కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/205వ మజిలీ
క. నీవొనరించిన సాహస
మేవారుం జేయరైరి యిదివఱ కిపుడో
దేవా! నేను భవత్పద
సేవకురాలై తి నిను భజింతుఁ బ్రియమునన్ .
నీ కేది యభీష్టమో యట్లు కానింతు నీవే నా భర్తవని పలుకుచు నక్కమలదామం బతని మెడలో వేయఁబోయిన బాలించుచు,
గీ. నిలు నిలు నా యిష్టము గతి
సలుపుదుపుగదా వధూటి సంతస మిదిగో
నిలుచున్న వాఁడె నీపతి
చెలువుగ నాతని భజించి చెందుము సుఖముల్.
అతని నిమిత్తమే నేనీసాహసకృత్యము గావించితి నతని భజించుటయే నా యభీష్టమని పలికిన విని యా దేవత మారుమాట పలుకలేక తన్నియమమునకు బద్ధురాలై యీ దామం బందుఁ దెల్లబోయి చూచుచున్న మిత్రగుప్తుని మెడలో వైచి వరించినది.
విక్రమార్కుండు ఆ దంపతుల నత్యంత సంపదలతోఁ దులదూగునట్లు వేల్పులం బ్రార్ధించి తదామంత్రణంబు వడసి కొండదిగి గుర్రమెక్కి యుత్తరాభిముఖుండై యరిగెను.
అని యెఱింగించి మణిసిద్ధుండవ్వల కథ పై మజిలీ యందు జెప్పం దొడంగెను.
205 వ మజిలీ.
బలిచక్రవర్తి కథ
విక్రమార్కుండట్లు మిత్రగుప్తుండను బ్రహ్మచారి యభిలాషదీర్చి యటఁ గదలి యుత్తరాభిముఖుండై పోవుచుఁ గొన్ని పయనంబులు గడచినంత నొకనాఁడొక యరణ్యములో నేనుఁగకన్నను బెద్దదియగు వరాహ మొదటి యెదురఁ బడి జడియక ఘుర్ఘారా రావముతో నతని గుర్రముమీఁది కుఱుకుటకుఁ బ్రయత్నించినది. అప్పు డతండు తన వాఱువమును విచిత్రగమనంబుల నడిపించుచు జంద్రహాసము గేలనమర్చి గుర్రమును దానిపైకిఁ దోలెను.
తత్ఖురాఖాతములు పీడగలుగఁజేయ నా యడవిపంది కొందల మందుచు వెన్నిచ్చి పఱవఁ దొడంగినది. తత్తురంగము దానిం దరుముకొనిపోయెను. వాయువేగమున నది పారిపోవుచు నృపతి కత్తివేటునకందు సమయంబున నందున్న యొక బిలంబునం దూరి పారిపోయినది.
అప్పు డతం డా గుర్రముతో నందుఁ బోవుటకు వీలులేక గుర్రమును దిగి యందుండుమని సంజ్ఞచేయుచుఁ జంద్రహాసంబుఁ జేతంబూని నిర్భయముగా నంధకార బంధురంబగు నబ్బిలంబునం బ్రవేశించి పోఁదొడంగెను. ఆ మార్గము పోయినకొలఁది చిన్నది కాఁజొచ్చినది. కొండంతపంది యం దెట్లిమిడినదో యని యచ్చెరువందుచు నయ్యసహాయశూరుండు మఱల దానికిఁ జాలినమార్గంబు నాకేల లేకపోవునని తలంచచుఁ బోవంబోవ మఱియు నా వరాహము హ్రస్వము కాఁజొచ్చినది. శరీరనిరపేక్షుండగు నాదక్షుండు తదంతము చూడక మరలువాఁడా? కొంతదూరము వంగియుఁ గొంతదూరము బాకియుంగూడఁ బోయెను. అంతలో నతని మేనికి గమనాయాసము వాయఁ జల్లనిగాలి విసరినది. బిలావసానము సమీపముననే యున్నదని తలంచుచు మఱి పదిబారలు సాగినంతట నించుక వెలుఁగు గనంబడినది. క్రమంబున నా బిలంబు పెద్దదగుట నడచుటకు వీలుపడినది అట్లు పోవం బోవ నా కందర మొక సుందరోద్యానవనంబునకుఁ దీసికొనిపోయి విడిచినది.
అయ్యుపవనవిశేషములం బరికించి యా నరపతి యవి యదృష్టపూర్వములగుట నపరిమితాశ్చర్యముతో నందు విహరింపుచు నా పోత్రి జాడ నించుకయుం గానక నలుమూలలు దిరుగుచుండ నల్లంతదవ్వుఁలో గనకరత్నగోపురప్రాకారసౌధాదులచేఁ బ్రకాశించుచున్న యొక పట్టణ మతనికి నేత్రపర్వము గావించినది
అప్పు డతం డోహో! ఇది నాకు స్వప్నమా యేమి? వెనుక మలయవతీ నగరమువలె నిదియుం గనంబడినదియా? కాదు కాదు. ఇది సత్యమే. వరాహమును దరుముకొనివచ్చి గుహామార్గంబున నిందుఁ జేరితిని. ఇది యే రాజు రాజధానియో కావచ్చును. ఈ నగరాభ్యంతరంబున కరిగి విశేషంబులం జూచి వెండియు నిందు వచ్చెద నీ కదళీవనంబు మొదటగదా? ఆ గుహ యున్నది. అని గురుతులు జూచుకొని మెల్లగా నా యుద్యానవనమార్గ మతిక్రమించి పట్టణాభిముఖముగా నరుగుచు నుభయపార్వ్శములం బరికింపుచుండెను.
ఉ. ఏనరనాథుఁ డీనగర మేలునొ? మేలు! తదీయవైభవ
శ్రీ నుతియింప నొప్పు భళిరే! యలకాదిసురాలయంబులున్
మానితరత్నహర్మ్య లసమానవిభావిభవాధిరామతన్
దీని సమానమౌనని మదింతలపోయ పయారె! సత్ప్రభల్
అని తత్పురీరామణీయకం బభివర్ణించుచుఁ బోయి పోయి తదభ్యంతరంబు సొచ్చి స్ఫటికమణిగణఘటిత మనోహరములగు వీథులంబడి యరుగుచు నతం డాత్మగతంబున,
సీ. ఏవీథిఁ గనుగొన్న శ్రీవల్లిభుని గుణా
లాపసంవాదకోలాహలంబె
ఏసౌధ మరసిన నిందారారపుచిహ్న
సుందరాలంకారశోభితంబె
ఏవేదికను జూడ గోవింద సత్కథా
బారాయణాసక్త భక్తజనమె
ఏదెస బొడగన్న ద్వాదశోర్వోరుపుం
డ్రవిరాజితాంక వైష్ణవజనంబె.
గీ. ఏనివాసముగాంచిన శ్రీనివాస
నామ సంతతసంకీర్తన స్వనంబె
భళిర! పరికింప నీమహాపట్టణంబు
హరికి నిరవైన వైకుంఠపుర వరంబొ.
అని తలంచుచు విక్రమార్కు డన్నగరవీథుల నడచుచుండ నొక్కండైన నీ వెవ్వడ వెందుఁ బోయెదవని పల్కరించినవాఁడు లేడు. ఊరక వీథులం దిరిగి తిరిగి యతం డొక దేవాలయము ప్రక్క తటాకము మ్రోల కల్యాణమండపములోఁ గూర్చుండి శ్రీవైష్ణవులు గొందఱు పురాణము జదువుచుండ విక్రమార్కుండు మెల్లఁగా నా మంటపము మీఁద నోరఁగా గూర్చుండి యా పురాణవిశేషము లాకర్ణింపుచుండెను. అప్పుడు కేశవాచార్యులు పురాణము చెప్పుచున్నాఁడు.
కేశవాచార్యులు -
శ్లో. అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వతః
నిత్యం సన్నిహితోమృతః కర్తవ్యోధర్మసంగ్రహః.
దేహము క్షణభంగురము. విభవములు మెఱపుంన్నను దొందరగాఁ బోవునవ. ప్రతిక్షణము మృత్యువు దేహమునకు సన్నిధానమందే యున్నది. ఇట్టి స్థితిలో మనుష్యుండు చేయఁదగిన ప్రయత్నమేమి? ధర్మము సంపాదించుటకు సర్వదా యత్నించుచుండవలయు.
శ్రోతలలో నొకఁడగు మాధవాచార్యులు ఆహా హా! ఏమి శ్లోకమండి! ఇది యెట్టిసారమైనమాట! బాగు. బాగు! స్వామీ! ధర్మ మనఁగా నెట్టిదో సెలవిత్తురా.
కేశవ - చెప్పుచున్నాను వినుండు.
శ్లో. యోదుఃఖితాని భూతాని దృష్ట్వాభవతి దుఃఖితః
సుఖితాని సుఖీచాపి సధర్మాత్మెతి శ్రూయతె
నాతో భూయ స్త్సరో ధర్మః కశ్చిదన్యోస్తిదేహినః
ఎవ్వడు భూతములు దుఃఖింప దుఃఖించునో సుఖింప సుఖించునో వాఁడే ధర్మాత్ముఁడని చెప్పఁబడును. భూతదయకన్న నుత్తమధర్మము లేదు. ధర్మమనంగా దానికే రూఢియైనది. తెలిసినదియా?
మాధవా - మేలు. మేలు. బాగు బాగు. నాలుగు వేదముల యొక్కసారము చెప్పితిరిగదా, కేశవాచార్యా! తరువాత.
కేశ – శ్లో. అధ్రువేణ శరీరేణ ప్రతిక్షణ వినాశినా
ధ్రువంయోనార్జయేద్ధర్మం సవోచ్యో మూఢచేతనః
ఎవ్వనికిని ముందరి క్షణ మెట్లుండునో తెలియదుగదా? అట్టి యశాశ్వతమైన దేహముచేత శాశ్వతమై యొప్పుచుండు ధర్మ మెవ్వఁడార్జింపఁడో యంతకన్న మూఢుండు పశుపు పాలసుం డింకొకఁడున్నాఁడా?
మాధవా - స్వామీ ! మీరు చెప్పినవి యమృతఘుటికలు గదా తరువాత..
కేశ —శ్లో. హోమధేను ధనాదీనాం దాతారః సులభాభువి
దుర్లభః పురుషోలోకే సర్వజీవదయాపరః
ధనకనక వస్తువాహనాదులు దానమిచ్చు దాతలు పెక్కండ్రుగలరు. కాని సర్వజీవములసమముగా జూచి యానందించువాఁడుండుట యరుదు. అట్టివాఁడు భూలోకములో విక్రమార్కుండను మహారాజున్నాఁడని చెప్పుదురు. కామక్రోధాదుల హృదయంబున నిరూఢములై యుండ నట్టి గుణంబు లెట్లు కలుగును.
మాధవాచార్యులు :- నిత్యము బరోపకారమునకై ప్రయత్నము చేయు చుండవలయును. దేహమును నిర్లక్ష్యముగాఁ జూచి సాహసకార్యములు చేయుచుండ వలయును. చావునకు వెఱవఁకూడదు. ఆచార్యులుగారూ! మీరు నమ్ముదురో లేదో కాని నేనిప్పు డట్టి ప్రయత్నమే చేయుచుంటిని అని చెప్పుచుండఁగనే యాప్రాంతము నుండి యొక వృద్ధ బ్రాహ్మణుఁ డరుదెంచి మహాత్ములారా! పుణ్యాత్ములారా! రక్షింపుడు. రక్షింపుడు. మొసళ్ళున్న వని యెఱుంగక మేమీ పుణ్యసరస్సులో స్నానము చేసితిమి. నా భార్య నొక మొసలి లాగికొని పోవుచున్నది. మీలోఁ బుణ్యపురుషుఁ డెవ్వఁడైన వచ్చి రక్షింపరే యని యాక్రోశించెను.
అప్పుడావైష్ణవు లెల్ల లేచి అయ్యో ! ఈ స్వామికిఁ దెలియక యాసరస్సునకే పోయెనా? అందుఁ గ్రుంకినవాఁడు బ్రదుకుట కష్టమే. మొసళ్ళు చాలఁ గలవు. ఇతరులు బోవుటకష్టమే అని పలుకుచుఁ దటాకము చుట్టును నిలువబడి చూచుచుండిరి.
అప్పుడు పురాణము చెప్పుచున్న కేశవాచార్యులు మాధవాచార్యులుగారితో స్వామీ! సమయము వచ్చినది. మనము చదివిన విషయములు యథార్థము దెలియుటకే యీ బ్రాహ్మణుఁ డిట్లు వచ్చెనేమో యెట్లయిన నేమి? మీరు సాధనము చేయుచున్నారు గదా దుముకుఁడు కొలనిలో దుముకుఁడని ప్రోత్సహించుటయు నతండిట్లనియె.
స్వామీ? శరీర మాద్యం ఖలు ధర్మసాధన మని చెప్పియున్నారుగదా? ఈ కోనేరులోఁ దిగినవాడు తిరుగా బ్రతుకుననుమాట కల్ల. ఆమెను బట్టికొని తీసికొన రాలేకబోవుటయేగాక వృధాగాఁ జావవలసి వచ్చును. ఇట్టి దారుణక్రియ ధర్మశాస్త్రసమ్మతమని నేనంగీకరింపను. ఆమె కాయువు మూఁడియే యందు మునిఁగినది (బుద్ధిః కర్మానుసారిణీ) అను మాటయేల తప్పును. దైవలిఖితముల మనము మార్చగలమా? ఆమె ప్రారబ్ధ మట్లున్నది. మనమేమి చేయఁగలము, ఆమెకు జలగండము విధి విధించియున్నాఁడు. మనము చూచుచుండవలసినదే కాని చెఱువు చేరఁగూడదని పెద్దగా నుపన్యసించెను.
ఆ వృద్ధబ్రాహ్మణుడు మొఱపెట్టుచుండ నాలించి యందుఁ బురాణము వినుచున్న విక్రమార్కుండు వెఱవకుఁడు నేనిదే మీ భార్యను విడిపించెదనని పలుకుచు గుభాలున నాతటాకములో నుఱికి కరవాలమున నా మకరముం బరిమార్చి యావృద్ధకాంతం బట్టికొని యొడ్డెక్కెను. అందఱు తెల్లబోయి చూచుచు నీ మహాపురుషుఁ డెవ్వఁడు? ఈ సాహసాంకుఁ డెవ్వఁడు? ఎందలివాఁడు? అని యాశ్చర్యముతోఁ జూచుచుండ నా వృద్ధబ్రాహ్మణుఁడు మహాత్మా! నా భార్యను బ్రతికించితివి నా యిల్లు నిలిపితివి. నీకు నేను బ్రతిక్రియ యేమియు జేయజాలను. గంగాతటంబునఁ బదిసంవత్సరములు గాయత్రీపునశ్చరణఁ గావించితి. తత్ఫలంబు నీకు ధారవోయుచున్నానని పలికి యట్లు గావించెను. అంతలో నాతటాకములోనుండి వికృతాకారుఁడగు నొక పురుషుఁ డరుదెంచి మహాత్మా! నేనొక గంధర్వుఁడ నైశ్వర్యమదమత్తుండనై తపోధనుం బరాభవించి మకరముగా శపింపఁబడితిని. నీచేఁ జంపఁబడి తజ్జన్మంబుఁ బాసితిని. నీవిప్పు డీవిప్రునివలన వడసిన గాయత్రీపునశ్చర్యాఫలంబు నాకు ధారవోసితివేని పూర్వరూపము గైగొందునని ప్రార్థించుటయు విక్రమార్కుండు మహాప్రసాదమని యప్పుడే యప్పుణ్య మతని కిచ్చివేసెను.
వాఁడు దివ్యరూపము ధరించి విక్రమార్కుని యశము గీర్తించుచు స్వర్గమునకు నిర్గమించెను. ఆ విచిత్రమంతయు నందలి వైష్ణవులు చూచి యబ్బురపాటుతో నతని చేరం జని మహానుభావా! నీవెవ్వండ మెందలివాఁడవు. ఇక్కడి కెప్పు డరుదెంచితివిఁ నీ వృత్తాంత మెఱుంగఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.
నేనొక బాటసారిని. మార్గము దప్పి మీ నగరమున కరుదెంచితి ఇది యే పట్టణము. దీనింబాలించురా జెవ్వఁడు? ఇందలి పుణ్యపురుషులంజూడ వైకుంఠమువలె నొప్పుచున్నది. దీని వృత్తాంత మెఱింగింపుడని యడిగిన వారిట్లనిరి.
అయ్యా! ఇది మహాబలిపురంబు. దీన్ని బలిచక్రవర్తి పాలించుచున్నాఁడు. ఇది పాతాళలోకములో నొకభాగము. పరమభాగవతశిఖామణియగు బలిచక్రవర్తి నానాదేశములనుండి నూరువేల వైష్ణవ గృహస్థుల రప్పించి యిందుఁ గాపుర ముంచెను. ఇందు వైష్ణవగృహములు లక్షయున్నవి. ఇందలివారందఱు బలికాశ్రితులు గురువులును నిత్యము వీరు తీర్థప్రసాదములఁ దీసికొనిపోయి బలికిచ్చుచుందురు. వీరి సంరక్షణయంతయు బలిచక్రవర్తిదే యని యెఱింగించిన వెఱగందుచు విక్రమార్కుం డిట్లనియె.
ఆహా! ఏమి నాపుణ్యము నేను వరాహమూలమునఁ బాతాళలోకమునకే వచ్చితినా? ధన్యుడనైతిని. పరమభాగవతశిఖామణులు మీ దర్శనము జేసి కృతార్థుండనైతిని. మఱియు శ్రీమన్నారాయణుండు బలిచక్రవర్తి వాకిలిఁ గాచికొనియుండునని చెప్పుదురు. ఆ మాట వాస్తవమేనా? అమ్మహాత్ముని గృహ మెందున్నది? యెఱింగింపుడని యడిగిన వారిట్లనిరి
అయ్యా? యీ నగరమునకుఁ తుది మొదలు లేదు. ఇది వైష్ణవుల వీథి యండ్రు. మఱియొకటి రాక్షసులవీథి. మఱియొకటి యురగుల వీథి. అంతయు బాతాళలోకమే యని చెప్పుదురు. బలిచక్రవర్తి గృహ మీ నగరమధ్యమున నున్నది. ఎటనుండి పోయినను నేఁడు వాకిళులు దాటిపోయినంగాని యమ్మహాత్ముని దర్శనముగాదు. ప్రతి ద్వారమునందు శంఖచక్రగదాది సాధనహస్తులు శ్రీవత్సలాంధనులు ద్వాదశోర్ధ్వపుండ్రధారులైనవారు గాచియుందురు. అందు శ్రీవిష్ణుం డెవ్వఁడో తెలియదు బలిచక్రవర్తికిఁగల వైభవము మహేంద్రునికి లేదని యచ్చటి విశేషములన్నియు నెఱింగించిరి!
విక్రమార్కుం డక్కడికథ లన్నియు విని యబ్బుచు నందున్న వైష్ణవుల వలన బలిచక్రవర్తియున్న నెలవునకు మార్గము తెలిసికొని యొకవీథింబడిపోవుచు దారిలో ననేక విశేషములఁ జూచుచు నరిగి యరిగి క్రమంబున రక్కసు లుండువీథి సొచ్చి శ్రీవైష్ణవులకు నందలి రాక్షసుల నించుకయు భేదము గానక బలిచక్రవర్తి విష్ణుభక్తిగుఱించి ప్రశంసింపుచు నురగులవీథికిం బోయెసు. అందొక గృహపతి యఱుంగుపై నించుక సేపు విశ్రమించెను. లోపలి సంవాదమిట్లు వినంబడినది
ఉరగుఁడు - సకియలారా! స్వర్గమున కరిగి మీరింత యాలసించి వచ్చితిరేమి? జానకీపరిణయనాటకము జరిగినదియా? అందు మీరు వేషములు వైచితిరా? మీ రేభూమికలైరి.
నాగకన్యకలు — ప్రాణేశ్వరా! మేము మీ సెలవు భూని నాకమున కరిగితిమి. జానకీపరిణయము జరిగినది. అందు రంభ జానకివేషము వైచినది. మేమిద్దరము సఖులవేషము వైచితిమి. ఆ భాగములన్నియు వర్ణించితిమి. అది కడుచమత్కారమైన నాటకము.
ఉర - అందలి చమత్కార మేదియో కొంచెము వినిపింపుఁడు.
నాగ -- సీతారామలక్ష్మణు లడవిలోఁ బర్ణశాలలో వసించునప్పుడు ఖరాసురుఁడు రామునిఁ బరిభవించి రమ్మని విరాధు ననుపుటయుఁ దత్ప్రేరణంబున విరాధుఁడు శుకరూపము ధరించి రామలక్ష్మణులం గాంచి తత్తేజోపరిభూతచేతస్కుండై విజయాశ వదలి శ్రీరామరూపము ధరించి సీత నెత్తుకొనిపోవఁ దలఁచుచు నా ప్రాంతమందు వసించి సమయ మరయుచుండ శూర్పణఖ యరుదెంచి యతనిం గాంచి నీ విందేమిటికి వచ్చితివని యడిగినది. ఖరప్రేషితుండనై శ్రీరాముం జంపుటకై వచ్చితినని చెప్పెను. తానుగూడ రావణప్రేరితురాలనై శ్రీరాముని పరిభవించుటకే వచ్చితినని చెప్పినది. ఇరువురు మాటాడికొని చెరియొక దెసకుఁ బోయి కాచికొని యుండిరి.
సీత రాముని బిలిచి యీవలకు వచ్చెనేని రామవేషము వేసికొని యామె నెత్తుకొని పోవదలంచుకొని విరాధుఁ డొకమూలఁ బర్ణశాలఁ గాచికొనియుండెను.
శూర్పణఖ సీతవేషము వహించి శ్రీరాము నెత్తుకొనిపోయి విక్రీడింప వేలయునని తలంచి యొకమూల నట్టివేషముతోఁ గాచికొని యుండెను.
అప్పుడా ప్రాంతమందు దిరుగుచున్న విరాధుఁడు సీతావేషముతో దూరదూరముగాఁ దిరిగుచున్న శూర్పణఖం జూచి సీత యనుకొని దాపునకు జేరి సీతా! రారమ్ము. ఈ వనములోఁ గ్రొత్తవిశేషము లున్నవి. చూతము గాక అని పలుకుచుండ నదియు సంతసించుచు దూరదూరముగా వాని వెంటఁ బోయినది. కొంతదూరము బోయిన తరువాత సందుఁ జూచి వాఁడా సుందరిని గౌఁగిటఁ జిక్క బట్టి యెత్తుకొని పారిపోవుచుండ శూర్పణఖ పర్వతమువలె బరువగుటయు వాఁడు మోయలేక నిదానించి చూచి అయ్యో? శూర్పణఖవలె నున్నదే అని పలుకుచు గుభాలున నేలబడ వైచెను. ఇరువురు నిజరూపము వహించిరి. అయ్యో! నీవా? అనియు నీవా? అనియు తెల తెల్లఁ బోయి చూచుచుండిరి.
వారి కపటప్రచారములు చూచి సభ్యులు కడుపు లుబ్బులాగున నవ్విరి! ఈలాటి వింత లనేకము లానాటకమునంగలవు. అంతయు రాక్షసమాయచర్యలతో నిండింపఁబడి యున్నది.
అని యెఱింగింప విని యురగుఁడు ఆ నాటకమున కెవ్వ రెవ్వరు వచ్చిరని యడిగిన భార్య లిట్లనిరి.
ప్రాణేశ్వరా? అష్టదిక్పతులు, ముప్పది మూఁడుకోటుల వేల్పులు గరుడ గంధర్వ కిన్నర యక్ష రాక్షసాది దేవతావిశేషులెల్లవచ్చి వచ్చి సభ నలంకరించిరి. మఱియు నలకాపురమునుండి కుబేరుని మరదలు మదనమంజరి యనునది పెక్కండ్ర యక్షకాంతల వెంటబెట్టుకొని వచ్చి యా నాటకమునఁ పెక్కు భూమికలకు సహాయము గావించినది.
మఱియు నామె యీ నాటక మాడిన మరునాఁడే త్రిపురసుందరీ విక్రమార్కమను నాటకము దా రచించినది యందు బ్రదర్శింపఁ జేసినది. అందు మేము గొన్ని భూమికల వహింపవలసి వచ్చినది. ఆహా ! ఆ నాటకమున విక్రమార్క మహారాజు సాహసవితరణాది సుగుణ గణంబులు విచిత్రముగా వర్ణింపబడినవి. అమ్మహారాజుం జూడ వేల్పులందఱు వేడుకపడుచున్నారు. త్రిపురసుందరి ఆమెకక్క కూఁతురట ఆ నృపతి రెండవ భార్యగాఁ జేయునట. గంధర్వాది దేవతలు తమ తమ కన్యకల నతనికి వివాహము జేయఁ బ్రయత్నించుచున్నారు. అతని కీర్తి ప్రతాపసౌందర్య చాతుర్యాదులు విని దేవకన్యకలు మన్మథార్తిం బొందుచున్నారు. రెండవ నాటకమున మేము వేషములువైచుటచే నన్న దివసంబునను రాలేకపోయితిమని యచ్చటి వృత్తాంతమంతయుం జెప్పిరి. అయ్యుదంతము విని యురఁగుడు ఔను విక్రమార్కమహారాజు కీర్తి పాతాళమునగూడ వ్యాపించినది.
నాగకన్యకలు గానము సేయుచుండ నాలించితి. వాసుకి మునిమనుమరాలు మణిమస్తకి యను జవరా లతనిసుగుణగణంబులు విని వివాహమాడ యత్నించు చున్నదని విన్నాను. మనుష్యుఁ డైననేమి ? సకలగుణగరిష్ఠుండు, దేవతలకుఁ గూడఁ బూజ్యుండగునని పలికెను. వారా రాత్రి పెద్దతడవు విక్రమార్కుని యశోవిసరంబుల నభినుతించిరి.
ఆ మాట లన్నియు విని విక్రమార్కుండు సిగ్గుపడుచు మదనమంజరి కృతజ్ఞతను మెచ్చుకొనుచు నఁట గదలి యా వీథింబడి పోవుచు నది రాత్రియో పగలో తెలియక విభ్రాంతుఁడై ఆహా ! ఈ నగరము వీథులకుఁ దుది మొదలు గనంబడుచున్నవి. బలిచక్రవర్తి యున్న నెల వెంతదూరమున్నదో తెలియదు. ఇది యురగనగరమని తోచుచున్నది. వీరుగూడ వేల్పులవలె సౌమ్యదర్శనులై యున్నారు. నా భాష తెలియకనేమో వీరు నా మాట కుత్తరమీయరు. కానిమ్ము. ఎప్పటికైన నవసానము చూడకపోవుదునా ? అని తలంచుచు మఱికొంత దూరము నడిచినంత నొకింత నోరఁగా నొక యుద్యానవనము గసంబడినది. అందుఁ గొందఱు నాగకన్యకలు విహరింపుచుండిరి.
వారి సౌందర్యాతిశయముఁ జూచి యాశ్చర్య మందుచు విక్రమార్కుం డల్లన నవ్వనోప్రాంతమున కరిగి యందొక లతాకుడుంగము మాటున నిలువంబడి వారి క్రీడాలాపము లాలించెను.
రత్నపదిక - సఖీ! మణిమస్తకా? నాటకము నందలి విక్రమార్క వేషము జూచియే యిట్టి మోహమందితి వేమనదగినది. మనకన్న మనుష్యులు తక్కువవారు. వారి వరింపఁగూడదు. నీ బుద్ది మరలించుకొనుము.
మణిమస్తక – నెచ్చలీ! విక్రమార్కుని వేషాభినయము జూచి వరించితి ననుకొంటివా యేమి ? చాలు చాలు. అతని చరిత్ర మంతయు జదివితిని. ఆహా ! ఆ పురుషసింహుఁ డెటువంటివాఁడనుకొంటివి వినుము౼
శ్లో. మహాకులీనత్వ ముదారతార
తథామహాగ్య విదగ్ధభావా
తేజస్వితా ధార్మికతో జ్వలత్వ
మమీగుణాజాగ్రతి నాయకస్య
మహాకులీనత్వో దారత్వ మహాభాగ్యత్వ విదగ్దత్వధార్మికత్వో జ్వలత్వాది మహాగుణంబు లతనియంది నిరూఢములై యున్నవి. అధీరోద్దతుని మీఁద నా మనసు వాలినది మరలదు.
రత్నపదిక ౼ తరుణీ! మొన్న మనము జూచిన నాటకములో మలయవతి పెద్దభార్య యనియుఁ ద్రిపురసుందరి రెండవభార్య యనియు దెల్లమైనదిగదా? ఇరువురు భార్యలు గలవాని పొత్తు నీవేల నభిలషించుచుంటివి.
మణి - ఎంద ఱుండిన నేమి? ఆ భువనసుందరునికి భార్య యనిపించు కొనినఁ జాలదా ? వాని వైదగ్ద్యము నీవే మెఱుంగుదువు ? అతండు దక్షిణ నాయకుండు.
రత్న - దక్షిణ నాయకుఁడో పశ్చిమనాయకుఁడో నే నెఱుఁగను. నీవు వాసుకి మనుమరాలవు. అతండొక మనుష్యుఁడు. మహాకులీనుండగు గాక వేల్పులు మానవుల వరింపఁదగదు.
మణి - మొన్నటి నాటకములో నెందఱు దేవకన్యక లతని వరించి విరహాతురలై పరితపించుచుండిరో చూచితివా ? కులము తక్కువవాని వారేల వరించిరి.
రత్న - సరి సరి. అది నాటకము. అందలి విషయము కల్పితములు, సత్యములు కావు.
మణి – నీవు వట్టి మూర్ఖురాలవు. నీ కేమియుం దెలియదు. మదనమంజరి నిజమైన విషయములనే నాటకమాడి ప్రదర్శించినది. ఆమె కామహానుభావునం దట్టి భక్తి విశ్వాసము లున్నవి. హరిహరాదులచే జేయ శక్యముకాని యుపకార మతఁ డామెకుఁ గావించెనఁట.
రత్న - నన్నిప్పుడేమి చేయుమందువు ?
మణి – మా తలిదండ్రులకు నా యభిప్రాయము జెప్పి యా భూలోక రత్నమునకుఁ బెండ్లిఁజేయుమని వారికిఁ దెలుపుము.
రత్న - వారంగీకరింపరని నా తలంపు.
మణి — నేను త్రికరణములచేత విక్రమార్క మహారాజును బతిగా వరించితిని. అతఁడే నా భర్త. తదన్యు నేనంగీకరింపను. వారొప్పుకొననిచో నాకు మరణమే శరణము.
అని వారు సంభాషించుకొనుచు విహారములు చాలించి తమ నెలవునకుం బోయిరి. ఆ మాటలన్నియు మాటునుండి విని విక్రమార్కుండోహో ! మదనమంజరి నేను జేసిన యుపకారము కొంచెమైనను గొప్పజేసికొని నా పేరు దేవలోకము లన్నియు వ్యాపకము జేయుచున్నది. ఆమె కృతజ్ఞత స్తోత్రపాత్రమైనది. ఆమె యాడించిన నాటకముజూచి మహేంద్రునకు నన్నుఁ జూడవలయునని తలంపు గలిగి యున్నదని వారిమాటలచేఁ దెలియబడుచున్నది. ఈ వార్తవిని నాకు సిగ్గగుచున్నది. నే నెక్కడ మహేంద్రుఁ డెక్కడ ? వారి పాదరజంబునకైన నన్ను మఱియు నీ వాసుకి మనుమరాలు మదనమంజరి స్తోత్రపాఠములు విని నన్ను వరించుటకు నిశ్చ యించుకొన్నది. ఇదియ సాదృశ్యబాంధవ్యంబు రత్నపదిక జెప్పినట్లు వేల్పులు మనుషులకన్న నుత్తములు. వారితో క్షణయౌవనులగు మనుజులకు సంబంధ బాంధవ్యములు కర్తవర్గములు కావు. కానిమ్ము భవితవ్యత యెట్లుడుంనో యట్లు జరుగక మానదుగదా ? తటస్థుండువోలెఁ జూచుచుండెదనని యాలోచించుచు నటఁ గదలి వెండియు రాజమార్గంబునంబడి నడువసాగెను.
నాటకము జూచుటకై నాటకమున కరిగి వచ్చి నాగు లెల్లరు తమతమ గృహములలో నాత్మీయ సాహస వితరణాది గుణగణంబు లగ్గింపుచుండ నాలించుచు నమ్మహారాజు బోయి యెట్టకే బలిచక్రవర్తిగారి పశ్చిమ సింహద్వారము చేరెను. అందు దురాసిదామ విభూషితోదరులు శీదివమాల్యానులేప నాలంకృతాంగులు శంఖచక్రగదాది సాధనహస్తులు నూర్ద్వపుండ్రాంకిత ఫాలురునగు మహాపురుషులు వేనవేలు గాచుకొని యుండిరి. వారికి మ్రొక్కుచు నా నృపతి యందలి గోపుర ప్రాకార మంటపాది గృహ విశేషములఁ జూచి యాశ్చర్య సాగరంబున మునింగి మహాత్ములారా ! నేనొక మానవుఁడ. పరమభాగవత శిఖామణియగు బలిదానవేంద్రునిం జూడ వేడుకపడి వచ్చితిని. వారి దర్శనము సేయింతురేయని ప్రార్థించిన నతనిమాట లెవ్వరు వినిపించుకొనరైరి. అతండు పలుమారట్లె యడుగుచుండ నందొక వీరభటు డతని దెసజూచి నీ వెవ్వఁడవు ? విక్రమార్కుండవైతేని లోనికిఁ దీసికొనిపోయెడిఁ గానిచో నవ్వలఁ బొమ్మని పలికిన విని యతండు తెల్లపోయి యిట్లనియె.
స్వామీ ! నీవనినమాట నాకు దెలిసినదికాదు. ఇప్పుడు మీరు విక్రమార్కుని పేరుచ్చరింప బ్రయోజన మేమి వచ్చినది. అతం డిందు వచ్చుననుకొను చుంటిరా యేమి ? అని యడుగుటయు నా భటుండదేమియో నాకు దెలియదు. నాకట్టి యాజ్ఞ యున్నదని యుత్తర మిచ్చెను.
పోనిండు. మీ వాక్యమున కన్యధాత్వమేల రావలయును నేను విక్రమార్కుండనే వారి దర్శనము జేయింపుఁడని వేడికొనియెను. అతం డా నరపతి కరము పట్టుకొని క్రమంబున సప్తకక్ష్యాంతరంబులు దాటించి బలిచక్రవర్తి పీఠము దాపున విడిచి యవ్వలికిఁ బోయెను. అప్పుడు
క. కాంచన బలి సింహాసన
చచంన్నవరత్నకిరణసముదయము తటి
త్సంచయమన మెరయఁగ ముకు
ళించుచుఁ గనుదోయి పతి చలింపని కడకన్.
ఇటునటు పరికింపుచున్న సమయంబున నబ్బలిచక్రవర్తి పీఠ నికటంబున విక్రమార్క నృపచంద్రుం గాంచి తటాలున లేచి గద్దియ దిగివచ్చి యతిని గ్రుచ్చి యెత్తుటయు నమ్మహారాజు తత్పాదపద్మములకు సాష్టాంగనమస్కారము గావింపుచు.
సీ. అఖిలార్ధఘాతుకంబగు నాపద ఘటించు
నని యెఱింగియు నొసంగిన సుదాత
వఖిలవేదోండ నాయకుఁ బరాత్పరు విష్ణు
గనులారఁ దృప్తిఁగాంచిన సుకృతివి
సకలసంపద లశాశ్వతములంచుఁ దలంచి
రాజ్యమేలిన సువిరక్తమతివి
ప్రత్యక్షముగ విష్ణుపాణిఁగోరినభూమి
ధారవోసిన మహోదారయశుఁడ
గీ. వచ్యుతపదాబ్జరేణుపూతామలప్ర
శస్తమస్తకుఁడవు నీకు సాటియే మ
హేంద్రుఁ డైనను సాధు మునీంద్రులైన
నతులకీర్తిపవిత్ర! ప్రహ్లాదపౌత్ర!
క. నీదర్శన మొనరించితి
నే ధన్యుడ నైతిఁగద ననేకజననసం
పాదితసుకృతవిశేషము
చే దానవనాథ! పూతచిత్తుఁడ నైతిన్.
ఆహా! నా భాగ్యమేమని చెప్పికొందును? మానుషదర్శనదుర్గ భుఁడవగు నిన్నుఁ బ్రత్యక్షముగాఁ గనుఁగొంటి. నావంటి కృతార్థు డెందును లేఁడని పొగడుకొనుచుండ నతనిని గౌఁగలించుకొని యుపలాలించుచుఁ బాణిఁ బాణిం గీలించి నిజపీఠాగ్రంబునకుం దీసికొనిపోయి యర్ధసింహాసనంబునఁ గూర్చుండబెట్టి గారవించుచు నిట్లనియెను.
వత్సా! విక్రమార్క సంతతము భవదీయ సాహసవితరణాది సుగుణ పుంజంబుల దేవతా విశేషులు వినుతింపుచుండ శ్రోత్రానందముగా నాలింపుచుంటి దేవలోకముల నన్నిట నీ పేరు మ్రోగుచున్నదఁట ఇదివఱకు జనించిన భూపతులలో నీయంతవాఁడు లేడనుట సత్యము. ఒక్కొక్కని కొక్కొక్క సుగుణమువలనఁ బ్రఖ్యాతి కలిగినది. కాని నీవలె నిన్నిగుణంబు లెవ్వనియందున్నవి ? ఆహా! నీ సుగణంబులు వైతాళికులు వినుతింపుచుండ మేను గఱపు జెందుచుండును. మొన్న నాకములో భవత్కీర్తి ప్రఖ్యాతమగు నాటక మాడిరఁట.
అందు నిన్నుఁ గుఱించి చేసిన స్తుతిపాఠము లన్నియు మా వైతాళికులు పాఠము జేసికొనివచ్చిరి. నీవును విందువుగాక అని పలుకుచు నా పద్యములం జదువు మని మాగధుల కాజ్ఞాపించెను. అప్పుడు వాంద్రిట్లు చదివిరి.
క. జయవిక్రమార్క భూపా!
జయ నిర్వాసిత మహాసుజన సంతాపా !
జయ మనసిజరూప ! ద్విష
ద్భయదాధిక సుప్రతాప ! ప్రధితాలాపా !
సీ. ఉట్టిచేరులు నైదు నొక్కటనసిఁ గోసి
వానిచే వరములఁగాంచి నావు
కటికచీఁకటి వల్లకాట భీతిలక బం
ధించి భేతాళునిఁ దెచ్చినావు
జంపఁబూనిన దుష్టసన్యాసి బలియిచ్చి
భేతాళు బంటుఁ గావించినావు
హరిహరాదులకు శక్యము గాని పనియై
కాపాలికుని మచ్చ మాపినావు
గీ. కరుణ వెలయఁగ మదనమంజరి భర్త
తోడఁ గూఁడఁజేసి తార్తులను బ్రోచి
తరులఁ బరిమార్చితివి దేశయాత్రఁజేసి
నన్నుఁబొగడఁగ మాకగునే నరేంద్ర 1
మఱియు
సీ. కవచకుండలము లొక్కటి మాత్రమే యిచ్చి
కర్ణుండు లోక విఖ్యాతుఁడయ్యె
మృతికిఁ గాల్సాపిన యతివృద్దుఁడు దధీచి
యెముక నిచ్చి సుకీర్తి వెసఁగె
వెలగపండంత క్రొవ్విన మేనిమాంస మీ
బూని యాశిబి పేరుఁబొందె నవని
నడిగినఁ పుడమి మూఁడడుగులు హరికిచ్చి
అని చదివి మాగధులు పైనఁ జదువుటకు సందియ మందుచుండ నెఱింగి బలి చదువుఁడు అని పరులాడిన మాటలు మీకేల అని యజ్ఞాపించుటయు
ధారుణి బలి పెద్దపేరువడ సె
గీ. కలదె వారికి నిట్టివిక్రమమునిట్టి
సాహసం బీ విగ్దత శాంతభావ
మీయుధారత కొంచెమయేని పుణ్య
వశమునను దాతలని పేరువచ్చెఁగాని.
అని మఱియుఁ బెద్దగాఁ స్తోత్రపాఠములు చదువుచుండ విక్రమార్కుండు వారించుచు దానవేంద్రా! జగద్రక్షకుని బ్రత్యక్షముగా గాంచి సకలైశ్వర్యములు నర్పించిన మహానుభావుండవు. నీకడనా నా యుదారత వర్ణించుట ? చాలు చాలు. సిగ్గు సిగ్గు అని చెవులు మూసికొనియెను. అప్పుడు బలిచక్రవర్తి యతని భుజము గొట్టుచు బాబూ ? నీ కిన్ని సుగుణంబు లెట్లు కలిగినవి ? నీ గుణపాఠములు విని విని యానదించి నిన్నుఁ జూడవయునని తలంచి వరాహకైతవమున విన్నిందు రప్పించితి తండ్రి ! నీ కేదేని యభీష్టమున్నఁ జెప్పుము. తీర్చెదనని యడిగిన నతం డిట్లనియె.
మహాత్మా ! నీ పాదరజమునైనఁ బోలని నన్నీ భవనమునకు రప్పించి యాదరించితి వింతకన్న నధికమగు వరమేమి యున్నది. మఱియు మీ వాకిలి శ్రీవిష్ణు డెప్పుడు గాచుచుండునని చెప్పుదురు. అ జగదీశ్వరుఁ డిపు డిందున్నవాఁడా యెఱింగింపుమని యడిగిన నయ్యసురేంద్రుఁడు మందహాసముతో నిన్నుఁ జేయి పట్టుకొని నా చెంతకుఁ దీసికొనివచ్చి విడిచినవాఁడే విష్ణువు. మఱియు నీవు బురాణము వినుచుండఁ దనభార్య తటాకములోఁ బడెనని మొఱపెట్టి నీ సాహసము పరీక్షించి వైష్ణవులకుఁ దెలియజేసినవాఁడే లక్ష్మీవల్లభుండని యెఱిగించిన విభ్రాంతుడై విక్రమార్కుండు.
క. ఆహాహా మద్భాగ్యము
నాహస్తయుగంబు నంటెనా ? మేల్మేలా
శ్రీహరి నా కొరుఁడను సం
మోహము గలిగించె మోసపోయితి నకటా?
గీ. ఎవ్వఁడో దాసు డని పరీక్షింపనైతిఁ
గాని హరియని యెఱిఁగితినేని యతని
పాదములు రెండు గట్టిగాఁ బట్టికొందు
వదలుదునె నన్ను రక్షించువఱకుఁ దండ్రి !
అని యనేక విధంబుల నమ్మహాత్మునిఁ దెలిసికొని నందులకుఁ బరితపించు చుండ వారించుచు బలిచక్రవర్తి వత్సా! భవత్సాహస వితరణాది గుణగణంబులచే గట్టఁబడి శ్రీవత్సాంకుండు నీ వంకకే రాఁగలఁడు. నీవు విచారింపకుమని పలుకుచు గొన్ని దినంబులు దనచెంత నునిచికొని యందలి విశేషము లెఱింగింపుడు దత్ప్రీతికరముగా రసము రసాయము అను రెండు వస్తువులిచ్చి తత్ప్రాభావమెఱింగించి గారవింపుచుఁ దన భటులకు మునువచ్చిన గుహామార్గమున భూలోకమున విడిచిరమ్మని యాజ్ఞాపించుటయు వారట్లు కావించిరి.
బ్రాహ్మణ కుటుంబము కథ
విక్రమార్కుడందె దన గుఱ్ఱమునుఁ గాంచి మిగుల సంతసించుచు నెక్కఁబోవు సమయంబున నమ్మార్గంబున నూరేండ్లు గడిచిన యొక వృద్ధభూసరుని చేయి పట్టుకొని యొక బ్రహ్మచారియు నొక కన్యకయు వచ్చుచు నమ్మహారాజుం జూచి యందు నిలువంబడిరి.
విక్రమార్కుండు వారు బ్రాహ్మణులని యెఱింగి నమస్కారము గావించుచుండ నతం డెవ్వఁడో గొప్పవాఁడని తలంచి యా వృద్ధుం డిట్లాశీర్వాదము గావించెను.
శ్లో. భవద్గుణదాయి భవతోస్తుపినాకపాణేః
పాణిగ్రహే భుజగకంకణభీషి తాయాః
సంభ్రాంతదృష్టి సహసైవ నమశ్శివాయే
త్యుక్త్వార్థలజ్జితనతం ముఖనుంబికాయః
శ్రీ శంకరుని పాణిగ్రహణ మహోత్సవమునఁ దన చేతిఁ బట్టికొన మహేశ్వరుని హస్తమునందుఁ గంకణముగానున్న సర్పములంగాంచి జడియుచు నమశ్శివాయ యని సగము పలికి భర్త పేరు చెప్పినందులకు సిగ్గుపడుచుఁ దలవంచుకొనిన పార్వతీదేవి యొక్క ముఖము మీకు సకలైశ్వర్యములు నొసంగుఁ గాక యని యాశీర్వదించుటయు నా నృపాలుం డతండు పండితుండని తలంచి మీరెందుఁ బోవుచున్నారని యడిగెను.
ఆ వృద్ధునకుఁ గొంచెము బధిర ముండుటచే వినంబడక యేమనుచున్నారని కుమారు నడిగెను. ఆ వటుం డామాట బిగ్గరగాఁ జెప్పెను. అప్పు డా వృద్ధుండు సౌమ్యా ! నాకు నూరేండ్లు గతించినవి. మా కాపురము విద్యాసాగరము నేను జాల విద్యలు జదివితిని. వరుసగా నెనమండ్రు కుమారులుగలిగిరి. నా భార్య ప్రతి ప్రసవమునకు నాఁడుపిల్ల పుట్టునేమోయని చాల వేడుక పడుచున్నది. పురుషులే కలుగుచుండుటం బట్టి పరితపించుచు నొకనాఁడు నాతో నాథా ! నా కాఁడు వియ్యమందవలయువని చాల వేడుకగా నున్నది. అందఱు మగపిల్లలే పుట్టిరి. పండువుల కల్లునిఁ దీసికొని వచ్చుటయు విందులు సేయుటయుఁ బురుళ్ళు పోయుటయు లోనగు ముచ్చటలెల్ల నాఁడుపిల్లవల్లనే తీరవలయును. మనకట్టి భాగ్యము పట్టినదికాదు. కోడండ్రు కూఁతుండ్రగుదురా ? కాలు వంగినఁ గూఁతురు జేసినట్టు కోడలు చేయునా? అనియూరక నిత్యము నాకడఁ బరితపించుచుండ నాలోచించి యొకనాఁడు నేను నా భార్యను వెంటఁ బెట్టుకొని యాశ్రితకల్పలత యని పేరుపొందిన మా గ్రామదేవత గుడికిఁ బోయి నమస్కరింపుచుఁ దల్లీ? జగజ్జననీ ? మా కిదివరకు మగపిల్లలే కాని యాఁడుబిడ్డ పుట్టినదికాదు. ఆఁడుపిల్లకై నా యిల్లాలు మిక్కిలి యుత్సుకము జెందుచున్నది. దేవీ ? ఈ మాటు మా కాఁడుబిడ్డ పుట్టున ట్లనుగ్రహింపుము. నీ పేరు పెట్టెదము మఱియు వివాహ సమయమున నా బాలికయెత్తు బంగారముతోఁ జతుశ్శాస్త్ర పండితుఁడైన వరునకుఁ గన్యాదానము గావింతుమని మ్రొక్కుకొంటిమి.
ఆ మహాదుర్గ యనుగ్రహ మెట్టిదో పరికించితిరా ? వెంటనే యీ యాఁడుపిల్ల కడుపునం బడినది మొదలు నా భార్వ నిత్యము దుర్గగుడికిఁ బోయి యాఁడుపిల్ల గలుగునట్లు చేయుమని ప్రార్ధించుచుండునది. దేవీ కటాక్షము మాకీబిడ్డ పుట్టినది. ఆ దుర్గ పేరే పెట్టితిమి. కాని వివాహమునకు దీనియెత్తు బంగారమెట్లు తేఁగలము. మా పిల్ల కులశీలరూపాదులచే ననవద్యయై యున్నది కావునఁ జదివిన వరుండు లభించెం గాని యనుకొనినట్లు కన్యాదానముచేయ దీనియెత్తు బంగారు మెట్లు లభించును? వెనుక ముందు విచారింపక యప్పుడట్టి మ్రొక్కు మ్రొక్కుకొంటిమి. ఆఁడుదానిమాట వినుటచే ముప్పురాక మానదు. పిల్ల పుట్టినప్పటినుండియు బంగారము కొఱకు ప్రయ త్నించుచునే యుంటిమి తులమెత్తుబంగారము మా యిల్లంతయు వెదకినను దొరకదు. పిల్ల యెదిగినకొలది బంగార మెక్కువ కావలసివచ్చును. వివాహకాలముగూడ నతిక్రమించు చున్నది. పెండ్లిచేయకున్నఁ గులములో వెలివేయుదురు. ఆడినమాట తప్పుటకంటె మహాపాతకములేదు. ఏమిచేయుటకుం దోచక పరితపించుచుండ నొక మిత్రుం డీ యుపాయము చెప్పెను.
గీ. విక్రమార్కుండునా కల్పవృక్షమవని
నర్దిజనకోటి కోరు కామ్యములఁ దీర్చు
చుండ మీరిట్టు చింతించు చుంటిరేల?
పొండు మీరమ్మహారాజు పొంతకిపుఁడు.
అతని మాట విని అయ్యుదారుం డీకన్యాదానము గావించునని తలచి దూరమైనను గష్టములకోర్చి యీ కన్యకను వెంటఁబెట్టికొని యందుఁ బోవుచున్నారమని యా బ్రాహ్మణుఁడు తన వృత్తాంత మంతయుం జెప్పెను.
అతని చరిత్రము విని విక్రమార్కుండు చిఱునవ్వు నవ్వి విప్రోత్తమా? మీరు పెద్ద లంతదూరము పోలేరేమో? ఇందులకు నాకు దోచిన సహాయము గావించెద వినుండు. నాకడ రసము రసాయనము అను రెండువస్తువులు మాత్రమున్నవి. రసమనుభవించిన వృద్ధత్వము వోయి పూర్ణయౌవనముతో నొప్పుచుఁ జిరకాలము జీవించును. రసాయనము వలన నితర లోహముల బంగారము జేసికొని యైశ్వర్యమనుభవింపవచ్చును. ఈ రెండు వస్తువులలో మీకొకటి యిచ్చెద మీకేది కావలయునో యాలోచించుకొని జెప్పుఁడని పలికిన సంతసించుచు నా వృద్ధుండు కుమారునితోఁ గూడఁ గొంచె మవ్వలికిఁ బోయి యిట్లాలోచించెను.
తండ్రి - అబ్బాయీ! యీతఁ డెవ్వఁడో తపస్సిద్ధుఁ డగు వదాన్యుఁడు వలె దోచుచున్నాఁడు. కానిచో నట్టి వస్తువు మన కిత్తుననునా? వీనిలో నేది కోరు మందువు. ఆలోచించి చెప్పుము.
కుమారుడు — ఆలోచించుట కేమి యున్నది. రసాయనమే కోరుదము ఇప్పు డీదుర్గ యెత్తు బంగారమే గాక కావలసినంత బంగారము జేసికొనవచ్చును. మహారాజైన మనకుఁ జాలఁడు. ఈతం డమాయకుఁడువలె నున్నాఁడు. అట్టి వస్తు వెవ్వఁడైన నిచ్చునా?
తండ్రి --- అబ్బాయి: నేనొక మాటఁ జెప్పెద. గోపింపకేమి. నేనీ వార్ధక్యము భరింప లేకున్నాను. యౌవనచర్యలన్నియుఁ దలంచుకొని దుఃఖించుచుందును. యారసమే కోరవలయునని యున్నది. ఏమందువు ?
కుమా-- బాగు బాగు. సిగ్గులేక మాట్లాడెదవేల తిరిగి యౌవనము వచ్చిన తిరుగ సంతానముఁ గందువు గాక. అందరము గలసి చిప్పలు వాసి నీ పేరుగా ముష్టి యెత్తుకొనియెదము. వివేకము లేకున్న నెంతచదివిన నేమి ?
తండ్రి - బాబూ! కోపింపకుము యయాతిచరిత్ర మెప్పుడైన వింటివా ? అరువదివేల సంవత్సరములు యౌవన సుఖము లనుభవించి తృప్తిబొందక తిరుగాఁ గుమారుని యౌవనము గ్రహించి సుఖింపలేదా ? వృద్ధులకోరికలు మీకుఁదెలియవు. నా కోరికతప్పులేదు. నిదానింపుము.
కుమా - నీవు తిరుగాఁ బెండ్లికొడుకవై సుఖింతువుగాక. మఱి నీ కూఁతుర నేమి జేసెదవు. దీనియెత్తు బంగార మెక్కడ దొరకును.
తండ్రి - విక్రమార్కుని కడ కరిగి యాచింతము అతండీయక పోవఁడు.
కుమా - ఈయనప్పు డేమి చేయఁ గలిగినది?
తండ్రి – ఇయ్యకున్న వేఱొక తెర వాలోచింతము తండ్రీ నా యభిలాష తీర్పుము. ఈ వార్దకము భరింప లేకున్న వాఁడ.
కూఁతురు — అన్నా! నాకుఁ బెండ్లి కాకున్న బలవన్మరణము నొందెద . నాన్న యభిలాషయే తీర్పుము. నా నిమిత్తమై యాయన కష్టపడనేల ?
కుమా - చెల్లీ ! ఈ ముసలివానిమాట విని సకలైశ్వర్య ప్రదమగు రసాయనము మాని రసము యాచించమందురా ? ఇంటికి బోయిన నమ్మ చంపివేయదా ? వీని పడుచుదనము వలన వచ్చిన లాభమేమి యున్నది. నేను రసాయనమే యాచించెదను.
తండ్రి - శుంఠవు. నీకెవ్వఁ డిచ్చును? ఆ పుణ్యాత్ముఁడు ఏమి కావలయు నని నన్నడిగెను కాని నిన్నడుగలేదు. నేను రసమే కో రెదను.
కుమా — నేనుమాత్ర మాయనతోఁ జెప్పలేనా యేమి? రజస్వలాభిముఖ యైన కన్యక యింటనుండఁ బెండ్లి జేయక తాను బదారేండ్ల బాలకుమారుఁడై యౌవన సుఖము ననుభవింపఁ దలంచు చున్నాఁడు. మీఁవృద్ధునిమాట వినక రసాయనమే యిమ్మని కోరెదను.
కూఁతురు - అన్నా !నా విషయమై మీ యిద్దరు తగవులాడ వద్దు. రసమే కోరనిమ్ము . నా పెండ్లి కై మీకేమియు భారము వద్దు. నేను బ్రహ్మచారిణినై యీ యడవిలోఁ దపము జేసికొనియెద. నే మృగమైన భక్షించిన గష్టమేలేదు.
కుమా - చెల్లీ ! నీవట్లనిన నా గుండె పగిలిపోవుచున్నది. కలిగిన సంతానము చాలక మన తలిదండ్రు లమ్మవారి గుడికిఁబోయి మ్రొక్కికొనిరఁట చేతఁ గాసు లేదు. నీయెత్తు బంగార మెట్లిత్తుమని మ్రొక్కికొనిరో తెలియదు. అమ్మ మేనఁ జిన్న మెత్తు బంగారమేన లేదుగదా? ఆఁడుపిల్లంగని సుఖ పెట్టుచున్నారు. అల్లుని విందులు వియ్యపరాండ్ర విందులు మనసు తీరినది. ఏమైనసరియే కాని తండ్రిగారికోరిక బాగులేదు అనిన వారు మువ్వురు తగవురాడుచుండగా నా మాటలన్నియు విక్రమార్కునికి వినబడుచునే యున్నవి. అతండు నవ్వుకొనుచునే నవ్వలికిఁ బోవలసి యున్నది. మీరు జాగుచేయుచున్నా రేల? వేగ వచ్చి యేదియో కావలసినది తీసికొనిపొండని కేకపెట్టెను చిత్తము చిత్తము. అని పలుకుచు వారు దాపునకు వచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుఁడు పుణ్యాత్మా! నాకుఁ గన్నులు కానుపింపవు చెవులు వినిపింపవు. దేహమంతయు నెండిపోయినది తినుదమన్నఁ బండ్లులేక నమలలేను. ఆఁకలి పెద్దగా బాధించును. ఏది తిన్నను జీర్ణముగాదు, వృద్ధత్వముకన్న బాధకరమైన యవస్థ యొకటిలేదు. పిల్ల వాండ్రకు ముసలితనము బాధయేమి తెలియును బాబూ ! నాకారసము దయచేసితివేని ఈ బాధ తొలఁగి సుఖింతునని కోరికొనుటయు నాక్షేపించుచుఁ గుమారుం డిట్లనియె.
అయ్యా! మీకు లోకజ్ఞానము చాలగలిగి యుండకపోవదు. తాను పెద్దకాలము యావనసుఖము లనుభవించెను. కావలసినంతమంది సంతానమును గనెను. ఒక్కనికి బెండ్లిఁ జేయలేదు. కూఁతురు పెండ్లి కెదిగియున్నది. చక్రవర్తికివలె మణుగుల కొలఁది బంగారము దీని పెండ్లికిఁ గావలసియున్నది. మాయింట జిన్న మెత్తు బంగారము లేదు. విక్రమార్క మహారాజుగారిని యాచించుటకై పోవుచుంటిమి. దారిలో మాపుణ్యవశంబున మీరు దారసిల్లి రసాయన మిత్తునని చెప్పుచుండ రసము కోరుటకంటె నవివేకమున్నదేమో యాలోచింపుఁడు. తాను చిన్నవాడైన లాభమేమి? తిరుగాఁ పెండ్లి యాడి సంతానము గనుట తప్ప వేరొక ప్రయోజనము లేదు. మీరీచిక్కులన్నియు నాలోచించి రసాయనమే దయచేసితిరేని కన్యాదానఫలము మీకు దక్కఁగలదు. మా చెల్లెలు కడు నభిమానస్థురాలు. దాని పెండ్లిని గుఱించి మే మిబ్బంది పడుచుంటిమని విని దుఃఖించుచున్నది. మీరాలోచించి మా కుటుంబ కలహము లేకుండఁ జేయుడని కోరెను.
విక్రమార్కుండు నవ్వుచు నౌను మీకు ధన మవసరమే. మీరన్న మాటయు నుచితముగానే యున్నది. మీ తండ్రిగారు వార్ధకబాధ పడలేక దానిం గోరిరి. అదియు నాలోచింపవలసినదే. కావున మీకు రసము రసాయనము గూడ నిచ్చువేయు చున్నాను. గైకొని పరమానందము వహింపుడు. బ్రాహ్మణులు తృప్తులైన శ్రీమహావిష్ణుండు తుష్టుండు నగునని పలుకుచుఁ దనకు బలిచక్రవర్తి పదిలముగా దాచికొనుమని చెప్పి యిచ్చిన రసము రసాయనము గూడ నా బ్రాహ్మణార్పితము గావించి గుఱ్ఱమెక్కి తా నవ్వలకుఁ బోయెను. దాతల కీయరాని వస్తువు లుండునా ?
శ్లో. రాజావరాహమనుధావ్య బిలం ప్రవిర్య
దృష్ట్వాబలిం సమధి గమ్యచతుత్సపవ్యాం
దత్తం రసాయన మవాప్యరసంచ విప్రా
యాదాదితి ప్రతిమయా వినివేద్య తేద్య.
అని యెఱింగించువఱకు గాలాతీతమగుటయు మణిసిద్ధుండవ్వలి కథ పై మజిలీయం దిట్లు చెప్పదొడంగెను.