కార్తీక మహా పురాణము/పదవ రోజు

జ్ఞానసిద్ధ ఉవాచ

వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను రహస్యమైనవానిగా, అద్వితీయునిగా కీర్తింపబడేవాడా! సూర్యచంద్ర శివబ్రహ్మాదులచేత మహా రాజాధిరాజులచేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలూ కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణా! నువ్వు పరమం కంటే పరముడివి. నువ్వే సర్వాదికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచమూ కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమౌతోంది. సృష్టి ఆది, మధ్య, అంతాల్లో ప్రపంచమంతా నువ్వే నిండిఉంటావు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప చతుర్విధ రూపుదవూ యజ్ఞ స్వరూపుదవూ కూడా నువ్వే.

అమృతమయమూ, పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రంచేత ఈ సంసారం సమస్తమూ వెన్నెల్లో సముద్రంళా భాసిస్తోంది. హే ఆనందసాగరా! ఈశ్వరా! జ్ఞాన స్వరూపా! సమస్తానికీ ఆధారము, సకల పురానసారమూ కూడా నువ్వే. ఈ విశ్వం సమస్తమూ నీవల్లనే జనించి తిరిగి నీ యందే లయిస్తూ ఉండి. ప్రానులందరి హృదయాల్లో ఉండేవాడివి, మనోవాగ్రూప గోచరుడివి అయిన నువ్వు కేవలం భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రీ. ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారం. నీ ఈ దర్శనఫలంతో నన్ను ధన్యుని చేయి. దయతో నన్ను పాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడంవల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకతాల పాలవుతున్న నన్ను సముద్ధరించు.

హే శుద్ధచరితా! ముకుందా! త్రిలోకనాథా! అనంతా! ఆద్యుడా! పరమాత్మా! పరమహంసా! పూర్ణాత్మా! గుణాతీతా! గురూ! దయామయా విష్ణుమూర్తీ! నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దివాసీ! స్వర్గాపవర్గ ప్రదా! అభేదా! తెజోమయా! నీకిదే నమస్కారం. సృష్టి స్థితి లయకరా! వైకుంఠవాసా! బుద్ధిమంతులైన వారు భక్తి అనే పడవ సాయంతో సంసార సాగరాన్ని దాటి, నిన్ను చేరుతున్నారు.

ప్రహ్లాద, ధృవ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజెంద్రాది భక్తజనులను రక్షించిన నీ నామస్మరణ మాత్రంచేత సమస్త పాపాలూ నశించిపోతున్నాయి. ఓ కేశవా! నారాయణా! గోవిందా! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! వాసుదేవా! నీకు నమస్కారం. నన్ను రక్షించు.

ఇలా తెరిపి లేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ విష్ణుమూర్తి జ్ఞానసిద్దా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు.

హే జగన్నాథా! నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు.

శ్రీహరి తధాస్తు అని దీవించి ఇలా చెప్పసాగాడు.

జ్ఞానసిద్దా! నీ కోరిక నెరవేరుతుంది. కానీ, అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహా పాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెప్తాను, విను. సత్పురుషా! నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమినాడూ, లక్ష్మీసమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీకశుద్ధ ద్వాదశినాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలూ ఎవరైతే వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవూ నీ సహవ్రతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణ చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైనవారు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్తాత్రయం ఏదీ ఉండదు. నేను వానికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్రామిషతో జగన్నాటకరంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నువ్వు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాల్లో పఠించేవారు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు ఇలా చెప్పి, ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై ఆషాఢ శుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు.

అంగీరస ఉవాచ

ఓయీ! నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. పాపులు కూడా హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతులవారందరూ కూడా తరించితీరతారు. ఈ వ్రతాన్ని చేయనివారు గోహత్యా ఫలితాన్ని, కోటిజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవారు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని, చివర్లో విష్ణులోకాన్ని పొందుతారు.

జనకుని కోరికపై వశిష్టుడు ఇంకా ఇలా చెప్పసాగాడు

ఓ రాజా! ఈ కార్తీక మహత్యం గురించి అత్రి, అగస్త్య మునుల నడుమ జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకరోజు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభ సంభవా! లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాధను వినిపిస్తాను, విను. వేదాలతో సమానమైన శాస్త్రం గానీ, ఆరోగ్యానికి తగిన ఆనందం కానీ, హరికి సాటివచ్చే దైవంగానీ, కార్తీకమాసంతో సమానమైన నెల కానీ లేవు. కార్తీక స్నాన, దీపదానాలు, విష్ణు అర్చనల వల్ల సమస్త వాంఛలూ సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోదన ప్రతిష్టాన సంపత్తులను పొందగల్గుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెప్తాను.

పురంజయోపాఖ్యానం

త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనే రాజు అయోధ్యణు పాలించేవాడు. సర్వ శాస్త్రకోవిదుడు, ధర్మజ్ఞుడు, అయిన ఆ రాజు ఐశ్వర్యం అధికమవడంతో అహంకరించి, బ్రాహ్మణద్వేషి, దేవ బ్రాహ్మణ పీడితుడు, సత్య విహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడయ్యాడు. ఇలా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేకమంది ఏకమై చతురంగబలాలతో వచ్చి అయోధ్యణు చుట్టి ముట్టడించారు. ఈ వార్తా తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జండాతో అలంకరించబడింది, ధనుర్బాణాదిక అస్త్రశస్త్రాలతో సంపన్నమైంది, అనేక యుద్ధాల్లో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూన్చినది, తమ సూర్యవంశాన్వయమైంది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ అనే చతుర్బలాలతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.