కాశీమజిలీకథలు/ఏడవ భాగము/115వ మజిలీ

శ్రీరస్తు

కాశీమజిలీకథలు

సప్తమ భాగము

115 వ మజలీ

మహాత్మా ! యీ యవనధంబు విచిత్ర విషయసూన్యంబగుట నడుగవలసిన విశేషంబేమియుఁ గనంబడలేదు మఱియు విక్రమాదిత్యుని మనుమఁడు విజయభాస్కరుని చరిత్రము వినినది మొదలు నా చిత్తము తదీయ సుగుణాయుత్తమై యున్నది. అతండు కలభాషిణి హేమప్రభలతోఁ గూడికొని యుజ్జయినీ నగరంబు బ్రవేశించి పట్టాభిషిక్తుండయ్యెనని యెఱింగించితిరి గదా !

ఆ రాజపుత్రుని తదనంత రోదంతం బెట్లుండునో వినవేడుక యగుచున్నది. పరోపకారపారీణుండగు నమ్మహానుభాపుండు లోకోపకారకమగు కార్యంబు లేమేమి గావించెనో దివ్యరత్న ప్రభావంబునం దెలిసికొని వివరింతురే యని ప్రార్థించినవిని మణిసిద్దుండు మిగుల సంతసించుచు నా రత్నంబు మ్రోల నిడికొని పూజించి విదితోదంతుండైయబ్బురపాటుతో నౌరా ! నీ వడిగిన విషయంబేదియుఁ జమత్కార కథారహిత౦బై యుండదు. ఏతత్సరిత్రంబు కడు చోద్యంబు సావధాన మనస్కుండవై యాకర్ణిపుము.

వీరసింహుని కథ

సకలసంపత్ప్రభాకరంబగు నుజ్జయినీ పురంబునఁ దేజోభాస్కరుండగు విజయభాస్కరుండు సుజనలోక బాంధవుండై విబుధమిత్రుండై దివ్యప్రభాసంపన్నుడై రాజ్యంబు గావింపుచు నొకనాఁడు కొల్వుకూట మలంకరించియున్న సమయంబునఁ బ్రతీహారిజనుదెంచి జోహారుజేయుచు దేవా ! దూరదేశ వాసియగు భూసురుం డొకండు ఇరువుర శిష్యులతో వచ్చి గోపురాసన్నవేదిక యందున్నవాఁడు. భవద్దర్శ నాభిలాషి‌యై యరుదెంచెనఁట. దేవరకు విన్నవింపుమని కోరుకొనియె. సెలవేమి యని అడిగిన నతండు బాలిశా ! ఎన్నిసార్లు జెప్పవలయును. బ్రాహ్మణుల రాకకు సెలవవసరము లేదని నియమింపలేదా ? పో? పొమ్ము వేగఁ బ్రవేశ పెట్టుమని యాజ్ఞాపించెను

ఆ ద్వారపాలుఁడు పోయి వెండియువచ్చి స్వామీ ! యాతండిందురాఁడఁట. దేవరతో నేదియో చెప్పుకొనునఁట. అక్కడకే దయచేయుమని ప్రార్థించు చున్నాఁడని యెఱింగించిన నారేఁడు దిగ్గున లేచి మొగసాలకరిగి యందున్న విప్రునకు నమస్క రించుచు ఆర్యా ! మీరే కార్యమునకై వచ్చితిరి? సభకేల రారైతిరి? మీ యభీష్ట మెరింగింపుఁడని అడిగిన నా భూసురుం డాశీర్వచన పూర్వకముగా నిట్లనియె.

దేవా ! మాది దక్షిణదేశము. నా పేరు సుముఖుడందురు. వాస్తుదేవతా భూయిష్టమగు కోటలోనికి వత్తునేని వాస్తుదేవతలు ముందరి కార్యమునకు విఘ్నములు చేయుదురు. అందులకై లోపలకి రాలేదు. నేను సమస్త విద్యలం జదివితిని. అంజన ప్రభావంబున నెక్కడ నిక్షేపములున్నదియుం జెప్పఁగలను. వాని నరయుటకై గిరినదీ పక్క ణారణ్య భూములఁ దిరుగచుందును. యీనగరమునకు దక్షిణముగా నున్న యరణ్యములోని పర్వతకూటమున మర్రిచెట్టుక్రింద బెద్ద నిక్షేపమున్నది దానిఁ పరిశీలించి వచ్చితిని. భూతభేతాళములు దానింగాచికొని యుండును. దేవర పట్టమహిషితోవచ్చి ఖననప్రారంభము గావింతురేని నిక్షేపము లభింపఁగలదు. మంత్రబలంబున భూత భేతాళములు విజృంభించకుండఁ గట్టివైచెదను. అందు దేవరకు సగబాలు బంచియిచ్చెదను. ఇక్కార్యంబునకు సహాయము గావింప దేవరం బ్రార్ధించు చున్నవాఁడ నిదియె నా యభీష్టమని తెలిపిన విని నవ్వుచు విజయ భాస్కరుండు ఆర్యా! మీ నిక్షేపములో నాకు సగమీయ నక్కరలేదు. అంతయు మీరే తీసికొనిపొండు. మే మెప్పుడక్కడకు రావలయునో చెప్పుఁడు. వచ్చి మీరు చెప్పినట్లు చేయుదుమని పలికిన విని యా బ్రాహ్మణుండు మిగుల నభిన౦దించుచు దేశకాలము విశేషంబుల నిరూపించి చెప్పినాగిరి శిఖరంబున కరిగెను.

అంత నిరూపింపఁబడిన దివసంబున విజయభాస్కరుం డుచిత పరివారముతోఁ గూడికొని కలభాషి నందలం బెక్కించి తను దురగారూఢుండై బయలు వెడలి మెల్లిగ నా గిరిపరిసరథరణి కరిగెను.

వారి రాక వేచి యందున్న యాపారు శిష్యులిద్దరు పరివారము నంతయు నందే యుండ నియమించి యందలములతో రాజు భార్యను రాజును మాత్రము శిఖరంబునకుఁ దీసికొని పోయిరి. ఆ కూటంబున నా జన్నిగట్టు మర్రిచెట్టుక్రింద నగ్ని వేల్చుచు విజయభాస్కరుని నమస్కారము లందుకొని వారి నందుఁ గూర్చుండ నియమించి శిబివాహకుల గొండ క్రిందికింబోవు నట్లాజ్ఞాపించెను.

రాజును రాజు భార్యయు శిష్యులును సుముఖుండు తప్ప నందెవ్వరు లేరు. పరిజనమంతయు దూరముగా నున్నది. అప్పుడా సుముఖుఁడు లేచి రాజదంపతులఁ దూరుపుముఖముగా నిలువంబెట్టి కన్నులు మూసికొమ్మని చెప్పి ముకుళిత నేత్రులై యున్న యారాజదంపతుల హఠాత్తుగాఁ దన దేహమును బెంచికొని వారి నిద్దరఁ జెరి యొక బుజముపై నిడికొని శిష్యులు వెంటరా వియద్గమంబునఁ దక్షిణముగా నెందేనిఁబోయెను. పర్వతప్రాంతమున వసించియున్న విజయభాస్కరుని పరిజనులు సాయంకాలము దనుక నందుండి రాజదంపతులం దీసికొని వచ్చుటకై యందలముతో శిఖరదేశమున కరిగిరి అందెవ్వరి జాడయుఁగనంబడ లేదు. మఱ్ఱిచెట్టు క్రింద వేదిక మధ్యమున నగ్ని బ్రజ్వరిల్లుచున్నది. అప్పుడు మిక్కిలి తొట్రుపడుచుఁ గొండగుహలు ప్రతిధ్వనులిచ్చునట్లు మహారాజా? విజయభాస్కరా? అని కేకలు వేయఁ దొడంగిరి. అతని ప్రతిధ్వని‌ యే మూలనుండియు వినక పరిజనులు హాహాకారము సేయుచు అయ్యో? ఆ బ్రాహ్మణుఁడెవ్వఁడో మాయావి రాజదంపతుల నేమి జేసెనో తెలియదు. తెలియక మోసపోయితిమి. అందరని దూరముగా బొమ్మనిన నేమోయనుకొంటిమి హా! మహారాజా ! ధర్మశీలా! హా పరోపకారనిరతా ! అని దుఖించుచు నా పర్వతమంతయు వెదకి యరణ్య భూమును పరిశీలించి యత్యంత దుఃఖాక్రాంత స్వాంతులై నాలుగు దినములకు దిరుగ నగరముజేరి మంత్రుల కత్తెరంగెరింగించిరి.

అప్పటికి రెండు దినములక్రింద హేమప్రభ ప్రసవమై మగశిశువుం గనినది. మహారాజుగారి వార్తకొరకుఁ బ్రజలెదురుచూచు చుండిరి. నిజమైన వార్తవినిమంత్రులు విచారసాగరమగ్నులై పురిటిదినములు పదియు దాటుదనుక నా కథ హేమప్రభ కెఱుంగనిచ్చిరికారు. నలుమూలలకు రాజద౦పతుల వార్తఁదెలిసికొన సమర్థులైన వీరభటులఁ బెక్కండ్రఁ బంపిరి.

హేమప్రభయుఁ బదొకండవ దివసంబున మంత్రుల వలన భర్తృప్రవాస ప్రకారంబువిని యడలుచు నొడలెఱుంగక మూర్ఛ మునిగినది. విజయభాస్కరుని తల్లియు నావా ర్తవిని యుల్లము భేదిల్లఁ తల్లడిల్లుచు గుమారుని గుణముల నగ్గించి యతండు దైవబలసంపన్నుఁడు శత్రువుల బరాభవించి యెట్లో రాగలడని కోడలి కుదుట గరపుచు దేశమరాజకము గాకుండ రాజ్యతంత్రము లన్నియు హేమప్రభ యనుమతిని మంత్రులు జూచునట్లుగా నియమించి తదన్వేషణమునకై మిక్కిలి రొక్కము వ్యయ పరచుచుండెను.

హేమప్రభకు బొడమిన పిల్లవానికి నాకార లక్షణములు పరీక్షించి విద్వాంసులు వీరసింహుఁడని పేరు పెట్టిరి.

గీ. చేరలకుమీరు కన్నులు బేరురంబు
    తళుకు జెక్కులు ముద్దులు గులుకు మొగము
    దీర్ఘ భాహులు గల్గి యెంతేని వింత
    కాంతిఁ జూపర కద్భుతఁ బ్రాంతిగొలుప.

వీరసింహుడు దినదిన ప్రవర్థమానుండై సింహకిశోరము భాతిఁబరాక్రమ సాలియై విజృంభించి యధాకాలమున నుపాధ్యాయులవలన విద్యల నభ్యసించుచు అచిరకాలములో అఖండకళానిపుణుండై విరాజిల్లెను.

హేమప్రభయు మంత్రులు గావించు రాజతంత్రముల స్వయముగా విమర్శించుచు మంచి చెడ్డల నిరూపించి ధర్మలోవము గాకుండఁ బూర్వఖ్యాతి సెడకుండఁ బ్రకృతిజనంబులు స్తుతియించునట్లు రాజ్యంబు గావింపుచు రాజద౦పతుల భూమండల మంతయు వెదకి తీసికొని వచ్చునట్లు గొప్ప ప్రయత్నము గావింపుచుండెను.

అచ్చేడియ యొకనాఁడు ప్రతిప దాయత్తచిత్తయై ధ్యానించుచుండ మంత్రులెద్దియో పత్రిక నామెయొద్దకుఁ బంపిరి. విప్పి దానింజదువ నిట్లున్నది.

రాజ్ఞీ ! వీరసింహునకుఁ బితృప్రవాస ప్రకారఁ బేమియు దెలియనీయఁగూడదని నీవు మా కాజ్ఞాపించితివి గదా? నీ యానతి ననుసరించి అట్టివారిం గట్టిగా శిక్షింతుమని మేముప్రకటించి యుంటిమి. తచ్చాసనంబునకు వెరచి యెవ్వరును యువరాజుగారి కత్తెరంగెఱింగించి యుండలేదు. నేఁడొక విదేశభూసురుండు విద్యాలాలసుండగు వీరసింహునింజూడ విద్యాశాలకఱిగి యుపాధ్యాయులు వలదని సంజ్ఞలు సేయుచుండఁ దెలిసికొనలేక మాశాసనము మన్నింపక వీరసింహునితోఁ బ్రసంగించుచు నీక్రింది పద్యములు నుడివెను.

గీ. విక్రమాదిత్యకులరత్న ! విపులయత్న
    తరణిసమతేజ! యర్దిమందారభూజ
    విజయ భానుతనూజ ! యో వీరసింహ !
    స్వస్తియగు నీకు భూలోక సార్వభౌమ.

చ. వనజహితుండు నాఁదగు భవజ్జనకుండు విదేశవాసియై
    చనఁ దిమిరంబు గ్రమ్మికొనెఁ జారులు చోరులు మీరిలోకపీ
    డన మొనరింపఁ దద్వ్యధ లడంచె గదా? మెఱుంగు చెల్వమీ
    జనని హితంబుగోరెడు ప్రజాతతి యింత త్వదాధిపత్యమున్.

గీ. భాస్కరునిరాకఁగోరు నీ ప్రజలు తత్స
    మాన తేజఃప్రదీపుఁడవైన నీ మ
    హోదయస్పూర్తిఁ బరితుష్టి నొందుచుండి
    రవని బాలింపు లోకబాంధవుఁడ వగుచు.

ఆ పద్యములువిని యందు రెండవ పద్యమునందలి అర్థమును విమర్శించి వీరసింహుఁడౌరా ! కదానిమెఱుఁగు చెల్వయన మాతల్లి హేమప్రభయని సూచించు చున్నది. విజయభాస్కరుఁడు మాతండ్రియా ? అతండు ప్రవాసమరిగినట్లు చూచించుచున్న దేయని తలంచుచు నావిప్రునితో మాతండ్రి వృత్తాంత మీరేమి యెఱుఁగుదురో చెప్పుమని యడిగిన అతండు సర్వము నివేదించెను.

ఆ కథ విని రాజపుత్రు డాశ్చర్యసంభ్రమ వివశుఁడై యొక్కింత తడ వాలోచించి యొజ్జల మొగము జూచుచు నీ పారుండు చెప్పిన కథ యదార్థమా? అని యడిగిన వారేమియు మాటాడక‌ మూగలవలె నూరకొనిరి.

అంతలోఁగొందరు రాజపురుషులా విధమెరింగి త్వరితముగా వచ్చి యావిప్రుం బట్టికొని కట్టి తీసికొనిపోవుచుండ నాబ్రాహ్మణుఁడు మొర పెట్టెను. రాజపుత్రుఁ డడ్డము వచ్చి కట్టులు విప్పించి వారి నదలించుచు వీని అపరాధమేదియో చెప్పుఁడని యడిగిన వాండ్రు అయ్యా! ఇది మంత్రిశాసనము ఈతడు కఠినశిక్షకుఁ బాత్రుఁడని చెప్పిన నితండు చేసిన తప్పు చెప్పక తీసికొనిపోవనీయనని గట్టిగా నిర్భంధించెనట. కింకరులు భయపడుచుండ నందున్న యుపాధ్యాయులు నిజమంతయుఁ చెప్పి వేసిరట. అప్పుడు మీబిడ్డఁడు ఛీ! ఛీ! మా మంత్రులింత యవివేకులా? దేశాంతరగతుడైన ఱేనిఁ దీసికొని రాలేక‌ తమ పట్టణములో సాధుజనములపైఁ బ్రతాపములు జూపుదురుకాఁబోలు ఓహో ? వీరి రాజ్యతంత్రములు స్తుతిపాత్రములుగానున్నవి. నాకీవార్త నిన్నినాళ్ళు చెప్పక దాచినందులకు వారు శిక్షార్హులు ఈ భూసురుఁ డర్చనీయుఁడు అని పలుకుచు నాభూసురునకు గానుక లిప్పించి మమ్ముదనయొద్దకుఁ దీసికొనిరమ్మని యా రాజభటులు బంపెను.

మీకుమారుం డిపుడు సర్వకళాపూర్ణుండై పూర్ణిమాచంద్రుడు వోలె విరాజిల్లు చున్నవాఁడు. అతనికి ధనుర్వేదమునం దసమానప్రజ్ఞ కుదిరినది అతం డేమి దలఁచికొనినను సాగకమానదు. మమ్ము శిక్షింపవలయునని తలంచి యున్నవాఁడట. దేవీ? యనుగ్రహించి కుమారునికి గోపోపశమనము గావింపుము. అట్టిశాసనము నీయాజ్ఞ చొప్పునఁ గావించితిమి. కాని మేము స్వతంత్రించి చేయలేదు. రక్షింపుము నీకు నమస్కారము.

అనియున్న మంత్రులు వ్రాసిన పత్రికం జదివికొని హేమప్రభ మంత్రుల కభయప్రదాన పత్రిక పంపి కుమారుం దీసుకొని రమ్మని పనికత్తెలఁ బంపఁబోవు సమయంబునఁ గుమారుండే తల్లిం జూడవచ్చుచున్న వాఁడను వార్త యొక దాదివచ్చి చెప్పినది.

రాజపుత్రుఁడు విషాదమే దురహృదయుండై వినీత వేషముతో అంతిపురి కరిగి తల్లికి నమస్కరించెను. ఆమె కన్నీటిధారచేఁ బుత్రుని శిరంబు దడుపుచు అక్కునం జేర్చుకొని దీవించినది.

మ. జననీ! యేమిటి కిన్నినాళ్లు వగఁబ్రచ్ఛన్నంబు గావింతు మ
     జ్జనకోదంతము దండ్రిలేడనియె నిచ్చన్‌ గుందుదున్‌ రాజు నం
     జనమంచున్ ధనమంచుఁ బారుఁడు దురాచారుండు గొంపోయెనే
     వనికిన్ సత్యము జెప్పుమమ్మ తగఁ ద్వార్తల్‌ విమర్శించెదన్‌.

అయ్యో తల్లీ? నాకు బుద్దివచ్చి యెనిమిదేండ్ల యినది. అప్పుడే నాకీకథ యెఱింగించిన నీపాటికి మా తండ్రిం దీసికొని రాకపోవుదునా అక్కటా! యెవ్వరి నడిగినను మా తండ్రి లేడనియే చెప్పిరి. కాని ప్రవాసము దీసికొని పోఁబడెనని యొక్కండును జెప్పకపోయెను. ఫై పెచ్చు చెప్పినవానిని శిక్షింతుమని శాసనము జేసితిరట. ఆహా ! యెంత చోద్యము. అని యడిగినఁ గుమారునికిఁ దల్లి యిట్లనియె.

నాయనా ! ఈ వార్త నీకెరింగించిన వగతువుకాని నీవేమి జేయఁగలవు. అందులకై అట్టి శాసనము జేసితిమి. ఇందు మంత్రుల తప్పులేదు. వినుము మీతండ్రి మరణమనిన వెరవరు. దేహమును దృణముగాఁ జూచుచుందురు. ఎవ్వడో మాయావి బ్రాహ్మణ వేషంబున వచ్చి నిక్షేపమున్నదని నెపముపన్ని తీసికొనిపోయెను. మీ పెద తల్లి కలభాషిణి తొమ్మిదిమాసములు నిండియున్నది. యంతఃపుర కాంతులు వలదనుచుండ వినక యందల మెక్కించి తీసికానిపోయిరి. వాఁడు బ్రాహ్మణుఁడు కాడు రాక్షసుడు. మా యవ్వకు సోదరుఁడు రక్తాక్షుఁడై యుండును. నారాక విని కోపించి మీతండ్రి నెత్తుకొని పోయెను. వాని నివాసము పాతాళ లోకమున కడుగుననున్న తలా తలము అక్కడకుఁ దీసికొనిపోయి యా దంపతుల దాచియుండును. వారిం జంపుటకు వానికి సామర్థ్యము లేదు. మీతల్లిదండ్రులు జీవించియున్నవారని నాకు దృఢమైన నమ్మకముగలదు. ఎప్పటికైనఁ దప్పించుకొని రాఁగలరని స్వప్న మూలమునఁ దెల్లమైనది. నీవు విచారింపవలదని బోధించిన విని వీరసింహుండు అమ్మా ! మా పెత్తల్లి‌యుం బోయెనా? అయ్యో? ఆమెప్రసవమై మగవానిఁగనిన నాకన్న యగునా, తమ్ముడగునా, చెప్పుము అనుటయు నామె కన్నీరుగ్రమ్మఁ తండ్రీ నీకు నన్నయే యగును అని యుత్తరముజెప్పినది.

అప్పుడతండు అమ్మా ! గతమునకు వగచినఁ బ్రయోజనములేదు వారు పాతాళముననున్నను స్వర్గముననున్నను వెదకి తీసికొని వచ్చెద నన్ననుపుము దృఢనిశ్చయునకుఁ గార్యసాఫల్యముగాక మానదు. అని యడిగిన హేమప్రభ చాలు జాలు పట్టీ! ఇట్టి యూహలెప్పుడును జేయకుము వారే రాఁగలరు. పాతాళమునకు మనష్యులుపోవఁ జాలరు. రాజ్యభారము వహించి ప్రజలం బాలింపుము. పిచ్చిమాట లాడకుమని బోధించిన నతండు ఆత్మగతంబున నోహో ? ఈమెతోఁ జెప్పిన సమ్మతింపదు. చెప్పకుండఁ గనే పోవలయునని తలంచి తల్లి మాటకంగీకరించు వాఁడుబోలె నభినయించుచు ననుజ్ఞ పుచ్చుకొని నిజనివాసంబునకుఁ బోయెను.

తమవారు పాతాళలోకముననున్నవారని వినినదిమొదలాలోకమునకు మార్గ మెట్లని యాలోచించుచుఁ బండితుల నడుగుచు గ్రంధముల విమర్శింపుచుండెను.

శో. ఏతత్తు నాగలోకన్య నాభిస్థానే స్థితంపురం
    పాతాళమితి విభ్యాతం దైత్యదానవసేవితం.

నారదుండు మాతల్లిందీసికొని వరుణలోకము మీదుగాఁబాతాళ లోకమున కరిగినప్పుడా యా యా లోకవిశేషంబులు శ్రీమహాభారతంబున దెలుపఁబడియున్నవి. వానిం జదువుకొని వీరసింహుడు సముద్ర మధ్యమున దుమికినఁ బాతాళము గనంబడు నని నిశ్చయించుకొని యట్టి సన్నాహము గావించుచు నొకనాఁడు వేకువజామున నెవ్వరికిం దెలియకుండ బయలువెడలి దక్షిణాభిముఖుండై పోయి పోయి కొన్ని దినంబులకు సముద్రతీరము సేరెను. అప్పటికి జాముప్రొద్దుమాత్రమే యుండెను.

సముద్రమును జూచి యతండు వెరగుపడుచు నాహా ఈ మహాసాగరమును సంసారముతో విద్వాంసులు పోల్చియున్నారు. ఈతరంగములవలె నందు సుఖదుఃఖములు పరంపరలు వచ్చుచుం బోవుచుండును. ఇక్కల్లోలము లొకక్షణమైన నేకరీతినిలువవు ఒక్కొక్కటి కొంతపొడవున పైకిలేచి కొంతదూరమువచ్చి తిరిగి యడంగిపోవును.వేరొకటి దానంజనియించి యింకొకదానికి జనపహేతువగు చుండును. ఇంచుకయు గాలి లేకున్నను నీతరంగంబు లింత ఘోషముతో వెల్లువలుగా నెగయుచుండుట కేమికారణమో నిజమెఱింగినవారులేరు.

ఇది యరణ్యదేశము. ఓడ యేదియుం గనబడదు. సముద్రాంతరంబున కెట్లు పోవువాఁడనో తెలియదు. అని యాలోచించుచు నా రాజపుత్రుండు తత్తీరదేశమున నడచుచుండెను.

సముద్రుండతిధికిఁ బార్యమిచ్చుచున్నవాఁడో యన జిన్నయల లతని యడుగులం గడిగి వెనకకుఁ బోవుచుండును పర్వతములవలె బొంగివచ్చు తరంగములకు వెరచి యతండొడ్డుదెసకుఁ బరచుచుండనవి యందే యణంగుచుండును. వేరొకటి చిన్నదియని నిర్లక్ష్యముగా నడువ దానికింకొకటి తోడుపడి మెల్లగావచ్చి కంఠదఘ్నమై యతని జలకమాడించుచుండును.

ఒక్కొక్క తరంగమున గంపతోఁ బోసినట్లు శంఖములు గవ్వలును గుమ్మరించుచుండును. అట్టి వింతలం జూచుచు నతం డతివినోదముగా నాసముద్రతీరమున నడుచుచుండ నొకచో సద్యోగతాసువగు చేపయొకటి తరంగముల రాయిడి నతని యడుగున మ్రోలఁబడినది. రత్నాచ్ఛాదితమగు శుభ్రాంశుకముభంగి మెరయుచున్న యామీనుంజూచి యతండు వెరగుపడుచుఁ దనచేతినున్న కత్తికొనఁ దదురగోళంబు ఛేదించి నంత నద్భుత ప్రభాపటల విరాజితమగు రత్న మొండు గన్నుల పండువు గావించినది.

అబ్బురపాటుతో దానింగైకొని నీళ్ళచే గడిఁగి పరిక్షించుచు నిది దేవతామాణిక్యమువలెఁ బ్రకాశించుచున్నది. సముద్రమునకు రత్నాకరమని పేరుగలిగి యున్నది గదా ! దీనిం జేపలుమ్రింగియుండ వచ్చును కాదు కాదు ఇది మండనము జేయబడినట్లు గురుతులు గనంబడుచున్నవి. నాగలోకములో దివ్యమణులున్నవని ప్రసిద్ధిగాఁ జెప్పికొందురు. పాతాళమునకు సముద్రమునుండి మార్గమున్నట్లు నిశ్చయింపవలసినదే. ఇది నాగకన్యలు ధరించుమండనము నాకిది శుభసూచకమని తలుచుచు రంధ్రములున్న యామణికి త్రాడుగ్రుచ్చి మెడలో వైచికొనియెను. అది యతని యురమున మిక్కిలి ప్రకాశించినది. యేమిటికో ప్రమాదమున జేయిజారి యదినేలం బడిన నతని కన్నులకుఁ గనంబడినదికాదు.

అయ్యో ? నాకీరత్నంబు ప్రసన్నమై తిరోహితమైనదేమి ? నే నేమియపచారము గావించితిని? ఎవ్వరి నిందించితిని. ఇట్టి మణి ధరించుటకు నేనర్హుండగానా? మెడలో వైచికొనుటతప్పా ? అగును బూజింపవలసినది తాల్చుట తప్పేయని పరి పరిగతులం దలంచుచు నా ప్రాంతమందుఁ జేతులతోఁ దడిమి వెదకెను. ఒకచోట నతని చేతికిఁ దగులుకొని కన్నులపండువ గావించినది. అతండొండు రెండుతేపలారతనంబును విడిచి పట్టుచు దాని మహిమ తెలిసికొని యోహో ? నిక్కము గ్రహించితి ఇది మేనికిఁదగిలిన దృశ్యమగు లేనిచో నదృశ్యమగును. దీనింధరింప నేనును నొరులకు కనంబడును. ఇది మంచిసాధనమేయని తలంచుచుఁ బరమానందముతోఁ బృథు గుణంబున దాని గట్టి మెడలోవైచికొని యాతీరమున నడుచుచుండెను.

కొంతదూరమఱిగిన నంత నొకచోట సముద్రములోనికిఁ ద్రోసికొనిపోవ తిన్నెయొకటి గనంబడినది. దానిపైకెక్కి నడచుచు వీరసింహుఁడౌరా ? యీభూమి యింత కఠినముగానున్నదేమి ? సైకత చిహ్నములులేవు. లంకభూమియుంగాదు ? రాతినేలయుంగాదు. వింతగా నున్నది సముద్రతీరమున నిట్లుండుగాబోలునని యంచునకుఁ జేరవలెనని వడిగా నడుచుచుండెను.

కొంతసేపటికి కదలుచున్నట్లు పొడకట్టినది. భూకంపమని మొదట నిశ్చయించి తరువాఁత దీరమునకు దూరమగుచు నదియొక జలజంతువని తెలిసికొని యతండిట్లు తలంచెను. ఆహా ! విధివియోగములు కడుసుచిత్రములుగదా ! ఇది తాబేలై యుండవచ్చును. దీనిం దీరమును జేరియుండుటచే నేలయే యనుకొంటిని. ఇప్పుడిది మహావేగముఁగా బోవుచున్నది. కమఠరూపుఁడైన శ్రీహరియే నన్నె త్తికొని పోవుచున్నాఁడు. ఇఁక నాసంకల్ప మీడేరఁగలదు. ఇది సముద్ర మధ్యమునకుఁ బోయి మునుఁగును. నేనును మునిఁగి పాతాళలోకమున కరుగుదును. నాకు దైవ మనుకూలుఁడై యున్నట్లు తోచుచున్నది లేకున్నఁ ద్రిలోకాశ్చర్యకరమగు దివ్యమణిం దెచ్చి యామత్స్యంబు నాపాదములమీదఁ బడవిడుచునా ? అని యత్యంత సంతోషముతో దలంచుచుఁ బరమేశ్వరువి దయకు స్తోత్రములు జేయుచుఁ బెన యోడ మీదం బలె నతండు నిర్భయముగానందు విహరింపుచుండెను. అంతలో బద్మినీకాంతుడస్తాచల మలంకరించెను. క్రమంబునఁ పికటులు నలుమూలలు వ్యాపించినవి. అప్పు డంతా కమఠవృష్టంబున వసించి కన్నులుమూసికొని ధ్యానించుచు నారాత్రి నిద్రబోలేదు మరునాఁడుదయమునఁ గన్నులువిప్పిచూడ నాతాబేలొక యొడ్డునఁ జేరియున్నది. అందుగల వృక్షలతాగుల్మాదు లతనికి నేత్రపర్వముగావించినవి. అప్పుడా రాజకుమారుం డౌరా ! నేను సముద్రాంతరమున మునుఁగుదమనుకొన్న నది మరల తీరమునకు దెచ్చినది ఇది యే దేశమో తెలియదు. ఒడ్డు గోడవలె నుండుటచే నెక్కుటకు శక్యముకాదు. దూరము చూడ నిదియొక పర్వతమువలెఁ గనంబడుచున్నది. పైకెట్లు పోవువాఁడనని యాలోచించుచు నాదెసఁబరిశీలించుచుండెను.

అప్పుడొక అడవిపంది యాగట్టుపైనుండి నీటిదెసఁ దొంగిచూచి దిగవలయునని ప్రయత్నము చేసినది నూయివలె నుండుటచే శక్యమైనదికాదు. అప్పుడది యిటు నటు తిరిగి తనదలష్టాగ్రంబున నేల విరజిమ్ముచు గునపముతోఁ ద్రవ్వినట్లు పొడిచి పొడిచిసోపానములు చేసికొని యాసముద్రములో దుమికి జలక్రీడగావింపఁదొడంగినది.

రాజపుత్రుఁ డవ్వింత కచ్చెరువందుచు మెల్లనదిగి యదిగావించిన మెట్లవెంబడిని పై కెగబ్రాకెను. అతం డొడ్డుపైకెక్కి తానెక్కి వచ్చిన కూర్మమము జూడ నది యంతలో సముద్రమున మునిఁగినది. ఆ తాబేలును దైవమేయని తలంచి యతండు స్తుతించుచు అటఁగదలి కొంచెముదూరము నడిచినంత సింహశార్దూలాది మృగ భయంకరమైన యొక యరణ్యము గనంబడినది. అయ్యడవియందు నడుచునప్పుడా రాజమారుడు భగవంతుడు తనకు సహాయము గావించెనని సంతసించుచు మధ్యాహ్నము దనుక నడిచి అయ్యడవి కంతము గనంబడమి గమనాయాసమున వాయ నొక చెట్టునీడ విశ్రమించియుండ అచ్చటికొకసింగం బరుదెంచి యందె విశ్రమించినది.

తన్ను జూచి బెదరక పండుకొనియున్న యాకేసరిం జూచి వీరసింహుఁడు వెరగుపడుచు నిది పెంపుడు మృగమా? కానిచో నిట్లు నాచెంత నిలుచునా యని తలంచి ఓహో ? తెలిసికొంటి నిమ్మణిధారణంబున దీనికి నేను గనంబడలేదు. దానం జేసి నిశ్శబ్దముగా నిందుబండుకొన్నది. కానిమ్ము, ఖడ్గహస్తుండనైన నన్నిది యేమి చేయఁగలదు. దీనిపై కెక్కి చూచెద గుఱ్ఱమువలె నడిచిన నుపకారమే యగు కానిచో మడియఁజేసెదనని తలంచి యది లేచి నిలువంబడి యెక్కడికో పోవయత్నించు సమయమున నుపాయముగా దానిపై కెగసి కూర్చుండి నడుము కాళ్ళతో అదిమిపట్టి కేసరముల గట్టిగాఁ బట్టుకొని యదలించెను.

అప్పుడా పెనుమెకంబు నాకంబు విరిగి మీఁదబడినట్లు వెరచుచు నెఱుకలు గలదివోలె నెరిగి‌ యెరిగి శరవేగంబునఁ బారఁదొడంగినది. వృక్షశాఖగుల్మాదుల నవలీల లంఘించుచు నాపంచాస్యంబు యామద్వయకాలం బేకరీతి బరుగిడి దారుణ కాంతారములు పెక్కులు దాటి యొక మేటిగిరి శృంగాటంబున నిలిచి గప నశ్రమచే నలసివివశయై నేలంబడినది.

అప్పుడా వీరసింహుండు తన్నుబునర్జాతులగాఁ దలంచి పుడమికి దిగి మేనెల్ల జెమ్మటల గార నిట్టూర్పులు నిగుడించుచు నొడలెఱుంగక పడియున్న ----- ర్యక్షమును జూచి జాలిపడి పాదములొత్తుచు నాకులచే విసరుచు సేదదీర్చఁ దొడంగెను.

అప్పటికి రెండుగడియల ప్రొద్దున్నది. అతండు ప్రొద్దు దిక్కు మొగంబై పరిశీలింపుచుండ నాసింగం బట్టేలేచి రివ్వున నెగిరి యొక మూలకుఁ బారిపోయినది. ఆవింతజూచి అతండు ముక్కుపై వ్రేలిడు కొని యౌరా? ఈమహారణ్య మీమృగరాజం బల్పకాలములో దాటించినది. పాదచారినై సంవత్సరముకైనను దీనిం దాటఁజాలను. రమణీయోద్యాన భాసురమగు నీగిరికూటము జేరుటకును నాకు శక్యమా? పెక్కేల శ్రీమన్నారాయణుని యాద్యావతారములు నాలుగును నాకీ యుపకారము గావించినవి. మత్స్యంబు మణిహార మర్పించినది. కూర్మంబు సాగరంబు దాటించినది వరాహంబు గట్టెక్కించినది. సింహంబు మహారణ్యంబు దాటించినది. ఇది యేదేశమో తెలియదు ఓహోహో దక్షిణముగాఁ జూచిన గొప్ప పట్టణము నేత్ర పర్వతము గావించుచున్నది మెరపుతీగెయంబోలె వీఁటిచుట్టును గాంచనప్రాకారము కాంతులీనుచుఁ గన్నులకు మిరిమిట్లు గొల్పుచున్నది. భూలోకనగరము లిట్టి శోభ గలిగియుండునా?

ఈరాజధానికీ శైలము క్రీడాశైలము కాబోలు. ఇందలి భవనములు విచిత్రరత్న ప్రభాయుతములై కన్పట్టుచున్నవి. ఈపట్టణ రాజమును జూచి కన్నులకలిమి సాద్గుణ్యము నొందఁ జేసికొనియెదను భానుండపరగిరిపరిసరము జేర్చుచున్నవాఁడు నేఁటి నీధాత్రీ ధరకూటమున వసియించి ఱేపు పోయెదం గాకయని తలంచి యందు నలు మూలలు తిరిగి యొక క్రీడాసౌధము యందలి యఱుగుపయిం గూర్చుండి యందలి వింతలం జూచుచుండెను.

ఇంతలోఁ జీకటి‌ పడినది తన మెడలోనున్న రత్నహారము కాంతుల పండు వెన్నెలను గాయుచుండ వీక్షించి యదివస్త్రచ్చన్నము గావించి తలక్రిందనిడుకొని పండుకొనియెను. అప్పుడాప్రాంతమున నిద్దరుపురుషులిట్లు సంభాషించుకొనిరి.

నరాంతకుఁడు -- దుర్ముఖా! నేను రాననుచుండ బలవంతముగా నేకాంతయు జెప్పదనని నన్నీత్రికూటమునకు తీసికొనివచ్చితివి అదియేదియో చెప్పుము.

దుర్మ -- మిత్రమా! నరాంతక ! అస్మత్స్యామి పుత్రుడగు విద్యుజ్జహుఁడు విభీషణమహారాజు గారి పుత్రిక చంపకను వరించి యున్మత్తుండై తిరుగుచున్నాడను వార్త నీవు వినియంటివా?

నరా - వినలేదు ఆదుర్మతికి భర్తృదారిక నిత్తురా? వాని పిచ్చియేకాని లాభములేదు రావణబ్రహ్మతోనే వాని బాంధవ్యము తెగిపోయినది.

దుర్మ - ఆమాట సత్యమే. పెద్ద విభీషణునికి శూర్పణఖ సంతతి పేరు తలపెట్టినఁ గోపము పెద్దగా వచ్చును. వారికిష్టము లేకున్నను వీని కోరికకేమి అభ్యంతరము

నరా -- అగును ఫలములేకున్నను మనోరధము లనేకములుండ వచ్చును. తరువాత

దుర్మ - నేఁడు పుణ్య దివసమగుట విభీషణ మహారాజు మనుమనితోఁ గూడి రంగనాధు నారాధింప భూలోకమున శ్రీరంగమున కరిగెను.

నరా - అట్లుబోవుట వారికి వాడుకయై యున్నది. ఉచితమే శ్రీ రామదత్తంబయిన రంగనాధుని విమానము అతండు లంకాపురంబునకుఁ దీసికొనివచ్చుచుండ కావేరికోరిక లీడేర్ప నాస్వామియందు స్థాపితుండయ్యె కాకున్న శ్రీరంగము లంకాపురములో నుండకపోవునా?

దుర్మ -- జయవకాశమరసి విద్యుజ్జిహ్వుఁడు నేటిరాత్రి అత్తలోదరి యంతఃపురమున కఱిగి శాంబరీ పాటవంబున నీకూటంబునకు దీసికొని వచ్చునఁట.

నరా - ఓహో? పులిమీసములు లాగుటకే బ్రయత్నించుచుండెనే పెద్ద విభీషణుని శాసన మతిక్రూరమని యెరుఁగఁడు కాబోలు

దుర్మ - కామాంధునకు యుక్తాయుక్తవివేక ముండదుగదా అది యట్లుండె స్వామి విమోచన మెట్లయినను సేయక దీరదుకాదా. నరా - యేమి సేయవలయును.

దుర్మ - పెందలకడ ముందుబోయి యీమందిరము శుభ్రము సేయుమని నాకు నియమించెను. వేరొక పనిమీద నాకిందు రాజాగయ్యె. అతండు వచ్చు వేళయైనది లోపలికిఁబోయి బాగుచేయుదమురమ్ము. ఇందులకే నిన్నుఁ బిలిచితిని.

నరా - బాగుజేసితిమనియే జెప్పుదము. నేను లోపలికిరాఁజాలను. అని సంభాషించుకొనుచు విద్యుజ్జిహ్వుని రాక నిరీక్షించుచుండిరి. వీరసింహుడు వారి సంవాద మాలించి యౌరా! వింతలపై వింతలు దోచుచున్నవి. యిది లంకాపట్టణమా? వీండ్రు రాక్షసులా విభీషణుని మనుమనిపేరును విభీషణుఁడే కాఁబోలును. వారిరువురు శ్రీరంగమున కఱిగినట్లు చెప్పికొనిరి. అది భూలోకములో నున్నదఁట. యిది ల౦కాపురము గానిచో నట్టి సంభాషణమున కవకాశముండదు. అయ్యారే ? ఎంతచిత్రము మనుష్యమాత్రునకీ దీవికి రాశక్యమగునా? కమఠరూపుండగు హరియే నన్నిచ్చటికిఁ దీసికొని వచ్చెను. ఇది శుభోదర్కమని తలంపనగు అని వెఱఁగుపడుచుఁ గన్నులు మూయక సందడిచేయక పండుకొని యుండెను. అని యెఱింగించువఱకు వేళయతిక్ర మించుటయు నవ్వలి మజిలీయం దిటని చెప్పదొడంగెను.

116 వ మజిలీ.

అశోకవనము కథ

ఏకాక్షి - అక్కా నీకెన్ని యేండ్లున్నవి నాకంటె పెద్దదానవా చిన్నదానవా ఛీ? రామ సీతారామ.

ఏకకర్ణ - నాకెన్ని యేండ్లున్నవో తెలియదుగాని నీకంటె కొంచెము పెద్దదాన నగుదును ఛీ! రామ ఛీ రామ సీతారామ రామ,

ఏకాక్షి - సీతాహరణకాలమునకును నీకెన్ని యేండ్లున్నవి

ఏకకర్ణ - మొన్న మొన్ననేకాదా సీతాహరణమైనది. దేవా సురయుద్దము నాటికి నే నీడేరితిని. ఆ సంగరములోనే నాభర్తకడ తేరెను.

'ఏవాక్షిలానీవు తాటక యీడుదానవా యేమి?

ఏకకర్ణ - సరిసరి తాటక నాకంటెఁ జాల చిన్నది. తాటకా సుందుల వివాహమునకు నేను బేరంటమునకుఁ బోయితిని సుందోప సుందులునాకు మేనత్తకొడుకులు.

ఏకాక్షి - నాకు మాత్రము తక్కువయేండ్లున్నవియా; సముచిశంబరులు నాకంటెఁ జిన్న వారలు. అమృతమునిమిత్తము దేవాసురులు కలహించినది నేను బాగుగ నెరుంగుదును.