కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/196వ మజిలీ

నతని మెల్లన లేవనెత్తి తదవస్థకు దుఃఖించుచు మెల్లన గుఱ్ఱముపై నెక్కించి తాను గళ్లెముఁ బట్టుకొని గుఱ్ఱమును నడిపించుచు నింటికిం దీసికొనిపోయి పరుండఁబెట్టి యెవ్వరితో మాటాడనీయక తానే వాని కుపచారములు సేయఁబూనెను. సిద్ధార్థుఁడు చచ్చినంత పాటుపడి వచ్చెనని పట్టణమంతయుఁ జెప్పుకొనుచుండెను.

అతని రాకవలన దలితండ్రులే కాక ప్రజలందరు నుత్సవములు సేయఁ బూనిరి. నాలుగుదినములకు సిద్ధార్థునకు మాటాడుటకు సామర్థ్యము కలిగినది అప్పుడు రాజపుత్రుఁడు రహస్యముగా నీకీబంధనప్రాప్తి యెట్లు కలిగినదో చెప్పుము. అని యడిగినఁ గన్నీరుఁ గార్చుచు సిద్ధార్థుం డొక రహస్యప్రదేశమునఁ గూర్చుండఁబెట్టి తనకథ నిట్లు చెప్పదొడంగెను.

196 వ మజిలీ.

మండోదరికథ

ఉ. ఎవ్వఁడు తొంటిజన్మమున నెట్టితపోవ్రతదానధర్మముల్
     నివ్వటిలంగఁ జేయునొ ఫలించును తత్సమభోగభాగ్యముల్
     నివ్వెఱఁ బూర్వపుణ్యములు లేక దివంబున కేగ మేరువుం
     ద్రవ్వి శిరంబుమీఁద నిడిన న్బరువై పడుఁ గాక నిల్చునే.

వయస్యా! ముందుగా నీకు నా యుదంతమును బోలినచిన్నకథ యొక్కటి చెప్పెద నాకర్ణింపుము.

మాంగళిక యను గ్రామంబునఁ బింగళకుండను కాఁపు కాపురముఁ జేయుచుండెను. వాని కెందరేని పిల్లలు గలరు. తినఁ గూడులేదు. విప్పచ్చరము బాధింపఁ బిల్లలం బెనుప నేయుపాయంబు దోపక యడవికిం బోయి కట్టెలం తెచ్చి గ్రామములో నమ్ముచు దాన వచ్చినసొమ్మునఁ బొదుపుగాఁ గుటుంబమును బోషించుకొనుచుండెను.

ఒకనాఁడు వాఁడు వేకువజామున లేచి గొడ్డలి భుజముపై నిడుకొని పొలమునకుఁ బోవుచుండఁ జినుకు జినుకుగా నుండియుండి క్రమంబున బలసి ధారాపాతముగా వర్షము గురియఁ జొచ్చినది. వాఁ డాయడవిలోఁ దిరుగుచుండ దారునిగ్గితమైన యొక యమ్మవారున్న చావడి గనంబడినది. అందు నిలుచుటచే వానికి వర్షబాధ యంతగాఁ గలుగలేదు. కాని మఱియొకబాధ హృదయంబున నావిర్బవించినది.

అక్కటా? ఈవానకుఁ దుది గనంబడదు. వలసిన దారువులన్నియుఁ దడిసినవి. మధ్యాహ్నము కావచ్చినది. ఒక్కకట్టెనైను సమకట్టలేకబోయితిని. నేఁడు కావడి తీసికొనిపోక యూరక యింటికిఁ బోయినఁ బిల్లల కన్న మెట్లు దొరకును. పిల్ల లన్నమునకై యేడ్చుచుండ నాభార్య నారాక కెదురుటచూచుచుండును. ఏమిచేయుదు దైవమా? యని ధ్యానించుచు దారుస్థంభముగా నిల్వబడియున్న యమ్మవారింజూచి మురియుచు నిట్లు తలంచెను.

ఆహా! దైవము తిండిలేక యెవ్వరిం జావనీయడు. ఎట్లో యాహారము గల్పించుచుండును. ఇంతవఱకు దీని నేను జూచియుండలేదు. ఈదారువు తడవక చేవ గలిగియున్నది. బరువుకావడి పేళ్ళుకాగలదు. నేడు ముసురు కావున నిబ్బడివెల రావచ్చును. మంచియాధారమే దొరికినదని సంతసించుచు దానిచెంతకుబోయి తచ్ఛిరోమధ్యము గురిజూచి గొడ్డలియెత్తి వేయబోయినంత నాయమ్మవారు ప్రత్యక్షమై ఆ! నిలు నిలు మూర్ఖా? నన్నె గొట్టుచుంటివా? నే నమ్మవారినని యెఱుగవా? అని యల్కతో బల్కిన వాడు గొడ్డలి క్రిందబారవైచి చేతులు జోడించుచు దల్లీ! రక్షింపుము రక్షింపుము. నాతప్పు మన్నింపుము. నీవమ్మవారవని యెఱుంగక కొట్టబూనితిని. ఈ చావడిలో నెవ్వరో స్థంభము పాతిరనుకొంటిని. ఎఱింగిన నిన్నట్లు చేయుదునా? అపరాధము అని పాదంబులబడి వేడికొనియెను.

అయ్యమ్మవా రదివఱకు వాడనుకొనిన మాటలన్నియు విన్నది. కావున వానియందు గనికరము గలిగి యోరీ? నీతప్పు మన్నించితి. నీదరిద్రము తెలిసికొంటిని. నీవును నీ పిల్లలును నిత్యతృప్తులగు తెఱంగెఱింగింతు వినుము. నీవింటికింబోయి స్నానముజేసి వంటయిల్లు శుద్ధిచేసి క్రొత్తకుండలందెచ్చి పొయ్యిమీదబెట్టి మూత వేయించుము. మూతదీసిచూడ నీకు గావలసిన యాహారపదార్థము లన్నియు వానిలో నుండును. నీవు నీపిల్లలు నిత్యము తృప్తిగా భుజింపుడు. పో మ్మీరహస్య మెవ్వరికిం జెప్పకుమని పలుకుచు నాదేవి యంతర్థానము నొందినది.

ఆ కాపు మహాసంతోషముతో నా గొడ్డలి యందు బారవైచి యింటికం బోయెను. భార్య మగనిరాక కెదురుచూచుచు నూరక వట్టిచేతు లాడించుకొనుచువచ్చిన మగనిం జూచి నేడెట్లు వేగుననుకొంటిరి. కట్టె లెందును దొరకలేదా? ఈ కాపురము నేను జేయలేనని విసిగికొన, నవ్వుచు దొందరపడకుము. మనము సుఖించు తెఱవొండు భగవంతుడు చూపెనని యా వృత్తాంతమంతయు నెఱింగించెను. ఆ కథవినిన వాని భార్య ప్రహర్షసాగరమున మునుగుచు నప్పుడ పోయి నూతనఘటంబులం దెచ్చి నియమముతో బ్రొయిలమీదబెట్టి మూతవైచి తీసిచూచినంత జతుర్విధపదార్థములచే నవి నింపబడి యున్నవి. పిల్లలు వారు తృప్తిగా భుజించి యమ్మవారిని స్తుతియింపు చుండిరి.

ఆ యొకదివసంబెగాక నిత్య మారీతినే చేయుచుండ గుండలు పదార్దములచే నిండుచున్నవి. వారు దినుటయేగాక యితరులకుగూడ పిండివంటలతో నిత్యము భోజనము బెట్టుచుండిరి.

పొరుగింటి తరుణి మండోదరి యనునది యా కాపువాని పదార్థ సమృద్ధి కని యోర్వలేక యసూయపరత నక్కటా! వాని పెండ్లాము నిత్యము చేయప్పులకై ప్రతియింటిపట్టునను దిరుగునది. ఇప్పుడు దానియందు నేకొఱంతయు లేదు. ఏపదార్థము కొనినట్లు కనంబడదు. నిత్యము పిండివంటలతో సంతర్పణము చేయుచున్నాడు. ఈ భాగ్యము వీరికెట్లు కలిగినదో తెలిసికొనవలయునని యాలోచించుచు నొకనాడు ఆ కాపువాని పెద్దకుమారు నెనిమిదేండ్లవానింజీరి యోరీ! మీకు నిత్యము ఈ పిండివంటకము లెక్కడివి! మీ యమ్మ వండుచున్నదా? అని యడిగిన వాడిట్లనియె.

ఇవి మా యమ్మ వండుటలేదు. మా యయ్య ముసురుపట్టిన నొకదినం బడవికి బోయి పొడికట్టెలు దొరకక విచారించెనట. ఒక చావడిలో నమ్మవారున్నదట. దాని నెత్తిమీద గొడ్డలితో గొట్టబోయిన గొట్టవద్దనిచెప్పి కుండలుతెచ్చి మూతవేసి తీసిన బూరెలు గారెలు నన్నము నిండియుండునని జెప్పినదట. అట్లు చేయుచున్నారు. కుండలు నిండుచున్నవని యా పిల్లవాడు తలిదండ్రు లనుకొనిన మాటలు విని యున్నకతంబున నారహస్య మా మండోదరికి జెప్పివేసెను.

ఆ ధూర్త యావర్తమానమువిని మేలు మేలు యా కూలిదాని యదృష్టము పండినది వంటయైన జేయనక్కరలేదు. నిత్యము పిండివంటలతో భోజనం జేయవచ్చు. నాకీ దిక్కుమాలిన కాపుర మెక్కడ వచ్చినదో యే సుఖములేదు. తెల్లవారినది మొదలు వంటపని వార్చుపని సరిపోవుచున్నది. చేయూత యిచ్చువారైనలేరు. అని తలపోయుచు చిర్రు బుస్సుమని బిడ్డలేదో యడుగవచ్చిన గొట్టుచు జట్టి పగులగొట్టుచు బుట్టల దన్నుచు మగడు వచ్చుసరికి రట్టుచేయుచు వంటజేయక యందరిం దిట్టు చుండెను.

వంట యైనదా? అని మగ డడిగినతోడనే ఆ, అయినది తిందుగానిరా; ఎందుకు నీ పుట్టుక మగవాడవను మాటయేకాని యాడుదానికన్న గనిష్టుడవు ఏ పనియుం జేతగాదు. నేనిక వండలేను. వంటవాండ్రం బెట్టుకొనుము, లేకున్న మానుడని దురహంకారముగా బలికిన నతండు నే డేమి వచ్చినది? మీ యమ్మ యిట్ల లుగు చున్నదేమని పిల్లల నడిగిన వాండిట్లరి.

అమ్మ ప్రొద్దుననుండి యిట్లే తిట్టుచున్నది. అన్న మడిగిన మమ్మందర జావగొట్టినది. మమ్మేగాక కుండలం గొట్టినది. ప్రొద్దుట నా కాపువాని కుమారునిం జీరి యేదో యడిగినది. వాడేమి చెప్పినో తెలియదు. అప్పటినుండి యిట్లు రట్టు చేయుచున్నదని చెప్పిరి.

అప్పు డతండు మమ్మేల దిట్టెదవు? నీ యభిప్రాయ మేమియో చెప్పుము. నీవు చెప్పినట్లు చేయకున్న యప్పుడు నిందింపుమని బ్రతిమాలికొనగా కాపుపట్టిచెప్పిన కథ యంతయుం జెప్పి యిప్పుడు నీవందుబోయి యా యమ్మగారిం గొట్టబూనుము. ఏమి కావలయునని యడిగిన వానికివలెనే మనకుగూడ బదార్ధము లుత్పన్నము లగునట్లు కోరుము. అందుల కొడంబడితివేని యిప్పుడు వంటజేసెద లేకున్న బస్తుండుమని చెప్పిన విని యా యజమాను డించుక యాలోచించి యిట్లనియె.

ఓసీ! నీ మాట వడుపున గావించెదగాని నాసలబొందక వినుము ఏ వేల్పైన సేవించిన వరం బిచ్చునుగాని కొట్టబూనిన వరమిచ్చునా? ఇందుల కేమందు వనవుడు భయముమీద జరిగిన పనులు భక్తిమీద జరగవు. ఆ శంకలతో బనిలేదు. నీవందుబోయి యట్లుచేయుదువా? ఒకటేమాట చెప్పమని పలికిన నాత డేమియు ననలేక చేసేదనని యొప్పుకొనియెను. నాటి రాత్రి మండోదరి పెద్దగొడ్డలి యొకటి తెచ్చి యింటబెట్టినది. జాము తెల్లవారగట్ల మగనిలేపి చేయవలసిన విధానముజెప్పి గొడ్డలియిచ్చి యడవి కనుపుచు భోజనపదార్థములు తప్ప మరియొక కోరిక కోరకు సుమీ? అని పలుమారు చెప్పి యంపినది.

అత డాగొడ్డలి మూపుపై నిడుకొని యడవికింబోయి యా యమ్మవారున్న చావడి వెదకి పట్టుకొని యట్టె గొడ్డలియెత్తి కొట్టబోవునంత గల్పాంతసముద్దీప్తమేఘగర్జారవమువలె భయంకరముగా గేక వైచి ఎవడవురా? నన్ను గొట్టజూచుచున్నావు పాపాత్ముడా? అని యదలించుచు వాని జుట్టుపట్టుకొని వంచి యొడలెల్ల జిట్ల గొట్టినది

వాడు మొఱ్ఱోయని యరచుచుఁ దల్లీ! రక్షింపుము. ఇది నాకుఁబుట్టిన బుద్ధిగాదు. ఆ కట్టెలమ్మువా డిట్లు చేసిన వరములిచ్చితివని విని నా భార్య యట్లు చేయుమని పంపగా వచ్చితిని. ఈ యపరాధము మన్నింపుమని వేడుకొనగా నా యమ్మవా రిట్లనియె.

ఓరీ! వాఁడు దరిద్రుఁడు. దెలియక నన్నుఁ గొట్టబోయెనుగాని నీవలెనే యెఱిఁగి చేయలేదు. ఇది నీ భార్య ప్రోత్సాహమా? కానిమ్ము ఆ కట్టెలవానికి నే నాహార పదార్థములన్నియు నిచ్చితిని కాని నేతినిచ్చుట మరచితిని. పాపము వాఁడు నిత్యము నిరభిగారపు టోగిరము తినుచున్నాఁడు. నీవు ప్రతిదినము వానికి రెండు సేరులు నేతినిచ్చుచుండెదనని యొప్పుకొంటివేని నిన్నిపుడు విడిచెద. లేకున్న మడియ జేసెద నేమనియెదవని యడిగిన వాఁడు గడగడ లాడుచునట్లే చేసెదనని యొప్పుకొనక తీరినదికాదు. ఇప్పు డొప్పుకొని యానక నెగవైచిన నా మహిమ యెఱుగుదుగాక జాగ్రత్త. పో పొమ్ము. నిన్నుఁ జూచి విడిచితినని జుట్టు వదలి యమ్మవారు వానిఁ ద్రోసివేసినది. ఆ త్రోపు విసరున వాఁడెట్లో యింటిలో వచ్చిపడెను. లేకున్న వానికిఁ దగిలిన దెబ్బలకు మూఁడు దినములదనుకఁ గదలలేక పోవలసినదే.

ఈ లోపల మండోదరి గదులన్నియు నలికి మ్రుగ్గులు పెట్టినది. స్నానం జేసి క్రొత్తకుండలు మూకుళ్ళు చాల దెచ్చినది. ప్రోయిలమీఁద బెట్టి మగని రాక కెదురుచూచుచు వంటచేయలేదు. బంధువు లెవ్వరయినఁ గనంబడి యిన్ని కుండ లొక్కసారి దెచ్చుచుంటివి. మీ యింట నేదియైన శోభనమా ? అని యడిగిన రేపు సంతర్పణ జేయుదుము. మీరందఱు రావలయుజుఁడీ అని చెప్పుచుండినది.

అంతలో మగఁడు వాకిటకువచ్చి యొడలెఱుంగక పడిపోయెను. మండోదరి దాపునకువచ్చి మగనింజూచి అయ్యో ! అయ్యో! నీ దేహమంతయు నిట్లు వాచిన దేమి? దొంగలు గొట్టిరా ఏమి? నీ వేపనిఁ జేసిన నిట్లే జరుగునని తిట్టుచు నీవు పోయినపని యేమైనది చెప్పుమని యడిగినంత నతం డెట్టకే దెలివిఁ దెచ్చుకొని యిట్లనియె.

నీవు రాకాసివి. నీకు దోచినంతఁ జేయుదువు వలదన్న దిట్టుదువు. నీ నోటికి వెఱచి ప్రతిఁ జెప్పజాలకున్నాను. దేవతలు కొట్టినఁ గోరిక లిత్తురా అని నే ననిన నేమేమో ప్రగల్భములు కొట్టితివి. గొడ్డలి యెత్తితినో లేదో పెద్దరూపముతో నొకదేవత యెదుర నిలువంబడి నాజుట్టు పట్టుకొని చావఁగొట్టినది. అబ్బా! ఆదెబ్బలకు నేనుగావున బ్రతికితిని; మఱియొక డైనఁ జావవలసినదే. చిదుగఁగొట్టి వదలిపెట్టినది వెండియుం దల్లికడుపున జనించితినన యూర్పులడవఁ జెప్పిన విని యాజెగజంత యిట్లనియె.

నీవు మొదటనే యపశకునపు మాటలాడితి వంతకన్న నెక్కువ జరుగునా? ఆ కాపువాఁడు దాని మగఁడా యేమి? ఆ పాడుముండ వానికట్టి వరములిచ్చి నిన్నిట్లు కొట్టనేల? ఆ మాట లడుగలేకపోయితివా? పెద్దగొంతుక పెట్టుకొని నాయొద్ద నేడ్చెదవు. మఱియొకచోట మాటాడనేరవు? మా మంచిపని జరిగినది. నాకు సంతోషమైనదని పలుకుటయు నతడు అయ్యో! ఆ యమ్మవారు బ్రహ్మాండమంతయై జుట్టు పట్టుకొని తన్నుచుండ నేమో యడిగితికానని యాక్షేపించుచుంటివి నన్నుఁ కనుకనే విడిచినది మఱియొకరినైన నప్పుడే చంపివేయునని చెప్పి యతండు మఱియు నిట్లనియె.

నీతో మరియొకమాట చెప్ప మరచితిని. మనము నిత్యమా కాఁపువానికి రెండు సేరులు నేతి నిచ్చుచుండ వలయునఁట. ఇదియొక జట్టీమీఁద బడినది. వానికిఁ దానిచ్చుట మరచినదట. ఈయకున్న మనపని పట్టెదనని చెప్పినదని యాకథ చెప్పిన విని యా మండోదరి ఆ! రమ్మనుము తనకుఁగూడ నిత్యము పేడనీళ్ళు గొట్టుచుండెద నా సంగతి యెఱుంగదు. నీ మెత్తతనము గనిపెట్టి యట్లన్నది. అని నోటికి వచ్చినట్లుగా నా యమ్మవారిం దిట్ట మొదలుబెట్టెను.

అప్పుడా మండోదరి యుదరంబు కడవయంతగా నుబ్బి యూపిరి యాడక నేలంబడి కొట్టుకొనుచుండెను. దేవతాద్రోహ మూరకపోవునా! చుట్టు పక్కలవారు ప్రోగుపడి జరిగిన చరిత్రమంతయు విని నవ్వుచు మండోదరితో నిత్యము కాఁపువానికి నేయి నిచ్చెదనని దండము బెట్టుకొనుము. లేకున్నఁ జచ్చిపోయెదవు. నీకు జడియుటకు మనుష్యులా యేమి? మూఁడులోకములు పాలించుతల్లిని నిందింపవచ్చునా? అని చెప్పుచు వారు బలవంతమున దానిచే నట్లు చేసెదనని యమ్మవారికి దండము పెట్టించిరి. అంతలోఁ గడుపుబ్బు తీసినది.

దాని మగఁడప్పుడే పోయి రెండు సేరులు నేయి తెచ్చి యా కాఁపువాని కిచ్చి దండము పెట్టెను. ఆ మఱునాఁడు నేయి తెచ్చుటకు, గొంచెము జాగుచేసినంత దాని కడు పప్పుడే యుబ్బుటకుఁ ప్రారంభమైనది. జడియుచు వడి వడి పోయి నేయి సమర్పించి వచ్చుచుండునది. ఏదిన మీయకపోయినను మండోదరి కడు పుబ్బు చుండును.

ఇళ్ళు పొలములు నమ్ముకొని యాజన్మాంతము కాఁపువానికి నేతి నిచ్చుచుండిరి. మిత్రుఁడా! నా చరిత్రము నట్లెయున్నది. నీకడ నిజము దాపనేల? నేను మొదట నీ సంకల్పము విని పిచ్చివాఁడవని తలంచితిని. తరువాత నీ వంటి ధన్యుఁడు లేఁడని యానందించితిని. నీవు వోలె నేను గూడ నా సిద్ధు నాశ్రయించినఁ బాదలేపన మీయక పోవునా? దానఁ బుణ్యలోకముల కరుగకుందునా? అని తలంచితిని కార్యసాఫల్యమైన పిమ్మట నీవువోలె నేనును కృతార్థుఁడ నై తినని నీతోఁ జెప్పవలెనని యెంచి మొదట నా సంకల్పము నీతోఁ జెప్పక వెండియుఁ గాశీపురంబున కరిగితిని.

భక్తిపూర్వకముగా గంగలో స్నానము జేసి విశ్వనాథు నారాధించి యెట్లో నీవు జెప్పిన గురుతుల ననుసరించి పశ్చిమముగాఁ బోయి యా సిద్ధుని పర్ణశాల గనుగొంటి. నదియును శిథిలమై దళ్ళకును గప్పునకును వైచిన తాటియాకులు చెదలుపట్టి పుట్టలు పెరుగఁ జూచుటకు భయంకరమై మనుష్యసంచార మెన్నఁడును లేని దానివలె గడ్డిమొలచి జీబురుమనుచు వెలయుచున్నది.

కొంతసే పది యగునా కాదా యని సందియ మందుచు ప్రాంతమం దట్టిది మఱియొకటి లేమింజేసి యదియే యని నిశ్చయించి తెగించి యా పుట్టలోనే యొకచో నిలువంబడి చేతులు జోడించి యా సిద్ధు నిట్లు ధ్యానించితిని.

ఉ. ఓ మహనీయ నైష్టికగుణోత్తర! యోకరుణాలవాలా! ని
     ష్కామనిరస్థ సంసృతివికార! విరక్త సురక్త భక్త చిం
     తామణి వంచు నీదగు పదంబులఁ బట్టఁగ వచ్చితిన్ యతి
     గ్రామణి భక్తు శిష్యువెసఁ గామ్యములిచ్చి యనుగ్రహింపుమీ.

క. అణిమాది సిద్ధి సంధన
    గణనా తీత ప్రభావ కర సిద్ధ గ్రా
    మణి వంచు నిన్ను నెల్లడఁ
    బ్రణుతింపఁగ నాశ్రయింపఁ వచ్చితిఁ దండ్రీ !

గీ. గంగలోపలఁ బడి దైవికమున నీదు
    చరణములఁ బట్టినంత నా సఖుని వెతలు
    వాయ సురలోకమున కేగఁ జేయవే మ
    హాత్మ! నేఁడు ప్రసాదింపు మట్లు నన్ను.

అని చీఁకటి పడువఱకు నా సిద్ధుం బ్రార్థించుచు నెవ్వరి గానక నందుండ వెఱచి మఱలఁ గాశీపురంబున కరిగితిని. ప్రతిదినము ప్రొద్దున్న లేచి గంగాస్నానము జేసి విశ్వపతి నారాధించి యాపాడుపర్ణశాలకుం బోయి సాయంకాలము దనుక సిద్ధుం బ్రార్థించుచు జీకటి పడినంత దనుగ్రహము గలిగినది కాదు. అప్పుడు నా మనస్సు

. విసువు నసూయము జనింప నాఁడు వాడుకప్రకార మా పర్ణశాలకుఁ బోయి పెద్దతడవు సిద్ధుం బ్రార్థించి సీ! ఇక నా బ్రతుకేల,

క. పోవంగావలెఁ బోయిన
    దేవేంద్రుని లోకములకు ధృతికాదేనిం
    జావం గావలెఁ బ్రబల
    గ్రావాదుల నిట నటంచుఁ గడు తెగువమెయిన్.

ఒక పెద్ద పాషాణముపై శిరంబువైచి వ్రక్కలుసేయ నుంకించునంతలో నా ప్రాంతమున ఆ! ఆ! మూర్ఖా! నిలు, నిలు, బలవన్మరణంబు పాపహేతువుకాదా అని యెవ్వరో పలికినట్లయినది. ఆ ధ్వని విని నేనా యుద్యము మాని తలయెత్తి నలువంకలు సూచుచుండ నీ యభీష్టమేమి చెప్పమను మాట మఱియొకటి వినంబడినది. అప్పుడు నేను జేతులు జోడించి మహానుభావా! నీకు నేటికి నాయం దనుగ్రహము గలిగినదియా? నా కామితం బిదివరకే చెప్పియుంటిని. నా మిత్రుడు మోహనుని కిచ్చిన పాదలేపనమే నాకిమ్ము. పుణ్యలోకముల జూచి వచ్చెదనని పలుకుచుండగనే యొక బరిణి నా ముందర బడినది. నేనది యందుకొని మూత దీసిచూడ బసరుతో జేసిన కాటుక యందున్నది. అదియే పాదలేపమని నిశ్చయించి పరమసంతోషముతో నా బరిణి మూటగట్టుకొని భయంకరమగు నాపర్ణశాలలోనికి బోయి చూచితిని. కాని యెవ్వరు గనంబడలేదు.

సిద్ధుండు దర్శన మీయకయే యభీష్టము దీర్చె నెట్లయిన లెస్సయే యని నిశ్చయించి చెచ్చెరం గాశీపురంబునకు వచ్చి విశ్వనాథు నాలయంబునకుబోయి స్వామికి మ్రొక్కి మణికర్ణికాతీరంబు జేరి యాకసము వంకజూచుచు నీవుపోయిన నక్షత్రమునకు బదిబారలదూరములో నున్న మఱియొక చుక్కం గురిచూచి పాదలేపనము గొంత పాదములకు రాచికొని కన్నులు మూసికొని యానక్షత్రముకడకు బోవలయునని తలంచి కన్నులం దెరచిచూడ నెక్కిడికిం బోక యందేయుంటిని.

పిశాచలోకము కథ

ఓహో నన్ను సిద్ధుండు మోసముజేసెనా? కాటుక చాలినది కదా? ఈ మాటంతయును రాచి చూచెదంగాక యని తలంచి వెండియు నిందున్న కాటుకనంతయు బాదములకు రాచికొని కన్నులు మూసికొని ధ్యానించినంత లోకాంతరమున కరిగినట్లు తోచినది. కన్నులు దెరచి చూడ నది భూలోక విలక్షణమగు భువనముగా దోచినది. అది పిశాచలోకమట. కర్మననుసరించి బుద్ధి నొడముచుండునుగదా! ఇన్ని నక్షత్రములుండ నా లోకమే పోవుడకు గనంబడవలయునా? అదియు గంధర్వాదిలోకములలో జేరినదియే. ఇంద్రునిచే బాలింపబడు పుణ్యలోకమే కాని యందు దమోగుణ ప్రధానములగు దానవ్రతాదులు చేసినవారు చేరుచుందురట పుణ్యలోకములలోనెల్ల నదియే తక్కువది. మఱియును

చ. వికృతముఖంబులుం గురుచవెండ్రుకలు న్మిడిగ్రుడ్లు పెద్ద మ
    స్తకములు తొట్టవాతెఱల సాగిసతోరపు గొగ్గిపండు లూ
    చకడుపు లడ్డకాళ్ళు మసిచాయలు గల్గి గడుంగడుం భయా
    నకముగ నాక నక్కడఁ గనంబడె గొన్ని పిశాచరూపముల్ .

అట్టివారిం దూరమునఁ జూచి యది యమలోక మేమోయని వెఱచుచుఁ బది యడుగులు వైచినంత ఖడ్గహస్తులగు పురుష లిరువురు నన్నుఁ జూచి నా చెంతకు వచ్చుచున్నట్లు కనంబడిరి.

నేను వారింజూచి వారు సీమారక్షకులుగాఁబోలు. కనకమణిమయ కటకమకుటాంగలాది విభూషణములచే నలంకరింపఁబడక భయంకరవేషములతో నున్నారేమొకో యని యాలోచించుచుండ వారు నా కడకు వచ్చి నీ వెవ్వఁడవు? ఇందేల వచ్చితివి? అని యడిగిన నే నించుక వెఱపుదోప నిట్లంటి.

అయ్యా! నేనొక పుణ్యపురుషుండఁ గాశీవిశ్వనాథుని యనుగ్రహంబున నీ పుణ్యలోకంబునకు వచ్చితి నిది యేలోకము? మీరు సీమారక్షకులా? ఇందు ప్రధానదండనాధుని పేరేమి? నాటకులెవరు? గాయకు లెవ్వరు? భోగిని యెవ్వతె? అని నీవు వోలె నడిగితిని. వాండ్రు నా మాట విని నవ్వుచు నోరీ? నీ మోసము లింక సాగవు. ఇది పిశాచలోకము. మేము దేవదూతలము. నీవు తీర్థశుల్క నెత్తికొని పోయిన దొంగవు. నేఁటికిఁ దొరకితివి. నీ కొఱకే దేవలోకములన్నియు నింద్రుండు కాపు పెట్టించెను. పాపము నీ వది యెఱుంగక వెనుకటి వలెనే వచ్చి యందలి భోగిని నెత్తుకొని పోవలయునని తలంచితివి కాఁబోలు. బడిశములోఁ బడిన మత్స్యమువలెఁ జిక్కితి వెందుఁబోగల వని పలుకుచు వారు నా చేతులు గట్టివైచి లాగికొని పోయి యూ బోనులోఁ బెట్టి యింద్రుని కడకుఁ దీసికొనిపోయిరి.

వయస్యా! నాకు దీనిలో నుండుటచేఁ గన్నులారఁ బుణ్యలోకములఁజూచు భాగ్యమైన గలిగినది కాదు. ఇతరుల మాటలు మాత్రము వినంబడును. ఈ పెట్టె నా యింద్రుని నికంబున బెట్టి దేవదూతలు నా తెఱం గెఱింగించుచుండ నీ మామ నిరృతి మహారాజు అక్కడికి వచ్చెను. దేవదూత లాయన రాక మహేంద్రుని కెరింగించిన మాటలు నాకు వినంబడినవి.

ఎదురు వచ్చి సురపతి నిరృతిని దీసికొనిపోయి తన ప్రక్క గూర్చుండఁబెట్టుకొని స్వాగతపూర్వకముగా గమనకారణం బడుగుటయు నతం డిట్లనియె ౼సురసార్వభౌమా? తీర్థశుల్కను రక్కసు లెత్తికొని బోయిరని మీరు భ్రాంతి పడితిరి. అదివట్టిదిసుఁడీ? మీ యాజ్ఞవడుపున రక్కసుల నెల్ల సన్మార్గప్రవర్తకుల గావించుచున్నాను. అని యెట్లు నోయినదో మీకు దెలిసినదియా? అని యడిగిన మహేంద్రుఁ డిట్లనియె.

నికషుపట్టి! నే నట్టివాని కొరకు గట్టి ప్రయత్నమే చేయుచుంటిని. పుణ్యలోకము లన్నియుఁ గాపు పెట్టించితిని. మా దూతలు నిన్ననే పిశాచలోకములో నా దొంగం బట్టికొని తీసికొని వచ్చినారు. ఆ పెట్టెలో నున్నాఁడు. చూడుమని పలికిన విని నిరృతి వెఱఁ గందుచు నేనున్న పెట్టెకడకు వచ్చి సందులనుండి తొంగి చూచి యోరీ? నీ వెవ్వండవు. పిశాచలోకమున కెట్లు వచ్చితివి? తీర్థశుల్క నెత్తికొనిపోయినవాఁడవు నీవేనా? నిజము జెప్పుము. నిక్కము చెప్పిన విడిపింతు. లేకున్న దండింతురని యడిగిన విని నేను చెతులు జోడించి, అతండు నీకు మామయని యెఱింగిన కతంబున నెడద నుదుటు గదుర నిట్లంటి.

మహాత్ములారా! మీకడ నసత్యము లాడుదునా, పులిని జూచి నక్కవాతఁ బెట్టుకొనిన దన్నట్లు నాపనియైనది. వినుండు. మహేంద్రనగరాధీశ్వరుండగునింద్రమిత్రుండను రాజునకు జగన్మోహనుండను పుత్రుం డుదయించెను. నేను వాని మిత్రుండ సిద్ధార్థుఁ డనువాఁడ. నా మిత్రుఁడు సిద్ధతలోషధిప్రభావంబునఁ దేజోలోకంబునఁ కరిగి యందు దీర్థశుల్కం గూడికొని యటనుండి నిరృతిలోకమున కరిగి యందానుజనాధుని పుత్రికచే స్వయంవరమున వరింపఁబడి యిద్దరి భార్యలతో నింటికి వచ్చెను.

వాని వైభవముఁ జూచి నేను నాసిద్ధు నాశ్రయించి పాదలేపనము సంపాదించి యా నక్షత్రలోకమున కేగితిని. నా దురదృష్టవశంబున నది పిశాచలోకమైనది. అందున్న వారలు నన్నుఁజూచి బెదరించుచుఁ గట్టి యీ బోనులోఁ బెట్టి యిక్కడికిఁ దీసికొని వచ్చిరి ఇదియే నా వృత్తాంతము. తీర్థశుల్కను నే నెత్తుకొనిపోలేదు. నిజము చెప్పితిని, నన్ను విడిపింపుడు, మా దేశమునకు బోయెద. పూర్వజన్మమున సుకృతము జేసికొనలేదు. పుణ్యలోకంబుల జూచు భాగ్యమైన బట్టినది కాదు అని దీనుండనై వేడికొనగా నా కథ విని యింద్రుండు నిరృతి కిట్లనియె.

దానవేంద్రా! ఇది యేమివింత! వీడు చెప్పిన యుదంతము నిజమేనా? తీర్థుశుల్క నెత్తికొని వచ్చిన వానికే నీ కూతుం బెండ్లి జేసితివా? మాకు గొంచమైన జెప్పితివి కావేమని యడిగిన నతం డిట్లనియె.

మహేంద్రా! నీకా వృత్తాంతము జెప్పుటకే నే నిప్పు డరుదెంచితిని. అందులకే తీర్థశుల్క నెత్తికొనిపోయిన దొంగం బట్టించితినని మీరు చెప్పిన వింతపడి నేనడిగితిని. వీడు చెప్పిన కథయంతయు సత్యమైనదియే. గంగామహాత్మ్యద్యోతరమగు నీ యుదంతము చమత్కారరూపమువలె నొప్పుచున్నది. వినుండు ఆ తీర్థశుల్క వెనుకటి తీర్థశుల్క కాదు. కపిల యను రెడ్డికోడలు వానిని వరించి ఇల్లు విడిచి వాని వెంటబడిపోవుచు దైవికముగా గంగలోబడి మృతి నొందినది.

మరణసమయంబున నా మోహనుడే పతి కావలెనని ప్రార్థించినది. గంగాగర్భమరణసుకృతంబునం జేసి యది యప్సరోలోకమున కేగినది. మీరే దానికి తీర్థశుల్కాధికార మిచ్చితిరి. మఱియు,

సీ. బ్రహ్మచర్యం బొక్కరాత్రి దై వికముగ
             మరచి తప్పినయట్టి మాసకమ్మ
    కలకాలమెల్లను గామిక వ్రతములు
             సలిపినట్టి చకోర శాబనయన
    బలిమి నొక్కనికి లోబడి వాని నెవ్వేళ
             బతిగా దలంచిన పద్మగంధి
    పురుషుండు లేని యప్పుడు ప్రమాదంబున
            మోసపోయిన యట్టి ముద్దరాలు
గీ. మాంత్రికుండైన నొక సిద్ధమౌని నొండె
    నొక్కవేలుపు నొండె ప్రియుండు పనుప
    బుత్రసంతానలబ్దికై పొందినట్టి
    యంబుజానన యచ్చరయై జనించు.

అని కాశీఖండంబునం జెప్పబడియున్నది. అది యట్లుండె చంద్రిక యను రాజపుత్రిక యా మోహనునే వరించి వానివెంటబోవుచు గంగలోబడి మృతి నొందునప్పుడు దానివలె వాడే తనకు భర్త గావలయునని తలంచినది. తత్సుకృతంబున సద్యోగర్భంబున నాకు బట్టిగా బుట్టినది వారిద్దరికోరికల ప్రకారము మోహనునికి బుణ్యలోకగమనాధికారము గలిగినది. ఆ కాంతలు వానింగాక నితరుల నెట్లు వరింతురు. ఆ కన్యలకు జాతిస్మరణము గలిగియున్నది. నేను నా పుత్రికకు స్వయంవరము జాటించితిని. దేవయోనివిశేషు లందరువచ్చిరి. అది యెవ్వరిని వరింపక దైవికముగా నాసభకు వచ్చియున్న మోహనుని వరించినది.

అందులకు నేనేమి చేయుదును? నిర్బంధించి యడుగ దన ప్రాక్తనజన్మవృత్తాంతము జెప్పినది. దానంజేసి నేను నానందనను వానికే బెండ్లిజేసితిని. కాశీగంగాప్రభావప్రక్రియలకు మనము విధేయులమై యుండవలయుంగదా. మనయధికారములు వాని నతిక్రమింపజాలవు. ఈ సంబంధము లన్నియు మీకెఱిగించి మాయల్లునకు నమృతము యాచించునిమిత్తము మీకడ కరుదెంచితిని. పాలకొఱకు దాతిని మోయవలయుం గదా. వీడు నా యల్లునిమిత్రుడగుట సత్యము. మోహనునకుంబోలె దనకుగూడ దివ్యబోగములు గలుగునని సిద్ధు నాశ్రయించి యిందు వచ్చెను. లాభము లేకపోవుటయేగాక గట్టి పరాభవము జరిగినది.

గీ. ఎవని యదృష్టమెట్లో యదియే లభియించెనుగాదె వానికిం
    దివమున కేగినన్ శతధృతింబరికించిన నిప్డుఁ జాచినం

    భవుఁగనుగొన్న; నన్య విభవంబులకు న్మతి నీసు? జెందియ
    ట్టివి తనకబ్బగాఁ బ్రతిఘటించినచోఁ దలవంపులౌ తుదిన్.

అని నిరృతి యావృత్తాంత మంతయు నెఱింగించుటయు శతక్రతుండు ఎట్టెట్టూ? ఈ యింద్రజాలము భాగీరథీసింఛకాకల్పితమా? సరిసరి. అందులకు మనము వందనము సేయవలసినదే. వీఁడు నీయల్లుని మిత్రుఁడా? కాశిలో మృతి నొందలేదు కాఁబోలు నందులకే యిట్టి నిర్భాగ్యస్థితి పట్టినది. వినిమయలోకంబునకుఁ బంపి శిక్షింపఁ దలంచుకొంటి నిందులకు నీ వేమందువు? అనుటయు నిరృతి యిట్లనియె.

అనిమిషేంద్రా! వీడు గాశిలోఁ జావలేదను మాటయేకాని గంగాతీర్థముల సేవించెను. విశ్వనాథు నర్చించెను పెద్దలఁ బూజించె వీఁడు నిరపరాధి. యమలోకప్రేరణార్హుఁడు గాఁడు వీని నింటికే పంపివేయుఁడు బోనుఁదప్పించి పుణ్యలోకములఁ జూపింపుడని పాప మాపుణ్యాత్ముఁడు పెద్దతడ నింద్రుం బ్రార్థించెను. కాని యింద్రుఁ డా మాటకు సమ్మతింపఁ డయ్యెను.

మత్పురాకృత మిట్లుండ నెవ్వఁడు తప్పింపఁ గలఁడు. తుదకుఁ ద్రిదళపతి నిరృతినందలి యనురాగంబునంజేసి నన్ను యమలోకంబునకుం బంపక యీ పెట్టెతోనే మహేంద్రపురప్రాంతమున విడిచిరమ్మని కింకరుల కాజ్ఞాపించెను. దేవదూత లరనిమిషములో నాపెట్టెతో నన్నిందుఁ బడవిడిచిపోయిరి. ఆ వెంటనే నీవు వచ్చి లేవఁ దీసితివికాని మఱియొకదిన మందుండినఁ జచ్చిపోవువాఁడనే. నేను గూడ నా గంగలోబడి చచ్చినచో నీ యవమానము రాకపోయెడిది. సీ! నా జన్మమేల? పుణ్యలోకమున కేగియుఁ జూడలేక పోయితిని. ఆ రంధ్రముల వెంబడి చూతమన్న నేమియుఁ గనంబడునది కాదు. నేను వట్టి పాపాత్ముండనని దుఃఖించుచుండ నోదార్చుచు మోహనుం డిట్లనియె.

వయస్యా! ఆ కాంతలు సేసిన సుకృతంబునంగాని నాకుఁ గూడ నీ యవమానము కావలసినదే గంగామహిమచే నది దప్పినది. వారందుఁ బడి మృతి నొందుటచే వారి కోరికలు చెల్లినవి. పోనిమ్ము. నీకు వచ్చిన లోపమేమి? మన మిందే స్వర్గసుఖముల ననుభవింతముగాక నిర్జరతరంబులఁ దిరస్కరించు మించుబోఁడుల నీకుఁ బెండ్లిఁగావించెద విచారింపకుము.

అని యూరడింపుచున్న సమయంబున నిరృతి కూఁతురు వచ్చి మనోహరా! మీ మామగారు మహేంద్రుని యాచించి మీ నిమిత్తమై యమృతబిందువులఁ బంపి యున్నాఁడు. వేగం గ్రోలుఁడని పలికిన సంతసించుచు నతండు గోక్షీరములతో నా బిందువులం గలిపించి సగము మిత్రుని కిచ్చి శేషించిన సగము తాను ద్రావెను.

దానంజేసి వారిరువురు జరారోగములు లేక చిరకాలజీవులై యొప్పిరి. మోహనుఁడు పట్టాభిషిక్తుఁడై సిద్ధార్థునకు మంత్రిత్వపదవి నిచ్చి యచ్చరులం బుర డించు ముద్దుగుమ్మల నిద్దరం బెండ్లిఁ జేసి దేవకాంతాసంభోగోత్సుకవిముఖునిఁ కావించెను. మఱియు మోహనుండు చంద్రిక తండ్రియగు భీమవర్మను రప్పించి తమ వృత్తాంత మంతయుం జెప్పి యతనికిం గూఁతునం దనురాగాంకురము గల్గునట్లు జేసెను. విద్యావతి ప్రాగ్జన్మసంబంధబాంధవ్యంబునం జేసి తల్లిదండ్రుల నాదరించుచు వారి మన్ననలం బడయుచుండెను. ఇష్టము వచ్చినప్పుడు నిరృతి లోకములోనికి బోయి వచ్చుచుండును. మోహనుం డట్లిరువురు భార్యలతో మిత్రునితోఁ బంధువులతో నాకభోగంబు లనుభవింపుచు బెద్దకాల మారాజ్యము పాలించెను.

అని యెఱిగించి మణిసిద్ధుండు గోపా! ఈ కథవలన గాశీమహాత్మ్యంబు దెల్లమైనదా? యని యడిగిన వాడురమున జేయివైచికొని స్వామీ! కాశీమహిమం బెంత వింతగా నున్నది? ఆహా? ఎక్కడి కపిల? యెక్కడి చంద్రిక? యెక్కడి దేవత్వము? విచారింప నిందు మోహనుని ప్రజ్ఞ యేమియు గనంబడదు. వారిద్దరు గంగలోబడి మృతినొందుచు వానినే పతి గావలెనని కోరుటచే మోహనుని కాభోగము పట్టినది. లేనిచో సిద్ధార్థునికైన పరాభవమే యైతీరును.

అయ్యగారూ! మన మింక గాశీపురం బెన్నినాళ్ళకు బోవుదుము. ఎప్పుడు గంగలో మునుంగుదుము? మనముగూడ నోడదాటునప్పుడు నావ మునిగిన బాగుండును. చెరియొక పుణ్యలోకము బాలింతుమని పలికిన నవ్వుచు నాజడదారి యిట్లనియె.

వత్సా? మనకట్టి తుచ్చభోగము లేటికి? ఆ వృత్తిరహితమైన కైవల్య మందుదుముగాక. కాశీపురము కల్పవృక్షము కాదా? ఎవరి కోరిక యెట్లుండునో యట్టి సంతోషంబు గూర్చును. ఇక కొలదిదినములలో నాయూరు జేరగలము. అందు జేరి మోక్షలక్ష్మి బడయగలమని పలుకుచు శిష్యు సంతోషపరచెను.

తదనంతరంబ.

ఉ. కావడి యెత్తి వాడు వెనుకం జనుదెంచుచు మున్ను విన్న నా
    నావిధసత్కథల్ మనమునం దలపోయుచు దచ్చమత్క్రియా
    భావము లెన్నుచుండ బ్రణవంబు జపించుచు దీక్షమోక్షల
    క్ష్మీవిభవప్రమోది మణిసిద్ధుడు ముందరుగున్ పథంబునన్.

197 వ మజిలీ

విక్రమార్కుని కథ

క. చంద్రాననార్ధగాత్రా । చంద్రాంశుశ్వేతభూతిచర్చితగాత్రా
   చంద్రార్కానలనేత్రా । చంద్రార్థజటావిచిత్ర సాధుచరిత్రా॥

దేవా! అవధరింపుము. మణిసిద్ధుం డమ్మజిలీయందు గాల్యకరణీయంబులం దీర్చుకొని భోజనానంతరంబున దనచెంత వినయమితోత్తమాంగుడై నిలువంబడియున్న గోపకుమారుం గాంచి చిఱునగవుతో నిట్లనియె.