కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/327వ మజిలీ

సమయముల నెల్లప్పుడును మాయానతిని వీనిని మాసమక్షమునకు గొనివచ్చుచుండు మని వసంతశీలున కనుజ్ఞ యొసంగెను. ఇంతలో మాధ్యాహ్నిక సమయసూచకముగ శంఖము మ్రోగెను

ఆ నినద మాలించియుచితవేదియగు నారాజేంద్రుండువసంతశీలున దగిన రీతిని బహూకరించి రత్నపంజర మందున్న చిత్రశిఖుని వాని కప్పగించిపోవ ననుజ్ఞ యొసంగెను. మరియును సన్నిధానవర్తులగు రాజపుత్రకుల నెల్ల వీడ్కొల్పి స్నానాది మాధ్యాహ్నికకృత్యముల నిర్వర్తింప సింహాసనమునుండి లేచెను. అట్లులేచి రెండడు గులు ముందునకరిగినతోడనే యాధాత్రీశునకు బ్రణమిల్లి వానియనుజ్ఞగైకొనిపోవ నొకరినొకరు త్రోసికొని ముందున కేతెంచు సామంతరాజుల గాత్రసంఘుట్టనమున వారికిరీటమాణిక్యములు నేలరాలి రత్నాకరతీరమున నలలతో దృళ్శిపడు రత్న సంచయముభాతి భాసిల్లెను. ఆయలజడిం దెగిన తదీయహారాద్యాభరణములనుండి పడిన ముత్యములు స్వాంత్యంభోధరవిముక్తజలబిందువుల కైవడి డంబుమీరెను. ఇటు నటు నటించు గుటిలాలక సమూహముల కింకిణీక్వణత్కార కలంకలంబనంగ నగరమున తరువాత లేచిన జనుల కోలాహలములీల జెలువొందెను. సమర్థవశమున విలాసినీజనము లాస్థానమణిస్తంభముల నూతగొనియుండ దదీయప్రతిబింబముల నెపమున నమ్మండ పశ్రీలు సమాలింగన మొనర్చి వారి నాదరించున ట్లొప్పెను.

ఇ ట్లతి వైభవమున నారాజమార్తాండుండు వేత్రహస్తు లిరు వేడల బరా బరులు సేయ వందిమాగధులు ముందు జయజయనినాద మొనరింప నాస్థానమండపము నుండి వెడలివచ్చి స్నానాది యధార్హ కృత్యములం దీర్చుకొని భుజించినపిదప లీలా తల్పమున విశ్రమించి సుహృజ్జనులతో నిష్టగోప్టి సలుపుచు మఱల జిలుకందెప్పించి దానితో నాదినము వినోదముగ గడపెను. ఇట్లే. ప్రతిదినమును చ్శి చిత్రశిఖుని సరసవచ నముల వినుచు నాభూమీశుండు సుఖమున గాలము బుచ్చుచుండెను.


327 వ మజిలీ

పుండరీకుని మృగవనవిహారము


మఱొక్కదినమున బుండరీక రాజేంద్రుడు విలాసమణిభపనమున మంత్రి సామంతపురోహితులతో నిష్టగోష్టివినోదముల బ్రొద్దుపుచ్చుచు గట్టెదుట మణిపంజర మందున్న చిత్రశిఖుని దరలితారవిందసఖములగు దృష్టులం దిలకించి యిట్లనియె సఖా ! బుద్ధి విశేషమున బరిహసితబృహసృతియనదగు నీవిభూతివర్ధనామాత్యుని ప్రజ్ఞా మూలమున నరాతివంశాకురములెల్ల బెకలింప బడినవి. సద్గుణ గణాకర్షి తంబై భూపాలబృందము వశంవదంబయ్యెను. వసుమతీ చక్రంబెల్ల నాయాజ్ఞదలదాల్చు చుండెను. మంత్రబద్ధయైనట్లు లక్ష్మీ నాకు వశీభూతమయ్యెను. మదీయరాజ్యమం దెల్లడలను సుఖసంతోషములు దాండవమాడుచుండెను. ఇట్లు సర్వార్ధసిద్ధిం జేకూర్చిన మదీయకృపాణం బొరయందిమిడియున్నది రణవినోదాభావముచే నా భూజాదండము దుస్థితిపాలయ్యెను. ఇక నే నేవినోదవిశేషమున గాలము గడుపగలను. హృదయాహ్లాద కరముగ నింక నేనే వ్యాసంగమున బ్రవర్తింతునని యడుగ రాజేంద్రుని యిం‌గిత మెరింగి చిత్రశిఖుం డిట్లనియె.

దేవా ! పుడమియందు మనుష్యునకు కల్యాణప్రదంబగు నఖిల సుఖోప భోగానుభవమే పర్యవసాయమగు వ్యాపారము. దాని కాస్పదమై హృదయవాంఛితము లొసంగునది రాజ్యలక్ష్మి. సప్తార్ణవతరంగ మాలాభరణంబగు వసుంధరయే రాజ్యము నకు మూలాధారము. అట్టి పుడమింబడయఁ బ్రద్వేషివంశవిచ్చేదనం బవసరమగు చున్నది. దానిని దేవరవారింతకు నొనరించియేయున్నారుగదా ? భూవలయ మధుపట లమున రాజ్యసుఖరసోపభోగలాలసులగు క్షుద్ర నరపాల బృందములనెల్ల పారఁదోలి తివి. వీరుల కవచముల నిజ నిశితాసి దండమున విచారించుటంజేసి పుట్టిన యనల జ్వాలల భవదీయభుజా కదనకేళీక౦డూతిం బాపికొంటివి. క్షురప్రముఖవిఖండితేభదంత ముసలములున్మూలింపఁబడిన విరోధివంశాంకురములవలె సంగ్రామ భూములయందు నీచే విరజిమ్మబడినవి. నిశితనిస్త్రీంశధారోత్తారితరిపుశిర శృంఖవలయములచే వీరలక్ష్మి నలంకరించితిని. వైధవ్య విధురితారి సీమంతినీనేత్రసలిలధారలతో మధూత్సవం బొనరించితివి. విపాటిత విపక్షవంశసమాకర్షుండవై యశోముక్తాఫలముల ద్రిభువనలక్షీ కాభరణములుగ నొనరించితివి. ఇట్టి నిన్నేమని వర్ణింపగలను.


మ. అనిలో నీనిశతాసి తీక్ష్ణగతి సూర్యౌఘంబు గల్పించిమించె,
     నరాతిప్రమదాశ్రుధారల‌ మహాసింధువ్రజం బేకమై
     దనరంజేసె ఘనారవంబున యశోద్వాంతాట్టహాసంబుతో
     డ నటించెన్‌ నరిశీర్షహారముల వేడ్కన్‌దాల్చి భీమాకృతిన్‌.

ఇట్లతిప్రతాపవిహిరం బొనరించి శత్రువంశనిల్మోలనము చేసిన నీకు భూవలయమున‌ నాయోధననినోద వ్యాపారమున కవసరము గలుగదయ్యెను. అయినను నీవొనర్పదగినదింకొక్కటిమాత్రము గలదు.


గీ. ధాత్రినిర్వైరులై రణోద్దతులనైన
    ధరణిపతులకు భుజవినోదంబుకొఱకు
    రోషచలితకిటీనికురుంబమందు
    దాపమడరింప మృగయాప్రసంగముండె.

ఇట్లు చిత్రశిఖుండు వేటమాటయనినతోడనే బైట నెవ్వని తోడనో యెవ్వడో

మృగయాఖేటనవ్యాపారం బభివర్ణించు మాటలిట్లు వినంబడెను.


మ. కరికుంభస్తనియై మృగీవిశద దృగ్వైదగ్ధ్యయై కేకిసుం
     దరబర్హ చ్చదకుంతల ప్రమదయై నానావిహారస్ఫుర
     ద్వభూదారగభీర ఘోరశితదంష్ట్రాకాంతిసంఘాతయై
     కర మొప్పారు మృగవ్యలక్మి నెనయన్‌ గాపూరుషుండర్హుఁడే?

చిత్రశిఖునిపలుకుల కుపశ్రుతిపలె నొప్పినయామాట లాలించి యారాజ బిడౌజుం డమందానందకందళిత హృదయారవిందుండయి మృగయాఖేటనవినోద విషయము జక్కగా స్మృతికి దెచ్చినందుల కా శుకనాధుం బొగడి యట్టివినోదం బను భవింపఁ గృతనిశ్చయుండై మృగవనగమనాశ్యకములగు నుచిత పాశవాగురసార మేయాద్యుప కరణములతో వేఁటకాండ్ర సంసిద్ధపఱుపఁ బ్రతీహారిముఖమునఁ దగిన వారి కనుజ్ఞ నొసంగెను.

మఱునాటివేకువ నుచితవేషము ధరించి యమ్మహారాజు నవరత్నకాంతుల బ్రదీప్తంబగు జీనుతో నలంకరింపఁబడిన యుత్తమాశ్వమును' నింద్రుండుచ్చైశ్రవమునుం బోలె నధిష్టించి, వేట యందు నేర్పరులైన యనుచర లమితోత్సాహమున ముందు నడువ సమరలీలా వ్యాపారసహచరులగు సామంతనరేంద్ర కుమారులును, మంత్రి సూనుం డగు విజయవర్థనుండును, తురగారూఢులై పార్శ్వముల ననుసరింప, మృగ యులు మార్గము దెలుప, నపరిమితపరివార సమేతుఁడయి వేటకు బయలువెడలెను.

ఇట్లతి‌ వైభవమున గదల యనతికాలముననే యారాజు ముఖ్యుండుమృగయా వ్యసన పరాయణుండై యనేక తరులతాలతాంకుర విరాజమానంబగు నొక మహారణ్య ప్రదేశము సపరివారముగ బ్రవేశించెను. అయ్యది నానావిధవిహంగసందోహ సంకుల నిస్వనముతోడను, పర్వతాగ్రసంపాతిత ప్రవాహారావముతోడను, కుసుమ మధుమదారుణిత షట్పదసమూహ ఝంకారముతోడను, పవన చలితకీచకానేక సంకీర్ణ స్వయముతోడను మిగులభీషణమైయుండె. మరియు నా ప్రదేశమున సంచరత్పతంగనఖ వికీర్ణంబగు కుసుమకింజల్క పూరం బనల్పరజోవృష్టివలె వివిధవర్ణముల భయావహం బయ్యెను. అందనిల తరళిత లతావనప్రసూనపతనము క్షతపాత్రమువలె మృగారిష్ట సూచకముగ నుండెను. తరుశిఖర శాఖాంతరములనుండి దుముకు వానరములబరువుచేఁ గుసుమములు నేల రాలి మహాద్భుతోల్కాపాతమువలె శార్దూలాది సకలసత్వవినాశన మును దెల్పుచుండెను.

అట్టి మహారణ్యమున మృగములసహాయమున నుచితరీతి మృగయావిహారం బొనర్ప బరిజనుల కా రాజేంద్రుం డనుజ్ఞనొసంగెను. తోడనే వారెల్ల రత్యుత్సాహమున గంతులువైచుచు, మృగములఁ బట్ట నురుల నొడ్డి, వలలఁ బన్ని, యంతరాంతరముల నశ్వవారము నిలిపి, మార్గమున ధనుర్ధరులై కాచియుండి, సారమేయముల నుసికొలిపి, యుచితస్థలమున నొకమహోక్షమును గట్టి మాటొగ్గి, దీపమృగకదంబకముం బఱపి నిమసములో నాయడవినెల్ల నాక్రమించిరి. మరియు శ్వాపదవిలోకనార్దమై కందరదరీ ప్రవేశం బొనర్చుచు, గహ్వరముల బరిభ్రమించుచు, పల్వల తటమున నాక్రమించుచు నిర్ఘరతరంగిణుల సమీపమున సంచరించుచు నతి కోలాహలముగ నా మృగయులా వనాంతరమున జెలరేగుచుండ, సమీపభూరుహములనుండి భయకంపితారావంబు లొన రించుచు ప్రాణభీతిఁ బై కెగురు విహంగమ సమూహములును, చెవుల నిక్కబెట్టుకొని పొదల మాటున నుండి పరువులెత్తు శశకనికురుంబములును, సగముకొరుకబడిన దర్భాం కురములు నోటినుండి జూరుచుండ బెదరుచూపులతో నురుకు సారంగకదంబములును, నప్పుడే రొప్పఁబడిన వల్మీకమృత్పిండములఁ గొమ్మలయందుదాల్చి వెనుకకు దిరిగి చూచు సైరభ ప్రకరములును, భూమినెల్ల వలితవదనాగ్రమునఁ బెకలింపగలిగి మాటిమాటికి భీకరఘుర్ఘరారావము లొనర్చు వరాహనివహములును, చిగురుటాకుజొంప ముల నోటి కందించుచుండటదేత వర్తులములగు తుండములతోడను, నంసదేశపాతితము లగు కర్ణతాళంబులతోడను నపాంగమిళితనేత్ర తారకంబులతోడను నొప్పు మదపు టేనుగులగుంపులును క్రోధగర్జారవంబున దిక్కులు పిక్కటిల్లజేయు శార్దూలగణంబు లును గలిగి యా మృగయా కోలాహలంబతి దారుణమయ్యెను.


మ. హరి, కుంభస్థలి నగ్రవామపదమున్‌ హత్తించి వేఱొక్కకా
     లరయన్‌ బేరెదమీఁద నడ్డముగ శూన్యాధారతన్నిల్పి యా
     దరసంకోచమితాళితాస్రమెడలన్‌ దచ్చృుక్వమార్గంబులన్‌
     కరివిచ్చేదనవృత్తిమాని మృగయాకల్లోల మీక్షించెడిన్.

అప్పుడు వేటకాండ్రు హరిణంబుల దాళంబులంబట్టి, వలలొగ్గి పక్షుల నిర్బంధించి, సారమేయంబుల సహాయమున వరాహముల బొడిచి, బాణ ప్రయోగ మున గంఠీరవంబుల సంహరించి, వలయాకారముగ నశ్వముల రొప్పించుచు వ్యాఘ్ర ముల బరిమార్చి, శరభముల బొరిగొని సకలళ్వాపదసంతాపముల రూపుమాపి యమ్మహారణ్యమున నశ్రుతపూర్వముగ నదృష్ట పూర్వంబుగనననుభూత పూర్వ కముగ మృగయాసంరంభమాచరించుచుండిరి.

ఇంతలో నుష్ణాంశుండు గగనశిరోధిరూఢు డగుట దిలకించి విజయవర్థ నుండు వినయమున నా భూపాలున నిట్లనియె. దేవా ! వేట తమకమున నున్న మృగయులెల్ల నీయెండవేడిమిని మిగుల నలసియున్నారు. సర్వవనసత్య సంహారం బొనరించి ధనుర్ధ‌రుల వామకరంబుల బాణాసనంబులదాల్చి యందందు దిరుగు చున్నారు. ఉచ్చండవేగమున బరువు లెత్తింపబడిన యశ్వము లొండొంటిజేరి స్థిమిత పడుచున్నవి. సారమేయంబులు సౌమ్యములై నాల్కలు వ్రేలవైచికొని నిలిచియున్నవి. సూర్యభగవానుడు తీవ్ర కిరణములబరసి తీవ్ర శరశిఖరఖండితములగు మృగయా ఖండముల బచనం బొనర్ప నగ్నివలెనే భరింపరాని యెండ గాయుచున్నాడు.


చ. అలఘుకపోలపాళి ననయంబు నిదాఘజలంబుగ్రమ్మఁ గ
    న్నుల కరమోడ్పుగల్గఁగఁ దనూలత వాడఁగ మోముగందఁగాఁ
    జలమున సంచరింతురు నిషాదినులుష్ణకరప్రసక్తిచేఁ
    గలఁగి యనంగసాత్వికవికారము లందినరీతి నియ్యెడన్‌.

మఱియును మధ్యందిన మార్తాండాతపోజ్జృంభణంబును సహింపజాలక పతత్రిజాలంబు లున్నతద్రుమంబులు శిశిరపత్ర పటలాంతరముల నడగియున్నవి. కరికుల ధారాజలనిమజ్జనమునుండి లేచి వచ్చిన షట్పదపటలంబు సూర్యకిరణముల వసి వాడిన కమలకానన లక్ష్మికి బట్టిన నీలాతపత్రమువలె సరోవరమున బ్రవర్తించు చుండెను. ఘర్మాంశుకర నికరమువలన దొడిమలపట్టు జారిపడిన లతాప్రసూన ముకు ళములచే వనభూమియెల్ల గప్పబడుచున్నది. కందర దరీప్రవేశ మొనరింప బరువు లెత్తు వనచరుల పరుషప ద ఘట్టనంబుల గిరితటంబుల కేగిన గైరికరజోపూరములవలన దిశాభాగములన్నియు నెర్రబడి యున్నవి. కావున నో దేవ ! ఇక వేట జాలించి విశ్ర మించుట యొప్పునని సమయోచితముగ వచించిన విజయవర్దనుని మాట లాదరించి యప్పుడే యా భూపాలముఖ్యుండు మృగయాఖేలన వ్యవహార విముఖుండై యా వనమునుండి బయలువెడలెను.

అట్లు బయలు వెడలి యుద్ధురమహాతపసంబాధితంబైన నిజ పరివారము నెల్ల నెచ్చటనైన‌ నొకశీతలప్రదేశమున విశ్రమింపజేసి యాదుస్సహమధ్యాహ్నమును గడుపనెంచి యరుగుచుండ ననతి దూరముననే ముందు పచ్చికబయళ్ళతో, నికుంజ మంజరులతో, సురదారు చందన ఘనసార పున్నాగ పాటలీ నీప చంపక ముచు కుందకేసరాశేత పనసామ్రజంబు జంబీర క్రముక నారికేళ ఖర్జూరకాది సుందర సాంద్రద్రుమ సందోహములతో బహుళశీతలజలాశయములతో, నతిసుందరమగు కుసుమసుందరమను విలాసోద్యానవనమును బొడగాంచెను.

అట్టి రమణీయ ప్రదేశమున గనుంగొని యా రాజోత్తముఁడమందానంద మున నాతపక్లేశ మపనయించుకొన సపరివారముగ నందు విడిసెను. ఆశ్వికుల దిగిన తోడనే పైనున్న జీనులు తీసివేయబడగా కొన్ని గుర్రములు ధూళియందు బొరల దొడంగినవి. కొన్ని దుర్వాస్థలంబుల కరగి మేయసాగినవి. పరిజనులలో గొందరు నిర్ఘరాంబువుల దానమాడిరి. కొందరు తనివితీరినీరంబుల గ్రోలిరి. కొందరు తరు చ్ఛాయల విహరించిరి. కొందరు కూర్పాసకంబుల నూడదీసి చల్లగాలిసుఖ మనుభ వించిరి. కొందరు కేశబంధముల విదళించుకొని యిటునటు దిరుగుచుండిరి కొందరు లతామండపముల నుత్తరీయముల బరచుకొని శయనించిరి. కొందరు చల్లని ప్రదేశముల కరిగి నిదాఘతాపంబడగ విసరుకొనుచుండిరి. కొందరు క్రిందబడియున్న ఫలముల నేరికొని తినుచుండిరి. అప్పు డమ్మహారాజు దివ్యాశ్వమునుండి దిగి విజయవర్ధనునిపై జేయూని నడచుచు సమ్ముఖంబున కేతెంచి నమస్కరించిన వనపాలుని వసంతశీలుని‌ సన్మానించుచు, మందగమనమున నతిశీతలమైన ప్రదేశమందు విమలమణిశిలాఫలక వినిర్మితంబైన దివ్యమాణిక్య మందిరమును బ్రవేశించెను.


328 వ మజిలీ

చిలుక పురుషుండైన కథ

అందు మాధ్యాహ్నికకృత్యముల యధార్హంబగు రీతి నిర్వర్తించి పిమ్మట సమీపమున సుందర కాసారతీరమునగల సహకార విటపిచ్చాయల శిశిరజలసమీరసం గమసుఖం బనుభవించుచు విశ్రమించియుండి యా యుద్యానవన రామణీయకంబును దిలకించుచుండ వాని యభిమతంబెరింగి యింగితజ్ఞుండైన విజయవర్థనుండా మహా రాజున కిట్లనియె.

దేవా ! పరిపక్వఫలస్తబకములతో నిండియున్న యీ ద్రాక్షలతామండప మెంత మనోహరముగా నున్నదో చూడుము. మీదుగా నున్న తరులతాకుసుమముల నుండి స్రవించు మకరందమువలన దడిసిన యీ మాలతీలతామతల్లిక మదనరాజ్యాభి షేకవేదికవలె నెంత వింత గొల్పుచున్నదో కనుంగొనుము. మణిమండపాంగణంబున జంద్రకాంతశిలాసోపానములతో నతి సుందరముగ నిర్మింపబడిన యా దిగుడుబావి యెంత సంతోషప్రదముగ నున్నదో తిలకింపుము. అల్లదేదూరంబున వివిధ తరు లతా ప్రశోభితంబగు విలాసభూధర ప్రదేశంబెంత మనోజ్ఞముగ నున్నదో పరికిం పుము. ఈ బాలమాతులుంగీ వనంబునకు వామభాగమున కదళీఖర్జూర నారికేళాది పాదపసమూహంబునకు నీరెత్తు మోటనూతు లెంత వైశాల్యము గలిగియున్నవో గ్రహింపుము. అనేక జలవిహంగమ విహారయోగ్యమై కురవకనికురంబునకు దక్షిణం బున నున్న యా దివ్య సరోవర సౌందర్య మెంత యొప్పిదముగా నున్నదో వీక్షిం పుము. అని యిట్లనేక విధంబుల నా యుద్యానవన విశేషంబుల నంగుళీనిర్దేశంబున జూపించుచుండ జేరువనుండి వారికిట్లు వినంబడెను.


శా. ఓ చంద్రోపల గౌరి ! యో మరకత ప్రోజ్జృంభిత శ్యామలా !
    యో చామీకర భిన్న వర్ణవిమలా ? యో పద్మరాగాంబరా ?