కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/34వ మజిలీ

శ్రీరస్తు

శుభమస్తు – అవిఘ్నమస్తు

కాశీమజిలీ కథలు

నాలుగవ భాగము

ముప్పది నాల్గవ మజిలీ

క. శ్రీమణిసిద్ధ యతీంద్ర
   స్వామి సమీహితమనీష చాత్రసమేతుం
   డై ముప్పది నాల్గవమజి
   లీ ముదమునఁ జేరి యట జలింపని భక్తిన్.

వ. ప్రణవమంత్ర పరాయణ పారాయణుండై జపావసాన సమయంబున నాఁ డుపవాసదినం బగుటఁ దీఱికగాఁ గూర్చుండి యంతకు మున్ను వింతలంజూడ నరిగిన గోపకుమారుని రాక నరయుచుండెను.

అంతలో నాగోపాలుం డా గ్రామము నలుమూలలు దిరిగినాఁడు. తన కేదియు వింతగ గనబడమిఁ బరితపించుచు గురు నంతికమునకు వచ్చి నమస్కరించి స్వామీ, మనమిల్లు వెడలిన తరువాత నింతపాడు మజిలీ యెందునులేదు. ఈ గ్రామముకన్న నరణ్యమే మేలు. గ్రామ మంతయుఁ బదిసారులు తిరిగితిని. మి మ్మడగుట కెచ్చట నేవిశేషము గనంబడలేదు. పోనిండు. ఇది పుణ్యదినము. ఊరక కాలహరణము చేయనేల ? కాశీవిశేషంబులఁ చెప్పి నన్ను గతార్థుం జేయుఁడని ప్రార్థించెను.

అప్పు డయ్యతిపుంగవుండు సంతసించుచు వానికి విశ్వేశ్వరమహాత్మ్యము, అభిషేకప్రభావము, పూజామహిమ లోనగు విశేషములన్నియు నితిహాసపూర్వకంగా వక్కాణించెను. వాఁడు తత్ఫలం బాలించి మించిన వేడుకతో స్వామీ, నేను నీచకులంబునఁ బుట్టినను మీయట్టి మహానుభావుని సాంగత్యము దొరకుటవలన కాశీయాత్ర లభించుచున్నది. కావున విశ్వేశ్వరుని నర్చించు భాగ్యం నాకీజన్మమున లభింపదుగదా. కాశీయాత్రవలన మీరు నుడివిన ఫలంబు నాకెట్లు వచ్చునని యడిగిన విని యయ్యతీంద్రుండు గోపా! నీవందులకుఁ జింతింపఁబనిలేదు. పంచములుదక్క తక్కిన జాతులవారందఱు విశ్వేశ్వరమహాలింగమునకు నభిషేకాద్యర్చనలు స్వయముగాఁ జేసికొనవచ్చును. తదభిషేకపుణ్యలాభంబు నీకునుం దప్పక లభింపఁగలదు. అని పలికిన విని యక్కుమారుం డిట్లనియె.

ఆర్యా! దీన నాకొక్కసందియము గలుగుచున్నది. వినుండు. ఒకప్పుడు మా గ్రామములో నేనును మఱికొందఱు గోపాలురును బశువులను మేపుచుండగా సాయంకాలమునఁ బెద్ద గాలివాన వచ్చినది. పాషాణములవలె వడగండ్లు పడినవి. కడవలతో గృమ్మరించునట్లు వర్షము గురియఁదొడగినది గాలివేగ మిట్టిదని చెప్పలేను. అట్టి సమయమున మేమందఱము పశువులను విడిచి గ్రామాభిముఖముగాఁ బరుగిడి పోయితిమి. వానతాకుడు బలమగుటచే వితాకుపడి యూరిబయటనున్న శివాలయము తలుపులు తెఱచుకొని దానిలో దూరితిమి. ఆ దివసమున నర్చకుండు మా పుణ్యవశమునఁ తాళమువైచుట మఱచెనఁట.

ఆ గుడిలోఁ బెద్దదీపము వెలుగుచున్నది . లింగముదాపున నరటిపండ్లు టెంకాయముక్కలు లోనగుపదార్ధము లున్నవి. గాలి యించుకయేని లోనికి సొరమింజేసి వెచ్చగా నున్నది. మేము మిగుల సంతసించి తడిగోచు లూడఁబారవైచి యా ఫలము లన్నియుం దిని యాకలి యడంచుకొని యా స్వామిదయచే దెల్లవారు వఱకు హాయిగాఁ బరుండి నిద్రపోయితిమి.

అంతలో నర్చకుండు తాళముమాట జ్ఞాపకమువచ్చి తెల్లవాఱక పూర్వమే యా గుడికి వచ్చెను. మే మందు నిద్రబోవుచుంటిమి. మమ్ము దొంగలగా భావించి వేగముపోయి గ్రామస్థుల దీసికొనివచ్చెను. వారు మమ్ము లేపి మావలన యథార్ధము తెలిసికొని దండించి విడిచి పెట్టిరి.

మే మాగుడిలో దూరి లింగము సోకినందులకు నాలుగు దినంబులు నైవేద్యము మానిపించి పిమ్మట నా ప్రాంతమందలి పెద్ద పెద్ద బాపనయ్యల రప్పించి మూడుదినంబులు మత్రంబులం జదువుచు సంప్రోక్షణ చేసి సంతర్పణఁ గావించిరి.

అయ్యా! పల్లెటూరి గుడిలింగమునకే యింతనియమము గలిగి యుండఁ ద్రిభువనప్రసిద్ధింబగు విశ్వేశ్వరలింగమున కట్టినియమ మేమిటికిలేదు; దీనికెద్దియో కారణముండకపోవదు; తద్వృత్తాంతము వక్కాణింపుఁ డని యడిగిన విని యయ్యతీంద్రుం డవ్విషయముదనకునుఁ దెలియనిదగుటచే నమ్మణిని మ్రోలనిడికొని కన్నులు మూసి యించుకధ్యానించి తద్వృత్తాంతమంతయు నంతఃకరణగోచరము చేసికొనియెను.

అప్పు డత్తావసచంద్రుఁడు మందహాసము చేయుచు గోపా! నీ పుణ్యము మంచిది. దీన మంచికథ వినుట తటస్థించినది. నీ ప్రశ్న మూరక బోవునా వినుమని యక్కథ నిట్లు చెప్పఁదొడంగెను.

పండితరాయలకథ

కాశీపురంబునఁ బండితభట్టను బ్రాహ్మణుఁడు గలఁడు. అతండు సకలవిద్యలయందు నసమానపాండిత్యము సంపాదించి పెక్కు విద్వత్సభలలో విజయమును గైకొని మహామహోపధ్యాయుం డను బిరుదము వహించెను. మఱియుఁ గాశీపట్టణంబునంగల పండితుల కెల్ల నాతండే ముఖ్యుండై నానాదేశములనుండి వచ్చి చదివెడు విద్యార్థులకుఁ బరిక్షాదికారియై యెక్కుడుకీర్తి సంపాదించెను అతనికిఁ గాశీ సభాపతి యని కూడ వాడుక వచ్చినది. దానంజేసి నిత్యము నప్పురంబునకు వచ్చు తైర్థికులును రాజులును ధనికులును నతని దర్శనము. తప్పకచేసి సన్మానించి యరుగుచుందురు. అందుమూలమున నప్పండితుండు స్వల్పకాలములో వేలకొలది ధనముగలవాఁడై యొప్పెను.

తఱుచు ధనమున్నచోట సంతతి లేకపోవుట వాడుకయున్నది. ఆ విప్రున కట్లుకాక యథాకాలముననే ప్రధమమునఁ బుత్రుండుదయించెను. ఆ శిశురత్న మద్భుతతేజంబునం బ్రకాశింపుచు నెల్లరకు నచ్చెరువు గలుగఁజేసెను. పండితభట్టు ఆ బాలునకు శిశుసంస్కారములఁ గావించి వేలకొలఁది ధనము పంచిపెట్టి విశ్వనాథుం డని నామకరణము వ్రాసెను.

ఆ పండితునింట సంతతము శాస్త్ర ప్రసంగములు జరుగుచుండును గావున నా శిశువు సంస్కృతభాషలోనే మాటలాడఁజొచ్చెను. ఆ విద్వాంసుఁ డాబాలు నైదవయేటఁ జదువవేసి కావ్యనాటకాది గ్రంథములు ప్రారంభించి చెప్పించెను. మిక్కిలి సూక్ష్మబుద్దిగల యా కుమారుండు వ్రతమువలననే గ్రహింపుచు నేడవయేఁడు ముగియు వఱకుఁ దర్కవ్యాకరణములయందుఁ బరిశ్రమ గలుఁగఁ జేసికొనెను. రూపమున మనోహరుండై బాల్యముననే శాస్త్రపరిశ్రమ జేయుచున్న యప్పిల్లవాఁ డెల్లవారి చిత్తంబుల లాగికొనుచుండఁ దల్లిదండ్రుల కోరికలు తీగెలు సాగుచుండెననుట యేమి యబ్బురము?

పండితభట్టు వానికి మిగుల వైభవముతో నుపనయనము జేయఁ బ్రయత్న పడుచున్నంతఁ గృతాంతుండుగూడ బాలుని జూడ వేడుక పడినట్లు నిజభువనాగంతకునిగాఁ జేసికొనియెను. ఆహా! యముండు కృతాకృతముల విచారింపఁడుగదా? సర్వజనమనోహరుండైన యా బాలుని మరణవార్తవిని కాశీపురంబున విచారింపనివారు లేరు. తల్లి దండ్రుల దుఃఖమేమని చెప్పుదును. పండితభట్టు ప్రాజ్ఞుండుగావున నెట్టకే నాశోకం బుపనయించుకొని కొన్ని దినములు చనినవెనుక గ్రమ్మఱి దనయింట యథాప్రకారముగా శాస్త్రపాఠములు జరుపుచుండెను.

పండితభట్టుభార్య సంతతము వానిగుఱించి చింతించుచు విరక్తిగలిగియుండ నింతలోఁ దిరుగా గర్భవతియై యథాకాలమునఁ గుమారునిం గనినది. ఆ శిశు వచ్చు గుద్దినట్లు మొదటివానివలె నొప్పుటంజేసి వాఁడే తల్లిదండ్రుల శోకం బపనయింపఁ దిరుగాఁ గడుపునఁ బడెనని యెల్లవారుం జెప్పుకొనఁ దొడంగిరి, పండితభట్టు వానికిని జాతకర్మాది క్రియలు నిర్వర్తించి వెనుకటివానిపేరే పెట్టెను. వాఁడు రూపంబుననే కాక విద్యాగ్రహణ సామర్థ్యంబునగూడ సోదరుం బోలియుండెను. తదీయసంభాషణ విలోకనాది విశేషంబులఁ దల్లిదండ్రులు గాలక్షేపము చేయుచు వెనుకటి దుఃఖము మఱచి సంతోషముతో నుండిరి. వానికిని దండ్రి యుపనయనము జేయఁదలంచుచుండు నంతలో నాబాలుండు నకాలమృత్యుదేవతాకరాళజిహ్వాకబళంబయ్యెను. అప్పుడు తల్లిదండ్రులకుఁ గలిగినదుఃఖం బీపాటిది యని నుడువ నాతరముకాదు.

పిమ్మటఁ బ్రాజ్ఞులచేఁ నూరడింపఁబడి వారు వైరాగ్యవృత్తితోఁ గాలక్షేపము జేయుచుండిరి. ఆహా! దైవమద్బుతకల్పనలంజేసి లోకుల సంసారసాగరంబున ముంచుచుండునుగదా. అంతలో వెండియుం బండితభట్టుభార్య గర్భవతియై పుత్రునిం గనియెను. ఆ సమయంబునఁ దల్లిదండ్రులు మృతిదినంబోలె నేడువఁదొడంగిరి. ఆ ద్వనివిని చుట్టుప్రక్కల వారుపోయిచూచి అయ్యా! సంతోషసమయంబున నిట్లు విచారించెదరేల, చెట్టునంబుట్టిన కాయలన్ని యును నిల్చునా? అందఱు నొక్కరీతియే యగుదురా? ఈ ముద్దుబాలుండు చిరకాలము బ్రతుకును. ముఖలక్షణము లట్లున్నవని యూరడించిరి.

వారిమాటలందేరి వారు విచారముడిగి తదనంతర కృత్యములం గావించిరి. ఆ బాలుఁడు దినదినప్రవర్ధమానుండగుచు ముద్దుమాటలచేత జూపులచేతను వారి హృదయము లాకర్షింపుచు వెనుకటి దుఃఖమును మఱుఁపజేసెను. ఈ తేప వీఁడు బ్రతుకునని తల్లి దండ్రుల కాసఁగలిగించుచు నాబాలుఁ డేడేఁడులు పెఱిగి యెనిమిదవ యేఁడు ప్రవేశించినతోడనే కాలధర్మము నొందెను.

ఆ దుఃఖము వారికిఁ బరిపాటియైనదిగావున నప్పుడంతగా బాధింపలేదు. పండితభట్టు పుత్రునివిషయమై నిరాశఁ జేసికొని భార్యకుఁ బోధించి విరక్తుండై కాలము గడుపుచుండ వెండియు నతనిపత్ని యంతర్వత్నియై యథాప్రకారము పుత్రరత్నమునుం గనియెను. వాని మృతప్రాయనింగాఁ దలంచి తల్లిదండ్రులు జాతకర్మాది విధు లేమియుం జరుపక విధిలేక పెనుచుచుండ నా బాలుండు సర్వజనదర్శనీయుండై యేడేఁడులు పెఱిగి పరలోకంబునకరిగెను. ఈరీతిఁ గ్రమంబున బండితభట్టున కేడ్గురు పుత్రులు జనించి యద్భుతకళామనోహరులై యేకప్రాయంబున నుపనయనము సేయకమున్న కాలధర్మము నొందిరి. పుట్టిన పుత్రుండెల్ల నట్లు గిట్టుచుండుటంజూచి పండితభట్టు దానంబులు జపంబులు తర్పణములు హోమంబు లెన్ని యేనిఁ గావించెను. గాని యించుకయు నుపయోగము లేకపోయినది.

ఎనిమిదవ గర్భమునకు నెలదప్పినప్పుడు పండితభట్టుభార్య గోలుగోలున నేడ్చుచు మగనిపైఁ బడి నాథా! యీ ప్రసూతివ్యధ నేను సైరింపకున్న దాననిది నాకు శరీరాయాసమునకేకాక దుఃఖమునకుఁ గూడఁ గారణం బగుచున్నది. ఏడ్గురు ముద్దుబాలుర గోఁతంబెట్టితిని, పితృపవనంబంతయు మెఱకయగుచున్నది. కొడుకులు గలుగనేల, చావనేల? యిప్పుడే యీ గర్భంబు దిగిపోవు నుపాయం బాలోచింపుడు. మీరును నేను సుఖపడుదుమని పలికిన విని యా బ్రాహ్మణుం డిట్లనియె.

తరుణీ? పూర్వకృతము లెట్టివారలకు ననుభవింపక తీఱవుసుమీ? పశుపుత్రగృహక్షేత్రాదులు ఋణానుబంధరూపమునఁ బ్రాప్తించుచుండును. తొలి పుట్టువునం దెట్టి ఘోరకృత్యములఁ గావించితిమో ఇప్పు డనుభవించుచుంటిమి. అంతటితోఁగాక ముందరి జన్మంబులగూడ గష్టంబు లనుభవింపవలయునా? నీవు చెప్పినట్లు చేసితిమేని భ్రూణహత్యాపాతక మనుభవింతుము, తటస్థులమై దుఃఖ మనుభవింపుచుండవలయును. ఇంతకన్నఁ బ్రాణమునకుఁ బ్రతీకారములేదు. సర్వధర్మముల నెఱింగిన నే నధర్మకృత్యంబుల నాచరింతునా? యని బోధించి భార్య నూరడించెను.

ఆనాతి ప్రసూతివేదనకుఁగాక పుత్రశోకం బనుభవింపలేక యెట్లైనఁ దన గర్భమును జెడఁగొట్టుకొను తలంపుతోనుండి చింతింపుచుండగా నొకనాఁడు ప్రాతఃకాలమున యవనసన్యాసి (ఫకీరు) యవనభాషతో దీవెనలం జదువుచు భిక్షార్థమై వారింటికి వచ్చెను.

పలువిధములగు రంగులుగల పూసలపేరు లురమున మెఱయ నల్లని యంగీలందొడగి నీలోష్ణీషముతో నొప్పుచున్న యతనివేషము చూచినవారికి వానియొద్ద నెద్దియో సిద్ధియున్నట్లు తోచకమానదు. వానింజూచి పండితభట్టుభార్య దాసీముఖముగా గర్భస్రావకమగు నోషధి నెద్దియేని నియ్యఁ గలవాయని యడిగినది. ఆ మాటవిని ఫకీరు నోరు గొట్టుకొనుచు అయ్యో? మేము ద్రోహకార్యములు చేయు వారముకాము. మీ యజమానురాలి కట్టియవసర మేటికివచ్చినది? మగనాలికాదాయని యడిగిన నా పరిచారిక వారి వృత్తాంత మంతయు నతనితోఁ జెప్పినది. అప్పుడా ఫకీరు జాలిపడి యా మాట జెప్పకపోతివేమి? మీ యజమానురాలి నిచ్చటికిఁ దీసుకొనిరమ్ము. పరీక్షించి రక్ష రేకిచ్చెదను. ఈసారి తప్పక పుత్రుండు జీవించునని చెప్పిన విని యాదాది సమ్మోదముజెంది యా వృత్తాంతమంతయుఁ బండితభట్టు భార్యకుం జెప్పి యామె నతనియొద్దకు దీసికొనిపోయినది.

అప్పుడా ఫకీరు ఆమెంజూచి యవనమంత్రములతో దీవించుచు అమ్మా! నేను దైవముతోడుగాఁ జెప్పుచున్నాను. నా యిచ్చిన పూసలపేరు సంతతము నడుమునఁ గట్టికొని పుత్రుండు గలిగిన పిమ్మట నా బాలుని మెడయందుంచ వలయును. ఆ పిల్లవానికి ఫకీరని పేరుపెట్టవలయును. రెండుపూటలయందు మసీదునకుఁ దీసికొనిపోయి యందు ( నమాజు ) దైవప్రార్ధన జేయుచున్న యవనవృద్ధులచే దీవెన లిప్పించుచు యవనవేదము (ఖురాన్ ) చెప్పించవలయును. అట్లు జరిగింతురేని మీ పుత్రుఁడు జీవించును. సందియమువలదు. బిచ్చగాని పలుకులని నిరసింపవలదు. శకునముజూచి చెప్పుచున్నాను. నా మాటనమ్మి యట్లు చేయుఁడని యెన్నియో శపథముల జేసెను.

ఆ మాటలువిని యా యిల్లాలు మిక్కిలి సంతసించుచు ఫకీరూ? మా కట్టి యదృష్టము పట్టునా? అయ్యో? చల్లనిమాటగాఁ జెప్పితివి. కానిమ్ము. నీ మాట ప్రకారము చేసిచూసెదము. నీ పుణ్యమువలననైన జీవించెనేని నీ శరీరమంతయు బంగారుపూసలపేరులు వేయింతు నిప్పుడు చెప్పనేల నీవును దైవమును బార్థింపు చుండుమని పలుకుచున్నంతలో వీధినుండి పండితభట్టింటికి వచ్చెను.

అప్పుడామె మగనితో ఫకీరు చెప్పిన మాటలన్నియుం జెప్పినది. అతండు నవ్వుచు చాలుచాలు మనమిదివఱకుఁ జేసినవ్రతములు, నియమములు నింత యుపయోగమైనవికద. ఇంక తురకదేవతలా మనల రక్షించువారు ? బిచ్చమునకై యెన్ని యేనియుం జెప్పుదురు వాని సత్యము లని నమ్మవచ్చునా యని పలికిన నక్కలికి వెండియు నిట్లనియె.

నాథా? మన దైవములకన్న తురకదైవములే మంచివారు. ఈ ఫకీరు బిచ్చము నిమిత్తము చెప్పిన మాటలుగాలేవు. ఇప్పుడేమియు నిమ్మని కోరలేదు. పరోపకారపారీణు లన్నికులములలో నున్నవారు. లోకములోఁగూడ నష్టపుత్రు లట్లు చేయుటయు నాచారమున్నదిగదా. దీనం దప్పేమి యట్లు చేసి చూచెదముగాక. మనపుణ్య మెట్లుండెనో యట్లు జరుగును. వీరి మాటలకు నాకుఁ గొంచె మాసగా నున్నదని పలికిన యవ్విప్రుండు కానిమ్ము, నీ యిష్టమువచ్చినట్లు చేయుమని చెప్పెను.

పిమ్మట నమ్మగువయు నా ఫకీరిచ్చిన పూసలపేరు భక్తితోఁ బుచ్చుకొని యతండు వద్దనుచుండ దోసెడు బంగారునాణెము లతని యొడిలోఁబోసి యంపి యా పూసలపేరు పొగవైచి నియమముగా నడుమునకుఁ గట్టుకొని యదిమొదలఁతడు చెప్పినరీతిగా జరుపుచుండెను.

కాలక్రమంబున బండితభట్టుభార్య వాడుకప్రకారము మంచిలగ్నమునఁ గుమారునిం గనినది. ఆ పాపని రూపము తేజము లక్షణములు లగ్నబలమును బరిశీలించి పండితభట్టు హృదయమున జీవించునని యించుక యాసజనింప నాశిశువునకు జాతకర్మాది విధులేమియు సమంత్రముగాఁ గావింపక ఫకీరు చెప్పినరీతిగా జరిగించి యా బాలుని పిన్నఫకీరని పిలువఁజొచ్చెను.

మఱియుఁ బండితభట్టుభార్య ఫకీరిచ్చిన పూసలపేరు తన కుమారుని మెడలో వైచుటయేకాక తురకపిల్లలకుఁబెట్టు నగలును దుస్తులునుబెట్టి యబ్బురముగాఁ బెంచుచుండెను. పిన్నఫకీరు బాలచంద్రుఁడువలె దినదిన ప్రవర్ధమానండగుచుఁ బ్రజ్ఞాగుణరూపములచే నెల్లరకు నద్భుతముఁ గలుగఁ జేయుచుండెను.

ఫకీరు జెప్పిన ప్రకారము పిన్నఫకీరునకు సంవత్సరము దాటిన తరువాత బ్రతిదినము రెండుపూటలయందుఁ బండితభట్టు కాశీపురంబున గల మసీదునకుఁ దీసికొనిపోయి యందు నమాజు చేయుచున్న తురకలచేఁ దీవెనలిప్పించి మరల నింటికి దీసికొనిపోవుచుండెను.

పండితభట్టు మసీదునం గల తురకలకును ఫకీరులకును మంచి కానుక లిచ్చుటంజేసి వారు నిత్యము పిన్నఫకీరును దీవించుచుఁ బెద్దతడవు తమయొద్దనుంచు కొని లాలించుచుందురు. మఱియఁ బండితభట్టు బాలునకై దేడులు వచ్చినతోడనే మశీదులోనే యవనభాషలోఁ జదువనేసి యొక వృద్ధయవనుని గురువుగా నేర్పరచి యవనభాషయే చెప్పించుచుండెను. ఒకదాది యా బాలుని బ్రతిదినము మశీదునకుఁ దీసికొనిపోయి పగలెల్ల జదివించి యింటికిఁ దీసికొనిపోవుచుండును. పిన్నఫకీరు మిగుల బుద్ధిమంతుఁడగుటచే నల్పకాలములోనే యవనవిద్య నేర్చుకొనియెను.

రాత్రులయందుఁ బండితభట్టుగారి యింటఁ గావ్యనాటకములు దర్కవ్యాకరణముల పాఠములు జరుగుచుండును. గావున వ్రతము వలననే యాబాలుండు గీర్వాణభాషయందును నసమానమైనఁ బ్రజ్ఞ గలవాడయ్యెను. ఆబాలున కేడేఁడులు ప్రాయమువచ్చినది మొదలు తల్లిదండ్రులు పిన్నఫకీరును మశీదులోనే యునిచి యవనదేవతల నారాధింపఁజేయుచు ఫకీరులచే జపములు చేయించుచు మశీదంతయు నలంకరించి యవనులకు సంతర్పణలఁ జేయుచుండెను.

రెండుమూఁడు దినములలో నేడేఁడులు గతించుననఁగా వారి హృదయములు తామరాకులపై నీటిబిందువులవలెఁ జలింపదొడంగినవి. క్షణక్షణము నాబాలు నంటి చూచుచు వేఁకి సోకునేమో యని జడియుచు క్షణమొక యుగములాగున వెళ్ళించిరి. పండితబట్టు కుమారుని యేడవయేట యంత్యక్షణమందుఁ గన్నులు మూసుకొని పరమేశ్వరుని ధ్యానించుచుఁ బుణ్యాత్ములారా! నాపుత్రుం డీనిమిషమం దెట్లున్నవాఁడు? బ్రతికియున్నవాఁడా? నా కట్టియదృష్టము పట్టినదా? యని పలికిన విని ఫకీరులు "అయ్యా! తురకదైవము మీదైవమువంటివాఁడు కాడు. తోడఁబలుకుచుండును. మీపట్టి కేమియు భయములేదు. గండము గడిచినది, నూఱేండ్లు బ్రతుకు" నని పలికిరి.

ఆ మాటలువిని పిన్నఫకీరు నాయనా! మీరు నావిషయమైయట్లు భయపడుచున్నారేమి. నాకేమియు భయములేదు. సంతోషముగా నుంటిని వెరవకుడని పలికెను. ఆమాటలువిని పండితబట్టు పట్టరాని సంతోషముతోఁ దండ్రీ! నీయన్న లేడ్గురు లేతప్రాయమున నీల్గిరి. ఎనిమిదవయేటలో నిమిషమైన జీవించినవారుకారు. అందు నేకరీతి మృతినొందుటచే నిందు జడియుచున్నాను. భగవంతుడు కనికరించి నిన్ను నిచ్చినట్లు తలంచుచున్నాను. ఆదయాళుఁడే ఫకీరురూపమున వచ్చి నన్నోదార్చియు యవనుల దీవెనలే నీకుజీవిత మిచ్చినపని యనేక ప్రకారంబుల నుడువుచు నాటినుండి నలువదిదినములవరకు తురకలకే సంతర్పణలు చేయుచుఁ -------------------------- దురకలనే కొనియాడుచు నతండు భార్యతోఁగూడా ------------------------ప్రహర్ష సాగరంబున నీదులాడుచుండెను.

అట్లు పండితభట్టు యమునితోఁ గలహించి కుమారుని బ్రతికించుకొని యెనిమిదవయేటనే వానికి నుపనయనముఁ గావించెను పీఁటలపైఁ గూర్చుండి కుమారుని మెడలో జన్నిదము వైచుట యాదంపతులకుఁ బట్టభద్రుని జేసినంత సంతసము గలినది. పండితభట్టు కుమారు నుపవీతుని జేసియు మశీదునకుఁ బంపుటమానలేదు, యవనవిద్యయే చెప్పించుచుండెను. పిన్నఫకీరున కిష్టము వచ్చినప్పుడు వేదము చెప్పుటకుగాను నింటియొద్ద నొక యుపాధ్యాయుని నియమించెను. దానంజేసి పిన్నఫకీరు క్రీడాలాపంబులంబోలె వేదవాక్యంబుల నశ్రమముగా నేర్చుకొనియెను.

మఱియుఁ బిన్నఫకీరు యవనసాహవాసమువలన గుఱ్ఱమెక్కుటయుఁ గత్తి త్రిప్పుటయు సాముజేయుటయు వేడుకపడి తండ్రిం గోరుకొనినఁ బండితభట్టు అట్టి వాండ్రం బిలిపించి యావిద్యలన్నియుఁ గుమారునికి నేర్పించుచుండెను. పిన్నఫకీరు గురువులనుండి యేవిద్యనైనను దర్పణము ప్రతింబమువలె నశ్రమముగా నాకర్షించుచుండును. ఆ బాలుండు రాత్రులయందు వేదశాస్త్రపరిశ్రమయుఁ బగలెల్ల నాయుధ పరిశ్రమయు నప్పుడప్పడు యవనవిద్యా ప్రసక్తియుఁ జేయుచుండుటచే బదియాఱేడుల ప్రాయమువచ్చువరకు నన్నిటియందును వానికసమానపాండిత్యము కుదిరినది.

ఆ విప్రకుమారుంజూచి రూపంబు మెచ్చువారు సహదేవుండనియు నస్వయానపాటవముఁ జూచువారు నకులుండేయనియు సాయుధ సాధనము విమర్శించువా రర్జునుండేయనియు మల్లసంగర నైపుణ్యముఁ దిలకించువారు భీముండనియు నిరుపమవిద్యాకౌశల్యముగనువారు ధర్మజుండనియు స్తోత్రములు చేయుచుందురు. అతనికి ఫకీరు పేర స్వర్దకముగా లేదని కాశీపురములో మహావీరుండని శూరులును పండిత రాయవల సూరులును బిలువదొడంగిరి. దానంజేసి యతండు మహా వీరుండనియుఁ బండితరాయలనియుఁ బిలువ బడుచుండెను. తల్లి దండ్రులు మాత్రము పిన్నఫకీరనియే పిలుచుచుండిరి.

ఆ వీరుండు తఱుచు తురకదుస్తులు ధరించుచుండును. గావున యవనప్రభు రీతి నొప్పుచుండును. పండితభట్టు వానికి వివాహము చేయువలయునని ప్రయత్నించెను. గాని వీరరసమునందుఁ యభిలాష శృంగారరసమునందుఁ గలుగక పోవుటచే నందుల కక్కుమారుఁడు సమ్మతింపడయ్యెను. ఒకనాఁ డమ్మహావీరుండు మశీదులోఁ గూర్చుండి యవనమతమునకును హిందూమతమునకునుంగల తారతమ్యంబుల గుఱించి చక్కఁగా నుపన్యసించి యందుఁగల పెద్దఫకీరు వాని యవనవిద్యాపాండిత్యమున కచ్చెరువందుచు అప్పా! నీపాండిత్యము నీవీరత్వము నీగాంభీర్యము ననన్యసామాన్యములు గాకున్న యవి. నీ విందుండదగిన వాడఁవు కావు డిల్లీకిఁబొమ్ము. పాదుషాగారు నిన్ను జూచెనేని నల్లునికిజేయునంత గౌరవముఁ జేయుదురు. మా మశీదున కాయన ప్రతిసంవత్సరము వార్షికము పంపుచుండును. ఆసొమ్ము రేపో నేఁడో రాఁగలదు. ఆ విత్తముఁ దెచ్చిన భటులవెంట నరుగుము. నీకుత్తరము వ్రాసి యిచ్చెదనని చెప్పుచుండఁగనే ఢిల్లీనుండి విత్తసహితముగాఁ గొందఱువచ్చి యొకయుత్తరము మా పెద్దఫకీరున కిచ్చిరి.

ఆఫకీరు వీరుండు వినుచుండ నాయుత్తరము విప్పియిట్లు చదివెను. కాశీ పట్టణంబునఁగల మసీదు ఫకీరున కనేకసలాములుచేసి డిల్లీ పాదుషాగారి వజీరు (మంత్రి) విన్నవించునది యేమనగా మనపాదుషా గారికి లవంగియనుకూఁతురగలదు. అచిన్నది యిప్పుడు పదియాఱేడుల ప్రాయముకలిగియున్నది. చిన్నతనమునుండియు హిందూమతము నందభిమానము గలదగుటచే నావిద్యలయందే యెక్కువ పరిశ్రమ చేసినది.

ఈ నడుమఁ గాశీఖండమను గ్రంధమును జదివినదఁట అప్పటి నుండియుఁ గాశీయాత్ర సేవింపవలయునని మిగుల వేడుకపడుచున్నది. రేపు రాఁబోవు శివరాత్రి కచ్చటికి వచ్చి విశ్వేశ్వరునికి స్వయముగా నభిషేకము చేయునఁట. తనయభిలాష నాయోషారత్నము తండ్రితోఁ జెప్పికొనఁగా పాదుషాగారు మీ కిట్లు వ్రాయమని యానతిచ్చిరి. ఇదివరకు మనపాదుషాగారికి వరుసగా నేడ్గురు పుత్రికలు పుట్టి యే డేండ్ల వరకు పెరిగి కాలముచేసిరి. ఇప్పుడీమె యెనిమిదివ సంతానమై యొక్కరితయే యున్నది. దానంజేసి పాదుషాగా రీకోమలిని గారాబముగాఁ జూచుచు నేమికోరినను గాదనక తీర్చుచుందురు. కావున నందలి హిందువుల యభిప్రాయము లెట్లున్నవో తెలిసికొని వ్రాయవలయును. బలవంతమునైనను నాకార్యము సేయింపక మానము.

అనియున్న యుత్తరవు రెండుసారులు చదివి యాపెద్దఫకీరు వీరునితో నప్పా! ఈయుత్తరము నీవువింటివిగదా? ఈయూర మీతండ్రి యన్నింటికిం జాలియున్నవాఁడు. ఈయుత్తరములోసంగతు లాయనకుం జెప్పి యేమిని వ్రాయవలయునో సత్వరముగాఁ దెలిసికొనిరమ్ము. చివరవాక్యమున కర్దము గ్రహించితివిగద. పాదుషాగారి శాసనమున కడ్డుసేయువాఁడు గలఁడా యని పలికినంత మందహాసము చేయుచు వీరుం డిట్లనయె.

ఏమేమీ? హిందూదేవాలయములోనికి వచ్చి యవనపుత్రిక యభిషేకము చేయునా? చాలు చాలు నిందులకు మామతస్థులు సమ్మతింపరు. మీమతంబులో నన్ని మతములవారి గలుపుకొందురు. మేమెవ్వరినిం జేర్చుకొనుటకు మాశాస్త్రములు సమ్మతింపవు. బలాత్కారముగాఁ జేయించుటకు పాదుషా యంత యెక్కుడు వీరుఁడా యేమి? యిచ్చటమాత్రము బలవంతులు లేరా యని పలికిన నా పెద్దఫకీరు వెండియు నిట్లనియె .

అప్పా! పాదుషాగారివృత్తాంతము నీ వెరింగినచో నిట్లనవు. భూమండలమంతయు నతనిదేసుమీ? ఈ రాజులెల్ల నాయనకుఁగప్పములు గట్టుచుందురు. ఆచక్రవర్తి తలంచకుండిన నేకార్యము సాగకుండెడది. అతనితోఁ బగసాధింప విప్రునికి సాధ్యము గాదు, మీతండ్రికిం జెప్పి వడిగా రమ్ము ప్రత్యుత్తరము వ్రాయవలయు ననుటయు నతం డిట్లనియె. అతండెట్టివాఁడైనను మతవిరుద్ధములగు కార్యములు చేయఁబూనినచోఁ బ్రజలు సమ్మతింతురా? ఇదియా చక్రవర్తియగుటకు ఫలము? గానిమ్ము నాకింత చెప్ప నేల మావారితో విచారించి రేపు ప్రత్యుత్తర మిచ్చెద ననిపలికి యప్పుడే తండ్రి యొద్దకుంబోయి యా వృత్తాంతమంతయుం జెప్పెను.

పాదుషాగారిశాసనమువిని పండితభట్టు వెఱచుచు నాయూరిలోఁ బేరుపొందిన వారికెల్ల నాకథచెప్పి వారితోగూడాఁ గాశీరాజు నొద్దకుంజని పాదుషాగారి యుద్యమ ప్రకారమంతయుం జెప్పెను. ఆవిషయము విమర్శింపఁ గాశీరాజు మఱునాఁడు విశ్వేశ్వరుని దేవాలయములో నొక సభఁజేసెను. ఆ సభకుఁ గాశీలోనున్న వారందరు వచ్చిరి. ఆ సభలోఁ బండితభట్టు నిలువంబడి పాదుషాగారి కూతురు శివరాత్రి వచ్చి స్వామికి స్వయముగా నభిషేకము చేయునఁట మనము వలదంటిమేమి బలత్కారముగా నప్పని సేయింతురట. దీనికిప్పుడు మనమేమి చేయవలయునో మీ మీ యభిప్రాయములు చెప్పవలయునని యుపన్యసించెను.

అప్పుడు కొందరు ఫాదుషాగారితోఁ బగఁబూని మనము నిలువఁజాలము గావున నడ్డము చెప్పవలదనియు మఱికొందరు వినయముతో నాయన కిట్టిపనిచేయుట మా మత విరుద్ధమగుట మానపింపుఁడని ప్రార్దనపత్రికలు పంపవలయుననియు నొకరు మనరాజుగారి యభిప్రాయ మెట్లో యట్లు చేయవలయుననియు మఱియొకరు ప్రాణములు విడచియైన మానముఁ గాపాడుకొనవలయు ననియుఁ దలయొకరీతిం బలికిరి. పిమ్మటఁ గాశీరాజు సభలో నిలువంబడి పాదుషాగారు మనకందఱకు జక్రవర్తియై యున్నవాఁడు వారిశాసనము తిరస్కరించుట మాబోటులకు శక్యమైనదికాదు. ఆయన యధీనములో ననేక లక్షల సైన్యమున్నది. రెండులక్షల సైన్యముగల నే నాయనతోఁ బగబూని నిలువగలనా? ప్రార్ధనాపత్రికఁ బంపుటయే యుచితమని నాకుఁదోఁచినదని యుపన్యసించెను.

అప్పుడు వీరుఁడు లేచి సభలో నిలువంబడి నలుదశలఁగలయఁ గనుం గొ'నుచు గంభీరస్వరంబున నిట్లనియె. “సభ్యులారా! పాదుషా చక్రవర్తియని మీరందరు వెఱచుచున్నారు. అతనికి మనలో నొక సామాన్యునకుఁ గల బలము లేదని నమ్ముఁడు. విశ్వేశ్వరలింగము హిందూమతస్థులకెల్ల ప్రాణమువంటిది. ఆ లింగము గాపాడుట మనకేగాక మన హిందూదేశమున కంతకు నావశ్యకమైయున్నదిఁ అల్పసారముగల తృణములు కూడికొని యేనుఁగును బంధించుచున్నవి. మన దేశమంతయు నేకమైనచో నీపాటి పాదుషాలు పలువురైన నేమియుఁ జేయలేరు. మానముకన్న ప్రాణము లెక్కుడికావు. దేశముమాట యటుండనిండు. ఈ పట్టణమంతయు నొక నూలిమీఁద నుండినజాలదా? మన రాజుగారు పాదుషాకు వెఱచిరి. ఆయనతోఁ బని లేదు. రెండులక్షల సైన్యమును నాయధీనము చేయుమనుఁడు. శివరాత్రినాఁడు పాదుషాగారి సైన్యమును బొలిమేరకు రాకుండఁ గొట్టెద. నతండు ప్రార్ధనాపత్రికలకు సమ్మతించువాడుఁ కాఁడు. వ్రాసినయుత్తర మట్లున్నదని పలికి యాసభ్యులయుల్లముల వీరరసముఁ బొంగజేసెను.

అప్పుడప్పౌరులందరు వీరునిమాటల మెచ్చుకొని వీరావేశముతో ఫాదుషా గారి కూఁతురు గుడిలోఁ బ్రవేశించుటకు సమ్మతింపము బలవంతము చేసి వచ్చెనేని బ్రాణములకుఁ దెగించి యాబాలవృద్ధముగాఁ బోరెదము. ఈ మహావీరుడే మాకు సేనాధిపతిగా నుండుఁగాక ఇతండు చెప్పినట్లు రెండులక్షల సైన్యము మాయధీనము చేయవలయునని యేకవాక్యముగాఁ బలికిరి. అప్పుడు కాశీరాజునకును రోష మావేశించినది. కావున “నోహో? మీరందఱు వీరులును నేను బిరికివాఁడననియా మీరు తలంచు చుండిరి. ఈవీరునకు సర్వసేనాధిపత్య మొసంగితిని. అతనియిష్టము వచ్చినట్టు చేయవచ్చును. సంగరమయ్యెనేని నేను సహాయుఁడగానుందు" నని పలికెను. ఆమాటల కందఱు సమ్మతించి యప్పుడే యమ్మహావీరుని సేనాధిపతిగా నియమించుకొని యంతటితో నాసభ చాలించిరి.

మఱునాఁడు వీరుండు మసీదునకుం జని ఫకీరుతో “మా మతస్థులు పాదుషా కూఁతురు గుడిలోఁ బ్రవేశించుటకు సమ్మతించినారు కారు. మతవిరుద్దధర్మములఁ జేయఁదగదని మందలించి పాదుషాగారికిఁ బ్రత్యుత్తరము వ్రాయుమని పలికెను. ఆ మాటలువిని ఫకీరు తలపంకించుచుఁ 'గానిండు. మాకేమి మీమేలునకే చెప్పితిమి. హిందువులకు ముప్పు రానైయున్నది. మాన్పింప నెవ్వరితనం' బని పలికి యప్పుడే వజీరున కావిషయములు వ్రాసిపంపెను. మఱికొన్ని దినములకు డిల్లీనుండి మశీదున కొకయుత్తరము వచ్చినది. అట్టిసమయమున వీరుఁ డందే యున్నవాఁడు కావున నందలి సంగతులు తెలిసికొనియెను.

'కాశీపురమునకు నాలుగు క్రోశముల దూరములో హుస్సేన్‌బాదను కోట కలదు. అది ఫాదుషాగారి యధీనములోనున్నది. లవంగి పదివేల సైన్యముతో శివరాత్రికిఁ బూర్వమువచ్చి యా కోటలోఁ బ్రవేశించును. శివరాత్రినాఁడు గంగస్నానముఁ జేసి లింగమున కభిషేకము చేయఁ గలదు. అడ్డమువచ్చినవారిం బరిమార్పవలయునని పాదుషాగారి యాజ్ఞయైనది. మీరును వారికిఁ దగిన సహాయముఁ జేయుచుండవలయు' నని వజీరు వ్రాసిన విషయములు రహస్యములైనను ఫకీరులు వీరునియందుఁ గల విశ్వాసమునఁ దెలియఁజేసిరి.

సంగరోత్సవముఁ గోరుచున్న వీరుఁ డామాటలు విని యుబ్బుచు దమవారి కెల్ల నారహస్యములం దెలియఁజేసి కాశీరాజు నడిగి లక్షసైన్యమును మాత్రము తెప్పించుకొని శివరాత్రికిఁ బూర్వము పట్టణముచుట్టును వీథులమొగలను దేవాలయద్వారములయందును గాపుగా నిలువంబెట్టి చక్రవ్యూహము పన్ని తాను గుఱ్ఱమెక్కి యన్నిచోటు లకుం బోవుచు వ్యూహమును గాపాడుచుండెను. హిందువుల యుద్యమము వజీరునకుఁ దెలియమిచేఁ బదివేల యవన సైన్యముతో లవంగిని హుసేన్‌బాదు కోటలోని కనిపెను.

లవంగి కథ

యవనసేనానాయకుఁడు తన సైన్యమంతయు హుసేన్‌బాదు చుట్టును నిలువంబెట్టి కాశీవిశేషములం దెలియ వేగులవారినంపి వారిచే హిందువుల సన్నాహము విని వెఱఁగుపడుచు లవంగి కొక యుత్తరమిట్లు వ్రాసికొనియెను. “రాజపుత్రీ! మన రాకఁ దెలిసికొని హిందువులు కాశీపట్టణము చుట్టును గాపుపెట్టుకొనిరి. వారి బలము మన బలముకన్న నధికముగానున్నది. ఈ విషయము తెలియక మేము సామాన్య సన్నాహముతో వచ్చితిమి. ఇప్పుడే మరికొంత సైన్యమును బంపుమని వజీరునకు వ్రాసితిని. ఆసేన వచ్చువరకు శివరాత్రి మిగిలిపోవును. ఇప్పటి బలముతో వారిం ద్రోసికొని పోవంజాలము. కావున సంగతి విశదపఱచుకొంటిని. సేవకునికు గర్తవ్యమెద్దియో యాజ్ఞాపింప వలయును.”

ఆ యుత్తరముఁ జదువికొని లవంగి యొక్కింతతడపు వివశయై మాటలు తడబడ 'సఖీ! సంగీతచంద్రిక! ఇటురా. ఈ యుత్తరముఁ జూడుము; అభాగ్యులకు సుకృతకార్యములు లభించునా? అయ్యో! గంగాస్నానము విశ్వానాథదర్శనముఁగలుగునని యెంతయో యభిలాషతో వచ్చితిమి. ఏదియు లేకపోయెను. ఈపాడుకులంబున నేమిటికిఁ బుట్టితిని. మాతండ్రియొద్ద సేనలు లేకపోయెనా? ఇంత యల్పముగాఁ బంపనేల? అదియు నా దురదృష్టమే. ఇప్పుడేమి చేయుదుము. మనప్రాణసఖి కుందలతిక యెక్కడ నున్న 'దని పరితపించుచున్న లవంగి నూరడించుచు సంగీతచంద్రిక యిట్లనియె.

'సఖీ ! మాకీవార్త నిన్ననే తెలిసినది. నీవు విచారింతువని నీతోఁ జెప్ప లేదు. నిన్నెట్లయిన రేపు గంగాస్నానముఁ జేయించి విశ్వనాథుని యాలయమునకుఁ దీసికొని పోవుదుము. నీవు విచారింపకుము. మేమిరువురము నాలోచించుకొంటిమి. నేఁటియుదయమునం గుందలతిక కాశీపురంబున కరిగినది. అచటి రహస్యములం దెలిసికొని రాఁగలదు. వచ్చినతరువాత యుక్తానుసారము గావింత'మని పలుకుచుండఁగ కుందలతిక యచ్చోటికి వచ్చినది. లవంగి యాయింతింజూచి సంతోషముతో 'వయస్యా! ఏమి ఏర్పాటు చేసికొని వచ్చితివి. మనము రేపు పోవుట సాగునా? మీవంటి యాప్తులుండ నాకుఁ గొదువయే'మని పలికిన విని కుందలతిక యిట్లనియె.

'బోటీ! నేను మాఱువేషముతోఁ గాశీపురమున కరిగితిని. కావలివారల యానతి లేక నావీటిలోఁ జీమైనం దూరశక్యము గాదు. పట్టణముచుట్టును వీథివీథులను రాజభటులు కాచి యున్నారు. యాత్రార్ధులైన హిందువులు నిరాటంకముగాఁ బోవ చ్చును. దారులలోఁ బరీక్షించుచుందురు. నేను జూచుచుండగఁనే పెక్కండ్రు హిందువులు నజారులెక్కి పురిలోని కరిగిరి. ఇప్పుడు బలవంతముచేసి యరుగలేము. నీవేషభాషలు స్వభావముచేతనే హిందువులం బురుడించుచుండును. మే మిరువురము హిందువులమేకదా? మనము పురుషవేషములు వైచికొని హిందువులమని చెప్పి యరుగుదము. నిరాటంకముగాఁ బోవచ్చును. ఇంతకన్న వేఱొకరీతిఁ గార్యసాఫల్యము కాదు.' ఆ మాటల విని రాజపుత్రి మిక్కిలి సంతసించుచు నట్లుజేయుటకు సమ్మతించి యొరు లెఱుఁగకుండఁ గోటలోనికి రాకపోకలు జరిగించుట యెట్లని శంకచేసినఁ గుందలతిక యిట్లనియె.

'ద్వారపాలురు మాయెఱుంగనివారు కారు. మావెంట నీవు పురుషవేషముతో వచ్చుచుండ శంకింపరుగదా. దీన నభ్యంతరమేమి యున్న' దని పలికిన విని సంగీతచంద్రిక 'సఖీ! అదియంత యుచితముగా లేదు. మనము పురుషవేషములు వైచికొని పోవలయుంగదా అట్టి పని రహస్యముగా జరుపవలయునుగాని దాసరివారి పోలికమారి బయల వేషములు మార్చుట యుక్తముగాదు. సాయంకాలములోపున భగవంతుఁడు వేఱిక యుపాయము తోపింపకపోపునా ? ఏదియు దొరకనప్పుడు నీవు చెప్పినట్లే చేయుద' మని పలికినది. ఆ మాటకు రాజపుత్రియు ననుమోదించినది.

పిమ్మట నాయంగజాన లిరువురుఁ గోట వెడలునుపాయ మాలోచించుచుఁ గోటగోడ దాట నేవియేని సాధనము లున్న వేమోయని యాప్రాకారముచుట్టును విమర్శనపూర్వకముగాఁ దిరుగఁజొచ్చరి. అందు నయఃపేటికాసదృశంబైన గుప్తభవనంబున నొక యినుపకవాటమొకటి కనంబడినది. దానిం బరీక్షించి వారిరువురు ప్రయత్నపూర్వకముగా గడియఁ గనుంగొని యెట్టకేదానిం దఱచిరి. అందు సోపానములున్నవి. వానివెంబడిన కొంతదూరము పోయిరి. ఆ మార్గము నున్నని పాషాణములచేఁ గట్టం బడుటచే నడచుటకు మృదువుగానున్నది. నిర్భయముగా నా తరుణు లా తెఱవునంబడి పోవఁబోవ గొంతదూరమున నొక తలుపడ్డమైనది. దాని చీలం గనుంగొని యాతలుపుఁ దెఱచిరి. ఆ మార్గము కాశీపురమున కనతిదూరములోనున్న యొక చిన్నమెట్టమీదికిఁ బోయినది. ఆ గుఱుతు లన్నియు గ్రహించి యమ్మించుబోఁడులు జెందుచు మఱల నాతలుపులు వైచికొని యథాగతముగాఁ బోయి రాజపుత్రితో నా వృత్తాంతమంతయుం జెప్పిరి.

శత్రువులు కోట ముట్టడించినప్పుడు తప్పించుకొని పోవుటకై కోటఁ గట్టునప్పుడు గుప్తమార్గము లుంచుట వాడుక యగుటచే నాదారి యట్టిదని తెలిసికొని యా లవంగి దానిం దెలియఁజేయుచు విశ్వేశ్వరుని యనుగ్రహమే యని పరమానందము జెందుచుఁ బ్రయాణసన్నాహముఁ గావింపుఁడని తొందరపెట్టినది.

పిమ్మట నాకొమ్మ లిరువురు లవంగికిఁ బట్టుదుస్తులు గట్టి యంగీలు తొడిగి కౌశేయోష్ణీషము శిరంబునం జుట్టి రత్నకటయంకాంగనీయాది వస్తువిశేషముల నలంకరించి పురుషవేషము వైచి మందహాసముతో నద్దముఁ జూపుచుఁ దరుణీ! ఇప్పుడు నీవు కంతు వసంతజయంతాదుల మించి యుంటివి. నీ మనోహరాకారముఁ జూచినంతనె యువతులు మోహవివశలు కాకుందురా? ఆహా! పురుషవేషమున నీ మోమెంతవింతగా నున్నదియో చూచికొనుము. తుమ్మెదచాలు చేరని బాలకమలము వలె మెఱయుచున్నది సుమా? అని పొగడఁగా విని యముద్దియ తన వేషము నిలువుటద్దములోఁ జూచికొని వెరఁగందుచు నిట్లనియె.

అగు నగు మీరని నట్లు నామొగము నాకే క్రొత్త యగుచున్నది. తఱుచు స్త్రీలు పురుషవేషము వైచునప్పుడు మనోహరముగా నుందురు. నన్నుఁ జూచి యెవ్వరును గురుతు పట్టజాలరు కదా? కానిండు. ఈ యుపాయము మపాయరహితమైనదే ఇఁక మీవేషములకుంగూడఁ తగిన దుస్తుల నేరి యుంపుడు. సాయంకాల మగుచున్నది. మనము వేకువజాముననే లేచిపోవలయును. ఈగుహామార్గ మెంతదూర ముండునో యని పలికిన విని యాయిరువురును పరిచారక వేషములు వైచికొని యామెవద్దకు వచ్చిరి. లవంగి మొదటావా రెవరో క్రొత్తవారనుకొని సందియమందుచు నవ్వినంతనె గుఱుతుపట్టి యచ్చెరువందుచు వోహో! సఖులారా! మిమ్ము నించుకయు గుఱుతు పట్టలేకపోయితిని సుఁడీ నవ్వినం దెలిసినది మీవేషములు సమయోచితములుగానున్నయవి. మనకు భగవంతుఁడు మంచి యుపాయమే తోఁపించెను. నాకు నెడమకన్ను పాదము నదురు చున్నవి. తప్పక మనకోరిక తీరఁగలదు. రేపీవేళకు మనము విశ్వనాథున కభిషేకము చేయగలము. మఱి యే యంతరాయములు రాకుండ నుండవలయునని యనేక ప్రకారములఁ దలంచుచు నెట్టకే నాదివసముఁ గడిపినది.

అంత నా రాత్రి నా పద్మనేత్రలు తమ యంతఃపురములోనికి నితరులు రాకుండ నియమించి వేకువజామునలేచి పురుషవేషముతో నా పాతాళమార్గమునఁ గరదీపికలు గయికొని నడువం దొడంగిరి. ముందు చెలికత్తియలు నడుచుచు దారిఁ జూపుచుండ నా రాజపుత్రిక తదేకధ్యానమున నడుచుటచే గమనాయాస మించుకయు గణింపదయ్యెను. అట్లు రెండుగడియలు నడచువరకు నొకచోట నడ్డముగా దలుపు కనంబడినది.

వా రాతలుపుచీల నూడలాగి తలుపుఁ దెరచి యా దారియందున్న మెట్ట నెక్కిరి. ఆ ప్రదేశము గుఱుతు పెట్టుకుని మఱల నా తలుపుమూసి మఱికొంత దూరము నడచినంత క్రోశముదూరములోఁ గాశీపట్టణము కనంబడినది. అప్పు డరుణోదయ మగుచున్నది. కావున నందుగల యాలయ ప్రాకారమంటపాదులు తెల్లముగాఁ దెలియబడుచున్నవి. అప్పుడు లవంగిమేనుప్పొంగ హస్తంబులుజోడించి గద్గదకంఠముతో

మ॥ అంత ప్రధితప్రభావయుత దివ్యప్రహాదినీసత్తటా!
       ధ్యాళాంచ త్పృథుసౌధమధ్యగత దేవాగారసందీప్తవి
       శ్వేశాఖ్యాక మహేశలింగ మది నీవె కావె? యైక్యస్థితిన్
       గాశీపట్టణరాజమా ! యిదె నమస్కారంబు నీకిమ్మెయిన్॥

అని నమస్కరించి పరమానందముతోఁ గాశీఖండంబునంజదివిన విశేషంములు జ్ఞాపకము దెచ్చుకొనుచు సఖులతో

మ॥ అది గంగానది హారమట్లు నగరాభ్యర్ణంబునంబొల్చు న
       ల్లది విశ్వేశ్వరునాలయం బగుఁ దదభ్యాళంబునం బార్వతీ
       సదనం జొప్పెడు బిందుమాధవుని వేశ్మం బల్లదే! కామిత
       ప్రదుఁడౌడుంఠిగణేశు నాలయము నాప్రాంతంబునంజూడుఁడీ!

అని తదీయమందిర విశేషంబుల నెఱింగినట్లు వారి కెఱింగించుచుఁ గాశీపురాభిముఖముగా నాచేడియ నడువందొడంగినది. లవంగి చిన్నతనమునుండియు నశ్వగజాందోళికారోహణ క్రీడల శిక్షింపబడినది. కావున నాపయనమును శ్రమగా గణింపక నడుచుచుండెను. ఇంతలో సూర్యోదయమైనది. అప్పు డా తెలువరులు పెద్దతెరువునంబడి కాశికింబోవు తైర్థికులం గలసికొని యరిగిరి.

పురద్వారంబున రక్షక పురుషులు వారిం బరీక్షించి మీ రెవ్వరని యడిగిన నితం డొక రాజకుమారుడు. యాత్రార్థమై యరుదెంచినాఁడు. పరిజనం బంతయు వెనుక వచ్చుచున్నది. స్నానమునకు వేళమిగులునని ముందుగా నడచి వచ్చుచున్నాఁడని చెప్పి యా సఖురాండ్రు లవంగితోఁ గూడ నీటిలోఁ బ్రవేశించిరి. అంతవఱకు నే యంతరాయము వచ్చునో యని యమ్మచ్చెకంటి వెఱచుచునే యున్నది. అప్పుడు ముప్పిరిగొను సంతసముతో వడివడి రాజమార్గంబున నడుచుచు నడుమ నడుమఁ దైర్థికులఁ బరీక్షించుచున్న రాజభటులఁ జూచి వెరచుచు సమ్మర్దములోఁ దూరుచుఁ నొరులకుఁ దెలియకుండఁ తప్పించుకొని యెట్లో గంగానదికిఁ జనిరి. లవంగి యా గంగానదిం జూచి యంతరంగం బుప్పొంగ మేనం బులక లుద్భవింపఁ జేతులు ఫాలంబునం జేర్చి నమస్కరించుచు ...

శా॥ గంగా! నిన్గడుదవ్వున న్మనముసాగంగాఁ దలంపంగ వే
      గం గారుణ్యముతోడ ముక్తికరుగం గావింతు వన్నన్వబిం
      చంగా నేటికిఁదావకాంబుకణసుస్నాంతుడు పూతుండఁటం
      చుం గైవల్యము వానిదొడ్డి దివిజక్షోణీజమై యొప్పదే?

అని యనేక స్తోత్రములు సేయుచు మెరుంగుదుస్తుల నూడ్చి గట్టునంబెట్టి తిరుగ గంగలోన నెట్లో స్నానముచేసి మరల నా పట్టుబట్టల ధరించి యంగీలు ధరించి తల యారుచుకొనుచు నొక్కింతతడవు గంగయొడ్డునం గూర్చుండి యచ్చటివిశేషములఁ జూచుచుండెను.

లవంగి యంగరాగవాసనలు కేశముల నలమిన కుసుమతైలపరిమళముతోఁ గలసి దెసల నావరించుటయు నా తావి యాఘ్రాణించి యందలి జను లచ్చెరువందుచు పలుదెసల బరికించి యా యంబుజాక్షి చెంతకరుదెంచి యీక్షింపఁ దొడంగరి. సోగవెండ్రుకలకప్పు వాలుఁగన్నుల యొప్పు తళుకుఁజెక్కుల సౌరు నుదురు తీరుం జూచి వెరఁగు పడుచుఁ బురుషుం డని స్త్రీలును స్త్రీయని పురుషులును విభ్రాంతితో మోహింపఁ జొచ్చిరి. ప్రజలు తన్నావరించి చూచుచుండటఁ గిలకించి యక్కలికి వెండ్రుకల ముడివైచుకొని యుష్ణీషముఁ బెట్టుకొని యట్టె లేచి విశ్వనాథునాలయమునకుం బోవ నొకవీథింబడి నడుచుచుండెను. అట్టి సమయమునఁ గొందఱు తైర్ధికు లా వీధిం బోవుచు నొకరితో నొకరిట్లు సంభాషించుకొనుచుండిరి. కొందఱు “నిరిటి శివరాత్రికి మే మీ తీర్థమునకు వచ్చితిమి. ఏ యలజడియు లేదు. ఇప్పుడిన్ని పరీక్షలు చేయుచున్నా రేమి? దేవతాదర్శనమునకు రానీయరుకాఁబోలు" మఱికొందఱు "అయ్యో? మీ రెఱుంగరా? వినుండు. పాదుషాగారి కూఁతురు లవంగి యను చిన్నది విశ్వేశ్వరలింగమునకు స్వయముగా నభిషేకముఁ జేయవలయునని కోరిన నామెతండ్రి యప్పఁనిఁ జేయింతునని శపథమునఁ జేసి యిచ్చటికిఁ బంపినాఁడట. ఈ యూరఁ బండితభట్టుగారి కుమారుఁడు వీరుఁడనువాఁడు తురకలు రాకుండ వ్యుహములు పన్ని కాచుచున్నాఁడు. మన కాటంకములేదు. మనము తురకలమేమో యని పరీక్షలు చేయుచున్నారు. అంతియకాని మఱియొకటి కాదు.

మఱియొకచోట మంగలివాడు తలారివానిం బిలుచుచుండ నిట్టి సంవాదము విననయ్యెను.

మంగలి – ఓరీ? తలారివెంకా? గంగఁడేమి చేయుచున్నాఁడు ?

వెంకి – రాత్రి తెల్లోర్లు గస్తీతిరిగి యిప్పుడే కాదంటయా వచ్చి తొంగున్నాఁడు. ఇంతలో ఏంపని వచ్చింది.

మంగ - ఈ వేళేమో పాదుషాగారి లవంగి వచ్చి గుళ్ళో ప్రవేశిస్తుందట. యిప్పుడేమో వూళ్ళోవాళ్ళందఱిని కత్తికట్టుకుని సిద్ధముగా వుండమని చాటించాలంట బేగిలేపు ఈరుఁడుగారు సెప్పినారు.

వెంకి - ఓరిబాబోరిబాబూ యీ చాటింపులతో చస్తున్నాము మేమేటయ్యా నీ కస్తమానం గనిపిస్తాము ఈ వేళ వీరడిది చాటింపువంతు.

మంగలి - ఇప్పుడు వంతులు పనికిరావు. వూరంతా అల్లరిగావుంది. అందఱు పనిచేయలంట; లేపు.

వెంకి - లెగు లెగు ఇంకా తొంగున్నావేమి ? పనికి మంగలాయన పిలుస్తున్నాడు. చాటించాలంట. .

గంగడు --- (దొర్లుచు) దీనిముందా! వంత మందికాదు. బాటింపువంతు వీరడిది. ఈయేల దిక్కులేని పీనుగులలాగు వంతు మంది. మంగలాయనిలో వీరడి వద్దకు పొమ్మని సెప్పు.

వెంకి - చెప్పినాను. వంతులు పనికిరావంట సివంగియేమో వూరుమీదబడి యల్లరి చేస్తుందంట వేగ రమ్మంటున్నాడు.

గంగడు - నే రాను పో ముండా యీమాటు లేపేవంటే బఱ్ఱపగలు కొట్టుతాను.

మంగలి - కానిమ్ము. తొంగో అదిగో బంట్రోతుగారు వస్తూన్నారులే.

వెంకి - బేగలెగు బేగలెగు బంట్రోతయ్యే వస్తూన్నాడంట.

బంట్రోతు – (ప్రవేశించి) తొత్తుకొడకా? యిక్కడ కూర్చున్నావేమి? నీవు వచ్చి యెంతసేపయినది. గంగడేడీ?

మంగ - అయ్యోబాబూ నన్నేమంటారు? గంగఁడిది వంతుకాదంట. తొంగుండి లెగకున్నాడు.

బంట్రోతు – లంబ్డీకొడకా? గంగా? వంతు నీదికాదా? యిటురా యేమన్నావూ?

గంగడు - లేదండి బాబు లేదు. వస్తున్నాను. (అని డప్పుతగిలించుకొని వచ్చుచున్నాడు.)

బంట్రోతు - వూఁ జాగ్రత్త. టము కేమని వేయవలయునో తెలుసునా?

గంగడు - తెలుసు యిన్నాను.

బం - ఈడే నేను వినుచుండగా నోకమాటు వేయి.

గం - చిత్తము. పాదుషాగారి సివంగిపిల్లవచ్చి వూరుమీఁదఁబడి గుడిలో దూరగలదు. యిప్పుడు పుసన్నపాడులో వున్నది. కాఁబట్టి గ్రామస్తులందఱు కత్తి కట్టుకొని సిద్దంగా ఉండండోయి.

బం - ( పక పక నవ్వుచు) వోరోయి! పాదుసాగారి సివంగి యేమిటిరా?

గం - ఏమో మంగలాయన నా కాలా సెప్పినాడు.

బం - సివంగి కాదు లవంగి.

గం - లంపంగంటె యేంటండి?

బం - ఆయన కూతుఁరు పేరు.

గం - ఆయన కూఁతురు మనవూరుమీఁదఁ బడడ మేటండి. అంత కొవ్వి యున్నదా యేమి.

బం - కాదురా సరిగా విను. పాదుషాగారి కూఁతురు లవంగి చిన్నది వచ్చి హుస్సేనుబాదుకోటలోఁ బ్రవేశించి యున్నది. ఈమె విశ్వేశ్వరుని గుడిలోకి వచ్చునేమో కనుక గ్రామస్తు లందఱు కాచికొని యుండవలయును. అని చాటింపరా!

గం - ఓయిబాబో! అన్నిమాటలు నాకు నోటపట్టునా తగ్గించి చెప్పండి.

బం — మఱేమీవద్దు లవంగి వచ్చువేళయైనది. అందఱు కాచుకొనియుండ వలయును. అని చెప్పగలవా?

గం – ఈమాటు చెప్పఁగలను. (అని యా ప్రకారము వీథుల వెంబడి చాటించుచున్నాఁడు.)

అట్లనేక ప్రకారములఁ జెప్పుకొనెడు ప్రజలమాట లాలించుచు నమ్మించుబోఁడులు తైర్థికులం గలసి నడుచుచుఁ గ్రమంబున విశ్వేశ్వరు నాలయంబున కరిగిరి. అందు బెక్కండ్రు రాజభటులు గాచియుండి లోనికిఁ బోవువారినెల్ల బరీక్షించుచు నలజడి లేకుండఁ గొంచెముగా జనులవిడిచి లోనివారు వచ్చినతరువాతఁ దక్కువారిం బోనిచ్చుచుండిరి. అప్పుడు సమయమరసి లవంగి చెలికత్తియ లిరువురు ముందు నడచుచు ద్వారపాలురతో 'అయ్యా! ఈతం డొక రాజపుత్రుండు. సమ్మర్ధము సైరింపలేఁడు. స్వామిని సేవించి వచ్చువఱకుఁ బెక్కండ్ర జనుల విడువకుఁడు. మీకుఁ బారితోషిక మిప్పింతు' మని చెప్పి లోపలకుం తీసుకొనిపోయిరి. లవంగి సఖులతోఁగూడ స్తుతిశ్లోకములు జదువుచు మేనుప్పొంగఁ బ్రదక్షిణములు చేయఁ దొడంగినది.

అప్పుడు కుందలతిక మెల్లగా బల్లవపాణి! ఇప్పటికి నీ కోరిక యీడేరినది. ఇంక మనల నాటంకము సేయువారుండరు. గుడిలోనికింబోయి యభిషేకము సేసికొని వేగఁబోవుదమురమ్ము. అడుగడుగునకు నాలస్యము చేయకుమని పలికిన విని యక్కలికి యిట్లనియె. 'మీ బుద్ధిబలమునఁ గార్యసాఫల్యమైనట్లె తలంచెదను. కాని మీరా ద్వారమునఁ జేయడ్డముగాఁ బెట్టికొని కాచియున్న పురుషునింజూచితిరా ? గర్భాలయములోనికిం బోవుటకు నతని యాటంకము గలుగునట్లు తోఁచుచున్నది. నేనదియే పరీక్షించి చూచుచుంటిని. ప్రతి మనుజుని బెద్దగా విమర్శించుచున్న వాఁడు. ఈసారి బడమరదెస కరిగినప్పుడు విచారింపు' డని పలికినది.

ఆ దినమున వీరుం డన్నిద్వారములయందు నితరులను గాపుపెట్టి తాను విశ్వేశ్వర మహాదేవుని గర్భాలయము పడమర గుమ్మమున నిలిచి వచ్చిపోవువారిం బరీక్షించుచుండెను. ఆ జవ్వనులు మువ్వురు నట్లు ప్రదక్షిణములుచేసి ముఖపంటపమునకుం బోయి యందు ఘంటానాదములు చేయుచు వీరునింజూచి బెదరుచు నల్లనల్లన గర్భాలయములోఁ బ్రవేశింపఁబోయిరి. అప్పుడు వీరుఁడు లవంగి చేయిబట్టుకొని నిలు నిలు యవనుండవోలె నుష్ణేషముతో స్వామియొద్ద కరుగుచుంటివేమి? నీ వెవ్వడవని యడిగెను. ఆ మాటలు విని చెలియకత్తియలు ముందరనిలిచి అయ్యా? ఈతండు నేపాళదేశరాజకుమారుండు. తలపాగయు నంగీలును దీసి బయటకువచ్చుట మా దేశా చారము కాదు. అది లేనిదే మేమేపనియుఁ జేయము. మమ్ముఁ బోనిండని వినయముగాఁ బ్రార్థించిరి. లవంగి యతండు తనపాణిగ్రహణము జేసినదిమొదలు వివశయై తదీయరూపలక్షణంబులు విస్మయముగఁ గలుగఁజేయ నతని మొగ మట్టెచూచుచుండెను. ఆబోటులమాటలు విని వీరుఁడు చేయివిడువక మీదేశాచారములు మాదేశమునం బనికిరావు. ఇష్టమగునేని నంగీలును దలపాగయుఁ దీసి లోపలకుఁ బొండు. లేనిచో నిందే నిలువుండు. అని మోమోట ముడిగి పలికెను.

అప్పుడు లవంగి చేయి విదళించుకొని యించుక వెనుకకుం జని యతని మొగముపైఁ జూపులు నెరయఁజేయుచు ధైర్యముతో 'అయ్యా ! నావేషము యవనవేషమువలె నున్నదని పలికితిరి. మీవేష మెట్లున్నది? మీరెవ్వరు? నన్నాక్షేపించి మీరిట్టివేషముతో నిందుంటిరేల? యని యడిగినది.

వీరుఁడు నేను బ్రాహ్మణకుమారుండను ద్వారమును గాచుచుంటిని. గాన నిట్టివేషము వైచికొంటిని. ఈవేషముతో లోపలకు బోవను.

లవంగి — అహో? భవదీయ విప్రత్వం, శాస్త్రాభ్యాసంవా, వేదపఠనంవా, ఉత యజ్ఞకరణంవా విశిష్యతే కింతేభ్యోత విప్రాణాం సేవకావృత్తి॥ మీబ్రాహ్మణత్వమంత కొనియాడఁదగియున్నది. ఇది శాస్త్రములు చదువుటా? లేక వేదము వర్ణించుటా? యజ్ఞములు చేయుటా? వానికంటె నిక్కడి బ్రాహ్మణులకు సేవకావృత్తియే యెక్కుడు కాబోలు అని గీర్వాణభాషతో నాక్షేపించినది.

వీరుఁడు - శాస్త్రేమవా నేదేషువా పరిచయోస్తికింభవతో యస్మిన్ కస్మి న్మాం పృచ్చం నాహం సేవకః వీరోహం యవనపుత్రికాప్రవేశభయా దేవతాలయ ద్వారం రక్షామి॥ మీరు శాస్త్రముల యందైనఁ వేదమందైనఁ బరిచయము గలిగియున్న యెడల మీ యిష్టమువచ్చినదానిలో నడుగుఁడు. నేను సేవకుండనుగాను వీరుండను. లవంగి యను చిన్నది బలాత్కారముగా నాలయములోఁ బ్రవేశించునని యీద్వారము గాపాడుచుంటిని.

లవంగి — ఉచితంవా విప్రస్యవీరత్వం దయామయ హృదయస్య॥ దయాహృదయుం డగు బ్రాహ్మణునికిఁ బౌరుషము తగునా ?

వీరుఁడు - కోయం పరసురామః. పరశురాముఁ డెవ్వఁడు? బ్రాహ్మణుఁడు కాఁడా? అతం డెట్లు వీరుండయ్యెను.

అని యారీతి వారిరువురకు యుక్తిప్రయుక్తులుగా రెండు గడియలు శాస్త్రములయందును బురాణములయందును బ్రసంగము జరిగినది. అందు వీరుని మాటలే మిగిలియుండెను. అప్పుడు వీరుఁడు అయ్యా ! యిది పర్వదినము. ------పరులు పెక్కండ్రు వచ్చుచుందురు. మనప్రసంగము పెక్కండ్ర నిలఁబెట్టినది. ఇప్పుడు సమయము కాదు. వెండియు దర్శనమిత్తురేనిఁ బ్రసంగింతము. మీతో మాటాడుటకు ముచ్చటగా నున్నది. మీ సుముఖత్వము మనోహరమై యున్నది. అని పొగిడిన నతనిమాటలకు సందియమందుచు నయ్యిందువదన యంతటితోఁ బ్రసంగము విరమించి చేతులు జోడించి అందుండియే విశ్వేశ్వరు నిట్లు వినుతించినది.

     జయ శంకర పంకజనాభ విధి
     ప్రముఖామరసేవిత పాదయుగ
     స్థిరముక్తిద భక్తినిదాన భరా
     బ్దిజలే పతితా మవమాం కృపయా ॥1॥

     ధరణీధరమందిర! బాలనిశా
     కరశేఖర! భూతిమనోహర! హే
     హర! పాప భయంకర! ఘోరభవా
     బ్దిజలే పతితా మవమాం కృపయా ॥2॥

     గిరిచాప! మహీధర! వారిధితూ
     ణ! రమాధవబాణ! మహారథిక!
     త్రిపురాసురభంజన! ఘోరభవా
     బ్దిజలే పతితా మవమాం కృపయా ॥3॥

అని యవ్వనితారత్నము విశ్వేశ్వరమహాదేవుని నినుతించిన విని యవ్వీరుండు సంశయాకులహృదయుండై (అహో కిమేతర్ పతితా మిత్యంగనావిశేషణస్తౌషి) అయ్యో యిదియేమి? నీవు వనితాం అని స్త్రీవిశేషణము వైచికొని స్తోత్రము చేయుచున్నా వని యడుగఁగా (వనితారచితస్తుతివృత్తరత్నా నియమా ఫణితాని) స్త్రీచేత రచియింపబడిన వృత్తములు నాచే నిప్పుడు చదువబడిన వని యుత్తరముఁజెప్పి యమ్మ త్తకాశిని తత్తరముఁ జెందుచుఁ జెలికత్తియలతోఁగూడ నచ్చోటు కదలి సత్వరముగా వచ్చినదారి ననుసరించి తన యంతఃపురమునకుం జనినది. అని యెఱింగించు వఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డంతటితో నావృత్తాంతముఁ చెప్పుటఁ జాలించి పైమజిలీయందుఁ దదనంతర వృత్తాంతమిట్లని చెప్పఁదొడంగెను.

ముప్పదియైదవ మజిలీ.

గోపా! విను మట్లు లవంగి సఖులతో నంతఃపురంబునం బ్రవేశించి భుజించిన వెనుక నొక రహస్యప్రదేశంబునం గూర్చుండి వారితో నిట్లు సంభాషించినది.

లవంగి - కుందలతిలకా! నేడు మీదయావిశేషంబునం గదా విశ్వేశ్వరునిం జూడగంటిని. కాకున్న నందఱ మరిగి యా యాలయంబున బ్రవేశింపశక్యమా?

కుంద - నీచే విశ్వేశ్వరలింగమున కభిషేకముఁ జేయంచలేక పోయితిమని లజ్జించుచున్నాము. ఆ గుమ్మముఁగాచియున్న బ్రాహ్మణకుమారుం డసాధ్యుండుగదా? ఏమి చేయుదుము.