కాశీమజిలీకథలు/ఏడవ భాగము/131వ మజిలీ

131 వ మజిలీ.

పద్మినీ గురుదత్తుల సమ్మేళనము

పుష్పవేణి - రత్నాంగి ! నీయభియోగ మీదినమున విచారింతురా? పాపము పెక్కుదినములనుండి తిరుగుచున్నావుగదా ?

రత్నాంగి -- ఛీ ! ఛీ ! ఎరుఁగక దీనిలో దిగితిని సొమ్ముపోతే పోయినది. రామరామ ఒక్కనికి జాలిలేదుగదా న్యాయవాదివచ్చునప్పుడెల్ల సొమ్ము తెమ్మనియే పీడించును. వానిక్రిందివారు డబ్బు చేతిలో వేసినంగాని కాగితమే వ్రాయరు. ఈ బంట్రోతుల కియ్యలేక చేతులు కాయలు కాచిపోవుచున్నవి. అధికారులు త్రిప్పి త్రిప్పి చంపుచున్నారు. అబ్బబ్బా ! నాలంజరికపుసొమ్మంతయు వీరి లంచముల క్రింద సరిపడిపోవుచున్నది. సుమేధుఁడు మహాజితేంద్రియుండని పొగడితివి. అతడుఁ స్త్రీలోలుండని తెల్లమైదిగదా ?

పుష్పవేణి - ఆమాటకు మాత్రము నేనొప్పుకొనను. అతండు పరస్త్రీ వర్జితుఁడని నేను శపథముజేసి చెప్పఁగలను.

రత్నాంగి -- చాలుచాలు నీమాటనమ్మియే నేనాప్రయత్నము చేసితినికాను. లేకున్నఏపాటికివాని నాగౌఁగిటలో వేసికొని నాపక్షమున తీర్పు చెప్పించుకొనక పోపుదునా ?

పుష్ప -- నీవెట్లు తెలిసికొంటివి?

రత్నా - వినుము. ప్రతిదినము అతఁడు గుఱ్ఱమెక్కి ప్రొద్దున విహారమునకై పోవుచుండును. గుఱ్ఱము వాఁడొక్కడుమాత్రము వానితోబోవును సమయము వచ్చి నప్పుడు నామాట జెప్పుమని వానికి లంచమిచ్చియుంటిని వానివలన నిజము తెలిసినది.

పుష్ప -- వాఁడేమి చెప్పెను.

రత్నా -- మొన్న ప్రొద్దున్నఁ బోవుచుండగాఁ జక్కని గొల్లది పెరుగుకుండ నెత్తిమీఁదబెట్టుకొని యమ్మ వచ్చుచుండఁగా దాని మోహించి వానిఁబొమ్మని దాని తనయింటికిఁ దీసికొనిపోయెనఁట. వాఁడీరహస్య మెవ్వరికిని జెప్పవలదని నాతోఁ జెప్పెను. ఈమాటైన నమ్మెదవా ?

పుష్ప -- వాఁడెందులకుఁ జెప్పెనో కాని నేను నమ్మజాలను.

రత్నా -- ఇంతయేల విచారణలోఁ బక్షపాతము చేయుచున్నాడని మా న్యాయ వాదియే చెప్పెను. పుష్ప --- న్యాయవాదులు తనపక్షముఁ జెప్పిన నుత్తముడందురు. లేకున్న ననుత్తముఁడందురు. మనకును వారికిని భేదములేదు.

రత్నాంగి - పోనిమ్ము. ఏమిజేసినను సరే. యేటో యొకటి తెలిసినం బాగుండును. రేపురేపని త్రిప్పి చంపుచున్నారుగదా ?

పుష్ప --- తిరుగా నెప్పుడు విచారింతుమనిరి.

రత్నా --- ఎప్పుడో తెలియకయే న్యాయవాది యింటికి దూతిక నంపితిని. అదిగో అది వచ్చుచున్నది.

దూతిక - (ప్రవేశించి) అబ్బా! న్యాయవాది యింటికి వెళ్ళువరకు నాకాళ్ళు ముక్కలగుచున్నవి. ఆయనయే వేగము మాట్లాడును గాని వారి గుమాస్తాలు తల యెత్తి చూడనే చూడరు. అభియోగము తెచ్చుటకంటె పాపములేదుకదా !

రత్నా - ఏమైనది ? ఎప్పుడని చెప్పిరి.

దూతిక - మనవ్యవహారము చక్రవర్తిగారు స్వయముగా విచారింతురఁట. ఉదయార్కుని గూడ రమ్మన్నారఁట ఎల్లుండి విచారింతురట. ఎల్లుండి పెందలకడ రమ్మని న్యాయవాదిగారు చెప్పినారు. సరేకదా వారికియ్యవలసిన సొమ్ముకూడా తెమ్మన్నారు. సొమ్ము లేకుంటె తాను రాడఁట. గుమాస్తాల బహుమతులు కూడా ఇవ్వాలట.

రత్నా --- సరిలే ఇయ్య కేమి చేస్తాము.

పుష్పవేణి - ఇంతకు మీపక్షమయ్యేటట్లున్నదా ?

రత్నా -- చక్రవర్తి విచారించునంట. ఈసారి న్యాయముచేయవచ్చును.

పుష్చ --- మృగదత్తుఁడువచ్చి సాక్ష్యమిచ్చినాడుగదా ? వారి సాక్ష్యమెట్లున్నది.

రత్నా --- వాఁడుబలుటక్కరి. గడియకొక పేరు చెప్పుచున్నాడు. రామదుర్గ నగరమునుండి వచ్చిన బంట్రోతులు ఏడ్చుచున్నారు. ఏదియో బ్రతిమాలుకొను చున్నారు వివరము నాకుఁ దెలియదు.

దూతి - నాకుఁదెలిసినది అందులకే చక్రవర్తి స్వయముగా విచారింతురఁట వినుము. ఈమృగదత్తుఁడు మఱియేదో యపరాధముచేసి శిక్షింపఁబడి తనపేరుతో మరియొకరిని వారి కప్పగించెనఁట ఈసమయమునకే యా యభియోగము విచారణకు వచ్చినది. ఒకే పేరుగలవారు రెండువిధములుగా వచ్చుటచే నందరు వింతగాఁ జెప్పు కొనుచున్నారు. ఇప్పుడు న్యాయవాదిగారి యింటికడ బలువురు కూర్చుండి యా మాటయే చెప్పుకొనుచున్నారు. అని వాండ్రు ముచ్చటించుకొనుచుఁ దత్కా లము నిరీక్షించియుండిరి. దుర్గానగరమునుండి వచ్చిన రాజభటులు దైవికముగా దారసిల్లిన గదాధర ప్రముఖుల మువ్వురంజూచి వెరగందుచు బాబూ మాకుఁ జీవత హానిదెచ్చిబెట్టితిరి. మీరుగూడ నేఁడేవచ్చితిరి. మీయభియోగమున్నదని మాకు జెప్పితిరికారు. నిన్నను సభ్యులందరు వింతగా మన కథలు చెప్పుకొనుచున్నారు. మీకొరకు వెదకుచుంటిమి. చక్రవర్తి స్వయముగా మన యభియోగములు విచారింతురఁట. ఈవ్యత్యాస ములు దెలిసికొనుటకే యని తోచుచున్నది. సుమేధుడు గట్టిగాఁ బ్రశ్నలు వైచినచో మొన్ననేవెల్లడియగును ఆయన యేమిటికోచల్లగానూరకున్నాఁడు. మాపని యేమిచేయుదురని దుఃఖించుచుఁ బలికిన రాజభటులు నూఱడింపుచు గదాధరుఁ డిట్లనియె.

మాకీవిషయమేమియుఁ దెలియదు. రత్నాంగి తెచ్చిన యభియోగములో మృగదత్తునకు సాక్ష్యమున్నదని మేమెరుఁగము. మేమడవిలో దాగుటకై పోయిన నందీతని బట్టుకొని తీసుకొని వచ్చినారు ఇంతవట్టు నిజము. ఈమార్పు మాకునుఁ ప్రమాదమే ఉదయార్కుని రాజప్రతినిధిగూడ రమ్మని యాజ్ఞాపత్రికలు పంపిరఁట అందులకే విచారించుటకు నాలుగు దినములు వ్యవధియైనది. నిజము వెల్లడియైనచో మనమందరము కారాగారములో నుండవలసిన వారమే భగవంతుని యెత్తి కోలు తెలిసి కొనఁజాలము. కానిమ్ము. రేపు నేను సుమేధునింజూచి యాశీర్వదించి యాశ్ర యింతును. ఆతండు కరుణాళుండని తోచుచున్నది. నిజముచెప్పి తప్పుగావుమని ప్రార్థింపదలంచుకొన్నాను. వానికేమాత్రము పాండిత్యమున్నను రంజింపఁజేసి వశ పరచుకోగలను. అని పలికి వాండ్ర నూరడించెను.

వాండ్రును జేయునది లేక తమ్ము తప్పించుమని గదాథరుని పాదములమీఁద బఁడి ప్రార్థించిరి అతండు వారినూరడించి యామరునాడుస్నానముచేసి యొడలెల్ల విభూతినలఁది బ్రహ్మతేజము మూర్తీభవించునట్లుమెఱయుచు ఫలములందీసుకొని సుమేధునింటికిం బోయెను.

నాలుగు దినములనుండి సుమేధుఁడు ప్రాతఃకాలమున నశ్వమెక్కి. విహరింప నరుగుటలేమింజేసి అప్పుడింటిలోనే యుండెను.

సింహద్వారమున నిలువంబడి వేదముచ్చరింపుచు నాలుగు శాస్త్రములయందుఁ బాండిత్యముగల పండితుండొకండు దేవరదర్శనార్థమై వచ్చియున్నాడని పద్యములతో వ్రాసియిచ్చి వర్తమానమం పెను.


శ్లో. గదాధరారాధన తత్పరోహం
    గదాధరారాధన తత్పస్త్వం


    గదాధరారోహం సుగధాధరస్త్యం.
    సమానధర్మాత్ప్ర వదంతిసఖ్యం.

క. బోధపడ నేరదించుక
   సాధులకేగాని మాప్రసంగంబులు సుమే
   ధా ధారిత భువనభరా
   సాధితపంచేద్రియ ప్రచార సుమేధా !

క. కోరఁ గనకాంబరాలం
   కారధరా వాహనాది కామ్యములనినున్
   భూరమణ! యాత్మముక్తి వి
   చారేచ్చన్ వచ్చినాడ సందర్శంపన్.

సుమేధుఁడాపద్యంబులఁ జదివికొని పరమానంద పూరితహృదయుండై యర్ఘ్యపాద్యాదికములఁ గైకొని యెదురువోయి పాదములు గడిగి శిరంబునఁ జల్లి కొనుచు మహాత్మా ! నేఁ డాత్మదార గృహయుక్తముగా భవదాగమనంబునఁ గృత కృత్యుఁడనైతి. నిన్నుఁ బరమమిత్రునిగాఁ దలఁచుచున్నవాఁడ దయజేయుఁడు. మీతో నాత్మరహస్య విశేషంబుల ముచ్చటింపవలసియున్నది యేకాంతప్రదేశమున కరుగుదము రండు. అని పలుకుచు సౌధాంతరమునకుఁ దీసుకొనిపోయి సుఖాసనా సీనుంగావించెను.

సముచిత వస్త్రాలంకారశోభితుండగు సుమేధుంజూచి గదాధరుఁ డెగాదిగ జూచుచుఁ గురుదత్తుఁడు కాదుకదా యను భ్రాంతి హృదయంబున నంకురింప నేమనిన నేమి అపరాధమో యని వెరపుగదుర నేమియు మాటాడకూరకుండెను.

కొంతదనుక సుమేధుఁడును మౌనముద్రవపాంచి పండితప్రవరా! నీయాగ మనకారణమెఱింగింపక ధ్యానించుచుంటివేమని యడుగుటయుఁ గ్రమంబునఁ దన యనుమానము వృద్ధినొంద నిట్లనియె.

దేవా! నాకు మొదటగలిగిన సందియముకన్న మిమ్ముజూచుటచే వేరొక సందేహముఁగలుగుచున్నది వినుండు జీవులకు నభిఖ్యాంతరంబుగలిగినను నాత్మ భేదము గలుగదుకదా? దానంజేసి మన యిరువుర మునొక్కటియేయనినాయభి ప్రాయముఅనియుపస్యసించిననతండిట్లనియె

మీరు శాస్త్రవేత్తలుగదా! మీయభిప్రాయమునకు సత్యమునకు భేదముండదు, మీమాటయే యదార్థమని నేను నొప్పుకొనియెదననపుఁడు నట్లైన నున్న రూపు దెలుపుట కేమికొదవ అని చెప్పెను. మీయభిప్రాయము తెలిసికొంటిని గదాధరత్వము మరియొకని యందారో పించి రూపభేదమునున్నను గ్రియాభేదము లేదని సూచించుచు నాత్మాపరాధము మరుగుపరచ నేతెంచితికికాదా సత్యము జెప్పుఁడని యడిగిన సుమేధునకు గదాధరుం డిట్లనియె.

సుమేధశబ్దము విశేషణపదముగాని విశేష్యపదముగా మీయందుఁ బరిగణింప బడదు, అట్టిమారుపు దేవరయందుఁగలదని అస్మదీయ గురుదత్త వరప్రదానంబునఁ దెలిసికొంటిని. సత్యముకాదా అవసరమును బట్టి భగవంతుఁడు నామరూపభేదంబులు వహింపలేదా? నన్నేమిటికిఁ బరితపింపఁ జేసెదరు? నిక్క మెరింగించి కృతకృత్యుం గావింపుఁడని ప్రార్థించెను.

అప్పుడు సుమేధుఁడు కన్నీరు స్రవింప హా! మిత్రమా! గదాధరా! యింత కాలమునకు గలసికొంటిమిగదా! యని పలుకుచు గౌఁగలించుకొని దుఃఖింపఁ దొడం గెను,

ప్రహర్ష పులకితగాత్రుండై గదాధరుఁడు ఔరా! ఎంత చిత్రము దైవసంఘటన మెంతచోద్యమైనది. అని యూరక యచ్చెరువందుచు నీకిట్టి యౌన్నత్య మెట్లుకలిగి నది? ఇంతకాలము మమ్ముఁ జూడకయేమిటి కుపేక్షించితివి? నీభార్య పద్మిని దేశ ములపై తిరుగుచున్నది నీకుమారునితో నేను గలిసికొని తిరుగుచుంటినని తన కథ యంతయుం జప్పెను.

సుమేధుఁడు, మొన్ననే మిమ్ముల గురుతుపట్టితిని మీమార్పులు నీబుద్ధిబలము చేతఁ గలిగినవని ప్రశ్నించితినికాను దైవోపహతులమగుట నీవియోగముఁ జెందితిమి మంచికాలమున నన్నియు సమకూడును. పద్మినితో మొన్ననే కలసికొంటిని లోపల నున్నది అని యామెంజీరెను సముచితాలంకారధారిణియై పద్మిని వచ్చి గదాధరునికి నమస్కరించి కన్నీరు గార్చుచుఁ దనవడిన యిడుమలన్నియుం జప్పుకొనియెను.

ఆమె నొదార్చుచు నీకుమారునికి నీవువ్రాసియిచ్చిన యుత్తరముచూచి నీవే యని గ్రహించితిని. మీనిమిత్తమై తిరుగుచుంటినని తానుపడిన కష్టములన్నియుఁ జెప్పికొనియె అప్పుడుసుమేధుండు తనవృత్తాంతంబిట్లని చెప్పం దొడంగెను.

గర్భభరాలసయైయున్న ప్రియురాలినివిడిచి కోయలతో గూడఁ విచిత్ర పత్రములకై యడవికిం బోయితి. అందు సర్పదష్టుండనైపడియుండఁ గోయలు నలు మూలలకుం బోయిరి. నేను వివశుండనై పడియున్న సమయంబునఁ నొక యడవి యేనుగ యక్కడికి వచ్చినది. అదినన్నుఁ దొండముతో మూర్కొని మూర్కొవి యాపాదమస్తకము తడిపినది. అప్పుడు సర్పవిషముతగ్గి నాకుఁ దెలివివచ్చినది యేమిచేయుటకుందోచక నేను బడియుండ తొండముచేఁ తడిమి తడిమి యదినన్ను జుట్టి వీపు పైకి విసరినది. ఆవిసురునకు దానిపైనిఁబడితిని. నాకుఁ నేనుగ నెక్కు పాటవము గలిగి యుండుటంబట్టి కాళ్ళను బిగబట్టి మెల్లిగా గు౦భము దాపునకుఁ బోయితిని.

ఆమతంగము నేను తనపైనున్న విషయమెఱిఁగి యుండదనుకుందును వేగముగా అటునిటు తిరుగుచు వృక్షలతాదులఁ దొండమెత్తి విరచుచు వక్కానలో క్కానలో దారుణవిహారముఁ గావించుచుండెను.

పర్వతశిఖరములెక్కుచుఁ బల్లములకు దిగుచుఁ గొమ్మలవిరచుచు నీరీతి చిత్ర సంచారముచేయుచు గ్రమంబునఁ గొండలోయలలోనికిఁబోయినది. నేను దానికంఠము విడువక యొంటిప్రాణముతో నుంటిని.

గజేంద్రవాహనుఁ డను చక్రవర్తికి నేనుఁగుల వేటయందుమంచిపాటవము గలదు. అతండా యడవికి వేటకై వచ్చి బోనులొగ్గియుండెను. అతండొక చెట్టుపై నున్న యతని నెట్లోచూచి వడివడిగాఁ బరిగిడిపోయినది. ఆవృక్షశాఖలు సమున్నత విశాలములై యన్నను అవి యన్నియు విరచి మోడుగావించినది. అప్పుడు గజేంద్ర వాహనుఁడున్న కొమ్మ విరువబూనినప్పుడతండు తనచేతనున్న కఠారి గురిజూచి తొండముపై వ్రేసెను. ఆవ్రేటుతప్పి గండ స్థలముపైగ్రుచ్చికొనినది. నేనాకత్తినందు కొని చేతనమర్చికొనియుంటిని. అంతలో నాశుండాలము గండుకొని తరుశాఖపై నున్న గజేంద్రవాహనుని బడద్రోయఁ బ్రయత్నించుచు నాకొమ్మ విరచి నేలపాలు గావించి యతని తొండముతోఁ బట్టుకొని పైకెత్తి వ్రేయఁబోవు సమయంబున నాచేత నున్న కత్తితో నాతొండము నరికివైచితిని. అట్లుచేయనిచో నప్పుడే యారాజు పిండియై పోవును. రాజు తొండముతోఁగూడ నేలంబడి వివశుండయ్యెను. అంతలో రాజభటులు పలువురువచ్చియీటెలంబొడిచి శరములనేసికరశూన్యమగుట దానినినేలపాలుగావించిరి.

రాజును సేదదేర్చిరి రాజులేచి నన్నుఁజూచి నీవెవ్వఁడవునాప్రాణములుగాపా డితివి. నన్ను రక్షింపవచ్చిన భగవంతుఁడవు. నీవృత్తాంతముఁజెప్పుమని ప్రార్థించెను. నానిజకద చెప్పక వేరొకరీతిఁ జెప్పితిని.

ఆతండు నన్ను దనయందలముపై నెక్కించుకొని తనరాజధానకిఁ దీసికొని వచ్చి ప్రాణమిత్రునిగాఁ జూచుకొని కాపాడుచుండెను. అదియేమియో కాని పూర్వ స్మృతియంతయు నశించినది. కలలోవార్తవలె నున్నది. కొన్ని అభియోగములలో నతనికి సందిగ్దముగానున్న విషయముల నిజముగ్రహించి నేను తీరుపులు వ్రాసితిని. దానుమెచ్చికొని ఆతండు నాకిట్టి అధికారమిచ్చుటయేకాక ప్రాణదాతనను విశ్వా సముతో నూఱుగ్రామములకు రాజుగావించెను. నేనీ ప్రజల బాలించి అతఁడు విచారింపవలసిన అభియోగముల విచారించుచుఁ గాలము గడుపుచుంటిని.

రత్నాంగి యను బోగముదాని అభియోగములో మృగదత్తుడల్లిన తివాసి జూచినతోడనే వెనుకటిస్మృతి అంతయు జ్ఞాపకము వచ్చినది ఆ విచారణములోనే పద్మిని జాడయుం దెలిసినది. వాని సాక్ష్యము నెపంబున రప్పించుట కాజ్ఞాపత్రికలఁ బెక్కు వ్రాసితిని. ఇదియే నావృత్తాంతము. దైవానుకూలమున నందఱము చేరు కొంటిమి. పద్మిని పడరాని యిడుములం బడినది. మొన్నటిదాని యవస్థదలంచికొనిన గుండెలు పగిలిపోవుచున్నవి. అక్కటా? గొల్లవానికి బానిసయై నిత్యము పెరుగును నీపట్టణమునకు మోసికొనివచ్చి అమ్ముకొనిపోవుచుండునది. పెరుగు, పాలు, చల్ల అమ్మి మధ్యాహ్నమున కింటికిఁ పోవునఁట. సాయంతనముదనుక నింటిపనులు చేయుచుండెడిది యఁట. కటకటా! ఆమాటలు వినిన నాడెందము చివికిఁ కుళ్ళిపోవు చున్నది. బోగముదానియింట నీళ్ళుమోయుచు వరవుఁడు తనంబున మెలఁగినదట, అని యామెబడ్డ బాములన్నియుంజెప్పిగోలున నేడువఁదొడంగెను.

తనపయ్యెవచేఁ గన్నీరు దుడుచుచుఁ పద్మిని ప్రాణేశ్వరా! అది కాలమహిమ గాక మరియొకటికాదు. దమయంతి, సీత, చంద్రమతి లోనగు రాజుభార్యలకన్న నేనధికురాలనాయేమి చివరకు మేలుచేసిన భగవంతునకు గృతజ్ఞులమై యుండవల యును. గతచరిత్రము స్మరింపవలదు నాకుమారునిఁ జూడవలయునని యున్నది. వేగమురప్పిపుఁడు అని వేడుకొనినది అప్పుడేపోయి గదాధరుఁడు వారిద్దరిం దీసికొని వచ్చి చూపి యన్యోన్యవృత్తాంతములు చెప్పెను.

అప్పుడు వారిహృదయంబుల గల యానంద మిట్టిదని వర్ణింప నాకు శక్యము గాదు. మనసుచేతనే దెలిసికొనదగినది.

ఆ రాత్రియెల్ల నిద్రబోవక తమరుపడిన యిడుములెల్ల నొండొరులకుఁ జెప్పికొనుచు సంతోషశోకము లభినయించుచు నోదార్చుచు దృటిగా వెళ్ళించిరి

సుమేధుడు నాటి ప్రాతఃకాలమునఁ జక్రవర్తియొద్ద కరిగి తన వృత్తాంతమంత యు౦జెప్పి అతని నాశ్చర్యపారావారములో ముంచివేసెను. అతండు కోరినప్రకారము విద్యానగరమునఁ బేరోలగము గావించెను. తన సామంతులనెల్ల నందు రా నియమించి నిండుకొల్వులో గురుదత్తుని చరిత్రమంతయుఁ గాధగా జెప్పి సభ్యుల నచ్చెరువు పడజేసెను.

రత్నాంగి తెల్ల తెల్ల పోయి చూచుచుండెను, రాజు ప్రతినిధి హృదయముకం పింప దొడఁగెను, ఉదయార్కు_ని ముఖపద్మము వికసింస దొడగెను. సామంత రాజుల వాక్కులు పద్మిని‌ పాతివ్రత్యము గొనియాడుచు సురూపుని నిందింపఁ దొడఁగి నవి.

అప్పుడు చక్రవర్తి సభ్యుల కలకలము వారించుచు ప్రతినిధిని తగ్గించి మృగ దత్తుని రామదుర్గనగరాధీశుని గావించితిమనియు సుమేధునికిమఱి నూరుగ్రామముల కధి కారమిచ్చితిననియుఁ బద్మిని చరిత్రము గ్రంధముగా వ్రాయించిదేశమున వ్యాపింపఁ చేయ నాజ్ఞాపించితిమనియు రత్నాంగి తప్పు మన్నించి దానికైన ఖర్చులన్నియు నిప్పించితిమనియు నున్నతస్వరంబున నుపన్యసించి సభ్యుల కానందము గలుగఁ జేసెను. జయజయధ్వానములతో సామాజికులు కరతాళములు వాయించిరి. అంతటతో సభ ముగిసినది

శుభముహూర్తమున మృగదత్తుని సామంతరాజులతో గూడుకొని చక్రవర్తి రామదుర్గనగరమునకు పట్టభద్రుని గావించెను. గురుదత్తుఁడు తల్లి దండ్రుల రప్పించి విద్యానగరమునవసించి రాజ్యపాలనము గావింపుచుండెను.

గోపా!


ఉ. భూపతిజంపితిన్మగఁడు భూరిభుజంగముచేతఁజచ్చెఁ బై
    నాపదఁ జెందిచెంది యుదయార్కుని పట్టణమేగి వేశ్యనై
    పాపము గట్టికొంటి నఁటఁపట్టి విటత్వముబూనిరాగ సం
    తాపముజెంది యగ్గిపడి దగ్ధముగాకిటు గొల్ల భామనై
    యీపని కొప్పుకొంటి నృపతీ! వగ పేటికి? చల్డ చి౦దినన్‌.

ఇందు మంచికథ పొడగట్టుచున్నది. తద్వృత్తాంత మెరింగింపుమని యడిగితివి విమర్శింపనట్టి కథయే యున్నది. తెల్లముగాఁ దెలిసినదియా అని యడిగిన వాఁడు స్వామీ ! మీదయవలన నాకు గ్రహణశక్తి పెరుగుచున్నది. ఈకథ నామనసున కెంతేని వింతగా నున్నది పద్మిని పాతివ్రత్యము సర్వయువతీజన స్తుత్యమైయున్నది. ధర్మ మును విడువనివారెన్ని యిడుములు గుడిచినను తుదకు సుఖింపక మానరు. అను నీతి దీనివలనం దెల్ల మైనదని పలుకుచు గురువుతోఁ గూడ నా శిష్యుండు కావడి మోచుకొనుచుఁ దదనంతరావసధంబు జేరెను.