కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/201వ మజిలీ

వింటిని. పరమానందముతో నే నమ్మహానుభావుని పాదంబులంబడి మహారాజా ! నీవు బ్రహ్మాదులచేఁ జేయశక్యముగాని యుపకారము నాకుఁ గావించితివి. ఇందులకుఁ గృతార్థురాలనైనా యావజ్జీవము మీ నామము స్మరించుకొనుచు మీ భక్తులమైయుండుట తప్ప ప్రతిక్రియ యేమియుం జేయఁజాలనని పెద్దతడవు వేడికొంటిని.

అమ్మహాత్ముఁడు మందహాస సుందరవదనారవిందుడై సుందరీ? మీరు వేల్పులు. మేము మనుష్యులము. మీరు సంతసించుట మాకు మహా ప్రసాదముగాదా? ఇంతకన్నఁ బ్రతికియు యేమి యున్నది? నీ పలుకుల కానందించితి. పదిలముగా నింటికిఁ జనుమని యానతిచ్చుటయు నేను పలుమా రాపురుషసింహుని పాదములకు మ్రొక్కి మ్రొక్కి యొక్క భర్తం గలసికొని యత్యంత సంతోషముతో నింటికిం బోయి పునర్జన్మ మెత్తినట్లుగా జుట్టాలం గలసికొని యానందించితిని. మలయవతీ వినుము -

క. చేసిన యుపకారము మది
   భాసిల్లఁగ నోపినంత ప్రత్యుపకారం
   బాస క్తిఁ జేయకుండిన
   సీ. సీ. యాజీవిదొక్క జీవమె చెపుమా ?

అని తలంచి భూమండలసామ్రాజ్య బంతయు నొక్క గవ్వఁగానైన గణింపక యర్థిసాత్కృతము గావించెడు నావితరణశాలికి నే నేమిచ్చి సంతోషపరచగలను. చతుస్సముద్రముద్రితమైన భూచక్రబంతయు బరిభ్రమించి యా తేజోమూర్తికి సరిపడిన లావణ్యవతి నేరితెచ్చి పాణిగ్రహణవిధి నెఱవేర్పించెదనని యుడుత భక్తిగాఁ దలంచి బయలుదేరి యేబదియారు దేశంబులుం దిరిగితిని. ఎందున దగిన యిల్లాలు గనంబడదయ్యె. ద్వీపాంతరధరాకాంత సంతానముల నరయు తలంపుతో నీ దెస కరుదెంచితి నిదియే నావృత్తాంతమని మదనమంజరి మలయవతికిఁ దనవృత్తాంత మంతయు నెఱింగించినది.

అని చెప్పువఱకు వేళ యతిక్రమించినది. పై కథ తరువాత నివాస దేశంబునం జెప్పఁబూనెను.

201 వ మజిలీ.

మలయవతి కథ

అట్లు మదనమంజరి తం యాగమనకారణరూపముగా విక్రమార్కుని యుదంత మక్కాంతామణి కెఱింగించి యంతలో పార్వతీపూజాసమయ మగుటయు దత్సఖీనివేదితమగు గదియందు వసించి దేవతార్చన గావింపుచుండెను.

అప్పుడు మలయవతి తలోదరితో సఖీ ! యిప్పుడీమె జెప్పినయుపన్యాసము వింటివిగద. ఆ విక్రమార్కుఁడే నీకు దగిన వరుండని సూచించినది. అతని చరి త్రము విన భూత బేతాళాదుల వశము జేసికొను మాంత్రికుండట్లు తోచుచున్నది. తదితరగుణ విశేషము లేమియుఁ దెల్లము కాలేదు. భూలోకమునంగల కలకంఠులలో నతనికిఁ దగిన మగువ దొరకలేదని చెప్పిన మాట యెంతసత్యమో గ్రహింపవలయును. వాని చిత్రఫలకము దెచ్చినదేమో యడుగుము. నా స్వప్నమున కీమె మాట లుపశ్రువతులవలె నున్న వని తోచుచున్నది. భగవత్సంకల్ప మెవ్వరికి దెలియదు. యుక్తిగా మాట్లాడి తద్విశేషంబులం దెలిసికొని రమ్మని పంచిన నమ్మించుబోఁడి మెల్లన నా గదిలోనికిం బోయి తజ్జపావశాన సమయ మరసి నమస్కరింపుచు నిట్లనియె.

దేవీ ! నీకుఁ బూజాసమయ మగుటచేఁ దరువాతి కథ వినుటకు మా కవకాశము గలిగినదికాదు. నీ సఖురాలు కోరిన గుణంబులన్నియు గల వరుం దీసికొని వత్తునని నాతోఁ జెప్పియుంటిమి. అతం డీతండేనా యేమి ? అట్లైన భూతభేతాళ వశ్యము తప్ప తదీయ సాహస వితరణాది గుణవిశేషంబులెఱింగించితివి కావేమి? అని యడిగిన నవ్వుచు నా జవ్వని యిట్లనియె. ముదితా ? తదీయ సాహస వితరణాదిగుణ లేశ కథంబునకు ననంతుం-------------- మము బోటివారి కెట్లు శక్యమువినుము.

చ. కనుఁగొనవేయి ----------------------- యున్
    మనమున సంచలన అనంచిన యొసంగు నర్దికిం
    గొనకొని విక్రమార్క నృపకుంజరుఁ డంచితదానశీలుఁడై
    యనుదిన మీ వ్రతంబొక మహాద్భుతమంచు వచింపనేటికిన్.

గీ. ఎంత వెలగల వస్తువయేని చేత
    నున్నఁ జాలిచ్చివేయు నాసన్నవర్తి
    యైనయాతఁడె పాత్రుండు దానమునకు
    నతని వితరణమెన్న బ్రహ్మకు వశంబె.

మఱియు నదియిది యననేల నడిగినంతఁ దన ప్రాణమునై నఁ గోసి యిచ్చెడు మహానుభావున కితరవస్తువులు లేక్కయేల ? ఉట్టికోసిన కథయుఁ భేతాళుం గట్టి తెచ్చిన విధానమును వినియు నతని సాహసగుణం బెట్టిదని యడిగితి వింతకన్న నవివేక మున్నదా? తదీయసౌందర్యాతిశయముఁ జూతువేని ఇదిగో చిత్రఫలకము చూచుకొమ్మని చేతికిచ్చినది.

తలోదారి దాని నందుకొని వింతఁ జూచుచు మెచ్చుకొనుచుం దీసికొనిపోయి మలయవతి కిచ్చినది. అది తాను వ్రాసిన దనుకొని యవ్వనిత యిది నీ చేతి కెట్లు వచ్చినది? దర్పణపేటికనుండి తీసితివా? అని యడుగుటయు నవ్వుచు నా జవ్వని యక్షకాంత చెప్పిన మాట లన్నియుం జెప్పి యిది ఆమె వ్రాసి తెచ్చిన చిత్రపటమని యెఱింగించినది.

అప్పు డాచిన్నది మున్ను వ్రాసిన చిత్రఫలకము దెప్పించి చూచి రెంటికి నించుకయు భేదము లేకుండుట తిలకించి ఔరా! యెంత చోద్యము? ఆమె చెప్పిన వాఁడు నా కలలో గనంబడినవాఁడేనా యేమి ? ఇది యక్షిణీ ప్రభావము గాదుగద. ఇట్టి కళ్యాణ ప్రసంగంబులు తథ్యంబు లగుచుండునా ? బాపురే యని యాశ్చర్యమందుచుండఁ దలోదరి యిట్లనియె.

దీని నీవు గలలోఁ జూచినవాని చిత్రఫలకము వ్రాసితివి ఆమె ప్రత్యక్షముగాఁ జూచి వ్రాసినది. రెండు నొక్క పోలికగా నుండుట నాతఁడే యీతఁ డనుటకు సందియము లేదు. యక్షకాంత చెప్పిన మాటలలో నణుమాత్ర మతిశయోక్తి యుండదు. దైవఘటన మత్యద్భుతము. శుభములు చేకూరునప్పుడు నన్నియు నట్లే ప్రోగుపడును. ఆమె జపము నుండి లేచినది. ఆమె యొద్దకుఁబోయి ప్రత్యక్షముగా నతనిం జూచు ప్రయత్నము జేయుదము గాక రమ్మని చెప్పిన నయ్యొప్పుల కుప్ప యప్పుడే యా యక్షిణి యున్న గదిలోనికిం బోయి యామెకు నమస్కరింపుచు నిట్లనియె.

తల్లీ ! నీ యకారణవాత్సల్యమునకు మిగుల గృతజ్ఞులము. నా పరిచారిక నీకడఁ దెలియక యేమేమియో వంకలు జేసెనఁదట. ఆ తప్పు నేను మన్నింప వేడుచున్నాను. తోఁటలో నున్నప్పుడు మా తలోదరితో నీవు నా కేదియో యుపకారము జేయుదునని వర మిచ్చితివఁట. దానిం దయచేయుమని యిప్పుడు నేను గోరుచున్నాను అని వేడుకొనుటయు నవ్వుచు యక్షిణి యిట్లనియె.

నాతీ ! నీవు నే నిచ్చిన చిత్రఫలకము జూచితివా ? నీ వాతనికిఁ దగుదువని నిశ్చయించితిని. నీవు గోరిన గుణంబులన్నియు వానియందున్నవి. నీ వంగీకరించిన నిప్పుడ పోయి ముహూర్తము నిశ్చయించెద నా వెంట నీ పరిచారికం బంపుమని యడిగిన మురియుచు మలయవతి యిట్లనియె.

దేవీ ! నీ కింకొక విశేషముఁ జెప్పమరచితిని. నాకు రాత్రి వింతయైనకల వచ్చినది. అందు నీ వెఱింగించిన సుందరుఁడు నా డెందము హరించి వింతపనులు జేసికొనియెను. నీ వెఱింగించినవాఁడే యతఁడని చిత్రఫలకముల వలనం దేలినది. ఇదిగో యతండు కన్నలకుఁ గట్టి నట్లుండ చిత్రఫలకము నేనువ్రాసితిని. చూడుము. ఈతఁ డాతఁ డగునో కాడో విచారింపుము స్వప్నము యధార్థము జేసి నా యభీష్టము నెరవేర్పుమని ప్రార్థించినది.

యక్షకాంత - కాంతా ! నీ యభీష్టము పరమేష్ఠియే నెరవేర్చెను. నీ కాతండు భర్తయని బ్రహ్మ లిఖించియున్నాడు. కానిచో నేనింత దూరమేల వత్తును ? కానిమ్ము. నీవు నీ గది యలంకరించుకొని యుండుము. మదీయ యక్షిణీ ప్రభావంబున నమ్మహానుభావు నిందుఁ దీసికొని వచ్చి నీ కర్పించెదఁ దరువాత నీ యిష్టము వచ్చినట్లు జరిగించు కొమ్మని పలుకుచుఁ దదామంత్రణంబు వడసి మనోవేగముగా నుజ్జయినీ నగరంబున కరిగి నృపాలుని శుద్ధాంతము జేరినది

అప్పుడు విక్రమార్కుఁడు తల్పంబునం బండికొని యుండ శ్రీధరుఁ డను చెలికాఁడు దాపునఁ గూర్చుండి యిట్లు సంభాషించుచుండెను. దేవా! నీవు విజయయాత్రకు వెడలి నానా దేశంబులుం దిరిగి వచ్చితి వందు -

సీ. సౌవీరభూనేత శరణుజొచ్చినఁగాచి
          తంగేశుచేఁ గప్ప మందికొంటి
    పాంచాలబతి బాహుబల దర్పముడిపితి
          చోళభూపతిఁ బారఁ దోలినావు
    యపవావనీసఁ బాదాక్రాంతుఁ జేసితి
          టెంకణేశ్వరునిఁ గట్టించినావు
    నేపాళభూపాలు నేపడంచితివి బ
         ర్భరనాయకునిఁ బట్టి పరిభవించి
గీ. తెల్ల భూమీధవులను జయించి పిదప
    మంచి మాటలచే నూరడించి వారి
    వారిదేశము లిప్పించి పంపి తహహ!
    నీగ్రహానుగ్రహాత్యంత నీధి మెరయ.

మహారాజా ! భవదీయ దాక్షిణ్యాభి రక్షితులగు క్షితిపతు లత్యంత విశ్వాసముతోఁ గానుకలం దీసికొని వచ్చి దర్శనార్థులై వేచి యున్నారు. నేఁటి యుదయము నుండియు నీ వెవ్వరితో మాట్లాడక చింతా పరాధీనమానసుండవై యున్నవాఁడవట. పరిజనులు నీ కడకు రావెఱచుచున్నారు. అందలి కారణం బేదియో వివరింపరానిదా అని యడిగిన శ్రీధరున కమ్మహీధవుం డిట్లనియె.

వయస్యా ! భట్టి విదేశాగతులగు భూపతుల సత్కరించుచున్నాఁడని విని నీ కొఱకు రెండువార్తల నంపితిని. అందలి కారణంబు వినుము. నిన్న నా కొక చిత్రమైన కల వచ్చినది. దానిం దలంచుకొనుచుండ నొండు తోఁచకున్నది. అట్టి వినోద మదివఱకు నే నెఱుంగను.

శ్రీధరా! నేను దేశాటనము జేయుచు సముద్రముఁ దాటి ద్వీపాంతరమున కరిగి యందొక విచిత్రమైన పట్టణముఁ జేరితిని. అన్నగరము సమున్నత ప్రాసాదముల చేతను విశాలమగు వీధులచేత మనోహరమై యొప్పుచున్నది. నే నాపుర విశేషముల జూచుచుఁ దిరుగుచుండ నొక దండ నేడంతరములు గల మణిసౌధము నాకుఁ గన్నులపండువఁ గావించినది. చొరవమై నేనందుఁ బ్రవేశించి యాదివ్య భవన విశేషములం జూచుచు వెఱఁగుపాటుతో నందొక దెస వెలయుచున్న స్పటిక సోపానముల నుండి పైయంతరమునకుఁ బోయితిని. అందెవ్వరును గనంబడలేదు. ఆ భవనము నాలుగు దెసలు పరికించి యందొకచో నున్న మెట్ల వెంబడి మఱియొక యంతరమెక్కితిని. అందును జనులు లేరు.

జనశూన్యమైన యారంతరములు బరిశీలించి చూచి చూచి యాశ్చర్యముతో నేఁడవ యంతరమునకుఁ బోయితిని. ఆహా ! అందలి యలంకారములు వినుతింప బ్రహ్మ శక్యముగాదు. కన్నులకుఁ గట్టి నట్టున్నవి. ఆ వింతలం జూచుచుఁ బోవం బోవ దివ్యాలంకార శోభితం బగు నొక సుందర మందిరంబున హంస తూలికాతల్పంబున బండుకొని యున్న యొక యన్ను మిన్న నా కన్నులం బడినది.

అందా పొన్న కొమ్మం గాంచి నేను మేను బులకింప బంగారు బొమ్మ యేమో యని తిలకింపుచుండ నక్కలువంటి యట్టె లేచి నల్లన వచ్చి నమస్కరించి యించుక మోముపంచి మనోహరా! మీ కొఱకే యిందు వేచియున్నదాన ననన్యరక్త నన్ననురక్తి నధీనం గావించుకొనుచు మీరే నా భర్తలని పలుకుచుఁ దొంగలిరెప్పలల్లార్చుచు నా మొగం బవలోకించుటయు నేను పరవశుండనై నీ వెవ్వతె వెవ్వరిదానవు? పే రెయ్యది అని యేమియు నడుగక యుడుగని తమిందటాలున నవ్వాలుగంటిం గౌఁగిలించుకొంటి. ఆహా! తత్పరిరంభణ సంరంభము దలంచుకొన మేనం బులుకలు నొడము చున్నవి చూడుము. అట్లు -

చ. బెగియఁ గవుంగలించుకొని భీతమృగేషణ సిగ్గువాపి నె
    మ్మొగమున భూము జేరిచి కపోలయుగం బొగిముద్దు పెట్టుకొం
    చగణిత వీలఁగ్రాల మధురాధర సార సుధారసంబు గ్రో
    లఁగఁదమి నంగుళీరచనలం బెదవి దఱిఁ జేర్చునంతలోన్.
గీ. విక్రమార్క మహీపాల! విజయశీల!
   మిత్రుఁ డుదయాద్రి కూట సమీపమునకు
   వచ్చుచున్నాఁడు చీకటుల్ వ్రయ్యజేసి
   మేలుకొనుమయ్య హంలోగ మేలుకొనుము.

అని పాడుచు నాపాడు వైతాళికుఁడు నా స్వప్నసుఖంబున కంతరాయము గలుగఁజేసెను. శ్రీధరా! ఆయన్ను మిన్న నా కన్నులకుఁ గట్టినట్లున్నది గదా? ఆ యెలనాగ సోయగంబు త్రిజగ నాశ్చర్యకరంబు వినుము.

చ. కలికిమిటారితళ్కు వెలికన్నులు జేరలమీరిమ్మి రే
    కుల నిరసించు నద్దములకున్ రుఁచి దప్పులు దిద్దు ముద్దు చె
    క్కులు దవమేగళంబులు చకోరయుగంబు లారు చీ
    మల నునుబారు గేరుఁ దరమా? కరమా చెలిరూపమెన్నగన్.

గీ. తరుణి కెమ్మోవితగు నమృతంపు బావి
    రమణి పాలిండ్లు మరుని పిరంగిగుండ్లు
    బాలకైతళ్కు బంగారుఁ చూలఁబల్కు
    రమణి నవ్వు నిండు వెన్నెలలనవ్వు.

ఉ. చల నూ కురులా గళంబు డం
ఆ పసి వివ మనను మాతొడ లౌపద ద్వయం

    బాబాకమనీయ దేహారుచులా హొయలేమని చెప్పువాఁడ నా
    హా! కనకాంగి రూపు తెలియంబడు గన్నులఁ గట్టినట్లుగాన్.

వయస్యా! ఆ భాసురగాత్రి రూపలేఖా విలాసము లిందు వ్రాసితిని. చూడుము. అని తాను వ్రాసిన చిత్రపటము చూపుచు ఇది సముద్రము. ఇది యా ద్వీప మీదారిఁ బోయిన నీ పట్టణము జేరుదుము ఇది యవ్వటి శృంగాటకము. ఇదియే యా చేఁడియయున్న మేడ. ఇదిగో యేడవ యంతరమున హంసతూలికా తల్పంబున నా చిన్నది పండుకొనియున్నది, తిలకింపుము. శయ్యదిగి వచ్చిన యా మచ్చకంటి రూపమిది. మా చిట్టకంబులివి కంటేయని యా స్వప్న విధాన మంతయుం జూపించెను.

శ్రీధరుఁడు తతల్లేఖన చమత్కారము తత్సుందరీ సౌందర్య ప్రతిభా విశేషముం జూచి తలయూచుచు-

గీ. స్వపరబ్ధపదార్థంబు చంచలంబు
    గాక సత్యంబె యిది యెఱుంగవె నృపాల
    ధాత్రి మృగతృష్ణలో నీరు ద్రావఁదివురు
    నట్లు వలన తగాంతువే యతివకొఱకు.

సర్వజ్ఞుండవు. నీ యెఱుంగునది కలదే? దేవకాంతలు వచ్చి వరింప దిరస్కరింతు. వీయింతి నిమిత్త మిట్లుత్తలపడ నేమిటికి ? స్వస్థచిత్తుండవై యాస్థానమునకు రమ్మని బోధించిన నా రాజపంచాస్యుం డుస్సురుమని నిట్టూర్చు నిగుడించుచు నిట్లనియె.

మిత్రుడా! నీ వనినట్లు స్వప్నోపగతం బసత్యంబని యెఱింగియు నా భ్రాంతి బోకున్నది. ఆ చిన్న దానివలపు నా డెందము లాగినది. నేఁడు పండుకొని నిద్రించునప్పుడు తత్స్వప్న విశేషంబు వెండియుం బొగగట్టునేమోయని యాసగా నున్నది. నేఁడిందు వైతాళికుల లేపవద్దని చెప్పుము. నా యంతట లేచువఱకు నన్నెవరు మేల్కొలుపఁగూడదు అని యతనికిం జెప్పి యొప్పింపఁజేసి యారేయి నా జవరాలిం దలంచికొనుచు నా భూపాలుండు నిద్రపోయెను.

మదనమంజరి విక్రమాదిత్యు నంతఃపురంబునఁ దిరోహితయై వసించి వారి సంవాద మంతయు నాలింపుచు నా చిత్రపటముఁ జూచియున్న కతంబున నందు వ్రాయఁబడిన రూపము మలయవతిదని గ్రహించి ఘటనా చమత్కారమునకు మిక్కిలి వెఱఁగందుచు దాను దలంచిన పనికి దైవము తోడ్పడెనని సంతసించుచు మెల్లన దాపునకుఁబోయి యక్షిణీ ప్రభావంబున నతనికి మైకము గలుగఁజేసి యెత్తికొని సత్వరంబున మలయవతీ నగరంబునందలి మలయవతి యంతఃపురమునకుఁ దీసికొని పోయి రాజపుత్రిక పండుకొనియున్న తల్పంబునం బండుకొనఁబెట్టి తిరోహితయై యా ప్రాంతమున నిలువంబడి చూచుచుండెను.

మలయవతి యతనిచేయి తగిలి యట్టెలేచి తన తల్పంబున మన్మథకల్పు నా నృపాలుం గాంచి మేను పులకింప వెఱఁగుపాటుతో దిలకింపుచుఁ దాను వ్రాసిన చిత్రఫలకంబు సరిజూచి తలయూచుచు మేనుబ్బ గొబ్బున లేచి సింగారించుకొని తల్పోపాలతపీఠంబునం గూర్చుండి తంత్రుల సవరించుచు మెల్లగా వీణ వాయించు చుండెను.

అంతలో నా నృపతి మేని మైకము బాసినది. ఆ ధ్వని విని ధూర్తా? వైతాళికా? నేఁడు నిన్ను బాడవలదని యాజ్ఞాపించినను వెండియుం బాడుచుంటివేల? స్వప్నసుఖాంతరాయము గావింపవచ్చిన యమిత్రుండవలెఁ దోచుచుంటివే? నీ మేలుకొలుపులు చాలింపుము. అని కసరుచు దెల్ల వారుచున్న దా యేమి? అయ్యో? నేఁ డే కలయు రాలేదేమి? అని పలుకుచు నట్టె లేచి నలుమూలలు సూచెను తన గది యదికాదని నిశ్చయించి మఱల నా స్వప్నవిశేషము బొడఁగట్టుచున్న దని తలంచి కన్నులు మూసికొని యట్టె పండుకొనియెను. అప్పు డయ్యొప్పులకుప్ప వీణమీఁద నీ క్రింది పద్యము స్వరయుక్తముగా గీతముగాఁ బాడినది.

సీ. కలలోన వచ్చి యుత్కంఠ మత్కంఠ మా
               శ్లేషం బొనర్చిన చెలువుఁ డితఁడె
    బిగియఁ గౌగిలిఁజేర్చి నగవుతోఁ జెక్కుట
               ద్దమున ముద్దిడుకొన్న రమణుఁ డితఁడె
    వ్రేళులఁ బట్టి కవ్వించి వాతెర లేనెఁ
              గ్రోలంబూనిన శిఖాంకుం డితండె
    యెటనుండొవచ్చి యువ్వెత్తుగఁ జిత్తమె
             త్తుకొనిపోయిన క్రొత్తదొంగ యితఁడె
గీ. అమరగంధర్వకిన్నరయక్షసిద్ధ
    సాధ్యవిద్యాధరాదిఖేచరులయందు
    నెవ్వఁడో వీఁడు క్రమ్మర నేగుదెంచె
    వీనిఁ బోకుండ నిటఁ గట్టి వేయవలయు.

ఆ గాన మాలించి యా నృపాలుఁ డోహో! ఇది వైతాళికస్తోత్రపాఠము కాదు గాయనీవీణాగానమువలె వినంబడుచున్నది. మఱల నా కాకల వచ్చినది కాఁబోలు నగునగు, నా గానము నా ప్రియురాలు పాడినదే? నాకు మెలకువ వచ్చిన దనుకొంటిఁగా దిది నిద్రయే అని లేచి నలుదెసలు పరికించి మంచము ప్రక్క నమ్మించు బోఁడింగాంచి వంచకరనిద్దహృదయుఁడై యాలసించిన స్వప్నాంతరాయ మగునను భయముతోఁ దటాలున శయ్యదిగి తెగువమై నా పల్లవిపాణిం బట్టుకొని,

గీ. పాట చాలింపు మింక నుత్పలదళాక్షి
    మోసపోయితి మును స్వప్న మోసవిణ్ణ

    జాగుచేసినఁ గల యదృశ్యత వహించు
    రమ్ము కెమ్మోవి రుచిఁజూడ నిమ్ము సరగ.

అనుటయు నా కుటిలకుంతల యది కల గాదని తెలిసికొని మోహవివశ యయ్యు నప్రమత్తవలె మనోహరా? మ్రుచ్చువలె వచ్చి నాడెందము మ్రుచ్చిలించుచుంటి వట్లు చేయుటకు నేను వేశ్య ననుకొంటివా ?

గీ. పేరు సెప్పి కులము పెద్దల వివరించి
    గుణవిశేషములను గణుతిఁ జేసి
    చెంత కరుగవలయు నంతియకాక వే
    గిరము వడుట కాట తెరవనొక్కొ,

అనుటయు నమ్మహారాజు సముద్దీపితంబగు వ్యామోహంబున,

క. ఉజ్జయినీ రాజ్యపతిన్
   మజ్జనకుండల మహేంద్ర మార్తాండుఁడు భూ
   భృజ్ఞాత మెల్లగెలిచి భ
   వజ్ఞితమతి నైతి స్వప్నవశమునఁ దరుణీ!

నాపేరు విక్రమాదిత్యుఁ డందురు. భవదీయకులశీలనామాదు లెఱింగించి మచ్చోత్రానందము గావింపరాదే యని పలికిన విని యక్కలికి కులుకుచు లేచి నమస్కరించి మహారాజా! ఈ పీఠ మలంకరింపుము. యుష్మత్సాహసవితరణాదిసుగుణగణంబు లిదివఱకు మదనమంజరి యను యక్షకాంతవలన వినియుంటిని. భవద్దర్శనంబునఁ గృతార్థురాలనైతినని స్తుతియింపుచు మహాత్మా! మూడువేల యోజనముల దూరములో నున్న మీ నగరమునుండి యీ యర్దరాత్రమున నిక్కడి కెట్లు వచ్చితిరో యెఱింగింపుఁడు . తరువాత నా వృత్తాంతము జెప్పెదనని యడిగిన నతం డిట్లనియె.

విక్ర - తరుణీ ? ఇది నిక్క మనుకొనుచుంటివా ఏమి ? కాదు. స్వప్నము.

మల - మహారాజా ! మన మిట్లు మాట్లాడికొనుచుండ స్వప్న మెట్లగును?

విక్ర - ఇదివఱ కొకసారి యిట్టి స్వప్నము వచ్చినది. జ్ఞాపకమున్నదా? ఇదియు నట్టిదే?

మల - ఓహో! నిజముగా మీరు వచ్చితి రనుకొనుచున్నాను. ఇది స్వప్నమా?

విక్ర - స్వప్నమే. ఈ సుఖము క్షణభంగురము. ఏ వైతాళికుఁడో లేపగలఁడు. నిద్రాభంగమైన నేమి జేయగలము?

మల - మన కన్నులు తెరవఁబడియున్నవే. దీని స్వప్నమందురేమి?

విక్ర -- తరుణీ! నీ పుణ్యము బిగ్గరగా మాట్లాడకుము. మెలకువ రాఁగలదు.

మల - మనోహరా! స్వప్నమో నిజమో యేదైన నేమి? నేను దలిదండ్రుల చాటు దానంగదా? ఇప్పుడు వేగిరింపనేల శాస్త్రోక్తవిధినే నన్ను బరిగ్రహింపవలయు. నేను మలయధ్వజుఁడను నృపాలుని కూతుఁర. నా పేరు మలయవతి యండ్రు. కొలదిదినములలో నాకు స్వయంవరమహోత్సవము జరుపుదురు. అందు దేవర విచ్చేసి నన్నుఁ పరిగ్రహింపవలయు నిదియే నా యభిలాష అని పలుకుచు నతని చేయి వదలించుకొని యవ్వలికిం దొలగినది. అంతలో నతనికి మదనమంజరి వ్యామోహము గలుగఁజేసి తీసికొనిపోయి యుజ్జయినీపురంబునఁ దదీయతల్పంబునం బండుకొనఁ బెట్టినది.

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది తదనంతర కథా విధానంబు మఱల నిట్లు చెప్పఁబూనెను.

202 వ మజిలీ

మలయవతి వివాహము

నాఁడు విక్రమార్కునకు వెంటనే మెలుకువ వచ్చినది. తాను జూచిన విషయములన్నియు స్వప్నదృష్టములనియే నిశ్చయించి యా విశేషములే ధ్యానించుచు దిరుగా నిద్రఁ బోడయ్యెను. మహారాజు లేచువఱకు నెవ్వరును లేపవలదని పరిజనుల శాసించుచు శ్రీధరుఁడు వాకిలిఁ గాచికొని యుండెను. అతని యలుకుఁడు విని విక్రమార్కుండు శ్రీధరా! శ్రీధరా! ఇటురా. అని కేక వైచెను. దాపునకుఁ పోయి నేఁడు నిద్రబోలేదా యేమి? పెందలకడ లేచితిరేమని యడిగిన శ్రీధరునితో వయస్యా! ఇది యొక యింద్రజాలమువలె నున్నది. ఈసారి యా స్వప్నము మఱింత వింతగాఁ బొడగట్టినది. వింటివా ? మలయవతీనగరము మలయధ్వజుండు, మలయవతి ఈ పేరులు నీ వెన్నఁడైన వింటివా ? తుంటవిల్కానిబారిం బడవైచినది యా మలయవతియె. అని తాను జూచిన విశేషము లన్నియు నెఱింగించెను.

శ్రీధరుఁడు విని మహారాజా! మలయవతి స్వయంవర మిదివఱకు రెండు మూఁడుసారులు జరిగినది. ఆ తరుణీలలామము ఎవ్వరిని వరించినదికాదు. అప్పుడు మనకుఁగూడ బత్రికలు వచ్చినవి. దేవర మరచితిరి. ఆ పేరులున్నవి యేమని చెప్పుటయు నృపతి యిట్లనియె.

ఇది కడు వింతగా నున్నది. కలయని కలయుం గాదు. నిజమని నిజము గాదు ఆ చిన్నది నా వృత్తాంత మడిగి తన కులశీలనామంబులు దెలియఁ జేయుచు స్వయంవరమున వరింపుచున్నది. మఱియొక చిత్రము వింటివా? నేనది కల యనియు మెలుకువ వచ్చునేమో యనియు వెఱచుచు నా చిన్నదానితో ముచ్చటించితిని. కల కాదు