కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/188వ మజిలీ
188 వ మజిలీ
సిద్ధవ్రతుని కథ
రాజపుత్రుని చిత్తము నక్షత్రలోకతాదాత్మ్యము జెందుచున్నది. సంతతము ఆ విషయమే ధ్యానించుచుండును. ఇతరశాస్త్రోపదేష్టలు వచ్చి యుపన్యసింప నాలింపక నక్షత్రవృత్తాంతమే యడుగుచుండు. ప్రవరుం డోషధీరసవిశేషంబున హిమగిరి కరిగిన చరితము సత్యమే! అని పండితుల శంకించుచుండును. నిద్రలో నక్షత్రలోకమున కరిగినట్లు కలలు గనుచుండును. ఇట్లున్మత్తునిక్రియ దదేకధ్యానమున వర్తింపుచు నొకనాడు సిద్ధార్థున కిట్లనియె.
మిత్రుడా? ఇక నాకు విద్యాగ్రహణమునం దుత్సుకములేదు. రాజ్యతంత్రమునం దభీష్టము పుట్టదు. భూలోకవిషయములన్నియు మన మెఱింగినవియే లోకాంతరవిషయములు కన్నులార జూడవలయును. మనము తపంబు సేయజాలము. తపోధనుల శుశ్రూషవలన నట్టిశక్తి సంపాదింపవలయును. మన సత్రము ప్రక్కనున్న మఠమునకు నిత్యము వచ్చుచుండెడి సన్యాసుల బైరాగుల నవధూతల బరివ్రాజికుల నాశ్రయింపుచుండవలయును. అందఱు గపటాత్ములుగారు. నూటికొక్కడైన మహానుభావు డుండకపోడు. మహర్షులు లోకరక్షణార్ధమై దేశసంచారము సేయుచుందురు. మఠమునకువచ్చు విరక్తులకు విశేషముగా ధనమిచ్చుచుండవలయును. మాతండ్రిగారి కీరహస్యము దెలియనీయగూడదని చెప్పిన విని సిద్ధార్థుండు నవ్వుచు వయస్యా! గట్టిపట్టే పట్టితివి. అందరానిపండ్ల కాసపడుచుంటివి. కానిమ్ము దీనం దప్పేమియున్నది ప్రయత్నింతముగాక అని యతండు సెప్పినట్లు కావింపుచుండెను.
రాజపుత్రుడు సిద్ధార్థునితో గూడ నిత్యము మఠమునకుబోయి మహాత్ములని తోచిన బైరాగులతో ముచ్చటింపుచు వారు వారు దిరిగిన దేశవిశేషము లడుగుచు క్షేత్రమహాత్మ్యముల దెలిసికొనుచు విశేషముగా గానుకలు పంచిపెట్టుచుండెను. దానంజేసి పుడమిగల విరక్తులందఱు వేలకొలది యచ్చటికి వచ్చుచుండిరి.
సీ. మెలికలు వారి కొమ్ముల భాతినొప్పారు
గోళ్ళుబెంచిన యతుల్ గొంతమంది
పొడవుగా వెనువెన్క మడమలఁ జీరాడు
జడలు గల్గిన యతీశ్వరులు కొంద
ఱఖిలాంగముల రుద్రాక్ష మాలికలొప్ప
భవుపోల్కె నొప్పుతాపసులు కొంద
ఱవయవంబుల భూతినలఁది యున్మత్తరూ
పములఁ గ్రుమ్మరు దిగంబరులు కొంద
గీ. ఱజినములు గుండికలును నర్కాక్షమాలి
కలును దండము లూను భిక్షులును గొంద
ఱరుగుదెంతురు నిత్యమన్నార్థులగుచు
నమ్మఠంబున కమరు ప్రఖ్యాతి నెఱిఁగి.
మరియు నిత్యము -
క. చెంబులు లోటా లంగీ
లంబరములు శాలువలు గటాసనములు ఛ
త్రంబులు పాదుకలును నును
కంబళులును నిత్తురుడుగక విరక్తులకున్.
చ. మారసమాన! యో నృపకుమార! సువస్త్రములిమ్ము, నారు సం
భారములిమ్ము, నాకు నునుపచ్చడము ల్వెసదెమ్ము నాకు జ
ల్తారు పంటంబులంచు జడదారులు మూఁగికొనంగ లో నహం
కారము జెంద కించుకయు కామ్యము లిచ్చు నతండు నవ్వుచున్.
అట్లు కొన్నిదినంబులు గడంచినంత నొక్కనాఁడు రాజపుత్రుఁడు మిత్రునితోఁ గూడ భిక్షువులకు వస్త్రాదికము లిచ్చుచున్న సమయంబునఁ దన్మధ్యంబున దివ్యతేజస్సంపన్నుడును జటామకుటమండితుండును. వ్యాఘ్రచర్మోత్తరీయుండును విభూతిరుద్రాక్షమాలికావిరాజితగాత్రుండు నై రెండవ శంకరునివలె నొప్పుచు నీక్షణంబులు దుర్నిరీక్ష్యంబగు తేజంబు గ్రక్కుచుండఁ జూచినంతనే మహానుభావుండని తెలియఁబడు నొక్కసన్యాసిం బొడఁగాంచి సంతసించుచు నతం డేమియు నడుగకున్నను, మిక్కిలి వెలగల మెఱుఁగులీను జల్తారుశాలువ యొక్కటి యతనిపైఁ గప్పి నమస్కరించెను. అవ్విరక్తుండు ఆ శాలువఁ దీసి చేతులఁ బట్టుకొని మోహనుని మోముపైఁ జూట్కులు నెరయఁజేయుచు రాజపుత్రా! నీదాతృత్వము విచిత్రముగా నున్నదిగదా! విరక్తుల రక్తులఁ జేయుచుంటివి. నీయీవివలన గృహస్థులుగూడ భిక్షుకులగుచున్నారు. పరివ్రాజకుల కీయమూల్యమాల్యాంబరాభరణాదు లేమిటికి? నాకీ శాలువతోఁ బనిలేదు. రామేశ్వరమునుండి వచ్చుచు నీ దాతృత్వ మెల్లరుఁ జెప్పికొనఁగాఁ జూడవచ్చితిని. కాని యీ పచ్చడంబునకై వచ్చినవాఁడగాను. దీని మఱియొకని కిమ్మని పలుకుచు మడతఁబెట్టి యాశాలువ వారిముందరఁ బెట్టెను.
అప్పు డారాచపట్టి యాభిక్షుని పాదంబులఁబుట్టుకొని మహాత్మా! రక్షింపుము. మీ కొక ప్రయోజనము లేకున్నను మద్భక్తినివేదితంబగు పుష్పంబనుకొని దీనిం బరిగ్రహింపుడు. ఎప్పటికైన మీ యట్టి మహాత్ముని దర్శనం బగుననియే యిట్టి యుద్యమము సేయుచుంటి. నేఁటికి గృతార్థుండనైతి. మీ పాదసేవఁజేసి కృతకృతుండ నయ్యెదనని పలికిన విని యతండు చిఱునగవుతో నోహో! మంచియుక్తిపరుండవే! సంతోషమయినది. గూర్చుండుము. అతండు నీ కేమి కావలయునని యడి గిన మోహనుఁడు స్వామీ! ఈతడు నా ప్రాణమిత్రుఁడు. మంత్రిపుత్రుఁడు. మా కిద్దరకుఁ గ్రొత్తదేశవిశేషములం జూడవలయునని యభిలాష గలిగియున్నది. మిముఁ బోటి తపోధనుల యనుగ్రహంబునం గాక మా కామితము దీరనేరదు. అని తనయభిప్రాయమెఱుఁగఁ బలికిన విని యా బైరాగి యిట్లనియె.
రాజపుత్రా! మేమును మీ వంటివారమే. మీరు సుఖప్రారబ్ధము, మేము దుఃఖప్రారబ్దము ననుభవించుచుంటిమి. అణిమాదిసిద్ధులు గలసిద్దు లెక్కడోగాని లేరు. అట్టివారి వలనం గాని నీ యభిలాష దీరదు. అని యేమేమో చెప్పిన విని సిద్ధార్థుండు స్వామీ! సుఖము కూడఁ బ్రారబ్ధమేనా? దుఃఖమే ప్రారబ్ధ మనుకొనుచుంటి మనవుఁడు సుఖప్రారబ్ధము దుఃఖప్రారబ్ధ మింతయే భేద మీ యర్థంబు దేటవడ నొకకథఁ జెప్పెద నాకర్ణింపుఁడు.
విజయదాసుని కథ
ఢిల్లీ చక్రవర్తి యొద్ద విజయదాసను మంత్రిపుంగవుఁడు గలడు. అతండు రాజతంత్రములన్నియు జరుపుచున్నను జనకుండు వోలె నిష్కాముండై కామక్రోధాధిదుర్గుణంబుల హృదయం బంటనీయక నువిరక్తితో నొప్పుచుండెను. అతండు గానప్రియుండగుట సంతతము వేదాంతకీర్తనలఁ బాడించి యానందింపుచుండును. తాను గూడ గొన్ని తత్వముల రచించి విపంచిమీఁదఁ బాడుచుండును. అతండు రచించిన తత్వకీర్తనలు ప్రస్థానప్రయోక్తసూక్తుల నభివ్యక్తము సేయుచున్నవి.
ఆ కీర్తనలు తరుచు సన్యాసులు బైరాగులు బాడుచుందురు. కొన్ని దినంబులకు దేశమంత వ్యాపించినని విజయదాసుగారి తత్వము లనిన వేదాంతులు చెవి చేసుకొందురు. ఆ గీతములు విరక్తులకే కాక రక్తులకుఁ గూడ గర్ణామృతములై యొప్పుచుండును.
ఒకానొక హరివాసరమున హరిద్వారంబున బైరాగులు కొందఱు కిన్నరలు మీటుచు విజయదాసు చెప్పిన కీర్తనలం బాడుటయు విజ్ఞానచంద్రుఁడనుసన్యాసి యా తత్వముల నాలించి యుబ్బిగంతులు వైచుచు నోహోహో! యీ గీతములను రచించిన మహానుభావుండెవ్వఁడో? ఎట్టి తత్వవేత్తయో? ఎట్టి విరాగియో? అతం డాధునికుఁడో పూర్వుఁడో వాఁ డిప్పుఁడుండినఁ దద్దర్శనముఁపసి కృతార్థుఁడనగుదుంగదా? అని యాలోచించుచు నతండు ఢిల్లీ పురవాస్తవ్యుఁడు బ్రతికియే యున్నవాఁడను వార్త విని సంతోషించుచు నటఁ గదలి కొన్ని దినంబులకు ఢిల్లీ నగరముఁ జేరెను.
అంకితము వలన విజయదాసని పేరు తెలిసికొని యున్నవాఁడగుట నిందు విజయదాసను తత్వవేత్త యెందున్నవాఁడని కనంబడిన వారినెల్ల నడుగుచుండెను. మాకుఁ దెలియదని సమాధానము జెప్పుచుండెడివారు. ఆరుమాసము లందుండి విమ ర్శించియు నా పేరుగల వానిం దెలిసికొన లేకపోయెను. అతండు గతించెనని నిశ్చయించి వెండియు హరిద్వారంబునకుఁ బోవఁదలంచెను. నాఁటిసాయంకాలమున వీణ మీఁద నా విజయదాసు జెప్పిన తత్వములఁ బాడుచున్న యొక గాయకుంజూచి పాట ముగించునంతవరకు నందుండి యతండు వీణఁ గట్టిపెట్టి వెళ్ళబోవునప్పుడు అయ్యా! మీరు పాడిన తత్వములు జేసిన విజయదా సెవ్వఁడో యెఱుఁగుదురా? అంకితము వలన నీ గ్రామమేయని తేలుచున్నది. అతం డిప్పుడు బ్రతికియున్నవాఁడా? అని యడిగిన నా గాయకుడు అయ్యో! బ్రతికియే యున్నవాఁడు అతండు
క. చతురం భోధి పరీత
క్షితినాయక నికరమగుట కీలిత రత్న
ద్యుతి నీరాజిత చరణుఁడు
మతిమంతుఁడు చక్రవర్తి మంత్రి మహాత్మా!
అనుటయు సన్యాసి అయ్యా! అట్టి ప్రసిద్ధపురుషుని పేరెవ్వరి నడిగినను జెప్పలేక పోయిరేమి? ఆరు మాసములనుండి వృధగ శ్రమ పడుచుంటిని. ఈ మాట యప్పుడే తెలిసినచో నింటికిఁ బోవుదం గదా? అని పలికిన నా గాయకుఁడు అగు నగు నంకితములో విజయదాసని చిన్న పేరున్నది. కాని, అతని యభిక్య పెక్కు బిరుదములతో నొప్పుచున్నది. విజయప్రతాపనృపవేదండకంఠీరవుఁడు. సామాన్యముగా నీవన్నపే రాయనదని యెవ్వరికిం దెలియదు అని సమాధానము జెప్పెను.
చీ, ఛీ మహావిరక్తుండువలె నిట్టితత్వములం రచించి తుచ్ఛములగు సంసారభోగము లనుభవించుచున్నవాఁడా? చాలుఁ జాలు. నిది లోకులను వంచించుటగాఁదా యని పలికిన నతం డేమియు మాటాడలేదు. ఇంచుక సే పాలోచించి యా సన్యాసి అయ్యా! ఆయన మాబోటివారితో మాట్లాడునా? దర్శనమిచ్చునా? అని యడిగిన సరి సరి మీకా దర్శనము! మహాసామ్రాజ్యాధిపతులు వచ్చి ద్వారమున వేచియుండ, నెన్నినాళ్ళకో కాని దర్శనావకాశము గలుగనేరదు. అని యాగాయకుఁడు సెప్పెను. బైరాగి మఱియు నాలోచించి, అట్టి భోగవర్తుం జూడ నతిప్రయత్నము సేయనేల పోవుటయే లెస్స. అని యాలోచించి యటఁ గదలి కొంతదూరము పోయి నిలువంబడి యతండు రచించిన కీర్తనలఁ దలంచుకొని మేను ఝల్లుమన నయ్యో! వాని కొఱకు శ్రమపడి యింతదూరము వచ్చి చూడకుండఁ బోవుట మంచి పని కాదు. చూచి మాట్లాడి యెట్టివాఁడో తెలిసికొని బోవుట యుచితము. పదిదినము లాశ్రయించిన దర్శనము కాక పోవునా! అని మఱలఁ దలంచి మంత్రిగారిగృహమెందున్న దని యడుగుచు మఱునాఁ డుదయమునకు వారి సదనాంగణముఁ జేరెను.
తత్ప్రదేశంబు మత్తమాతంగతురంగమాది మంగళజంతుసంతత్యలంకృతంబై స్ఫటికశిలాఘటితకుట్టిమంబై యొప్పుచున్నది. సమున్నతఫాలవిరాజ మానంబగు మునిప్రసాదంబు నందలి సింహద్వారంబు కార్తస్వరభాస్వరఘృణీకలిత లలితమణి నిర్మితంబగుటఁ గన్నులకు మిరిమిట్లు గొల్పుచున్నది. అంతకుమున్ను స్యందనారూఢులై పెక్కండ్రు మహారాజులు వచ్చి యయ్యమాత్యప్రవరుని దర్శనమునకై వేచియున్నారు. ప్రతీహారి వారివారి పేరులం దెలిసికొని యవసరము గనిపెట్టి నివేదింప దర్శనమిచ్చి క్లుప్తముగా మాట్లాడి యంపుచుండెను.
ఆ వైభవమంతయు గన్నులార జూచి యా బైరాగి యోహో వీఁడెక్కడి విరక్తుండు. పలుకు వేఱు చేత వేఱుఁగా గనంబడుచున్నది. పొరపాటు వలన నేనింత దూరము వచ్చితిని. ఈ యవివేకి దర్శనముతో నా కేమి పని? పోవుదునా? అని యాలోచించి యంతలో గానిమ్ము రానే వచ్చితిని గదా? ఎట్లో కష్టపడి మాటాడియే పోవుదం గాక! యని తలంచి యా ప్రభువుల సందడి యంతయు నుడుగుపర్యంతము నిలిచి యవకాశము కనిపెట్టి ద్వారపాలకుని యొద్దకుఁ బోయి నాకు మీవిజయదాసుగారి దర్శనము సేయింపఁగలవా? అని యడిగిన నవ్వుచు వాఁ డిట్లనియె.
ఓహో! బైరాగి! విజయదాసుగారని సులభముగాఁ బలుకుచుంటివి. ఇదివర కాపేరున నెవ్వరుఁ బిలువలేదే? నీ వెవ్వఁడవు? వారి దర్శనముతో నీ కేమిపని? నీ బోటివారికి వారు దర్శనమియ్యరు. దూరదేశములనుండి వచ్చిన నృపతులకే చూడ నవకాశము గలిగినది కాదు. వారి సత్ర మా వీథి నున్నది. పొమ్ము నీకు గావలసిన వస్తువుల నిత్తురని పలికిన విని బైరాగి నా కేకోరికయునులేదు. వారితో నొక్క మాటాడి పోవలయునని వచ్చితిని. ఇంచుక యవకాశముఁ జూచి నా మాటవానితోఁ జెప్పుమని యడిగిన వాఁడు పదిదినములవఱకు మహారాజులకే సమయములేదు. నీ కెట్లు గలుగును. తరువాతఁ జూతును. అని చెప్పిన సంతసించుము. నట్లే యుండెదఁ బదిదినములకే తెలుపుమని యా ప్రాంగణ ప్రతోలికయందుఁ గూర్చుండెను. ఎవ్వడోకరతలభిక్ష వలన నాఁకలి యడంచుకొనుచు సంతతము నా ద్వారదేశమునందే కూర్చుండును
పదిదినములు గడచినంత నతండు ప్రతీహరి యొద్దకుఁ బోయి నీవన్న మితి గడచినది. నా రాక చెప్పెదవా? అని యడిగిన సరిసరి. రాజుల సమ్మర్థ మెక్కువ యగుచున్నది. ఇంకొక పదిదినములు పోయినం గాని మాట్లాడుట కవకాశము దొరకదు. అని యీ రీతి మూఁడు నెలలు జరిపెను.
చివరకు సన్యాసికి విసుగు వచ్చినది. కడపట ద్వారపాలునొద్దకు బోయి నే నీగ్రామము వచ్చి తొమ్మిదినెల లైనది. మీ ప్రభు దర్శనమైనది గాదు. ఆయనతో నా కొకప్రయోజనము లేదు. ఒక్క మాటాడిపోవుదును. ఇంత మాత్రపుపనికి మూఁడునెలలనుండి జరుపుచుంటివే? గృహస్థుఁడ వీమాత్ర ముపకారము సేయఁజాలవా? పోనిమ్ము కాదని చెప్పుము. పోయెదంగాక అని పలికిన నులికిపడి వాఁడు నేనేమి చేయుదును? నిన్నుఁ ద్రిప్పుచున్నమాట వాస్తవము. అవకాశము చిక్కకున్నది కానిమ్ము. నేఁడుపోయి చెప్పెద నిందుండుము, అని పలికి యవకాశము గనిపెట్టి లోపలకు బోయి నమస్కరించి దేవా! ఒక సన్యాసి హరిద్వారమునుండి వచ్చి తొమ్మిదినెలలనుండి మీ దర్శనమునకై యీయూర వేచియున్నాడఁట. ఏ మిచ్చిననుం బుచ్చుకొనఁడు. పని యేదియో చెప్పడు. మీతో నొక్కమాటాడి పోవునఁట. మూఁడునెలలనుండి వీథిగుమ్మము విడువకున్నవాఁడు. ఈ మాట తమతో నివేదించుట కవకాశము దొరికినదికాదని పలికెనో లేదో తలయెత్తి చూచి యేమీ? నిష్కాముఁడైన యొకవిరక్తుడు మూఁడుమాసములనుండి ద్వారమునఁ వేచియుండఁ జెప్పకుంటివా? ఛీ, ఛీ, నిర్భాగ్యుఁడా? వానికన్న మహారాజు లెక్కువవారురా? చారు కానుక లిత్తురని వారి రాఁకఁ దెలియఁజేయుచు నీ బిచ్చగాని మాట చెప్పక వెనుక త్రోయుదువా? ఇట్టి యవివేకినిఁ బ్రతీహారిగాఁ జేయుట మాదియే తప్పు. పోపొమ్ము. ని న్నీపనినుండి తొలగించితినని నిందించుచు మఱియొక దూతం జీరి నీవు సత్వరముఁ బోయి యా బైరాగిం దీసికొనిరమ్మని యాజ్ఞాపించెను.
వాఁడు భయపడుచు వాకిటకుంబోయి సన్యాసిగారూ! రండి మీ మూలమున ద్వారపాలుని నోటిలో మన్ను పడినది. ఆ బుద్ధివిహీనుఁడు మీ మాటయేముందుఁ జెప్పిన దీరిపోవునుగదా! రండు, రండు. అని తొందరపెట్టిన విని యతండు ద్వారపాలకుని కేమి మోసము వచ్చినది. నేనేమియు ననలేదే? అనవుఁడు జరిగినకథ జెప్పి సగౌరవముగా లోపలికిఁ దీసికొనిపోయెను. బంగారుగొలుసులచే వ్రేలాడుచున్న తూగుటుయ్యెలలో హంసతూలికాతల్పంబునం గూర్చుండి సుందరు లిరుగడ వీచోపు లిడుచుండ మహేంద్రవైభవంబున నృపప్రేషితములగు పత్రికల విమర్శింపుచున్న యమ్మంత్రిపుంగవుం గాంచి యాబైరాగి రెండుచేతుల నాద్వారశాఖల నాని నిలువంబడి తత్వకీర్తనల రచించిన విజయదాసువు నీవేనా? నీవేనా ? అని ముమ్మా రడిగెను.
అప్పు డాసచివోత్తముఁడు తటాలున లేచి నమస్కరింపుచు నార్యా యీ పీఠమున వసింపుఁడు. విజయదాసను లౌకికనామము గలవాఁడను నేనే. మీ రాక దెలియక శ్రమపెట్టినందులకు క్షమింపుడు.
సన్యా - లోకులకు దత్వోపదేశము సేయుచుఁ తుచ్ఛబోగము లనుభవించెడు మిముఁ బోటులకు బీఠములు గాని మాకు వానితోఁ బనిలేదు. ఈ తత్వములు రచించినవాఁడవు నీవేనా?
విజ - స్వామీ! క్షమింపుడు. పీఠ మలంకరింపుఁడు. దైవప్రేరితము బుద్ధిచే వీని రచించినవాఁడను నేనే.
సన్యా - అక్కటా! నీవు పలు కొక్కటియు సేత యొక్కటియుఁ గావింతువా?
మంత్రి - మహాత్మా! నే నట్లు సేయలేదే.
సన్యా - ఓహో! నీ మోహ మింకనుం దెలియకున్నావుగదా! సర్వసంగవర్ధితులు గమ్మని లోకులకు బోధించుచుఁ బామరుండువోలె సక్తుండవై నీ వీతుచ్ఛ భోగము లనుభవింపుచుంటివే? ఇంతకన్న యవివేక మేమియున్నది? ఇంతకన్న చెడుకార్య మేమియున్నది? నీవు భాగవతము చదువలేదా.
సీ. రమనీయభూమి భాగములు లేకున్నవే
పడియుండుటకు దూదిపఱులేలఁ
గొనకొని వసియింప గుహలు లేకున్నవే
ప్రాసాద సౌధాది పటలమేల ?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
భోజన భాజన పుంజమేల?
వల్కలాజినకుశావళులు లేకున్నవే
కట్ట దుకూల సంఘంబులేల?
గీ. ఫలరసాదుల గురియవే పాదపములు
స్వాదుజలముల నొప్పవే సకలనదులు
పొసఁగ భిక్షలఁ బెట్టరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలువేల తాపసులకు.
మంత్రి - స్వామీ! క్షమింపుడు. ఇది సుఖప్రారబ్ధముకాదా? అనుభవింపక విడుచునా?
సన్యా - ఆహా! సుఖమును గూడఁ బ్రారబ్ధమని చెప్పుచుంటివే చాలుఁ జాలు. నీ వైదుష్యము తెల్లమైనది.
మంత్రి - స్వామీ! మీరీసుఖము నేమందురు?
సన్యా - ఏమందునా? మదాంధుండవై యవివేకివై మూర్ఖుండవై జడుండవయి దీని ననుభవింపుచుంటి వనుచున్నాను.
మంత్రి - స్వామీ! క్షమింపుఁడు. నేను దీని సుఖప్రారబ్దమని యనుభవింపుచుంటిని. కాని సక్తుండనయి కాదు.
సన్యా - ఓరీ? నీ సుఖప్రారబ్ధమును గడియలో వదలించెద నా చెప్పినట్లు చేయుదువా?
మంత్రి - సుఖముగూడ దుఃఖమువలె ననుభవింపక వదలదు స్వామీ?
సన్యా --- నేను వదలించెద. నా చెప్పినట్లు చేయుదువా?
మంత్రి - సందియమేలా? అట్లే చేయువాఁడ నవహితుండ నాజ్ఞాపింపుఁడు.
సన్యా - ఈ భోగములన్నియు నెట్లు వదలవో చూచెదంగాని హరిద్వారమునకుఁ బోవుదము. ఇప్పుడు బయలుదేరి నాతో రమ్ము.
మంత్రి - చిత్త మట్లే వచ్చెద సాయంకాలమువఱకుఁ దాళుఁడు.
అని పలికిన యా సచివోత్తముఁ డాదివసంబెల్ల వ్యవహారపత్రముల సవరించుకొని కాషాయాంబరములు ధరించి యా రాత్రి వేకువజామున నెవ్వరికిఁ జెప్పకుండ నాయిల్లు విడిచి యా సన్యాసివెంట హరిద్వారమునకుఁ బోవుచుండెను. ఇరువురు నొక మహారణ్యమార్గంబున జాముప్రొద్దెక్కువఱకు నడచిరి. సుకుమార దేహుండగు విజయదాసునకు నెండవేడిమికి మేనెల్ల జెమ్మటలు గ్రమ్మినవి. కాళ్ళు పొక్కులెక్కినవి. అడుగులు తడఁబడ నడుచుచున్న మంత్రిపుంగవు గాంచి యా సన్యాసి యోయీ! పాపము నీవు సంతతము సూర్యకిరణప్రసారమి సొరని గృహాంతరముల వసించువాఁడవు. ఈ పయనమువలన జాల డస్పితివి. ఈ మర్రిచెట్టుక్రింద గొంచెముసేపు విశ్రమింపుము. నే నీ ప్రాంతమందలి గ్రామంబునకుఁబోయి యన్నము యాచించి తెచ్చెద. మన మిద్దరము భుజింతమని పలికిన విని యతండు నీరసముచే మాటాడలేక యట్లే చేయుమని సంజ్ఞచేసి యా వటవిటపి మూలముల హస్తోవధానముగా నేల కొరిగి నిద్రించెను. సన్యాసి కొబ్బరిచిప్పఁ దీసికొని యా దాపుననున్న పల్లెకుం బోయెను.
అంతలో ఢిల్లీచక్రవర్తియొద్దఁ బనికలిగి యొక మహారాజు చతురంగపరివారముతోఁ గూడికొని యమ్మార్గంబునం బోవుచు నాఁటికి ప్రొద్దెక్కినది కావున నమ్మర్రిచెట్టుక్రిందనే బసఁజేయఁదలంచి పరిశీలింపుచు నొడ లెఱుంగక యందు డస్సి పండుకొనియున్న యమాత్యశేఖరుం గాంచి యా రాజు గురుతుపట్టి యోహోహో! ఈతండు నా మిత్రుఁడు ఢిల్లీశ్వరుని మంత్రి విజయప్రతాపరాజవేదండకంఠీరవుఁడు. ఇక్కడ నేమిటికి పడియుండెనో? కాషాయాంబరములుధరించి యున్నాడేమి? ఈతని సహాయము కోరియేకదా నేనుఁ బోవుచుంటిని ? కానిమ్ము. వీని రాకగురించి తరువాత విమర్శింపవచ్చును. ఎండతాకున మృదువగు వీని శరీరము వాడియున్నది. శైత్యోపచారములు సేయుట లెస్సయని తలంచుచు నాతని లేపకయే పైన మృదువగు పట్టు డేరా వేయించి పన్నీరు జల్లుచు వింజామరలని వీపించుచు మీఁదఁ బూవులు జల్లించుచుండెను. అయ్యుపచారములవలన నలయిక తీరి నతనికి మెలకువ వచ్చినది. లేచి చూచి వెఱఁగుపాటుతో మీ రెవ్వరని యడిగెను. ఆ నృపతియు మోడ్పుచేతులతో దేవా! నేను నేపాళదేశ ప్రభుఁడ వీరవర్మయనువాఁడ దేవదర్శనార్ధమై వచ్చుచుంటి దేవర యొంటిగా నిందేమిటికి వచ్చితిరి? కాషాయాంబరధారణమేల ఎద్దియేని వ్రతము గై కొంటిరా? అయ్యయ్యో? ఎండ కన్నెఱుఁగని మీరీచెట్టుక్రింద విజనారణ్యములోఁ బండుకొనియుండ మిక్కిలి యక్కజముగా నున్నది. మీ నిమిత్తము ప్రత్యేకము వంటచేయించితిని. స్నానముఁజేసి భుజింపుడు. తరువాత నంతయుఁ జెప్పుకొనవచ్చు నని పలికిన నతండు శిరఃకంపపూర్వకముగా నంగీకారము సూచించెను.
పదుగురు పరిచారకలువచ్చి వేడినీళ్ళచే జలకమార్చి నూత్నాంబరరాభణాదులచే నలంకరింపజేసిరి. మృష్టాన్నంబులఁచే తృప్తినొందిన పిమ్మట వాని నావట కుటీరమున సమున్నతపీఠంబునం గూర్చుండఁజేసి వింజామరలచే వీచుచు రాజోపచారములు గావింపుచుండిరి.
అంతలో నా సన్యాసి బిచ్చమెత్తి కొబ్బరిచిప్పనిండ నన్నము దెచ్చి యచ్చటికి వచ్చెను. వీథులుగాఁ దీర్చిన పటకుటీరములచేత నొప్పుచు నేనుఁగుల ఘీంకారములు, గుఱ్ఱముల హేషారవములు, కాల్బలముల కోలాహలధ్వనులు నింగిముట్ట నా ప్రదేశమొక పట్టణమువలెఁ బ్రకాశించుచుండెను. బైరాగి యానడుమ నడచుచు నయ్యో? ఈ బ్రము లింతలో నెక్కడనుండి వచ్చినవి? ఇందు మా మనుష్యు డుండవలె నేమయ్యెనని యడుగుచుండ వానిమాట నెవ్వరు వినిపించుకొనరైరి. అతండు తిరిగి తిరిగి చెట్టుగురుతుఁ జూచుకొని యా ప్రాంతమునకుఁబోయి యందు వేయఁబడిన పెద్దకుటీరము మ్రోల నిలువంబడి విజయదాసూ! విజయదాసూ! అని కేకలు పెట్టఁగా నంతకుముందు వానినిమిత్తమై వేచియుండుమని నియమించిన దూత బైరాగిం జూచి యరవకుము. ప్రభువు లిందున్నవారు. నీ వెవ్వఁడవని యడిగిన నతఁడీ చెట్టుక్రింద నా మిత్రుఁ డొకండు పండుకొని యుండవలె నతం డేమయ్యెనో యెఱుంగుదువా? అని మఱల నడిగిన నా దూత, ఎఱుంగుదును. రమ్ము. ఆ సన్యాసివి నేవేనా? నీ నిమిత్తమే నన్ను వారిందుంచిరి. అని పలుకుచు నా బైరాగిని వెంటబెట్టుకొని లోపలకుఁ దీసికొనిపోయెను. ఆ సభాపటకుటీరము కొత్తరంగులచే మెఱయుచుఁ జిత్రపటంబులచే దీపించుచు నింద్రభవనమువలె విరాజిల్లుచుండెను.
అందు సమున్నతరత్నపీఠంబున నిరుగెలంకులఁ బంకజముఖులు వింజామరలు విసరుచుండ రాజోపచారము లందుచున్న విజయదాసుం జూచి విస్మయ మందుచు విజయదాసూ? ఈ వైభవమంతయు నెక్కడనుండి వచ్చినది? వెనుక రప్పించుకొంటిరా? ఏమి అని యడిగిన నతఁడు నవ్వుచు స్వామీ! ఇదియేకదా, సుఖప్రారబ్దము విడువదని చెప్పలేదా? నేనిమియు నెఱుగ. జరిగినకథ వీరి నడిగి తెలిసికొనుడు. అని చెప్పిన విని యతండు ఆ! నీవేమియు నెఱుఁగవా? ఈ రా జెక్కడినుండి వచ్చెను. అని వితర్కించుకొనుచు నా నృపతి వలనఁ జరిగినచర్య యంతయు దెలిసికొని వ్రేలు గఱచుకొనుచు విజయదాసూ? నీ వన్నమాట సత్యము. సత్యము. నేనే ప్రమాదముఁ జెందితిని. అగునగు సుఖముగూడ ప్రారబ్ధమే. అనుభవించినం గాని తరుగదు. నీవు నాకు గురుండవయితివి. నీ వంతర్ముఖుఁడవు. నిష్కారణము నిన్ను బాధపెట్టిన నా తప్పు మన్నింపుము. నీవు బోయి రాజ్యమేలుకొనుము. నా దారి నేను బోయెద. జనకుండువోలె నపర్తుండవయి యుండుమని యుపన్యసించి తదామంత్రణంబు వడసి తనదారిం బోయెను. విజయదాసుం డా నృపాలునితో జరిగిన విషయమంతయు చెప్పి యప్పుడు డిల్లీకిఁ బోయి యథాప్రకారము రాజ్యతంత్రములు జరుపుచుండెను. కావున సుఖదుఃఖములు రెండును ప్రారబ్దములే. యనుభవింపక తరుగునవికావు. మిమ్ము సుఖము విడువదు. మమ్ము దుఃఖము విడువదు. అని యెఱింగించిన విని రాజపుత్రుం డిట్లనియె.
మహాత్మా! మా యైశ్వర్యములు మా సుఖములు మా భోగములు మీ పాదరేణువునకు సరికావు. మీరు తలంచుకొనిన మేరువును రేణువునుగాను, రేణువు మేరువుగాను జేయఁగలరు. నా యభీష్టము మీ కెఱింగించితినికదా! నా యభిలాషఁ దీర్ప మీరు సమర్థులుకాకపోరు. నేను మీ యనుగ్రహపాత్రుండఁ గావలయునుం గదా? అని వినయముతో వేడుకొనిన నత డిట్లనియె.
రాజపుత్రా! నేను కపటముగా మాట్లాడువాఁడనుకాను. నీ కోరిక యణిమాదిసిద్ధులుకలవాఁడుగాని తీర్పజాలఁడు. అట్టి యోగి కాశీపురంబున మణికార్ణికాతీర్థప్రాంతమున గంగలో జలస్థంభనఁజేసి జపముజేసికొనుచున్నాఁడని చెప్పుదురు. కాని వానిం జూచినవారులేరు. మఱియు హరిద్వారాది పుణ్యస్థలంబుల నుందురు. వారు సామాన్యులకుఁ గనంబడరు. కనంబడినను మాటాడరు. ఆజ్ఞ మూకజడోన్మత్తులవలెఁ దోచుచుందురు. నాకట్టి శక్తిలేదు. ముముక్షుండనై తీర్థాటనము సేయుచున్నవాఁడ నిప్పుడు రామేశ్వరమునుండి కాశి కరుగుచు మీ వాడుక విని యిందు వచ్చితిని. మీరు చిన్నవారలై నను బుద్ధిమంతులు. ధర్మశీలురు. మీ గుణముల నేను మెచ్చుకొంటిఁ బోయివచ్చెద ననుమతి యిండని పలికిన విని రాజపుత్రుఁ డిట్లనియె.
మహాత్మా! నా కోరిక యసాధ్యమైనదని తెలిసికొనియు నా బుద్ది మరలకున్నది. యశమో మృత్యువో నాకు దీనివలన రానున్నది. మీకు శుశ్రూషఁజేయుచు మీ వెంట వచ్చెద. నన్ను గాశీపురమునకుం దీసికొనిపొండు. ఆ మహాత్ముడుండు తావు చూపుఁడు. అందు మునింగి వాని పాదంబులం బట్టుకొందునని కోరిన నవ్వుచు నాయోగి యిట్లనియె.
రాజపుత్రా! మేము కాలినడకతో దేశములు తిరుగుదుము భిక్షాశనము వలన నాఁకలి లడంచుకొందుము. నీవు సుకుమారదేహుఁడవు. మాతో రాక నీకు సరిపడదు. పరదేశవాసము క్లేశబహుళమగుట నీ సంకల్పము త్రిప్పుకొనుము పుడమి సుకృతకార్యములు సేసి దేహాంతమున లోకాంతరవిశేషములఁ జూడవచ్చునని యుపదేశించిన నా మోహనుండు స్వామీ! నాకు నక్షత్రముల నెట్టివో కన్నులార చూడవలయునని గట్టియభిలాష పుట్టినది. నా కోరిక తీరువఱకు నా సంకల్పము మరలించుకొనను. దీన దేహపాతమైన నగుంగాక. నన్ను మీ వెంటగదీసికొనిపోవక తప్పదని పాదంబులంబడి వేడుకొనియెను. ఆతం డెట్టకేని యంగీకరించెను.
అప్పుడు సిద్ధార్దుం డా యుద్యమ మెఱింగి వయస్యా! నీ సంకల్పము సమంజసమే కాదు. తన కేమియుం దెలియదని నా యోగి చెప్పుచుండ వెనువెంటఁ బోయెద ననియెదవేల? పాదచారివై భిక్షాశనముఁ గుడుచుచు నెట్లుఁబోగలవు? ఆ సిద్ధుం జూడవలయునని యభిలాషయున్నచో నశ్వారూఢులమై మనము వేఱొకప్పుడు ప్రత్యేకము పోవుదుముగాక. ఇప్పుడీ పయనము మానుమని పలికిన విని రాజపుత్రుం డిట్లనియె.
మిత్రమా ! మహాయోగు లెప్పుడు నాత్మీయమగు సామర్థ్యమును జెప్పుకొనరు. మనబోటులతో హృదయమిచ్చి మాటాడరు. ఈతం డద్భుతప్రభావసంపన్నుఁడగుట నిక్కువము. మంచియండ దొరకినప్పుడు విడువరాదు. ఈ యోగివరుని చరణసేవ సేయుచు బోయి వీనివలననే నాకామితము బడయుదును కానిచో వీని యాశ్రయబలంబున నాసిద్ధుని యనుగ్రహము సంపాదించెను. ఇప్పుడు నా పయనమున కంతరాయము గలుగఁజేయకుము. కొలఁదికాలములో నభీష్టసిద్ధివడసి యింటికి వచ్చెద. మద్వియోగదుఃఖముఁ బొందకుండ నా తలిదండ్రులఁ గాపాడుమని బోధించినఁ గన్నీరుఁ గార్చుచు డగ్గుత్తికతో సిద్ధార్థుఁ డిట్లనియె.
వయస్యా! నీవు సన్యాసివై సన్యాసివెంట నరుగుచుండఁ జూచి చూచి యింటికడ నెట్టుందును. నీ తలిదండ్రులమాట యట్లుండనిమ్ము. నీ వియోగము నేను సహింపఁగలనా? పదపద. నేనుగూడి మీవెంట వచ్చెదని పలికిన విని రాజపుత్రుండు తమ్ముడా! నామాట వినుము. మనమిద్దర మొక్కసారియే పోయినచో గగ్గోలుపడి మనవారు దేశముల వెదకించి పట్టుకొని తీసికొనిపోవుదురు. నీ విందుండిన నాపోక కొన్నిదినములవఱకు నెవ్వరికిం దెలియదు. నీవు గొన్నిదినంబు లిందుండి మనవారి నెట్లో జోరువెట్టి పిమ్మటఁ గాశీపురంబునకు రమ్ము, అందు నీకొఱకు వేచియుండెద. శ్రీవిశ్వేశ్వరుని యాలయముమీఁద నాయునికి వ్రాసెద. వచ్చి ముందుగాఁ జూచుకొమ్మని పలికి బలవంతమున వాని నొప్పించి నాఁటి వేకువజాముననే యా యోగివెంట మోహనుండు కాశీపురంబునకుఁ బయనంబై పోయెను.
అని యెఱింగించి యవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.
189 వ మజిలీ
కపిల కథ
మోహనుం డట్లు సిద్ధవ్రతుండను యోగీశ్వరునితోఁ గాశీపురంబునకుఁ బోవుచు నొకనాఁడు మల్లెప్రోలను పల్లెఁ జెరువుగట్టున నున్న రావిచెట్టు కిందఁ బస జేయుటయు వారిని భిక్షసేయనీయక తానందలి యంగడికిఁబోయి భోజనసామగ్రి తీసికొనివచ్చి యర్పించెను. ఆ యోగి శిష్యుఁడొకఁడు వంటఁ జేయుటయు నందఱు భుజించిరి.
నాఁడు దూరము నడచి వచ్చుటచే మోహనుని కాళ్ళలోఁ బొక్కు లెక్కినవి. దానంజేసి రెండుదినంబు లందుండక తీరినదికాదు. ఆ తటాకమునకు నీళ్ళకు