కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/332వ మజిలీ

ఓహో ! నిజము దెలిసికొంటిని. భూమండలశరీరమునకు బ్రాణమనియును, బ్రహ్మాండశుక్తియందలి యాణిముత్తెమనియును, నరలోకన్యంజనమునకు మృగనాభి నాయకమనియును, భూకల్పలతికయందలి రత్నగుచ్చమనియును, జంబూద్వీపపదక మందలి మాణిక్యబంథమనియును, సకలభువనభూపాలచూడామణియనియును నెవ్వరు కీర్థింపబడుచుండిరో యట్టి ప్రతిష్టాననగర పరమేశ్వరునిగా గుంతలావనీనాధునిగా బండరీకరాజదేవేంద్రునిగౌ నిన్నెరింగితిని. నీ యత్యద్భుతచరిత్రము, నీవిక్రమక్రమము నీవిజ్ఞానసంపద, నీ యుదారస్వభావము, నీ యైశ్వర్యవిశేషము, నీ సద్గుణగరిమము నే నెన్నిసారులో ముల్లోకములయందును విని యానందించితిని. అంధకమధనునిచే బరా క్రమమున గొనియాడబడిన మదీయసామర్ద్యము నెదిరింప నీకుదక్క_ నితరులకు శక్య మగునా? త్రైలోక్యవిజయిని యగు నీమండలాగ్రము దనశక్తినుడిగి నీ పాదముల మ్రోల బడియుండుట విచిత్రముగదా! ఈ కృపాణమును నీకు గానుకగా నొసంగు చున్నాడను. ఈ తపస్వినిని విడచిపెట్టుచున్నాను. ఇక నాకు సెలవొసంగుము. పోయి వచ్చెదను. అవసరము గలిగినప్పుడు నన్ను దలంచినంతనే వచ్చి నీయాన నెరవేర్చి పోవుచుందు నని మిన్నకుండెను.

పుండరీకుండును విస్మయకౌతుకావేశ హృదయుడై యిట్లనియె. అసమ సమరాంతమున నొనగూడిన మనమైత్రి శుభదాయకమై చిరము వర్దిల్లుగాక. ఇందు నాకు నిషచరధౌరేయుడగు మిత్రుడలవడినందుల కెంతయును సంతసించుచుంటిని. నీవృత్తాంత మెరుంగుటకు నా మనం బుత్సహించుచున్నది. నీ వెవ్వడవు? రక్కసుండ వైనను నీయందు సద్గుణము లుండుట గ్రహించితిని. ప్రభావసంపన్నంబగు నీమండ లాగ్రము నెందుండి యెట్లు సంగ్రహించుకొనివచ్చితివి. ఉన్నతాశయుండవగు నీవీ తపస్వినిని దయమాలి యేమిటి కట్లేడ్పించితివని ప్రశ్నించు నరేంద్రున కా దాన వేంద్రుం డిట్లనియె.

332 వ మజిలీ

మాయాబలునికథ

దేవా అవధరింపుము ! దక్షిణసముద్రమున కావల కనకమయా శేష వస్తునిస్తులంబై యత్యంత శోభాయమానమగు లంకాపురము గలదని వినియేయుందువు. అచ్చట‌ దశకంఠునిశాసనమునఁ గట్టపడినసమీరణుం డిప్పటికిని బ్రబలదాయకపతాకాగ్ర ములఁ‌ దన వణకు గనుపింప నతిభయంబున నప్పురంబునుఁ బ్రవేశించుచున్నట్లు దోఁచును. రావణునిచే బంధింపబడి యనవరతము విలపించుచున్న త్రిదశవనితల కన్నీటిధారలచే మలినమైనరీతి వినీల మరకతశిలానిర్మాణహర్మ్యముల మాణిక్యకుట్టిమము లొప్పారుచుండెను. ఆ పట్టణమున రాక్షసుల కధీశ్వరుడై పులస్త్యుని పుత్రుండును, నంభోజసంభవ వంశప్రదీపకుండును నగు విభీషణుండు రావణవధానంతరము శ్రీరామునిచే లంకారాజ్య పట్టాభిషిక్తుడై నివసించియండెను. అతని ప్రఖ్యాతి త్రిభువన ములయందును వ్యాపించియున్నదిగదా !


చ. పురుషగుణాకరుండయి ప్రపంచ మహాపరితాపకుండునై
    పరగిన రావణుం డిసురవల్లభుఁడీల్గ విభీషణుండు, భా
    సురశిశిరాశయుండు, పరిశుభ్రసుధాత్మకమూర్తిరాజునై
    ఖరకరుఁ డస్తమింప శశికైవడి లోకహితంబుగూర్చెడిన్.

గీ. సహజదుష్టము నతిభయాస్పదమునైన
   దనుజకులమందుఁ బుట్టుకఁ గనెనుగాని
   యతఁడు విమలాకృతిని సేవ్యుఁడయ్యెఁ బ్రజకు
   ఫణిఫణాగ్రంబునందున్న మణివిధాన.

ఆ విభీషణునకు నేను మాతులసూనుండను. మాయాబలుండను వాడను. వెనుక రావణునిక్రోధమునకుగురియై యతండు వెడలగొట్టబడినప్పుడు నేనాపత్సహా యుండనై వెంటనుండి వానిమన్ననలకు బాత్రుండనైతిని. ఆ విభీషణరాక్షసేశ్వరుం డొకనాడు ప్రణయలోకముతో విలాసగోష్టిం బ్రొద్దుపుచ్చుచున్న సమయమున బ్రతీహారి సత్వరమె వచ్చి దేవా ! కంకాళకుండను రక్కసుం డెక్కడనుండియో యతిజవమున నేతెంచి దేవరదర్శన మతిశీఘ్రమున నభిలషించుచు వాకిట నిలిచియున్నాడు. ముదల యేమని మనవిసేయ నారాక్షసేంద్రుండు వాని నతిశీఘ్రమె ప్రవేశ పెట్టుమని యనుజ్ఞ నొసంగను. అంత బ్రతీహారిదారి జూప గంకాళకుండేతెంచి రాక్షసచక్రవర్తికి గృత ప్రణాముడై యేలినవారికి రహస్యముగా మనవి సేయదగినపని యున్నదని బలుకుట యును దక్కినవారందఱ నవలకుబంపి మద్ద్వితీయుడై యున్న యాదానవేంద్రునితో గంకాళకుండిట్లనియె.

దేవా ! దేవరచే నవనీతలమున నన్ని దిక్కులకు బంపబడిన వార్తాహారులలో నొక్కడనగు నేనుత్తర దిక్కుగాబోయి మహానదిం దాటి పిదప నర్మదనదీతీరమునున్న పెక్కుపట్టణముల దిలకించుచు గ్రమమున భృగుగచ్చమను నగర రాజముజేరితిని. ఆ పట్టణరామణీయకము దిలకించుచు గొన్నాళ్ళందు గడపి పిమ్మట నుత్తర దిక్కు నున్న గ్రామపురపట్టణములంగల విశేషముల బరికించుచు దుదకు గంసారిశైశవదశ కాస్పదంబైన మధురాపురమున కరిగితిని. అందొకచో భ్రాతృయోగవిఘటితుండగు మారుతివలె మనుష్యురూపమందిన యాంజనేయువలె క్షత్రియకులమందవతరించిన యశ్వత్థామవలె, నరలోకమం దుద యించిన కా ర్తవీర్యునివలె నతిబలపరాక్రమసమేతుండగు రాజపుత్రుని గుమారకేసరి యనువానిని ద్యూత క్రీడాపరతంత్రుని నొక్క చోఁగాంచితిని. వానిద్యూతవిద్యా నైపుణ్యమున కక్కజపడుచు నేనచ్చటనే ప్రచ్చన్నముగ నుంటిని. పిమ్మట నారాజ పుత్రుండుకితవమి తులతో బుడమి నెందును వీరుడు లేకుండజేసి యెం దైన నొక ధనికుడగువాని ద్రవ్యమెల్ల నపహరించుకొనివచ్చి ద్యూతమునకై వినియోగించెద నను వాని బీరంపుమాటల నాలికించి వీడెంత కైన దగినవాడు, త్రిభువనముల వీని కసాధ్య మగునదెద్దియు నుండజాలదని తలంచుచు మఱియు నిట్లని యూహించితిని.

ఈ రాజపుత్రుండు ద్యూత క్రీడాభిరుచివలన నతిసాహసముతో గనకము కొరకు మేరువు నుత్పాటింపగలడు. రత్నేచ్చవలన ఫణీంద్రఫణా పటలమును విద ళింపగలడు. అర్థకాముడై కుబేరుని బంధింపగలడు. తొల్లి కపిమా తుడగు నాంజ నేయుడు దశకంఠునిచే బంధింపబడియును లంకాపురంబెల్ల భస్మ మొనరించియుండ లేదా ! భీమసేనుండును నాగలోకమున కేగి కాద్రవేయుల నెల్ల నిర్జించి యమృత కుండమును గైకొనలేదా ? వీడును స్వర్ణార్థియె లంకాపట్టణం బాక్రమింపదలచునేమో చూచెదను. వీని‌ ననుసరించియుండి యేమేమిచేయునో యెందెందు బోవునో తెలిసి కొందునుగాక యని నేను వాని వెన్నంటి తిరుగుచుంటిని.

వాడొక దినమందు దక్షిణదిక్కుగా బోయి యా రాత్రి కొకగ్రామము జేరుకొనెను. అందొక వృద్దకితవునియింట విడిసి‌ వానితో దాను దక్షిణసముద్రమున కావలనున్న యొక యమానుష ప్రచారమగు ప్రదేశమున కరుగుచున్నానని ప్రస్తావవశ మున జెప్పెను. ఆ మాట విని నేను చకితుండనైతిని. నేననుకొన్నట్లేయైనది. ఈ వీరుడు తప్పక లంకాపురమును నిగ్రహించుటకే పోవుచున్నాడు. దక్షిణసముద్రమున కావల రాక్షస‌ నివాసభూమి. లంకకాక యింకేమున్నది ? అమానుష ప్రచారమగు ప్రదేశమదిగాక యింకేది గలదు? వీని వెంటబోయి యింకను బరిశీలించెదగాక యని యదృశ్యరూపమున గ్రమ్మర వాని ననుసరించి పోవుచుంటినివాడతి జవమున దక్షిణా పధము నతిక్రమించుచుండెను.

తుదకు మలయమండలమును బ్రవేశించినతోడనే నాకాసందియము దీరినది. తప్పక లంకాపురమును ముట్టడించుటకే వాడేతెంచుచుండెనని నిశ్చయించుకొని యా వార్త దేవర కెరిగింపనతిజవమున నిందేతెంచితిని తిరుగ బలవంతుడగు పురుషపుంగవుడీ లంకను జయింప నేతెంచుచున్నాడు నాకు దెలిసిన వృత్తాంతమెల్ల నేలికకు నివేదించు కొంటిని. మీది కృత్యమునకు దేవరయే ప్రమాణమని యూరకుండెను. ఆ వృత్తాంత మెల్ల విని రాక్షసేశ్వరుండు శంకాకులస్వాంతుండై చెంత నున్న దనచూపులం బరగించెను‌ వాని యింగితం బెరింగి నేనిట్లంటిని. దేవా! దీనికై మీరింత వలవంత బడ నగత్యములేదు దుర్వార భుజపౌరుషమున బ్రసిద్దికెక్కిన వీరులు బెక్కురు మనయొద్ద గలరు. వారు మేరువునైన ద్రవ్వి తేగలరు. స్వర్లోకము నిముసములో నాక్రమింపగలరు. పాతాళము నతలం బొనర్పగలరు. మరియును మదీయ మాయా ప్రభావమునకు ద్రిభువనముల నెదురెయ్యదియైన గలదా ?


చ. పవలది రాత్రికా, నిశిఁ బవల్గతిఁ జంద్రుఁ డినుండులా గినుం
    డువిధునిమాడ్కి, జీకటిఁగడున్‌ వెలుఁగునట్లు, వెలుంగు నంథకా
    రవిధము, వార్ది నేలవలెఁ బ్రస్థల మంబుధిలీల నిట్లు వ
    స్తువులను మార్చి లోకమున దోడ్తనె విభ్రమ మందఁజేసిదన్‌.

ఇట్టి నేను దేవరయానతివడువున నీ కంకాళకుని సహాయముతో నంతరాళ యానమున బోయి యచ్చోటి కేతెంచువానిని నివారించి వచ్చెదనని విన్నపం బొనర్ప నా విభీషణుండు నీ యిచ్చవచ్చినట్లొనర్పుమని యానతిచ్చెను. తోడనే నేను గంకాళకు నితో లంకమీద కేతెంచనున్న యా మానవుని సమీపమున కరుగ బయలుదేరితిని.

పిమ్మట నచిరకాలముననే మలయమండలమున నొక మహారణ్య మధ్యమున నున్న జీర్ణచండికాలయమును దిలకించితిని. నిలువ దావులేని యీదురంతారణ్యమున దిరుగు నావీరాధ్వగు డొకప్పు డైన నీయాలయమును జేరుకొనక మానడని తలంచుచు నేనందేగితిని. అందు దేవిపటోపసేవకులగు వేదాళురు పలువురు నన్గాంచి యాలింగన కుశలప్రశ్నాదిసత్కా.రము లొనరించిరి. వారితో ముచ్చటించుచు నేనందు గొంత కాలము గడపితిని.

ఇంక జామురాత్రి యున్నదనగా బ్రాంగణమున నున్న కంకాళకుం డదరిపడుచు “అదిగో ! నేను చెప్పిన వీరు డిచ్చటికే వచ్చుచున్నా” డని నాకు జూపించెను.

నేనా యుదారమూర్తిని దిలకించి విస్మయపడుచు “వీనినిగూర్చికంకాళకుడు చెప్పినది యత్యల్పము. స్వరూపంబున భీమాదివీరులు వీనిని నిక్కముగ బోలనేరరు. స్వర్గలోకమందలి వీరులగూడా నతిశయించుచు వీనిరూప మొప్పియుండెను. కావున వీని చేష్ట లెరుగువరకు నీవేతాళవర్గముతో నదృశ్యుండ నై యుండెదంగాక” యని యట్లొనరించితిని. ఇంతలో నా పురుషపుంగవుండు గుడిలోని కేగి దేవికి నమస్క రించి బైట కేతెంచి యందున్న మండపముమీద నుపవిష్టుండయ్యెను. అప్పు డంతరిక్షము నుండి బూర్వపరిచితుండగు కపాలభైరవుండను విద్యా ధర కాపాలికుం డేతెంచెను. వానికి నమస్కరించి యా వీరుడు నిజవృత్తాంతమెల్ల నక్కాపాలికుని ప్రశ్నకుత్తరముగా జెప్పెను. మధురాపురపాలకుండగు కళిందకేతుని తనూజుండు కుమారకేసరి యను నతండు ద్యూతవ్యసనపరాయణుండై లంకాపుర మును జయించి విభీషణుని కోశమందలి ప్రభూతకాంచనరాశులం గొనివచ్చుటకు బోవుచున్నాడనుట విని కంకాళకుడు చెప్పిన వృత్తాంత మెల్ల నిక్కమయ్యెనని వాని పరేంగితజ్ఞానమును మెచ్చుకొనుచు వాని నత్యంతము గౌరవించితిని. అప్పుడా పురు షుని విక్రమాతిరేకమునకు దృప్తుడై యక్కాపాలికుండు విజయోగవిద్యాకృష్ణమగు దివ్యకృపాణ మొకటి వాని కొసంగి‌ యంతర్హితుండయ్యెను. పిమ్మట నా రాజపుత్రుం డును ఖడ్గమును గైకొని యా గుడిలోనికి బోయి యందు నిద్రించెను.

అప్పుడు నేనౌరా ! వీఁడు సంగరరంగమున నిక్కముగ నసాధ్యుండు. మీఁదుమిక్కిలి నిరాయుధుండగు వీనికి దివ్యకృపాణము లభించినది. వీని నుపేక్షించిన నిఁక లంకాపురము మాకుఁ దక్కుట కల్ల. కావున వీనియందు మాయాప్రయోగం బొనరింపవలెను. వీడు ద్యూతవ్యసనుఁడు గదా ! మాయాద్యూతమున వీనిని నిర్జిం చెదంగాక యని నిశ్చయించుకొని యందలి వేతాళవర్గమునెల్ల గితవబృందముగా నేర్చరచి ప్రాంగణమండపమున జూదమాడ నారంభింపఁ జేసితిని. ద్యూతరసోల్లోల కోలాహలము వినినతోడనే తదేకపరతంత్ర చిత్తుఁడగు నారాజకుమారుండు గుడిలోనుండి వచ్చి వారితోఁ గలసి యాఖడ్గమును బణమొడ్డుచు జూదమాడఁ దొడంగెను.

నేనేను గంకాళకుని మాయాశక్తిచే విమానముగఁ జేసి దాని నధిష్టించి విహిత విద్యాధరాకృతిం బూని యంతరిక్షము నుండి యవతరించి వారింజేరి యాపురు షునితో నా మాయావిమానమును బణమొడ్డిజూదమాడితిని. నావిమాన మతండు గెలుచు కొనెను. వాని కృపాణమును నేను గెలుచుకొంటిని. వాంఛితార్థసిద్ధిం గాంచి నేనావేతాళ వర్గముతో నదృశ్యుండ నైతిని. అప్పుడా వీరుండు మనుష్యదుర్గభం బగు విమాన లాభమునకు సంతుష్టుండై లంకాపురమున కేఁగ విమాన రూపముననున్న కంకాళకుని మూఁపుమీఁద నుపవిష్టుండయ్యెను. వాఁడును నా యపదేశానుసరణి గగనమున కెగిరి యొకచో గంభీరవారాళిమధ్యమున వానిని బడద్రోసి నిజరూపము దాల్చి నన్నుఁ గలిసికొనెను.