కాశీమజిలీకథలు/పదవ భాగము/238వ మజిలీ
విక్రముండు నవ్వుచు అమ్మా! మేము నీపతి నక్రమముగా జయించితిమని పలుకవలదు.
కొంత గడువిత్తుము. సేనలం గూర్చుకొని మీకడనున్న మహావీరులనెల్ల నాయత్తపరచికొని యుద్ధము సేయుమనుము. అందుఁ గూడ గెలిచినప్పుడే మాకు నీపతిచే జయపత్రిక లిప్పింపుము. అంత దనుక మేమిందొకచోట వసించియుందు మని పలుకుచు విక్రముండు క్రోధనుని విడిచి లేచెను. అప్పుడతండు లజ్జావనతముఖుండై లోపలికిఁబోయెను. అప్పుడారాజపుత్రులు ద్వారమున నిలిచియున్న మంత్రిసామంత ప్రముఖ యోధులనెల్ల లోపలికిబొమ్మని యాజ్ఞయిచ్చి సాధ్వీ ! మే మామఠమునకుం బోవుచుంటిమి జయపత్రికయో రణపత్రికయో మూడుదినములలో మాకుఁ బంపవలయును. నింతియగడువు. మేము బోవుచున్నారమని పలికి వారు మఠంబునకుం బోయిరి.
అని యెఱింగించి మణిసిద్ధుండు. . . ఇట్లు చెప్పఁ దొడంగెను.
- _________
238 వ మజిలీ
అయ్యో భూలోకమునంగల చక్రవర్తులందఱు నాపేరువినినగడగడలాడుచుందురు. నా పాలిటికీవీరు లెక్కడనుండివచ్చిరో ! ఇప్పుడు నేను వీరికి జయపత్రికలిచ్చినచో నలువురలోఁదలయెత్తి తిరుగుట యెట్లు? ప్రేయసీ ! ఇట్టిపరాభవము నే బుట్టినతరువాత బొందియుండలేదు. మనయింటికివచ్చిన చుట్టములులోకైకవీరులని చారుమతి చెప్పినదిగదా! వారీ రాత్రి నింటికిఁరాగలరు వారింటనుండు నప్పుడైన వీరిని బిక్షకుఁ బిలిచితినికానే యౌరా! ఆకపటాత్ములు యతులవలె నెంతప్రచారముచేసిరి! ఇంతయేల జయవత్రికలిచ్చిపంపుమందునా. తిరుగాయుద్ధమునకురమ్మని సన్నాహము చేయుమందువా? ఇప్పుడు కర్తవ్య మేమని యడిగిన భార్య యిట్లనియె.
నాథా ! మీరు వారితో, బోరఁజాలరు వారు సామాన్యులు గారు ఈరాత్రి మనచుట్టములనడిగి పిమ్మట వారికి వార్తబంపవచ్చు నింతలోఁతొందరయేమివచ్చినది? చారుమతీ ! నీవిందులకేమందువు నీవు తెలివిగలదానవు. మొదటనే మనక్రోధనుఁ డోడిపోవునని చెప్పితివి. అనియడిగినఁ జారుమతి యిట్లనియె అమ్మా ! నాపతియు సోదరులు నుత్తర దిక్కంతయు జయించినమహావీరులు వారువీరిం గెలువఁ జాలుదురు. వారువచ్చినతరువాత నాలోచించి రేవుశత్రువులకు వార్తలంపుటయే యుచితమని పలికినది.
రాజు. ఆదినమెల్ల మంత్రులతో నాలోచించుచుండెను. విక్రముని బలముదలచి వెంటనే జయపత్రికలిచ్చి యంపుటయే శ్రేయమని పలుకుచుండెను. ఇంతలో సాయంకాలమైనది సముద్ర విహారమునకై యరిగిన వారిచుట్టములింటికివచ్చి యంతకపూర్వమే యావార్తవినియున్న వారగుటఁ క్రోధను నూరార్చుచు నిట్లనిరి.
మామా! మామాసామర్ధ్యములు నీవెఱిగిన నింతచింతింపవు నిన్నవమానము గావించిన యావీరుల గడియలోఁ బలాయితులంగావింపనిచో మాప్రజ్ఞనిందింపుము. పాపము నీకిట్టి యవమతి గలుగు యోగముండఁబట్టియే మేము లేనితఱివారినింటికి రప్పించుకొంటివి. కానిమ్ము గతమునకు వగవంబనిలేదు. రణభేరి మ్రోగింపించుము మాప్రతాపము చారుమతి చెప్పలేదా! నీవుమాకుఁ జుట్టమువై యొరులచేఁగొట్టఁబడిన నూరకుందుమా ! ఈయవమానము మాదికాదా. ఇప్పుడెవారి కందు వచ్చుచున్నామని వార్తనంపుము. అనితొందరపెట్టుటయుఁ క్రోధనుండిట్లనియె.
వీరులారా! మీసామర్ధ్యమట్టిదే కావచ్చును. ప్రతివీరుల బలముకూడఁ గొంతదెలిసికొన వలసియున్నది. నేనిట్లేనాకెవ్వరు సాటి లేరని గర్వపడువాఁడను. పోరనినఁ బండువుగాదలంచువాఁడ నిప్పుడా మాట జెప్పిన నెడద దడబడుచున్నది. నిదానింపుఁడు. ఆ వీరులు సా మాన్యులుకారు. వానిప్రహారములు నామర్మముల వీడఁజేసినవి. ఇప్పుడు జయపత్రిక లిచ్చిన బోవుదురు.
క్రమ్మఱఁ బోరంజీరి మీరుగూడ నందోడితిరేని నారాజ్యమే కైకొందురేమో? యని పలికినవారు మీసములు దువ్వుచు నిట్లనిరి.
మహారాజా ! మాప్రతాప ప్రభావమెఱుంగకిట్లు పిఱికితనంబు వహించుచున్నావు. నిన్నిందుఁ గూర్చుండఁబెట్టి జయము గొందుము చూడుము మీసేనలతో యోధులతో మాకేమియుఁ బనిలేదు. మాగుఱ్ఱములఁ దెప్పింపుము. రేపు సూర్యోదయ సమయమే యుద్ధసమయమని వారికి వార్తనంపుము పరితపింపకుమని యుదుటు గరుపుచుం బలికిన నతండెట్ట కే యంగీకరించి యట్టివార్త మఠంబునకుఁ దెలియజేసెను.
మఱునాఁడు సూర్యోదయముకాక మున్న యావీరులేవురు గుఱ్ఱములెక్కి వీర వేషములతో రణభేరి మ్రోగ నామఠంబున కరిగిరి. క్రోధనుండింటికడనుండి చారుమతితో పట్టీ! వీరిసాహసములు వింతగా నున్నవి. వీరెవ్వని కుమారులు ? ఎట్టి బలవంతులు ? అని యడిగిన నాయువతి యిట్లనియె.
బాబా! వీరు తాళధ్వజుఁడను మహారాజు కుమారులు ఉత్తరదిగ్విజయము జేయ బయలుదేరి యెల్లభూపతులను జయించి కప్పములు గొన్న మహాశూరులు నన్నెత్తికొని పోయిన మధుండను దానవుని బరిమార్చిన యోధులు వీరే! ఇట్టియసహాయ శూరు లెందును లేరని చెప్పిన విని యతండు. ఏమీ వీరు తాళధ్వజుని కుమారులా! నాశత్రువు గూడ దాళధ్వజుని కుమారులమని చెప్పిన జ్ఞాపక మున్నది. వీరును వారు నన్నదమ్ములు గారు గద. అని యడిగిన నవ్వెలఁది తెల తెల పోవుచు గావచ్చును. తాళధ్వజుని కుమారులు ఇరువదిమంది పెద్ద వారేవురు పూర్వదిక్కు జయించుకొని వచ్చిరఁట. వీరు సులోచనుని తరువాతి వారేమో! కానిచో నితరుల కింత పరాక్రమముండుట యరుదే. వీరు మీతోఁ దాళధ్వజుని కుమారులమని చెప్పిన మాట బాగుగా జ్ఞాపకమున్నదియా. అట్లైన మనము ధన్యులమే. అందలి నిజానిజములు దెలిసికొనుటకై తగిన వారి ననుపుడని యుపాయము చెప్పినది.
ఆనృపతి తగుపరిజను నొకనిం బిలిచి సంగరంబెట్లు వర్తించు చున్నదో తెలిసికొనిరమ్మని యనిపెను. వాఁ డతి రయంబునంబోయి యక్కడి విశేషంబు లన్నియుఁ జూచివచ్చి యిట్లు చెప్పెను.
దేవా! మనవీరులు వాఱువములెక్కి యక్కడ కరుగునప్పటికి బ్రతివీరులును బోరనాయత్తపడి యుండిరి. మనవారి గుఱ్ఱముల ముఖ పట్టణముమీఁదనున్న చిహ్నముల విలోకించుచు వారిలో వారేదియో నిరూపణపూర్వకముగా మాటాడికొని యాయుధములవిడచి మోడ్చు చేతులతో మనవారి గుఱ్ఱముల దాపునకు వచ్చి నమస్కరించిరి.
మనవీరులు వారింజూచి యోహో! ఇదియేమి చోద్యము. మన తమ్ములిందు వచ్చియున్నా రే! అని గుభాలున గుఱ్ఱములు డిగ్గ నుఱికి వారిం గౌఁగిలించుకొని విజయా ! విక్రమా! అని పేరులు పెట్టి పల్కరించుచుండ వారును నానందబాష్పములు గ్రమ్మ గ్రమ్మఱ నాలింగన సుఖం బిచ్చిరి. కంఠంబులు డగ్గుతికపడ నొక్కింత తడ వేమియు మాటాడలేక వారూరక చూచుచుండి రందు విక్రముం డను ప్రతివీరుం డిట్లనియె.
అన్నలారా! మీ రుత్తరదిశ కరిగితిరిగదా! యిక్కడి కెట్లు వచ్చితిరి? ఈరాజు మీకుఁ జుట్ట మెట్లయ్యెను ? తొలుత గుఱ్ఱములఁ జూచి గురుతుపట్టితిమి. లేకున్నఁ బ్రమాదమే జరగును. జుఁడీ. ఆహా ! నేడంత సుదినము. అయత్నోపలబ్ధముగా మనము గలిసికొంటి మని సంతోషాతిశయముతోఁ బలికిన విని మనవీరులును మురియుచు వారిచేతులు పట్టుకొని పోయి యామఠంబు వేదికపైఁ గూర్చుండి ముచ్చటలాడుకొనుచు నొండొరుల చరిత్ర మొండొరులకుఁ దెలియఁ జేసికొనిరి.
పౌరులు విశేషముగా మూగికొనియుండుటచే నాకు వారి దాపునకుఁబోవ వీలుపడినది కాదు వారాడికొనిన మాటలన్నియు వినఁబడలేదు వినఁబడినవానిం జెప్పెద నాలింపుడ మేము ద్వారవతీనగరంబున నాలుగుదివసంబులుండి శ్రీకృష్ణునిభజించి యింటికింబోవలయు నని ప్రయత్నింపుచుండ జారుమతి తండ్రి యవంతీశ్వరుఁడు తోడల్లుఁడగు క్రోధనునింజూడ నోడలమీఁదుగా నీయూరుచేరుటకై ద్వారవతి యరుదెంచి మూడుదివసంబులావీటిలో నివసించెను తనకూఁతురు చారుమతి నప్పుడు రాక్షసుండెత్తికొనిపోయెననియేకాని తరువాత జరిగిన వార్తలేమియు నెఱుంగఁడు.
మేమెవ్వరమో మహావీరులము దేశములు పెక్కుజయించితి మనివిని యారాజు దైవికముగా మర్యాదకై మమ్ముఁ జూడవచ్చి మాకువార్తనంపెను. మేమతని రాక కనుమోదించుచు శిబిరద్వారము దనుక నెదురుపోయి సగౌరవముగాఁ దీసికొనివచ్చి యుచితాసనాసీనుం గావించి స్వాగతపూర్వకముగా గుశలప్రశ్నము జేసితిమి. అతండు తనవృత్తాంతము మాకిట్లుచెప్పెను.
రాజపుత్రులారా! నాయదృష్ట మేమనిచెప్పికొందు. లేక లేక నాకుఁ జారుమతియను నాఁడుపిల్ల కలిగినది. దానికిఁదగినవరుఁదీసికొని రాలేక స్వయంవరముచాటింపించితిని అందుఁ గల్వాణమంటపమున కరుగుచున్న నాపట్టి నాకసమునంబోవురక్కసుడొక్కఁడట్టెవచ్చియెత్తికొని పోయెను. ఎంతయోదూరము వెదకించితిని. ఆకన్యజాడ యేమియుఁ దెలియలేదు. నాఁటిసుతనేటి దనుక నాభార్య నిద్రాహారములులేక బిడ్డకై పరితపించుచున్నది. వగపునిరర్ధకంబనియెఱిఁగి యున్నను మోహ పాశబద్ధులమగుట లోకమును జింతాపరంపరలు తాకఁకమానవు. వరుణావతీనగరంబునఁ గ్రోధనుండను మహారాజు నాభార్యకు అక్కమగఁడు అతనిభార్య చెల్లెలి పరిదేవనమువిని మమ్మక్కడికిఁ దీసికొనిరమ్మని నమ్మకమగు భృత్యులనంపినది వారివెంట మేమందుబోవుచున్నాము ఈక్షేత్రం బతిపవిత్రమైనదగుట మూడునాళ్ళు వసించితిమి. రేపు ఓడలెక్కిపోవుదుము మీరు లోకైకవీరులని చెప్పగావిని చూడవచ్చితి నని యారాజు తనకథయంతయుఁ జెప్పెను. ఆకథవిని మే మొకరిమొకము చూచుకొనఁ దొడఁగితిమి. అప్పుడు హరివర్మలేచి యో హో హో! అవంతీశ్వరుఁడవా నీవు! దైవసంఘటన మతివిచిత్రమైనది గదా. మీకూతురు చారుమతి కుశలినియైయున్నది. మీకిందుఁ జూపింతు నా కేమి పారితోషిక మిత్తురని యడిగిన నమ్మహారాజిట్లనియె.
మహాభాగ!నీవనినమాట సత్యమగుంగాక. అట్లైన నా రాజ్యమే నీకుఁ బారితోషికముగానిత్తు. ఏదీ? ఎందున్నదియో చెప్పుఁడు చెప్పుఁడు అనియూరక యున్మత్తునిచందమున నడుగుచుండ మనహరివర్మమామా! నేను నీయల్లుఁడ చారుమతి నన్ను వరించినది. అని తమకథసంక్షేపముగాఁ జెప్ప విని యమ్మహీపతిబొందిన యానందమిట్టిదని చెప్పుటకు మాతరముకాదు.
హరివర్మంగౌఁగలించుకొని యేదీనానందనియేదీ చూపుదువా? అని యడిగిననతఁడు నాతోరమ్ము చూపింతునని పలుకుచు నొకపట కుటీరమునకుఁ దీసికొనిపోయి చారుమతింజీరి నీతలిదండ్రులు వచ్చి యున్నారనిచెప్పెను. అప్పుడప్పడఁతి ముప్పిరిగొను వేడుకతో వారిం గాంచినది పుత్రికఁజూచి వారుమాటాడలేక హా తల్లీ ! నీవు బ్రతికి వచ్చితివా! అనిపలుకుచుశోకగద్దదకంఠుడై యక్కునంజేర్చి పెద్దతడవు గారవించిరి.
ఊరికిఁ బోయివచ్చిన బిడ్డలం జూచినప్పుడే యెక్కువ ప్రహర్షము గలుగును. మృతినొందినదని నిరాశ జేసికొనిన పట్టి గనంబడినపు డెట్టి యానందము గలుగునో యది యనుభవైకవేద్యముగదా.
అవంతీశ్వరుఁడు మాచరిత్రము విని మమ్ము జాలగౌరవించుచు మాపయన మాపి యీక్రోధనుని బలపరాక్రమములు రాజ్యవైభవములు పెద్దగా నగ్గించుచు నందుబోయి యాద్వీపవిశేషములు చూచి వత్తముఁ రండని యెక్కువఁగా బట్టుపెట్టెను. క్రొత్తదేశములు చూచుటకు మనకుఁ జాలవేడుక గలిగియున్నదికదా! అతనిమాట ననుమతించి యప్పుడె బయలుదేరి యోడలమీఁదుగా మాపరివారముతోఁ బదునాలుగుదివసముల కీయూర సేరఁగలిగితిమి.
ఈరాజు తన నగరము శత్రువుల యోడలు సేరకుండ సముద్రములో యంత్రపుగనుల వైపించెనఁట. కర్ణధారు లారహస్యము నెఱింగినవారగుట నాగనులకుఁ దగులకుండ నౌకల దీరమును జేర్చిరి. మారాక విని క్రోధనుఁడు కలములకడ కెదురువచ్చి సగౌరవముగా మమ్మింటికి దోడ్కొనిపోయి యల్లుండ్రకుఁ జేయువిందులు చేయుచు యంత్రరహస్యములఁ దెలుపుచు స్థానవిశేషములఁ జూపించుచు మమ్ము విడువక సంతతము మాతోఁ దిరుగుచుండెను.
మే మెప్పటి కప్పు డింటికిఁ బోవలయునని బయనమగుచుండ నేదియో నెపము పన్ని వారింపుచు మఱి పదిదినము లాపెను. మొన్న సముద్రములోఁ బగడపుతీగెలు గలతావు దాపున నున్నదని విని యోడలెక్కి యక్కడకుఁ బోయితిమి. ఆవింత జూచి మరలివచ్చుచుండ దారిలో రాజభటు లెదురుపడి మీయౌద్ధత్యం బుగ్గడించుచు నృపతి పరాభవపరాక్రమ మంతయుం దెలియఁజేసిరి.
అప్పుడు మేము తొందరగా నింటికి వచ్చి క్రోధనుని యపజయంబు విని యతని ననునయించుచు నుదుటుగఱపి మనగుఱ్ఱము లెక్కి యిక్కడికి వచ్చితిమి. దైవకృపచే మనము గలసికొంటిమని తమవృత్తాంతమంతయు వారి కెఱింగించిరి. ఒండొరు లత్యుత్సాహముతో మాట్లాడుకొనుచుండిరి. మనవీరులు వారిం దమవెంటఁబెట్టుకొని యిక్కడికిఁ దీసికొనివచ్చుచున్నారు. రణభేరీనాదములు తూర్యనాదములుగా మారినవి. ఇంతపట్టు చూచివచ్చితిని. వా రీపాటికిఁ గోటసమీపమునకు వత్తురని యావృత్తాంతమంతయు వార్తాహరుం డెఱింగించెను.
ఆకథ విని చారుమతి క్రోధనునితో బాబా! నే జెప్పలేదా? ఇతరుల కట్టిసాహసవిక్రమము లుండవు. నీ వింక జింతింపఁబనిలేదు. వారుగూడ నల్లుండ్రేకదా యని యూరడం బలుకుచున్నంతలోఁ తూర్యనాదములు వినంబడినవి. క్రోధనుండు లేచి యటు చూచుచుండగనే యారాజకుమారు లందఱు నంతఃపురమునఁ బ్రవేశించి క్రోధనుం గాంచి నమస్కరించిరి.
హరివర్మ తమ్ములచరిత్రము క్రమ్మఱఁ గ్రోధనున కెఱింగించెను. అతండు సిగ్గుపడుచు విక్రమునిపరాక్రమ మెక్కుడుగా వినుతింపుచుఁ దత్సమయోచితముగా వారినెల్ల నభినందించెను. విక్రముండును బంధుత్వము దెలియక తాము గావించిన యవమానము మఱువవలయునని క్రోధనునిం బ్రార్థించెను.
క్రోధనుండును విషాదంబు విడిచి ప్రీతిపూర్వకముగా వారి నాదరింపుచుఁ గొన్నిదినంబులు దనయింట నుంచుకొని యనేకమహోత్సవములు గావించెను. పెక్కు సభలు జేసి వారివారిచరిత్రము లుగ్గడింపుచుఁ దదీయబలపరాక్రమము లెక్కుడుగా స్తోత్రములు సేసి లోకులకుఁ దెలియఁబఱచెను.
ఆరాజపుత్రులు క్రోధనునకుం జెప్పి తమబలంబుల నోడలమీఁద నంపుటకు నియమించి ద్వారవతిలో నిలిచియున్న బలంబుల
నాదారిని గన్యాకుబ్జమునకు రమ్మని వార్తననిపి శుభముహూర్తంబున హరివర్మాదులు దలంచినంతనే దేవకన్యలతో గూడ సన్నిహితమగు రత్న విమానముపై వారెల్లభార్యలతో నెక్కిమహావైభవముతో గగనమార్గంబునఁ బుష్పకారూఢుం డగు శ్రీరాముఁడువోలె జనుచుఁ దొలుతనుమాపురంబున కరిగిరి.
అందొకచో విమానమునిలిపి హరివర్మయల్లన శ్రీధరుని కోటలోనికిం జనియెను. అతండు శ్రీముఖుని తమ్ముండని యెఱింగిన వారెల్ల వడివఁడి బరుగిడికొనిపోయి యావార్త శ్రీధరుని కెఱింగించిరి. శ్రీధరుం డతని కెదురువచ్చి ప్రీతిచే నాలింగనము జేసికొని రాజపుత్రా! మీతమ్ములేరి! అందరు సుఖముగా వచ్చితిరా? అని యడిగిన నతండు మీ యనుగ్రహమున సేమముగానే వచ్చితిమి. మాయన్న శ్రీముఖుఁ డిందుఁ గుశలియై యున్న వాఁడా యని యడిగిన నా రాజిట్లనియె.
రాజపుత్రా! నిన్నొకమాట నడిగెదఁ జెప్పుము. మీరుసముద్రములో నరుగుచుండ నోడలన్నియుఁ గనులకుఁ దగిలి వికలములై మునిగినవనియు, మీరందుఁబడి మృతినొందితిరనియు మాకు వార్తలు వచ్చినవి. మీ రెట్లు బ్రతికి వచ్చితిరో తెలుపుమని యడిగిన నతండు సంక్షేపముగా దమకథ నెఱింగించి యతని కానందము గలుగఁ జేసెను.
రాజు విస్మయపడి అయ్యో! పాపము! మీయన్న మీ మరణవార్త విని మిక్కిలి దుఃఖించుచు అక్కటా! క్రోధనుని యంత్రబలసామర్థ్యము వినియుం దమ్ములబంచి బలవంతమున జంపికొంటి. నావంటి దుర్మార్గుం డెవ్వఁడైనఁ గలఁడా? అయ్యో! నేనత్త వారింట విందులు గుడుచుచుఁ దమ్ములతోఁ బోలేక నిలిచితినే. నేనొక్కరుండ నింటి కెట్లు పోవుదును? తమ్ములేరని యడిగిన మాతల్లి కేమి చెప్పుదును? అనియూరక యున్మత్తునివలెఁ బలుకుచు నాఁడుదానివలె గుండెలు బాదుకొనుచు వచింపఁదొడంగెను. మేమెంత జెప్పినను వినిపించుకొనడయ్యె. కొన్నిదినములు సముద్రముమీద బయనముజేసి మీజాడలు దెలిసికొని మీరు మృతినొందినట్లే ధ్రువపడి నంత నింతంతనరాని వంతతో వచ్చి యెవ్వరుజెప్పినను వినక నింటికిఁ బయన మగుటయు నేనతని భార్యగూడ వెంట నంపితిని. వారి మీ యింటం బ్రవేశ పెట్టి మాపరిజనులు తిరుగావచ్చిరని యావృత్తాంత మంతయు నెఱింగించెను.
ఆవార్తవిని విక్రముఁడు శోకవిహ్వలుఁడై మామా! మాసోదరుని పరిదేవనము వినిన నాగుండె పగిలిపోవుచున్నది. ఇంటికిఁ బోయి యీదుర్వార్త మాతల్లి కెఱింగించిన నామెయెంతచింతించు చున్నదో! వేగబోయి వారియార్తి యుడిగించి ప్రహర్షము గూర్చవలయు సెలవిండు పోయివత్తుమని పలుకుచు నటఁగదలి క్రమ్మఱ విమానమెక్కి, యక్కడి కథ లందున్నవారి కెఱింగించుచు నర్థదివసములోఁ గన్యాకుబ్జమునకు విమానముఁ బోఁజేసెను. అప్పు డందు శుద్ధాంతమున సౌభాగ్యసుందరి బిడ్డలు చుట్టునుం గూర్చుండి యూరడింపుచుండ,
ఉ. హా! సుకుమారులార! సుగుణైక నిధానములార! శత్రు సం
త్రాసకరప్రతాప బలదర్పితులార! కుమారులార! మీ
హాసవిలాసభాసుర ముఖాంబుజము ల్గన నాకు నింక న
య్యో! సమకూరదా సుతవియోగభవార్తి భరింపనెట్లకో.
క. ఇదె వత్తురొ యదెవత్తురొ
కద యని యెదురెదురుఁజూచి కాలముగడపన్
దుద కిట్లు పిడుగుపడిన
ట్ల దరఁగఁ జెడువార్త వినంగనయ్యెం గట్టా!
క. మీయన్నలగతి మీరును
శ్రీయుతులై వచ్చి నేను ప్రియమంద నతుల్
సేయుదురని యెడదం దల
పోయుదు నెల్లపుడు రిత్తవోయె మదాశల్ .
గీ. ఏల పోయితిరయ్య మీరెఱిఁగి యెఱిగి
క్రోధనుని యంత్రశక్తి రాకొమరులార!
అంబుధి నిమగ్నమూర్తులైనప్పు డెంత
యార్తిజెందితిరో బిడ్డలార మీరు.
అక్కటా! పెక్కండ్రు బిడ్డలు పుట్టుటయు రట్టున కే కారణమైనది. ఱెక్కలువచ్చిన పక్షులవలె బిడ్డలు జెప్పియుఁ జెప్పకయు నలుమూలలకుం బోయిరి. తూర్పుదెస కరిగిన వారు మాత్రము కష్టములు దాటి గట్టెక్కి వచ్చిరి. యుత్తరముదెస కరిగిన వారి సౌకర్యవార్త దెలియుచున్నది. కాని యింకను నింటికి రాలేదు. వారిట్లు సముద్రముపాలైరి. కడపటివా రేవురు దండ్రియాజ్ఞ బూనకయే దక్షిణముదిక్కున కరిగిరఁట. ఎవ్వరికై వగతును ఏమి సేయఁగలను? ఆసముద్రము లోతైనదే కాఁబోలు. శ్రీముఖా! నన్నక్కడికిఁ దీసికొని పోవుదువా! సముద్రములో మునింగి నాబిడ్డలం జూచెదగాక, అని యూరక వారలం దలంచి సౌభాగ్యసుందరి దుఃఖించుచున్నది. అట్టి సమయంబున విమాన మామేడమీఁదికి దింపి విక్రమాదులు దిగివచ్చి
గీ॥ జలధిఁబడియు దైవసంకల్పమునఁజేసి
బ్రతికినార మొక్క భంగి మేము
చూడు వీరె నీదు సుతు లుత్తరాశకు
ౙనినవారు వారి సతులు వారు.
వీరు మా భార్యలు దేవకన్యలు. వీడు విద్యాసాగరుని కొమారుఁడు. నీమనుమని జూచికొనుమని పలుకుచు వారినెల్ల దెల్లముగా నెఱింగించి తమ వృత్తాంతము పూసగ్రుచ్చిన ట్లెఱింగించి సౌభాగ్య సుందరిని సంతోషపారావార వీచికల నుయ్యెల లూగించిరి.
క॥ కొడుకుల నక్కునఁజేర్చుచు
గడువడిఁ గోడండ్రఁ దిగిచి కనుగొనుచు నొడల్
బుడుకుచు నామె కొమారుల
నడిగిన మాటలనే మఱియు నడుగుచు వేడ్కన్.
సౌభాగ్యసుందరి దివ్యరూపసంపన్నులగు కోడండ్రను గొడుకులను దనకడనే యుంచికొని వారివారి చరిత్రములం బలుమారు వినుచు గడమకొడుకులు గూడ నింటికి వచ్చినచో నిఁక నా కేవిచారము నుండదని పలుకుచు సంతోషముతోఁ గాలముగడుపుచుండెను.
అని యెఱింగించి మణిసిద్ధుండు. . . ఇట్లు చెప్పు దొడంగెను.
- _________
239 వ మజిలీ.
దక్షిణదిగ్విజయము
పుష్ప కేతుని కథ.
పుష్ప కేతుఁడు మయూరధ్వజుఁడు చిత్రభానుఁడు సౌమ్యుఁడు పింగళుఁడు వీరేవురు దక్షిణదిగ్విజయము సేయఁదలంచి తండ్రియనుమతి బొందకయే రహస్యముగాఁబయలుదేరి యాంధ్రకర్నాటకేరళాది దేశవిశేషములఁ జూచుచుఁ గాంచీపురాదిదివ్యక్షేత్రంబుల సేవింపుచు ద్రవిడదేశంబు జొరపడి యందలివింతలనరసి పాండ్యదేశంబు మీఁదుగా స్త్రీరాజ్యంబుజేరి తద్రాజధానియగు పుష్పపురంబు ప్రవేశించిరి.
ఆనగరము పదియామడ వెడల్పును పదాఱామడ పొడవును గలిగియున్నది. విశాలములైన వీధులచే సౌధములచే నొప్పుచున్నది.