కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/190వ మజిలీ

రెడ్డి సిగ్గుపడుచు సీ సీ. లేచిపోయిన కోడలిని రప్పించుకొనుటకంటె తప్పిదమున్నదా? తెలియక వచ్చితిమి. దానినోట మన్నుఁగొట్టికొని యదియే పోయినది. నా కొడుకునకు వేఱొకకన్యకం బెండ్లిఁ జేయలేనా? రండు, రండు. పోవుదమని పలుకుచు నింటికిం బోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పదొడంగెను.

190 వ మజిలీ.

చంద్రిక కథ

హేమదుర్గమను నగరమున భీమవర్మయను రాజు గలఁడు ఆతండు మిగుల ధర్మాత్ముఁడు వితరణశాలి. కేవలము సన్యాసుల నిమిత్తమై పెద్ద మఠ మొకటి గట్టించెను. దాని దుర్గామఠమని పిలుచుచుందురు. అందు విరక్తులకు సకల సదుపాయములు చేయుచుందురు. బైరాగు లెన్నిదినము లుండినం బొమ్మనక భోజనము పెట్టుచుందురు. అందెప్పుడు జూచినను వేయిమంది సన్యాసులకుఁ దక్కువ యుండరు.

మార్గవశంబున సిద్ధవ్రతుండు శిష్యులతోఁ గూడ నొకనాఁడు సాయంకాలమునకు నా మఠంబునఁ బ్రవేశించెను. రాజపుత్రుండు మఠవిశేషము లన్నియుం జూచి వచ్చి యోగీంద్రా! ఇందున్న బైరాగులు మహేంద్రవైభవం బనుభవింపుచున్నారు వింటిరా?

సీ. చమురు మెల్లన రాచి జడలు విప్పుచు దల
             లొప్పార నంటుదు ఱొక్కచోట
    మేనఁ బూసిన భూతి బోనంగ రాగముల్
             జిక్కనీరాడింతు ఱొక్కచోట
    నడిచిన పెంద్రోవ బడలికల్ దీరంగ
             నొడలల్లఁ బట్టుదు ఱొక్కచోట
    మృదుతల్పములను నెమ్మది బరుండగఁ బెట్టి
             యోపిక వీవుదు ఱొక్కచోట
గీ. వంటకంబులతోడఁ గావలసినట్టి
    భోజనము గూర్తుఱిటఁ బరివ్రాజకులకు
    నొక్కచోఁ బెండ్లికొడుకులకో యనంగ
    నహహ! ఇది గట్టినట్టి పుణ్యాత్ముఁ డెవ్వఁడో.

మ. ఒకచోఁ బుణ్యతరింగిణీ సుమహిమ న్యూనాధికోద్యత్ప్రసం
     గకథల్, యోగవిధానచర్చ లొకచోఁ, గాశీప్రయాగాది సు

    ప్రకటక్షేత్ర ఫలప్రసంగ మొకచో, బ్రహ్మత్వసంప్రాప్తి హే
    తుక విద్యాధివాద మొక్కయెడ, సాధుల్ గోష్టిఁ గావింపఁగన్.

శ్రోత్రానందముగా నాకర్ణించి వచ్చితినని తద్వృత్తాంత మెఱింగించిన సిద్ధ వ్రతుండు నవ్వుచు రాజపుత్రా! నీవు వోలె నీ పురుషుం డెవ్వఁడో బైరాగుల భోగులం జేయుచున్నాఁడు. ఇప్పని యతనికిఁ బుణ్యప్రదంబే కాని యీ యోగులకు మోహప్రదం బగుచున్నది. కానిమ్ము. ఆ గొడవ మనకేల నని మాట్లాడికొనుచుండ మఠోద్యోగస్థులు వచ్చి మహాత్ములారా! మీ కేమి కావలయును? దూరము నడిచి వచ్చితిరేమో? ఆ తల్పంబుల విశ్రమింపుఁడు. ఈ పరిచారకులు మీ కుపచారములు సేయుదురు గాక! వంటశాలకుఁ బోయి వలసిన పదార్థములు భుజింపుఁడు. అందు భుజింపరేని స్వయంపాకము జేసికొనుఁడు. సామాగ్రి యిప్పింతుమని యాదరంబునం బలుక సిద్ధవ్రతుండు మూ కేమియు నక్కరలేదు. మీ సత్కారముల కానందించితమని, ప్రత్యుత్తర మిచ్చెను.

వా రామఠవిశేషంబులఁ జూచుచు నాదివసంబు పయనంబు మానివేసిరి. సాయంకాలమునఁ గొందఱు రక్షకభటులు వచ్చి యందున్న బైరాగుల నెల్ల బరీక్షించుచు విరక్తులుగాక యందెవ్వరు నుండఁగూడదు. మా రాజపుత్రిక యోగుల సేవింప వచ్చుచున్నదని పలుకుచు నితరుల దూరముగాఁ దోలవేసిరి.

అంతలో నాందోళిక మెక్కి తలుపులు మూయించి రెండు దెసలఁ బరిచారికలు పల్లకిదండి పట్టుకొని వచ్చుచుండ రాజపుత్రిక యా మఠాంతరమునకు వచ్చినది. గవాక్ష వివరములనుండి యందున్న యోగుల నెల్లఁ బరిశీలించి చూచుచు నొకచోటఁ దనపల్లకి దెసఁ జూచుచున్న సిద్ధవ్రతుని మోహనునిం గపిలం గాంచినది. హృదయంగమంబైన మోహనుని సౌందర్యము జూచి విస్మయము జెందుచు నందాందోళికము నిలుపుఁడని పరిచారికలకు సంజ్ఞ చేసినది.

తలుపు లోరఁగాఁ దెరచి తదీయతేజోవిశేష మంతయుఁ బరికించి మేను పులకింపఁ జూచి చూచి తలయూచుచు -

మ. హరునిం గెల్వ మరుండిలం దపము సేయన్వచ్చెనా? లేక య
     య్యరవిందారి సమస్తమండలవిభుత్వాకాంక్షమై నిష్టకుం
     ధర కేతెంచెన! కాక యింద్రజుఁ డనంతత్వం బపేక్షించి దు
     ష్కరయోగవ్రత మూన నిట్లు మునివేషం బూనెనా? బాపురే?

సామాన్య యతికుమారుల కిట్టి సౌందర్యం బుండునా? వీనియాకారలక్షణంబులు పరీక్షింప భూమండలాఖండలుండుగా నుండవలసినది. ఇట్లు జోగియై తిరుగుటకుఁ గారణము తెలియకున్నది. ఆ చిన్నది వీని భార్య గాఁబోలు? ఆ యువతి రూపవతియే కాని వీని కాలికిని సరిపడినది కాదు. అందులనే యీతం డిట్లు బైరాగియై తిరుగుచున్నాడు. సన్యాసులకు భార్యలుందురా? ఎట్లైన నేమి నా కన్నులకలిమి సార్దకము గాఁగ నేఁ డిందుఁ జూడతగిన వస్తువుం జూచితిని. స్వభావసుందరులకు వికృతులు గూడ శోభఁ దెచ్చునను మాట వాస్తవము వీని మేనికిఁ బూసిన బసుమంబు రుద్రాక్షమాలికలు జటాకలాపములు వింతయందముఁ దెచ్చుచున్నవి.

అక్కటా! వీఁడు సన్యాసియని యెఱింగియు నిర్దుష్టమ నా చిత్తము వీనియందు వ్యాపించుచున్న దేమి పాపము? నా స్వప్నమునకు ఫలంబిదియా యేమి? ఇప్పుడేమి చేయవలయునో నాకుఁ దెలియకున్నది. ఈ తగుల మెవ్వరు విన్నను నవ్వక మానరు. భూమండలంబున బేరు పొందిన రాజపుత్రుల నెల్ల నాక్షేపించిన నా హృదయము వీనిపై వాలుట నాకే వింతగా నున్నది. సీ! స్త్రీ హృదయముకన్నఁ జంచలమైనది మఱి యుకటి లేదు. అయ్యో? పల్లమునకు బోవు జలమువలె నామనము ఎంత మరలంచుకొనుచున్నను మఱలక వానిపై వ్యాపించుచున్నదిగదా! అని వితర్కించుకొనుచు వారితో సంభాషించి పోవలయునని నిశ్చయించి పల్లకి దింపుమని యాజ్ఞాపించి తటాలున లేచి శిబికాకవాటములఁ దెరచుకొని చెలులు త న్ననుసరించిరాఁ దిన్నగా సిద్ధవ్రతు నొద్దకుఁ బోయి పాదంబులకు సాష్టాంగనమస్కారముఁ గావించినది.

అనుకూలవల్లభ సమాగమోస్తు. అని యా యోగి దీవించెను. పిమ్మట మోహనునకు మ్రొక్కుటయు నతండుగూడ నట్లే యాశీర్వదించెను.

అప్పుడా చిన్నది వినయముతో మహాత్ములారా! మీ యాశీర్వచనములు వరంబులుగా స్వీకరించితిని. మీరు సత్యవచనులుగదా! మఱియు నేనభీష్టప్రాప్తి ప్రశ్నమునకై యిప్పు డీమఠంబున కరుదెంచితిని. మిమ్మిందుఁ గాంచి కృతార్థురాల నైతిని, మీ రెందుండి వచ్చితిరి? ఈ బాలయోగి మీ కంతేవాసి కావచ్చు. ఇంత లేబ్రాయంబున వైరాగ్యంబు వహింప నేమి వచ్చెను? ఈ మచ్చకంటి వీరి కేమి కావలయు ? మీ యుదంత మెఱింగించి నాకు శ్రోత్రానంద మాపాందింపుఁడు.

నేనీ దేశప్రభుండగు భీమవర్మ పుత్రికను. నా పేరు చంద్రికయండ్రు. మీకడ దాచనేల? రాత్రి స్వప్నములో నా యభీష్టదేవత గనంబడి రేపు మఠంబునకుఁ బొమ్ము. నీకు శుభంబగునని యానతిచ్చినది. ఆ మాటలయందుఁ గల విశ్వాసమున నిందు వచ్చితిని. మీకన్న నాకిందుఁ జూడఁదగినవారులేరని విని యా యోగి యిట్లనియె.

పుణ్యవతీ! నీవాఙ్నైపుణ్యము నీ పాండిత్యమును వెల్లడించుచున్నది. ఈ మఠమే మీ తండ్రిగారి యౌదార్యమును వేనోళ్ళుఁ జాటుచున్నది. సత్కులప్రసూతవగుట నిన్నభినందింపఁదగినది. బైరాగులకు నొకదేశము నొకనామము గలిగియుండదుగదా? ఈతం డొక్క గొప్పకులస్థుఁడు. ఒక కార్యదీక్షకై వ్రతస్థుఁడై మావెంట వచ్చుచున్నవాఁడు. ఈ తరుణికి నీతనికి నేమియు సంబంధములేదు. ఆమె ముత్తైదువుగా వచ్చుచున్నది. మేము కాశీపురంబున కరుగుచుంటిమి. నీ స్వప్నం బునకు ఫలస్థులము మేము కాము ఇందు మఱెవ్వరేని యుండిరేమో యరసికొనుము. అనుటయు రాజపుత్రిక యిట్లనియె.

స్వామీ! నే నీమఠం బంతయుఁ జూచి వచ్చితిని. నాకు నచ్చినవారెందును గనంబడలేదు. మే దర్శనమే నన్నుఁ గృతార్థురాలిఁగా జేయునని తలచుకొంటిని. నాకు స్వప్నమందు గట్టినమ్మకము గలదు. దర్శనాదేవసాధవః అను నార్యోక్తి యేల తప్పును? మీ వలననే నా యభీష్టము దీరు నిది నిశ్చయము. మంచిదారిఁ జూపుఁడు. అనిన నా యోగి యిట్లనియె.

సుందరీ! నీ వట్లనిన మే మేమందుము? మమ్మేమి చేయుమందువు? నీ యభిలాష యేమి? యెఱింగింపు మనుటయు నా జవరాలు స్వామీ! సర్వజ్ఞులుమీ రెరుంగనిది కలదా? మీ రేమని యాశీర్వదించితిరో మరచితిరా? నాకా వరమే దయజేయుఁడని కోరినఁ నతం డోహో! సందిగ్ధముగాఁ బలుకకుము. నన్నేమి చేయమందువో నిరూపించి చెప్పుము. నీ యిచ్చవచ్చినట్లు చేయుదునని పలికిన ముఱియుచు నా తరుణి యిట్లనియె.

మహాత్మా! ఇఁక మీకడ దాచనేల? నాడెందము మీ శిష్యునందు లగ్నమైనది. అందులకే నీ నిందు వచ్చితిని. నింతకుముం దెన్నడైన నీ మఠముద్రొక్కి చూచితినేమో యడుగుఁడు. నా యభీష్టదేవతయే నాకీ యుపదేశము జేసినది. అందులకుఁ దార్కాణముగా నీ సుందరుని దర్శనమైనది. ఈతఁడే నా పతి. వీనినే వరించితి. అనుగ్రహించి వీని నిందు విడువుఁడు. పెండ్లి సేయింపుఁడని పలికినఁ పకాలున నవ్వి యవ్విరాగి యిట్లనియె.

విదుషీమణీ! నీవు మీగులఁ జదివినదాన విట్లు తొందరపడవచ్చునా? స్త్రీలు రూపముననే ప్రధానముగాఁ జూచి వరింతురు. ఇతర విషయముల నేమియు నూలోచింపరు. ఇతండు వ్రతస్థుండు. నిన్నెట్లు పెండ్లి యాడును? దీక్షాంతమైన పిమ్మట వెండియు నిందువచ్చి నీ యభీష్టముఁ దీర్పగలడు. అంతదనుక నాఁగిన నాఁగు మనవుఁ డాపడఁతి స్వామీ! త్రికరణంబులచే నితనిఁ బతిగా వరించితినిగదా! ఇఁక నాకు వేఱొకనితోఁ బనిలేదు. నన్నుగూడ మీ వెంటఁ దీసికొనిపొండు. శుశ్రూషఁ గావింపుచుండెద నెప్పటికైన నభీష్టము దీరినం దీరఁగలదు. లేకున్న నుత్తరజన్మమందైన వీనిఁ బతిగాఁ బడసెద నిదియే మదీయహృదయనిశ్చయము. దీని కడ్డు చెప్పవలదు. జెప్పితిరేని నాయాన యని యొట్టుపెట్టుటయు నతం డే మాటయుఁ బలుగక సరే నీ కిష్టమైనఁ గాషాయాంబరాదులు ధరించి మా వెంట రమ్ము. పొము . నీ నిమిత్తము రేపుగూడ నిం దాగెదము. మీ వారికిం జెప్పి యెల్లుండి యుదయంబున రమ్మని యాజ్ఞాపించుటయు నా యువతి సంతసముతో వానికిఁ మ్రొక్కుచు నతిరయంబున నాందోలికమెక్కి యింటికిం బోయినది.

ఆపైదలిదాదు లా సంవాదము వినియుంట వెంటనే యామె తల్లికిం జెప్పిరి. రాజపత్ని కూఁతునొద్దకు వచ్చి పుత్రీ! నీవు సన్యాసి మఠంబునకుఁ బోయితివఁట. ఎవ్వరితో జెప్పితివి? అని యడిగిన నేమియు మాటాడినది కాదు.

అప్పుడామె మోము జేవురింప మాటాడవేమి? నీ యుద్యమముఁ దెలిసికొంటి. సన్యాసులవెంటఁ బోవుటకు నిశ్చయించుకొంటివఁట. ఇవి యేమికర్మము. చక్రవర్తుల కుమారులకు వంకలుబెట్టి చివరకు సన్యాసిని వరించితివా? ఆహా యేమి నీ భాగ్యము? ఆహా ఏమి నీ సంకల్పము? సన్యాసులు స్త్రీ యంత్రవేత్త బద్ధలం జేసి స్త్రీల వశముఁ జేసికొందురు. . నీవు వారి యంత్రములోఁ బడితివికాఁబోలు చాలు. చాలు. నీ సంకల్పము మరలించుకొనుమని చెప్పిన విని కన్నులప్పళించుచు నా యొప్పులకుప్ప యిట్లనియె.

అమ్మా! నీతో నిజము చెప్పుచున్నాను. వినుము. నాకు నిన్నరాత్రి నొక కలవచ్చినది. అందు నాయభీష్టదేవత గనంబడి రేపు నీవు సన్యాసి మఠంబునకుఁ బొమ్ము ఉత్తమభర్తృలాభంబు గలుగఁగలదు అని చెప్పినది. అవ్వచనమునందలి విశ్వాసమున మీ కెవ్వరికిం జెప్పకుండఁ బోయితిని. చెప్పినట్లే త్రిలోకాభిరామసౌందర్యవిభ్రాజితుండు నాకు నేత్రపర్వము గావించెను. వాఁ డుత్తమకులజుండె కాని కారణాంతరమున దీక్షఁ బూని సన్యాసియై తిరుగుచున్నవాఁడు. పూజ్యమగు నా చిత్తము వానియందు లగ్నమైనది. నేనేమి చేయుదును? దైవముమ మీరువారుందురా? అతఁడే నా భర్తయని నిశ్చయించుకొని పెద్దవానితో నా కోరికఁ దెలిపితిని. దీక్షాంతమున స్వీకరింతునని చెప్పెను. ఆ దీక్ష కంతమెప్పుడో తెలియదు. మఱల వత్తుమని చెప్పిరి. కాని నేనిందుండి యేమి చేయుదును? వాని వరించి వేఱొకని బెండ్లి యాడిన వ్యభిచారినగుదుంగదా? శుశ్రూషఁ జేయుచు వారివెంటఁ బోవుటకు నిశ్చయించుకొన్న మాట వాస్తవము. నా యుద్యమమునకు మీ రెవ్వ రడ్డుచెప్పవలదు. నా ప్రారబ్ద మట్లున్నదని పలికిన విని రాజపత్ని ముక్కుపై వ్రేలిడుకొని యిట్లనియె.

సెబాసు చంద్రికా! నీ సంకల్పము చక్కగానున్నది. స్త్రీ యంత్రవేదులు స్త్రీలకు మన్మథులవలెఁ గనంబడుదురఁట. ఆ మాట సత్యమైనది. ఓహోహో! సన్యాసియట. రూపవంతుఁడట. దీక్షాంతమున స్వీకరించునఁట. ఎంత యుక్తముగా నున్నది. నిన్ను వాండ్రు యంత్రబద్ధం జేసి లాగికొనఁ బోవఁదలంచుచున్నారు. కానిమ్ము. వారి నిప్పుడే పట్టించి శిక్షింపఁజేసెద జూడుమని పలుకుచు నవ్వలికింబోయి భర్తకు వర్తమానముఁ బంపి రప్పించి యిట్లనియె.

నాథా! మీరు సన్యాసులకు మఠము గట్టించి సకలసదుపాయములు గల్పించినందులకు ఫల మిప్పటికిఁ గనంబడినది. పాములకుఁ బాలుపోసిన విషము గాకపోవునా? బూఁడిద బూసికొనినవాఁ డెల్ల విరక్తుఁడేనా నిజమైన విరక్తుడు మఠమునకు రానే రాఁడు. వచ్చినను నిలువఁడు. దొంగసన్యాసు లెల్లవచ్చి పెండ్లి కొడుకులవలె తిని మత్తిల్లి యందుఁ గదలక స్త్రీలఁ జెఱబట్టుచున్నారు. ఇప్పుడు మీ కొంపమీఁదికే వచ్చినది. కాచుకొనుఁడని జరిగినకథ యంతయుం జెప్పినది.

ఆ వార్త విని భూభర్త క్రోధమూర్ఛితుండై ఏమీ? ఆ కృతఘ్నులు చంద్రికనే యంత్రబద్ధం జేసిరా? తామున్న యింటికే నిప్పంటిచుకొనిరా? కానిమ్ము. నేటితో వీరి సుఖములు పటాపంచలైనవి. వీరి దేహములు కాకగృధ్రముల పాలు చేయించెద జూడుమని పలుకుచు నప్పుడే యాస్థానమునకుఁ బోయి మఠంబునంగల సన్యాసులనెల్ల నా బాలవృద్ధముగాఁ బట్టికొని వెంటనే బందీగృహంబునం బడవేయుడు. తరువాత విచారించెదనని కింకరుల కాజ్ఞాపించుటయు వాండ్రు గాండ్రు మని యరచుచుం బోయి తెలతెలవారుచున్న సమయంబున నా మఠంబుననున్న బైరాగుల నవధూతల, బరివ్రాజకుల భిక్షుకుల నా బాలవృద్ధముగా వెదకు వెదకి తీసికొనిపోయి మొఱవెట్టుచుండఁ జెఱసాల బడవైచి యా మఠమును శూన్యముఁ గావించిరి.

మఱునాఁ డాఱేఁడు భార్యతోఁగూడ గూఁతునొద్దకు వచ్చి చంద్రికా! నీవు స్వతంత్రురాలవైతివఁటే. అంత చదివితి నింత మూఢురాలవైతివేమి? పెద్దలకుఁ దెలియకుండ మఠమునకుఁ బోవచ్చునా? పోయితివో చూచిరాక సన్యాసిని భర్తగా వరించి వాని వెంటఁ బోవుట కుద్యమించితివఁట. ఇది యేమి కర్మము. భూమండలాఖండలుల కుమారులకుఁ దప్పులు పట్టితివే? బిచ్చగాఁ డెట్లు నచ్చెను? అది స్త్రీయంత్రప్రభావమని యిప్పటికైనం దెలిసికొంటివా? ఆ ద్రోహులు నిన్ను యంత్రవివశం జేసినందులకు ఫలం బనుభవించుచున్నారు. రేపు వారినందఱం బలవంతమున జంపించెదఁ జూడుము. అని యత్యంతాగ్రహంబునం బలికిన విని చంద్రిక మెల్లన నిట్లనియె.

తండ్రీ! నీవు కోపించిన నేమియుం జెప్పఁజాలను. ఎవ్వరును నన్ను మంత్రబద్ధం జేయలేదు. సన్యాసులయం దిసుమంతయు దోసములేదు. ఎఱింగియో యెఱుఁగకయో స్వప్నఫలాశం జేసి స్వతంత్రించి నేనే యా మఠంబునకుం బోయితిని. అందొక బాలయోగి నా హృదయ మాకర్షించెను. చూచినతోడనే యతండు కారణజన్ముఁడని నిశ్చయించి యతఁడే నా భర్తయని త్రికరణంబుల వరించితిని. దైవికముగా నా కట్టిబుద్ధి పుట్టినది. ఇప్పుడేమి చేయుమందురు? శాస్త్రమెఱింగిన వేత్తలు మీరే చెప్పుడు. సతికిఁ బతితోడిదయ గతిగదా? సావిత్రి యేమి చేసినదో తెలియదా? నేను వారివెంటఁ బోవ దలఁచుట తప్పుగాదని నా యాశయము. మీరు వారిం జంపుదురా? సహగమనము జేసెదఁ గట్టింతురా నన్నుఁగూడ గట్టుఁడు. వేఱొక తెఱవు నాకాచరణీయము కాదని నిర్భయముగాఁ బలికినది.

రాజు - ఛీ ! ఛీ ! కులపాంసనురాలా! అవాచ్యము లాడెదవు! పుంశ్చలివై నీ తప్పు నీకుఁ దెలియకున్నది. సిగ్గువిడిచి నా యెదుట నేమేమో ప్రేలెదవు? అని కటము లదరఁ బండ్లుగీటుచు నట నిలువక కొల్వుకూటంబునకుంబోయి యా బైరాగుల నెల్ల రప్పించి పరీక్షించి చూచెను.

సీ. కటిసూత్రములఁ గావి కౌపీనము బిగించి
             తోలు గప్పిన యవధూత యొకఁడు
    పొడుగుగడ్డము గిట్టపొట్ట వ్రేలాడ
             నవ్వించు బడుగు సన్యాసి యొకఁడు
    డొక్కలంటుకొని పో బక్కజిక్కి శవంబు
             పగిదిఁ గాన్పించు తపస్వియొకఁడు
    మేనెల్ల బసుమంబు మెత్తి నెత్తిని జటా
             జూటంబుఁ జుట్టిన జోగి యొకఁడు
గీ. రోగియై మూల్గుచున్న బైరాగి యొకఁడు
    భిక్షకై చిప్పఁ గై దాల్చుదాల్చు భిక్షుఁడొకఁడు
    కాని పరికింప మచ్చుకైనఁగాని
    వారిలో నొక్క చక్కనివాఁడు లేఁడు.

వారినెల్లఁ గలయం గనుంగొని యా నృపాలుం డలుక దీపింప మేకవన్నెపులులు, తృణచ్ఛన్నకూపములు, తేనెఁ బూసిన కత్తులవలెఁ దపస్వివేషము వైచికొని లోకుల వంచించుచున్న మీకు వేయఁదగిన శిక్ష యేదియో తోచకున్నది. పాములకుఁ బాలు పోసినట్లు కుపకారము జేసినందులకు నా పనియె పట్టితిరి. కృతఘ్నులారా? మీ దేహము తునకతునకలుగాఁ గోయించి కాక గృధ్రముల పాలుసేసిన దోసము లేదు. కానిండు. కానిండు జవ్వనములోనున్న యన్ను మిన్న యొకతె మీలో నున్నదఁట? అది కాన్పింపదేమి? దాని నెందు దాచితిరి? ఆలాటి బోఁటుల నెందరఁ దెచ్చితిరి? అక్కటా? తెలియక నిట్టి తుచ్చుల మఠంబునం గుడవ బెట్టుచుంటినే? ఆబాలయోగి యెందున్నవాఁడు? ఈ బడుగు లిట్లుండిరేమి? అని యడిగిన నందొక వక్త యగు సన్యాసి యీవలకు వచ్చి మ్రొక్కుచు నిట్లనియె.

మహారాజ! మున్నొక్కపామువలనఁ దన దండ్రి మృతి నొందెనని జనమేజయుఁడు సర్పయాగముఁ జేసినట్లు ఒక దుష్టుండు మిమ్ము మోసముజేయ నిరపరాధుల మమ్మెల్ల శిక్షింపఁ బూనితిరి పడుచుతో వచ్చిన సన్యాసు లారాత్రియే పారిపోయిరి, మే మేమియు నెఱుఁగనివారము. భోజనంబున కాసపడి మీమఠంబున వసించితిమి ఇంతవఱకు మమ్ము బిడ్డలవలెఁ బోషించితివి. నిజము విమర్శింపక యిప్పుడు మమ్ము శిక్షించితివేని యపఖ్యాతి వహింతువు. అని యుక్తియుక్తముగా నెఱింగించి యానృపతి మతిఁ గరింగించెను.

అప్పుడా నృపతి యించుకసే పాలోచించి నాఁడు చంద్రికతో మఠంబునకుఁ బోయినచారుల రప్పించి వీరిలో జంద్రికతో మాట్లాడిన యోగు లెవ్వరో చెప్పుఁ డని యడిగిన వాండ్రు విమర్శించి దేవా! ఆ బాలయోగి మిగుల జక్కనివాఁడు. వారి వెంటనున్న వాల్గంటి మంచి యందగత్తె. వా రిందెవ్వరును గారని చెప్పిరి. రాజు వారి నెల్ల బంధవిముక్తులఁ గావించి పోపొండు. మా దేశము విడిచి పొండు. సన్యాసి పురుగు మా విషయమున నుండఁగూడదు. అని యాజ్ఞాపించి వారినెల్ల విడిపించి యంతఃపురమునకు వచ్చి భార్య కత్తెఱం గెఱింగించెను.

ఆమె నాథా! చంద్రిక బుద్ధి యెంత చెప్పినను దిరుగకున్నది. తనమూలమున నా సన్యాసులఁ బట్టించితిరని విని యురిఁ బోసికొనుటకు బ్రయత్నించుచున్నది. వారి విడిపింతునని బ్రతిమాలికొని వచ్చితిని. నగ లన్నియు దీసి పారవేసినది. జల్తారుచీర లన్నియుఁ బంచి పెట్టుచుండ వారించినఁ జించిపారవేసినది. కాషాయాంబరధారిణియై యోగినీవేషము ధరించినది. నిద్రలో సన్యాసులఁ బలవరింపుచున్నది. వాండ్రు దీని మంత్రబద్ధం జేసిపోయిరి కాబోలు? ఇందులకుఁ బ్రతితంత్రవేత్త లెవ్వరయిన నుండిరేమో రప్పింపుఁడు వాండ్రు నిన్ను మోసముఁ జేసి తీసికొని పోవుచున్నారని యెంతఁ జెప్పిన నొప్పుకొనదు. వారు మహానుభావు లనియు నేయంత్రము వేయలేఁదనియు నాతని రూపమే తనకు మోహనయంత్ర మైనదనియు నాతండే భర్తగ బ్రహ్మ లిఖించెననియు వాదించుచున్నది. అయ్యయ్యో? ఇప్పుడేమి చేయుదము? అది మనమాట వినదు. అన్నింటికిం దెగించి యున్నది. మనము నిర్బంధించిన బలవంతమునఁ జావఁగలదు. పోనిండు. ఆ బాలయోగి నిందు రప్పింపుఁడు. ఇందే యుండఁగలఁడని పలికినంత నతండు ప్రళయకాలమేఘమువలె బొబ్బ పెట్టి ఎట్టిమాట పలికితివి? నీ స్త్రీ చాపల్యమూరక పోయినదికాదు. అది చచ్చినం జచ్చుఁగాక. గట్టిగా రట్టుజేసిన దానిం గూడఁ గట్టి పారవేయించెదఁ గులము చెడఁబుట్టినది. ఈ విషయమయి దయఁదలచనని చెప్పుమని పలుకుచు నతండు తన మందిరంబునకుంబోయెను. రాజపత్నియు దుఃఖించుచుఁ గూఁతునొద్దకుఁ బోయినది.

191 వ మజిలీ.

కాశీప్రభావము

దైవజ్ఞుండగు సిద్ధవ్రతుండు నాఁటి వేకువజామున మఠమునుండి బయలుదేరి శిష్యులతోఁగూడ నుత్తరాభిముఖుండై యరుగునప్పుడు మోహనుండు మహాత్మా! నీ వసత్య మాడని వాఁడవుగదా. ఆ రాజపుత్రికతో నెల్లుండివఱకు నిందుండెదనని చెప్పి యప్పుడే బయలుదేరితి రేల? కపిల రాక కనుమోదించి యామె నట్లు వంచించితి రేమి? అని యడిగిన నయ్యోగి యిట్లనియె.

మోహనా! కపిలమూలమున మన కపఖ్యాతి చాల గలుగుచున్నది. బలశాలివి నీ వడ్డుపడబఁట్టి మేము బ్రతికితిమిగాని లేనిచో నాఁడు రెడ్డిచేతనున్న దుడ్డుకఱ్ఱచేఁ జావక పోపుదుమా? ఆ యాపద యెట్లో దాటినది. అగ్గి నొడి గట్టినట్లు