కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/316వ మజిలీ

యపుడు గాలఁదన్నుకొనిపోయిన భాగ్యలక్ష్మి నేఁడు గ్రమ్మర మనవశమైనది. ఇపు డైనను మనము దీనిని జాగ్రత్తగాఁ గాపాడుకొనవలయును. అని వచించుచు నుద్యాన మందిరమున జరిగిన వృత్తాంతమంతయును వాని కెఱింగించి యీమెకుఁ దెలివిగలుగు లోపల నొకవివిక్త ప్రదేశంబునకుఁ జేర్పఁదగును గావున నతిశీఘ్రముగ విమానమును గొనిరమ్మని వానినంపెను. జలంధరుండును విస్మయస౦తోషాశ్చర్యములతో సత్వరమె యొక దివ్యయానమును విమానశాలనుండి కొనితెచ్చి మణిగ్రీవునను సంతోషమును గలుగఁజేసెను.

పిమ్మట నొడలెరుంగక పడియున్న యాసన్నుతాంగిని విమానము పైఁ బెట్టుకొని వారిరువురును భూలోకమునకుఁ బోయి యందు జనసంచారానర్హంబగు శీత నగాగ్రమున నొక సుందరకందరాంతరమునఁ బ్రవేశించిరి. యక్షలోకమున గుణవతి కిని నామె చెలికత్తెలకును మణిగ్రీవుం డరిగిన కొంతసేపటికి తెలివి వచ్చినది. అనంగ మోహినిని దన సోదరుండు బలాత్కారముగాఁ గొనిపోవుటకు గుణవతి మిగుల విచా రించెను. ఈ యుదంతము నితరులతోఁ జెప్పినఁ దనగుట్టు బట్టబయలగునేమోయను భీతిచేత దొంగఁ దేల్గుట్టిన చందమున నెవరికిని దెలియనీయక నిజనివాసమునకేగి లోలోన గుందుచుండెను.

316 వ మజిలీ

య౦త్రబిలముకథ

దివోదాసుండు గుప్తసోపాన మార్గమునంబడి కొంత దూరమరుగునప్పటి కంతకుముందందుగల చీఁకటి క్రమక్రమముగా నంతరించుచు నత్యద్భుతమగు తేజో రాశి గోచరమయ్యెను. ఆ యనఘుఁడు దానున్న దొక విశాల బిలాణ్విమని గ్రహించి దాని యంతమెఱింగి యందలి వింతలఁ దెలిసికొనఁ దలంపు మిగుల నతిసాహసమున ముందునకుఁ బోవుచుండెను. ఆ బిలమున కిరుప్రక్కల నచ్చట నుండియే యనర్ఘ రత్నములు స్థాపింపబడియుండుటచేఁ బట్టపగలువలె నా ప్రదేశమంతయును దేదీప్య మానముగ వెలుఁగుచుండెను. అట్లతడు కొంతదూర మరుగునప్పటికి ముందబ్బిల మార్గమున కడ్డముగానున్న యినుపబోనును బోలు యంత్రమునం దొకవ్యక్తి చిక్కు కొని కష్టపడుచుండుట కనంబడెను. ఆ దృశ్యమున కతండద్భుతమందుచు నతిజ వంబున నా యంత్రమును సమీపించెను. కోరలవలె నినుప నారసము లనేకముగాఁ బైనుండియుఁ గ్రిందనుండియు నా వ్యక్తిని గట్తిగా నొక్కి వేసెను. వాని సందునంబడి యావ్యక్తి కొట్టుకొనుచు బాధచే బిట్టమూల్గుచుండెను. అ ధ్వని యా బిలమంతయును మారుఁమ్రోగుచుండెను అందుఁ జిక్కుకొనియున్న యాదై వోపహతుం డెవ్వఁడో తెలిసికొనుటకు వాని యుత్తమాంగ మా యంత్రమున నావలవై పుగా నదుమఁ బడి యుండుటచే వీలుగలిగినదికాదు. ఆ యిపనారసము లన్నియును వాని దేహమున నట్లు తీవ్రముగ నాటుకొనియున్నను నొక రక్తబిందువైనను గ్రిందఁ బడుటలేదు. అందు బడిన నే జీవియైనను నిమిషములో బ్రాణములఁ బాయవలసినదేగాని యా వ్యక్తి కేమి కారణముననో చైతన్యము దప్పలేదు.

దివోదాసుండు వాని నా యంత్రమునుండి తప్పింపవలయునని యెంత ప్రయత్నించినను సాధ్యపడలేదు. చేతులతో బలముగా నా నారసములఁ బైకెత్తఁ జూచెను. అడుగుననున్న వానిని క్రిందకుఁ ద్రోయ నుంకించెను. పాదములతోఁ దన్ని పట్టి గట్టిగా యీవలకు లాగఁదొడంగెను. ఇట్లెన్ని యుపాయములఁ బ్రయోగించినను నన్నియును వ్యర్థమయ్యెను. ఆ నారసము లించుకయును జలింపలేదు. ఏమిచేయుటకుఁ దోచక యా రాజేంద్రుం డచ్చట చతికిలంబడి యొకింత తడవేమి చేయుటకుఁ దోచ కుండెను.

పిమ్మట నెద్దియో స్మరణకు వచ్చినట్లు తటాలున లేచి యా ప్రాంతముల నతిశ్రద్దగా వెదుకసాగెను‌. ఆ యంత్రము మార్గమంతయును నాక్రమించియుండుటచే దానిని దాటుట కుపాయము దోచుటలేదు నారసముల సందులనుండి మణిదీపికల వలన నా బిల మింకను జాలాదూరము వ్యాపించియున్నట్లు స్పష్టపడుచుండుటచే నెట్లయి నను నా యడ్డమును దాటి ముందుండు వింతలఁ జూడవలయునని వాని కుత్సాహ మధికమగుచుండెను. అంతకుముందు దాటివచ్చిస ద్వారము వలెనే యీ యంత్రమును గూడ నెద్దియైన మీటచే నమరింపఁబడి యున్నదేమో యని యా భూపాలుండు మిగుల నోపికతో నందందు విమర్శింపఁ దొడంగెను. ఆ బిలము చుట్టునుగల కుడ్యము లతి స్నిగ్దములై యుండుటచేఁ జేతులతో నెంత తడవిచూచినను, నెచ్చట నొక్కినను వాని కట్టిసాధనమేమియును దొరకలేదు చివరకందు దీపమువలె వెలుఁగుచున్న రత్నముల నొకటొకటిగఁ గదలింపసాగెను. అందొక రత్నమించుక చలించినట్లు తోచి దానిని గట్టిగ నొక్కెను. తోడనే యా యంత్ర సమీపమునఁ జిన్నతలుపు తెరచుకొనుటచే మార్గమేర్పడెను.

దాని కతండచ్చెరువందుచు నా ద్వారమువెంట రెండవప్రక్కకుఁబోయి యా యంత్రమున నున్న వ్యక్తిని దప్పించవచ్చునేమో చూచెదంగాక యని యందుఁ బ్రవే శించెను‌ తోడనే యా గుప్తమార్గము మూతపడెను. ముందుఁ బోయిచూడ వానికా యంత్రముగాని యందున్న వ్యక్తిగాని కనుపించలేదు. బిలమార్గము దిన్నఁగా మణి ప్రదీపులచే విస్పష్టముగఁ దెలియఁబడుచుండెను. ఆ మార్గమున నతివేగముగా నడచు చుండఁ జివురకొక విశాల రమణీయ ప్రదేశంబునకు జేరుకొనెను. పిదప నతండు వెనుకకుఁ దిరిగిచూడ దా నింతకుఁ జనుదెంచిన బిలమార్గ మెందున్నదో యించుకయును గుర్తు తెలియలేదు. నలుమూలలయందును మిగుల నున్నతములగు పర్వతపంక్తులు నందందుఁగల వృక్షశ్రేణులును మాత్రము గోచరమగుచుండెను.


హేమసౌధముకథ

దివోదాసుండు విస్మయముతో ముందు గొంత దూరమరుగ నచ్చట నొక నిర్మల సరోవరంబు తీరంబున నున్న హేమసౌధంబొండు వానికి నేత్రపర్వ మొన ర్చెను. అతిజవంబున నడచుచు నా పుడమి యొడయండు దృటిలో దానిని సమీ పించెను. ఆ సుందరహర్మ్యము నిర్మల ధర్మమయమై యనర్ఘ రత్నఖచిత ప్రదేశ ప్రదీ ప్తమై యనేక యున్న తాంకరవిరాజితమై యత్యంత శోభాయమానమై యలరారు చుండెను. అట్టి సౌధాభ్యంతరంబున నేమివింతలు గలవో లోనికేగి చూచుటకు గుతూ హలపడుచు రాజేంద్రుం డా సౌథ ద్వార ప్రదేశమున కేతెంచెను. ఆ ద్వారము ఇనుప తలుపులతో లెస్సగా బిగింపబడియున్నది. దానిముందు భయంకర రూపంబుల నొప్పు చున్న రెండు సింహము లభిముఖముగా నిలువంబడియుండ యొక దానిమీద నింకొ కటి దుముక నుంకించుచున్నట్లు గనుపించుచుండెను.

వానిం జూచినతోడనే దివోదానున కించుక వెరపు గలిగెను. కాని యంతలో ధైర్యము దెచ్చుకొని మొలనున్న కటారి నొఱలోనుండి యూడఁబెరికి బాహుబలం బూతగా నా హర్యక్షముల తలలు వరుసగ నరికివేసెను. తోడనే సంవర్త సమయ సముద్భూత ప్రచండ వాతో ద్దూత జీమూతవ్రాత సమ్మేళనోద్దికానూన గర్జా సదృక్షంబగు మహాధ్వానంబు వెడలి దిక్కులఁ బిక్కటిల్లజేసెను. ఆ భయంకర నిస్వ నంబునకు దద్దరిల్లుచు రాజేంద్రుఁడు గ‌నులు మూసి తెరచునప్పటి కా మృగముల యంగములన్నియును విడిపోయి యున్నవి. సౌధద్వారము వివృతమగుటచే లోపల నుండి కనులకు మిరుమిట్లు గొల్పు తేజఃపుంజ మేతెంచి బయలాక్రమించియుండెను. తా నిదివఱకుఁ దలలు నరికినవి కృత్రిమ పంచాస్యములని తెలిసికొని యా భూమీంద్రుం డద్భుతమందుచు నవి యీ సౌధద్వారము దెరచుట కేర్పరుపఁ బడిన సాధనము లని గ్రహించెను. జీవకళతో నొప్పియుండుట నట్లా మృగముల నిర్మించినవాని పనితన మును బెద్దగా నగ్గించెను.

అట్లు వివృతమైయున్న ద్వారమున నా సౌధములోనికి దివోదాసుండు ప్రవేశించుటే తడవుగ నా ద్వారకవాటము బెద్ధధ్వనితోఁ దిరుగ మూసికొనిపోయెను. హర్యక్షములును దమతమ స్థానములందు బూర్వపురీతిని నిలువఁబడి యుండెను. ఆ సౌధమున మొదటి యంతస్తునందు బది విశాలములగు గదులు గలవు. అవి యన్ని యును దలుపులు దెరువబడియే యున్నవి. అందు దొమ్మిది గదులయందు దివ్య మాణిక్యములు రాసులుగా నుండెను. పదియవ గదిలో మీదియంతస్తునకు బోవుటకు సోపానము లమర్పబడియున్నవి. దివోదాసుడా మెట్ల వెంబడిని పైభాగమునకు బోయెను. అందుగూడ బదిగదులే గలవు. తొమ్మిది గదులనిండ నవర్ఘరత్నములుండి తక్కినదానలో మెట్లుండెను. ఆ రత్నరాసులంజూచి యా రాజమార్తాండుడు నివ్వెరం బడుచు మూడవ యంతస్తునకేగెను. అందు ముందు మిగుల విశాలమగు ముంగిలి యును దాని కిరుప్రక్కల రెండేసి గదులును గలవు. ఆ ముంగిలియంతకును జిత్ర చిత్రవర్ణములుగల రత్నకంబళ మొకటి పరవబడి యున్నది. గదులయం దాణిముత్తె ముల ప్రోవులుండెను. ఆ సౌధంబున కింకను రెండంతస్తులు గలవు గాని యందు బోవు టకు సోపానములు గోచరించుటలేదు. వానియందుగల వింతలగూడ జూడవలయునసు నుత్సాహముతో నా రాజేంద్రుడందు బోవుటకు వెరవాలోచించుచుండెను. నలుమూలలు బరికించి యందొక వైపున గోడలో నమరింపబడియున్న తలుపును గనిపెట్టగలిగెను. దానికీవల జిన్నబీగము‌ వేయబడియున్నది. అది బిగించటయు నూడదీయుటయును గూడ నక్షరసాంకేతికమునుబట్టి యేర్పడియుండుటచేత దాని దీయు విధము నెరుంగ నతండించుక యోజింపవలసివచ్చెను ఆ బీగమునం దక్షరములతో నున్న చక్రములు నాలు గమరింపబడియుండి‌ చేతితో ద్రిప్పిన నటునిటు దిరుగాడుచుండెను. ఆ యక్షర ములతో నెద్దియో యొక సాంకేతికపదమును గూర్చినగాని యా తాళమూడిరాదని యతడు గ్రహించి యట్టిపద మెద్దియగునో యని యూహించుకొనుచు నా యక్షర ముల బరిశీలింపుచుండెను. వానిలో “దృష్ట" అను ద్విత్వాక్షరములు వరుసగదులం దుండుట జూచి దైవికముగా వానికి, “అదృష్టము” అను పదము స్ఫురించెను. అట్లు నాలుగరల యక్షరములను గూర్చి బీగమును లాగగా నది యూడివచ్చెను. బీగ మూడుట కేర్పరచిన సాంకేతికపదము దన కప్పుడు స్ఫురించినందులకు డెందమున నానందమందుచు నా రాజచంద్రుడు కవాటమును దెరచి చూచెను.

అందు సోపాన మార్గము గోచరించెను. వెంటనే పై యంతస్తున కతఁడవ లీల బోగలిగెను. ఆ నాల్గవ యంతరువున జూడ దగినవింత లేమియును గనంబడ లేదు. పైభాగమునకు బోవుటకు సోపానములును లేవు. కాని యొక గోడమూల బిగించి యున్నత పీఠమున శక్తివిగ్రహమొకటి ప్రతిష్టింపబడియున్నది. ఆ విగ్రహ మట్లు మూలనుండుటకు శంకించుచు దాని సన్నిధికేగి విమర్శించి యదియు నొక యంత్ర విశేషమేయని గ్రహించెను. దాని కీలెరుంగుట కతడెంత బ్రయత్నించినను వ్యర్ధమయ్యెను. ఆ విగ్రహమున కెదురుగా నిర్విణ్ణడై యతఁడు జదికిలంబడి ఱెప్ప వేయకుండ దానిని జూచుచుండెను. ఆ యమ్మవారి కంఠభాగమున నెద్దియో గీలమరి యున్నట్లు తోచుటంజేసి యాతండు త్వరితగతి లేచి తత్కంఠమును రెండు చేతు లతో నొక్కి పెట్టెను. తోడనే యా విగ్రహము నోరు వివృతమై సొరంగమేర్పడెను. ఆ యవకాశమున జేయి లోనికి బోనిచ్చి పరీక్షింపనందు జిన్న చక్రము జేతికి దగి లెను. దానిని ద్రిప్పగా నచ్చటి కుడ్యభాగము రెండుమూరలు వెడల్పున బై కెగసి పోయెను. అచ్చట నొక యినుప నిచ్చెన క్రిందికి వ్రేలాడుచు గనంబడెను. అదియే మీది యంతస్తునకు బోవ సాధనమని గ్రహించి దానినెక్కి యా భూపతి యైదవ యంతస్తునకు జేరుకొనెను. అతడు మెట్లపై కెక్కుచుండగా మీదినుండి కుడ్యభాగము దిగజారుచు గ్రమంబున నా మార్గమును బూర్వపురీతిని గప్పివేసెను.

ఆ సౌధమున నమరింపఁబడియున్న యంత్రముల శిల్పినైపుణ్యమున కతఁ డబ్బురపడుచు నా తుదియంతస్తునం దింక నేమైన వింత లుండవచ్చునని తలంచుచు మిగుల శ్రద్దగా విమర్శింపుచుండెను. అందుఁ బ్రాంగణమునందలి కుడ్యములన్నియును నున్నతములగు దర్పణములచే నలంకరింపఁబడి యుండుటచేఁ దన ప్రతిబింబము నా యద్దములయం దన్ని వైపులను జూచి యచ్చట నితరు లెవ్వరో యుండిరని మొదట భ్రమపడి కొంత సేపటికిఁ దన ప్రమాదమును దెలిసికొని నిర్భయముగ నందుఁ దిరుగు చుండెను. అందొక గదియందు స్పటికశిలావికల్పితమగు గోడమీఁద సువర్ణాక్షరములు మణిదీపికలచేత మిగులఁ బ్రకాశించుచుండెను. వానింజదువ నిట్లున్నది.


చ. పుడమిని గాంచనాఖ్య హిమభూధర సచ్చికరంబునుండి యే
    ర్పడిన బిలంబు మార్గమున వచ్చి యిటన్‌ గలరత్నసంతతుల్
    వడిఁ గొనిపోయి శాంభవిని భక్తిదలిర్పఁగఁ బూజసేయువాఁ
    డెడపక యక్షుఁడొక్కఁడితఁడే బిలకర్తయు సౌధభర్తయున్‌.

ఉ. ఇట్టియనర్ఘరత్నముల నెక్కడనుండి గ్రహించి తెచ్చి యి
    ప్పట్టునఁ జేర్చి యక్షుఁడు ధృవంబగు భాగ్యమునెట్లు పొందెనో
    గుట్టెరుఁగంగ గోరుటదికూడిదు గావున నారహస్య మి
    ట్టిట్టిదటంచుఁ దెల్పఁబనియంతయు లేదుగదా తలంపఁగన్‌.

గీ. తివిరియక్షుండు శాంభవీ దేవి నచటఁ
    దేజమలరంగ రత్నాలఁ బూజసేసి
    యిష్టకామ్యంబులను బొంది యేగె నైజ
    లోకమునకు సంమోదాతిరేకుఁ డగుచు.

మ. నిజజన్మస్థలమందుఁ బ్రేమమిగులన్‌ నిర్ణద్రతేజుండు య
     క్షుజుఁ డట్లేగుచు నిందుగాంచిన మహైశ్వర్యంబుగొంపోక యి
     ట్లజుఁడై నన్‌ గనలేని చోట నిట మాద్య ద్రీతి రక్షింప న
     క్కజమౌయంత్రములెన్నియేని నతఁడే గల్పించెఁ బొల్పొప్పగన్‌.

శా. ఈయంత్రంబులఁ జిక్కికిందుఁగల గుట్టెల్లన్‌ మహాభాగ్య ప
    ర్యాయంబొప్పఁగ నెవ్వడే నెఱుఁగునో యాపుణ్యుఁడే దీనికిన్‌


    న్యాయంబైన ప్రభుండు గాఁగలఁ డిఁకన్‌ యక్షప్రవీరుండు నా
    త్మీయస్వామ్యము దీయందు విడచున్‌ మేలెంచిముమ్మాటికిన్‌.

క. పాయక బిలమధ్యంబున
   వాయసమై యెసఁగు బోను నద్భుతరీతిన్‌
   దీయఁగఁ దగు సాధనమును
   నీయైదవ యంతరువుననే తెలియఁదగున్.

ఉ. ఇక్కడనే సొరంగమునకేగఁగ దగ్గరదారి యుండె నిం
    కెక్కడనుండి బోనుదరికేగిన దానిని బుచ్చుసాధనం
    బొక్కటియున్‌ లభింపదు మహో త్తమ పూరుషుఁడెవ్వఁడేని యీ
    చక్కనిఁగీలెఱింగిన భృశంబు శుభంబు లతండు బొందెడిన్‌.

మ. బిలమార్గంబున వచ్చియున్న యతఁడే బ్రీతిన్‌ విలోకింపఁగాఁ
     గలఁధీసౌధము నన్నుఁడెవ్వనికి నెక్కాలంబునన్‌ గాని యీ
     విలసన్మందిరభాగ మేమియును బృద్వి న్గానఁగారాదు క
     న్నుల కీదేశము సాంద్ర కాననగతి న్జూపట్టు నెప్పట్టునన్‌.

అనియున్న లిపిని బలుమారు చదువుకొని యంతరంగమున నుప్పొంగుచు నాధాత్రీ బిడౌజుండు బిలమార్గంబునఁ గల యినుపబోనును దర్శించు సాధనము నెరుంగుటకై యందు విమర్శింపఁ దొడంగెను. కాని వాని కేమియును‌ గనంబడలేదు. బిలమును చేరుట కందుండికలదన్న చేరువదారి నైనఁ గాంచవచ్చునేమో యని దాని కొఱకు వెదకెను.

అందింకొక గదియందు సుందరమగు బల్లయొకటి యమరింపఁ బడి యున్నది. దానిమీద విల్లును, నంబుల పొదియును గలవు ఆ గది యందే యొకమూల గోడనంటి కృతిమ పతత్రి గోచరించుచుండెను. ఆగోడమీఁద నిట్లు వ్రాయఁబడి యున్నది.


చ. ఇటఁగల వింట నారి నమరించి యుదంచ దిషుప్రయోగ సం
    ఘటనముచేతఁ గట్టెదుటఁ గన్పడు గృత్రిమ పక్షిశీర్షమున్‌
    దటుకునఁ ద్రెళ్ళనేసినఁ గనంబడు బెన్వివరంబు బోనుఁ జే
    రుట కదెమార్గ మచ్చట నెరుంగఁగవచ్చును మీదికృత్యమున్‌.

అనియున్న లిపిఁ బఠించి యందుబల్ల పైఁ గల కోదండంబుగ్రహించి గుణంబు సారించి మార్గణంబు దొడిగి యా మాయావిహాయసంబు శిరంబు గురిఁ జూచి యేసెను. తోడనే యా యంత్రవికిరంబు తలదెగి క్రిందపడెను. సమీపమున నున్న గోడబారెడు వెడల్పునఁ గ్రిందకుజారుట గమకించి యందేగి చూడ విశాలమగు సొరంగము జూపట్టెను. దిగుటకు సోపానము లేర్పడి యుండుటచే యా రాజోత్తముండు బటురయంబున నందుండి క్రిందకు నడచెను. ఆ సొరంగము మేడగోడలోనే యత్యద్భు తముగ నేర్పరింపఁ బడియున్నది. దాని వెంబడిఁ గ్రిందకుఁ దిగి ముందుఁ బరికింప మణిదీపికలచేఁ బ్రకాశించు బిలమార్గము జూపట్టెను. దానిం బ్రవేశించి కొలఁది దూర మరుగు వఱకే వెనుకఁ దాఁజూచిన యినుపబోను జేరఁగలిగెను. అందుఁ జిక్కుకొని యున్న దురదృష్టపు వ్యక్తి యట్లే యుండెను. కాని యిప్పుడు మూల్గుట మాత్రము మానివేసెను. ఆ వ్యక్తి యుత్తమాంగము దనవైపుగనే యుండెను గాని యది యధో ముఖమై యా నారసముల మధ్యనిమిడి యుండుటచేఁ బోల్చుటకు వాని కిప్పటికిని వీలు కలిగినది కాదు.

ఆ బోను నెడలించు సాధనము నెరుంగ గుతూహలముతో నా ప్రాంతముల విమర్శింప నందొక వంక నినుపగొలుసు వ్రేలాడు చుండెను. దానిని బట్టిలాగఁగా నా బోను తృటిలోమాయమయ్యెను. అందున్న పురుషుఁడు విస్మృతుఁడై దివోదాసుని పాదముల సన్నిధిఁబడియుండెను. ఆ పురుషుఁడు డెవ్వఁడోయని జూచుచుండ వానికిఁ జైతన్యము గలిగి యొక్కయుదుటునలేచి నిలువంబడి వానిం జూచి యారాజేంద్రుం డాశ్చర్య విషాదమేదుర హృదయారవిందుఁడయ్యెను. ఆ మందభాగ్యుఁడగు పురుషుఁ డెవ్వడు ? దివోదాసుని సహచరుండగు నరిందముఁడు. అతండు యక్షలోకమునుండి యీ గుప్తమార్గమున కేతెంచి బోనులోఁ దగుల్కొనుట రాజేంద్రునకు వింతగాఁ దోచెను. వాని కట్టికష్టముగలుగుటకు మిక్కిలి విచారించెను. ఎట్టకేలకు వాని కే యాపదయును లేకుండుటకు సంతసించెను.

ఆ యక్ష కుమారుండును దివోదాసుని జూచి యాశ్చర్యమందెను. వారిరువు రును గొండొక వడి నివ్వెరపాటు బొంది యొకరినొకరు బల్కరింప జాలక‌ చూపుల తోనే తమ హృదయానురాగముల వెలిబుచ్చుచుండిరి. అప్పుడు దివోదాసుండు నిజ హృదయోద్వేగంబడంచుకొని యరిందమునితో మందస్వరంబున నిట్లనియె.

మిత్రమా ! నేడు నేనెంతయును ధన్యుండను. ప్రాణస్నేహితుని యాపద దప్పించి వానితో ముచ్చటించు భాగ్యము నాకొదవెను. ఇందున్న బోనులో చిక్కు కొని యా బాధచే నీ వొనర్చిన యాక్రందన ధ్వనియే మనకు మహోపకార మొనరిం చెను. నేనీబిలము జొచ్చుటకదియే కారణమై యఖండైశ్వర్యము లభింపజేసెను. నీ యాపద దాటింపఁ గలుగుటకుఁగూడ నదియే మూలమగునుగదా. యక్షలోకంబు నుండి యిచ్చటి కెట్లువచ్చితివి ? ఈ బోనులో నెప్పగిదిఁ జిక్కుకొంటివి ? నీ యుదం తము సాంతముగా వినఁ గుతూహల మగుచున్నదని యడుగుచున్న యమ్మహారాజున కరిందముండు పునఃపునస్సాష్టాంగ దండప్రణామంబు లాచరించుచు వినయముతో నిట్టనియె. మహారాజా ! భైరవీదేవి యాలయమునుండి శబర బాలకాన్వేషణంబునకుఁ బశ్చిమ దిశనున్న దివ్యభువనంబులెల్లఁ దిరిగి యెచ్చటను వాని యునికి నెరుంగఁజాలక గ్రమంబున వెనుకకువచ్చుచు నలకాపురము సమీపంబున మణిగ్రీవ జలంధరులఁ గలసి కొని వారివలన శబర బాలకుని వృత్తాంతము గొంత యెరింగి యావార్త మీకు నివేదింప వలయునను గుతూహలముతో మిమ్మ న్వేషించుచు తూర్పువైపుననున్న దివ్యపురంబు లన్నియు వెదకితిని గాని యెందును మిమ్ముగనుగొనలేకపోతిని. హిమవన్నగము మీద శబరబాలకుని బడవై చి వచ్చితిమని మణిగ్రీవ జలంధరులు నాతో జెప్పియుండుటచేత నచ్చటికేగి వానినైన గనుంగొని వచ్చుట యుచితమని తలంచి యొక దివ్యయానం బెక్కి భూలోకమున కేగితిని. అందు శీతశైల శిఖరమున నందందు విమర్శించుచు నొకదండ దేవతాలయముం జూచి విమానము నా ప్రాంతములకు బోనిచ్చి యా యాలయమునకు వెనుకనున్న పూలతోటలో దిగితిని. అందుగల మందిరమును జూచి దానియందేమైన వింతలు గనంబడవచ్చునని తలంచి లోన బ్రవేశించి గదులన్నియును విమర్శింపుచుండ నొక దానియందు గోడలో మీట యొకటి యమరించియుండుట గ్రహించి దానిని నొక్కితిని. తోడనే ప్రాంతమందున్న గుప్తద్వారము వివృత్తమై యందు క్రిందకు సోపానమార్గము గోచరించుటయు నదియేమో చూడవలెనను నుత్సా హముతో దానిలో బ్రవేశించి ముందేగితిని. బిలమార్గమంతయును మణిదీపికలచే స్పష్ట ముగా గనంబడుచుండెను. నేనిచ్చటి కేతెంచి నప్పుడిందుబోను లేదు. అది యెచ్చట నుండి వచ్చి నన్ను గబళించెనో యెరుంగగాని బిలమార్గమున నడచుచున్న నన్ను దృటిలో బడగొట్టి నొక్కివేసినది ఆపదలయందు గాపాడగలదని మీరు నాకిచ్చిన రత్నము మచ్చన్నిధి నుండుటచే నేనీ బోనులో నదమఁబడినను జీవించియుండుట తటస్థించెను. అందుజిక్కిన వెంటనే నేను వివశుండ నైతిని గాని తిరుగ నతిశీఘ్రముగనే నాకు స్మృతి వచ్చినది. ఆ యినుపనారసములు నా యొడలిలో గాటముగ నాటుకొని యున్నవి.

కాలుచేతులు గదలించుటకు గూడ శక్తిలేక పోయినది. నోటమాట వెల్వడ కుండెను. అప్రయత్నముగ మూల్గుమూత్రముబుట్టినది. నేనం దెట్టి బాధ ననుభవించి తినో నా కించుకయును దెలియదు. కొంతసేపటికి మూల్గుటకు కూడ నా కోపిక లేక పోయినది. పిదప నేమియును నెరుంగను. అ బోనున నమరింపఁ బడిన నారసములు మృత్యుదేవతాదంష్ట్రలన జెల్లును. అందుండి యెట్లీవలబడితినో యాబోనేమైనదో తెలియకున్నది. ఇట్టి భయంకరమైన యంత్రము నేనెచ్చటను గనివిని యెరుంగను. దీనిని బుచ్చుటకు భవదీయ బలప్రతాప ప్రభావములుగాక కారణమితరముగానేరదు. మీ దివ్యరత్నము నాకిప్పటికి రెండుగండముల దాటించినది. దీని యత్యద్భుత ప్రభా వము వర్ణింప బ్రహ్మాదులకైన దరము గాదని సంతోషాతిరేకమున బెక్కురీ‌తుల బ్రస్తుతింప‌ దొడంగెను. ఇట్లు వారిరువురును బరస్పర సమావేశమునకు ముదంబందుచు నబ్బిలముదాటి యడవులం బోయిన నపాయము లేకుండునని దలంచుచుండ దివో దాసున కదొక లిపి గనంబడుటయు దాని నతండిట్లు చదివెను.


ఉ. ఆపద సంభవించును జుమా ! యిఁక ముందడుగైనఁ బోయినన్‌
    ప్రాపుగ నిచ్చటే కల దుపాయ మొకండు బిలంబుదాట సం
    తాపము బొందనేమిటికి ? తధ్యము బోనిట హేమసౌధ ని
    క్షేపము రక్షణంబునకె కేవలమున్‌ సృజయింపగాఁ బడెన్‌.

అంత దివోదాసు డాలిపినందు రచించిన వారినిసంస్తుతించుచు బిలనిర్గమనో పాయమునకై యందు మరియు విమర్శింపుచుండ నొకదండ దివ్యగానరవంబొకింత వినంబడుటయు దాని కబ్బురంపడుచు నా ధ్వని యేతెంచిన వైవున నతిశ్రద్ధగా బరీక్షింప దొడంగెను. లిపి యందిచ్చటనే బిలముదాటుట కుపాయము గలదని యుండుటచే నది యున్నచోట వెదకుచు నొక్కొక్క యక్షరమును చేతితో దడుముచుండెను. “కలదుపాయ మొకండుబిలంబుదాట” అని యున్నచోటు చేతితో నదుమగా నా భాగములోనికి పోయెను. వెంటనే చేరువనున్న గుప్తద్వారము వివృతమయ్యెను.

దానింగాంచి వారిరువురును విస్మయమందుచు నందు సత్వరము ప్రవే శించిరి. తోడనే యా గుప్తద్వారము మూతబడెను దివోదాసుండు యక్షునితో నిపుడొక గదియందుండెను. శాంభవీ దేవతాలయము వెనుకనున్న యుపవనము వారికి దృగ్గో చరమయ్యెను. ఇదివరలో దాను బిలంబు బ్రవేశించిన గుప్తద్వారము వారిపుడున్నగది ప్రక్కగదిలో నున్నదని గ్రహించి యాశ్చర్యమందుచు నా మందిరము వెడలివచ్చిరి. ముందు దేవీగీతముల బాడు‌కొనుచు బుష్పావచయం బొనరించుచున్న దేవతాస్త్రీలు నేత్రపర్వ మొనర్చిరి. వారింగాంచి యా భూపాలుం డమందానందభరితాంతరంగుడై సత్వరము యక్షునితో వాని సన్నికర్షమున కేగెను. దివోదాసుండట్లు నిరపాయుడై తిరుగ దమ కన్నులంబడుటచే నాచకోరాక్షు లత్యంత సంతోష స్వాంతలైరి. గుప్త ద్వారమున బిలములో బ్రవేశించినది మొదలు జరిగిన వృత్తాంతమంతయు నా రాజేం ద్రుని వలన విని యద్భుతమందిరి. ఇంతలో దేవి నర్చించుటకు వేళయగుటయు నా మదగజయానలు సంభ్రమించుచు నమ్మవారి పూజావిధానములదీర్చి యిపుడే రాగలమని పలికి పూజాద్రవ్యములంగొని యతిత్వరితగమనముల నా యాలయమున కరిగిరి. దివోదాసుండును వారేతెంచువరకు నూఱకుండ నేల నని యక్షునితో నా ప్రాంతముల యందలి వింతలంజూడ బోయెను.