కాశీమజిలీకథలు/అయిదవ భాగము/48వ మజిలీ

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

శ్రీ శంకరాచార్య చరిత్రము

ప్రధమోల్లాసము

48 వ మజిలీ

క. శ్రీవిద్యాతీర్థాకా
   రావిర్భూతం బరాత్ము నాత్మం బ్రణుతుల్
   గావింతుశంకరగురు
   శ్రీవిజయము గురుకటాక్ష సిద్ధివహింపన్.

మ. చెలురారన్ ఘటియించుగాత గృపను జ్జిహ్వాగ్రసింహాసన
     స్థలినాచార్య పదాంబుజస్తుతికథా సంతుష్టయై భారతీ
     లలనారత్నము నృత్యదీశ్వర జటాలంకార గంగాసరి
     చ్చలదూర్మిప్రకర స్వనప్రబల వాక్చాతుర్య విద్యార్భటిన్.

గీ. అల్పమగుదర్పణంబున నద్రికోటి
    గానఁబడురీతి సంగ్రహ మైననిందు
    తొంటిశంకరవిజయమందు దనరారు
    తచ్చరిత్రాంశమెల్ల వ్యక్తపడుగాదె.

గీ. అతిరుచివహించుమధుర మందితరరుచి జ
   నింపరుచ్యంతరము ఘటియించునట్లు
   ప్రాకవీశ్వరకృత హృద్య పద్యగతికి
   దెచ్చు వేరొక్క రుచిని మదీయకవిత.

చ. గరసగతింబురాణ కవి సన్నుతుఁడైనను భాష్యకర్త శం
    కరుఁడుమదల్పవాక్యకృతి గౌరవబుద్ధి ననుగ్రహింపఁడే
    నిరతము దుగ్ధవార్ధి శయనించెడు విష్ణుఁడు ప్రీతిగోపికా
    తరుణులొసంగు దుగ్ధముల దక్కు వనాక పరిగ్రహింపఁడే.

శా. ప్రారంభించి కడంక శంకరగుణ వ్రాతంబువర్ణింపగా
    ధీరుల్ పెక్కురు శ్లోకపాదమును బూర్తింజేయలేరైరహా
    యేరీతిన్ రచియింతుదత్కథలనం చెంతేనిలజ్జింపక
    బ్జారింబట్టగరంబు లెత్తుగతి నా యత్నంబు చిత్రంబగున్.

శా. ఐనన్మూగలనైన వక్తలుగ జేయంజాలి దగ్ధార్ణవా
    నూనోర్మిప్రకరోల్లసత్కణరుచి వ్యూహంబులన్ జేరుచున్
    జానై యొప్పెడుదేశికోత్త మకటాక్షంబుల్ కరంబిప్డు నా
    పైనిండారంగ నొప్పుచున్నవి యలభ్యంబెద్దినాకింకిటన్.

చ. పరమహితోపదేశమునఁ బామరకోటిఁదరింప జేయఁగా
    ధరనుదయించినట్టి పరతత్వవిదుండు మహేశ్వరుండు శం
    కరగురుసచ్చరిత్రము ప్రకాశముగా రచియించినేనెద
    న్మురియుట యబ్బురంబె పరిపూతుఁడనంచుజనంబులెన్నగన్.

చ. శుభకరవారిజాసన వృక్షితిభృచ్చకోల్లస
    చ్ఛుభకరశూన్యనందగిరి శుభ్రమయూఖశకాధి కోల్లస
    ద్విభవసమాసుమార్గసిత విశ్రుతమౌ విదియంజనించితిన్
    ద్రిభువనవంద్య వేదజన నీ కరుణావిలసద్విలోకన
    ప్రభవకవిత్వవైభవుఁడ భవ్యకవీంద్రవచో విధేయుడన్.

నేను జన్మసాఫల్యంబు శ్రీశంకరాచార్య చరిత్రము రచింప నెంచితి తత్కథాక్రమంబెట్టిదనిన, మణిసిద్ధయతీంద్రుఁడు గోపాలునితోఁగూడ నలువది యెనిమిదవ మజిలీనెలవు జేరి యందుఁ గాల్య కరణీయంబుల దీర్చుకొని తన్ను జూడవచ్చిన చిదానందయోగితోఁ బెద్దతడ వద్వైతజ్ఞానమును గురించి ముచ్చటించెను. వారి ప్రసంగ మంతయు దాపున గూర్చుండి గోపాలుండు వినుచుండెను. తత్ప్రసంగానంతరమున మణిసిద్ధుండు శిష్యుని మొగముజూచి నవ్వుచు, వత్సా! మా ప్రసంగము నీకేమయిన నర్ధమయినదా? కడుశ్రద్ధగా వినుచుంటివని యడిగిన గోపాలుండు, స్వామీ! నా కేమియుఁదెలియలేదు. ఆ విషయములెల్ల దరువాత మీ వలనం దెలిసికొనునభిలాషతో నిందు గూరుచుంటి నాయందక్కటికముంచి యత్తెరంగెరింగింపుడని కోరిన నాయతిశేఖరుం డిట్లనియె.

శ్లో॥ అశ్వాలంభం గవాలంభం సన్యాసంపలపైతృకం
     దేవరాచ్చసుతోత్పత్తిఃకకా పంచవిసర్జయేత్.

కలియుగమున సన్యాసము స్వీకరింపగూడదని మునులచే నిరూపింపబడినది. శంకరాచార్యు లవతరించి సన్యాసము స్వీకరింపవచ్చునని ప్రమాణములు చూపుచుఁ దిరిగి స్థాపించెను. ఆ శంకరయతీశ్వరులచేఁ బ్రస్థానత్రయమునకు భాష్యము లద్వైతపరముగా రచింపఁబడినవి. అందలి విషయములు ముముక్షువులకుఁ జాల నింపుగా నుండును. గాన మేము ముచ్చటించితిమని చెప్పిన శిష్యుండు, స్వామీ! శంకరాచార్యులు పరకాయప్రవేశము చేసెననియు నెవ్వరితోనో వాదించెననియు నొకప్పుడు నాకు సంక్షేపముగాఁ జెప్పితిరి. మీరు చెప్పినంత కథయే యెంతో రుచిగా నున్నది. అప్పుడు వేరొక కథాసందర్భములో నాకథఁ జెప్ప మానివేసితిరి. నేటికి వెండియు నామహాత్మునిపేరు జ్ఞాపకము జేసితిరి. నేడు నేను మీ ప్రసంగము వినుచు నెక్కటికింబోక నిందే గూరుచుంటిఁ గావున నిప్పుడా శంకరాచార్యు కథయంతయు సాంతముగాఁ జెప్పవలయునని వేడుకొనుటయు మణిసిద్ధుండిట్లనియె.

వత్సా! యెన్ని దినముల నుండియో నీకీ పుణ్యచారిత్రము చెప్పవలయునని సంకల్పము గలిగియున్నది. యెప్పటికప్పుడేదియో ప్రశంసమీద మానివేయుచున్నాను. నేడు సుదినము. తద్వృత్తాంతమంతయు వక్కాణించెద సావధాన మనస్కుండవయి యాకర్ణింపుమని శంకరులకు నమస్కరించుచు నిట్ల చెప్పందొడంగెను.

శ్రీరస్తు - శుభమస్తు

శ్రీ శంకరాచార్యచరిత్రము

ప్రధమోల్లాసము

కథా ప్రారంభము

శ్రీరమణీయమై విబుధ సేవితమై ఫలపుష్ప న మధా
త్రీరుహకల్పితోపవన దీపితమై సుమనోజ్ఞ గేహశృం
గారతరాంతరంబగుచుఁ గాలటినాజను నగ్రహారమ
క్కేరళదేశమందమరుఁ గేవలమయ్యమరాలయంబనన్.

సీ. కలనైననరయ శక్యముగాదువిద్యా ప్ర
         సక్తిగాననియథా జాతునచట
    ఘనమతి వెదుకంగఁ గానరాఁడటనాహి
        తాగ్నిగానట్టి గృహాధికారి
    మందునకైన లేడందుసాంగాగమా
        ధ్యయనంబు సేయని యజ్ఞుఁడొకఁడు
    పన్నిదంబునకైనఁ బడయఁజాలముశాస్త్ర
       ధీయుక్తి లేనివైధేయునొకని

గీ. నందరును భూరితత్త్వవిద్యామహత్త్వ
   ఖనులు నవతోషితామరుల్ వినుతయశులు
   వేదశాస్త్రాదివిద్యాప్రవీణబుద్ధు
   లవనిసురులుందు రయ్యగ్రహారమందు.

అయ్యగ్రహారంబు పరిసరంబునం బవిత్రోదకంబై పూర్ణయను మహానది ప్రవహింపుచుండు. దానినంటియే వృషాచలంబు విఖ్యాతంబై విరాజిల్లు నప్పుణ్యగిరి కూటంబున మహేశ్వరుండు జ్యోతిర్లింగ స్వరూపంబున నావిర్భవించి తద్దేశాధిపతి యైన రాజశేఖరుండను నృపాలుని స్వప్నంబునఁ బొడసూపి యాలయ ప్రాకారమంటపాదులఁ గట్టింపుమని నియమించిన మించినసంతసముతో నానరపతి యట్ల కావించి కృతార్ధుండయ్యె. నాటఁగోలె నయ్యగ్రహారంబు పుణ్యక్షేత్రంబై వృషాచలేశ్వరుని మహిమాతిశయంబునం జేసి యీతిబాధాశూన్యంబై యొప్పుచుండు. మఱియునందు—

క. విద్యాధిరాజునానిర
   వద్యయసోనిధియొకండు బహుళకళాసం
   పద్యోగశాలిదనరున్
   సద్యోగార్చితసుపర్వసంఘుండగుచున్.

సీ. సతతంబుశాస్త్ర చర్చలు సేయుచుండుఁద
           ద్గేహాంకశారికా కీరచయము
    నిగమశేఖరతత్త్వ నిశ్చయార్థముల భా
           షించుఁదన్మందిర స్త్రీజనంబు
    వివిధాధ్వర క్రయా నివహంబులను బ్రస్త
          రింతు రర్చకులు గ్రీడాంతరముల
    సత్పురాణకధా ప్రసంగముల్గావించుఁ
          జెలఁగితద్దాసదాసీజనంబు

గీ. లనినచో నమ్మహాత్ము విద్యాతిశయము
    వేఱేవర్ణించినుతులు గావింపనేల
    సార్థకాహ్వయుఁడాసూరి చక్రవర్తి
    సాధుమతిదానజిత బలిచక్రవర్తి.

అట్లు విద్యాధిరాజు సకల విద్యా ప్రవీణుండై సురభూసుర స్తవనీయ చరిత్రుండై యయ్యగ్రహారమున వసియించి పూర్ణానదీస్నానంబు వృషాచలేశ్వరుని సేవయుం బ్రధానములుగాఁ జేసికొని తత్వగోష్ఠి విశేషములచేఁ గాలక్షేపము సేయుచుండఁ గొండొక కాలంబునకుఁ దత్పత్ని యంతర్వత్నియై శుభముహూర్తంబునఁ బుత్త్రరత్నమును గనియెను. మిగుల సంతోషముతో నాపాపనికి విద్యాధిరాజు యథాశాస్త్రముగా జాతకర్మాది సంస్కారముల నిర్వర్తించి శివగురుండని నామకరణము గావించెను.

శివగురునికథ

ఆ బాలుండు శిశువిలక్షణ వ్యాపారములు గలిగి దివ్యతేజస్సంపన్నుండై బాలమృగాంకుని పగిది ననుదిన ప్రవర్ధమానుండై యొప్పుచుండెను మఱియు నప్పండితుండు శివగురునికి యథాకాలంబున నుపనయనము గావించి సమీపగ్రామంబున వసియించియున్న యొక్క పండితునొద్ద విద్యాభ్యాసము గావింప నప్పగించెను. శివగురుఁడు గురుని శివునిఁగాఁదలంచుచు యథావిధి బ్రహ్మచర్యవ్రతం బొనరింపుచు జ్ఞానంబున శివుఁడే యనఁదగి సతతము గురుశుశ్రూషాపరుండై యశసపానశయనాది వ్యాపార ముల యందు నియమమును విడువక కాలముల యందు నగ్ని నారాధింపుచు గురు నింట వేదాధ్యయనము గావింపుచుండెను. అతండు మిగుల బుద్ధిమంతుఁడగుటచే స్వల్పకాలములో వేదముల సాంగముగా నధ్యయనముఁచేసి శాస్త్రములయం దసమాన మైన పాండిత్యము సంపాదించి వేదార్థావబోధముఁ జక్కగా జేసికొని యనుభవమునకుఁ దెచ్చుకొనుచుండెను.

ఒకనాడుఁ గురుండు శిష్యులకు వేదార్ధమంతయు నుపన్యసించిన విని శివ గురుండవల్లన నాచార్యునితో నిట్లనియె, ఆర్యా! అర్ధావబోధము క్రియానుష్ఠానమే ఫలముగాఁ గలది గదా? వేదము మొదటఁ గర్మచేయుమని యెంతయో చెప్పిచెప్పి చివరఁ గర్మవలన నేమియుఁ బ్రయోజనము లేదనియు జ్ఞానమునంగాని మోక్షము కలుగదనియు నుడువుచున్నది. అట్లు చెప్పుటకు గారణమేమియో తెలియకున్నది తదభిప్రాయము వక్కాణింపుఁడని వేఁడుకొనియెను. అప్పుడు గురుండు మిగుల సంతసించుచు వత్సా! నీ ప్రశ్నము కడు గూడార్ధమైనది. వినుము. జననమరణాది సుఖ దుఃఖములకుఁ గర్మయె కారణమై యున్నది కర్మవలన జంతువు బొడముచున్నది. ఆ కర్మ యజ్ఞాన మూలకమైనది. యా యజ్ఞానము మాయాజనితంబు. కర్మవలనఁ బుట్టిన జంతువులకు నజ్ఞానము సహజంబై యుండును. జ్ఞానమాగంతుకము గావున సహజ గుణంబైన యజ్ఞానమెట్టివారికిని విడుచుట కష్టము. దేహధర్మము లెంతవాని నైన మోసము చేయక మానవు. ఇంద్రియ ప్రవృత్తి బలవంతమైనది. ఉపాధ్యాయుండు బాలురకు నక్షరబోధ చేయు తలంపుతో రుచులఁ జవిజూపు చందంబున వేదము ప్రకృతి వలన జనించి ఫలాపేక్షగల జంతువులకు ఫలము లెరఁజూపి కర్మలఁ జేయుమని చెప్పినది. కర్మలయందు నియమింపఁబడిన చిత్తము గలవాఁడు దృఢవ్రతుం డగుటచేఁ బైన నెట్లు చేయుటకును సమర్థుండగును. కావునఁ గర్తవ్యాంశములఁ బిమ్మట యథార్థముగా వక్కాణించినది. ఈ విషయ మనుభవగోచరము. పిమ్మట విమర్శింపవచ్చును. నీవు సమస్త విద్యలం జదివితివి. నీవు వచ్చి పెద్దకాలమైనది. మీ తలిదండ్రులు నీ కొఱకు వేచియుందురు. సత్వరముగా నింటికి బొమ్ము. బంధువులకు సంతోషము గలుగఁజేయుము. కాలమునకు మిక్కిలి వేగము గలదు. దేహంబుల క్షణభంగురములు. రేపు జేయఁదలచికొనిన కార్యములు నేఁటి యుదయముననే చేయవలయును. కాలమున నాటినసస్యమువలె విపరీతకాలమున నాటిన సస్యము సంపూర్ణఫలము నీయజాలదు. అట్లే వివాహాది కృత్యంబులు యథాకాలంబున నిర్వర్తించిన మంచి ఫలంబుల నీయఁజాలును మఱియుం గుమారుండుదయించినది మొదలు తల్లిదండ్రులు వత్సరములు గణింపుచు వివాహాద్యుత్సవములఁ జేయఁదొందరపడుచుందురు. తమకు బిండధాదృలోపము గలుగునని పితృదేవతలు తమకులీనుని వివాహక్రియఁ గోరుచుందురు. కావున నీవును సలక్షణయగు కన్యంబెండ్లియాడి గార్హస్థ్యధర్మముల యథాశాస్త్రముగా నడుపుచు యజ్ఞములచే వేల్పుల దృప్తిపరచి నిష్కర్ముండవై ప్రవ ర్తింపుము ఇదియే వేదార్ధావబోధమునకు ఫలమని యుపదేశించిన విని శివగురుండిట్లనియె.

ఆర్యా! మీరనినది యథార్ధమేకాని బ్రహ్మచారి వేదాధ్యయనమును జేసిన పిమ్మట గృహస్థే కావలయు. మఱియొక మార్గమవలంబింపఁగూడదను నియమ మెందును గనబడదు. బ్రహ్మచారియు నిహామిత్రార్ధభోగముల యందు విరక్తుండై నిత్యా నిత్య వస్తు వివేకము గలిగిన సన్యాసాశ్రమమును స్వీకరించినచో సమంజసము కాదా? గృహస్థునికి ఋణావకరణము సత్యశుద్ధి కొఱకుంగాని మఱియొకటి కాదని నా యభిప్రాయము. అట్టి వైరాగ్యము గలుగనివాఁడు గృహస్తుఁడై రాజయోగపదం బనుసరించుచున్నాఁడు.

మహాత్మా! నేను మరణాంతర బ్రహ్మచర్యవ్రతము గైకొని దండాజినములు దాల్చి యగ్ని వేల్చుచు, వేదమును జదువుచు, జదివినది మఱువక యనుభవ గోచరముఁ జేసికొనుచు మీ యొద్దనే వసియించెదను. చక్కని భార్యం బెండ్లియాడినప్పుడు సుఖముగానే కనంబడును. అనుభవమున విమర్శింప నందున విరసత్వము గనంబడక మానదు. అదియే దుఃఖములకు నాదికారణము. ఐహిక సుఖములేకున్న వివాహకృత్యమువలన యాగాదిసుకృతంబు సంపాదించుకొనవచ్చును. దానంజేసి పార లౌకికఫలము గలుగునంటిరేని వినుండు. సవనతంత్రములు యథాశాస్త్రముగా నాచరించుట దుర్ఘటము. అశాస్త్రీయ పశుహింసనమువలన మహాపాతకములు రాఁగలవు. అదియునుంగాక గృహస్తుండు దరిద్రుండయ్యెనేని త్యాగభోగముల కణుమాత్ర సమర్థుండు కానేరడు. అంతకన్న గష్టము మరియొకటిలేదు. ప్రజలు వానిని జీవచ్ఛవముగా జూచుచుందురు భాగ్యవంతుడైనచో విషయ సుఖ ప్రమత్తుండై సర్వానర్ధ హేతుభూతమగు తృష్ణచే గట్టబడి లేశమైన సంతోషము జెందనేరడు.

శ్లో॥ యాన్యేతానిదురంతానిదుర్జరాణ్యున్న తాస్యపి
      తృష్ణావల్ల్యాః ఫలానీహతానిదుఃఖానిరాఘవ
      యావతీయావతీజంతొరిచ్చో దేతియథాయథా
      తావతీతావతీదుఃఖబీజముష్టిఃప్రరోహతి.

అంతము ముదిమియులేని దారుణములగు దుఃఖములన్నియుఁ దృష్టాలతా ఫలములని తెలిసికొనుము జంతువులకు నెంతవఱకు హృదయంబుల నిచ్చతీగెలు సాగుచుండునో యంతవఱకుదుఃఖబీజములు మొలకలెత్తుచుండునుగదా మఱియుం గామంబు లనుభవము వలన నశింపవు.

శ్లో॥ సజాతుకామఃకామానా ముపభోగేనశ్యామతి
     హవిషాకృష్ణవర్మేవభూయ ఏనాభివర్ధతే.

ఆద్యాది హవిస్సువలన నగ్ని చల్లారక మఱియుం బెచ్చు పెరికి నట్లనుభవించుటచే గామంబులు వృద్ధియగును. కాని క్షీణింపవు. గృహస్తుడు గృహోపకరణముల బూర్తిజేయు తలంపుతో నున్నవానివలని దృప్తినొందక లేనివాని విషయమై కృతప్రయత్నుండగుచు సంసార సాగర మగ్నుండగును. దానంజేసి పూర్వపుణ్యము నశించుటయు, రాబోవు సుకృతముచెడుటయు, నిలిచియున్న పుణ్యము క్షీణించుటయు దటస్థించును. కావున గృహస్థాశ్రమమున సర్వదా దుఃఖమేకాని సుఖలేశము లేదు. నేను భవదీయకృపావిశేషంబునం బొడమిన వైరాగ్యలాభంబునం జేసి యీ బ్రహ్మచర్యాశ్రమము నుండియే తురీయాశ్రమమును స్వీకరింతు నన్ననుగ్రహింపుడని యనేక ప్రకారముల స్తోత్రములు గావించెను. అప్పుడుపాధ్యాయుడు తదీయ వైరాగ్య ప్రవృత్తికి మిక్కిలి యచ్చెరువందుచు విద్యాధిరాజునకు నవ్విషయము వార్తనంప దలంచునంతలో దైవవశంబున బుత్రుందీసి కొనిపోవ నప్పండితో త్తముం డరుదెంచిన జూచి యుపాధ్యాయుండు సహాధ్యాయునకు నాదరంబున నర్ఘ్యపాద్యాది క్రియకలాపంబులు నిర్వర్తించి స్వాగతంబడిగి పిమ్మట నిట్లనియె.

సూరిసత్తమా! నీ కుమారుండఖిలవిద్యా పారంగతుండయ్యును ఉపనిషదర్ధముల జక్కగా దెలిసికొనియెను. వైరాగ్యోదయము లెస్సగా జనించినది. మీ కులంబునకు మిగుల బ్రఖ్యాతి యీతని మూలమున రాగలదు. ఇప్పుడు గృహస్థాశ్రమమును స్వీకరింపదగియున్నవాడు వీనిందీసికొనిపొమ్ము. వానిమతి వేఱొకరీతిగా నున్నదని పలికిన విని సంతసించుచు విద్యాధిరాజిట్లనియె. ఆర్యా! యిదియంతయ నీ యక్కటికంబున లభించినది. పుత్రునివలె జూచి విద్యలంగఱపితివి నీ యుపకార మెన్నటికిని మఱువము వీనింజూడ వీని తల్లి మిగుల నుత్సుకత్వముం జెందుచున్నది. వివాహప్రయత్నమును జేసితిమి. పెక్కండ్రు విద్వాంసులు కన్నెల నిత్తుమని మా యింటికి వచ్చుచుండిరి వీనికి గృహగమనంబున కనుజ్ఞయిండని పుత్రుండు వినుచుండ నగ్గురుని గోరికొనిన నతండును [సాదరముగా] సమ్మతించితిని. సంతోషవార్త వింటినని యుత్తరమిచ్చెను. అప్పుడు శివగురుండు గురుని మోము జూచుచు మెల్లగా దన యుద్యమము వెండియుంజెప్పిన విని శివగురుండు యగ్గురుండేకాంతముగా వాని చెవిలో నేదియోచెప్పెను. ఆమాటవిని శివగురుండు మాఱుమాట పలుకక గురునాజ్ఞగైకొని తండ్రి వెంట నింటికిం జని జనని పాదంబులంబడి నమస్కరించెను. ఆమెయు నతని గ్రుచ్చియెత్తి ముద్దాడుచు జిరవిరహమువలనం గలిగిన పరితాపము శమింప సంతోషసముద్రంబున మునింగెను. తరుచు పుత్రాలింగన సుఖము కర్పూర చందనాదులకన్న జల్లగా నుండి యాహ్లాదపెట్టును గదా! చిరకాలము గురుకులవాసముజేసి సకలవిద్యలం జదివి యింటికి వచ్చిన శివగురుని వార్తవిని బంధుజనము సందోహముగావచ్చి చూచుచుండుటయు శివగురుండు వారినెల్ల నాదరపూర్వకముగా బల్కరింపుచు సంతోష పెట్టు చుండును.

మఱియు విద్యాధిరాజు బంధుసమక్షమందు శివగురుని విద్యాపాటవము దెలియగోరి వేదమునందు భట్టపాద ప్రభాకరకణాద గౌతమ సంఖ్యాది మతసిద్ధాంతముల యందును తర్కవ్యాకరణాది శాస్త్రములయందును ప్రశ్నలువేసి యడుగుటయు నవ్వటూత్తముండు గురునికి నమస్కరించి మందహాసశోభితవదనారవిందుడై యా ప్రశ్నములకెల్ల యుక్తియుక్తముగా దేటమాటలతో సమాధానము జెప్పెను. విద్యాధిరాజు పుత్రుని పాండిత్య ప్రకర్షకు మిక్కిలి సంతోషమును జెందెను సంస్కారరహితములైనను గుమారుని వచనంబులు శ్రవణసుఖం బొనరించుననుచో సంస్కారయుక్తము లయ్యెనేని యేమి నుడువదగినది. అల్పకాలములో శివగురుని విద్యాతిశయము బంధుముఖముగా నాదేశంబంతయు వ్యాపించినది. విద్యాకులగుణశీలాదులచే నిరుపమానుండగు శివగురునికి గన్నెలనిచ్చు తాత్పర్యముతో బెక్కండ్రు ధనికులైన బ్రాహ్మణులు విద్యాధిరాజు మందిర మలంకరించిరి.

శివగురుని వివాహము

అప్పండితుండు వారిచరిత్రల నెల్లవిని వారిలో ధనమున సామాన్యుండైనను గుణశీలాదులచే ప్రఖ్యాత ప్రభావుండగు మఖపండితుండను విద్వాంసుని పుత్రికను గుమారునకు జేసికొనుటకు సమ్మతించెను. పిమ్మట దైవజ్ఞులచే నిరూపింపబడిన శుభలగ్నమందు మఖపండితుండు సతియను పేరునం బరగుగు తనకూతు సతీతిలకమును దీసికొనివచ్చి విధివిధానమున విద్యాధిరాజు మందిరముననే కన్యదానము గావించెను. ఆ వివాహ దినములలో గావించిన యుత్సవములాదేశపు ప్రజలు పెద్దకాలము వఱకు నబ్బురముగా చెప్పుకొనుచుండిరి అవ్వధూవరు లొండొరుల జూచుకొని యపూర్వం సంతోషమును జెందుచు బార్వతీపరమేశ్వరులవలె బ్రకాశించిరి. మరికొంతకాల మరిగిన వెనుక శివగురుండు యజమానుండై సతీదేవితోగూడ ననేకాధ్వరములు గావించి దేవ భూదేవతల సంతుష్టులం జేసెను పెక్కేల నతండు గావించు యజ్ఞములలో హవిస్సుల సేవించెడు వేల్పులు అమృతమును మరచిపోయిరి. తత్తత్పరార్ధములచే బితృ దేవ మనుష్య కోటుల వాంఛితముల దీర్చుచు సుమనోమనోహరుండగు నా శివగురుని జంగమ కల్ప ద్రుమమని యెల్లవారు పొగడదొడంగిరి.

ఆ సుకృతికి బరోపకారమే వ్రతము. వేదపఠనమే నియమము. విహితములే నిత్యగృత్యములై యున్నవి. అతండు రూపంబున మన్మథుండు క్షమచే ధరిత్రియు విద్యల బృహస్పతియు, ధనంబున గుబేరుండు నై గర్వమనునది యించుకయు నెరుంగక వినయసంపత్తితో నొప్పుచుండ బెద్దకాలమరిగెను. సంతానము కలిగినది కాదు.

క. వింతగృహంబులు భూముల
   నంతకనక ధేనుహస్తి హయపశుచయముల్
   సంతోషపెట్టజాలవు
   సంతానములేని యట్టి జనునెవ్వేళన్.

గీ. కలుగుదప్పక యీ శరత్కాలమందు
   బొడమునీచై త్రమున నది గడచెనేని
   దాటదీరానకారు నందనుడువొడమ
   ననుచు దలపోయుచుండనేం డ్లరిగె బెక్కు.

అట్లు పెద్దకాల మరిగినంత సంతానవిహీనతా సంతాపంబు స్వాంతము త్తలపెట్ట శివగురుండొక్కనాడు భార్యతో నిట్లనియె.

సాధ్వీ! మనకు సగము కాలము గతించినది. సంతానము వొడమదయ్యెను. కర్తవ్యమేమియు తెలియకున్నది. సంసారమసార మనియే నేను మొదట బెండ్లి జేసి కొననని నిశ్చయము జేసికొంటిని. గురుండు నీకు లోకవిఖ్యాతుండగు కొమరుండు గలుగు నతనివలన లోకోపకృతి గాఁగలదు. పెండ్లియాడుమని రహస్యముగాఁ జెప్పి నన్నీ యరణ్యమునఁ బ్రవేశ పెట్టెను. రెండింటికిం జెడితిని. అపత్యరహితులమగు మనల నెవ్వరు స్మరింతురు. పల్లవఫలదళభరితమైన వృక్షమును విడిచి గొడ్డుచెట్టు నెవ్వరైన నాశ్రయింతురా! ఇప్పుడు నేను వంశహర్తనైతిని. పితౄణబద్ధుండ నైతినని యనేకప్రకారములు విచారింపుచు భార్యతోఁ బ్రసంగించిన నమ్మహాసాధ్వి యిట్లనియె.

ప్రాణేశ్వరా! దీనికై మీరింత చింతింపనేమిటికి ? మనము భక్తజన కల్పద్రువమైన చంద్రశేఖరు నాశ్రయింతము. మనకు స్థిరమైనఫలము లభించును. దీనికుపమన్యువే ప్రమాణము. వినుండు.

ఉపమన్యుని కథ

తొల్లి యుపమన్యువను ముని బాలకుండాడుకొనుచు నొకచోట బాలుద్రావు చున్న కొందఱు మునిబాలకులతోఁ గలహించి యీసులోఁ దల్లి యొద్దకువచ్చి, "అమ్మా నేనిప్పుడాడుకొనఁ బోయితిని. అందుఁగొందరు పిల్లవాండ్రు తెల్లనివేమియో త్రాగుచున్నారు. నాకు గొంచెమిమ్మని యడిగిన వెక్కిరించిరి. వానిపేరేమి" యని యడిగిన విని యతని తల్లి, నాయనా! అవి పాలు గోపులవలనం బుట్టునని చెప్పినది.

ఆ మాట విని యాబాలుండమ్మా! నాకాపాలు దెచ్బియిమ్ము గ్రోలవలయు నని యడిగిన విని తమ దారిద్య్రదోషమునకు వగచుచు నాయింతి తెల్లనిపిండిని నీటిలో గలపి యిచ్చినది. వానింద్రావి యాయర్భకుండు గంతులువైచుచు నా బాలకులయొద్దకుం జని చూడుఁడిదిగో నేనును బాలు ద్రావుచుంటిని. కొంచెమిమ్మని యడిగిన నిచ్చితిరికారు గదాయని వారినూరించెను. అప్పుడా బాలకులు పరికించి ఇస్సిరో? నీవు పిండినీటింద్రావుచుఁ బాలని మమ్ము వెఱపించెదవా? చాలుఁ జాలు, పాలెక్కడ. నీవెక్కడ పో పొమ్ము. దరిద్రుఁడాయని పరిహసించిరి.

వారి మాటలు విని యుపమన్యువు సిగ్గుపడుచు మఱలఁ దల్లియొద్దకువచ్చి అమ్మా? నీవు నాతోఁ బాలనిచెప్పి పిండిని నీటిలోఁగలిపి యిచ్చితివా? ఎంత మోసముఁజేసితివి. అయ్యో నీమూలమున నాకెట్టి యవమానము వచ్చినదో చూచితివా? నన్నువాండ్రు దరిద్రుడా నీవెక్కడ! పాలెక్కడనని పరిహసించిరి. మనము దరిద్రులమా? దరిద్రులన నేమియని తల్లి పైఁబడి నిర్బంధింపఁదొడంగెను. అప్పుడామె మిగుల జింతించుచు, నాయనా యేమియు లేకపోవుటయే దారిద్యము మన పూర్వపుణ్యమట్టిదని నుడివినది. ఆ మాటవిని యా పిల్లవాఁడు, అమ్మా! ఆ దారిద్ర్యమేమి సేసినం బోవునో చెప్పుము. అట్లు కావించెదనని యడిగిన నా సాధ్వి, పట్టీ! యష్టైశ్వరసంపన్నుఁడగు నీశ్వరునారాధించిన నాదారిద్ర్యము త్రుటిలోఁ బాసిపోవునని చెప్పినది. అప్పుడా బాలుఁడు తల్లి తో నాయీశ్వరుడెందున్న వాఁడో చెప్పుము పోయి యాశ్రయించెదనని యడిగిన నప్పఁడతి గుడిలోనున్న శివలింగమును జూపి యితడే యీశ్వరుఁడని పలికినది.

అప్పుడుపమన్యువు గుడిలోనికింజని తలుపులు మూసికొని యా లింగమును రెండు చేతులతోఁబట్టికొని, స్వామీ! నీవు సమస్త లోకనాయకుండవనియుఁ గామితములఁ దీర్చువాఁడవనియు భాగ్యవంతుడవనియు మాయమ్మ నాతోఁ చెప్పినది నీవు మాత్రము సిరిగలవాఁడవై మాకేమియు లేకుండఁజేయుట నీకు దగునా? నేను మొన్నటిదినము పాలులేక మునిబాలకుల నడుమ నెంత యవమానముఁ బొందితిని. అట్లది నీ కొడుకులకు వచ్చిన నెంత చింతింతువు. నాకుఁదండ్రి లేకపోవుటచే నిన్నింత బ్రతిమాలవలసి వచ్చినది. లేకున్న నాతఁడే నాకుఁబాలు దెచ్చియిచ్చును. తండ్రిలేనివారలకు నీవే తండ్రివని మాయమ్మ చెప్పుటచే నిన్నాశ్రయించుచుంటిని. మాటాడవేమి కోపమా? ఇంతకఠినుండవని మా తల్లి చెప్పలేదేమి మిక్కిలి దయాళుడనియు నడిగిన తోడనే కార్యంబులఁ దీర్బుననియుఁ జెప్పినదే నీసంగతి యెరుఁగదు. లేక నీబుద్ధి మాఱినదా? నిజముఁజెప్పుము నాపట్టు నీవెరుంగవు. క్షణమూరకున్న వీఁడేపోవునని యూరకుంటివి కాబోలును. విడుచువాఁడనుకాను. నేను నీకంటె మొండిని. తండ్రీ! కనంబడుము. మాటాడుము అనుగహింపుము. అవమాన దుఃఖముచేత నింత ధైన్యముఁ బొందవలసి వచ్చినది. నాకుఁ గోపము దెప్పింపకుము. వద్దువద్దు మాట్లాడమని యనేక ప్రకారములఁ బ్రతిమాలెను కాని యమ్మహానుభావునకు దయ వచ్చినది కాదు అప్పుడబ్బాలుండు తన్ను నిందించుకొనుచు సీ! యిక నా జన్మమేల పాలు గొనక వెండియుం జనితినేని మునిబాలకులు నన్ను మిక్కిలి యక్క సక్కెము లాడుదురు. ఈతండు మాటాఁడడు. నా తల్లి యున్ననుఁ బరిహసించును. ఈమాట వీనికే దక్కునుగాక వీనిపైఁబడి శిరము పగులఁగొట్టుకొని ప్రాణములు విడిచెదనని లేచి తన శిరమెత్తి వ్రక్కలగునట్లు గభాలున నా లింగముపైఁ గొట్టికొనునంతలోన

శా. సామేనంబొలుపొందునిందుముఖితోఁ జర్మోత్తరీయంబుతో
    సోమార్దాంచితమౌళితోఁగరలన చ్చూలంబుతో దేవతా
    స్తోమారాధితపార్శ్వభాగములతో శుబ్రాంగకశ్రేణితోఁ
    గామారాతితదగ్రదేశమున సాక్షాత్కారమయ్యెన్ గృపన్.

అట్లు ప్రత్యక్షంబై యప్ఫాలాక్షుం డబ్బాలు నెత్తుకొని, వత్సా! నీ మాటలు విని నేను వచ్చుచుండ నింతతొందరపడియెద వేమిటికి? నీకామితంబేమియో చెప్పుమని యడిగిన విని యుపమన్యుండు సంతసించుచుఁ, దండ్రీ! నాకేమియు నక్కఱలేదు. నాకుఁదండ్రిలేఁడు కావున నేను పిలిచినప్పుడెల్ల నా పనులంజక్క పెట్టుచుండుము. మాయింట పాలు సమృద్ధముగా నుండునట్లను గ్రహింపు మిదియే నా కోరిక యని పలికిన విని యబ్బాలున కవ్వరంబులొసంగి యయ్యనంగవైరి యంతర్హి తుండయ్యె. పిమ్మట నయ్యుపమన్యువు తల్లి యొద్దకుం జని యా వృత్తాంతమెఱింగించినవిని యామె విస్మయావేశహృదయయై పరమేశ్వరుని దయావిశేషంబు నెల్లకాలము గొనియాడు చుండెను. ఉపమన్యుఁడును శివభక్తుండై మహర్షికోటిలోఁ జేరి మిగుల విఖ్యాతుండయ్యెను. మహాత్మా! అట్టి మహానుభావుండు భక్తకల్పద్రుమంబై యొప్పుచుండ మనము చింతింపనేల యతని నాశ్రయింతము మనకామితము దీర్పక మానడు. దేవతలయందు జడత్వమెన్నఁడులేదు. అది మనుష్యుల హృదయములయందున్నది. వీరి చిత్తములు నిశ్చయాయత్తము లయ్యెనేని వేల్పులు తప్పక వరములిత్తురు. కావున శివుని గురించి తపంబొనరింతమని బోధించినవిని సంతసించుచు శివగురుండమ్మరు నాఁడే భార్యతోఁగూడ బూర్ణానదిని స్నానముగావించి దీక్షవహించి కందమూలఫలాశనుఁడై యావృషాచలేశ్వరు నారాధించెను.

మఱియు-

క. పన్నగ కేయూరుమహా
   పన్నగసుశతారు నెడద భావించుచు భా
   స్వన్నీతిఁదపముఁజేసిరి
   కొన్ని దినంబులు జలంబె క్రోలుచువారల్.

ఇట్లత్యంతనియమంబుల నాదంపతులు తపంబొనరింపుచుండ నొకనాఁడు కృపాపరవశుండైన మహాదేవుండు శివగురునికి బ్రాహ్మణవేషంబున స్వప్నంబునం బొడసూపి, ఆర్యా! నీవేమిటికిట్లు కాయమును గ్లేశపరచుచుంటివి. నీ యభీష్టమేమి యని యడిగిన శివగురుండు పుత్రునిమిత్తమని యాకలలోనే యుత్తరముఁజెప్పెను.

అప్పుడు శివుండు శివగురునితో నీకు నల్పాయువు సుగుణ సంపన్నుండు లోకైకవిఖ్యాతుండైన సుతుండొక్కండు కావలయునా? యల్పబుద్ధులు, దుర్గుణులు, దీర్ఘాయువులు నగు సుతులు పెక్కండ్రు కావలయునా? యని యడిగిన నా విప్ర పుంగవుండు ధ్యానించి యల్పాయువయ్యు లోకైక విఖ్యాతుండైన వాని నొక్కనినే దయసేయుండని కోరికొనియెను.

అప్పు డప్పరమేశ్వరుఁడట్టి వరమిచ్చి యంతర్హి తుండైనతోడనే శివగురుండు మేల్కొని యల్పాయువనుమాట తప్ప తక్కిన స్వప్న వృత్తాంతమంతయు సతీదేవి కెఱిగించిన నమ్మించుబోణియు మంచి కుమారుం డుదయించునని మిగుల సంతసించెను. ఆ దంపతులంతటితో నియమములు చాలించి బాహ్మణసంతర్పణంబు గావించి తదాశీర్వాదములనంది యానందింపుచు విప్రభుక్తావశిష్టమగు నన్నమును భుజించిరి.

సతీదేవి గర్భవర్ణనము

ఆ దినమందే శైవతేజ మాయన్నమునఁ బ్రవేశించి శివగురుని శరీరమున వ్యాపించి పిమ్మట నతని పత్నియందుఁ బ్రవేశించినది.

క. వనితారత్నముగర్భం
   బునవాసరమధ్యమందుఁ బొలుపొందువిక
   ర్తను గాంతివోలె నత్తఱి
   ఘనతేజంబొకటి మెఱసెఁ గడుచిత్రముగన్.

గీ. అఖిలవిష్టపభరవహుఁ డష్టమూర్తి
   గర్భగతుఁడై ప్రకాశింపఁగా నొకింప
   యలసగతియయ్యె నయ్యంబుజాక్షియనుచు
   బలుకుటిదియొక యబ్బురంబా? తలంప.

క. గురుకుచ గురుకుచయుగమిష
   నరవిందభవుండు సూతనామృతపూర్ణాం
   తరకనక కలశయుగ్మము
   విరచించెన్ దుగ్ధపాన విధియోగ్యముగాన్.

ఉ. ఆ తరళాక్షి గర్భగతుఁడైన కుమారుఁ డనంతరంబునన్
    ద్వైతమత ప్రశూన్యమత వాదములన్ని రసించియంచితా

    ద్వైతము నిల్పుటల్ దెలుపుఁ దత్కుచకుంభయుగంబుగౌరవ
    త్యాతిశయంబుచే నొకటియైగతమధ్యగతావకాశమై.

ఉ. చారుపయోధరాద్రివిల సద్రుచిళైవలినింజనించి చె
     న్నా రెడునాచునాఁదనరు నాసరసీరుహపత్రనేత్ర నూ
     గారువిరాజిలెన్మిగుల నాశిశుమౌళినిమిత్తమై తదం
     భోరుహసంభవుండవనిఁ బూనిరచించిన దండమోయనన్.

సీ. రమణీయధవళ గోరాజవాహనమధి
              ష్ఠించియల్లన సంచరించినట్లు
    గంధర్వులొగియంత్ర గాత్రంబులనుజుట్టు
             బలసిసంగీతము ల్పాడినట్లు
    జయజయరక్ష రక్షకృపానిధేపాహి
            యంచు దేవతలు ప్రార్ధించినట్లు
    వాదంబులను బ్రతి వాదులనోడింప
           యెలమి విద్యాపీఠ మెక్కినట్లు.

గీ. నిద్రలోఁగాంచి యంతలో నేత్రయుగము
    దెఱచియేమియుఁగాన కబ్బురముఁజెంది
    దెసలుపరికించి యివ్వధూతిలకముల్ల
    మలర మరలను గనులమూయం గడంగు.

శ్రీ శంకరాచార్యుని యవతారఘట్టము

శా. సూర్యాదిగ్రహకోటిస్వోచ్ఛగతమై సొంపార నిర్దుష్టమై
    యార్యంబై తగులగ్నమందుఁగనె సౌఖ్యంబొప్ప శ్రీశంకరా
    చార్యుండత్తరుణీశిరోమణియునా శర్వాణిసేనాని న
    ట్లార్యుల్సంతసమందదుందుభులు మ్రోయందివ్యమార్గంబునన్

సీ. ధృతివోవవిపరీత మతనాదిహస్త పు
            స్తక మకస్మాత్తుగా జారిపడియె
    జెలఁగివేదవ్యాసు చిత్తరాజీవంబు
           వికసించెనిగమ మస్తకములలరె
    గాడ్పులద్భుతదివ్య గంధబంధురములై
          వీచెవేల్పులు పుష్పవృష్టిగురిసి

    రమలంబులైదిక్కు లమరెఁబల్లవపుష్ప
             ఫలదీపితములయ్యెఁ బాదపములు.

గీ. నదులునిర్మలసలిల సంపదఁదనర్చెఁ
    బొదలెనగ్ని ప్రదక్షిణీ భూతశిఖల
    మృగములపగతవైరంబు లగుచు మెలఁగె
    శంకరాచార్యుఁడుదయించు సమయమందు.

అట్లుదయించినకుమారు వృత్తాంతమాకర్ణించి శివగురుండా నందనదీ ప్రవాహంబున మునింగియుఁ బూర్ణానదింగ్రుంకువెట్టి బ్రాహ్మణుల కనేక దానంబులు గావించి దైవజ్ఞుల జన్మకాల విశేషంబులం జెప్పుఁడని కోరిన వారును లగ్న ఫలము విమర్శించి యచ్చెరువందుచు నయ్యారే! యీ బాలుండు సర్వవిద్యా విశారదుండై శారదను సైతముఁ దిరస్కరింపఁగలఁడు. స్వతంత్రముగా శాస్త్రముల రచింపఁగలఁడు తనకీర్తినాచంద్రతారకముగాఁ బుడమి వ్యాపింపఁ జేయును. పెక్కేల నీశిశువొక్కరుండ లోకంబులం జూచినవాఁడగునని నుడివిరి. శివగురుండాబాలుని యాయువును గురించి యడుగలేదు. కావున వారును చెప్పరయిరి. తెలిసియున్నను దైవజ్ఞు లశుభంబులఁ జెప్పరుగదా.

శంకరుని రూపము పుణ్యాంగనలు వర్ణించుట

పిమ్మట శివగురుండా యర్భకునికి జాతకర్మాది కృత్యంబులు నిర్వర్తించి శ్రీశంకరుండని నామకరణము వ్రాసెను. అమ్మహోత్సవంబునకు నుపాయనంబులు గొనివచ్చి విద్యావినయ వివేకవతులగు యువతు లాసూతికాగృహంబున దీపము లేకయే యద్భుత తేజంబునఁ బ్రకాశింపఁజేయు నాశిశురత్నమును జూచి విస్మయముఁ జెందుచు నొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

భవాని — బోధినీ ! యీ యర్భక చూడామణికి శంకరుండని పేరు పెట్టిన శివగురున యభిప్రాయమేమియో నీవు గ్రహించితివా ?

బోధిని — శంకరుని కరుణావిశేషంబునంబుట్టుటచే నట్టిపేరు పెట్టెనని తలంచెదను.

భవాని — కాదు. కాదు. శివగురుండభిజ్ఞుండు శంకరుఁడన సుఖముచేయు వాఁడను నర్ధమునుబట్టి వీనికి పేరు పెట్టెను. నిశ్చయము. వీఁడు కన్నుల కెట్టి యాహ్లాదము చేయుచున్న వాఁడో చూడుము. ఆహా? వీని రూపమాసేచనకమై యున్నదిగదా.

భవాని - సాధు సాధు బోధిని ! నీ బుద్ధి మెచ్చుకొనఁ దగియున్నది. చక్కగా గ్రహించితివి. వీనింజూడఁ గన్నులు చల్లబడుచున్నవి. శివగురుండు వీనికిఁ దగిన పేరుపెట్టెను.

కృత్తిక — అక్కలారా! మరియొక విశేషము గనంబడుచున్నది. చూచితిరా మస్తకమున.

బోధిని — (విమర్శించి) ఇది శశిచిహ్నములాగున్నది సుమీ.

కృత్తిక — అది యొక్కటియే ? నిటలముననున్న నేత్రచిహ్నమునుగూడఁ జూడుము.

బోధిని — అగునగు నిదిగో భుజములపై నున్న త్రిశూలాకృతులఁ బరిశీలించితిరా ?

కృత్తిక — ఓహో! వీనిందప్పక శంకరావతారమనియే చెప్పఁదగినది.

భవాని — సందియమేల? కాకున్న పక్షమున నీనాగరేఖ యెవ్వరికిఁ గలిగియుండును.

కృత్తిక - చెలులారా? కలకల నవ్వుచున్న వీని మొగమెంత సోయగముగా నున్నదో చూచితిరా ?

తిలక — ద్విజరాజమండలమును బురడింపుచున్నదిగదా.

బోధిని — ద్విజరాజమండల శతంబులు ప్రేష్యత్వము వహించి సేవించుచుండ ముఖముతో సాటిఁ జెప్పవచ్చునా.

తిలక — మంచిశ్లేషకవివి. నీ మాట మెచ్చుకొంటిని వీని పాదములు పద్మసమములని చెప్పుటకేమైన నాక్షేపణమున్నదా?

బోధిని — ఉన్నది. ద్విజరాజకరోపలాలితములగుటచే వీని పదంబులఁ బద్మమదాపహరంబులని చెప్పవలయును.

తిలక - బాగు! బాగు!! నీయొద్ద మాటాడుటకే భయమగుచున్నది. కవాట ఫలకమువలె విశాలమైయొప్పుచున్న యీ ముద్దు బాలుని వక్షస్థల మెట్లున్నదో నీవే చెప్పుము.

బోధిని — దేశాటనము చేయుటచే నలసిన జయలక్ష్మికి విశ్రమింప యోగ్యమగు శయ్యవలెనున్నదని నాకుఁదోసినది.

తిలక - బాహువులో.

బోధిని — బాహ్యాభ్యంతర శత్రువులం బరిభవింప సమర్ధములగు పరిఘల వలె మనోహరములైయున్న వికాదా?

తిలక - కపోలములఁగూడ వర్ణించుము.

బోధిని —— వదనమునాశ్రయించియున్న సరస్వతికి నుపయోగించునని సంకల్పించి విరించి నిర్మించిన దర్పణమువలెఁ బ్రకాశింపుచున్నవి.

తిలక — బాపురే నీ యుత్ప్రేక్షములన్నియుఁ బ్రౌఢకవివాక్యస్తుత్యములై యున్నవిగదా. ఈ పాపనిదృష్టిప్రసారములు నాకు మిగుల వింతగాఁ గనంబడు చున్నవి. ఎద్దియో యలంకారముఁ కల్పించి చెప్పుము.

బోధిని - మదనదావానల జ్వాలాసంకులమై యామయకంటక భయంకరమై యొప్పు సంసారతాపంబునం దపించువారికి నమృతమును వర్షించు వీని దృష్టి ప్రసారములు రక్షకములగుంజుమీ.

తిలక — కృత్తికా! యిక్కలికి పలుకు లసత్యములు కావు. ఈ శిశుతిలకము లోకైక విఖ్యాతుండగునని దైవజ్ఞులు చెప్పియున్నారు గదా!

కృత్తిక — అవును. కానిచో నిట్టి యద్భుత రూపలక్షణములు సామాన్య శిశువులకుం గలిగియుండునా?

బోధిని - పురాకృతసుకృత విశేషంబునంగాక వీనిఁ జూచుట లభించునా? మనము కృతకృత్యులమైతిమి. ప్రాకృతులు వీరి మహిమఁ దెలిసికొనఁజాలరు సుమీ.

తిలక - మనము వచ్చి పెద్దతడవైనది. పోవలదా వీని రూపమెంతసేపు చూచినను జూడవలయుననియే యుండును.

అని యమ్మహాడింభకుని వర్ణించుచు నా సాధ్వీరత్నములు కొంతసేపందుండి తమతమ నివాసంబులకుం జనిరి.

శంకరుండును బాలమృగాంకునివల ననుదిన ప్రవర్ధమానుండగుచుఁ తలి దండ్రుల మనోరధము లభివృద్ధినొందఁ గ్రమంబున నవ్వుటయుం, బొర్లుటయు మణి గుచ్ఛంబుల వీడించుటయుఁ, బలుకుటయు, నడచుటయు నాఱు మాసములకు నేర్చు కొనియెను.

శంకరుని బాలక్రీడలు

మఱియు నాశిశువు సంవత్సరము ముగియువరకు స్వభాషనంతయు లెస్సగా గ్రహించి నిర్దుష్టముగా మాటాడదొడంగెను. సంవత్సర ప్రాయముగల యాపాపండు సంస్కార యుక్తముగా మాటాడుటఁ జూచి యెల్లవారు విస్మయ సంతోషములఁ జెందుచుండ దల్లిదండ్రుల మాట జెప్పనేమిటికి? అబ్బాలుండు రెండవ యేఁట సమస్తభాషలు లిపునులు వ్రాయుటకును, జదువుటకును సమర్థుఁడయ్యెను. మూఁడవయేఁడు జొరఁబడిన తోడనే శంకరుఁడు శ్రవణములేకయే కావ్యనాటక పురాణాది గ్రంథ విశేషములు స్వయముగాఁ దెలిసికొనియెను. శంకరుని విద్యాగ్రహణ శక్తి యరసి శివగురుండంతరంగమున వెరఁగందుచుఁ గంటకముదగులునని వెఱచి యప్పుడా శిశునకుఁ జదువుఁ జెప్ప నొక యుపాధ్యాయుని నియమించెను. కాని వాని కతనివలన నించుకయుఁ బ్రయోజనము లేకపోయినది. అది గ్రహించి శివగురుండు మఱల సకల శాస్త్రపారంగతుండగు గురుని మఱియొకని నియమించెను. ఏక సంధ గ్రాహియగు శంకరు డా యుపాధ్యాయునికించుకయు శ్రమ గలుగనీయక మణిదర్పణమువలె సకల విద్యలం గ్రహించి యుపాధ్యాయునకుఁ బాఠములు జెప్పునప్పుడు తప్పులు దిద్దుచుండును.

ధూళిచే నాడుకొను నీడుగల యా బాలునకుఁ గావ్యనాటకాలంకారాదిగ్రంథములు క్రీడనకములై యొప్పుచుండెను. అప్పుడు శివగురుండతని శరీరమును జౌలకర్మచే సంస్కరింపజేయుటయు నది యాహుతులచేఁ బ్రజ్వరిల్లు నగ్ని తేజమువలెఁ బ్రకాశించినది. బృహస్పతినిఁ దిరస్కరించు బుద్ధిబలముగల శంకరుని మ్రోల బాల్య దశయందే యెట్టి పండితుఁడును నోరు మెదల్చుటకు వెఱచుచుండెను. చిన్నతనము నందే యతండు కుత్సిత మతముల ఖండించుచు స్వమతమును బ్రతిపాదించుచుండెను. అంత నొకనాడు శివగురుండు కుమారుని యపూర్వ ప్రజ్ఞావిశేషంబులం దలంచుకొని యచ్చెరవందుచు నాహా! వీని ప్రాయమెంత? విద్యాగ్రహణశక్తి యెంత? వీనికి గురువులు నిమిత్తమాత్రులే కాని వారివలన నొక విషయము వీఁడు గ్రహించుచున్నట్లు కనంబడదు. ఎన్నడో నేర్చికొనియున్నట్లు విద్యలన్నియు వీని ముఖమునుండి వెలువడుచున్నవి యవి శంకరుని మాట యేల తప్పును. వీనికి బ్రాయము చాలదని యుపనయనముఁ జేయనిచో వేదపఠనాధికారము లేకపోవును. గ్రహణశక్తినింబట్టి వీని కుపనయనముగావించెద. వీనిచే నా కులమంతయుఁ బవిత్రముగాగఁలదని తలంచుచు దత్ప్రయత్నము చేయుచున్నంతలోఁ గృతాంతుండతని నిజభువనాగంతుకనిఁ జేసికొనియెను. కట్టా! యముఁడు జంతువుల కృతాకృతముల నరయఁడు గదా! శివగురుని నాముద్దు బాలుని కుపనయనమైనం జేసికొననీయక కాలధర్మము నొందించెను. ఈ సంసారమున నుత్తముఁడగు కొడుకు గలుగుటయే దుర్లభము. కలిగినను లోకోత్తరమైన తదీయ వైభవముఁ జూచుట కడు దుర్లభమని చెప్పుటకు శివగురుఁడే నిదర్శనము. అట్లు నాక లోకమలంకరించిన శివగురుని కళేబరము పైఁబడి సతీదేవి ప్రాజ్ఞురాలయ్యు లోక వాసనా విశేషంబునఁజేసి శోకించుచు, హా ప్రాణనాథా! నీముద్దుకుమారుని విడిచి యెక్కడికిఁ బోయితివి. వీనిపై నీకుఁగల ప్రేమయంతయు నేమయ్యెను. వీని యుపనయనమున కెంతయో ప్రయత్నముఁ జేసితివే యేదియు లేకపోయెను. ఇఁక వీని విద్యాబుద్ధులు జూచి సంతసించువా రెవ్వరు. మాకు దిక్కెయ్యది. అయ్యో యేమి చేయుదము. ఈ వైధవ్య వ్యధ యెట్లు సైతును కట! కటా! విధి యెంత క్రూరుఁడ వైతివిరా యని యనేక ప్రకారముల విలపించుఁ దల్లి నూరడించుచు శంకరుం డిట్లనియె.

జననీ! జననము గలవారికి మరణము రాకయుండునా? జంతువులకుఁ గృతాంతుఁడు బంధువుఁడా? శరీరములు శిలానిర్మితములా? యిట్లెఱింగియు మమత్వమే సంసారవృక్షమునకు బీజము. మనము మాత్ర మెల్లకాలము జీవింతుమా. కాలమునఁ బరిపక్వమైన ఫలము చెట్టునుండి రాలినట్లు మనుష్యులు గాలానుసరణముగా సమయుచుందురు. దానికిఁ గర్మయే కారణము. కర్మబద్ధులగుటయే బంధమునకు హేతువు. మా తండ్రి కృతకృత్యుండై స్వర్గంబలంకరించెను. అతని విషయము చింతించినఁ బ్రయోజన మేమియున్నది. నేను గలిగియుండ నీకేమి కొఱంత. తల్లీ? దుఃఖమును విడువుము వైరాగ్యవృత్తి నవలంబింపుమని తత్త్వోపదేశముగాఁ బలికిన విని సతీదేవి తదీయ ప్రౌఢ వాక్యంబుల కచ్చెరువందుచు శోకోపశమనము గావించు కొనియెను. పిమ్మట నామె శివగురునికి దహనాద్యపర సంస్కారములు జ్ఞాతులచేఁ జేయించి కుంతియుంబోలెఁ బతితో సహగమనముఁ జేయక కుమారుని రక్షించుచు నొక సంవత్సర మతికష్టముగాఁ గడిచినది.

పిమ్మట సతీదేవి శంకరునికి మిగుల వైభవముగా నుపనయనము గావించినది. అప్పటికే శంకరుండు సకల విద్యాపారంగతుండైనను లోకవిరుద్ధము గాని యట్లుగా గురుకులవాసముఁజేసి వేదవేదాంగములఁ జదువఁ బ్రారంభించెను.

శంకరుని విద్యాభ్యాస వైచిత్ర్యము

శంకరునితో విద్యాభ్యాసముఁజేయుచున్న సహాధ్యాయులొకనాఁడు రహస్యముగా ఇట్లని సంభాషించుకొనిరి.

సుమతి — గుణవర్మా! యిది యేమి చిత్రము శంకరునిం జూడ జేనెడు లేడు. వీఁడి విద్య లన్నియు నెప్పుడు చదివెనో తెలియదు. మొదట నన్ను వీనితో సహాధ్యాయునిగా నియమించి నప్పుడీ యల్పునితో సమముగా నెంచిరేయని గర్వపడితిని. ఇప్పుడు వాని ముందర నేనేమిటికిఁ బనికివచ్చితిని గాను.

గుణవర్మ - మీ యిరువురను సమముగాఁ బరీక్షఁజేసితిరా ఏమి?

సుమతి - నిన్న నీవు లేవా యేమి?

గుణవర్మ - లేను గురువస్త్రక్షాళనార్థమై యరిగితి నప్పుడేమి జరిగినదో చెప్పుము?

సుమతి - నేను వేదమంతయు నొక సంవత్సరములోఁ జదివి బ్రథమ పరీక్షలో సుమతియను బిరుదు వడసితి. నది యెఱుంగుదువా ?

గుణవర్మ - ఆ మాట విని యుంటిని.

సుమతి - అట్టి నన్ను నిన్నఁగాక మొన్న వేదము ప్రారంభించిన శంకరునితో కలిసి పనసరువ్వు పెట్టుమని మన గురువుగారు నాకు నియిమించిరి.

గుణవర్మ — దానందప్పేమి యతండు క్రొత్తవాఁడు గావున నీతోఁ గలిపి చెప్పుమనిరి. వానికిఁ దప్పులు వచ్చిన నీవు దిద్దుదువనియే వారి తాత్పర్యము. తరుచు బుద్ధిమంతులతో మందమతులం గల్పుచుందురు గదా ?

సుమతి — ఉపాధ్యాయుని యభిప్రాయమది కాదు. నా తప్పులే వాఁడు దిద్దునని.

గుణవర్మ - అలాగునా ? తరువాత తరువాత.

సుమతి — ఆ మాట విని నేనసూయ చెందుచు నా తప్పులీ బాలుఁడు దిద్దినప్పుడు చూతము లెండని పలికి యెరింగియుఁ దప్పు ద్రోవలు తొక్కితిని.

గుణవర్మ - మంచి యుపాయమే యూహించితివి. పిమ్మట.

సుమతి - ఆ ఢింబకుఁడు నా పెడ త్రోవలం బడక సవరించి చక్కగాఁ జదివెను.

గుణవర్మ — అట్టి సామర్థ్యము వాని కెట్లు వచ్చినది ?

సుమతి — పురాకృతసుకృతము వలన. పిమ్మట నన్ను మన గురువుగారు పరిహసించిరి.

గుణవర్మ - తరువాత.

సుమతి — నేనెరింగియే వీని బుద్ధి దెలియుటకై తప్పితిని. మఱల మా యిరువురను బరీక్షింపుఁడని పలికితిని.

గుణవర్మ - అది యుచితమే. తరువాత.

సుమతి - అప్పుడు మా యిరువురను వేదము ఘనలో స్విస్తి చెప్పుమని నియమించిరి.

గుణవర్మ - దానిలో నీకు జయము గలిగినదా ?

సుమతి - నాకుఁ గాదు పరమేశ్వరునికి గలుగదు వినుము. వేదములో శంకరుండు గావించిన విచిత్రావధానముల నేమని చెప్పుదును. నాకుఁ బనస లందిచ్చుచుఁ దప్పులు దిద్దుచుఁ దాఁజెప్పవలసిన వాక్యములు తలక్రిందులుగాఁ జెప్పె.

గుణవర్మ - నీకు మఱలఁ దప్పులు వచ్చెనా యేమి ?

సుమతి — అతఁడు దిద్దిన తప్పులు నేనును మన గురువుగారును గురువుగారి గురువుగారికూడ నెఱింగినవికావు.

గుణవర్మ - వానికి మన గురువుగారు సమ్మతించితిరా ?

సుమతి — మొదట నొప్పుకొనిరికారు. తరువాత నతం దర్ధము చెప్పి శాస్త్ర దృష్టాంతములు జూపి సమాధానపరచెను.

గుణవర్మ — శాస్త్రప్రసంగము గూడ జరిగినదా యేమి ?

సుమతి — అయ్యో యేమని చెప్పుదును. తర్క వ్యాకరణముల యందసమాన ప్రజ్ఞ గలిగి పెక్కు బిరుదులు గైకొనియున్న మన గురువుగారి సహాధ్యాయు లిరువురు వానితోఁ బెద్దతడవు ప్రసంగించిరి.

గుణవర్మ — తమ సహాధ్యాయుని వాదము నిల్పవలయుననియా యేమి ?

సుమతి - అవును. ఆశ్రమమున వారిని శాస్త్రములలో నిరుత్తరులం గావించి తప్పులు దిద్దెను.

గుణవర్మ - ఆహా! శంకరుని విద్యార్ధియనియు, బాలుండనియు సామాన్యునిగాఁ దలంచుచుందురు. విద్యామూర్తి యని యెరుంగరు. వీనిలో దైవశక్తి యున్నది సుమీ. కాకున్న వీని ప్రాయమెంత? విద్యయెంత?

సుమతి — ఈతండు మనుష్య మాత్రుఁడుకాఁడు. అవతారమూర్తి యనియే తలంపవలయు. నిశ్చయము. ప్రసంగము గావించినపుడు వీని వదనమునుండి శబ్దజాలము గంగాప్రవాహమువలె గలగల ధ్వనితో నూరక మొలచుచున్నట్లే బయలు వెడలును గదా.

శ్లో॥ నృత్యద్భూతేశవల్లమ్మకుటకటత్స్వర్దునీ స్పర్దినీ భి
      ర్వాగ్బిర్నిర్బిన్నకూలోచ్చలదమృతసరస్సారిణీధోరణీభిః
     ఉద్వేలద్వైతవాది స్వమతపరిణతాహంక్రియాహుంక్రియాభి
     ర్బాతి శ్రీశంకరార్యస్సతతముపనిషద్వాహినీగాహినీభిః.

గుణవర్మ — మనకు శంకరుని సహాధ్యాయులమని చెప్పుకొనుటయే ప్రతిష్ఠ గదా అదిగో మనరామభట్టీలాగున వచ్చుచున్నాఁడు చూచితివా.

సుమతి — మనకొఱకే కావచ్చు.

రామభట్టు — [ప్రవేశించి] మిత్రులారా! యిందేదియో మంతనమాడు చున్నారే.

సుమతి — మఱేమియులేదు. నిన్న శంకరుఁడు గావించిన యద్భుతచర్యల వీరితోఁ జెప్పుచున్నాను.

రామభట్టు - నీవు శంకరుని మహిమ యెరుంగక వానితో వాదమునకుఁ బూనుకొంటివి. దానికి గురువులు నిమిత్తమాత్రులుగాని వాఁడు విద్యార్ధికాఁడు వాని మహిమ నేనంతకుఁ బూర్వమే యెరుంగుదును.

శ్లో॥ అజ్ఞానాంతర్గహనపతితానాత్మవిద్యోపదే శై
     స్త్స్రాతుంలోకాన్బవదవశిఖాతాపసాపచ్యమానాన్
     ముక్త్వామౌసంవటవిటపినోమూలలో నిష్పతంతీ
     శంభోర్మూర్తిశ్చరతిభువనెశంకరాచార్యరూపా.

అజ్ఞా నారణ్య మధ్యంబునంబడి పుత్త్రస్త్రీధనవశవియోగ సంతాపముగల సంసారదవానలంబునఁ బరితపించెడు జనులకు నాత్మ విద్యోపదేశముచే రక్షింపనవతరించిన శంభుమూర్తియని నమ్ముము.

సుమతి — సందేహమేల! ఆ మాటయే నేను వీరితోఁ జెప్పుచున్నాను.

రామభట్టు - నిన్న యుదయమున జరిగిన యద్భుతము నీవు వింటివా.

సుమతి - లేదు. మదీయ పరాభవదుఃఖముచేత మూఁడు రోజులనుండి నేను బయటకేరాలేదు. ఏదియో చెప్పుము.

రామభట్టు — శంకరుండును సోమవర్మయు నిన్నను మాధుకర భిక్షకై యొక పేద పారునింటికింజని భవతి భిక్షాందేహి యని యడిగిరఁట.

సుమతి - తరువాత.

రామభట్టు - ఆ మాట విని యాయింటి యిల్లాలు వాకిటకివచ్చి వారింజూచి, వత్సలారా ! మీరు వామనమూర్తుల వలె వచ్చి నన్ను భిక్ష నడిగితిరి. నేనేమి చేయుదును. మీయట్టి వారికిఁ బెట్టుకొను భాగ్యము నాకు లభించినదికాదు నేను మహాపాపాత్మురాలను. ఇంట నేమియును లేక మూఁడు దినములనుండి యుపవాసము చేయుచున్నాము. తొలుతనే యీ పాడుకొంప కేమిటికి వచ్చితిరి. మఱియొక చోటనుగూడ లభింపదు. వూరక పోవకుఁడీ యుసిరకకాయమాత్రమున్నది. ఇది గైకొనుఁడని యా ధాత్రీఫలం బిచ్చి యూరక విచారింపఁ దొడంగినది.

సుమతి — అయ్యో! యీ యగ్రహారంబున నంతకటికి దరిద్రులున్నారా? శివశివా యప్పుడప్పుణ్యాత్మురాలి మనస్సెంత తపించినదోకదా. తరువాత.

రామభట్టు - భక్తిపూర్వకముగా నిచ్చిన యా ధాత్రీఫలము గైకొని శంకరుండు తదీయదారిద్ర్యదోషమునకు మిక్కిలి వగచుచు నప్పుడే సద్వృత్తరత్నములచే మహాలక్ష్మిని స్తోత్రముఁజేసి సాక్షాత్కరించిన యమ్మహాదేవిని నప్పాఱెత దారిద్ర్యము వాయఁజేయుమని వేడికొనియెను.

సుమతి - దీన నతండు దీనదయాళుండైనట్లు స్పష్టపడుచున్నది గదా. పిమ్మట.

రామభట్టు — పిమ్మట నయ్యిందిరాదేవి యతని యనుమతి గతి వారి మందిరములోఁ గనకామలవర్షము గురిపించినది.

సుమతి — ఆ యిల్లాలి పూర్వసుకృత పరిపాకంబునంగాక యబ్బాలుండు వారింటికి భిక్ష కరుగునాఁ తరువాత.

రామభట్టు — వానచినుకులనడుమఁ దమవాకిటంబడిన పైఁడి యుసిరిక కాయలం జూచి యా యిల్లాలు సంతోషము పట్టజాలక యబ్బురముఁ జెందుచు నా వృత్తాంత మెల్లరకుం చెప్పినది.

సుమతి - ఆ యుసిరికాయలం నీవు జూచితివా ?

రామభట్టు - సోమవర్మతో నీ కథఁ జెప్పుచు నామె వానికా కాయలం జూపినదఁట. అతండు నాకీ కథ రాత్రిఁ జెప్పెను.

సుమతి - మనముగూడ నతని నాశ్రయించుచుందుము. మహాలక్ష్మి వాని చేతులో నున్నది గదా. యెప్పుడైన దయ రాకపోవునా ఏమి ?

రామభట్టు — ఈ యలఁతి సిరితోనేమి యతని యనుగ్రహమే కలిగినచో మనకు శాశ్వత సుఖపదమే కలుగునుగాదా.

సుమతి - అవును ఇది మొదలు మనమతని సహాధ్యాయ బుద్ధి విడిచి దైవముగా భావించుదుముగాక.

రామ —— అతం డవతారమూర్తియే కానిచో నేడేండ్ల ప్రాయము గలవాని కీ ప్రజ్ఞ లెట్లు కలుగును.

సుమతి - అతండు కొంతకాల మిందుండునా ?

రామ — ఇక బదిదినములు మాత్రముండి పిమ్మట నింటికిం జనునట. తల్లి యొద్దనుండి రమ్మనుమని వార్తరాగా దిరుగనట్లు ప్రతి వార్త నంపెను.

సుమతి — అట్లైన మనముగూడ నతనితో బోవుదము కృతృత్యుల మగుదుము.

అని యెరింగించి మణిసిద్ధుండప్పటికి కాలాతీతమగుట దదనంతరోదంత మవ్వలి మజిలీయం దిటుల చెప్పదొడంగెను.

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

49 వ మజిలీ

ద్వితీయోల్లాసము

అట్లు శంకరుండ పూర్వ ప్రభావప్రచారములచే నేడవయేడు ముగియు వరకు గురుకుల వాసముజేసి సర్వవిద్యలయందు నసమానపాండిత్యము సంపాదించి సర్వభాషాకవిత్వచాతురీధురీణుండై సరస్వత్యవతారమని యెల్లరు గొనియాడుచుండ నింటికింజని తల్లికి నమస్కరించెను.

శంకరుని మాతృసేవ

సతీదేవియు దదీయాద్భుత విద్యా గ్రహణసామర్థ్యము విని వెరగుపడుచు బుత్త్రుం దీవించి కౌగలించుకొని శిరము మూర్కొని ముద్దాడి తద్దయు గారవించి విద్యాభ్యాస కాలవిశేషము లడిగెను.