ద్వితీయోల్లాసము
క. |
శ్రీలుఁడు ప్రణతావనిపతి, మౌళిమణిద్యుతిసమేతమంజీరుఁడు తే
జోలంకారుఁడు ధృతిసుర, శైలుఁడు చాళుక్యవిశ్వజనపాలుఁ డిలన్.
| 1
|
శా. |
శ్రీ నిండారఁగ లోకరక్షకొఱకై సిద్ధించుటంజేసి ల
క్ష్మీనాథుం డగునయ్యుపేంద్రుఁ డటు లేఁగెన్ గాన నీనూతన
క్ష్మానాథుం డగు విశ్వనాథునకు శృంగారాధినాథత్వ మెం
తే నొప్పుం బ్రణుతింప నంచుఁ గవు లుత్ప్రేక్షింతు రెల్లప్పుడున్.
| 2
|
క. |
కావున నుపేంద్రునకు ల, క్ష్మీవనితకు దనయుఁ డైనశ్రీవిశ్వేశ
క్ష్మావరునకుఁ బ్రియకరముగ, భావితశృంగారరసముఁ బ్రణుతింతుఁ దగన్.
| 3
|
క. |
ఉక్తవిభావాదులచే, భక్తనవస్థాయిరూపభావంబులు సు
వ్యక్తములై నిజగుణసం, సక్తము లై రసము లన రసత్వము నొందున్.
| 4
|
తే. |
స్థాయిభావంబులకు ననుసారు లైన
తద్విభావాదులను రసత్వంబు గలుగుఁ
ఒరఁగ వెన్నకుఁ బాకసంప్రాప్తిఁ జేసి
తగుఘృతత్వంబు కలుగుచందమున నెపుడు.
| 5
|
క. |
వినువారికిఁ గనువారికిఁ, దనరు విభావానుభావదర్శననయముల్
ఘనరసపోషకములు నాఁ, జనుఁ గవితానాట్యములఁ బ్రసన్నాకృతు లై.
| 6
|
తే. |
ప్రోడలకుఁ గావ్యములయందుఁ బొందు రసము,
ద్రష్టలకు నాట్యములయందుఁ దనరు రసము
స్ఫుటవిభావానుభావసంఘటనచేత
సాత్వికవ్యభిచారిసంసక్తిచేత.
| 7
|
క. |
రస మారోప్యం బగుటన్, బొసఁగదు నాట్యములయందుఁ, బొల్పగుఁ దత్త
త్ప్రసరస్మరణముచేతన్, వెస సామాజికులయందు వేడ్కకు నెలవై.
| 8
|
శృంగారరసము
క. |
అతులానందాత్మిక యగు, రతియె విభవాదిభావరంజనముల సం
వృత యై శృంగారరసా, కృతిఁ జెందు మనోనురాగకీలితగతులన్.
| 9
|
క. |
ద్వివిధం బగు శృంగారం, బవిరళసంభోగసంభవాత్మకమును గై
తవవిప్రలంభజము నన, యువతిప్రియజనులవలన నుదితం బగుచున్.
| 10
|
సంభోగశృంగారము
క. |
అనులాపాలింగనద, ర్శనచుంబనమోదనప్రసాధనవిధులన్
వనితలుఁ బతులున్ దమలోఁ, జెనయుట సంభోగజనితశృంగార మగున్.
| 11
|
మ. |
లలితస్విన్నకపోల మాననము, హేలాలోల మాలోకనా
వలనం, బుల్లసదంగ ముత్పులకసంవాసంబు, వృత్తస్తన
స్థలి మాల్యావృత, రంజితాధరము లబ్జాహాసభావంబు, నె
చ్చెలి కీసొంపు చళుక్యవిశ్వవిభుఁ డిచ్చెన్ జూచితే నిచ్చలున్.
| 12
|
తే. |
పంచవిధభావకలితప్రపంచ మెల్ల
గలసి శృంగారగసపోషకంబ యండ్రు;
క్రమముతోడఁ బ్రయోగసంగతి యెఱింగి
కావ్యనాటకములఁ గూర్పఁ గనుట యొప్పు.
| 13
|
తే. |
ఇందు శృంగారరసమును నెసఁగఁజేయు
వివిధభావాదికక్రియావింశతియును
నెఱుఁగఁబడు భావకుల మది కేర్పడంగఁ
గవిత లక్షణలక్ష్యప్రకారములను.
| 14
|
క. |
అంగనలకు యౌవనగుణ, శృంగారరసోపపన్నచేష్టలు నానా
భంగులయి యొప్పు నిరువది, యింగితముగఁ దత్ప్రకార మెఱుఁగఁగవలయున్.
| 15
|
క. |
ఆవింశతిలో భావము, హావము హేలాభిధయును ననియెడు మూఁడున్
భావింప నంగజాతము, లావిధ మెఱుఁగంగవలయు నయ్యయి గతులన్.
| 16
|
తే. |
అలరు శోభయుఁ గాంతి దీప్తులును మధుర
తయుఁ బ్రగల్భత్వమును సరోజగతియును
ధీరతయు నాఁగఁ బేర్కొను తెఱఁగు లేడు
పరఁగు సతుల కయత్నసంభవము లగుచు.
| 17
|
తే. |
చెలఁగు నీలావిలాసవిచ్ఛిత్తి విభ్ర
మాహ్వయంబులు గిలకించితాభిధంబుఁ
గొరలు మోట్టాయితంబులు గుట్టమితము
నెసఁగు లిబ్బోకలలితవిహృతులు వరుస.
| 18
|
క. |
పదియును నైసర్గికములు, విదితము లన్నియును గూడి వింశతి యయ్యెన్;
వదలక తల్లక్షణములఁ, దదుదాహరణములు నెఱుఁగఁదగుఁ దజ్జ్ఞులకున్.
| 19
|
భావము
క. |
అతినిర్వికారచేతో, గతవృత్తివిశేష మరయఁగా సత్త్వము, త
త్ప్రతిపాద్యక్రియ భావము, సతతాలంకారకారి, చనుఁ దెలియంగన్.
| 20
|
ఉ. |
ఆళిజనోపభోగవచనార్ధములం జెవిఁ బెట్టి, సిగ్గుతోఁ
గ్రాలెడువింత చూపు కడగన్నులయం దిడి, మున్నువోలె వై
మాళపుటాటకున్ జొరదు మారుఁడు గల్గుట లో నెఱింగి, యీ
బాల చళుక్యవిశ్వజనపాలునిఁ జూచుట నిక్కువంబ పో.
| 21
|
హావము
క. |
భావమ యించుక వదన, వ్యావళితవికాస మైన హావము, శృంగా
రావిర్భావనివాసము; భ్రూవల్లీమందచలనమున నెఱుఁగఁబడున్.
| 22
|
చ. |
అరవిరితమ్మిలో వెడలునమ్మధుపమ్ములఁ గ్రేణి సేయుచున్
గరము విలోచనాంతములఁ గ్రాలెడుచూడ్కుల దందడించున
మ్మరుఁ డెడకాఁడుగా నొకతె మక్కువఁ గన్గొనె సిగ్గు ముందఱన్
దిరుగఁ జళుక్యవిశ్వనృపతిన్ జెలిచాటున నుండి వేడుకన్.
| 23
|
హేల
క. |
హావము సువ్యక్తవిలా, సావహ మగు నేని హేల యనఁగాఁ బరఁగున్
భావింపఁగ శృంగారము, పై వాఱుచు నారఁబారఁదనరుటచేతన్.
| 24
|
శా. |
భ్రూతారావలనంబు ఘర్మపులకాభోగంబు రాగంబునున్
జేతోజాతుఁడు తన్ను జోకుటఁ బ్రశంసింపన్ బ్రసన్నోదిత
ప్రీతిన్ జూచెఁ బయోజనేత్ర కుతుకశ్రీపుష్టదృష్టిక్రియా
చాతుర్యంబులు చంద్రికన్ దెగడఁగాఁ జాళుక్యవిశ్వేశ్వరున్.
| 25
|
ఈమూఁడును అంగసముద్భవములు.
శోభ
తే. |
రూప యౌవన లావణ్యరూఢి సొబగు
సుందరుల కెల్ల రసికులు శోభ యండ్రు;
దలరు నన్యోన్యతుల్యగాత్రములయందుఁ
గడఁగి పెట్టని తొడవయి కానఁబడుచు.
| 26
|
ఉ. |
కోరి చళుక్యనాథుకడకున్ జనునింతికి రత్నకాంచనా
కారము లైనభూషణనికాయములం దడవంగ నేల; యీ
సూరెలఁ గ్రాలునంగములసోయగ మెంతకు లేదు చూడుఁ డా
మారునిపూవుఁదూపులకు మాఱటరూప మనంగ నొప్పెడున్.
| 27
|
కాంతి
క. |
ఆశోభయ రంజనగుణ, పేశలయై మించు గలిగి బెరసిన విద్యా
కౌశలులు కాంతి యండ్రు ప్ర, కాశప్రతిభాప్తి నెఱుఁగఁగాఁ దగు బుద్ధిన్.
| 28
|
చ. |
కలపపుఁబూఁతలోన వెలిఁ గ్రమ్ముచుఁ బయ్యెదచీరమీఁద ను
జ్జ్వల యగునంగకాంతి గరువంపునడం బొలుపారెఁ జూచితే
పొలఁతి కుపేంద్రపుత్త్రపరిభోగమతిన్ జనుచోట నెంతయున్
బలుచనివారిదంబు వెలిఁబర్వు శశిప్రభతోడ సాటియై.
| 29
|
దీప్తి
క. |
శస్త మగుకాంతికల్పిత, విస్తారము దీప్తి యనఁగ విలసిల్లు శరీ
రస్తుతగభస్తివిభవని, రస్తాలంకారకరణ యగు సతి కొప్పున్.
| 30
|
మ. |
బలవద్విశ్వనరేంద్రుధాటి మదిలో భావించి యుగ్రాచలా
చలితధ్వాంతగుహాంతరంబులఁ బ్రవేశం బొప్పఁ గావింతు ర
స్ఖలితాంఘ్రిప్రసరంబులన్ బ్రియవధూశారీరభూరిప్రభా
వలనంబుల్ కరదీపికావళులుగా వైరిక్షమావల్లభుల్.
| 31
|
మాధుర్యము
క. |
పొగ డొందనివస్తువుతోఁ, దగిలియుఁ గడుహృద్య మగుటఁ దా మాధుర్యం
బగు నప్రసిద్ధమండన, లగనంబున నెఱుఁగఁ దగు విలాసకరం బై.
| 32
|
ఉ. |
లాలితసిందువారముకుళంబులపేరులు కర్ణకీలితా
లోలశిరీషపుష్పములు లోధ్రరజంబును మేనఁ జెంది సు
శ్రీలఁ దనర్పఁ క్రొవ్విరులఁ జేసినకానుక యిచ్చి సొంపుతో
బాల చళుక్యవిశ్వజనపాలుని మ్రోల వెలింగె సిగ్గునన్.
| 33
|
ప్రాగల్భ్యము
క. |
వ్రీడోదితభయమున్ దగ, వీడుట ప్రాగల్భ్య మనఁగ వెలఁదుల కొనరున్
ప్రోడతనం బై విద్యా, మ్రేడితసంక్రీడనముల మెలఁగెడు నెడలన్.
| 34
|
మ. |
ఇల విశ్వేశ్వరచక్రవర్తిసభలో నీముగ్ధ భావింప ని
శ్చలలజ్జావతి యయ్యునుం దగునెడన్ సంగీతసాహిత్యవి
ద్యల విద్వన్నుతి కెక్కినట్టిదిగదా తర్కింప నత్యాశ్రయ
స్థలదత్యాతతసిద్ధులన్ విధికళాచాతుర్య మొప్పుం జుమీ.
| 35
|
ఔదార్యము
క. |
లలి సురతాయాసాదుల, నలసియు విలసిల్లు కణఁక యౌదార్య మగున్
లలనకుఁ దగ మగుడనివే, డ్కల నొసఁగున్ దయితకౌతుకప్రదచేష్టన్.
| 36
|
ఉ. |
కన్నులచెన్ను హల్లకవికాసముతోఁ బురణింప, లింకపున్
జన్నులమీఁది పెంజెమరు సాలమి నెన్న, మృదుప్రచార ము
త్పన్నపుసోలముం దెలుప, భామకు లోఁ దమకం బొకింతయున్
సన్నము గాక విశ్వనరనాథునిపైఁ దగులంబ చూపెడున్.
| 37
|
ఈయాఱునొకటియు అయత్నసంభవములు.
ధైర్యము
క. |
రూపింపఁ జిత్తసంభృత, చాపల్యముచేతఁ బుష్పచాపాదులచే
నేపఱక యుండుతాలిమి, చూపట్టును ధైర్య మనఁగ సుస్థిరబుద్ధిన్.
| 38
|
మ. |
పతి విశ్వేశుఁడు నాకు; నవ్విభుఁడు చెప్పన్ సర్వలోకాశ్రయుం
డతఁ డేలాగు దలంచినన్ దలఁపనీ; ప్రాణంబు నిత్యంబె? మా
రుత మాకంద మనోజ మాధవ మహారోషంబు సైరింప సం
స్తుతి సామాన్యమె? మాన మాభరణ మై శోభిల్లదే యెల్లెడన్?
| 39
|
లీల
క. |
గతివచనాలోకన మి, శ్రితచేష్టలఁ బ్రియుని ననుకరించుటయ కదా
మతిఁ దలఁప లీల యనఁ జను, సతతమనోరంజనప్రసాదం బగుచున్.
| 40
|
ఉ. |
చేరి చళుక్యవల్లభుని చెప్పినయట్లన సేయు నుత్తమ
శ్రీరమణీసరస్వతులచేఁతలు చిత్రము; లన్నరేంద్రుఁ డె
వ్వారికి నేపదార్థము లవారిగ నీ మ్మను నట్ల యిత్తు; ర
న్నారులకున్ బ్రియానుకరణం బురుధర్మము కాదె యెప్పుడున్.
| 41
|
విలాసము
క. |
బిట్టు నిజప్రియు నంగన, కట్టెదురన్
జూచి యంగకంబులమీఁదన్
బుట్టించినయొయ్యారము, చిట్టాడుట యది విలాసచిహ్నం బరయన్.
| 42
|
ఉ. |
పయ్యెదఁ జక్కఁ దీర్చుకరపల్లవముం, గడచూడ్కిలోన నిం
పయ్యెడు సిగ్గుఁ, గుంతలము లల్లన వీనులపొంతఁ జేర్చున
త్తియ్యపుఁ జెయ్వు, మన్మథుని తేజుపుబీజము లై తనర్పఁగాఁ
దొయ్యలి చూచెఁ గోరికలు దొట్రిల విశ్వనరేంద్రచంద్రునిన్.
| 43
|
విచ్ఛిత్తి
క. |
సురతాదులయెడ నల్ఫా, భరణం బై మెఱయుచున్న భావము తగ సుం
దరులకు విచ్ఛిత్తి యనం, బరఁగు నిజప్రథమరసవిభాసక మగుచున్.
| 44
|
ఉ. |
మంచివిభూషణావళులు మాని నవారుణశాటకంబునుం
గొంచెపుహారముల్ చెలువుఁ గోరి ధరించినయింతి కామినీ
పంచశరాంకు విశ్వజనపాలునిఁ జూచి తన ర్చెఁ జూడ్కికిన్
బంచషపల్లవప్రసవభాసిని యయ్యెడు తీఁగచాడ్పునన్.
| 45
|
విభ్రమము
క. |
కడుఁ గౌతుకాతిశయమునఁ - దొడవులుఁ బూతలును దప్పఁ దొడుగుటచే న
య్యెడు సంభ్రమంబు విభ్రమ, మడరుం బ్రియదర్శనాదులం దెల్లపుడున్.
| 46
|
మ. |
ఒక నేత్రంబునఁ గజ్జలంబు నిడి వేఱొక్కంట నర్పింప నొ
ల్లక యొక్కర్తు జయాంగనాపరిణయాలంకారవిశ్వక్షమా
పకునిం జూచె విలోచనప్రభలు విభ్రాజిల్ల నిద్ధంబులై
వికచేందీవరపద్మతోరణగతిన్ విప్పారి యొప్పారుచున్.
| 47
|
కిలకించితము
క. |
లలనునిదెసఁ బ్రియ కబ్బెడు, నలుకయు నెలనగవు గద్గదాలాపములున్
గలరుదితము ననియెడు నివి, కిలకించిత మనఁగ, బరఁగుఁ గేళీగతులన్.
| 48
|
చ. |
అలుగు, విలోకనాంతముల నశ్రువులం బరఁగించు, చిన్నిన
వ్వులు చిలికించి చేరి చనవుం దగవుం దళు కొత్త గద్గదో
క్తులు నిగిడించు, నిక్కమునకుం బులకించుఁ జెమర్చుఁ, జూడుఁ డి
న్నెలఁతకు విశ్వనాథుపయి నెక్కొనుకూరిమిచంద మెట్టిదో!
| 49
|
మోట్టాయితము
క. |
పతికిం దనపైఁ దలఁ ప, ద్భుత మని విని వనిత మేను పొంగుట మోట్టా
యిత మండ్రు భావసూచన, గతులం దెలియంగవలయుఁ గాముకు లెల్లన్.
| 50
|
మ. |
ప్రమదం బారఁ జళుక్యవిశ్వవిభుశుంభద్గానధారాజలౌ
ఘముచేఁ బొంగుచు నంబరాభరణరంగత్కీర్తులం దాల్చుచున్
సుమనోవిస్ఫురదుత్తమాంగరుచులం జూపట్టు భూదేవి ని
త్యము నాథుం డభిగామి యైన వలదా తత్తద్విజృంభక్రియల్.
| 51
|
కుట్టమితము
క. |
పరిరంభిణాధరక్షత, పరిపీడాదులసుఖంబు పటుదుఃఖముగా
దురపిల్లుట కుట్టమితం; బరయఁగ నుపచారవిధుల నగుఁ తెలియంగన్.
| 52
|
మ. |
వనితా, నేఁడు చళుక్యనాథుని మరున్ వారించుటన్ బీవర
స్తనకుంభాధరబింబమధ్యమున నాసౌగంధికశ్రేణిచే
జన నర్చించెదు నీకు నీసుభగతాసంధాత విశ్వేశ్వరుం
డనియో కాక యుపేంద్రపుత్త్రుఁ డనియో యాచందముం జెప్పుమా.
| 53
|
బిబ్బోకము
క. |
రాగమున నొండె, గర్వా, భోగంబున నొండె, మొఱఁగిపోవుట నొండెన్,
వేగాదరణము పతిపై, సాగమి బిబ్బోక మనఁగఁ జను నంగనకున్.
| 54
|
ఉ. |
బుద్ధి మహీరమాసతులపొత్తున నుండక సత్ప్రతాపపం
బద్ధసఖిత్వ మొప్పఁ జని భాసురకీర్తి దిగంతరంబులన్
వృద్ధగుణానురక్తుఁ డని విశ్వనృపాలు నుతించు నెప్పుడున్
శుద్ధపతివ్రతాత్మికల సోఁకునె యెందు ననాదరక్రియల్.
| 55
|
లలితము
క. |
వికసితవర్తనమున సే, వకవర్తనమునను రచితవచనములయెడన్
సుకుమారాంగన్యాసము, ప్రకటితముగ లలిత మండ్రు భావజ్ఞు లిలన్.
| 56
|
చ. |
కనుఁగొన నొప్పు కంఠమున గానముఁ, బాణులఁ మంజులార్థక
ల్పనమును, దృగ్విశేషమున భావములుం, జరణక్రమంబులన్
దనరు లయప్రపూర్ణ మగుతాళముఁ, గ్రాలఁగఁ బాత్ర యోర్తు రం
జనముగ నాడె నింపు వెద చల్లుచు విశ్వనృపాలుసన్నిధిన్.
| 57
|
విహృతి
క. |
చెప్పఁ దగుమాట సిగ్గునఁ, జెప్పక వెడ గప్పిపుచ్చు చేష్టాదులచే
నొప్పు నది విహృతి, రసికుల, కప్పుడు తగు దెలియ నింగితాకారములన్.
| 58
|
ఉ. |
డెందము విన్న నయ్యె, నొకడిల్లఁదనం బొడఁగూడె మోముపై,
ముందఱిలాగు గాఁ దొడలు, ముచ్చటమాటల కాస చేసె, దీ
చందముఁ జెప్పు మన్న వెడ సన్నపుసిగ్గున మ్రొగ్గుచూడ్కిచే
సుందరి చెప్పె విశ్వవిభుఁ జూచిన కాముఁడు తన్ను సోఁకుటల్.
| 59
|
ఈపదియును నైసర్గికములు.
విప్రలంభశృంగారము
క. |
లలితశ్రవణాలోకన, కలహాసూయాప్రవాసకలనలచేతన్
గలిగెడు దశావిశేషము, చెలువారఁగ విప్రలంభశృంగార మగున్.
| 60
|
సీ. |
ఆదియుఁ జక్షుఃప్రీతి యన, నంతఁ జిత్తసంగంబునా, మఱియు సంకల్ప మనఁగ,
నటఁ బ్రలాపంబు నా, నవల జాగర మన, నటుమీఁదఁ గార్శ్యసమాఖ్య మనఁగ
వెండియు విషయవిద్వేషంబు నాఁ ద్రపాసంత్యక్త మనఁగ, సంజ్వర మనంగ,
నున్మాద మనఁగ, మూర్ఛాపగమం బన, మరణంబు నా, నిట్లు మానినులకు
|
|
తే. |
ననుగతద్వాదశావస్థ మై తనర్చుఁ;
బదియదశ లండ్రు కొందఱు ప్రౌఢజనులు;
పరఁగు లక్షణములు నుదాహరణములును
వరుసఁ జెప్పుదుఁ దెలియంగవలయు నిందు.
| 61
|
చక్షుఃప్రీతి
క. |
చక్షుఃప్రీతి యనం జను, నక్షీణవిలాసగుణసమగ్రునిఁ బ్రీతిన్
వీక్షించుకుతుక; మది మరు, నిక్షుధనుర్దండమునకు నె క్కెక్కించున్.
| 62
|
ఉ. |
ఉల్లముఁ జూపుచూపు, లన నొల్లనియుగ్గులు, విచ్చుసిగ్గులున్
బెల్లుగఁ జేరుకోరికలు, బెక్కులు మక్కువచక్కడంబులున్,
మెల్లనె జాఱుపయ్యెదయు, మిం చొలయం బులకించుమేను, రం
జిల్లుఁ జళుక్యవిశ్వనృపశేఖరుఁ గన్గొను పువ్వుఁబోఁడికిన్.
| 63
|
చిత్తసంగము
క. |
చిత్తాసంగం బన నా, యత్తం బగుఁ బ్రతికృతి ప్రయత్నాదిసుఖో
త్పత్తికి నెల వగుచింతన, మత్తెఱుఁగు మనోవికీర్ణ మై విలసిల్లున్.
| 64
|
ఉ. |
మానినిచూపులం దొరలి మానుగ విశ్వనృపాలుఁ డేపుతో
నానఁగఁ గారుకొన్న మనమా మన మాదట నాదరింప మిం
పూన నుపేంద్రపుత్త్రుఁ డత డున్నపదం బని కాదె యక్కునన్
నూనపటీరపంకములు సొం పలరారెడు సారెసారెకున్.
| 65
|
సంకల్పము
క. |
చిత్తములో ననిశంబును, మొత్తము లగుతలఁపుఁగూటములఁ బొందెడిచో
నొత్తిల్లు చెమరుపులకల, యొత్తుడు సంకల్పదశకు నొనరిన చిన్నెల్.
| 66
|
చ. |
అకట తలంచి చొక్కఁదగ ద క్కలయిక్కల నున్న నున్నగా
లికి నెల వైనపువ్వుఁబొదలే పొదలే పులకింప నేల మి
న్నక యెలనాఁగ నాగరజనప్రియుఁ డయ్యెడు విశ్వనాథు శ
య్యకుఁ జనవచ్చు వచ్చుమరునమ్ములు వమ్ములు చేసె దంతటన్.
| 67
|
ప్రలాపము
క. |
ఇంతికిఁ బ్రలాప మనఁగాఁ, గాంతగుణాలాపకథనకల్పన; యదియున్
సంతసము చేయు నుచితా, ర్థాంతరరచనావిశేషణాదులచేతన్.
| 68
|
ఉ. |
ఈగతిఁ జూతురే! తగులరే తగులే తగులేమ లీధరన్?
రాగదుఁ డైనవిశ్వనృపురాకయ పో తగురాక నాకు, లో
లో గమిగొన్న చూపుఁదొగలున్ దొగ లై విలసిల్లు; దానిచే
సాగెడు నన్నరేంద్రునకు సద్ద్విజరాజకళాధరత్వమున్.
| 69
|
జాగరము
క. |
వల్లభుఁ డెట్లును నబ్బమి, మొల్లం బగుచింతఁ గన్ను మోడ్పక మదిలో
నల్లల నుడుకుచునుండెడు, తల్లడ మది జాగరాభిధానం బయ్యెన్.
| 70
|
చ. |
నెలగలమేలురేలు చెలినిద్దరకుం బగ లయ్యెఁ, బెల్లువె
ల్లులఁ గొనువేడ్క లీనుపగలుం బగ లయ్యెను, గాన దీనికిం
గలువలు కన్ను లంటయును కైవడి విశ్వనృపాలచంద్రు నిం
పలరఁగఁ జూచుటం గువలయప్రియుఁ డంటయు నిక్క మిక్కడన్.
| 71
|
తనుకార్శ్యము
క. |
అంగనకు నెట్లు ప్రియుదెస, సంగతి యరుదైనఁ గామసంతాపముచే
నంగములు డస్సిపోయిన, భంగి తనుత్వంబు నాఁగఁ బరగుం జూడన్.
| 72
|
చ. |
అటమట మేల? యేలికొను మంగన, నంగదభంగు లయ్యె న
క్కట కటకంబు లింతి! కెడకత్తెలు నీకడ నాడి పాడిరే
విటతతివింటదూపడనువింటఁ దొరంగుట నీగుణంబు లిం
తటఁ జల మేది మేదినిఁ బొదల్పుము విశ్వనృపాలమన్మథా!
| 73
|
విషయద్వేషము
క. |
సద్వస్తువు లొల్లక విల, సద్విద్యావిహరణంబు చాలించి వివే
కద్వారము గానమి విష, యద్వేషము తెలియవలయు నప్రీతిమెయిన్.
| 74
|
ఉ. |
గీరనురాగ ముప్పతిల గీరమణీ రమణీజయంతుపైఁ
గూరిమిఁ గూరి మిక్కుటపుఁగోరిక వీరిక లెత్త బల్కి తిం
పార నపారధీరగుణుఁ డారయ నాపతి విశ్వనాథుఁ డా
మారుఁడు మారుతంబు నెలమావియుఁ గ్రించులు మించు లేటికిన్.
| 75
|
త్రపానాశము
క. |
పొలఁతుక నిజదయితునికై, కలమానధనంబు చాల గజిబిజి గాఁ దా
నిలువడియును గులగతియును, దలఁపమియ త్రపావినాశదశ యనఁ బరఁగున్.
| 76
|
ఉ. |
క్రొన్ననగొన్న సిగ్గుదలకొన్న తలంపు నలంపకున్న నీ
నన్నుఁ జళుక్యవిశ్వనరనాథుఁడు మన్ననలం బొదల్బు నీ
ప న్నొడఁగూడినం జెలులపా టొడఁబా టటుగాక యెట్లు నే
వెన్నెల నిల్తు గెల్తు ననవిల్తు నదల్తు బికాదిసేనలన్.
| 77
|
సంజ్వరము
క. |
శీతకరమదనకృతమును, శీతలకరణోపచారజృంభితమును నై
యేతెంచుతాపభర మది, నాతికి సంజ్వర మనంగ నలు వెడలించున్.
| 78
|
ఉ. |
వే చని విశ్వనాథు గుణవిశ్రుతుఁ దోకొని వత్తు మంచు ము
న్నీ చెలు లెల్ల నన్న పలు కెల్లగఁ జూచితి నో మి దేల నా
కీ చలిమందు లేమిటికి నీవల నావలఁ దావలంబు లై
త్రోచి మొగంబుపైఁ దిరుగుతుమ్మెద లూరడుఁగాక యింతటన్.
| 79
|
మోహము
క. |
విరహవశవికలచేత, శ్చరితోన్మాదంబు మోహసంజ్ఞం బరయన్,
సొరిది నచేతనచేతన, పరిచితి సరి యగుట నెఱుఁగఁబడుఁ జతురులకున్.
| 80
|
ఉ. |
ఆతురపాటుతో నిలువుటద్దముద్దీప్తులు మాటు సేయుచో
నాతరుణీలలామ మనయాసలు గన్గొని 'నట్టిజాలి యీ
గోతుల కేల కేలఁ గొనె క్రొన్నెల వెన్నెల మూయు టొప్పునే
యీతఱి' నన్న చిన్నిపలు కెన్నరు విశ్వనృపాలుసన్నిధిన్.
| 81
|
మూర్ఛ
క. |
అనయము నెమ్మనమనఁ బా, యనిసొమ్మలపేరు మూర్ఛ యనఁగాఁ బరఁగున్,
దనరెడు నింద్రియగుణవ, ర్తనవైకల్యమున నెఱుఁగఁ దగుఁ దజ్జ్ఞులకున్.
| 82
|
చ. |
మృదులత నెన్ని యన్నమును మెచ్చఁడు విశ్వనరేంద్రశేఖరుం
డదె యొకతేఁటిజోటి నడయాడెడు నింతియ యింతిమోమునన్
వదలక నోమి నోమి యదనం గడ గానఁగ లేము లేమ కై
మదిఁ బడదే కదే కరుణ మారుఁడు మారుఁడు కాఁడె యెప్పుడున్.
| 83
|
ద్వాదశదశ
క. |
ద్వాదశదశయుం గలుగుఁ ద, లోదరికిం బ్రియుడు బహువిధోపాయములన్
సాదరుఁడు గాక తక్కిన, నాదశ యున్నట్లు చెప్పి రార్యులు కృతులన్.
| 84
|
చ. |
తలిరులు తమ్ములుం గలువదండలు మాటికిఁ బాటి సేసె నా
వల వలరాజుతూపు లనవచ్చుట యెచ్చటఁ దోఁప దక్కునన్
జిలికిన చందనద్రవము చిక్కగ నిక్కడ కేఁగుదెంచితిన్
జలములు మేల మేల సతిచక్కటి విశ్వనృపాల, యిత్తఱిన్.
| 85
|
చ. |
పొలఁతుక చూచురా యబలపోకులు ఱేకులు విచ్చి, చన్నుఁగ్రే
వలఁ బలుమాఱు గప్పెడు, నవస్మిత మొప్పఁగ దర్పణంబులోఁ
బొలుచులలాటరేఖ గని బొట్టిడి సోలెడుఁ, గ్రాలువాలుఁజూ
పుల మరుతూపులం దెగడఁ బూనెడు విశ్వనృపాలుప్రాపునన్.
| 86
|
ఇది విప్రలంభశృంగారద్వాదశకము.
క. |
ఇప్పుడు చెప్పిన వన్నియు, నొప్పగు శృంగారరససదుపకరణము లై
చెప్పఁబడుచుండుఁ బలుకుల, చొప్పున భావములు గబితఁ జొనుపఁగవలయున్.
| 87
|
నవరసములు
క. |
క్రమమున శృంగారము హా, స్యముఁ గరుణము రౌద్ర వీర సంజ్ఞంబులు ఘో
రము బీభత్సము నద్భుత, సమాఖ్య శాంతములు ననఁగఁ జను నవరసముల్.
| 88
|
తే. |
అందు శృంగారరసవిశేషాంతరములు
వితతములు గాఁగ మున్నె భాషితము లయ్యె
నింక హాస్యాదిరసముల నెనిమిదింటి
వకుుఁ జెప్పుదుఁ దెలియంగవలయుఁ గవులు.
| 89
|
హాస్యము
క. |
దృష్టవిభావాదులచేఁ, బుష్టం బగుహాస మందముగ హాస్య మగున్,
శిష్టాలంబన మరియు వి, శిష్టవిదూషకజనాదిచేష్టిత మగుచున్.
| 90
|
ఉ. |
కల్పకుజంబులం దెగడుఁ, గామగవిం బ్రహసించు, వట్టిసం
కల్పపురాయి నవ్వు, శిబికర్ణులచాగము నేవగించు, న
|
|
|
స్వల్పవదాన్యవిశ్వజనవల్లభుచే సిరి నొందు యక్షరా
ట్కల్పవిదూషకప్రతతి గర్వితరాజసభాంతరంబులన్.
| 91
|
తే. |
రూపభాషితవికృతు లుద్దీపనములు
ముఖవికాసాదు లనుభావములు దలంప
నశ్రువైవర్ణ్యవిస్వరతాదికములు
సాత్త్వికంబులు నాఁగ హాస్యమున కమరు.
| 92
|
తే. |
అశ్రుసంపాతచపలతాహర్షణాదు
లడరు సంచారిభావంబు లనుసరించి;
|
|
హాస్యభేదములు
|
హాస్య మాఱుప్రకారంబు లై తనర్చు;
తత్స్వరూపంబు లెఱిఁగింతుఁ దగు నెఱుంగ.
| 93
|
క. |
స్మితమును హసితము నను నీ, ద్వితయము నుత్తమము నాగఁ దీపించుఁ దగన్;
స్మితము వికాసికపోలము, మితదర్శితరదన మైన మెఱయు హసిత మై.
| 94
|
క. |
విహసితమును బ్రహసితము, న్మహి రెండును మధ్యమములు మదిఁ బరికింపన్;
విహసితము మృదులనినదము, ప్రహరితము శిరఃప్రకంపపరిమిత మరయన్.
| 95
|
క. |
అపహసితము నతిహసితము, నెపుడును నధమంబు లనఁగ నేపారు; శిర
శ్చపలము నశ్రుయుతంబును, నపహసితము, మేను గదల నతిహసిత మగున్.
| 96
|
కరుణము
క. |
శోకము విభావముఖభా, వాకలనముచేతఁ గరుణ మను రస మయ్యెన్;
జేకూఱిన యతులితవిప, దాకులితాలంబభావ మనఁగాఁ బరఁగున్.
| 97
|
మ. |
తనరం బుత్త్రకళత్రమిత్రమిళితార్థస్వాంతుఁ డై శాత్రవుం
డని భక్తిన్ బ్రణమిల్లినన్ బ్రకటరాజ్యశ్రీలు ప్రాపించుఁ జ
క్కని విశ్వేశ్వరచక్రవర్తికరుణం; గాకున్న నవ్వైరి మా
త్స్యునిచందంబునఁ బాండ్యుభంగి ద్రవిడక్షోణీశుభావంబునన్
జను దీనుం డయి హీనుఁడై కృపణుఁ డై సంతప్తుఁ డై లుప్తుఁ డై.
| 98
|
తే. |
అనిశకృతఖేదపర్యటనాదికములు
వరుస నుద్దీపనవిభావపరికరములు;
రూఢపరిదేవనశ్వాసరోదనములు
పరఁగు ననుభావములు గాఁగఁ గరుణమునకు.
| 99
|
తే. |
స్తంభవైస్వర్యబాష్పము ల్సాత్త్వికములు;
మరణసంభ్రమదీనతోన్మాదములును
జాడ్యచింతాదులును నపస్మారగతియుఁ
బటువిషాదంబు సంచారిభావదశలు.
| 100
|
రౌద్రము
క. |
క్రోధమ రౌద్రరసం బగు, సాధువిభావాదికముల సంపుష్టం బై;
ద్వైధం బగు మాత్సర్యవి, రోధంబులఁ దెలియఁ దగు నిరూపణవిధులన్.
| 101
|
మాత్సర్యరౌద్రము
మ. |
అని రోషించిన వీరభద్రుకరణి న్బ్రాపించుఁ, బ్రాపించి చ
య్యన రుద్రోద్ధతిఁ జెందుఁ, జెంది వికటోగ్రాటోపమున్ జూపుఁ, జూ
పి నట త్య్రంబకులీలఁ బేర్చు, బిదప భీమాకృతిన్ జేకొనున్;
జనునే మార్కొన మత్సరాహితులకుం జాళుక్యవిశ్వేశ్వరున్.
| 102
|
విద్వేషరౌద్రము
శా. |
దృక్కేలిం గరవాలభైరవుఁడు విద్వేషించి విద్వేషులన్
జెక్కున్, జక్కడుచున్, బలంబు నెఱపుం, జెండాకు, ఖండించు, ను
బ్బెక్కించుం, బడవైచు, నెంచుఁ, బొడ మాయించున్, బిశాచావలిం
జొక్కించున్ భటఘోటకామిషకృతస్థూలోపహారంబులన్.
| 103
|
క. |
క్రమమున మాత్సర్యద్వే, షము లాలంబన మనంగఁ జనుఁ, దద్భాషా
సముచితచేష్టాదికములు, రమణీయోద్దీపనములు రౌద్రంబునకున్.
| 104
|
క. |
అనుభావంబులు వికృతన, యనరాగాధరవికంపనాదులు; ఘర్మ
స్వనగద్గదవైవర్ణ్యచ, లనములు సాత్వికము లండ్రు లక్షణవేదుల్.
| 105
|
క. |
ఆయతమదచాపల్యా, సూయాగర్వములు హర్షసులభోత్సాహ
స్థేయోభావోగ్రతలును, బాయక సంచారు లనెడు భావము లరయన్.
| 106
|
వీరము
క. |
విహితవిభావాదులచేఁ, బ్రహితోత్సాహంబ వీరరస మనఁ బరఁగున్,
బహువితరణకరుణారణ, మహిమంబులఁ ద్రివిధ మగుచు మలయుం గృతులన్.
| 107
|
దానవీరము
క. |
అతివితరణశూరతచే, నతులబహిఃప్రాణమైన యర్థము నర్థి
ప్రతతికి నొసఁగెడుసద్గుణ, చతురత యిల దానవీరసంజ్ఞం బడయున్.
| 108
|
శా. |
అల్పార్థిం బొడచూచినంతటనె విశ్వాధీశ్వరుం డిచ్చు సం
కల్పార్థంబులకంటె నర్థము నసంఖ్యాకంబుగా నున్నమ
త్కల్పానోకహకామధేనువులకుం గల్పించు జల్పాకవా
క్స్వల్పఖ్యాతి నడంచి యల్పమని యౌదార్యం బవార్యంబుగన్.
| 109
|
దయావీరము
క. |
అసువిలయంబున నైనను, బస గల్గు నుదారసారభాషాదుల సా
హసరచనయ కరుణాత్మక, రసవీరం బనఁగఁ బరఁగు రసికోత్సవ మై.
| 110
|
చ. |
చతురచళుక్యనాయకుని చారుతరత్తరవారిధార న
ద్భుతపద మొంద వల్లభుఁడు పోయెడుఁ దోడనె కూడఁ బోయెదన్,
సుతు లనిశస్తనంధయులు సు మ్మని దాదికిఁ జెప్పి ప్రజ్వల
చ్చితిశిఖియంకపీఠమును జెందె నరాతివధూటి పోరిలోన్.
| 111
|
యుద్ధవీరము
క. |
పేరుకొని పోరిలోన న, పారపరాక్రమము నుభయబలములు వొగడన్
దోరంబుగ విహరించు ను, దారత రణవీర మనఁగఁ దనరుం గృతులన్.
| 112
|
మ. |
అరుదారం బరగండభైరవుఁడు వీరాకారుఁడై వైరిభూ
వరుఁ దుండించి ఘృతాచికిం బ్రియునిగా వాలించు, విద్వేషము
ష్కరు దూలించి తిలోత్తమావిటునిఁ గాఁ గల్పించు, నత్యంతమ
త్సరు రంభారమణీయుఁ జేయు నసిచే సంగ్రామరంగంబునన్.
| 113
|
ఆ. |
దానవీరమునకుఁ దగుపాత్రమును, దయా
వీరమునకు దీనపూరుషుండు,
వీరమునకు బద్ధవైరంబు నా
యుద్ధవీరమునకు బద్ధవైరంబు నా
లంబనములు భూతలంబునందు.
| 114
|
క. |
దానస్తవసంబులుఁ బటు, దీనాలాపములు సమరదృప్తపటహని
స్వానంబులు వరుసను సం, స్థానోద్దీపనవిభావసంజ్ఞము లరయన్.
| 115
|
ఆ. |
పటుముఖప్రసాదబాష్పశస్త్రాదులు
వరుసఁ దదనుభావవర్గ మండ్రు;
సాత్త్వికములు పులకసంఘాతవైవర్ణ్య
ఘర్మబిందువితతిక్రమముతోడ.
| 116
|
క. |
క్షితి దానదయారణసం, గతులకు సంచారికములు గర్వసదైన్యా
కృతి హర్షంబులు మొదలగు, వితతయథోచితనియోగవిధి నెఱుఁగఁదగున్.
| 117
|
భయానకము
క. |
ఉక్తవిభావాదులఁ బ్ర, వ్యక్తం బగు భయమ యగు భయానకమహితో
ద్రిక్తవ్యాఘ్రాదులు ని, ర్ణిక్తాలంబనము లనఁగ నియతము లయ్యెన్.
| 118
|
చ. |
వితతభయానకం బయినవిశ్వనృపాలుపతాకవోలె మ
త్పతియు వరాహలాంఛనము దాల్చిన నున్నతి కెక్కి దండభా
సతయును నంబరాభరణసంపదయు న్గని యెల్ల వైరులన్
మతి దెరలించు నంచు వెతమాయ లొనర్తురు భీరు లద్రులన్.
| 119
|
తే. |
వలయు నుద్దీపనవిభావవర్గ మరయ
సత్త్వగజహయపటహనిస్వనము లండ్రు
కలుగు ననుభావములు సాత్త్వికములు దలఁప
భయవిమోహాదిసంచారిభావచయము.
| 120
|
బీభత్సము
క. |
వరుసవిభావాదులచేఁ, బెరుఁగు జుగుప్సయ తలంప బీభత్స మగున్
బరువడి రెండుగు హేయా, చరణమున విరక్తివలనఁ జను నెఱుఁగంగన్.
| 121
|
జుగుప్సాబీభత్సము
చ. |
జరపక విశ్వనాథునకు సత్యము దప్పినరాజు రాజ్యసం
హరణము నొంది దీనుఁ డయి యార్తి పెనంగొను మేనిపుండ్లనుం
బురు వగురక్తపూరముల బ్రుంగి పయింబయి నంతకంతకున్
దొరఁచెడిపుర్వులం గెలికి తోడుచు వేఁడును రచ్చపట్టులన్.
| 122
|
వైరాగ్యబీభత్సము
ఉ. |
ఎప్పుడుఁ గాఱుచొంగలకు నెత్తినచిప్పయుఁ బోని మోవియున్
జిప్పిలి రోఁతగాఁ గడుపు చీలినకప్పయుఁబోని యచ్చటున్
దప్పక సొమ్ముగాఁ దనరఁ దప్పుల మాటల కర్జమంచు నో
రొప్పులు వల్కు శాత్రవుల నొల్లఁడు విశ్వనరేంద్రుఁ దూకొనన్.
| 123
|
తే. |
అతిజుగుప్సితములు నప్రియంబులును నా
లంబనములు, మదికి లాగు గాని
పూతిగంధవర్గములు తదుద్దీపనా
ఖ్యములు నాఁగ నెందు నతిశయిల్లు.
| 124
|
క. |
వదనాక్షి ఘ్రాణ రద చ్ఛ, ద కూణన విధులపేరఁ జను ననుభావా
స్పదము లనంగా దదుచిత, సదమలపులకాదికములు సాత్త్వికము లగున్.
| 125
|
తే. |
అందు సంచారిభావంబు లనఁగ బరఁగు
సముచితోద్వేగనిర్వేదశంకనములు
భయవిషాదామయాహ్వయప్రభృతికములు
చతురు లెఱుఁగంగఁ దగు నండ్రు గృతుల యందు.
| 126
|
అద్భుతము
క. |
జననితవిభావాదులచే, ననుగత మగు విస్మయంబ యద్భుత మనఁగాఁ
జను, నాలంబన మశ్రుత, వినుతచమత్కార మనఁగ విశ్రుత మయ్యెన్.
| 127
|
మ. |
శశికాంతంబులు సంతతార్ద్రతఁ గనుం జక్రాచలాగ్రంబునన్
బ్రశమం బొందు నితాంతసంతమసముం బాతాళగేహంబునన్
|
|
|
భృశసంఫుల్లతఁ జేకొనుం గుముదినీబృందంబు మందాకినిన్,
విశదం బైన చళుక్యభూవిభుయశోవృద్ధిప్రభావంబునన్.
| 128
|
తే. |
వరుస నుద్దీపనవిభావవర్గ మండ్రు
మేదురాశ్చర్యతరవర్ణనాదికములు,
చక్షురాననగండవిస్ఫారణాదు
లడరు ననుభావములు నాగ నభిమతములు.
| 129
|
క. |
పులకస్వేదప్రమదము, లలవడు సాత్త్వికము లనఁగ, హర్షావేగా
దులు సంచారులు గాఁ జను, నలవడ యోజింపవలయు నయ్యైగతులన్.
| 130
|
శాంతరసము
క. |
శమము విభావాదులచే, నమరం బరిపుష్టమైన నది శాంత మగున్
సమకొను నాలంబన మన, నతులము శాశ్వతము నైనయజపద మరయన్.
| 131
|
శా. |
డంభాచారము లుజ్జగించి రిపుగాఢక్రీడ నిర్జించి లో
శుంభద్విద్యలఁ జేర్చి సద్గుణములన్ శోభిల్లి శక్తిత్రయా
రంభం బొప్పఁగ రాజయోగవిదుఁడై బ్రహ్మప్రబోధస్థితిన్
శంభుశ్రీచరణార్చలం బ్రబలు విశ్వక్ష్మావరుం డెప్పుడున్.
| 132
|
క. |
వేదాంతచతురసంభా, షోదితకౌతూహలంబు లుద్దీపనముల్
భేదేతరసమదర్శన, వాదము లనుభావములు శివప్రసరంబుల్.
| 133
|
క. |
రోమాంచస్థంభాదులు, నేమపు సాత్త్వికము లండ్రు, నిర్వేదము వి
ద్యా మతి ధృత్యాదులు నభి, రామవ్యభ్రిచారిభావరచనం జెందున్.
| 134
|
సీ. |
శృంగార ముత్పలాంచితము విష్ణుఁడు భర్త తెలుపుహాస్యము గణాధిపుఁడు ఱేఁడు,
కరుణ కాషాయంబు కాలుడు పతి, రౌద్ర మవ్యక్తరక్తంబు హరుఁడు విభుఁడు
వీరంబు గౌరంబు వృత్రారి పతి, భయానకము ధూమ్రము మహాకాలుఁ డీశుఁ,
దసితంబు బీభత్స మధిపతి నంది, యద్భుతము హేమాభ మంబుజభవుండు
|
|
తే. |
భర్త, శాంతంబు నిర్మలస్ఫటికనిభము
పరఁగునధిదైవతము బరబ్రహ్మ మండ్రు;
వివిధరసశాస్త్రవేదు లై వెలయునట్టి
కవుల కివి యెల్ల నెఱుఁగుట కర్జ మెపుడు.
| 135
|
ఆ. |
ప్రథమరసము సామభవము వీరంబు ఋ, గ్వేదసంభవంబు, వెలయురౌద్ర
రస మథర్వనిగమరచితంబు, భీభత్స, మది యజఃప్రసూత మండ్రు బుధులు.
| 136
|
తే. |
ఆది శృంగారజాతంబు హాస్యరసము, రూఢరౌద్రోద్భవంబు కారుణ్యరసము,
పుట్టె వీరంబువలన నద్భుాతసమాఖ్య, మడరు భీభత్సమునను భయానకంబు.
| 137
|
క. |
శాంతము సర్వోత్తరరుచి, మంతం, బట్లగుట వైరమైత్రులు లే, వి
చింతన మెఱుఁగనికవి కన, గంతవ్యం బగునె రసవికాసప్రతిభల్.
| 138
|
తే. |
మున్ను శృంగారబీభత్సములకు నొంట;
దరులు తమలోన వీరభయానకములు;
సమవిరోధంబు రౌద్రాద్భుతముల కెపుడు;
హాస్యకరుణంబులకుఁ బగ యనుదినంబు.
| 139
|
చ. |
తమతమపంగడంబులకుఁ దప్పనిభావకదంబకంబుచే
నమరు రసంబు; లంగకము లన్నిటికంటె బరిస్ఫుటాకృతిన్
బ్రమద మొనర్చు నెద్ది యది ప్రత్యయ మంగి; రసప్రవృద్ధికిన్
గ్రమమున నిత్తెఱం గెఱుఁగు కల్పన మొప్పుఁ గవిత్వసిద్ధికిన్.
| 140
|
క. |
సుఘటితపదార్థభావా, లఘుతరరసవత్ప్రబంధలంపటుఁ బతి భూ
మఘవుఁ డని నుతి యొనర్తురు రఘురామునిఁబోలెఁ బరశురాముంబోలెన్.
| 141
|
ఉ. |
తోయజమిత్రతేజు గుణదోషవివేకనవీనభోజు వి
ద్యాయనకంటకారసికహర్త మహారథనవిహర్త గో
పాయితబంధువర్గు బలభిన్నపరాచలదుర్గు నున్నమ
ద్రాయకటారిసాళువధురంధరు సత్ఫలవద్వసుంధరున్.
| 142
|
క. |
నారీజనమారుఁ జమూ, వారీవినిపతితవైరివారణు నానా
రిసూహితవితరణగుణున్, గౌరీపతిచరణకమలగంధానందున్.
| 143
|
మాలిని. |
సకలనిగమవేదిన్ జారుసంగీతమోదిన్
సకరుణదృఢచిత్తున్ సత్త్వసంజాతవృత్తున్
నికటనిధిసమాజున్ నేతృసంపత్బిడౌధున్
గుకవిజనవిదూరున్ గుంఠతారాతివారున్.
| 144
|
గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధ
బుధవిధేయ విన్నకోట పెద్దన నామధేయరచితంబైన కావ్యాలంకార
చూడామణి యను నలంకారశాస్త్రంబునందు రసప్రపంచప్రకటన
సముద్దేశం బన్నది ద్వితీయోల్లాసము.