కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/330వ మజిలీ

యున్నను నాసన్న కుసుమమంజరుల ఝంకారమొనర్చు తుమ్మెదలును పక్వఫలముల మెసపుచు గలకలముసేయు శుకాదిశకుని సంతానములును, సహకారశాఖాగ్రముల నుండి కుహూకారమొనర్చు పికసంతతులును, తమాలషండములనెక్కి కేకారవమొనర్చు మయూరవారములును, దీర్ఘికాపులినముల గోలాహలం బొనర్చు మరాళకులములును దుర్నివారములై యేలినవారి మనమునకు సావధానమును బోఁగొట్టగలవని వచింప నమ్మహీపతి వల్లెయని సత్వరమ లేచెను. తత్కధాశ్రవణ కౌతుకభరమున నడచువాని కైదారడుగులదూరములోనున్న నమ్మణి మండపము గవ్యూతిరతాయితంబై గన్పట్ట నెట్టెట్టులో నాయుర్వీపతి మణిమండపముం జేరి యందు విమలమణి మయాసనమున సుఖోపవిష్టు డయ్యెను.


330 వ మజిలీ

కుమారకేసరికథ

అట్లుపవిష్టుండై వినోదకథ శ్రవణమునకై సావధానమనస్కుడై యున్న యన్నరేంద్రుని యభిప్రాయ మెరిగి వసంతశీలుఁడు తొందరబెట్ట శుకశరీరము విడిచి వచ్చిన యానూతన పురుషు డిట్లని చెప్పదొడంగెను.

దేవా ! అవధరింపుము. భువనంబులబ్రసిద్ధమగు మర్త్యలోకకీర్తివలె వివిధసౌధ సుధాదవళయై, జంబూద్వీప జయశ్రీవిధమున నున్న తాయతనధ్వజవిరాజమానయై, భారతవర్ష సౌభాగ్యములీలమాణిక్యమందిర ప్రశోభితయై, యుత్తరాపథ ప్రవృత్తికరణి ప్రభూతారామ రమణీయయై, భూచక్రమును జుట్టియున్న మహార్ణవముయొక్క రూపాంతరమువిధమున గభీరజలదుర్గమపరిఖావృత పరిసరయై, మిన్నునొరయుటచే జారివడియున్న రవిరధతురగతుండడిండీర పిండములబోలు చంద్ర కాంతకపిశీర్షము లతో వెలయు మరకత శిలానిర్మాణ ప్రాకారయై, సిరులకు నెలవగు ననేకచిత్రశాల కాకరమై, పరిశుద్ధవర్తనులగు పురజనుల కావాసయోగ్యమై, ముల్లోకములకు నగయై పొగడ్త కెక్కిన మధురయను పట్టణశ్రేష్ట మొకటి కలదు.

అం దుపేంద్రవిదళితుం డగు పంసదానవుని యంతఃపురపురంధ్రుల కాటుకకన్నీటిధారలచే నిండిదోన యన నల్లనైన ప్రవాహజలముగలిగి వసుంధరారమణి భ్రూపల్లరివలె, నుదగ్దిశాసీమంతిని మరకతరత్నహారమువలె, కళిందవీరుని కృపాణ పట్టికవలెను, పూర్వార్ణవకుంజరము చరణశృంఖములవలె, నలరారుచు కైటభారాతి భయమున లోన నడగియున్న కాళియభుజంగుని జీర్ణనిర్మోకదళ ఖండములవలెనొప్పు డిండీరశకలములు దీరమునగలిగి విమలజలకేళీరసప్రసక్త‌ గోపీగణాభ్యంతరవిహారి యగు మురారి శరీర సంపర్కమున బవిత్రవంతములగు నుదకములుగలిగి మిగుల బ్రసిద్ధికెక్కిన యమునానది యప్పురి కుత్తరదిశ నాశ్రయించి ప్రవహించుచుండును.

ఆ పట్టణమున కధినాధుండై కళినకేతుండను రాజు గలడు. అతండు హర చరణ సరోజసంసేవాసక్తచిత్తుండై నిజప్రతాపప్రసారము ననరాతిభూపతులకు భయ జ్వరము గల్పించుచు, హరునివలె యశోవిభూతి ధరించుచు, నింద్రునివలె సకలశాస్త్ర ముల సహస్రాక్షముల బరీక్షించుచు, నననరత సేవావినమ్రసామంతమౌళిమణిమండిత చరణ సరోజాతుండై, యనంతపరాక్రమోపేతుండై, యనిర్వచనీయ ప్రతాపుండై, దిగంతవిశ్రాంతకీర్తికలాపుండై మిగుల బ్రసిద్ధికెక్కెను.


చ. అతనియశోమరాళి కకుబంతములన్విహరించుచున్‌ మురా
    హితు నెదురన్‌ సుధాజలధి నీది వియద్గతిఁ బోవఁ దత్పయో
    ప్లుత గరుదుజ్ఘతాచ్చకణముల్‌ గ‌నఁ దారకలయ్యె దానియం
    చితవలయాంగ‌ ధీధితి విశేషము దా శశిబింబ మయ్యెడిన్‌.

ఆ రాజోత్తమునకు విచిత్రగుణశాలురగు పుత్రులు బలువురు పుట్టిరి. వారిలో గడగొట్టువాఁడు కుమారకేసరియను నపత్యహతకుండు. వాఁడు చంద్రాదిరత్నములగా లక్షయాంకురమువలె, గ్రహములలో గేతువువలె, సంవత్సరములయందుక్షయవలె, యుగములలో గలివలె నతిమలినాత్ము డై గడునింద్యచరిత్రుడై యుండెను. ఆ యభాగ్యుడే నేనని యెఱుంగునది - నన్ను పితరులు సన్మార్గమున‌ బెట్ట నెంత ప్రయ త్నించినను, నెన్ని నీతు లుపదేశించినను పూర్వకర్మ దోషమున వాని నెల్ల బెడచెవిం బెట్టి ద్యూత విషయావర్తిత హృదయుండనై మెలంగుచు వారికెంతేని విషాదమును గల్పీంచితిని.

ఇట్లనుక్షణ ప్రవర్థమానద్యూతక్రీడాభిలాషచే గ్రమముగ నిజధనమెల్ల నా దుర్వ్యసనమునందు వెచ్చించితిని. ఒకప్పుడు బంధుజనుల నర్దించియు, నొకప్పుడు శ్రీమంతుల నాశ్రయించియు, నొకప్పుడు జానపదుల బెదరించియు‌ సంపాదించినరొక్క మెల్ల నక్కితవ వృత్తిం బెట్టుచు నెట్టలో కొంతకాలము గడపితిని. ఈ పందెము నందు దప్పక గెలుపుగలుగును. ఇదికాకున్న నింకొక దానియందైన జయము నిక్కమను నాసతో గ్రిందుమీ దెఱుంగక ప్రవర్తించుచు గలధనంబెల్ల నోటి జననీజనకులకును, భ్రాతృవర్గమునకును గూడ సహింపరానివాడనై యొకనా డిట్లు చింతించితిని. ఔరా ! సమానులలో నే నెంత తేలికపడియుంటిని? నే నిట్లెంతకాలము గడుపగలను ? ధన హీను నెవ్వరును గౌరవింపరు. వాంఛితరసోపభోగ సంప్రాప్తికి ధనమేగదా మూలము. ధనసమృద్ధి గలిగినవాని కేమి లేకున్నను లోపముండనేరదు. శ్రీమంతులకు నాయకుం డైన నా తండ్రి ధనాగారమెల్ల నామూలమున శూన్యమైనది. నాయవజ్ఞతకతన నా జనని ముదిభూషణముల గోల్పోయెను. నాపైగల యనురాగము వలన బంధువులెల్ల దమ భాగ్యము నెడబాసిరి. రాజపుత్రుడ నను గౌరవమూలమున జానపదులు దమవిత్తమును బోగొట్టుకొనిరి. సామంతలోక మెల్ల నావలన నిర్భంధింపబడి యపారమగు సిరికి దూర మయ్యెను. ఇంక నే నెచ్చటనుండి ద్రవ్యమును దేగలను ? ద్యూత క్రీడావినోదమహా భాగ్యం బెట్లనుభవింపగలను? ద్రవ్యోపార్జనమునకు నూతనమార్గ మెద్ది గలదు ? మహా ర్ణవమందు వివిధ రత్నజాతులు సంభవించునందురు.

మరియు రోహణాచలము మృణిమృద్ధమని వచింతురు ఛీ ! అగస్త్యునిచే గ్రక్కబడిన సముద్రమందలి రత్నములు నా కెట్లు స్పృశింపనర్హ ములగును? రోహణా చల గర్భమున రత్నముల నిక్షేపించుకొని దానిమీ‌ద గూర్చునియున్న యా గృపణుని ధనము నా కెట్లు పనికివచ్చును ? లేకున్న మదీయభుజబలమున రోహణగేంద్రమును మధింపకుందునా‌ ? ప్రతిపానలమున సముద్రము నింకింపకుందునా ? అభిమతార్థ సిద్ధికి వీరుల కసాధ్య మేమి గలదు ? ఇక ధనసమార్జనమునకు మరొక్కమార్గ మేది గలదు ! బాగు. బాగు. చక్కగా జ్ఞప్తికి వచ్చినది. సకలసువర్ణమణిమయాగార పరి కరములచే నొప్పుచు రాక్షసులకు నివాసమైన లంకాపట్టణమున్నది గదా? దానిని పూర్వము స్త్రీ హృదయుండగు రాముడే సాధించియుండ నశేషభువనైక వీరుండనగు నేను మాత్రమిప్పుడు జయింపజాలనా ? కావున నేనడకేగి యా పురమును హఠాత్తుగా నాక్రమించి యందున్న సువర్ణశిలాసంభారంబెల్ల సంగ్రహించి కుబేరుని నాటినుండి యును సంపాదింపబడి ధనాగారమున దాచియుంచిన విభీషణుని ధనమెల్ల గొల్లకొని దానిని నాకు వంగి నమస్కరించు రాక్షసులమూపులం బెట్టి యిందు దెప్పించెదగాక. అప్పుడుగాని ద్యూతవ్యసనమందు నామనమున కానందము గలుగనేరదని నిశ్చయించు కొని దిగంయాత్రోచిత సమయం బపేక్షింపక ముందువెనుక లరయక ద్యూతకార్యా వస్థిత హృదయుండనై వలయు పరికరముల స్వీకరించి నాటి మధ్యాహ్నము గడచిన పిమ్మట నితరు లెవ్వరికిని దెలియకుండ నేకాకినై యిల్లు వెడలిపోతిని.

అట్లు గృహప్రతోళీద్వారమున నిర్గమించి యిట్లని తలంచితిని జౌరా ! నే నిట్లు ప్రయాణపరికరములతో బోవుట యెవడయిన జూచెనేని నా జననీ జనకుల తోడను‌ బంధుజనులతోడను జెప్పకమానడు. దేశాంతర మరుగుచుండుట దెలిసిన తోడనే వారు నా కడ్డుగాక మానరు. లేకున్న నా వెనువెంట నెవ్వరినైన సహాయము బంపకుండలేరు. దాన నా కనేకములగు నంతరాయములు గలుగఁ గలవు. కావున నొరు లెవ్వరికంట బడకుండ జనపదమునకు జేరువదారిని బరిత్యజించి పోయెదం గాక యని నిశ్చయించి యతిత్వరితగమనమున బురపరిసరం బతిక్రమించి దక్షిణదిశ కేగు మార్గమునంబడి నడచుచు సూర్యాస్తమయ సమయమునకు యోజనశక్తిక యను గ్రామమును జేరుకొంటిని.

ఆ పురము జేరినతోడనే యెదుర గనంబడిన యూరచెరువునందు సామంతన సంధ్యా విధుల నిర్వర్తించుకొని యప్పటికే చిమ్మచీకటిచే నావృతమైయున్న యా గ్రామములోని కరిగి యితరులెవ్వరు జూడకుండ నాకు బూర్వపరిచితుండగు పిప్పల కుండను వృద్ధ ద్యూతకారుని గృహమును దెలిసికొని యందు బ్రవేశించితిని. అతం డును నభాగ్యతుండనని, రాజపుత్రుండనని, ద్యూతమిత్రుండనని, నా యందత్యం తాదరము జూపుచు యధోచితస్వాగత ప్రశ్నాసనాది సత్కారముల నా కెంతేని సంతస మును గూర్చెను. పిమ్మట భోజనముచేసి శయ్యాగతుండ నైయున్న నా సన్నిధి నాసీనుడై యతండతి వాత్సల్యముతో కుమారా ! దూరదేశ యాత్రకు బోవ దలంచి నట్లు కనంబడుచుంటివి ? ఎచ్చటి కరిగెదవు ? ఏమి పనిమీద బోవుచుంటివి ? పరు లెవ్వ‌రికిని దెలియగూడదని ప్రయోజనమందేమి గలదు ? తోడులేక పోవనేమిటికని ప్రశ్నించెను. “సత్య మెరింగించిన నా ప్రవాసమున కంగీకరింపక యితండు నా జన కున కీ రహస్యము దెలియ బంపి నా పయనమున కంతరాయము గల్పింపగలడు. అట్లుగాకున్న వృద్దుడైనను నా యందలి ప్రేమచే వెంటబడును. వీనిని నమ్మరాదు. యదార్దమును గోప్యముజేసి వచించి వీనిని వంచించెదగాక” యని దలంచి వానికి నే నిట్లంటి :-

పిప్పలకా ! వినుము. ఇచ్చటకు దక్షిణముగా సముద్రము గలదు. దానిని దాటిన నమానుషప్రచారమైన ప్రదేశ మొండు గన్పించును. అందు దేవతలకైన నసాధ్యమగుభాగ్యము గలదు. దానిని నేను సాధించి తెచ్చుటకు బోవుచుంటిన‌ని ప్రత్యుత్తరం బొసంగితిని.

అతి ప్రసిద్దద్యూతరసికుండనని నన్నెరింగిన యతండు జూదమునకై యెవనినో నిర్భంధించి ధనము దెచ్చుట కెచ్చటికో పోవుచుంటినని తలంచి దృఢ ప్రతిజ్ఞుండగు రాజపుత్రుని ప్రతికూలవచనంబున నొప్పింపనేమిటికని యూరకుండెను. పిమ్మట ద్వారప్రదేశమున కరిగి సేవకునిభాతి నాయుధముబూని యా రాత్రియెల్ల మేల్కాంచి యా వృద్ధుండుండెను. నేనును దూరము నడచివచ్చిన శ్రమచే గాడముగా నిద్రబోతిని. రాత్రి మూడు యాయములు దాటినపిమ్మట నాకొక స్వప్నమైనది. ఒకా నొక కాననమున వనలక్ష్మివలె నతిసుందరాకారమున నొప్పు స్త్రీ రత్నము మబ్బులో జిక్కుకొనియున్న కంఠీరవము నుద్దేశించి యిట్లనినట్లు వినంబడెను.


గీ. విక్రమంబునఁ గరిబృందవిదళవైక
    మల్లుఁడ వతిబలుండవు మహి మృగేంద్ర !
    కాని‌ యిపుడు పయోభృతిఁ గడిమి‌ సెడితి
    వకట ! విధిముందుఁ బౌరుష మడగదొక్కొ .

ఇట్లు విని స్వప్న సంభ్రమంబున వెంటనే మేల్కాంచి యిట్లని తలంచి తిని. ఆహా ! ఇది కల. ఈ విధమున నా యన్వయదేవత దైవబలము లేకున్న నేపని యును సాధింపబడదని సింహశిక్షాకైతవమున నాకుపదేశమొనర్చి యుండవచ్చును. పయోభృత్పళంసవలన నేను దాటవ‌లసిన సముద్రము స్ఫురించుచున్నదిగదా ! కాని కలలెల్ల గల్లలు. అట్టివానిం బురస్కరించుకొని బడలుపడుట కాపురుషలక్షణము. కావున వివేకము గలిగి నాపూన్కె నెఱవేర్చుకొనెదను. ఇప్పుడే నేనిందుండి బయలు దేరి పోయెదంగాక ! విధి బలీయమని చెప్పుట యీనాటి మాటకాదు. దాని నెవ్వరును విశ్వసింపదగదు. నేనొక్కడనై నను నన్నెదుర్కొను బగతుర బిల్కుమార్చియైన ముందేఁగఁగలనని దర్పోద్రేకంబున లేచి పిప్పలకా ! నీవుండుము. నేబోయి వచ్చెదనని వానిని వీడ్కొల్పి యటనుండి గదలి యమందగమనమున నా గ్రామము విడచి పోయితిని.

దుర్వ్యసనపరాయణుం డెట్టివాడైనను నపహాస్యమునకు లోనగును గదా ! అట్లు బోవుచు నే నేనగర మేగినను, నే గ్రామము ప్రవేశించినను, నెవనియింటిలోన కరిగినను నచ్చట వీడు జూచిరి. మన యిండ్లలో నేమైన దొరికినది దోచుకొని పోగల డని జాగరూకతతో నే నావలి కేగువరకు కనిపెట్టుకొని యుండెడివారు. ఒకొక్క యూరద్యూత విద్యానిపుణులు నన్నాదరించి యక్షక్రీడాసక్తుం జేయుచుందురు. ఆ యానందమున నా పయనముమాటయే మరపువచ్చుచుండెడిది. అప్పుడప్పుడు జూదమువలన గలిగిన గెలుపుసొమ్ము పూర్తిగ నోడువరకు నా వ్యసనమునంబడి మైమరచి యుండెడివాడను. చేత గాసైనలేనప్పు డింకెట్లు ద్యూతక్రీడకు గడగువాడనని చింతిల్లుచుందురు. ఒకప్పుడు వివేకముగల్గి నా మూఢత్వమునకు నేనే నవ్వుకొను చుందును. ఇట్టి ప్రవృత్తితో ననేకదినములు గడపుచు బయనము సాగించుచుండ నుత్తరదక్షిణావనీభాగములు గలహించి యొండొంటి డీకొన నారెంటి నడుమ దగవు దీర్ప నడ్డుగాజూపిన సముద్రుని భుజదండమువలె నొప్పుచు గాలిచేఁగదలు వీచికాశిఖర శీకరప్రకరములతో వరుణకుంజర మదావస్థయన జెలగుచు దీరముల నిర్మింపబడిన తావసానేకకుటీరములను ధర్మ పురమువలె నలరారుచు, నిర్వాణనగర వీధివలె జెలువైన రేవాపరాభిధానముగల నర్మదానదీతీరమును జేరుకొంటిని.


మ. ఘనరేవాభిదనొప్పుదాని విశదాఖర్వప్రవాహద్యుతిన్‌
     గన సాక్షాద్దివినుండి వచ్చిన వియద్గంగాసరిద్రీతి నొ
     ప్పెను వాతోచ్చలితాంబుబిందుతతి తద్విఖ్యాతతీరాళ్మవీ
     ధిని జిందన్‌ గనుపించెఁ దారకలు బ్రోదిన్‌ జేరియున్నట్లొగిన్‌.

పిమ్మట నే నా మహానదికి నమస్కరించి దానిం దాటి దిక్షిణా పథమునం బ్రవేశించితిని. అందుండి తిన్నగా సముద్రమధ్యమందున్న లంకాపురమునకేగ నత్యు త్సాహంబున బయలుదేరితిని. ఇట్లు క్రమంబున భిల్లపల్లియల నతిక్రమించి, గ్రామ ముల విడచి నగరముల బరిత్యజించి, వనంబుల దరించి, పర్వతంబులదాటి చివుర కత్యంత భీకరంబగు నొక మహారణ్యమధ్యంబున జిక్కు కొంటిని. ఇంతలో సూర్యుం డస్త గతు డయ్యెను. క్రమంబున గాఢతమంబు దిశల నాక్రమించి నేత్రములున్న ఫలంబు బోగొట్టెను. అప్పుడిట్లని చింతించితిని. అయ్యో ! ఇమ్మహారణ్యమున నిర పాయమున నెచ్చోటనుండి యీ రాత్రి గడపగలను. ఏ చెట్టుతొర్రలో విశ్రమించి యుందును ? ఏ కొండ గుహలలో దలదాచుకొందును ? ఏ నికుంజపుంజంబున నడగి యుందును ? ఇంతకన్న నివసింప ననువగుతావు ముందెద్దియైన దొరకునేమోయని విత్కరించుచు నంధకారబంధురమ్మగు నమ్మహారణ్యమున నతిభయమున బరిభ్రమించు చుంటిని.

ఇంతలో దూరమున నాకటికిచీకటిలో మురారి వక్షస్థలకౌస్తుభమువలె బ్రకాశించుచు దీపభ్రాంతిగొల్పు నెలుగొకటి ముందు గనుపించెను. దానింజూచి సంశ యాకులిత చేతస్కుడనై ఔరా ! ఆ వెలు గేమైయుండును ? ఏదైన దీపకాంతియా ? లేక రవులుచున్న దావాగ్నిశిఖయా ? కాకున్న నేదైన దివ్యౌషధీవిశేషమా ? ఏదైన నగుగాక. దీని ననుసరించిపోయి నిజమెరింగెదనని నిశ్చయించుకొని యావైపు బోవ ముందు నాకొక జీర్ణదేవతాయతనము గోచరమయ్యెను. దానిముం దొక మండపము గలదు. అప్పుడు నే నతిహర్షంబున దానిని సమీపించిచూడ దుర్గాదేవిమ్రోల యిటుక లూడిన గోడయందు జిరకాలము క్రిందట జచ్చి శల్యావశిష్టమైయున్న పన్నగశిరమున వెలుగు దివ్యరత్నము గాన్పించెను. అప్పుడు నేను విస్మయమందుచు నౌరా ! ఈ చండికాయతన మంతయు శూన్యముగా నున్నదేమి? బాగు బాగు. ఈ భుజగమణియే దీపభ్రాంతి గొల్పి నన్నిందు జేర్చెను. ఇందు నేను కరచరణముఖంబులం గడిగికొని యాచమనం బొనర్చి శుచినై యీయమ్మవారికి నమస్కరించెదంగాక యని యిటునటు బరికింప ముం దొక యల్పవిరసాంబువులతో బాడుపడియున్న పుష్కరిణి గనుపింప నందు విధ్యుక్తధర్మంబుల నిర్వర్తించి సత్వరమ యా దుర్గాదేవి సన్నిధికరిగి “జయ జయ త్రిభువన జనాప్యాయినీ కాత్యాయనీ” యని భక్తిప్రయుక్తవచనంబుల నిట్లని స్తుతించితిని.


శ్లో. స్వామిన్యార్యే భుజంగాభరణవలయిని స్థూలశూలాస్త్రదండే
    చాముండే చండి చంచన్ని భిడనరశిరఃస్రక్పరీతాంగి దుర్గే
    దేవి స్వర్నాధచూనామణికిరణకణ శ్రేణిధౌతాగ్రపాద
    ద్వంద్వే పంద్యేభినంద్యే జనని జయజయ శ్రీమహాకాళిదివ్వే.

ఇట్లు స్తుతించి యా యమ్మవారికి సాష్టాంగ నమస్కారం బొనరించి లేచి యన్యపధికజననోసిలబ్ది నపేక్షించుచు బహిర్మండపమున కేగితిని. అందుగూడ నెవ్వ రును లేరు. లోనఁ బ్రతిష్టింపబడియున్న క్షేత్రపాలక విగ్రహముంగాంచి యిట్లని స్తుతించిరి.


శ్లో. ధృత్యావేశ ప్రసక్తైర్జ్వలదనలను ఖోమ్మక్త ఫేత్కార ఘోరైః
    ములై రుత్తాంతాళ వ్యతికరముఖరీభూతభూషాస్థిమాలైః


    క్రీడంతం ప్రేతరంకైః కుణపభువిహాజంగలగ్రాసలోభ
    భ్రామ్యద్బల్లూకఘూకప్రకరపరిగతం క్షేత్రపాలం నమామి.

పిమ్మట నమ్మండపమున నించుక విశ్రమించి విస్మయమున గనులు మూసికొని యిట్లు ధ్యానించితిని. ఔరా ! విధివిధాన మతి విచిత్రమైనదిగదా? అతి భయంకర మహారణ్యమధ్యమందు జిక్కి. జీవితాశ వదలుకొనిన నాకు రత్నజ్యోతిం జూపి యిందు జేర్చెను. కాకున్న నిట్టి గేఢాంధకారమున నియాయతన మేరీతి గోచర మగునని తలంచుచు గనులు దెరచి చూచినంత మణికింకిణీరణత్కారముతో నంబరము నుండి దిగుచున్నవాడును, కటికిచీకటిలోగూడ దన్నావరించియున్న నిజతనూద్యుతిచే విస్పష్టముగ గనపడువాడును, చరణసూపురధ్వని విని వెన్నంటివచ్చు గగనగంగా మరాళ బాలకశ్రేణివలె ధవళనరకరోటిమాలిక నుత్తరీయముగా ధరించు వాడును, భస్మావలేపనమున పితాచ్చధూళిధూసరితమగు మోక్షమార్గమున జరించు బాటసారివలె నొప్పువాడును, నస్థి మణిభూషణభూషితుండై గగననగరమునం గల తారకధనమెల్ల నపహరించుకొని వచ్చు దొంగవలె నెన్నదగినవాడును, వామకరమున శుక్లకపాలశుక్తికం దాల్చి శశిబింబార్థమును సంపూర్ణముగ జేయ దానిని జేత బట్టికొనిన విధాతవలె నొప్పువాడును, పూదండవలె నల్పాస్థికర్ప రకములచే జుట్టబడిన జటాకలాపము దాల్చినవాడును నగు కాపాలికుం డొకండు నాకు గనంబడెను.

అట్లు పుడమికి దిగి యాకాపాలికుండు తొలుత నతిభక్తి నా దేవి కభి వందనం బొనర్చి పిమ్మట నన్గాంచి విస్మితుండై నా సమక్షమున కేతెంచెను. నేనును లేచి వానికి నమస్కరింప బ్రీతుడై మదఁతికమున గూర్చుండి వత్సా ! దురతి క్రమా పాయబహుళంబగు నీ మహారణ్యమధ్యమున నెటు జిక్కుకొంటిని? ఎచ్చటినుండి వచ్చి తివి? నీ కిందేమి నిమిత్తము గలదని సంభ్రమమున బ్రశ్నించు వాని సన్నిధిని నిజము మరుగుపరుపజాలక యధార్థ మెల్ల జెప్పి నా పూన్కెకు దగు సహాయము జేయుమని ప్రార్దించితిని. నా వృత్తాంతము సాంతముగ విని యామునిముఖ్యుండు శిరఃకంపం బొనరించచు నిమేషమాత్ర మేకాగ్రచిత్తుడై నావంక దిలకించి తోడనే పర్యంక బంధమున సుస్థిరుడై యాకసమువంక జూపు నిగుడించెను. తోడనే తళతళ మెఱయు గౌక్షేయకమెచ్చటనుండియో వచ్చి వాని మ్రోలబడెను. దానిం గైకొని యతడు మందహాస మొనరించుచు వత్సా ! ఈ కృపాణమును గైకొనుము. నీపూన్కె కిది సన్నిధినుండిన నెంత పనినైన సాధింపగలవు. ఇయ్యది దివ్యప్రభావము గలది. దీనిం జేపట్టి యున్నవానిని దేవదానవులైన నిర్జింపజాలరు. దీనివలన నీయభీప్సిత మీడేరగలదు. కావున నతిజాగరూకుడవై కాపాడుకొనుచుండుమని చెప్పి నన్నాశీర్వ దించి యాకత్తినిచ్చి యాకాపాలికుండు వియద్గమనమున నెచ్చటికో పోయెను.

తత్కృపాణలాభమునకు మనమున నత్యంతసంతోషమును బొందుచు నప్పటికే రాత్రి చాలగతించుటచే నించుక విశ్రమింపనెంచి యాదేవీభవనములోనికిం బోయి యందొకచో శయనించి గాఢముగా నిద్రబోతిని. ఇంతలో వెలుపల నెద్దియో సందడి యగుటచే మెలుకువ వచ్చినది బహిర్మండపమున, జాలమంది జూదరులు ద్యూతక్రీడాభిరతిం దవినియున్నట్లు వారిమాటలవలన నాకు దెల్లమయ్యెను. ద్యూత ప్రసంగము చెవులబడిన యనంతరము నాకన్నులకు కునుకురాలేదు. ఆయాట జూడ వలయునను నుత్సాహము నెమ్మనమును వేధింప, నతిరయమున నందుండి లేచి కృపాణము చేత బూని వారి సమీపమునకు బోయి యాసమాజమందు జేరి యమందా నందమున జూదముడ దొడంగితిని. అక్షవిద్యారహస్య సంవేదినైన నేనే యం దున్న వారికెల్ల బై చేయినై యన్నిపందెములు గెలుచుకుంటిని. గాకందుగలపాండిత్య మెల్లరును బ్రస్తుతింపసాగిరి. వారు కొనివచ్చిస దివ్యమణిసందోహ మెల్ల నాకశ్రమమున‌ వశ మయ్యెను. తిరుగ బందె మొడ్డుటకు వానియొద్ద నిం కేమియును లేనందున విభ్రాంతులై చూచుచుండ మింటనుండి విమానముమీద నోకపురుషుం డం దేతెంచెను. వానిని నేను దివ్యపురుషుండని భావించితిని. మా యుదంత మెల్ల నతండు విని మందస్మితమున నాతో నిట్లనియె.

పుణ్యపురుషా ! నీయక్షక్రీడాపాండిత్య మపారమైనది. ఇట్టి నీతో విలాస ముగా నాడుటకు నామనంబుంతేని యుత్సుకతం బొందుచున్నది. కాని పణ మొడ్డుటకు నాయొద్ద నీ విమానముకన్న నొండెద్దియును లేదు. కావున దీని నే నొడ్డుచున్నాను. పందెము వేయమని నన్ను బురికొల్పెను‌. నే నంతకు గెలుపొందిన రత్నముల గొన్నిటి నొడ్డి పందెము వైచితిని. కాని నేనే యోడితిని ఇంకొక పందెము వైచితిని. అదియును గూడ వెనుకటి దానివలనే యైనది. నే నార్జించిన మాణిక్యరాశి నెల్ల నతండు గెలుచు కొనెను. అన్ని పందెములు నేనె యోడుచుండుట నా కెంతేని యబ్బురముగా దోచెను. ఇక బణ మొడ్డుట కేమియును జేతలేనందున నేను విభ్రమమున నుండ నతండు మంద స్మితమున సోదరా ! ఊరుకుంటి వేమి ? ఇదియే కపటిమాట. నీ యొద్ద కృపాణ మున్నదికదా ! నీవు దాని నొడ్డుము. దానికి బ్రతిగ నా విమానము నే నొడ్డెదను. ఇది దివ్యయానము గలదని‌ యెరుంగుము. నీ కృపాణమున కిది తీసిపోదని పలుక నే నందులకు సమ్మతించితిని. తృటిలో నాదివ్యయానము నావశమయ్యెను. అంతటితో దృప్తిపడక నే నా కృపాణమునే యొడ్డి యింకొక పందెమువైచి యోడిపోతిని. ఆ చంద్ర హాసము నా పురుషుండు గైకొని యిక నాట చాలు నని చెప్పి మాయమయ్యెను అందున్నవారెల్ల నిముసములో నేమైరో గ్రహింపకుండ బోయిరి. నేను గెలుపొందిన విమానముమాత్రము నా సమీపమందుండెను. దానికి నేను విస్మయ మందుచు నిట్లని తలంచితిని. ఔరా ! ఇదేమి చిత్రము ! ఇంతలో వీరంద ఱేమైరి ! అయ్యో! నాయం దత్యంతవాత్సల్యమున నమ్మహానుభావుండొసంగిన దివ్య కృపాణమును నిముసములో బోగొట్టుకొంటిని ! దానిసహాయమున నే నెన్నియో యద్భుతకార్యముల సేయనెంచితిని. అన్నియును వ్యర్థములైనవి. నాదుర్వ్యుసనలోపత్వమే నన్నింతకు దెచ్చెను. బుద్ధి వచ్చి నది ఆ కత్తి యున్నవానిని దేవదానవులుగూడ జయింప జాలదని యమ్మహాత్ముండు మొదటనే చేప్పియుండెను. కావుననే దానిని నా సన్నిధినుండి యపహరించుటకు వీరె వ్వరో యిట్టి పన్నుగడ వేసియుందురు. వీరి మాయల నే గ్రహింపజాలక చేతి కబ్చిన లిబ్బిని చేతులారా జారవిడిచితిని. పోనిమ్ము నే నప్పుడు పూర్వము వలెనే యుంటిని. ఆ కాపాలికుండు నాకాఖడ్గము నొనంగలేదని యనుకొనెదంగాక ! అట్లనుకొననేల ? దానికి మారుగ నాకీ విమానము లభింపలేదా ? ఇది కీడులో మేలు. దీనికంతరిక్షగమన మున్నదిగదా? నేనిం దధిష్టించి లంకా పట్టణమునకు దృటిలో బోవచ్చును. నా పయన మునకు బరమేశ్వరుండు దీని నాధారముగ నొసంగె గావలయును. నా పూన్కె నెర వేర్చుకొనుట కా ఖడ్గ ప్రవరముగూడ నున్న నెంత బాగుండును ? నా భుజబల పరాక్ర మములకు దోడుగ నీవిమానముతో నాఖడ్గముగూడ నున్న ముల్లోకముల జయించి యపర దివస్పతినై చెలంగకుందునా ? కలిగిన దానితో సంతృప్తి నందుట ధీర లక్షణమందురు. ఆ కృపాణము లేకున్నను మద్భుజబలము మాత్రముననే లోకమంతయును సాధింప గలను. భుజబల సంపన్నునకు సాధింపరాని దెద్దికలదు ? ఈ విమానమెక్కి నే నిప్పు డేల లంకకు బోవరాదు ? దివ్యశక్తిగల విమానయానము దన్నధిష్టించి యున్నవాని యిచ్చ వచ్చినచోటికి బోవునని చెప్పుదురుగదా ! కావున దీని నధిష్టించి నే నిప్పుడే లంకాపురమునకు బయన మగుట యుక్తమని నిశ్చయించి యాక్షేత్రపాలునకు దుర్గా మహాదేవికిని భక్తి ప్రణామము లాచరించి యతి సాహసమున నవ్విమాన మధిష్టించి లంకాపురమున కేగవలెనని తలంచుకొంటిని.

మహారాజపుంగవా ! వినుము. నే నవ్విమాన మెక్కిన తోడనే యది యతి జవమున బైకిలేచి హరగళగరళమలీ మసంబగు నంతరిక్ష శిఖరమున కేగి యందుండి ముందున కరుగ దొడంగినది. అట్లతి వేగమున బోవుచుండ దాని స్వచ్చపతాక కాంతి కలాపము గాలిచే గొనిరాబడిన గగనగంగాడిండీరపటలమువలె విలసిల్లెను. తిమిరము నడంప గొనిపోబడు ప్రదీపతంత్రమువలె నవ్విమానమున సమర్చబడిన యనంత రత్నద్యుతులు జెలగెను. తదీయ కింకిణీరణత్కార నిస్వనము వేగమున సమీర వీరు జయించి యొనరించు విజయ కోలాహలము గతినతిశయించెను మరియు నయ్యది నతి వేగమున గదలు పతాకముల పటపటాత్కారముతో గనకదండముల నభస్తలమును విచారించుచు, జలధరముల నతిక్రమించుచు, తారలక గదలించుచు, నతిజవమున నట్ల రుగుచుండ నప్పటి చీకటి యడంగి వెలుగు వచ్చియుండెను. అందు నే నన్యునిచే నడ పింపబడు నంధుని విధమున నే దిక్కునకు బోవుచుంటినో, దేని నతిక్రమించితినో, ముం దెచ్చటి కేగుచుంటినో, యందలి భూము లెట్టివో, గిరసరత్కాంతారపరిగతం బగు నమ్మార్గం బెట్టిదో, యందలి జనపదము లెట్టి ప్రచారము గలవియో యించుక యును దెలిసికొనజాలకుంటిని. కాని మాటిమాటికి జల్లని పిల్లవాయువులు నమ్మేన సోకుచుండ నా విమానయానమున గమలసుఖమును మాత్ర మనుభవించుచుంటిని.

రాజేంద్రా ! ఏమి చెప్పుదును ! అట్లు పోవుచుండగా నొక్కచో నావిమా నము దివ్య ప్రభావమెల్ల భగ్న మైనట్లు, సంచారయంత్రము చెడిపోయినట్లు ముందేగ సమర్థత లేనట్లు, యెవనిచేతనో నిరోధింపబడినట్లు కదలకుండ నాగిపోయినది. అందు లకు నే నతి విస్మయా హృదయుడనై నే యడ్డంకియు లేని యానభోమార్గమున నతి జవమున నేగుచున్న విమాన మెందులకు నిలిచిపోయినదో నే నెంత యాలోచించినను నిజస్థితి నించుకయును దెలిసికొని జాలనైతిని. దాని యడుగు భాగమున నమరింప బడియన్న విమలమణిదళమునుండి గనుపించు దురంత విస్తారమగు పయోరాశి మాత్రము గోచరమయ్యెను. దానిం గాంచి నే నక్కజంపడుచు నింత నీరున్న ప్రదేశ మెద్ది ? ఇదే దేనియొక మహాహ్రదమా ? లేక మింటి కెగయ తరంగములతొ నొప్పు సరోవరమా ? కాకున్న లంకాపురమును జుట్టుకొనియున్న దక్షిణాంబోనిధియై యుండునా ? అని యిట్లతి డోలాయమాన మానసుడనై వితర్కించుచుండ దోడనే కింకిణీనినాదమున గలకల ముదయింప నా విమానము గంపింప దొడంగెను. ఆ కద లికకు నేనందు గూర్చుండజాలక యత్యంతభయమున దానినుండి నూఁతఁ జేసికొన బోవుచుండగా నాతో నవ్విమాన మాయంభోధి మధ్యంబున బడిపోయెను.

ఆ యగాధ జలగర్భమున మునిగిన తోడనే నాకు చైతన్యము తప్పినది. తిరుగ నాకెట్లు తెలివివచ్చినదో నే నెరుంగను. అప్పుడు నాకు విమానముగాని సాగ రముగాని గనుపింపలేదు. కాని విమలవిద్రుమ శిలా నిర్మాణమగు నొక ప్రాకారమణి మయ ద్వారము నా యెదుట గనుపించెను. దానిం దిలకించి విస్మయమందుచు నేనిట్లు దలంచితిని.

ఔరా ! నన్నిందు జేర్చిన యా విమానయానమేది? నేను మునిగిన యా సముద్ర మేమైనది? నే నందు మునుగలేదా ? పారావాల నిమగ్నములైన నా యంగ ముల నట్టి చిహ్నము లేమియును గనంబడవేమి ? నేను మఱొకడను గానుగదా ? బహుతరంగతాడిత సర్వాంగుడ నగు నాకిట్టి విధమున గనుపించుచున్నదేమో ! ఇయ్యది సముద్రగర్భమం దెద్దియో గొప్ప యింద్రజాలముగా దోచుచున్నది. తిమి తిమింగిలాది జలజంతువుల గర్భమం దెచ్చటనైన నే నప్పు డుండలేదుగదా ? వెనుక యోజనశక్తి కా గ్రామమున బిప్పలకునియింట గలలో గాంచిన స్త్రీ సింహశిక్షాకైత వమున బౌరుషముకన్న విధి బలీయమని పల్కినమాట లన్నియును యధార్థములైనవి. సముద్రమందు మరణించి నేనిప్పుడు పరలోకమున కేతెంచి యుండుట నిక్కము. ఈ ప్రాకారాంత మందున్నది యమ మందిరము గానవచ్చును. నేను నరలోకమున బడి తినా ? కాదు కాదు. నేనెంత నికృష్టుండనై నను నత్యదశయందు దివ్య‌పురుష సంద ర్శనం బొనరించి దివ్యయానాధిష్టితుండ నగుటచే నాకుత్తమలోక సంప్రాప్తికలుగవలెను. కావున నిది స్వర్గద్వారము. నరక స్వర్గంబుల నేదియైన నింత శూన్యముగ‌ నుండునా? అయ్యో ! నేనిప్పుడేదియు నిశ్చయింప జాలకున్నాను. ఏమైన గానిమ్ము. నాకిట నీ యవాంతర వితర్కమేల? ఈ ప్రాకారాంతరమున కేగెదగాక. పిమ్మట నేమి జరుగ నున్నది ? యది జరుగగలదని తలంచుచు జంద్రకాంత మాణిక్యఘటిత కవాటముచే నతి సుందరమైన యా ప్రాకారద్వారమున లోన బ్రవేశించితిని.

అందు దట్టమగు మణిధూళిచే నరుణ కాంతులీను మార్గమునబడి కొంతదూర మరుగ ముందుగాలిచే గదలు నాకు జొంపములలోని కల్ఫతరు మంజరులవలె నెలరారు గుత్తులతో నలరారుచు, గనులకు మిరుమిట్లు గొలుపు జలువఱేని పడగలవలె రతనంపు గాంతుల దుర్నిరీక్ష్యమగుచు, మిసిమిమించు బంగరు కొండవలె జెలువొప్పు గొప్ప వెలుగు గుప్పతో నొప్పుచు, నత్యంత ప్రభావముచే బ్రజ్వరిల్లు చున్న నొక్క ప్రదే శము గనుంపించెను.

ఆ ప్రదేశము జూచినతోడనే నా మదికి మిగుల దిగులు గలిగెను. రెండు మూడడుగుల వెనుకకు వైచి యిట్లు విచారించితిని అయ్యో ! నేనిందు బడబాగ్నిలో బడిపోవుచుంటినా ? మహార్ణవగర్భమున నింక దేని కిట్టి చండతేజం బుండగలదు ? అంతులేని కాంతుల కిది విధానముగావలయు. ఓహో 1 తెలిసెఁ దెలిసె. ఈ మహా తేజమువలన శోషింప బడుటచేతనే యిందు నీరించుకయునుం లేకుండెను. ఇచ్చట గల్గు శీతలప్రకారమే నా యూహను ధృవపరచుచున్నది అట్లు గాకున్న నింకేమై యుండును? కానిమ్ము. ఏదైన నేమి? సాహసమున ముందేగెదను నాయనుమానమే తిరమైన నిందు మడిసెదను. లేకున్న నపూర్వ వస్తు సందర్శనమున గన్నుల కలిమి సార్థకము జేసికొందును. ఈ విశేషమేమో చూచెదనుగాక అని నిశ్చయించుకొని ముందున కేగితిని.

అట్లు సంశయాకులిత చేతస్కు.౦డనై ముం దేగుచుండ ననతిదూరమందే యా తేజో రాశినడుమ నత్యంత దేదీప్యమానం బగు దేవతాయతనం బొండు గనుల పండు వొనరించెను. దాని సమీపమున జక్కని పూదోట కలదు. అప్పుడు మది కుదుట పరచుకొని నేనెనత్యంతరయమున నా గుడిలో బ్రవేశించి యందు బ్రతిష్టింప బడియున్న పురాణదంపతుల నుమామహేశ్వరుల గనుగొంటిని. తోడనే నిటలతట

ఘటిత కరపుటుండనై యభీష్టసిద్ధి కప్పరమేశ్వరు నిట్లని స్తుతించితిని.


ఉ. మిక్కిలికన్నుబొట్టువలె మేన నలందిన బూదె గందపున్‌
     జక్కనమట్టు లఱ్రునను జేర్చినపామును బూలదండగా
     మక్కవనేన్గుతొల్వలువమాడ్కి గనుంగొనుఁ గొండిపట్టి ని
     న్నెక్కుడెదన్‌ దలంతు నను నేలుమ లేనెలఁదాల్కు దేవరా.

ఇట్లు స్తుతించి సాష్టాంగ నమస్కారంబొనరించి లేచి యెందైన విశ్రమింప నెంచి యందొకమూల మాణిక్యమణిఫలకముతో జెలువగు నరుగుమీద కేగి యుప విష్టుండనైతిని.

ఇంతలో బ్రాంగణమున మణిభూషణమున చప్పుడు లుప్పతిల్ల నా వంక దిల కించితిని. స్త్రీరాజ్య పురక్షోభంటువలె, శృంగార మహార్భాటము లీల, సౌందర్యమేళము విధమున యౌవన ప్రసిద్ధార్దముగతి నతికుతూహల కోలాహలమున నడచుచు, మకర వాహనుని బ్రకటించు మన్మధసైన్యమువలె గాంచీముఖాభరణాగ్రంబుల మకరరత్న చిహ్నములం దాల్చి, వెన్నెల కిక్కయగు చంద్రుని కుటుంబముగతి నతి ప్రకాశమాన మగు మౌక్తిక హారంబుల ధరించి యాందోళికల విలసిల్లువసంతుని జ్ఞాతివర్గంబువిధం బున గర్ణపాశముల నూగు గుండలశ్రీలవహించి, రతీదేవి ‌పరిగ్రహించిన కాటుకబరిణెల వడుపున గరాగ్రముల లీలాకువలయములబూని, పాతాళసంభూతమగు తిమిరినికు రుంబముకరణి సవిరళంబుగ గురులబెడంగుగాంచి, నభంబునుండి దిగివచ్చి చలించు తార కానికరము లీలభ్రమించుమౌక్తిక హారంబులబూని దిగ్గజముల శిరస్సిందూరరాగము దిక్కుల బ్రసవింప లగ్న మైనట్లరుణకాంతుల నొప్పు నడుగుదామరల దాల్చి, సము ద్రము వెడలివచ్చి ముఖసంమిళితమై యున్న నిద్రుమదళంబు దెన్నున సహజ శోణాధరబింబము బొంది. స్వర్గమునుండి యేతెంచిన పారిజాతపరిమళముగతి నామోద నిశ్వాసవైభవము గలిగి, లావణ్యజలై కసముద్రమై, కింకిణీరణితరవై కారవమై, ఆభరణ ప్రభలకేకాభ్రమై, త్రిభువనలక్ష్మికి క్రీడాపుత్రికౌఘమై, గుళికాదనుర్ధరుండగు మనో భవుం డనవరతము విడుచుమరకతోపలగుళికలవలె మధుపముల మూగికొను ముఖ సమీరసౌరభము గలిగి యనన్యయువతీసామాన్యమగు కన్యాసమూహము గోచర మయ్యెను.

ఆ సమూహమధ్యమున నతిధవళాపత్రము నీడనొయారముగ నడచుచు జంద్రమండలమునుండి యేతెంచిన లక్ష్మివిధమున నొప్పుచు, సావిత్రీధ్యానపరతంత్రు డగు ప్రజాపతిచే సృష్టింపబడుట నాదేవీస్వరూపమునే వహించిమించుచు, నాకన్యాసమూ హమున కెల్లనేలికయై కనుపించుచు, సర్వాంగసుందరియగు నొకతరుణీలలామ నాకు నేత్రపర్వమొనరించెను.


శా. ఆ వామాస్తనయుగ్మశృంగ కలితోద్యస్మందరాహార్య స
    ద్వ్యావృత్తోత్తమ విగ్రహాతిశయ లావణ్యాబ్ది నాస్యేందుబిం
    బావిర్భావము, నోష్ఠకౌస్తుభభవం, బామోదనిశ్వాసశో
    భావంతంబగు నాసికామరనగోత్పన్నంబు గల్గెన్‌ వడిన్‌.

అతి విస్తరమేల?


గీ. ఇంతి సుందరరూపసంసృష్టిఁ జేసి
    కాంచఁగ విధాతమదిఁ బుట్టెఁ గామవహ్ని
    దాని సైరింపలేక శైత్యంబుఁ బడయ
    నతఁడు హారిబొడ్డుతమ్మియం దధివసించె.

ఇట్టి యనన్య సామాన్య రూప లావణ్యాతిశయమున నొప్పు నొప్పుల కుప్పం దిలకించి నేనంత్యంతాశ్చర్యస్వాంతుడనై యిట్లు తలంచితిని.

ఆహా ! ఈ యువతీరత్న మెవ్వరు ? ఎచ్చటనుండి విచ్చేసినది? ఇట్టి సుందరీమణులుగూడ సముద్రగర్భమం దుందురుకాబోలును తొల్లి సముద్రమధనసమ యమున నందుండి లక్ష్మీదేవి యుత్పన్నమై నారాయణుని జేపట్టియుండలేదా? రూపాతి రేకమున రతి ప్రభృతి యువతీమణులకన్న మిన్నగ నొకయలివేణిని నిర్మింప నుత్సు కతం బొంది విధాత యీయేకాంతప్రదేశమున కేతెంచి యీ స్త్రీరత్నమును నిర్మించి యుండలేదు గదా ?

రూపసంసృష్టియందు ప్రధమాభ్యాసముగా నతండు మొదట లక్ష్మిని నిర్మించి యుండవచ్చును. ఈ యసామాన్యసృష్టి కుపాధానమృత్తికం గొనివచ్చు తురంగమే యుచ్చైశ్రవము, స్తనబింబపిండముల కాధార మైరావతకుంభి శ్వాసపరి మళోపయోగద్రవ్యము పారిజాతము, ముఖముదిద్దుటకు పరికరము హిమాంశుబింబము, కరప్రక్షాళనజలం బమృతము మెరుగువెట్టుఱాయి కౌస్తుభమాణిక్యము, ఈ యంగ నిర్మాణవస్తువులెల్ల సురలకు సముద్రమందే గదా దొరికినవి. ఇట్లనేక విధముల నేను విత్కరించుకొనుచుండ నావేదండగమనకన్యాకదంబముతో నా యాలయప్రాంగణము నకు దక్షిణముగానున్న మార్గమున బుష్పాపచయం బొనర్ప బూదోట కేగెను

పిమ్మట నందుండి ఛత్రవాహిని యను నొక రమణి వడివడి నేతెంచి యా యాయతనమును బ్రవేశించి గొడుగు ముడిచి యొక మూలబెట్టి దివ్యాంశుకావేష్టితం బగు నీపటమునుగూడ దానిమీద నుంచి వెంటనే యందుండి వెడలి యాకన్యా సమూ హమును గలసి కొనెను. ఆ యువతి కార్యాంతరవ్యగ్రహృదయయై యున్నకతమున నాతొందరలో సమీపమందున్న నన్ను జూడలేదు.

అప్పుడు వారు పుష్పాపచయమునుండి తిరిగి వచ్చులోపల నందు వస్త్రమున జుట్టిపెట్టబడిన వస్తువేమో చూడవలెనను నుత్సాహము నెమ్మనమున వేధింపనే నత్యంత వేగమున నాప్రదేశమున కొకగంతువైచి యా బట్టచుట్ట జేత బట్టికొని విప్పిచూడ నీ పటము గనంబడినది. అందొకవైపున నాస్త్రీరూపమును, మరొకవంక భవదీయరూప మును జిత్రింపబడియుండుట దిలకించి నేనత్యద్భుతరసావేశహృదయ సరోజాతుండనై యొండెరుంగక మీయిర్వుర రూపవిలాసవిశేషముల గనులు విచ్చి యతిశ్రద్ధగ బరి‌ కించుచున్న సమయమున భస్మోద్దూళిత సర్వాంగియు తపిలజటాకలాపయు, వల్కల పటావృతయు, దురవలోక ప్రకృతియు నగు నొక వృద్దతపస్విని యెక్కడనుండియో మహాకోపమున నాగర్భగృహోపకోణము ననుసరించి బిరబిర నరుదెంచి చూపుల నిప్పులు రాల్చుచు వెరపుగొలుపు తీక్ష్ణవచనముల నన్నుద్దేశించి యిట్లనియె.

ఓరీ! పాపాత్మా! పురుష పశువా! వివేకశూన్యా! మనుష్యాధమా! నీ వేలరా వచ్చి యీ ప్రదేశమెల్ల నపవిత్రముగ నొనరించితివి ? అపవర్గ విషయవేదులై మహాత్ము లధిష్టింపదగిన యీ వేదికపై నేమిటి కడుగిడితివిరా ? మూఢుడా ? దేవతార్చనోపకర ణంబగు నీవస్తువు నిట్లేల భగ్నమొనరించితి ? నీదుర్వినయమున కిప్పుడే తగినఫల మనుభవింతువుకాక. మొదట నేనన్నట్లు నీకు పశుభావమబ్బగలదు. ఒకచోటనుండి యిట కెగిరిపడితివి కావున పతంగ జాతియందుబుట్టుము. మాణిక్యశుక్తి కా భంగం బొనరించిన కారణమున దదాకారముగల చంచువుం బూను చిలుక వయ్యెదవుగాక. మరియు నీపటము శుకజాతి విలక్షణముగ నీ తలపై బింఛము రీతి నుండగలదని నన్ను దీవ్రముగా శపించెను.

అట్లు శవ్తుడనై నేనేమి యపచార మొనరించితినో యెరుంగక క్రిందు జాడ నందు బరువబడిన కృష్ణాజినమును దానిపైన నాకాలుదగిలి ద్రద్దలైన మాణిక్యశుక్తి యును గనుపించినవి. వానిం దిలకించి మిగులననుతాపము నందుచు నయ్యో! చిక్ర పటవిలోకనావ్యగ్రహృదయుండనై యీ కృష్ణాజినమును ద్రొక్కుటయు దానిమీద నున్న శుక్తి కాలికిదగిలి భగ్నమగుటయుగూడ‌ నించుకయును దెలిసికొనజాలనైతిని గధా? నేనొనర్చిన దుష్కర్మము వలననే నాకిట్టి పరిణామము గలిగెను. కానిమ్ము. విధి దేనిని సమకూర్చునో దాని ఫలంబనుభవించెదంగాక.


గీ. గాత్రములు గాంస్యపాత్రలు గర్మగతిని
    ఛిద్రతనుగాంచు నయ్యవిచిత్రముగను
    కాంస్య కారకువైఖరిఁ గడక నెపుడు
    నరయ పరివర్తనమొనర్చు నావిధాత.

కావున నాకీ శాపసంతాపము దప్పించుకొనరానిదగుటవలన నందులకు విచారింపబనిలేదు. కాని యారమణీమణి వృత్తాంతము దెలిసికొనజాలమికి మిగుల వగచుచున్నాను. ఆమె యెవతె? ఎవని తనూజాత? ఏకులమందు జన్మించినది? నివాస స్థలమెయ్యది? ఇచటికేమిటి కేతెంచినది? నామధేయమేది ? ముజ్జగములయందును సాటి లేని రూపముగల యీ యువతీమణి యపహసితానంగ రూపుండగు పురుషపుంగవుని హృదయమునందువలెనే యీపటమం దిట్లేలదాల్చి యున్నది. అని యిట్లు నాలో నేనే ప్రశ్నించుకొనుచున్న సమయమున శాపకలకము విని పుష్పాచయము మాని పూదోట నుండి ఇద్దరు ముగ్గురు చెలికత్తెయలతో నాకన్యకాలలామ యతిరయమున నచటి కేతెంచినది.

అట్లేతెంచి నాచేతనున్న చిత్రపటమును జూచి నిశ్చేష్టితురాలై నిముస మాత్ర మెద్దియో ధ్యానించి మొగమున నించుక కినుకదోప నన్ను శపించినచో తపస్విని కిట్లనియె.

ఆర్యాణీ ! ఇదేమి ! సకల ప్రాణముయందు సమానానుకంపజూపు భవా దృశులు క్రోధమలోపలేపంబైన చిత్తమును విమల సమాధి సింధూదకమున గడిగి వై తురుగదా ? కృపారసతరంగిణీ ! ధవళభస్మాను లేపనమున హిమకాలచంద్రికవలె శీతల స్వభావమైన నీవిట్లు త్రీవత బూనదగునా ? కరాగ్రముల జుట్టుకొనియున్న రుద్రాక్షవలయముచే దర్శినీయమగు నీ మూర్తి పన్నగావృతమగు చందనలతికవలె నిట్లు భయంకరముగా నున్నదేమి ? ఘనకోపానలజ్వలితమగు చూపుచే జలధరము వడువున నశనిపాతంబొనరించుచు నమృతాకాంక్షితంబగు లోకము నేలతపింప జేసె దవు?

ఆక్రోశ కటురవములగు మాటలచే నింపగు బాలమున్నీటియొడ్డున విరుగు నలలయలజడివలె నేల వ్యధ కలిగించెదవు ? భగవతీ ! ఇంద్రియ నిగ్రహంబొనరించి భవసంబంథమును దూరముజేసి‌ యుంటివనుమాట నీవిప్పుడు మరచితివా యేమి ? ఈ శిలా వినిర్మిత శుక్తికా భంగంబు నెపంబున సాధువృత్తి విడనాడి సర్వార్థముల కనర్ద మూలమగు కోపము వహించి వీని నిట్లు శపించితివి.

మరియు నో దేవీ ! హరిహరబ్రహ్మలకైన దులాపమై నిశ్రేయసర రసా స్సంబై విజ్ఞానతేజోమయమై, వివేకమాణిక్య నిర్మాణమై యొప్పు క్షమాశుక్తిం గాంచి యున్న నీ వీతుచ్చవస్తుభంగమున కిట్లు క్రోధముబూనుటవలన నీ నియమమున కనర్దము వాటిల్లును గదా ? కావున సంసారసాగర గ్రాహమగు నరిషడ్వర్గవిజయము నెట్లు పొందితివో యట్లె ప్రశాంతివలన గోపము నుపశాంతించుకొనుము. పరిశుద్దాశయు డగు వీనికి శాపాంతమును బ్రసాదింపుము మరియు నితండు శుకజాతి బుట్టినను నత్యధికమగు మనుష చైతన్యముతో గాలము గడపునట్లనుగ్రహింపుమని ప్రార్దించు చున్న యా చిలుకల కొలికి పలుకల కలరి ప్రసన్నురాలై యా తపస్విని యిట్లనియె.

కుమారీ ! నీవు కోరినట్లే యగుగాక. ఈ పటము వీని తలమీద బింఛమై పెరుగుచున్నకొలది విజ్ఞానమభివృద్ది‌ నొందుచుండును. మరియు మదీయాసనగతుండై యరుణమణి మయంబగు‌ నీ శుక్తి‌ నెట్లు భగ్న మొనర్చెనో యట్లె యొకప్పుడొక జగ దేక వల్లభుని యాస్థానవేదిక నెక్కి శుక్తికాయమానంబగు చంచూభంగం బొన రించుకొని నిజస్వరూపము నందగలడని నాకు శాపాంతమును బ్రసాదించెను. ఇంతలో శాపదోషము మూలమున నాకు చైతన్యము దప్పినది. ఇంద్రియార విందములుముకుళితములైనవి. లోకమెల్లనంధకారబంధురమయ్యెను. ఆత్మ జడత్వమును వహించెను. పిమ్మట నేనెవ్వడనో, యెచ్చట నుంటినో, యేమైతినో, యే రూపమున మెలగితినో, యెచ్చ టెచ్చట దిరిగితినో, యెట్లు పొట్టపోసు కొంటినో నా కేమియు దెలి యదు.

నేడచట శాపాంతమగుటచే నిజస్వరూపమును దాల్చి విస్మయమున ముందు జూడ భవదీయ దివ్యదర్శనమయ్యెను. చిత్రపటమందలి రూపమును నేనిప్పుడు చూచిన రూపమును నొక్కటే యగుటచే పూర్వస్మృతి గలిగి యత్యంతానందమున నిటకేతెంచి దేవరవృత్తాంత మెల్ల బ్రతీహారి ముఖమున నెరింగి ప్రభు సన్నిధానమునకు జేరితిని. ఇదియే నా వృత్తాంతము.

ఈ పటమందలి యోషామణి నాఁడు సముద్రగర్భమందు నేను చూచిన సుందరాంగియే. ఇందున్న దేవరస్వరూపమును బ్రత్యక్షముగ గనుంగొనగలిగితిని. ధన్యుండ నైతిని. సాధ్యాసాధ్యము లెరుంగక లంకా విజయ మొనర్పబూనిన నా మనం బునకు భవదీయ దివ్యదర్శనంబున శాంతియొదవెను. సంసారాంభోది పతనంబు మూలం బున నాకు భవత్పరిచయ రత్నలాభ మొదవినదని సంతసించుచుంటిని.

దేవా ! మర్త్యలోక మకరథ్వజా ! నా మాట నమ్ముము. ఆ కన్యాలలామ చిత్రగతమైన నిజమూర్తి దేవర ప్రతిబింబమును హృదయమున దాల్చి యెటుల సేవించుచుండెనో యట్లే యీ‌ చిత్రపటమును విడువక యా యంబికాదయితు నారా ధించుచుండుట బరికింప‌ నీయందామె యనురాగము గలదై ప్రసూన శరనాయకశిఖా దందహ్యమానమానసయై యెట్లో కాలము గడుపుచున్నదని తలంతును. ఆమె సౌందర్యమనన్య సామాన్యము. నిఖిల విశ్వనిర్మాణదక్షుండగు పరమేష్టి సృష్టి నైపుణ్య మునకెల్ల నామె రూపము దలమానికముగదా ! ముల్లోకముల యందును సౌందర్య మున బ్రసిద్ధికెక్కిన శచీప్రభృతుల రూపముగూడ నా కన్యకా లలామయెదురగ వన్నె కెక్కనేరదు. త్రిభువనాధిపత్యమైన దొసంగ సమర్థమగు తపముగూడ నట్టి యువతీ రత్నమును లభింపజేయజాలదని యూరకుండెను.

అప్పుడు పుండరీకు డిట్లనుకొనియె. ఆహా ! ఈ కథ యెంత వింతగా నున్నది ? దీనిని వినినదివోలె నా హృదయమున నెద్దియో నూతన సంతోష మంకు రించుచున్నది. విషయ కర్మకల్లోల లీలాగర్భితంబగు సంసార మహాసముద్రాంతరమం దట్టి కన్యారత్న మెచ్చట గనుపింపగలదు ? కాని యఘటనఘటనా సమర్దుండగు విధి కసాధ్యమెద్దిగలదు ? అట్టి విధియే నా కనుకూలవర్తియై యున్న యా యన్నుల మిన్నను నిక్కముగ నాకు సమకూర్చునని నమ్మెదను? అని యిట్లు దలంచుచు నందుండి లేచి ముందు నడచుచున్న కుమారకేసరి నత్యంత ప్రేమోపచార వచనముల నాదరించుచు నమ్మణి మండపము వెడలి వసంతశీలుని యనర్ఘ పారితోషికముల బ్రీతునొనర్చి తురగారూఢు డై సామంతవర్గము జేయునతులందుకొనుచు గ్రమం బున నిజనగరంబున కేగెను. ఇంతలో నా కన్యాలలామను సమకూర్చు భారము నర పతి తనయందుంచి నాడని విధి యామెను వెదుక బంపెనో యనునట్లు పగలును స్యూరుడును గూడ నిష్క్రమించిరి. అప్పుడు రాజేంద్రుని మనమున మన్మధ రాగము నిండినట్లె పశ్చిమ భూభృచ్చిఖరమున సంధ్యారాగ మావరించెను. పిదప గాఢాంధకారము దిశలెల్ల నాక్రమించుకొనెను.


331 వ మజిలీ

రాక్షసుని గర్వభంగము

నాఁటిరాత్రి చీఁకటి పురమెల్ల దట్టముగా నలుముకొనెను. ఇది స్థలమిది నీరిది మెరక యిది పల్ల మని నిరూపింప నశక్యముగా నుండెను. ఇంతలో జనార్థనుని చేతిపాంచజన్య మట్లు, కాళియపణా పంజరమందలి నిర్మోకపుంజముగతి, యమునాజల మందలి ఫేనపిండము డంబున, కువలయవనమందలి హంస విధమున తారకానాధుం డంబరము నలంకరించెను.


గీ. చీఁకటికి సూడు వీఁడని వీఁక మిగుల
    మఱుఁగునభిసారికర చూపుమంటలఁబడి
    చందురుఁడు బూదెబుంగయై స్వచ్ఛబింబ
    మడరఁ దొలిదిక్కుగట్టున నమరియుండె.

మరియును,

గీ. ఇనుఁడు లోకాంతరంబున కేగ నపగ
    తాళిఘనశిరోజకలాపయైక మలిని
    విధవలోలె వెన్నెలయను విమలవస్త్ర
    మునుముసుంగిడుకొని మోము ముడుచుకొనియె.

అప్పుడు చీఁకటిపడఁగ నభము శుభ్రకాంతు లీనుచుండ గుముదములు వికసింపఁ దమ్ములు ముకుళింప, శశికాంతశిలలు చెమ్మగింప, జారచోర ప్రచారములు సన్నగింప, విరహిణుల చిత్తముల కనంగతాప మతిశయింప, జగమున కాహ్లాద మొన గూర్చు సుధాంశుండు మింటఁ బ్రకాశించుచుండెను.