కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/320వ మజిలీ
నదేవతాకములగు జన్నములెన్నేని జేయవచ్చునని పలుకుటయు నక్కుహనా బ్రాహ్మ ణుండు గటకటంబడుచు నిట్లనియె.
రాజోత్తమా ! విశ్వేశ్వరుండు లేకుండుటచే నీయవిముక్తక్షేత్రం బెంతేని చిన్నవోయియున్నది. ఆ వాసుదేవుఁడొక్కడు మాత్రమిందేతెంచుట కనుమతింపుము. తక్కిన వేల్పులు నే నొనర్చు జన్నమునకు రాకున్నను జింతలేదని బ్రతిమాలుచున్న వాని కానృపోత్తముం డర్దాంగీకార సూచకముగ మిన్నకుండెను. పిమ్మట నవ్విధాత దశాశ్వ మేధయాగములు సుప్రయోగములుగా నాహరించి బ్రహ్మేశ్వర దేవుం బ్రతి ష్టించి భాగీరదీ పశ్చిమతీరమునఁ జెలఁగియుండెను.
అచ్చట గౌరీశుండును గాలవిలంబము సైరింపఁజాలక నిజాంతర్గతమున నిట్లని చింతించెను. యోగినీబృందంబా యానందకాననమునకేగి తిరిగి రాదయ్యెను. వినస్వతుండు పూర్వవృత్తాంతమంతయు మరచి యందే నిలచియుండెను. అంభోజు సంభవుండును నందె కదలిని కంబంబయ్యె ఇంకఁ బరమవిశ్వాసనిధులగు ప్రమధుల నందుఁ బంచెదంగాక యని శంకుకర్ణ ఘంటాకర్ణ మహాకర్ణ గోకర్ణ తిలకర్ణ స్థూలకర్ణ మహాకాళ పింగళకాహళాది ప్రమధోత్తముల బహుమానపురస్సరముగా రావించి కాశీ వృత్తాంతంబరసి వచ్చుటకు బుత్తెంచుటయును వారతిరయమున నచ్చటికేగి యాక్షేత్ర మహాత్మ్యమున నిర్వచింప లేనట్టి యానందం బనుభవించుచు నభవు నాజ్ఞను మరచి యం దీశ్వర లింగంబులం బ్రతిష్టించి తదారాధనాతత్పరులై యన్యమెరుంగకుండిరి.
320 వ మజిలీ
మందరాద్రియందు బాలేందుకలాధరుండు కాశికరిగిన వారి వృత్తాంతము తిరుగ నెరుంగక చింతించుచు గజాస్యునిగూడ నందుఁ బంపువాఁడై వాని రావించి చేయవలసిన కృత్యమెల్ల బోధించి యచ్చటకు బంపించెను. వారణాస్యుండు వారణాసి కరిగి ప్రతిదిన మందనేక దుర్నిమిత్తములఁ గల్పించుచుఁ బౌరులకు మిగుల వెరపు గలిగించుచుండెను. తాను పురజనులలోఁ జేరి యా దుర్నిమిత్తములవలనఁ గలుగబోవు విపత్తు లెరింగించుచు వాని కుపశాంతుం బోధించుచు నందరకు బరమాప్తుండువలె నా కాశీమధ్యమున సంచరింపఁ దొడగెను.
సీ. కలలోనఁ బుట్టినకథలెన్ని యన్నియుఁ
బూసగ్రుచ్చినయట్లు పొసగఁజెప్పు
హస్తరేఖలుజూచి యాయుష్యమును భవి
ష్యము తేట తెలవిగా నానతిచ్చు
గూతులిద్దరు నీకుఁ గొడుకులిద్దరు నీకు
నని మోముసూచి సత్యంబునుడువు
దాతగారనువావిఁ దనవారితన మొప్పు
గురును మోపకయుండ సరసమాడు
గీ. వ్రతమునోమించు దివసవారములు దెలుపు
ననుగలంబై భామినీజనులయెడను
గుండుబొజ్జయు శిఖయును గురచపొడవు
వ్రేలిదర్భాంకురము నొప్ప విఘ్నరాజు.
ఇవ్విధమున నానా ప్రకారముల సంచరించుచు నరిష్టం బనతి కాలముననే కాశీపట్టణమునకు సంభవింపఁగలదనువార్త యెల్లరకుఁ దెలుపుచుఁ బౌరుల భీతావహులం జేయుచు హితుండునుబోలెఁ జరించుచు సర్వజనులచే సంస్తుతింపబడుచు డుంఠిభట్టార కుండను నామమున మెలంగుచు నొకనాఁడు రాజదర్శనం బొనరించి యతం డడిగిన ప్రశ్నలకు సదుత్తరములొసఁగి మెప్పువడసి యతని పురోహితులలో నొక్కండై ప్రవర్తించుచుండెను. మరియొకనాఁడు రాజు వాని జూచి యిట్లనియె.
గీ. చెప్పుమా డుంఠిబట్ట ! కాశీపురమునఁ
బుట్టుచున్నవి యుత్పాతములు దరుచుగఁ
గారణంబెద్దిదీనికి ? కలుషమెట్లు
వాటిలెనొ ? ధర్మమేవంకఁ బల్లటిలెనొ ?
అట్టి రాజ ప్రశ్నమునకు జేతులు జోడించుకొని డుంఠి వినయ వినమిత గాత్రుఁడై యిట్లనియె. రాజచూడామణీ ! అప్రియము బలుకుటకు నోరాడకున్నది. ఈ యుత్పాతములవలన నిప్పురమునకు బెన్ముప్పురానై యున్నది. అయినను మదీయ మంత్రబలమున నీ యనర్దములకెల్ల నుపశాంతి యొనర్పగలవాడను. కాని నీవిందుం డుట యుచితముగాదు. నీకు కీడ గలుగుటకు మేము సహింపజాలము. కావున నీవు కొంత కాలము రాజ్యము విడచి యెందేని బోవుట శ్రేయస్కరమగును. ఆత్మార్థం పృధివీంత్యజేత్త అనెడు వాక్య మిందులకుఁ దార్కాణముగా నున్నది. అయినను బెద్దల నింకను విచారించి వారి యాదేశము వడువున నొనరింపుము. త్రికాలజ్ఞుండగు బ్రాహ్మణుం డొక్కరుం డుత్తర దేశమునుండి నేటికిసూటిగా బదునెనిమిదివనాటి కేతెంచి నీకు హితోపదేశము సేయంగలడని చెప్పి యప్పార్ధివేంద్రుని డెందమున కెన్నడు నెరుంగని భయమును గల్పించెను.
పిమ్మట నరవిందాక్షుండుగూడ శంకరుని యభిమతము పొంది కాశికేతెంచి గంగావరణాసంగమమున బాదప్రక్షాళనం బొనరించిన కారణమున నా ప్రదేశము బాదోదక తీర్థం బయ్యెను. అచ్చట గృతకాలోచిత క్రియాకలాపుండై యప్పుండరీ కాక్షుండు -
గీ. త్రిపురకాంతల శీలంబు లపహరింప
బద్ధవేషంబు గైకొన్న పోకలాడు
జలజనాభుండు సుగతవేషము ధరించెఁ
గాశికాప్రజ కులధర్మగతి హరింప.
తనకుఁ బుణ్యకీర్తియని పేరు బెట్టుకొని గరుత్మంతునకు వినయకీర్తియను నామముబెట్టి శిష్యునిఁగాఁ బరిగ్రహించి జ్ఞానకౌముది యనిపేరు లక్ష్మికిఁబెట్టి యామెం బరివ్రాజికంగావించి తాను శిష్యుడును నొక్కవంకఁ బురుషులఁ బ్రమోదింపఁగను గమలయొక్కతె నింకొక్కచక్కి చక్కెరబోండ్లఁ బ్రలోభింపఁగను సంకేతము లేర్ప రచుకొని వేరువేర తెరవుల నప్పుటభేదనముజొచ్చి యొక్కచో నెల్లరు వినునట్లు పుణ్య కీర్తి శిష్యుండగు వినయకీర్తి కిట్లుపదేశింపఁ దొడంగెను.
శిష్యా ! సర్వజీవులకును జననమరణంబులు స్వభావసిద్దములు. వానికి నియామకుఁ డొక్కఁడెందునులేఁడు కాలభేదంబునగాని బ్రహ్మ రుద్రాదుల బ్రదుకులు గూడ మనకుఁబోలె యస్థిరములైనవే గదా ఆహార నిద్రాభయమైధునాది సమస్త వ్యాపారము లెల్లరకును సమాన ధర్మంబులు కావున జీవులకు తారతమ్యంబు లెంచక సర్వభూత సమత్వమున మెలంగవలెను. చీమ దోమ నల్లి మొదలగు నల్పప్రాణుల యందున్నజీవుఁడు నీయందు నాయందునుగల జీవునికన్న యల్పుఁడు కానేరఁడు. కావున నహింసయే పరమధర్మము. సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. శరీర త్యాగమే మోక్షము. అహింసాత్సర్వభూతాని అని వేదములయందే చెప్పఁబడియున్నది. కాని యందే యజ్ఞయాగములఁ బశువిశసనం బొనర్పదగునని జెప్పఁబడియున్నది. ఇట్లు పరస్పర విరుద్ధమగు వేదంబు ప్రమాణంబు గానేరదు. అహింసకన్నఁ బరమ ధర్మంబు లేదు. హింసకుడు నిక్కంబుగ నరకయాతనలను నహింసకుఁడు స్వర్గసుఖంబులఁ బొందును.
దానంబులెన్నియున్నను నభయప్రదానంబునకు సాటికానేరవు. దాననే నాలాసిద్ధాంతశాస్త్రపారంగతులగువారు భీతున కభయ దానమును వ్యాధితున కౌషధ దానమును శిశ్రూషునకు విద్యాదానమును నాకొన్నవాని కన్నదానమును దానములలో కెల్లఁ బ్రశస్తములని చెప్పుచుందురు. ప్రత్యక్షానుమానోపమానార్ధాపత్తి జ్ఞానములయం దింద్రియార్ద సన్నికర్షోత్పన్నంబై యవ్యభిచారియు వ్యవసాయాత్మకమునకు జ్ఞానంబు ప్రత్యక్షంబు ప్రత్యక్షజ్ఞానము సర్వజనులకు దేటతెల్లంబు గావున నెల్లరు ప్రత్యక్షం బవలంబించి యితరధర్మముల నన్నిటిని బరిత్యజింపవలయునని సుగతవాదంబు శిష్యు నకు బోధించుచు నా పట్టణమునఁ దిరుగాడుచుండెను. ఇంకొక్కొచక్కని విజ్ఞాన కౌముది యనుపేరు వహించి పరివ్రాజకావేషధారియగు విషధికన్య యుపన్యాస చాతుర్యంబొప్ప నొప్పులకుప్పల సన్నిధి నిట్లని యుపన్యసింపఁ దొడంగెను.
మానినీమతల్లులారా ! పరబ్రహ్మం బానందస్వరూపంబని యందరెరింగినదే కదా ! ఏపనివలన మనమున కానందంబొనగూడునో యట్టివానినొనర్చుట కితరులకై వెరువనేమిటికి ? పాంచభౌతికమగు మన శరీరం బొకఁడు సౌభ్యార్థియై యాచింప నొసంగకుండుట సమంజస మగునా ? చనిపోయినపిమ్మటఁ జీమలును గాకులును గుక్క లును దిను నీదేహమును బ్రతికియన్నప్పు డొకఁడు ప్రార్థించిన వెంటనే యొసంగుట కన్న మిన్నయగు దాన మున్నయదియా ? అత్యంతప్రియతమమగు శరీరమును దాన మిచ్చుట నిక్కముగ దాతృత్వలక్షణము. వావివర్ణముల విచారింప నగత్యము గని పింపదు. దక్షుఁడును మరీచియును బ్రహ్మపుత్రులేగదా ? మరీచినందనుండగు కశ్య పుఁడు దక్షునికన్యకలఁ బదుమువ్వుర నెట్లు వివాహమయ్యెను ? పరమపురుషుని ముఖ బాహూరు పాదములయందుఁ జాతుర్వర్ణ్యం బుత్పన్నం బయ్యెంగదా ? ఒక్క తనువు నందు జన్మించిన నలువురు నేకోదరులగుదురో కారో మీరలే విచారింపుఁడు. అట్టివారికి భిన్నవర్ణత్వమెట్లు సిద్ధింపఁగలదు. కావున వర్ణావర్ణ విచక్షణము విడచిపెట్టి యిచ్చ వచ్చిన మచ్చున స్త్రీపురుషులు విహరించుటయే పరమధర్మంబని పెద్దగా నుపన్యసింపఁ బురాంగనులకు భర్తృశుశ్రూషాది ధర్మముల విముఖత్వము గలుగఁదొడంగినది. ఇట్లు బుంరీకాక్షుండును వానియిల్లాలును వాడవాడలకుఁ దిరిగి యుపన్యసించుచుండఁ గొన్ని దినములకు -
గీ. వర్ణములు నాశ్రమంబులు వరుసఁదప్పె
వేదములు నాగమంబులుఁ విన్నఁబోయె
సౌరభంబులు గృష్ణపచ్యములుఁ జెడియె
వృద్ధిబొందె నధర్మంబు విశ్వమందు.
ఇట్లుండ దివోదాసుండు డుంఠిభట్టారకుండుచెప్పిన విప్రుండెప్పుడువచ్చునో యని కనిపెట్టుకొనియుండ సరిగఁ బదునెనిమిదవ దివసమున మధ్యాహ్న కాలమున సుగతవేషధారియగు మధుసూదనుండు బ్రాహ్మణ వేషముదాల్చి రాజసన్నిధి కేతెంచి సముచితగతి నద్దివోదాసు నాశీర్వదించి యతని కనుసన్న నా పన్న యున్న తాసనమునఁ గూర్చుండెను. అప్పుడు విఘ్నేశ్వరుండు రాజుహృదయమున నావేశించి యుండెను. వినాయకాధిష్టితుఁడగు భూపతి వైరాగ్యము వహించి యందున్న కపట బ్రాహ్మణు నుద్దేశించి యిట్లనియె.
గీ. బడలుపడితి రాజ్యభారంబు భరియించి
పొడమె మదివిరక్తి భూసుపర్వ !
యేమిచేయువాఁడ నెక్క డికేగుచు
నేది దిక్కు నాకు యెరుఁగఁ జెపుమ.
నా భాగ్యముకతమున నీవు హితోపదేశం బొనర్ప నాచార్యుండునుంబోలె నేఁడేతెంచితివి. ఇంతకాలము నా రాజ్యమున నకాల మరణములును జరావ్యాధిదారిద్ర్య ములునులేవు. ఇప్పుడేమి కారణముననో యవి గలుగుచున్నవి. మరియు నరిష్టసూచ కములగు నుత్పాతము లెన్నేని యిప్పురమునఁ బొడముచున్నవి. దేవతలఁ దృణీకరించిన యొక్క యపరాధము దక్క నేనింకేదోసము నెరుంగను. ఇది యంతయును వేల్పులచేఁ గల్పింపబడిన కపటనాటకముగాఁ దోచుచున్నది. ఏది యెట్లయినను బెద్దకాలము రాజ్యం బొనరించితిని. రాజభరాక్రాంతుడనైతిని. ఇంద్రియములు విరతిం గోరుచున్నవి. ఇఁక సకల కర్మనిర్మూలన క్షమంబగు మోక్షంబపేక్షించుచున్నాఁడను. అమ్మహోపదార్థము నాకేయుపాయమున సిద్ధింపఁగలదో యానతిచ్చి నన్ను ధన్యునిం జేయుఁడని ప్రార్థించు రాజేంద్రునకు బ్రాహ్మణ వేషధారియగు హృషికేశుం డిట్లనియె.
గీ. కాశికాపట్టణంబున లింగప్రతిష్ట
యాచరింపుము కల్పింపు హర్మ్యరేఖ
బొందితోడన శివలోకమునకు నరిగె
దనఘ ! నామాట వేదతుల్యంబుసుమ్మ.
నీ తనయునకు రాజ్యపట్టాభిషేకం బొనర్పుము. వానికి దైవభక్తి నుపదేశిం వుము. రాజ్యభారము పుత్రుని యౌదలంబెట్టి తపోవనమున కరుగుటయే వార్థక్యమున రాజు సేయఁదగిన కృత్యము. నేను చెప్పి నట్లొనర్తువేని నీవు కృతకృత్యుండవగుదువని చెప్పి యప్పుడే యా బ్రాహ్మణుం డెక్కదికేనియుం బోయెను.
దివోదాసుండును నైహికవిరక్తుండై యమాత్యుల మండలేశ్వరుల నధ్య క్షులఁ బురోహితులఁ బ్రతీహారులఁ గణకుల రాజపుత్రుల బ్రాహ్మణుల నంతఃపురజన ముల రావించి కుమారు సమరంజయు నందఱకు నప్పగించి యతనికి దారుణీరాజ్య పట్టాభిషేకముచేసి కాశికా నగరము నందుఁ దన సర్వశ్రీసమృద్ధియు వెచ్చించి మహా ప్రాసాదము నిర్మించి యందు శివలింగము బ్రతిష్టించి కింకిణిజాలమందితంబైన దివ్య విమానమెక్కి శరీరముతోడ శివలోకమునకుం జనియే ఆ ప్రాసాదము సర్వశ్రీ సమృద్ధి వినియోగనిర్మితము గావున భూపాల శ్రీయనఁబ్రసిద్ధిగాంచెను. దివోదాసేశ్వరలింగము గాశీపట్టణమున భుక్తిముక్తిప్రదాయకంబై నేఁటికిని బ్రకాశింపుచుండెను. పిమ్మట మందర ధరణి థరమున నున్న పినాకపాణి కా వృత్తాంతమంతయును మురమధనుండు గరు
డుని మూలమునఁ దెలియఁజేసి సత్వరమే వారణాశికి రమ్మని ప్రార్ధించెను.
సీ. సంతోషమునఁ జతుష్షష్టిశక్తి గణంబు
నామోదవృత్తంబు నభినయించె
రవులులోలార్క కేశవఘటోల్కాదులు
పన్నిద్దరు ప్రమోదభరితులైరి
వనజాసనుఁడు నాల్గువదనంబులనుతించె
వేదార్థముల భక్తివిశ్వనాధు
గణనాయకులు శంఖకర్ణఘంటాకర్ణ
నందిసేనాదులానంద మొంది
గీ. రఖిలమాయాప్రయోగవై యాత్యగరిమ
డుంఠి విఘ్నేశ్వరుండు వైకుంఠపతియు
గమలవాసిని యను నేకకార్యపరత
నాదివోదాసు వెడలంగ నడచునపుడు.
అనంతరము విదిత దివోదాసవృత్తాంతుండై యంతక మధనుం డంబికా యుతుండై ప్రమధులు దేవర్షులు దిక్పాలుకు గొలిచి వెంటరా గిన్నెరకింపురుష గరుడ గంధర్వ సిద్ధవిద్యాధరులు జయజయధ్వానము లొనరించుచుండ నందివాహనా రూఢుండై మందరమునుండి యానందమున నానంద కాననమునకు విచ్చేసి యవి ముక్తమంటపమున బేరోలగమునుండి డుంఠివిఘ్నేశ్వరు నాలింగనము చేసికొని పద్మ లోచనుని కరస్పర్శనం బొనరించి తక్కినవారినెల్ల నర్హ రీతి సంభావించెను. పుడమిపై వేలుపులుండరాదన్న దివోదాసుని శాసనము వానితో నంతమొందెనని దేవతలకెల్ల దెలియునట్లు బ్రకటించెను. పిమ్మట దనకు గాశీపురముపై గల మక్కువ నందున్న వానికెల్ల నెఱుంగ బల్కుచు మరియు నిట్లనియె. కాశీక్షేత్రధూళిత్రసరేణువు సర్వాంగ రక్షకము, కాశీనామసంస్మరణము సర్వపాపహరము, బ్రహ్మాండ గోళమునందున్న తీర్థరాజములెల్ల గాశీక్షేత్రమున బంచక్రోశమున నివసించియున్నవి. కాశీనిర్వాణ మాణిక్యఖని. కాశీ మోక్షలక్ష్మీ. నివాసకు శేయము. కాశీ సంసారబీజాంకురమరు భూమి. అట్టి కాశీక్షేత్రము నేటికి జేరగంటిమని యధికానందమున నా యంబికానాధుండు బెద్దగా నుతించెను. అందున్న దేవతాకోటురెల్లఱును దిరుగ దమకు గాశీనివాస వైభవం బబ్బినందుల కెంతయును సంతసించిరి.
గోపా ! వింటివా ! కాశీక్షేత్ర ప్రభావము అట్టి మహాక్షేత్రం బిక గొన్ని పయనములలో మనము చేరగలము. అందు భాగీరధీ నిర్మల స్రవంతియందఘమర్షణ స్నానం బాచరించి భక్తసులభుండగు విశ్వనాధుని సందర్శించి చరితార్థులగుదుమని నుడి విన మణిసిద్ధున కభివాద పురస్కరంబుగా నగ్గోపాలుం డిట్లనియె. అయ్యగారూ ! కాశీక్షేత్ర ప్రభావంబు వినుటచే నా మనంబున నధికోత్సా హము బుట్టుచున్నది. మీ యనుగ్రహమున నట్టి యుత్తమ తీర్థగమనలాభము నాకు చేకూరుచున్నది. నే నెంతేని ధన్యుండనని పలుకుచుండ నమ్మణిసిద్దుండు నేటికి జాల ప్రొద్దు బోయినది. ముందు మజిలీ యించుక దూరముగా నున్నదందురు. వేగమె బయలుదేరి యందు జేరవలయునని వానిని తొందరబెట్టి యప్పుడే బయలుదేరి యగ్గో పాలుండు గావడి యెత్తుకొని వెంటరా దదనంతరావసధమునకు బోయెను.
శ్రీరస్తు
కాశీమజిలీకథలు
పుండరీకుని జన్మవృత్తాంతము కథ
321 వ మజిలీ
శ్రీకాశీవిశ్వేశ్వర !
ప్రాకటబ్రహ్మాచ్యుతస్తుతాద్భుతమహిమా
ప్తోక ! శశికళాధర ! గౌ
రీకన్యాహృదయపుండరీకనివాసా !
దేవా! అవథరింపుము. అట్లు మణిసిద్దుండు శిష్యునితో దదనంతరావ సధముజేరి భోజనాంతరమున నుచితస్థలమున సుఖోపవిష్టుడైయున్న సమయమున నగ్గోపాలుండు వానిసన్నిధిం గూర్ఫుండి వినయమున నిట్లనియె.
గీ. ఇచటఁ జేరినదాది మీరింతవఱకు
నాకుఁజెప్పిన కథలెల్ల నాకలింపుఁ
జేసికొనుచుండఁ దోచె నాచిత్తమునకు
శంకలొకదానియందు విస్తారముగను.
సీ. కాదంబరీమహాగాధ గాధాంతరం
బునఁ బుండరీకుఁ డన్మునితనూజు
డమ్మహాశ్వేతకై యుమ్మలించుచు జీవ
ముల బాయఁ జంద్రుఁడమ్మూ ర్తి నాత్మ