుపు దెరచికొని వచ్చిన చూచి యాచిగురుబోడి విసిగికొనుచు నంతర్ధానమైపోయినది. నేనొక్కరుండగాక యితరులుండ తన్నుఁ జీరఁగూడదని యామె నొడివినమాట నాకప్పుడు జ్ఞాపకమువచ్చి పశ్చాతాపము జెందుచు వానితో నామాట చెప్పితిని.

అప్పుడు వా డేమియు మాట్లాడక యారాత్రి రుచిరతో ప్రేయసీ! మా తమ్ముని యభిప్రాయము వింటివా? నీవు నాకు దగవట. మనమిరువురము ప్రీతిగా నుండుట వానికిష్టములేదు వాడొక యక్షకాంతను స్వాధీనముచేసికొని దానియొద్ద దాసిగానున్న దాని నాకు బెండ్లిచేయునట. ఎంతయుచితముగానున్నదో చూడుము. సవతితల్లి బిడ్డల కింతకన్న నెక్కుడు మైత్రియుండునా? కానిమ్ము నాకు వీనిపాటి తెలివితేటలు లేవనుకున్నాడు కాబోలునని చెప్పుచుండ నేనంతకుమున్ను వీథిలోనికి బోయి వచ్చుటచే నాకామాటలు వినబడినవి.

అంతలో నారాక తెలిసి యా ప్రస్తావన గట్టిపెట్టిరి. ఆతని దుర్వృత్తినరసి యా రాత్రి నేను పరుండెడుగదిలో మఱియొక పరిచారకుని బరుండబెట్టి వేఱొకచోట బండితిని. ఉదయకాలంబున బోయి చూచువరకు నా గదిలో బరుండియున్న పరిచారకుడు కత్తివేటు తిని చచ్చిపడియుండెను. అందు నావీణ గనంబడలేదు. అప్పుడు నేను మిక్కిలి తొందరపడుచు నలుమూలలు వెదకుచు రాముని గదిలోనికి బోయిచూడ నందెవ్వరునులేరు. వీణపోయినందులకు బరిచారకుడు చచ్చినందులకు మిక్కిలి దుఃఖించుచు నది రాముని ఘోరకృత్యముగా నిశ్చయించి కర్తవ్యము తెలియక పెద్ద తడవు శోకసాగరంబున మునింగితిని. నాకు నేన యుపశమించుకొని చారుమతీవియోగపరితాపాగ్ని హృదయమును దహింపజేయ నాపట్టణమెల్లను వెదకి యెందును వారి జాడ గానక విచారముతోనప్పురంవదలి అడవులు, పల్లెలు, పట్టణములు, గ్రామములు వెదకికొనుచు నిచ్చటికి వచ్చితిని. ఇందు దైవవశంబున నీవుగనంబడితివి ఇదియే నావృత్తాంతము మనమిరువురము సోదరులమూలమున భార్య లేనివారమైతిమి. భార్యలేనిజన్మ జన్మమే - ఆహా ! అట్టికాంత యీ జన్మంబున నాకు లభించునా ?

సీ. భార్యలేకయొనర్చు పండువుదండువు కులకాంతపెట్టనికూడు గీత
    బత్నితోఁబలుకని పలుకులు చిలుకులు గృహిణిలేని కబంధకేళిజాలి
    జాయవాటింపని సరసముల్ విరసముల్ప్రాణేశ్వరికిఁగాని పాటుచేటు
    దయితరై సేయని ప్రియములు భయమువలుల్ల భవెలియైనయిల్లుపొల్లు
గీ. ముద్దుకులకాంత సుద్దులే ప్రొద్దువినని
    చెవులు గవులు వృదావేయిఁ జెప్పనేల
    యకట! సతిలేని బ్రతుకేల యర్థమేల
    వాహనములేల కరులేల వసుధయేల.

అని విచారించుచున్న తమ్ముని నోదార్చుచు విజయుండు చంద్రా! దైవకృతంబులకు వగచుట పురుషకారణంబుకాదు. నీ వమానుషోచితములైన భోగంబు లనుభవించితివి. కానిమ్ము అదృష్టముండిన వెండియు లభింపకుండునా? తగు ప్రయత్నము చేయుదుము. ఆవీణ దొరకకున్న దిరుగనాశైలముల బోవుదము. అదియునుంగాక యక్షిణీగాంతలకు దివ్యదృష్టి కలిగియుండును. చారుమతి నీ వెక్కడ నున్నను వెదకికొని వచ్చును. ఏదియులేకున్న నేమిచేయగలమని యెన్నియో దృష్టాంతరములు చెప్పి యతనిమతి సంతోషపెట్ట యాదినంబున నా గ్రామంబున నివసించిరి. అని యెఱింగించి యప్పటికి వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుఁడు తదనంతర వృత్తాంతము దరువాయి మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.

ఇరువదియేడవ మజిలీ

గోపా! వినుమట్లన్నదమ్ములిద్దఱు సంభాషించుకొని మరునాడుదయంబున నయ్యూరువెడలి స్వదేశగమనోన్ముఖులై యరుగుచు నొకనాడు రాత్రికి భీమవర్మ పాలించెడి విజయపురంబున కరిగిరి.

అందు విజయునిచే స్థాపింపబడిన సత్రమునకు జని యీసత్రమెవ్వరిదని సత్రాధికారినడిగిరి వారు విజయుడను మహానుభావుడి సత్రమును గట్టించెననిచెప్పిరి. ఆతం డిప్పు డెందున్నవాడనని యడిగిన వారు స్వర్గమున సుఖముగా గూర్చుండిఉన్నారని యుత్తరమిచ్చిరి.

ఆ మాటలువిని విజయుడు తమ్మునితో రహస్యముగా దానచ్చట గావించిన కృత్యములన్నియు జెప్పి నలుమూలల దిరుగుచుండ నందొకచో నొక శిలాశాసనము కనంబడినది. అందు నతిపుణ్యాత్ముండైన విజయుండను ప్రధాని యీ సత్రమును గట్టించెను. అమ్మహానుభావుం డొకప్పుడు స్వదేశమునకు బోవుచు మార్గములో నకాలమృత్యువుచేత గబళింపబడియెను. ఆచంద్రసూర్యస్థాయియై యతని పేరిందు మూలమున భూతలంబున స్థిరంబై యుండుగాక. అని యున్న యక్షరంబులం జదువుకొని భీమవర్మనృపాలునికి దనయందుగల ప్రీతివిశ్వాసములకు మిక్కిలి సంతసించుచు మఱియు నచ్చటయున్న విశేషములన్నియుం జూచుచు లోనికిబోయిరి. వారి కందొక గదిలో మందధ్వనితో నిట్టి సంభాషణ విననయ్యె.

రాముడు -- అన్నా! వారికి మన యిద్దఱియందు మొదటినుండియు నసూయయే సుమీ. నేనీ కాంతతోనుండుట యిష్టములేక యెన్నియో జెప్పెను. మనలను నమ్మి తలిదండ్రులను విడచి కష్టములకోర్చి వచ్చిన ప్రియురాలిని విడుచుట నీతి యేమో నీవు చెప్పుము. అదియునుంగాక తాను పట్టుబడి యెంతబాధపెట్టినను నిజము చెప్పినదా? అది యొక్కటి చాలదా.

భానుడు - కాదా! తన్నాశ్రయించినవా రెట్టివారయినను విడువగూడదని నీతి కూడ నున్నది. మంచిపనియే చేసితివి. యెవ్వరి ప్రీతి యెవ్వరికి దెలియును.

రాముడు - పోనీ! తాను నాకు బెండ్లి చేసెదనన్న యువతి మాత్రము మంచిదియా? తన భార్య యొద్ద పనిచేయునదియట. వారిద్దరికీ మేమిద్దరము దాసులమై యుందుమనియే వానియభిప్రాయము.

భానుడు - వాని భార్యను నీవు చూచితివా? ఏ మాత్రపు చక్కనిది?

రాముడు - ఇంతయెర్రగా బొర్రగానుండగానే సరియా యేమి? ఏమో నా కంత రుచింపలేదు. నాకు రుచిరయే బాగున్నది. అయినను నేనంత తిన్నగా జూడలేదు.