కాశీఖండము

కవిసార్వభౌముడు శ్రీనాథమహాకవి 'ప్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండ' రచించిన ప్రౌఢకావ్యము కాశీఖండము. రాజమహేంద్రవరము నేలిన రెడ్డిరాజు వీరభద్రారెడ్డి కంకితముగా క్రీ.శ. 1440 సం॥ ప్రాంతమున రచినమైనది. ఇది స్కాందపురాణమునందలి యేబదిఖండములలోగల సంస్కృత కాశీఖండమునకు అనువాదము. మహాపురాణైకదేశ మగు సంస్కృత కాశీఖండము సులభగ్రాహ్యమై పురాణరీతితో నుండఁగా, తెనుఁగున శ్రీనాథుఁడు ప్రౌఢతరమగు కావ్యశైలిలో దీనిని వచించెను కావుననే “కాశీఖండమయః పిండమ్" అను నాభాణకము తెలుగు కాశీఖండమునుబట్టియే యేర్పడినది.

సంస్కృతమూలమున, ద్వాదళసహస్రగ్రంథపరిమితిగల విషయమును తెలుగున నేడాశ్వాసములును (1-142,2-167, 3-248,4-306,5-399, 6-310, 7-265) 1777 గద్యపద్యములుగల కావ్యమైనది. మూలగ్రంథములోని పౌరాణికవిషయములను, జాతివార్తా చమత్కార విలసితముగను, శైవతత్త్వప్రతిపాదకములుగను శ్రీనాథకవి విపులీకరించి, ఆంధ్రతాముద్ర నీగ్రంథమున నచ్చొత్తినవాఁడు.

కాశీఖండమున కాశీక్షేత్రమహిమయే చెప్పబడినను, అందందు సాముద్రిక, పాతంజలయోగశాస్త్ర, మంత్రశాస్త్ర విశేషములు పొందుపడినవి కావున నిది శ్రీనాథుని కవితాశైలికేగాక పాండితీప్రతిభకు నికషోపలము.

ఇందలిశైలి కావ్యశైలి గావున సంస్కృతాంధ్రసాహితీపారగుఁ డగు శ్రీనాథుఁడు, పూర్వకవుల రచనారీతుల నెట్లు జీర్ణించుకొన్నదనియు తెలిసికొనుటకు నీగ్రంథ మెంతేని యుపయోగపడును. సంస్కృతమున, మయూరుని సూర్యశతక శ్లోకానువాదములు ప్రధానస్థాన మాక్రమించును. వాల్మీకిరామాయణము, భవభూతియుత్తరరామచరిత్రము, విశాఖదత్తుని ముద్రారాక్షసము, భట్టగోపాలుని సాహిత్యచింతామణి (కావ్యప్రకాశికవ్యాఖ్య) అవతారికారచనముల కనువాదము లిందు గలవు. తెలుగున వేములవాడ భీమన యుద్దండలీల - నన్నయ భట్టారకుని యుభయవాక్ప్రౌఢి, తిక్కయజ్వ రసాభ్యుచితబంధము ప్రబంధపరమేశ్వరునిసూక్తివైచిత్రియు నిందుగలవు. ఇవియన్నియు ప్రత్యేకముగ జూపిన గ్రంథవిస్తరమగును. సూక్తముగను విశాలముగను బరిశీలించి శ్రీనాథమహాకవి రచనమున పదబంధములకు మూలములు మనము కనుగొనుట కవకాశములు గలవు.

కాశీఖండము శ్రీనాథుఁ డాంధ్రీకరించిన వెనుక వేఱెవ్వరును పద్యకావ్యముగ దీని నాంధ్రీకరింప దలపెట్టలేదు. ఈ విష యమే దీని ప్రత్యేకత తెలుపగలదు. కంచెర్ల శరభకవి (క్రీ. శ. 1500) యు మోచర్ల అన్నయు (క్రీ. శ. 1650, దీనిని ద్విపద కావ్యములుగ పరివర్తించిరి. కాని యవి లభ్యమగుట లేదు. దీనిని కర్ణాటాంధ్రభాషలలో వచనరూపముగ హాలాస్యమాహాత్మ్య కృతికర్త యగు నంజరాజు రచియించియున్నాడు. ఈవచనకాశీఖండము నముద్రితమైయున్నది. లాక్షణికులగు తాతంభట్టు, అప్పకవి కాశీఖండములోని లక్ష్యము లుదాహరించిరి. కూచిమంచి తిమ్మకవి తన సక్వలక్షణ సారసంగ్రహమున నిందలి పద్యములను డెబ్బదింటికి పైగా నుదాహరించియున్నాడు. ప్రామాణికాగ్రగణ్యుఁడగు పరవస్తు చిన్నయసూరి దీనియందలి పాఠభేదములను గుర్తించినాడు. భాషావిషయమున నీ గ్రంథ మెంతప్రమాణమో పై యుదాహృతులే తెలుపగలవు.

శ్రీనాథుఁడు సంస్కృతకాశీఖండమునందలి వ్యాసుఁడు కాశిని బాయుట అను వృత్తాంతమును గ్రహించి, దక్షిణకాశి యనఁదగిన దాక్షారామక్షేత్రమాహాత్యమును (భీమఖండము) రచించెను. అఖిలభారతవర్షప్రసిద్ధమగు కాశీక్షేత్రమహిమను దెలుపుగ్రంథమే స్కాందపురాణమున నున్నది. ఆగ్రంథవిషయమును గ్రహించి, ఆంధ్రదేశమున నూతనముగ వెలసిన దాక్షారామముయొక్క మాహాత్మ్యమును తెలుగులో రచించి, ఆవెనుక దానికి పురాణప్రామాణ్యమును మూలగ్రంథగౌరవమును నొసంగుటకు శ్రీనాథుఁడు తెలుగుగ్రంథమును యథామాతృకముగా సంస్కృతీకరించెను. సంస్కృతభీమఖండము శ్రీనాథోపజ్ఞమే యనుటకు నీవ్యాసఘట్టమే ప్రమాణము. కాశిని వ్యాసుఁడు బాసినవృత్తాంతము రెండుగ్రంథములయందును, భిన్నభిన్నరీతులుగ నుండుట కిదియే కారణము. ఈ గ్రంథములను రెంటిని మూలగ్రంథములతో పరిశీలించి చూచిన నీవిషయము తేటతెల్లము కాఁగలదు.

క్షేత్రమహిమలు వెలయించుటయందు శ్రీనాథునికిఁగల ప్రత్యేకతను శ్రీయుత మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నముపంతులవారు తమ బిల్వేశ్వరీయమున నవతారికలో నిట్లు ప్రశంసించియున్నారు -

శా. స్కాందం బందనువందివందితమునౌ ఖండద్వయం బాంధ్రభా
షం దివ్యంబుగఁ జేసి క్షేత్రమహిమాచార్యుం డనన్ గౌరవం
బందె న్మున్నుగ బిల్వనాథసమనామాఢ్యుం డెవండెంతు
సత్సందోహస్తుతు నమ్మహాకవిని విద్వన్నాథు శ్రీనాథునిన్.

శ్రీనాథుని రచనము లనఁగా, పదునాల్గు పదునైదవశతాబ్దిలోని యాంధ్రదేశరాజకీయ, సాంఘిక, సారస్వత చరిత్రపతిబింబములు. ఆంధ్రమహాజనుల సాహితీమయ జీవితమున సరసత్వమును, జాతీయతను, సభ్యతను ముద్రించి యజరామరకీర్తి గడించిన శ్రీనాథమహాకవిగ్రంథములుస ప్రమాణికపాఠములతో సంస్కృతమూలములతో, సవ్యాఖ్యానములతో సమగ్రముగ ముద్రితము లగునేని యప్పు డామహాకవిలోకోత్తరస్వప్రతిభావిశేషము, సర్వతోముఖ పాండిత్యము, సాహిత్యవిద్యాపారీణత, జాతీయకవిశేఖరత్వము ప్రస్ఫుటములై, ఆతనికీర్తిమూర్తిని దేదీప్యమానముగ విరాజిల్లఁజేయ సమర్ధములగును. ఆంధ్రమహాజను లట్టి మహాకార్యమునకు గడంగుదురుగాక!

నిడుదవోలు వేంకటరావు, ఎం., ఏ.