కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/23వ మజిలీ

దప్పుగానెంచును. సతులకు బతియె తల్లియుదండ్రియు దైవమును, వీరిలెక్కనాకు లేదు. సత్వరముగా బోవుదము లెండు. యిందుండి యీ నిర్బంధముల బడనేల. యిందులకు బెద్ద యాలోచనలు చేయుచున్న వారని మధురిక చెప్పినది. ఆది యొక్కతియు నా కొఱకు విచారించును. మనము స్థిరపడిన తరువాత దానిని రప్పించుకొందమని పలుకుచు దాను ప్రయాణమునకు ఆతని దొందర పెట్టుచు అప్పుడే రత్నమండనములు మొదలైన వస్తువులు సవరించుకొనినది.

కందర్పుడు మిక్కిలి సంతసించుచు జీకటియండగనే యా జింకను బూరించి యాయించుబోణిని రమ్మని పిలిచెను. సంతసముతో అన్నెలతుక తదంతికమునకు వచ్చి నాథా? నేను ముందు గూర్చుండనా వెనుక గూర్చుండనా అని అడిగినది. ముందే కూర్చుండుమని చెప్పి తన గౌగిటిలో జిక్కబట్టుకొని కీలు ద్రిప్పుటయు ఆక్కురంగం బతిరయంబున గగనంబున కెగసి పఱవదొడగినది.

ఉ. అ పెనుచీకటింబడి రయంబున బోయెడివేళ వానితో
     నాపె హితానులాపముల నాడెడిఁగాని తదంతరిక్షయా
     త్రాపృధుఖేదమింత యహితంబని పల్కదు మన్మథాస్త్రసం
     తాపితచిత్తు లెన్నడును తక్కి న బాధల నెన్నరాత్మలోన్.

అని యెఱింగించి మణిసిద్దుడు వత్సా! ముందటికథ పెద్దదిగానున్నది. మనకు బయనము వేళయైనది లెమ్ము ముందటి యవసధనంబున దరువాయి వృత్తాంతము జెప్పెదనని యొప్పించి వాడు కావడిమోచికొని తనతోడనడచుచుండ ఆతండు ప్రణవజపము చేసికొనుచు నిరువదిమూడవ మజిలీ చేరి అందు తరువాయి కథ నిట్లని చెప్పందొడంగెను.


ఇరువది మూడవ మజిలీ.

విద్యావతి కథ

గోపా! వినుమట్లు కందర్పు డాసుందరీరత్నముతో అక్కురంగంబుపై గూర్చుండి గరుడవాహనారూఢు డయిన లక్ష్మీనారాయుణుడువోలె మెరయుచు గగనమార్గంబున నతిరయంబునం బోవబోవ గొండొకవడికి దూరుపుకొండ మార్తాండుం డలంకరించుటయు మనోరమ తద్వేగంబు సైరింపక నాథా! యీయంత్రసారంగము వేగంబునం బతంగవతిం బురడింపుచున్నది. దీనివడికి నాయొడలును. గన్నులును దిరుగచున్నయవి. యింతదాక అసువులుగ్గబట్టుకొని యుంటినిక నిలువజాలను యెందేని నొక్కింతసేపు విశ్రమించి యేగుదము పుడమికి దింపుడని పలుకగా విని యారాజపు త్రుండు ధాత్రీతలముపయి జూడ్కులు నెరయుజేయుటయు నల్లంత దవ్వులో నొకపట్టణము గనంబడినది కందర్పుడప్పుడు కీలుద్రిప్పి తెప్పునదానిఁ బదిలముగా దత్పురబాహ్యారావమునం దింపి పడతీ! పుడమికి వచ్చితిమి కన్నులం దెరువుము. వెరపుడుపికొనుమని పలుకుచు మెల్లన అక్కుసం బిగియబట్టి యారాచపట్టిని భూమిపయి నిలువంబెట్టెను.

అప్పల్లవపాణి మెల్లన గన్నులుదెఱచి నలుమూలలు పరికింపుచు రాజపుత్రా! ఇదియేదేశము? మీరాజధాని యిచ్చటికెంతదూరమున్నది? మాపట్టణము విడిచి యెంతదవ్వు వచ్చితిమి? మనల నెఱింగినవారిందెందేని లేరుగదాయని బెదరు గదురబలికిన అక్కలికి నూరడింపుచు గందర్పుడు బోటీ! యిది యేదేశమో నాకును దెలియదు. మావీటికి నేటిరేయిలోపున జేరవచ్చును. మీదేశ మిచ్చటికి బెక్కుదూర ముండవచ్చును. మనల నెఱింగిన వారిందుండరు. కాని మనయాకారములు చూచిన వారికి సందియము గలుగకమానదు. కావున నీవిచ్చోట గూరుచుండుము. నేనొక్కరుండపోయి దాపుననున్న అంగడిలో నాహారవస్తువు లెవ్వియైన గొని తెచ్చెద దృటిలో వచ్చెదనని అచ్చిగురుబోడికి జెప్పియొప్పించి యాజింకం జంకనిడికొని నలుదెసలం జూచుచు అల్లన అప్పటణాభిముఖుండయి అరిగెను.

ఆప్రాంతమందలి అంగడిలో నాహారపదార్ధము లేమియుదొరకమి అతండు క్రమక్రమంబున ద దపేక్షఁ జేసి అరుగుచు, దుద కప్పట్టణాభ్యంతరమునకుం బోయెను, అతండరిగిన వీథి వేశ్యాజనసంకులంబై యుండెను.

అట్టివీథింగల విశేషములు సూచుచు గందర్పుడంతరంగంబున మనోరమ వృత్తాంతము విస్మతిజెంది యరుగనరుగ నొక్క విచిత్రభవనద్వారమున నిలువంబడి యొక విటుండును వేశ్యమాతయుం గలహింపుచుండ నాదండ నిలువంబడి తత్కలహప్రకారం బాకర్ణింపుచుండెను. ఆవేశ్య యావిటుని మాటలంగోపించి చేటపోటులు మేననాటించుచు దరిద్రచూడామణీ? యెన్నిసార్లు తోలినను సిగ్గులేక శునకమువలె గుమ్మము విడువకున్నవాడవు. విద్యావతి సులభ అనుకొంటివా, "నక్క యెక్కడ దేవలోక మెక్కడ?" నీబోటి కుమతుల మోమయిన అక్కామినీరత్నంబు దిన్నగాజూడదు. అదియాసపడనేల? ఆయాస వదిలికొని నీదారింబొమ్మని పలికి యాతలుపు తటాలునవై చుకొని లోపలకుబోయినది. అప్పురుషుండు పరుషము లాడుచు దుఃఖితుండయినం జూచి కందర్పుడు దయాళుండగు ఆతనిదాపునకు జేరి యోదార్చుచు నీవిట్లుదీనితో బోట్లాడుటకు గారణమేమి? నీవృత్తాంతమెట్టిది? చెప్పుమనిఅడిగిన సప్పురుషు డతనితో నిట్లనియె.

అయ్యా! నాతెరంగేమని వక్కాణింతును రెంటికిజెడితిని. ఈప్రాంతమందు యొకజనపదంబు గలదు. దానికి మేము అధికారులము.

మాతండ్రి నాబాల్యమున బరలోకగతుండగుటయు మాజనని నాయాస్తి అంతయు సురక్షితముజేసి నేను ప్రాజ్ఞుడనైనతోడనే నాయధీనము గావించినది. ఇక మీయొద్ద దాచనేల. నేనొకనాడు కొందరు మిత్రులతోగూడ నీవీటికి జనుదెంచి యందంద సంచరించుచు నొక దేవాలయములో హరి భజనార్థమై అరుదెంచిన విద్యావతి యను యువతీరత్నమును జూచితిని. ఆమోహనాంగి సౌందర్యాతిశయంబు వర్ణింప నాతరముకాదు తదీయ కులశీలాదుల వితర్కింప వారకాంత అనియు రత్నావతి కూతురనియు దెలియవచ్చినది. యిప్పుడు నాతో గలహించినదె రత్నావతి. అప్పుడట్టి వార్తవిని ముప్పిరిగొను సంతసముతో మిత్రులతోగూడనీ రత్నావతి యొద్దకు వచ్చి నేను విద్యావతిని వరించితిననియు నాయెలనాగను నాకు భోగినింజేసితివేని గ్రమంబున నాభాగ్యంబంతయు దదధీనము చేయుదునని యొక మిత్రునిచే దీనికిం జెప్పించితిని.

అప్పుడు రత్నావతి నన్ను సమిత్రకముగా మేడమీదికి దీసికొనిపోయి యెన్నేని సత్కారములు గావించినది. కాని విద్యావతిని మాత్రము చూపించినది కాదు. నాటంగోలె నేను ప్రతిదినమువచ్చు చుంటిని. రేపురేపు అని యాసజూపుచు మాయింటనున్న వస్తువాహనములన్నియు దెప్పించుకొన్నది. తుదకా గ్రామము గూడ దీనికి వ్రాసియిచ్చితిని. అప్పుడును కొరంతపెట్టిన మాతల్లి వస్తువులు రహస్యముగా దొంగిలించి తెచ్చియిచ్చితిని. యింక నేమి సేయుదును. మాయింట నేమియునులేవు ఆలుమందలన్నియు మొదటినే దీనిపాలు సేసితిని. నన్ను జోగిని సేసినది. విద్యావతి మాటయేమని అడిగిన గొన్నిదినములు వ్రతములు నియమములు బేరుసెప్పి గడపినది. మఱికొన్ని దినములు వ్యాధిమిష జెప్పినది. చివరకు గట్టిగా అడిగినంత నీవు దరిద్రచూడామణివి విద్యావతి నీకెక్కడ లభించును. పో. పొమ్మని కారులరచుచు జేలుదీసికొని బాదినది. యిది మీరు చూచినదేకద? ఇప్పుడేమి చేయుదును? దీనిమూలమున బెండ్లికూడ నాడలేదు. ఆప్తులెవ్వరును గనంబడరు. మునుపునాచుట్టును బెక్కండ్రుమిత్రులు పరివేష్టించి తిరుగువారు. ఇప్పుడొక్కరుడు రాడు. మీమొగముజూడ మహాత్ములవలె దోచుచున్నారు. నిష్కారణము దీనికతంబున దరిద్రుండనై చెడిపోయితిని. దీనిమందలించి నాకెద్దియేని యాధారము గలుగ జేయుడని మిక్కి లిదీనుడై వేడుకొనెను.

కందర్పుం డతని వృత్తాంతమంతయు విని వెరగుపడుచు నౌరా! వారకాంత లెంతకైనం దగినవారు పాపమునకు వెఱువరు. కరుణ యించుకయును బూనరు. ద్రోహమతులు. వారినేమిచేసినను పాపములేదు కానిమ్ము రత్నావతిం గపటోపాయంబున బరిభవించి వీనికుపకారము గావించెదనని తలంచి వాని నోదార్చి బుద్ధిహీనుడవై భాగ్యమంతయు బోగొట్టుకొంటివి. గతంబునకు వగచిన బ్రయోజనము లేదు. నీవీప్రాంతమందే వసియించి ఉండుము. నీయాస్తి నీకిప్పించెదనని యోదార్చి యావేశ్యల రహస్యములన్నియు స్పష్టముగా దెలిసికొని అప్పుడ చిత్రకారుని యింటికిం జని తన కురంగంబునకు గరుడవాహనము రంగు వైపించుకొనెను.

అంత బద్మినీకాంతుం డపరసాగరంబు గ్రుంకిన నొక్కింతసేపునకు దిరుమయంబు లొడలెల్ల మెఱయ దిద్ది కపట శంఖ చక్రాది విభూషణముల దాల్చి కందర్పుండు రెండవ కందర్ప జనకుడువోలె నొప్పుచు నాచర్మకురంగంబును బూరించుకొని యెక్కి గగనంబున కెగసి యావారకాంత మేడదాపుగా బెండెములు దిరుగ జొచ్చెను. అప్పుడు విద్యావతి సఖులతోగూడ నామేడపై గూర్చుండి వీణాగానంబున హరిగీర్తింపుచున్నది. ఆసమయమెఱిగి అతండు తులసీదళమాల యొకటి విద్యావతిపై పడునట్లు దిగవిడిచెను .

బెదురుగదర అమ్ముదవతి యామాలికం గైకొని యాకసమువంక జూచినది. అదిచూచుచుండ వెండియు నతండొక ఉత్తరము విడిచెను. గరుడారూఢుండైన విష్ణుండువలె నొప్పుచున్న అతని అంతరిక్షమున జూచి విభ్రాంతినొందుచు నాఉత్తరమును దత్తరముతో విప్పి చదవగా సుందరీ! నేను గందర్పజనకుండ నీ భక్తికి మెచ్చి నీకు దర్శనంబీయ వచ్చితిననియున్న యాపత్రికను ముమ్మారుజదివి భక్తివివశయై అప్పుడే అందున్న వారినెల్ల దూరముగా నంపి తలుపువైచి రమ్మని చేయి వీచుచు దేవా! ఆర్తరక్షక! రమామనోహర! కరుణాంతరంగ! నేటికి నాయందు దయ వచ్చినదా? స్వామీ? భక్తురాలింగని కనికరింప విచ్చేసితిరా? అనిఅనేక దండకములం జదువుచు ఆతనిని వినుతించినది.

అప్పుడతండు మెల్లన నామేడమీదికి దిగెను. అమ్మగువయు గన్నులు మూసికొని సాష్టాంగమెరగినది. ఆసమయమున నా రాజపుత్రుడు చర్మసారంగంబును దిగి నిలువంబెట్టి తాను విద్యావతిని లేవనెత్తుచు గరంబుకరంబున గ్రహించి అందున్న గదిలోనికిం దీసికొనిపోయెను. యేమనిననేమి అపరాధమోయను వెఱపుతో అత్తరుణియు దత్తదను గుణ్యముగా మెలంగ దొడగినది.

అతండు తల్పంబున గూరుచుండి వేఱొకయుత్తర మమ్మత్తకాశిని కందిచ్చెను దాని జదువ నిట్లున్నది.

పికవాణీ, పూర్వజన్మంబున నీవొక గోపికవు. కృష్ణావతారంబున గామంబున దృప్తిం బొందక వరంబడిగిన నన్ను వెండియు సురతంబ అభిలషించితివి. అది యుత్తరజన్మంబునం దీర్తు నని అప్పుడు పలికితిని. కామాభిలాషం జేసి వారకాంతవై జన్మించితివి. పూర్వజన్మసంస్కారంబున నా భక్తియు బ్రాప్తించినది. ఆ కోరిక దీర్ప నిప్పుడు చనుదెంచితిని నీయభీష్టములము దీర్చుకొనుము. నీ యిచ్చ వచ్చినన్ని దినంబులు రాత్రులవచ్చి వేకువజామునం బోవుచుండెదను. మాకు భక్తుల కామితముల దీర్చుటకంటె వేరొకపని లేదు గదా?

ఆపత్రికం జదివి అమ్మదవతీ తిలకంబు మేన బులకలుద్గమింప సుగంధమాల్యాను లేపనాదుల అతని నర్చించి పూవుసురటిచే నొక్కింతసేపు వీచి మనంబునం గల భ క్తి విశ్వాసములు దెల్లముగాగ అతని యుల్లము రంజిల్లం జేసినది. కందర్పుండును డెందంబున ముదంబుజెందుచు నా సుందరీరత్నముతో నా రాత్రి అంతయు గందర్పుక్రీడలం దేలి సూర్యోదయము కాకమున్ను ఆ యంత్రమృగం బెక్కి --- యిక్క తుంబోయెను.

ఈరీతి అతండు ప్రతిదినంబునుం బోయి నిశావసానము దనుక తత్కేళీవినోదములం జెలంగుచు దెల్లవారకముంద అరుగుచుండును. అక్కలికియు నిక్కముగా అక్కంసారియే తన భక్తికి మెచ్చి వచ్చుచున్నవాడని సంతసించుచు నా రహస్య మెవ్వరికిని జెప్పవలదని అతండు నుడివియున్న కతంబున దల్లికైన జెప్పక కొన్ని దినములు గడిపినది.

శ్లో॥ స్మితేన భావేనచలజ్జయా భయాపరాఙ్ముఖై రర్థకటాక్షవీక్షణైః
     వచోభిరీర్ష్యాకల హేనలీలయాసమస్తభావైఃఖలుబంధనంస్త్రీయః

యౌవనాదిమదవికారముల బుట్టిన యాకస్మికపు నవ్వుచేతను బాల్యయౌవన సంధియందు బొడమిన శృంగారవిషయికంబై న ప్రధమాంతఃకరణవికారము, భావ మనంబడు దాని చేతను, కుచదోర్మూలాచ్ఛాదనాది మనస్సంకోచకరూపంబై సిగ్గుచేతను, హఠాజ్జనితంబైన భయముచేతను, గ్రేగంటిచూపులచేతను, శుకకోకిల మధురతరమృదులాలాపములచేతను, ప్రణయకలహములచేతను, విభ్రమములచేతను, సాత్వికసంచారభావములచేతను, జితేంద్రియులకు సైతము కాంతలు మోహమును గలుగజేయుదురుగదా.

కందర్పుండు రత్నావతిని వంచింపదలంచి యరిగి విద్యావతి రూపవిభ్రమములచేదానె వంచితుడై పగలెల్ల నెచ్చటనో గడియ యుగముగా గడుపుచు రాత్రులెల్ల దత్క్రీడావిశేషములచే దృటిగా వెళ్ళింపుచు మనోరమ వృత్తాంతములు తన వృత్తాం తమును మరచి యన్య మెఱుగక యక్కలికిమిన్న వలపులం జిక్కి వర్తింపుచుండ బెక్కు వత్సరములు గతించినవి.

ఒక్కనాడు రత్నావతి తన కూతుంజూచి మందలింపుచు పట్టీ! నీవు వట్టినియమంబులం బెట్టుకుని జవ్వనం బంతయు మంచుము పాలుసేయుచున్నదానవు నాగడించిన విత్తమును గొరంత అగుచున్నది.

ఉ. ఒక్కనిబిల్వబంచి మఱియొక్కని చేత బసిండివట్టివే
    ఱొక్కనియింటి కేగుచు మఱొక్కని నానడుచక్కి నొక్కచో
    బుక్కిలి దార్పి కూడ భ్రమబొంది విటుల్ దెలియంగ లేరు గా
    కెక్కడి సత్యమేడ వలపెక్కడి నేమము వారకాంతకున్.

ఇంక నీనియమము లన్నియుంగట్టిపెట్టి ధనార్జనాయత్తచిత్తనై వర్తింపుమని భాధించిన నాలించి యాచంచలాక్షి తల్లితో అమ్మా! నా వృంత్తాత మ్మెఱుంగక నీవట్లనుచున్నదానవు కారణాంతరమునుజేసి నీకును గోప్యము జేసితి నింక దాచనేల సకలలోకాధ్యక్షుడైన పుండరీకాక్షుండు బ్రత్యక్షంబుగా నన్నిరాత్రుల నాతో గ్రీడింపుచున్నవాడు. అమ్మహానుభావుండు నాకు విదుకాడై యుం నీ నీచవిటులతో బ్రయోజన మేమి అని అత్తెఱం గంతయు నెరుంగ చెప్పెను.

ఆ మాటలు విని రత్నావతి యాశ్చర్య మందుచు పుత్రీ! యీరహస్య మిన్నిదినంబులు నాకుఁ జెప్పకుంటివి. నేనోర్వననుకొంటివా యేమి? నీయధ్రయము నాయదికాదా? నాకు మాత్ర మొకసారి దర్శన మిప్పింపగూడదా? అని పలికిన విని విద్యావతి అమ్మహానుభావుని సెలవు లేదు. నేడే ..సాహసినని చెప్పతిని. క్రమంబున జనువు చిక్కుచున్నది. ఆయనకుం జెప్పి నీకు దర్శనమిప్పించెదనని సమాధానము చెప్పి తల్లికి సంతోషము గలుగ జేసినదీ. మఱి యొకనాటిరాత్రి గ్రీడావసానమున సరససల్లాపగోష్ఠి ప్రసంగంబుల విద్యావతి మెల్లన నతనితో నిట్లనియె. దేవా! నా యౌత్సుక్యంబొక్కటి మీకు విన్నపము సేయదలచుకొంటి నది తప్పైనను మన్నింప వేడెద. నేను సకలబ్రహ్మాండనాయకుండవైన నీయండజేరియు నిందుండనేల మీదివ్యధామంబు వైకుంఠంబు జూడ వేడక అగుచున్నది. పురాణంబుల దద్వైభవం బద్భుతముగా వర్ణింపబడియున్నది. కావున నొక్కసారి అచ్చటికి దీసికొని పోయి నన్ను గృతార్థురాలిం గావింపుడని ప్రార్ధించిన నతం డెలనవ్వొలయ లలనామణీ! నీ అభీష్టంబెట్ల అట్లు కావించెద గాని వైకుంఠము జూసినవారికి వెండియుం బుడమికి వచ్చుట అభావ్యంబు. నీకిందు భోగసంతృప్తి అయ్యెనేని వక్కాణింపుము పిదప మన్నివాసంబునకు దీసికొనిపోయెద. ఇదెంతపని అని నొడివిన అవ్వనితయు పంతసించుచు వెండియు అతని కిట్లనియె.

స్వామీ! యుత్కృష్టసుఖంబు లభించుచుండ నల్పసుఖంబుల కాసించువారుందురా? మీ అనుగ్రహంబున వైహికసుభేచ్ఛ నా కేమియు లేదు. కాని అనన్యశరణ్య యగు మజ్జనని యొకతె యున్నది. దాని గుఱించి యించుక చింతించుచున్నదాన. మహాత్మా, ఎవ్వరికిని దల్లిరుణము దీర్చుకొనుట కష్టముగదా! శిశుతనంబున దల్లి పిల్లకు జేయునుపచారము లేతన్మాత్రములే! అట్టివారి విషయమై కృతజ్ఞత జూపనివారు మహాపాపాత్ములుగదా! నా నిమిత్తంబున మజ్జనని కొక్కసారి దర్శనంబీయ వేడెదను. భవద్దర్శనంబై న పిమ్మట వైకుంఠగమనంబున కర్హురాలనని యేను వక్కాణింపగలను. మీచెట్ట బట్టినందులకు నాకీపాటి యుపకారము సేయకతప్పదని ఎంతయో నైపుణ్యముగా బ్రార్థించినది.

అప్పు డతం డాశ్చర్యముఖముతో ఏమేమీ! మీ తల్లికా? నన్ను దర్శన మిమ్మనుచుంటివి. చాలుచాలు! అదిచేసిన పాతక విశేషముల నల్పములుగా నున్నవనియు దాని కొరకు గ్రొత్త నరకముల గొన్నిటి నిర్మింపవలసి యున్నదనియు నాజ్ఞయిమ్మని మొన్ననే కృతాంతుడు చిత్రగుప్తులచే నాకు వ్రాయించి పంపించెను.

అట్టివాని గట్టుటకు నేనును సెలవిచ్చితిని ఆ విషయ మెఱుంగక దానినిగూడ వైకుంఠమునకు దీసికొని రావలయునని తలంచుచుంటివి కాబోలు? మంత్రపూతం బయిన పురోడాశము కుక్క కర్హమగునే అని పలికిన విని యుల్లము ఝల్లుమన నప్పల్లవాధరి మూర్చిల్లి యల్లంతలొ దెలిసి నాకన్నుల బాష్పమ్ము గ్రమ్మ నంజలిఘటించి ధైన్యంబుదోప వెండియు అతని కిట్లనియె.

దేవా! సోదికిం బోయిన మతరంకులు బయల్ర్పడినయట్లు ఏమేమో చెప్పుచుంటిరి. మీ చరిత్రలు నేనెఱుంగనవి కావు. అజామీళుని కన్న మా తల్లి పాపాత్మురాలా? స్వకులధర్మంబులు దూష్యములైనను దుష్కృతహేతువు కాదండ్రు. సర్వస్వతంత్రనై యున్న మీరేమి చేసిన సాగకుండు? కాదనువారెవ్వరు? సర్వేశ్వరా! నీకు నేను బ్రేయసినై యుండి మా తల్లిని మాత్రము రక్షించుకొనజాలనా? నీదర్శనం బైనచో నన్ని పాతకములును భస్మములై పోవును. దానికి నిష్కృతి చెప్పకుంటిరేని యిప్పుడ మీమ్రోల ప్రాణముల బోగొట్టుకొందునని చనువును భయభక్తివిశ్వాసములు దగునట్లు బ్రార్దించిన విని అతండు లోపల నవ్వుకొనుచు విధిలేక యాచరించువాడువలె యించుక నొక్కి కాసేపు ............. దాచుకొనకూడదు. వస్త్రావశేషముగా దీసికొనివత్తువేని దర్శనం బిత్తును. దానం బూతుపాలగునని చెప్పి అతడు వేళ యగుటయు చర్మకురంగ మెక్కి యాత్మీయనివాసంబునకుం బోయెను.

పిమ్మట విద్యావతి తల్లి యొద్దకువచ్చి యావృత్తాంతమంతయుం జెప్పినది. రత్నావతియు వానిసంవాదమంతయు అంతకుమున్ను గవాక్షవివరములోనుండి విని యున్నది. కావున నిక్కముగా దనకూఁతు నియమమునకు సంతసించియే హరి వచ్చుచున్నవాడని నమ్మి తన వై కుంఠయాత్ర నిజమే అనుకొని తన సొమ్మంతయు బంచిపెట్టుటకు సమ్మతించినది.

అప్పుడు విద్యావతి ధనకనకవస్తువాహనరూపంబయిన తన యాస్తి నంతయు రత్నావతి యీదినంబున బ్రాహ్మణులకు బంచి పెట్టును. కావున వలసినవారందరు దానియింటికి రావలయునని పట్టణమంతయు జాటింపబంచినది. మఱియు నెవ్వరివలన నేయేధనాదికము -------


యున్నంతవరకు కవరకు వారివారికి వార్తలనంపినది. ఆతెగువచూచి పౌరులెల్ల అద్భుతము నొందజొచ్చిరి. ఆవార్త పురంబంతయు వ్యాపించుటయు అందున్న బ్రాహ్మణు లాబాలవృద్ధముగా అగ్గణికఇంటికి వచ్చి అరుగులమీద గూర్చుండి యుండొరులిట్లు సంభాషించుకొనిరి.

తిమ్మన - ఓహో! వెంకట సోమయాజులుగారా! నమస్కారము. అప్రగ్రహీతలమని చెప్పుకొనుచుండెడి పెద్దలందరు దయచేసినారే? దీని ద్రవ్యము పరిశుద్ధమయినదని కాఁబోలు.

వెంకట - తిమ్మా! నేనందులకు రాలేదురా! దీనియీవి యెంతనిజమో యెట్టిదో అని వేడుకజూడ వచ్చితిని. దీనికింత తెగువయెట్లు పుట్టినది. కడు వింతగా నున్నదే.

తిమ్మన — ఇది పెక్కండ్రజండాలఁ జేసినది. ఆ దోషమఁతయు నిప్పుడు బ్రాహ్మణుల పాలుచేయుచున్నది. తప్పేమి? యింతకుమీరు చూడవచ్చినారా? ఏదయినా అభిప్రాయముతో వచ్చినారా? నిజము చెప్పండి.

వెంకట - అంత తరచితరచి అడుగుచున్నావు నాగొడవ నీకేల?

తిమ్మన - మఱేమియులేదు. రత్నావతి తనద్రవ్యమంతయు బంచిపెట్టును. అందులో విద్వాంసులైన వారల పేరులువ్రాసి తెమ్మన్నది ఆట్టివారికి దానపూర్వకముగా విశేషసత్కారము చేయుచున్నది. అందువలన అడుగుచున్నాను. షోడశమహాదానములు గావించును.

వెంకట - ఆలాగునా! సరే ఆపైతె నీవు నాగౌరవమెఱిగినవాడవే. నేను ఆహితాగ్నినిగదా! నేను భూదానముతప్ప నితరదానములు పట్టను. ఆపద్దు నాకేలాగైనా వేయించు.

తిమ్మన - ముందురాలేకపోయినారూ? ఆవద్దు మించిపోయినది.

వెంకట - పోనీ గృహదాన మిప్పిస్తావూ.

తిమ్మన -- అవిఅన్నియు నిరూపణచేసినాము.

వెంకట - యింక నేమియున్నది.

తిమ్మన - మహిషదానము, తిలదానము, దాసీదానము ఈలాటివి యున్నవి.

వెంకట - మూటిని నేనేలాగున పట్టను.

తిమ్మ - మాట (చెవులో నెల్లరకు వినంబడునట్లు) మహిషదానము పడతారూ, పదివేలు దక్షిణయిప్పిస్తాను. దీనితో మీ దరిద్రము వదలును.

వెంకట - అంత దక్షిణయిప్పిస్తే నాకుమారునిచేత పట్టిస్తాను. పనికి వస్తుందా?

తిమ్మ - పనికిరాదు. మీరు అహితాగ్నులు గనుకనే ఆ దక్షిణ మఱియొక రైతే సామాన్యయే.

వెంకట - ఆలాగైతే యొకటిచేయుము? కొంచెము రహస్యముగా జరిగేటట్టు చూడుము సహస్రగాయత్రి జపించి యీదోషము పోగొట్టుకోగలనులే. ఏదానమైనా బ్రహ్మణుడు గాక మరియెక్కడు పట్టునాయేమి?

శంకరభట్టు - సోమయాజులుగారూ! మీరహస్యము బాగానేయున్నది. మీ మాటలందఱు వినుచున్నారు. యెందుకు కక్కురితిపడతారు. ఊరుకొండి. వీడు మిమ్మలనాడించుట కట్లనుచున్నారు. వీని పెత్తనమిచ్చట యేమిన్నీ లేదు.

వెంకట - ఆరి కోతిముండాకొడకా ! యెంతమోసము చేసితివి. కానిమ్ము నే నూరకయంటినిగాబట్టి యుగ్రదానము పట్టుదుననుకొంటివిరా.

తిమ్మ - (పకపకనవ్వుచు) అయ్యో మీరు చూడవచ్చితిరికాని సంభావనకు రాలేదని చెప్పితిరికాదూ! ఆమాట పరిహాసమే కాబోలు! చల్లకువచ్చి ముంత దాచనేల?

వెంక - ఊరుకోరా. ఇది పరిహాస సమయముగాదు. అదిగో! లక్ష్మణకవి కాగితము, కలము పట్టుకొని వచ్చుచున్నాడు పద్దులు వ్రాయుటకు కాబోలు లక్ష్మణ కవిగారూ! ఈలాగున దయచేయండి యిచ్చట పెద్దలంతావున్నారు.

లక్ష్మణకవి - (ప్రవేశించి) అయ్యో ! ఈలాగున మూగితే నేనేమి చేయుదును? మీరు గడబిడ చేయకుండా వుంటే అందరికి సమముగా ముట్టచెప్పిస్తాను కూర్చుండండి.

పెద్దన్న - లక్ష్మణకవిగారూ! మీరిచ్చట కూర్చుండి నేను జెప్పినపదల్లా వ్రాయండి. యెవ్వని నోరు మెదల్పనీయను.

లక్ష్మణ - సరే చెప్పండి వ్రాసెదను . సంస్కారములు కనిపెట్టి మఱి చెప్పండి. విద్యావతి పరీక్షచేసినచో మాయదక్కదు.

పెద్దన్న - ఆ సంగతి నాతో జెప్పవలయునా? ఈ గ్రామములో ముందు అహితాగ్నులను వ్రాయుట మామూలు గనుక వ్రాయండి వెంకట సోమయాజులుగారు (అని చెప్పగా)

విశ్వేశ్వరసోమయాజులు - (లేచి) పెద్దన్నా! నూర్వురు ఆహితాగ్ను లుండగా మహిషదానమునకు సిద్ధంచిన వేంకటసోమయాజులు ముంద జెప్పుటకు నీకు దొరకెనా. చాలులే నీపెత్తనము.

వెంకట - ఛీ ఛీ! నోరుమూయి. నేను మహిషదానము పట్టెదనా? అన్నా? ఏకవాహనము తినే విస్సిగారికి యజ్ఞముచేయడముతోనే యెంతపొగరు వచ్చినది.

విశ్వేశ్వర - ఏమని కూయుచున్నావూ? విస్సిగాడా? దవడపండ్లూడును. జాగ్రత్త! పొత్తర్లజాబులంతా యజ్ఞములుచేయుటచేతనే కాల మీలాగుననున్నది.

పెద్దన్న - మీరు గ్రుద్దులాడేయెడల యిరువురు దూరముగా బొండి. మీ సంస్కారములు నేనెరుంగనివికావు పాక తగలవేయడముతోనే గొప్పవారమని విఱ్ఱవీగుచున్నారు. ఒక్కరియింటిలో అగ్నిహోత్రములు లేవు. నోరుమూసికొని నేను చెప్పినట్లు వింటారా వినండి లేకుంటే తిలదానమైన నిప్పించేదిలేదు.

బుచ్చెన్న -- సోమయాజులు - పెద్దన్నా ! వీరిలో నీవెఱుంగనివారులేరు. నీ యిష్టమువచ్చినట్లు వ్రాయించు.

పెద్దన్న -- లక్ష్మణకవిగారూ ! అహితాగ్నులైనారు. ఇంక అవధానులు పద్దులు వ్రాయండి ఘనాపాఠీలు మూడువందలు.

లక్ష్మణ - వ్రాసినాను.

అప్పావధాని --- పెద్దన్నా! క్రమాంతమైనను పూర్తిగాని యీ సుబ్బన్నను ఘనాపాఠీలలో వ్రాయించినా వేమి? నీకు బంధువుడు కాబట్టియా? వాడిమాత్రము పనసవచ్చినవారు చాలామందియున్నారు వాళ్ళనుకూడా వ్రాయించు.

సుబ్బన్న – ఇచ్చేది భోగముదియుండగా మధ్యను నీపుట్టేమి మునిగినది. పెండ్లామును వంచుకోలేవుగాని యీలాటితగవులు పెట్టగలవు. ఘనలో నేమి యున్నది? సరిగమపదనిస లాగున నీవిద్యావతిని చెప్పుమంటే చెప్పుతుంది.

పెద్దన్న - లక్ష్మణకవిగారూ! వీనిమాటలు మనము వింటిమా మూడురోజులకు సాగదు. ఆధ్యయనపరుల పద్దులైనవి పేరిశాస్త్రిగారు మా గొప్పవారు వ్రాయండి.

పేరిశాస్త్రి - పెద్దన్నమాటకేమిగాని యున్నవారిం జూడు పొత్తర్ల బాబులు కూడ అయినతరువాత వ్రాయవచ్చునులే.

పెద్దన్న -- అట్లనుచున్నా రేమి? యిప్పుడు వాయించినవారు తక్కువవారా?

పేరిశాస్త్రి -- కుచ్చలకథలాగున వేదముపాడితే సరియా? ఎక్కడను క్రొత్తకుండ తడపనీయకుండా అష్టాదశవర్ణముల యిండ్లకు తిరిగేవారు కొందరు. పునహావతారాలు తిరిగేవారు కొందరు. తీర్థకాకములు లాగున రేవులలో దిరిగి నీరుకాసులు పట్టేవారు కొందరు. ఈలాటివారి నందరిని ముందు పేర్కొని యిప్పుడా నాజమ-- మామా సంస్థానములకు సైతము పిలిచినంగాని పోనే! యిచ్చటికి నేను రాదగినదా యేమో అద్భుతముగా అందరు చెప్పుకొనుచుండగా జూతమని వచ్చితిని గడేకారీ సజ్జులలో మామర్యాద జూచువారుందురా.

జగన్నాధావధాని - యేమి? వేదము కుచ్చలకథా! యంత సారస్యముగ్రహిం చితివి. నీ కంటె వీరు తక్కువవారా? రెండు వ్యాకరణపు ముక్కలు చదువుకొని యెగిరెగిరి పడుచున్నావు. స్వరయుక్తముగా సంధ్యావందనము చెప్పుచూతము.

పేరిశాస్త్రి --- అర్థము తెలియని మీ పాటవలన ప్రయోజనము లేదని రూఢిగా జెప్పుచున్నాను. ఊకదంపు, ఊరుకో నీతో మాటాడుటలేదు మాటకుమూడు తొస్సెలు వస్తవి.

జగన్నా - ఊ ఆలాగునేమి? కాని సభజేసి ఈ సంగతి తేలుస్తానుండు.

పేరిశాస్త్రి - నీ సదుగునకు సభలుకూడాను.

లక్ష్మణకవి - శాస్త్రులుగారూ! మీకు వీరితోనేమి? మీ అభిప్రాయమేమో చెప్పండి. పద్దులో ఎప్పుడు వ్రాస్తేనేమి యిప్పించేవాడను నేను మీకేమి దానము కావలయును.

పేరిశాస్త్రి - నేను వీరిలాగున చిల్లరదానములేమియు బట్టను ఇదివరకు జేయిచాపినవాడను కాను మాజ్ఞాతికుఱ్ఱవాని నొకనిగాటుకవేసి యీ రత్నావతిమూడు పుట్లభూమి యేకఖండిక లాగినది. మాకు చేలోచేను ఆ భూమి యిప్పించండి ఇక మరేమిన్ని నాకక్కరలేదు.

జగన్నాధావధాని - పడుపులంజ కాళ్ళు గడగియిస్తే పుచ్చుకొనుటకు సిద్ధముగానుండి తక్కిన వాళ్ళనందరిని అధములని యాక్షేపించెదవేల? నీ యెక్కువ యేమిమండినది? కంబళిలో తింటూ వెండ్రుకలు లెక్క పెట్టెన న్నట్లున్నది. వీరు మాత్రము తిలదానములు పుచ్చుకొనుటకు వచ్చినారనుకొంటివా యేమి? ఇస్తే అందరికి భూదానమందే యాస యున్నది.

పేరిశాస్త్రి - నీవు శుద్ధఛాందసుడవు నీతో నేను మాటాడను.

లక్ష్మణకవి - అవధానులగారూ! ఊరుకోండి పెద్దన్నగారు! తరువాయి శాస్త్రజ్ఞులను చెప్పెండి.

పెద్దన్న - లెక్కించి యిరువదిముగ్గురు వ్రాయండి.

లక్ష్మణ - అందఱిపేరుల వ్రాసినాను. తరువాత ?

సర్వశాస్త్రి -అయితే లఘుకౌముది చదివెనోలేదో శాస్త్రులని పేరుపెట్టుకొని తిరిగే యీవెంగన్నగాడి తరువాత నాపేరు? భావ్యముగా జేసిన ముండాకొడుకును గదా, పరువుమర్యాదలు చూడ వద్దా వీరి తండ్రి యిప్పటికి నీరుకాసులు పట్టుచున్నాడే.

వెంకన్నశాస్త్రి - ఏమీ నేను వెంగన్నగాడినైతే నీవు సర్విగాడవు కావూ. నాకు లఘుకౌముదియైనను రాదేమి నాతో సమానంగా పంక్తినన్వయించు పరశ్లోక మన్వయముకాదు. శాస్త్రజ్ఞులని విఱ్ఱవీగుచుందురు చూచుచుండగా నూరుపద్యములు చెప్పగలను. నీకు పదిరోజులు గడువిస్తాను ఒక్క పద్యము చెప్పు చూతాము.

సర్వశాస్త్రి - ఇదివరకున్న గ్రంథాలు చూచి యేడిసినాము. క్రొత్తకవిత్వములు చేస్తాము చాలులే. ఇప్పటి కవిత్వములలో సంస్కృతసమాస ముండెనేని పది తప్పులకు తక్కువ యుండవు. రామశబ్దమైన రానివాడూ కవిత్వమె.

వెంగన్న - కవిత్వము చెప్పలేని శాస్త్రజ్ఞు లీలాగేయాక్షేపించుచుందురు. మాసకమ్మ రవిక కుదిరినదికాదని రవికెను తిట్టునట. పాపము తన యవయవలోపమని యెఱుంగదు.

లక్ష్మణకవి - పెద్దన్నగారూ! ఈవ్రాతలో మొదటినుండియు దగాదానేవస్తూన్నాది. సరిగాజూచి చెప్పండి.

పెద్దన్న - ఏలాగున చెప్పినా యీ ముండాకొడుకులు వూరుకోరు. వారి మాటలజోలి మనకేల? తరువాయి వారిని వ్రాయండి సాహిత్యగాండ్రు శ్రౌతులు మధ్య సంస్కారులు సిద్ధాంతులు.

లక్ష్మణకవి - వ్రాసినాను.

సిద్దాంతులు - లేచి అందఱికన్న నధములు సిద్ధాంతులని నిశ్చయించినారు. బోలు. చిట్టచివర వీరి పేరులు వ్రాసినారే నెంతయుచితముగా నున్నది. జ్యోతిష్యము వేదాంగము లోకాంగముకూడా అగునుగదా? తెల్లవారిలేస్తే దీనితో పనిలేని వారుండరే. సురాపానతుల్యమగు సోమపానము చేసే శ్రౌతులకంటును తక్కువవారా? సంస్కారహీనులు పెత్తనముచేస్తే యిలాగేయుంటుంది.

శ్రౌతులు - మీయేడుపు మీరేడువవలయునుగాని మాజోలి మీకెందుకు? సోమపానం నింద్యమైనచో యజ్ఞములును నింద్యములే యజ్ఞముల జేయమని చెప్పిన వేదము బుద్ధిలేనిదే. మీ సిద్ధాంతము వలన దేలినది. ఇదియా చాలు. మాలసాతానులు చెప్పెడి జ్యోతిషపు ముక్కలు నాలుగు చదివినంతనే శ్రౌతుల నిందించుచున్నారా?

లక్ష్మణకవి - బాగు బాగు మీ తగవులు బ్రహ్మదేవుడు తీర్పజాలడు. పెద్దన్నగారు! విద్యావతి కబురుచేసినది. పద్దులైనవి యా యింకాయేమైనగలవా.

పెద్దన్న - అంశవారీలు గడేకారీలు వున్నారు. వీరిపద్దులు మాత్రము తరువాయి తక్కినవి అయినవి.

లక్ష్మణకవి - వీరలందరిలో ఎవ్వరు బ్రౌఢులు?

పెద్దన్న - అందరూ అన్నివిద్యలలోను ప్రౌఢులే. వీరి పేరులు మనము వ్రాయనిచో మన యాయువులు మూడినవే. ఈ యూరిలో నేను చెప్పినవారికి సంస్కారముతో పాటు పద్దులు వేయుచున్నారు కావున వ్రాయండి.

లక్ష్మణకవి - మీరు చెప్పిన ప్రకారము వ్రాసినాను. ఇంక నిచ్చట నేను నిలువజాలను ఈ చిల్లర బ్రాహ్మణులు నన్ను నలిపివేయుచున్నారు. ఊపిరి రావడము లేదు. లోపలకి బోవుదును. నన్నేలాగైన నీ సమ్మర్దమునుండి తప్పించి లోపల బ్రవేశపెట్టి నా ప్రాణములు గాపాడవేడెదను. (అని లేచుచున్నాడు.)

అప్పుడు కేకలు వేయుచున్నందున చిల్లర బ్రాహ్మణులందఱు లేచి లక్ష్మణ కవిని జుట్టుకొని నా పేరు. నా పేరు వ్రాయండి. నేను సంస్కారినని అరవజొచ్చిరి ఆసమర్దమునకు దాళక లక్ష్మణకవి పెద్దన్నను రక్షించి యీ యాపద దాటింపుమని వేడుకోగా నత డతని సందిట బట్టి యాబ్రాహ్మణుల ద్రోసికొని లోపలకు బోయెను. ఆ సందడిలో లక్ష్మణకవి చేతనున్న కాగితము నెవ్వడో లాగికొని చింపి పారవైచెను. పద్దులకాగితము పోయినది. పోయినదని కేకలువై చిరి. అప్పుడెల్లరు లేచి హల్లకల్లోలముగా రొదజేయ దొడంగిరి ఆ ధ్వని రత్నావతియు విద్యావతియు దొందరపడజొచ్చిరి. ఇంతలో లక్ష్మణకవి దీసికొని లోపలకు బోయెను.

అప్పుడక్కవి తన్ను బునర్జీవితునిగా దలంచుకొనుచు నూపిరి విడిచి విశ్రాంతి వహించి యింతలో దనచేతనున్న కాగితము జారిపోయినదని తెలిసికొని పశ్చాతాపము జెందజొచ్చెను.

ఆతండు మిక్కిలి ధారణశక్తిగల పండితు డగుటచే బెద్దన్న గ్రామములోని వారి నందఱిని నెఱింగినవా డగుటచేతను వెండియు దాను బూర్వము వ్రాసినరీతి అంతయు గుఱుతుంచుకొని యాప్రకారము బ్రాహ్మణుల బేరెత్తి పిలిపించుచు గ్రమంబున సాయంకాలము వరకు దాని యాస్తి యంతయు బంచి బెట్టించెను.

విద్యావతియు మునుపు తనతల్లి జంగాలజేసిన విటపురుషుల నెల్లర రప్పించి వారివారి ద్రవ్యముల గురుతున్నంతవరకు నిప్పించినది.

అట్లు బ్రాహ్మణులు పాత్త్రానుసారముగా దమకు దానమిచ్చిన వస్తువాహనంబులం గొని రాజమార్గంబునం బడిపోవుచుండ గొందరు తమ కేమియు దానములు దొరకలేదని తిట్టుకొనుచు నరుగుచుండిరి. అప్పుడు పౌరులకు వాండ్రకు నీరీతి సంవాదము జరిగినది.

పౌరులు - ఏమయ్యా! ముందువెళ్ళిన బ్రాహ్మణులు రత్నావతిని కామధేనువుగా బొగడుచుండ మీరిట్లు నిందించుచున్నారు. మీకేమియు దాన మియ్యలేదా?

బ్రాహ్మణులు - మాకేమిటి కిస్తారు. ఈ యూరునున్న సోమయాజులు, అవధానులు, శాస్తుర్లుగారలే కాని దానిద్రవ్యమున కితరులు నర్హులు కారట. ఇంతకు పెద్దన్ని గాడిదపెత్తన మీలాగున యేడిసినది.

పౌరులు - కోటిరూపాయలు విలువగల తనయాస్తి అంతయు రత్నావతి ఈ దినమున బ్రాహ్మణాధీనము చేసినదంటే మీకు మాత్రమేమియు దొరకక పోవడమేమి?

బ్రాహ్మణులు - ఏమియా? మా ప్రారబ్దము. కలియబడి అడుగుదామురా, అంటే మా బుచ్చిరామిగాడు లోపలకు వెళ్ళితే చచ్చిపోతామని కదలనిచ్చినాడుకాడు. మొదటి లోపలదూరినవారి పని అందఱిది బాగానేయున్నది. మేము వీథి గుమ్మము దాపున యేడిసినందులకు తలయొక పదిరూపాయలు దొడ్డిసంభావన పారవేసినారు.

పౌరులు -- పదిరూపాయ లిచ్చినదిగదా. ఇంకేమి; దానినింకా నిందిస్తారేమి.

బ్రాహ్మణులు - పదిరూపాయ లొకలెక్కా! శాకదానము బట్టిన శంభన్న వెధవగాడికి వేయిరూపాయలు ముట్టినవి. మాకర్మముగనుక యేదియు దొరకినదికాదు దానమిచ్చే లంజముండ అందఱిని సమముగా జూడవద్దూ రండవని క్షౌరమైనదిలెండి తనయిల్లు పురోహితున కిచ్చినది. ఆతం డీరాత్రియే గృహప్రవేశ ముహూర్త ముంచుకొనియెను. రేపు మూఢమి వచ్చునట. ఈరాత్రియే యా యింటిలోనుండి లేచి వెళ్ళగొట్టును. రేపటినుండి వీథుల తిరిపెమెత్తవలయు మమ్ముల నుసురుపెట్టినందులకు గూడు గుడ్డలకు మొగమువాచునులెండి అని దీవించుచు బోయిరి.

అట్లు రత్నావతి పుత్రికతోగూడ దనయైశ్వర్య మంతయు జాముప్రొద్దు పోవువఱకు బ్రాహ్మణులకు బంచిపెట్టి తమ్ము ననుసరించియున్న పరిచరులకు జాలినంత విత్త మిచ్చి యిష్టులతో జెప్పదగినరీతిం జెప్పి మహావిరక్తురాలివలె నొప్పుచు తన కాప్తులైనవారితో దన పయనంపు తెఱఁగు రహస్యముగా నెఱిగించియు వారు దుఃఖింప దాను వైకుంఠముననుండియు మిమ్ములఁ బరామర్శింపుచుందు నని యోదార్చుచు సమయ మయ్యెనని కూఁతురు దొందర పెట్టుచుండ రెండడుగులు నడిచి వెండియు నెద్దియో జ్ఞాపకమువచ్చి గదిలోపలికిఁ బోయి విరామము వీటితో నీకేమి రమ్ము రమ్మని విద్యావతి జీరుచుండ నెట్టకేల కాయిల్ లువదలి యామేడమేదకు బోయి తనతో వచ్చు వారిం దూరమునంద వారించి నటులు అంతరిక్షము జూచుచు శ్రీహరి రాక వేచియుండెను.

అంతలోఁ గందర్పుండు వింతగా అలంకరించుకొని యాజింక నెక్కి అంతరిక్షమార్గమున నామేడమీదకు వచ్చి చేరెను. రత్నావతి దాదులందఱు వారిరువురు వైకుంఠమునకుఁ బోవు ప్రయత్నముతో నున్నారని గ్రహించి మూలమూలనుండి శ్రీహరిరాకఁ జూచుచుండిరి.

అట్లు మేడమీఁద వ్రాలిన కందర్పుం జూచి అనుమానమునందుచు గూతు మూలమున నేమియు మాటాడక రత్నావతి చేతులు జోడించి స్తుతిచేయ దొడంగినది. తల్పగతుడైన అతని యొద్దకుఁ దల్లిని దీసికొనిపోయి విద్యావతి మ్రొక్కించి నమస్కరించి యిదియే మీదాసురాలు నాతల్లి, మీరు చెప్పినరీతి సర్వము బ్రాహ్మణాధీనము గావించి పయనమునకు సిద్దముగా నున్నదని చెప్పెను.

అప్పు డతండు శిరఃకంపము సేయుచుఁ గానిమ్ము నేఁటికి బూతురాలయ్యె. వైకుంఠమునకుఁ దీసికొని పోయెదనులే యిరువుర నొకసారి వాహనముమీదఁ గూర్చుండబెట్టుకొనుట గష్టము. నిన్నుముందుగా దీసికొనిపోయెద రమ్మని చెప్పెను.

అదియు అందులకు సమ్మతించి ప్రయాణమునకుఁ దొందరపెట్టుటయు అతండు వేచి యాజింకను రహస్యముగా బూరించి యెక్కుమని చెప్పిన అప్పొలఁతి దేవా నేను ముందుఁ గూర్చుండనా వెనకఁ గూర్చుండనా అని పలికెను.

పూర్వము మనోరమయు నాజింక నెక్కునప్పు డారీతినే పలికెను. కావునఁ దటాలున అతని కప్పడఁతి జ్ఞాపకము వచ్చినది. అంత నాకందర్పుండు హా! ప్రేయసీ మనోరమా! అని పలుకుచు గరమాల ఖండితమైన పాదపంబు చందంబున నాజింకను విడిచి నేలంబడి మూర్ఛిల్లెను.

అప్పు డాజింకయుఁ గీలెడలుటచే గాలిపోయి చర్మమువలె నేలంగూలినది. అది చూచి విద్యావతి అయ్యో! సామీ! యిది యేమి యిట్లు పడితిరి? నాయం దనుగ్రహము దప్పెనా? అని శైత్యోపచారములఁ గావించుచు సేదదేర్చినది.

ఆతండు లేవకయే హారాజపుత్రీ! నిన్నెంత మోసము జేసితినే? కటకటా? అంతఃపురమున నుండనీయక నట్టడివిలో బాఱవైచితిగా! ఏనైతో, నన్నేమని వలవించితో! ఎట్టి యిడుమలం గుడుచుదున్నదానవో యని యూరక పలవరింపఁ దొడంగెను. అప్పుడు రత్నావతి కూతుంజూచి అయ్యో! శ్రీహరి కిట్టి అవస్థ యేమే? నిజముగా నితడు శ్రీహరియే? నాకనుమానముగా నున్నది. మీ గరుడవాహన మట్లు తోలుగానుండనేల? ఇదిఅంతయుఁ గపటముగా దోయచున్నది. నీవు గ్రహింపలేక నాకొంప ముంచతివి, ఇక నేమి యున్నదని గుండెల బాదుకొనుటయు దల్లిని వారించుచు విద్యావతి అయ్యో! అట్లనకే ఆయనకు గోపమువచ్చును. ఈస్వామికి మన మొక్కండ్రమే? ఎందరు దాసురాండ్రుగలరు. యెవ్వరో జ్ఞాపకమువచ్చిన వారికొర కిట్లు చింతించుచున్నట్లు తలంచెదనని పలుకుచు వెండియు అతని అడుగు లొత్తుచు స్వామీ! యింకను దెలివిరాలేదా? ప్రొద్దుపోయినది. వైకుంఠమునకు బోవుదము. లెమ్మని పలుకగా అతం డిట్లనియె.

అయ్యో! యెక్కడి వైకుంఠము? నీ వెవ్వతవు? కటకటా! కీలుజింక లేకపోయిన నింత మోసము రాకపోవునుకదా? అని సన్ననియెలుంగున మణియు పలవరింప దొడంగెను.

అప్పు డవ్విద్యావతి వెండియు నెద్దియో వేడుకొనబోయిన రత్నావతి యాక్షేపించుచు ఓసీ! నిర్భాగ్యురాలా? ఎక్కడి శ్రీహరియే? ఇంకను వేదనవుట నాకు దెలిసినది. ఇది కీలుజింక. దీని కిట్లు రంగులువైచి వీడెవ్వడో మనకొంప ముంచినాడు. నీ మాటనమ్మి నేనును గంగలో దిగితిని. అయ్యో? కట్టుకొనుటకు గుడ్డయినను లేదే? ఏమిచేయుదునని పలుకుచు నాజింకను పట్టుకొని విప్పిచూడ మరలు కనబడినవి.

అవి అన్నియు గూతునకు జూపుచు గత్తిచే నాజింకను గోసి యొకమూల, బారవైచి యిక నీ అనుమానము దీరినదాయని గుండెలు బాదుకొని యుచ్ఛస్వరంబున రోదనము జేయదొడంగెను. అయ్యాంక్రందనధ్వని విని దాని దాదులందరు అచ్చోటికి వచ్చి దానింజుట్టుకొని యేమి యేమని అడుగజొచ్చిరి.

అది వాండ్ర జూచి అయ్యయ్యో మీతో నేమని చెప్పుదుము? నా కూతురే నన్నేటిలో దింపినది. నాయైశ్వర్యమంతయు నొక్కదినములో బోయినది. అన్నన్నా యెట్టి జల్తారుచీరలే! యెట్టి మంచములే! ఎట్టివాహనములే! అటువంటివి నాజన్మములో సంపాదించగలనా? తినుటకొకపూటకైన అన్నములేదు. నిజముగా వైకుంఠమునకు బోవుదమనుకొంటిని కాని యిట్టి కపటమని యెవ్వరికి దెలియును. మహామునులకు బ్రత్యక్షముకాని భగవంతుడు దీనికిని నాకును బ్రత్యక్షమగునాయని యించుకయు శంకింపనైతిని, ఇది పుట్టినది మొదలు నాకు వ్యయమేకాని యించుకయు సంపాదనలేదు యెప్పుడో గొప్పగా నార్జించునను నాసతోనుంటిని. ఒక్కసారియే చక్కగా నార్జించినది. నివసించుటకు గొంపయైనలేదు, మఱికొంతసే పిందుండిన నా బ్రాహ్మణుండు వెళ్ళగొట్టును. ఇది అంతయు దెచ్చి పెట్టినది విద్యావతియే యని అనేకప్రకారముల దలంచుకొనుచు నేడువఁ దొడంగినది.

వాండ్రందఱు తెల్లపోయి చూడదొడంగిరి. విద్యావతియు నివ్వెరపడి యూరక చూచుచుండెను. అప్పుడు కందర్పుండా రోదనము వలన నించుక దెలివి వచ్చుటయు అప్పటి వృత్తాంతమంతయు మఱచి మీరెవ్వరు? నామనోరమ యెందు బోయినది? ఈయిల్లెవరిదని అడుగంగా విద్యాపతి ఏమయ్యా? అట్లనియెదవు నీ వెవ్వడవు. మనోరమ యెవ్వతియ. నిజముచెప్పుమని అడిగిన అతఁడు మఱచిపోయి దాని కిట్లనియె నేను గందర్పుడను రాజకుమారుడ మరజింక నెక్కి దేశాటనము జేయుచు దారిలో నొక పట్టణంబున మనోరమయను రాజపుత్రి మేడమీద వ్రాలి యా ప్రోయాలుమిన్న నిల్లువెడలించి యీపట్టణము జేరితిని.

ఆనారీమణి యూరిబయట తోటలోనున్నది ఫలములు కొని తీసికొనిపోవలయు నిందుదొరకునా అని పలవరించునట్లు చెప్పగా విని విద్యావతియు గుండెలు బాదుకొనుచు దల్లిని గౌగలించుకొని అమ్మా! నేటితో మనపని దీరినదే అని విలపింప దొడగినది.

అంతలో లోపలనుండి పురోహితుడు వచ్చి ఆయ్యో! యిదియేమి? అమంగళముగా నిట్లు రోదనము చేయుచున్నారే మేము గృహప్రవేశోత్సవము గావించుకొందము. పుణ్యాహవాచనము చేయవలయు శూద్రులిందుండరాదు. ఈమేడ దిగి యెక్కడికేనిం బొండని పలికెను.

ఆమాటలువిని రత్నావతి మఱియుం జింతించుచు నేను వైకుంఠమునకు బోవుదునుగదా అని నీకీయిల్లిచ్చితిని ఇప్పుడాపయనము చెడిపోయినది. కావున మేమీ యింటిలోనుండి పోవుటకు వీలులేదు. మీరు మీయింటికి బొండు. తనకుమాలిన ధర్మముండునా ఆనిపలికిన విని అలుకతో నా బ్రాహ్మణుం డిట్లనియె.

ఓహో! నీదాతృత్వ మనుకూలముగానున్నది. నిన్నెవ్వరిమ్మని యేడ్చిరి. నీ వలన గృహదానము పట్టినందులకు నన్ను గులములో బ్రాహ్మణులు వెలివేసిరి. దానికి బ్రాయశ్చిత్తమునకుగాను గొంతసొమ్ము రహస్యముగా మా గురువుగారి కిచ్చుకొన్నాను. యిప్పుడు నీవు దానమిచ్చిన వస్తువులన్నియుం దెచ్చితివేని యిదియు విడిచివేయుదును అని తగవుపెట్టెను.

అంతలో గందర్పునకు జక్కగా దెలివివచ్చినది. లేచి తన మోసమును తెలిసికొని శోకముడిగి ధైర్యము దెచ్చుకొని సీ వీండ్రను భంగపెట్టవచ్చి భంగపడుట తప్పు. మనోరమమాట తరువాత విచారించెదగాక అని యూహించి యంగములు సవరింపుచు నాప్రాంతమందు చినిగిపడియున్న జింకనెత్తి దీనినెవ్వరిట్లు చేసిరని యహంకారముఖముతో నడిగెను.

అప్పుడు రత్నావతి ఓరీ! మిత్రద్రోహుడా! నేనురా నేనురా నీవు దీనిమూలమున మాకొంప ముంచి యింక సిగ్గులేక మాటలాడెదవేల నీవు విష్ణుండువని నమ్మి నాకూతు గోతిలోకి దింపినది. నీ విష్ణుత్వ మేది చూపుము మరజింక నొకదాని నెక్కి పంగనామములు పెట్టుకొని శ్రీహరినని మమ్ము మోసముచేయుదువా? నిన్నిప్పుడేమి చేయించెదనో చూడుమని బెదరింపగా నతం డిట్లనియె.

సీ! రండ! కాఱు లరవకుము. రాజుతోఁ జెప్పి నీసిక గోయించెదను. అయ్యా వినుండు దీనిగూతురు విద్యావతికిని నాకును బెక్కుదినములనుండి సాంగత్యము గలిగియున్నది. అది యొకనాడు మాతల్లి వైకుంఠమున కెట్లుపోవునని నన్నడుగగా నది మహాపాపాత్మురాలు, దానికి వైకుంఠము దొరకదు. నరకమునకే పోవునని నేను చెప్పితిని అదియు మఱియు నన్ను బ్రాతిమాలుచుఁ బాపములకు నిష్కృతి యుండకమానదు. అట్టి ప్రాయశ్చిత్తము చెప్పి దీనికి ముక్తి కలుగునట్లు చేయుడని గోరగా బురాణములో నున్నరీతి దనకున్న ధనమంతయు బ్రాహ్మణాధీనము గావించెనేని వైకుంఠము దొరకునంటి ఇదియే నేను జేసినతప్పు. అట్లు చేసినది కాబోలు! చేసినవెంటనే వైకుంఠము దొరకునా? మరణావసానమునం గదా యెక్క,డికి బోవునది తెలియును లంజ పితరులకు బెట్టి యాకసమువంక జూచినదట. దీని మాటలట్లున్నవి. చూడుడు. మిక్కిలి వెలగలనాతోలుజింకను జించివేసినది. మీరు సాక్ష్యముగా నుండవలయు నానక నే నెఱుగనని పలుకగలదు నే నిప్పుడు రాజుగారియొద్దఁ జెప్పి శిక్షింపజేసెదనని అందున్న పురోహితబ్రాహ్మణునితో జెప్పెను.

అతనిమాటలు విని విద్యావతి విస్మయశోకాదులు మనంబున నావేశింప దల్లితో అమ్మా! యీయన మాటలను వింటివా? అతఁడు రాజుగారితో సైత మట్లే చెప్పును. దీనికి నిదర్శన మేది? మనమాటలు విశ్వసించువా రెవ్వరు? ఇది మనగ్రహస్థితి యనుకొని యెచ్చటకేని పోయి యెక్కడేని యుండుట యుచితము. రాననిన వెండియు ........................................ మనలనే రాజు ఆక్షేపించును. కానిమ్ము. ....................................ధైవానుగ్రహము. ......................ఎంతయో చెప్పినది.


అప్పుడు రత్నావతి కూతుఁ గోపించుచు ఓసి రండా! వీనియందు నీకింకను బక్షపాతము వదలలేదే. నీ వెఱింగియే యిట్లు చేసితివి కాబోలు. మీయిరువురు బదియారుసంవత్సరములనుండి నాయింటనున్న ధనమంతయు వ్యయపెట్టుచు యథేష్ట సుఖముల దృప్తులైరి. నీకిప్పుడేమి బాధ. కపటోపాయంబున నాయిల్లంతయు గుల్ల జేసి నన్ను జోగినిచేసి విడిచిన వీని నూరక విడువుమని వేదాంత ముపదేశింతువా? దీనిబట్టిచూడ నాకు నీయందును ననుమానము గలిగియున్నది. మీయందరి సంగతియు రాజుతో జెప్పెదను. ఇప్పుడు పూర్వపురాజు కాడు, న్యాయాన్యాయములఁ జక్కగా విచారించు సామర్థ్యముగల గ్రొత్తరాజు నాగదత్తుడు సింహాసన మెక్కెను. ఆయన పట్టాభిషేకమహోత్సవమునకు నేను మేళమునకు బోయితిని. నిజముగా శ్రీవైకుంఠపదము దొరకునట్లే, నీవీ శ్రీహరిని బెట్టుకొని అప్పుడు వచ్చితివికావు. అప్పుడు నన్నాయన యెక్కుడుగా మెచ్చుకొనియెను. ఇప్పు డీమాత్ర ముపకారము చేయడా? అని పలికిన విని తల్లిమాట త్రోసివేయలేక విద్యాపతి యూరకుండెను. అంతలో దెల్లవారినది.

అప్పుడు కందర్పుడును పురోహితుడును దానికంటే ముందే రాజసభకు బయనమైరి కందర్పు డెందేని బారిపోవునని రత్నావతి వారిని విడువకయే నడువ దొడగినది రత్నావతియు విద్యావతియుఁ గందర్పుడు పురోహిత బ్రాహ్మణుడు రత్నావతి దాదులు మఱికొందరు వీధింబడి నడుచుచుండిరి. రత్నావతి దానమిచ్చునని యాసతో పెక్కండ్రు బ్రాహ్మణులు మూగుటయు బురోహితుడు వారితో నప్పుడు జరిగిన వృత్తాంతమంతయుం జెప్పిన నప్పౌరులెల్ల జప్పట్లుగొట్టుచు రత్నావతిని బరిహాసము జేయదొడంగిరి.

మఱియు నడిగిన వారికెల్ల పురోహితుడిట్లు చెప్పుచుండ బౌరులెల్లరు హల్లకల్లోలముగా దానివార్త జెప్పుకొనదొడగిరి ఆహా! విద్యావతి తెలివి అంతయు నెందుబోయినది. యెవ్వడో వచ్చి శ్రీహరి ననినంత మాత్రమున నమ్మి తల్లిచే నింటగల ధనమంతయు బంచి పెట్టించినది. బాపురే యా బుద్ధిశాలి యెవ్వడో మంచి పుణ్యాత్ముడు దరిద్రులుగా నుండిన పెక్కండ్రు బాపనయ్యలు వీని మూలమున ధనికులైరి ఆ రత్నావతి యెందరికొంపలు దీసినది దానికి ప్రాయశ్చిత్తము కావలసినదే దీనికి నాగదత్తు డేమి న్యాయము చెప్పునో వినవలయునని యనేకు లనేకరీతుల జెప్పుకొనుచుండిరి. ఆయాక్షేపణవాక్యము లన్నియు వినుచు రత్నావతి సిగ్గుతో దలవాల్చుకొని వారితో గూడ నారాజసభకు బోయినది.

ఆ విచారణము వినుటకై పౌరులు, పెక్కండ్రు గుంపులు గుంపులుగా గూడు కొని యారాజస్థానమునకు బోదొడగిరి.

ఆనృపతియు వారియాగమనకారణముల వేరువేర పత్రికాముఖంబుల తెలిసికొని వారి నుచితస్థానముల గూర్చుండ నియమించి అందు ముందుగా రత్నావతిని నీవేమి చెప్పుకొనియెన వని యడిగిన అది లేచి నమస్కరింపుచు నిట్లనియె.

దేవా! నేను దేవరదాసురాలను. రత్నావతి యను దానను ఇది నా కూతురు విద్యావతి యనునది మా అక్క రుక్మవతి దాని గూతురు కామమంజరి కొన్ని సంవత్సరముల క్రిందట చనిపోయినది. మేమిరువురమే యీ పట్టణంబున బ్రసిద్ధి జెందిన దేవరదాసురాండ్రము. మా విద్యాగౌరవములు దేవరతండ్రిగా రెఱుంగుదురు ఈతోలుజింక జంకనిడుకొని కూర్చుండిన పురుషుండు కొంతకాలము క్రిందట నీమరజింక నెక్కి యాకాశమార్గమున మా విద్యాపతి యున్న మేడమీదికి వచ్చి తాను శ్రీహరినని చెప్పి దానిని మోసము చేసి ప్రతిదినము రాత్రులయందు వచ్చి దానితో గ్రీడించువాడు.

అదియు అతని నిజముగా శ్రీహరియే అనుకొని యితర చింతలేక సంతతము తద్గోష్టినే వర్తించుచుండునది తాను చెడిన కోతి వనమంతయు జెరిపినదను సామెత రీతి నీనాతి అంతటితో నూర కొనక నాతో నొకనాడు తాను శ్రీహరితో వైకుంఠమునకు బోవుదునని చెప్పినది. నేనామాటవిని యథార్థమనుకొని నన్ను గూడ దీసికొని పోవునట్లు శ్రీహరితో జెప్పుమని కోరితిని. అదియేమి చెప్పినదో రేపురాత్రి మనల శ్రీహరి వైకుంఠమునకు దీసికొనిపోవుటకు నిశ్చయించెను. మన ధనంబంతయు బ్రాహ్మణాధీనము గావింపవలయునని చెప్పిన నాదినమున బూచిన పుల్లయేని దాచక సర్వము పంచిపెట్టితిమి నాయిల్లీ కూర్చుండిన పురోహితునికి దానమిచ్చి అతినియమముతో మేడమీదికి బోయితిమి ఇంతలో నితండు వాడుకప్రకారము మీ జింకనెక్కి వచ్చెను. నా కూతురునను జూపుచు దేవునకు విజ్ఞాపన జేసినట్ల యీతని యొద్ద నిలిచి వైకుంఠమునకు దీసికొని పొమ్మని చెప్పినది. మోక్ష మబ్బుననిన నెవ్వరి కిష్టముండదు? ఈతడీ జింకను పూరించి ముందు విద్యావతి నెక్కమనియె. అదియు వెనుక గూర్చుండనా ముందు గూర్చుండనా అని అడిగినది. ఆ మాట వినినతోడనే యేమి జ్ఞాపకము వచ్చెనో కాని హా! మనోరమా? అని అఱచుచు నేలంబడి మూర్ఛిల్లెను. దాని మూలమున నితనిగుట్టు తెలిసినది. ఈతండు మమ్ము మోసము చేసెను. కావున నీ నష్టమంతయు నితనివలన మాకిప్పింపుడని దేవర గోరుచున్నదాన. నిదియే నా విజ్ఞాపనము ఈ పురోహితునికి మొదట మేము వైకుంఠమునకు బోవుదముగదా అని యిల్లు దానమిచ్చితిని. ఇప్పుడా ప్రయాణము చెడిపోయినది. కావున నా యిల్లు నాకిచ్చునట్లనుగ్రహింపుడు. ఆతని పనికి యారత్నావతి యూరకుండెను.

అప్పుడారాజు కందర్పుని జూచి నీవేమి చెప్పెదవని అడిగిన అతండు లేచి దేవా! ఈ రత్నావతి చెప్పిన దానిలో కొంత నిజము గొంత అసత్యము గలిగియున్నది. నేనా మేడమీదకు బోయినప్పుడు విద్యావతి నీ వెవ్వడవని అడిగిన గందర్పజనకుఁడనని చెప్పితిని అది పండితురాలు కావున నా శబ్దమునకు శ్రీహరి యని అర్దము చేసికొనినది కాబోలును. నా అభిప్రాయమదికాదు. కందర్పజనకుండనిన ధర్మవికారములు గలుగజేయువాడనని అర్థము. సాలగ్రామంబున హరిభావన యుండలేదా? నాయందు దానికట్టి అభిప్రాయ మున్నది కాబోలు నేనేమి చేయుదును. మఱియు నొకనాడు తన తల్లికి వైకుంఠము దొరకు విధియెట్లని అడిగిన దనకున్న ధనమంతయు బ్రాహ్మణాధీనము గావించెనేని దొరకునని చెప్పినమాటనిజమే! పురాణములలో అట్లున్నది కావున జెప్పితిని. ఇంతమాత్రముననే నాది తప్పైనచో బెక్కురీతుల నాశీర్వచనములు జేయు బ్రాహ్మణుల నందరిది తప్పేయగు ఆశీర్వచనప్రకార మెవ్వరికి లభించును. నే నొక్కకాసైన స్వీకరించితినేమో అడుగుడు ఇంత మాత్రమువ నన్ను దప్పుజేసినవానిగా నెంచి కారు లఱచుచు నాతోలుజింకను జించి పారవేసినది ఇది మిక్కిలి విలువగలది. దీని నేను దేశాటనము చేయు తాత్పర్యముతో నెరపుతీసికొని వచ్చితిని. దీని జించినందులకీ పురోహితుడే సాక్షి దేవర కెట్లు న్యాయమని తోచిన అట్లు చేయుడని చెప్పి అతం డూరకుండెను.

అతని మాటలువిని యానాగదత్తుడు మనంబున నెద్దియో ధ్యానించుచు గన్నుల నుండి వెల్వడు నానందబాష్పముల దుడిచికొనుచు గన్నులు మూసికొని యొక్కింతసే పాపీఠస్తంభంబున నోరగా జేరబడి కూర్చుండి అంతలో లేచి యోహో! దీని పర్యవసానము రేపుజెప్పెదను. అందరును బోయి రేపు రండని యానతిచ్చి అప్పుడు పీఠమునుండి లేచుటయు సభ్యులందరు లేచి క్రమంబున అయ్యొడయని అనుజ్ఞ గైకొని తమతమ నివాసములకు బోయిరి.

అప్పుడా నాగదత్తుడు గందర్పుని మాత్రము వెళ్ళనీయక హస్తము గైకొని తన యంతఃపురములకు దీసికొనిపోయెను.

కందర్పుడు వానితో నడుచునప్పుడు మనంబున నాహా! ఈ రాజకుమారు డెవ్వడో నన్నింత గౌరవముగా దీసికొనిపోవుచున్నాడేమి? నాకులశీలనామంబులు గ్రహించెనా లేక రత్నావతినట్లు భంగపరచినందులకు సంతసించెనా? వీని ముఖమందు మనోరమ ముఖచిహ్నములు గనంబడుచున్న వేమి? అయ్యో? నే కాంతను వెదుకక ఈ గొడవలో బడిపోయితినేమి యని పెక్కుతెరంగుల దలపోయుచు నాయనవెంట అంతిపురి కరిగెను. నాగదత్తుడు కందర్పుని శుద్దాంతమున గాంచనాసనాసీనుం జేసి యొరులెవ్వరు లేకుండ నాతనితో మెల్లన నిట్లనియె.

అయ్యా! తమదేశ మేమి, నామధేయ మేమి? యారత్నావతి అట్లు వంచించుటకు గారణమెద్ది? మీకు సంతానముకలదా? యథార్థము జెప్పుడు. నిజము గ్రహించితిని. నిక దాచనక్కరలేదు. నన్ను మీపుత్రునిగా నెంచుకొనుడు. మనోరమను దలంచుకొని చింతించుట ఆకాంత యెవ్వతియె? తదీయస్మరణమాత్రంబున బరితపించిరనుటకు గారణమేమి? మీవృత్తాంతమంతయు వినవేడుక అగుచున్నది. వక్కాణించెదరే? అనిఅడిగిన గందర్పుండు తదీయమృదుమధురగంభీరసంభాషణములకు డెందం బానందమంది యింతయేని గొరంతబుచ్చక తనకథ అంతయు అతని కెఱింగించెను.

అప్పుడు నాగదత్తుడు ఒకయుత్తరమును వ్రాసి పరిచారిక చేతి కిచ్చి లోపలకు అంపెను. అంతలో లోపలనుండి యొక మత్తకాశిని తత్తరంబున జనుదెంచి ప్రాణే శ్వరుం డెచ్చ టెచ్చటని పలుకుచు నాగదత్తుని మ్రోల మాటలాడుచున్న కందర్పుని పాదంబులబడి హా! జీవితేశ్వరా? రక్షింపుము. రక్షింపుమని వేడుకొనిరి.

అప్పుడు కందర్పుడు తెల్లబోయి ఆ! యిది యేమి చోద్యము ? ఈ జవ్వని యెవ్వతియ. నన్ను బ్రాణేశ్వరా అనుచున్నదేమి? సుభద్ర కాదుకదు? అమ్ముదిత యిచ్చట కేలవచ్చును? ఒకవేళ మనోరమ యగునా? నాకంత భాగ్యము కలుగునా? అయ్యో! నాపాదంబులంబడిన ఇప్పడతి మొగము శిరోజములచే నావృతమగుట గురుతుపట్టరాకున్నది. దీనికేమని నేను బ్రతివచన మియ్యను అని బహువిధంబుల దలపోయుచు ఆర్యా! ఈకాంత యెవ్వతెయో నాకు దెలియకున్నది. గుఱుతు లెఱుగజెప్పుము. ఈ మెకు నీ వేమికావలయునని నాగదత్తు నడిగెను.

అప్పుడతండు అయ్యో! తాతా యింకను నెఱుంగకుంటివా ? ఈమె నీవల్ల నాడీ వీటిప్రాంతమున విడువబడిన మనోరమయే. నేను భవదీయనందనుండ దైవకృపచే నాపత్తులన్నియుం గడిచితిమని పలుకుచు నమ్మజాలక యేమేమీ! యిది స్వప్నముకాదుకద. నిక్కువమే అగుంగాక ప్రేయసీ! వదనమెత్తి చూపుము కడ కటా! తెలిసికొనలేకపోయితినే అని అవ్వనితామణిం గ్రుచ్చియెత్తి కౌగిటంజేర్చుచు బోఁటీ యీతడు నాపట్టి అగుటయెట్లు? అగునగు జ్ఞాపకమున్నది వత్సా! యిటురమ్ము. నేడెంతసుదినము. ఔరా గాలమహిమ! అయ్యారే! విధి నియంత్రమని పెక్కు తెరంగుల నాశ్చర్యమందుచు సంతోషముతో బుత్రుగౌగిలించుకొని శిరముమార్కొని డగ్గుత్తికతో పట్టీ! నీకీరాజ్య మెట్టువచ్చినది. ప్రేయసీ! నీవు నారాక తెలియక ఏమి చేసితివి? నన్ను గృతఘ్నునిగా దలంచితివి కాబోలు? దైవయోగమున నా కప్పుడట్టి బుద్ధిపుట్టినది. లేకున్న ప్రాణములకన్న ప్రియమగు నీమాట మరచిపోవుదునా? నీవు తరువాత నేమిచేసితివో చెప్పుము. వినుటకు నాకు మిక్కిలి యాతురముగా నున్నదని పలికిన నక్కలికియు గన్నీరు దుడుచికొనుచు నిట్లనియె.

నాగదత్తుని కథ

ప్రాణేశ్వరా! వినుండు మీరు ఫలములకై అరిగి యెంతసేపటికి రాకుండిన నేనా చెట్టుక్రింద గూర్చుండి పెక్కుతెరంగుల నంతరంగమునం దలపోయుచు నెవ్వరేని నింతవారలు వచ్చినప్పుడు చెట్లమాటునకు బోవుచు సాయంకాలమువరకు మీరాక బరీక్షించి అప్పటికి నిరాశచేసికొని యుల్లంబు ఝల్లుమన మనంబున నిట్లు తలంచితిని. అయ్యో! దైవమా నన్నీ కందర్పకైతవంబున నాపత్సముద్రంబున ముంచితివా! నా ప్రియుం డెద్దియో యాపదంజిక్కినట్లు తలంచెద, లేకున్న నన్నొంటిమై డించి జాగుజేయువాడా? ఇక రాడు ఆ! యేమీ ఇప్పుడు నేనేమి చేయవలయును ఇది అంతయు నిక్కువమే! నేను నాయంతఃపురము దాటి యిచ్చటికెట్లు వచ్చితిని. ఇది స్వప్నము కాబోలు నిజముగా గందర్పుడనువాడెన్న డేని నా యొద్దకువచ్చెనా? అయ్యయ్యో! ఆకుమఱుంగుపిందెవలె నేయాపదయు నెఱుంగక యంతఃపురంబుల బెక్కండ్రు చేడియ లూడిగములు సేయ సుఖపరంపరలచే గాలక్షేపము చేయుచుండెడి నాకెట్టి యవస్థ వచ్చినది? కట్టా ఇప్పు డెందు బోవుదును? ఎవ్వరితో చెప్పుకొందును? న న్నూరడించువారెవ్వరు? అని పరిపరిగతుల దలపోయుచు మీరు వెళ్ళిన మార్గమున నెవ్వరు వచ్చినను మిమ్ముగానే తలంచి చూచుచు గాకుండిన హా! అనివేడి నిట్టూర్పు నిగుడ్చుచు బ్రొద్దుదెస జూచి గుండెలు బాదుకొనుచు నీరీతి గురరియుంబోలె బెద్ద తడవు విలపించితిని.

అంతలో సాయంతన సమయమగుటయు నాకు నేన యుపశమించుకొని యెద్దియో మొండిదైర్యము హృదయంబున గదుర బురములోనికి బోవ నిశ్చయించుకొని మేని అలంకారములన్నియు దీసి మూటగట్టుకొని పటణాభిముఖముగా మీరు పోయినదారినే పదిఅడుగులు నడిచి నంత నాప్రాంతమున నొక వేశ్యమాత ఇందొకచోట గూర్చుండి యేడ్చుచుండెను దానిం జూచి దాపునకు బోయి నేను అవ్వా! నీ వెవ్వతెవు? ఇట్లు విలపింప గారణమేమి? చీకటి పడుచున్నదే పురములోనికి రావా? అని అడిగిన నాజరఠ నన్ను గన్నెత్తి చూచి అయ్యో తల్లీ! నీవు మరల బ్రతికి నన్నోదార్చుటకై యిట్లు వచ్చితివే అని అరచుచు నాపై బడి కౌగిలించుకొనినది అప్పుడు నేను బెదరుచు నుది నక్కటికము దోప ఆమ్మా! నన్నెవ్వతెననుకొంటివి? నేను నీవనుకొనిన దాననుకాను ఎవ్వరికొరకిట్లు విలపించుచున్నదానవు నీ వృత్తాంతము జెప్పుమని సానునయముగా నడిగిన నది యిట్లనియె. అమ్మా! నేను బోగముదానిని నాపేరు రుక్మవతి నాకొకకూతురు కామమంజరి అనునది కలదు. అది నీ పోలికనే యుండునది. నా దురదృష్టవశమున కొన్ని దినములక్రిందట గాలధర్మము నొందినది. ఇది దానిస్మశానము నే డచ్చేడియ నాకు జ్ఞాపకమువచ్చిన నిచ్చటికి వచ్చి విలపించుచున్న దాన. ఇంతలో నీవు వచ్చితివి. నన్ను జూడ నాకూతురు జూచినట్లే యున్నది నీదేయూరమ్మ? మా యింటికొకసారి వత్తువా? నీవొంటిగా నిచ్చటికి వచ్చితివేల? నీ వృత్తాంతము సెప్పుమని అడిగిన నేనిట్లంటి అవ్వా! నేనొక రాచకుమార్తెను. గారణాంతరమున నీయూరు చేరితిని. నా పతియు దేశాంతర మరిగె నీయూరు వచ్చెనేమో చూడవలయునను తలంపుతో గ్రుమ్మరుచుంటి నేను గర్భవతిని ఆరుమాసములు గతించినవి నా బంధువులందఱు దూరదేశమందున్న వారు. నన్ను జెడుపనులకు నియోగింపకుందు వేని నీ వెంట వత్తునని పలుకగావిని యమ్ముసలిదియు దానికి నొప్పుకొని అప్పుడే నన్ను దన యింటికి దీసికొనిపోయినదిట నా కప్పు డంతకన్న వేఱొకదిక్కు లేమింజేసి అట్లు పలుకవలసి వచ్చినది. పిమ్మట నేనా వేశ్యమాతవెంట దానింటికి బోయితిని. ఆ వృద్ధవేశ్య మదీయరూపలావణ్యాదివిశేషములు జూచి నామూలమున ధనము సంపాదించుకొనవలయునని అభిప్రాయముతో నన్ను దీసికొనిపోయినది.

మిక్కిలి వైభవములతో నొప్పుచున్న దాని యిల్లుచూచి నేను వెఱగుపడుచు నవ్విలాసములకు జిత్తము జొరమి నొకమూలను బడియుండ శరీరము నిలుచుటకై అన్నము మాత్రము దినుచు సంతతము మిమ్మే స్మరియించుచు మీజాడ జూచుచు నతి కష్టముతో గాలక్షేపము చేయుచుంటిని. కొన్ని దినముల వరకు నెద్దియో పని కల్పించుకొని యాయూరిబయటకుబోయి మీజాడ నరయుచుంటిని. ఏమియుం దెలిసినదికాదు.

ఆ రుక్మవతి చెల్లెలు రత్నావతి అను వేశ్యవచ్చి నిత్యము దానితో నెద్దియో బోధించునది. కాని నేనంతగా విమర్శించితిని కాను. అంతట నాకు నవమాసములు నిండి ప్రసవవేదన యారంభించనతోడనే యీ రత్నావతి వచ్చినది. ఇరువురు నెద్దియో గుజగుజలాడిరి. అప్పుడు రుక్మవతి నన్ను జూచి అమ్మా! ప్రసవమగు సమయమున గన్నులకు గంతలు గట్టుకొనుట ఈదేశాచారమైయున్నది. మే మట్లు చేయుచున్నాము. దీనికి నీవు సందియమందవలదు సుమీ! అని పలికి నాకన్నులకు గంతలు కట్టినది.

మఱికొంతసేపటికి నేనీ ముద్దుపట్టిని గంటిని. కాని వాండ్రు అప్పసికూన నప్పుడే దయలేనివారై రహస్యముగా దీసికొనిపోయి ఈ పట్టణమున కనతిదూరములో నున్న యొకనూతిలో బారవిడిచిరి. మఱియు నాయెదుట నొక రాతిగుండు నుంచి అయ్యో? కూతురా? నీ వీరాతిని గంటివే. కటకటా అని పలుకుచు నాకంటి గంతలు విప్పిరి.

అప్పుడది అంతయు యథార్ధమనుకొని అప్పటి గ్రహస్థితికదియు సరిపడినదని నేను మనంబున దలుచుకొని శోక మడంచుకొనుచు గాలగతి కచ్చెరువందు చుంటిని.

నన్ను రత్నావతియు రుక్మవతియు దత్కాలోచితము లగు మాటలచే నోదార్ప దొడంగిరి కట్టా! అట్టియవస్థలో నైన నాకు జీవితాశ వదలినదికాదు. ప్రాణములకన్న ప్రియమైన వస్తువులు లేవు కదా? మఱికొన్ని దినములరిగిన రుక్మవతి నన్ను జూచి మంచివస్త్రములు ధరింపుమని మణిమండనములు మేన నలంకరించు కొనుమనియు నిత్యము బోధింప దొడగినది. నాయం దక్కటికముచే నట్లనుచున్నదని నేను తలంచుచు మనంబున నిష్టములేకున్నను దాని చిత్తము చిన్నవోవకుండ ననుమతించుచు గొంచెము గొంచెముగా నట్లు చేయుచుంటిని. మరియొకనాడు రత్నావతి నాయొద్దకువచ్చి యెద్దియో ప్రసంగములో నాతో మెల్లగా నో సుందరీ? నీ వెప్పుడును నివారింపుచునే యుందువేమి? నీ సౌందర్యము త్రిలోకమోదాజనకమై యున్నది. తొలిప్రాయములో నుంటివి నీజవ్వనమంతయు అడవిగాసిన వెన్నెలవలె నిష్ప్రయోజనము చేయుచుంటివేమి? నిన్ను జూచినప్పుడెల్ల నాయుల్లము దల్లడిల్లుచున్నది. మంచిపరువమున సరసమగు రతిసుఖ మనుభవింపని తరుణీమణి జన్మ మేటికి? నీ పూర్వవృత్తాంత మెద్దియో నాకు దెలియదు అదియునుగాక కాలానుగుణ్యముగా బ్రవర్తింపవలయును. ఇప్పుడు మాలో గలిసితివి మామకధర్మములనే అనుసరింపవలయును. నీవు సమ్మతింతువేని ధనికులైనవారి బెక్కండ్ర విటకాండ్ర రప్పింపగలను. నీకు దెలియకున్న మదీయధర్మములన్నియుం బోధించెద. వైశికప్రకరణ మంతయు మాకు గంఠస్తమైయున్నది. వశ్యౌషదములు మాయొద్ద బెక్కులుగలవని యెన్నియో చెప్పినది. కాని దానిమాటలేమియు చెవినిబెట్టక దాని కేమియు సమాధానము సెప్పక అప్పటికెద్దియో పని గల్పించుకొని యావలకుం బోయితిని.

మఱియొకనాడు సాయంకాలమున నాగదత్తుడు పట్టాభిషిక్తుండై మత్తగజ మెక్కి యూరేగుచుండగా నాజనసంఘములో దేవరయుందురేమో అను నాసతో మేడయెక్కి తొంగిచూచితిని.

ఆ యంతఃపురములో అతండు గజముపై నుండి నన్ను జూచెను. నేనును వేశ్యవాటికలో నుండుటచే నన్నును వేశ్య అనుకొని ఆతం డారాత్రి రుక్మవతికివార్త పంపెను.

అదియు నాయొద్దకువచ్చి ముద్దుగుమ్మా! నిన్ను నాగదత్తుడు చూచి మోహించి యిప్పుడు వార్తనంపెను. నేనేమి చేయుదును? రాజశాసన మనతిక్రమణీయమైనది గదా? నీవు సమ్మతింపవేని దప్పక ముప్పురాగలదని చెప్పిన అప్పుడు నేనుమనంబున అయ్యో? ఈచెడిపె నన్ను బలుమారు నీచకృత్యములకు బ్రోత్సాహపరచుచున్నది. నాకతంబున ధనము సంపాదించుకొనవలయునని దీనికి బుట్టినది. ఇంక నిందుండ రాదు. ఆ రాజువచ్చిన బాదంబులంబడి నా వృత్తాంతమంతయుం జెప్పి రక్షించుమని వేడుకొనియెద న్యాయముగా బ్రజలబాలించు నతనికి నాయందు దయపుట్టకుండునా? అని పెద్దతడవు విచారించి దానికేమియు బ్రత్యుత్తర మిచ్చితినికాను.

అప్పుడది అదియే మదీయాంగీకారసూచనముగా దలంచుకొని యారాత్రియే వచ్చునట్లు నాగదత్తునకు బ్రత్యుత్తర మంపినది. అతండును రహస్యముగా నొక్కరుండ యా రాత్రి మా యింటికి వచ్చి లోపల నడుచునపుడు చూడక త్రోవలో యావుదూడను ద్రొక్కెను. ఆక్రేవు అంబా అని అరచి వీడెవ్వడో వేగముగా బోవుచు నన్ను ద్రొక్కెనె అని తల్లితో జెప్పెనట. ఆ మాటవిని యా ధేనువు అయ్యో కూనా! వాడు మాత్రుసంగమము చేయుటకై అరుగుచున్నవాడు నిన్ను ద్రొక్కుట కేమిశంక వానికి గ్రిందును మీదును గనంబడుచున్నదా అని పలికినదట ఆరెండుమాటలును విని తనకాభాష వచ్చుచే నాగదత్తుడు సంశయించుచు అయ్యో! నేనిప్పుడు వారకాంత యింటికి వచ్చితిని. వీండ్రకును మాకును వావిలేక ఒకవేల నేను కోరినదాని మా తండ్రి యెప్పుడేని నుంచుకొనియెనేమో అరసెదగాక అని మొదటి యుత్సాహ ముడుగ అతండు నాయొద్దకువచ్చెను. అట్టిసమయంబున నేను మాసినచీర గట్టుకొని అలంకారములు దీసిపారవైచి కన్నుల నీరుగారుచుండ నొకమూల గూర్చుండి యుంటిని.

అట్లతండు గదిలోనికివచ్చి మంచముదాపున నిలువంబడి నన్ను జూచి కాంతా! నీవెవ్వతెవు అట్లు శోకించెదవేల? విటుల జూచి వేశ్యలు పరితపింతురే నీయందు వేశ్యాధర్మ మింతయేని గనంబడకున్నదేమి? యథార్థము చెప్పుమని అడిగిన నేనతని అడుగులకు యిట్లంటి.

దేవా! రాజనగా బ్రజలకెల్ల తండ్రివంటివాడు. నీవు నాకు దండ్రివగుదువు. నీవు నన్ను మన్నింతువంటివేని నావృత్తాంతమంతయుం జెప్పెదనని దైన్యముగా వేడుకొనుటయు అతండు మేను ఝల్లుమన దల్లీ! నీవు వెఱవకుము. నిన్ను మాతగా భావించెద నీవృత్తాంతము చెప్పుమనియె.

అప్పుడు నాకు బాలు చేపువచ్చి మేను గఱుపుచెంద నా వృత్తాంతమంతయు నామూలచూడముగా వక్కాణించితిని.

అప్పుడతండు శిరఃకంపము చేయుచు గోవత్ససంవాదము నా కెఱింగించి తల్లీ నీవు వగవకుము. నీకు నేను నిజముగా బుత్రుండనే. ఈరుక్మవతి కపటము జేసి నేను బుట్టినతోడనే నన్ను దీసికొనిపోయి యూరిబయటనున్న నూతిలో బారవేసి నీతో అట్లు చెప్పియుండవచ్చును.

ఈ పట్టణపురాజు ధర్మకేతుడనువాడు ఒకనాడు విహారార్థమై అరిగి దాహము కొరకు నొకనూతిదగ్గరకు బోయెను. అందులో శిశురోదనము వినబడినదట తొంగి చూడగా నే నందుంటి. నాపైకి నెండతాకకుండ నొకసర్పము పడగ విప్పి నీడబట్టుచుండెను. దానికి వెరగుపడుచు సంతానవిహీనుడైన యారాజు తన పరిచారకులచేత నన్నుదీయించి రూపవిశేషమును మెచ్చుచు దనకు సర్పరూపుడై భగవంతుడే వీని దయచేసెనని సంతసించుచు మిగుల వైభవముతో బుత్రోత్సవము గావించి నాకు నాగదత్తుడని పేరుపెట్టి మిక్కిలి గారాబముగా గన్నవానివోలె బెంచుకొనియెను.

మొన్ననే నాకు బట్టాభిషేకముజేసి అతండు తపోవనమునకు బోయెను. ఈ వృత్తాంతము మైనమట్టుకు ప్రస్తావముగా నాకతం డెఱింగించెను. వయఃపరిమాణము లెక్కింప నీవు చెప్పినది అదియు నొక్కటియే యైనది. అదియునుంగాక గోవత్ససంవాదము దీనికి అనుకూలించియేయున్నది. ఈనిక్కువము ముందు వీరిచేతనే చెప్పించెద మనమింక కోటలోనికి బోవుదము రమ్ము మాతండ్రినిగూడ వెదకి రప్పించెదనని చెప్పి అప్పుడే నన్నిచ్చటికి దీసికొనివచ్చెను.

మఱునాడు రుక్మవతి యింటనున్న దాదులఁ గొందఱిని రప్పించి అడిగిన వాండ్రు రహస్యముగా జరిగినకథ అంతయు జెప్పిరి. నాటంగోలె నేనిందు మీరాక వేచియుంటిని. ఈతడు నీపుత్రు డిదియే మావృత్తాంతమని చెప్పిన విని కందర్పుఁడు లెక్కించుకొని యాహా! కాలమున కెంతవేగము గలదు? నడిచినట్లే యుండదు. ప్రజలకు శుభాశుభంబుల గూర్చుచుండును. ఆందులకే భగవంతుడు కాలస్వరూపుడని చెప్పుదురు. అయ్యో! ఇంతకాలమైనదనుమాట జ్ఞాపకములేదు. నేను సంవత్సరములోగా నింటికిబోవలయునని బయలువెడలితిని నాకొరకు మాతల్లిదండ్రులెంత విచారించుచుందురో? అదియునుంగాక సుభద్రమాట నీకు జెప్పియేయుంటినికదా? అత్తరుణియు మద్విరహార్తిఁ గృశించియుండునని చెప్పుచున్న సమయములో మఱియొక తరుణివచ్చి అడుగులంబడినది. దానినిజూచి అతండు విభ్రాంతుండై నాతీ! యీ తరణి యెవ్వతెయని అడిగిన మనోరమ ఆర్యపుత్రా! ఇదియే మీ ప్రధమప్రేయసియైన సుభద్రయని చెప్పినది.

ఏమేమీ! సుభద్రయే? ఇచ్చటికెట్లు వచ్చినదని పలుకుచు అక్కలికిని గ్రుచ్చియెత్తి కౌగిటజేర్చుకొని ముద్దాడి చేడియా? నీవిచ్చటికి వచ్చి యెంతకాలమైనది? ఈ భాంధవ్య మెట్లు తెలిసికొంటివి. నీరాక విదంబెట్టిదో చెప్పుమని అడిగిన అప్పడంతి అతనికిట్లనియె. రాజపుత్రా! అమ్మరజింకను గైకొని మీరరిగిన కొన్ని దినములకు మాతాత యొకనాడు గదిలోనున్న జింకను దీసిచూచి గుండెలు బాదుకొనుచు నన్ను బిలిచి సుభద్రా! నాగదిలోనున్న జింకనుదీసి ఇది యెవ్వరిట్లుంచిరని నడిగెను. నేనేమియు నెఱుంగనని మాటలు దడబడఁచెప్పితిని. ఆతం డనుమానము జెందుచు ఏమే? నిజము చెప్పుము. దానివలన నాకు బెద్దపనియున్నది చిరకాలము నుండి ప్రాణప్రదముగా దాచితిని. నీవు తీసినట్టే నాకు బొడకట్టుచున్నది. అని మొదట నెన్ని యోవిధముల సామముచేత నడిగిన నేనెఱుగనని చెప్పితిని.

అప్పుడతండు కోపించుచు నిజముగా నీవెఱుగవా అనిపలికి నన్ను దాపునకు రమ్మని యెద్దియో మూలిక నాతలలోనుంచి సుభద్రా! నీవీ జింక సంగతి యెఱింగియు జెప్పకుందువేని యిప్పుడే చిలకవై పోయెదవు సుమీ. యాలోచించుకొనుమని అడిగినను నేను లజ్జాభయంబులు మనంబున మత్తలపెట్టుచుండ నిజము చెప్పక బొంకులే పలికితిని. ఆమ్మూలిక ప్రభావమెట్టిదో కాని అప్పుడే నేను జిలకనై యెగిరి పోయితిని. అప్పుడు మాతాత విచారించుచు రమ్ము. రమ్ము. నీశుకత్వము బాపెదనని పిలిచెను. కాని అట్టి క్రూరునిచెంతనుండుట కిష్టములేక దూరముగానెగిరి యెచ్చటికో పోవుచున్న చిలుకలగుంపులో గలిసితిని. ఆ చిలుకలు రెండుమూడుదినములు నన్ను గ్రొత్తగా జూచుచు గ్రమక్రమంబున రానిచ్చినవి. పదిదినములవరకు నాకు జాతి జ్ఞానము గలిగియున్నది. అలోపల నేను దేవర అంతఃపురమునకు బోయి చూచితిని. కాని సర్వము శూన్యమైయున్నది. మీ తల్లిదండ్రులు నిద్రాహారములుమాని త్వదాయత్తులై యున్నవారు. దేవర దేశాంతరమరిగిన వార్తవిని నేనును ఆ గ్రామమును విడిచి కొన్ని చిలకలదోడుగా గూర్చుకొని పెక్కు దేశములు తిరిగితిని కొన్ని దినము లకు నాకు జాతిస్మృతి పోయినది. తరువాత నెందెందు గ్రుమ్మరితినో యేమేమి యాచరించితినో నాకుదెలియదు. మఱియొకనాడొక అరణ్యములో గ్రుమ్మరుచుండ బొదలరాయిడిగదలి నాసికలోనున్న మూలిక జాఱిపడినది కాబోలు నేనందు యథాపూర్వవేషముతో నిలువంబడి నన్ను నేను చూచుకొన పూర్వవృత్తాంతమంతయు జ్ఞాపకమువచ్చుటయు నలుమూలలు పరికించి యందు నెవ్వరింగానక మనంబున నిట్లు తలంచితిని. ఆహా! దైవము నన్నీ యరణ్యమధ్యంబున బారవైచి శాపాంతము గావించెను. నేను చిలుకగా నుండిన జక్కగానుండును. ఇప్పుడెందు బోవుదాన ఎవ్వరు దిక్కు అయ్యో! క్రూరమృగంబుల గోలాహలములు వినంబడుచున్న వే యని పెక్కుతెరగుల దలంచుచు నెందేనిసోవుటకు దారినరయుచున్న సమయంబున నొకమూలనుండి యొకవీరుడు విల్లంబులు ధరించి గుఱ్ఱంబుమీదనుండి యొకవరాహమును దరుముకొని నేనున్న చోటికి వచ్చెను వానిఁజూచి నేను మనుష్యదర్శనమునకు సంతసించుచు ఆర్యా! రక్షింపుము రక్షింపుము! దీనురాల దిక్కుమాలి యిందుంటినని యుచ్ఛస్వరంబున వేడుకొనగా నతనికి దయవచ్చి గుఱ్ఱమునాపి మెల్లగా నాయొద్దకువచ్చి దుఃఖోపశమనముగా నిట్లనియె. తల్లీ ! నీవెవ్వతెవు? జన మేన్యమైన యీకాంతారమున కెట్లు వచ్చితివి? నీపతియెవ్వడు? తల్లిదండ్రుల పేరేమి? నీవృత్తాంతము జెప్పుమన అడిగిన నేనిట్లంటి. ఆర్యా! నాకాపురము కుంభఘోణము, నా మనోహరుడు కందర్పుడు నాపేరు సుభద్ర. మాతాతపేరు మణివర్మ నేను విశ్వకర్మ కులస్థురాలనైనను క్షత్రియజాతుండైన కందర్పుని గాంధర్వవివాహమున వరించితిని మాతాతకు దెలియకుండ నొకనాడు మాయింటనున్న మరజింక నాయనకిచ్చితిని కొన్నిదినములకు మాతాత విమర్శించి మరజింక లేమింజేసి పరితపించుచు నాయందనుమానము చెందుచు దయావిరహితుడై నన్ను జిలుకజేసి విడిచి పెట్టెను. నేనును గ్రుమ్మఱుచు దైవవశమున నిందిప్పుడు చిలుకరూపము విడిచి పూర్వరూపము గైకొంటిని. దారితెలియక పరితపించుచున్న సమయములో దేవర యిచ్చోటికి వచ్చితిరి ఇదియే నావృత్తాంతము. నామనోహరుండైన కందర్పుఁడు నేను జిలుకరూపము గైకొనునప్పుడు దేశాంతరమందున్నవాడు. ఇప్పుడెందున్న వాడో తెలియదని పలికినవిని యతండు విస్మయాకుల హృదయుండై దిగ్గున గుఱ్ఱము దిగ్గనురికి నాకిట్లనియె.

తల్లీ! నీవు వెరవకుము. నేను కందర్పుని కుమారుండ నాపేరు నాగదత్తుడు మాతల్లి మనోరమ నేనాయన వెదకుచుంటిని మాతల్లివలన నీవృత్తాంత మిదివరకే నేను వినియుంటినని తన వృత్తాంతమంతయుంజెప్పి నన్నప్పుడే యిచ్చటికి దీసికొని వచ్చెను. నాటంగోలె నన్ను మనోరమ సోదరీభావమునను నాగదత్తుడు మాతృభావమునను జూచుచున్నారు. ఇదియే నావృత్తాంతము. చిరసమయ సంతృప్తమగు కేదారంబు ఘనోదయము బోలె భవదాగమనము నిరీక్షించుచున్న వారమని పలికి అక్కలికి యూరకుండెను. వారందఱు నాదివసము పరమానందసాగరమగ్నులై, యననుభూత హృదయానురాగ సూచకమగు సంభాషణములచే దృటిగా వెళ్ళించిరి.

అంత మఱునాడు నాగదత్తుడు తండ్రి అనుమతిని రత్నావతిని సభకు రప్పించి అదిచేసిన క్రూరకృత్యములన్నియు బ్రజలవలన విని యుగ్గడించి యిట్లనియె. ఓసీ! రత్నావతీ! నీకు వైకుంఠము కావలసియున్నదికాదా? కందర్పుని చేత నైనదికాదు. నేనంపెదను చూడుమని పలుకుచు నప్పుడే నా పితల రప్పించి తండ్రి చేసిన ప్రతిజ్ఞాప్రకారము సిగగొరిగించి విరూపమును జేసి గాడిదపై నెక్కించి రత్నావతి వైకుంఠమునకు బోవుచున్నది. ప్రజలువచ్చి చూడుడోయని చాటించుచు వీధులన్నియు ద్రిప్పుడని తనకింకరుల కాజ్ఞాపించెను. దీనికి శిక్ష చక్కగానున్నదని యెల్లరు సంతసించిరి. రాజభటులు తదీయ శాసనప్రకారము రత్నావతి నారీతి నూరంతయు నూరేగించుచున్న వారు. ఇదియే నీవుచూచిన వృత్తాంతము విద్యావతి తల్లికంటె గుణవంతురాలని కందర్పుడు చెప్పగా నాగదత్తుడు దానికి గొంత పారితోషికమిచ్చి యంపెను. నీవడిగిన ప్రశ్నమున కిది సమాధానముగా నున్నది. కాదాఅని అడిగిన మణిసిద్ధునకు వాడు వెండియు నిట్లనియె. తండ్రీ మీకు నిరుత్తరముగా గాక మరియొకలాగున జెప్పుదురా ? దీన నాకు మిక్కిలి సంతసమైనది. తరువాత కందర్పుడు భార్యాపుత్రులతో నింటికి బోవునా? అందేయుండునా? అనినడిగిన నయ్యతి యోహో ముందురాగల వార్తలుకూడ నీకు గావలయునా? ఇంచుకయు విడువవు. కానిమ్ము. చెప్పెద వినుము. కందర్పుడు తల్లిదండ్రుల స్మరించుకొని అమ్మఱునాడే భార్యాపుత్రులతో బయలుదేరి మిక్కిలి విభవముగా గుంభఘోణమునకు బోయి అందు దనరాక వేచియున్న జననీజనకులకు సంతోషము గలుగజేసెడిని చిలుకరూపముతో నుండుటచే సుభద్ర కొంతకాల మతిక్రమించినను సమారూఢ యౌవనయై కందర్పునకు రెండవభార్యయై సకల సుఖములం జెందెను.

మఱియు దానందు బట్టాభిషిక్తుండై పుత్రకు గొన్నిదినము లుంచుకొని స్వదేశమున కనుపును. అదృష్టవంతుల కెందేగినను లాభమేయగుంగదా అనిచెప్పి మణిసిద్ధుండు శిష్యున కధికప్రహర్షము గలుగజేసెను.