కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/179వ మజిలీ
సాగరా! హా! సౌందర్యమందిరా! నిన్నింటికడ సుఖముగా నుండనీయక యాపత్సముద్రములో ముంచుటకై లేవదీసికొని వచ్చితిని. పెద్దపులుల వశ మైతివి. నిన్నెవ్వరు విడిపింపఁగలరు? నీ శౌర్యమున కసూయఁ జెంది యీ దుర్మార్గులు నిన్ను జంపక విడుతురా? అయ్యో? నేనేమి చేయుదును. ఈ వార్త వినినఁ గల్పలత ప్రాణములు భరింపగలదా? తలిదండ్రు లేమి సాహసముఁ జేయుదురో? శ్రమణి యెంత చింతించునో యన యనేకవిధంబులఁ బలవరించుచు నక్కటా? వాని కనుసన్నల మెలఁగు నాయశ్వం బీదారినిరాక యా దారిఁ బోవుట దైవసంకల్పితమని తలంచెదను కానిమ్ము. మా వసుపాలునకుఁ బెక్కండ్రు మిత్రులు ధాత్రీపతులు గలరు. వారి కందరుకుం జెప్పి యెట్లయిన వాని విడిపుంచుతెరు వరసెదంగాక. ఈ వార్తవినిన శ్యామలాపుర భర్త సహాయముఁ జేయకుండునా? అని యనేక కోపాయము లాలోచించుచు ముందుగా నీ వార్త కల్పలత కెఱింగించి తరువాతఁ దగు ప్రయత్నము సేసెద నని నిశ్చయించి యనుచరులుగూడరా మహేంద్రపురంబున కరిగినది. అని యెఱింగించి యవ్వలి మజిలీయం దిట్లు చెప్పదొడంగెను.
179 వ మజిలీ.
ఆదిత్యవర్మ కథ
మహేంద్రనగరమునుండి జయపురంబున కరుగు మార్గములో దక్షిణదేశమునుండి యుత్తరదేశమున కడ్డముగా నొకబాట పోయినది. ఆ నాలుగుతెరువులు గలిసినచోట వసుపాలునిచే నొకసత్రము గట్టింపబడి యున్నది. మార్గస్థులు వచ్చి వంటఁజేసికొని భుజించి పోవుచుందురు. అందులకుఁ దగిన సదుపాయము లన్నియు నందున్నవి.
అందొకనాఁడు ఆదిత్యవర్మయను బ్రాహ్మణుఁడు తగుపరిజనులతో వచ్చి బసచేసి వంటఁ జేసికొనుచుండెను. అంతలో వసుపాలుని దూతలు కొందఱు వచ్చి మహారాజుగారి యుద్యోగస్తులు వచ్చుచున్నారు. ఇం దెవ్వరు నుండఁగూడదు. చోటు చేయుఁడను కేకలుపెట్టిరి బాహ్మణుఁడు వంటఁజేసికొనుచున్నాఁడు. సగము వంట యైనది. భుజించిన తరువాత వెళ్ళిపోయెదమని యాదిత్యవర్మ భృత్యుడొకడు వారికి సమాధానముఁ జెప్పెను.
అట్లు పనికిరాదు. గదులు మాకు కావలయు నిప్పుడే లేచిపోయి యవ్వలగదులలో వండుకొనుమనుము. ఇది గొప్పవారు దిగుచోటు. ఇందు సామాన్యులు వసింపరాదు. తొలగుండు అని కింకరులు తొందగ చేసిరి. సార్ధవాహుడును "నాబ్రాహ్మణుఁడు గొప్పవాఁడే. మహారాష్ట్రదేశప్రభువునకు మిత్రుఁడు. పనిగతిని యుత్తరదేశమునకు రాజు నానతి నరుగుచున్నాడు. భుజించి పోయెద" మనిప్రత్యుత్తర మిచ్చుచుండెను.
ఇంతలో నొక గుఱ్ఱమెక్కి యొక వీరపురుషుఁ డచ్చటికివచ్చి సత్రమున కవకాశము దొరకలేదా? అని రాజభటుల నడుగుటయు వాండ్రు దేవా! ఇందొక బ్రాహ్మణుఁడు బసఁజేసి వంటఁ జేయుచున్నాడఁట. పొమ్మనినఁ బోవకున్నాడు. సత్రము మనదని యెఱుఁగడు. తమ సెల వైనచో లోపలఁ బ్రవేశించి యీవలకు లాగికొని వత్తుమని పలికిన విని యా వీరుఁడు తొందరపడకుఁడు. భుజించు బ్రాహ్మణు నవమాన పరుపరాదు. మఱికొన్ని గదులు లేవా? అని యడిగిన వాండ్రు దేవా? గొప్పవారు దిగు గదు లివియే. తక్కినవి బాటసారులు సామాన్యులు దిరుగుచుందురు. అని ప్రరిశుభ్రముగా నుండవని పలుకుచుండఁగనే భుజించి యాదిత్యవర్మ యీవలకు వచ్చి గుర్రముపైనున్న వీరపురుషునిఁ బరిశీలించి చూచుచు అమ్మా? మేము తెలియక యిందుఁ బ్రవేశించితిమి. నా భోజనమైనది. భృత్యు లీవలఁ గుడుతురు. ముహూర్తకాలములో గది చోటు చేయుచుంటిమి మీరు ప్రవేశింపవచ్చునని పలికిన విని యా వీరుఁడు గభాలున గుర్రము దిగి యా విప్రునకు నమస్కరింపుచు మహాత్మా? క్షమింపుఁడు. మా భటులెఱుఁగక మిమ్ము లేచిపొమ్మనిరి. అది నా యభిప్రాయము కాదు. మీ వంటి యుత్తములు నిమిత్తమే యీ సత్రములు నిర్మింపబడినవి. మేము మఱియొక గదిలో వసింతుము. మీరు సావధానముగా విశ్రమింపుఁడు. అని పలుకుచు జనాంతికముగా నన్ను మీ రమ్మా! అని సంబుద్దిఁ జేసి పిలిచితిరి. మరచి యట్లు పిలిచితిరా? అని యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె.
వేషము మార్చిన భాష మారునా? రూపము మారునా ? ఎఱుఁగనివారలకుఁ దెలియక పోవచ్చును. మాకుఁ దెలియదా? మొగముఁ జూచినతోడనే గ్రహించితి నని పలికిన నవ్వీరుఁడు ఆర్యా! మీ రెందలివారలు! ఎందుఁ బోవుచున్నారని యడుగుటయు నతం డిట్లనియె.
నేను మహారాష్ట్ర దేశప్రభువునకు మిత్రుఁడ. నాపే రాదిత్యవర్మయండ్రు. నే నాఱేనియానతి నేనుఁగులు, గుఱ్ఱములు, సింహములు లోనగు మృగంబులఁ గొనుటకై దుందుభియను పుళిందునొద్ద కరుగుచున్నవాఁడ నని చెప్పుటయు నావీరుఁ డతని చేయి పట్టుకొని చాటునకు దీసికొనిపోయి యిట్లనియె.
మహాత్మా! నిన్ను సర్వజ్ఞు డనవచ్చును. నీ మొగంబున నద్భుత తేజం బొలుకుచున్నది. ని న్నాత్మబంధువుగాఁ దలంచి నా వృత్తాంత మెఱింగించెద నాలింపుము. నేను మహేంద్రనగరాధీశ్వరుండగు వసుపాలుని కూఁతురు కల్పలత యను దాని సఖురాలను. నాపేరు అశోకవతి యండ్రు. మాఱేనిపట్టి పంపున నేనా పుళిందు నొద్ద కరిగి రాజవాహనుండను వానికుమారుని అసమానరూపరేఖావిలాసు నింటికడ సుఖంబుగా నుండనీయగ మాటల నేర్చిన పక్షి నిత్తునని చెప్పి యిల్లు వెడలించితిని. వాఁడు తెలియక జయపురమార్గంబునఁబడి యా వీటిరాజమార్గంబున గుఱ్ఱమెక్కి యరుగుచుండ దుర్మార్గులైన యా రాజులు వానిం బందీగృహంబునఁ బెట్టించిరఁట. ఇఁక మీయొద్ద నిజము దాచనేల . మా రాజపుత్రిక వాని చిత్రఫలకమును చూచి వరించినది.
ఈ యుపద్రవము విని నిద్రాహారములు లేక పరితపించుచున్నది. నన్నందుఁ బోయి యా పుళిందకుమారుని స్థితిగతు లెట్లున్నవియో విమర్శించి రమ్మన్నది అందులకై పురుషవేషము వైచికొని నేనందుఁ బోవుచున్నాను. మీరు మహాపండితులు గనుక తెలిసికొంటిరి. మీరా పుళిందుని కడకరుచుగచున్నారు. కావున నీ వార్త వానికిఁ దెలియజేయుఁడు. ఇదివర కొకవర్తమానము పంపియుంటిమి. అని తన వృత్తాంతమంతయు నెఱింగించిన విని యా యాదిత్యవర్మ తలయూచుచు నిట్లనియె.
ఆశోకవతీ! నేనా జయపురములోఁ గొన్ని నాళ్ళుంటి. మధువర్మ మందపాలుర నెఱుంగదు. వారు కడుక్రూరులు నీ వందుఁబోయి యేమి జేయఁగలవు? ఒంటరిగాఁ బోయితివేని నిన్నుఁగూడఁ బట్టికొందురు మీరాజుతోఁ జెప్పి తగుప్రయత్నముతోఁ బోవవలయునని చెప్పిన నప్పడతి స్వామీ! మీరానగరమున నేమిటికి వసించితిరి? ఆ రాజుల నెట్లెఱుఁగుదురు? మీ వృత్తాంతముఁ జెప్పి నా కానందముఁ గలుగఁ జేయుఁడని వేడిన నా బ్రాహ్మణుం డిట్లనియె.
తరుణీ! నాకథ నడుగుచుంటివి గనుక జెప్పెద వినుము. ఉజ్జయినీపురంబున భాస్కరవర్మయను బాహ్మణుఁడు గలఁడు. అతనికిఁ జిన్నతనమునందే తలిదండ్రులు గతించిరి. మేనమామగారియింట పెరుగుచుండెను. అతండు క్రమంబున వేదవేదాంగములఁ జదివి మహావిద్వాంసుఁడని ప్రఖ్యాతి వడసెను. ఆ పండితునికి దైవికముగా నొక పరివ్రాజికునితో సహవాసము గలిగినది. ఆ సన్యాసి నిత్యము శ్మసానభూమిలో వసించి యక్షిణీసిద్ధికై జపముఁ జేసికొనుచుండును. భాస్కరవర్మయుఁ దరుచు వానియొద్దకుఁ బోవుచుండును. ఒకనాఁడు అతనిం జూచి మిత్రమా! నీ వీవల్లకాట వసించి సంతతము జపింతువు. ఇందులకు ఫలమేమి? దేనిగుఱించి యీ శ్రమ పడుచుంటివని యడిగిన నతం డిట్లనియె.
విద్వాంసుఁడా! నేనొక యక్షిణీదేవత నారాధించుచుంటిని. అందుల కీ భూమి కడుపవిత్రమైనది. ఆ మంత్రము సిద్ధించెనేని జన్మసాద్గుణ్యము నొందఁగలదు. యక్షిణి ప్రత్యక్షమై యభీష్టకామంబుల దీర్పగలదని యాకల్పవిధానమంతయు నెఱింగించెను. అప్పుడు భాస్కరవర్మ వయస్యా! ఆ మంత్రము నాకుఁగూడ నుపదేశముఁ గావింపుము. నేనుగూడ జపించెదనని యడిగిన నతండు నా మంత్రసిద్ది చూచిన పిమ్మట నీ కుపదేశించెదఁ బదిదినములలో యక్షిణి ప్రత్యక్షముకాక తప్పదని చెప్పుటయు భాస్కరవర్మ యాసిద్ధి ప్రకార మరయుచు వాని నాశ్రయించుచుండెను.
మఱికొన్నిదినములకు నొకదేవకన్యక దివ్యస్త్రీసహస్రపరివృతయై విమాన మెక్కివచ్చి యాపరివ్రాజకు నెదుర నిలువఁబడి మధురగంభీరస్వరముతో నోపరివ్రాజక! నేను యక్షకన్యకను. వీరందరు నా సఖురాండ్రు. నీ తపంబునకుఁ గట్టుబడి వచ్చితిమి. వీరిలో నీకుఁ గావలసిన కన్యక నేరికొనుము. నీకు వశవర్తినియై భార్యగానుండి నిత్యము నైదుమాడల దీసికొనివచ్చి నీకిచ్చుచుండునని చెప్పిన విని యా పరివ్రాజకుఁడు సంతసించుచు వారిలోఁ దనకు నచ్చిన మచ్చెకంటి నొకదాని నేరికొని భార్యగాఁ జేసికొనియెను. ఆకాంత నిత్యము రాత్రుల నేకాంతముగా వచ్చి యైదు మాడలు వాని కిచ్చి యభీష్ట కామంబుల వానిఁ దృప్తిపరచి యేగుచుండెను.
భాస్కరవర్మ పరివ్రాజకుని మంత్రసిద్ధిఁ దెలిసికొని మిక్కిలి యుత్సుకముతోఁ దన కామంత్ర ముపదేశింపుమని యా సన్యాసిం బ్రార్థించెను. అతఁ డొకశుభదివసంబున యధావిధి ప్రయోగముగా నా మంత్రము భాస్కరవర్మ కుపదేశము గావించెను.
భాస్కరవర్మ పరివ్రాజకుని మంత్రసిద్దిఁ దెలిసికొని మిక్కిలిశ్రద్ధతో నా మంత్రము జపించుచుండెను. అచిరకాలములో నా యక్షిణి భాస్కరవర్మకు సహస్రయక్షకన్యాపరివృతయై ప్రత్యక్షమై నీ యభీష్టముఁ దెలుపు మనవుఁడు నీవే నాకు భార్యగా నుండుమని కోరికొనియెను. ఆ జవ్వని నవ్వుచు నిదివఱ కెవ్వరు నన్నుఁ గోఱలేదు. నేను సులభసాధ్యను గాను. ఆరునెలలు నీవు బ్రహ్మచర్యవ్రతం బొనరింపవలయును. అందుఁ గృతార్థుఁడవు కాకపోవుదువేని నీవు సర్వభ్రష్టుండ వగుదువు. కృతకృత్యుఁడ వైతివేని నీకు భార్యఁ గాగలను. ఇంతయేల వచ్చె? వీరిలో నీయిచ్చవచ్చిన చిగురాఁకుబోఁడిఁ గోరుకొనుము. సుఖింతువుగాక యని పలికిన నతండు నే నితరులఁ గోర నీవే భార్యగావలయు. నన్ను నీ యిష్టమువచ్చిన నియమంబులఁ బరీక్షింపుము. కృతార్థుండ నైనప్పుడే యంగీకరింపుమని పలికిన విని యాకలికి సంతసించుచు నాతని నప్పుడే యలకాపురంబునకుఁ దీసికొని పోయినది.
యక్షస్త్రీసహస్రమధ్యంబున విడిచి యారుమాసములు పరీక్షించినది. అతనిబుద్ధి యించుకయు జలింపలేదు. అసిధారావ్రతముగా నతం డాస్త్రీమండలమధ్యంబున సంచరించెను. తన్నియమమునకు మెప్పుఁ జెంది యాయక్షిణీకాంత యతనిం బెండ్లి యాడినది. భాస్కరవర్మ యలకాపురమున యక్షకాంతతో నభీష్టసుఖంబు లనుభవింపుచుండెను.
ఆ దంపతులకు నేను బుత్రుండనై యుదయించితిని. నే నాయలకాపుర మందే మణిధరుండను యక్షునివలన సమస్తవిద్యలు నేర్చుకొంటిని. ఎట్టివారికిని పురాకృతము లనుభవింపక తీరవుగదా? ఒకనాఁడు మహేంద్రుఁ డేదోయుత్సవమున యలకాపురంబునకు వచ్చుటయుఁ గుబేరుఁ డతనికి గొప్ప విందుఁ గావించెను. అం దొకగానసభయందుఁ జూచియో, చూడకయో దేవేంద్రుఁడు వచ్చినప్పుడు మా తండ్రిగారు లేవలేదఁట.
దేవేంద్రునికిఁ జాలకోపము వచ్చినది. కుబేరునిం జీరి వీఁడెవ్వఁడు? దేవతావిపరీతాకారము గలిగియున్నవాఁడు. అని యడిగిన నతండు దేవా! ఈతం డొక బ్రాహ్మణుఁడు. భూలోకవాసి. యక్షిణీమంత్రసిద్ది వడసి యిందు వచ్చి యున్నవాఁడని చెప్పినవిని యతండు చాలు చాలు. వీఁడు దురభిమానపరిభూతుడువలెఁ గనంబడుచున్నవాఁడు. వీఁడు దేవతాలోకనివాసమునకుఁ దగఁడు. వేగమ భూలోకమునకు బంపివేయుమని యాజ్ఞాపించెను.
ఆవార్త మాతల్లి విని యడలుచుఁ బోయి పురుహూతు నడుగుదమ్ముల వ్రాలి మహేంద్ర! రక్షింపుము. ఆ బ్రాహ్మణుఁడు నాభర్త. తపస్సిద్ధివలన నన్నుఁ బడసెను. మిమ్ముఁ జూడక లేవలేదు. గర్వాభివిష్టుఁడు కాఁడు. అతనితోఁ గూడ నేను భూలోకమునకుఁ బోవలయునుగదా? అందలి దుఃఖములు నే ననుభవింపఁజాలను. అనుగ్రహించి శాపప్రతీకారము గావింపుమని వేడుకొనియెను.
ఇంద్రుం డాచంద్రముఖి కుబేరునకు దగ్గిరచుట్టమని తెలిసికొని అయ్యా? కార్యము మిగిలినది. తెలియక శపించితిని నాశాప మమోఘము. మిముఁబోటులకు భూలోకవాసము క్లేశకరము. కర్తవ్యమేమని యాలోచించుచు నీశాప మతఁడు గాక మరియొకం డెవ్వఁడైన ననుభవించిన వాని నంటదు. అట్టివానిం జూడుమని యుపాయము జెప్పెను. అప్పుడు మాతల్లి నన్నుఁ జీరి మీతండ్రిశాపము నీవు భరింపుము. తొల్లి యయాతివార్థక్యము వహించిన పూరుండువలె నీవును విఖ్యాతి బొందఁగలవని పలికిన నేను మహాప్రసాదమని యంగీకరించితిని.
అప్పుడు కుబేరుని దూతలు నన్ను భూలోకమునకుఁ దీసికొనివచ్చి విడిచిపోయిరి. నేను భూసంచారముఁ జేయుచు జయపురంబునకుఁ బోయి తదధిపతియగు విజయపాలుఁడను నృపాలు నాశ్రయించి యతనికొలువు చేయుచుంటిని. ఆ రాజు చాల యుత్తముడు. ఈ మధువర్మవలన నతనికి తటస్థించిన ప్రాణహాను లైదుసారులు తప్పించితిని. అతండు నన్ను సుమతియని పిలుచుచుండువాఁడు.
అతనిభార్య తేజస్వి యనునది పుష్పచాపదాపంబునం జేసి నాయందు లేనిపోని యపరాథము లాపాదించి భర్తకు నాయం దెక్కుడుకోపము గలుగఁజేసినది. అతం డామెమాట సత్యమని నమ్మి నన్నుఁ బట్టించి బందీగృహంబునఁ బెట్టించుటకుఁ బ్రయత్నించెను. నే నెట్లో తప్పించుకొని పారిపోయితిని.
ఒకనాఁ డొకయగ్రహారమున నొకబ్రాహ్మణుని యింటి కతిథిగాఁ బోయితిని. అతండు నాలుగువేదములు, ఆరుశాస్త్రములు విద్యార్థులకుఁ బాఠముఁ జెప్పుచుండెను. భోజనానంతరమున నేను వారివిద్యార్థులకుఁ దప్పులు దిద్దితిని. ఆ బ్రాహ్మణుఁడు నీ వేమి చదివితివని యడిగిన నన్నివిద్యలుం జదివితినని చెప్పితిని. వెఱగుఁ పడుచు నీ ప్రాయము కడుచిన్నది. ఇంతలో నిన్నివిద్య లెట్లు గ్రహించితివని యబ్బురపాటుతో నడుగుటయు నేను వృత్తాంతమంతయు నెఱింగించితిని ధన్యుండ నైతినని సంతసించుచు దివ్యరూపసంపన్న యగు తన కూఁతుర నాకిచ్చి వివాహముఁ గావించెను.
విజయపాలుండు వెదకించి నన్నుఁ బట్టుకొనునను భయముతోఁ గొంతకాల మాయగ్రహారమునఁ బ్రచ్ఛన్నముగా వసించితిని. పాపము నేను లేవగొట్టఁబడితినని తెలిసికొని యా విజయపాలుం డసహాయుండని యెఱిగి మధువర్మ మందపాలుని సహాయముగా జేసికొని దండు వెడలి జయపురము ముట్టడించి యా రాజదంపతులం బరిమార్చి యానగరము స్వాధీనముఁ జేసికొని యిరువురు నా దేశమును బాలించుచుండిరి.
నేనావార్త మఱికొంతకాలమునకుఁ దెలిసికొంటిని. విధికృత మసాధ్యము గదా? తరువాత నేను భార్యతోఁ గూడ మహారాష్ట్రదేశంబునకుఁ బోయి తద్దేశాధిపతి నాశ్రయించితిని. అతండు నన్ను మిత్రునిగా భావింపుచుండెను. తదాదేశముననే మృగంబులం దెచ్చుటకుఁ బుళిందు నొద్ద కరుగుచుంటినని తనవృత్తాంత మంతయు నెఱింగించెను.
అశోకవతి యా కథవిని విస్మయసాగరంబున మునుంగుచు నోహో? మిమ్ము సామాన్యు లనుకొంటిని. మీ ప్రభావ మమానుషము. మీ జితేంద్రియత్వము స్తోత్రపాత్రమైయున్నది. కృతఘ్నుండై విజయపాలుండు భార్య చెప్పినమాట విని మిమ్ము లేవఁగొట్టి తానే చెడిపోయెను. స్త్రీలమాయలకు వశము కాని పురుషులుండుట యరుదు. అది విజయపాలుని రాజ్యమా? పాపము. వృధగా నన్యాక్రాంతమైపోయినది. కానిండు, ఆ చింత మాకేల? మీ చరిత్రము విన మీరు మహాబలశాలులనియుఁ బరోపకారపారిణులనియుఁ దెల్లమగుచున్నది. మా రాజవాహనుని విడిపించు నుపాయము మీరే చేయవలయును. మీ పాదంబులకు మ్రొక్కుచున్న దాననని వేడికొనియెను.
ఆప్పు డతం డాలోచించి సుందరీ! తొందరపడవలదు. ముందుగానే నా పుళిందునొద్దకుఁ బోయి మృగంబులం గొని మహారాష్ట్ర దేశంబు బంపెదను. మారాజువద్ద వ్రాసి కొంత సైన్యమును దెప్పించెద ననివార్యముగా శత్రురాజులఁ బరిభవించి రాజవాహనుని విడిపించి యతనినే యారాజ్యమునకు బట్టభద్రునిగాఁ జేసెదఁ జూడుము. శపథముఁ జేసెను.
ఆ మాటలు విని యాపాటలగంధి బ్రహ్మానందముఁ జెందుచు స్వామీ! మీవాక్యము వేదవాక్యము. మీప్రతిజ్ఞ శ్రీరామప్రతిజ్ఞ మీరు సంకల్పసిద్ధులు. నేను గూడ నిప్పుడు మీవెంట వచ్చెద. నా పుళిందుని కీవార్తఁ జెప్పెద. అతనికడ యుద్ధనైపుణ్యము గల శబరసైన్యము లనేకము గలవు. వానితో నతండు మీకు సహాయము జేయగలఁడు. మఱియు శ్యామలాపురభర్త నీరాజవాహనుఁడు జేయఁదలచికొన్నాఁడు. కోరిన సేనల నీయగలఁడు. ఈ సేనల కన్నిటికి నాయకుండవై నీవు శత్రులఁ బరి మార్పఁగలవని పలుకుచు నతనిఁ బెక్కుస్తోత్రములు చేసినది. దాని రాక కతం డంగీకరించెను. ఇరువురుం గలిసి పుళిందపురమున కరిగిరి.
అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. తరువాయి కథ పైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.
180 వ మజిలీ
శ్రమణి కథ
ఆహా! దైవము జనుల నప్రయత్నమున నాపత్పరంపరలపాలు జేయుచుండును. శకుంతలోభంబునం జేసి తలిదండ్రులకుఁ దెలియకుండ మాయన్నను అశోకవతి వెనుక మహేంద్రపురంబున కనిపితిని. దారిలో జయపురంబున మధువర్మచే వాఁడు చెరసాలం బెట్టఁబడెనని యశోకవతి వార్త నంపినది. ఇప్పుడు నేనేమి చేయుదును? మాతండ్రి మృగములనిమిత్తము దూరారణ్యములకుఁ బోయెను ఈవార్త మాతల్లి కెఱింగించితినా నిత్యము వానికొఱకుఁ బరితపించుచుండుటం బట్టి డెందము పగిలి మృతినొందఁగలదు. వాఁడు నేఁడు వచ్చునో రేపు వచ్చునో యని గడియలు లెక్క పెట్టుకొనుచుండఁ బిడుగువంటి యీవార్త వచ్చినది. వాఁ డేమి యపరాధము జేసెనో, మధువర్మ యెందులకు జెఱసాలఁ బెట్టించెనో తెలియలేదు. మాతండ్రి యెప్పుడు వచ్చునో తెలియదు. అంతదనుక జాగు చేయుటకు నాడెందము తాళకున్నది. నేను స్త్రీచాపల్యంబున వాని సుఖముగా నింటికడఁ నుండనీయక యాపత్సముద్రములోఁ ద్రోచివైచితిని. అక్కటా! నామాట మిక్కిలి గారాముగా మన్నించు నాయనుఁగు సోదరుఁ డెట్టి చిక్కులం బడుచున్నాఁడోగదా? అని కంటఁ దడి వెట్టుచు నంతలో సీ! ఈ యమంగళకార్యమేల చేయవలయును? ఇది పౌరుషహీనుల విధానము. మహావీరపురుషవేషము ధరించి నే నానగరముఁ బోయి శత్రువుల నెట్లో వంచించి వాని విడిపించి తీసికొని వచ్చెదనని నిశ్చయించి పురుషవేషము వైచికొని యెవ్వరికిం దెలియకుండ నశ్వారూఢయై వేకువజామున బయలుదేరి యంతకుమున్ను బరులవలన దక్షణదేశమార్గము లన్నియు వినియున్నది కావున నొకదారిం బోవుచుండెను.
ఆ పుళిందపుత్రిక త్రిభువనాశ్చర్యకరసౌందర్యవిరాజమాన తెల్లతామరలఁ బోలు సోగకన్నులతోఁ దళ్కులీను చెక్కులతో నక్కలికిమొగంబు పురుషవేషమున మఱియు ముద్దును మూటగట్టుచుండెను. దానింజూచి జయంతుఁడో, కంతుడో, వసంతుఁడో యని జను లద్బుతపడక మానరు.
ఆ చిన్నది దేశవిశేషములు వినుటయేకాని చూచి యెఱుంగదు. క్రమంబున నడవి దాటి తెరపిదేశములనడుమ జనుచుఁ గనంబడినవారి నాయాదేశ గ్రామ