కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/19వ మజిలీ



శ్రీరస్తు

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

మూడవ భాగము

పందొమ్మిదవ మజిలీ

జయభద్రునికథ

శ్లో॥ శ్రీ మద్గౌరీలతాళ్లిష్టం జటావల్లవశోభితం
     విబుధాభీష్టంఫలదం శంభుకల్పద్రుమం భజే॥

పందొమ్మిదవ మజిలీయందు గోపకుమారుండు నగలవిశేషంబు లరయ నరిగి అతిరయంబునఁ దిరిగి పరుగిడివచ్చి మణిసిద్ధుని పదంబుల వ్రాలి యూర్పులు నిగుడింపుచు మహాత్మా! ఈవీటినడుమ బెద్దకోట గలదు. గుంపులుగాఁ గూడుకొనిపోవు జనులతో నే నాకోట ముంగలి యంగణము చేరితిని. అందు వలయాకారముగా జనులు మూఁగికొని యేదియో వింతఁ జూచుచుండిరి. నే నాగుంపులో దూరి పరికించితిని. చిటచిటారావములతో విస్ఫులింగము లెగయ ధూమంబు మబ్బువలె నెల్లడల వ్యాపింప మింటిపొడవున మండుచున్న చితియొండు గనంబడినది.

అది యెందులకో యని యాలోచించుచుండ నొకదండనుండి అండజయాన యోర్తు సకలాలంకారభూషితయై పుష్పాంజలితో నతిరయంబునవచ్చి అగ్నికి వలగొని యాపూవు లందువైచి చేతులెత్తి మ్రొక్కుచు

క. పతిభక్తి లేక యతఁ డుప
   పతియని నే నెఱిఁగి కామపరతంత్రఁత గూ
   డితి నేని యిపుడుఁ నన్నా
   హుతిగాఁ గొనుగాత వీతిహోతృఁడు బలిమిన్.

అని పలుకుచు అక్కలికి గుభాలున నాయగ్నిలో దుమికినది. కటకటా ఒక్కరైనను వలదని వారింపరైరి. కూడదని యడ్డగింపరైరి. అనుచితమని పట్టుకొనరైరి. చేతులు తట్టుచు నారాయణస్మరణ గావింపుచుండిరి. నే నప్పుడు అయ్యో అయ్యో అని గోలుగోలున నేడువదొడంగితిని. వినుం డందున్నవారికన్నఁ బావకుఁడే దయాళుడు అగ్నిభట్టారకుఁడే చల్లనివాడు. అచ్చేడియ బడినతోడనే జ్వాల లుపసంహరించుకొని నీరుజల్లినట్లు చల్లబడి యాజవ్వనిం గాపాడెను. అక్కలికి యగ్గిఁపడియు బుగ్గిగాక పుటంబిడిన బంగారమువలె వన్నెగలిగి మెఱయుచున్నంత జూచి యాప్రాంతమందున్న యొకచక్కనిచిన్నవాఁ డాకాంతచెంత కరిగి ప్రాణనాయకీ! రమ్ము రమ్ము. నీకళంకము బాసినదని పలుకుచుఁ జేతులు సాచి గుచ్చియెత్తి మంగళవాద్యములతోఁ గోటలోనికిఁ దీసికొనిపోయెను.

నే నప్పు డప్పడతివృత్తాంత మెట్టిదని యెవ్వరి నడిగినను నామాట వినిపించుకొనినవారు లేరు యింతయేల? మా అయ్యగారే అంతయుఁ జెప్పగలరని పరుగిడి వచ్చితిని. శిష్వుని మన్నించి యాప్తు నాదరించి యావృత్తాంత మెఱింగింపుఁడని పాదంబులం బడి వేఁడుకొనియెను. మణిసిద్ధుండు మణిప్రభావంబున అయ్యుదంత మంతయు నాకలించుకొని యిట్లు చెప్పఁదొడంగెను. గోపా! వినుము.

ఈ నగరము పేరు మణిప్రస్థము. కుంతిభోజుండను రాజు దీనిం బాలింపుచుండెను. అతండు సుమతి యను సతియందుఁ గాలక్రమంబున నేడ్వురఁ బుత్రులం గాంచెను. కడపటివానిపేరు జయభద్రుఁడు. వాని జన్మకాలఫల మరసి దైవజ్ఞులు ఈ బాలుండు భార్యమూలమున భూలోకమంతయు వ్యాపించినకీర్తి గలవాఁడగునని వ్రాసియిచ్చిరి. అవయవలక్షణంబులు పరీక్షించి సాముద్రికశాస్త్రవేత్త లాట బలబఱచిరి. రాజు వానిం గుమారసాదారణదృష్టిం జూడక అతి ప్రయత్నంబునఁ బెనుచుచు యుక్తకాలంబునం జదువవేసి సుమిత్రుఁడను మిత్రునితో జతపరచి పదుగురు నుపాధ్యాయుల నియమించి విద్యలఁ జెప్పించుచుండెను.

గంట నొకయుపాధ్యాయుడు వచ్చి యొక్కొక్కవిద్య గఱపుచుండును. కొన్నివత్సరములకు రాజపుత్రుఁడును సుమిత్రుండును బెక్కువిద్యల నధికపాండిత్యము గలవారైరి. రాజపుత్రునకు అన్నికళలయందు ఆభినివేశము గలిగినది కాని రసప్రకరణమునం దేమియు బ్రవేశము గలుగలేదు. తదుపదేష్ట కష్టపడి వాత్స్యాయనసూత్రములు రతిరహస్యము, అనంగరంగము, రతిమంజరి, రతిరత్నాకరము, రసమంజరి, లోనగు గ్రంధము లెన్నియో పలుమాఱు చదివించి బోధించెను. కాని వానిమనసు దానియం దేమియు రుచిగలది కాదయ్యెను. ఆ గ్రంధము లన్నియు నిష్ప్రయోజనము లని గురువుతో వాదించుచుండెను.

పరీక్షింప జయభద్రుఁ డితరవిద్య లన్నిటిలో మొదటివాఁడుగా నెన్నఁబడెను. రసప్రకరణములో ఆధముఁడుగా లెక్కకు వచ్చెను. ఆవిద్య గఱపు గురువు మిక్కిలి పరితపించుచు నొకనాఁడు శిష్యులిరువురు నుద్యానవనవిహారము సేయుచుండ అందుఁ బోయి వారిచే గౌరవింపఁబడి యుపవిష్టుండై రాజపుత్రున కిట్లనియె.

జయభద్రా ! నీకు విద్య గఱపిన గురువులందఱు నధికముగా బారితోషికము బొందిరి. నే నొక్కరుండ నిరసింపఁబడితిని. యెన్నిసారులు చెప్పినను నీకీరసము మానసమునఁ బట్టకున్నది. నే నేమి చేయుదును. దీనిం గ్రహించినఁగాని పురుషుని రసికుఁడనరు. రసమనిన నీవూరక యాక్షేపించుచుందుపు. మఱియొకసారి యుపన్యసించెద, కుశంకలు చేయక యాకర్ణింపుము.

రసములు తొమ్మిది.

శ్లో॥ శృంగారహాస్యకరుణారౌద్రవీరభయనకాః
      భీభత్సాద్బుతశాంతాశ్చరసాః పూర్వైర్న పస్మృతాః॥

శ్లో॥ రతిర్హాసశ్చశోకశ్చ క్రోధోత్సాహౌ భయంతథా
      జుగుప్సావిస్మయశమాః స్థాయీభావా నపస్మృతాః॥

శృంగారరసమునకు రతియు, హాస్యమునకు హాసము, కరుణకు శోకము, రౌద్రమునకు కోధము, వీరమున కుత్సాహము, భయానకమునకు భయము, భీభత్సమునకు జుగుప్స, అద్బుతమునకు విస్మయము, శాంతమునకు శమమును క్రమముగా స్థాయిబావము అని చెప్పఁబడు చుస్నవి.

శ్లో॥ విభావై రమభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః
      ఆనీయమానః స్వాదుత్వం స్థాయీభావోరసః స్మృతః॥

విభావము, అనుభావము, సాత్వికము, వ్యభిచారము, వీనిచేఁ దీసికొని రాఁబడిన స్వాదుత్వము స్థాయీభావమనంబడును. దానికే రస మనిపేరు. అందు విభావము ఆలంబనమనియు నుద్దీపన మనియును రెండువిధములు. శృంగారరసమునందు నాయికానాయకులును, రౌద్రరసంబున శత్రువులును, భ్రయానకరసంబున వ్యాఘ్రాదిమృగంబులును, ఆలంబన విభావంబులగుచున్నవి. గుణచేష్టాలంకార తటస్థములని నాలుగు విధముల నుద్దీపనవిభావం జొప్పుచున్నది. రూప యౌవనాదికము గుణము యౌవనంబువలనఁ బుట్టిన హావభావములు చేష్టలు; నూపురాంగదహారాదు లలంకరణములు; మలయానిల చంద్రాదులు తటస్థములు;

శ్లో॥ భ్రూవిక్షేపకటాక్షాదివికారోహృదయస్థితం
      భావంవ్యనక్తి యస్సోయమను భావమితీరితః॥

భ్రూవీక్షేపకటాక్షాదులచే హృదయమందున్నభావమును తెలుపుట అనుభావం బనంబడును.

శ్లో॥ స్తంభప్రళయరోమాంచా స్వేదొవైవర్ణ్యవేవధూ
     అశ్రువైవర్ల్యమిత్యష్టౌ సాత్వికాః పరికీర్తితాః॥

స్తంభప్రళయరోమాంచాదు లెనిమిదియును సాత్వికభావములు. రసమందంతటను నొప్పుచుండుటచే వ్యభిచారములని పేరువడసిన నిర్వేదగ్లానిశంకాది వ్యభిచారములు ముప్పదిమూఁడు. అవి సముద్రతరంగములవలె రసమందు బుట్టుచు నడుగుచుండును. మఱియు ననుకూలుఁడు, శఠుఁడు, దృష్టుడు, దక్షిణుడు అని నాయకులు నాలుగు విధముల నొప్పుదురు.

స్త్రీలలో జాతులు పద్మినీ, హస్తినీ, చిత్తినీ, శంఖినీ, యని సామాన్యముగా నాలుగు విధములు. అందు బ్రతిజాతియందును అవస్థాభేదంబులఁబట్టి వాసక, సజ్జిక విరహోత్కంఠిత, స్వాధీనపతిక. కలహింతరిత, ఖండిత, విత్రలబ్ధ, ప్రోషితభర్తృక అని యెనిమిది విధంబుల నామంబులతో నాయికలు విరాజిల్లుదురు. అందు బ్రతినాయికకును, బాల, తరుణీ (మధ్య) ప్రౌఢ వృద్ద, అనెడు నామంబులు వయోవిశేషంబునంబట్టి, యెప్పుచుండెడివి. మఱియు తత్వభేధంబులఁబట్టి స్త్రీజాతు లనేకరీతులం బ్రవర్తిల్లెడివి.

రాజపుత్రా! ధర్మార్థ కామమోక్షములని పురుషార్ధములు నాలుగు. అందు మూడవదియగు కామమునఁ గృతార్థుఁడగుటకే దీనిందెలిసికొనుటకు ఫలము.

శ్లో॥ జాతిస్వభావగుణదేశికఖర్మచేష్టా
     భావేంగితేషువికలోరసతంత్రమూఢః
     లబ్ధ్వాపిహిస్లలతియౌవన మంగనానాం
     కిం నారికేళ ఫలమాస్య కపిః కరోతి॥

జాతిస్వభావము గుణములు. దేశవిశేషములు, ధర్మములు చేష్టలు, భావములు, ఇంగితములు స్త్రీలయందీలక్షణములు దెలిసికొనుట యావశ్యకము. వీని తెఱంగెఱుంగని వాఁడు రసతంత్రమూఢుఁడని చెప్పఁబడును.

శ్లో. బాలా తాంబూలమాలా ఫలరసవర సాహార సన్మానహార్యా
    ముక్తాలంకార హార ప్రముఖ వితరణై రజ్యతె యోవనస్థా
    ....... ......... .......... ........ ......... ........ మధ్యమారాగలుబ్దా
    మృద్వాలాపైః ప్రహృష్టాభవతిగతనయాగౌర వేళాతిదూరం॥

తాంబూలమాల్యానులేపనాది మనోజ్ఞవస్తుప్రదానంబున బాలయు అలంకారప్రదానమున దరణియు మృదువులగు మాటలచే వృద్ధయు రజించును.

ఈ లక్షణంబు లెఱుంగని పురుషుఁడు కామంబున నెట్లు గృతార్థుండు కాగలడు? రాజనందనా! సర్వజనానుష్ఠేయంబైన రసపవృత్తి నీచిత్తంబునం బట్టించుచు నీ పరీక్షలోఁ కృతార్థుండవైతివేని నాగౌరవంబు నిలువఁగలదని పలికిన విని యాజయభద్రుం డాయన చెప్పిన విశేషము లనుభవముగాఁ దనమనమున కేమియు గోచరములు కాకుండుట తిలకించి తలయూచుచు నిట్లనియె.

చ. గురువర! చాలకష్టపడి కోవిదధర్మముమీర మీర లి
    త్తెరఁగున నానతిచ్చితిరి తెల్లముగాఁగ రసప్రవృత్తి స్త్రీ
    పురుషలకున్ బ్రభేదశతముల్ దగుఁగాక మృగంబులన్ ఖగో
    త్కరములలేవె భేదములు: తద్దతినొప్పెడి దీననేమగున్.

క తరుణీమణి పద్మినియై పరగినఁ జిత్తినియు నాప్తపతిగయు గలహాం
   తరితయునైనను నేమగు! గురువర! తద్విధముదెలిసికొనదెల్లముగాన్.

గీ. హావమఁట భావమఁట యనుభావమఁట వి
   భావమఁట సాత్వికంబఁట బాగుబాగు
   వీనిచే నేదొ రస ముద్భవిల్లునంట
   పేరులెన్నెన్నో చిత్తవికారమునకు!

గీ. మీరు చెప్పినయట్టి శృంగారరస వి
    శేషములనెల్ల శేముషీసీమ నవఘ
    టించి రాపాడఁజేసితి నించుకయును
    నెక్కదయ్యెను నామది కెక్కదింక.

ఆతని అభిప్రాయము గ్రహించి సుమిత్రుఁ డుపాధ్యాయునితో ఆర్యా మీరిప్పు డింటికి దయసేయుడు. మీరు చెప్పవలసినది చెప్పితిరి. నేనును గొంత చెప్పి చూచెదఁగాక అని అప్పుడే అశ్వకశకటము నెక్కించి యాచార్యునంపి సుమిత్రుం డతనికైదండ గొని మెల్లగా నడిపించుచు నావీటి వేశ్యవాటికకు దీసికొనిపోయెను.

ఎండకన్నెఱుగక మిక్కిలి సుకుమారముగలిగి కంతువసంతాదులతో బోల్పదగిన సౌందర్యముతో నొప్పెడి రాజకుమారుండట్లు సుమిత్రునితో గూడి వేడుకలు చూచుచు వీథింబోవుచుండగా నందున్న వారసుందరులందందు నొయ్యారముగా నిలువఁబడి శృంగారవిలోకనంబుల నారాజనందనుం వీక్షింపదొడగిరి.

ఆరాజకుమారుం డంతకుపూర్వ మట్టియువతులఁ జూచి యెరుంగడు. అపూర్వవిస్మయకౌతుకావేశంబున మరల వారిఁజూచుచుండెను గణికామణుల వదనచంద్రికామరీచికలన నొప్పెడు మందహాసప్రసారములు జయభద్రుని నయన కువలయంబుల వికసింపజేసినవి. పూబోడుల వేణీఘనదర్శనంబున రాజకుమారుని హృదయక్షేత్రంబున స్మరాంకురము ప్రాదుర్భవించినది. వాల్గంటుల క్రేగంటి చూపులు నృపనందనునికి శృంగారవిలోకనముల నేర్పినవి. మదనుండా జవరాండ్ర మెరుంగు లెరజూపి యారాచపట్టి హృదయంబు భేదింప జొచ్చెను ఆహా! కాంతాకృతులు నృపసూతికి దృటిలో స్మరవిభ్రమములు గలుగజేసినవి.

అట్లప్పడంతుల నెడతెగక చూచుచున్న యాతనిహస్తంబు గైకొని సుమిత్రుండు మెల్లన నడిపించుచు దత్తద్విశేషంబు లెరింగింపుచుండ నాదండమేడ నుండి యనంగచంద్రిక యనుగణికయొకర్తుక యా రాజకుమారుని రూప మాపోవక చూచిచూచి, తలయూచుచు సోయగమును మెచ్చుకొనుచు సుకుమారమును గొనియాడుచు, యౌవనము నభినందించుచు, వారిందోడితేర నేరుపుగల యొకచేటికిం బుచ్చుటయు నయ్యతివ అతిరయంబునం జని దారికడ్డముగా నిలువంబడి చతురముగా నిట్లనియె.

ఆర్యులారా! మీకు నమస్కారము. అతిసుకుమారగాత్రుడగు నీతం డిట్లు పాదచారియై నడుచుచుండ జూచువారికిగూడ క్లేశకరముగానున్నది. ఈ మనోహరుని మృదుపాదములు భూతలస్పర్శక్లేశంబున నెట్లు కందినవో చూడుడు. ఇంచుకసేపు విశ్రమించి యేగుదురుగాక యొకసారి లోపలికిదయచేయుడని యతివినయముగా బ్రార్థించిన సంతసించుచు నమ్మించుబోడివెంట సుమిత్రుం డతని నాయింటిలోనికిం దీసికొనిపోయెను.

మిక్కిలిజాణయగు నగ్గణికయు వారికి గొన్నియడుగు లెదురేగి యర్ఘ్యపాద్యాదులిచ్చి మచ్చికతో జయభద్రుని కేలుదమ్ముంగైకొని మెల్లన దోడ్కొనిపోయి పూపానుపునం గూర్చుండబెట్టి గమనాయాసంబువాయ బూసురటితో వీచుచు జిరునగవు మొగమునకు నగయై మెఱయ నిట్లనియె.

మనోహరులారా! ఆకృతివిశేషములు మీగౌరవములు తెలుపుచున్నవి. మీ యాగమనంబున నాయిల్లు పవిత్రమైనదనుట ముఖస్తుతికాదు. యష్మదభిఖ్యానుగుణ్యంబులగు వర్ణంబుల వాక్రుచ్చి నాకు శ్రోత్రసుఖం బాపాదింపుడు. మీవంటి యుత్తమాతిధుల సత్కరించుటకే యీ భవనము నిర్మింపబడినది. భుజంగశేఖరసేవాసక్తమగు మావంగడము కళానిధిశిరోమణులగు మీకు మన్నింపదగినదని నుడువనక్కరలేదు. నేననంగచంద్రికాభిఖ్యం బ్రవర్తిల్లుదునని చాతుర్యముగ బలికిన విని సుమిత్రుడు సంతసించుచు నయ్యించుబోడి కిట్లనియె.

వాల్గంటీ! నీవంటిపరోపకారపారీణల కిదియే తెరువు. నీసుముఖత్వ మెవ్వారికి హృదయరంజకము కాకుండును. నీయభిఖ్యయే కులశీలవిశేషంబులం దెలుపుచున్నయది నీదర్శనంబున జలజాంబికుడు వీనిహృదయంబున బ్రవేశించి నుత్పానందము గలుగజేయుచున్నాడు. నీకావించిన యుపచారంబులు మాకెంతేని సంతసం బొనరించినవి. ఈతం డీపట్టణపురాజైన కుంతిభోజుని యేడవ కుమారుండు. ఈతనిపేరు జయభద్రుడు. నేనీతని మిత్రుండ సుమిత్రుండనువాడ. ఈతం డీ పురవిశేషముల జూడంగోరిన రహస్యముగా నీవీథికిం దోడ్కొని వచ్చితిని ఇతండింతకు మున్నిల్లు కదలినవాడు కాడని చెప్పిన విని ముప్పిరిగొను సంతసముతో నన్నెలంత యిట్లనియె.

ఓహో! ఈతండు ధరామన్మధుండని ప్రసిద్దిచెందిన జయభద్రుండే! ఆహా! నా పుణ్యమేమి? ఈ దివసం బెంతసుదినము. అని పెక్కుతెఱగుల స్తుతిచేయుచు నత్తరి నత్తరు పన్నీరు పునుగు జవ్వాజి కస్తూరి లోనగు పరిమళవస్తువులతో మిళితమగు మలయజము దెప్పించి యారాజకుమారుని మేనం బూయుచు జారిన పయ్యెద నొయ్యన సవరించుకొనుచు నడుమనడుమ జిరునగవుతో దళ్కుచూపు లతనిమొగముపై నెరయుజేయుచు దడయార బూసురటిచే వీచుచు వింతపలుకుల నబ్బురము గలుగజేయుచు బెక్కుతెరంగుల నతనియంతరంగముగరుగ స్మరవిలాసములు చూపి, కమ్మనలుజిమ్మ బుష్పమాలికయొకటి యొయ్యారముగా నతనిమెడయందు వైచినది.

తదీయకరతలస్పర్శంబున మేనం బులకలుజనింప జిత్తంబునం బొడమిన క్రొత్తవికారము చూపులం దెలియజేయుచు నారాజపుత్రుండు వివశుండై యుండెను. సుమిత్రుండును తదీయచిహ్నంబులం గ్రహించి పంచేశరుని చేష్టలం దిలకించి విస్మయమందుచుండెను.

ఇంతలో సాయంకాలపుగంట గొట్టిరి ఆనినాద మాలించి యదరిపడి సుమిత్రుం డతివా! మేము వచ్చి తడవైనది పోవలయు. మే మొరు లెరుగకుండ నిచ్చటికి వచ్చితిమి ఱేనికిం దెలిసిన బ్రమాదము నీయాదరము పునరాగమనమునకు బ్రోత్సాహము జేయుచున్నది. నీనేస్తము మరువదగినది కాదని పలుకుచు బోవుదము లెమ్మని యతనిఁజీరి హ స్తమును గైకొనియెను.

అప్పు డప్పుడతి మొగంబున విన్నదనంబుదోప అయ్యో! యిప్పుడే పోయెదరా! ఈ మనోహరుని యాకృతిజూడ జూడదనివి తీరకున్నది. అదృష్టవశంబునం గాక యీ రాజకుమారుని దర్శనంబు దొరకునా! దాసురాలిం గరుణించి యెట్లయిన నీరాత్రి నిందుండం బ్రార్ధించుచున్న దాననని యెన్నియో చెప్పినది. కాని సమ్మతింపక సుమిత్రుం డయ్యంగనతో వెండియు రేపు వత్తుమని చెప్పి జయభద్రుని బలాత్కారముగా నందుండి లాగికొనిపోయెను.

అతి ప్రయత్నమున సుమిత్రుని వెంటనడుచుచు రాజకుమారుండు మిత్రమా! ఇప్పుడు మనల సత్కరించిన జవ్వని యెవ్వతియ? ఇంతకు మున్నట్టి యాకృతి గల కలకంఠిం జూచి యెరుంగనుసుమీ? ఈ వీథి కిదివరకు నీవు వచ్చితివా! మన పట్టణములో నిదియే ప్రధానపువీథియని తలంచెదను. ఇందున్న వారందరు వింతరూపులనొప్పియున్న వారు. ఆ పూవుబోడియు నీవు నెద్దియో మాటలాడిరి. నా కందున్నప్పుడు మేను వివశమైనదేమి? దానంజేసి మీమాటలు బోధపడినవికావు. మనము మరల అచ్చటికి బోవచ్చునా యని పలుమారడిగిన మాటయే అడుగుచు చెప్పినమాటయే చెప్పుచుండవిని సుమిత్రుండు నవ్వుచు నిట్లనియె.

వయస్యా! ఇప్పుడు మనల నాదరించిన పైదలి వారకాంత, వారస్త్రీ గణికా వేశ్యా అని మన మమరములో జదివిన పర్యాయపదములన్నియు దానికివర్తించును. ఆ వాల్గంటి యింటికి నెప్పుడుపోయినను బోవచ్చును. అది వెలయాలగుట నాటంకముచేయువారు లేరు. యిప్పుడు నీ హృదయంబులో నయ్యంగనఁ జూచుటచే శృంగారరసం బంకురించినది. గురు డెరింగించిన శృంగారరసప్రవృత్తి యిట్టిదే వినుము. మన్మథావస్థలు పదియని యిదివరకు మనము జదివి యుంటిమిగదా, నీవప్పడతిం జూచుటయే దృక్కు. దానంజేసి మనస్సంగంబు గలిగినది. పిమ్మట దానిగురించియే సంకల్పము గలుగుచున్నది. అది లభింపనిచో రాత్రులు నిద్దుర పట్టదు. దానిపేరే జాగరము. దానివలన గృశించుట తటస్థించును. ఈ రీతి అవస్థలన్నియు గ్రమంబున నుత్పన్నములు కాగలవు. ఈ గుణంబులు మనుష్యులకు సామాన్యములుగా నుపదేశంబులేకయే పొడముచుండును. తద్విశేషము లన్నియు నిటుపై నీకే బోధకాగలవు. ఇంతదనుక నన్యకాంతఁజూచి యెరుంగవు. కావున రసోదయముకాలేదని పలుకుచు గ్రమంబున విద్యామందిరమునకు దీసికొనిపోయెను.

ఆ రాత్రి జయభద్రుడు, అనంగచంద్రికాహాస దృగ్విలాసాదుల స్మరించుకొనుచు నిద్దురంజెందడయ్యె. ఉదయంబున లేచి ప్రాతఃకృత్వంబులం దీర్చుకొని యారాజకుమారుఁడు సుమిత్రునితో సుహృద్వరా! మనము దాని యింటికెప్పుడు పోయినను బోవచ్చునని చెప్పితివి కదా యిపుడు పోవచ్చునా? యిచ్చట మనము చేయవలసిన పని యేమి యున్నది? నన్నొకసారి మరల నచ్చటికి దీసికొనిపోవా? యని అడిగిన సుమిత్రుండు రాజపుత్రా! యిది సమయము కాదు.. అచ్చటికి సాయంకాలమే పోవలయునని చెప్పి యేట్టకే వాని నంతదనుక బోకుండ నిలిపెను. జయభద్రునికా కాలవ్యవధిగడియ యుగముగా దోచినది. సారెసారెకు బ్రొద్దు చూచుచు సమయమైనది లెమ్మని సుమిత్రుని దొందరపెట్ట జొచ్చెను.

అంత యథాప్రకారము సాయంకాలమున బయలువెడలి సుమిత్రుడు రాజపుత్రు నుద్వాసగమనకైతవంబున నయ్యంగచంద్రిక యింటికి రహస్యముగా దీసికొనిపోయెను. అదియు వారి కెదురువచ్చి తోడ్కొనిపోయి తల్పంబునం గూర్చుండబెట్టినది, అప్పుడు సుమిత్రు డెద్దియో కల్పించుకొని యిప్పుడే వత్తునని చెప్పి యుద్యానవనమునకు బోయెను.

అప్పుడా రాజకుమారుం డంతరంగంబున లజ్జాసంభ్రమకౌతుకంబు లొక్కసారి జనియింప నేమి చేయవలయునో తెలియమి నలుమూలలు సూచుచు సుమిత్రా! సుమిత్రా! యని పిలచెను. అప్పు డప్పడంతియు దాపునకుబోయి దాసురా లిందుండ సుమిత్రుని జేరెద రేల ఆయన ఇప్పుడే వచ్చెదనని చెప్పి యేగుట మీరెఱుగరా? పనులేమి? చెప్పుడు? మాకు మీ సేవకన్న వేఱొక కృత్యమేమియున్నదని పలుకుచు నతండు వలదు వలదనుచుండ బలాత్కారముగా హస్తములంగైకొని మేనెల్ల మలయజం బలందినది. సిగం బూవులు ముడిచినది కంఠంబున బుష్పమాలిక లర్పించినది. వీణ పాణింబూని అత్యంత మోహజనకంబులగు రాగంబులు వెలయ దంత్రీనాదంబుతో బికస్వర వికస్వరంబగు కంఠస్వరము మేళవించి హాయిగా బాడినది.

అప్పు డంతడాసుపాణి పాణిగ్రహణముగావించి కేళీలాలసుండగుటయు నారోపితశరాననుండైన కుశుమశరుం డేతత్కృత్యంబుల నెల్ల నతని కువదేశించెను.

అత్తరుణియు నతని యిచ్చవచ్చిన తెఱంగున వేడుక గలుగజేసినది. అట్లు వారిరువురు సుఖపారావారవీచికలం దేలియాడుచున్న సమయంబున సుమిత్రుండు వచ్చి జయభద్రుం జీరి యిప్పుడు చీకటిపడినదనియు నింటికిబోవలయు రమ్మని పిలిచెను. కాని రాజపుత్రుం డుదయమువఱకు దన్నచ్చట నుండనిమ్మని సుమిత్రుని మిక్కిలి వేడుకొనియెను. అతం డియ్యకొని అప్పటి కింటికిబోయి జయభద్రుని విషయమై యుపాధ్యాయునితో నెద్దియోచెప్పి యారాత్రి గడపి యుదయంబున మరలబోయి జయభద్రుం జీరెను.

అప్పుడు రాజకుమారుండు అయ్యో! మిత్రమా! రేపు ప్రొద్దున రమ్మని చెప్పిన అప్పుడే వచ్చితివేమి? నేను సుఖించుట నీకిష్టము లేదా? నీవు చేసిన యుపకార మెన్నటికిని మఱువను. ఇప్పటికిబోయి రేపు రమ్మని బ్రతిమాంగా వినినవ్వుచు సుమిత్రుడు, భర్తృదారకా? ఇప్పుడు సూర్యోదయమై రెండుగడియలైనది. చూడుము నీకు సుఖపారవశ్యంబున గాలనియమము తెలిసినది కాదు. రమ్ము పోవుదము. మీవారు నీ కొఱకు వేచియుందురని పలికిన నులికి పడుచు లేచి అతండు తలుపుతీసి యెడజూచి అన్నా! యేమి ఇది చిత్రముగానున్నది రాత్రి అంతయు దృటిగా దోచలేదే? అని పలుకుచు మనంబున నిష్టము లేకున్నను విధిలేక అమ్మగువకు జెప్పి అప్పుడతని వెంట నింటికి జనియెను. మఱియు సుమిత్రుండు నడుచునప్పుడు రాత్రి విశేషము లేమని అడిగిన అతనికి రాజనందనుం డిట్లనియె.

గీ. రసమనంగను శృంగారరసమె రసము
   రసికురాలన వేశ్యయే రసికురాలు
   గురునికన్నను నీకన్న సరసముగను
   దెలిపె శృంగారరసపరిస్థితులనెల్ల

గీ. తెలిసికొనలేకపోయితి దేశికుండు
    జాటి చెప్పినయట్టి రసప్రసక్తి
    యనుభవములేక యిపుడారహస్యమెల్ల
    దెల్ల మయ్యెను లెస్సగా దీనికతన.

అనంగచంద్రిక యనంగచంద్రికయే ఔరా! ఆమోహనాంగి! అని మెచ్చుకొనుచు రాజపుత్రుడు సుమిత్రునితో గూడ విద్యామందిరమున కరిగెను.

ఉపాధ్యాయుండు ఆ రాజకుమారుం జూచి వీని కన్నులింతయెఱ్ఱగానున్న వేమి? అని ఆడగిన సుమిత్రుండు, ఆర్యా: ఈతడీ దివసంబున బరీక్షించు తాత్పర్యముతో రాత్రి అంతయు శృంగారరస వ్యాసంగములోనే యున్నవాడు గాన జేసి నిద్రలేకపోయినది తద్రినప్రవృతి అంతయు జక్కగా గ్రహించెను. యెందేని బరీక్షింపుడని మొగంబున జిఱునగవొప్ప జెప్పినవిని వితర్కించుచు నుపాధ్యాయు డడుగ వారిరువురకు నీరీతి సంవాదము జరిగినది.

ఉపాధ్యాయుడు - సీ. చూడందగిన వస్తువులందుఘనమెద్ది?

జయభద్రుడు - తులలేక తగువెలందుల మొగంబు

ఉపా - వలపుగైకొనదగు వానిలో నెయ్యది?

జయ - మగువల వదనాబ్జమారుతంబు

ఉపా - వీనులకింపైనవానిలో నెయ్యది?

జయ - కోమలాంగుల ముద్దుగులుకుపలుకు

ఉపా - తనువుసోకిన సుఖ బొనరించు నెయ్యది?

జయ - నెలతల సొబగైన మేను తీవ

ఉపా - గీ. అతిమధురమెద్ది?

జయ - కాంతాధరామృతంబు

ఉపా - సరసజనులకు జింతింప జాలునెద్ది?

జయ - పువ్వుబోడుల వెలలేని జవ్వనంబు

ఉపా - వెలయు నెల్లెడనేవి?

జయ - తద్విభ్రమములు

అని యుపాధ్యాయుని మాటలకు బ్రత్యుత్తరమిచ్చి మఱియు నీరీతిం జదివెను.

చ. గొనబగు మేనసంకుమద కుంకుమపంక మెసంగ సిబ్బెపుం
    జనుఁగవ రత్నహారములు సారె బెసంగఁ బదాంబుజంబుల
    న్మొనసిన జల్గుటందియుల మ్రోత సెలంగ ననంగవైభవం
    బెనయఁగఁ గుల్కు కల్కి సొబ గెవ్వనిఁ దావలపింప దిమ్మహిన్.

అని మేనం బులక లుద్గమింప జదివినవినిం రాజకుమారుని మూపుదట్టుచు నుపాధ్యాయుండు, బాపురే జయభద్! మిక్కిలి విచిత్రములు వింటిమే. ఆహా! నీ నోటినుండి వెల్వడిన శృంగారప్రసంగము వినవలయునని నాకెన్నియో దినముల నుండి కోరికగానున్నది. నేటికి సఫలమైనది ఇంతలో నీస్వాంతము మారునని నేనెన్నడును దలచుకొనలేదు. ఇది సుమిత్రుని చాతుర్యమని యూహించెదను కానిమ్ము. ఎట్లయినను లెస్సయేయని మిక్కిలి సంతసించుచున్న యాచార్యునితో సుమిత్రుండు ఆర్యా! సకలశాస్త్రాభినివేశముగల యీతనికి శృంగారరసగ్రహణ మొక వింతయా? శాస్త్రానుభవముగలవానికి లౌకికానుభవం బెంతలో గలుగును? మీయనుగ్రహమే దీనికి గారణముగాని వేరొకటికాదని అప్పటికి దగినరీతి సంభాషించిరి.

ఇంతలో రాజకింకరు డొకఁడువచ్చి యెద్దియో యుత్తరము నుపాధ్యాయుని కిచ్చెను. దానింజదువుకొని గురుండు సుమిత్రునితో వత్సా! ని న్నిప్పు డేమిటికో అంతఃపురమునకు బంపుమని రాజుగారు వ్రాసినారు. కావున నీ వీకింకరుని వెంటనే యరుగుమని చెప్పగా సుమిత్రుండు సంతసించుచు జయభద్రుని రహస్యముగా జీరి, చెలికాడా! ఇప్పుడు మీ తండ్రి నన్ను బిలుచుట నీ విషయ మడుగుటకని తలంచెదను. ఇంతకన్న వేఱుకారణమేమియుం గానరాదు. నేను దృటిలో వచ్చెద నీ వెచ్చటికిం బోవక యిచ్చటనే యుండుమీ యని చెప్పి యప్పుడే రాజునొద్దకరిగెను.

వత్సా! నీ మిత్రు డెప్పుడైన దనవివాహము మాట నీతో ముచ్చటించునా వాని విద్యారూపశీలగౌరవముల బట్టి అనేకసంబంధములు వచ్చుచున్నయవి. ఇప్పు డింద్రసేనమహారాజుకూతురు సునీతి చిత్రఫలక మిదిగో పంపినారు. ఆ నాతి విద్యావతి, రూపవతి, గుణవతియు నని జగంబంతయు వాడుకమ్రోసినది. ఐశ్వర్యమున నితనిసాటి యెవరునులేరని ప్రసిద్ది అట్టిసంబంధము వచ్చినప్పుడు త్రోయరాదు. ఈబంధుత్వము చేయ వానితల్లికిని మిక్కిలి యుత్సాహముగానున్నది. ఈచిత్రఫలకమును దీసికొనిపోయి వారికి జూపి యొప్పింపుము. నీకు మంచిపారితోషిక మిప్పించెదనని చెప్పినవిని యానందించుచు సుమిత్రుండు వినయముతో నిట్లనియె.

దేవా! దేవరయానతిచొప్పున నాచరించెదను. జయభద్రుడు పెక్కుసారులు నాతో వివాహమును గుఱించి ముచ్చటించెను. మీపజ్జ లజ్జాభయంబులచే నేమియు మాట్లాడజాలరు. సునీతయను రాజపుత్రిక చారిత్ర మిదివరకు మేమును గొంత వినియున్నవారము. ఆయువతిం బెండ్లి యాడుటకు సందియములేదు. చిత్రఫలకము చూపి వాని సమాధానపరచి యిప్పుడే మీకు వార్తనంపెద. అనుజ్ఞయిండని పలికిన విని మెచ్చుకొనుచు రాజు, సుమిత్రా! అది స్త్రీలుచూచుటకు అంతఃపురమునకు బంపితిమి. నీవు పొమ్ము. ఇప్పుడే తెప్పించి నీ వేనుకయే అంపెదనని చెప్పిన మహాప్రసాదమని పలుకుచు సుమిత్రుండు విద్యామందిరమునకుం జనియెను.

అందు నలుమూలలు పరికించిన జయభద్రుడెందును గనంబడలేదు. అప్పుడు మిక్కిలి తొట్రుపడుచు అయ్యో వీడిప్పుడా వారకాంత యింటికిం బోయియుండును. నేనేమి చేయుదును? నేను దోడరాకుండగనే యొంటిగా జనియెను. యిక నాజోలి వీని కక్కరలేదు. చివరకు వీని నీదుర్వ్యసనము నుండి తప్పించుట శక్యము గాకుండెను. మహర్షులను గూడ ధ్వంసముచేసిన స్మరప్రవృత్తి రుచి చూపినపిదప మానిపింప వశమా? ఏమియు నెరుంగని దీని దుర్వ్యసనమున నేడు ప్రవేశపెట్టితిని ఱేనికిం తెలిసిన బ్రమాదముగదా! నామాటయు వీడిక వినునోలేదోకదా వెలయాండ్ర వలలో జిక్కినవానికి నన్యము తెలియదు మందులచే మతి చెడగొట్టుదురు. ఈ రహస్య మొరులకుం దెలిసినచో నతని మంచివాడుకకు గళంకమగును. గుప్తము సేయుటయే యుచితమని అనేక ప్రకారముల దలపోయుచు నుపాధ్యాయునికి గూడ జెప్పక అప్పుడే యవ్వారకాంత మేడకుంపోయి జయభద్రా! అని పిలిచెను.

అతని కంఠధ్వని గురుతుపట్టి అతండు లోపలికి రమ్మని పిలిచెను. సుమిత్రుడు లోపలికిరానని చెప్పుచు నొక్కమాట చెప్పవలసియున్నది. వినిపొమ్మని మరలజెప్పగా నెట్లకే నచ్చటికి వచ్చెను.

అప్పు డతనిచేయి పట్టుకొని నీవింత స్వతంత్రుడవైతి వేమి? మీతండ్రి నీకును వర్తమానము బంపెను. నీవు గనంబడలేదని కింకరులు వచ్చిచెప్పిరి. దానికి వారు తల్లడిల్లుచుండగా నేను తీసికొనివత్తు నతండు రహస్యముగా గూర్చుండి చదువుచున్నాడని చెప్పివచ్చితిని. యిందు జాగుచేసితివేని వారుకూడ విద్యామందిరమునకు వత్తురు. సునీతియను రాజపుత్రిక చిత్రఫలక మొకటి తెప్పించిరి. దాని నీకు జూపి నీ వనుమతింతువేని నిప్పుడే వివాహమునకు ముహూర్తము నిశ్చయించి శుభలేఖ వ్రాయుదురట. ఆసునీతి రూపము వర్ణింప జతురాశ్యుని వశముకాదు. వేగిరము రమ్మని పలికిన అతండిట్లనియె

చెలికాడా! నాభారమంతయు నీయదియేనని మొదటనే చెప్పితినికదా? నీకు సమ్మతమేని నాకును సమ్మతమే. చిత్రఫలక మతండు చూచెననియు సమ్మతించెననియు మా తండ్రితో జెప్పుము. శుభలేఖ వ్రాయింపుము. నీ వింటికి నడువుము. నీవెనుకనే వచ్చి కలసికొనియెదను. అనిచెప్పుచు అతనిమాట వినిపించుకొనక దీనస్వరముతో బ్రతిమాలుచు అతనింద్రోసి తలుపుమూసి లోనికిం బోయెను. అప్పుడు సుమిత్రుండు పెక్కుతెఱఁగుల దలపోయుచు నింటికిం జని వారికా రహస్యము తెలియనీయక సునీతిం బెండ్లియాడుటకు జయభద్రుండు సమ్మతించెననియు ముహూర్తము నిశ్చయించి శుభలేఖ వ్రాయవలయునని రాజుగారితో చెప్పెను.

ఆభూపతి దైవజ్ఞుల బిలిపించి ముహూరము జూడుడన నమ్మరునాడే మంచి ముహూర్తమున్నదని చెప్పిరి. అప్పుడారాజు శుభలేఖతోడనే కూలాచారప్రకారము మంత్రిసామంతాదిపరిజనంబులతోఁ గూడ విచ్చేసి వివాహము చేసికొని రమ్మని చెప్పెను. ముహూర్త మవ్యవధిగా నుండుటచే నాపరిణయప్రయత్న మంతయెక్కుడుగా జరుగలేదు, నాటిరాత్రి సుమిత్రుడు జయభద్రునొద్దకు పోయి వివాహవిశేషము లన్నియు జెప్పియింతవరకని చెప్పి మరునా డుదయంబున దప్పక వత్తునని యతనితో బ్రమాణికము

సుమిత్రుడు మరునా డుదయకాలంబున జని జయభద్రునిం జేరి అయ్యో! యింతమూఢుండవైతి వేమి? ని న్నీదినము బెండ్లికొడుకును జేయవలెనట. ఎన్నినాళ్ళు బొంకుదును. ఇప్పుడు రాకపోదువేని యీగుట్టు దాగదని యెన్నియో చెప్పిన విని యతం డెట్టకే గదలి వానివెంట నందు విద్యామందిరమునకుం జనియెను.

అంతకుఁ బూర్వమే యతనిని బెండ్లికొడుకుం జేయ దీసికొనిపోవుటకై వచ్చిన రాజకింకరులం జూచి బెదరుచు గండ మెద్దియో చెప్పి సుమిత్రునితో గూడ గోటలోనికిం బోయెను.

తల్లిదండ్రు లతని మిక్కిలి గారవించుచు మంగళస్నానములు చేయించి బ్రాహ్మణాశీర్వాదపురస్సరముగ వివాహమంగళకార్యంబుల దీర్చిరి. అతండున్మత్తునిక్రియ బ్రవర్తించుచుండ నాకొరల కేమియుం తెలియకుండ సుమిత్రుండు గాపాడుచుండెను. మరియు వివాహాదిదినమున గూడ నెప్పుడో సమయము చేసికొని యనంగచంద్రిక యింటికిం జనుచుండ నాగుట్టు బయల్పడకుండ సుమిత్రుండు వోయి అతని వెంబడియుం దీసికొని వచ్చుచుండెను.

ఈ రీతి నాలుగుదినములు గడిసినంత నైదవనాడు సునీతి మిక్కుటమగు సారెతో అత్తవారింటికి వచ్చినది. ఆచిన్నది తెచ్చినసారెఁ జూచి పౌరులు వెఱగుపడజొచ్చిరి. అంతకుం బూర్వమే యాసునీతి నిమిత్తము జయభద్రున మేడ నలంకరించి యుంచిరి. అపూబోడి యాసామాగ్రితో నామేడలో బ్రవేశించినది.

ఆదివసంబుననే కుంతిభోజునకు మిత్రుడైన యొకరాజు శత్రువులచే నోడింపబడి తనకు సహాయము రమ్మని కుంతిభోజునకు వార్త నంపగా నారాజు నార్గురపుత్రులతోగూడ సైన్యముల దీసికొని అచ్చటికిం బోయెను. జయభద్రుం డాయలజడిలో దన్ను విమర్శించువారు లేరని రహస్యముగా అనంగచంద్రిక యింటికిం జని యధేష్టకామసౌఖ్యముల బొందుచుండెను.

పాయంకాలము జయభద్రుని తల్లి సుమిత్రునిం బిలిపించి వత్సా! యీ జయభద్రునికి సిగ్గు మెండుగానున్నది. నాదగ్గరగూడ దలయెత్తి మాటలాడడు యీ రాత్రి వానినొక్కనిని సునీతి మేడకుం దీసికొనిపోయి అచ్చట జరుగవలసిన వినోదములు నడిపింపుము. పేరంటాండ్ర నెవ్వరిని రానీయను ఆయువతితో వచ్చిన వారెవ్వరేని యుండిన నుందురుగాక. నీవ యాతండు గాన నింత చెప్పుదాననని పలికిన నతండును సమ్మతించి పిమ్మట నతని వెదకెనుగాని యెందును గానబడలేదు. సుమిత్రుడు మిక్కిలి విస్మయము నొందుచు సునీతి చిత్రఫలకమును గైకొని యేకాంతముగా ననంగచంద్రిక యింటికిం బోయి ఆతని రహస్యముగా గూర్చుండబెట్టుకొని యాచిత్తరువు జూపుచు నిట్లనియె.

రాజపుత్రా! నీ చరిత్రము మిక్కిలి విపరీతముగా నున్నది. యెప్పటికప్పుడే యెద్దియో చెప్పి నన్ను మోసపుచ్చుచుంటివి వేశ్యలనగా నెటువంటివారో నీకు దెలియదు. చెప్పెదను వినుము.

శ్లో॥ వేశ్యా సౌమదనజ్వాలా రూపేం ధని వివర్జితా
      కామిభిర్యత హూయంతే యౌవనాని ధనానిచ ॥

రూపమనెడి సమిత్తులచే వృద్ధిపొందింపబడుచుండెడి మదనాగ్నియే వేశ్య. కాముకులు ఆజ్వాలయందు, తమ యౌవనములును ధనములును హోమము చేయుచుందురు. కావున వేశ్యాసంగమము దూష్యము. అదియునుంగాక నీభార్య రూపములో దీనికి సహస్రాంశములేదు. ఎన్నిసారులు చూడమన్నను నామె చిత్రఫలకమును జూచుటకే నీకు సమయము లేకున్నది. యిదిగో చూడుము యెంత చక్కగా నున్నదియో ఆహా! చతురాస్యుని నిర్మాణకౌశల్యమున కిది తుదికాదా! ఈలాటి పాటలగంధి వచ్చి మేడలో బ్రవేశింప నీక్షుద్రకాంత నిశాంతమున వసియింప నీకు బుద్ధి యెట్లొప్పుకొనెనో తెలియదు. ఒక్క సారి వచ్చి నీమేడం జూ కొనుము దాని నీదివసమున నింద్రభవనము లాగున నలంకరించిరి. మీ తండ్రి అన్నలతోగూడ మిత్రకార్యముమీద నరిగెను. మీతల్లి నీరాక వేచియున్నది ఈ రాత్రి నీమేడలో మంచి యుత్సవములు చేయుదురు. భార్యలేనివాని కిట్టిపాట్లుకాని నీకేల. వడిగా పోవుదము రమ్ము చిత్రఫలకములో నున్నవిషయములకన్న నాచిన్నదానియం దెక్కుడువిశేషము లున్నవని మీ తల్లి నాతో చెప్పినది. గాన పట్టణములోనివారెల్ల నప్పల్లవపాణి సోయగము నద్భుతముగా జెప్పకొనగా, నేను కంటినని యెన్నియో నీతు లుపదేశించెను.

జయభద్రుండామాటల కేమియు సమాధానము సెప్పక యాచిత్రఫలకము మాత్రము సాలాభిలాషగా జూచిచూచి తలయూచుచు, వయస్యా! యాచిన్నది నిజముగా నిట్లున్నదా! అట్లయిన నీరాత్రి దప్పక వచ్చెదను. నామాట నమ్ముము. నీవు ముందు నడచి అచ్చట జరిగించవలసిన కృత్యములు కావింపుచుండుము. ఇంతలో నీ కాంతను సమాధానపఱచి నేను వచ్చెదను. అనంగచంద్రికను లోకసామాన్యగణికగా దలంపవలదు. దానికి నాయందుగల మక్కువ యీపాటిదని చెప్పనేరను. నీవు పైపైన జూచిపోవుచున్నవాడవు కావున నీకేమియుం దెలియదు. కానిమ్ము ఎట్లయినను నేనీరాత్రి అచ్చటికి రాకమాననని యెన్నియో శపధములుచేసి ఆతని నంపెను. అనంగచంద్రికయు వారి మాటలను వినుటకు మాటుగా నొకబోటిని నియోగించినది కావున దత్సంభాషణవిషయములన్నియు దానికి బోధపడినవి.

జయభద్రుండును యా చిత్రఫలకమును హస్తమున బూని లోపలికింబోయి యాబోగముదానికిం జూపుచు యింతీ! యిందున్న సుందరి యెంత సొగసుగానున్నదియో చూచితివా. నీ బుద్ధిచాతుర్యము జూచెదను దీనంగల దోషములు నిరూపింపుము ఈలాటి బోటి భార్యగాగలవాని అదృష్టము మంచిదగునో కాదో చెప్పుము. అని యత్యంతసంతోషముతో నడిగిన విని యజ్జవ్వని అది ఆతనిభార్య యాకారమని గ్రహించి రూపవిశేషమునకు విస్మయము చెందుచు, నిట్టి కాంతగలసిన వెనుక తన్ను మరల జేరడని నిశ్చయించి దాని కొకయంతరాయము కల్పించవలయునని తలంచుచు నాపటమును పలుమారు త్రిప్పి చూచుచు శోధించుదానివలె నభినయించుచు నతండు పరాకునున్న సమయములో నాయాకృతి యెడమకంటిలోని గ్రుడ్డున దెల్ల మచ్చనంటించి యాశ్చర్యముఖముతో వితర్కించుచు రాజపుత్రా! యిటు చూడుము ఈ చిన్నది మిగుల జక్కనిదే కాని యెడమకంటిలో మచ్చయొకటి దీనికి గళంకము దెచ్చి పెట్టినది. మొగమునకు నేత్రములేకదా అందము దెచ్చునవి అట్టి అందములేని సౌందర్య మేపాటిది యీ యొంటికంటి వాల్గంటి నెవ్వనికో కప్పిపుచ్చి పెండ్లిచేయ వలయుంగాని పేరుగలవాడు దీనిని గైకొనడు. ఈ మచ్చయు నిదానంగ చూచినం గాని దెలియబడదు అని సాపేక్షముగా బలికిన నులికిపడుచు అతండా పటమును మరల గైకొని చూచి నంత నామచ్చ కనంబడినది.

ఓహో! యిది యేమి చోద్యము. యింతకు మున్ను మాకీమచ్చ గనంబడ లేదే. యిప్పు డెట్లు వచ్చినది. మేలుమేలు తొందరగా జూచితిమా యేమి? అని యాలోచించుచుండగా నా యతివ రాజపుత్రా! మీనేత్రములు పెద్దవి కనపక మీకు గనంబడినదికాదు మా కన్నులు చిన్నవి కావున గాన్పించినది. యిదియే కారణము. ఈ చిన్నది గ్రుడ్డిదికాకున్న జక్కనిదే! యిస్సిరో! యీమాత్రము దానికే అబ్బురముగా జీరితిరని పరిహాసము చేసినది.

అప్పు డతండు సిగ్గుపడుచు, అకటా! నన్ను నా మిత్రుడెంత ద్రోహము చేసెను. వానిమాట నమ్మి , విమర్శింపకపోవుటచే నిట్టికాంత తటస్థితించినది. అయ్యో! మాయన్నదమ్ములలో నన్ను గ్రుడ్డిదాని మగడని పిలుతురుకాబోలు. ఈ అపఖ్యాతి నాకెట్లు పోవును హా! దైవమాయని ధ్యానించుచు, గానిమ్ము దాని మొగమిదివఱకు నేనుచూచి యెఱుంగనుగదా! యింకను జూడను, లోకములో గ్రుడ్డివాండ్రెందరు లేరు. వారిలో నదియొకతె యిదియే దానికి బ్రాయశ్చిత్తము. నే నీ అనంగచంద్రికతో నైకమత్యముగా నుంటినని యీసుబూని, సుమిత్రు డీపని కావించెను కానిమ్ము యింతకన్న నేమిచేయగలడు. ఎట్టివారిని నమ్మగూడదని వ్రాసినశుక్రనీతి యథార్థ మగునని తలంచి, అది తనభార్యయని, దానితో జెప్పక, యాపట మొకమూల బాఱవైచి, సుమిత్రునియందు బద్దమత్సరుండై , నిట్టూర్పుల నిగిడించుచు గొంతసేపున కావెలది కావించిన యుపచారమువలన గలుషమైన మనస్సును నిర్మలపరచుకొనియెను.

అచ్చట సుమిత్రుడును సునీతియున్న మేడకుబోయి కడమ అలంకారము లన్నియుం గావించి, అతనిరాక వేచి యుండెను. కాని యెప్పటికి నతనిజాడ గనంబడదు మిక్కిలి కోపముతో అనంగచంద్రిక యింటికిం జనియెను. తలుపు మూసి యుండుటచే దాను వచ్చినట్లు లోపలికిం వర్తమానము బంపెను ఆ మాటలు విని జయభద్రుడు మిక్కిలి కోపించుచు, నెద్దియో చీటివ్రాసి చేటికచే నతని కందింపజేసెను. ఆచీటి విప్పి చదువ నిట్లున్నది! నీవు నాకు మిత్రరూపుడవైన శత్రుడవు. నీవు నాజన్మావధికి సరిపడిన అపకారము గావించితివి. యింతటితో నీ స్నేహము చాలును. ఇక నీవు నాదగ్గిర కెన్నడును రావలదు నీనీతులు నాకుపయోగింపవు. అని యున్న యుత్తరము గన్నుల నీరుగ్రమ్మ రెండుమూడు సారులు చదివికొని హా! ప్రియసుఖా! అని వణకుచు మూర్చవోయి అంతలోలేచి, తలయూచుచు అన్నా! వెలయాలిబోధ యింతచేసినది. ఆయ్యో, ఇకనాకు మీత్రుని దర్శనము లభింపదు కాబోలు. యేమిచేయుదును నేనితని కేమి యపకారముచేసితిని. యిట్లు పరుషముగా వ్రాయుటకు నేమి నిందమోపినదోకదా? ఒక్కనిమిషము నేను గనంబడనిచో మిక్కిలి పరితపించువాఁ డెంత యుగ్రముగా వ్రాసెను. మందులచే అతని హృదయముమార్చిన దీనినేమిచేసినను దోసములేదు. అయ్యో! అతనిరాక నిరీక్షించుచున్న సునీతితో నేమని చెప్పుదును ఆమెయుత్సాహమంతయు నిష్ఫలమయ్యెనే? కటకటా అని అనేకప్రకారముల బలవరించుచు, నెట్టకే ధైర్యము దెచ్చుకొని యిప్పుడును నతనియం దించుకయు నీసుబూనక గణికాకృత్యమును గుఱించి వితర్కించుచు మరల సునీతి అంతఃపురమునకు బోయి రహస్యముగా నొకయుత్తరము వ్రాసి సునీతికిం బంపెను.

తల్లీ! నీప్రియుండు వేశ్యాలోలుండై రాకున్నవాడు నాయం దకారణవైరము వహించి, నామాట పాటింపకుండె. నే నతనిగుఱించి మిక్కిలి ప్రయత్నము చేయుచున్నవాడ. ఇంతదనుక నీ వీగుట్టు వెల్లడిచేయక గుప్తముగా నుంచుము. కాలము మంచిదైన అన్నియుఁ జక్కఁబడును. అల్లరిచేసితివేని నిహపరములకు దూరమగుదువు. నీవు పతివ్రతవుగాన నింతగా వ్రాసితిని. అనియున్న యుత్తరము జదువుకొని, సునీతి తలయూచుచు, నేమియుం బలుకక యెవ్వరికింజెప్పకఁ వేఱొకరీతి అతనిరాక కభినయించుచు గుప్తముగాఁ గాలక్షేపము చేయఁదొడంగినది. సతులు పతుల నవమానపరుతురా? జయభద్రుడు భోజనసమయమునందప్ప సంతతము ననంగమంజరితోనే యుండును. అతని తల్లియు నన్నలును, ఆ రహస్య మేమియు తెలియక అతడు అంతఃపురములోనే యున్నవాఁడని, అంతగా విమర్శింపరైరి.

సునీతి కథ

సునీతి ప్రాతివత్యంబునఁ జంద్రమతింబోలినదగుట నాగుట్టు బయలుబెట్టక, తోడికోడం డెప్పుడేని, అక్కా! నీవొక్కమాటైన మామఱది నీవలకు రానీయవే చక్కగా వశపఱచుకొంటివి. అన్నలకన్న నతండే బుద్ధిమంతుఁడు. నీఅదృష్టము మంచిదని స్తుతిచేయ మనంబున సిగ్గుపడుచు రానినవ్వు దెచ్చుకొని వారికిఁ దగిన ట్లుత్తరమిచ్చునది. ఉత్తమాంగనలు పతులకుఁ దమయెడ నిష్టము లేకున్నను వారిం జులకన సేయరు.

ఇట్లు కొన్నిదినంబుల చనిన నొకనాఁడు సునీతి పరిచారిక భ్రమరిక అనునది ఏదియో యాకు దీసికొనివచ్చి సంతోషముతో సాయింతి కిట్లనియె.

అమ్మా! నీవు మిగుల సుందరివి. విద్యాశాలినివి, సుగుణవతివి, యిట్టి నీకనుకూలవాల్లభ్యము లభించియు సౌఖ్యము లేకపోయినది. పతి మిగుల చక్కనివాడఁట నేను జూడవలయునని యెన్నియో ప్రయత్నములు చేయుచుంటిని కాని నాకుఁ గనంబడకున్నాడు. ఎప్పుడువచ్చునో, యెప్పుడు పోవునో తెలియదు. అందఱు నీకడ నున్నాడని తలంచుచున్నారు. ఈ రహస్యము వారియాప్తులతోఁజెప్పి మందలింపఁ జేయవలయునని తలంచినను నీ వొప్పుకొనవు ఈవార్త మీతండ్రి వినిన నెంత కోపింతురు. నీకతంబున నాకేమియుం దోచకున్నది. నేను నీతోఁ బెనగినదానవగుట నింత చింతింపుచుంటిని. నేఁటి యుదయుమున నేనిందలి దేవాలయములోనికిఁ బోయితిని. అందు జటావల్కముల ధరించి రెండవ శంకరునివలె నొప్పుచు జపముచేయుచున్న యొక సిద్ధుండు గనంబడెను.

ఆయ్యతిపతిరూపము చూచినవారికి మహానుభావుండని తోచకమానఁదు. నేనును గొంతుసే పందుండి అందఱు వెళ్ళినతరువాత, నతని పాదంబులంబడి మహాత్మా! నీవు సామాన్యసిద్ధుండవుకావు. సర్వజ్ఞమూర్తివి, దయాశాలివి, పరోపకారపారీణుఁడవు. మీవంటి మహాత్ములు లోకంబుల రక్షించుకొఱకే దేశయాత్రచేయుదురు. నాదొక విన్నపముగలదు విని ప్రతిక్రియ చేయుదురను తలంపుతో వచ్చితిని మీరెరుంగని మంత్రములు తంత్రములు లేవు. నా మిత్రురాలొకతె యుత్తమగుణములు గలిగియు బతిచే నవమానింపఁబడినది. అతండు వేశ్యాలోలుండై యా లోలాక్షి గుణంబుల గణింపకున్నవాఁడు, దీని కెద్దియేని వశ్యౌషధము మీయొద్ద నుండకమానదు. ఆ దంపతులం గూర్చితిరేని మీకీర్తి శాశ్వతమై పుడమినుండుటయేకాక పారలౌకికసౌఖ్య మధికముకాఁగలదు. రక్షింపుఁడని పలుకుచుఁ బాదములు విడువక అతండడిగిన నీవృత్తాంతమంతయుఁ గ్రమ్మఱజెప్పితిని.

అప్పు డతనికి మిక్కుటమగు నక్కటికము హృదయంబున బొడిమినది హరినామస్మరణచేయుచుఁ దనబరణిలో దాచియుంచిన యీయాకుదీసి యిచ్చి, మచ్చెకంటీ! దీన పసరు దీసి నీవయస్య మగనిమేన నెచ్చటఁ దగిలించినను వశ్యుఁ డగు. దీసికొనిపోయి వేగమ అట్లు చేయి౦పుము. ఇది దేవతాసిద్ధౌషధము. సునీతి నీతిమతి నెఱింగి యిచ్చితివి కాని సామాన్యుల కియ్యనని పలుకుచు నన్ను గౌరవించి యంపెను. నేను సంతోషముతోఁ దొందరగా వచ్చితిని. యాలస్యమైన నెండిపోయి పసరురాదు. వేగమట్లు చేయుటకుఁ బ్రయత్నింపుమని పలుకుచు నాయాకుఁ జేతికిచ్చినది.

సునీతియు, సంతసించుచు నాయాకు స్వీకరించి, బోఁటీ! నీకు నాయందుఁ బుత్రికావాత్సల్యము గలిగియున్నది. కావున నింత శ్రమపడితిని. దీనివలన దైవకృపఁ నంతయు జక్కపడెవేని నాయైశ్వర్యమంతయు నీదే సుమీ? యాసిద్ధుం డుత్తముఁడే యని తోచుచున్నది. ద్రవ్యాశలేక యిట్టియుపకారముచేయుట కాతని కేమి అవసరము? కానిమ్ము ఈరాత్రియే అట్టిపని జరిగింపఁ బ్రయత్నింతు మఱియు నేనిదివఱకతని మొగము చూచియుండలేదు. ఈదినమున మాత్రమెట్లు సంఘటిల్లును దీనికుపాయ మేమన అడుగగా భ్రమరికి యిట్లనియె.

అమ్మా! వినుముఁ ఆయన భోజనమున కింటికి వచ్చునుగదా నీయత్తగారి నడిగి ఈరాత్రి నీవు వంటచేయుము. అతను భుజించుసమయుములో సులభముగా నీపసరుమీద జిమ్మవచ్చును. యింతకన్న మఱియొక సాధనములేదని పలుకగా సునీతి ఆయాలోచన మెచ్చుకొని కొంచెము ప్రొద్దుండగనే అత్తగారియొద్ద కరగినది.

రాజపత్నియు, ముద్దుగోడఁలిం దద్దయుగారవించి, సునీతీ! నీవు దారితప్పి యెట్లువచ్చితివి? నీవు వచ్చినది మొదలు మాచిరంజీవి యెప్పుడో నక్షత్రములాగున వచ్చి నిమిషములోఁదిని పోవుచున్నాఁడు. ఇదియంతయుఁ నీనేర్పరితనము. నేఁ డెద్దియో ప్రయోజన ముండక వచ్చుదానవు కావు. పని చెప్పమని అడిగిన అప్పడఁతి యామెకు నమస్కరించుచు మెల్లన నిట్లనియె.

అత్తా! మీరు సర్వజ్ఞులు, మీరెఱుఁగనిది యేమిగలదు? మీకుమారువి సెలవు లేక యేపనియు, జేయరాదుగదా. ఈరాత్రిఁ దనకుఁ బ్రత్యేకము వంటచేయమని చెప్పి పోయిరి. దానికె ముందుగా వచ్చితిని. యిదియే కారణము. ఆయుపకరణము లిప్పింపుఁడు వంటచేయుదును. అని యడుగగా నామె సంతసించుచు నా నారీమణి కోరిక ప్రకారమన్నియు సమరించినది.

సునీతి చక్కగా నలంకరించుకొని యరాత్రి అద్భుతమైన రుచులు వెలయఁ బెక్కు పిండివంటలతోఁ బాకముజేసి పతిరాక నిరీక్షించి యుండెను. ఇంతలో నాజయభద్రుఁడు వేశ్యాగృహమునుండి భోజనమున కింటికివచ్చి పాదప్రక్షాళనాదిక్రియలు నిర్వర్తించి పీటయొద్దకు వచ్చునంత నచ్చట వింతగాఁ బాత్రాదికము లమర్పబడియున్నవి. అందులకు వెరగందుచు నాపీటమీఁదఁ గూర్చుండి పాత్రము సవరించుకొనుచు త్వరలో వడ్డింపుడని కేకవైచెను.

అప్పుడా సునీతి, వింతకౌశేయము ధరించి, విభూషలు దీపపుకాంతులఁ దళ్కు తళ్కున మెఱయఁ బదంటకంబులు ఘల్లుమని మ్రోయ జనుదెంచి భక్ష్యభోజ్యాదికము వడ్డించినది.

జయభద్రునిచిత్తమంతయు ననంగచంద్రికపైనున్నది. కావున నా పదార్థరుచి అంతగాఁ గనిపెట్టక యామె తనభార్యఅని యెరుఁగక యత్తురుణి యెవ్వతియో అనుకొనియే భుజించుచుండెను.

ఆతని మనోహరాకారాము చూచి యాచిగురుఁబోడిఁ తలయూచుచు నౌరా! ఈరాకుమారుఁ డెంత చక్కనివాడు! చూచుటకైన నోచుకొనకపోయితినిగదా. ఇన్ని దినము లూరక గడిపితినే. అయ్యో ఇప్పుడీ పసరు వీరిపై నెట్లు రాయుదును? రాచిన నేమి వికటించునో? ఊరక ప్రమాదము దెచ్చినదాన నగుదును. యోగముండిన నెప్పటికే నితనికే దయపుట్టును. ఇట్టివాఁడు మగఁడని చెప్పుకొనినం జాలదా మందు వలని గలిగిన మక్కువ యేమాత్రమునిలుచును? అని పెక్కు తెఱంగులఁ దలపోసి తుదా కాపసరు వానిపైఁ జిమ్మక దాచి యాతనికిఁ గావలసినపదార్దములు వడ్డించుచుఁ దనివిదీర వానిరూపము గన్నులారాఁజూచుచుండెను. అతండును దృటిలో భుజించి, చేయిఁగడిగికొని తోడనే బట్టలుగట్టికొని యాయనంగచంద్రిక యింటికిఁబోయేను.

పిమ్మట నాకొమ్మయు మంగళసూత్రము జల్లగనుండినం జాలునని సంతసించుచు నతనివిస్తరిలో భుజించి అత్తగారి అనుజ్ఞ పుచ్చుకొని మరలఁ దనమేడకుఁ బోయినది.

మఱియు భ్రమరిక మిక్కిలి ప్రయత్నముతో సంపాదించిన మందు వృధ చేసినందునకు జింతించునని తలంచి యాపసరు తాను మేడలోనికిఁ బోవుచు దారిలోఁ గనంబడిన యొక పుట్టకలుగులోఁ బోసి యారహస్యము దానితోఁజెప్పక తలుపువైచుకొని శయ్యపై బరుండి ఆతని రూపవిశేషములన్నియు నాచేటికకు జెప్పుచుండెను.

ఇంతలో నెవ్వరో వచ్చితలుపుగొట్టిరి. ఆచప్పుడు విని యెవ్వరని భ్రమరిక అడుగగా నేను జయభద్రుఁడని యుత్తరముజెప్పెను. ఆమాటవినిన తోడనే సంభ్రమము జెందుచు సునీతి తటాలున కుయ్యడిగ్గి తలుపుతీసినది.

అతని నంతకుఁ మోర్వమే చూచియున్నది. కావున భేద మేమియు లేమి గురుతుపట్టి పాదములు గడిగి శిరంబునఁ జల్లుకొనుచు నివాళి యిప్పించి చేయింగొని బాన్పుమీఁదఁ గూర్చుండఁబెట్టి తాంబూలమిచ్చి యుచితమర్యాదఁ గావించి యాప్రాంతమున నిలువంబడి పూసరుటి వీచుచు మెల్లన భ్రమరికతో నిట్లనియె.

చేటీ! ఆర్యపుత్రునకు నేఁటికి మనయం దనుగ్రహము గలిగినది. ఇదియుఁ మత్కృతసుకృతముగానే తలంచుచుంటిని. దైవకృపలేక యేకార్యముజరుగదు. ఓర్పు గలవారికన్నియు సమకూడును. నానోములు ఫలించినవి ఇందాక దర్శించి కన్నులు గృతార్థ నొందినవి.

ఇప్పుడు దేహమునుగూడా సాద్గుణ్యము నొందఁజేయఁగోరుచున్నదానినని మఱియుఁ బెక్కుతెఱంగుల వినయవిశ్వాసము లేర్పడఁ జతురోక్తులచే నతని అంతరంగముఁ గఱుగఁజేసినది.

అప్పు డతండు మిక్కిలి సంతోషించుచుఁ దదర్చనల నంగీకరించి తానుదెచ్చిన యనర్ఘరత్నమండనము లాయెలనాగ కందిచ్చెను.

అపూర్వములైన యావస్తువిశేషములు స్వీకరించి సునీతి తదీయప్రభాపటలములు కన్నులకు మిఱుమిట్లు గొలుపుచుండ నతనిది దేవతాప్రభావమని యగ్గించుచు నభ్బూషలందాల్చి వేల్పుచేడియలం దిరస్కరించి సోయగమున నొప్పుచుండెను.

అపురుషుం డత్తరుఱితో నారాత్రి రతివిరహితములగు కృత్యములు పెక్కు గావించి యమ్మించుబోఁడిం బరితుష్టురాలింగావించి యుదయంబున దననివాసమునకుఁ బోయెను.

ఈరీఁతి బ్రతిదినము రాత్రి వచ్చి యుదయంబునఁ బోవుచుండును. మఱియు నతఁడు వచ్చునప్పుడు నిత్యము కోటిదీనారములు వెలగల నగలందెచ్చుచుండును. సునీతియు నారత్నములు మార్చి దేవతారాధనములు వ్రతములు నియమములు చేయుచు దానధర్మములకై యేదినమునఁ దెచ్చినసొమ్ము లానాఁడే వ్యయము చేయు చుండును.

దానంజేసి సునీతి మిగులపుణ్యాత్మురాలనియు, జయభద్రుఁడు అన్నదమ్ములలో మిక్కిలి ప్రయోజకుఁడనియు భూమియంతయు వాడుక మ్రోసినది.

అని చెప్పినంత నాగోపకుమారుఁడు మణిసిద్ధుంజూచి నమస్కరింపుచు, అయ్యా! నాకొక సందియము గలిగినది. వెఱ్ఱిగొల్లవాఁడనుగదాఅని సందర్బము లేకుండ నీకథఁజెప్పుకొని పోవుచున్న వారు, జయభదుఁడు అనంగచంద్రిక యింటిలో నుండువాఁడని యిదివఱకు చెప్పితిరి. దాని విడిచి సునీతియింటి కారాత్రి రాగతఁమేమి? వచ్చెనచో, యిట్టివిలువగల రత్నవస్తువు లెట్టు తెచ్చుచున్నవాఁడు వాని వృత్తాంత మేమియునుం జెప్పకయే సునీతి యంతికమునకు వచ్చుచున్నట్లు నుడువుచుంటిరి. మఱియు రతిజేయకయే సంతుష్టి జెందుచుండెనని చెప్పితిరి. అటుచేయుటకుఁ గారణం బేమి? నాకేమియు వీడిపోకున్నది. తెల్లముగా నెఱింగింపుఁడు అని అడిగిన మణిసిద్దుండు నవ్వుచు నిట్లనియె.

వత్సా! నీ వీమాట అడిగెదవో లేదో అని నీ శ్రద్ధాళుత్వము దెలిసికొను తలంపుతో నట్లు చెప్పితివి. గ్రహించితిని. చెప్పెద వినుము. సునీతి వశ్యౌషధియొక్క పసరు మగనిపైఁ జిమ్మక పుట్టలోఁ బోసెనని చెప్పితినిగదా. అసమయమునఁ బాతాళలోకనాయకుండైన నాగరాజు భూమికి విహారార్ధమై యాదారిని బైకివచ్చుచున్నవాఁడు ఆపసరు శిరమునఁ బడినది. తోడనే మనము గఱిగి యతండు సునీతియందు బద్దానురాగుండై, కామరూపుఁడగుట సునీతిపాతివ్రత్య ప్రభావము తెలిసికొని పాతాళలోకసంభూతమునగు రత్నములతో జయభద్రునివేషముతో వచ్చి యాసుందరింజేరి సంతోషబఱుచుచుండెను. పాతివ్రత్యభంగంబు సేయనొల్లక దివ్యప్రభావంబున నట్టి హర్షము గలుఁగజేయుచుండెను. పతివ్రతలు పతుల కేది ప్రియమో అట్లే కావించి యానందింతురుగదా!

ప్రతిదినము ఆనాగరాజు జయభద్రుని రూపముతో వచ్చి రత్నభూషణములు కానుకలిచ్చుచు సునీతికి సంతుష్టి గలుగఁజేసి పోవుచుండ నాసాధ్వియు నతండు తనపతియే అని భయభక్తివినయవిశ్వాసములు దేటఁబడ నతని కుపచారములు చేయుచుఁ దద్దత్తమండనప్రదానమున లోకవిఖ్యాతకీర్తి సంపాదించుచుండెను.

నిజమైన జయభద్రుఁ డావార్తయేమియుఁ దెలియక వేశ్యాగృహమందే సంతతము నివసించి యుండెను.

ఒకనాఁ డిరువురు బ్రాహ్మణులు సునీతిచేమణిహారములు కానుకగానంది, యా వీధింబోవుచుండ వీధిగుమ్మమున నిలువంబడియున్న యనంగచంద్రిక నమస్కరించుచు అయ్యా! తమరికీ బహుమాన మెవ్వరిచ్చిరని అడుగగా వారిట్లనిరి.

కాంతా! వీని నెవ్వరిచ్చిరని యడుగవలయునా? మీయూరీలోఁ బ్రసిద్ధి జెందినవనిత యెవ్వతియో నీ వెఱుగవా? సునీతి విఖ్యాతి లోకవిదితమైనదే అమ్మహాత్మురాలి యీవికి సాటియున్నదా? ఆమె పెనిమిటి జయభద్రుఁడెంత ప్రయోజకుడో! నిత్యము తనయిల్లాలింత ద్రవ్యము దానముచేయుచుకడ నెట్లు సహించెనో కదా అని పెక్కుగతుల నాదంపతుల వినుతింపుచు నాబ్రాహ్మణు లెందేనిం బోయిరి.

ఆమాటలు వినినంత స్వాంతమున నీసుజనింప నాపడుపుచేడియ శిరఃకంపము చేయుచు నౌరా! వీరిమాటలు చోద్యముగానున్న యవి. జయభద్రుని భార్య సునీతి ఖ్యాతి యింతకుమున్ను నేను వినియున్నదాన జయభద్రుఁడు సంతతమునాయొద్దనే యున్నవాఁడు ఈతడు దానికెట్లు విత్తమిచ్చుచున్న వాఁడు! ఒకవేళ రహస్యముగా సొమ్మిచ్చి వచ్చుచున్నాడేమో! ఆరయవలయునని యూహించి ఒక దూతికకుఁ గొన్నివిషయములు బోధించి యామఱునాఁడు సునీతి యింటి కనిపినది.

ఆదూతిక యుదయములేచి వృద్ధబ్రాహ్మణిరూపము వైచికొని పెద్ద ముత్తైదువ వలె నొప్పుచు సునీతియింటికిఁ బోయెను సునీతి యాకపటకాంతంజూచి యాదరించుచు అవ్వా! మీదేయూరు? ఎచ్చటికిఁ బోవుచుంటివి! పతి ఎచ్చట నున్నవాఁడు ఇన్ని దినములు అయిదవతనము మోపిన నీపుణ్యము గొనియాడఁ దగి యున్నదని అడుఁగ నాటక్కులాడి యిట్లనియె.

అమ్మా! మాది కాశ్మీరదేశము. నామగండు చిన్నతనములోఁ గాశికిఁబోయి నేఁటివఱకును రాలేదు. ఆయన ఎచ్చటనున్నది తెలియదు అయినను వెదకుచు దేశాటనము చేయుచుంటివి. ఇప్పుడు రామేశ్వరములో నున్నవారని తెలిసి అచ్చటికి బోవుచుంటిని. మార్గములో నీవిఖ్యాతిని విని నిన్ను జూచుటకై వచ్చితిని. నీవుమిగుల బుణ్యాత్మురాలవు నీపతికిం నీయం దనురాగము గలిగియున్నదా? సంతానమోదం బనుభవింపుదువా? ఈయైశ్వర్యము పతి సంపాద్యమా? పితృ సాంపాద్యమా? వినుటకు వేడుకగా నున్నది. నిక్కము వక్కాణింపుమని అడిగిన నవ్వుచు నాపూబోడి యిట్లనియె.

శ్లో॥ మితం దదాతి హిపితా మితం మాతా చ సోదరః
     ఆమితస్య ప్రణాతారం భర్తారం కొన పూజయేత్ ॥

అవ్వా! లోకములో దల్లి యు దండ్రియు, అత్తయు, మామయు, బంధువులు, అన్నలు, దమ్ములు మొదలగువారు మితముగా నిత్తురు. అమితముగా నిచ్చువాడు పతియొక్క రుండే. సతికి బతికన్న నాప్తులులేరు. పతిఏ దైవము నాకీ యైశ్వర్యము పతి సంపాదితము గాక పితృసంపాదిత మెట్లగును? నాకు సంతాన మింకనుం గలుగలేదు. నాయందు పతికిప్పుడు మక్కువయే గలిగియున్నది. మగవారు స్వతంత్రులు గదా! వారి యిష్టము కెప్పుడును పడతులు విఘ్నములు చేయరాదు. కొందఱు స్వల్పవిషయముకై పతుల నవమానపఱతురు. అట్లుచేయుట నా యభిప్రాయము కాదు. గతమును గురించి చింతించినను లాభములేదు. ప్రస్తుతము దైవానుగ్రహము వలన నాకే కొదవయునులేదు. అని పలుకుచు దానికి భోజనము పెట్టి మార్గభృతికిది చాలునని పలుకుచు నొకముత్యాలహారము గానుకగా నిచ్చినది.

సంతోషపూర్వకముగా స్వీకరించి దీవించుచు నా దూతిక యింటికి వచ్చి అచ్చట జరిగిన విశేషము లన్నియుం జెప్పి యాహారమును జూపెను. అనంగచంద్రిక యామె దాతృత్వమును మెచ్చుకొనుచు నోహో! ఈ జయభద్రు డెంత మాయవాడు. రహస్యముగా భార్య కన్నియు నిచ్చుచు శూన్యహస్తములతో నాయొద్దకు వచ్చును. ఈహారమొక్కటియే వేయిదీనారముల వెల గలిగియున్నది. యిట్టిది యొకనాఁడైన నాకు దెచ్చియిచ్చుట లేదు. ఈ లోభివానిని నమ్మి నాయైశ్వర్య మంతయుఁ బోఁగొట్టుకొనుచున్నదాన ఏదియైన అడిగితినేని నేను తండ్రిచాటువాఁడ ననియు నా కేమియుఁ దొరకదనియు జెప్పుచుండును.

ఈ బొంకరి నేమిచేసినను బాపములేదు. అన్నన్నా! నన్ను వీఁ డెంతభంగపెట్టెను! మా ముసలిది చెప్పిన మాటలు వినక ముందెప్పుడో నన్నుద్ధరించునని గంపెడాసతో నుంటినిగాని యిటువంటివాఁడని యెఱుఁగకపోతిని కానిమ్ము! వీని కీరాత్రియే తగిన ప్రాయశ్చిత్తము సేయఁబుత్తును. అని తలంచుచుఁ దన కంతకు మున్ను గృతపరిచయు లై యున్న నల్వురు దొంగలకు వర్తమానముచేసి పారితోషికమిచ్చి వానితోఁ జెప్పవలసిన విషయములం జెప్పి పంపినది.

జయభద్రుఁడు యథాప్రకారము నాఁటిరాత్రి యింటియొద్ద భోజనము జేసి దానియింటికిఁబోయెను. కాని అదియు వానిఁ బూర్వమువలె గౌరవింపక తనకు దేహములో స్వస్థతలేదనియు నీదివసమున మఱియొక మంచముమీఁద బరుండవలయునని దాసీముఖముగాఁ జెప్పించి అట్లు చేయించినది.

అతఁ డారాత్రి అనంగచంద్రిక అస్వస్థతగా నున్నదనుమాట విని మిక్కలి బరితపించుచుఁ బరిచారికంజూచి "ఏమే చేటీ! అనంగచంద్రిక యెచ్చటనున్నది? ఆయార్తి యెట్టిదో చెప్పుము. వైద్యులం బిలిపింతునా" అని అడిగిన అదియు దాని చిత్తవృత్తి యెఱింగినది కావున అతని కిట్లనియె.

అయ్యా! యిప్పుడెవ్వరు వచ్చినను రానీయవద్దని నాతోఁ జెప్పి పరుండినది. గాఢముగా నిద్రబోయినది. ఉదయంబున అన్నియు విమర్శింపవచ్చును. ఆ మంచముమీద బవ్వళింపుడు. లేపుటకు వలను కాదని చెప్పగా సిగ్గుపడి అందుఁ బరుండి యిట్లు తలంచెను.

అయ్యో! నాకిదియేమి కర్మము! ధరణిఁ బాలించు చక్రవర్తి కుమారుఁడనై కామహతకుని మూలమునగదా యీమూల బరుండవలసి వచ్చినది. ఈతుచ్ఛురాలికారణముననే ప్రాణమువంటి మిత్రునితోడను, భార్యతోడను విరోధముబెట్టుకొంటిని ఇప్పుడు నా గౌరవము తలఁపక నన్నింత దుర్గంధప్రదేశమునఁ బరుండ నియమించినది. అతిపరిచయము వలన అపజ్ఞత వచ్చుననుమాట తప్పునా? కానిమ్ము. ఈరాత్రి మాత్ రమెట్లో సహించి రేపు నా భార్యయింటికే పోయెదను. అది గ్రుడ్డిదని చెప్పిన మాట దీని కల్పితమేమో! ఏమైనను, యిక దీని యింటికి రాదగదని మనము చివుక్కుమన బెక్కుతెఱంగుల దలపోయుచుండ అంతలో నిద్రపట్టినది. మఱియొక్కింతసేపునకు మెలకువ వచ్చి కన్నులు దెఱచి చూచునంత నక్షత్రములు గనబడినవి.

అట్లే చూచుచు నిది యేమి చోద్యము! నే ననంగచంద్రిక యింటిలో బరుంటినే. పయికప్పు ఏమైనది చుక్కలు గనంబడుటకు గారణమేమియని యాలోచించుచున్న సమయమున నతనికి నొండొరులు మాటాడుకొనుచున్న మాట లిట్లు వినంబడినవి.

భీరుఁడు - ఒరే మారేసూ! ఈయన యెవ్వడురా ఈ బోగముదానికి యీయనకు విరోధమెందుకు వచ్చిందిరా.

మారేసు - భీమా! ఈయనే మనరాజుగారి ఆఖరికొడుకురా పాపము వెఱ్ఱిబాగులోడు ఉన్నడబ్బంతా తెచ్చి ముండ కిచ్చేడు యిప్పుడియ్యడములేదు గాబోలు. నూతిలో బారవేయు మని నాకు జెప్పినది బోగమోళ్ళకు నీతి యున్నదా?

బీమ - ఒరే: ఈ యనకు పెండ్లాముండాదా?

మారేసు - ఈయన పెండ్లామేకాదా, భేమ్మలకు ధానధమ్మాలు చేస్తూంటాది. దాన్ని విడిచినందుకు యీయన కీశాస్తి కావలసిందే

భీమ - ఈబోగంది మన కే మిస్తానన్నది?

మా - వెనుకటి మామూలే యున్నది. ఇప్పుడు వేఱే అడుగనక్కరలేదు.

భీమఁ - ఇదివర కెవ్వరినైనా నా తీసికొనిబోయినావా యేమి?

మా - ఆయ్యో! నీవెఱుఁగవు: ఇదివఱకు ధర్మడు కొన్నాళ్ళునకు లేసుగాడు కొన్నాళ్ళు వచ్చేవారు ఆళ్ళూరికి బోతే ఇప్పుడు నిన్ను బిలిచినాను. దీనితల్లినాఁట నుండియు నీ పని మేము చేయుచున్నాము. ఈలాటి రాజకుమాళ్ళకు పదురుగు దీసికొనిపోయి ఆనూతిలో బారవేసితిమి.

భీమ - వాళ్ళనెందుకు ?

మా - ఎందుకేటి, ఉన్నన్నాళ్ళు తిన్నగా చూచి యెప్పుడో కోపము వచ్చి, యీ ముండ చంపిస్తూంటది. ఏలాగైతేనేమి, సాలుకి నా కొకసంచీరూపాయలు ముట్టచెప్పుతుంది.

భీ - నీకు మంచియండే దొరికినది ఇక్కడనుండి నన్నుగూడా పిలుచుచుండేం.

మా - ఒరే భీమా! ఈయేడు మీజట్టుకు కన్నాలవల్ల మొత్తం లాభం యెంత వచ్చిందిరా.

భీమ - ఇంకాపంచుకోలేదు ఏలాగైనా, నిరిటికన్న తక్కువే. ఏముంది, బంట్రోతులకు అమ్మోరుకి, పంచాంగం చెప్పిన భేమ్మడికీ, నాయకుడికీ, పాలుపంచిపెట్టాలిగంద! ఈఖర్చులన్నీ పోగా, యేముంటుంది.

మా - అయినా మునుపటి లాభాలు లేవు . అన్ని యిళ్ళల్లోను ఇనుపపెట్టెలే. గాజుదీపాలే అవి ఆర్పుటయే తెలియదు. ఇంతకు చవక చమురు మనకొంపదీయు చున్నది.

భీ - ఏమో! మనకు ప్రాప్తి వున్నంతవస్తుంది. సరిగా నడువుము.

అని యీరీతి మాటాడుకొనుచుండగా నా దొంగల మాటలన్నియు విని జయభద్రుడు అనంగచంద్రిక చేసిన క్రూరకృత్యమని తెలిసికొని అప్పు డేమియుంజేయునది తోచక భగవంతుని ధ్యానముచేయుచు, ఆయ్యో! వారకాంతల వలపులు నమ్మగూడదవి చెప్పిన నా మిత్రుని మాటలు వినకపోవుటచేతగదా, యింతయాపద వచ్చినది. నాకు విధాత బలవన్మరణము విధించెనుగాబోలు. ఇప్పుడు పాఱిపోవుదమన్నను వీండ్రు నన్ను బోనీయరు. నాకు ఈతవచ్చునుగదా? దెబ్బతగులక, స్మృతిగా నుంటినేని బ్రతికి యీవలబడగలను. ఇంతకు దైవసంకల్ప మెట్టిదో తెలియదు. అని పలువిధముల వితర్కింపుచు గదలక, అట్లేయుండెను. ఇంతలో నూయి సమీపించుటయు, నా చోరులా మంచముతోగూడ నాతని 'చావుము ' అని పలుకుచు, నా నూతిలో బారవైచిరి.

జయభద్రు డానూతిలో బడుసమయములో దనకది చరమావస్త అని నిశ్చయించి, నారాయణ మంత్రము జపించుచు గ్రమముగా నా నూతినీటిలో బడియెను.

ఆ కూపమున నీరు మిక్కుటముగా నుండుటచే నతనికంత రాయిడి తగిలినది కాదు ఇంచుక మునింగి యీతవచ్చుటచే గాలుసేతులు గదల్చుచు, మెల్లన నానూతి గోడమీద మొలచిన మఱ్ఱిమొక్క. పట్టుకొని యలసట దీర్చుకొనుచు దనయవస్థను గుఱించి వేదెరంగుల దలంచుచుండెను.

ఇంతలో మఱియొకజంతువు దానిలో బడినట్లు గుభాలుమని చప్పుడైనది. అతండదరి పడుచు నోహో! దీనిలో మఱియేదియో పడినట్లు చప్పుడైనది. ఈదొంగలలో నొకడు నన్ను బట్టుకొనుటకై యఱుగలేదుగద? ఏమైనను మేలగు చావునకు దెగించిన నాకేయాపదలు లక్ష్యములుకావు." అని తలపోయుచున్న సమయంబున నీటిలో వ్రేలాడుచున్న తనపాదముల కేదియో తగిలినది.

అది మొసలి మొదలగు జంతువులలో నొకటిఅగునని భయపడుచు, రెండుమూఁడుసారులు విదల్చి వైచెనుగాని, మృదువైన వ్రేళ్ళు కాళ్ళకు దగిలినట్లై, నంతలో మనుష్యుడై నట్లు నిశ్చయించి యా వ్రేళ్ళకు కాలందిచ్చెను.

ఆవ్రేళ్ళతోఁ దనకాళ్ళు పట్టుకొ"నినట్లు తోఁచినతోడనే కాలు పైకిలాగికొనియెను. పిమ్మట జేతితోఁ దడిమినంత నీటియందు నాచువలె పైకి వ్యాపించియున్న వెండ్రుకలు కొన్ని చేతికిఁ దగిలినవి.

ఆవెండ్రుకలు చేతికిఁ బెనవైచుకొని మెల్లగాఁ బైకిలాగినప్పు డద్భుతముగా మృదువైన పరిమళము గొట్టినది. ఆతావి యాఘ్రాణించి అతండు వెరగందుచు, మఱియుం దడిమినంత, మృదువులైన, అవయవములు చేతికిఁ దగిలినవి. అప్పు డతండది యొకచిన్నదని యూహించి అయ్యో! నన్ను వలె నీయబలనుగూడ, నీ నూతిలో నే దుర్మార్గులోఁ బడవైచిరి. దీని కాయుశ్శేషమున్నట్లే తోచుఁచున్నది. నాయోపినంత ప్రయత్నము చేసి దీని ప్రాణములు గాపాడెదనని నిశ్చయించి మెల్లమెల్లగా పైకిలాగి మోము తడవి యెత్తిపట్టుకొని, కౌఁగిటనాని నీటిలో మునుఁగ కుండ నదిమిపట్టుకొనియెను.

ఆచిన్నదియు నొడలెఱుంగక గుండెలు తటతటఁగొట్టుకొనుచుండఁ గన్నులు మూసికొని జయభద్రుని భుజాంతరమున వసియించి యలసట దీర్చుకొనుచుండెను.

వారియాపదఁ జూచి యోదార్చువాఁడువోలె లోకబాంధవుం డుదయగిరిశిఖర మలంకరించెను. తదీయ హృదయాంధగారముతోఁగూడ నానూతిలోన చీఁకటి విరిసిపోయినది

అప్పు డొండొరులు చూచుకొని, వారిరువురు నాశ్చర్యమందిరి మఱియు జయభద్రుఁ డాచిన్నదానిఁజూచి నేత్రములు విప్పి చూచుచున్నది కావున మెల్లన నిట్లనియె.

తరుణీ! నాకువచ్చిన యవస్థ నీకును వచ్చినదా! నీయాకృతిం జూచి సహింవక యేదుర్మార్గుఁడిట్లు కావించెను? నీముద్దుమో మేకఠినాత్ముని కన్నులకు వెగటైనది? కటకటా! మెఱపుతీగఁవలె మెఱయుచున్న నీదేహ మీనూతిలోఁ పారవేయుట కేద్రోహునకు జేతులువచ్చినవి. ఇటువంటి కఠినదండన జేయుటకు నీ వేమి నేరముఁ జేసితివి? నీయాయుశ్శేషము దృఢమైనదని నమ్ముచున్నాను. అర్థరాత్ర మిట్టిపాడునూతిలోఁ బడియును నాధారముబూనియుంటివి. అనిఅడుగగా నా చిన్నది హస్తసంజ్ఞచేయుచు బైకిబోయినవెనుక నంతయుం జెప్పెదనని సూచించినది.

అప్పు డాసన్న గ్రహించి, జయభద్రుడు ఆ చిన్నదానిచేతి కొకదృఢమైన మఱ్ఱిమొక్క నందిచ్చి తాను మెల్లగా నందలి మొక్కలన్నియుం బట్టుకొని క్రమంబున బైకిబోయెను.

అందు దొంగలు పారవైచిన ద్రాళ్ళు కొన్ని ముడిబెట్టి నీటిలోదింపి యా చేడియ యాత్రాడు బట్టుకొనినంత మెల్లమెల్లగా బైకి లాగి క్రమంబున గట్టెక్కించెను.

అప్పుడు వారిరువురు పునర్జన్మ మెత్తినట్లు తలంచుకొనిరి. అది మహారణ్య మగుటచే జనసంచార మేమియునులేదుగావున నందు నిలుచుటకు వెఱచుచు నెటకేని బోవదలచి, అప్పటికి రెండు గడియల ప్రొద్దెక్కినది. కావున జయభద్రుడు ఆ చిన్నదాని కాకలిగా నున్నదని గ్రహించి యాప్రాంత మందున్న యొక వెలగచె ట్టెక్కి పండ్లు కొన్నికోసి యవి యాచిన్నదాని ముందుంచెను.

వానిని దిని యాకలి యడంచుకొనుచు నెండవేడిమి సహింపక తీగవలె వాడియున్న యాచిన్నదాని నొకచెట్టునీడకు దీసికొనిపోయి అందు గూర్చుండబెట్టి విశ్రాంతి వహించిన కొంతసేపునకు మెల్లగా జయభద్రు డిట్లనియె.

కాంతా! నీయుదంతము విన నాకెంతే నౌత్సుక్యముగా నున్నది. సఖ్యము సాప్తపదీనమనుమాట వినియేయుందువు. నీకాపురస్థల మెచ్చట? తల్లిదండ్రు లెవ్వరు? నిన్ను భార్యగాబడసిన పురుషుని యభిధానవర్ణములేయవి? నీయభిఖ్య యెట్టిది- ఆమూలచూడముగా వక్కాణింపుము.

నేను మణిప్రస్థపట్టణాధీశుడైన కుంతిభోజుడను రాజు నేడవకుమారుండ. నాపేరు జయభద్రుం డందురు. నేను రూపవతియు గుణవతియునగు భార్యను నిరసించి యొకవారకాంతమాయలో జిక్కి యిట్టి యిక్కట్టులకు బాల్పడితిని. చెడుదినములలో నెట్టిబుద్ధిమంతునకును మంచియూహలు పుట్టవు కొన్నిదినములు నేను రాజకుమారులలో నుత్తముడను వాడుక పొందియుంటిని. పరతరుణులకొఱకు నిడుమలం గుడుచు చెడుగులం జూచి పరిహాసము చేయువాడ. తుదకట్టి నాకు బ్రాణమిత్రుని నీతివాక్యములు కర్ణకఠోరములైనవి. పైత్యరోగము గలవానిజిహ్వకు బంచదారయు జేదుగానుండునుగదా. ఇట్టి విపత్తు చెందవలసియుండ, నతని మాటలేల చెవికెక్కును. అని తనకథ నంతయు నన్నెలంతతో జెప్పి యయ్యొప్పులకుప్ప మొగమునందు జూడ్కులు నెరయజేసెను. అని యెఱింగించి మణిసిద్దుడు తదనంతర వృత్తాంతము పై మజిలీఅందు వాని కిట్లని చెప్పం దొడంగె.