కార్తీక మహా పురాణము/పదమూడవ రోజు

విష్ణు ఉవాచ

దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. దేశానికి రాజుగా గో, బ్రాహ్మణులను రక్షించడం తన కర్తవ్యమని, అందుకు విరుద్ధంగా విప్రుడైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి. కానీ, బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు.

దోషి అయిన బ్రాహ్మణుని వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు ధనహరణం లేదా వస్త్రహరణం స్థానభ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చనిపోయినా, ఇతరులతో చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తనవల్లనే ప్రాణాపాయాకరమైన సుదర్శన బాధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కనుక నువ్వు తక్షణం అంబరీషుని దగ్గరికి వెళ్ళు.. అప్పుడు మీ ఇద్దరికీ శుభం జరుగుతుంది.. అని విష్ణువు చెప్పగానే, దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కృతమైంది. భయపడుతున్న దూర్వాసుని, అతనిమీదికి రాబోతున్న సుదర్శనాన్ని చూసిన అంబరీషుడు చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శనచక్రమా! నన్ను మన్నించు. ఒక బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుస్సు చేపట్టి ఇలా చెప్పాడు.

ఓ విష్ణుచక్రమా! ఆగు.. ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రదానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే సిద్ధం. రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు. విష్ణుమూర్తి ఆయుధమైన నువ్వు, నాకు దైవస్వరూపానివే. కనుక నిన్ను ప్రార్ధించడంలో తప్పులేదు. అయినా కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్ధం నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీలేదని నాకు తెలుసు. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరి కొన్నాళ్ళపాటు శ్రీహరి హస్తాలతో బతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నెల కూలుస్తాను.. అని క్షాత్రధర్మపాలనకై తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్దారి అయి నిలబడిన అంబరీషుని చూసి అతని ధర్మనిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది.

అంబరీషా! నాతో యుద్ధం అంటే సంబరమనుకుంటున్నావా? మహాబలమదమత్తులైన మధుకైటభుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్నీ అవలీలగా నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడదానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో అలాటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్త పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమే అని మర్చిపోకు. మహా తేజస్సంపన్నుడై న దూర్వాసుదే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు.. నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడూ బలవంతుడితో సంధి చేసుకోవాలే గానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కనుక ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోనిబీరాలకు పోయి, వృథాగా ప్రాణాలు పోగొట్టుకోకు

ఆ మాటలు విన్న అంబరీషుని కళ్ళు ఎరుపెక్కగా ఏమిటి, సుదర్శనా? ఎక్కువగా మాట్లాడుతున్నావు.. నా దైవం అయిన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గానీ లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలమీద, ఆవులమీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా ఇంకా నా క్రూర రాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలు వేశాడు.

అంబరీషుని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గానీ నీతో కయ్యానికి కాదు. నిన్ను పరీక్షించేందుకు అలా ప్రసంగించాను కానీ, విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుని వదిలేస్తున్నాను అని అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు.

అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు.

సంతోషించిన సుదర్శనుడు, అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి అదృశ్యమయ్యాడు.

కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని చదివినా, విన్నా అనేక భోగభాగ్యాలు అనుభవించి, తుదకు ఉత్తమగతులు పొందుతారు.