మిక్కిలి యక్కజపడి వానికించుక బుద్దిచెప్పిరి. కాని, మూర్ఖుల మనసు మచిమార్గమున ద్రిప్పు నెవరితరము? అతడువారి హితోపదేశంబుల సరకుగొనక వారినెగతాళిజేసి తిరస్కరించి తూలనాడెను. అంతట వారు కోపోదీపితులై కనులెఱ్ఱజేసి "దురాత్మా! సదాచారమువిడచి మునిజనవిరుద్దమైన మార్గమున నీవు సంచరించు చుంటివి. గావున నీవుత్తరజన్మంబున నొకకిరాతుడవై యుందువు గాక! " యని శపించిరి. శాపాక్షరములు వారినోట వెలువడినతొడనే చిరంతపుడు భయాక్రాంత చిత్తుడై పశ్చాత్తప్తమనస్కుడై శ్రీమన్నారాయణ చరణారవిందసేవకులగు నమ్మునిసత్తముల పాదములపై బడి యనుగ్రహింపుడని వేడుకొనెను. నవనీతహృదయులగు నమ్మునిచంద్రులు సదయులై "ఓయీ ! యిచ్చినశాపము సంపూర్తిగా మఱల్పజాలము. కాని, కొంతమార్పు చేసెదము. నీవు మొదట బ్రాహ్మణగర్భంబునంబుట్టి విద్యానయశూర్యుండవై కిరాతులంగలసి సంచరించెదవు. అనంతరము దేవీ ప్రసాదంబున మరల బ్రాహ్మణుడవై జగత్ప్రసిద్ది గాంచెదవు" అని శాపము కొంత త్రిప్పి యధేచ్చంజనిరి. కాలక్రమంబున వానితపంబు భంగంబువావించి యచ్చనలు నియచ్చడలోకంబునకు జనిరి. చిరంతపుడు కడు వృద్దుడై భోగవిముఖుడై యన్నివిధంబుల జెడి మృతి నొందెను.

బాల్యము

అతడుత్తర జన్మమున

గౌడదేశమున సంతానహీనుడై బిడ్డలకై తపించునట్టి యొకానొక బ్ర్రాహ్మణునకు నందనుడై రూపరేఖా విలాసంబుల నెల్లర కానందము గలిగించుచు నల్లారుముద్దుగా బెరుగుచుండెను. కాలక్రమమున నక్షరాభ్యాసము, నుపనయనము మొదలగు కర్మలు జరిగెను. గాని చదువు సంధ్యలు వాని కావంతయు నంటలేదు. సహవాసము దుష్టులతోడనే జేయుచు నిరంతర మాటపాటలయం దాసక్తిగలిగి భోజనమునకు మాత్రమే గృహంబునకు భోవుచు గ్రమక్రమంబున దుండగీడై నూరివారినందఱిని నిందించుచు, దూషించుచు , మందలించినవారిని గొట్టుచు దిట్టుచుండేను. గ్రామస్తులు తలిదండ్రులకడకు బోయి వాని యాగడంబులు బాదకరములుగ నున్నవని మొఱపెట్టుకొనిరి. తలిదండ్రులు మందలించినప్పుడు వారింగూడ దిరస్కరించెను. వారేమియుంజేయజాలక గ్రామవాసులతో నిష్టమువచ్చి నట్లు చేసికొమ్మని చెప్పిరి. అంతట గ్రామీణులందఱు దుస్సహములైన వానిచేష్టల కాగజాలక, కుక్కనుగొట్టినట్లు కొట్టి, గ్రామమునుంది తరిమి యడవుల పాలు చేసిరి. అంతట వాడొక కిరాతకులుండు పల్లెకుంజని తనబుద్దులకు జేష్టలకు దగిన సహకారులు లభించుటచేత నాకిరాతకులతో గలిసిమెలసి జంతువులను వేటాడుచు, మత్స్యమాంసంబుల భక్షించుచు, సురాపానంబుజేయుచు, దారులు గొట్టుచు , నిదియది యనక యెల్ల ఘాతుకకృత్యంబులు జేయుచు యధేచ్చగ విహరించుచుండెను. అధమస్దితినుండి యుత్తమ స్థితికి బోవుట దుర్లభముగాని యుత్తమపదవినుండి భ్రష్టుడగుట సులబము. దుస్సహవాసములవలన దిర్వినయంమువలన, దురాచారంబువలన , నెట్టి యనర్ధము వాటిల్లునో చూడుడు! వేదాధ్యయన సంపన్నుడైన బ్రాహ్మణుని యింటబుట్టిన యాబాలుడు స్వల్ప కాలములో గిరాతకుడైపోయెను. కావున సర్వవిధముల దుస్సహవాసము వర్ణింప వలయును.

వివాహము

ఆవనంబునకు

సమీపమున నొకదేశముకలదు. ఆదేశమునేలు రాజునకు సర్వాంగసుందరమైన సర్వమంగళ యను పుత్రిక కలదు. ఆమె యమేయ రూపలావణ్యసమేతమై తలిదండ్రులకేగాక బంధుమిత్రులకు, నగరవాసులకు నయనోత్సవము జేయుచుండెను. రూపమునకుదోడు వినయసంపత్తి కలదు. సకలశాస్త్రపారంగతుడైన యొకానొకబ్రాహ్మణుని రావించి యారాజు విద్యాబుద్దులు గఱపుమని తన గారాబుకూతును వాని కప్పగించెను. బాలిక మిక్కిలిశ్రద్దతోగ్రహించి గురుభక్తిగలిగి యయ్యవారు చెప్పినదంతయు సూక్ష్మబుద్దితో గ్రహించినదానిని మఱువక కుశాగ్రబుద్ధిశాలినియని పేరుదెచ్చుకొని క్రమక్రమముగ విద్యలన్నియు నేర్చుకొనెను. విద్యాపూర్తియైనపిదప రాజు గురువునకు గురుదక్షిణ నిమ్మని చీనిచీనాంబరములు వెలలేని యాభరణంబులు మొదలగునవి యిచ్చి గురువునకు సమర్పింపుమని పుత్రికనంపెను. గురువు వయోవృద్దుడయ్యు , జ్ఞానసంపన్నుడయ్యు, గుణహీనుడగుటచేత నాబాలికయొక్క నవయౌవనప్రాదుర్బావముంజూచి మోహ విష్టుడైపరవశత్వముజెంది బాలికతో నిట్లనియె—“లతాంగీ! నీగురుభక్తికిజాలమెచ్చితి నాకీయాభరణంబులేల? ఈకాంచనవస్త్రంబులేల? నీనిరుపమాన లావణ్య తారుణ్యంబుల జూచినది మొదలు నిన్నొక్కసారిబిగియాగు గౌగిటజేర్చి ముద్దాడవలెనని కోరిక పుట్టినది. నాయందునీకు నుజముగా భక్తికలదేని నాకోరికదీర్చుము. అదియే గురుభక్తి అదియే గురుదక్షిణ, అదియే శుశ్రూష“ యనిపలికి లేచి పయోముఖవిషకుంభమువంటి యా యుపాద్యాధముడు బాలిక హస్తము బట్టుకొనబోవ