కాశీమజిలీకథలు/ఏడవ భాగము/129వ మజిలీ

బంపవలయును వాని వలనఁ గొన్నిసంగతులు తెలిసికొనవలసియున్నదని వ్రాయించి సుమేధుడు గజేంద్రవాహనుని ముద్రికలువైచి యుదయార్కునినొద్దకనిపెను. మఱియుఁ గొన్నిదినములు గడువిచ్చితిమి. మృగదత్తునిని వలన సాక్ష్యము తీసికొన వలసియున్నది. వాని రప్పించుట కుత్తరము లిచ్చితిమి. యప్పటికి నీవు రమ్ము, పొమ్ము. అని యెఱింగించి గడువుచెప్పి సుమేధుఁడు మృగదత్తునిరాక నరయు చుండెను ఉదయార్కుఁడు గజేంద్రవాహనుని శాసనపత్రికంజదివికొని తొందర పడుచు మృగదత్తుడు గనంబడినతోడనే పట్టుకొని తీసికొని రావలయునని చెప్పి పలువురఁ దూతల నలుమూలలకుఁ బంపెను.

అని యెఱింగించి-

129 వ మజిలీ కథ

గదాధరుని కథ


ఆహా ! విద్యయం దెట్టిమహిమయున్నది.

ఉ. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్‌
     విద్యయశస్సుభోగకరి విద్యగురుండు విదేశబంధుఁడున్‌
     విద్య విశిష్టదైవతము విద్యకుసాటిధనంబు లేదిలన్‌
     విద్య నృపాలపూజితము విద్య నెరుంగనివాఁడు మర్త్యుడే.

చదివికొనక యెంతమూర్ఖుఁడ నైతిని. నాకా యిల్లా లీమాట చెప్పక పోయినచో నేమియుం దెలియదుగదా? ఇప్పుడు చదివికొనుటచే గ్రంథములు చూచుటకు శక్య మగుచున్నది నాలుగుమాసములలోనే వ్రాయుటయుఁ జదువుటయుఁ దెలిసినది. ఆమె చీకటిలో వ్రాసిన విషయములు తెల్లమైనవి. నాతల్లిదండ్రులు మృతినొందిరఁట అందున్నవారు నాతల్లికిఁ దల్లిదండ్రులఁట ఆమెకు నావృత్తాంతమెట్లు తెలిసినదియో? ఆమె యెందుఁబోయెనో తెలయదు. ఇఁక నేను రామదుర్గనగరమునకుఁ బోవుట కర్జము. బంధువులం గలసికొనియెద అయ్యో? నన్నుఁగోయవాఁడని నిరసింతురేమో వేషము మార్చెదనని మృగదత్తుఁడొకనాఁడు తలంచుచు నార్యవేషముతో బయలుదేరి యొక మార్గంబునంబడి నడుచుచుండెను.

ధ్యానించుచుండుటచేఁ దారిలో బాషాణకంటకాదులు అతని నంతగా బాధించినవి గావు పోవంబోవ మధ్యాహ్నమునకొక గ్రామము జేరెను. అందు భోజనసదుపాయ మెందుగలుగునని యరయుచు సత్రముండుటఁ దెలిసికొని అక్కడికిఁ బోయెను. అందు నాలుగు వర్ణములవారికిని భోజనము పెట్టుచుందురు. కుడిచి కూర్చున్న పిమ్మట నొక బ్రాహ్మణుఁడు మృగదత్తునిఁ జూచి నీ వేయూరి కరుగుచుంటివని యడిగిన నతఁడు. రామదుర్గ నగర౦బునకుఁ బోవుచుంటినని యుత్తరము జెప్పెను.

బ్రాహ్మణుఁడు - రామదుర్గనగరములో నెవ్వరింటికి బోయెదవు.

మృగదత్తుఁడు - కుముదాంగదుని యింటికి.

బ్రాహ్మ - అతండు నీకుఁ జుట్టమాయేమి?

మృగ - చుట్టమే.

బ్రాహ్మ -- ఏ‌మగును?

మృగ - మాతల్లి తండ్రి.

బ్రాహ్మ -- (విస్మయముతో) మీతల్లి పేరేమి?

మృగ - నాకుఁ దెలియదు.

బ్రాహ్మ - మీ తండ్రిపేరు?

మృగ -- అదియుం దెలియదు.

బ్రాహ్మ - వారెందున్నారు?

మృగ - తెలియదు. మృతినొందిరని యొకతె చెప్పినది.

బ్రాహ్మ -- (దుఃఖముతో) వారికి నీ వెందుజనించితివి.

మృగ - నాకేమియుం దెలియదు. పోనిండు. నావృత్తాంతముతో మీకేమిపని మీరెవ్వరు?

బ్రాహ్మ - నేను మీతండ్రికి మిత్రుఁడను. మీతల్లి దండ్రుల నిమిత్తమే వెద కుచు దేశాటనము చేయుచుంటిని.

మృగ -- మీపేరు

బ్రాహ్మ - గదాధరుఁడండ్రు.

మృగ - వారెందుబోయిరి?

బ్రాహ్మ - వెల్లడింపరాదు. మెల్లగా మాట్లాడుము. మహాపతివ్రతయగు మీతల్లి రాజుం గామాపచారాపరాధంబునఁ బరిమార్చినది దానంజేసి యిరువురు కానన ములంబడి యెందోడాగిరి. అని వింటిని వారినరయుచుంటిని. బాబూ ! వారు మృతి నొందిరని నీకెవ్వరు చెప్పిరి. అని కన్నీరుగార్చుచు నడుగటయుఁ నతఁడు వేశ్య యింటిలోనున్న పరిచారిక చెప్పినదని యాకథయంతయు నెఱింగించెను. నమ్మక తోచిన పిమ్మట నామె వ్రాసియిచ్చిన యుత్తరము చూపించెను.

గదాధరుఁడాయుత్తరము చదివికొని లిపిగురుతుపట్టి అయ్యో ఈయుత్తరము వ్రాసినది పద్మిని తెలిసికొనలేకపోయెను. భర్తతో వియోగము పొందియుండవచ్చును. విరక్తితో వ్రాసినదని తలంచెదను అక్కటడికిఁబోయి చూతమా? అని యాలోచించి బాలుఁడా ! ఆమె యిప్పుడెందున్నదని అడిగిన నెక్కడికో పోయినది. అందులేదని యాబాలుం డుత్తరము జెప్పెను.

మృగదత్తుఁడు రహస్యముగా గదాధరునివలనఁ దనతలితండ్రుల వృత్తాంతము సాంతముగాఁ దెలిసికొని పరితపించుచు దుర్గానగరంబునకుఁ బోవుటకు సహాయము రమ్మని కోరికొనుచు.


గీ. సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
   గౌరవ మొసంగు జనులకుఁ గలుషమణచు
   గీర్తిబ్రకటించు ధైర్య విస్పూర్తిజేయు
   సాధుసంగంబు సకలార్థసాథకంబు.

అనిస్తుతియించుటయు నతఁడక్కడి అధికారుల శాసనము కడుక్రూరముగా నున్నది. మీవారియింటికిఁ జుట్టునుగాపు పెట్టిరి. క్రొత్తవారువచ్చిన బరీక్షించుచుందురు. వారినెచ్చటికిఁ బరీక్షింపపోవనీయరు. నీవృత్తాంతము దెలిసినఁ బట్టికొనియెద రేమో మీపితామహుని యూరికేగుదమన్నను వారనినట్లే నిర్భంధించుచున్నారు. కావునఁ బ్రచ్ఛన్నముగా బోయిచూడవలయునని గదాధరుఁడుపలుకుటయు మృగదత్తుండి ట్ల నియె.

మనమేమి అపరాధము జేసితిమి? నిరపరాధుల రాజపురుషులు బట్టికొని యెదరా? మఱియు రాజు చేసిన అక్రమమును నిందింపక మావారి నపరాధులుగా నెన్నుట తప్పుగాదా? ఎట్లయినను దుర్గానగరమున కరుగక తప్పదు. ఈయుత్తరము చూపవలయునని పలికెను.

వారట్లు మాట్లాడికొనుచుండఁగాఁ బ్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొక పురుషుఁడు వారిమాట లించుక యించుకవిని వారి వెనువెంట దిరుగుచుండెను.

వారుగూఢముగారామాదుర్గనగరమునకుంబోయిరి. కావలివారి నెట్లో తప్పించు కొని యిరువురు గుముదాంగదుని యింటిలోని కరిగిరి. గదాధరుని గురుతుపట్టి కుముదాంగదుఁడు నమస్కరించుచు భూసురోత్తమా? మావారి జాడ యేమైనం దెలి సినదియా? అయ్యో మేమిక్కడ బద్దప్రాయులమై యుంటిమి. యీబాలుఁడెవ్వఁడు యుశీనర నగరంబున కేమైన వార్తలు తెలియవుగదా యని కన్నీరు గార్చుచు అడిగిన అతండిట్లయె.

శెట్టీ ! చలపట్టి విధి మనలరట్టు వేయుచున్నాడు కీడులోమేలు విను మీ బాలుండు పద్మిని కొడుకు వీనిపేరు మృగదత్తుఁడు దైవికముగాఁ వీఁడు నాకన్నులఁ బడియెను. పద్మిని వీనింగనుటయేకాని ముద్దు ముచ్చటలు చూచి యెఱుంగదు. వారు మడిసిరని వార్త వ్యాపించినది. కాని యది అసత్యము దేశములపాలై తిరగుచున్నారు. రాజపురుష భయంబున వెల్లడికాకున్నారని తానెఱిఁగిన వృత్తాంతమంతయుంజెప్పి వారికి సంభ్రమము గలుగఁజేసెను.

అప్పుడు కుముదాంగదుఁడు వాని తెఱంగు భార్య కెఱిగించి కౌఁగలించు కొనుచు నానందబాష్పములచే వాని శిరంబు దడిపెను. అతని భార్యయుఁ గూఁతు చిహ్నములు వాని యందుండుట దిలకించి శోకింపఁ దొడంగినది.

తాను కొండపల్లిలో నుండుటయుఁ గోయపల్లెలో అల్లినచాపల జూచి తానంత కన్నఁ జిత్రముగా నల్లుటయుఁ నుదయార్కుని నగరమున కరుగుటయ నొక వేశ్య యింటి కరుగుటయు అందుఁగల యొక లేడియ బుద్దులు గరపుటయుఁ జీటి వ్రాసి యిచ్చుటయు రాజునొద్దకు బోవుటయు రత్నాంగి తనపై నేరమారోపించుటయు లోనగు వృత్తాంతమంతయుఁ గ్రమ్మర వక్కాణించి యామె యిచ్చిన చీటి కుము దాంగదునికి జూపెను.

ఆకమ్మ జదివికొని లిపి గురుతుపట్టి అయ్యో నాయనా! అదియే నీతల్లి. వేశ్య యింటిలో నేమిటికుండవలయును. ఏమన్నది బాబూ చెప్పము. చెప్పుము. అని మఱియుమఱియు అడుగుటయునతఁడిట్ల నియె.

అయ్యా ! ఆమె అలంకరించుకొనక యొకగదిలోఁ దలుపుమూల నిలువంబడి యున్నది. ఆమెంజూచి నీ వెవ్వతెవు ప్రొద్దున్న నాతో మాటాడిన బోగముది యేదీ? అని యడిగితిని. అది యిప్పుడే వచ్చును. నీవెవ్వఁడవు అని యడిగిన నేను నా వృత్తాంతము జెప్పితిని. అప్పుడు గోలుగోలున నేడ్చుటయు నేను శంకింప నీవు చిన్న వాఁడవై దుర్వృత్తిలోఁ బ్రవేశించినందులకు దుఃఖించితినని చెప్పినది. అప్పా ? అప్పుడు నాకామె‌ చెప్పిన నీతులకు మేరలేదు. మేనంతయు నాకు నీరు గ్రమ్మినది. ఈలాటి పను లెన్నఁడును జేయవలదని బోధించుచు నీ యుత్తరము వ్రాసి యిచ్చినది.

అప్పటికి నాఁకు జదువురాదు. ఏమి వ్రాసినదో తెలియదు. పిమ్మటఁ జదివి కొని యా యుత్తరము తెలిసికొని యిందు వచ్చుచుండ దారిలో గదాధరుఁడు గనం బడెను.

ఇరువురమువచ్చితిమని యాకథయే పదిసారులు చెప్పెను. ఎన్నిసారులుచెప్పినను తనవిసనకమరలమరలనడుగుచుంద్రు. వారట్లుమాటలాడుకొనుచుండరాజపురుషులుకొం దరులోపలికివచ్చి ఈ కొ త్తవారెవ్వరు? గురుదత్తునిచేఁబంపఁబడిరని యనుమానము గలిగి యున్నది. నిజము చెప్పమని యడిగిన గుముదాంగదుఁ డడలుచు వారెవ్వరో నాకుఁ దెలియదని యుత్తరము జెప్పెను. వీరపురుషులు వారిం బట్టుకొని రాజసభకుఁ దీసికొనిపోయిరి. రాజప్రతినిధి వారిని విడదీసి మీరెవ్వరు? వీరింటి కేమిటికి వచ్చితిరని యడిగిన గదాధరుఁ డొకరీతిని మృగదత్తు డొకరీతిం జెప్పిరి.

అంతకుమున్ను కుముదాంగదుని మేడలో నతడెరుంగకుండ ధ్వనిగ్రాహిణి యను యంత్రము నొకదాని నమర్చియుంచిరి. ప్రతినిధి యప్పుడా యంత్రమును దెప్పించి పరీక్షించెను.

చాలభాగము మృగదత్తుఁడు చెప్పినమాటలు గదాధరుఁ డాడిన మాటలు నాయంత్ర మాకర్షించినది. అభిముఖముగాక విముఖముగాఁ జెప్పినమాటలు గొన్ని దానిలోఁ జేరలేదు. వారిసంవాదమంతయు నవి యాకర్షించినచో వారు నిరపరాధులని తెల్లమేయగును వారికిఁ బ్రతికూలమైన మాటలే యందుఁ జేరినవి. విధిప్రేరితము కడు విచిత్రముగదా ? మృగదత్తుఁడు గురుదత్తుని కొడ కైనట్లును గదాధరుఁడు మిత్రుఁడై నట్లును అతం డడవులలోఁ గాపురముండి వీరిక్కడి కనుపుచున్నట్లు తెలిసికొని రాజప్రతినిధి వారినెల్ల నపరాధులుగానెంచి బద్దులంజేసి చెరసాల బెట్టించెను.

మఱియొకనాఁడు సామంతచక్రవర్తియగు గజేంద్రవాహుని కొత్త శాసన ప్రకారము వారికి స్థిరమగు దండన విధించుటకుఁ దన కధికారము లేమింజేసి వారి మువ్వురను రక్షకభటులతోఁ గూడ గజేంద్రవాహునియొద్ద కనిపెను.


సీ. ధన నిమిత్తమున కాదా ? మేదినీపతుల్‌
            బ్రభువులై ప్రజలఁ గాపాడుటెల్ల
    ధనముపార్జింపఁగాదా విప్రులఖిల వి
            ద్యాసంగ్రహస్పూర్తిఁ దనరుటెల్ల
    ధనము గూర్చుటకె కాదా ? బేరులూరఁ
            దిఱిగి వ్యాపారముల్‌ దిద్దుటెల్ల
    ధనలాభమునకె కాదా ? పాదభవులు క్షే
            త్రాజీవులై భూమి బ్రబలుటెల్ల

గీ. ధనముగోరనివారలీ ధరణిలేరు
   దైవమినకైనఁ గావలె ధనము ధనము
   వలనమెచ్చుచు దైవంబు వరములిచ్చు
   ధనమఖిలలోకలోక మోహనముసూవె

క. దైవంబునకే ధనమనఁ
   గాఁ వేడుక బొడముచుండగా దారుణమో


   హా విలమతులగు మనుజులు
   భావంబున ధనవిరక్తి బడయంగలరే.

ధనమునకు వశులుగానివారు లేరు మృగదత్తుని గదాధరుని గుముదాంగదుని రక్షకపురుషులు పదుగురు చుట్టునుం బరివేష్టించి గజేంద్రవాహుని యొద్దకుఁ దీసికొని పోవుచుండిరి. నడుచునప్పుడుమార్గమధ్యంబున రాజభటుల నుద్దేశించి గదాధరుఁ డిట్లు పన్యసించెను.

కింకరులారా! లోకంబున ధర్మాధర్మంబులు న్యాయాన్యాయంబులు మంచి చెడ్డలు పాపపుణ్యంబులు అని చెప్పుకొనుచుందురు పర్యాయపదంబులు వీనిభావం బొక్కటియే. ఒకప్పుడు న్యాయమన్యాయముగాఁ బరిగణింపఁబడుచుండును. వీనికిఁ బూర్వకర్మంబులు హేతుకంబులని పెద్దలు వక్కాణింతురు. తొల్లి మాండవ్యుండను మహర్షి నిరపరాధియయ్యుఁ జోరుండువోలెఁ గొరతవేయఁబడిన భారతమునందలి కథ యిందులకు నిదర్శనముగా నున్నది. దుర్మరణమునొందిన మీరాజుగారి కృత్యము లెట్టివో మీ రెఱుంగనవి కావు. పద్మినిచేసిన పని యధార్హమని మనమిక్కడ నను కొనక మానము. ప్రజలు చాటున మంచిమంచిగను చెడ్డచెడ్డఁగను చెప్పికొనకమానరు. అది యెట్టిదైనను నపరాధము విమర్శింప బ్రతినిధకి విధియైయున్నది కాని యేమియు నెఱుంగని‌ మమ్మిట్లు బాంధించుట కేవలమక్రమము. అధర్మము ఈతండు గురుదత్తుని కుమారుడని యూహించితిమి. ఆదంపతు లెందుండిరో మాకుఁదెలియదు వీడుఁమునుపే యెఱుంగఁడు జాడలంబట్టి సంబంధముగలుపుకొంటిమి ఇదిమాకుఁ బూర్వకర్మయుగాక మరియొకటికాదు సజ్జను లందరిలో నుందురు. క్రూరమృగంబులలో సైతము సాత్విక విశేషంబునంబట్టి సాధుత్వము బొడగట్టుచున్నది. గోటీశ్వరునికి మనముండై యీతం డీరీతి నిడుములగుడుచుచున్నవాఁడు దైవము నేమనఁ దగినది. వీని సిరికి మీరాజు రాజ్యమంతయుఁ బదియారవ సాలునకు సరిపడదు. అని యుపన్యసించుచు జాలివొడము నట్లు వారి మొగములు జూచుటయు వారిలో.

ఒకడు - బ్రాహ్మణుఁడా ? మేమేమి జేయగలము.

గదాధరుఁడు - మీరు జేయఁగలిగినపని మహారాజు చేయలేడు.

మరియొకడు - విడిచి పెట్టుమనియెదవా? యేమి.

ఒకడు - అట్లయిన మాశిరంబులు ఖండింపరా.

గదాధరుఁడు - అయ్యో అట్లనుటకు నేనంత మూర్ఖుఁడనను కొంటిరా? మీకృ త్యములు నేనెఱుంగనివి కావు.

వేరొకఁడు - మాకు బాధకములేనిరీతి నేదియైన నుపకారము చేయఁగలము చెప్పుడు. గదాధరుఁడు - వినుండు. ఉశీనరపురంబున వీనితాత రత్నాకరుఁడు గలఁడు వానికివీనింజూపి తీసికొని పోవుఁడు ఇదియే నాకోరిక అతండు కోటీశ్వరుండగుట మీకు మంచి పారితోషిక మీయఁబడునని ప్రార్థించెను.

ఆమాట వినినతోడనే వారి హృదయంబులు సంకల్ప శతంబులచేఁ బూరితంబు లగుట నామార్గంబుల నడిపింపందొడంగిరి. గదాధరునితో మంచిమాటలు సెప్పుచు గౌరవింపందొడంగిరి కతిపయప్రయాణంబుల నన్నగరంబునకుఁ జనిరి. సంకెళులుదీసి ప్రచ్ఛన్నముగా దాచి రత్నాకరుని యింటికి గుప్తముగాఁ దీసికొనిపోయిరి. గదాధరునిఁ జూచి రత్నాకరుఁడు తొందరపాటుతో మావారిజాడ యేమైనం దెలిసినదా? అని అడుగుటయు నించుక జనాంతికముగా విను మీతండు నీమనుమఁడు ఆయడవిలో జని యించెను. తల్లిదండ్రుల నెరుంగఁడు దైవికముగా దారిలో దారసిల్లెను. దుర్గానగరం బునకుఁ బోయితిమి విధివశంబునం బట్టువడితిమి పెద్దశిక్షకై కొంపోఁబడుచుంటిమి అని యా కథ యంతయుం జెప్పెను.

రత్నాకరుఁడు మనుమని గౌఁగలించుకొని దుఃఖింపదొడంగెను. రాజభటులు అయ్యా ! చూచితిరిగదా ఇఁక పోవలయును. లెండు లెండని తొందర పెట్టుటయు గదా ధరుఁడు రత్నాకరునితో నేకాంతమాడి వారితో నిట్లనియె.

భటులారా ! మీవేతనము కడు స్వల్పములు అధికారము పెద్దది దండనవిధి అంతయు మీచేతిలో నున్నది దా మఱియు మాకొక యుపకారము మీరు జేయవలసి యున్నది. ఈధనము గైకొని అట్లు కావింపుఁడని పలుకుచు నేబదివేల దీనారముల వారి మ్రోలరాశిగాఁ బోయించెను. కనులకు మిఱిమిట్లు గొల్పుచున్న యాకనకరాశిం జూచి వాండ్రు విభ్రాంతిపడి యొక్కింత సేపేమియు మాటాడనేరక మిన్నకచూచు చుండిరి. గదాధరుండు మీరువీనిమూటగట్టుఁడు తరువాతఁ జేయదగిన కృత్యము బోధింతునని పలుకుటయు వాండ్రు దగ్గుత్తికతో స్వామీ ! మీయనుగ్రహమునకు సంత సించితిమి. మాశిరంబులు నిలుచునట్లుచేయుఁడు? మీరేమిచెప్పిన నట్లు నడుచువారమని పలికిన వని గదాధరుఁ డిట్లనియె.

మీకేమియు భయమురాదు. అపాయములేని యుపాయం బెఱింగించెద. వినుండు. మామువ్వురనిందు విడువుఁడు. మాకుమారుగా మీకు మరియొకరిని మువ్వురనప్పగించెదము, మాపేరులే చెప్పగలరు. దీన మీకేమియుఁ గొరతయుండదు. అక్కడివారలు మమ్ముఁజూచిన వారు కారుగదా? మీపత్రికలలోఁ బేరులే వ్రాయఁబడి యున్నవి. వానిం జదివికొని వారికే శిక్షవిధింతురు. వారికినిఁ దగిన యుపాధుల మే మేరుపరుతుమని చెప్పినవిని వాండ్రు ఆలోచించుకొని యందుఁదమ కేమియుఁ బ్రమా దములేదని నిశ్చయించుకొని యప్పని కంగీకరించిరి. రత్నాకరుని పరిచారకులలోఁ దగినవారి మువ్వుర కప్పలుకులు బోధించి విశేష ధన ప్రదానంబున వారి సంతోషపరచి రక్షక పురుషుల వెంట నామువ్వురిం బంపి వేసెను.

రత్నాకరుఁడు వారిం దనయింటనుండ నిర్బంధించెనుకాని గదాధరుఁడు అంగీకరింపడయ్యెను. మేమిక్కడ నుంటిమేని విదితము కాకమానదు. గుట్టు బయల్ప డె నేని బ్రమాదము గలుగును. కొన్ని దినములు ప్రచ్ఛన్నముగా రహస్యస్థలంబుల వసించి కొలది కాలములో గ్రమ్మర జనుదెంతుమని బోధించి యతని నొప్పించి యిల్లు విడిచి యేకాంతముగా నుత్తరాభి ముఖముగాఁ బోవఁదొడంగిరి.

మనకిప్పుడు గమ్యస్థాన మేదియని యడగిన గదాధరునికి మృగదత్తుండు ఆర్యా ! నేజనించిన కోయపల్లె కడు రహస్యమైనదని మీరు వినియేయుండిరి. మనమక్క డికిఁ బోవుదము. మనల నెరుఁగఁజాలరు. కొన్నిదినములుండి వత్తము. జన్మభూమిజూడ నాకును వేడుకగానున్నదని పలికి అయ్యరణ్యమునకుఁ బ్రయాణము చేసెను.

అతికష్టములపాలై కాలినడక నెట్టకే సమ్మెట్టల నడిభాగము జేరిరి. మృగదత్తుని కొందఱు గురుతు పట్టలేకపోయిరి. గురుతుపట్టిన వాండ్రు చిరుతపులియని కేకలు వైచిరి. ఇంటికివచ్చిన మృగదత్తుని జూచి తండ్రి యేమి‌రా? పెద్దవాఁడవై యింటి యొద్దకురాక దేశముల పాలై తిరుగుచుంటివి. వీఁడెవఁడు? చాపలమ్మినసొమ్మేమి చేసితి వని యడిగిన మృగదత్తుండు వాని పామరత్వమునకు వెరగందుచుఁ గొంతసొమ్ము వానికిచ్చి నాయనా! కారణముండబట్టితిరిగితిని. అమ్మినసొమ్మిమ్మనియే తీసికొనుము. మిమ్మెప్పటికిని మరువను. అని అప్పటికిఁ దగిన మాటలాడి వాని సంతోషపరచెను.

ఆసొమ్ము పుచ్చుకొని వాఁడు మిగులఁ జలఁగుచు బాబూ ! నీకొఱకీనడుమ పదు గురువచ్చి వెదకిరేమిటికి? ఎందోబోయెనని చెప్పితిని. పలుమారు మాయిల్లు శోధించిరి. కారణ మేమని యడిగిన విని నాకేమియుఁ దెలియదని చెప్పెను.

గదాధరుఁడా మాటలు విని శంకించుచు నెన్నిదినము లైనదని యడిగి గడువు దెలిసికొని కారణము తెలియక యాలోచించుచుండెను. చిరుతపులి వచ్చెనని యాగ్రా మము లన్నియుఁ బ్రచురమైనది. చాపలపని నేరుపుమని పెక్కండ్రువచ్చి సేవించు చుండిరి.

మరియొకనాఁ డొక కోయవాఁడు నలువుర రాజకింకరుల వెంటబెట్టుకొని యక్కడికివచ్చి వీఁడే చిరుతపులియను మృగదత్తుఁడు అని చూపి వారి యధీనము గావించెను

ఆరాజకింకరులు వానింజూచి ఔరా ! నీనిమిత్తమెన్ని దేశములు తిరిగితిమి. ఎన్ని యిడుములం బడితిమి. పదపద. అడవులలో దాగిన విడుతుమనుకొంటివా? అని అదలించుచు వానిం బంధించిరి. మృగదత్తుఁడు తెల్ల తెల్లపోయి చూచుచుండ గదాధరుఁ డించుక యాలోచించి యిది యెవ్వరియాజ్ఞ వీఁడేమిఅపరాధము జేసెనని అడిగిన వాండ్రు అది మాకుఁ దెలియదు. గజేంద్రవాహునుని యానతిని వీనింబట్టితిమి. మేముకాక పెక్కండ్రు రాజభటులు వీని నిమిత్తము తిరుగుచున్నారని చెప్పిరి.

అందలికారణము పలుతెరంగులఁ దలంచుచు గదాధరుఁడు, ఏమియైనను లెస్సయే మేముగూడవత్తుము. పదుఁడని పలుకుచు నతనివెంట నడువసాగెను. గొన్ని దినంబులకు నా రాజకింకరులు వారి నుదయార్కునివీటికిఁ దీసికొనిపోయి రాజు ముందర నిలువఁబెట్టిరి.

ఉదయార్కుఁడు వారిం జూచి, ఏమిరా? నీకతంబున మాకుబైవారివలనఁ జాల యవమానములు వచ్చుచున్నవి. మాచక్రవర్తి నిన్నుబంపుమని యిరువదిసారులు ఆజ్ఞా పత్రికలఁ బంపిరి. నీ జాడ యేమియు మాకుఁ దెలియదు. రత్నాంగి పైవారింబట్టికొని తనయపరాధము మాపికొనఁదలంచుచున్నది. నీవునుఁబోయి గట్టిగా వాదించి గెలుపు కొనిరమ్ము. పొమ్ము. నీ వెంట రాజపురుషులువత్తురు వెఱవకుమని బలికిన విని సంత సించుచు మృగదత్తుఁడు గదాధరునితో మనమక్కడికిపోయి వాదింపవలసి యున్నది. నీవు బుద్ధిమంతుడవు ఎట్లు చెప్పవలయునో యాలోచింపుమని పలికెను. గదా ధరుఁడును గ్రమ్మర నాకథయంతయును విని విమర్శించుచుండెను. రాజభటుల విచా రించు దివసమున వారిని విద్యానగరమునకుఁ దీసికొనిపోయిరి.

అని యెఱింగించి ... .... ... ....

130 వ మజిలీ

అపరాధవిచారణకథ

అయ్యో? అయ్యో? మృగదత్తా! మనరహస్యము వెల్లడియగునట్లున్నది. అన్నన్నా? విధిసంఘుటనము కడు విపరీతముగదా. రామదుర్గనగరమునుండి రాజ ప్రతినిధియంపిన యభియోగ మీదినమే విచారించునఁట అప్పుడే పిలుచుచున్నారు. గురుదత్తాయనియు గుముదాంగదా యనియు గదాధరా యనియు మూడేసిమారులు పిలుచుచున్నారు. ఇప్పుడు మన మేమిచేయవలయును కన్నములో దొరికిన దొంగ చెప్పినమాటల నెవ్వరైన నమ్ముదురా? మన మట్లే దొరకితిమి. ఇప్పుడేమి చేయఁదగినది? రాజభటులు పారిపోవనీయరు. నిన్నుఁ విడిచి మేము పోవఁజాలము. అని భయ మభిన యించుచుఁ బలికిన విని యతండులికిపడి ఆహా ? మనదినము లెంతచెడ్డవి. మనకన్న ముందుగా శనిచారమువచ్చి పీడించుచున్నది కదా. కానిమ్ము. ఏమిచేయుదుము. చంపినఁ