కాశీమజిలీకథలు/ఆరవ భాగము/96వ మజిలీ
తొంబది యాఱవ మజిలి
కమల కథ
అమ్మా ! నేనీ నడుమ సఖులతోఁ బుడమికరిగి భైరవసరస్సులో జలకమాడుచుండ గట్టునఁ బెట్టిన నా పుట్ట మెవ్వరో యెత్తుకొనిపోయిరి. ఎంత వెదకినను వస్త్రచోరుడు కనంబడలేదు. నా సఖురాండ్రందరు నన్నుజూచి నీ చీరఁ దీసికొని పోయినవానికి నీవు భార్యవై యుండవలసివచ్చును. ఇఁక నీవు భూలోకవాసినివే. దేవలోకము నీకుఁ బ్రాప్తిలేదని పరిహాస మాడుచు నన్ను మిక్కిలి పరితపింపఁ జేసిరి.
నేను దిగంబర నగుట నందు గదలక వేరొక పుట్టముఁ దెచ్చి పెట్టుడని యనేక విధంబుల బ్రతిమాలుకొంటిని. వారిలో నొక మచ్చెకంటి నా కంటికి నీరు దెప్పించి యెట్టకే దనపుట్టము సగము చీరి యిచ్చినది. ఆ వస్త్రఖండముఁ గట్టికొని యిక్కడికి వచ్చితిని. వారు సెప్పినట్లు జరుగదుగదా ? యని కన్నీరుఁ గార్చుచు గమలయను గంధర్వకన్యక ప్రజ్ఞావతి యను తన తల్లితోఁ జెప్పుకొని విచారించినది.
ఆ మాట విని ప్రజ్ఞావతి అయ్యో ? ఎంతమోసము జరిగినది. వా రన్నమాట వట్టిదికాదు సత్యమైనదే? నీ వివాహము నిమిత్తమై యెంతో ప్రయత్నము చేయుచుంటి. నా మనోరథము తీరదు గాబోలు. నేడు మహాలక్ష్మీ సేవ నిమిత్తమై వైకుంఠమున కరుగవలసి యున్నది. నీవు గూడ నాతో రమ్ము. అమ్మహాదేవినడిగి యీ సందియముఁ దీర్చుకొందము ఆమెపేరే నీకు బెట్టితిని. సేవకులయం దామెకు మంచి యనురాగము గలిగియున్నది. అని చెప్పుటయుఁ గమల సంతసించుచు నాడు చక్కగా నలంకరించుకొని తల్లితోఁగూడ వైకుంఠమునఁ కరిగినది.
ప్రజ్ఞావతియుఁ దనకు నియామకమైన చామరగ్రహణ సేవ కావించి యామెం బ్రసన్నురాలిం జేసికొని తనపుత్రిక నామె పాదమూలమునఁ బడవైచి దేవీ! ఇది నీ దాసురాలు కమల. దీనికిం దగిన వరుఁడెవ్వడును గనంబడకున్నాడు. గంధర్వకుమారు లెందరు వచ్చి యడిగినను సమ్మతించినదికాదు. అది యట్లుండ మొన్న భూలోకమున కరిగి జలక్రీడల సందడిని పుట్ట మెట్లు పోయినదో తెలిసికొన లేకపోయినది. ఆ వస్త్రచోరునికే భార్యయై యుండవలసి వచ్చునని కొందరు చెప్పు చున్నారు. దాసురాలిపై కృపఁజేసి యందలి నిజం బెరింగింపుము. మరియు దీని నెవ్వనికిఁ బెండ్లి చేయవలయునో నిరూపింపుము. సకలలోక చక్రవర్తినివి నీ వెరుంగనిది లేదని స్తుతిపూర్వకముగాఁ బ్రార్థించిన మందహాసముఁ గావించుచు నిందిర యిట్లనియె.
కమలా! నీకుఁ దగినవరుఁడు గంధర్వులలో లేకపోయె నేమి? మంచిది. నీ నిమిత్తమై బ్రహ్మతోఁ జెప్పి యొక చక్కనివాని సృష్టింపఁ జేసెదనులేయని పరిహాస మాడుచు నొక్కింతద్యానించి మరియు నిట్లనియె.
ప్రజ్ఞావతీ ! నీ కూతునకు మంచిపని జరిగినది. చీర దాచినవాఁడే భర్త యగునను వాడుక సత్యమైనదే. మనుష్యునికిఁ బత్నియగునని పలికిన నులుకుచుఁ బ్రజ్ఞావతి అమ్మా ! నీ భక్తురాలి కీ యాపద దాటింపలేవా ? క్షణయౌవనులైన మనుష్యుల కేమిసుఖము గలదు. రక్షింపుము రక్షింపుమని దైన్యముతోఁ బ్రార్థించినది.
అప్పుడు మహలక్ష్మి చిరునగవుతో నోసీ ! ఇందులకు నీవు చింతింపకుము. నేను జెప్పఁ దలచుకొనిన వానియొద్దనే నీ పుత్రిక చీరయున్నది. అతండు దేవాంశ సంభూతుండు. వినుము. సరస్వతీశాపంబున బృహస్పతి వసుమతిపై జనియించి యున్నవాఁడు. అతడు నిరతిశయవిద్యారూప వైభవములతోఁ బ్రకాశించుచున్నాఁడు. నీ కూతు నాతనికిఁ బెండ్లి చేయుము. చక్కఁదనము వన్నెకెక్కఁగలదు. కోక చేరుటచే మునుపే బహ్మ విధియించినట్లు తోచుచున్నది. పో, పొమ్మని యానతిచ్చిన విని ప్రజ్ఞావతి యిట్లనియె,
దేవీ ! మహానుభావుండైన సురగురుండు శాపపాత్రుం డగుటకుఁ గారణంబేమి? వాగ్దేవికట్టి కోప మేమిటికి వచ్చినది. ఆ కథ యెరింగింపుమని యడిగిన యిందిర యిట్లనియె.
మహేంద్రుఁ డొకనాఁడు బృహస్పతి పురస్పరముగా ముప్పదిమూడు కోటులు వేల్పులు సేవింప దిక్పాలురతో గూడికొని హిరణ్యగర్భునియోలగంబున కరిగెను. వాణిధవుండు వేల్చుల కెల్లఁ బ్రసన్నుండై యాదరించుచు వారినుచితాసనములఁ గూర్చుండ నియమించెను దివస్పతియు బృహస్పతియు బ్రహ్మకు దాపుననున్న పీఠము లలంకరించిరి. లోకేశుండు స్వాగతపూర్వకముగా దేవతల క్షేమ సమాచారముల దెలిసికొనుచుండెను. అట్టి సమయంబున శారద శారదుఁడను తన వీణావాహకునిచేఁ దనవీణ మోయించుకొని యాసభకరుదెంచినది. అప్పుడు దిక్పాలురును దేవతలును సిద్ధులు లోనగువారెల్ల పీఠములనుండి లేచి యద్దేవికి వందనంబులం గావించిరి. బృహస్పతి పీఠమునుండి లేవకయే యద్దేవి నభినందించెను. అప్పుడు వాగ్దేవి నిరతిశ యరోషారుణ కటాక్షవీచియై చురుకుచూపులం జూచుచు నోరీ? దేవతాపురోహితా ? నీవును నీ వేల్పులును మా యింటికి వచ్చి మొఱ వెట్టని గడియలేదు. మాకు దాసానదాసుండైన యింద్రుయింట బాచకుండవైన నీవు నన్నిట్లవమానపరతువా ? ఈ లేచినవారెల్ల నీ మాత్రము బుద్ధిలేనివారు కాఁబోలు ? లేచినంత నే నీ గౌరవమునకు హాని వాటిల్లిన దేమి? నీవు దేవలోకంబున నుండనర్హుండవు గావు పుడమిజనింపుము. తాపత్రయ పీడితుండవైనచో బుద్ది రాఁగలదు అని శపించినది. అప్పుడు బృహస్పతి పీఠముపై నిలువంబడి క్రోధానజ్వాలలచేఁ మోము జేవురింప నోహో ? వ్యాపారస్వరూపిణీ ? పితామహునిపత్ని వైనంతనే యింతకన్నుఁ గానకుందువా ? పిన్న పెద్ద తారతమ్యము కొంచెమైన విచారింపవలదా ? పూజ్యులమైన బ్రాహ్మణులము. నీకు లేచి వందనములు చేయవలయు నేమి? ఈ మర్యాదలు మాకు దెలియవు. లక్ష్మియుఁ బార్వతియుఁ నిట్లనినఁ జెల్లును కాని నీకీ మాట చెల్లదు. నీ కిప్పుడు నేను బ్రతిశాపమిచ్చుచున్నవాడఁ జూచికొనుము. నీవును మనుష్యయోని జనియింపుమని పలుకుచు శాపోదకము హస్తంబునఁ దాల్చినంత బద్మగర్భుం డాతనిచేయి వట్టుకొని ధిక్షణా ! నీకది తగునా ? ఆఁడువాండ్రు పది తప్పులు మన్నింపఁ బాత్రలని విని యుండలేదా భారతిదేవి వెనుక ముందు విచారింపక నన్ను శపించినది. కానిమ్ము నీవు పుడమి జనించినను మహేంద్రునికన్న నెక్కుడు. వైభవ మనుభవింపఁ కలవు. నీ విఖ్యాతి భూతలం బంతయు నా చంద్ర తారకంబై విరాజిల్లఁ గలదు. నీ శాప ముపసంహరింపుమని శాంతి పరచిన బృహస్పతి విగత క్రోధుండై యిట్లనియె.
దేవా ! నే నీ యానతి నతిక్రమించువాఁడనా ? నా శాప మమోఘము. దీనిం భరించువారు వేరొకరిని జూపుము వారిపై వ్యాపింపఁ జేయుదు ననుటయు నలు మొగంబుల వేల్పునలుదెసలఁ జూచుచుండెను. అప్పుడు వీణావాహికుఁడు శారదుఁడు ----------- దేవా ! మా దేవి శాపంబు నేను వహించెద. నాపై బ్రయోగింపుఁడని పలి---------------------- బ్రహ్మ సురుగురునట్లు చేయుమని యుపదేశించెను. బృహస్పతి ------------------------ జల్లెను. అప్పుడు పరమేష్టి శారదుంజూచి యోరీ ! నీ విందులకు జింతిల్లకుము. నీవు బుడమి జనియించి మహాకవి వైలోకాతీతమైన ప్రఖ్యాతినొందఁ గలవు. మీ యిరువురు నొక చోటనే వసింతురు. ఏక కాలమందే శాపవిముక్తి వడయుదురు. అని యనేకవరంబు లిచ్చి యచ్చతురాననుండు వేల్పులనెల్ల ననునయించుచు వారి నివాసదేశముల కనిపెను.
తత్కారణంబునం జేసి సురపురోహితుఁడు భూమండలమున జనియించి ధారా రాజ్యంబున బోజుండను నామంబున విరాజిల్లుచున్న వాఁడు. అతఁడే నీ పుత్రిక కనుకూలుండగు నాధుండు. అని మహలక్ష్మి యానతిచ్చిన విని ప్రజ్ఞావతి సంతసించుచు అమ్మా ! నీ యక్కటికమ్ము నట్లే కావించెద. మంచివార్త యెరింగించితివి. శారద వీణావాహకుఁడు శారదుఁ డెవ్వఁడై పుట్టెనో తెలుపవైతివి. నావుడు నవ్వుచు హరిపత్ని యోసీ ! అదియు వినవలయునా ? అతండు కాళిదాసను పేరుతో నమ్మహారాజు నా స్థానకవి యగుచున్న వాఁడని యెరింగించినది.
అప్పుడు ప్రజ్ఞావతి భార్గవీదేవియనుజ్ఞగైకొని పుత్రికతో గూడ భూతలంబున కరుదెంచినది. బోజకుమారునితో సంబంధ మెట్లుఁగలుపు కొందునని యాలోచించుచు ధారానగర ప్రాంత భూభాగముల సంచరించుచు నొకనాఁ డొకయుద్యాన వనమునకుఁ బోయి కుసుమకిసలయ ఫలద్రుములతా మనోహరమగు నయ్యుపవనరామణీయకమున కచ్చెరువందుచు నందున్న వనపాలురం జీరి యీ తోటయెవ్వరిది ? ఇప్పుడు క్రొత్తగా నరంకరించుచున్నా రేల యని యడిగిన వాం డ్రిట్లనిరి.
అమ్మా ! ఈ తోట బోజమహారాజుగారిది. వారిప్పుడు భార్యలతో విహరింప నివ్వనంబున కరుదెంచుచున్నవారు. అందులకై యలంకరించుచున్నార మని చెప్పిరి. ఆ మాటవిని ప్రజ్ఞావతి యించుక యాలోచించి బోజమహారాజుగారికి భార్య లెందరు ? పట్టాభిషిక్తుఁడై యెంతకాల మైనది? ఆయన యెన్ని యేండ్లవాడుఁ తద్వృత్తాంతముఁ జెప్పుడని యడగిన వారిట్లనిరి.
రాజ్యలోభంబునఁ బినదండ్రి చంపఁబంపి చివరకు బశ్చాత్తాపముఁ జెందుచుఁ బ్రాయోపవిష్టుండగుటయు నా రాజు మువ్వుర భార్యలం బెండ్లి యాడి యీ నడుమనే నగరమున కరుదెంచెను. పినతండ్రియైన ముంజుఁడు యోగీశ్వరు మంత్ర మహాత్మ్యంబున నతండు జీవించి వచ్చెనని సంతసించుచు వెంటనే యతనికిఁ బట్టముఁ గట్టి తపోవనంబున కరిగెను. కొలదికాలము క్రిందటనే బోజుండుసింహాసనమెక్కెను. ఆయన ------------ చిన్నది. ఆ ముగ్గురు భార్యలతో వచ్చి కొన్నిదినము లిందు విహరింతు రిదియే వారి వృత్తాంతము. అని చెప్పి మీ రెవ్వరు ? ఎందుబోవుచున్నారని యడిగిరి.
మేము బాటసారులు మని చెప్పి ప్రజ్ఞావతి పుత్రిక మొగముఁ జూచినది. కమల సిగ్గు విడిచి ఇఁక మనమింటికిఁ బోవుదము. లెమ్ము. ఆయనకు మువ్వురు భార్యలుండిరి. ఇఁక నే నేమిటికి? నా కేమియు నిష్టము లేదు. ఇట్లె యుండెద నెవ్వరినిఁ బెండ్లి యాడనని పలికిన విని ప్రజ్ఞావతి యిట్లనియె.
భక్తపరతంత్రురాలగు నిందిరాదేవి స్వయముగా నానతిచ్చిన విషయముల కన్యదాత్వమేల కలిగెడని? ఇంతకుమున్న మువ్వురు భార్యలు కలిగినరాజు నిన్కెక్కుడుగాఁ బ్రేమించునా ? ఈ రెండు విషయములు శంకాస్పదము లగుచున్నవి. అయినను వాని సౌందర్యమెట్లున్నదో చూచి పోవుదముగాక. ఇంతలోఁ దొందరయేమి యని పలికినది. చూడ నక్కరలేదు. చరిత్రయే చెప్పుచున్నది. నేనుఁ బోయెద. నీవు చూచిరమ్మని కమల నొడివిన బ్రజ్ఞావతి నవ్వుచుఁ గమలా ! నీ యిష్టము వచ్చినట్లే చేయుదువుగాక. ఇంతదూరము రానే వచ్చితిమిగదా? వారిని భార్యలను గాంచిపిమ్మటఁ బోవుదము. అని యెట్టకె నొప్పించినది.
ఇరువురు తిరస్కరిణీవిద్యచేఁ దిరోహితులై యా తోటలో విహరించుచుండిరి. అంతట బోజుఁడు తురగారూఢుండై మువ్వురు భార్యఁలు చతురంతయానమున నెక్కి తోడరా నింద్రవైభవముతో విచ్చేసి యందున్న సౌధంబునఁ బ్రవేశించెను.
సాయంకాలమున లీలావతియుఁ జంద్రముఖియుఁ బద్మావతియు సఖులతో నా తోటలో విహరించుచుండిరి. వారి సోయగములు చూచి కమల తల్లితో అమ్మా ! మనుష్యకాంతలును జక్కగనే యుందురు సుమీ ! ఈపూబోణులం జూచితివా ? అయ్యారే లావణ్యము బాపురే తారుణ్యము బళిరా సోయగము? అని కొనియాడుచు వెనువెంటఁ దిరుగుచు అదిగో నా చీర. ఆ నారీమణి కట్టికొన్నది. తల్లీ ! చూచితివా ? ఈరాజకుమారుఁ డక్కడికివచ్చి యెత్తికొని పోయెం గాఁబోలు. తన భార్యకిచ్చె నాహా! లోకప్రవాదము తప్పదు. ఈ పుట్టముకతంబున నీతని భార్య నగుదునాయేమి? బహు భార్యావల్లభు బెండ్లి యాడిన సుఖ ముండనేరదు దైవసంకల్ప మట్లున్నదియా తెలియదని యాలోచించుచున్నది.
అంతలో బోజుండు నూతనాంబోజశరుండువోలె నొప్పుచున్న నప్పుడతు లక్కడ నరుదెంచెను. శా. ఆలోలాక్షులఁ గూడి భోజనృపరాధ్యక్షుండు మేల్తూగు టు
య్యాలల్ తీగెలనూగుఁ బుష్పములఁ గోయం బుచ్చు వాపీపయః
కేళిం దేలు మనోజ్ఞనాదముల సంగీతంబుల బాడగా
నాలించు న్బహుభంగులం గెరలి క్రీడాయత్త చిత్తంబుతోన్.
ఇట్ల త్తరుణీ రత్నములం గూడి వేడుకలతో వనవిహారము సేయుచున్న యన్నరనాథపుంగవు ననంగ రూపుంగాంచి విస్మయాంచిత స్వాంతయై యక్కాంతారత్నంబు తన తెరగంటితనము సార్దకముగాఁగఁ జూచి చూచి తల యూచుచు మెచ్చుకొనుచుఁ బొగడుచు నక్కుమార శేఖరునియందు బద్దదృష్టియై యొండెరుగక వివశ మానసయై యుండెను.
అట్టియెడఁ బ్రజ్ఞావతి పుత్రీ ! కళత్రయుక్తముగా నాధాత్రీపతిం జూచితిమి. ఇఁకఁ బోవుదము రమ్ము. అని పిలుచుటయు నక్కమలేక్షణ యక్షీణ మోహావేశముతోఁ దల్లీ ! సకల బ్రహ్మాండనాయకురాలగు నయ్యిందిరాదేవి గతాగతములఁ దెలియక మనల నిందుఁ బొమ్మని యేల యానతిచ్చెడిని. సురగరుడోరగ విద్యాధరాది ఖేచరులయం డిట్టి సుందరుడు లేడని ప్రతిన పట్టి చెప్పగలను. అమ్మక చెల్లా ! భార్గవి చెప్పిన నేమోయనుకొంటిని. నా మనము వీనియందు లగ్న మైయున్నది. ఇఁట నుండి రాఁ జాలను. నన్ను వీనికే పెండ్లి చేయుము. ఈ క్రీడా విశేష౦బులం జూడ నీతఁడు దక్షిణనాయకుండని తెల్ల మగుచున్నది. పెక్కులేల? ఒక్క నిమిష మా వయసుకానితోఁ గూడి సుఖించిన యువతికి బ్రహ్మాండాధిపత్య మేమిటికి ? అని తన యభిలాష సూచించినది.
అప్పుడు ప్రజ్ఞావతి యుపాయమాలోచించి యా తోటదాపునబాటలోనిలిచి అక్కటా ! తెక్కలికాండ్రు మమ్ము బాధించుచున్నారు. పుణ్యాత్ములారా ! వచ్చి రక్షింపుఁడు రక్షింపుఁడని యఱచినది. ఆ యార్తధ్వని బోజుండు చెవియొగ్గి విని బాటసారులఁ బాటచ్చరులు గాసి పెట్టుచున్న వారు కాబోలు పోయివచ్చెద నిందుండుడని తొందరగాఁ బలుకుచు ఖడ్గపాణియై వెరవకుఁడు. వెరవకుడు. నేనిదే వచ్చుచున్నానని కేకలు వైచుచు నా దెసకుఁ బరుగెత్తి కొని పోయెను.
అతని రాకఁజూచి కమల కేగంటిచూపుల నవ్విపులాధిపతిం జూచుచుండెను. ప్రజ్ఞావతి యెదురువోయి నమస్కరించుచు అయ్యా ! తమ రెవ్వరో పరోపకార పారీణులు. మా యాపద దాటించిరి. మీ రాకజూచి దొంగలు పారిపోయిరి. మీకుఁ గృతజ్ఞులమై యుండెదమని స్తుతిఁ జేయుటయు బోజుండక్కమలంగాంచి యబ్బురముఁ జెందుడెందముతో బ్రజ్ఞావతి కిట్ల నియె.
అవ్వా ! మీ రెవ్వరు ? ఎందుఁ బోవుచున్నారు. ఆ చిన్నది నీ కేమి కావలయును. సహాయములేక నొంటరిగా దెఱ వేమిటికి నడచుచుండిరి? అని యడిగిన నా ప్రజ్ఞావతి దేవా ? అది నా కూతురు. దానిపేరు కమలయండ్రు. దానికి వివాహముఁ జేయుతలంపుతోఁ దగినవరు నరయుచు దేశములు తిరుగుచుంటిని. ఇందు దొంగలడ్డము వచ్చిరి. మీ కృపవలన నా యిక్కట్టు దాటితిమి. ఇక్కడికి గ్రామ మెంత దూరమున్నది ? మా కకారణ బంధువులైన మీ కులశీల నామముల వినఁ గోరుచున్నదాన నని యడిగెను. అంతలోఁ గమల దళ్కు చూపు లా భూపతిపై వ్యాపింపజేసినది. అతని ధైర్యము మట్టు మాసినది. చేష్టలు మారినవి. ఆ చపలనేత్ర చూపులకు బోజునిచూపు లెదురుకొని పెనవైచినవి. మనసిజుండా విలోకనములనే సాధనములుగాఁ జేసికొని నరనాధుని హృదయమును వేధింపఁ దొడంగెను.
అప్పుడయ్యొడయం డొక్కింత తెరపిఁ జేసికొని యేమంటివి ? ఆ వాల్గంటి నీ కూఁతురా ? వరునికొరకుఁ దిరుగుచుంటివా ? ఇది కడు వింత. రత్నమును వెదకుదురు గాని రత్నము వెదకువారిని వెదుకరుగదా ? ఆ చకోరకుకోరిన నేభూపతి యంగీకరింపఁడు ? నా పేరు బోజుండందురు. మా కాపురము ధారాపురము. ఈ రాజ్యమునకు నేను యధిపతి. మీరు మా దేశమున కతిధులుగా వచ్చిరి. కావున సత్కరింపవలయును. మా యింటికి రండు అని పలికినఁ ప్రజ్ఞావతి వినయ మభినయించుచు నిట్లనియె.
ఓహో ? బోజకుమారులు మీరేనా ? మీ యభిఖ్య త్రిజగద్విఖ్యాతమైనది. కడు ధన్యులమైతిమి. మృగ్యమైన రత్నము చేతికిఁ దగిలినది. ఆడఁబోయిన తీర్థ మెదురు వచ్చినదని పొగడుచు మీ యొద్ద దాచనేల ? ఈ కన్యను భరింప మీర సమర్థులు దీనిం బత్నిగాఁ గైకొందురేని మీ యాతిధ్య మందెదము. లేకున్న మా దారిం బోయెదమని పలికిన నా నృపతిలకుఁడు మొగమున లేతన వ్వొలయనిట్లనియె.
ఇందులకింత మనవియేల ? సిరిరా మోకా లొడ్డు వాఁడుండునా ? (రత్నహారీతు పార్థివః) మంచివస్తువులను రాజే భరించును. అను సామెత యుండలేదా ? నీ మాట వడువున నీ బోటిం బరిగ్రహించెద. నింటికి రండని సాదరముగాఁ బలికిన విని కమల విమలహాస చంద్రికలు వెలయ జననీ ! నీ వింత వెఱ్ఱిదానవేమి? భూ వల్లభులు బహువల్లభులని వినియుండలేదా ఇంటికిం బోయిన మన పరిగణన మెప్పటికో యని యర్థోక్తిగాఁ బికస్వర వికస్వరరవంబునఁ దెలిపినది.
బోజుండు పెచ్చు పెరుగుతమి నింత యేల బాలా ! నీ కే లిటుతమ్ము. గాంధర్వంబునఁ బరిగ్రహింతుఁ గంతుఁడే మనను బురోహితుండని పలికిన విని ప్రజ్ఞావతి సంతసించుచు దేవా ! ఇది దేవచోదికము. నీ నిమిత్తమే మేమిక్కడికి వచ్చితిమి. మేము గంధర్వులము. హరిపత్నిచే మాకీ యుపదేశము చేయఁబడనదని యా వృత్తాంతమంతయుఁ జెప్పినది. అప్పుడా బోజనరేంద్రుండు పరమానంద కందళిత హృదయార విందుండై యయ్యరవిందగంధిం గాంధర్వ వివాహంబునఁ బత్నిగాఁ గైకొని కేలు గేలం గీలించి యుద్యానవన సౌంధంబునకుం దీసికొనిపోయి తన భార్యలకు జూపుచు నక్కాంతామణి వృత్తాంత మంతయు నెరింగించెను.
అక్కురంగనయనలును గమలను జెల్లె లిగా నెంచి గారవించిరి. లీలావతి తాను గట్టుకొనిన చీర కమలదని విని విధిఘటితమును గురించి పెద్దగా నుపన్యసించినది. అట్లు బోజనరేంద్రుండు లోకైకసుందరులఁ నలువుర బెండ్లి యాడి మహేంద్రవై భవంబున రాజ్యంబు సేయు చుండెనని యెరింగించి యయ్యతి పంచాననుండు తత్కథా శేషంబు తదనంతర నివాసదేశమునఁ జెప్పఁ దొడంగెను.
తొంబదియేడవ మజిలీ
భోజుని రాజ్యపాలనము కధ
పతంగకులంబులు కులాయంబులనుండి వెలువడి కలకల ధ్వనులతో నలుదెసలకు బారుచున్నవి. చిగురించిన రసాలతరు శాఖలవసించి పికని కరంటులు మధురస్వరంబులఁ గూయుచున్నవి. నర్మదా నదీసీకర చోకరములగు మందమారుత పోతంబులు హాయిగా వీచుచుండెను. కుసుమకిసలయ ఫల మనోహరములై న తరులతా షండంబులు కన్నుల పండువుఁ గావించు చుండెను. ఒకనాఁ డట్టి సమయంబున బోజనరేంద్రుఁడు క్రీడావనంబున కరుగుచుంట రాజమార్గంబున నొక పండితుండతని కెదురువడి కన్నులు మూసికొని నడువఁ దొడంగెను. బోజుండందు నిలువంబడి యా విప్రు నుద్దేశించి పారుఁడా। నీ యాకారముసూడ విద్వాంసుండవువలెగనంబడు చుంటివి. నన్నుఁజూచి యాశీర్వదింపక విశేషించి కన్నులు మూసికొని యరుగు