కాశీమజిలీకథలు/పదవ భాగము/240వ మజిలీ

అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. అవ్వలికథ తదనంత నావసధంబున నిట్లు చెప్పఁదొడంగెను.

________

240 వ మజిలీ.

మణిమంతునికథ.

స్త్రీరాజ్యపాలనావిశేషము లెట్లుండునో రత్నమకుట యెట్లు తీరుపులు చెప్పునో వినవలయునని యభిలాషగలిగి యొకనాఁడు పుష్పకేతుఁడు భార్యతోఁగూడ సభాస్థానమున కరిగి రత్నమకుట సింహాసనమునకుఁ బ్రక్కగా వేరొకపీఠంబునఁ గూర్చుండి యామెచేయు ప్రశ్నప్రకారము అరయుచుండెను. తనభర్తప్రక్కనుండుటచే వాడుక ప్రకారముగాక స్వరవైక్లబ్యముతో మంత్రిదిక్కు. మొగంబై యామె నేఁడు విచారింపవలసిన యభియోగము లేమిగలవని యడిగినది.

మంత్రి లేచి రాజ్ఞీ! నేఁడు ముఖ్యముగా హత్యాపరాధపరిశోధకములు రెండువిమర్శింప వలసియున్నవి. ఒకదానిలో వాది ప్రతివాదు లిరువురు వచ్చియున్నారు. ఒకదానిలో వాదిమాత్రమే వచ్చి యున్నాఁడు అని పలుకుచు నాకాగితములుకట్ట నామెచేతికిచ్చెను. రత్నమకుట చేయి వణక నందుకొని వానిభర్త కిచ్చుచు మీయెదుట మేము విమర్శింపలేము. మీరే విచారించి తీరుపుచెప్పుఁడని పలికినది

అతండు నవ్వుచు మీపాలనావిధానము జూడవలయుననితలంప నీభారము నామీఁదనే పెట్టితివా? కానిమ్ము మీయమాత్యుఁడు హత్యలనుచున్నాఁడు. అవి యెట్టివో తెలిసికొనియెదంగాక యని పలుకుచు నాపత్రికలం జదివికొని శిరఃకంపముతో ముందు మణిమంతుఁడు రత్న పాదుఁడునను వర్తకులఁ బిలువుఁడని భటుల కాజ్ఞాపించెను.

వాండ్రు పిలువఁగా నావర్తకులికువురు వచ్చి యెదుర నిలువం బడి నమస్కరించిరి. వారిరువుర పేరులు తెలిసికొని

పుష్ప కేతుఁడు — మణిమంతా! నీదీయూ రేనా?

మణి - చిత్తముమహాప్రభూ మా తాత తండ్రులనాఁటి నుండియు మా దీనగరమే కాపురము.

పుష్ప - నీవు కోటీశ్వరుఁడవఁట నిజమేనా?

మణి - ప్రభువువారికిఁ బదికోట్లమీఁదఁ బన్ను గట్టుచున్నాను మహాప్రభో!

పుష్ప - ఈరత్న పాదు నెఱుగుదువా?

మణి — ఎఱుఁగుదును మహాప్రభో. యెఱుఁగుదును.

రత్న పాదుఁడు - ఎఱుఁగబట్టియే నాకొంప నిట్లు ముంచినాఁడు.

మంత్రి — ఉస్స్ నీవు నడుమ మాటాడరాదు.

పుష్ప - గొప్ప స్థితిగల వర్తకుని కుమారునకుఁ బిల్లనిత్తునని యొప్పుకొని వారు తరలివచ్చులోపల నీకూఁతును మఱియొకని కిచ్చి వివాహము చేయుటయేకాక నీయల్లునిచే వారి బలగమునంతయుఁ జావమోదించితివఁట. కొందరు చచ్చిరఁట. కొందఱు కాలుసేతులు విరిగి బాధపడుచున్నారఁట. నిజమేనా? ఈదేశమునం దిట్టి యాచారము లున్నవియా యేమి? హత్యలనిన సామాన్యదోషము లనుకొంటివా?

మణి – మహాప్రభూ! మాకథ యంతయు మీరు సాంతముగా వినినగాని నిజము బయలు పడదు. చెప్పుటకు సెలవైనచోఁ దెలిపెద.

పుష్ప — ఊ. చెప్పుమనియేకదా నేనడుగుచుంటిని?

మణీమంతుఁడు చేతులు జోడించి మహారాజా! నేను మిక్కిలి భాగ్యవంతుఁడ నయ్యు సంతానము బొడమక కొంతకాలము పరితపిం చితిని. చివరకుఁ గన్యకాపరమేశ్వరీ కృపావిశేషమున నొక్కయాఁడు పిల్ల కలిగినది. దానినేపుత్రుఁగా భావించి యపురూపపు గారాముతోఁ బెనుచుచుంటిమి. జాతకర్మకు నేబదివేలు వ్యయపెట్టితిని. నూఱ్వురఁ బాలదాదులను రెండువందలమంది యాడించు పిల్లదాదులను నూఱ్వుర రక్షకుల నియమించి బెంచుచుంటిమి. డోలికోత్సవము, అన్నప్రాశనోత్సవము, దంతాగమనోత్సవము, విద్యాభ్యాసోత్సవము, ఒకటననేల ఏదియో పేరుపెట్టి దినమున కొక యుత్సవము చేయుచుండెడి వారము.

ఈచిన్న కార్యములకే యీవతన్‌కుఁ డింత వ్యయపెట్టుచున్నాడు. కూఁతురి పెండ్లి కెంత వ్యయము చేయునో యని యనుకొనుచుఁ గొందరు నన్నామాట యడిగిరి. అప్పటి యుత్సవము మీరే చూతురుగాక. ఇదివఱకు భూమండలములో నిట్టియుత్సవ మెక్కడను జరుగలేదని జనులు స్తోత్రములు చేయునట్లు కావింతునని చెప్పుచుందును.

పిల్ల కై దేండ్లు దాటినది మొదలు పెండ్లి ప్రయత్నము చేయుఁడని నాభార్య నన్ను నిర్భందించు చుండెను. మఱిరెండు సంవత్సరములు నేను మనసులో నాలోచించుచు, బిమ్మట దేశముల వెంబడి త్రిప్ప మొదలిడితిని. నాలుగేండ్లు దేశములు త్రిప్పుటతోడనే గతించినది. మాకు సరిపడిన సంబంధ మెక్కడను దొరకలేదు. ఒక్కమాట చెప్ప మఱచితిని మా వైశ్యులలోఁ గన్యకాపరమేశ్వరీ శాపంబునఁ జక్కని కన్యకలుండరు. నాముద్దులపట్టి నాయమ్మవారు ప్రసాదించినది కాబట్టి బహుసౌందర్య శాలినియై యొప్పుచున్నది. దాని కూర్మిళయని పేరు పెట్టితిని. దానిచక్కఁదనమునకు సరిపడినవరుఁ డెందును దొరకలేదని పరితపించుచు శుకద్వీపమున నీరత్న పాదుని కుమారుఁడున్నాడని విని నలువురుబ్రాహ్మణుల ననిపితిని. వారు వీని స్థితిగతులు వరుని విద్యా శీలములు విమర్శించివచ్చి యన్నిటికిని నీకుఁదగిన సంబంధమని చెప్పిరి. అదిమొదలు నేను నాపరిజనులు వీరింటిచుట్టు నాఱుమాసములు దిరిగితిమి. మాకు రాకపోకలకుఁ బదివేలు వ్యయమైనది. ఎట్టకేల కీమహానుభావుఁ డనుమతించెను. అతడు కోరినంతసొమ్మిత్తు నన్నప్పు డనుమతి కాకయేమి? దేశదేశములనుండి సిద్ధాంతుల రప్పించి యాఱుమాసములు వ్యవధియుండగా సుముహూర్తమునిశ్చయించితి అట్టిముహూర్తము మఱియొకటిలేదని యేకగ్రీవముగా సిద్ధాంతులందరు నొప్పుకొనిరి. ఆపైన మూఢమి వచ్చునఁట. అటుపైని నధిక మాసమట. ఆపైన క్షయవత్సరమట. ఆసుమూర్తము దాటినచో మూడేండ్లవఱకు మఱియొక సుముహూర్తములేదని సిద్ధాంతులు చెప్పియున్నారు. అదే స్థిరపరచి పనులు ప్రారంభించితిమి. మహారాజా ! నూఱ్వురుచిత్రకారు లాఱుమాసములు కేవలము పందిళ్లపని చేసిరి. నవరత్నములు నద్దినట్లుగా బందిళ్ల పైఁ జిత్రించిరి. వివాహమంటపము మీఁది పందిరికి నిరువదివేలు వ్యయమైనవి. ఆపందిళ్ల వైభవము చూచితీరవలయును. ఇప్పటికి నట్లేయుండునుకాని యీమహానుభావుఁడు దుడ్డుకఱ్ఱలవాండ్రతో వచ్చి యాపందిళ్లన్నియుఁ బాడు చేయించెను. పేరుపొందిన నూఱుభోగము మేళముల నూఱ్వుర వైణికుల నూఱ్వుర గాయకుల నాటకుల భాగవతులఁ బెక్కేల ఎక్కడ నేవిద్యలోఁ బేరుపొందినవిద్వాంసుఁ డున్నాడని వినిన నక్కడనుంచి యట్టివాని నాపెండ్లికిఁ దగినవెలయిచ్చి రప్పించితిని. ఆపెండ్లిదినములలో మాయిళ్లు మహేంద్రవైభవముతో నొప్పుచుండునవి. సుముహూర్తమునకు మూడుదినములకు ముందరనే వారందఱువచ్చి చేరిరి. నెలదినములు వ్యవధియుండఁగనే బంధువులువచ్చి చేరిరి. అప్పుడే యుత్సవములు ప్రారంభించిరి. సుముహూర్తము సమీపించినకొలఁది మాకు సంతోషావేశ మెక్కు.వయగుచుండెను. సుముహూర్తము నాఁటి యుదయమునకు మాగృహములన్నియు బంధుజనముతో నిండి పోయినవి.

పదివేలమందిజనులు నివసించుటకుఁ దగినట్లు పెండ్లివారికి విడిది నేరుపరచితిని. దారిలో స్నానకవ్రతము జేసికొని సుముహూర్తమునాఁటి యుదయమునకే వత్తుమని యీతఁడు మాకు జూబువ్రాసెం గావున వారికొఱకు నిరీక్షించుచుంటిమి సూర్యోదయమైనది. యెంతయో వైభవముతోఁ బెండ్లివారి కెదురేఁగవలయునని యందర నాయత్త పరచియుంచితిని. వీరిజాడయేమియుఁ గనంబడ లేదు. జాముప్రొద్దెక్కినది. రెండుజాములైనది. రాలేదు. గుఱ్ఱములెక్కించి రౌతులఁ బరుగెత్తించితిని. పెద్దదూరము పోయి వచ్చి యెవ్వరు గనంబడలేదని చెప్పిరి. ముహూర్తము రాత్రిగదా దారిలో భోజనముచేసి లగ్నము వేళకు వత్తురని తలంచి మాసన్నాహములో మేముంటిమి.

అంతలో సూర్యుఁ డస్తమించెను. అప్పటికిని రాలేదు. పందిళ్లన్నియుఁ బ్రేక్షకులతో నిండిపోయెను. వింతవింతలుగా దీపమాలికలు వెలిగింపఁబడినవి. పెక్కుచోట్ల వారాంగనలు నృత్యములు సేయు చుండిరి. వైణుకులు పాడుచుండిరిఁ నాటకు లాడుచుండిరి. హాస్యములు చెప్పుచుండిరి భూమండలములోఁ దూర్యనాదము లెన్ని భేదములు గలిగియున్ననో వానినన్నియుం దెప్పించితిని కావున నానినదములన్నియు శ్రోత్రపర్వముగా మ్రోగుచుండెను. దిగ్దంతులవంటి చతుశ్శాస్త్ర పండితులు కవీశ్వరులు సిద్ధాంతులు నవధానులు వేనవేలు బ్రాహణులు నానాదేశములనుండి వచ్చి వివాహమంటప మలంకరించి శాస్త్రవాదములు చేయుచుండిరి. పెండ్లికొడుకుజాడమాత్రము లేదు.

అప్పుడు నేను మిక్కిలి పరితపించుచు నేమియుందోచక వారు వచ్చుదారిలోఁ బోయి నిలువంబడితిని. పురోహితుఁడు వచ్చి మణిమంతా! ఇఁక రెండుగడియలలోఁ బీటలపైఁ గూర్చుండవలసియున్నది. ఇప్పటికిఁ బెండ్లివారే రాలేదే! ఏమిచేయుదము? అని యడిగిన నే నేమియు సమాధానముచెప్పక యూరక యాదెస జూచుచుంటిని.

ఇంతలో నిరువురు గుఱ్ఱపురౌతులు వడిగా వచ్చుచు నొకచో గుఱ్ఱములనాపి పెండ్లివారిల్లెక్కడనని యడుగుచున్న మాటలు వినంబడినవి. ఇటురండు. ఇటురండు. అని వారిని కేకలు వేయించితిని. వారు నేనున్న కడకు వచ్చి యాతఁడే కన్యాదాతయని యెవ్వరో చెప్పఁగా గుఱ్ఱములు దిగి వాండ్రు నాకు నమస్కరించిరి.

అప్పుడు నేను కోపముతో నోహో! మీయజమానుఁ డెంత మోసకాఁడు ! సుముహూర్తమున కొకదివస మెడముండగా రమ్మని చెప్పితినే. ఇప్పటికి రాలేదు ఏమి చేయవలయును ? ఎంత దూరములో నున్నారు అని యడిగిన వాండ్రు మోమున విన్నఁ దనముదోపనేదియో యుత్తరము తత్తరముతో నాకిచ్చిరి. దాని విప్పి చదువ నిట్లున్నది.

రత్నపాదుఁడు నియమితదివసమునాఁడే పదివేలజనముతో నిల్లు బయలుదేరి యోడలెక్కి సముద్రము దాటుచుండ గాలిత్రోపున నౌక లొకకొండకుఁ దగిలికొని వికలములై సముద్రములో మునిఁగినట్లు మాకు వార్తలు వచ్చినవి. వారిరక్షణకొఱకు కొన్ని యోడల మేమందుఁ బంపితిమి. వారిక్షేమసమాచారము మాకిప్పటి కేమియుం దెలియలేదు. కావున వారివృత్తాంతము తెలియువఱకు ప్రస్తుత మీసుముహూర్త మాపవలెనని కోరుచున్నాము. మేము రత్నపాదున కత్యంతబంధువుల మగుట విూరు దొట్రుపడుచుందురని యీవార్త మీకుఁ దెలియఁజేసితిమి.

ఆపత్రికం జదివితిని. నా నాడులన్నియుం గ్రుంకినవి. నేలం జదికిలఁబడితిని. అప్పుడు నా చిత్త మెట్లుండునో విచారింపుఁడు. అర నిమిషము నాకు మేను దెలిసినదికాదు. ఏమిచేయుటకుం దోచక నేలం బండుకొంటిని. అంతలో నాకు భగవంతుఁడొకయూహ తోపించెను. గడియ యాలోచించి యది మంచిదని నిశ్చయించుకొని యట్టె లేచితిని. అప్పుడే యావార్త నలుమూలలు వ్యాపించుటచే దూర్యారవములు మ్రోగించుట మానివేసిరి. నేను వాని నాపవలదని తెలియఁజేసి యాయుత్సవములోఁ బెండ్లిపందిరిలోనున్న ప్రేక్షకులనెల్ల నుపలక్షించుచు నాలుగుతేప లిటునటు తిరిగితిని.

నాపుణ్యవశంబున నొకచోట మేజువాణీజూచుచున్న యొక చిన్నవాఁడు నాకుఁ గన్నులపండువు గావించెను. విశాలములగు నేత్రములు చంద్రబింబమువంటి మొగము, ఆజానుబాహువులు. పెద్ద యురముగలిగి తేజస్ఫూర్తితోనొప్పు నాపురుషుని చేయిపట్టుకొని రమ్మని చీరుచు అబ్బాయీ! నీ వేకులమువాఁడవని యడిగితిని. అతఁడు ద్విజకులుండనని యుత్తరముచెప్పెను. ఇక మఱేమియు నడుగక సంతోషముతో నతని లోపలికిఁ దీసికొనిపోయి నీకు నాకూఁతు నిచ్చి వివాహముగావించెద నంగీకరింతు వేయని యడిగితిని. అతఁడు చిఱునగవుతో నంగీకరింపకేమి ? అని యుత్తరమిచ్చెను.

అప్పుడు నేను వీఁడే నాయల్లుఁడని యందరకుఁ దెలుపుచు దీసికొనిపోయి నాభార్య కత్తెరంగెఱిఁగించితిని. తద్రూపాతిశయమునకు మెచ్చుకొనుచు నాభార్య నే నీమాట మొదటనే చెప్పితిని. ఎక్కడో సముద్రమధ్యములోనున్న దీవిలోఁ గాపురముసేయు కోటీశ్వరుని కుమారుఁడఁట ఎన్నఁడు చూడని సంబంధము తెచ్చిపెట్టితిరి. దైవము మనకిప్పు డనుకూలుఁ డే! మొదటనే యోడ మునిఁగినది. పెండ్లి చేసిన తరువాత మునిఁగిన నేమిజేయుదుము! తప్పక వీనికే పెండ్లి చేయుమని బోధించినది. బంధువులందరు సమ్మతించిరి. బ్రాహ్మణులుత్తమలక్షణుఁడని మెచ్చుకొనిరి. ప్రేక్షకు లుత్సాహపడిరి.

పురోహితుఁడు తొందరపెట్టగాఁ బుణ్యస్త్రీ లప్పుడే వాని మంగళస్నానములు చేయించి పట్టుపుట్టంబులు గట్టనిచ్చి మాల్యానులేపనాద్యలంకారములచేఁ గైసేసి వివాహవేదికపైఁ గూర్చుండబెట్టిరి. మహావైభవముతో నే ననుకొన్నముహూర్తమునకే నాకూఁతు నాపిల్ల వానికిచ్చి కన్యాదానమహోత్సవము జరిగించితిని. వధూవరు లొండొరులం జూచికొని యానందించుచు మనంబునంగల ముచ్చటలు వెలిబుచ్చుచు విచ్చలవిడి తలఁబ్రాలు పోసికొనిరి.

పెక్కేల నూరేగింపులతో బోగముమేళములతో గానసభలతోఁ గర్ణరసాయనంబులగు తూర్యనాదముల తోఁ బెండ్లి యైదుదినములు నట మహోత్సవముతో వెళ్ళించితిమి. దీక్షావసానదివసంబున వధూవరులం గలిపి సంవర్తనమహోత్సవము గావించితిమి. మహా రాజా ! నేనాయైదుదివసములలో బ్రాహ్మణులకుఁ బీదలకు నితరులకు బంధువులకు జేసిన దానములు చెప్పుకొనరాదుగాని రెండులక్షల కన్న నెక్కువయైనట్లు లెక్కలవలనఁ దెలియఁబడినది.

అట్లుండ నేడవనాఁడు సాయంకాలమున కీరత్న పాదుఁడు బదివేల పౌజులతోఁ బెక్కండ్రు బంధువులతో వచ్చి మావీధి బాహ్యోద్యానవనంబున విడిసినట్లు నాకు వర్తమానమువచ్చినది. నేనావార్త విని గుండె ఝల్లుమన నోహో! సముద్రంబున మునింగివా రెట్లు వచ్చిరి? వచ్చిరిలో నేనిప్పుడేమీ జేయుదును? పెండ్లి యైనదని తిరుగా వర్తమానము బంపుదునా ? అట్లుకాదు. ఇంటికివచ్చినవాని గౌరవించుట న్యాయము. అని తలంచి తగినపరివారమును వెంటఁబెట్టికొని యీరత్న పాదుఁడు విడిసిన చోటికిం బోయి పల్కరించితిని.

అంతకుమున్నె నాకూఁతునకు వివాహమైనదని వినియున్నకతంబున నితండు నన్నుఁజూచి మండిపడుచు నోరీ తులువా! నీవుసంపన్న గృహస్తుండవని దూరమైనను నీసంబంధ మంగీకరించితిని. ఎక్కుడు విభవముతోఁ దరలివచ్చుచుంటి. దైవవశంబున సముద్రమధ్యంబున మాయోడలు కొండకుఁదగిలి చిల్లులువడినవి. లోపలికి నీరు చొరబడుచుండ నందలి, సామగ్రి కొంత జలధిలోఁ బడవేసి యెట్లో రంధ్రములు గప్పించి నీరు తోడించి యతిప్రయత్నమున నాలుగుదివసము లకఁ బ్రాణములతో నీవలగట్టునం బడితిమి. అందున్న మాబంధువులు మమ్ము బెద్దగా నాదరించి మావార్త మీకుఁ దెలియఁజేసినట్లు గాఁ జెప్పిరి. ఆమాటపై పెండ్లియాపి మాకొఱకు వేచియుందురని యింతదూరము వచ్చితిమి. మాచావుబ్రదుకులు తెలిసికొనకుండ నీ కూఁతు మఱియొకనికిచ్చి పెండ్లిచేయుట నీకు నీతియా? మఱినాలుగు దివసములైనఁ బరీక్షింపఁగూడదా. మేము మీయింటికి వచ్చుచుఁజిక్కుపడియుంటిమని వినియు విచారింపక వివాహమహోత్సవము జరిపించితివే! నీవెట్టికృతఘ్నుఁడవు. నీవు మానుషజన్మమెత్తలేదా? నీకంటెఁ బశువైన మేలే. ఛీ ఛీ నీమొగము చూడఁగూడదు అని నోరికివచ్చినట్లు ప్రేలుచుండ నే నిట్లంటి.

రత్న పాదా! తొందరపడకుము. నీవు పడరానియాపద పడి యుంటివి కావున నీకినుకకుఁ బ్రత్యుత్తర మీయక సైరించితిని. ఈవల యిబ్బందులుగూడఁ బరికించిన నింతగాఁ దూలనాడవు. మీరౌతులు చెప్పిన మాటలవలన మీరు బ్రతికివత్తురను నాస లేకపోయినది. మఱియొకసుముహూర్తము మూఁడేండ్లవఱకు లేదని దైవజ్ఞులు సెప్పు చున్నారు. వచ్చినబంధువులు నిలువరు. చేసిన సామగ్రి చెడిపోవును. దైవఘటనము లేదని తలంచి వీధింబోయెడివారి కిచ్చితిమి. నీతో సంబంధము కలియనందులకు మాకుఁ జాలవిచారముగానున్నది. దైవము ప్రతికూలుఁడైన మనమేమిచేయగలము ? మీరిచ్చటికి వచ్చి నందులకైన వ్యయమంతయు నిచ్చుకొందును. అలుగకుమని బ్రతిమాలినకొలది వీని కలుక పెఱుగుచుండెను.

మూఢు లిట్లే తప్పులుచేసి దైవముమీఁదఁ బెట్టుచుందురు. పుట్టుముహూర్తము లేకున్నను బెట్టుముహూర్త ముండదా? బ్రాహ్మణులకుడబ్బిచ్చినఁ గావలసినన్ని ముహూర్తము లున్నవని చెప్పుదురు. కానిమ్ము. సామగ్రిచెడుననికాదా పెండ్లిచేసితివి. నీసామాగ్రి నీక్రొత్తయల్లుని చుట్టాలతోఁగూడ మట్టుమాపెద నాసామర్థ్యము చూడుము మాకిది చాల లజ్జాకరముగానున్నది. ఇంత ధనముండియు నీచే నవమానింపఁబడితిని. నాకైనవ్యయ మిచ్చుకొందువా ! ఇందులకుఁదగిన ప్రాయశ్చిత్తము నీకుఁ జేయనిచో నాకసితీరదు. నీమర్యాదలుమా కవసరములేదు. పోపొమ్ము. నీయిల్లు కాచికొనుము. నీభాగ్యమంతయుఁ గొల్లగొట్టి మాయింటికిఁ బట్టించుకొనిపోవనిచో నన్నీ పేరఁబిలువవలదు. ఎవ్వరడ్డమువత్తురో చూతముగా. అని మీసములు దువ్వుటయు నే నేమాటయుం బలుకక గిరాలున మరలి యింటికివచ్చి భార్యతో నిట్లంటి.

మన కిప్పుడు గ్రహచారము చాలనట్లున్నది. శుభముచేసికొనినవెంటనే కలహమువచ్చినది. రత్న పాదున కిప్పుడు మనపైఁజాల కోపమువచ్చినది. మనయిల్లంతయుం గొల్లగొట్టి పట్టించుకొనిపోవునఁట. నాలుగువేలమందివీరులు నాఱువేలు నితరులును బదివేలపౌజుతో వచ్చియున్నాడు. వాని నడ్డపెట్టువారెవ్వరు? నేనీవార్త మనరాజ్ఞికిం దెలియఁజేసి సహాయమిమ్మని కోరికొనివచ్చెద నంతదనుక నింటికడ భద్రముగా నుండుఁడు. వెలగల రత్నపుసరకులన్నియు దాచివేయుఁడు. అని దైన్యముతోఁ బలుకుచున్న సమయంబున నామాట విని బంధువులందఱు గగ్గోలుపడఁజొచ్చిరి.

అంతలోమాయల్లుఁ డావార్తవిని మాకడకువచ్చి మీ రేమిటి కిట్లు చింతించుచున్నారని యడిగెను. మేమతనికి రత్న పాదుని యెత్తి కోలంతయుం దెలిపితిమి. అతండు నవ్వుచు నోహో! యిది స్త్రీరాజ్యమా! బలముగలవాఁడే యధికుఁడు కాఁబోలు కాకున్న ద్వీపాం తరమునుండివచ్చిన కోమటిశెట్టి పొరుగూరిలో నిట్లు బీరములుగొట్టునా. కానిండు మీరు వెరవఁబనిలేదు. రాజ్ఞినొద్దకు బోయి చెప్పుకొననవసరము లేదు. అతనికడ నాలుగువేల వీరులున్నారా.

ఉ. నాలుగువేలుగాదు భువనంబులు మూడునుగూడి వచ్చినన్
    లీల జయించువాఁడను చెలింపక సంగరసీమ నిల్చి మ
    త్కాలకరాళహేతితత ఖడ్గనిశాతవిఘాత పాతన
    జ్వాలల పాలుగాఁగ రిపుజూలముల న్మడియింతుఁ జూడుఁడీ.

మామా! మీరందఱు జింతమాని సుఖంబుండుఁడు. రత్నపాదుని భటుల మన పందిరిలోనికి రాకుండ నేను గాపాడెద నని పలికిన నందరము విస్మయముజెందితిమి.

మఱునాఁడు సూర్యోదయము కాకమున్న రత్న పాదునిబలము దుడ్డుకఱ్ఱలుబూని వచ్చుచున్నట్లు వాతన్‌లు వచ్చినవి. అప్పుడు మా యల్లుఁడు చేఁతఁ గరవాలంబు మెఱయ రయస్తుతంబగు నొక హాయ మెక్కి ప్రచండ హేతిభీకరుం డగు చిత్రభానుండో యన నొప్పుచు మాయింటి మొగసాలం గాచికొని యుండెను.

క. మణిమంతుని పని తీరఁగ
   నణువైన న్మిగులకుండ నతిశయసంప
   న్మణి కనక వస్తు వాహన
   గణముల వెసఁ గొల్లకొట్టి కైకొందుమిఁకన్ .

అనికేకలు వేయుచు దండములు ద్రిప్పుచు మూకమూకలుగా మాయింటికడకు వచ్చుచుఁ బెండ్లి పందిళ్ళన్నియుఁ బాడుపడెడుగా దండములతో బాదుచుండిరి. అప్పుడు మాయల్లుఁడు వాండ్రయల్లరి దిలకించి తనగుఱ్ఱమును మడమలతోఁ గొట్టినంత నది రివ్వుర నెగసి శత్రువీరుల కడ కొక్కయడుగులోఁ బోయినది. అతండు గుఱ్ఱపుడెక్కలచే వారిం ద్రొక్కించియుఁగరవాలంబున నేసియుఁద్రోసియుఁ గ్రుచ్చి యుఁ బొడిచియు మొఱ్ఱోయని యఱచుచు నాతురతంబాఱుచుండ వెన్నంటి లేళ్ళగమిం దఱుము బెబ్బులియుం బోలె పఱచుచు నాభీల కరవాల ప్రహారముల నాబలమునెల్ల గడియలోఁ బీనుఁగు పెంటలు గావించెను. మహారాజా? మీకడ ససత్యమాడనేల? చేతులు తెగి యఱచువారును బాదంబుల నరకఁబడి యేడ్చువారును ఖండితంబులగు శిరంబులతోఁ బాఱువారునై యతని జనులు పరితపింప నాప్రదేశము జూడ భయంకరముగాఁ దోచినది. హత శేషులుగోడగోడల సందుసందుల దాగికొని ప్రాణములు దక్కించుకొనిరి. అతని పరాక్రమముజూడరుద్రుడోయని మాకేభయమైనది. దేవా ! ఇదియే జరిగిన కథ. ఇందు మాతప్పేమి యున్నదియో దేవర విచారింపవలయును. మాయల్లుఁ డడ్డపడనిచో నీతఁడు మాయిల్లు కొల్లగొట్టువాఁడే. అప్పుడు మే మే మగుదుము అని యావృత్తాంత మంతయు మణిమంతుఁ డెఱిఁగించుటయు విని పుష్ప కేతుఁ డవ్వీరుని శౌర్యమునకు విస్మయము జెందుచు రత్న పాదునితో నిట్లనియె.

సెట్టీ ! నీవియ్యంకుఁడు సెప్పిన కథయంతయు వింటివా ? ఇందేమైన ససత్యముండిన నడుగుము. విమర్శించెదనని పలికిన నతండు ఇందేమియు నసత్యము లేదు. చెప్పినదంతయు సత్యమే. నిరాయుధులైన మాభటులం బీనుఁగు పెంటలు గావించెనని యతం డొప్పుకొనుచు నప్పని తప్పుగాదని పలుకునేమి ? అంతకన్న నపరాధ మేమి యున్నది? మేముబలవంతమున నతని యింటిపైఁబడి కొల్లగొట్ట దలంచిన దేవరకుఁ జెప్పికొనవలయుంగాని యల్లునిచే హత్యలుగావింప వచ్చునా? ఇంతకన్న నపరాథ మేమున్నది? అని పలికిన విని పుష్ప కేతుఁడు నవ్వుచు నిట్లనియె.

సెట్టీ! నీకీమాత్రము బుద్ధియుండిన నీముప్పే రాకుండెడిదికదా. ఆతగవుమాయొద్దఁబెట్టక బలము గలదుగదా యని వాని యింటిమీఁద బడి కొల్లగొట్టింపఁజూతువా! వాని యల్లుఁడు లేకున్న వానిపని యేమగును? ఇది స్త్రీరాజ్యము గావున మీయాటలు సాగుచున్నవి. నీకు మంచి ప్రారశ్చిత్తమైనది. సంతసించితినని రత్న పాదుని నిందించుచు నీతప్పంతయు రత్న మకుటది. నగరములో నేమి యల్లరి జరుగుచున్నదియో తెలిసికొనవలదా? యని రత్నమకుట నాక్నేపించుచు రత్న పాదా! నీవు మొదట మణిమంతు నిల్లు గొల్లగొట్ట బలములఁ బంపుట నీదియే తప్పుగాఁ గనంబడుచున్నది. ఇందుల కేమందువని యడిగిన నతం డిట్లనియె.

దేవా ! నేను అవమానజనితమగు కోపము పట్టఁజాలక యూరక యట్లు చేయుదునని బెదరించితిని కాని మఱియొకటి కాదు. అంత మాత్రమునకే యట్టిహత్యలు గావింపవలయునా ? అయ్యపరాధ పరిశోధనము గావింపరా? అని యడిగిన పుష్ప కేతుఁ డిట్లనియె. సెట్టీ! నీ వూరక వియ్యంకుని బెదరించుటకై పదివేల జనముతో నతనియింటిమీఁదఁ బడితివా ? ఆపెండ్లి పందిళ్ళన్నియు భగ్నముచేయించితి వదియుఁ బరిహాసమే కాఁబోలు! కానిమ్ము. మణిమంతుఁడా ! నీయల్లునికిఁగూడ నాజ్ఞాపత్రిక పంపితిమిగదా. అతం డేమిటికి రాలేదు. బలవంతుఁడనని గరువము కాఁబోలు. అతనివలనఁ గొంతసాక్ష్యము దీసికొనవలసి యున్నది. నీవువోయి యిప్పుడే వెంటఁబెట్టుకొని రమ్ము. పొమ్ము అని పలికి యతండు వచ్చుదనుక నవ్వల నుండుమని రత్న పాదునితోఁ జెప్పి రెండవ యభియోగంబున వాదియగు వ్యాఘ్రముఖ యన్నగారిం బిలిపించి నీవేమి చెప్పెదవు? ప్రతివాది యేమిటికి రా లేదు? అని యడిగిన వాఁడిట్లనియె.

దేవా! వ్యాఘ్రముఖియను వారకాంత నాయక్క కులవృత్తిచేఁ జాల ధన మార్జించినది. మొన్ననొక విటుఁ డెవ్వఁడోవచ్చి దాని కూఁతుఁ గుందమాలను వశముజేసికొని వ్యాఘ్రముఖిని బలవంతము గా జంపి నూఁతిలో బారవేసెను. అడ్డమువచ్చిన మఱికొందఱ దాదులఁగూడ నాక్రోశింపుచుండ నానూతిలోనే పడవేసెను. మామేనకోడలు కుందమాల వానికిఁ జడిసియో వరించియో యహత్య యెవ్వరికిం దెలియఁజేయక యాశవములఁజాటుగాఁ దహింపజేసి వానింబెట్టుకొని కులుకుచున్నది. తల్లిచావున కించుకయు విచారములేదు. స్త్రీల చరిత్రలు దేవర యెఱుంగునివికావు. ఆవిటుఁడు సంతతము దానితోఁ గలసిమెలసి వర్తించుచున్నాడు. వాఁడు చాల పొగరుఁబోతు. నేను మాయక్క చావునకు దుఃఖించుచుఁ గుందమాలతో నీహత్యాప్రకారము చదురునఁ జెప్పికొనుమని యెంత బోధించినను వినక చచ్చిన తల్లి తిరుగారాదు. ఈవిటుఁడు మంచివాఁడు వీని జంపించిన లాభ మేమని యుపేక్ష జేసినది. దానంజేసి నేనే యీయభియోగము దెచ్చితిని. ప్రతివాది మీయాజ్ఞపత్రిక జూచియుఁ బుచ్చికొనియుఁ దిరస్కారముతో నిందురాలేదు. దేవర వాని రప్పించి యీయభియోగము విచారింపుఁడని కోరికొనుచున్నాను.

అని యెఱింగించిన వానిమాటలు విని పుష్ప కేతుఁడు మంత్రిం జూచి ఇక్కడిప్రజలు మీయాజ్ఞల మన్నింపరు కాఁబోలు. ప్రతివాది రాకున్న నెట్లు విచారింతుము. తగిన భటులంబంపి వానింబట్టి తెప్పింపుమని యాజ్ఞాపించుటయు నతండప్పుడే యతనిం దీసికొనిరాఁ బదుగుర రాజభటులం బంపించెను.

ఈలోపల మణిమంతుఁ డరుదెంచి మహారాజా ! నాయల్లుఁడు చాల యలసియున్నాడు. రాలేనని తమతో మనవిచేయుమన్నాఁడని యేదియో చెప్పఁబోయిన నలుగుచు ఔను. నేనప్పుడే యనుకొన్నాను. ఇది స్త్రీ రాజ్యమనుకొనుచున్నాడు కాఁబోలు పురుష రాజ్యమని చెప్పుము. గడియలో రాకున్న వానిం గట్టి తెప్పింతు. క్రమ్మఱఁబోయి చెప్పుమని యతనివెనుక నొక రాజభటునిగూడ నంపించెను. వారిరు వురు వోయివచ్చిరి. మణిమంతుఁడు:- మహారాజా పిల్లవాండ్రమాటలు మీరు పాటింపఁగూడదు. రేపు బతిమాలి తీసికొనివచ్చెద. నేఁటి కూరకుండుఁడని ప్రార్థించెను. నాయాజ్ఞనిని యతం డేమనియెనో చెప్పుమని భటునడిగిన వాఁడిట్లనియె.

దేవా ! మేముపోయి దేవరసందేశ మెఱిఁగించితిమి. నే నపరాధివలె నరపతికడకు వచ్చువాఁడను గాను. అతనియాజ్ఞ మన్నింప నాకవసరములేదు. నాబలము దెలిసికొన నభిలాషగలదేని కయ్యమున కాయత్తపడియున్న వాఁడ. పొండు పొండు. నన్ను రప్పించుటకువాని కేమిసామర్థ్యమున్నదని యతఁడు నిర్లక్ష్యముగా నుత్తరముచెప్పెను. దేవా ! వాఁడు మీయానతి తృణముకన్నఁ దేలికగాఁ జూచెను. పాప మీవర్తకుఁడు రమ్మని బతిమాలికొనినను వినిపించుకొనలేదని భటుం డెఱింగించిన విని పుష్పకేతుఁడు ధూమకేతుండువలె మండుచు నిట్లనియె.

ఓహో ! ఇందలిప్రజలకు నాసామర్థ్యము దెలియలేదు. ఇంకను నాఁడుదియే పాలించుచున్నదని తలంచుచున్నవారు కాఁబోలు. మణిమంతా ! నీవింటికిం బోయి నీయల్లునితో నిప్పటిరాజు రత్న పాదుఁడు కాడని చెప్పుము. మేకలవంటి యతనిమూకల నేమో చేసితినని గరువముఁజెందియున్న వాఁడు కాఁబోలు కాచికొనుమని చెప్పుము వాని పరాక్రమముఁజూడ నాకును వేడుకగానేయున్నది. రేఁపు ప్రాతఃకాలమే బద్ధసమయమని తెలియఁజేయుము పొమ్ము. అని వానినంపి పీఠమునుండి లేవఁబోవుసమయమున వ్యాఘ్రముఖి తమ్మునివెంట నరిగిన భటు లరుదెంచి యిట్లనిరి.

దేవా ! మేమా హంతకునికడ కరిగి దేవరయాజ్ఞ యెఱింగించిన నవ్వుచు నతఁ డిట్లాక్షేపించెను.

క. మీరా జాఁడుదియని విని
   నారముగద పురుషుఁడయ్యెనా యిపు డక్కాం
   తారత్నం బట్లైనం
   బోరం గనుఁగొందు వాని భుజబలమిహిహీ.

అని పలుకుటయు మేమదలించి వానిం బట్టికొనఁ బ్రయత్నించితిమి. స్వామి ! వాఁడు మాకు లొంగువాఁడుకాడు. చేతనున్న బెత్తముతోనే మమ్ముఁ గాందిశీకులఁ గావించెను. ఆదెబ్బలఁ దిని పారిపోయివచ్చితిమని యెఱిఁగించినఁ బక్కున నవ్వుచు నౌరా ! ఈ రాజ్యంబున మంచివీరులున్నారు గద. రాజునానతినొక్కరుఁడు లెక్క సేయఁడు. ఆఁడురాజ్య మాఁడురాజ్యముగానే యున్నదని రత్నమకుట నాక్షేపించుచు వారిరువురబలము రేపు గనుంగొనియెదఁగాక. తెల్లవారకమున్న పదుగురసాదుల నిందుండునట్లు నియమింపుము. నానిమిత్త ముత్తమాశ్వ మొకదాని నాయత్తపరచి యుంచుమని మంత్రికి నియమించి పుష్ప కేతుఁడు భార్యతోఁగూడ నతఃపురమున కరిగెను.

అని యెఱింగించునప్పటికి వేళ యతిక్రమించినది. పై కథ యవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

241 వ మజిలీ.

మణిమతుఁ డల్లునితో నగరిలోజరిగిన కథయంతయుం జెప్పి గడ్డముపట్టికొని బాబూ! నామాట వినుము. బలవద్విరోధమువలదు. రాజు చాలమంచివాఁడు. రత్న పాదునిమాటలు విని యతని నాక్షేపించుచు నీపక్షమే వాదించెను. నీవు తనకడకు వచ్చితివికావను కోపముతప్ప మఱేమియును లేదు. ఒకసారి పోవుదమురమ్మని బతిమాలిన నవ్వుచు నతండు మామా! నాసామర్థ్యము నీవెఱుంగక వగచుచున్నావు. అతండు నన్నేమియుఁ జేయఁజూలఁడు. నాకంటె బలవంతులగు నాసోదరులు నలువు రీయూరనున్నారు. అంతయవసరమువచ్చి