కాశీమజిలీకథలు/ఏడవ భాగము/125వ మజిలీ

125 వ మజిలీ

పద్మిని కథ

రామదుర్గమున కుత్తరమున కొన్ని యోజనముల దూరములో దుర్గమారణ్య మధ్యంబునఁ గొన్ని కోయపల్లెలు గలవు. ఆపట్టణములకుఁ జుట్టును బెట్టనికోటలై యున్నతములైన పర్వతములు పెక్కువలయముగా వెలయుచున్నవి. ఆపల్లెలకుఁ బదియోజనముల దూరము వరకు మహారణ్యమేకాని గ్రామమేదియును లేదు. అందున్నవారిని శబరులనియు, వనచరులనియు, బోయెలనియుఁ గోయలనియుఁ బిలుచుచుందురు. వాండ్రకు నాగరిక మించుకయుఁ దెలియదుకాని అడవి యాకు లతోఁ జాపలు, బుట్టలు, తట్టలు లోనగు నుపకరణము లల్లుటయందు నేరుపు గలిగి యున్నది.

తేనె, పునుఁగు, జవ్వాది, కస్తూరిలోనగు నడవివస్తువులును దామల్లిన బుట్ట లును గాడిదలపై నెక్కించి గ్రామములయందమ్మి సొమ్ము తీసికొని పోవుచుందురు. అమ్మహారణ్యంబునకుఁ దరుచు జానపదులుగాని, పౌరులుగాని యెన్నఁడు పోవరు.. కోయవాండ్రుతప్ప నప్పల్లెలందున్నవని యెవ్వరును యెఱిఁగినవారులేరు.

మృగములబాధ తలంపక కంటకములవెత లెక్కింవక రాళ్ళకస్తి గణియిం పక రాజద్రోహాపరాధభయంబున గురుదత్తుఁడు భార్యయు నహోరాత్రంబు లేకరీతిఁ బయనము సాగించి మారువేషములతో యెట్లో కొన్నిదినముల కాకోయపల్లె జేరిరి.

దారిలో నొక శబరునితో బరిచయముజేసి యాపల్లెవృత్తాంతముఁ దెలిసికొని వానివెంట నాదంపతులా కొట్టిక కరిగిరి. లేనిచో నత్తెరవెరుంగుట దుర్ఘటమే ఆకొండ పల్లెకు నాలుగు దండలను పెనుకొండలు కోటలవలె నొప్పుచున్నవి. ఆనడుమనున్న సమభూమి మనోహర నానాఫలతరులతావృత్తమై తృణకాష్టజలసమృద్దిఁగలిగి యుద్యా నవనమువోలె గ్రాలుచుండెను. కొండలనుండి ప్రవహించు సెలయేరులకుఁ గాలు వలుగట్టి కోయలు తరులతాగుల్మాదులఁ బెంచుచు సస్యములఁ బండించుచుందురు.

ఒకశబరుని వెంట నీదంపతులా కొండపల్లెకుఁ బోయి యందలి వింతల కచ్చెరువందుచు నందుండుటకు నిశ్చయించికొనిరి. వారిభాష స్వభాషయేయైనను వికృతముగా నుండుటచేఁ దెలిసికొనుట దుర్ఘటముగా నుండెను. మొదట. వారింజూచి యాపల్లెలోని వారందరు నాశ్చర్యపడఁజొచ్చిరి. గురుదత్తుఁడు మాటలుగలుపుకొని కొంతసొమ్మిచ్చి వేరుగ నొక పర్ణకుటీరమువైపించుకొని యందు నివసించి కాలక్షేపము చేయుచుండెను. ఒకనాఁడు పద్మిని గురుదత్తునితో మనోహరా! నాకతంబునఁగదా మీకీయిడు ములు వచ్చినవి. ఆగర్భశ్రీమంతులై సమస్త విద్యలం జదివి యుత్తమరూపసంపన్ను లైన మీకు మహారణ్యములోఁ గొండలోయలోఁ గోయలతోఁ గూడికొని గుడిసెలలోఁ గాపురముచేయవలసి వచ్చినది అన్నన్నా ! విధిపరిపాకము ! ఆపాపాత్మునిఁజంపి నేనుఁ గూడ మడసితినేని మీకీకష్టము గలుగునా ? మఱియొక కన్యక౦ బెండ్లియాడి సుఖింతురుగదా అయ్యో ? నామూలమున మీతల్లిదండ్రుల కెడమైతిరి. ఎప్పుడో గొప్పవేడుకతో నత్తవారింటికిఁ బోవలయునని తలంచికొనియుంటి ఏయదృష్టమును పట్టినదికాదు. అడవులలోఁ గాపురము చేయుమని మనకు విధి విధించెను. కాఁబోలు. ఆనీచుఁడు నాకు సందేశము పంపినతోడనే మీకుఁజెప్పి యుశీనరపురంబున కఱిగిన నీయాపదరాక పోవునుగదా ? అని మకని తొడపై శిరంబిడుకొని దుఃఖించుటయు గురుదత్తుం డిట్లనియె.

సాధ్వీ ! సాధ్వీతిలకమగు నీతో నిందు వసియింప నాకేమియుఁ గష్టములేదు. ఈయరణ్యమే యుద్యానవనమైనది. ఈ కొండలు క్రీడాశైలములుగా నున్నవి. కాని నీవు గర్భభరాలసవై పనులు గావింపుచుండఁ జూచి పరితపించుచున్న వాఁడ ఇంటి కడనున్న నిన్నుఁ దలిదండ్రులు నత్తమామలు నరచేతిలోఁ బెట్టుకొని కాపాడక పోవు దురా ? ఎందరుబంధువు లెంతేసి నూడిదలు పంపుదురో ? ఏ ముచ్చటయును లేక కిరాతయువతులతోఁగలసి తిరుగుచుండ నిన్నుఁజూచి నా హృదయము భేదిల్లచు న్నది. కానిమ్ము కాల మొక్కరీతి నుండునా ? వినుము.


శ్లో. సుఖస్య దుఃఖస్య నకోపిదాతా
    పరోదదాతీతి కుబుద్ధిరేషా
    అహం కరోమీతి వృధాభిమానః
    స్వకర్మసూత్ర గ్రధితోహి జంతుః

తొల్లి హరిశ్చంద్రాది నృపతులు పడిన బన్నములువిని కథలను కొంటిమిగాని యథార్థములు. కర్మసూత్రమును మీరినవారు లేరు. ఇంద్రాది దేవతలకు దప్పినది కాదు. దైవమెట్లువంచిన నట్లు జేయఁదగిన వార మంతకన్న మనకేమియు స్వతం త్రము లేదని యోదార్చెను.

ఒకరికష్టమునుగురించి యొకరు పరితపించుచు నొండొరుల నోదార్చు కొనుచుఁ బూర్వచరిత్రలను నుగ్గడించుచు నందున్నకోయబాలురకుఁ జదువుజెప్పుచు వినోదముగాఁ గాలక్షేపముచేయుచుండిరి. మరియు పద్మినికి నల్లికపనియందు మంచి నేర్పరితనము గలిగియుండుటం బట్టి యక్కిరాతులల్లెడి చాపలు, బుట్టలునుజూచి యంతకన్న విచిత్రముగాఁ దానల్లఁజొచ్చినది. దినమునకొక వింతగా నల్లుచు మగ నికిఁగూడనాపని నేరిపినది. వారిరువురుంగలిసి మృగరోమముతోను, నడవియాకులు తోను, కడునద్భుతములైన తివాసులును, చాపలును, పెట్టెలును మంచ ములు లోనగు గృహోపకరణములు అత్యాశ్చర్యకరములైనవి, అల్లి వానిపై వెలలువైచి కోయలకిచ్చి గ్రామములకంపి అమ్మించుచుందురు. ఆవింతవస్తువులు జూచి జానపదులును బౌరులును మూఁగి మూఁగి వేగముగాఁ గొనుచుండిరి. దానం జేసి యాపల్లెలోని వారెల్ల నావస్తువులమ్మి పెద్దగా ధనము సంపాదించుచుండిరి. వారందఱు తమకుఁ బరిచర్య సేయుటతప్ప మఱియొక ప్రతిఫలము వారివలన నాదం పతులు కోరుటలేదు.

అందున్న కోయలెల్ల నాదంపతులను గురువులుగా దైవములుగాఁ బ్రభువు లుగాఁ దలంచి భయభక్తి వినయవిశ్వాసములతో సేవించుచుండిరి. అవ్వనవాసము యౌవనవిలాసములలో నొక వినోదము వారికిఁ గూర్చుచుండెను. పద్మినికిఁ గ్రమం బున నెలలు నిండుచుండెను. భిల్లపల్లవాధరుల నుపచారముల ననుమోదింపుచుండెను. గురుదత్తుండు హృదయంబునఁ బెట్టికొని యామెం గాపాడుచుండెను.

ఒకనాఁడు గురుదత్తుండు వింతయగు నొకతివాసీ నల్లుచు అందులకై మృదు వులగు పిట్టరెక్కలు కొన్ని కావలసి వనచరులం గూడికొని యాప్రాంతారణ్యమున కరిగెను. వలదు వలదు మనము క్షత్రియులముకాము. వేఁట మనకుఁ దగదు నోరు లేని పక్షుల మృగములఁ గొట్టవలదు. అకులతోఁ బూర్తిఁజేసెదనని పద్మిని బోధించు చున్నను వినక వస్తులోభంబునంజేసి అతఁడా అరణ్యములన్నియు దిరిగి తిఱిగి అలసి యొక చెట్టుక్రిందఁ గూర్చుండి యలయికలు తీర్చుకొనుచుఁ బిట్టల రెక్కలకై తోడివారిని నలుమూలలకుఁ బంపెను.

విధి చలపట్టి పట్టినవానినే మొట్టుచుండునుగదా? అంతలోనావృక్షాంతము నుండి యొకపాము నేలకుఱికి అతనిం గఱచి పారిపోయినది. తద్విష విశేషంబెట్టిదో నిమిషములోనే అతండు తెలివిదప్పి నేలంబడిపోయెను. అతనిదాపుననున్న వనచరు లదిచూచి యడలుచు నొకఁడు మందుచెక్కలకై పరుగిడెను. ఒకఁడింటికిఁ బరుగున వచ్చి యూర్పులడరఁ దివాసినేయుచున్న పద్మినింజూచి తల్లీ! తల్లీ! మా అయ్యగారు పాముగరచి నేలఁబడిరని చెప్పుటయుఁ బద్మిని గుండెలు బాదికొనుచు అయ్యో? అయ్యో? యెక్కడరా బాబూ? బ్రతికియుండిరా? హా? దైవమా? ఇంతటితో మమ్ము విడువవా? అని యరచుచు నేలంబడి మూర్ఛిల్లి అంతలోఁ దెప్పిరల్లి భిల్లుఁడా ! యెంత దూరములో నుండిరిరా? మాట్లాడుచుండిరా? నామాట యేమైన జెప్పిరా చెప్పుము చెప్పుము తండ్రీ! మందులకొఱకు మీవారు పోయితిరంటిని. బ్రతికించు మందులున్న వియా? నాయనా ! యెఱింగింపుము నీ వెంటవత్తును నన్నక్కడికిఁ దీసికొనిపొమ్ము. పుత్రా ! అని పిచ్చిదానివలె అడలుచుండ వాఁడు తల్లీ! వారికేమియు భయములేదు మాకొండలలో పాము చెక్కలు చాలఁగలవు. గాలిలేకపోయెనను గంధము రాచిన బ్రతుకఁగలఁడు. రమ్ముఁ పోవుదము. నీవు ఏడువకుము. అని యోదార్చుచు నా కిరాతుఁడా నాతిని గురుదత్తుఁడున్న తావునకుఁ దీసికొని పోవుచుండెను.

ఒకచోట నొక చిన్న మెట్టయెక్కుచుండ అయ్యండజయానకుఁ బ్రసవవేదన యావిర్భవించినది. నేలం జదికిలఁబడి యోరీ? నేఁనిక నడువలేను. కడుపులో నేదియో బాధగా నున్నది నీవు పల్లెకుఁబోయి యాఁడువాండ్రం గొందఱిఁ దీసికొనిరమ్ము. వడిగా రమ్ముఁ అని చెప్పి వానింబంపినది. క్రమంబున నొప్పు లధికమగుచుండెను. ఓదార్చువారు లేరు. భర్త సర్పదష్ఠుడై పడియున్నవాఁడను వార్త వినియుండెను. అట్టి తరి నత్తలోదరి చిత్తమెట్లుండునో యూహింపవలయును.

అక్కుసుమకోమలి ప్రసవాయాసము సైరింపలేక యొడలెఱుంగక నేలం బడి పోయినది. అంతలో నాకాంతా రత్నమున కొక కుమారరత్న ముదయించెను. గాని యా మానవతి యేమియు నెఱుఁగదు. మఱిరెండు గడియలలో నాకిరాతుఁడు కొందఱ నాఁడువాండ్ర వెంటఁబెట్టుకొని అచ్చటికి వచ్చెను. శిశువు వారికిఁ గనంబడ లేదు. తొందరపడి కిరాతస్త్రీలు పద్మినిం బట్టుకొని తుడిచి కట్టులుకట్టి కాచి చెక్కరసము పూసి యుపచారములు చేయుచు నెత్తుకొని తమపల్లెకుఁ దీసికొనిపోయి పండుకొనఁ బెట్టిరి.

పెద్దతడవున కామెకుఁ దెలివివచ్చి హా ! ప్రాణనాధా! హా! మనోహరా ! అని విలపింపఁ జొచ్చినది కిరాత వధూటులూరడింపుచుఁ దల్లీ ! నీవు గన్నపుత్రుఁ డేమ య్యెను నీవు ప్రసవమైతివే మాకు గనంబడలేదని అడిగిన నప్పడఁతి అమ్మయ్యో? నేనేమియు నెరుఁగను. అయ్యాశయు భగ్నమైనదా ! ఔరా ! కాలమహిమ ! పోనిండు. నాభర్తయేడీ? జీవించియున్న వారా? అని అడిగిన వాండ్రిట్లనిరి. అమ్మా అక్కడి వాండ్రింకనురాలేదు. నీకొరకై మేము అడవికి వచ్చితిమి. మేము వచ్చునప్పటికి నీవు వివశవై పడియుంటివి. నిన్ను మోచుకొనివచ్చి చికిత్సలఁ జేసిన బ్రతికితివని యావృత్తాంత మంతయుం జెప్పిరి.

అప్పుడు పద్మిని మిక్కిలి అడలుచుఁ దానుగనిన శిశువు నేమృగమో యెత్తి కొని బోయినదని నిశ్చయించి తచ్ఛోకము హృదయమునంటనీయక పతిపాదాయత్త చిత్తయై యవ్వార్తకొర కెదురు చూచుచుండెను. అంతలో నచ్చటివారలువచ్చి ధైన్య ముతో బద్మినింజూచి చింతించుచు నామెయడుగ అమ్మా ! నీభర్తసకృ దష్టుండగుట విని మందువేరులకై తలయొకదెసకుఁబోయితిమి. మందులందీసికొనిపోయినంత నతండా చెట్టుక్రిందలేడు. అడవియేఁనుగు పాదములచిహ్నములు గనంబడినవి అవి మనుష్యుల నమాంతముగా నెత్తికొనిపోఁగలవు వివశుండగు నతని నాయేనుఁగుదీసు కొనిపోయినది. తల్లీ ! మేమేమియు జేయలేక పోయితిమని దుఃఖింపఁదొడంగిరి.

ఆమాటలవినియా బోఁటియూహచెడినేలంబడి అడలుచుండుటయు నెఱుఁగదు పిచ్చిమాట లాడఁదొడంగినది కొంతసేపు వింతవింతగాఁ జూచుచుండెను. చెంచెతలు మంచిమాటలనూరడించుచు అమ్మా ! నీమగని కేమియు భయములేదు. ఏనుఁగనెక్కి రాఁగలఁడు. నీయొడలు పచ్చిది దుఃఖించినఁ జెడకమానదు మానుము మానుము అని బ్రతిమాలుచుండిరి. వారిమాటలు పద్మినికి వినఁబడవు విపరీతముగా నుత్తరములు చెప్పుచుండును. పూర్వమువలె వారితో మాట్లాడదు పనులుచేయదు. అభి మానంబునఁ బద్యపానములిచ్చి కొన్నిదినంబులామెకు బరిచర్య చేసిరికాని క్రమంబున నామెకు వెర్రియెక్కువైనకొలఁది తప్పుకొని తిరుగుచుండిరి. అమె కుడు చుటయుఁ గట్టుటయు నెరుఁగదు. వెఱ్ఱిదానివలె మాట్లాడుచుఁ గొన్ని నెలలా పల్లెలో నుండెను ఆమె స్వయముగా వండికొనితినుట యెరుఁగదు. ఎవ్వరయినఁ బిలిచి తిను మనినఁ దినును. లేకున్న నుపవాసమేచేయుచుండును. గురుదత్తుని జాడయేమియుఁ దెలియక అతండు చచ్చెనుకా నిశ్చయించి బోయలు పద్మిని నంతగా విమర్శింప మానివేసిరి.

పద్మినియు దన్ను మన్నించువారు లేమంజేసి యొకనాఁ డొక అరణ్యమార్గం బునంబడి నడువసాగెను. పులులకు వెరవదు. చీకటికి జడియదు. ఎండకుజంకదు, వానకు భయపడదు ఆహారసుఖము కోరదు. ఆకులలములు తిని యాకలి యడంచు కొనఁగలదు.

నడుమనడుమ తెలివివచ్చివప్పుడు మనోహరా ? గురుదత్తా నాకీజన్మమునకుఁ గనంబడవా ? ఇప్పుడేవత్తునని పోయితివే యెందైనం దాగితివా ? అని పలుకుచు పెద్దయెలుంగున నోగురుదత్తా ! అని పిలుచుచుండును. ఈరీతిఁ గొంతకాల మున్మ త్తవ్యాపారమున నయ్యడవుల సంచరించి యేబాథం బొరయక యొకనాఁడు ప్రాతః కాలమున కొక పట్టణము జేరినది. అప్పటికిగొంచెము ప్రొద్దెక్కినది. పద్మిని పిచ్చివేషములతో నొక వీధింబడి పోవుచుండెను.

ఆవీధిని రత్నాంగి యను బోగముది తనయింటిముంగల నిలువబడి నీళ్ళుతెచ్చు పనిక త్తెకై యెదురుచూచుచుండెను. ఎప్పటికినిఁబనికత్తె వచ్చినది కాదు. పద్మిని కొక‌ గమ్యస్థానము లేమింజేసి యావీధినిటు నటు మూడుసారులు తిరిగినది. చిక్కి మలినయై వికృతముగా నుండుటచేఁ బద్మిని సౌందర్యము సామాన్యు లకుఁ దేటగాదుకాని నిదానించి చూచిన బుద్దిమంతులకుఁ దెలియఁబడకమానదు. రత్నాంగి పద్మినింజూచి రూపమునకు వెరగుపడుచుఁ దాపునకుజీరి, అమ్మీ ! నీదే యూరు? ఎవ్వరికొఱకిటు పలుమారు తిరుగుచుంటివి. నీ పేరేమి ? నాకొక యుప కారము చేసి పెట్టెదవా ? తప్పుగా గణింపకుమీ ? ఈ కడవతోఁ గడివెడునీళ్ళు తెచ్చి పెట్టెదవేని నీయుపకారము మరువను. అదియే తటాకము. మేము స్వయముగాఁ దెచ్చికొనిన మాకులములో వెలవేయుదురు. అని కడవ నందిచ్చుచు బ్రతిమాలికొన్నది. పద్మిని సహజముగాఁ బరోపకార పరురాలగుట విని ప్రతివచన మేమియు నీయకయే కడవగైకొని తటాకమునకుబోయి స్నానముచేసి కడవతో నీళ్ళుతెచ్చి అమ్మా ! యెక్కడఁ బోయుదును చెప్పుమనుటయు నది తొందరపడుచు సంతస మభినయించి యింటనున్న బిందెలు సద్ది వీనిలోఁబోయుమని చెప్పినది.

విసుగులేక పదికడవలనీళ్ళు తెచ్చి గంగాళములు నిండించినది . దొడ్డిలోని చెట్లకుఁ బోసినది. పలుమారు స్నానముచేసినది. రత్నాంగి యామెను వెఱ్రిదానిగా గ్రహించి అమ్మీ ! నీకుఁ గూడును గుడ్డయు నిచ్చెదను. మాయింట నేపనియుఁ జేయనక్కరలేదు. అనుదినము పది బిందెలు నీళ్ళు తెచ్చి పెట్టెదవా యని యడిగిన నట్లే తెచ్చెదనని తల ద్రిప్పినది.

రత్నాంగి యట్టి పనికత్తెకొఱకు చాల యిబ్బంది పడుచున్నది. కావున నప్పుడు మిగుల సంతసి౦చుచు నామెకుఁ గట్టుకొన మంచిపుట్టములిచ్చి భొజనము పెట్టి పోషించుచుండెను.

పద్మిని పూర్వపుస్మృతిలేక యున్మత్తవికారముతోనే రత్నాంగి మెచ్చునట్లు పనులుచేయుచుఁ గొంతకాలము దానియింటిలోనుండెను. అప్పుడప్పుడు తెలివివచ్చి తన వృత్తాంతము దెలిసికొని దుఃఖించుచు మరణింపవలయునని నిశ్చయించుకొను చుండును. కాని యంతలో నా మాట మరచిపోవుటచే యధాప్రకారము పనికత్తెయై పనులు చేయుచుండెను పాండవులంతవారిని బానిసలనుజేసినవిధి పద్మిని నొక వారాంగనకుఁ బనికత్తెగాఁ జేయుట యబ్బురము గాదు.


మ. ఎట నెవ్వానికి నెన్ని రేల్సుఖముగా * నీ దుఃఖమున్‌ గానివి
     స్ఫుట పూర్వా చరితాత్మకర్మవశతన్‌ * భోక్తవ్యమైయుండునో
     ఘటనాచాతురిఁ ద్రాళ్ళగట్టుచు బలా * త్కారంబుగా వానిన
     చ్చోటికిందోడ్కొనివచ్చి దా నిగుడిపిం * చున్‌దైవమన్నాళ్లొగిన్‌

     అని యెఱింగించి.