కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/322వ మజిలీ
గీ. అట్టిసూనుండుబుట్టు భాగ్యంబు నాకు
గలుగదయ్యెను నాతపఃఫలమదెల్ల
దారుమారయ్యె నాడుసంతానమబ్బ
వంశమెటునిల్చు మీదఁ దాపసవరేణ్య!
అని వ్యసనపడు చిత్రరధు నూఱడించుచు నారదుం డిట్లనియె. గంధర్వ కులచూడామణీ! విధినతిక్రమింపజాలువా రెందును లేరుగదా? పరమేశ్వరుని యాదేశము గూడ వారివారి పురాకృతము ననుసరించియే యుండును. నీకొక్కపుత్రికయును హంసుని కొక్క పుత్రికయును గలుగగలరని పలికిన సర్వేశ్వరునిమాటల కన్యధాత్వ మెట్లుండును ? దీనికై యెంత వంతపడినను ప్రయోజనములేదు. పరమేశ్వరప్రసాద సంలబ్ధమగు పుత్రికలను సామాన్యబుద్ధి దలంపరాదు. ఆపుత్రికాద్వయము మూలమున మీయుభయగంధర్వకులములకును శాశ్వతసదృశ్యంబు గలుగగలదు. వారికిపుట్టు పుత్ర సంతానమే గంధర్వరాజ్యరమా పరిష్వంగసౌఖ్యార్హ మై మీకత్యుత్తమ లోకసంప్రాప్తికి కారణమగును. తపమున బరమేశ్వరుని సన్నిహితుంజేసికొనగల్గిన నీభాగ్యదేయము మిగులస్తోత్రపాత్ర మైనది. ఇక మనమున నే విచారమును బెట్టికొనక నిజసదసమునకు బోయి సుఖమున గాలము గడుపుచుండుము, నీచే నిచ్చట బ్రతిష్టింపబడిన నీశ్వరునకు నిత్యమును బూజావిధానములు జరుగుచుండునట్లుచూడుము. దాన నీకుత్తమలోకప్రాప్తి గలుగగలదు. పొమ్ము. శుభంబులం బడయుమని దీవించి యా దేవమునీంద్రుండు యధేచ్చాగతిం బోయెను. చిత్రరధుండు వానిమాటలవలన గలంకముడిగి నిజనివాసము నకుబోయి యా వృత్తాంతమెల్ల నాప్తుల కెఱింగించి సంతోషమున గాలము బుచ్భు చుండెను. నిత్యమును బుడమి కేతెంచి యందు దనచే బ్రతిష్టింపబడిన సదాశివమూర్తిని స్వయముగా నర్చించుచుండెను.
322 వ మజిలీ
శ్రీవైకుంఠమందు గార్తికశుద్ధఏకాదశినాడు గొప్ప యుత్సవము బ్రతివత్స రము జరుగుచుండును. నాడు శ్రీమన్నారాయణుండు పాలసంద్రమునుండి యోగ నిద్రాప్రబోధితుండై లేచివచ్చి సర్వప్రపంచ సంరక్షంబునకు గడంగును. అప్పుడు దేవతలెల్లరునువచ్చి యా యాదినాయణ దివ్యదర్శనంబొనర్చి స్తోత్రపాఠము లొన రించుచుందురు. సురపురోహితుండగు బృహస్పతి సర్వబృందారక సమక్షమందాయధో క్షజుని లక్ష్మీసమేతముగా దివ్యసింహాసనమునందు గూర్చుండబెట్టి యాగమవిధుల వివిధసత్కారము లొనరించుచుండును. దేవర్షిబృందమెల్ల నాసభాభ్యంతరమున లక్ష్మీ నారాయణ ప్రీతికరముగ నాశిషంబుల బఠించుచుండును. తుంబురునారదులా దేవదేవుని వింశత్యవతార విశేషముల దివ్యగానం బొనర్తురు. అప్సరోయువతులా సభాప్రాంగ ణంబున నాట్యకళాప్రదర్శనం బొనరింతురు. ఇట్టివినోదముల నాడా వైకుంఠమందిరం బెల్ల నత్యంతసోభాయమానమై చెలగియుండును. నాడు లక్ష్మీనారాయణసందర్శనము సర్వపాపహరం బనియును నిఖిలభయ విధ్వంసకంబనియును వివిధహృదయోపతాప నివారకంబనియును శాశ్వతమోక్షసామ్రాజ్యలక్షీ సముపలబ్ధసాధకంబనియును ననేక విధముల దలంచుచు భక్తసందోహమా వైకుంఠమందిరద్వార ప్రదేశమున గుమిగూడి యుండును.
అట్టి యుత్కృష్టోత్సవదినమున కొకప్పుడు దేవతలు మునీశ్వరులును నేతెంచి యా వైకుంఠపురమున విడిసియుండిరి. మునిపత్నులెల్లరును సముచితరీతి నలంకరించుకొని శ్రీదేవిం దర్శింప ముందుగా నా మందిరమునకరిగి తమరాక పరి చారికా ముఖమున దెలియజేసిరి. రమాదేవి యా వార్త విని ముప్పిరిగొను సంత సమున నమ్ముని పత్నుల కెదురేతెంచి యభ్యంతరమునకు గొనిపోయి వారినెల్ల నర్హ రీతి నాదరించెను. గౌతమసతియగు నహల్యయును నాచార్యుని భార్యయగు తారాసతి యును సహజలావణ్యప్రశోభితములగు నిజాంగయష్టులకు నూత్నశృంగార మాపాదించు తెరగున వివిధభూషణభూషితలై మనోహరకుసుమవిసరసమలంకృత కేశ పాశలై సౌందర్యాబిమానసమంచిత ముఖసరోజాతలై యధేచ్చగా నానారీమండలమున మెలంగుట దిలకించి కలుములజవరాలు మనమున నించుక యేవగించుకొనెను. అన సూయను నరుంధతిని లోపాముద్రను మునిపత్ను లందరియందును మిక్కిలి గౌరవించి యామె పూజించెను. వారి సతీత్వమహత్వము బెద్దగా వినతించెను. అందువలన దక్కినవారి కించుక హృదయపరితాపం బొదవెను. సహజాభిమాన గర్వభూయిష్ట లగు నహల్యాతారారమణుల కందువలన నందరికన్న నధికముగ మనముల నీర్ష్య జనించినది. ఇట్టి యంతఃకరణప్రవృత్తులలో గొంత ప్రొద్దరిగిన వెనుక వారికిట్టి సంవాదము జరిగెము.
లక్ష్మి --- ఆర్యాణులారా ! మీ సందర్శనమున నా హృదయమునకు నే డపరిమితానందం బొదవెను. మీ చరిత్రములు సర్వప్రపంచ కాతీతములు. మీ మహి మలు మహాద్భుత సమేతములు. సకలభువనంబులును మీ మాటలకు వశంవదములై యుండు. ఇట్టి మీతోఁగలసి ముచ్చటించుట నాకు మహాభాగ్యము.
అనసూయ - దేవీ ! నీవిట్లు మమ్ము బెద్దసేసిపలుకుట నీ యభిమాన సూచకముగాక వేరెట్లగును ? సర్వ ప్రపంచ సంరక్షకుండగు నధోక్షజున కిల్లాలవై నిఖిలదేవతా చక్రవర్తివై యొప్పు నీ యెదుట మేమెంతవారము.
అరుంధతి -- తల్లీ ! నీచేఁ గొనియాడబడిన కారణమున మేము ధన్యుల మైతిమి. నీ కటాక్షరస సమప్రసారము మాత్రముననే నిరుపేదకైన సర్వసంపదలు గలుగునని వచింతురుగదా ? అట్టి లో కైక శరణ్యంబవగు నీతో ముచ్చటింపగలిగిన మా యానందమునకు నేడు మేరలేదు. లోపాముద్ర - అంబా ! కారడవుల నేయాకు టింటిలోనో కాపురముండి భర్తయే సర్వమనినమ్మి యాతని పాదముల గొల్చుచు నమాయకవృత్తి గాలముగడుపు చున్న మావంటి నిరుపేదలపై నీ కిట్టి యవ్యాజమైన యనురాగము గలుగుటకు మేము పూర్వభవమున నెట్టి పుణ్యమొనరించితమో యెరుంగము.
లక్ష్మి - నిఖిలదేవతా పురోహితుఁడగు వాచస్పతి సతియగు నీతామరణిరా దక్కదక్కి.న మునిపత్నులందరును భర్తలతో దపోవనముల దరచుగ గృశించుచున్న మాట నిక్కువమగును. కాని సాధ్వికి జీవితేశ్వరునితోడిదలోకమని నమ్మి యట్లుండుట చేతనే మిక్కిలి ప్రసిద్ధి గాంచగలిగిరి. స్వర్గమున గాపురముండి రాజభోగానుభవా నందఁబందినకతమున మీ యందరయందును దారయే మిగుల నదృష్టవంతురాలని యామెమొగము దిలకించుచు మందస్మితమున నర్మగర్మముగా వచించెను.
తార - [ఇంచుక మొగము జిట్లించుకొని] ఏమమ్మా ! నా భర్త ఇంద్రుడా యుపేంద్రుడా ! రాజభోగానుభవము నా కెట్లు కలుగును ! దేవతలకందరకును బురో హితమాత్రుండై వారి కనుసన్నల మెలగుచున్న వాని యిల్లాలిని నన్ను మీ రిట్లవమాన పరచుట యొప్పిదమేనా ?
లక్ష్మి --- [చిరునవ్వుతో] తారాసతీమణీ ! యింతలోనే నీకింత యలుక గలుగవలయునా ? మునీశ్వరులు భార్యలకు హితము సేయుపొంటె యాత్మప్రభావ మున జంద్రుడైన గాగలరు, ఇంద్రుడైన గాగలరు.
అహల్య - [తనలో] ఇంద్రుని పేరుచ్చరించుచు నీ శ్రీదేవి నన్నుగూడ నెత్తిపొడుచుచున్నది గదా. [తారతో] సఖీ ! చూచితివా శ్రీదేవి సాహసము ! అజ్ఞాన మున నెన్నడో మనమిరువురము నింద్రచంద్రసహవాసం బొనరించిన నీ షద్దోషము నీమె యెట్లిచ్చట సూచించుచున్నదో గ్రహించితివా ? లేకున్న వారిరువుర నామముల నిందుహరింప బనియేమి ? సమానులలో నేడు మనకిచట తలవంపులు గలుగునట్లు బలుకుచున్న నీ యుదధికన్య నేమనవచ్చును ?
తార -- నేను మొదటినుండియు నీ లక్ష్మీచేష్టితముల గ్రహించుచునే యున్నాను. అనసూయా ప్రముఖుల నత్యంతము గౌరవించి మనమిరువురనీమె యించుక యుపేక్షించియండుట నీవు కనిపెట్టలేదా ? ఇట్టి తేలికబుద్ధి గలిగిన యీమెను బెద్దజేసి చూడవచ్చుట మనదే తప్పని తలంతును.
అహల్య - తక్కినవారివలె మనముగూడ మోటుముస్తాబు వహించియుండక దివ్యభూషణభూషితులమై చెలగియుండుట కీమె యీర్ష్య వహించియున్నట్లు తోచు చున్నది. తనకన్న నెదుటివారు మనోహరరాకృతి నొప్పియుండుట కొందరికి గన్నె ఱ్ఱాగానుండు నందురు.
తార - నీవు చెప్పునది సత్యమే కావచ్చును. మొగమునిండ బస పింతదట్ట ముగా నలందుకొని నుదుట బట్టెడు కుంకుమబొట్టు బెట్టికొని చక్కగా దిద్ధబడ కుండుటచే నరజారుచున్నకొప్పునం దడవిపూవులం దురిమి ముకుదూల మూడునట్లు వ్రేలాడు నాసామణింబూని బొమ్మకు గట్టినట్లు చీరధరించి కొన్ని యనాగరకంపు నగల దొడిగిచూపుర కపహాస్యము గలిగించు వెసవములనున్న తక్కినముని పత్నుల వలె మనముగూడ నుండక శృంగారవేషముల నొప్పియుండుట యీమె కిష్టము లేకుండవచ్చును. దానికి మనమేమిచేయగలము ? పేదముదుసలి పేరంటాండ్రవలె నుండుమన్న మనమెట్లుండగలము.
లక్ష్మి -- [మందహాసముతో] మీ యిరువురును రహస్యసంభాషణమునకు బూనియుంటిరేమి ? మీ ముఖములు దిలకింప మాఫై నెద్దియో యలుకవహించుచున్నట్లు తోచుచున్నది. యధేచ్చగా మాటలాడుకొనుచున్న సమయమున నలుకబూనుట సమం జసముగాదు.
తార --- మహాభోగపరాయణుండై యనేక చిద్విలాసభాసురుండై యనిర్వచ నీయప్రభావసమేతుండై త్రిభువన జేగీయమానుఁడగు యొడయని జెట్టపట్టిన యదృష్ట శాలి సన్నిధికి విభూతిరుద్రాక్ష మాలికాధరులై యసదృశజటాకలాపభారులై యత్యంత ఛాందస ప్రవృత్తులైయున్న భర్తలతోఁ గాపురము సేయచున్న మేము దగుదు మమ్మాయని యిందరుదెంచుట హాస్యాస్పదము కాకుండునా ?
అహల్య - (కోపముతో) వచ్చినందులకు మంచి పరాభవమే జరిగినది, ఇఁక మనమిక్కడ నుండబనిలేదు. వచ్చిన దారిబోయి చేతనయిన నిందులకు బ్రతీకార మాలోచించుకొందము రమ్ము. (అని తార చేయిపట్టుకొని బిరబిరలాగికొని యవ్వలఁ బోయినది)
తక్కిన మునిపత్నులెల్లరును జరిగిన దానికి మనముల వగచుచు శ్రీదేవి యనుజ్ఞ గైకొని నిజనివాసములకు బోయిరి. రమాదేవియును నహల్యాతారాసతులతో దనకు నిష్కారణ కలహము సంభవించినందులకు నెమ్మనంబున నుమ్మలికము జెందుచు నంతర్గృహమునకు బోయెను.
ఇంద్రచంద్రులశాపము
నాడు యధానిర్దిష్టముగ వైకుంఠమున జరుగవలసిన వేడుకలు జేయ మొదలు పెట్టిరి. ఈశ్వరుడు గూడ పార్వతీసమేతముగ నాటి యుత్సవతిదృక్షాపేక్ష వచ్చి సభ నలంకరించియుండెను. ఇంద్రుఁడును జంద్రుఁడును దక్కఁ దక్కినదేవత లెల్లవచ్చి యర్హాసనముల నుపవిష్టులై యుండిరి. గౌతమ బృహస్పతులుగాక తక్కిన దివ్యమునీంద్ర సందోహమెల్ల నామందిరమున కేతెంచెను. కొంతసేపటికి యధోచితా లంకారభాసురులై లక్ష్మీనారాయణులు సభాస్థలంబులకు విచ్చేసి అందున్న వారికెల్లఁ గనుల పండువయొనర్చిరి. పురోహితుండగు బృహస్పతి యంతవరకు రాకుండుటచే నా దేవసభయందుఁ గొంత కలవర ముదయించినది. తక్కినవారు రాకుండుట గూడ నెరింగి యెల్లరును విస్మయసందేహడొలాయమాన మానసులై వారికై యెదురు చూచు చుండిరి.
ఇంతలో నారదుండు పరుగు పరుగునవచ్చి హతాశులమైతిమి. అనల్పమగు ప్రమాదము సంభవించెను. నేఁటి యుత్సవమున కంతరాయము గల్గినదని పల్కుచుఁ జేరువనున్న యాసనమునఁ జదికిలంబడెను. వానిమాటల కెల్లరును నాశ్చర్యభయవశం వదులైరి. అప్పుడు కశ్యపుఁడు నారదుని సన్నిధి కేతెంచి యిట్లనియె.
కశ్య - నారదా ! నీ మాటలు జాలభయవిషాదములఁ గలిగించుచున్నవి గదా ! నేఁడేమి ప్రమాదము సంభవించినది ? ఈ యుత్సవమున కేమియాటంకముద యించెను ? గౌతమబృహస్పతు లిందు రాకుండుటకు గతంబేమి ? ఇంద్రచంద్రు లేమైరి? సత్వరమ యధార్థ మెరెంగింపుము.
నారదుడు - ఆర్యా ! వారు నేఁడు మహాక్రోధాభిమానులై యున్నారు. అనర్ధము రాకమున్నే ప్రతీకార మాలోచింపవలసి యున్నది.
కశ్య - జరిగిన వృత్తాంతమెల్ల సవిస్తరముగా నెరింగింతువుగాక. ఊరక కాలయాపనమేమిటికి ?
నార -- నేఁడు శ్రీదేవిం దర్శింప మునిపత్నులెల్లరును నామె సమక్షమున కేగిరి. అందాలోకమాతచే నహల్యాతారారమణు లవమానింపబడిరఁట. వారిరువురును దమ విడిదెలకరిగి విచారమానసులై యెవ్వరితోడను బలుకక తలగట్టుకొని పరుండిరట. అందులకుఁ దహతహంబడుచున్న భర్తలతో నా ముద్దుగుమ్మలు శ్రీదేవిపై లేనిపోని నేరము లెన్నియో చెప్పిరఁట. దానికై యాముని యుగ్మము మండిపడుచుండెను. ఇంద్ర చంద్రులు సన్నిధినుండి వారి క్రోధాగ్నినిఁ దమ యవినయప్రసంగమునఁ బ్రజ్వలింప జేయుచుండిరి. వారి కోపమూలమునమ్మహాలక్ష్మి కేమియిక్కట్టు సంభవించునో యను భయంబున నీ యుదంతము మీకు నివేదింప నే నిందేతెంచితిని. మీద మీరలె యాలో చింపఁ గర్తలని మిన్నకుండెను.
ఆ మాటలాలించి చేరువనున్న నిటలాక్షుండు క్రోథతామ్రాక్షుడైఁ యందున్నవారెల్ల భయకంపితులగునట్లు చంద్రదేవేంద్రుల నుద్దేశించి యిట్లనియె. ఏమి యీ యింద్రచంద్రుల యసమంజస ప్రవర్తనము ! సర్వలోకాధినాయకుండగు లక్ష్మీనారాయణునకుఁ బ్రియముగ నిందొనర్పవలసిన మహోత్సవము జూడ నిందరు దేవతలు మహర్షులు వచ్చి వేచియుండఁ దామెచ్చనో నిలచియుండుట హైస్యమని యేల వారికి దోపకున్నదో గ్రహింపఁజాలకున్నాను. ధూర్తజాయా ప్రకల్పిత మహామాయా వాగురాబద్ధహృదయ రాజీవులకు గౌతమబృహస్పతు లందుమసలిన మసలియుందురు గాక. వారి ననుసరించి వీరందునిలిచి లక్ష్మికి ప్రతిపక్షులై బలుకఁ దివురుట సహింహఁ దగినదికాదు. ఇట్టి యవినయప్రవర్తనులు దేవలోకమున నుండదగరు. అచిరకాలము ననే వారిరువురును నరలోకమునఁ గష్టపరంపరలం దగుల్కొని తమ యవజ్ఞతకుఁ దగినఫలం బనుభవించెదరుగాక యని యింద్రచంద్రుల శపించెను.
పరమేశ్వరుని సామేననొప్పియున్న యార్యాణియును నట్టి యుత్సవసమ యమున శ్రీదేవితోఁ గలహించి యమాయకులగు భర్తలకుఁ గళంకమాపాదించిన యహల్యాతారామణులను దేవలోక నివాసయోగ్యత లేకుండఁ బుడమిఁ బుట్టునట్లు శపిం చెను. విష్ణువక్షస్థలమున నొప్పియున్న శ్రీదేవి పార్వతీపరమేశ్వరుల శాపవాక్యము లాలకించి కించిచ్ఛ్మితాస్వభాస్వరయై యింద్రచంద్రుల కతమున నిట్టి దారుణశాపం బనుభవింపవలసివచ్చిన యా మచ్చకంటులకు శాపగ్రస్తులైయున్నను వారిరువుర సహ వాసము వెండియు లభింపఁజేసిన నీ పరమేశ్వరి శాపము వరంబై సంతోషముగూర్చుఁ గావున నట్లయగుంగాకయని యనుగ్రహించెను. మరియును భార్యల దుష్టప్రవర్త నంబు సైరించి వారిం బురస్కరించుకుని యెదిరితప్పెన్నుచున్న గౌతమ బృహస్ప తులు శాపకారణమున రూపాంతరములు వహించియున్న సతులకు మనప్రియులఁ గూర్చుటయందు సహాయులై మెలంగెదరుగాక యని యూరకుండెను.
ఇట్లు దారుణముగా, వారెల్లరును శపింపబడుటకా సభాసదులెల్లరును నిశ్చే తనులైరి. అప్పుడు నారాయణుండు ప్రశాంతవచనముల నిట్లనియె. ఎంతవారలకైన నొకప్పుడు ప్రమాదము సంభవించుట సహజము. ఈ శుభదివసమున నిచట జరుగు చున్న మహోత్సవమున కానందమున నేతెంచిన వారికిట్లు ప్రమాదము సంభవించుటకు నా మనం బొప్పకున్నది. పార్వతీ పరమేశ్వరులిడిన శాపమును శ్రీదేవి యాడిన మాటలను ద్రిప్పనెవరితరంబగును. రూపాంతరముల నింద్రచంద్రుల కహల్యాతారా పతులయందుఁ బుత్రోదయంబగువరకే యీ శాపదోషము నిలువఁగలదు. సంతానము గలిగిన యనుక్షణమందే వారెల్లఱకును శాపాంతమై యధాస్థితిఁ గలుగఁ గలదు. మరి యును చంద్రుడు లేకున్న నోషధులు వర్దిల్లజాలవు. దానఁ బ్రజాసంరక్షణమునకుఁ గొరంత వాటిల్లును. కావున నీ శాపఫలం బాకశానిధి యంశమాత్రమే యనుభవింప దగునని యనుగ్రహించెను. పిమ్మట నాయధోక్షజుండు నాటి యుత్సవములెల్ల నిలుపు జేయించి దేవతలను మహర్షులను వీడ్కొల్పి లక్ష్మీసమేతుండై యంతర్గృహమున కేగెను. పార్వతీపరమేశ్వరులు వృషభవాహనా రూఢులై కైలాసములకేగిరి. వాణీ హిరణ్యగర్భులును గందినడెందములతో మరాళ మందయానమున నిజమందిరమున కరిగిరి. తక్కిన సర్వబృందారకులును మునివృషభులును విన్ననగు మొగములతో నా సభామందిరము విడచి యదృచ్ఛాగతింబోయిరి. నారదుండు గౌతమబృహస్పతు లున్న విడిది కరిగెను. అప్పటికి వారించుక శాంతచిత్తులై గతమునకు వగచుచు నా గతమునకు వెరచుచు మనోవైకల్యంబు మొగముల గనుపింప నొకచోఁ జదికిలంబడి దీర్ఘ నిశ్వాసంబుల నిగుడించుచుండిరి.
నారదుండు మెల్లన వారి సన్నిధింజేరి ముకుందుని మందిరమున జరిగిన వృత్తాంతమెల్ల పూసగ్రుచ్చినట్లు వారికి విశదపరచెను. తమకు సంభవించిన శాప దోషము విధంబెల్ల నాలకించి మించిన విచారమున వారు హాహాకారములు సేయదొడం గిరి. ఆ దేవమౌనియును వారి నుచితవచనముల నూరడించుచు మరియు నిట్లనియె. పూజ్యులారా ! విధివిధానము ననుభవింపక యెంతవానికైన దీరదు. కాని శ్రీదేవి యిడిన శాపము చాలకుచ్చితముగా నుండెను. ఇదొక్కటియే నా మనమును వేధించు చున్నదని వారికా లక్ష్మీదేవిపై యీర్ష్య జనించునట్లు పలికి యూరకుండె.
అప్పుడు గౌతముడు క్రోధఘూర్ణితవదనుండై యేమేమి ! ! ఆ శ్రీదేవికి మే మంతచేతకాని వారముగా గాన్పించితిమి కాబోలును. ఆమె మిమ్ము తాపసులమని విభూతిరాయలమని జటావల్క లాజినులమని ముదుసళ్ళమని మరియు నెన్నో విధముల మునిపత్నుల సమక్షమందు మిగుల నధిక్షేపించిన పాపకారణంబున మముబోలు మునీంద్రుని మూలముననే పుత్రుంగాంచి యుపయశంబు గాంచుగాక యని ప్రతి శాపంబిడెను. అందులకు నారదుండు సంతసించుచు దేవేంద్రుడు జన్మాంతరమున నా శ్రీదేవికే తనయుడై జనియుంచి రూపాంతరంబున నీకు బరమాప్తుడై యుండగల వాడు. అని వెండియు నిట్లనియె. శ్రీదేవి మీ యిరువుర నరలోకమున బుట్టునట్లు శపించి యుండలేదు. కావున మీరు దేవలోకములయం దెచ్చుటనైన జన్మించవచ్చును. కాని మనుష్యలోకమున శాపమూలమున గష్టపరంపరలంబడు నింద్ర చంద్రులతో గొంతకాలము సహచరులై యుండుట మాత్రము తప్పదని పలికెను.
అప్పుడు బృహస్పతి భిన్నమతియై యౌరా! ఎంత విపత్తు సంభవించి నది ! శాపమూలమున నరలోకమందున్న పత్నులను మఱొకరికి, గూర్చుటయే మా పనియా ! అట్టి యవమానము మాకు గలుగకండునట్లాయిరువురురమణులు నర లోకమున గాక యధోలోకమున జన్మింతురుగాక యని యూరకుండెను. నారదుం డా మాటలకు మందస్మితం బొనరించుచు నార్యా ! శ్రీదేవి శాపం బమోఘంబు. అధో భువనమున బొడమినను దిరుగ నూర్ద్వలోకమున జన్మించినను వారి కింద్రచంద్రుల సంఘటనము నరలోకమున దప్పదుగదా ? యని వచించు నారదునను బృహస్పతి యిట్లనియె.
నారదా ! నీ మాటల మూలమున నా యిరువురు తరుణులు నధోలోకము నను నూర్ద్వలోకమునను గూడ జన్మింపవలెనని పొడనట్టుచున్నది. దైవవిధి దురతి క్రమణీయము. ఏది యెట్లు జరుగనున్నదో యట్లె యగుంగాక యూరక వగవనేమిటి కని పలికెను. పిమ్మట తమ యవినయంబుకతంబున బుట్టిన యనర్థముల విని యహల్యాతారా రమణులు మిగుల విచారించిరి వారి నుచితరీతిని ననునయించి నార దుండు యధేచ్ఛాగతింబోయెను. పిమ్మట నెల్లరును నిజనివాసముల కరిగిరి.
323 వ మజిలీ
పుండరీకునికథ
దేవలోకమున శ్వేతకేతుండను మహాముని కలడు. అమ్మహానుభావుండు దివిజగంగాసరి త్తీరమున నాశ్రమము గల్పించుకొని తపంబాచరించుచుండెను. ఒక్కనా డమ్మునిముఖ్యుండు మందాకినీ స్నానంబొనరింపగనేగి యందలి వికసిత సరోజాతముల దేవపూజకై కోసి తెచ్చుట కా జలంబులందిగెను. ఆ సమయమున గమల వనమున సన్నిహితయై వేయిరేకుల తమ్మిగద్దియపై గూర్చుండియున్న లక్ష్మీదేవి యామౌనిసత్తము నీక్షించి గౌతమశాపమూలమున జిత్తచాంచల్యము నొందెను. దర్శన మాత్రముననే సమాగమసౌఖ్యంబందిన యామెకు సద్యోగర్భమున నప్పుండరీకమందు పుత్రోదయంబయ్యెను. అప్పు డద్దేవి యా పుత్రకు నెత్తుకొనివచ్చి మునీంద్రా ! వీడు నీ తనయుండు. వీనిం గ్రహించి సంరక్షించుకొనుమని వచించి యబ్బాలకు నా శ్వేత కేతుల కొసంగెను. పుత్రసంభవము మాత్రముననే యామెకు శాపాంతమగుటయును జరిగినదానికి మనమున లజ్జించుకొనుచు నా శ్రీదేవి యంతర్హి తురాలయ్యెను.
పిమ్మట శ్వేతకేతుండు తనూజలాభమున కంతరంగమున సంతసించుచు నబ్బాలకుని నిజాశ్రమమునకు గొనివచ్చి పుండిరీకమున సంభవించిన కారణమున వానికి పుండరీకుడని నామకరణం బొనర్చెను. అబ్బాలకుం డమ్మునీంద్రుని సంరక్షణావిశేష మున దినదిన ప్రవర్థమానుండగుచుండెను.
దేవలోకముననే యొక మునిదంపతులకు గౌతముడు శాపమూలమున గపింజలుండును పుత్రుడై జన్మించెను. వానిని తలిదండ్రులుపనీతులొనర్చి విద్యా భ్యాసంబునకై శ్వేతకేతునియొద్దకు బంపిరి. పుండరీకునితో సమవయస్కుండగు నాకపింజలుని దన యాశ్రమమునందే యుంచుకొని పుత్రునితో వానికి సకల విద్య లను నేర్పుచుండెను. పుండరీకకపింజలు లత్యంతమైత్రి గలిగియుండిరి. ఉపదేశికుని ప్రభావమున నబ్బాలకు లచిరకాలముననే సర్వశాస్త్రముల యందును ప్రవీణులైరి.
ఇట్లుండ నొకనాడు నారదుండు శ్వేతకేతుని యాశ్రమమున కేతెంచెను.. అందా బాలకుల నిరువుర నీక్షించి మందహాస మొనరించుచు నమ్మునిపుంగవునితో నిట్లనియె.