కాశీమజిలీకథలు/ఏడవ భాగము/141వ మజిలీ

ఆవైశ్యుఁడు వానియెడఁ గృతజ్ఞతజూపుచు వారిస్థితినిగుఱించి పరితపించుచుఁ దన యింట దావిచ్చి రహస్యము బయలుపడనీయక కాపాడుచుండెను.

చంద్రగుప్తుఁడు తన కత్యంత ప్రియమిత్రుఁడైన వజ్రదత్తుని కొకజాబు వ్రాసి యావైశ్యునిమూలముగ నతనియొద్ద కనిపెను. విశోకునిచే జయింపఁబడి మేము ప్రచ్చ న్నముగా నీనగరమున వసియించియున్నవారము. మాకుఁ గొన్ని సాధనములును సేనలుం బంపితివేని వీనిం బరిమార్చి రాజ్యము మేము గైకొందుము. దీనదశజెంది యున్న మాకీపాటియుపకారము జేయవలయునని యాజాబునందున్నది.

ఈలోపల వికటదంతుఁడు విశోకునొద్ధకుఁ బోయి చంద్రగుప్తుఁడు భార్యా పుత్రులతో వచ్చి ప్రచ్చన్నముగా నీయూరఁ బ్రవేశించి యున్నవాఁడు. నన్నుఁ దావీ యమని యడిగిన నిచ్చితినికాను. ఎంత ప్రచ్చన్నముగా వసియించి యున్నవాఁడు. నీయంతరములు వెదకుచుండును. మీకు హితుండగాన నింతజెప్పితినని యెఱింగించిన నతఁడు జడియుచు, వానిజాడ దెలిసి కొనుటకుఁ బెక్కండ్రరాజపురుషుల గూఢచారుల నియోగించెను.

ఒకగూఢచారుఁ డెట్లో జాడలమీఁద వైశ్యగృహ సంస్థితులగు వారియుదంతము తెలిసికొని విశోకునికిఁ దెలియజేసెను అతండు దండనాధపురస్సరముగాఁ బెక్కండ్ర దూతలనంపి హఠాత్తుగా వారినందరం బట్టుకొని నిగళములు దగిలించి కారాగారంబునఁ బడవేయించెను.

అని యెఱింగించి...

141 వ మజిలీ.

సూర్యవర్మకథ

ఆహా! దైవము ధర్మమునందు వసియింపఁడా? దైవమే వచ్చి మనకుఁ దోడ్పడి మనశత్రువగు సూర్యవర్మం గడతేర్చెను. అని దేవవర్మ యల్లునితోఁ గూతురితో ముచ్చటించుటయు యమున యమ్మహాభూతస్వరూపుండైన పరమేశ్వరుండు చక్ర వర్తిస్థానంబున మఱి యెవ్వరినో నిలిపెనని చెప్పుకొనుచున్నవారు మీకేమైన వర్త మానము దెలిసినదా? వార్తవచ్చినదా అని అడిగిన నది కింవదంతియేకాని నిజమైన వార్త దెలియదని అల్పుఁడు జెప్పెను.

ఆమాటలోనే యొకదూతవచ్చి వాకిట నిలిచి చక్రవర్తిసందేశ పత్రిక లోపలి కనిపెను. అదివిప్పి చదువ నిట్లున్నది.

దేవయజనాగ్రహార కాపురస్థుఁడగు నగ్నివర్మకూఁతురు సురస అల్పునిపై దెచ్చిన అభియోగములో నీవతనియందుఁగల పక్షపాతంబున వానిని శిక్షింపక విడిచి యల్లునిఁ జేసికొంటివనియు నందులకై అతండు సూర్యవర్మయొద్ద మరలఁ దగవు చేయక నీయల్లుని నపరాధివోలె సంకెళులు దగిలించి పంపమని మీకు నాజ్ఞాపత్రికలు వ్రాయగా దిరస్కరించినందులకుగాను పెద్దయుద్ధము జరిగినదిగదా? అందు సూర్య వర్మ నిహతుం డయ్యెను. వారిస్థానమందు నేను రాజుగావచ్చి పీఠ మెక్కితిని. ఇప్పుడా బ్రాహ్మణుడు వచ్చి అయ్యభియోగము నన్ను విమర్శింపమని కోరుచున్నాడు. ఇందులగుఱించి మీకు యదార్దము తెలిసినట్లు మీరువ్రాసిన పత్రికలలో నున్నది ఇప్పుడు మఱియొకసభ జేయుచుంటిని. ఆసభకు సామంతరాజునెల్ల రప్పించు చున్నాను. అందు రాజులలో రాజులకుఁగలిగిన తగవులను విమర్శించి యందఱి యభి ప్రాయములం గైకొని న్యాయమెట్లో యట్లు కావించువాఁడ ఇందులకుఁ మనలోమనకు విరోధ మవసరములేదు. కావున నాసభకు మీరును, మీయల్లుఁడును దయచేయవల యును స్త్రీసహితముగా రావచ్చును. అందరుకును దగినబస లేర్పరుపఁబడి యున్నవి. మీమీ బిరుదములతో, వాహనంబులతో రావచ్చును.

అనియున్నపత్రిక జదివికొని, యాహా? క్రొత్తచక్రవర్తి యెంత మంచివాఁడు. ఎంతన్యాయవేత్త. ఎట్టి వినయశీలుఁడు. అని పొగడుచు దేవవర్మ యమునతో నీవు గూడ నాసభకురమ్ము ఆమహాసభలో సురసయొక్క యౌచిత్యము దెలియజేయుదము అనుటయు నామె యంగీకరించినది యల్పుఁడును సమ్మోదించి సభనాఁటికి బాట లీపురంబున కఱిగి యందుఁ దమకై యేర్పరచిన నెలవున వసియించెను.

మఱియు నతని యధికారముక్రింద సామంతరాజులెల్లఁ దమతమ సేనలతో వాహనములతో మంత్రులతో వచ్చి నగర మలంకరించిరి. వజ్రదత్తుఁడు విశోకునిచేఁ జంద్రగుప్తాదులు క్రమముగా బద్ధులై చెరసాలం బెట్టఁబడిరని వైశ్యునిచే విని యాయ న్యాయ మాసభలో విమర్శింపుఁడని‌ చక్రవర్తికిఁ బత్రికాముఖంబునం దెలియఁజేసెను. దానంజేసి చక్రవర్తి చంద్రగుప్తాదులతో నాసభకురమ్మని విశోకుని కాజ్ఞాపత్రిక బంపియున్నకతంబున నావిశోకుఁడు చింతావ్యాకులచిత్తుడై వారితోఁగూడ నాసభనాఁటి కావీటికి జనుదెంచెను.

మఱియుఁ గొందరురాజులు తమలోఁ దమకుగల తగవులన్నియు నాసభలో విమర్శింపఁబడునని సంతసించుచుఁ దగిన సన్నాహములతో నానగరమున కరు దెంచిరి.

నిరూపిత దివస౦బున సమున్నతవిశాలంబగు సభాభవనంబునఁ జక్రవర్తి పీఠములకుముంగల రెండుశ్రేణులుగా వేయఁబడిన పీఠములపై సామంతరాజులు తమ తమ యధికారము ననుసరించి తారతమ్యముగాఁ గూర్చుండిరి ఆపీఠమునకు వెనుకటి పీఠములఫై వారికుమాళ్ళు, బంధువులు, మిత్రులు గూర్చుండిరి. మఱియుఁ బండితులు హితులు పురోహితులు లోనగువారు సభ నలంకరించిరి. చక్రవర్తియు భార్యయు వచ్చి పీఠ మెక్కినతోడనే సామంతులెల్ల లేచి కరతాళములు వాయించుచు జయజయ ధ్వానములు గావించిరి. చక్రవర్తి వారినెల్లగూర్చుండనియోగించి తాను సింహాసన మలంకరించెను.

అప్పుడు ప్రధాని చక్రవర్తియెదుట దాపుననున్న పీఠ ప్రాంతమందు నిలువం బడి సామంతరాజుల పేరులు జదువుచుండ వచ్చినవారెల్ల జేతు లెత్తుచుండిరి. చంద్ర గుప్తుఁడు అని చదువువరకుఁ బ్రతివచనము వినంబడమిఁ జక్రవర్తి శంకించుచు, నాచంద్రగుప్తుఁ డేమిటికి సభకు రాలేదు? అతనిపీఠము శూన్యమై యన్నదేమి? అని యడిగెను. అప్పుడు విశోకునికి గాళ్ళు గజగజ వడకుచున్నవి.

వజ్రదత్తుఁడు లేచి మహారాజా ! ఆరాజు నాకు మిత్రుఁడు విశోకుఁడనురాజు చంద్రగుప్తు నన్యాయముగాఁ రాజ్యమపహరించి చెరసాలం బెట్టెనని యిదివరకే దేవ రకు విజ్ఞాపనపత్రిక బంపికొని యుంటిని. ఈమహాసభలో నావిషయము విమర్శింతు నని సెలవిచ్చితిరి. ఆ రాజు బద్ధుడై యిచ్చటికిఁ దీసికొనిరాఁబడెను. ఆ తగవే ముందు విమర్శింపవలయు. మహాప్రభూ! అని చెప్పికొనఁగా. జక్రవర్తి కన్ను లెఱ్ఱజేసి, విశోకుఁ డెందున్న వాఁడు? అని కేక పె పెట్టించెను.

విశోకుఁడు పీఠమువిడిచి నిలువంబడి, నేను మహారాజా! అని ప్రతివచన మిచ్చెను. చక్రవర్తి యతని బీఠముదాపునకురమ్మని నీవేమిటికిఁ జంద్రగుప్తునిఁ జెర సాలం బెట్టించితివని అడిగెను. రాజధర్మమున నతని నోడించి రాజ్యము గైకొంటి శత్రువు బ్రబలుడని చెరసాలం బెట్టించితినని యుత్తరము జెప్పెను.

అప్పుడు చక్రవర్తి సోపహాసముగా విశోకా! ఇప్పుడు నేను నీకంటె నధి కుండనై యుంటిని నిన్నుఁ జెరసాలం బెట్టించి నీరాజ్యంబు లాగికొనిన నీరాజు లందరు‌ సమ్మతింతురేమో యడుగుము అది రాజ థర్మమేమో తెలిసికొనుము. అనుటయు నామాటవిని అందున్నరాజులెల్ల నతఁడు అన్యాయముజేసెనేని కేకలు పెట్టిరి.

అప్పుడు విశోకుఁడు మోమున విన్నదనంబుదోపఁ జేతులునలుపుచుఁ చిత్తము. చిత్తము. తప్పుజేసితి రక్షింపుమని వేడికొనియెను. చక్రవర్తి, నీతప్పు పిమ్మట విమర్శింతుము నీవుపోయి యాచంద్రగుప్తుని సపరివారముగా విముక్తుంజేసి యిచ్చటికిఁ దీసికొనిరమ్ము. పొమ్ము. అతఁడు వచ్చుదనుక నేమియు విమర్శింప వలనుకాదు. అని పలికినతోడనే విశోకుఁడు పరుగున బోయి యానృపతి జామాతృ సుత సహితముగా నిగళములు విప్పించి పాదంబులంబడి వేడికొనుచు నాసభకుఁ దీసికొనివచ్చెను.

చంద్రగుప్తుఁడు చక్రవర్తికి నమస్కరించుచుఁ దన పీఠము మ్రోల నిలువఁ బడి మహారాజా! నాసుతుఁడు కుశుఁడును, అల్లుఁడు సుకుమారుఁడు సైన్యములతో వెనుకటి చక్రవర్తికి సంగరమున సహాయమువోయి అందు బ్రహ్మరాక్షసునిచే జ౦పఁబడినవార్త దెలిసి కొని యీక్రూరుఁడు విశోకుఁడు నన్నసహాయనిగాఁ నెంచి దుఃఖ సముద్రములో మునిఁగియున్న సమయంబున నాపట్టణము ముట్టడించి నన్నడ వులపాలు గావించెను. దైవ వశంబున నాకుమారుఁడును నల్లుఁడును బ్రతికి అడవిలో మాకెదురుపడిరి. మేము తిరుగ మానగరము జేరుకొని యొకవైశ్యునియింటిలో నుండగా వికటదంతుని మూలమునఁ దెలిసికొని చెరసాలం బెట్టించి చిక్కులఁ బెట్టుచున్నాఁడు అని తమ వృత్తాంతమంతయు నారాజులెల్ల వినఁ జక్రవర్తికిఁ దెలియ జేసెను.

అప్పుఁడు చక్రవర్తి చంద్రగుప్తుని దాపునకు రప్పించుకొని రాజా! నీకు బిల్ల లెందరు?

చంద్రగుప్తుడు - ఇద్దరు మగవాండ్రు, యిద్దరు ఆడువాండ్రు.

చక్రవర్తి - వారి పేరులేమి?

చంద్ర - లవుఁడు, కుశుఁడుమగవారు. రతి విరతులాడువాండ్రు.

చక్ర. - వారందరికి వివాహము గావించితివా?

చంద్ర - చేసితిని.

చక్ర - నీయల్లుం డెవ్వరు?

చంద్ర - పెద్దవాఁడీసుకుమారుఁడు రెండవకూఁతురు, నల్లుఁడు మాయొద్ద లేరు. దేశాంతర మరిగిరి.

చక్ర - అల్లుఁడే రాజకుమారుఁడు.

చంద్ర - రాజపుత్రుఁడు కాడు. సామాన్యుఁడే.

చక్ర - సామాన్యుఁడనఁగా సామంతుఁడా యేమి?

చంద్ర - కాడు ఒక జంగమదేవర.

చక్ర - శివశివా! అదియేమి యన్యాయము. ఆ జంగమదేవరకిచ్చితివేమి?

చంద్ర - అందులకొక కారణమున్నది దేవా! (అని యావృత్తాంతమంతయు నెఱింగి౦చెను.)

రాజులందరు విస్మయమునజెందిరి. పెద్దకుమారుఁడు విరక్తిజెంది దేశముల పాలై పోయెనని చెప్పెను. చక్రవర్తి, సరే నీ చరిత్రము పిమ్మటే విమర్శింతుము. నీపీఠముపైఁ గూర్చుండుము. అని నియమించెను. అల్లుఁడును. కొడుకును ఆపీఠమును జేరియున్న పీఠములపైఁ గూర్చుండిరి, రతియు, ధర్మరతియుఁ జక్రవర్తి యానతి వడువున నాసభలోనే యొకమూల స్త్రీలకు నిరూపింపఁబడినగదిలో వచ్చి కూర్చుండిరి.

అప్పుడు చక్రవర్తి అగ్నివర్మను, సురసను, దేవవర్మను, అల్లుని బిలిపించి పీఠముదాపునకు రప్పించుకొని వారువారుజెప్పిన సాక్ష్యములును మాటలు‌ను వ్రాసి కొని వెనుక వ్రాసినవానితో సంప్రతించి పరస్పరభేదముల నిరూపించుచు సామంతరాజుల నుద్దేశించి యిట్లనియె. ఓమహామతులారా! మీరందరు వీరిచెప్పిన మాట లన్నియును వింటిరిగదా! గ్రామాధికారియు మండలాధిపతియు దేవవర్మయు నీయల్పుని నిరపరాధిగా నెంచిరి. సురసయందే తప్పున్నదని నిశ్చయించిరి. అందు లకుఁ దగిన సాక్ష్యమేమియుఁ గనంబడదు. దేవవర్మకూఁతురు యమున తండ్రికి గుప్తముగానల్పుని సురస ప్రార్థించిన విషయము జూపినట్లుగాఁ జెప్పుచున్నారు. ఇది యొక్కటియే సురస యపరాధనియని తెలియఁజేయు చున్నది అగ్నివర్మ యల్పునివరించి యమున యిట్టి కల్పనజేయుచున్నదని చెప్పుచున్నాడు. కావున నిందలి నిజానిజంబుల మీరే విమర్శించి మీకుఁదోచిన సంగతులు రేపు చెప్ప వలయునని యానతిచ్చి చక్రవర్తి యంతటితో సభచాలించెను.

అందరును లేచి తమతమ నెలవులకుం బోయి యావిషయమే విమర్శించుచు దేవవర్మయొద్దకు వచ్చి తమకు దోచిన విషయముల నడుగుచు నగ్నివర్మను శంకిం చుచుఁ బలుదెరంగులఁ దలంచుచు నా రాత్రి వేగించిరి.

మరునాఁడు యధాకాలమునకు నృపతులందఱు సభనిండించిరి. చక్రవర్తి భార్యతోఁగూడ సింహాసన మలంకరించినతోడనే రాజులందఱులేచి నమస్కరించిరి. పిమ్మటఁ జక్రవర్తి లేచి నిలువంబడి ఓమహాశయులారా! రాత్రి జక్కగా విమర్శించి యుందురు. మీకుఁ దోచిన న్యాయంబుల జెప్పుఁడని యడిగిన నేమనిన నేమి యపరాధ మోయని భయపడుచుఁ దొలుత నెవ్వరును మాటాడిరికారు.

అప్పుడు వజ్రదత్తుఁడు లేచి మహారాజా! దేవవర్మ యబద్ధమాడువాడుకాడు. తాను గన్నులారఁ జూచితిననియుఁ జెవులారావింటిననియుం జెప్పుచున్నాడు. అతని మాట లేల నమ్మగూడదు?

అతండు బ్రాహ్మణపక్షపాతియైనట్లు మొదట గ్రామాధికారి పైన మండలాధి పతిపైనను వ్రాసిన వ్రాతఁలే చెప్పుచున్నవి. తనమనసునకు నచ్చినంగాని యట్టితీరుపు చెప్పఁడు. కావున సురసయే దోషురాలని నాకుఁదోచినదని చెప్పెను. చక్రవర్తి యభి ప్రాయమెట్లున్నదో యట్లు చెప్పవలయునని కొందఱు తలంచిరికాని యతనిహృదయ మెవ్వరికిం దొరకినదికాదు వజ్రదత్తుఁ డేదియో తెగించి జెప్పెను. కావున నతనితో నేకీభవించితిమని పెక్కండ్రుచెప్పిరి.

దేవవర్మయందు వైరముగల మఱికొందరు రాజులు దేవవర్మకు నల్లునియందుఁ బక్షపాతము౦డక మానదు కావున నతనిమాటలు మన్నింపవలసినవికావు ఇతరసాక్ష్యము లేదు. సురసదే న్యాయము అల్పుఁడే యపరాధియని చెప్పిరి.

అప్పుడు చక్రవర్తి వజ్రదత్తుఁజూచి నీవు లెస్సగాఁబలికితివి గాని నీకు సంతతి కలదా! యని యడిగిన నతండు మొగమున వెల్లదనంబు దోప మహారాజా! కలిగినను లేనివాడఁనై తిని. జంగమదాసను కొమరుడుదయించెను. వాఁడు గురుతిరస్కా రంబుజేసి వెఱ్ఱివాఁడై దేశముల పాలై తిరుగుచున్నాడు. దేశమంతయు వెదకించితి ఎందును వానిజాడ గనఁబడలేదని తనకథ యెఱింగించెను.

పిమ్మట, జక్రవర్తి పీఠమునుండి లేచి యోభుపతులారా? ఇంతదనుక మీమీ చరిత్రము లన్నియుం జెప్పితిరిగదా? నేనెవ్వడఁనో యెట్లుమీకుఁ జక్రవర్తినై తినో మీరు నుం దెలిసికొనఁ దగినదియేకదా వినుండు. భగవంతుని విలసితములు కడువిచిత్ర

ములు తృణమును మేరువునుగా, మేరువును తృణముగాఁ జేయుచుండును.


శ్లో॥ మజ్ఞత్వంభసి యాతువేరుశిఖరం శత్రూన్‌ జయత్వాహవె
      వాణిజ్యం కృషి సేవనాది సకలా విద్యాఃకలాః శిక్షతాం
     ఆకాశం విపులం ప్రయాతు ఖగవత్కృత్వా ప్రయత్నం పరం
     నాభావ్యం భవతీహ భాగ్యవశతో భావన్యనాశఃకుతః॥

సముద్రమున మునిఁగినను మేరుశిఖర మెక్కినను శత్రువుల జయించినను వర్తకము జేసినను వ్యవసాయరతుండై నను సర్వవిద్యలు నభ్యసించినను బక్షివలె నాకాశ ములో నెగిరినను రానియర్థంబు లభింపనేరదు. పూర్వపుణ్యము మంచిదేయైనచో అడవిలోనున్న బ్రయత్నమేమియుఁ జేయకపోయినను దైవము నోటి కందిచ్చును. ఇందులకు నాచరిత్రమే దృష్టాంతము వినుండు.

నేనీ వజ్రదత్తుని కుమారుండ. ఆయన జెప్పిన వడుపున జంగమదేవర వరంబునం జనియించితిని. యౌవన మదంబునఁ దండ్రి చెప్పిన చొప్పునఁ జేయక యాజంగమదేవరం దిరస్కరించి శాపగ్రస్తుండనై ముష్టియెత్తుకొనుచు దేశాటనము చేయుచుంటిని. అట్లున్నను నా చంద్రగుఁప్తుడు కనిష్ఠపుత్రిని నిరతిని నాకిచ్చి పెండ్లి చేసెను. చూచితిరా. దైవమహిమ.

నేనా నిరుతి మొగము నిరతి నామొగము జూచి యెరుంగము. నేను దోడి యల్లుఁడని బావయనియుఁ జెప్పికొనుటతప్పు గానెంచిమా యిద్దరిని నాబుద్ధిమంతు లిద్దరు నొక యర్దరాత్రంబునఁ బరిజనులచే నూరు దాటించి యడవిలో విడిపింపఁజేసిరి. అప్పుడు మే మొకరి నొకరు బలకరించుకొనలేదు. నాకు మతిపోవుటచే వెఱ్రివాఁడుం వలె నా అబలవెంటఁ బోవుచుంటిని.

పోవ౦బోవ దన్మహారణ్యములో నొక పర్వతప్రాంతమునఁ ఛండవేగుఁడను భూతరాజు వసియించుఁ చోటికిఁ భగవంతుఁడు లాగికొనిపోయెను మేమాచెట్టుఁక్రిందఁ బండుకొనియుండగా నాభూతదంపతులువచ్చి రాతిపైఁ గూర్చుండి యాహారము దొరకక పరితపించుచు నీ సురసకథ జెప్పికొనిరఁట.

పిశాచభాష గుర్తుతెరింగిన విరతి వారి పరిదేవనమువిని తన్నుఁ భక్షింపుమని వారియెదుటికిఁ బోయి కోరినది. ఆభూతదంపతు లామెమాటవిని వెరగుపడుచు నీవెవ్వ తెవు? ఇచ్చటి కెట్లువచ్చితివని అడిగిరి. విరతి జరిగిన తనవృత్తాంతమంతయు జెప్పినది భూతపత్నికిఁ జాలదయగలిగినది దాపుననే చెట్టుక్రింద నిద్రించుచున్న నాయొద్దకు వచ్చి యాభూతకాంత నావృత్తాంత మడిగి తెలిసికొని‌ జాలి జెంది మాకత్యం తైశ్వర్యము గలిగింపుమని తనభర్తం బ్రార్ధించినది.

అప్పుడా భూతరాజుసూర్యవర్మకుదేవవర్మకు జరుగుచున్న రాత్రియుద్దములో సేనలతో గూడ రాజుల బెక్కండ్ర రూపుమాపి సూర్యవర్మం జంపి తత్క ళేబరముల గుదెలగావైచి తన నెలవునకుం దీసికొని యారాత్రి భుజింపుచుండెను.

చంద్రగుప్తుని కుమారుఁడు కుశుని నల్లుడుసుకుమారుని నొకేలంకెవైచి యొక చెట్టుకొమ్మకు వ్రేలాడవైచి మిగిలిన శవముల దినుచున్న సమయంబున విరతి వారి జీవములతో నున్నవారిఁగా దలంచి మెల్లనఁ బోయి భూతరాజునకుఁ దెలియకుండ వారి పాదములగట్టులు విప్పి యవ్వలకు సాగనంపినది వారెవ్వరో యెఱుగఁదు వారువెళ్ళు నప్పుడొక యుంగరమా విరతికి గురుతుగా నిచ్చిపోయిరి. ఇదియే యాయుంగరము. అని సభ్యులకది యిచ్చెను వానింజూచి యందఱు విస్మయ మభినయించుచున్నారు. అమ్మరునాఁడే యాభూతరాజు మా యిద్దరిని తన భుజముపై నెక్కించుకొని వచ్చి యీ సింహాసనమునఁ గూరుచుండఁబెట్టి చక్రవర్తినని చాటించి తన నివాసమునకు బోయెను.

భూతపత్ని నావృత్తాంతమడిగినప్పుడే నాకంతయుస్ఫురించినది. మతి యధాగ తము వచ్చినది. మునుపుగలిగిన గరువ మంతయు నటమటమై పోయినది. నాఁటి సుతనే నీరాజ్యము పాలించుచుంటిని చంద్రగుప్తుఁడు నాకు మామగారు సుకుమా రుఁడు తోడియల్లుఁడు రతి వదినగారు ధర్మరతిం దిరస్కరించి కామక్రోథాదులు మనుష్యుని కవశ్యముండవలసినదనియుఁ బురుషకార్యమె ప్రధానమనియు వాదించు టచే నిట్టి యిడుములం బడిరి.

అల్పుఁడన చంద్రగుప్తుని పెద్దకుమారుఁడు లవుఁడు లవశబ్ధమున కల్ఫార్థ మున్నది కావున నట్టిపేరు పెట్టుకొనియెను. అతఁడు కడు మంచివాఁడు. అంతర్ము ఖుఁడు సురస వానిని వరించినది అంగీకరింపమింజేసి యెదురు వానినే అపరాధిగాఁ జెప్పినది. స్త్రీలెట్టి ఘోరకృత్యములకైన సాహసింతురు యమున స్త్రీయే కావున నాగుట్టు గ్రహించినది.

వారిమూలముననే కదా యీ ఘోర సంగ్రామము జరిగినది. దేవవర్మ కడు ధర్మాత్ముఁడు ధర్మము జయింపకపోవునా! అధర్మమెప్పటికి నిలువదు. విశోకుఁ డన్యాయమార్గవర్తి వాఁడు రాజ్యార్హుఁడుకాఁడు. రాజు ప్రజలకు దైవమువంటి వాఁడు. వానియందు దుర్గుణము లేమియు నుండఁగూడదు వికటదంతుడు రాజ పురో హితుఁడై కృతఘ్నుత్వమున నతని రహస్యము బయలుపరచెను. వాని లోకములో నుంచఁదగినదికాదు. కావున మీరెల్లరు సత్యమునకు ధర్మమునకు బద్ధులై పూర్వచార ముల మన్నించుచు రాజ్యములు సేసినచో నుభయ లోకములయందు సౌఖ్యముల నందుదురు. ఇదియే నా వృత్తాంతము అని కన్నుల నానందబాష్పములు గ్రమ్మ నుపన్యసించి పీఠముడిగ్గ నురికిఁ దండ్రియగు వజ్రదత్తునకు జంద్రగుప్తునికి నమ స్కారములు గావించి బావలనాదరించి బంధువుల గుర్తించి యానంద సముద్రములో నోలలాడెను.

అప్పుడు కుశుఁడును సుకుమారుఁడు లజ్జావనతముఖులై వారు గావించిన అక్రమమునకు వగచుచుండిరి. లవుఁడు తండ్రికి నమస్కరింపుచు జనకా! మాత మ్ముడు నాస్థికుఁడు ఇప్పటికైన బుద్ధివచ్చినదేమో యడుగుఁడు, నాఁడు నాతో నక్రమవాదము గావించెను నాకేమి కొదవ వచ్చినది. విరతి సుగతుం బెండ్లి యాడి నది. అతండు జక్రవర్తియయ్యెను వారిద్దరిని రహస్యముగా నడవికిఁ ద్రోయించెను. అదియే వారి కుపకారమైనది పరమేశ్వరుని విలాసము లెవ్వరి దెలిసికొనఁగలరు? అని యొత్తిపొడిచిన విని చంద్రగుప్తుడు లవునాలింగనము జేసికొని బాబూ మేమందరము జ్ఞాన లవశూన్యులమైతిమి నీవును విరతియు మీతల్లి యజ్ఞానియుక్తులై వై భవంబు బిడసితిర. మీ‌ మాటలయందిప్పటికి నమ్మకము గలిగినది. నీవింటికివచ్చి రాజ్యము గావించుకొనుమని బోధించిన నతఁడు తండ్రీ నన్నీ కుశుఁడు రాజ్యలోభం బున నగరము వెడలఁగొట్టైను. అందులకు నాకించుకయు నీసులేదు మామగారి రాజ్యము నాకుఁగలదు. కుశునికే పట్టాభిషేకము గావింపుఁడని బోధించెను.

అప్పుడు రాజులందఱు సుగతుని స్తుతియించుచు నతని యనుమతి వడసి తమతమ నెలవులకుంబోయిరి. సుగతుఁడు విరతితోఁగూడ జక్రవర్తియై న్యాయం బునఁ బ్రజలం బాలించెను. కుశలవులు దండ్రి యనుమతిని జెరియొక రాజ్యమునకు నధికారులై పాలించిరి.

చంద్రగుప్తు ననుమతిని గుశుఁడింటికి బోయిన వెంటనే పురోహితుండైన వికటదంతుని నడివీధి మంటపములో నిలువంబెట్టి యావీథిని వచ్చుఁబోవువారిచేత వాని మీఁద నుమ్మివేయునట్లు నియమించెను. కృతఘ్నునకు వేరొకనిష్కృతిలేదుగదా? ఆపురోహితుండు కాలథర్మము నొందిన పిమ్మట వానిరూపము శిలయందు జెక్కించి యానడివీధిలో నిలిపి యట్లె యుమ్మివేయించుచుండెను. నీవుచూచినది వికటదంతుని రూపము అతండు కృతఘ్నుఁడై యట్టి యవమానమునకుఁ బాత్రుండయ్యెఁ దెలిసి నదియా అని అడిగిన గొల్ల వాఁడు స్వామీ! తెలిసినది. ఇందలి నీతి లోకులకుబుద్ధిజెప్పు చున్నది. వినుండు కుశుఁడును రతియు లనవిరతుల నాక్షేపించుటచే నత్యంతావమానము జెంది వారిచేతనే కష్టవిముక్తి వడసిరి. కుశుఁడు దుర్మంత్రముజేసి సుగతునితో విరతి నడవుల పాలుచేసెను. అదియేవారి కుపకారమై భూతదంపతులదర్శనలాభంబున మహారాజ్యవై భవము లభింపఁజేసినది. మంచిదినములలో నపకారముజేసినను నుపకార మగుననుసామెత దీన దృఢ మగుచున్నదికదా? దేవవర్మ ధర్మమునే నమ్మి పాలించు చుండుటచే బ్రబలశత్రువు లతనిమీఁదకువచ్చి యగ్గిబడిన మిడుతవలె మ్రండిపోయిరి. రతివిరతి మూలముననే భర్తృమతియైనది. అన్ని దోషంబుల కంటె బెద్దదియగు కృత ఘ్నుదోషము వికటదంతుని జిరకాలము బాధించుచున్నది. ఏపాపమునకైన నిష్కృతియున్నది. కాని కృతఘ్నునికి నిష్కృతి లేదని పురాణములు ఘోషింపు చున్నవి.


శ్లో॥ మిత్రద్రోహి కృతఘ్నశ్చ నృశంసశ్చ నరాధమః
      క్రవ్యాదైః క్రిమిభిశ్చానైర్ణభుజ్యంతేహాతావృశాః॥


కం. వినుమిత్ర ద్రోహుగృత
     ఘ్నుని ఘాతుకు వేనిమాంసకోశంబు లహా!
     దినవఁట క్రవ్యాదములై
     చనుకీటక కాకశునక జంబుకములిలన్‌.

ఇన్ని నీతులు కథవలన దెలిసినవి. అని చెప్పిన సంతసించుచు వాఁడు అయ్యవారికి నమస్కరించెను.

గురుశిష్యు డా నా డందు వసించి మఱునాఁడు తదనంతరావసధంబు జేరిరి.


చ. అమితమతిప్రభావ సుగుణాన్విత నాయక నాయకీ కధా
    క్రమ సుమనోహరంబయి ప్రకాశిలు సప్తమభాగమార్య స
    త్తముల కృపన్‌ రచించి విదితం బొనరించితి లోగనాబ్ది వ
    స్వమృత మయూఖనంఖ్యనగు నట్టి శకంబున రౌద్రియన్‌సమన్‌.

క. జగదీశ సర్వమంగళ
   త్రిగుణాతీత ప్రభావ దేవకిరీట
   స్థదితమణి ఘృణిలసత్ప ద
   నిగ మాంత స్తుత్య సత్య నిర్మలతేజా!

క. జలదము తఱి వర్షింపఁగ
   నిల నన్యసమృద్దమై ఫలించుతసుఖులై
   వెలయుదురు గాక ప్రజలీ
   తుల బాధలులేక ధనతతులఁ దులదూగగన్‌.

శ్లో. గృహెకించిన్నేతి ప్రవదతిఃకళత్రం ప్రతిదినం
    తమేనార్థం భ్రూతెనృపతి రపియత్నె నమహతా
    ఆధీతె వేదాంతెశ్రుతి రపితనేవార్ద మదవతీ
    నిరాలంబో లంబోదర జననికం యామి శరణం॥


గద్య. ఇది శ్రీమద్విశ్వనాథసదను కంపాసంపాదిత కవితా

విచిత్రాత్రేయముని సుత్రామ గోత్రపవిత్ర మధిరకుల

కంశజలనిధీ రాకాకుమురమిత్ర లక్ష్మీ నారా

యణ పౌత్ర కొండయార్యపుత్ర సుకవిజ

నాభిరక్షిత సుబ్బనదీక్షిత కవి విర

చితంబగు కాశీయాత్రా

చరిత్రంబున సప్తమభాగము.

శ్రీ విశ్వనాధార్పణమస్తు.