కాలక్షేపం

(TIT BITS)

మొదటి భాగం

ణాటికెట్టు పెట్టి, సోమయ్య, ఒకచోట గ్రామఫోను వాయిస్తూఉన్న సమయంలో సూది అదే గాడిలో పాడడంవల్ల గుర్రుమని అదేధ్వని కాగా, శ్రోతలలో ఒకడైన...

కైలాసం - ఆ పాడేవాణ్ణి లేచికూర్చుని తిన్నగా పాడమనకూడదూ?

అనగా, నలుగురూ నవ్వగా,

కై - (పక్కవాడి చెవిలో) నాది పొరపాటుగావును! గ్రామఫోను పుంలింగమా, స్త్రీలింగమా?

పక్క - నపుంసకం కూడాను!

కై - అల్లాయితే త్రిలింగా?

పక్క - కాదు. గ్రామఫోనూ, కాళహస్తీకూడా వాయులింగాలే!

2

మేష్టరు - ఈ లెక్కకి ఆన్సరు అర్థణా తక్కువ వచ్చిందేం? సోలయ్య!

సో - నిన్న పొద్దున్న మా బామ్మచేతి కిచ్చానండి.

మే - అడిగి పట్రా రేపు.

సో - (విచారంతో) నిన్న సాయంత్రం మా బామ్మ పోయిందండి.

మరొక బాలుడు - మేష్టారండి. వట్టిదండి. ఈ వేళ, నే చూశానండి!

మే - ఏమిరా, వెధవా! బతుకున్న వాళ్ళమీదే వొట్లు?

సో- మా బామ్మ పోయినట్లు మా నాన్న ప్రమాణిక్యం చేసి నెల తిరిగిందండి.

3

అల్లుడు - చూడండి, అత్తా! తొమ్మిదిగంటల బండికి వెళ్ళాలి. వంట త్వరగా కానీండి.

అత్త - అడ్డమా! తొమ్మిదిదాకా ఎందుకు నాయనా, రెండింటికి అయిపోతూంటేనూ!

4

రామయ్య - భీమారావు! సోమన్న దగ్గిర ఎంత ఉందని నీ తాత్పర్యం? క్రియమాట.

భీ- పది లకారాలుండచ్చు. నీ ఊహ?

రా - పది లకారాలు లెక్కేమిటి? డెబ్బై పిల్లకూన్ల పైమాట.

5

తెల్లారకట్ల గదిలోనించే.

దత్తుడు - ఒరేయి, భంట్రోత్! సూర్యోదయం అయిందేమో, చూడు.

భం - అంతా చీకటిగా ఉంది బాబూ, అయిందేమో, ఏమీ కనిపించడంలేదు.

- ఏమిరా పొగరూ! కనిపించకపోతే దీపబ్బుడ్డి పట్టుకు వెళ్ళి చూడాలని తెలియదూ?

భం - చిత్తం. అగ్గిపెట్టి తమదగ్గిరే ఉంది.

దత్తుడు గారి భార్య - పోనీ నిప్పుపుడక మీదగ్గిరే ఉంటే మన పాతికరూపాయల కొత్తలాంతరు ముట్టించి ఇయ్యండి, పాపం! బుడ్డి వెతుక్కుంటాడూ!

6

శనెయ్య - అయితే శాస్తుల్లుగారూ! 'గౌరవం' అనే మాట వాడతారు, 'మర్యాద' అని వాడతారు. ఈ పదాలకి ఉండే ప్రయోగతారతమ్యం కాస్తంత సెలవిస్తురూ!

శా - ఎక్కడా నీకు సంబంధంలేనివాట్లతో నువ్వు జోక్యం కలగజేసుకోవడం ఎందుకు, పోనిస్తూ.

7

దుర్గారావు - ఏమోయ్! ఈమధ్య నువ్వు కొన్న గుఱ్ఱం ఏమంటుంది?

మంగన్న - ఏమోనోయ్! నే నెప్పుడూ దాన్ని అడిగి చూడలేదు. ఇహ అడగాలి.

దు - సరే. ఆ అడిగేటప్పుడు, తీరా మరచిపోయి ఊరుకోక, ముందునించి అడుగేం!

8

రాజమండ్రీ రైలుస్టేషనులో మెయిలుటైముకి -

శంకరం - ఎక్కడికిరోయ్, భాస్కరం?

భా - ఏలూరు.

శం - మరి, చేతులో దమ్మిడీ ఆడటం లేదన్నావు, నిన్న నాబాకీ ఇవ్వమంటే?

భా - అందుకనే, కానీ ఖర్చులేని టిక్కట్టు కొంటా.

శం - అదేమిటి?

భా - లెట్రిన్ టిక్కట్టు.

శం - బాగుంది. సరే ఏలూరెళ్ళి?

భా - నాటకం చూడాలి.

శం - దానికి?

భా - దానికీ అంతే, వాల్ టిక్కట్టు.

9

దహనం అవుతూన్న ఒక సత్రంలో పడుకున్న ఇద్దరిలో ఒకడిమీద అగ్నితుట్టలు దిట్టంగా పడడంవల్ల, వాడు కళ్ళు మూసుగునే ఉండి రెండో వాణ్ణి రక్తప్రవాహాలయేటట్లు బరకగా.

రెం - తమ్ముడూ, చీమలురా!

మొ - నాకూ అల్లాంటివే గావునురా.

రెం - ఒరేయి. నువ్వు నన్ను గోకుతున్నట్టున్నావురా!

మొ - మరి నా ఒళ్ళు ఇంకా ఎక్కడుందిరా?

రెం - నీచెయ్యి ఇల్లాతే చూపిస్తా.

మొ - దానికీ నన్నే అడ్గాలీ! నిన్ను గోకేటప్పుడు చూసుగుందూ!

10

భాను - భామయ్యా! ఈ చెయ్యి చూడు, దీంతో నేను రైలాపేస్తా.

భా - అంత బలాసివిగావును నువ్వు. ఏంపుణ్యంరా.

భాను - బలమేమిటి నీపిండం? ఇప్పుడు నేను డ్రైవరుగా జేరితేనే!

11

చొక్కా తొడుక్కుని ఒక పల్లెటూరు వెళ్లిన ఆనందరావు మీద పడి ఆ ఊరివారంతా ఏడవగా. ఆనం - ఏం ఏం! ఎందుకూ?

ఒకడు - ఇందులో దేంట్లోనో ఇరుక్కుపోయావు! జన్మ పిరాయించు గోవాలిగాని, నువ్వు ఇవతలకిరావడం అంచూ మళ్ళీ ఉంచుందిషోయ్.

12

ఒకడు తను గొప్ప వేషధారినని ఒకసభలో కోస్తూండగా.

ఒక సభ్యుడు - ఎవ్వరికీ తెలియనే తెలియదండీ! సాధారణంగా ఏపాత్రం మీది?

ఒకడు - అర్జునపాత్రమండి, సర్వత్రా. మొన్న నేను అభినయించిన రాత్రి నాకు ఒక మెడల్సు ఇద్దామని గుసగుస లాడుకున్నారు.

ఒక సభ్యుడు - ప్రసన్న యాదవంనాటి రాత్రేనా.

ఒకడు - మరే.

ఒక సభ్యుడు - మీ వేషాలు నాటకరంగం మీద తప్ప కడంచోట్లలా ఉన్నాయి. మరి గయోపాఖ్యానంలో ఏం వేస్తారు?

ఒకడు - గయునిఫ్ఠీవనం వేస్తాను.

13

కామయ్య - ఎక్కడికిరా, రామకృష్ణా!

రామ - బట్టలషాపుమీదికి. చొక్కాలు చింపించాలి.

కా - మొన్న కుట్టించి నెల తిరిగిందోలేదో, అప్పుడే ఎందుకురా మళ్ళీ పారేశావా, చిరిగాయా?

రా - ఉన్నాయి కాని, పిగిలాయి. నెలనెలా ఇదే ఇబ్బంది.

కా - సరిపోయింది. ఈమాటు నామాట విని బనియన్ గుడ్డ చింపించు, నెలనెలా ఎందుకొచ్చింది ఈ ఇబ్బంది !

14

ఒక బాలుడు - ఒక బొమ్మ గీసి దానికింద 'ఆవుదూడ' అని రాయగా

మేష్టరు - ఏమోయ్! నువ్వు ఫస్టుక్లాసు దూడేశావు. మళ్ళీ రాశావు కూడా ఎందుకు. కింద?

బా - నేను లోపల అనుకున్నది అందరికీ తెలియడానికండి.

15

“పుస్తకాలన్నింటిలోకీ అధమాధమం ఐనదానికి గొప్ప బహుమతీ!” అని పేపర్లో ప్రకటనచూసి చాలామంది రాయడం మొదలెట్టగా, అందులో ఇద్దరైన వెనకయ్య భూతయ్యలు ఒకనాడు కలుసుగుని, మాటల్లో,

వె - పూర్తిచేశావుటోయ్, బావా!

భూ - ఏదో, అయిందనిపించాను. ఏంపేరెట్టావ్?

వె - 'విధవేశ్వరవిజయం.' నువ్వు?

భూ - 'కుంకేశ్వరవిలాసం.'

వె - ఏడిశావులే, నాకు యోగ్యతాపత్రిక ఉందిలే మరి. ఒక ఒక గొప్పవాడే ఇచ్చాడు - అనగా నేనేరాస్తే సంతకం చేశాడు. “ఇంత అభాగ్యపుస్తకం నేచూడలేదు” అని.

భూ - నాకూ ఉందిలే మరి, “ఇంత దౌర్భాగ్యపు పుస్తకం ఇదే” అని. వె - రెండూ ఓటేలే. మనకి చెరిసహం వస్తుంది బహుమతీ.

భూ - కాదులే “అభాగ్యం” అంటే భాగ్యం లేకపోవడం మాత్రమే. “దౌర్భగ్యం” అంటే దరిద్రం ఉండడం. అంచేత నేనే కొట్టేస్తా.

వె - ఏడ్చావులే! నాదాల్లో సారస్యం, జీవం, ఆత్మా లేవని రాయించి నెగ్గుతా!

భూ - నా దానికి శరీరమే లేదనీ, అది అసలు ఏమీ లేదనీ రాయించి నేనే నెగ్గి మరీ నీకు కనపడతా!

16

తెనుగు పాండిత్యానికి పేరుపొంది పోటీలో సంభావన కొట్టిన ఒక దొరగారితో వారి హిందూస్నేహితు డొకడు ముచ్చటిస్తూ.

హిం - మా గ్రంథాలు మీరేమన్నా చూశారూ, అసలు?

దొ - అవును. మీ రామాయణ మహా భారతాలు మనకు మాంచి స్నేహితులు. వారితో మేము ముట్టులో నున్నాము.

హిం - ఉన్నారూ, బాగుంది. అయితే మీకు తర్జుమా కూడా వచ్చినట్టే?

దొ - టర్జుమా! ఓ. అడి వెనుకనే వచ్చు.

హిం - ఇంకా కొంచెం సెలవియ్యండి.

దొ - ఉదాహరణా మీకు కావలసినది! ఇడుగో! 'దహార్స్ ఈజ్ ఈటింగ్ గ్రాస్' “గుఱ్ఱముగారు గడ్డి భోజనము చేయుచున్నారు.”

17

కుంటికాలు జగ్గయ్య ప్లీడరుగారు బోనులో ఉన్న వెంకటప్పగారిని 'క్రాసు' చేస్తూ.

- మీది ద్వారపూడి కాదుటయ్యా?

వెం - చిత్తం.

- వెనక మీ అబ్బాయిని రాజమండ్రిలో పట్టుగుని పోలీసువారు కేసు పెట్టలేదూ అతనిమీద?

వెం - అయితేం ? వెంటనే కొట్టేశారు. అప్పుడు నేను అక్కడే వున్నా.

- అక్కడికి ఎందుకు వెళ్ళారు మీ రప్పుడూ?

వెం - అక్కడికీ వెళ్ళక ఎక్కడికీ వెళ్ళక ఓచోటే అహోరించడానికి నేను వట్టి కుంటిముండావాణ్ణి కాదుగామరీ!

18

మంగన్న - ఓ వేసంకాలంలేదు దిబ్బాలేదు, నావీపు ఎప్పుడూ పెట్లుతూ ఉంటుందండీ!

మిత్రుడు - మీభార్య-అనగా మీ కళత్రం - కాపరానికి వచ్చినట్టేనా!

మం - ఆ. ఏణ్ణర్థం అయింది.

మి - ఇహనే మ్మరీ. అప్పణించేమో! నిదానంగా జ్ఞాపకం చేసుగోండి, ఈ పేలాపన!

19

ఒక ఇంటి ఎదట కట్టిఉన్న ఇంగ్లీషు నోటీసుబల్ల పరకాయించి చూసీకూడా ఇంగ్లీషు సాంప్రదాయం తెలియని పిచ్చెయ్య లోపలికి చొరబడగా,

యజమానుడు - ఔట్‌సైడువాళ్ళు లోనికి రాకూడదని తెలియదండి?

పి - అబ్బో! తెలుసు, తెలుసు! అందుకనే వచ్చాను, మొగాణ్ణిగనుక.

20

ఇన్ఫెంటుక్లాసు పరీక్షచేస్తూ ఒక ఇనస్పెక్టరుగారు తన ఒక్కొక్క చేతులో రెండేసి చొప్పున లక్కగాడిదలు పెట్టుగుని,

- ఒకటోవాడు, ఇవి ఏమిటమ్మా!

ఒక - గాడిదలండి.

- ఇవి ఏమి మోస్తున్నాయి! రెండోవాడు!

రెండు - బట్టలండి.

- ఇక్కడున్న గాడిదలు మొత్తం ఎన్ని ? అయిదో వాడు!

అయి - అయిదండి!

21

మేష్టరు - ఏమోయ్. బుచ్చన్నా! ఏదీ క్షమార్పణకాగితం? రాసుగొస్తానన్నావ్, క్లాసు పిల్లల ఎదట?

బు - ఇదుగోనండి. అని ఇవ్వగా,

మే - (చూసి) సరే. ఇకనైనాసరే నువ్వు తిన్నగా ఉంటేసరి, నావాడవే పట్టుగెళ్ళు.

బు - మీ దగ్గరే ఉంచండి!

మే - ఎందుకూ?

బు - నేను మళ్ళీ మళ్ళీ రాసి ఇస్తూండలేనండీ!

22

బుచ్చి అబ్బాయి - ఒక్కొక్క కుక్కకి ఉండేబుద్ధి యజమానికి కూడా ఉండదు.

గౌరం - (తనకి కుక్క లేకపోయినా) ఒక్కొక్క కుక్క అనక్కర్లేదు. మా కుక్క అల్లాంటిదే.

బు - ప్రతిష్ఠ లేనప్పుడుకూడా అబద్దం ఎందుకూ?

గౌ - నీకుమల్లే సందర్భాలు కనిపెడుతూ కూచోడం నాచేత గాదు, పోదూ!

23

ఎలాగైనా క్లాసు ఎగవేయదల్చుకొన్న ఒక అబ్బాయి మేష్టరుతో,

- సార్, నాకు తల నొప్పి దంచేస్తోంది. క్లాసులో కూర్చోలేనండి.

మే - కూర్చో లేకపోతే నుంచో.

- పంతులికి అంత కాఠిన్యం పనికిరాదండి.

మే - నిజమే, నీ కవిత్వంలో మృదుత్వం ఉంది.

24

రాలయ్య పూటకూళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి ఒక రంగంలో, వడ్డించే వాడితో.

రా - ఏమిటయ్యా నీ గడుస్దనం, నాకు తెలియకడుగుతానూ నాలిక తెంపుగున్నా నాకేమీ రాల్చవ్. వాణ్ణెవణ్ణో ఆమూల కూర్చున్నవాణ్ణి మట్టుకు మేపుతున్నావు, మాంచి తరిపిదూణ్ణి మేపినట్టు. పప్పురైటర్ని ఇల్లా పిలు కనుక్కోవాలీ!

వడ్డనమనిషి - ఆ మూల ఆయనేనండీ.

25

కొందరు కోతలరాయుళ్ళు ఒక చోటచేరి దారుణాలు చెప్పుగుంటూ,

ఒకడు - ఓడికి యుద్ధంలో గుండుదెబ్బ తగిలి కుడిచెయ్యి ఊడిపోయిందిట. వాడది ఎరగడు. తరవాత ఓ ఘంటకి జేబులోంచి చుట్ట తీసుగోవలసి, అప్పుడు గ్రహించాట్ట చెయ్యి లేదు కదా అని. ఇంకోడు - ఇదింకా నయమేనోయ్, ఓపక్షానికీ, ఓడికి గుండుదెబ్బతగిలీ, తలా ... ఏది! తలా, బెసికిపోతే తరవాత ఓఝాముకి వాడు తల గోక్కోవలిసొచ్చి, మరోగంటకి తల ఊడిపోయిన సంగతి గ్రహించడం మొదలుపెడదాం అనుకున్నాట్ట.

26

ఎనభై మంది పిల్లలుగల ఒకానొక క్లాసులో నలుగురు ముగ్గురు తప్ప తక్కిన అంతా హాజరై ఉన్నట్టు తోచగ, ఆ సహస్ర నామాలు లాంటివి పిలుస్తూ కూచోడం కాలయాపనం అనుకుని,

మేష్టరు - ఆబ్సెంటు అయన నలుగురు ముగ్గురూ ఠంగున నుంచోండి. చట్టున రాసు గుంటానూ.

27

వైద్యుడు - ప్రొద్దున్న ఒక గంటా, సాయంత్రం ఒకగంటా తప్ప నేను వైద్యం చేయనేచేయను.

మిత్రుడు - మరేంజేస్తారు కడంటైమంతా?

వై - వైదిక గ్రంథాలు చూస్తూంటాను.

మి - అవును. మీ వైద్యానికి అపరం వాటి అవసరం ఉన్నట్టు వేటి అవసరమూ లేదు.

28

మార్తాండం - బట్టతలకి ఘట్టి మందంటూ ఇచ్చారు మీరు. అబ్బే, ఇదేం మందండీ! తలకాయ ఊరికే పారణం ముద్దల్లా అల్లానే ఉందిగాని ఎక్కడా గరగరేనా పుట్టిందే!

డాక్షరు - ఎందుచేతచెప్మా! ఈ పాటికి కొంత బరిహస్సు విజృంభించ వలసిందేనే మరీ.

మా - ఎమోనండీ! ఏమైనాసరే, ఇహను నేను ఆ మందు బుడ్లు మట్టుకు తాగను.

29

గడబిడ చేస్తూన్న పిల్లవాడితో ఒక పంతులుగారు కలగజేసుకుని.

పం - ఏమిటబ్బాయి, అది?

పి - అదాండీ సర్వనామం అండి.

పం - (పిల్లవాణ్ణి ఒక్కటికొట్టి) ఇది?

పి - (బిక్క మొహంతో) ఇదీ అంతేనండి. కాస్త పొగరుమోతు రకపుది.

30

సత్రం గుమాస్తా - రాసుగో వాలి, భోజనాని కొచ్చింది ఎవరెవరబ్బాయి, చెప్పూ.

అబ్బాయి - నేనొకణ్ణండి.

- నువ్వు నానదిక్కడ? నీ పేరు!

- రాచయ్యండి.

- సరే, రాచయ్య, ఇంకెవరు!

- మానాన్న ఒకడండి.

- సరే మీనాన్న ఒకడూ. ఇంకా ఎవ్వరూలేరుగద!

- అంతేనండి.

- అంతే?

- ఎవర్నేనా అడగండి కావలిస్తే.

31

పుల్లంరాజు - ఆ నాటకంలో వేషం వేసే ఆయనకి అంత కంతకి చెముడు ముదురుతోంది.

విస్సన్న - వినిపించుకోడం మానేశాడు. ఆ వినికిడి శక్తి కాస్తా ఎగిరి చక్కపోయింది.

పు - ఏం ఎందుకు మానేశాడు?

వి - ఏమో! రంగంమీద ఆయన అభినయించేటప్పుడు పుట్టే అరుపులూ, తిట్లూ ఇంకా ఎన్నేళ్ళని వినగలడూ!

32

సరయ్య - ఏమోయ్, సువర్ణలింగం! ఏమిటా ఉత్తరాలు?

సు - ఈ మధ్య పేపర్లో ప్రకటన ఓటి చేశాను. అందు నిమిత్తం జనం పంపుకున్న దరఖాస్తులు!

- ఏమని ప్రకటన?

సు - ఎడంపాదం ఒక్కటీమాత్రం లేనివాళ్ళని నాకు రాసుగోమని.

- ఎందుకూ?

సు - వాళ్ళల్లో అర్హుడూ నేనూ కలిసి దుర్వ్యయం లేకుండా జాయింటుగా జోడు కుట్టించుకుందామనీ!

33

వేషధారి - ఏమండోయ్. మేనేజరుగారు మూడో అంకం రెండో సీనులో నేను బ్రాందీ పుచ్చుగోవలిసి వస్తుంది. తెప్పించి ఉంచారా.

మే - తప్పుతుందా బాబూ అదీ తెప్పించాను. అయిదో అంకం ఒకటో సీనులో నువ్వు పుచ్చుకోవలిసిన విషంకూడా సిద్ధం ఇందాకానే చేయించాను.

34

ఓ పట్టణానికి చేరువగా ఉన్న పల్లెటూర్లో నివసిస్తూన్న ఒక దొరసాని తన వదెన గారితో.

దొ - వదెనోయ్ రేపు పట్నం వెడతాను.

- ఎందుకు!

దొ - కొత్తటోపీలు చూడడానికి.

- నీకు మతిపోయినట్టుంది. రేపు ఆదివారం షాపులు కట్టేస్తారు.

దొ - కట్టేస్తేం? నే వెళ్ళదల్చుకున్నది చర్చికి,

35

గిరీశం - శాస్తులుగారూ మీరు చుట్టపుచ్చుగోరూ!

శా - (చిరునవ్వుతో) దానికోసం నలుగురు నౌకర్లని ఏర్పాటు చేస్తేనే! ఒకడు పొగాకు తేవడానికి. ఒకడు అది భేషుగ్గా నౌజులా చుట్టడానికి, ఒకడు అగ్గి తేవడానికి.

గి - మరి నాలుగోవాడు?

శా - (కోపంతో) కాల్చడానికి.

36

సోంబ్లెట్లు - రమణా! నీకు తెలుస్తుంది, చెప్పూ మామూలుగా నుంచుంటే చాలా సేపటిదాకా కాళ్ళు బరువెక్కకపోవడేం? బుర్ర కిందగాపెట్టి కాళ్ళు పై కెట్టి నిలబడితే నిమిషంలో బుర్ర బరువెక్కడమే? నేను నాలుగు మూడుసార్లు చూశాను.

- అబ్బో, అదా! ఉన్నసరుకంతా నీకు కాళ్ళలోనే ఉంది గావునురా.

37

అచ్చంగా ఒకటే పోలికగా ఉండే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకణ్ణి మార్గవశాత్తూ ఒక శాస్తుల్లుగారు కలుసుగుని,

శా - అబ్బాయీ, మాట. అయితేనూ మొన్న యీ మధ్యపోయింది నువ్వా మీ వాడా?

- అదేమిటండోయి, అల్లా అడుగుతున్నారేమిటి!

శా - ఎరుగుండబట్టి భోగట్టాకోసం అడిగాను. తప్పా? ఇప్పటి వాళ్ళతో ఏమన్నా నోట్లోపుండే.

38

హోరున వర్షం కురుస్తుండగా ఒక దొర తన ఇంటి సావిట్లో పచారుచేస్తూ, ఈల వేస్తూ, తాళంచెవుల గుత్తి గిరగిర తిప్పుతూండగా, ఒక స్నేహితుడు వచ్చి,

స్నే - ఎవరికోసమో నిరీక్షస్తున్నారు!

దొ - ఇంట్లో దాని కోసమే. గొడుగులేకుండా బజారెళ్ళింది.

స్నే - అయితేం? షాపులుంటాయిగా, నిదానించడానికీ?

దొ - అందువల్లే మరీ గుండెల్లోరాయండి, కొంప గుండం వేసుగుపోతుందేమో అని తాళంచెవులు పుట్టుగు నుంచున్నా.

39

భానోజీ - ఏంరా, రామదాసూ! భారతం రాసింది వీరేశలింగంగారా, వావిళ్ళ రామస్వామి శాస్తుల్లుగారా?

రా - ఎల్లా గ్రహించావు?

భా - వారిపేర్లు మొదట్లోనే కనపడ్డాయి.

రా - ఇదిట్రా నీమాతృభాషజ్ఞానం! భారతం రాసింది "స్వకీయ ముద్రాక్షరశాల” అన్న సంగతి ఇంకా నీకు తెలియదూ?

భా - మరి మానాన్న, భారతంరాసింది ఘంటం అంటాడేం! పోరా! మనిషి ఒక్కంటికోమాటా!

40

శోభానాద్రి - నాయుడుగారూ! రేపు సంవత్సరాదికి నాకు అధికమాసల్తోటి అరవైయేళ్ళూ నిండుతాయి. ఒక్కటేనాలేదు ఇదివరకు. భేషైనది దింపి పెడుదురూ ఒక పొటిగ్రాపూ!

నా - సరే అల్లానే. కాని ఫొజిషను ఎల్లా పెడదాం అంటారు. ఫొజిషన్?

శో - దానికేం. మాదొడ్లో చెట్టుంది చూశారూ? దాని వెనకాల టోపీ చేత్తోపుచ్చుగు నుంచుంటానూ, అపళంగా దింపండి.

41

ఒక సైన్యపుతణికీదారు సేన తణికీకి వచ్చి. ఒక సోల్టరు క్షౌరం లేకుండా తెగమాసిన గడ్డంతో రాగా.

- ప్రతి ఉదయం వపనం చేసుగు మరీ రావాలని ఎరగవ్?

సో - చేసుగున్నానండి మీరల్లా మనవిచేస్తే నేనేం సెలవియ్యను?

- ఛీ. నోరుముయ్! గడ్డం మాసిఉంటేనూ!

సో - ఇదండి సంగతి. మేం తొమ్మండుగురం ఉన్నాం. ఇందరికి ఒకటే అద్దం. బహుశా మూడుపాళ్ళు నేను మరోడి గెడ్డం గీకేశానేమో!

42

అయ్యవార్లు - చిట్టిగా, ఇప్పుడు దేనిమీద పాఠం?

చి - చర్మం గురించండి.

- చర్మం అంటే ఏమిటి!

చి - గేదెలూ అవీ తొడుక్కునే కోటండి.

- ఓరి పశువా “కోటు” అయితే గుండీలేవిరా?

చి - లోపల వేపు నుంటాయండి. కనిపించవు.

43

హనుమానులు - ఏమండోయి! కుంభరాడ్కవిగారు ఈ మధ్య తమరుగారు ఇంకో పుస్తకం రచించారటగా.

కుం - ఏదోనండి రాశాను, కాని నేను అంత చవటపుస్తకం ఎన్నడూ రాయలేదు.

- మీరేకాదు. ఎవ్వడూకూడా రాయలేరనుకుంటాను.

కుం - రాయకేం!

- అదైనా మీ రనకూడదు ఊరుకోండి.

44

శేషం - చూశారూ, శాస్త్రిణః! మా నాన్నగారు కూడా నున్నూ గొప్పపండితుల్లో జమస్మండి.

శా - నేనామాట నిన్ను చూడ్డంతోటే పోల్చుగున్నా.

45

పెళ్ళాన్ని వంట పూటింట్లో దిగవిడిచి ఎక్కడికో సర్కీటు కొట్టివచ్చిన ఒకదొర తిన్నగా ఆ వంటపూటి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి,

దొ - అవ్వా. వచ్చాను తీసి గెళ్ళడానికి. ఏదీ మా ఆవిడ?

అవ్వ - వచ్చినవాడవు రానేవచ్చావు, నాయన, మరికాస్త పెందరాళేవస్తే నువ్వే తీసుగెడుదువుగా.

46

అక్కన్న - ఏదో అన్నారు, వంట్లో ఎల్లాఉందోయ్, ఉమ్మన్నా?

- చాలా జబ్బుగా ఉందనీ, చాలా ఆరోగ్యంగా ఉందని కూడా అంటున్నాడు, డాక్టరు?

- డాక్టరా. అంటా డాక్టర్లా?

- డాక్టరే!

- అంత విరుద్ధంగా అన్నాడేం!

- కక్కూర్తి! అతను మాత్రం ఏంజేస్తాడూ ? నిన్న పొద్దున్న నేను సెలవు పుచ్చుగోవలిసొచ్చి అతడు నాకు జబ్బు సర్టిఫిక్కట్టు ఇచ్చాడు. నిన్న సాయంత్రం నేను రెండువేలకి, ఇన్సూరుచేశాను. అందుకని నాకే, అతడే, ఆరోగ్యం సర్టిఫికట్టు ఇచ్చాడు.

- “చావూ” “బతుకూ” అంటూ మాటలూ రొండు గాని భావం ఒకటే.

47

టెలిగ్రాం కొట్టడానికి పరదేశిగారు ఆఫీసుకువెళ్ళి, అక్కడి గుమాస్తాతో,

- బాబూ, ముందు మాటెలిగ్రాం పట్టండి. గు - (ఆఫారం మీద కొన్ని టిక్కులు పెట్టి) మాటలు పన్నెండూ ఉన్నాయికాని, రెండుమూడు మాటలు తెలియడం లేదు. తిన్నగా రాయించుగు రండి. లేకపోతే రాసుగురండి.

- నా దస్తూరీ అవతలవాడికి తెలుసు. కొట్టెయ్యండి బాబూ మీకెందుకు మా ప్రైవేటు గొడవలన్నీనూ!

48

మీనాక్షి - కాకపోయినా, మహ అయిపోతున్నాయిస్మీ ఈ కాలం పెళ్ళిళ్ళు!

పిచ్చెమ్మ - మరేనండీ పిన్నిగారూ, చోద్యం అవుతుంది! అందులో ఆడపిల్లలకి మరీనూ!

మీ - ఇంకా నిమ్మణంగా అంటావేమిటి? వాళ్ళ సంఖ్యలో సహమేనా ఉండదు, పెళ్ళయిన మొగముండావాళ్ళసంఖ్య.

49

పుట్టంధుడు - పాలు ఎలా ఉంటాయ్, మాణిక్యాలూ?

మా - తెల్లగా ఉంటాయి.

పు - తెలుపెల్లా ఉంటుంది.

మా - కొంగరెక్కల్లా ఉంటుంది.

పు - మరి కొంగ ఎల్లాఉంటుంది?

మా - ఇల్లా. అని మాణిక్యాలు చెయ్యి వంకరటింకరగా పెట్టగా ముట్టుగుని తడిమి.

పు - అయితేమరి పాలు గొంతిక్కి చిక్కడవేం మరీ?

50

సైకిల్ మీద టెలిగ్రాఫు బంట్రోతు వచ్చి, టెలిగ్రాం ఇవ్వడంతోటే సుభద్రం అదివిప్పి చూసుగుని మొఖం ఇంత చేసుకోగా,

విశాలరావు - ఏమిట్రోయ్, విశేషం? పరీక్షా, లాటరీఆ?

సు - ఏదీకాదూ, నప్షల్స్ అయిందిట.

వి - నీకేనామిటీ?

సు - కాదు, మాతోడల్లుడికి.

వి - ఎవరిచ్చారు టెలిగ్రాం?

సు - మా మామగారే.

వి - ఏదీ ఇల్లాతే (అని పుచ్చుగు చూసి) మీ మామగారి దస్తూరీ బాగానే ఉంటుంది. కొట్టూ!

51

మూలస్వామి - దొరయ్యా! నువ్వు ఎంతో మంచివాడవని నలుగురితోనూ చెబుతూంటాను.

దొ - తమరు శుంఠలని నేనూ అందరితోటీ మనవి చూస్తూంటాను.

మూ - నీమాట నమ్మద్దూ, ప్రపంచం?

దొ - నీమాట నమ్మేడిశారూ, అప్పిడేను, నామాట నమ్మకపోవటానికి?

52

ఒక ఉద్యోగస్తుడు మాతృపాఠశాలకి వెళ్ళి తరగతులన్నీ చూస్తూ నాలుగో తరగతి దగ్గిర ఆగి,

- బాలులారా! మీలో ఆఖరువా డెవడో నుంచోవాలి.

(అనగానే ఒక పెద్దన్న నిమ్మళంగా నిలబడగా) - నీ పేరేమిటి, తమ్ముడూ?

పె - పెద్దన్నండి. స్కూల్లో వెంకటపెద్దన్నారావు,

- సరే, ఇది పుచ్చుగో

అని ఒక రూపాయిలనోటు ఇవ్వగా,

మే - బాబుగారూ, ఆ దయచేసేది ఎల్లనూ దయచేస్తున్నారు గనక మొదటివాడికే ఇస్తే. పోనీ!

- స్వస్థలంలో దీపం పెడుతూన్నవాడికి ఓతృణం ముట్ట చెప్పడం తప్పనా తమరనేది! చాల్లేస్తురూ!

53

తల్లి - సత్తెం! ఓరి సత్తెం! ఇల్లారా!

- (వచ్చి) ఎందుకే అమ్మా!

- ఇంద (అని బెల్లమ్ముక్క చేతిలో పెట్టి) వెళ్ళి, మన సాలలో బియ్యం దంపుతున్నారు చూశావ్, వాళ్లతో, బియ్యం తెల్లగా వెయ్యమని చెప్పిరా.

- (వెడుతూ) సరే.

- ఏమని చెబుతావ్?

- బెల్లం తియ్యగా వెయ్యమంటాను!

54

దీక్షితులు - గుమాస్తాగారూ మీ ఊరు సంత ఎప్పుడండి?

గు - పోనీలేస్తురూ మీ కెందుకు ఆ వెధవసంత!

దీ - అబ్బా! మీ ఊళ్ళో అల్లాంటి సంతకే ఉన్నారేం జనం? లోటులేదు.

55

సోమప్ప - ఒరేయి కనకం! భానోజీ పెద్ద భాండం కొన్నాడు.

- ఘటవాయిద్యం చేస్తాడా ఏమిటి?

సో - వీడికివాయిద్యం ఏమిటి? అవతల పట్నంకుంపినీవాడు ఇదివరకే వాయించి పుచ్చుకున్నాడు బాగా రెండు వందలైతే.

- అబ్బో! అంత పెద్దదిట్రా! లోహపదామిటీ?

సో - లోహం ఏమిట్రా నిం దగలెయ్యా! నూట యాభై పుస్తకాలు పైగా ఉంటేను!

56

హనుమంతు - (సిసింద్రీకిమల్లే ఉన్న రాజాలుతో) రండి రండి! పర్వతావధానులుగారు

రాజాలు - (పొణకంతున్న హనుమంతుతో) చిత్తం చిత్తం. వస్తునానండి నల్లమూ సంభొట్లుగారు.

హను - నేను తమ తెలివిని గురించేష్మండి మాట్లాడతా, శరీరం కాదు!

రా - నేనూ అంతేనండి.

57

అవధాని - ఏమండీ యల్టీమేష్టరుగారూ! మా వాడికి ప్రైవేటు చెపుతున్నారు గందా, లెక్కల్లో ఈ కుంక ఎల్లా వున్నట్టూ! - లెక్కల్లో మీవాడు “గుడ్” అని వాళ్ళ క్లాసు మేస్టరు ఈ వేళ పొద్దున్నే అన్నారండి.

- లెక్కల్లో గుడ్డయితే నువ్వు చెప్పి చచ్చిందేమిటయ్యా మరీ!

58

సోమన్న - ఒరేయి, కోటిలింగం! నేనూ నాభార్యా, మే మిద్దరం పట్టంలో ఉంటే సాలీనా ఏమవుతుందిరా?

కో - నువ్వూ నీభార్యా కలిసి పదిమంది పెట్టు. ఇద్దరేమిటి? ఎంతేనా అవుతుంది.

సో - పదిమందేమిట్రా, నీమోహం?

కో - అవునురా. నీభార్య ఒకటి. నువ్వు సున్న. ధరిమేనా జేరిస్తే పదీ.

59

పంతులు - దానాలన్నింటిలోకీ గొప్పదేది? భైరవరావు!

భై - అన్న దానమండి.

పం - నీ ఉద్దేశం? సుబ్బరాజు

సు - మైదానమండి, గుర్రపుసవ్వారీకి.

లక్ష్మణ సెట్టి - నే చెప్పనాండి.

పంతు - కానీ.

- ఉపాదానం అండి.

పంతు - భేష్. ఇది అన్నిటికీ పైదానం. అల్లానే కానీ, ఒకోక్కడికి ఒకొక్కటి నిదానం.

60

బ్రాహ్మడు - ఏమట్టుకొచ్చిందోయ్, వడ్డాణం.

కంసాలి - అబ్బే మెరుగు తరవాయండి.

బ్రా - అదెప్పుడు మళ్ళీ?

కం - ఇప్పుడేగాని ముందు ఈకంటె చూడండిబాబూ!

బ్రా - (చూస్తూ) ఏం?

కం - ఇది కల్తీదని ఏచవటవెధవ అనగలడండీ!

బ్రా - అవునోయి. చాలా దివ్యంగావుంది.

61

మధ్యవర్తి - ఏమిటోయ్, ఈ పేచీ, శ్రీరంగం?

శ్రీ - ఈ తారకం నన్ను తిట్టాడండీ!

- ఏమోయ్ తారకం?

తా - చిత్తం.

- ఏమనోయ్, శ్రీరంగం

శ్రీ - "పోరా, వెధవన్నరగా” అన్నాడండి.

- ఏమోయ్ నిజమేనా?

తా - చిత్తం.

- అల్లాతిట్టచ్చా? ఋజువు చెయ్యలేనిమాట ఆడచ్చా?

తా - చిత్తం. ఋజువు చేస్తానండి.

- ఎల్లా? తా - ఇతని పెళ్ళాం పోయినప్పుడు వెధవై, తరువాత ఉంచుకున్న మనిషి పారి పోయినప్పుడు ఒక అర అయాడండి!

62

ఒక స్త్రీ హోరున ఏడుస్తూ పోలీసుస్టేషన్కి వెళ్లి అక్కడి ఇనస్పెక్టరుతో,

స్త్రీ - బాబూ! మా ఆయన మూడు రోజుల కిందట కోపం వచ్చి నూతులో పడతా నన్నాడు. మొన్న తప్పిపోయాడు. కాస్త జాలిదల్చి నూతులూ గోతులూ వెతికించండి.

- మీ ఆయనకి ఆనవాలు చెప్పి వెళ్ళు.

స్త్రీ - మా ఆయనికి ఎడంచెవి చెముడండి.

63

కోరమ్మ - ఎమోయ్, నాంచారెయ్య బావా! మొన్న మనవీధిచివర ఆడవాళ్ళు నిన్ను తిట్టి బుగ్గలొడుస్తున్నారేం? మొగాళ్ళు తన్నుతున్నారేం?

నాం - ఏముంది వదినా! వాళ్ళకి ప్రపంచకపు చరిత్ర తెలియదు. అదీ కర్మదశ!

కో - సరేలే. నువ్వు చేసిందేమిటి అసలు?

నాం - రెండురోజులు వాళ్లపిల్లకేసి దీక్షగాచూసి మూడో రోజున దాన్ని జుట్టట్టుగుని గబగబా మా ఇంటికి ఈడ్చుకుపోదామని యత్నించాను.

కో - ఏం అదేంరోగం నీకూ!

నాం - చెప్పలా! “ఎస్కిమో” దేశంలో ప్రేమ ప్రకటించడం అల్లాగేట

కో - సరేలే. దెబ్బలు నయం అయింతరవాత. ఆదేశం వెళ్ళి ఆపనిచెయ్!

64

కొందరు ఆడంగులు ఒక డబక్కులరావుని యుద్ధం ఎట్లా జరుగుతోందో వర్ణించమని అడగ్గా.

- ప్రస్తుతం ఐరోపా మహాసంగ్రామంలో జర్మనీవాండ్లు లక్షలకొలది రుష్యావాండ్లని ఖైదీలుగా తీసుకుంటున్నారు. కాని, ఆ రుష్యావారు కోట్లకొలది జర్మనీ వారిని లాక్కుపోతున్నారు. ఇల్లా కొన్నాళ్ళకి, జర్మనీ వారంతా రుష్యాలోనూ రుష్యావారంతా జర్మనీలోనూ ఉంటారు. అప్పుడు తమతమ దేశాలకి వెళ్ళిపోయి రావడానికి పునహా పోట్లాట ప్రారంభిస్తారు.

65

ఇద్దరు స్నేహితుల్లో ఒకడు డాక్టరీ ఒకడు ప్లీడరీ ఒక్కమాటే ప్యాసై ప్రాక్టీసు ప్రారంభించగా, కేసు వచ్చేటంత దరిద్రం ఇద్దరికీ పట్టక, చివరకి తల్లి ముగ్గురుచావై డాక్టరికి కేసువస్తే ఆయనవెళ్ళి ఆమట్టున ప్లీడర్ని కాగలించుగుని ఆనందబాష్పాలు ఒలకపోసుగుంటూ,

డా - మిత్రమా కేసోచ్చింది. వెడుతున్నా, ఆ ఆసామీని చూడ్డానికి.

ప్లీ - (ఆదుర్దాగా) ఆ ఆసామీ “విల్లు” రాశాడో లేదో నేనూ వస్తానోయ్!

66

తెలుగు పంతులు - 'పిసినిగొట్టుతనము' ఏ భాషాభాగం? నాలుగోవాడు!

నాలుగో - అవ్యయం.

67

సుబ్బారావు - రత్తయ్యగారూ! ఆ డాక్టరు మీ ఇంటికి వస్తున్నాడు గదా. ఒహొక్క తడవకి ఎంత 'బిల్లు' చేస్తాడు. - అయిదు రూపాయలు.

సు - ఎన్నిమాట్లు వచ్చాడు ఇప్పటికి?

- ఇరవైసార్లు.

సు - అల్లాయితే నూరూ అక్కడ కక్కవలసిందే.

- నూరేమిటి నీ బుర్రా, అయిదే! వాడు ఒకసారి వచ్చాడూ!ఆకడం పందొమ్మిదిసార్లూ ఆ అయిదూ వసూలు చేసుగోడానికి అహోరించాడు.

68

మాణిక్యాలు - అవ్వా! ఏమన్నా పెట్టవ్.

- కోడిగుడ్డు ఓటుంది ఇస్తానుండు, పీల్చుదుగాని,

మా - ఈ పీల్చడంలో కొత్త పద్ధతి విన్నావా?

- ఏమిటి?

మా - అండజంబునకు నిరుపార్శ్వంబుల సూక్ష్మబిలంబుల నిర్మించి, దానినోష్ఠములతో గబాళించి, గంభీర నిశ్వాసంబు గావించినచో తదంతర పదార్థంబు గొంతు ప్రవేశించును. ఇది నూతన ఫక్కి.

- వెనకట్లో గుడ్డుకి చెరోపెడా బొక్కపెట్టి పీల్చేవారు! అంతా కొత్తే.

69

క్షీరపురంలో “రసపుత్రవిజయం” ఆడుతూ, రాజసింహుడు తనచేత్తో పట్టుగొచ్చిన హాండ్‌స్టిక్కు ముట్టుగుని,

రా - "పూనితి నిదె ప్రతిన కత్తి ముట్టి”

అని పాడేటప్పటికి అంతా నవ్వగా,

ఒకడు - అదేం కత్తిరోయ్?

అనగా రాజసింహుడు - “మహాత్మా”

అని పద్యం పూర్తిచేసి సిక్కులో ఉన్న కత్తిపైకి లాగగా,

మరిఒకడు - కర్రకత్తిరోయ్

70

బృందావనం - వందనం! ఈకాలంలో గురుభక్తిలేదు.

వం - ఏం జరిగిందేమిటి!

బృం - ఓ కుర్రాడు నాదగ్గిర రెండేళ్ళు ప్రైవేటుగా చెప్పించుగుని నాకు ఇవ్వడంమాట మరిచి చక్కా పోయాడు.

వం - ఏమిటి చెప్పుగుంటా

బృం - జ్ఞాపక శాస్త్రం

వం - అతని పేరు!

బృం - ఏదో ఉందయ్యా, నోట్లో ఆడుతోంది, ఇట్టీ మరిచిపోయానూ.

71

ఒకచోట ఉపన్యాసం పెట్టించినవాడూ, ఇచ్చేవాడూ, రాసేవాడూ మాత్రం హాజరుకాగా, ఇచ్చేవాడు లేచి ప్రారంభిస్తూ,

- ఆర్య మహాజనులారా! రా - అప్పిడే కోతలు మొదలు!

- ఎంచేత!

రా - చూడండి హాలుకేసి,

- ఆయన ధర్మబుద్ధితో పేపర్లు అచ్చువేసి పంచి పెట్టడం వల్ల ఆర్యుడు, తమరు స్థూలకాయులు కాబట్టి మహాజనులు ఇహనేం?

72

ఒక గొప్ప లోగిటికి చాలామంది ముష్టికివెళ్లి అడుక్కుంటూ,

వైదికి - సీతారామాభ్యాన్నమః అమ్మా! యాయవార బ్రాహ్మణ్ణి.

నియోగి - (పక్కకి చూస్తూ యజమానితో) చేత్తో ఇక్కడ కూడా కాసిని తగలెయ్యమను!

క్షత్రియుడు - (మీసాలుదువ్వి సకిలిస్తూ) మేము మాత్రం ఎందుకు వచ్చామనుకున్నావు.

కోమటి - యెట్టయ్యా, యెట్టు యెట్టావో, పై లోకంలో పున్యాలు జుఱ్రుకున్నానో! దీంటో నాకేంలేదు!

శూద్రుడు - ఏదో కూంతంత సూడుబాబూ, అంతే సేన!

సాహేబు - (కళ్ళు మూసుగుని) మాకీ హక్షంగా హదే సెప్పీనామ్!

73

రామారావు - ఏమండీ! కేశవరావుగారూ! మా అమ్మాయి నాపోలికా, తల్లి పోలికా? పట్టింపొచ్చింది చెప్పండి.

కే - ఏమోనండి, తల్లి పోలికేనండీ, నాకు తోచినంతమట్టుకూ!

రా - ఛీ ఛీ మీరుకూడా అట్లా చెప్పారేమిటి?

కే - ఏమిటి నే నన్నదీ!

రా - దానిపోలికేమిటి ముష్టిపోలికా! నా పోలిగ్గానీ! నా స్వంతకూతురవుతూంటే ఏమిటి మీరీ అడ్డదిడ్డం మాటలూ!

74

దొరసానిగారు చాలా విచారంగా కూర్చుని ఉండగా, దొరగారు ప్రవేశించి

దొర - ఏమిటి సంగతీ!

దొరసాని - ఏమడుగుతారూ అద్దం చేతిలోంచి జారి బద్దలయింది. ఏడేళ్ళు అష్టకష్టాలూ పడాలిగదా అని విచారంగా ఉంది.

దొర - నాన్సెన్! అది వట్టి పిచ్చినమ్మకం. ఒకావిడ వెనక ఇల్లానే బద్దలుకొట్టి అనుకుంది. కాని ఏడేళ్ళూ ఎంత మాత్రం కష్టపడలేదు.

దొరసాని - మరి

దొర - మూడోనాడు సునాయాసంగా కాలధర్మం చేసింది.

75

రైల్లో, అన్నగారి శవాన్ని తీసుకుపోతూన్న వెంకబ్రహ్మందగ్గరికి ఒక రైల్వే ఉద్యోగి వచ్చి, తణికీచేసి హెచ్చు అక్కడ పెట్టమనగా,

వెం - మావాడికి 'సీజన్' టిక్కెట్టు ఉందండి. అతగాని పని అయిపోయినా, అదిమాత్రం ఇంకా రొండు నెల్లదాకా అయిపోదు. అందుకని వేరే ఏమీ పుచ్చుగోలేదు. పైన మీచిత్తం.

ఉద్యోగి - శవాలికి 'సీజన్' లేదండి.

76

యజమాని - అయితే, బల్లవెడల్పు ఎంత, పెట్టింది?

వడ్లాబత్తుడు - నాలుగు అడుగులండి.

య - పొడుగు?

వ - మూడు.

య - అదేమిటీ అల్లా ఎల్లా ఉంటుంది.

వ - ఏమోనండి. రెండుదఫాలు కొలిస్తే, రెండుదఫాలూ కూడా పొడుక్కంటే యెలడ్పే ఎక్కువొచ్చింది.

77

మేష్టరు - 'పఠము' వర్ణక్రమం చెప్పు - మూలకూర్చున్న ఎర్రటోపీ.

ఇనస్పెక్టరు - అదేం పిలుపండోయ్! (కుర్రవాడితో) చెప్పమ్మా అబ్బాయి.

ఎర్రటోపీ - పకారాకారముల 'పా'

మే - 'పఠము' లో ఆకారం ఎక్కడుందిరా!

ఇనస్పెక్టరు - లేకపోతే ఎందుకండీ దిక్కుమాలిపఠం

78

పల్లెటూరి పెద్ద అనిపించుకున్న కాసులు, సుదర్శనంతో మాట్లాడుతూ,

కా - టెలిగ్రాం వట్టి తీగే అని కొందరి భ్రాంతి.

సు - సరిసరి. నీ నమ్మకం ఏమని?

కా - అది కేవలం గొట్టం. అందులో సరుకులు పంపుతారు.

సు - గొట్టం ఏమిట్రా నీ తలకాయ్!

కా - పైగా, ఆగొట్టంలో ఎర్రసిరా పోస్తారు.

సు - ఇదెవడు చెప్పాడ్రా?

కా - చెప్పేదేమిటి, గ్రహించాను. ఇక్కణ్ణించి తెల్లగా వెళ్లి అక్కడ ఎర్రగా అందుతుంది టెలిగ్రాం కాగితం.

79

రాజమండ్రీ కాపరస్తురాలైన రమణమ్మ తన బంధువు సుబ్బారావు వీధిగుమ్మంలోంచి దాటివెడుతూండగా.

ర - సుబ్బారావుగారూ ! ఎప్పుడొచ్చారు? మా యింట్లో ఉండనే ఉండరుగదా? ఎందుకుంటారూ? డయలేందే.

సు - తప్పకుండా ఉంటాను. కానీ, మీ ఆయన ఏడీ?

ర - తాడేపల్లిగూడెం బియ్యానికి వెళ్ళారు. (తనలో- పైకి వినపడేటట్టు) అబ్బబ్బా! ఈ చేతిమీద కురుపు అన్నమేనా వండనీయడంలేదుగదా!

సు - సరేసరే. బియ్యమూతెచ్చి, మడికట్టుగుని, వంటావండి, తినాతిని మరీవెడతానమ్మోయ్! నా బోటిగాణ్ణెప్పుడూ అతి బలవంతం చెయ్యకు.

80

కనుచీకటి వేళప్పుడు, సామర్లకోట స్టేషను ప్లాటుఫారం మీదికి అంతా మూటలు జేరేసుగుని వచ్చి నిలబడూతూండగా, అంజయ్య - రాజమండ్రీ వెళ్ళేమేలు వస్తోందొస్తోంది!

చెంచు - (రాజమండ్రీవేసు చూస్తూ) ఏదీ కనపడదేం?

అం - ఆవేపుచూసి లేదంటావేమిటయ్యా, నువ్వెప్పుడూ రైలెక్కనట్టు కనబడుతుంది!

చెం - నేనుమాత్రం ఎక్కినట్టు చెప్పానా ఏమిటీ! రాజమండ్రీ మేలూ అంటే రాజమండ్రీలో బయల్దేరి ఇక్కడి కొచ్చి నన్ను తీసుగు వెడుతుందేమో అనుకున్నాను.

81

కొడుకు - నాన్నా ; పుస్తకాలన్నీ కొన్నానయ్యా, ఇంక డిక్షన్రీ ఓటి కొనాలి, రొండున్నరా.

తండ్రి - అదంటే ఏమిట్రా, చవటా?

కొ - అర్థాలూ అవీ ఉంటాయి నాన్నా!

తం - ఓరి నీ మోహం ఈడ్చా! అమరమామిటీ?

కొ - కాదు నాన్నా, ఇంగ్లీషుది.

తం - ఏడిశావులే అప్పిడేను. ముందు, కొన్నవన్నీ చదివి ఏడుద్దూ అదీ కొనితగలేద్దుగానీ!

82

అప్పుడు - రైలుకి టెక్కెంటెంతేటి బాబు?

గుమాస్తా - ఏడిసినట్టే ఉంది. ఏవూరికి?

అ - ఎక్కడికైతేంబాబు! నాయిట్టం!

గు - అది కొన్న తరవాత.

అ - అయితే యిజానారం బాబు!

83

ఒక టీపార్టీ జరిగే సందర్భంలో అశ్లీలపుమాటలంటే చెవికోసుగునే లక్ష్మణయ్యగారు టీలోకి తనకి కొంచెంపాలు ఎక్కువ కావలసి, యజమానితో,

ల - అయ్యా! ఆ ఆవుని కాస్త ఇల్లా వెనకాడించి తరుముకురండి!

అనగా, యజమానురాలికి ఎల్లానో అనిపించి, పాలువడ్డించే దానితో,

యజమానురాలు - దూడ అరిచేచోటికి వెళ్ళమ్మా త్వరగా! -

84

రావు - నిన్న కలెక్టరు షేక్ హాండు ఇచ్చాడండీ

శాస్త్రి - ఏమి అదృష్టమండీ? మీకే?

రా - అబ్బే, నాకు కాదండి. ఒక గొప్పాయనికి.

శా - సరి. ఆమాటెందుకిప్పుడూ?

రా - అందుకనికాదూ. మొదట నాకే ఇద్దాం అనుకున్నాడులెండి.

శా - ఏం?

రా - ఆయనేమో అనుకుని.

85

కొందరు బియ్యే విద్యార్థులు భోజనం దగ్గర కూర్చుని ఉండగా,

సుబ్బు - పంకజం! నువ్వెన్ని బూర్లు తినగలవ్?

పం - రెండు మూడూ! ఊహూ ఆబేగాని తీపి మొహం మొత్తిపోతుంది.

సు - నువ్వురా, చంద్రయ్య! | చం - ఆ. నేను ఓ సున్నా బూర్లకంటె ఎక్కువ పుచ్చుగోలేనుష్మి! నీమాట!

సు - నేనూ ఆ రకమే. ఒక్కఅరసున్నకంటె ఎక్కువ నావల్లకాదు.

చం - జాగ్రత్తస్మీ. అరసున్న కొడవలిలా ఊరుకుని అంగుట్లో గుచ్చుకుపోగల్దు.

86

ఒక అధికారి ఒక అవధాన్లుగారితో వ్యవహారం మాట్లాడుతూ, మధ్య కోపం ఆపుకోలేక,

అధి - చాలు. సంతోషించాంగాని ఇక తమరు ఈ విషయంలో నోరుముయ్యండి.

అవ - నమోన్నమః సంసిద్ధుణ్ణి. కాని, ఎవరిదో సెలవిచ్చారు కారు.

87

పిల్లలికి భూగోళం చెబుతూ,

మేష్టరు - రొండోవాడు! లే. భూమి పెద్దదా చిన్నదా?

రొం - పెద్దదేనండి.

మే - మీ నాన్న దాన్ని చుట్టూ నడిచిరాగలడా?

రొం - నడిచిరాలేడండి! -

మే - ఎంచేత చెప్పుమరి చూస్తానూ!

రొం - నిన్న సాయంత్రం ఆయనకి కాలు బెణికిందండి.

88

బొమ్మలు రాసే సత్యమూర్తితో,

బంగారమ్మ - నాబొమ్మ వేసి పెట్టాలండి. సరిగ్గా నాకు మల్లేనే ఉండాలి, బాగుండాలి.

స - కుదరదండి. ఏదో ఒకటి మీరేచెప్పండి బాగా ఆలోచించుగుని.

89

వెంకయ్యగారు తలుపు తాళంవేసి ఊరికెళ్ళడం కనిపెట్టి, ఒకడు రాత్రి ఒంటిగంటకి తాళం తియ్యడానికి ప్రయత్నిస్తూంటే ఒక కనిస్టీపువచ్చి.

క - ఎవడ్రా, అదీ!

ఒకడు - అయ్యా! నేనండి, తాళంచెవి ఓటి దొరికింది. అది ఈ తాళానికి పెట్టిచూసి సరిపోతే ఇంటివారిని కనుక్కుని ఇచ్చిపోదాం అని చెప్పేసి వచ్చానండి.

90

ఒక ముసలిదొర ఒక చంటి పిల్లని పెళ్ళిచేసుకోడానికి చర్చికి లాక్కెళ్ళి అక్కడి అర్చకుడికి కనబడగా,

అ - ఉదకం తూర్పువేపు గదిలో ఉన్నాయి, పట్రండి.

దొర - ఉదకం ఏమిటి మీ మొహం!

అ - అల్లానా? క్షమించండి. ఈపిల్లని జ్ఞానస్నానం నిమిత్తం తీసుకువచ్చారేమో అనుకున్నాను.

91

ఒక పెద్దమనిషి ఒక మురికిబాలుణ్ణి చూసి,

పె - ఒరీ కుర్రకుంక! ఏ పెంటమీదేనా దొరికితే నీకు ఓ అణా ఇచ్చుగుంటానుగాని శుబ్బరంగా వెళ్ళి స్నానం చేసిరా, చూడలేకుండా ఉన్నాం.

అనగా, వెంటనే వాడు వెళ్లి స్నానం చేసిరాగా, అన్నప్రకారం ఆయన వాడికి అణాఇచ్చిన తక్షణం తిరిగీ ఆయన చేతులోనే పెట్టి ము. బా - ఇది మీరే ఉంచండి. ఉంచి ఇదెట్టి క్షౌరం చేయించుగుందురు, బాబూ, బతకలేకుండా ఉన్నాం,

92

షరాబు - డబ్బు ఇవ్వడానికి మరేమీ ఆక్షేపణ లేదుగాని గాని మీరు అచ్చంగా మీరే అనే సర్టిఫికట్టు ఓటి ఉండి తీరాలి.

ఆవిడ - నేను నేనే కదండీ, ఎప్పుడూనూ!

ష - ఆ తెలివి కట్టెయ్యవమ్మా! పుట్టుమచ్చలు వగైరాలతో ఒక కాగితం ఉండాలి, లేకపోతే వీలుండదు.

ఆ - అది ఇప్పట్లో పట్రాలేనుగాని నా దగ్గిర ఒక ఉత్తరం ఉంది. అందులో ఒకరు నన్ను పూర్తిగా వర్ణించారు. నేను నే నవునో కాదో చూసుకోండి. మళ్లీ మా ఆయనతో అనకండిస్మీ ఈ గొడవ!

93

వెంకమ్మ - ఆసంగతి రామక్కతో చెప్పద్దని చెబితే చెప్పేశావూ?

పుల్లమ్మ - ఎంత మొగవీరుడమ్మా, రామక్కా! తనతో చెప్పినట్టు నీతో చెప్పద్దంటే చెప్పిందీ!

వెం - సరేలే. ఆమాట నీతో చెప్పనని రామక్కతో చెప్పాను. ఈమాట మళ్ళా ఆవిడతో చెప్పకు.

94

బస్తీస్కూల్లో నాలుగోక్లాసు ఒకడూ అయిదోక్లాసు ఒకడూ చదివేసిన ఇద్దరు అన్నదమ్ములు సెలవలకి ఇంటికొచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఇంగ్లీషునే మాట్లాడుకోవాలని సంకల్పించుగుని,

పెద్ద - ఒరేయి! బురదర్రూ! నాన్న కాల్తున్నాడ్రోయి! దబ్బున్రారోయ్!

చిన్న - ఎప్పుడ్రా? కాల్తా? నాకు తెలియదే?

పెద్ద - ఇందాకా ఏయిటింటికిరా కాలిందీ!

తల్లి - మీనాన్నేట్రా ఏటింట్లో కాల్తా! అయ్యొ, అయ్యొ నా పసుపూ!

95

దుమ్ములోపడి దొర్లుతూన్న కొడుకుని రెక్కపట్టుగు లేవదీసి,

తండ్రి - వెధవ మొహం వెధవ! బాడిలో ఏడవద్దని ఎన్ని మాట్లు గద్దెట్టాను? ముష్టెత్తుగు పోతావ్ లే! అంటూండగా పక్కనించి జగ్గప్ప ఇది విని వచ్చి,

జ - ఎవరండీ ఈకుర్రాడు?

తం - మావాడే. ఏం?

జ - ఏంలేదండి. అచ్చంగా మీ మొహమే!

తం - (పొంగిపోయి) ఏదోనాయన! పెద్దలాశీర్వచనం!

96

పెద్దక్లాసులో ఇంగ్లీషుపాఠం చెబుతూ, రంగేశ్వరుడు గారు, మూడేళ్ళు ఆక్లాసే చదివినా ప్రశ్నవేస్తే నోరువిప్పని మారెయ్యతో,

రం - ఛీ! వట్టి శూన్యంలా ఉన్నావేమిటోయ్, నువ్వూ! నీ యీడప్పుడు నేను చాంతాళ్ళలాంటి ఇంగ్లీషు ప్రశ్నలు ఇల్లా ఊరికే ఉప్పున ఊదిపారేసేవాణ్ణీ. మా - మీమేష్టరు మంచి తెలివిగలవాడై ఉండాలండి.

ఇంకో విద్యార్థి - కాదు. వీళ్ళనాన్న తెలివిగలవాడు. ఈన్ని సరియైన మేష్టరుదగ్గిర పారేశాడు.

రం - మామేష్టరు అడ్డమైన అనర్హుణ్ణి చేర్చుకోడం నేనెరుగను. పాఠంలో పడదాం.

97

యాభైని నాలెగెట్టి గుణించమని, అయిదు నిమిషాలు ఊరుకుని, ఇనస్పెక్టరు ఒక కుర్రవాణ్ణి,

ఇ - నీ పేరేమిటమ్మా.

కు - తిలక్ అండి.

ఇ - బాగుంది, నీకు ఆన్సరు ఏంవచ్చింది?

కు - (గుతకలువేస్తూ) మరేమోనండీ, రొండండి.

ఇ - యాభైని నాలుగెట్టి గుడిస్తే యాభైకంటె ఎక్కువొస్తుందా, తక్కువా ?

కు - ఎక్కువేనండి.

ఇ - మరి రొండంటావే ?

కు - చివర సున్నలుంటే కొట్టెయ్యచ్చని మా అన్నయ్యతో వాళ్ల ప్రైవేటుగారు చెప్తే విన్నానండి..

98

తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లో,

ఆచారి - టిక్కెట్లిచ్చే గుమస్తా మీరేటయ్యా ?

గు - మరేనండి,

ఆ - ఇంకా ఆలస్యమేమిటి.

గు - లేదండి.

ఆ - అయితే, రాజమండ్రీ గోదావరికి టిక్కెట్టు ఎంత కమ్ముతున్నారండీ?

గు - ఏడణాలకాని.

ఆ - పావలా అర్థణాకిస్తారా ఇంకా ఏమన్నా బేరముందా?

గు - అవతలకిపో బ్రూట్!

ఆ - ఛీ! ఛీ! ఇక్కడన్నీ ప్రియమే. బజార్లోనే నయం!

99

షాపుమీదికీ వెళ్లి కోటుగుడ్డలరకాలు చూస్తూ షాహుకారు కొంతెడంగా ఉండగా, మెల్లిగా,

బుచ్చిరాజు - ఒరేయి, సరవారావు! ఈ గుడ్డ గజం ఎంతో?

స - బహుశా గజం మూడడుగులు అయిఉంటుంది! చాలా నాణెం సరుకుస్మీ.

బు - మరే. మన్నేటట్టే ఉంది. కాని నేను గజం ముప్పై ఆరు అంగుళాలు అని ఆలోచిస్తున్నా ఇంకా! తప్పు తప్పు!

స - అడ్డమా! ఇహ ఇల్లాంటి తప్పుడాలోచన్లు మానుకో.

100

ఇంటిల్లపాతీ తాగుబోతులైన ఒక నీచపు సంసారంలో,

చిన్నవాడు - ఓలమ్మోయ్! నీలట్రాహే, నింతెగెయ్యా!

పెద్దవాడు - లమ్మనెందుకురా తిడతావ్, తొత్తుకొడకా! తల్లి - సంటోడిమీద కేక లెందుకురా ఎదవకొడకా!

పెద్ద - నేనా యెదవకొడుకుని? అడిగోత్తానుండు నాన్ననీ!

101

నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ గుటకలువేసి మునిగి చావడానికి సిద్ధమై గిజగిజా తన్నుకుంటూన్న,

చలమయ్య - బాబోయి - సచ్చాను - గట్టుకి లాగండి - బాబోయి! "

అని ఒక్కొక్కమాటే అంటూండగా, చాలాదూరాన్నించి ఇది చూస్తూ రెండంగల్లో అక్కడికి పరిగెట్టి, తన “కెమిరా” కర్రలు నిలబెడుతూ,

గంగారామ్ - అట్టె ట్టె ట్టె! అల్లానే ఉండు. బాబ్బాబు! ఒక్క చిటిక! కదలకు. వన్, టూ, త్రీ!

102

అయ్యవార్లు - నీకు కాళ్ళెందుకురా, గురవా?

గు - ముల్లు విరిగితేనండీ, తీసుగోడానికండి!

అ - ఛీ! నువ్ రా వెంకన్న!

వెం - గురవడు చెప్పిందండీ, మరేమోనండీ, శుద్దండీ, తప్పండి.

అ - సరే తరవాత!

వెం - బూజసులు తొడుక్కునేందుకు కాదండీ?

అ - ఏడిసినట్టేఉంది. నువ్ రా పాపిగా!

పా - ఏదేనా తొక్కితేనండీ, కడుక్కోడానికండి!

అ - ఓరి అపాత్రుడా! ఎరక్కపోయి అడిగాను. కూచో.

103

గొప్ప వేషంలో ఉన్న ఒక పెద్దమనిషి ఒక కాఫీహోటల్లోకి జొరబడి, కొసిరివేయించుగున్న పెరుగుతో వెరసి ఆరు ఆవడలు పుచ్చుగుని, తరువాత,

పె - ఏమయ్యా, వడ్డించే ఆయన!

వ - (వచ్చి) ఇంకేం కావాలండి!

పె - ఈవేళ చేసిందయితే, ఓఅణా 'వగైరా' పట్రా?!

వ - (చప్పరించి) పోవయ్యా! గడుసుదనం!

పె - బల్లమీద రాసుంటేనే?

వ - అదా అర్థం ? వెళ్లవయ్యా !

పె - అల్లాయితే ఏమిటి నువ్వనేమాట ఏమున్నాయి?

వ - ఇడ్లీఉంది, కాఫీఉంది.

పె - అల్లాచెప్పూ! అల్లాఅయితే, రెండుచేతుల ఇడ్లీ, శేరు కాఫీ పట్రా!

104

బాలుడు - టైం, ఎంతైందండీ, బాబూరావుగారూ!

బా - (బాలుడివీపుమీద ఒక్కటికొట్టి) ఇంతైంది.

బాలుడు - నయమేయింకా. గంటకిందట అడిగానుకాను.

105

పత్రపురంలో 'పాదుక' ఆడుతూన్న సమయంలో వన్సుమోర్లు చాలాపడటంవల్ల, ఒకసెట్టిగారు తనొక్కడూ ప్రత్యేకంగా అల్లానే అనదల్చి, ఒకపద్యం అయింతరవాత,

సె - (గట్టిగా) హంసమార్క్! పనసమోడ్ ఆని అరవడంచేత కొందరికి నవ్వురాగా,

పక్కవాడు - ఏమిటండీ, సెట్టిగారూ! మీరన్నదీ?

సె - మళ్ళీ కాస్సేపటికి మీరంతా అనేదే!

106

పంతులు - పద్దయ్యా! మీ తమ్ముడు బజారుకెళ్ళి పాతిక మామిడిపళ్ళు తెచ్చి పందొమ్మిది పుచ్చుగున్నాడు, నీ కెన్ని మిగుల్తాయి!

ప - అమ్మనాయనా! అన్ని పుచ్చుకుంటాడేం? కణతమీద పైడ్‌మని, ఒక్కదౌడ లెంపకాయి ఉచ్చుగుంటాను.

107

పాపారావు - వెంకటయ్యా, గోవిందు చాలా పెద్దమనిషి ష్మీ! మాటేనా ఆడ్డు. నోట్టో నాలికేలేదు వాడికి.

వెం - అబ్బా! అల్లానేం? వాడీమాటు అన్నంతినేటప్పుడు చూడాలి.

పా - అప్పుడు లాభంలేదు. డోక్కునేటప్పుడు చూడు.

వెం - సరే, ఈమాటు వాడెప్పుడు డోక్కుంటాడో!

పా - నువ్వెళ్ళి వాడికి ఊరికే కనబడితేచాలు?

108

కొత్తమేష్టరు - సుందన్నోయ్! నువ్వు మంచివాడవ్. కాదూ?

సుం - అవునండి, మాతమ్మురు మంచివారు కారు.

కొ - అవును. నేను అక్షరాలు చెబుతూంటాను, నువ్వుకూడా చెబుతూండు; ఇంచక్కా,

ఏం?

సుం - అమ్మా! నాకేమన్నా పెడితే!

కొ - సరేలే. అడ్డమా! ముందు చెప్పు ఏం?

సుం - సరే,

కొ - అ ఆ

సుం - హ హా

కొ - ఛీ ఛీ!

సు - ఛీ ఛీ.

109

వెంకయ్య - ఇంగ్లీషుకంటే సంస్కృతం కష్టం.

పుల్లయ్య - కారణం?

వెం - ఇంగ్లీషు త్వరగా చదవచ్చు!

పు - ఇదా కారణం? నీ పిండాకుడులా ఉంది. నువ్వు మొదట చెప్పిందీ ఈ మాటేగా?

వెం - అవునోయ్, అన్నట్టు. పు - ఇక నేముంది కారణం?

వెం - నేను అనేశాకాదూ. పోదూ, అదేకారణం?

పు - అల్లాగా ఈ మాటు తెలిసింది.

వెం - ఏమిటి?

పు - నీ సంగతీ,

110

హాస్య కర్త అయిన ఒకనటుడు సాక్ష్యం ఇవ్వడానికి ఒకనాడు బోనులో నిలబడి ఉండగా, అవతలపార్టీ ప్లీడరు 'క్రాసు' లో అతణ్ణి వంచిద్దామని,

ప్లీ - తమవృత్తి అభినయించడం కదూ!

నటుడు - అవును.

ప్లీ - అది చాలానీచం కదూ?

న - (నవ్వి) అది నాకంతబాగా తెలియదు. కాని ఇది మానాన్నవృత్తికంటే చాలా నయం.

ప్లీ - ఆయనవృత్తేమిటి?

న - ఏముంది? మన ప్లీడరీవృత్తే!

ప్లీ - ఎందుచేత నయం ?

న - ప్లీడరీ నిజంగా అబద్దం, అభినయం అబద్దంగా నిజం.

111

సుబ్బన్న పూటకూళ్ళ ఇంట్లోకి పోతూ, అక్కడ గల్లా పెట్టి దగ్గిర కూచున్న పూటకూళ్ళ అతనికి వినపడేటట్టు -

సు - ఈ కుండులోనేగదా వెనక మానాన్న ఓ గుఱ్ఱపుకాసు నోమునోపించింది! అంటూ రూపాయి బల్లమీదకొట్టగా, పూటకూళ్ళ అతను పెరుగుటిక్కట్టు కోసి యిస్తూ,

పూ - త్వరగా వెళ్లండీ, “బ్యాచ్” అయిపోతోంది.

అని కుండులోకిదిగి వెతకడం ప్రారంభించిన అరగంటకి సుబ్బన్న భోజనమై రాగా,

పూ - నువ్వు, సరిగ్గా ఎరుగుదువ్? ఇక్కడేనా?

సు - ఇక్కడే, మానాన్న ఆకాసు తీసుకోడం నేను కళ్ళారా చూస్తే!

112

కోటయ్య, తనస్నేహితుడు బుచ్చబ్బాయితో కొంతసేపు దొడ్లో గూటేబిళ్ల ఆడుకుని, తరువాత ఇంట్లోపడి ఒక అలమారా తెరవడంతోటే దాన్లో ఉన్న శవాన్ని చూసి బుచ్చబ్బాయి మూర్ఛ పర్యంతంకాగా,

కో - (నవ్వుతూ) మానాన్నకీ ఇదంటే ఎంతో యిష్టం,

బు - (అతిభయంతో) ఏం? ఏంచేత?

కో - మానాన్న దగ్గిర మొదట ఈనేట మండుపుచ్చుగుంటా!

113

మాంచి చురుకుఉంటేనేం మరుపుకూడా ఉన్న ఒకలాయరు వాదించడానికి తక్షణం రాజమండ్రి వెళ్ళి, సరియైన కోర్టుకే వెళ్ళినా క్లయంటు పేరు మరిచిపోయి తనగుమస్తాకి టెలిగ్రాం కొట్టగా, తిరుగు టెలిగ్రాం ఇస్తూ,

గుమస్తా - తమరు వెళ్ళవలసింది బెజవాడ. క్లయంటు పేరు మరమేకుల పట్టెయ్య. గమనించండి. తమ పేరు అపస్మారక రావు.

114

చాలావేషాలలో దొంగతనం చేస్తూన్న ఒకడివి, ఆరు ఫోటోగ్రాపులు, ఒక అధికారి తన కింద ఇనస్పెక్టర్లకి పంపగా, పంపిన నెలనాటికి,

ఒక ఇనస్పెక్టరు - (పై అధికారికి రాస్తూ) అయ్యా, సదురు ఫోటోగ్రాపులతాలూకు ఐదుగురను పట్టుకొన్నాడను. ఆరవవాని కొఱకప్రమత్తుడనై పనిచేయుచున్నాడ. వానిం గూడ పట్టికొని మనవి చేసికొనియెద.

115

ఒక సైన్యానికి సంబంధించిన బ్యాండులో పనిచేస్తూన్న ఒకడికి గొంతుక నెప్పిపెట్టగా,

డాక్టరు - చూడూ! నువ్వు గొంతుకతోమాత్రం పనిచెయ్యకు, చేస్తివట్టాయనా నెప్పి హెచ్చిపోతుంది. నీకు ఓవారం సెలవు ఇప్పిస్తున్నాను. నే ఇచ్చేమందు రాస్తూండు. ఒకడు - సరేనండి. అని వెళ్ళి, వారంరోజుల తరవాత నెప్పి కుదిరి బ్యాండువాడురాగా,

డా - ఏమోయ్! నీకు నిమ్మణంగా ఉందా?

ఒకడు - చిత్తం.

డా - కిందనమాటు అడగాలనుకుంటూనే మరిచిపోయాను. నువ్వు మామూలుగా వాయించేదేమిటి? సన్నాయా. సృతా?

ఒకడు - డోలుబాబు.

116

ఒక యజమాని గారి కోసం తెల్లారకట్ట అయిదింటికే తేవలిసిన పాలువిషయం వారింటో పనిచేస్తున్న బండీవాడూ వంటలక్కా జుట్టూ జుట్టూ పట్టుకోగా, యజమాని ఆకేసు విచారిస్తూ.

య - వంటలక్కా! ఏమిటి నీసోది?

వ - ఏం లేదండి. వాడికి పచారు చెయ్యడమే పనీ, అందుకని తెస్తాడు. రోగమా? "

య - ఏమోయ్, బండాసామీ! నువ్వేమంటావ్?

బం - మహాప్రభూ! ఆపని నాదికాదు.

య - ఏమిటిమరి!

బం - బండి తోలడమేనండి.

య - సరే. నువ్వు తెల్లారకట్ట నాలిగింటికే బండీ కడుతూండు. రోజూ, అందులో ఎక్కి వెళ్లి వంటలక్క పాలు తెస్తూంటుంది. పొండి.

117

మనమడు - తాతోయ్! రేపు నే పుట్టింరోజు!

తా - రేపు మాఖ శుద్ధ విదియకాదూ? అన్నట్టు నేపుట్టింరోజూ అదే!

మనుమడు - అల్లాయితే, మనిద్దరం కమలపిల్లలమా, తాతా?

118

రోగి - చాలుగాని, మీకెంతివ్వాలో చూసి చెప్పండి.

వైద్యుడు - చూశానండి. అయిదూ ఆరణాలు. -

రోగి - నువ్విచ్చిన మూడుమాతర్లకీనా?

వై - మాటలు తిన్నగారానీండి. మొదటయిచ్చిన సలహాకి అయిదురూపాయలు, తరువాతిచ్చిన మాత్రలకి ఆరణాలు. రో - అల్లాయితే ఈ ఇరవై నాలుగు కాన్లదొత్తరా ఉంచండి.

వై - సరే. మొదటిదానిమాట?

రో - అదా! అది మాయింటో ఎక్కడచూసినా అదే! ఇంకా ఎందుకు కొనడం?

119

ఒక ఆరితేరిన కేడీ బోనులో నుంచుని జడ్జిగారితో,

కే - మహాప్రభూ! మా ప్లీడరుగారు రాలేదు, ఆయనకి వీలు లేకపోయి ఉంటుంది.

ఒకవారం గడువు కటాక్షించాలి.

జ - (అక్కడనుంచున్న ఫిర్యాదిని చూపించి) ఆ ఘరానా మనిషి జేబులో నీచెయ్యిఉండగా నిన్ను బరిమీద పట్టుగున్నారుగా?

కే - చిత్తం!

జ - అల్లాంటప్పుడు, ఇక నీ ప్లీడరు వచ్చి మాత్రం ఏం వాదిస్తాడూ?

కే - నాకూ అదే చూడాలని మహఉందండి లోపల.

120

కృష్ణమ్మ - ఎమోయ్, ఆనందం! గుర్లింగం వడ్రంగం ఎల్లాచేస్తున్నట్టు?

ఆ - (తల ఊగించి) చేస్తున్నాడు, యధాశక్తి! మొన్న పొద్దున్న రొండువందల రూపాయల టేకుపలక అప్పచెబితే, గాలితిరిగేవేళకి రూళ్ళకర్రకేనా పనికిరాకుండా చెక్కేశాడు.

కృ - ఏం చెయ్యమనిచ్చారు?

ఆ - ధ్వజస్తంభం!

121

సాంబం - అక్కయ్యా! బావ చాలామంచివాడుస్మీ.

శాంత - మరే, మండిపోతోంది. మంచి!

సాం - అల్లాయితే, మా చెడ్డవాడు.

శాం - ఆమాత్రంగూడానా, బతుక్కి!

సాం - అల్లాయితే బావకి మంచీ చెడ్డా లేదు.

శాం - సరే. మంచీ ఉంది, చెడ్డా ఉంది. అది నీకు తెలియదు గనుక నువ్వు చెప్పడానికి వీల్లేదు, నాకు తెలుసునుగనక చెప్పడానికి వీల్లేదు.

122

క్షౌరంచేసి కొత్తమంగలి వెళ్ళిపోయింతరవాత,

కనకయ్య - (కూతురుతో) అమ్మా, నీళ్ళుపట్రా!

కూ - స్తానానికేనా? నాన్నా!

క - నోట్లోపోసుగోడానికి.

కూ - ఎందుకూ?

క - నోట్లో పోసుగుని, పెదిమిలు బిగించి, నీళ్ళుంటాయో కారిపోతాయో చూస్తా.

123

బిచ్చగాడు - చూడ కళ్ళూలేవు. నారాయన్నారాయన!

సుబ్బలక్ష్మి - ఎప్పణ్ణించి నాయనా నీకీ అవస్థా?

బి - వారం రోజుల్నించి, తల్లి. సు - హు, ఇప్పుడు కళ్ళుకనబడకపోవడం మామూలైపోయింది. ఏంచేతొచ్చింది నాయనా నీకీ దురవస్థా?

బి - అదివరకు మూగాణ్ణి, అది కిట్టుక ఇల్లా అయాను.

124

భార్య - ఇదిగోనండి! మీకు మల్లెదండ కట్టించాను, బహుమతీగా.

భర్త - దేనికి?

భా - ఈ వాళ తమరు పెళ్ళాడిన రోజుమరీ?

భ - ఒహో, సరె. నువ్వు పెళ్ళాడినరోజు వచ్చినప్పుడు కూడా నాకు కాస్త జ్ఞాపకం చెయ్యేం! యధాశక్తిగా ప్రతిమర్యాద చెయ్యాలి.

125

కారణాంతరంవల్ల కృష్ణారావుగారు నూతిలోపడగా నలుగురూ పోగై, తాళ్ళతో కట్టినతట్ట నూతులోకిదింపి,

ఒకడు - ఇహ తట్టలోకి జేరుకోవయ్యా, పెళ్ళికూతుర్లాగా!

కృ - (నూతులోంచి) ఉండండెహెయ్, మీసిగ్రొయ్యా, ఫొడుం పీల్చుగోవాలి.

126

సుబ్బరాజు - కామోజీ! మన అరుణాచలం దొరలా వేషం వేసి అందరికి షేక్‌హాండు ఇస్తూంటాడూ, వీడి హృదయం ఎలాంటిదోయ్?

కా - మంచిదే!

సు - అయినా?

కా - కాని, షేక్‌హాండు అనంతరం మనవేళ్ళు ఒకమాటు మళ్ళీ లెక్క చూసుగోడం అంతకన్న మంచిది.

127

పంటులు - ఒకటోవాడు! 'సుందరము' అనేమాట వాక్యంలో ఉపయోగించు.

ఒ - “మీ ముఖము సుందరము"

పం - భేష్, రొండోవాడు! నువ్వు 'సుందర తరము' ఉపయోగించి చెప్పు.

రొం - “మీ ముఖము పండుకోతి ముఖముకన్న సుందర తరము”

పం - ఓరి కొండముచ్చు వెధవా! .

128

గుర్రాజుగారు బంట్రోతు కూర్మయ్యతో,

గు - ఒరేయి, నాకు ఆనందంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చెయ్యి, జీతం ప్రమోషను చేస్తాను. అని అన్న, వారం రోజులకి కూతురికి చాలా సుస్తీగా ఉండి, ఆ అమ్మాయిని పడుకోపెట్టిన గది వాసనగా ఉండడంవల్ల అగరు పుల్లలు తెమ్మని, చిల్లరలేక రూపాయిచ్చి కూర్మయ్యని పంపగా, కూర్మయ్య 'అగరు' మాట మరిచిపోయి ఓరూపాయి పుల్లలు పట్టించుకు రాగా,

గు - (దీనంగా) హారి! ఇదేమిరా? (అని చిరునవ్వు నవ్వగా)

కూ - చిత్తం! ప్రమోషన్, మహప్రభో!

129

హరికథకి వెళ్ళి ఆ హడావిడిలో చెప్పులు కొట్టేసివచ్చిన ఇద్దరు మాట్లాడుకుంటూ.

ఒకడు - నువ్వేం లాక్కొచ్చావురా?

రొండోవాడు - బూడ్సులజోడు, నువ్వు?

రొం - ఇదేమిట్రా నీ తలకాయి?

ఒ - తలకాయే మరి. యజమాన్లు ఒక్కక్కటే పట్టిగెళ్ళలేక ఆరెండూ విడివిడిగా అక్కడే చుట్టుప్రక్కల పారేసి పోతారు. రాత్రి పన్నెండింటికి కెళ్ళి ఆరెండూ నొల్లుకొస్తా.

130

చాలాభాగం హరిశ్చంద్ర నాటకం చూసి కామరాజు తన స్నేహితుడు నరసింహం చెవులో

కా - ఈ హరిశ్చంద్రుడు వట్టి వెర్రినాయనస్మీ, నన్నడిగితే!

న - ఏం? ఎల్లా కనిపెట్టావ్?

కా - ఆ రాతి విశ్వామిత్రుడిమీద తన మైనరు కొడుకుచేత స్థిరాస్తికి ఓపాపరుదావా పడెయ్యించకూడదూ? దానివల్ల తన సత్యవ్రతానికి లోటేమిటీ?

131

తన స్నేహితురాలు ఎక్కడ కాపరం ఉందో ఎరగని ఒకరు ఒక ఇంటిదగ్గర వెళ్ళి, అక్కడ, ఆ స్నేహితురాలి కొడుకు కూర్చుండడం కనిపెట్టి, ప్రాణం కుదుటబడి,

ఒక - మీఅమ్మ ఇంట్లో ఉందిరా కుర్రాడా?

కు - ఎందుకూ?

ఒ - అట్టే ముదురుప్రశ్న లెయ్యక, ఉందో లేదో చెప్పు.

కు - ఉంది.

అనగా, ఆ ఒకరు ఆ ఇంట్లో జొరబడి, అందులో ఎవరూ కనబడక తిరిగివచ్చి.

ఒ - లేదబ్బాయి.

కు - ఉందండి.

ఒ - ఏడిశావ్. నే చెడ వెలిగితేనే?

కు - అన్నటు, మాయింట్లో ఉందండి.

132

ఒక గవర్నమెంటు కాలేజీలో ట్రైనింగువిద్యార్థి కేవలం తన స్వంతకార్యం సందర్భంలో వెళ్ల వలిసివచ్చి, సెలవర్జీ రాయగా ప్రిన్సిపాలు అది మంజూరు చెయ్యకపోగా స్వయంగా ఆయనతో మాట్లాడడానికి వెళ్ళి,

వి - సెలవు తప్పకుండా కావాలండి.

ప్రి - ఏమిటి కార్యం ?

వి - నాకార్యమేనండి.

ప్రి - ఏమైనా సరే, డాక్టర్ సర్టిఫికెట్టు ఉండాలి.

వి - దీనికి ఇవ్వరండి.

ప్రి - ఇవ్వకపోతే ఎల్లానో పుట్టించుగు రా. వెళ్ళు.

133

సుందయ్యగారిపెళ్లాం, గార్లు నందికేశ్వరుడు నోం చేసుగుంటూ మొగుడుతో.

పె - చూడండీ! చూరుదాటి పదార్థం అవతలికి వెళ్ళరాదుట. ఇంట్లోఉన్నది మీరొక్కరేగనక ఓనలుగుర్ని కేకేసుగొస్తురూ!

సుం - ఎన్ని శేర్లు పోసింది?

పె - అయిదుపొయ్యకపోతే ఎల్లాపనికొస్తుంది?

సుం - అంతేగద! అట్లయితే చూరుదాటి ఒక్కర్నీ పిలవక్కర్లేదు.

134

శంభన్న సత్రంలో తన సహపంక్తిని భోజనంజేస్తున్న గోపాలంతో,

శం - గోపాలం! మన పంక్తిని చివర ఉన్నాడు చూడూ ఓ జంతువూ! ఆయన అంతున్నాడేమిటీ? సింహద్వారం ఎల్లా పట్టిందోయ్, వాడికీ? .

గో - సరే. పట్టడం లేదు గిట్టడం లేదు. వాణ్ణి లోపల ఉంచే కట్టారట సత్రం.

135

శరీరశాస్త్రం చెప్పుగుపోతూ, మధ్య,

ఉపాధ్యాయుడు - హృదయము నాలుగుభాగములు. కుడి వెంట్రికిల్, ఎడమవెంట్రికల్..... అనగా, ఇదంతా పరధ్యానంగా వింటూన్న

రాజ్యం - హృదయంలో అవేమిటండోయ్! మేష్టారు!

136'

వెంకటేశం - ఏమండీ గిరీశం మేష్టారూ ! మన్ని ఎవడేనా ఎడం దవడమీద వాయిస్తే, కుడిదికూడా ఒగ్గమంటారు, కవి హృదయం ఏమిటక్కడ?

గి - కొట్టేవాడు అర్భకుడైనప్పుడు తలకాయకి పక్షపాతం జరక్కుండా అలా సూత్రించారు. కాని, తలకాయచేసే ప్రదక్షిణం పూర్తి అయేటట్టు కొట్టేవాడికి ఇది వర్తించదు.

137

మేష్టరు - ఒకమనిషి గంటకి పదిమైళ్ళు పరుగెత్తుతాడు. పదిగంటల్లో ఎంతదూరము పరుగెత్తుతాడు? చెప్పు! నూకయ్య

నూ - సాలాదూరం యెల్తాడండి, యెల్తేని, అసలు యీలోపులో సత్తాడండి.

138

అన్న - తమ్ముడూ! మాయవరం అర్జెంటుగా మనిషిని పంపాలి. మాచిరాజు చురుకైనవాడే?

త - (చప్పరించి) ఏమో, ఈ మాచిరాజుని వెనక మామయ్యకి జబ్బుచేసినప్పుడు మాత్రకోసం పంపిస్తేనూ, మాసిగం నాటికొచ్చాడు!

139

కాయిలాగాఉంటూన్న లక్ష్మణ పెరుమాళ్ళుగారికి ఓసారి జబ్బు ఎక్కువై ఇక ఆట్టేరోజులు జీవించడనుకున్నప్పుడు,

భార్య - (కొడుకుతో) అబ్బాయీ! మీనాన్న ఉన్నన్నాళ్ళుండరు. వారికి గార్లిష్టం, ఓ శేరు మినుములు పట్రా! అవొండి పెడతాను.

అనగా, ఈమాటలు లక్ష్మణ పెరుమూళ్ళు విని,

ల - శేరెందుకూ? నేనొక్కణ్ణి అన్ని తినగల్నా , పోనీ సోలెడు తెమ్మను, తరవాత ఎల్లానూ కావాలిగాంసు!

140

మంగమ్మగారు పక్కింటి వెంకమ్మగారితో,

మం - మామేనమామ పెళ్ళాం వచ్చిందమ్మా మొన్న చూచి వెళ్లడానికీ! ఇల్లా కారప్పూసేనా పట్రాలేదుష్మీ? ఉత్తమనిషి చక్కావచ్చింది.

వెం - అల్లానా! కిందనమాటు మనం మాట్లాడుకోడంలో ఆవిడ ఉత్తమనిషి కాదన్నారు.

141

సత్యభామ - (దొంగ ప్రియుడితో) మనోనాయకా, జీవితేశ్వరా! మీఫోటోగ్రాపు ఓటివ్వరూ నాకూ?

ప్రి - అదెవరేనాచూస్తే నీ దగ్గిర ప్రమాదం కాదూ.

స - ఇంతపిరికివారు ఎల్లాపనికొస్తారండీ! పోనీ, ఫోటోతీసే వాడితో ఫోటో మీకుమల్లే తియ్యద్దని చెబుతాలెండి.

142

బసవన్న - చంద్రంబావోయ్, ఎల్లానూ వెడుతున్నావు గనక, రామారావుని చాలాచాలా అడిగానని చెప్పు, వాణ్ణెరుగుదువా?

చ - ఎరగనోయ్, కర్మం?

శ - సరేలే. పోనీ అల్లాయితే అడగలేదని చెప్పు.

143

పూటుగా పులిహార లాగి, అది మారు తెచ్చినప్పుడు పుచ్చుగోడానికి కాళీ లేదని చెప్పి, తరవాత మళ్ళీ రొండుపుంజీల బూర్లు గుమ్మరించినా కిక్కిరుమనకుండా ఊరుకున్న పున్నయ్యతో."

నాగయ్య - ఇందాకా కాళీ లేదనవుటయ్యా.

పు - సరిసరి. నీకు శరీరశాస్త్రంలో ఓనమాలే తెలియవే!

పొట్టలో పులిహారసంచీ వేరూ, బూర్లకోశం వేరూ!

144

సంయుక్తపరగణాలల్లో ఒక గ్రామస్తుడు తన స్నేహితుడితో ముచ్చటిస్తూ.

ఒక - ఎగేసేవాడికి రోజులు, కాని, విధివిధాయకంగా పని చేసేవాడు ఇప్పట్లో కంట్రకుడు.

స్నే - ఏం జరిగిందేమిటి?

ఒక - మొన్న జనాభా లెక్కల్లో నాకు ఒక చిన్న “బ్లాకు” ఇచ్చారు!

స్నే - ఇస్తే?

ఒక - అది, ఏడింటికి మొదలెడితే, పదినిమిషల్లో పూర్తి అయింది.

సే - అయిపోతే?

ఒక - లెక్కసమాప్తి మరి రాత్రి పన్నెండింటికిగా! ఈ ఈలోపున మరిఎవరేనా నీళ్ళాడేరేమో, లేకపోతే పోయారేమో కనుక్కోవద్దూ? కాని, గర్భిణీవాళ్ళు ఆ బ్లాకులో లేనే లేరు. అదికనుక్కో అక్కర్లేక పోయింది.

స్నే - ఇక ఎవరేనా పోయారేమో అని నువ్వు కనుక్కుంటోచ్చావుగావును!

ఒక - ఓ మాటా? ఎంత సేపటికీ పన్నెండు కాదాయిరి. అయిదుమాట్లు “ఎవరేనా పోయారండీ, ఇక్కడా”? అంటూ కేకేస్తూ తిరిగేటప్పటికి జనానికి నా మీద అసహ్యం పుట్టింది. స్నే - పదిమాట్లతో?

ఒక – పదిమాట్లతో “అయ్యా ఇకపడుకో” అన్నారు. పదిహేనుసార్లతో “తంతాం జాగ్రత" అని బెదిరించారు. సరి ఇరవైసార్లలో అప్పటికింకా పదకొండుకంటె టైము ఎక్కవై తగులడలేదు - నా కుడికాలు బొప్పాసి గొట్టం విరచినట్టు విరిచారు. ఇంకా గంటటైమున్నా వెళ్ళలేక ఊరుకున్నాను.

145

నరసుపంతులు - ఏం రామమ్మా! కులాసాగా ఉన్నావూ?

రా - చిత్తం .

న - మీ వాడికి ఉత్తరం వేశానన్నావు, జవాబు రాశాడూ?

రా - లేదు, నాయనా!

న - ఏం? చిరునామా సరిగ్గా రాయించావా?

రా - ఆ,

న - ఏమని రాయించావు?

రా - మావాడు! ఊరికెళ్ళాడు ఎక్కడున్నాడో కనుక్కుని తక్షణం ఈ ఉత్తరం ఇవ్వాలని రాయించానండీ!

న - పోనీ, ఆ ఊరి పేరు రాయించకపోయావ్?

రా - ఇల్లారండి, (అని రహస్యంగా) ఆ ఊరు వాడోరహస్యపు పనిమీద వెళ్ళినప్పుడు ఎల్లా రాయించటం?

146

చిరంజీవి - శాస్తులుగారూ! ఆకనిపించే గట్టు ఏమిటండీ?

కామశాస్త్రి - చెరువు.

చి - స్నానానికి వీలేనా?

కా - కొబ్బరికాయలు కొట్టచ్చు.

147

ఒక అంటకత్తెర క్రాపింగు పెద్దమనిషి ఒక యాజులుగారితో వాగ్యుద్ధం చేస్తూ, ఒక రంగంలో,

పె - వెధవంతవాడవయ్యా, జుట్టుతేడాగానీ!

యా - తమకు ఆతేడాకూడాలేదు. ఒక్క ముసుగు మట్టుకు తరవాయి.

148

నరసింహం - నారాయణమూర్తీ! ఈవెంకడు చంపేస్తున్నాడోయ్. పనిమీదపోతే అదేపోత! చీటికీమాటికీ ఏదో ఉంటూంటుంది. అందడు.

నా - వాడికి జుట్టుపిలక ఉందా?

న - ఆ. ఉంటేం?

నా - మీ ఇంట్లో నులకమంచం ఉందా?

నా - ఉంది. ఏందుకూ?

న - ఆ తాడు విప్పి, ఉండకింద చుట్టి వాణ్ణి ఎక్కడికేనా పంపుతావు అనగా ఓ చివర వాడిజుట్టుకి రాయిలా పీటముడేసి, వాడితో పనున్నప్పుడుల్లా రొండోకొస లాగుతూండు.

149

కొండలరావుగారు జిగురుతొట్టిలో ఉన్న జిగురుతో ఉత్తరం అంటించడం చివరదాకా చూసి,

రత్తమ్మ - నాన్నా! ఇది మల్లీ తియ్యత్తా?

కొం - ఆ. నీ కెందుకులేస్తూ, తొట్టి గూట్లో పెట్టిరా.

ర - అమ్మకిత్తాను.

కొం - ఎందుకూ?

ర - అన్నయ్యేం, అమ్మదాతిన దబ్బులు తీత్తునాత్త! దీంతో కల్లు అంతింతమంతాను. మల్లీ తియ్యత్తుగా.

150

గోవిందశాస్త్రి - అందుకనే కదండీ, నారద మహామున్లవారు, ఎంత మహత్సంపన్నులైనా, ఎంత దేవమున్లైనా, నిత్యమూ నున్నూ కూడా ఆయొక్క శ్రీకృష్ణభగవాన్లవారి దర్శనం విడవకుండా పొందుచూండే వారషా!

గిరీశం - డామిట్. నాకు తెలియనట్టు చెప్తారేం? కృష్ణుడు ఒక షెపర్డు అనగా గొల్లవాడు. అతనికి పాలు లావుగా ఉండేవి. ఇది కనిపెట్టి కానీ ఖర్చుకాకుండా రోజూ కాఫీ టైమ్కి మిష్టర్ నారదుడు కృష్ణుడు లాడ్జికి జేరుకునేవాడు.

151

సుబ్బారాయుడు - వెంకన్నా! రాత్రివేళ స్మశానంలోకి నువ్వు ఒక్కడవూ వెళ్లగలవ్?

వెం - దంచేసి.

సు - ఏడిశావ్. మొఖం తేలేస్తావు భయమేసి.

వెం - ఛీ కావలిస్తే కూడా వచ్చి చూస్కో

152

నాటకశాలలో,

పరాత్పరరావు - ఏమండీ! ఆ అశ్వత్థామ శాలువ పైన తెల్లటిది ఏమిటి?

పూర్ణానందం - దంధ్యం.

ప - అది పైన వేసుగున్నాడేం?

పూ - ఇహ కాస్సేపట్లో తనికి దారుణకోపం వస్తుందనీ, అప్పుడు తను దంధ్యం తెంపుగోవలివస్తుందనీ, వాడెరుగు. చేతి వీలుకోసం పైన పెట్టుగున్నాడు.

153

శాస్త్రిగారు రాజమండ్రీనించి ధవిళేశ్వరం జట్కా కట్టించి, ఎక్కి పోనిమ్మని బండివాడితో అంటూండగానే గుర్రం హరామీ చెయ్యగా,

బండీవాడు - అయ్యా! గుర్రం వెనక్కి నడుస్తోంది.

శా - నాకూ తెలుసు. ఇప్పుడు నేను ఏం చెయ్యవలసి ఉంటుంది.

బం - దిగాలి.

శా - నీకు చాదస్తంగాని దిగడం ఎందుకూ?

బండీ రాజమండ్రీ కేసి తిప్పితే సరీ, పని జరిగిపోతుందీ!

154

సావిత్రినాటకం ఆడటంలో యమధర్మరాజు ఓపద్యం చదవగా,

ఒకడు - వన్సుమోర్!

పక్కవాడు - ఓయి నీ మొహంమండా, మళ్ళీ ఎందుకయ్యా చదవమనండం? నీమాట పట్టుగుని వాడు ఇందాకటికంటె గట్టిగా పద్యం మళ్ళీ చదివితే, ఇహ అక్కడికి మేమంతా వినవలిసిందే?

155

బల్లకట్టులేని మురుక్కాలవకి అడ్డంపడుతూ,

చంద్రుడు - జాగర్తోయ్! సత్తెన్న శాస్త్రీ!

స - నీ జాగ్రత్త నువ్వుపడుదూ! నాకేమిటీ! నేను గోదావదిలో నాలుగైద్సారులు ఈదిన ముండావాణ్ణి! మొన్న రథసప్తమికి అక్కడేఉన్నా!

చం - అల్లాన్టో య్, చెప్పావుకావేం? అయితే మొన్న రథసప్తమినాటిది ఎన్నో ఈత?

156

నాగయ్యని దవడలెంపకాయ కొట్టినందుకు వెంకట్రామయ్యకి అర్ధరూపాయి జుల్మానా విధించాం అని జడ్జీగారు తీర్పుచెప్పిన ఉత్తరక్షణమే వెంట్రామయ్య వెళ్ళి నాగయ్యని సాగదీసి ఇంకొకటికొట్టగా,

జడ్జి - ఏమిటది?

వెం - రూపాయి, ఇదిగోనండి!

జ - మా సమక్షమందు ఏమిటి అల్లరి?

వెం - ఆల్లరీ లేదండి, చిల్లరీ లేదండి? క్షమించాలి.

157

ఒకశర్మగారు ఒక హైస్కూలికి వెళ్ళి, అక్కడ హెడ్‌మేష్టరుతో,

శ-మిమ్మల్నేనా, హెడ్‌మేష్టరనేది?

హె - అవునండి. కూచోండి. ఏం!

శ - ఏం లేదండి మావాణ్ణి థర్డుఫారంలో జేర్చాలి.

హె - (బల్లమీద ఒక చిన్నకాగితంముక్క చూస్తూ) థర్డుఫారం! సీట్లు లేవండి.

శ- అంటే ఏమిటిబాబూ?

హె - సీటా? సీటంటే కూచునేది.

శ - అదా! తమరు అతిమర్యాదకోసం దేవుళ్ళాడతారుగాని. మావాడికి కూచోడానికి అసనంకూడా ఎందుకండీ? నిక్షేపం అల్లా కిందేకూచుని రాసుగుంటాడూ!

158

భోగయ్య - (కోపంవచ్చి పెళ్ళాంతో) ఛీ ఛీ! వారం రోజులుదాకా నాతో మాట్లాడకూ!

పె - తరవాత నాకు మళ్ళీతప్పదూ?

భో - (మరీకోపంతో) ఛీ ఛీ! నాతో అసలు మాట్లాడకూ.

పె - మాట్లాడకుండా కనిపిస్తూండం కావాలీ మళ్ళాను!

భో - (మండిపడి) అయితే ఏడు కూచుని!

పె - అప్పుడేనా?

159

కాంభోట్లు - రామయ్యా! మరోమాట చెప్పకు. పట్టు. గోవుతో పాటు ఒకరూపాయి చెక్కపేడంటిది దక్షణఇస్తారు.

రా - దక్షణ రూపాయకి తగ్గితే ఈ గోవుని ఛస్తే దానం పట్టను.

కాం - ఏం?

రా - మాదిగాళ్ళు మనిషి ఒక్కంటికి పావలాయేనా పుచ్చుగుంటారుగదా, చేత్సొమ్మెట్టుకోమన్నావుటోయ్?

160

తండ్రి - అబ్బాయి. మునెయ్యా! నువ్వు క్లాసులో ఆఖరు వాడవు టేమిటి? ఈవాళ తెలిసిందీ!

ము - మరేట నాన్నా, కాని, నాతప్పు ఏమీలేదు.

తం - ఏం అల్లా ఎల్లా వచ్చింది?

ము - తప్పంతా మాక్లాసులో రంగోజీ అనే కుర్రాడిది.

తం - వాడెంజేశాడూ?

ము - చిన్నతన్నాన్నించీ మా బర్లోనే తగులడ్డ పీనుగు ఇప్పుడు సర్టిఫికట్టు పుచ్చేసుగుని లేచి చక్కాపోయాడు, అందుకని ఇల్లావచ్చింది.

161

ఒక ఇనస్పెక్టరు సెకండుఫారం కుర్రాళ్ళని పరీక్షచేస్తూ,

ఇ - రొండోవాడు! “లోకల్‌ఫండు" అంటే ఏమిటి?

రొం - ఎక్కడా రాలేదండి.

ఇ - (మేష్టరుతో) ఈ క్లాసులోకల్లా తెలివిగలవాణ్ణడగండి!

ఇ - నువ్‌చెప్పు! ఒకటోవాడు?

ఒ - లోకుల దగ్గిర్నించి పోగుచేసిన డబ్బండి.

ఇ - ఓ మోస్తరుగా ఉంది. కాని, ఇంకా వీళ్లకి లోకల్ నాలెడ్జి సరిగ్గా లేదయ్యా, మేష్టరు!

162

బెజవాడా బందరు రైలుగార్డు దోసపాడుదగ్గిర ఒక ముసలమ్మ అవస్థ ప్లాటుఫారంమీద చూసి జాలిపడి,

గా - ఏవూరెళ్ళాలి, ముసలమ్మా?

ము - బందరు.

గా - అట్టాయితే, పోనీ ఈరైలెక్కు నడవలేవు.

ము - కోరటులో అర్జెంటుపనుంది బాబూ, నడిచేపోతా!

163

ఒక దొరసాని “మాజిక్ లాంతరు” లెక్చరు ఇస్తూండగా, ఆవిడ తాలూకు గుమస్తా సందర్భానికి బొమ్మకనపరచడంలో,

దొరసాని - (సభవారితో) అదిగో, నేను నాటకంలో వేసిన వేషంబొమ్మ!

గుమాస్తా - (ఆ బొమ్మ చూపించాడు)

దొ - అదుగో, నేను పట్నవాసంలో ఉన్నప్పుడు వేసుగునే వేషంబొమ్మ! గు - (ఆబొమ్మ చూపించాడు)

దొ - అదిగో, నేను ఎడారిలో ఉన్నప్పుడు వేషం బొమ్మ!

గు - (గోచీలేని ఒకచంటి పిల్లాడి బొమ్మ చూపించాడు.)

164

ఒక మహపట్టణంలో ఇరవైవేలకి భీమా వెయ్యదల్చుకుని వచ్చిన పెద్దమనిషితో,

భీమాకంపెనీ ఏజెంటు - దయచెయ్యండి. ఏం నిశ్చయించారు? యాభైవేలా, ఇరవైయేనా?

పె - ఇరవైయే.

ఏ - అయితే మీ కారు ఏం కారూ?

పె - నాకు కార్లేదండి, నడిచే పోతూంటాను.

ఏ - రోడ్లమీదకూడానా?

పె - ఆ. అయితేం?

ఏ - సరిసరి. అల్లాయితే ఇన్సూరెన్సు కుదరదండి. రోడ్లమీదనడిచే పోతూండేవాళ్ళని ఇన్సూరు చేసుగుంటే మాకంపెనీ మట్టికొట్టుకుపోతుంది. దయచెయ్యండి.

165

నారాయణమూర్తి - నరసింహం! మనఊళ్ళో పెద్దసత్రం ఉంది చూశావ్?

న - ఆ. చెబుదూ!

నా - దానితాలూకు మురుగుకుండు ఉన్న వీధిని కలరా ఎప్పుడూ రాదు.

న - ఎంచేత?

నా - కుండులో ఉన్న పురుగులు కలరాపురుగుల్ని తినేస్తాయి.

166

లచ్చన్న - ఏమోయ్, కనకయ్యా! రాయుడికి పిల్లనివ్వాలని ఉంది. ఏమిటి నీ ఊహ?

క - రాయుడికేనా? రాజాలా ఉంది. ఇచ్చెయ్. వాడికి ఆయుర్దాయంకూడా పూర్తిగా ఉంటుంది.

ల - వాడి చక్రం వేసిచూశావా ఏమిటి?

క - లేదు.

ల - లేకపోతే ఎల్లాతెలిసిందీ?

క - తెలియక పోవడమేమిటీ? వాడు పోస్టుశాఖవాడుగా!

ల - అయితే?

క - వాడికి చావడానికి తీరుబడి ఉండదు.

167

ఏడేళ్ళ వయస్సుగల బసవయ్య తండ్రి దగ్గర డబ్బుఒకటిచూసి,

బ - నాన్నా! ఏంనాన్నా, నాకు డబ్బెట్టి గాజులు వేయించవ్? చెల్లాయికిమల్లే?

తం- ఇల్లూపొలమూ తగులడి పోనిరా, వెయిస్తానూ! S

బ - (మూతిముడుసుగుని) అప్పుడు డబ్బుండదు నాన్నా!

168

ఇంగ్లీషులోంచి తెలుగులోకి తర్జుమా చెయ్యడం చెప్పే

మేష్టరు - "స్టేన్జర్” అంటే అర్థ మేమిటి తెలుగుని? ముక్కయ్య! ము - "విదేశి.”

మే - అంతబాగుండలేదు. “పరదేశి” అంటే దానికంటె సరిగ్గా ఉంటుంది. అనగా వెనకాలకూర్చున్న మోహనరావు అడగందే.

మో - మేష్టారండి! మీరు చెప్పిందానికంటె మరొకటి మరీ జోరుగా ఉంటుందండి,

మే - ఏమిటి?

మో - “బహిర్దేశి”

169

ఒకతురక రైల్లో పోతూ, తనపక్కకూచున్నది ఒక బ్రాహ్మడని కనిపెట్టి.

తు - బొమ్మన్ జీ! హిందూస్తానీకా మాలుమ్?

అని అడగగా, బ్రాహ్మడు ప్రత్యుత్తరం చెప్పక, తెలిసినట్టు తలకాయి ఊపగా,

తు - కహోజాతే?

బ్రా - అబ్బో! ప్రజ్ఞ! మాలోనూ ఉంది, ఉత్తమే శిఖరేజాతే!

170

వెంకాజీ - వర్దనమ్మాగారూ! అయిందీ, మీ మనమరాలి వివాహం?

వ - ఏదో అషిషూ అయింది, నాయన! కన్నెచెర వొదిలింది.

వెం - సంతోషం. కట్నం ఏమాత్రం, లాంచనాలేమిటి?

వ - కట్టం లేదుగాని, పెళ్ళికొడుకు పెంకితనం చేస్తే, తరవాత, చేతికి కట్టుగోడానికిష ఓవిష్ణువాచీ కొని ఇస్తాం అన్నాం.

171

శివయ్య - బాపిరాజూ! మనఊరి డిస్ట్రక్టుమునసబుగారు ఏం ప్యాసయ్యాడురా పరిక్షలూ! ఆయనికి అన్నీ డిగ్రీలే. వాటికి లెక్కాపత్రం లేదు.

బా - ఇవేంచూశావు ? వీళ్ళ అన్నది సామ్మూ!

శి - ఆయన కెన్ని ఉన్నాయి?

బా - మూడువందల అరవై సరిగ్గా,

172

కోదండం - బలరామా! విన్నావా? చలమప్పసెట్టి ఇనసాలమెంటు ఎక్కాడట! పెళ్ళాం లేవడం లేదుట!

బ - పాపం! విచారం గావును.

కో - కాదుట! నగలు మొయ్యలేక.

173

కొత్తగా గర్భాధానం అయిన సింహేశ్వరరావు తమయింటిహాలులో కూర్చుని ఉండగా, అతని స్నేహితుడు కమలయ్య దవడ చేత్తో పట్టుగుని ప్రవేశించగా,

సిం - అదేమిటోయ్?

క - (మూలుగుతూ) పల్లుతీపూ! ఇది ఎల్లాపోవడం?

సిం - ఒస్! ఇంతేగద! నేనోటి చెప్తాను గప్‌చిప్‌గా చేసిపారెయ్!

నేనూ ఇల్లానే ఈ మధ్య బాధపడ్డాను. కాని, నా పెళ్ళాన్ని ముద్దుప్పెట్టుగునేసరికి బాధ ఎక్కడి దక్కడ ఎగిరి చక్కాపోయింది. క - (మూలుగుతూనే)సరే అల్లాయితే తప్పుతుందీ నువ్ చెప్పింతరవాత! ఓమాటు ఆవిణ్ణి మరి ఇల్లారమ్మనూ!

174

ఒక భారీ ఆడమనిషి దొంగని పట్టుగున్న కేసు విచారిస్తూ.

జడ్డి - మీరేనండి, దొంగని పడతా?

ఆవిడ - చిత్తం!

జ - మీరేనా అతణ్ణి కొడతా?

ఆ - కొట్టడంలో మళ్ళీ ఓమోస్తరుగా కాదండి. చెంపలు వాయగొట్టి, బుగ్గలు రక్కి ఒళ్ళుకొరికి వొదిలి పెట్టాను.

జ - మంచిపని చేశారు. కళ్ళుకూడా పీకి పళ్ళుకూడా రాలగొట్టవలసింది, తీరిపోను!

ఆ - అంతపనీ జరిగేదేనండి కాస్తయితే! కాని నేను మాఆయనేమో అని భ్రమించి చాలాసేపు సందేహించి ఊరుకున్నాను.

175

నారయ్య - సత్యం! వెంకట్రామారావు వరసని ఫీలవుతున్నాడు యం. యే. ఏమిటి కారణం? వ్యాకరణం తప్పా? వర్ణక్రమం తప్పా? భావాలు తప్పా?

స - నా ఉద్దేశం ఇవేంకాదురా! ఈయన చచ్చినన్ని పుస్తకాలు చదివాడు. ఇవన్నీ దిద్దేవాడికి బోధపడక ఈన్ని ఫేలంటున్నాడు.

నా - ఈ మాటు ఇక ఫేలు అవడేమోలే!

స - ఏం?

నా – ఈమాటు పేపరిచ్చే ఆయనా నాలుగుసార్లు గంట వాయించినవాడేట.

176

తిరువమదాసు - రేపు ఆఫీసరొస్తాడు. తప్పకుండా రావాలిస్మీ

మంగలీ ! సూర్యోదయం కాకుండా వచ్చే సెయ్యాలి.

మంగలీ - సిత్తంబాబు.

తి - విధాయకంగా రారోయ్. ఏం?

మం - వత్తానుబాబు.

తి - మరిచిపోతావా?

మం - మరిచిపోనుగాని బాబూ, పోనీ సాయింతరం కసేరీనించి వచ్చేతప్పుడు తమరు గెడ్డం నాకెచ్చి యెల్లండిబాబూ, అద్దంనాగ సవరం సేసి ఉంచుతాను. ఉదయాన్నే తగిలిచుకు సక్కా యెల్దురుగాని!

177

రాజశేఖరం - ఇందాకణ్ణించి వెతుకుతున్నాను, “చిత్ర నళీయం” కనిపించదు.

చంద్రశేఖరం - (పరధ్యానంగా) ఏమిటిరా వెతుకుతుంటా!

రా - ఏడ్చినట్టేవుంది. “చిత్రనళీయం” అని చెప్పలేదుట్రా? కొత్తగా కొన్నది!

చం - చెబుతున్నావ్ గాని. ఓ పనిచెయ్. “హరిశ్చంద్ర” వెతుకు. తక్షణం “చిత్రనళీయం” కనిపిస్తుంది.

రా - ఏం? ఎల్లా చెప్పగలవ్? చం - ఏదేనా ఒకటి ఉండదేమో అనుకుంటూ మనం దాని కోసం వెతిగితే, ఆ ఒకటితప్ప కడంవి అన్నీ కంటికి కనపడతాయి.

178

అయిదోక్లాసు చదువుతూన్న రామన్న తండ్రితో,

రా - మన తలుపుమీద 2/6 అని ఉందేమిటి నాన్నా?

తం - అదా? మన ఇంటి నెంబరు.

రా - ఇది వేసేవాళ్ళకి లెక్కల్లో సున్నావస్తుంది నాన్నా.

తం - ఏం?

రా - ఆ భిన్నాంకంలో రొండు “కామను” కొట్టేసి 1/3 అని వెయ్యాలి నాన్నా!

179

రాఘవులు - రమణారావూ! సోమన్న ఈ వ్యాపారం ఇల్లా తగలేశాడేమిటీ! తనా హైరానపడ్డాడు. మనకా చిక్కులు. అందరికీ తగులుబాటైంది. వీడు వొఠ్ఠి వైదీకిలా కనబడుతున్నాడు.

రా - వైదీకైనా బాగానే ఉండును. నా ఉద్దేశంలో వీడు కేవలం జడ్‌దీకి,

180

సీతానాగయ్య - ముత్యాలూ! ఇదిట్రా చేసినపనీ! ఆ ఉత్తరం సోమేశ్వరమ్మగారికి ఇమ్మంటే సోమేశ్వరయ్యగారికి ఇచ్చావ్! వెఱ్ఱిముండావాడులా ఉన్నావెక్కడోను!

ము - నెనెనెనేను - వెవెవెవెఱ్ఱోణ్ణి కానండిబాబు, ననననత్తోణ్ణండి.

181

జగన్నాధం - అప్పాజీ! భోజనమెక్కడోయ్ యీపూటా?

అ - మన ఘంటావారి సత్రంలో.

జ - అయితేనూ, అక్కడెంతమందవుతారుపూటకీ?

అ - చాలామందవుతారు.

క - అయిదారుకుంచాలు వారతాయీ?

అ - లెక్కేమిటి? అయిదారువేల బియ్యంపైగా ఉడుకుతాయి.

182

గురువయ్య - ఉరేయి! రాయప్పా? నిన్న పొద్దున్న వస్తానని రాలేదేం?

రా - విరోచనాలకి మందుపుచ్చుగున్నాను.

గు - అయితే రొండు వారాలు తిరగలేదుకదా మొన్న పుచ్చుకుని, మళ్ళీ ఎందుకూ నిన్నా?

రా - అప్పుడా! అప్పుడు రుగ్మతగా ఉండడంవల్ల!

గు - ఇప్పుడు!

రా - ఇప్పుడా! మన్లోమనమాట. రేపు భోజనానికి వెళ్ళాలి కాట్టోయ్ మరీ!

183

గంగాధరం - ఒరేయ్, అప్పారావ్! మన శివరామమూర్తి ఉన్నాడేం? వాడు ఊరికే బుజాలు సర్దుకుంటూంటా డేమిటి? నిమిషానికోసారి?

అ - నువ్వు కనిపెట్టలా? పాపం వాడికి భుజంమీద షర్టు చిరుగూ కోటుచిరుగూ ఏకీభవించాయి. చర్మం కనిపించకుండా కమ్మడానికి వాడియత్నం. గం - చిరుగుని ఆక్షేపణా?

అ - అబ్బే కమ్మడాన్ని.

184

పంతులు - “వర్షాలు” దీనికి ఇంగ్లీషేమిటి? పాపయ్య!

పా - రెయిన్సండి.

పం - “అకాలపు వర్షాలు” దీనికి? బాపయ్య!

బా - అకాలీరెయిన్సండి. -

185

కొండన్న - మా మేష్టరు గడ్డముందే, అది ఇనపరవ్వలాగ ఉంటుంది. అచ్చంగా, “అయిరన్ ఫైలింగ్సే”

రెడ్డి - అల్లా అయితే, డబ్బు లిచ్చుగుని క్షౌరం చెయించుగుంటా డెందుకూ ఆయనా? "

కొం - ఏంజెయ్యమన్నావ్? కనపడ్డవాడల్లా “ఫీల్” అవుతుంటేనే!

రె - అదికాదోయ్! అయస్కాంతం అనగా “మేగ్నెట్” తగిలిస్తే పని జరగదుటోయ్?

186

విస్సప్ప - గోకర్ణంగారూ! ఎప్పుడొచ్చారండీ పట్నంనించీ? ఈవాళ మెయిల్‌లోనా? “ఎలిమెంటరీ మేథమేటిక్సు” లో నా మార్కులు కనుక్కొచ్చారూ?

గొ - వీల్లేకపోయిందోయ్.

వి - పోనీ 'కైట్' దొరగార్ని చూసొస్తాం అన్నారు. చూశారా?

గో - ఆ.

వి - పోన్లెండి, ఎక్కడికక్కడికే. వారి దర్శనం ఎవరుచెయించారు?

గో - మన “శేషూఅయ్యరు” గారు! -

వి- అల్లాన్టండీ? అయితేనూ శేషూఅయ్యరు పార్టు వన్నా పార్టు టూ ఆ?

మిమ్మల్ని దొరదగ్గరికి తీసిగెళ్ళింది?

187

ముకుందం - కాంతయ్యా! ఆదెయ్యకి ఎన్నేళ్ళుంటాయి?

కాం - అధిక మాసాలు మినహా యింపు నూటపదహార్లు.

ము - వాడు ఇంకా పోలేదేం కర్మం?

కాం - వీడు పుట్టినవేళ చిత్రగుప్తుడికి స్మారకం లేదేమో. అంచేత లెక్కల్లో రాసుగోడం పడలేదుగావును.

ము - అదే నిజమైతే వీడు ఇహ పోడేమో, వీడి మొహం మండా?

కాం - అల్లాయితే, చిత్రగుప్తుడికి ఆకాశరామన్న అర్జీ పారెయ్యాలి.

188

ఆచార్యులుగారూ నాగరత్తమ్మగారూ కలిసి పాటకచేరీ చెయ్యడం సంభవించగా.

ఆ - (నాగరత్తమ్మ పాడుతూండగా) ఓహోహో! ఏం పాట అహాహా! ఒస్సి! అబ్బోబ్బో!

నా - (ఆచార్లుగారు పాడగా) మీపాట నా దగ్గర్నించి అంతశ్లాఘ లాక్కోలేకపోయింది గదా!

ఆ - అవునుమరి పాపం! వెఱ్ఱిమాటగాని, నువ్వు నాకుమల్లే అబద్దం ఆడగలవా?

189

ఒక బ్రాహ్మడూ ఒక శూద్రుడూ దొంగతనం జాయింటుగా చేసి పట్టుబడిన ఒక కేసు జడ్జియెదటికి తేబడగా.

జ - ముందే కూడబలుక్కుని వెళ్లిన బాపతామీది? లేకపోతే, ప్రత్యేక ప్రయత్నంలో కలుసుగున్నదా?

శూ - నాకేమీ తెలియదండి.

జ - చాల్లేస్తూ మాట్లాడొచ్చావ్ పైగానూ! స్థలం సందర్భం లేదునీకూ? ప్రతీచోటా అవతలవాడితో పోటీయేనా నీకు?

శూ - నాకేమీ తెలియదండి.

జ - ఛీ ఇక్కడ నీకు జాగాలేదు. అధమం ఇక్కడేనా ఆపోటీ మట్టం చెయ్యాలి. అవతలికినడు. పో, తక్షణం !

190

పుల్లయ్య తనుచేస్తూన్న భూమికి ఖామందులైన అప్పారావు గారితో మాట్లాడుతూ.

పు - ఏమండీ. అప్పారాయలగారూ! మరి తమరు ఎక్కడలేనిడబ్బూ పోసి బోలిడంత శాస్త్రం చదివారు గందా! అద్దాలు అవీ సూస్తారుగందా! నచ్చిత్రాల్ని పిలుస్తారు గందా! మా మంగలోడి అద్దంలో నెమిలి కనిపిస్తుందీ, అదేటి చెప్పండి!

అ - హారినీముండామొయ్యా, అదిటోయ్? దుర్భిణీలద్దం గాబోలు! క్షౌరం తరవాత చూసుకో, నెమిలి అప్పుడు కనిపించదు.

191

సుబ్రహ్మణ్యం - ఏరా, అచ్యుతరామయ్యా! అయిందీ “కాంపిటిషను”?

అ - ఆ

సు - ఎన్నీ తినవలిసిన మిఠాయి ఉండలు ?

అ - పెద్దరకం. నలభై.

సు - 'ప్రైజు' నీదేనా ?

అ - ఆ.

సు - ఎంత ?

అ - రూపాయిన్నర.

సు - అదేమిటి ? అల్లా పెట్టారేం?

అ - బండిచార్జి ఓ అర్థనుకో, డాక్టరు రూపాయి తక్కువకి మాట్టాడతాడామరి !

192

సీతయ్య - ఎక్కడికిరా, బయల్దేరావ్?

సూరప్ప - చెప్పనా?

సీ - కానీ.

సూ - సురభి నాటకానికి.

సీ - ఏం తొందర?

సూ - ఈవాళమరి ఆఖరాటకాదూ?

సీ - కూచోవోయ్, రేపెళ్ళచ్చు! సూ - నీ కంతా వేళాకోళంగా ఉంది!

సీ - కాదురా! “ఆఖరాట” అనేది ఉందే అది బహువచనం.

193

గోవిందు - ఏంరా చిదంబరం? పెద్దకాలేజీలో నీళ్ళ బ్రాహ్మడు...

చి - ఊ.

గో - మంచినీళ్లడిగితే కరుస్తాడుటేమిటి మనుషుల్ని?

చి - ఎవడ్రా అంటా? నేనమ్మను.

గో - ఏం?

చి - నువ్వూ నమ్మవు, ఆ మాటకొస్తే.

గో - ఏం?

చి - లక్కపిడతకాదుట్రా, ఆయన నోరూ!

194

బాపిరాజు తమూళ్ళోనే వేరే బసలో కాపరంఉన్న తన మేనత్తని చూడ్డానికెళ్ళి మాటామంతీ అయేసరికి పొద్దుపోయి అక్కడే మడిగట్టుకుని భోజనం చేస్తూ.

బా - అత్తా! తలవెంట్రుకొచ్చిందమ్మా!

అ - నాఇంట్లోకి ఎల్లావొచ్చింది, నాయనా! అభిరిస్తానుండు.

195

ఒక బోధన కాలేజీలో బోధించడం నేర్చుగుంటూన్న ఒక తయారీ మేష్టరు ఒకసారి తప్పనిసరి భోక్తవ్యం తగిలి “స్కూలు ఫైనలు” పరిక్షని మూడేసిమాట్లు గుంజిచూసిన విద్యార్థుల క్లాసుకి వెళ్ళి, చరిత్రపాఠం చెప్పబోగా, క్లాసులో ఒకరైన,

వరహాలరావు - ఏమండి, ట్రైనింగు మేష్టారూ! మీరు బి.యే. రొండు "సబ్జెక్ట్లూ ” ఓమాటే ప్యాసయారా, లేక అపసవ్యం ఏమన్నా జరిగిందా?

మే - (కోపంగా) నాన్సెన్స్, షటప్, అనవసరంగా ప్రస్తాపించకు.

వ - తగ్గాలి తగ్గాలి, ధోరణి జోరుగా ఉందండోయ్ మీవంటి వాళ్ళని లక్షమందిని చూశాను.

మే - "సిడౌన్”. ఇది మొదటి "వార్నింగ్” జాగ్రత్త.

వ - సరేగానండి, మొన్నసందులో మిమ్మల్ని పిండికింద కొట్టడం...

మే - జాగ్రత్త. వారి

వ - కోపంవద్దు సార్. ఇందాకా “మొదటి” అన్నారు. గనక ఇంకా రెండు మూడు వార్నింగు ఛాన్సులు ఉంటాయనుకున్నా!

మే - ఎన్ని ఛాన్సులు చూసినా ఏమీ లాభంలేదు.

196

రమణప్ప - కోరటులో మంచినీళ్ళ బ్రాహ్మడిపని కాళీ వచ్చిందిట.

కాశీ - నువ్వెరగవోయ్, కొత్తవాణ్ణి వేశారట!

ర - ఎవర్నీ?

కా - ఒక అప్పలస్వామిని.

197

పల్లెటూరినుంచి వెళ్ళి పట్నవాసంలో తన స్నేహితుడు నాగేంద్రుడు కలిసి నాటకం చూస్తూన్న,

శివన్నావధాన్లు - నాగేంద్రుడూ! ఈ నారదుడు వేషం వేసిన వాళ్ళూ వాళ్ళూనూ, ప్రత్యేకం ఇందుకోసం ముందునించీ గడ్డాలు పెంచుగు అట్టే పెట్టుగుంటారా ఏమిటి?

నా - అక్కర్లేదు. గడ్డాలుంటాయి.

శి - ఇందాకా మనం వస్తూంటే పొదుచ్చుగు మంగళ్ళు లోపలి కెందుకూ వెడుతున్నారూ?

నా - పొద్దున్నే వీల్లేనివాళ్ళు క్షౌరాలు చేయించుగోడానికి.

శి - అదికాదోయ్! క్షౌరంచేసినగడ్డాలు పెట్టుగుని బరిమీదికి రాకూడదూ?

198

తండ్రి - అబ్బాయి! వెంకటేశ్వర్లూ! మీపరిక్ష దరఖాస్తులు ఎప్పుడ్రా?

వెం - ఈవాళే.

తం - నువ్వు కట్టేశావా, పరిక్షకి?

వెం - హెడ్డుమేష్టరుగారు పెట్టించలేదు. నాన్నా.

తం - ఏడిసినట్టేఉంది. రూపాయలిచ్చేవాణ్ణి నేను ఇక్కడుంటూంటే ఆయనెవడ్రా కట్టించడానికీ?

వెం - ఏమో నాన్నా. ఇప్పుడెంజెయ్యనూ?

తం - పందిరిమంచం సొరుగులో రూపాయిలు దాచాను, అవి చప్పుడు చెయ్యకుండా తీసి రొండోకంటివా డెరక్కుండా కట్టేసి రా, తరువాత చూసుగోవచ్చూ!

199

ఒక గొప్పవాడు గంభీరోపన్యాసం ఇస్తూ, ఒక సందర్భంలో,

గొ - “ఒకదొరసాని నిద్రచెంది, కలగాంచి, ఆ కలలో తాను తన భర్తను ఎడబాయవలసి వచ్చుటయు, ఆ కలలో భర్త గతించెనను సంగతి తనకు తెలియవచ్చుటయు, అందుచే తానును మరణించుటయు జరిగినట్లు చూసి, ఆమె తక్షణమే నిజముగ చనిపోయెనట.”

ఒక సభ్యుడు - ఏమి ఆశ్చర్యం! ఏకాశ్చర్యం!

గొ - ఏది అది?

ఒక సభ్యుడు - ఆ కల మీకు తెలియడమే! ఆశ్చర్యం!

200

శేషు - వి. యస్. మన్యం ఫొటోలు తీస్తున్నాట్ట. ఏమన్నా బాగుంటూన్నట్టేనా? బాబూ?

బా - బాగానే ఉంటున్నాయి. కాని, మొన్న నాఫోటో తీశాడూ! ఆ తీసినపలకకి ఈశాన్యమూలమాత్రం నా రొండుకాళ్ళూ పడ్డాయి.

శే - నీ మొహంలా ఉంది!

బా - అదిలేందే, అందులో!

201

రైలులో ఫస్టుక్లాసుబండీలో ఒకడు దిక్కుమాలి కంపుకొట్టే చుట్ట తాగతూ నానాఅల్లరీ చేస్తూండడం చూసి వాడికి ఎల్లానేనా ఉద్వాసన చెప్పాలని కడంవాళ్ళు యత్నిస్తూంటే, అందులో ఉన్న పెంటోజీ కిటికీలోంచి బయటికి తలకాయపెట్టి చూసి, పెం - గార్డ్! ఈ మనిషి మూడోక్లాసు టిక్కట్టుతో ఫస్టు క్లాసులో ఎక్కాడు.

అని కేక వేసేసరికి ఎవడోవచ్చి వాణ్ణి సాగదోలగా, తక్కిన వాళ్లలో ఒకడు పెంటోజీతో, ఎల్లా కనిపెట్టారు మీరిదీ ?

పెం - నా టిక్కట్టు రంగునుబట్టి.

202

రామన్న - పిచ్చెయ్యా! కనకదాసుగారు బాగున్నారూ?

పి - ఆ. నిక్షేపంలా ఉన్నాడు. ఏం?

రా - అహ. మరొహమాటవిన్నాన్లే, నేను.

పి - పనుందా?

రా - మరేలే, వేరే మాట్లాడవలిసిన పనుంది. ఇంట్లో ఉంటాడా ఇప్పుడు?

పి - బహుశా ఈ పాటికి పైకివెళ్ళుంటాడు ! లాభంలేదు.

203

పంతులు - నారప్పా! ఎంచేత ఆలస్యంగా వచ్చావ్?

నా - నాన్న ఉండిపొమ్మన్నాడండి.

పం - సరే క్షమాపణ కోరుతూ ఉత్తరంపట్రా ఆయనగారి దగ్గర్నించి!

నా - నాన్న క్షమాపణ్లుకోరే రకంకాదండి.

పం - ఏం కథ?

నా - అల్గాగనక ప్రారంభిస్తే అమ్మ, గరిటి కాలేస్తుందండి.

204

లింగప్ప - ఏమండీ! నాటకం టిక్కట్లు ఎవరు అమ్ముతూంటా?

గుమాస్తా - ఏం? నేనే, ఏంకావాలి?

లిం - నాటకపుపేపరు ఓటిల్లా ఇవ్వండి.

గు - ఇక్కడుండవు.

లి - అయితే. అర్ధచార్జీలు ఎవరెవరికి?

గు - చదువుకునే పిల్లలకి.

లిం - నాకు ఎడంకంటో పువ్వుగదామరి, నేనుకూడా పూర్తి రేటు తగలేసుకోవలిసిందే చూస్తూను!

గు - ఆ. చెముడు లేదుగా?

లిం - లేకపోతేమాత్రం! ఓపాతికేనా కొట్టెయ్యరూ?

205

రఘూరాంగారు తనకి కావలసిన వాడైన పంకజాన్ని లెక్కల పరిక్షనాడు కలుసుగుని,

ర - పంకజం! లెక్కలు ఎన్ని చేసినట్టు? అంటే రైటుగా!

పం - ప్రతీప్రశ్నా వొఠ్ఠి తప్పులకుప్ప అవుతూంటే, చెయ్యడం కుర్రాడి తరంటండీ? వాడి తాతతరమా!

ర - ఓరి! ఇప్పటి కుర్రాళ్ళది ఏమి మేధస్సురా? నువ్వు అందులో తప్పులుకూడా ఎంచావ్?

పం - ఓ. ఓ లెక్కలో “రెండువరసమైలురాళ్ళదగ్గరనుండి” అంటూ ఉంది. అందులో గొప్పతప్పూ! ర - ఏమిటదీ?

పం - తప్పంటే మరేంలేదు, ఒక దారుణమైన లోటు!

ర - అదే ఆయిరి. ఏమిటి?

పం - ఆమైలురాళ్ళ మధ్యదూరం ఇవ్వడం మరిచి పోయాడు.

ర - సరే. అదోటీ. కడంవి?

పం - కడంవీ ఇదేరకం గదా అని ఊహించి మానేశాను. అన్నం అంతాచూడాలీ!

206

కామన్న - సుబ్బయ్య బాబూ! మీ ఆవు సంగతీ ఎల్లా ఉన్నట్టు?

సు - అసలు ఆవుతో అహర్నిశలూ హైరాన పడేకంటే, విస్తరిదగ్గిర ఓ రాగంపెట్టి లేస్తేనయం. ఏం చెప్పనూ!

కా - దొడ్లో గుంజకి కట్టేసిలేదేం? బీటికి తోలేరా తెంపుగు పోయిందా?

సు - ఎరగవ్ నాయనా? ఈత పాలికి తోలిపెడితేనే!

కా - ఎవరికీ?

సు - ఓ ధర్మరాజుకి.

కా - మంచివాడేనా?

సు - అల్లాంటివాడు భూమిమీద లేడు.

207

తీర్థం రొండోనాడు చేన్లూ పరబ్రహ్మం కలుసుకోగా,

చే - నిన్నరాత్రి మళ్ళీ కనిపించలేదేంరా, నువ్వూ?

ప - పైగానా? ఆ రథందగ్గిర ఇట్టే మాయం అయావు! నాకెక్కడా పడక్కి స్థలం కుదరక నాటకాని కెళ్ళాను.

చే - "వరవిక్రయాణా"నికేనా? “చింతామణి” కా?

ప - చింతామణికే,

చే - "చింతామణి” ఎవరు?

ప - మాణిక్యంట.

చే - స్త్రీ ఆ?

ప - నాపక్కని కూచుని నాటకం చూస్తూన్న మంగల్ని ప్రతీ అంకంచివరా లోపలికి ఈడ్చుకుపోయారు మరి.

208

సుబ్బన్న - హరిదాసుగారూ! మీరు కథ చెప్పేటప్పుడు పాలు వగైరా పుచ్చుగోడం కద్దా?

హ - పుచ్చుగోకపోడంకూడానా! ఏడిసినట్టేఉంది.

సు - కథ మొదలెట్టిన ఎంతసేపట్లో పుచ్చుగుంటూంటారు?

హ - ఎంతసేపా? తోడుతూనే.

సు - ఏం? అంతతొందరేం దేవరవారికీ?

హ - నీకేం తెలుసూ! ఈశాన్యమూల చేటంత మబ్బట్టి, కొండ కుండల్లా అయి, క్షోణీపాతంగా వర్షం కురిసి, అసలు కథే ఆగిపోవచ్చు. ఆ తరవాత నాకథ ఎవడిక్కావాలి?

సు - అహ, వర్షాకాలం కానప్పుడు? హ - అప్పుడూ మరోటి ఏదోరావచ్చు.

సు - మరోటి ఏదో రాకుండా ఉంటేమాటే!

హ - ఏమో! వెధవ యక్షప్రశ్నలు. ఇదివరకెప్పుడూ ఏదోవోటి వస్తూనే ఉంది.

209

“పుట్‌బాల్” ఆటలో మధ్యవర్తిగా పనిచేస్తూన్న బ్రహ్మయ్యగారిని ప్రేక్షకుల్లో ఒకకుర్రవాడు రాయిపుచ్చుగుని చచ్చేటట్టు వెయ్యగా, బ్రహ్మయ్య, పక్కనున్న ఒక పెద్దమనిషిని సంబోధించి,

బ్ర - చూశారండీ, సార్, ఈ కుర్రపిశాచం గాడు నా మొహం మీద ఎంతగాయం చేశాడో?

పె - (ఆయన్ని సమదాయిస్తూ) తొందరపడకండి, బాబూ ఆ పిల్లకాయకి బంతిఆట రూల్సు తెలియవేమో, కర్మదశా!

210

నరసింహమూర్తి, తనకి కొత్తగా పరిచితుడైన సత్యనారాయణ ఇంట్లో భోజనం చేస్తూ, కొంత అర్థంలేని సంభాషణ చేసిచేసి,

న - ఏమండీ! మీ “వైఫ్” గారు చాల “బ్యూటిఫుల్” గా ఉంటారండి, ఏముటో అనుకున్నానూ!

స - అందుకనేనండి మిమ్మల్ని మీబోట్లనీ పిలుస్తూంటాను నాయింటికి,

న - ఏం?

స - అనుమానం అనేది నా మనస్సులో జనించడం అసంభవం అవడానికి.

211

మగపెళ్ళివారి తాలూకు లక్ష్మణరావు, విడిదిలో భోగంమేళం మేజువాణీ జరుగుతూన్న సందర్భంలో పెళ్ళివారింటికి పరిగెట్టి అక్కడ తన స్నేహితుడైన కామప్పతో,

ల - కామప్పగారూ! మేళానికి రావాలి మహజోరుగా ఉంది.

కా - నన్ను చంపకు, ఎందుకొచ్చిన మేళం!

ల - పోనీ వాళ్ళతో ఒక్కమాటచెప్పి చక్కావస్తురుగాని!

కా - ఏమోబాబూ! నేను మళ్ళీ మళ్ళీ నాలిక ఇస్త్రీ చేయించు గోలేను.

ల - అదేంకర్మం !

కా - అప్పటితో వాక్సుద్దిపోతుంది, మరి.

ల - పోనీ వాళ్ళ గాంధర్వం విని చక్కావద్దురుగాని!

కా - ఏమోబాబూ! నేను మళ్ళీమళ్ళీ చెవులు కళాయి చేయించుగోలేను.

ల - అదేంకర్మం ?

కా - అప్పటితో శ్రుతిజ్జానం చేస్తుంది, మరి.

ల - పోని వాళ్ళనిచూసి చక్కారావయ్యా!

కా - ఏమోబాబూ! నేను మళ్ళీమళ్ళీ కళ్ళు మెరుగు పెట్టించుగోలేను.

ల - అదేం గ్రహచారం?

కా - అప్పటితో స్త్రీవాంఛ హరాయించిపోతేనూ!

212

డంగూరావుగారు ఒక సైన్యంలో జేరడానికి వెళ్ళి, అక్కడ పెద్దసేనానితో మాట్లాడుతూండగా,

సే - అనుభవం ఏమన్నా సంపాదించావూ?

డం - చిత్తం.

సే - సరే. నీకు సేన ఉందీ అనుకో.

డం - నిజంగానేకదండీ! సరే.

సే - నాలుగు వేపుల్నించీ శత్రుసేనలొచ్చి పడుతున్నాయీ అనుకో. నీపై సుబేదారు దాక్షిణ్యం అంటాడనుకో, మీ సేనలు ఉత్తరం అంటారనుకో, నీకు తూర్పు మోహంగా తిరగాలని ఉందీ అనుకో.

డం - నే అనుకోనండి.

సే - కబడ్దార్! అనుకో! అప్పుడేం జేస్తావ్?

డం - చిత్తం! రాజీనామా దాఖలుచేస్తాను.

213

వెంకటానందం - మరిటా, ఒక ఆసామీటా, జైలు తణికీ చెయ్యటానికి ఇట్టేవెళ్లి, ఓ అరగంటలో బయటికి రావాలనుకున్నాట్ట.

కోదండం - అనుకుంటే?

వెం - పాపం ఆర్నెల్లు ఆలస్యం అయిపోయిందిట.

కో - అంతాలస్య మెందుకైందో?

వెం - వాడు వెళ్ళిన దారి వలన వచ్చిందీ ప్రమాదం

కో - ఏం?

వెం - సింహద్వారం అంట వెడితే తీరిపోనా! కన్నంలోంచి వెళ్ళాట!

214

బుచ్చన్న - రాంగారు! మాఆవిడబొమ్మ పూర్తిచేశారూ?

రా - అయిందండి, రేపిస్తా.

బు - రంగులు ఏం ఉపయోగించారు?

రాం - చీరకి పసుపూ, రైకకి ఊదా వేశా.

బు - చీ చీ. కారపురంగు చీరా మిరియపురంగు రవికా ఉండాలి.

రాం - ఏమిటండీ, తెలియకుండా మాట్లాడతారూ?

బు - తెలియకపోవడమా! ఆకారానికీ తత్వానికీ ఆమాత్రమేనా సంబంధం లేకపోతే మా ఆవిడ బొమ్మే అనిపించదూ!

చాలుగానీ, ఈపాటి రంగు ఫిరాయించండి.

215

మొగభార్య - నాతో ఎవేనా మాటలు తగులడాలీ అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు తగులడక, నలుగురూ వచ్చినప్పుడు తగులడతారేం? మీతగులడ్డం మండిపోతే!

ఆడంగిభర్త - సాక్ష్యానికి మనుషులు లేందే నీతో మాట్లాడ్డం ప్రమాదకరం అని లోగడ గ్రహించాగా!

216

రాజయ్య - పానకాలూ! డిక్షనరీ అమ్ముతున్నాను కొంటావాయేమిటి?

పా - ఎవరిది?

రా - నాదే.

పా - సరేలే. చేసిందెవరూ?

రా - బ్రౌను.

పా - గొప్పదే. ఎంచేత అమ్ముతున్నావ్?

రా - ఏమాట తీసిచూసినా నా వర్ణక్రమం ఒక్కచోటా కనపట్టంలేదు.

రా - అసలతను దొర గనక నా వర్ణక్రమం కనబడి ఏడుస్తుందా ఏమిటి!

పా - నాకూవద్దు.

217

భొట్లు - ఏమోయ్ యాజు! చమత్కారంగా మాట్లాడినా కొందరు నవ్వరేం!

యా - నువ్వు మాట్టాడినప్పుడేనా?

భొ - మరే,

యా - అల్లాటప్పుడు నువ్వు వాళ్ళసమక్షమందే ఉంటావు గనక చంకలిగిల్లేనా పెట్టు, అరికాళ్ళేనా గోకు. కడుపుబ్బిపోతారు.

218

జడ్జీగారి ఎదట,

1వ ప్లీడరు - అవతలపార్టీ వకీలు బలే కుట్రమనిషీనూ, ఉపద్రవమైన లుచ్ఛానండి. లేకపోతేనా?

2వ ప్లీడరు - అవతల నాసోదరుడు ఫక్తు కోతలరాయడూనూ వొఠ్ఠి భటాచోరూనండి. లేకపోతేనా!

జడ్జీ - సరే! ఇక్కడ వాదించవలసినది మీమాంసలేకాని సిద్ధాంతాలుకాదని జ్ఞాపకం ఉంచుగోండి.

219

ఒక కంపెనీ ఏజంటు, తను రైలు ప్రయణీకులకి అమ్మతెచ్చిన ఒక ఔషధం ప్రకటనకోసం కొనియాడుతూ లెక్చరుపూర్వకంగ,

ఏ - (ఒకడబ్బీ చూపిస్తూ) అయ్యా! ఇది రోజుకు నాలుగు వేలు ఖర్చు, కురుపులకు ఇది వజ్రాయుధము. ఇది రాసినచో, కురుపులు పూటలో వింతగా తుప్పురాలినట్టు రాలిపోవును. దీని పేరు 'వింత'. డబ్బీ ఒక పావలా, ఒక డబ్బీకొనువారు వెంటనే పది కొందురు.

రైల్లో ఒకరు - దీనివల్ల కురుపులు ఎక్కువవ్వుగదా! కొంపతవ్వి.

220

ఒకరైల్లో సెకండుక్లాసు పెట్టెలో రెండుసీట్లు కాళీగా ఉన్నప్పుడు రంగారావుగారు ఎక్కి ఒకదాన్లో సామానుపెట్టి రొండోదాన్లోకి తను, సర్దుకుంటూండగానే అందులోకి ముచ్చటకోసం పెద్దటిక్కట్టు కొనుక్కున్న రాజన్న ప్రవేశించి పగలైనాసరే మరతిప్పి లైట్లువెయ్యగా.

రం - ఇందులో ఖాళీలేదండి. రా - ఆ మూట ఎవరిదీ?

రం - నాది గాదు, ఎవరో ఇక్కడెట్టి అల్లావెళ్ళారు.

రా - నే యిస్తాలెండి.

అని మూటతీసి, తనుకూచుని మూట వొళ్ళో పెట్టుగున్న క్షణంలోనే రైలుకదలడం చూసి అతడు మూటఅవతలికి గిరవటేయగా,

రం - అదేంపని!

రా - అవతలాయనకి పాపం మూటనష్టం కూడా ఎందుకనీ!

221

సూరపరాజు - చూశారూ! చిక్కొచ్చిపడ్డది. మా ఇద్దరమ్మాయిలకీ వివాహాలు. పెళ్ళికొడుకులికి పట్టుతాపితాలు కొనాలి. రొండూ ఒకటేతూనికా, ఒకటేరంగూ, ఒకటేసైజూ, ఒకటే ఖరీదూ ఉండితీరాలి.

గిరీశం - వార బొత్తిగా ఉండకూడదేం!

సూ - ఉంటే కుస్తీలు జరిగిపోతాయి మగపెళ్ళివార్లల్లో. అదీచిక్కు. ఏమిటి సాధనం! గి - డామిట్! ఇదాచిక్కూ! ముందు ఒకటి కొనండి.

సూ - కొంటే ఏమైనట్టూ?

గి - ఎవ్వరూ చూడకుండా దాన్ని రెండెట్టి గుడించండి. “వెరీ సింపిల్, యూ కెన్ వర్కిట్ ఎట్ హోమ్”

222

రాముడు, తనేగీసిన ఒక రంగుబొమ్మ చిన్నకాముడు గారికి చూపిస్తూ,

రా - చూశారండీ బొమ్మా!

చి - చూశా. ఇంకాబాగా ఉండాలంటే ఏంకావాలి. కొత్త రంగులా, కొత్తకుంచెలా?

రా - అవేమీ పనికిరావండీ!

చి - కాగితం మీద వేస్తేనయమా, గుడ్డమీద వేస్తేనయమా ఇంకా బాగుండడానికి?

రా - అవీ పనికిరావండీ!

చి - మరి?

రా - (వేలు గాలిలో తిప్పుతూ) నిరాధారంగా ఇల్లావేస్తే, నే' అనుకున్నట్టు అచ్చంగా వచ్చేస్తుంది.

223

కమల - ఏమమ్మా! లలితాంబగారూ! మన విశాలాక్షి కాపురం ఇల్లా మారాముళ్ళయి పోతోందేం? మొగుడూ పెళ్ళామూ ఎప్పుడూ మహాభారతంట, ఏం గ్రహచారమోగాని!

ల - ఏముంది? వీళ్ళ పెళ్ళిసమయంలో సన్నాయివాళ్ళు అపశృతిగా వాయించారట.

క - శృతేకాదు అల్లాయితే, లయకూడా తప్పి ఉంటుంది.

ల - అదెల్లా?

క - ఇప్పుడు అన్ని దెబ్బలేకాని ఉసి ఒక్కటీ లేదు.

224

సూర్యానికి తేలుకుట్టగా సదాశివుడు మంత్రంవేస్తూ

స - ఎక్కడా, కుట్టింది? సూ - కాలిమీద.

స - ఇంతేగదా! నీకు కాళ్ళులేవనుకో, పోయిందా?

సూ - అల్లా అనుకుంటే కింద పడాలి. ఏమీపోలేదు.

స - ప్రపంచంలో తేళ్ళులేవనుకో - పోయిందా ఈ మాటు?

సూ - ఇదివరకి చిమచిమలాడేది ఇప్పుడు అగ్నిహోత్రం పుంతయింది.

స - (ఊది) ఈ మంత్రంతో కుదరకపోతే బ్రహ్మాదులొచ్చినా ఇంతే. ఈ మాటు పోలేదూ?

సూ - పోయిందయ్యా మహప్రభో!

పక్కని ఉన్న సుబ్బన్న - నిజంగానే సూర్యం?

సూ - నిజంగానే, ఈయన నన్ను పెడుతూన్న బాధముందు.

225

చిదంబరం కొత్త సైకిల్ మీద పోతూండగా ఒక మేష్టరుగారు ఎదురై,

మే - ఏమోయ్! నీకు పెళ్ళిఅయి ఎన్నాళైంది?

చి - స్వధనం రెండువందలండి, "లైటూ” “బెల్లూ” కలుపుగుని.

మేం - ఒప్పుగున్నాం!

226

ఒక నల్లదొర తను “మాజిక్” చేస్తానని ఒక పల్లెటూరిలో కొన్ని నోటిసులు గోడలకి అంటించి మరికొన్ని స్వయంగా జనానికి జారీచేయగా, మర్నాడు చంద్రుడూ అనంతం దాన్ని గురించి మాట్లాడుకుంటూ,

చం - అయిందిటగా, “మాజిక్” రాత్రీ!

అ - లేదుటరా,

చ - అబ్బ అయిందిట.

అ - లేదు. నామాట కాస్త వినుమరీ, దాంతగలెయ్యా! పొద్దున్న ఆయననోటంటేవింటా. ఒక్కడూ రాలేదుట.

చం - అల్లాఅయినా, అయిందన్నమాటేరా!

అ - లేదురా.

చం - నీ మొహం! ఒక్కడూ రాకపోడం ఏమిట్రామరీ, “మాజిక్” కాకపోతే?

227

రాముడు - వసిష్ఠుగారూ! మీరు యజ్ఞంచేశారూ?

వ - ఆ.

రా - ఎందుకండీ అదిచెయ్యడం?

వ - ముక్తికోసం.

రా - అంటే?

వ - అంటే, రంభాసంభోగం! తెలిసిందా?

రా - ఈమాటు తెలిసింది. మీరొక్కరేనా ఇది చేస్తా?

వ - ఏడిసినట్టేఉంది. మా ఆవిడ కూడాలేకపోతే యజ్ఞం ఎల్లా చెల్లుతుంది?

రా - అల్లాయితే ఆవిడముక్తి ఏ భోగంతోటీ?

228

యాచన నిమిత్తం వచ్చిన ఒక అవధాన్లు, రాముడుగారితో,

అ - చూశారూ, పంతులుగారు! మీదయ! ఘనా, జటా, తల్లకిందులుగా కత్తిమీద అప్పగించగలవాణ్ణి.

రా - మచ్చుచూతాం, కేశవనామాలు తల్లకిందులుగా కానీండి ప్రస్తుతం.

అ - (చెప్పలేక, తెల్లపోక) చిత్తం. ముందు తమరు ఏ ఏ నామాలో చెప్పండి, తరవాత వెనకనించి చెబుతాను.

రా - (తెల్లబోతూ) నాదాకా ఎందుకు మావాణ్ణి పిలుస్తానుండండి. అమ్మా ! నాకు నామాలే రావనా?

ఆ - నామాలు రావనికాదు, పంగనామాలు వచ్చుననీ!

229

భోజనాలపందిట్లో పరిషించిన కాస్సేపటికి.

ఒక మొగపెళ్ళివాడు - (హేళనగా) ఈ ఉసిరీపచ్చడి ఏం ఫకడుగా ఉందండీ! నాలిక్కి రాచుకునేసరికి అమాంతంగా జిహ్హ వెనక్కి లాక్కుపోతోంది. ఎందుకు చేసినట్టిదీ?"

ఒక ఆడపెళ్ళివాడు - బహుశా, వడ్డించడానికే అయిఉంటుంది.

230

సామాన్య ప్లీడరైన గిరిశాస్త్రిగారు రాత్రి పదకొండు గంటలకి బయటికి వచ్చి, అరుగుమీద జనం పడుకుని ఉండడం కనిపెట్టి.

గి - ఎవరువారు?

ఒకడు - మేం పార్టీలమండి.

గి - అయ్యో వెఱ్ఱిమొహాలా! నన్ను లేపకపోయారా?

ఒ - వకాల్తానామా ఇవ్వడానికి రాలేదండి.

గి - మరి?

ఒ - అదుగో ఆ యెదురుగుండా ఉన్నాయనికి ఇచ్చేశామండి.

గి - పగలు మీకు కళ్ళు కనిపించి నా బల్ల దుష్టికి రాలేదూ? ఇప్పుడు స్థలంకోసం వచ్చిపడ్డారా? ఛంపేస్తా, లేచిపోరేం? మీ మొహంమండా! కర్రిల్లాతేవే!

231

సోమన్నగారి ఇంట్లో ఆబ్దీకానికి భోక్తలైన వీరయ్యా సుబ్బయ్యా లేచిం తరవాత, పారణ నైవేద్యం పెట్టవలసి, సోమన్న తనభార్యతో,

సో - చూడవే, అరిసిముక్క పట్రా ఓటీ!

భా - అల్లాకాదు, బెల్లంముక్క ఇదిగో, ఉంచండి .

అనగా ఆ ఇచ్చినదానితో ఏదో కానిచ్చి, ఇకబ్రాహ్మలు అక్షతలు పెట్టుగుని వెళ్ళి పోతూండగా, తను అదివరకే ఇంట్లోకి వెళ్ళి, వండిన ఎనభై రెండు ఆరిశెల్లోనూ ఒకటి మాత్రమే వీరయ్యా తతిమ్మా ఎనభై ఒకటి సుబ్బయ్యా తినేసి పారేశారని తెలుసుగుని, సోమన్న, వచ్చి, నడుంకట్టుగుని సుబ్బయ్య పాదాలమీద పడి,

సో - బాబూ! నిన్ను బుద్దితక్కువచేత భోక్తగా ఉండమన్నాను. ఇహ నా జన్మలో పిలవను. అనంతరంగూడా నిన్ను పిలవనని మావాడు ఒట్టు వేసుగోకపోతే నేను పోనేపోను.

సు - మీనాన్న నాలో ప్రవేశించి చూపెట్టిన మహిమకి నన్ను స్తోత్రాలెందుకోయ్, వెర్రివాడా!

232

అమృతయ్య - ఏమండీ! వెంకట్రాయరిసుబ్బరాయారూ! కళ్ళెర్రపడ్డాయేం, రాత్రి నిద్దర్లేనట్టు?

వెం - నిన్న బీంవారం కాపీవుటేలుకి యెల్లానండీ. యెల్లీ, నాలుగు పుంజీలు యిండ్లీ, ఓ పెద్దచెంబుడు కాపీ యిమ్మన్నా నండా!

అ - ఇమ్మంటే?

వెం - టీ యిచ్చాడు గాబోసును ఆసచ్చినోడు! నిద్దర తేలిమోయిందండా!

అ - అదా! అయినా ఫర్వాలేదు, పట్టుగోవచ్చు, ఎక్కడికి పోతుందీ మనదైనప్పుడూ!

233

అచ్చయ్యగారు, తన కొడుక్కికూతురున్నూ మూడేళ్ళదిన్నీ అయిన లచ్చమ్మతో.

అ - ఈవాళ మాట్లాడకూడదమ్మా. జాగ్రత్తగా కూచోవాలి. మనింటో ఈవాళ తద్దినం అమ్మా! తాతయ్య తద్దినం!

ల - తాతయ్య తద్దినమా?

అ - మరేనమ్మా. అల్లరి చెయ్యకూడదు.

ల - సరేగాని తాతయ్యా! తద్దినం, నీదా, అమ్మగారి తాతయ్యదా?

234

కొత్తగామాటలొచ్చిన సుశీలతో.

తల్లి - అమ్మాయి, చంటీ! పొద్దున్న అంతేడుపు ఏడిచావేమే, ఊరూనాడూ ఏకమయేటట్టూ?

సు - నిబద్దేటే? అంతేడు పేడిచానా?

త - నిబద్దేనే! రోజూనూ!

సు - రోజూఅయితే, పోనీ నాచేత కందనోంపట్టించి ఉద్దాపన చెయించు, ఏడుపు పోతుందేమో!

235

ఒక సాహేబు దొంగతనం నిమిత్యార్థం తొమ్మిదింటికే ఒక షాహుకారు ఇంటివెలిసిమీద సోగయాచేసి ఉండడం షాహుకారు కనిపెట్టి చుట్టుప్రక్కల కోమటి జెమాజెట్టీలని కేకవేసి, సాహేబు చేతులో బిందె ఓటి పెట్టించి వాణ్ణి దంచుతూ పోలీసు ఇనస్పెక్టరు ఎదటికి ఈడ్చి,

షా - ప్రభువోరు కటాచ్చించాలి, ఈ లుచ్చాగాడు నాసరుకు దోచుకుపోతూంటే పట్టుగున్నాం బాబు! సూడండి బింది.

కొందరు - మరేనండి. అవునండి.

సా - (దోసెడుమట్టి పోగుచేసి నోట్లో పోసుగుంటూ) మీకీ బిందీవాడ్ నాకీ తీశామ్? హెంద్కూఅయ్యా అబ్దం మల్లీ! హామాట్కీ వొస్తే. హబ్ధంకన్నా దొంగ్తనమ్ హెక్వా!

236

దేశాంతరం సర్కీటు తిరగడంలో ఆస్తి అంతా హారతికర్పూరం చేసుగున్న చెంచుగారు, ఎల్లానైతం చివరికి స్వగ్రామం జేరుకుని "లండను” వెళ్ళిదిగుతూన్నట్టు నలుగురితోటీ ఫరఫరలాడించడం అంబయ్యగారు విని,

అం - తమరు లండన్లో ఉన్నది ఎన్నాళ్ళూ? చెం - గ్రేట్‌వైల్. చాలాకాలం.

అం - మీరు “హౌస్ ఆఫ్ లార్డ్సు ” వీక్షించారూ?

చెం - వాట్! చూడకేం. సాక్షాత్తూ ఒక హౌస్ ఆఫ్ లార్డు గారి ఇంట్లో భోజనంకూడా చేస్తేనే!

237

పల్లెటూరి రాజుగారు రత్తయ్యచేత పంపించిన తెల్ల చెక్కెర కేళీగెల, రత్తయ్య, తిన్నగా బస్తీలో ఉన్న ఒక కోమటి మేజస్ట్రీటుగారింటికి పట్టిగెళ్ళి వీధిసావిట్లో పనిచూసుగుంటూన్న మేజస్ట్రీటుతో,

ర- దణ్ణాలండి, తమకి ఇది రాజుగారు అంపారండి.

మే - ఆ గడ్డి మాకు వద్దు, పో.

అనేసరికి రత్తయ్య సాగిపోగా, అదంతా లోపల్నించి విని, మేజస్ట్రీటుగారి భార్య సావిట్లోకి వచ్చి

భా - మీకేమన్నా మతిగాని పోయిందాయేమిటి.? ఒంట్లో తెగ వేడివేడని ఏక దేవుళ్ళాడుతూంటిరి! రమ్మనండి ఈ పాటికి వెనక్కి, ఎవరేనా పుచ్చేసుకోగల్రు.

మే - అల్లానా! సరే మరీ.

అనిచెప్పి, ఆమట్టున వీధినిబడి, గోచీయేనా ఏశ్రేణికి పోయిందో కూడా చూసుకోకుండా అరిటిగెల వాణ్ణి వెనక్కితిరగమని ఉఱమగా, వాడు వచ్చిం తరవాత వాడితో,

మే - సరేనోయ్, పోనీ అప్పగించు ఇంట్లో!

ర - చిత్తం. రాజుగారిచ్చిన సీటీ సదివించానండి. సదివిత్తే, సదివినోడు ఇది ఓరిశీలుగారి కివ్వాలని సెప్పాడండి.

238

పరదేశి - తమరేనా, వెంకన్నగారంటే!

వెం - అవును. ఏం?

ప - ఏంలేదండి. తమరింటికి భోజనాని కొస్తాను.

వెం - వీలు లేదండీ. లేకపోతే ఎల్లానో అల్లా యిది చెయ్యచ్చూ!

ప - అహఁ. తమరు నిరతాన్న ప్రదాతలని చెప్పారు. మరో మాట చెప్పకండి నాదగ్గిర.

వెం - అబ్బా! మళ్ళీ అదేమాటా!

ప - అల్లాకాదండి. ఇల్లాపోనీండి. చెప్పాగా! పట్టుబట్టతీస్తా.

వెం - మాకు పురుడండీ, ఈవాళకారూ! లేకపోతే భాగ్యంమామిటి పట్టెడన్న!

ప - అవుంట, కనుక్కున్నా. నాకూ పురుడేనండి. మాతమ్ముడికి తొల్చూరు కొడుకూ! ఈవాళకారే. పట్టుబట్ట తీస్తున్నా.

వెం - ఓరి నీ తస్సలమందూ! నీ పురుడు మాయింట్లో కలపాలనా! మాకు పురుడూలేదు బుగ్గీలేదూ!

ప - నాకూ అంతేనండి నాకు తమ్ముడేలేడు. పట్టుబట్టతీశా!

239

మొదటిసారి నిశ్శబ్దపు సినిమాకివచ్చిన విస్సన్నతో గోపాల్రావు సినీమా చూస్తూ,

గో - ఎల్లావుందిరా, బావా, సినీమా? వి - వెధవమాటలూ వీళ్ళూ, మరీ నిమ్మళంగా మాట్లాడుతున్నారోయ్! గొంతుకలు పూడాయ్ పీనుగులికి, గొల్లచల్ల దాహం పుచ్చుగున్నట్టు!

240

పంచదార నీళ్ళల్లో కరుగుతుందని పిల్లలదగ్గర్నించి రాబట్టి, కరగడాన్ని గురించి పాఠం చెప్పదల్చుగువచ్చిన రామన్న మేష్టరు,

రా - నీళ్ళల్లో పంచదార వేస్తే ఏమవుతుంది? రొండోవాడు!

రొం - పానకం అవుతుందండి!

రా - (చికాకుపడి) అల్లానా! నువ్వు ఎవరబ్బాయివి?

రొం - మావాళ్ళ అబ్బాయినేనండి.

రా - (కొంచెం కోపంతో) ఎవరు మీవాళ్ళూ?

రొ - మా అమ్మా, మానాన్నా, మాబామ్మా, మాచెల్లాయీవాళ్ళూనండి.

రా - (ఇంకా కోపంతో వెళ్ళి పిల్లాణ్ణి ఒకలెంపకాయ కొట్టి) అబ్బా!

రొం - ఎందుకూ నన్ను కొట్టడం? మళ్ళీ యింకోటికొడితే దవడపళ్ళు ఊడిపోను. ఈపాటికి!

241

వేదాంతం చదువుకున్న ఒక మేష్టరు గణితం బోధిస్తూ ఒక లెక్క కొంతవరకే పదిలంగాచేసి, తుద నెగ్గడం విషయం అపనమ్మకంతోచి, బోర్డుమీద తను రాసినంతమట్టుకు చేత్తో చూపించి పిల్లలతో,

మే - ఇల్లానే కొంతదూరం చేసుగుపొండి. ఆన్సరు ఎదురుగుండా చక్కావస్తుంది. కర్మకాండ అంతాయింతే!

ఒక పిల్లాడు - అవునుగానండీ, సరియైన ఆన్సరు రావాలంటే, జ్ఞానకాండ వేరుగా ఉండవలసి వచ్చేటట్టు తోస్తుందండి!

మే - అవును నీ జ్ఞానకాండలా ఉండకూడదు.

ఒ - ఏమండీ?

మే - యోగం !

242

బంగారు - ఎమోయ్! ఏంజెప్పినా, ఉఁ ఆఁ అనవాయిరీ, ఉసూరుమని ఉంటూంటావ్! ఏమిటీ?

శేషు - ఏముటో! ఏమిలేదూ?

బం - నవ్వనేనా నవ్వవేం?

శే - సరేగాని, ఒరేయి, నువ్వు “విట్టు” వేద్దాం అనుకున్నప్పుడు కాస్తంత ముందుగా నాతో చెబుతూండేం!

బం - ఎందుకూ? ఎక్కించుగుంటావా?

శే - కాదు, నవ్వుతుండాలి, అలవాటుగా!

బం - అదిటోయ్! నేనేమీ అనుకోనులే!

శే - నేనెరగనుట్రా! కాని, రేపు మరొకరవుతుంది. నా అలవాటుకోసం నే చెప్పింది!

243

రామేశం నాలుగోఫారం, వెంకటేశం అయిదోఫారం చదువుతూ సంవత్సరపరిక్షలో, పేపర్లలో, ఒక్కక్కడికిచ్చిన పదేసి లెక్కలకీ నాలుగేసింటికి కాపీ తెప్పించుగుని ఎక్కించినా ఫేలయిపోయి, తరువాత కలుసుగుని.

రా - పదింటికీ నాలుగేసి లెక్కలు చేశాం. ప్యాసుకావలిసిందే, మరీ! ఆ స్కూలు ఫైనలువాడు మనకి అవి తప్పుడుగా చేసి పంపించాడేమో!

వెం - అబ్బే, రైటేట.

రా - అయితే మరి దిద్దేవాడు కనిపెట్టి సున్నా చుట్టాడంటావా?

వెం - నా ఉద్దేశం అంతే. అదేనా వాడుకనిపెడతా వాడికి తెలివితేటలుండికాదు. మన గ్రహపాటు కొద్దీనూ! నా లెక్కలు నువ్వూ, నీలెక్కలు నేనూ కాపీచేశాంట!

244

తిరుమలరావు - గోపన్నా! నిన్న వెడతానన్నావ్, వెళ్ళి సౌందర్యభవనం చూసివచ్చావ్?

గో - ఆ.

తి - అద్భుతంగా లేదూ?

గో - ఏం అద్భుతం. నాపిండాకుడూ!

తి - లోపలికివెళ్ళి చూస్తే?

గో - లోపలికివెళ్ళి కాస్తకాస్తే చూస్తే ఓ మోస్తరుగా ఉంది. కాని ఏకమొత్తంగా, బాహ్యానికిమాత్రం మాచెడ్డ అసహ్యంగా ఉంది.

తి - ఏర్పాట్లన్నీ చేశారేమరీ! పోనీ కట్టుదిట్టంగా లేదూ?

గో - నేవెళ్ళి కొన్ని మార్పులు చేయించిన తరువాత రాయిలా ఉంది.

తి - ఏమిటవీ?

గో - కొన్ని చోట్ల విస్తారం సాలిగూళ్ళుంటే అవి తక్షణం లాగించేశాను.

245

కృష్ణమూర్తి - సరవయ్యా! మనం మహధూకుడుగా నడుస్తున్నాంగాని, ఏముచ్చుగుంటాడు, ఈ వంటపూటివాడు?

స - మనిషికి ఐదణాలు,

కృ - ఇంకేం, అల్లాయితే లోపలికి పద.

స - ఏం? అంత కసిగా మాట్లాడుతున్నావ్?

కృ - ఏం లేదు. భోంచేస్తే! నాకు అయిదణాలు లాభం.

స - లాభమా?

కృ - అడ్డమా! నడు. నీకే తెలుస్తుంది.

246

సూరన్నగారు ఒకగొప్ప రాజువేషంవేసి, అభినయిస్తూ ఒక కష్ట సమయంలో.

సూ - “హా! తుదకు నా అవస్థ ఇంతకు వచ్చెగా!” అని విచారిస్తూండగా, సూరన్న స్నేహితుడు ఒకాయిన నాటకం చూస్తూ, ఆ మాట నమ్మక,

స్నే - అల్లాంటావుగాని నీకేమోయ్ హాయిగానూ! నెలకి వంద జీతమాయిరీ! మెళ్ళోపూసలూ! తీపుతీసిందీ?

247

రామానందం, తనకోసం కుట్టిఉంచిన చొక్కా తొడుక్కుని తృప్తిపడక, పనివాడితో.

రా - నిరుడు, ఎక్కడున్నావోయ్?

ప - చెన్నాపట్నంలో సార్.

రా - అక్కడెక్కడ?

ప - "మోజస్” కంపెనీలోనండి.

రా - ఏంపని చేసేవాడవ్ అక్కడ?

ప - పోగేసేవాణ్ణండి.

రా - అందుకనే చొక్కా ఇట్టావుంది.

ప - అబ్బే, గారంటీగా కుడ్తే, ఏంటండీ అట్లా సెలవిస్తారు! తొడుక్కుచూడండి, ఇక వొదిలిపెట్టరు.

రా - అవును. నిన్ను వొదిలిపెట్టకుండా నీ చుట్టూ తిరగాలి.

248

వెంకట్రావుగారు గుమ్మం దిగేసరికి లింగమ్మగారు ఎదురుకాగా,

వెం - లింగమ్మా! వొచ్చావ్ ఎదురుగుండా! నా పని యీ పక్షానికి కాదు. ఎన్నింటికని ఏడవన్రా, భగవానుడా!

లిం - సరే. వొచ్చావ్, నా ప్రాణానికి, ఎదురుగుండా, ఒంటి బ్రాహ్మడివి! నా పని యీ మాసానికికాదు! నేను మాత్రం ఏడుచుకోడంలేదూ?

వెం - అల్లాయితే ఓ పనిచేస్తే మంచిదీ!

లిం - ఏమిటది?

వెం - ఇద్దరికీ ఏడుపే అయినప్పుడు కలిసి ఏడిస్తేనే నయం.

249

మనుమడు - బామ్మా! ఈజాతిబొమ్మ చూశావ్? అచ్చంగా బతికిఉన్నపిల్లాడే! ఆనాలట్టలేం.

బా - మరేరా అబ్బాయి. అయితే ఇవెల్లా సృష్టిస్తారొరీ?

మ - పోతపోస్తారట?

బా - సరేకాని, ఇది ఒక్కక్కటి ఏమాత్రం ?

మ - అయిదేసీ ఆరేసీనూ!

బా - అబ్బో. ఏం ధరా! నా చిన్నతనంలో పిల్లలు వాళ్ళంతట పుట్టుకురావడమేగాని, డబ్బోసి పిల్లల్ని సృష్టించడం అంటూలేదు.

250

ఉమాపతి - ఎమోయ్, కామేశా! రావుగారు రాజకీయంలో కృషి చేస్తున్నాడుగదా! ఇప్పటికి ఏం చేసినట్టూ?

కా - రాజకీయంలో ఎమిటయ్యా చేసేదీ! రాజకీయానికీ ఆడతనానికీ బోలెడు సంబంధం వుందీ!

ఉ - అదేమిటి, అల్లా అంటున్నావు?

కా - రాజకీయంలో, “అల్లానే” అని పలికితే “బహుశా” అన్నమాట. “బహుశా” అని అంటే “లేదుపో” అన్నమాట. ఉ - “లేదుపో” అని చెప్పేస్తే?

కా - రాజకీయమే కాదు. అవునా, ఇక ఆడతనంలో. “లేదుపో” అని చెప్పేస్తే "బహుశా” అన్నమాట, “బహుశా” అని అంటే “అల్లానే” అన్నమాట. “అల్లానే” అని పలికితే ఆడతనమేకాదు. అందుకని వీటికి చచ్చినంత సంబంధం.

ఉ - నువ్వు చెప్పిందాన్ని బట్టి ఈ రెండింటికీ ఏమీ సంబంధం లేదని తేలింది.

కా - ఎవేనా రెండింటికి సంబంధం లేదని తేలినా, ఉందని తేలినట్టే!

ఉ- ఏం! ఎల్లా?

కా - ఆ రొండొంటినీ గురించి మాట్లాడ్డమే సంబంధంగా!

251

పంతులు, ప్రశ్నతప్పిన కుర్రాణ్ణి చూసి,

పం - ఉండు! రేపు తాడేపల్లిగూడెంసంత రానీ!

కు - ఎందుకండీ?

పం - కూడా నిన్ను తీసిగెళ్ళి నీకు ఓ జత పోతుల్ని కొనిమ్మని మీ నాన్నగారితో చెబుతాను.

కు - ఓటి చాలండి.

పం - ఏం?

కు - కూడా మీరుంటారుగాదండీ!

పం - కూడా ఉండేది మీ నాన్న, పైన నీ యిష్టం!

252

దూరపుచూపు ఆనని శోభనాద్రిగారు తన స్నేహితుడు బాలయ్యతో పిట్టల్ని కొట్టడానికి వెళ్ళి, ఒకచోట, నిలబడి ఉండగా,

బా - అదుగోనండోయ్, కొమ్మకి చిటారురొబ్బని! అడివి పావురాయి. కొట్టండి. కొట్టండి.

శో - సరే. అల్లానే. మాట్టాడకండి. అదికాస్తా ఎగిరి చక్కాపోగల్దు. కాని, అదిఉన్న వేపుకి చిన్నరాయి వెయ్యండి, నాకు బోధపడుతుందీ!

253

చాలామంది స్నేహితుల్లో కూచుని కామయ్య మాట్లాడుతూండగా సుందరం గబగబావచ్చి.

సు - ఏమిటండీ విశేషాలు?

కా - ఏమున్నాయి!

సు - ఏమిటి, వీళ్ళదగ్గిర ఊరిఖే కోతలు కోస్తున్నారు?

కా - రామరామా! ఏం లేదండీ! మీరు మంచివారని చెబుతున్నా.

254

కోటయ్య - మీ సుబ్రావ్ ఎక్కడున్నాడండీ, కోనేటిరావుగారూ?

కోనే - బందర్లో.

కోట - ఏం చదువుతున్నాడూ?

కోనే - ఇంటరుమేటు.

కోట - ఎక్కడా?

కోనే - హిందూ హైస్కూల్లోట.

255

ఒక మగపెళ్ళివారు, రాత్రి, బాజాలతో భోజనానికి బయల్దేరి, వెనుకాల ఆడంగులూ ముందు మొగంగులూ నడక నడుస్తూండగా, కాగడావాడు ఆడంగులదగ్గిరే ఆగిపోగా, మగవారిలో ఒకరైన

ప్రసాదరావు - ఒరేయి కాగడా! మాకు వెలుతురు లేదురా!

కా - వెనకాల ఆడంగులండి బాబూ!

ప్ర - సరే, ఏడిసినట్టేఉంది. ఇక్కడ మేం మాత్రం !

256

సన్యాసి - (ఇంటివారితో) పోనీ మీరన్నట్టు నేను కామమ్మ మొగుణ్ణి కాకపోతే నా కర్రాబుర్రా నాకు పారెయ్యండి! వెధవ గోలొచ్చిపడింది. వీళ్ళగోల మండిపోను.

ఒకస్త్రీ - ఏమిటి నాయనా! అన్నీ అయాయిరీ, ఇంకా పైపెచ్చు ఏముటోచికాకు పడతావు, ఏం రోగం? నీ చికాకు చిచ్చంటించా!

స - చికాకా చికాకున్నరా ! ప్రతీ ఊళ్ళోనూ ప్రతీకొంపలోనూ నాకు ఇల్లా అవుతూంటేను!

257

సుబ్బారాయుడు వనమయ్యగారికి ఉత్తరంరాసి పెడుతూండగా చిరంబరంగారు వచ్చి, చి - ఏముటోయ్ సుబ్బారాయుడూ! పెదిమిలు బిగపట్టావ్ కనుబొమ్మలు ముడెట్టావ్, కలం పట్టట్టావ్, సర్రుమనిపించేస్తున్నావ్, ఏమిటదీ?

సు - నీ కెందుకుపోవయ్యా! ఆయనేదో నాకాళ్ళుపట్టుగుంటే ఓ ఉత్తరం గోకిపెడుతున్నాను.

చి - అల్లా అయితే వనమయ్యా! నువ్వు వసుదేవుడంతటివాడవని ఇప్పటికి విశదం అయింది.

258

సుబ్బకవి - ఏమండీ లచ్చయ్యగారూ! ఈ మధ్య మీరు మెడ్రాసు వెళ్లి వొచ్చారటా!

ల - మరేనండి.

సు - వ్యవహారపు పని గావును.

ల - మరేనండి. కొన్నికృతులు చేశానుగా!

సు - ఆకృతులు అచ్చుకొట్టిద్దామనా?

ల - మరే.

సు - అయితే త్యాగరాయకృతులు చేసింది మీరేనా ఏమిటీ!

259

బేరగాడు - షాహుకారూ! తమలపాకులు మోదెల్లా!

షా - మూడణాలండి. ఏమాత్రం?

బే - వందెల్లా?

షా - ఏడుకాన్లు ఇవ్వండి.

బే - కానీకి ఏమాత్రం వస్తాయి?

షా - ఇంతేటండీ బేరం! పదీ!

బే - ఓ దమ్మిడీవి కట్టూ!

షా - కొన్నా వెల్లవయ్యా ! బే - కొనందే, ఎల్లా వెళ్ళడం?

షా - ఊరికే అడగరాదూ నాలుగూ!

బే - నీ యిష్టం, పోనీ అల్లా అయినాసరే.

260

సీనయ్యా బాపయ్యా కాలవగట్టున పళ్ళు తోముకుంటూ కూర్చున్న సమయంలో, ఒక యానాదిమనిషి, అచ్చంగా సీనయ్య అప్పుడు కప్పుగున్న శాలువలాంటి శాలువే కప్పుగుని గట్టంట పోతూండగా,

సీ - ఏమే అమ్మీ! ఎల్లాకొన్నావ్? శాలువ?

యా - రొండన్న రండి బాబూ!

సీ - చూశావోయ్, బాపయ్యా, ఆడ పీనుగుల తెలివి తక్కువా? అదీ ఇదీ సరిగ్గా ఒకటేగదా, ఇది నేను అయితే అయిందని రూపాయిన్న రెట్టి పట్టుగొచ్చాను.

యా - బాబూ, చిత్తగించండి, తెలివితక్కువ ఏ పీనుగులదో! నేను నా శాలువ వేలంలో పదణాలిచ్చి పుచ్చుగున్నానండి.

261

సీతన్న తన క్లాసుమేష్టర్ని ఇంటిదగ్గిర కలుసుగుని,

సీ - మేష్టారండి! రోజూ పొద్దున్నే రొండుఘంటల పాటు పుస్తకాలు వస్త్రకాళితంకింద నూకేస్తే చాలదండీ? గొప్పవాడవడానికీ ?

మే - గంటేచాలు, పట్టుదలగా చేస్తేసరి.

సీ - నాకు పట్టుదలా ఉందండీ!

మే - ఏమన్నా పాతపాఠాలు చూస్తున్నావా?

సీ - అవన్నీ ఒచ్చునండి, చూడ్డం అవసరం లేదు.

మే - కొత్తవి ఏమన్నా చూస్తున్నావా?

సీ - అవి తెలియవండి. చూడ్డం లాభంలేదు.

మే - పోనీ కొంత కొంత తెలిసేవి చూస్తూంటే?

సీ - అల్లాంటివి ఉండవండీ. చూడ్డం దండగా! పైగా తీరా చూసిం తరవాత పూర్తిగా తెలిసిపోతే!

262

తండ్రి - ప్రభా! ఇల్లా రా. బళ్ళోకి వెళ్ళేవచ్చావా?

ప్ర - ఆ. ఆఖరుగంట మా మేష్టరు లేకపోతే, నాలుగో క్లాసుని పొమ్మన్నారు.

తం - ఏమేం అయినాయి పాఠాలు!

ప్ర - “కాంపోషన్” అయింది నాన్నా.

తం - దేన్ని గురించి?

ప్ర - "రైల్లో మూడోక్లాసు ప్రయాణం” గురించి.

ఆ పళాన్ని మాక్లాసు పిల్లలంతా ఏకరాతే.

తం - నువ్వు?

ప్ర - ఒక్క ముక్కలో రాసిచ్చేశాను నాన్నా.

తం - ఏమనీ? ప్ర - “నేను రైలెక్కలేదు” అని రాసేశాను నాన్నా.

తం - ఇంకేమీ రాయలేదూ?

ప్ర - “మూడోక్లాసులో రొండేళ్ళు ప్రయాణం చేసితిని” అని కూడా రాశాను నాన్నా!

263

ఒక నాటకం ఆడుతూన్న సందర్భంలో,

భీముడు - (సహదేవుడితో) తమ్ముడా చూచెదవేమి?

సహదేవుడు - (ప్రాంప్టర్ని వినిపించుగోక) అన్నయ్యా చూచుటలేదూ!

ప్రాంప్టరు! (కోపంవచ్చి గట్టిగా) వినిమాత్రం ఏడిశావూ! ఇందాకణ్ణించి ఛస్తూంటేను!

స - (ప్రాంప్టరుతో) చీ! పేలకూ!

ప్రాం - ఊరుకో నా నామాట వినిపించుకోక నీ తాతల్లాంటి వాళ్ళు మారుపేరు పెట్టించుగున్నారూ!

264

శ్రీరాములు - ప్రయత్నించినా ఆనవాలు పట్టలేమోయ్. ఆ బ్రాహ్మణ

పుని స్త్రీలిద్దరికీ తేడా బొత్తిగా తెలియడంలేదు నాకు.

పిచ్చెయ్య - బ్రాహ్మణ కర్మ ధర్మానుసారం కొన్నాళ్ళకి తెలియచ్చు.

శ్రీ - అదా! ఎంత కర్కోటకుడవ్!

పి - మళ్ళీ కొన్నాళ్ళకి తెలియకపోవచ్చు

శ్రీ - మరే. అప్పుడు ముగ్గురుంటారు.

పి - ముగ్గురేమిటి?

శ్రీ - నువ్వోమరీ!

265

రుక్కమ్మ - బతికుండిమాత్రం నన్ను ఏం సుఖపెట్టి ఏడిశారండీ! చెప్పుగుంటే సిగ్గుగాని, సోమమ్మగారూ! రాత్రి ఒంటిగంటేసిం తరవాత ఇల్లు వెతుక్కుంటూ వచ్చేవారు.

సో - మరేనమ్మా. ఎవరెరగనిదిదీ! ఆయన ఎక్కడ అణగారిపోయారో అని మీకు ఊరికే దుద్దగాఉండి మీరు ఎంతో అంత ఇదయేవారు.

రు - ఇప్పుడు - నాగతి ఇల్లా కడుక్కుపోయిందన్న మాటగాని, ఆ దుద్దలేదు, సోమమ్మగారు, మీ ధర్మమా అంటూ!

266

పాలరాజు - విన్నారా శివయ్యగారు! నాయీడున మానాన్న సరిగ్గా నాకుమల్లేనే ఉండేవాడుట.

శి - ఎవరాఅన్నది?

పా - మా అమ్మ కనుక్కుంటే తెలిసిందిట.

శి - పోయినవాళ్ళని గురించి పోకిరీమాటలాడితే నీకొచ్చిన లాభం ఏమిటని ఎవడేనా నవ్విపోయేరుగనకా, నోరుమూసుగూరుకో ఈపాటి!

267

కామేశ్వరరావు - సత్తెన్నా! ఏమిటి విశేషాలు?

స - అన్నీ సశేషాలే. సూరన్న ఉత్తరం రాశాడు. కా - ఏమంటాడు?

స - మొన్న మా ముసలమ్మ ఆబ్దీకంట.

కా - అయితే!

స - నేను పెద్దవాణ్ణికాదూ! “నువ్వు అది అక్కడ పెట్టావా లేదా?” అని రాశాడు.

కా - నువ్వు పెట్టావా.

స - ఆ. “నువ్వుక్కడ పెట్టేసిఉండి తీరాలి లేకపోతే వీలు లేదంటుంన్నారు. గ్రహించవలెను.” అనికూడా రాశాడు సూరన్న.

268

ఒక పిల్లవాడితండ్రి ఒక మేష్టర్ని కలుసుగుని,

తం - మావాడు మీవద్ద చెప్పుగుంటున్నాడండి. -

మే - మీ ఇంటిపేరు.

తం - ఆదివారపువారు.

మే - ఒహో మందేశ్వరుడా! మీవాడు! సరే. ఏం? ఇప్పుడూ!

తం - వాడు బహు సుకుమారండి.

మే - అవును పాపం. చాలామంది పిల్లలూ అంతే.

తం - అందులో వీడు మరీనండి, తమరెరగరు. తమరు ఓ ముక్క చెప్పవలసిందేగాని ఏమీ ఇల్లా చెయ్యి వెయ్యాయిస్తుకాదండి వాడి వొంటిమీద!

మే - నిజమేమరీ! నేరం మీవాడిదై తప్పనిసరి వొచ్చినప్పుడు తప్ప.

తం - అప్పుడైనా అంతేనండి.

మే - ఏం? ఎల్లా?

తం - నేరం మావాడిదే అయినా, బళ్ళో ఇంకా ఇతర పిల్లకుంకలు ఉంటారు కాదూ, వాళ్ళల్లో ఒకణ్ణో ఇద్దర్నో పచ్చడి కింద దంచండి, దంచితే మావాడు హడిలిపోయి మళ్ళీ నేరం అన్నమాట చెయ్యడు.

269

హరిశ్చంద్రనాటకం జరుగుతూండగా, దేవయ్య కొంతసేపు జోగుతూ చూసి, ఉలిక్కిపడి పక్కకుర్చీ అయనతో,

దే - ఏమిండీ!

ప - అయ్య!

దే - ఆ పావురాయిలసీను ఇంకారాదేం? ఎగేశారాయేంటీళ్ళు!

ప - తొందర పడకండీ!

దే - తొందరేంటయ్యా! నువ్వూ ఆళ్ళబాపతో, లేకమోతే నీది ఫ్రీ టిక్కంటో

ప - ఉండవయ్యా! ఇందాకా వాటికోసం వెళ్ళిన కుంభకర్ణుణ్ణి రానిస్తావా?

దే - ఎప్పుడు? వొచ్చెల్లాడేం? సెప్పకుండా,

ప - మూడునిమిషాలైంది, వాడొచ్చినా మీకు మెణుకువ లేదు.

దే - అయితే సరే.

270

రావుజీగారి గాత్రపాట పూర్తి అయిన వెంటనే అనేకులు ఆయన్ని అభినందిస్తూండగా, ఒకశ్రోత - ఆహాహా! ఎన్నాళ్ళకి విన్నామండీ గానం! ఇల్లాంటిపాట ఇండియాలో లేదు. రా - మీ దయవల్ల గ్రామఫోనువాళ్ళు నాచుట్టూ తిరిగి తిరిగి పోతూంటారండి.

ఒ - ఏమాత్రం ఉన్నాయి తమరి రికార్డులు?

రా - రేటు కుదరక నేను ఇవ్వను పొమ్మన్నాను.

ఒ - ఎవ్వరూ అనుకోలేదు! చివరకి నాకూ తెలియదే!

రా - తెలియకపోవచ్చు. “నాకూ” అంటే ఏమిటి అక్కడికి మహా మీరు!

ఒ - నేనా! నేను ఇండియా మొత్తానికి గ్రామఫోను కంపెనీ ఏజెంటుని.

271

కొండయ్య - యాక్టరంటే రాజయ్యే యాక్టరు! రాజు మొదలు ఆఖరికి వెధవముండ వేషమైనాసరే ఒప్పిస్తాడు.

చేన్లు - మరేపాపం. అందులో, విశ్వప్రయత్నమూ చేసి సకలశ్రమా పడతాడు! పడాలికూడానూ!

కొం - వేషాలు వేసుకోడానికా నువ్వంటూంటా?

చే - మరే రాజులాంటి వేషాలు.

272

శాస్త్రిగారు జనాన్ని పోగుచేసి ఒక దొంగని తాచుపాముని పట్టినట్టు బరిమీద పట్టుగుని, కుళ్ళబొడిచి, వాడి కాలిగూడు సడలగొట్టి, వాణ్ణి సాగనంపుతూ,

శా - పశువా! బుద్ధితెచ్చుగు బతుకు! నడు!

దొ - (చచ్చిచెడిలేచి కుంటుంగుంటూ) మరినాకు నడిచే యేత్తులేదండీ!

273

పాలయ్య - బెజవాడ వెళ్ళొచ్చావురా శేషాచలం?

శే - ఆ.

పా - పని?

శే - పనే.

పా - బస?

శే - బంధువులున్నార్లే.

పా - ఎవర్రా!

శే - ఆ! నాకు ఇస్తారనుకోలేదూ!

పా - ఊఁ ఊఁ.

శే - ఆపిల్ల అత్తారు.

274

మెల్లకన్ను రత్నాకరం ఒక గొప్ప రాణివేషంలో ఉండి భర్తృవియోగం అభినయిస్తూ,

రాణి - (విచారంతో) నా నాధుని తిరిగి కాంచు భాగ్యము నాకబ్బునా! హా దైవమా! నాకన్నులెట్టి దౌర్భాగ్యపు కన్నులూ!

ఒక సభ్యుడు - మరే. అందులో ఓటి మెల్లకూడానూ!

ఒక కుర్చీదాసు - సైలెన్సు ప్లీజు!

సభ్యుడు - ఈమాటకి వెనకేసుగు రావడంకూడానా! బాగానే ఉంది గుడ్డిలో మెల్లకి తల్లకిందులు!

275

“ఇంటరుమీడియేట్” చదువుతూన్న మియ్యా తన విద్యాశాఖవాడే అయన కమలాకరాన్ని కలుసుగుని.

మి - కమ్లాకరం! నిన్న లెస్సన్సు హేమ్టీఅయిందీ?

క - ఏం? నువ్వురాలేదూ?

మి - లేదూఓయ్!

క - ఏమిటి కమామీషు!

మి - మాది సెల్లెల్ హీనింది.

క - అదేమిటోయ్, నీముండా మొయ్యా! అల్లా అంటే ఎవడేనా జున్ను తెమ్మంటాడు. ముఖ్యమైన అశ్లీలాలు ముందుగా నేర్చుగుని మరీమాట్టాడు, అన్యభాష!

276

మూర్తి - ఎంజెయ్యమన్నావ్, బ్రహ్మం! జీతం ప్రమోషన్కి పిటీషను పెట్టుగున్నాను, జవాబు లేదూ. నాలుగు రిమైండర్లు కొట్టాను. వాటికీఅంతే. నాకేనా సిగ్గు ఉండద్దూ? ఏం మొహం పెట్టుగుని అయిదో రిమైండరు పంపడం, అని చూస్తున్నాను.

బ్ర - కొత్త రిమైండర్లు ఇక తగిలించకు.

మూ - ఒక్కొక్క రిమైండర్కే మెల్లిగా రద్దుపిటీషన్లు జారవిడుస్తూండమంటావా!

బ్ర - మరే. అనుకున్నపని అవుతుందిగా! ఉదలు దండకం అందుకు

277

వర్మ - ఏమోయ్, శర్మా! నలుగురు కూలివాళ్ళనీ పంపించానుగదా సామగ్రి మొయ్యటానికి! మళ్ళీ అయిదోవాడికోసం కబురంపించా వెందుకూ!

శ - అయిదోవాణ్ణా?

వ - మరే.

శ - నిప్పుచ్చుగోడానికి.

వ - నిప్పెందుకూ?

శ - తట్ట తగలెయ్యడానికి.

278

చిట్టిబాబు - ఎమండి, రామయ్యగారు! భోజనం అయిందీ?

రా - ఏదో! అయింది.

చి - ఈవాళ కూరలేంజేశారు? మీయింట్లో?

రా - రోజూలాగే తినేశారు. మీయింట్లో?

చి - పారేశారు.

రా - దొడ్లోనా? ...ఒహో! నోట్లోనా!

279

దామోదరం - నిన్న నేనిచ్చిన నవల చివరదాకా చూశారూ?

శాస్త్రి - చూశా చూశా. ఎటొచ్చీ ఆడమనిషి రాసిందన్న మాటగాని, ఏముటుంది అందులో గొప్పా!

దా - మొదట్లో నేనూ అంతే అనుకున్నాను. కాని అథాత్తుగా అభిప్రాయం మార్చుగోవలిసొచ్చింది. శా - ఏం?

దా - అది కమిటీవారు ఒక పెద్దక్లాసుకి పఠనీయగ్రంథంగా నియమించారు.

శా - వారు ఏదో కొంత సారం కనబడితేగాని నియమించి ఉండరు. ఈమాటు తెలిసింది. ఆయితే, నీకెందుకూ ఈ గొడవా?

దా - నాకూ లాభం ఉంది.

శా - ఏమిటీ?

దా - ఇదివరలో నేను రొండు నవలలు రాస్తే వాటిమీద ఇల్లా కాకి వాల్లేదు. ఆపళంగా, కానున్నది కాకమానదని చెప్పేసి ఇది ఓ ఆడమనిషి పేరట అచ్చేయించాను.

శా - ఎవరావిడ?

దా - ఎక్కడా అనకండి, అలాంటి మనిషేలేదు!

280

ధర్మయ్య ఒక శాస్త్రుల్లుగారి ఇంటికి వచ్చి, చెప్పులు విడిచి దణ్ణమెట్టి కూర్చుని, చాతుల్లుగారూ ! మా అమ్మాయికి రాగిడీ సెయించాను. ఈయాల మంచిదేమో, సూడండి కాత్తంత, యెట్టుగోటానికి,

శా - ఈవేళ బుధవారం కాదూ?

ధ - చిత్తం,

శా - 'కుర్వీత బుధసోమయె?” అన్నాడు! మంచిదే,

281

ప్రైవేటుమేష్టారు - పుస్తకం చూడమ్మా, చూసి చదువు. ఇదిగో”

కుర్రాడు - “ఇదిగో”

ప్రై - “ఆవు”

కు - "ఆవుబొమ్మ.”

ప్రై - ఛీ, పుస్తకంలో ఉన్న అక్షరాలుచదువు. “ఇదిగో ఆవు”

కు - “ఇదిగో ఆవుబొమ్మ,”

ప్రై - కళ్ళుమూసుగు చదువుతాడూ! (అని కొట్టబోగా)

కు - (బిక్క మొహంతో) ఈ పుస్తకంలో ఉంటా ఆవాండీ!

282

ఒక ఉపన్యాసకుడు అన్యదేశం వెళ్ళి ఊరూరా లెక్చర్లు ఇస్తూ ఒకనాడు ఆదేశపు రాజుని కలుసుకోగా,

రాజు - వింటున్నాం! వింటున్నాం! తమరు అద్భుతంగా ఉపన్యసించడం!

ఉ - ఏదో. నాకేమి వచ్చునండి అసలూ?

రా - అయితే మీరు ఊర్నిబట్టి మాట్లాడతారా, లేకపోతే ప్రతీచోటా అవే పలుకులా?

ఉ - అవే.

రా - అల్లాయితే మీ లెక్చరు ఓ మాటు వినేసినవాడు రొండోమాటోస్తే చప్పగా ఉంటుందేమో!

ఉ - ఎంతమాత్రం ఉండదు.

రా - మీరెట్లా చెప్పగలరు?

ఉ - రొండోమాటు రాడు.

283

దొర - మిత్రమా ఏమిటి రాస్తున్నావ్?

స్నేహితుడు - ఒక వైద్యుడికి జవాబు.

దొ - ఏవిషయం ? చెప్పడానికి వీలుందా?

స్నే - ఆ. సంవత్సరం కిందట నేను మోకాలు నొప్పులన్నిటికీ “తారు” గొప్ప మందని పేపర్లో ప్రకటించాను.

దొ - అయితే?

స్నే - అప్పణ్ణించీ ఒక వైద్యుడు. ఆ నెప్పితోనూ నా మందుతోనూ సకల తంటాలూ పడుతున్నాట్ట, లాభం లేకుండా ఉందిట.

దొ - ఇప్పుడు జవాబేమనీ?

స్నే - నా మోకాలు కర్రమోకాలని రాయడం అప్పట్లో మరచిపోయాననీ!

284

గుర్నాథం - కల్యాణం! కలెక్టరు గొప్పా? ఇంజనీరా?

క - అనుమానం ఎందుకొచ్చింది ఆసలూ!

గు - సరే, కలెక్టరికి ఒకటే జిల్లా, ఇంజనీరుకి రెండూ.

క - సరే, అల్లాచూస్తే స్కూళ్ళ ఇనస్పెక్ట్రెసు మరీ గొప్పది.

గు- ఏం?

క - ఆవిడికి నాలుగూ!

285

లెక్చరరు - నువ్వు చెప్పే అర్థం ఈ మాటల్లో లేదు. అది షేక్స్పియరు అనుకున్న అర్థమూకాదు? అభిప్రాయమూ కాదు.

విద్యార్థి - ఏంజేస్తామండీ, క్షమించాలి. షేక్స్పియరు గొప్పవాడే. కానైతేం!

లె - కానయితేం? ఏమిటి?

వి - ఈ విషయంలో నేను షేక్స్పయరుతో ఏకీభవించను.

286

మేష్టరు - శంకరం! కూచున్నావేం? లేటుగా వచ్చిన వాళ్ళు నిలబడాలని తెలియదూ?

శం - తెలుసునండి.

మే - మరి?

శం - నేను లేటు కాదండి.

మే - "ఫస్టుబెల్” కొట్టేసిన తరవాత క్లాసులో అడుగెట్టి ఎందుకొచ్చిన అబద్ధం పట్టపగలు?

శం - అబద్దం లేదండి.

మే - ఏం?"

శ - ఈవాళ మొదటకొట్టింది “సెకండుబెల్” టండి. ప్యూను చెప్పాడు. ఇంకా "ఫస్టు” ది కొట్టాలిటండి.

287

సవ్వయ్య - ఏమోయ్, రామలింగం! నేను నీతో చెప్పిన కనకరత్నం సంబంధం మా అమ్మాయికి ఎల్లా ఉంటుందని నీ ఊహ? రా - కనకరత్న సంబంధం ఎల్లాఉంటుందని నువ్వు మళ్ళీ ఓకోన్కిస్కా హేని కనుక్కోవలిసిన పనేముంది పోదూ!

288

భద్రుడు - ఒక ఠావు తీసుగుని దానిమీద పంక్తికి అయిదారు అక్షరాలచొప్పున నాలుగైదు పంక్తులు రాసి మరోఠావు పుచ్చుగుని రాస్తుండగా స్వామిశాస్త్రి చూసి,

స్వా - ఏమిటి రాస్తున్నావ్, భద్రుడూ! మీ కుర్రాడి కాపీలకి ఒరవడా?

భ - కాదు మా మేనమామ కొడుక్కి ప్రైవేటు ఉత్తరం.

స్వా - ఈ ఉత్తరం ఒకటే మింగేటట్టుంది కొన్ని రీములు!

భ - ఏమో! సొమ్మంతా ఇల్లానే పోతోంది.

స్వా - లిపి అంతపెద్దపన్నాగా పుచ్చుగువ్నావేం!

భ - ఎంజెయ్యమన్నవ్? అవతల మా వాడికి బ్రహ్మ జెముడు, వీణ్ణి తగలెయ్యా, చచ్చిపోతున్నాను.

289

సూరన్న - వెంకన్నా! ఏం వారం ఈవేళా?

వెం - లక్షింవారం.

సూ - సుక్కురారంటగా!

వెం - ఎవరా అన్నదీ!

సూ - మా ముసలమ్మ,

వెం - ముసలమ్మలమాట ఎక్కడ నెగ్గుతుంది! ఇందాకా అయిన మీటింగులో ఇది ఓటుకిపెడితే, అధ్యక్షుడి చివరఓటుతో మెజారిటీ లక్షింవారం అనేశారు.

290

రాజు, లక్ష్మయ్య చేతులో గొడుగుచూసి,

రా - ఏరా లక్ష్మయ్య నీ గొడుగు పోయిందన్నావ్?

ల - అవున్రా కాలేజీలో గొడుగులు పెట్టుగునేచోట పెడితే ఎవడో మర్యాదగా తాంబూలం వేశాడు.

రా - మరి ఇదెవరిదీ? నీది కానటుంది?

ల - కాదు. కాకపోతేమాత్రం! ఎంజెయ్యనూ!


★ ★ ★