కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/318వ మజిలీ

జలంధరుండు తనపూన్కెయంతయును విఫలమైనదని నుడివి యిప్పుడే యిచ్చటి కేతెంచి మణిగ్రీవుని గలసికొంటినని తానొర్చినప్రముత్నము లన్నియును దివోదాసున కెరింగించెను. మణిగ్రీవుండును గుణవతి కొఱకై యరణ్యమధ్యమందారాత్రి యంత యును దాఁబడిన యిడుమల నా మహారాజున కెరింగించెను.

పిమ్మట దివోదాసుండు శబర బాలకుండు దొరకువఱకుఁ దాను నిజరాజ ధానిని జేరవీలులేదని చెప్పుచు గుణవతిని చెలికత్తియతో దివ్యయానంబున నలకాపురంబు నకుఁ దీసికొనిపొమ్మని మణిగ్రీవునితోఁ జెప్పెను. అందులకు గుణవతి మొదట సమ్మ తించినదిగాదు. శబర బాలకుని వానియాప్తుల సన్నిదిఁ జేర్చిన వెంటనే నేను నీకొఱకు యక్షలోకంబున కేతెంతునని నమ్మకముగలుగునట్లు దివోదాసుఁడు వచించుటచేత నామె యెట్టకేల కంగీకరించినది. అప్పుడు మణిగ్రీవుండు గుణవతిని జిత్రలేఖను విమాన మెక్కించుకొని జలంధరుండు వెంటరా నలకాపురంబున కేగెను. దివోదాసుండును నరిందముని దనవెంటనుంచుకొని శబరబాలాన్వేషణంబున కరుగఁదలచి యందుఁ గన బడిన యొకమార్గము ననుసరించి ముందు బోయెను.


318 వ మజిలీ

రత్న చూడుని కథ

వింధ్యారణ్యంబున రత్నచూడుఁడు మౌనిసత్తముడనఁ బ్రసిద్ధి కెక్కి యుండెను. దివోదాసునిచేఁ బుడమి నుండుట కనుమతిఁ బడసియున్నకతంబున నా నాగోత్తముఁడు నిర్భయముగా నందొక యుచితస్థలంబునఁ దపంబొనరించుచుఁ గాలము బుచ్చుచుండెను. దివోదాసుని బలవిక్రమ ప్రభావములు దలంపునకు వచ్చినప్పుడెల్ల నతండు మిగుల నక్కజంపడుచు వానిని దైవసమునిగా నెన్నుచుండెను. ఆరాజేంద్రుని సుగుణగుణములఁ బలుమారు ప్రస్తుతింపుచుండెను. తనకతండొనరించిన యుపకారము నకుఁ బ్రతి యెన్నఁడైనఁజేసి వానియందుఁ దనకుఁ గల కృతజ్ఞతను వెల్లడింపవలయు నని యతండు సమయమును బ్రతీక్షించియుండెను.

ఇట్లుండఁ గొన్నిదినముల కొక సంధ్యాసమయమున నా నాగకులప్రదీప కుండు ప్రాంతసరోవరమునకుఁ బోయి వచ్చుచుండ నంతరిక్షమునుండి యెద్దియో నీటిలోఁ బడిన ధ్వనియగుటయు నతండదరిపడి వెనుకకుఁ దిరిగిచూడ నాపద్మాకరమున నొకమందసము మునుఁగుచుఁ దేలుచు గోచరమయ్యెను. రత్నచూడుఁ డాపెట్టెను సమీపించి దానిని బట్టుకొని తీరమునకుఁజేరి మూఁతఁబైకెత్తి చూడ నందొక మనుష్య బాలకుఁడు కరగతప్రాణుఁడై యుండుట పొడకట్టెను. తోడనేయతండాబాలకు నందుండి పైకిఁదీసి వానికి వివిధోపచారము లొనర్చుచుండఁ గొండొకవడికి స్మృతివచ్చినది. పిమ్మట నాబాలకుండు ముందున్న మునివల్లభుంజూచి భయాశ్చర్యస్వాంతుడై మేమియుఁ బలుకఁజాలక వడకుచు నిలువంబడియుండెను.

రత్నచూడు డాబాలకున కుదుటుగరపుచు నిజపర్ణశాలాభ్యంతరమునకు దోడ్కొనిపోయి కందమూలాదుల వానిని బరితృప్తుని జేసెను. పిమ్మట వాని వృత్తాంత మెరింగి యురగరూపమున దనచే వెనుక బ్రాణములు హరింపబడిన వనాటబాలకునిగా వాని నిరూపించి వాడెట్లు పునర్జీవితుండయ్యెనో తెలిసికొని నుత్సుకతం బొందుచు నిజ యోగవిద్యాప్రభావమున జరిగిన వృత్తాంతమంతయునుగ్రహించి మందహాసభాసుర వదనపంకేరుహుండగుచు నల్లన వాని కిట్లనియె.

బాలకా ! నీవు కడుపుణ్యాత్ముండవు. మనుష్యదుర్లభంబగు దివ్యలోకమున కేగివచ్చితిని. స్వప్నా పయముగ బాముకాటువలన జచ్చి పునర్జీవులగుట యదృష్ట హేతువని చెప్పుదురు. దేవతలనందర నాంక్షబెట్టిన దివోదాస ధాత్రీకళత్రుండు నీకొరకై పడరాని యిడుమలంబడుచున్నాడన నింక నీసుకృత విశేషమునకు నిదర్శన మేమి కావలయును? తొలుత నెవ్వాని యాభిలవిష జ్వాలలంబడి మడిసితివో యానాగ శ్రేష్ఠుని శిరోమణి ప్రభావముననే పిదప జీవించితివి. నీకికమీఁద నేయాపదయుం గలుగ బోదు. అనతికాలముననే మీ బందుగులం గలసికొందువు. నీకొరకై వెదకుచున్న దివోదాసుడు శీతశైలాగ్రమున నున్న శాంభవీదేవియాలయమున నిప్పుడున్నవాఁడు. నిన్ను మదీయ యోగప్రభావమున నిప్పుడే వానిసన్నిధికిం దోడ్కొనిపోయెద. గనులు మూసుకొమ్మని పలుకుచు నాశబరబాలకుని మందసముతోగూడ నాదేవభవనమునకు దృటిలో దీసికొని పోయెను.

అచ్చట దివోదాసుడు దేవీమండపముమీద నుపవిష్టుడై యుండి యరిందము నితో నెద్ధియో ముచ్చటించుచుండెను. మణిగ్రీవ జలంధరులతో గుణవతి నలకాపురము నకు బుత్తెంచిన పిమ్మట నమ్మహారాజు యక్షసచివునితో బయలుదేరి యరణ్యమందొక మార్గముననుసరించి నడచుచు గ్రమమున శాంభవీదేవి యాలయమున కప్పుడే వచ్చి చేరును అందుండు దివ్యకాంతల యుదంతమెరింగిరమ్మని యరిందమునితో బలుకు చున్న తరుణమందే శబరబారకునితో రత్నచూడు డచ్చటికివచ్చెను

దివోదాసుండు రత్నచూడుని పోలిక గ్రహింపజాలక కేవలమొక తాప సోత్తముడచ్చట దనకు బ్రత్యక్షమయ్యెనని తలంచుచు భయభక్తి వినయంబులు మనంబున నొక్కసారి జనింప దిగ్గునలేచి వానిపాదములకు సాష్టాంగపడెను అరింద ముండు పేటికాహస్తుడై యున్నశబరబాలకుని జూచినతోడనే గుర్తింపగలిగెను. ప్రేత సంరక్షణమునకై తనచే దొల్లికల్పింపబడిన మందసముసు గాంచి విస్మయమందెను. ఎవ్వని నన్వేషించుటకు దివ్యభువనములన్నియును దిరిగి యుంటిరో, యెవ్వని క్షేమము నకై దివోదాసమహారాజు మిగుల నాత్రమందుచుండెనో, యెవ్వని మూలముగా సర్వ సౌఖ్యముల నా యనఘుండు పరిత్యజించి యడవులపాలయ్యెనో యట్టి శబరబాలకుని గట్టెదుటంగాంచి యరిందముడు మహానందమున “ఇడుగో శబరబాలకు"డని యొక్క కేకబెట్టి వానిసన్నిధికురికి నిజకరద్వయమున నాబాలకుని మూపులంబట్టి యూప దొడంగెను.

రత్నచూడుడు దివోదాసుని లేవనెత్తి తనకు వానియందు గల గాఢాను రాగము దెల్లంబగునట్లు శిరమునిమురుచు నిట్లనియే. మహారాజచంద్రమా ! నీయుదార స్వభావమున‌ నే నెంతయును సంతసించితిని. జడదా రూపమున నున్న నాకు నీవిందు బ్రణమిల్లుట సమంజసమే కాని నేనందుల కర్హుండనుగాను సుమా ! భవదీయ బలప్రతాప ప్రభావములచే మొదట నిర్జింపబడి‌ క్రమ్మర ననుగ్రహింపబడిన యొకపాపజాతి పురు షుండు నీకెట్లు వందనీయుడగును. నేను నీకు మిత్రుడను, ఆశ్రితుడను, సేవకుడను, రత్నచూడుడ‌ను నాగవంశమువాడను. నీయనుగ్రహము మూలముననే నేనీ భూతల మున నివసించుచున్నాను. సర్వదా నీకు హితమునే తలంచుచు మునివృత్తిని వింధ్యా రణ్యప్రదేశమున నున్న వాడనని తనవృత్తాంతమెరింగించి శబర బాలకుని వానియెదుట బెట్టెను.

అప్పుడు దివోదాసుండు మిగుల బ్రీతుండగుచు రత్నచూడున కిట్లనియె. మిత్రమా! నీభావనైర్యల్యము ప్రశంసాపాత్రమైయున్నది. శబరబాలకాన్వేషణమునకై తహతహం పడుచున్న నా హృదయమునకు నేడు నీవు సంతోషమొనగూర్చితివి. వాని కొరకై మేము పడుచున్న యిబ్బందియంతయును నీయాగమనము మాత్రముననే తీరి పోయెను. నీకు నేనొనర్చిన మే లత్యల్పమైనది. నాకు నీవిం దొనరించిన ప్రత్యుప కారము మిగుల నుత్కృష్టమైనది.


చ. పుడమియురాజ్యమున్‌ విడచి భోగవిశేషములన్‌ ద్యజించి కా
    రడవుల సంచరించుచు ఫలాదులఁ గు నినింపుకొంచు నే
    నిడుమలఁ బొందుటెల్ల భవదీయ దయాప్తిఁదొలంగె నేఁటికే
    ర్పడ ముదమబ్బె నీ శబరబాలకు నేనిటఁ గాంచఁగల్గుటన్‌.

ఆ. వె. అనుపమానమైన యనురాగ మొప్ప నీ
         శబరబాలు దెచ్చి‌ సాధుమతిని
         నాకొసంగు టరయఁ బ్రాకటంబుగ మూడు
         లోకముల నొనంగుటే కదయ్య!

నీవు నాకీతీరున జేసిన యుపకారము నెన్నడును మరువజాలను. నీమూల మున నేను వనాటులతో జేసినప్రతిజ్ఞ నెరవేరినది. ఇక నాకు గారడవుల సంచరింప బనిలేదు. అని పలికి స్మృతినభినయించుచు నయ్యో! అనంగమోహినిమాట మరచితిని. అయ్యోషారత్న మెచ్చటనున్నదో తెలిసికొని యామె యాపద దప్పింపకుండ నేనెట్లు వారణాశికి బోగలవాడను. అని వగచుచున్న దివోదాసునకు రత్నచూడుడు మంద హాస సుందరవదనార విందుడగుచు నిట్లనియె.

రాజమార్తాండా ! నీ ప్రభావము నీ వెరుంగక యిట్లు వలవంతఁబొందు చుంటిని భవదీయ విజ్ఞాననేత్రము దెరచిన నీకు దెలియని దెద్దికలదు. శబరబాలకుని కొరకుగాని యనంగమోహిని కొరకుగాని నీవు సామాన్యునివలె నన్వేషించుచు గష్ట పడవలసిన యగత్యము లేకున్నను విధి విధానము ననుసరించి యట్లు జరిగినది. మొదట శబరబాలకుని ప్రేతమును నరిందముండు యక్షలోకమునకు గొంపోయి తైలద్రోణియందు భద్రపరచి యుంచిన యుదంతమును నేను మీ యనుజ్ఞఁబొంది నాడు శీతశైలము నుండి వెడలిపోయిన పిమ్మట నంతర్ధృష్టిం దెలిసికొంటిని‌. కాని తదన్వేషణము నెపమున మీరొనర్ప వలసిన కార్యము లేన్నేనియుండుటంజేసి యింత వరకు మీ కెరిగింపదలంప నైతిని. ఇందులకు నన్ను మన్నింప గోరుచున్నాను మరియు ననంగమోహిని యెందున్నదో కనుంగొనుట కిప్పుడు మీకు‌ కష్టములేదు. నాగలోకమున పితృగృహమున క్షేమముగానున్నదని తెలియుచున్నదిగదా యనుటయు దివోదాసుండు నివ్వైరంబడుచు నార్యా ! శైలకందరాంతరమునుండి యా యన్నుల మిన్న రసాతలమునకు బోవుట చిత్రముగా దోపకుండునా ? ఆ వృత్తాంతము జెప్పి మాకు సంతోషము గూర్చుమని యడుగుటయు రత్నచూడుడు మందహాసముజేయుచు నిట్లనియె.

ధాత్రీశ్వరా ! సర్వము నెరింగియును నీ వావృత్తాంతము నాచే జెప్పింప వలయునని తలంచు చుండుటంజేసి నేనే చెప్పెద నాకర్ణింపుమని యనంగమోహిని వృత్తాంతమెల్ల నంతర్దృష్టిం దెలిసికొని యిట్లు చెప్పందొడంగెను.


పాతాళేశ్వరి కథ

అట్లుహిమశైలకందరాంతరమున మణిగ్రీవునకువెరచి యంధకారబంధురమై యున్నయా మహాబిలములోనికిఁ బారిపోయి యనంగమోహిని మతిసాహసమున నడచు చుండెను. ఆ గుహా ముఖమున కతిసమీపమున మణిగ్రీవుండరిగిన ------------ కిరుప్రక్కలను రెండుగుప్తమార్గములు గలవు. కుడివైపుదారి పాతాళము వరకు వ్యాపించియున్నది. ఎడమవైపు మార్గము శాంభవీదేవి యాలయ ప్రాంగణమునకు జేరియుండెను. అనంగమోహినీ సమాన్వేషణమునకై నీ వగ్గుహాంతరమున బ్రవేశించి వామభాగమందలి మార్గమును దైవవశమున ------------------ జేరికొంటిని. బిలాధ్వమునఁ దిన్నగాబోయిన మణిగ్రీవుని వృత్తాంతము మీరు విన్నదే కదా! ఇక ననంగమోహిని యగ్గుహలో గాఢాంధకారమున నేమియుం గనుంగొనజాలక భయో ద్రేకమున నొక ప్రక్కగా నడచుచుండెను. దైవికముగా నామె కుడివైపుననున్న మహాబిలమార్గము ననుసరించి యతిరయమున‌ బోవుచుండ ముందు మణిఘృణులచే నబ్బిలము ప్రదీప్తమై కనంబడుచుండెను. ఆ దేజఃపుంజము గాంచి యామించుబోణి సమంచిత గమనమున నా భూగర్భముననుండి వెల్వడు నుపాయం బెరుంగవచ్చు నను నాసతో ముందరుగు చుండెను. డట్లబ్బిలమున నామె యెంత తడవు నడచెనో నుడువజాలనుగాని బడలికచే నొడలు దడబడువరకు బోయిపోయి యింక ముందరుగఁ జాలక నందొకచోఁ జదికిలంబడి వివశయై యంతలో చైతన్యము వడసి శ్రమంబపన యించుకొనుచుఁ గ్రింద శయనించియుండెను. అట్లామె విశ్రాంతిం బొందుచున్న సమయమున మాటిమాటికి నికటమున ఘంటారవము వినంబడ దొడంగెను. దాని కబ్బి బ్బోకవతి యబ్బురంబడుచు గొబ్బునలేచి యిటునటు బరికించుచుండఁ గ్రిందనుండి వెండియు శక్తిస్తోత్రపాఠకుల సందడి వినంబడెను. ఆ ప్రాంతముల యందెచ్చటనో దేవతాయతనమున్నదని గ్రహించి యా చంచలాక్షి యందేగి యమ్మవారి నభ్యర్థింప వలెనను నుత్సాహమున లేచి యబ్బిలము నర్గమింప నతిరయమున నడచుచుండ నెదుర గనకమయ గోపుర ప్రాకరములతో నొప్పుదేవతాయతనంబొండు నేత్రపర్వంబగు టయు నాముగుదలతలమానికము మురియుచు నచ్చటి కరిగినది.

అయ్యది పాతాళేశ్వరియని ప్రసిద్ధికెక్కిన యమ్మవారి యాలయము. దానిని దానింతకుముందెన్నఁడో చూచియున్నట్లు సంశయించుచు ననంగమోహిని తిన్నఁగా గర్భాలయముం బ్రవేశించెను. అందు దివ్య ప్రభావము దేటపరచుచు వెలు గొందుచున్న యా లోకేశ్వరిని గాంచి స్మృతినభినయించుచు నిట్లని సన్నుతింపఁ దొడంగెను.


మ. కలలోఁగాంచితిఁ దొల్లి నిన్ను వరముల్ గైకొంటి నత్యద్బుతో
     జ్వల మౌసత్పలమున్‌ గ్రహించితిని నమ్మచ్చీర్ష మందొప్పు ని
     ర్మల మాణిక్య మహా ప్రభావమును సర్వంబాను పూర్వ్యముగాఁ
     దెలియఁగాంచితి నీ దయన్‌ సతత మో దేవీ ననుంగావవే.

చ. వరుడతి సత్ప్రభావ బలవైభవుఁడబ్బెను నాకు నీ కటా
    క్షరససమప్రసారమునఁ వాని మదీయ విశేషదోష ని
    ష్టురమున వాని‌ బాసితిఁ గడుంగడుకష్టము లందుచుంటి ని
    క్కరణిన్ నన్నికన్‌ కరుణఁగావఁదలంపఁగదమ్మ ? యమ్మరో !

చ. చెనఁటియొకండు నబ్బలిమిచేత హరించి గుహాంతరము జే
    ర్చిన విధమెల్ల నెమ్మది నెరింగి భయమునఁ నబ్బిలము వెం


    టను జనుదెంచి చేరితి నిటన్‌ జననీ ! భవదీయ దివ్యద
    ర్శనము మహాద్భుతముగద ! శాంభవీ నీ మహిమము లెన్నగన్‌.

ఉ. రక్కసుఁడొక్కఁడే డ్తెర విరాళిని దెచ్చి యరణ్యమందునన్‌
    జిక్కులఁబెట్టనున్నపుడు చేసితి నీదగు దర్శనముఁ బెం
    పెక్కఁగ స్వప్నమం దిపు డదే విథ మాపదనున్న వేళ నా
    కిక్కడ గన్నులంబడితి వీశ్వరి ! నా వెతలెల్ల దీర్చవె.

గీ. నాఁటి పోలిక యొప్ప నీనాఁడు గూడ
   స్వప్నమున నాకు నీవు సాక్షాత్కరించు
   చుంటివేమొ గ్రహింపలేకుంటినమ్మ
   హృదయపరితాపమడచి రక్షింపుమమ్మ.

తల్లీ ! త్రిభువనేశ్వరీ ! నీ ప్రభావం బిసుమంతయును గ్రహింపజాల కున్నాను. ఆపద వేళయందు నాకు బ్రత్యక్షమై మనంబు కుదుటు గరపుచున్న నీ భక్తవత్సలత్వము నెంతని కొనియాడగలను. మొదట నాకు స్వప్నమున బాతాళమున బ్రత్యక్షమైతివి. నేఁడొక కందరాంతమున నీ యునికి దెలియబడుచుండెను గదా? నేను నిక్కముగా నిపుడు నీ సన్నిధానమందుంటినో లేక యిది యంతయును భ్రాంతి మూలకమో తెలిసికొనఁజాలనైతిని. నీ నివాసము రసాతలమందుఁ గలదో యక్ష ప్రపంచమందున్నదో లేక మధ్యమలోకమందుండెనో గ్రహింపఁజాలకుంటిని. మణి గ్రీవునకు వెరచి మహాబిలమార్గము ననుసరించి యేతెంచిన నా కిచ్చట నీ యాలయము గోచరించుట భ్రాంతి మూలకముగాక వేరొకటి యెట్లగును. ఇది యంతయును స్వప్న విభ్రమమనుటకు సందియములేదు. బిలమార్గమున నడచుచుండ నాకు శ్రమ మిక్కుట మగుటచే నేనందు శయనించితిని. అప్పుడు నాకు నిద్ర వచ్చినట్లుకూడఁ గొంచెము స్ఫురించుచున్నది. ఆ నిద్రలో నేర్పడిన స్వప్న విశేషముచేతనే నిక్కముగ నేనిప్పుడు నీ యాలయమునఁ బ్రవేశించి యుంటిని. అని యాలోచించి వెండియు నిట్లనుకొనియె. అయ్యో ! ఇది స్వప్నవృత్తాంత మెట్లగును నేను మల్కొనియే యుంటిని. ఇట్లు విత ర్కించుకొనుట గూడఁ గలలో కలకాదుగదా ! అయ్యో ! నేనిప్పు డేయవస్థ యందుం టినో నిర్ధారణఁ జేసికొనలేకున్నాను, తల్లీ ! నామనం బిప్పుడతిచంచలముగా నున్నది. నిక్క మెరింగించి నన్నుఁ గృతార్దురాలిం జేయుమని యాయమ్మవారి ననేకవిధంబులఁ బ్రార్దించుచుండెను.

ఇంతలో నాదేవీమందిరమున కెవ్వరో వచ్చుచున్న సందడి యగుటయు మణిగ్రీవుఁడు దన్ను బట్టుకొనుట కందు వచ్చుచున్నాఁడేమోయను భయమున ననంగ మోహిని యతిరయంబున‌ నా దేవీ విగ్రహము చాటున కరిగి యందు దాగియుండెను. అప్పుడు వాసుకి యచ్చటికేతెంచి భక్తిపూర్వకముగా నద్దేవి నర్చించి పిమ్మట యామె నుద్దేశించి యిట్లనియె.

జననీ ! నీయనుగ్రహం బెన్నటికైన నాపై గలుగకుండునా యని నిత్య మెదురు చూచుచు గాలము బుచ్చుచుంటిని. కాని నేఁటివరకు నీకించుకయును దయ బుట్టలేదు. నేనిట్లెంత కాల మోపికఁబట్టి యుండవలయును ! నా పుత్రికారత్నము నెడఁ బాసి యెన్ని దినములైనదోకదా ? ఇంతవరకు నా యనంగమోహిని జీవించి యుండెనా? ఎన్నఁడైన నా కన్నుల కా బాలికామణి గనంబడునా ? కలలోఁ బ్రత్య క్షమై యనతికాలముననే యనంగమోహిని కనంబడునని నీవానతిచ్చి యుండుటచే నేనిట్లు ప్రాణముల నిలుపుకొనఁ గలిగితిని. ఇఁక నాయాస తీరిపోయినది. ఎంతకాలము నిరీక్షించియున్నను నించుకయును బ్రయోజనము లేదనుట ధృఢమైనది. అనంగ మోహినింగాంచఁ గల్గుదుననునాసతో నిత్యమును నీ సన్నధికేనేతెంచి‌ పూజానమస్కా రము లొనరించుచుంటిని దీన నబ్బు సుకృతవిశేషమున ముందు జన్మమందైన నిట్టి విచారము నాకుఁ గలుగకుండునట్లు వరంబొసంగుము. ఇదియె నా కడపటి కోరిక. నాకిఁకఁ మనుగడయందు రోత బుట్టుచున్నది నీ సమక్షమందే ప్రాణత్యాగం బొన రించి ధన్యుడనయ్యెదనని పలుకుచుఁ గృపాణపాణియై నిజమస్తకమును నరకుకొనుట కుద్యమించుచుండెను. దేవీవిగ్రహము వెనుకనున్న యనంగమోహిని యిది యంత యును గమనించుచునే యుండుటచేఁ దటాలున బయటికివచ్చి తండ్రి చేయి పట్టుకొని యెత్తిన కత్తిని లాగిపారవైచెను. వాసుకి యెదుటనున్న తనూజను హృదయోద్వేగం బున గురుతు పట్టజాలకఁ తన మరణోద్యోగమును మాన్పించుట కాయమ్మవారే యందుఁదనకు ప్రత్యక్షమైనదని తలంచుచు నామె మ్రోల సాగిలంబడి భక్తితత్పరత్వం బున నిట్లని వినుతింపఁ దొడంగెను.

దండకము

శ్రీమన్మహాదేవదేవీ ! భవానీ ! త్రిలోకైకమాతా ! కృతార్థుండనై తిన్‌. భవద్దర్శనంబబ్బె నాకిందు నేనెంత పుణ్యంబునన్‌ బూర్వ జన్మంబునం జేసియున్నానో మున్నెన్నఁడెవ్వారునుం గాంచలేనట్టి యుత్కృష్టయోగము నీప్రేమచేఁ గల్గె నా కిప్పుడో సర్వలోకేశ్వరీ ! శాశ్వతానంద సంధాయినీ ! నీ సమీపంబునన్‌ బ్రాణముల్‌ బాయగాఁ నెంచియున్నట్టి నాపూన్కె నీకిష్టమే లేకయున్నన్‌ మదీయాత్మజాతన్‌ గుణోపేత నిచ్చోటకిన్‌ దెచ్చి నాకీయరాదే ముదంబంద నేనెంతయున్‌. బంధుసంఘం బుతో నీ ప్రభావంబు నిత్యంబు వర్ణింతు నమ్మా ! దయంజూడుమమ్మా ! వెతల్‌ దీర్పు మాయమ్మ ! పాతాళ లోకేశ్వరీ ! భక్తసంకల్ప సత్కల్పవల్లీ ! నమస్తే నమస్తే నమః ఇట్లు నితాంతభక్తి నాదేవిం బ్రస్తుతించుచు ననంగమోహిని పాదమూలమున నొడలెరుంగక పడియున్న జనకుని యవస్థగాంచి యామించుబోణి మిగుల విచారించుచు నిజకరద్వంద్వంబున నా యనఘునిఁబట్టి లేవనెత్తుచు నిట్లనియె. తండ్రీ! మీకిట్టి మనోవ్యధ సమకూర్చిన మహాపాపాత్మురాలనగు ననంగమోహిని దేవీప్రసాదమున మీ సమక్షమున కేతెంచియున్నది తిలకింపుఁడనియనుటతోడనే యాసరీనృప కులవరేణ్యుండు దిగ్గునలేచి యెదురనున్న పుత్రికారత్నమునుగాంచి మించిన యానందమునఁ గౌగలించు కొని కొండొక దడవేమియుఁ బలుకఁజాలకుండెను. అనంగమోహినియును చిర వియోగక్లేశమున వెండియుఁ బలుక నశక్తురాలై చూపులచేతనే తండ్రియందు దనకుఁ గల ప్రేమ దెల్లముసేయుచు వాని యక్కున వ్రాలియుండెను.

ఇట్లు కొంతతడవు వారు చిత్తరువులవలె యుండి క్రమమున హృదయో ద్రేక మడంచుకొనదొడంగిరి. అపుడు వాసుకి యనంగమోహినితో నిట్లనియె. తల్లీ ! నీవు మమ్ము బాసిపోయినది మొదలు నేఁటివరకు మేము బడిన హృదయ పరితాపము నకు మేరలేదు. ఈ త్రిభువనేశ్వరి యనుగ్రహాతిలేశమున నిప్పుడు నీవు నా కన్నులం బడి యానంద మొనగూర్చితివి. రక్కసుతో జిక్కి నీవు మనుష్యలోకమున హిమ వత్పర్వత ప్రాంతములకుఁ గొనిపోఁబడుటయు దివోదాస ధారుణీంద్రుండు నిన్నా నక్తంచరుని బారినుండి తప్పించుటక కథ నేనిదివరకే తెలిసికొని యెన్నఁటికైన మగిడి నా సన్నిధి కేతెంచఁ గలవను నాసతో నుంటిని. పిమ్మట నెచ్చటికేగితివి. ఇన్నిన్నా ళ్ళెచ్చటనుండి యిప్పుడిచ్చటికెట్లే తెంచితివి? దివోదాస పార్దివేంద్రుఁ డేమయ్యెను. నీ చరిత్రమంతయును జెప్పుమని యడుగుచున్న జనకునకు నిజకధావిధానమెల్ల సాను పూర్వకముగా నెరింగించి మరియు నిట్లనియె.

తండ్రీ ! నేనీ భువనేశ్వరి యాలయంబున కేతెంచుట నాకే వింతఁ గొలుపు చున్నది. నేనిప్పు డేలోకమునందున్నానో గ్రహింపఁజాలకున్నాను. ఇది నిక్కముగాఁ బాతాళమేయైన యెడల యక్షలోకము నుండి యిందేతెంచుట కడుంగడు విచిత్రము గదా ! భయమూర్చితురాలనైయున్న నన్నా మణిగ్రీవుండు దుష్టబుద్ధియై యెత్తుకొని పోయి యగ్గుహాంతరమునఁ జేర్చియుండును. అందుండియే గదా యీ యమ్మవారి యనుగ్రహమున నిచ్చటకుఁ బారిపోయి వచ్చితిని. ఎట్లయినను నేనిచ్చటి కేతెంచుటకు మణిగ్రీవుఁడే కారణమై నా కెంతేని యుపకారమొనర్చెను. ఇందులకు వానికేను నిక్క ముగఁ గృతజ్ఞురాలను. అని వచించుచున్న పుత్రిక పలుకుల కలరుచు నా సర్పవంశ ప్రదీపరుఁడు నిజవృత్తాంత మెరిగించి పిదప నామెను దీసికొని నిజనివాసమునకుఁబోయి యెల్లరకు నానందమును గలిగించెను. దివోదాస పార్దివేంద్రా ! అనంగమోహిని నాఁటనుండియును బితృగృహ మున నుండెను. ఆమత్తకాశిని చిత్తంబు భవదాయత్తమై యుండుటచేత నాహార విహా రముల నయిష్టము సూపుచుఁ గృశించుచుండెను. ఆ సాధ్వీలలామకు నీవతి శీఘ్రమునఁ గనంబడకున్న నామె యాపదలపాలగుట నిక్కము. నీ వనుమతించిన నేనిప్పుడే నాగ లోకమునకేగి వాసుకితో నీయుదంతం బెరింగించి తగినట్లొనరించెదనని పలుకుచున్న రత్నచూడునితో నమ్మహారాజిట్లనియె.

దివోదాసునికథ

మిత్రమా ! నీయుపకారబుద్ధి కేనెంతయును సంతసించుచుంటిని. శబర బాలకుండు సజీవుఁడై నా సమీపమున నుండుటచే నేనింక నరణ్యములం దిరుగఁబని లేదు. నే నొనర్చిన ప్రతిజ్ఞ వడువున వీనిని దోడ్కొనిపోయి యాప్తుల కప్పగించి తిరుగ వారణాసికరిగి రాజ్యరమాలలామం జేపట్టుట యొప్పిదంబగును. అనంగ మోహిని నిమిత్తమున నాగులకెల్లరకు నేఁటినుండియును భూలోక ప్రవేశమున కనుమతి యొసంగుచున్నవాఁడను. కావున నీవతిరయమున నాగలోకమునకేగి నా యాదేశము వాసుకి ప్రముఖ రసాతలవాసులకెల్ల నెరెంగించి రమ్ము, అనంగమోహినికి నాక్షేమం బెరింగించి యామె యభిమతము గూడఁ దెలిసికొనిరమ్ము. ఇదియే నాకు నీవొనరింపం దగిన యుపకారమని పలుకుటయును రత్నచూడుఁ డందులకుఁ సమ్మతించి యప్పుడే నిజస్వరూపము ధరించి చేరువనున్న భూనివశంబులో దూరి మాయమయ్యెను. అందుల కందున్న వారెల్ల నబ్బురమందుచున్న సమయమున దేవకాంతలు నల్వురును నచ్చటి కేతెంచి యందున్న దివోదాసుని గాంచి మించిన యానందమున వాని సన్నిధిఁజేరి వాని యెడబాటువలన దమకు గలిగిన పరితాపంబెల్ల దెలుపసాగిరి. ఆ కాంతామణుల విడచి తానరిగిన పిమ్మట జరగిన వృత్తాంత మెల్ల దెలుపుచు వారి నుచితిరీతి నా రాజేం ద్రుం డాదరించెను. పిమ్మట నరిందము నీక్షించి యమ్మేదినీ వల్లంభుం డిట్లనియె.

మిత్రమా ! తుంబురు శాపంబు మూలమున నీ యప్సరో భామినులకు స్వర్గలోక ప్రవేశార్హ త లేకపోయినది. ఇయ్యది వీరలకెట్లున్నను నాకుఁ బ్రమోదావహం బయ్యెను. వీరిందోడ్కొని యిఁక వారణాశికిం బోవుట యుచితముగదా ? ఈ శబర బాలకుని గూడ మనము తీసికొనిపోయి వీనియాప్తుల నచటికే పిలిపించి నారి కప్పగిం చుట సమంజసమగును మనమెల్లరము నీక్షణమే యిచ్చటినుండి కాశికిం బోవుటకుఁ దగువెరవరయవలయునని పలుకుటయును నరిందముండు మందహాస మొనరించుచు నిట్లనియె.

రాజేంద్రా ! నేను యక్షలోకము నుండి తెచ్చిన దివ్యయానంబీ చేరువఁగల నుపవనముననే యుండెనుగదా ! దాని నధిష్టించి మనమందర మశ్రమంబున వార ణాశికిం బోవచ్చునని పలుకుచు నప్పుడే యతండు దివోదాసుని యనుమతమున నద్దివ్య యానంబునకై పోయి ముహూర్త మాత్రముననే దానిఁగొనివచ్చి వారి యెదుటనుంచెను. రాజేంద్రుండందుల కెంతయును సంతసించుచు నా శాంభవీదేవి గర్భాలయమునకు దేవకాంతలతోఁ గ్రమ్మరనేగి యమ్మహాదేవి దివ్యదర్శనం బొనరించివచ్చి యావిమాన మెక్కి తక్కినవారితోఁ గూడ వారణాశికింబోవ నందుండి కదలెను.

అరిందమునకుగల విమానమును నడపునేర్పుచేతనో దివోధాసధారుణీంద్రుని మనోబలము మూలంబుననో కాశీనగరవాసు లారాజమార్తాండు డతిత్వరితముగ నేతెంచ వలయునని యెదురు చూచుచున్న విశేషము వలననో దివోదాస రాజకంఠీరవుండెక్కి యున్న దివ్యయానము దృటిలో గాశీపురము జేరెను. దివోదాసుని యనుమతమున నవ్విమానమును దిన్నగా రాజమందిరములోనికి దీసికొనిపోయి యరిందము డందొక యుచితప్రదేశమున నా పెను. అందుండి దివోదాసుండు దిగిన తోడనే మంత్రిసామంత హితపురోహిత భృత్యవర్గంబెల్ల బరుగుపరుగున వానిసన్నిధి కేతించి మించిన యానం దమున రాజోచిత సత్కారముల గౌరవించిరి. ఆ రాజేంద్రుండు దేవకాంతల నంత ర్గృహమున కనిపి తనవెంట శబర బాలకుని దీసికొని యరిందమునితో బేరోలగమున కేగి యందు గొల్వుదీర్చి నిజకధాశ్రవణ కుతూహలులై యున్న సమస్త బంధుమిత్రుల కెల్ల నుల్లములు బల్లవించు విధమున దనవృత్తాంత మంతయు నుపన్యసించెను.

దివోదాసునిరాక రాకయుంబోలె సమస్త హితపురోహితామాత్య భ‌ త్య చకోర సంచయమునకెల్ల నాడమందానందం బొనగూర్చెను. పౌరులెల్లరును దమ యేలిక క్షేమముగ దిరుగ రాజధాని జేర గల్గుటకు సంతసించి యానాడు గొప్పపండుగ దినముగా బరిగణించుకొనిరి.

పిమ్మట దివోదాసుండు తొ ల్తింటి శబరులరావించి వారికి జరిగిన వృత్తాంత మెల్ల సంక్షేపముగా నెఱింగించి శబరబాలకుని జూపుచు ఇడుగో సర్పదష్టుడై మర ణించిన మీ బాలకుడు ! మానవదుర్లభంబగు దివ్యలోకమున కరిగి తిరిగి యిందు వచ్చి యున్నాడని పలుకుచు వారి కప్పగించెను. ఆ శబరబాలకని సన్నిధినున్న మందసము నిండ ధనము బోయించి దానితో సుఖంబున గాలక్షేపముసేయుమని పలుకుచు నా రాజేంద్రుడు వాని కొసంగెను. అందున్న వా రెల్లరును వాని యుపకారబుద్ధి ననేక విధముల బ్రస్తుతింప దొడంగిరి. శబరు లెల్లరును ఱేని యనుమతము వడసి శబరబాల కుని దోడ్కొని‌ నిజ నివాసము కరిగిరి.

తదనంతరము గొన్ని దినముల కొకపరివ్రావాజకుం డా రాజచంద్రుని సన్నిధి కేతెంచి మందహాస భాసురవదన సరోజుండగుచు నొకయుత్తరము నిజోత్త రీయమునుండి పైకిదీసి వాని కందిచ్చెను. దివోదాసుడు ససంభ్రమముగా నా లేఖ విప్పి యిట్లని చదువసాగెను.


సీ. శ్రీమన్మహారాజ సేవితపాదప
            ద్మునకు దివోదాసభూమిపతికి
    వాసుకియను నాగవంశోత్తముఁడు వ్రాయు
            వినయపూర్వకమైన వినతిపత్ర
    మిది మానవేంద్ర ! మీవృత్తాంతమంతయు
            రత్నచూడుండు సర్వంబు మాకు
    జెప్పఁగావిని సంతసించితి మెంతయు
            నాగులకిపుడీ వొనర్చినట్టి

గీ. గౌరవంబునకెల్ల నిక్కంబుగాఁ గృ
   తజ్ఞులము మేము దీనికెంతయును బ్రతిగ
   నీయనెంచితిఁ బత్నిగా నాయనంగ
   మోహినీపుత్రికను నీకు భూపవర్య.

చ. నినువిడనాడుటే మొదలు నిత్యము డెందమునన్‌ గృశించుచుం
    డెను నిముసంబదేయుగము రేవనుబుచ్చుచు నాయనంగమో
    హిని హితమెంచి నీవిచటికేడ్తెరవచ్చి పరిగ్రహింపు మో
    యనఘ! విలంబమింకఁ దగదయ్య ! వచింపఁగ నేలఁబెక్కిటన్‌.

శా. ఈలేఖంగొనివచ్చినట్టి యతఁడేయిందందు ముఖ్యుండగున్‌
     వాలాయంబుగమిమ్ము నాగభువనప్రాంతమునన్‌ జేర్పఁగా
     వీలౌమార్గము జూపగాఁగలఁడు సంప్రీతిన్ హితామాత్యభృ
     త్యాళిన్‌ దోడ్కొనితర్లి రాఁదగును నుద్వాహార్థమై వేగమే.

ఇట్లు,

భవదీయశ్రేయోభిలాషి,

వాసుకి.

అనియున్న యుత్తరమును మాటిమాటికిఁ జదువుచు దానిం దెచ్చిన వాని మొగంబుపైఁ జూడ్కులు బరగించుచు గించిచ్చి తాస్వభాస్వరుండై తలపంకించుచు దివోదాసుండు వానితో నిట్లనియె.


మ. తెలిసెన్ బో ! యిఁకదాపనేమిటికి నీతీరిందునాముందు ని
     ర్మలచిత్తుండగు రత్నచూడుఁడు మహాప్రాజ్ఞుండు విజ్ఞుండు నా
     చెలికాఁడొక్కఁడుదక్క నాకిరులవాసిన్‌ మేలుగూర్పంగ న
     న్యులు సంసిద్దులుకాఁగలరె? నిజమోహో ! నాకుఁగన్పట్టెడిన్.

అని యా పరివ్రాజిక వేషధారియైన రత్నచూడుని దెలిసికొని వానిననేక విధంబుల నభినుతించెను. రత్నచూడుఁడును బూర్వపురూపంబు వహించి యా రాజేంద్రుని ముందు నిలువంబడి మహాప్రభావసంపన్నుఁడవగు నీయెదుర నామాయా వేషములు బనికివచ్చునా యని మందహాస మొనరించుచు వచించెసు. పిమ్మట దివో దాసునితోఁ దన పాతాళలోక యాత్రావృత్తాంత మెల్ల వర్ణించి యనంగమోహిని క్షేమమెరింగించి వానిమనంబున కానందంబొనగూర్చెను. పిమ్మట గార్తాంతికు లెరిం గించిన శుభముహూర్తంబున రత్నచూడుఁడు మార్గదర్శకుఁడై ముందునడువ కతిపయ పరివారసమేతముగా రసాతలంబునకేగి మహావైభవంబున ననంగమోహినిం బరిణయ మయ్యెను. ఆ వివాహామునకు సప్తపాతాళలోకములంగల బెద్దలందఱు నరుదెంచి వధూ వరుల నాశీర్వదించిరి. పిమ్మట నమ్మహారాజు రసాతలమున ననంగమోహినితో నిష్టోప భోగముల ననుభవించుచు గొంతకాలముండి యనంతరము నిజలోకమున కరుగుటకు వాసుకి యనుమతము వడసి యనంగమోహినిం దోడ్కొని యఖండ వైభవమున వారణాశి కేతెంచెను.

ఆ సమయమునకే యక్షలోకమునుండి మణిగ్రీవ జలంధరులు గుణవతిం దోడ్కొని దివ్వయానమున గాశీనగరమున కేతెంచి తమ రాక ఱేనికెరింగించిరి. అమ్మహా రాజ మందానందకందళిత హృదయారవిందుడై యనంగ మోహిని కాయుదంతబెరిం గించియప్పుడే వారి నెల్లర రప్పించి గుణవతిని నంతఃపురమునకు బంపి మణిగ్రీవజలం ధరుల బెద్దగా గౌరవించెను. అనంగమోహినిని బట్టమహిషిగా స్వీకరించి యమ్మహా రాజు గుణవతింద్వితీయ గాంధర్వవిధిం బరిగ్రహించెను. పిమ్మట దేవకాంతలను గూడ గరిష్టభార్యలుగ గైకొనెను. హిమశైలంబున శాంభవీదేవి యాలయమందున్న రత్న రాసులకును హేమసౌధమునందలి మహాభాగ్యమునకు దివోదాసుడే నాయకుడై యఖండ వైభవములనుభవింపుచుండెను. ఆ రాజశేఖరుని యనుమతమున మణిగ్రీవ జలంధరులు గొన్ని దినములందేయుండి పిమ్మట నిజనివాసమున కరిగిరి. అరిందముండు దివో దాసుని విడచి నిజలోకమునకరుగలేక భూలోకముననే యుండి యా రాజేంద్రుని యాంతరంగిక సచివుడై యొప్పియుండెను. దివోదాసుని కనంగమోహినియందు సమ రంజయుండను పుత్రరత్నము దొలిచూలు తనయుడై జన్మించెను. మరియు ననేక పుత్రపుత్రికా సంచయం బారాజేంద్రునకు దక్కిన కళత్రముల యందును గలిగెను.

పిమ్మట దివోదాసుడు నిర్ద్వంద్వ నిరవగ్రహ నిస్సపత్నంబుగా ధరణీ రాజ్యంబు బెద్దకాలంబు పరిపాలించెను.

319 వ మజిలీ

అట్లు సిరితో సంతతితో దివోదాసుండు వారణాశీపురమున బెద్దకాలము నివసించియుండి పుడమిని ప్రజానురంజకుడై పరిపాలింపుచుండెను. కాని‌ దేవత లప్పుటభేదనంబు జొచ్చుటకు మాత్ర మతడంగీకరించి యుండలేదు. కాశీవియోగ వేదనా దోదూయమానమానసులై వేల్పులు శచీకళత్రుం బురస్కరించుకొని యొక నాడు బృహస్పతి చెంతకరిగి తమ మనోవ్యధ తెరంగెరింగించి యద్ధివోదాసునకు రాజ్య పదభ్రంశనం బెవ్విధమున నగునో యానతిమ్మని వానిని గోరుకొనిరి.

అప్పుడా వాచస్పతి మందస్మిత సుందరవదనారవిందుడగుచు వారికిట్లనియె. బృందారక బృందంబులారా ! ఇందులకై మీరింత యలజడిం బొంద నేమనం‌గలను. మానవులు దివిజుల యాశ్రమము లేక గడియయైన మనఁగలరా ? అగ్ని దేవుని యాధా రము లేకున్న వారెట్లు భోజనపదార్థముల బచనము జేసికొనగలరు ? గాలి లేకున్న వారికెట్లూపిరాడగలదు. వరుణదేవుని యనుగ్రహమునగాదే భూమిపై వారికి జీవనము నిలుచుట గలుగుచున్నది ?


గ. అగ్నిమనలోన నొక్కరుడౌ నొకాఁడొఁ
   చేయ డే వాయుదేవుండు జెప్పిసట్లు
   వరుణుఁడెవ్వరివాడు ! మువ్వురునులేక
   నిముసమోర్తురె మర్త్యులు నిశ్చయముగ.

వరుణానిలాగ్నులు దమతమ శక్తులుపసంహరించి రేని పుడమిపై బిఠర పాకంబు సాగదు. దానంజేసి యోదనంబు పరిపక్వంబు గానేరదు. వైశ్వదేవ బలి హరణాది సత్క్రియాకలాపము లక్కారణమున గుంఠితములగును. హవ్యకవ్య క్రియాశూన్యులైన బ్రాహ్మణులు రాజునందు విరక్తులగుదురు. తక్కిన వర్ణముల వారును బ్రాహ్మణుల ననుసరింప గలరు. ప్రజానురంజనంబునంగదా రాజు రాజ్యము