కవి జీవితములు/శ్రీకృష్ణదేవరాయలు

శ్రీరస్తు.

కవిజీవితములు.

ప్రౌఢప్రబంధకవులచరిత్రము.

19.

తుళువవంశము

శ్రీకృష్ణదేవరాయలు.

(ఇపుడు వ్రాయఁబూనుకథ సంప్రదాయజ్ఞులచే వాడికొనఁబడు.)

ఈతండు చంద్రవంశ సంజాతుం డగునరసింహరాయనికుమారుండు. ఆనెగొందె యనియు, [1] విజయనగర మనియుఁ బలుకంబడు తుంగభద్రా తీరంబున నున్నపట్టణం బీతనిరాజధాని. ఈతనికి నాంధ్రభోజుం డనుప్రసిద్ధి గలదు. ఆంధ్రభాష సంపూర్ణంబుగ నీతని కాలంబుననే వృద్ధిబొందెను. ప్రబంధరచనం బీతనినాఁడే కలిగె. అందు మొదటి ప్రబంధం బగు మనుచరిత్రం బంధ్రకవితాపితామహుం డనంబరగిన యల్లసాని పెద్దనచే రచియింపఁబడియె. దాని కీతండు కృతినాయకుండు. ఈరా జెల్లపుడుఁ బండితజన గోష్టి నుండి వారితో విద్యావినోదంబులు సలుపుచుండు. వారిలో నాంధ్రకవనమున కెనమండ్రు ముఖ్యులు. వీరికే యష్టదిగ్గజంబు లని పేరు. అం దల్లసాని పెద్దన, పారిజాతాపహరణరచనాధురంధరుం డగునందితిమ్మన, పాండురంగవిజయ నిర్మాణకుఁ డగుతెనాలిరామకృష్ణకవి, నరసభూపాలీయనిర్మాణదక్షుం డగుభట్టుమూర్తియు, రామాభ్యుదయమును రచించినయయ్యలరాజు రామభద్రకవియు, కాళహస్తిమహాత్మ్యకర్త యగుకవిధూర్జటియును, ద్విపదకావ్య రచనాప్రవీణుం డగు తాళ్లపాకచిన్నన్నయును, రాఘవపాండవీయకళాపూర్ణోదయాదిగ్రంథకర్త యగు పింగళిసూరనయు నష్టదిగ్గజములు. అపరశంకరాచార్య నాముఁడు నశీతిగ్రంథకర్తయైన యప్పయదీక్షితులును, సంస్కృతమహాకవియు, సరసవచనరచనా నల్పకల్పనాచతురుండును ప్రతిభాసమన్వితుండును నగుతిమ్మరుసు మంత్రివర్యుండును, రాజగురుం డగుతాతాచార్యులును, గృష్ణదేవరాయ ప్రసిద్ధాస్థాన పండితు లని వాడుక గలదు. ఇందలి యాంధ్రకవులచే రచియింపంబడిన గ్రంథంబులలో మనుచరిత్రమును బారిజాతాపహరణమును, కవినామంబును, గృతిపతినామంబును, జగద్విఖ్యాతిం గాంచునట్లొనరించె. ఇంకను గొన్నిగ్రంథంబుల కీరాయండు కృతినాయకుండని విందుము. ఆగ్రంథంబు లిపుడు నామావశిష్టంబు లై మనకు లభ్యములు కాలేదు. కొండవీటి దండకవిలెలో నున్న వృత్తాంతమును పురుషార్థప్రదాయిని యీక్రింది విధంబుగఁ బ్రకటించెను.

"ఈకృష్ణదేవరాయలు పిన్నవయస్సులోనే సమస్తశాస్త్రములు నేర్చి అప్పాజీ లేక తిమ్మరుసు అను నాయనవద్ద రాజనీతి దండనీతి మొదలగు విద్యలు గ్రహించె. ఆయన జీవితకాలము యావత్తు ఆంధ్ర విద్యాభివృద్ధికొఱకు పాటుబడుచునుండువాఁడు. ఈయనయొక్క సభయందు అష్టదిగ్గజము లనునామముచేత నెనిమిదిమంది గొప్పపండితులు ప్రసిద్ధిం జెందిరి. అధ్టదిగ్గజముల పేళ్లును, వారిచే రచియింపఁబడినముఖ్య గ్రంథముల పేళ్లును నీక్రింద దెలియఁ జేయుచున్నాను.

కవీశ్వరులపేళ్లు. గ్రంథములపేళ్లు
1 అల్లసానిపెద్దన్న. ఈయన దూపాటి సీమలోని ద్రోణాదుల కాఁపురస్థుఁడు. ఈయనకు నాంధ్రకవితాపితామహుఁ డను పేరు గలదు 1. మనుచరిత్రము, 2. రామ స్తవరాజము, 3. అద్వైతము.
2 భట్టుమూర్తి ఈయన భట్టుపల్లె కాఁపురస్థుఁడు. 1. నరసభూపాలీయము, 2. వసుచరిత్రము.
3 ముక్కుతిమ్మన్న. ఈయన గన్నవరము కాఁపురస్థుఁడు. 1. పారిజాతాపహరణము.
4 పింగళిసూరన్న. రాఘవపాండవీయము.
5 తెనాలి కాఁపురస్థుఁ డగు తెనాలి రామలింగము. ఈయన యింటిపేరు ఈశ్వరప్రెగ్గడవారు. పాండురంగవిజయము. (పాండురంగమాహాత్మ్యము.)
6 సీడెడ్డు డిస్ట్రిక్టు కాఁపురస్థుఁడు రామభద్ర కవి. రామాభ్యుదయయ
7 శంకరకవి
8 ధూర్జటి
N. - B. ఈచివర నిద్దఱు కవులయొక్క కాఁపురస్థలమును వారు రచించినగ్రంథముల పేళ్లును తెలియదు. అల్లసానిపెద్దన మనుచరిత్రమును రచించి కృష్ణదేవరాయులకుఁ గృతియియ్యఁగా నట్టికావ్యము వెనుక రాయలవారు ఆముక్తమాల్యదను చేసిరి. ఇది గాక సకలకథాసారసంగ్రహము, రసమంజరి మొదలగు నేనేకగ్రంథములు రాయలవారు రచించిరి. అని యున్నది. పైదానిలో భట్టుమూర్తి వసుచరిత్ర రచియించినట్లు చెప్పితిని. శంకరకవి కృష్ణరాయల సంస్థానములోని వాఁడు కాఁ డని మాత్రము చెప్పవలసియున్నది.

కృష్ణరాయని జననవృత్తాంతము.

ఈ కృష్ణదేవరాయలజననంబున కొకకథ కలదు. దీని నిచటి సంప్రదాయజ్ఞు లందఱు వాడుకొనున ట్లీక్రింద వివరింతము. ఈతనితండ్రి యైనతెలుఁగుదేశపు నరసింహరాయఁడు త్రిలింగదేశంబున రాజ్యంబు సేయుచుండె. ఈతం డొకనాఁటిరాత్రి కాలోచిత కృత్యంబులు నివర్తింప బహిర్దేశంబునకుం జనియుండ నంతరిక్షంబునుండి యొక్క రిక్క మిక్కిలి తేజంబుతో నాతని యుదకస్థాలింబడియె. దానిం జూచి యా రాజు తనచేత నాపాత్రంబు మూసి యనతిదూరంబున నున్న నిజభటుం బిలిచి యోరీ అప్పనికి (తిమ్మరుసునకు) ఈవార్త దెల్పుము అనుడు నాభృత్యుండు వేగిరంబ చని దాని నెఱిఁగించిన నాతం డానీరుద్రావు మని రాజుతోఁ జెప్ప నుత్తరం బిచ్చె. వాఁ డావార్తను రాజునకుఁ దెలిపినతోడనే యాతండు తిమ్మరుసు నాజ్ఞానుసారంబుగాఁ గార్యం బు నడపె. అనంతరము తిమ్మరుసు రాజుకడ కేతెంచి యాతని నారాత్రి స్వీయతో సుఖంబుగ నుండుమని తెల్పె. రాజును తిమ్మరుసు మాటలయెడం గౌరవ ముంచి యంతిపురికిం జని పట్టపుదేవిం బిలువంబంచిన నాపె కారణాంతరముచే రాలేదయ్యె. దాని కెంతయు వగచుచు నాపెచెలికత్తెలలో నొక్కజవరాలిం గూడి యాదినంబు సుఖంబుగ నుండె. తోడనే యాయింతి గర్భంబు దాల్చె. నవమాసంబులు నిండినయనంతర మాయింతి యొక శుభముహూర్తంబున దేవకి కృష్ణునిం గన్నట్లు తాఁ గృష్ణరాయనిఁ గనియె. ఆవార్త విని నరసింహరాయండు విశేషోత్సవంబు సేయించె.పుత్రుని జూచి యాతని తేజోధికతకుఁ దండ్రి యెంతయు సంతసిల్లె. అప్పటి నుండియు నీతని నతి ప్రేమచేతఁ కాపాడుచుండె. అప్పు డీ నరసింహరాయనికి బీజనగరదేశ మంతయు స్వాధీనమయ్యె. దానిచేఁ గృష్ణరాయం డెంతయు నదృష్టవంతుం డని యాతండు మఱియుం బ్రేమాతిశయంబున నాదరింపుచుండె. రా జిట్లుండుటచే నోర్వలేక రాజభార్య లతనిం జంపయత్నంబు లొనరించి యాతనిఁ జంపఁబంపిరి. అపుడు తిమ్మరుసు కృష్ణరాయనియెడ మిగుల నెన రుంచి యాతనిఁ దనమందిరంబునకుఁ గొని తెచ్చి యచ్చటఁ జిరకాల ముంచి సంరంక్షించె. కృష్ణరాయ లిలువెడలు సమయంబున నెనిమిదితొమ్మిది సంవత్సరములవాఁడు. ఈతనికిఁ దిమ్మరుసు జాగరూకుండై విద్యాబుద్ధుల నేర్పుచుండె. ఇట్టిసమయంబునఁ దిమ్మరుసును అప్పా అని యీరాయండు పిల్చుటం జేసి యీతనికి నప్సరుసను నామాంతరంబు గల్గె.

నరసింహరాయనికి స్వీయాసంభవు లగుకొడుకులు గలరు. నరసింహరాయనికి శరీరంబున జాడ్యంబు సంప్రాప్తమై అది క్రమక్రమంబుగ హెచ్చినపుడు జీవితేచ్చ వదలి నరసింహరాయండు తనపుత్త్రులఁ బిలిచి వారిలో ధైర్యసాహసంబులు గలవానికి రాజ్యం బిచ్చెదఁగాక యని నిశ్చయించి తనచే నున్న భద్రముద్రికం జూపి యోపుత్త్రులారా నాదేహంబు జాడ్యంబున నుబ్బియున్న యది. కావున నీయుంగరం బే యుపాయంబుచేతను రాకుండ నున్న యది. దీని నెట్లైనఁ దీసికొన సమర్థుం డగువానికి నారాజ్యం బిచ్చెద ననుడు వారు గ్రమంబునఁ జనుదెంచి దానిం దీయ ననేకవిధంబుల యత్నించి వేసరి సేయునదిలేక యూరకుండిరి. అపుడు నారసింహుండు తిమ్మరుసుం జూచి కృష్ణరాయం డుండిన నిపు డెంత మేలై యుండు నాతని దుర్మార్గులు చంపించి రనుడు తిమ్మరుసు సెలవేని కృష్ణరాయనిం దెచ్చెద నని తెల్పిన సంతసించి యాతనిఁబిలువనంపి కౌఁగలించుకొని కృష్ణా ! ఉంగరము దీసికొ మ్మనుడు మొల నున్నకత్తిచే నాతని వ్రేలు దునిమి రాయం డాయుంగరముఁ గైకొనియె నరసింహరాయం డాతని సాహసంబునకు మెచ్చి తనసామంతమంత్రివరుల కాతనిం జూపి తనయనంతరంబున నాతనినే రాజుగ నియమించి పట్టముం గట్టుఁ డని తాఁ బరమపదప్రాప్తుం డయ్యె. అనంతర మామంత్రివరులు రాజాజ్ఞానుసారంబుగ నతనికిఁ బట్టాభిషేకం బొనరించిరి. అని యుండుకథయంతయును కల్పిత మయినట్లు నిది యేమఱియొకరాజుకథయో యీతని కతుకంబడినట్లునుతోఁచెడిని. శూద్రస్త్రీసంభవుఁ డనుకథ ప్రౌఢదేవరాయని దని వెలమలచారిత్రము వలనం గాన్పించెడిని. నరపతు లగువిజయనగర రాజుల చారిత్రములోఁ బ్రౌఢదేవరాయవృత్తాంతములోఁ జూడనగును. కొండవీటిదండకవిలెలో నీపైవృత్తాంతము కొంచెము విపులముగా నున్నట్లును దానిసంగ్రహమును తాఁ బ్రచురించుచున్నట్లుగాఁ బురుషార్థప్రదాయిని అనుపత్త్రికలోఁ గొన్నిసంగతు లొకపాంథునివలనఁ బ్రకటింపఁబడియెను. అదెట్లన్నను :-

కృష్ణదేవరాయలజన్మకర్మము.

"రాచవేమనతో రెడ్లప్రభుత్వ మంతరించిన దని యి దివఱలోఁ దెలియఁజేసియుంటిని. రాచవేమనగారు ఆపుత్త్రవంతుఁ డగుటంజేసి కొండవీటిరాజ్యమంతయు వేమనయొక్క డెబ్బదియిద్దఱు పాలెగాం డ్రు అపహరించ యత్నము చేసిరి. గాని జనబాహుళ్యముచేత నొకరిమాట యొకరికిఁ గాక, సుమారు నలువది సంవత్సరంబులవఱకు ఒకరితో నొకరు కలహించుచుండిరి. ఇంతలో శా. శ. 1351 సంవత్సరములో నుత్కలదేశాధీశు లగుగజపతివారు ప్రబలులై విస్తరించి బలమును గూర్చుకొని కొండపల్లి మొదలగు దుర్గముల నాక్రమించి, కొండపల్లిలో మకాము జేసిరి. ఇట్లుండ తుంగభద్రాతీరస్థం బగువిజయనగరపురా జగుకృష్ణదేవరాయలు ఆంధ్రదేశమంతయు నాహుతి వేసికొనుటకు యత్నించెను."

కృష్ణదేవరాయలజన్మకథాప్రశంస.

"విజయనగరపురాజులలో [2] పదియాఱవవాఁ డగువీరనృసింహరాయలు చిరకాలము పుత్త్రులు లేక ఖేదపడుచుండఁగా నొకనాఁ డొక విప్రశ్రేష్ఠుఁ డేతెంచి రాజా ! నే నేర్పఱిచిన ముహూర్తకాల మందు నీవు నీభార్యతోఁ గూడినచోఁ దప్పకుండ నీకు పుత్త్రుఁడు కలుగును అని చెప్పెను. అందుల కారాజు సంతసించి ముహూర్త కాలమునకు సిద్ధముగా నుండునటుల నిజపత్ని యగు తిప్పాంబకు వర్తమానము పంపెను. "చీరె సింగారించువఱకు పట్నము కొల్లబోయెను." అను లోకమువాడుక నిక్కము గాఁ దిప్పాంబగారు దిద్దుకొని తీర్చుకొని రాజు సమ్ముఖమున కేతెంచువఱకు ముహూర్తకాలము మించిపోయెను. ఈమధ్యకాలములో రాజుగారి పడకటింటిలో దీపాలు బాగు చేసెడి నాగి యను నొకదాసి ముహూర్తకాలమునకు హాజరు గా నుండఁగ రాజు దానితో రమించెను. తత్క్షణమే నాగికి గర్భోత్పత్తి ఆయెను. నవమాసపూర్తి యైనతర్వాత దివ్యతేజస్సు కలిగినశిశువును గనెను. ఈశిశువునకు కృష్ణదేవరాయలు అనునామ మేర్పడెను."

కృష్ణదేవరాయలు రాజ్యభారము వహించినవిధము.

"పూర్వము వక్కాణించిన నాగి యనునది గర్భవతి యైన కొం తకాలమునకు పిదప పట్టమహిషి యగుతిప్పాంబకూడ గర్భముదాల్చి మొగశిశువును గనెను, ఈశిశువునకు నృసింహరాయ లనునామ మేర్పడెను. నాగు యనుదానికి రాజుగారితో స్నేహ మగుటం జేసి నాగమాంబ యనుపేరు వచ్చెను. తిప్పాంబకుమారుఁడును నాగమాంబ కుమారుఁడును వయస్సులో సమానులైనను, రూపలావణ్యముల యందును, విద్యావిసయములయందును, ధైర్య స్థైర్యములయందును, దాసీపుత్త్రుఁడు రాణిపుత్త్రునికంటె నూఱురెట్లతిశయించియుండెను" అని యున్నది. ఈరెండుకథల నమ్మినను నమ్మకున్నను వేఱుచరిత్ర లేదు.

కృష్ణరాయని పూర్వుల వృత్తాంతము.

దీనింగూర్చి పారిజాతాపహరణ, మనుచరిత్రములలోఁ గొంత కానుపించును. మఱికొంత "కొంగదేశ రాజకాల్" అను వచనగ్రంథములోపలను గానుపించును. ఇందులో మొదటిరెండుగ్రంథములును గృష్ణరాయాస్థాన విద్వాంసులవలన రచియింపబడెఁ గావున విశ్వసనీయములు. మూఁడవ గ్రంథము గవర్నమెంటు Oriental M. S. S. లైబ్రేరీలో, నూఱుసంవత్సరములక్రిందటఁ జేరియుండిన దైనను కృష్ణరాయలకాలీనులవలన రచియింపఁబడక అటుపిమ్మటఁ గొన్నిశతాబ్దము లైన యనంతర మొరునచే రచియింపంబడుటచేత విశేషవిశ్వసనీయము కాదు. ఎట్లున్నను చారిత్రములలోఁ జేరి నిల్చియున్న గ్రంథమగుటం జేసి దానినిగూడఁ జేర్చుకొని యితరగ్రంథసహాయమున నందులో భేదించునట్టి యంశముల వివరించి చెప్పెదను. కృష్ణరాయని పూర్వులవంశము చంద్రవంశ మైనట్లును, తుళువ యను పౌరుషనామంబు గలది అయినట్లు నీక్రింది పద్యమువలనం గాన్పించును.

చంద్రవంశములో నొకపురుషుఁడు.

"క. అతనికి యదుతుర్వనులను, సుతు లుద్భవమంది రహితసూదనులు బలా
     న్వితమతులు వారిలో వి, శ్రుతికీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై.

గీ. వానివంశంబు తుళువాన్వ వాయమయ్యె, నందుఁబెక్కండ్రునృపులుదయంబునంది
    నిఖిలభువనప్రపూర్ణనిర్ణిద్రకీర్తి, నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి."
                                                                              మనుచరిత్రము.

ఇట్టివారిలో మొదటివాఁడు తిమ్మరాజు. ఇతనింగూర్చినకథ పారిజాతాపహరణములోమాత్రము చెప్పఁబడలేదుగాని మనుచరిత్రము లో నతని విశేషములు వ్రాయఁబడినవి. ఎట్లన్నను :-

"మహాస్రగ్ధర. ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి శఠకమఠగ్రావసంఘాతవాతా
                శనరాడాశాందంతితస్థవిరకిరులజంఝాటము ల్మాన్పి యిమ్మే
                దిని దోర్దండైకపీఠిం దిరముపఱచి కీర్తిద్యుతుల్ రోదసిం బ
                ర్వ నరాతుల్ నమ్రులై పార్శ్వముల నిలువ తీవ్రప్రతాపంబు సూ పెన్.

క. వితరణఖని యాతిమ్మ, క్షితిపగ్రామణికి దేవకీదేవికి సం
    చితమూర్తి యీశ్వరప్రభుఁ, డతిపుణ్యుఁడు పుట్టె సజ్జనావనపరుఁ డై."

ఈ ఈశ్వరరాజుంగూర్చి పైరెండు గ్రంథములలోఁగూడ వివరింపఁబడియున్నది. అందు పారిజాతాపహరణములో

"ఉ. రాజులనెత్తుటం బరశురాముఁడు వ్రంతలు చేసె రెండుమూఁ
      డీజగతిం గణింప నది యెంతటి విస్మయ మబ్జినీసుహృ
      త్తేజుఁడు కందుకూరికడఁ దిమ్మయయీశ్వరుచే జనించె ఘో
      రాజి బెడందకోట యవ నాశ్వికరక్తనదీసహస్రముల్."

అనుదానివలన నీయీశ్వరరాజు కందుకూరి సమీపములో బెడఁదకోట తురుష్కులం జయించె నని మాత్రము చెప్పంబడినది. మనచరిత్రములో నీతనివిజయవిశేషములు చెప్పంబడకపోయిన ననేకులగు రాజులవలనఁ గప్పంబులు మొదలగునవి గ్రహింపఁబడినట్లును, శత్రుజయము చేసినట్లుగా రెండుపద్యములు చెప్పఁబడినవి. ఎట్లన్నను :-

"చ. బలమదమత్తదుష్టపురభంజనుఁ డై పరిపాలితార్యుఁ డై
      యిలపయిఁ దొంటియీశ్వరుఁడె యీశ్వరుఁ డై జనియింప రూప ఱెన్
      జలరుహ నేత్రలం దొఱఁగి శైలవనంబుల భీతచిత్తులై
      మెలగెడుశత్రుభూవరుల మేనులఁ దాల్చినమన్మథాంకముల్.

సీ. నిజభుజాశ్రితధారుణీవజ్రకవచంబు, దుష్టభుజం గాహితుండికుండు
    వనజేక్షణామనోదనపశ్తతో హరుం, డరిహంససంసదభ్రాగమంబు

    మార్గణగణపిక మధుమాసదివసంబు, గుణరత్న రోహణక్షోణిధరము
    బాంధవసందోహపద్మవనీహేళి, కారుణ్యరసనిన్ను గాక శత్రుఁ

తే. డన జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె, ధరణిథవదత్తవివిధోపదావిధాస
    మార్జితశ్రీవినిర్జిత నిర్జరాల, యేశ్వరుఁడు తిమ్మభూపతి యీశ్వరుండు."

నరసింహరాజు.

పై ఈశ్వరరాజు కుమారులు నరసింహరాజు, తిమ్మరాజు. నరసింహరాజు వృత్తాంతము పై రెండు గ్రంథములలోనే కాక 'కొంగదేశరాజకాల్‌' అను గ్రంథములోను, 'విజయనగర రాజులచరిత్రము' అనుదానిలోఁగూడ నున్నది. కావున మొదట మనుచరిత్రములో నున్న దానిం దెల్పెదము.

"క. ఆయీశ్వరనృపతికిఁ బు, ణ్యాయతమతి యైనబుక్కమాంబకుఁ దేజ
     స్తోయజహితు లుదయించిరి, ధీయుతు లగునారసింహ తిమ్మనరేంద్రుల్."

ఇట్లు చెప్పి యనంతరము నరసింగ రాజు విశేషములు మాత్రము కొన్ని వివరింపఁబడినవి. ఇటులనే పారిజాతాపహరణములోఁగూడ నీశ్వర రాజు కుమారుల యిర్వురపేరులును వివరింపఁబడినవి. [3]అందుఁగూఁడ నరసింగరాయని వృత్తాంతమే వివరింపఁబడెనుగాని తిమ్మరాజుంగూర్చిన విశేషములు వివరింపఁబడవాయెను. కావున మన మిపుడు నరసింగ రాయనివిశేషములే వ్రాయవలసియున్నది. ఇఁక తిమ్మరాజునుగూర్చి చెప్పవలసినవృత్తాంత మొకటి యున్నది. అందులో ఈతిమ్మరాజే కృష్ణదేవరాయనిప్రసిద్ధమంత్రి యగుతిమ్మరు సని కొందఱూహించుచున్నారు. అది సరియైనది కానట్లు కొన్నిగ్రంథదృష్టాంతము లుండుటంబట్టి ఆసంవాదము మఱియొకస్థలములోఁ జూడఁదగు నని చెప్పి ప్రస్తుతము నరసింగరాయనికథలోనికి దిగెదను. కో. రా. లో 47 "నరసింగరాయపట్టము" ఇతఁ డుద్దండుఁ డనుమంత్రితోఁగూడి తెన్గుదేశము రక్షించుచు అందుమీఁద కర్ణాటకదేశములో నున్న పాలెగాండ్రు కప్పమీయకున్న వారితో యుద్ధము చేసి జయించి, మళయాల, కేరళములలో విజయరాజుతో బహుయుద్ధము చేసి జయించి, అతనివలన ననేకద్రవ్యముం దీసుకొని పాండ్యరాజుతో స్నేహముచేసి, చోళద్రవిడదేశములలోఁ గప్పము తీసుకొని అక్కడనుండి యుత్తరదేశములకుం బోయి కళింగ, బంగాళ దేశరాజుల జయించి, అనేక తురుష్కులం జయించి గజపతిరాజుం జంపి, గంగరాజును జయించి వచ్చిన ఆమంత్రికి "విజయోద్దండేంద్రుఁ"డని బిరు దిచ్చెను. ఈనరసింగరాయనికి రాజాధిరాజు రొందరలేశ్వర మహారాయ లని పేరు పెట్టిరి." అని యున్నది. ఇట్టిచారిత్రవిశేషము లితరగ్రంథసహాయము లేనిది సిద్ధాంతములుగా నెంచఁబడఁగూడదు. కావున పైమనుచరిత్ర పారిజాతాపహరణములలో నుండు కొన్నిపద్యములంబట్టి కొంత నిర్ణయింతము. అందు మనుచరిత్రములో నరసింహరాజుయొక్క ప్రతాపము విశేషముగ వర్ణింపఁబడియెంగాని, యేయేస్థలములలో నేయేప్రతాపముఁ జూపెనో వ్రాయంబడి యుండ లేదు. ఇఁకఁ బారిజాతాపహరణములో :-

"సీ. ఎవ్వనివిజయంబు లెఱిగించుశాసన, స్తంభంబు లాశాంతశైలవితతు
      లెవ్వానియరిగాపు లేపారుకాళింగ, యవనాదివిదిధదేశాధినాథు
      లెవ్వానినిత్యదానైకవిలాసంబు, లారూఢతరతులాపూరుషంబు
      లెవ్వానిచిరగీర్తి యింద్రలోకాంగనా, భోగినీగీతికాభోగపదము

తే. వాఁడు వొగడొందు సర్వసర్వంసహాధి, దేవతాముఖదర్పణద్విజయనగర
    భద్రసింహాసనస్థుఁ డున్నిద్రతేజుఁ, డీశ్వరాధిపునరసభూమీశ్వరుండు.

సీ. కుంతలేశ్వరుఁడు పిక్కువడంగ విద్యాపు, రంబు గైకొని నిజప్రౌఢి నెఱ పెఁ
    బారసీకునకు దుర్భరమానసత్వంబుఁ, దొలఁగించె మానవదుర్గసీమఁ
    జోళవల్లభునకు సురవధూమధురాధ, రము లిచ్చి మధురాపురంబుఁ గొనియె
    శ్రీరంగపట్టణసీమ ఖడ్గనటీవి, నోదంబు యావనేంద్రునకుఁ జూపె

తే. నతఁడు నుతికెక్కె రామసేత్వఁతరాళ, కలితషోడశదానవిఖ్యాతయశుఁడు
    మండలీకరమేఘమార్తాండబిరుదుఁ, డీశ్వరాధిపునరసపృథ్వీశ్వరుండు.'

ఇ ట్లుండుటంబట్టి యీనరసింహరాజు చారిత్రాంశములు కొన్ని స్పష్టమగుచున్నవి. అవి యెట్లనఁగా :-

1. దిగ్విజయము చేసి శాసన స్తంభంబులు నిలిపెను.

2. కళింగ రాజు, యవనరాజు మొదలగువారిచేఁ బన్నులు గొనుచుండెను.

3. విజయనగరసింహాసనాధ్యక్షుఁడు.

4. కుంతలేశ్వరుం జయించి విద్యాపురము (Beejapore) ను స్వాధీనమును చేసికొనియెను.

5. పారసీకునకు (తురుష్క రాజపర్యాయముకానోపు) మానవదుర్గ సీమలో బ్రాణహానిం జేసెను.

6. చోళ రాజును సంహరించి మధురాపురముం గైకొనెను.

7. శ్రీరంగపట్టణ సీమయం దుండుయావనేంద్రునితో యుద్ధముచేసెను.

8. మండలీకర మేఘమార్తాండ బిరుదు గలవాఁడు.

ఈ యెన్మిది యంశములును నప్రమాణములు. వీనితోఁ బ్రతిఘటించని పైచారిత్రాంశములను విశ్వసించుట కభ్యంతర ముండదు. విజయనగర రాజచరిత్రములో నీరాజుంగూర్చి యీక్రిందివిధముగా నున్నది. అందులో నృసింహదేవరాయనివఱకును వ్రాయంబడినచరిత్రము బీజనగరరా జగు బుక్క రాజుచరిత్ర మై యున్నది. ఆచారిత్రకుని కందుఁ గలభేదములు పరిశీలనలోనికి రానికారణమున నారెండుకథలును గలిపి వానిని నరసింహరాయనిపూర్వుల కథలుగా వివరించె ననియుఁ జెప్పవలసియున్నది. అట్టిభేదమును బీజనగర రాజచారిత్రములోఁ జూపఁదలంచి ప్రస్తుతము నరసింగరాయనింగూర్చి వ్రాసిన కథాభాగము మాత్ర మిచ్చట వివరించెదను. ఎట్లన్నను :-

"ఆబుక్క దేవరాయనికి నరసింహుఁ డనుకుమారుఁడు పుట్టెను. నృసింహదేవరాయలు విజయనగరమందు రాజ్యపరిపాలన చేయుచుఁ దమదండ్రి యేప్రకార మాజ్ఞాపించెనో ఆప్రకారము దేవబ్రాహ్మణులయందు భక్తి నుంచి అనేకు లగుబ్రాహ్మణులకు ననేకాగ్రహారములు తామ్రశాసన పత్త్రికలపై వ్రాసి యిచ్చి తండ్రికంటె నుత్త ముఁ డని ప్రజలవలనఁ గొనియాడఁబడుచు బహుదినములు విజయనగరమున నుండి కొన్నిదినములకు సకలదేశములం జయించి, సకల కిరీటాధిపతులచేతను మ్రొక్కులు తీసుకొనుటకు దిగ్విజయార్థము తరలి దక్షిణ సముద్ర పర్యంతము నుండు సకలదేశములం గొట్టి తద్దేశాధిపతులను దనయాజ్ఞానువర్తులుగాఁ జేసికొని, యాయాదేశములకుఁ దగినట్లుగా నర్థముం గూర్చుకొని కొంత విజయనగరమునకుం బంపి కొంత దనతోఁ బట్టించుకొని అక్కడనుండి రామేశ్వరమునకుఁ బోయి ఆ దేశములం దర్థము కట్టుకొని, అక్కడ సర్వాగ్రహారము లిచ్చి అటులనే సకలపుణ్యక్షేత్రములలో ధర్మముల నడిపెను. అటు తరువాత చోళ, పాండ్య, కేరళ, దేశపురాజులను, మధురదేశపుప్రభువును మ్లేచ్ఛప్రభువులం జయించి, అది మొదలు గంగాతీరముదాఁక సకలదేశములం జయించి శ్రీరంగమునకు వచ్చి చేరెను. అక్కడఁ జోళదేశమునకుఁ గేవలము కావేరినదియొక్క యుదకము ప్రవహించిన ఫలాదిక్య మగు నని యెంచి, వేయికాల్వలఁ ద్రవ్వించి, అవి శాశ్వతము లగుటకుఁ గాను పంచలోహములతోఁ గట్టలు వేయించి, వేలూరునకుఁ బోయి యచ్చోఁ దమసంస్థానము శ్రీరంగమునకుఁ గాంచీపురమునకును సమీపముగా నుండవలె నని యెంచి ఆవేలూరునకుఁ గోట కట్టించి అందులో దివ్యభవనంబులు గట్టించి అక్కడ దక్షిణదేశములకు తఖ్తు (సింహాసనము) నేర్పఱిచి, కొన్నిదినము లచ్చటఁ బ్రభుత్వము చేసి, పిమ్మట మఱికొన్నిదినములకు వేలూరున కుత్తరముగ నుండుచంద్రగిరియందు శత్రుభయము లేక యుండును గావునఁ దాను సంపాదించినద్రవ్య మచ్చట నుండుట మంచిదని యెంచి, దానికిం గోటఁ గట్టించి, తాము నివసించుటకు మహళ్లు గట్టించి అందుఁ దా సంపాదించిన ద్రవ్య ముంచి ఆస్థలమును భద్రపఱిచి తిరుగ విజయనగరమునకు నరసింగరాయఁ డు వచ్చి చేరెను. ఇట్లు చేరిన రాయఁడు తనపెద్దకుమారు డగు వీర నరసింహదేవరాయనికిఁ బట్టాభిషేకము చేసి, కృష్ణరాయనిం బిలిచి వీర నరసింహదేవరాయనిచేత నొప్పగించి సకలకార్యములలో నీకృష్ణరాయనిఁ గూడ నుంచుకొని వ్యవహారము చేయుటచేఁ గీర్తిప్రతిష్టలు రాఁగల వని బోధించి లోకాంతరము నందెను. అని యున్నది. ఇందులోఁ బైకథలకు విరోధించనిభాగము నమ్మవచ్చును.

నరసింహరాయని భార్యలు పుత్త్రులు.

పైగ్రంథములోను "కొంగదేశరాజకాల్" అనుగ్రంథములోఁగూడ నరసింహదేవరాయని యాలుబిడ్డలఁ గూర్చి వివరింపఁబడియున్నది. అందులోని పైగ్రంథములో "తిప్పాంబ యను భార్య యందు వీరనృసింహేంద్రుఁడు అనుకుమారుఁడు పుట్టెను. నాగులాంబ అను భార్యయందుఁ గృష్ణరాయఁడు పుట్టెను. ఓబాంబయనుభార్యయందు రంగదేవరాయలు, అచ్యుతదేవరాయలు అను నిర్వురుపుత్త్రులు పుట్టిరి. వారు నల్గురును బహుధర్మాత్ములై శౌర్యాదిగుణములు గలవారలై యుండిరి." అని యున్నది. ఇటులనే కొంగదేశరాజకాల్, అను గ్రంథములోఁగూడ నున్నది. వీనింబట్టి చూడఁగ నరసింగరాయనికి మువ్వురు భార్యలు, నల్వురు కొడుకులు నున్నట్లుగాఁ గానుపించుచున్నది. ఈరెండు గ్రంథములలోఁ గృష్ణరాయలు కృతులందినపారిజాతాపహరణ, మనుచరిత్రగ్రంథములును, కృష్ణరాయకృత మగునాముక్తమాల్యదయు నేకీభవింపవు. ఎట్లన్నను :-

"క. ఆనరసమహీమహిళా, జానికిఁ గులసతులు పుణ్యచరితులు తిప్పాం
      భానాగాంబిక లిరువురు, దానవదమనునకు రమయు ధరయును బోలెన్." పారి.

      పుత్త్రులవిషయమై

"శ. వారలలోఁ దిప్పాంబకు, మారుఁడు పరిపంథికంధిమంథాచలమై
     వీరనరసింహరాయఁడు, వారాశిపరీతభూమివలయం బేలెన్." పారి.

"తే. అనృసింహప్రభుండు తిప్పాంబవలన, నాగమాంబికవలన నందనులఁ గాంచె
      వీరనరసింహరాయ భూవిభుని నచ్యు, తాంశసంభవుఁ గృష్ణరాయక్షితీంద్రు." మను.

ఇ ట్లీపై రెండుగ్రంథములలో నొక్కతీరుగనే చెప్పి యుండుటం బట్టి వీనిలోఁ జెప్పంబడినవారే నరసింహరాయని పత్నీ పుత్త్రులు గాని పైకొంగదేశపురాజకాలులోఁ జెప్పినవిధమునఁ గాదు. కావున నరసింహరాయనికి నిర్వురు భార్య లనియు, నా యిర్వురివలన నిర్వురు కుమారులు గల్గి రని సిద్ధాంతము చేసెదను. అయితే పైన చెప్పంబడిన యోబాంబికకుఁ గల్గి రనిన రంగరాయ అచ్యుతరాయు లెవ్వరికుమారు లనుదాని నాలోచించవలసియున్నది. దానికి గ్రంథ దృష్టాంతము లగుపడువఱకు సరియైన సమాధానము రానేరదు, నరసింగరాయనామము గలకుమారుఁడు పైనరసింగరాయనికే యున్నాఁడు. అతఁడు వీరనరసింగరాయఁ డని పైగ్రంథత్రయమందును గానుపించుచున్నది. కావున నీయిర్వురు పుత్త్రు లావీరనరసింగరాయని కుమారులుగా భావించెదను. [4]

ఇఁక నరసింగరాయనిమృతి యెప్పుడో వ్రాయవలసియున్నది. అందువిషయమై కొ. రా. లులో శా. శ. 1401 అగుశార్వరి (A. D. 1478) గా వివరింపఁబడినది. విజయనగర రాజుల శాసనములలో క్రీ. శ. 1471 లో నొకశాసనమును, 1487 లో నొకశాసనమును నరసింగరాయని శాసనములు కానుపించుచున్నవి. ప్రిన్‌సెపుదొరశాసనములలో క్రీ. శ. 1490 లో వీరనరసింహరాయనిశాసనము కానుపించును. 1490 సంవత్సరములోఁ గాన్పించిన శాసనము వీరనరసింహరాయని దవుటచేత నాతనితండ్రి 1487 వఱకు నున్నట్లును, వీరనరసింహరాయఁడు తదనంతరము రాజ్యమునకు వచ్చె ననియు నూహింపనై యున్నది. క్రీ. శ. 1487 - 77 = శా. స. 1410 అగును.

వీరనరసింగరాయఁడు.

ఇతనిం గూర్చియు కొంగదేశరాజకాల్ కొంతచరిత్రము చెప్పుచున్నది. అది యెట్లనఁగా :- "శార్వరిసంవత్సరములో నితనికిఁ బట్టాభిషేక మాయెను. ఇతఁడు తండ్రివలెననేకదేశములలోఁగప్పము గొనియెను. ద్రావిడ పాండ్యచోళ దేశములవారు కొంతద్రవ్యమిచ్చి ఇతని స్నేహము చేసుకొనిరి. కర్ణాటదేశము కొంకణదేశము, ఉమ్మత్తూరు, తలకాడు మొదలయిన గళ్లలోనున్నపాలెగాండ్రు కప్పము పంపకపోయినందున వీరనరసింగరాయఁడు కోపించి అనేక సేనలం జేర్చుకొని తనకు తమ్ముఁ డైనకృష్ణరాయలను విజయనగరములోనుంచి తాను అచ్యుతరాయ, శ్రీరంగరాయలును, మఱికొందఱు రాకొమరులు ప్రయాణమై పోయి ఉమ్మత్తూరు సమీపములో దండుదిగి, తమకు పూర్వమిచ్చెడువ న్నిచ్చినచో రాజ్యములో నుంచెదమనియు, లేకున్నఁ గోటలగ్గలఁ బట్టెదమనియుఁ జెప్పిపంపెను. దానికి మాఱుగా నుమ్మత్తూరిరాజు యీక్రిందివిధంబుగఁ జెప్పినంపె. ఎట్లన్నను :- "మేమీదేశమును బహుదినములుగాఁ బాలించుచున్నాము, మావంశములో నుండువారుగాని కొంకణవర్మరాజులుగాని యీదేశమును పరిపాలించిరి. వారెవ్వరికిని కప్పమిచ్చెడునాచారములేదు. అట్లుండ మీతండ్రి నరసింగరాయఁడు బలము కల్గియుండుటవలన జయించి కప్పము దీసికొనియెను. గాని అట్లు తీసుకొనుటకు న్యాయములేదు. కావున మేము కప్పము గట్టము." అట్టిసమాచారమునకు వీరనరసింగరాయఁడు కోపించి తమకుఁ బూర్వులగు హరిహర రాయఁడు మొదలగువారికిఁ గప్పముకట్టి తనకుఁ గట్టనని చెప్పుట అక్రమమని యూహించి ఉమ్మత్తూరుకోట ముట్టడించెను. అట్లుగా మూఁడుమాసములు ముట్టడి వదలక యుండినను దానిని లక్ష్య పెట్టక ఉమ్మత్తూరురాజు కోట శత్రులకు స్వాధీనము కాకుండ కాపాడి శత్రువులను విశేషముగాఁ దూలించెను. అపుడు వీరనరసింగ రాయఁడా కోటను పట్టుకొనలేక దండును మఱల్చుకొని శ్రీరంగపట్టణమునకు వచ్చి అక్కడి కోటను ముట్టడించెను. అయితే ఆకోటలోని ప్రభుఁడు పెద్దనరసింగరాయనివలన పట్టముగట్టఁబడిన జీవగ్రాహ్యునికొడుకైయుండెను. అతఁడు తనకోటను గట్టిచేసుకొని ఉమ్మత్తూరు, తలకాడు పాలెగాండ్రకు వర్తమానముచేసి, వారిసేనాసహాయమునంది, కోటవెలుపలికి వచ్చి వీరనరసింగరాయనిసేనలలోఁ జొరఁబడి విశేషయుద్ధముచేసి యోడించిన వీరనరసింగరాయఁడు కొంతనష్టముతో విజయనగరమునకు వచ్చి చేరెను. ఇట్లుచేరి తనతమ్ముఁ డగుకృష్ణరాయని విశేష సేనలను ధనమును తీసుకొని ఉమ్మత్తూరు శ్రీరంగపట్టణముల జయించుటకై పంపెను. మఱికొన్నిదినములకు అనఁగా శా. స. 1425 అగు రుధిరోద్గారి సంవత్సరములో మరణమునొందెను." అనియున్నది. అయితే క్రీ. శ. 1487 మొదలు 1507 వఱకు నీవీరనరసింగరాయల శాసనములు కానుపించుటం జేసి యితఁ డంతవఱకు ననఁగా 20 సంవత్సఱములు రాజ్యముచేసినట్లు చెప్పవలసియున్నది. అది శా. స. 1430 సంవత్సరము కావలసియున్నది. కాని 1425 కాదు. ఇఁక విజయనగరమునుగుఱించినకథ యనుగ్రంథములో వీరనరసింగరాయల అధికారముంగూర్చి యీక్రిందివిధంబునం జెప్పంబడియున్నది. అందు :-

"ఆనరసింహ దేవరాయనికి పెద్దకుమారుఁ డైనవీరనృసింహదేవరాయల కతఁడు పట్టాభిషేకముంజేసి కృష్ణరాయలం బిలిచి వీరనృసింహదేవరాయని చేతికి నొప్పగించి ఈకృష్ణరాయని కూడ నుంచుకొని నీవు సకల కార్యములు నడిపింపుము. అట్లైన నీకుకీర్తి ప్రతిష్ఠలు రాఁగలవు. అనిచెప్పఁగా నరసింహ దేవరాయలును కొన్నిదినములు కృష్ణరాయని దగ్గఱ నుంచుకొని రాజ్యవ్యవహారము చేయుచువచ్చెను. ఇట్లుండఁగా వీరనృసింహరాయఁడు బాలుఁడౌటచేతను, వ్యవహార దక్షత తక్కువయై యుండుటచేతనుఁ ఇతనితండ్రి రాజ్యకాలములో పన్ని చ్చుచువచ్చినరాజూ లీతనికి పన్ని చ్చుట మానివేసిరి.

ఇట్లుండ వీరనరసింహరాయఁడు తనతమ్ముఁ డగుకృష్ణరాయని బిలిచి యిట్లనియె. మనదేశమునందుండు రాజు లిదివఱకు భృత్యులై యుండి కప్పములం గట్టుచుండిరి. ఇపుడు మనము పిన్నల మవుటచేత లక్ష్యము చేయక వీరనరసింగరాయఁడు శూరుఁడని భయమున పన్నిచ్చినారము గాని యీపిల్ల వాండ్రకుంగూడ పన్ని చ్చెదమా అని చెప్పి శఠించినారు. కావున సర్నసేనావృతులమై మనలో నొక్కఁడు శత్రువులంజయించుటకు వారిదేశములకుం బోవలయును. కావున నీరాజధానిని గనిపెట్టికొని నీ వుండుము. నేను బోయి శత్రువులం జయించి వచ్చెద నని పలికెను. అపుడు కృష్ణరాయలు లేచి అంజలిబంధముం జేసి యిట్లనియె. నే నుండఁగ మీరు దండయాత్రకుఁ బోనేల ? యోఁచించవలయును. నేను పోయి శత్రులం జయించి కప్పములం గట్టించుకొని వచ్చెదను. అన వీరనృసింహదేవరాయలు కృష్ణరాయనితో నిట్లనియె. నీవు చిన్నవాఁడవు. పదియాఱు సంవత్సరములే నీకైనవి. ఇట్టి నీవు యుద్ధములకుం బోఁగూడదు. నీవు కోటం గనిపెట్టియుంట మంచి దని చెప్పగాఁ గృష్ణరాయం డందులకు సమ్మతింపక తానే యుద్ధయాత్రకై తరలెను." అనియున్నది. ఇది పైకథతోఁ గొంత భేదించును. అయినను విరుద్ధము కాదు.

వీరనరసింహరాయనికి రాజాధిరాజ రాజపరమేశ్వర ప్రౌఢప్రతాప మహారాయ లనుబిరుదు లున్నట్లుగాఁ గొంగదేశరాజకాల్ చెప్పును. ఇతని రాజ్యవిశేషములు మనుచరిత్రాదులలో నసాధారణములుగా వర్ణించఁబడినవి. ఎట్లన్నను :-

"క. వీరనృసింహుఁడు నిజభుజ, దారుణకరవాలపరుషధారాహతవీ
     రారి యగుచు నేకాతప, వారణముగ నేలెధర నవారణమహిమన్."

       ఇఁక పారిజాతాపహరణములో.

"క. వారలలోఁ దిప్పాంబకు, మారుఁడు పరిపంథికంధి మంథాచల మై
     వీరనరసింహరాయఁడు, వారాశిపరీతభూమివలయం బేలెన్."

ఈరెండు పద్యములలో వీరనరసింహ రాయని విక్రమము మాత్రమే చెప్పఁబడెంగావున నతఁ డట్టివాఁడని చెప్పవచ్చునుకాని ఇతని నాఁడు వీరిరాజ్యమునకు విశేషదేశములు కలియ లే దని మాత్రము చెప్పవలసియున్నది.

కృష్ణరాయనివృత్తాంతము.

దీనింగూర్చి కొం. రా. లో నిట్లున్నది. "ఇతఁడు విజయనగరములో నవరత్న సింహావనాధిరోహణము శా. స. 1426 అగు నేఁటి రక్తాక్షి సంవత్సర చైత్రమాసములోఁ బట్టాభిషేకము అయినపిమ్మట చేసెను." అని యున్నది. శాసనములలో గ్రీ. శ. 1509 - 77 = శా. స. 1432 మొదలు కృష్ణదేవరాయ లధికారము చేసినట్లు కానుపించును. వీరనరసింహరాయని శాసనము శా. స. 1430 వఱకు నుండుటచేత నతనిమరణమునకును కృష్ణరాయని పట్టాభిషేకమునకును వ్యవధి యుండక పోవుటచేతను ఆకాలము పైరెండు శాసనముల మధ్యకాల మై యుండును. అందు విశేష భేదము లేదు గనుక దానిని క్రీ. డ. 1507 - 77 = శా. స. 1430 గా నిర్ణయించెదను. ఇది విభవ సంవత్సరమని కర్ణాటరాజుల కాలనిర్ణయ పట్టికలో నున్నది. వీరనరసింహ రాయని యనంతరమే కృష్ణరాయ లధికారి యయినందులకు పైపద్య కావ్యములు నుపబృంహణము చేయుచున్నవి. అందు పారిజాతాపహరణములో

"శా. వీరశ్రీనరసింహశౌరిపిదప న్విశ్వక్షమామండలీ
       ధౌరంధర్యమునన్ జనంబు ముదమందన్ నాగమాంబాసుతుం
       డారూఢోన్నతిఁగృష్ణరాయఁడు విభుండై రాజ్యసింహాసనం
       బారోహించె విరోధులున్ గగన శైలారోహముం జేయఁగన్."

"క. అవిభుననంతరంబు ధ, రావలయముఁ దాల్చెఁ గృష్ణరాయఁడు చిన్నా
     దేవియు శుభమతి తిరుమల, దేవియునుం దనకుఁగూర్చుదేవేరులుగాన్." మను.

కృ. రాయనిధర్మపత్నులు.

వీరిపేరులు చిన్నాదేవియు తిరుమలదేవియు నని పైమనుచరిత్ర పద్యములలోఁ గాన్పించుచున్నది. పారిజాతాపహరణములోఁ గృతిముఖంబున నీయంశము వివరింపఁబడలేదుకాని ద్వితీయా శ్వాసములో "తిరుమలదేవీవల్లభ" అనియును, తృతీయాశ్వాసములో

"క. శ్రీవేంకటగిరివల్లభ, సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ
     జీవితనాయక కవితా, ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా."

అని యున్నది. వీని యనంతర కృతి యగునాముక్తమాల్యదలో మాత్రము కృష్ణరాయనిభార్యలు, తిరుమలదేవి, అన్నపూర్ణాదేవి అని చెప్పంబడి యుండెను. ఎట్లన్నను :-

"క. అవిభుననంతరంబ ధ, రావలయముఁ బూని తీవు రహిమైఁ దిరుమ
     ల్దేవియును నన్నపూర్ణా, దేవియుఁ గమలాబ్జముఖులు దేవేరులు గాన్."

అని యున్నది. విశాఖపట్టణమండలములోఁ జేరిన సింహాచల క్షేత్రము సేవింపఁబోయి పొట్నూరుకడఁ బాతించిన స్తంభముమీఁదఁ జెక్కించిన శాసనముంబట్టి యితని భార్యలపేరులు చిన్నాదేవీ తిరుమలదేవులుగాఁ గాన్పించెడిని. అన్న పూర్ణనామము చిన్నాదేవియొక్క నామాంతరముగా నూహించుట నిర్వివాదాంశమగును. దీనింగూర్చి

కృష్ణరాయరాజ్యవిశేషములు.

"కొంగదేశరాజకాల్" లోను, విజయనగర రాజచరిత్రములోను, గొండవీటి దండకవిలెలోఁ గొంత వివరింపఁబడి యున్నది. కృష్ణరాయ, తత్పండితజన రచిత గ్రంథములలో సూత్రప్రాయముగ నావృత్తాంతములే వివరింపఁబడినవి. కావున ముందుగా పైగ్రంథములలో నేమి వ్రాయఁబడినదో చూపి అనంతరము పద్యకావ్యములవృత్తాంతము న్వివరించెదను. అందు " కొంగదేశరాజకాల్" అను గ్రంథములో "కృష్ణరాయఁడు పట్టాభిషేకము చేసుకొని తనతమ్ముఁడు అచ్యుతరాయఁడు, రంగరాయఁడు వీరలతోడను, తనమంత్రితోను రాజ్యముచేయుచు విజయనగరము కోట లెస్సగాఁ గట్టించి, పెనుగొండ, చంద్రగిరి మొదలగు కోటలు వెట్టించి, అనేకసేనల జేర్చి యితరదేశములం జయించుటకుఁ గోరి ద్రావిడదేశమునకుఁ బోయి అక్కడ కాంచి, సెంజి, వేలూరు మొదలగు గడీలను వశముచేసుకొని, వేలూరుకోట బహుభద్రపఱిచి దానిలో తనసేనలను రాజకుమారుల నుంచి రాజ్యపాలనము జేయు చుండెను. అపుడు కర్ణాటకరాజులలో నుమ్మత్తూరు శివసముద్రముల వారిని వశము చేసుకొనవలె నని యత్నించెను. ఉమ్మత్తూరు స్వాధీనమాయెను. అపుడు శివసముద్రముకోటలో రాజ్యముచేయుచున్న త్యావరా

శివసముద్రముపై దండెత్తుట.

జు కాలధర్మము నందఁగా నతనికుమారుఁ డగు గంగరాయఁడు శివసముద్రము కోటలో నుండి ఆయుధములతోను సేనలతోను గోడను భద్రపఱిచెను. ఇతని తండ్రియే ఫిరంగులు మొదలయిన వానిం జేర్చి యుంచె. పైపాలెగాఁడును, మఱికొందఱును గృష్ణరాయని లక్ష్యము చేయక అతనితో యుద్ధము చేసి పరాజితుం జేసి రను కోపముతోఁ గృష్ణరాయలు చతురంగబలసమేతుఁడై ఫిరంగులు మొద లగునాయుధములతోను మఱి కొందఱు పాలెగాండ్రతోడను ప్రయాణమై పోయి కర్ణాటకదేశములో కావేరితీరమందున నుండు పశ్చిమరంగమునకుఁ దూర్పుగానున్న శివసముద్రముకోటను ముట్టడించి, ఆశివసముద్రపు పాలెనానికి శత్రువైన చిక్కరాయనిం జేర్చుకొనిమఱికొందఱు పాలెగాండ్రనుచేర్చుకొని ప్రేతపర్వతము, గౌరికొండ అనుస్థలములలో దండు దిగి యొక సంవత్సరముపైని ఒత్తినకనుమ కావేరిమార్గములో కోటను హల్లాచేసెను. అపుడాగంగయరాయఁడు గంగఁడు శుచి అను కావేరి మడుఁగులోఁ బడి పోయెను. అటుపిమ్మట కృష్ణరాయః డాకోటను స్వాధీనము చేసికొనెను" అనియున్నది. ఉమ్మత్తూరు శివసముద్రము లనుకోటలను గృష్ణరాయలు భేదించినవృత్తాంతము పారిజాతాపహరణములో రెండవ యాశ్వాసమున నీక్రిందివిధముగ వర్ణింపఁబడియె, ఎట్లన్నను :-

శా. సమ్మర్దక్షమధీనిబంధనవిధాసంక్రందనాచార్య ళూ
     రమ్మన్యాచలవజ్రపాతజగతీరక్షాంబుజాక్షా శర
     ధ్యమ్మార్గస్థదశాస్యరాజ్యసమసహ్యప్రోద్భవాతీరభా
     గుమ్మత్తూరి శివసముద్రపురనప్రోన్మూలనాడంబరా."

అని చెప్పఁబడియున్నది. "కొంగవంశపురాజకాల్" గ్రంథములోఁ బై రెండుకోటలును పట్టినపిమ్మటఁ గృష్ణరాయఁడు శ్రీరంగపట్టణమునకుఁ బోయి కాంబగౌడఁడు, వీరప్పగౌడఁడు అనువారి స్వాధీనములోఁ గొన్ని దేశములును, చిక్కరాయని వశములోఁ గొన్ని దేశములును విడిచి, ఆసమీప మందుండెడుమఱికొనీ పాళియంపట్టులు జయించి వానిం బరిపాలింప తగవరులనియమించి బేరీజుద్రవ్యము నేర్పాటుచేసి కర్ణాటదేశము కోటిద్రవ్యమునిచ్చుదానిఁగాఁ జేసెను. అట్టి కర్ణాటదేశమున కంతకు నధికారస్థానముగా నుండుటకుఁ దగిన శ్రీరంగపట్టణము దిట్టపఱిచి ప్రభవసంవత్సరములో మహాబిరుదు కలుగఁ జేసికొని దానియందుఁ గృ ష్ణరాయధ్వజ,శంఖ, చక్రములఁ గలధ్వజ మెత్తించెను అని యున్నది. అనంతరము కృష్ణరాయలు శ్రీరంగపట్టణము విడచి 1. కొడగు 2. మళయాళము 3. గౌడము మొదలుగాఁగల దేశములకుఁబోయి అచ్చటఁ గప్పముల నందుకొని పాండ్యచోళదేశముల స్వాధీనపఱుచుకొని అట నుండి విజయనగర పట్టణమునకు వచ్చి అచ్చట ననేక సేనలను, పాలెగాండ్రను, అనేకగోత్రములవారిని సిద్ధపఱిచి, మందుగుండుసామానులను, ఆయుధములను సన్నాహపఱుచుకొని యుత్తరదేశపు దండయాత్రకు బయలువెడలెను. ఇట్లు వెడలి కళింగదేశపు రాజును స్నేహితుంగా నొనరించి ఆతని వెంటఁ బెట్టుకొని పోయి హిందూదేశపుమార్గముగా ఘూర్జర మగధ దేశముల జయించి కప్పముం గైకొని అనేకులఁ దురుష్కులం జయించి తిరుగ విజయనగర పట్టణమునకు వచ్చి సింహాసనాధి రోహణముం జేసి, యదుకులోద్భవ రాజమార్తాండ రాజగంభీర మహారాజపూజిత కృష్ణరాయ మహారాయ లని హిమవత్సేతుపర్యంతము బహుకీర్తి నంది సదాశివరాయఁ డనుసేనానాయకునితోఁగూడ రాజ్యరక్షణముం జేయుచు ననేకధర్మముల నడిపెను. అనియును కొంగదేశరాజకాల్ లోనున్నది.

అయితే యీగ్రంథము పశ్చిమసముద్ర తీరవాసులచేత రచియింపఁబడియుండెఁగావున వారికిఁ గర్ణాటకదేశవృత్తాంతము లెస్సగఁ దెలిసి యుండవచ్చును. కాని కృ. రాయని యుత్తరదేశపు దండయాత్రయొక్క విశేషముల నిది విపులముగాఁ జెప్పఁజాల. కృ. రాయని ప్రతాపాదిక ముత్తరదేశమందె విశేషము గావున అట్టి విశేషములం దెల్పుటకు మఱికొన్ని గ్రంథములు చూపివాని న్వివరించెదను. అందు పురుషార్థప్రదాయినిలోని కొండవీటి దండకవిలెలో రెడ్లయొక్క డెబ్బదియి

కొండవీటిఖిల్లాను స్వాధీనముచేసికొనుట.

ద్దఱు పాలెగాండ్రస్థితిని తలఁప దలఁప రాయలవారికి నారాజ్యాధిపత్యము రావలయునని యత్యాశకలుగుచుండెను. ఈయనగారు తనమనో వేదనను తనయిష్టు లగుకొంతమందికిఁ దెలుపఁగా, స్వామీ మీకోరిక బూరుగవృక్షము వలెనే వున్నదని కొందఱును, అందని మ్రానిపండ్లకు అఱ్ఱుచాఁచుట యుక్తము కాదని కొందఱును, అయ్యా తాము జేయు నుద్యమము పిచ్చుకుంటొకఁ డొకగొప్పమ్రాను కొనయం దుండెడుతేనియ నపేక్షించి పొందఁ బూనుకొనునట్లున్నది. అని మఱికొందఱును ప్రత్యుత్తరములు చెప్పసాగిరి. ఐనను రాజు కొండవీటి సింహాసనమును నాక్రమించుకొనుటయందే యేకాగ్రచిత్తము కలవాఁడై యుండెను. ఒకనాఁ డీరాజు శకునము చూత మని విచారించి ఉపశ్రుతి దేవతను బిలచి, రజకుని గృహముమీఁద శకునానికి అక్షతలు జల్లెను. ఆరజకుఁడు తనలోఁ గాను "కొండవీడు మనదేనా ! కొండపల్లి మనదేనా ! కాదని యెవరు వాదమునకు వచ్చినా కటకందను కామనదేవా!" అని యొకపదముగా బాడెను. ఈవాక్యములు వినఁగా మాయావ్యక్తులయొక్క మంగళవాక్యములు వినినపుడు రాయలవారి మనమునందుఁ పట్టిన యాశ్చర్య సంభ మాతిశయములు పది రెట్లు హెచ్చుగా నుండెను. ఈరాయలు రజకుఁడు చెప్పిన మాటలన్నియు తనవద్ద నమ్మకముగాది దిరుగు చుండెడునొకబ్రాహ్మణునితోఁ జెప్పఁగా నతఁడు మనస్సునందు మితిలేని యుల్లాసముగలవాఁడై రాజుయొక్క యుద్దేశ్యమున కనుకూలముగాఁ గొన్నిమాటలను పలికెను, ఇంతియకాదు ఎట్టి పాపకృత్యము జేసియైనను తనరాజు మనోయభీష్టము తీర్చుట యుక్త మని యెంచి ప్ర్రాణహింసచేయుటవలన తనకుఁ గలుగఁబోవు పాపమునకు వెనుదీయక స్వామీ నాకు కావలసినద్రవ్యసహాయముం జేసితిరా డెబ్బదియిద్దఱుపాలెగాండ్రను హింసించి కొండవీటిసీమకు నిన్ను పట్టాభిషిక్తు'నిఁగా జేసెదను అని రాజుతో ధైర్యముగా నీవిప్రుండుపలికెను. అందుకు రాయలు ఆనందించి కావలసినద్రవ్యము బ్రాహ్మణున కిచ్చివేయుటకు ఖజాన్‌జీకి నుత్తర్వు చేసెను. అంత విప్రుఁడు కొండవీటికిఁ జని అచట మాయోపాయములచేత పాలెగాండ్రను మంచిమాట జేసికొని, ఒకగొప్పదేవాలయము కట్టించి అందు గోపీనాథస్వామి యను నొకశిలాప్రతిమను ప్రతిష్ఠచేసి, పాలెగాండ్రందఱిని యాదేవాలయమునకు రావించి అచ్చట కృతిమోపాయముచేత వారిని హతజీవితులనుగాఁ జేసెను. పిదప కృష్ణదేవరాయలు అత్యానందభరితుఁడై నిజబలసమేతంబుగాఁ గొండవీటి సీమ కేతెంచి, కొండవీడు, బెల్లముకొండ నాగార్జునకొండ, వినుగొండ దుర్గముల నాక్రమించుకొనెను. ఈయనగారు ఖిల్లాలో నుండుట కిష్టము లేక కొండక్రింద నొకకోట కట్టించి దానికిఁ గొండపల్లిగమిడి, నాదేళ్లగమిడి యనురెండుద్వారము లుంచి తగుసైన్యమును కాపుంచి పదునాల్గుసీమలు స్వాధీనము చేసికొనెను. ఈయన ప్రభుత్వకాలమునందు కైతేపల్లి యనుగ్రామము ఉదయగిరి సీమక్రిందను, పరుచూరు అద్దంకిసీమ క్రిందను, కేసానిపల్లె, యమ్మలమంద, మాదల, తొండపి, కోసూరు, జువ్వలకల్లు అను నాఱుగ్రామంబులు బెల్లముకొండ సీమక్రిందను ముసి యనునదికి దక్షిణమందున్న పాకాల, చింగనపల్లి, తుమ్మలపేట, కరేడు అను నాలుగు గ్రామములు కందుకూరు సీమక్రిందను చేర్చంబడెను. కొండవీటిసీమను మట్టుకు హవేలి యను నామముచే నిలిపి, వినుకొండ, బెల్లముకొండ నాగార్జునకొండ సీమలు మూఁటిని పరగణాలుగాఁ జేసి, శేషించిన పదిసీమలు కర్నాటకముక్రింద కలిపివేసిరి. రాయలవారు భూసురులకు ననేకగ్రామములను అగ్రహారములుగా నిచ్చినదేగాక, మున్నంగికి కొల్లిపరగ్రామమునకు మాచెర్ల వారు మహాంకాళి వార్లను మున్నంగికి కేతనభొట్లచారిని, ఈపనికి నగరంవారిని, అతుమూరికి శిష్ఠావారిని, తెనాలికి పిల్లలమఱ్ఱివారిని, సుద్దపల్లికి దంటువారిని పడమటి జొన్నలగడ్డకును పోతవరముకును పానలవారిని యజమాన పెత్తనదార్లనుగా నేర్పర్చెను. సీమలు యావత్తు కర్ణాటకముక్రింద చేరినవెనుక పూర్వమందు రెడ్లవలన యియ్యఁబడిన యగ్రహారములన్నియు నడువవేమో అనుభీతిచే అగ్రహారికులందఱు కృష్ణునివద్ద కేతెంచి ఆయనను మిక్కిలి కొనియాడి, తమమనోభావముల నెఱింగింఁచఁగా నేయ గ్రహారపు యజమానత్వము ఆయగ్రహారీకుల కే స్థిరపఱచఁబడెను. అందుమీఁద రాయదత్త యజమాన పెత్తన మని వ్యవహారము జరిగెను. కృష్ణదేవరాయలు కొండవీడుప్రభుత్వము చేయుకాలములో కొండపల్లి దుర్గము సంపాదించవలె నని యనేకసైన్యముతోఁ గొండపల్లికి దక్షిణముగా నున్న కొండగూటూరు (ఇపు డిభరాంపట్ణ మని వాడెదరు) అను గ్రామములో బ్రవేశించి అచ్చట శుకురాజు బాహుబలేంద్రుఁడు అను రాజులతోఁ బండ్రెండు సంవత్సరములవఱకుం బోరాడెను. గజపతుల నోడించి కొండపల్లి స్వాధీనపఱుచుకొనినట్లు కనుపించదు. అను మొదలగువృత్తాంతము లున్నవి. ఇందలి కథలలోఁ జివర నుండుశుక రాజు బాహుబలేంద్రులకథకు పద్య కావ్యములలో నాధారములు గాన్పించవు. కావున వీనికినిటనుండి పద్య కావ్యములోవివరించిన చారిత్రమును దానితో సంబంధించిన హాకీ ఖత్తులను వివరించెదను. ఇదివఱలోఁ జెప్పినవృత్తాంతము కొండవీడు దండకవిలెలోనిది. అది కేవలము విశ్వసనీయ మనుటకు వీలుపడదు. కావున మనుచరిత్రము పారిజాతాపహరణము, ఆముక్తమాల్యద వీనిలోఁ జెప్పంబడినప్రకారము కృష్ణరాయని విజయములం జెప్పి అతని రాజ్యకాలము అతనిరాజ్యవిస్తీర్ణతను నిర్ణ యించెదము గాక.

కృష్ణరాయల రాజ్యవిస్తీర్ణత కటకపుదేశముం జయించుట.

ఇఁకఁ గృష్ణరాయని కాలములో నీవిజయనగర రాజ్యమెంతవఱకు వ్యాపించియున్నదో దానిని తెలియవలయును దానికి పారిజాతాపహరణములోని పద్యము

"సీ. ఉదయాద్రి వేగ నత్యుద్ధతి సాధించె, వినుకొండ మాటమాత్రన హరించె
      కూటముల్ సెదరంగఁ గొండవీ డగలించె, బెల్లముకొండయచ్చెల్లఁ జెఱిచె
      వేలుపుకొండ నుద్వృత్తిభంగముజేసెఁ, జల్లిపల్లి సమగ్రశక్తిఁ గూల్చె
      కినుకమీఱ ననంతగిరి క్రిందుపడఁజేసెఁ, కంబము మెట్టు గ్రక్కనఁ గదల్చె"

అని యున్న పద్యముంబట్టి పారిజాతాపహరణ రచనకాలంబు నాఁటి కాకృష్ణరాయలు, 1 ఉదయగిరి, 2 వినుకొండ, 3 కొండవీడు, 4 బెల్లముకొండ, 5 వేలుపుకొండ, 6 జల్లిపల్లి, 7 అనంతగిరి, 8 కంబము మెట్టును జయించె. ఆనాఁటికి కటకము పై దండెత్తి వెళ్లవలె నని కృష్ణరాయల కభిప్రాయ మున్నట్లును, తనదేశముపైకి వచ్చునేమో నని ఆకటకాధివుం డగునుత్కలరాజు జడియుచున్నట్లును పైపద్యములోని యెత్తుగీతలవలనఁ గాన్పించును. ఎట్లన్నను :-

"గీ. బలనికాయంబు కాలుమట్టుల నడంచు, కటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
     డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు, రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుఁడు.

దీని యనంతర కాలమున రచియింపఁబడిన యాముక్తమాల్యదలో కృష్ణరాయ లుత్కలదేశముం జయించుటకుఁ బోవుచో మార్గమున జయించిన మఱికొన్ని రాజ్యములపేళ్లు చెప్పెను. దానివలన బెజవాడ మొదలు కటకమువఱ కున్న దేశములు కృష్ణరాయల స్వాధీన మైనట్లు కాన్పించు. ఆ పద్య మెద్దియన :-

"సీ. తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి తీండ్రించె, నసిలోహమునవెచ్చనై జనించె
      మఱి కొండవీ డెక్కి మార్కొని నలి యైన, యలక సవాపాత్రు నంటిరాఁజె
      నట సాగి జమ్మెలోయఁ బడి వేఁగి దహించి, కోన బిట్టేర్చి గొట్టానఁ దగిలెఁ
      గనకగిరిస్ఫూర్తి గఱచె గౌతమిఁ గ్రాఁచె, నవుల నాపొట్నూరు రవులుకొలిపె

తే. మాడెములు వేల్చె నొడ్డాది మసియొనర్చె, కటకపురిఁ గాల్చె గజరాజుకలఁగిపఱవ
    తోఁకచుజ్జన నౌర నీ దురవగాహ, ఖేలదుగ్రప్రతాపాగ్ని కృష్ణరాయ.
                                                                            ఆముక్తమాల్యద.

పైపద్యములో నుదాహరింపఁబడినవి :-

1. ఉదయాద్రి.
2. కొండవీడు.
3. వేఁగిదేశము, జమ్మెలోయ.
4. కోనసీమ.
5. కొఠాన (కొట్టాముతాలూకా.)

6. కనకగిరి రాజమహేంద్రవరము దగ్గఱ, హేమగిరి యని యొకగ్రామము దుర్గము నుగలవు. పైపేరు దానిపర్యాయ మై యుండ నోపు. నెల్లూరిజిల్లాలోని కనిగిరి దీని పర్యాయనామ మని కొందఱందురు.

7. గౌతమిఁ గ్రాఁచె ననుటచేత గౌతమీనదికి రాజమహేంద్రవరమునకు నుత్తరముగ నుండు రహితాపురము మొదలగు మన్యపు సంస్థానముల స్వాధీనపఱచుకొనె నని భావము 8. పొట్నూరు :- ఇది విశాఖపట్టణము జిల్లా లోనిది. బాహుబలేంద్రుని వంశస్థులకు కొంతకాలము ముఖ్యపట్టణ మై యుండెను.

9. మాడెములు :- మన్యసంస్థానము లనియును, మాడుగులు సంస్థానమనియు నగును.

10. వడ్డాది : ఇది మత్స్యవంశస్థు లని చెప్పంబడు నొక సంస్థానమువారి ముఖ్యపట్టణము.

11. కటకపురి :- ఇది యుత్కళదేశ మనబరఁగు నోఢ్రదేశమునకు ముఖ్యపట్టణము. గజపతిప్రభువులలో ముఖ్యుఁ డగు ప్రతాపరుద్రగజపతి యిక్కడ నుండు సింహాసనముపై నెక్కెను.

కొండవీడువఱకు నుత్కళరాజు లగుగజపతుల ప్రభుత్వము క్రింద నుండినట్లుగాఁ గానుపించును. కాఁబట్టి పైపద్యమువలన గజపతుల సర్వరాజ్యము కృష్ణరాయలు జయించె నని చెప్పనొప్పు.

కలుబరిగిం జయించుట

ఈవఱకు నుడివిన దంతయుఁ గృష్ణరాయని రాజ్యము తూర్పు బెజవాడ మొద లుత్తరము కటకపురివఱకును వ్యాప్తమై యుండె నని తెల్పుటకై యున్నది. ఆ ముక్తమాల్యదలోవలనే వివరింపఁ బడిన మఱి కొన్నిపద్యములవలన నది పశ్చిమోత్తరములయం దెంతవఱకు వ్యాపించియుండెనో అది సూచింపఁబడియె. అది యెట్లన్నను :-

"తే. తిరుగు హరిపురి సురతరు సురల మరిగి, బహుళహళహళ భరితకల్బరిగనగర
      సగరపురవరపరిబృఢ జవనయవన, పృతన భవదసి ననిఁ దెగి కృష్ణరాయ."

దీనింబట్టి కృష్ణరాయఁడు కలుబరిగె (ప్రస్తుతములో కుల్బర్గ) అను స్థలములోపలను, సగరపురి (సాగర్) అను పట్టణమున నుండు తురుష్కులం జయించె నని యున్నది.

ఖురాసాన్ దేశముం జయించుట.

పై ఆముక్తమాల్యదలోనే కృష్ణరాయలు ఖురాసాన్ దేశము పై దండెత్తిపోయి తద్దేశ ప్రభుం డగుయేదుల్ ఖాన్ అను తురుష్కుం జయించిన ట్లున్నది. ఎట్లన్నను:

"మ. అలుకన్ఘోటకధట్టికాఖురపుటీహల్యం గురాసానిపు
       చ్చలవోదున్ని చలచ్చమూగజమదాసారప్లుతిం గీర్తిపు
       ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తౌ దృష్టి కే
       దులఖానోగ్రకపాలమర్ధపహరిద్భూజాంగలశ్రేణికిన్.

గౌడదేశమును జయించుట.

కృష్ణరాయఁడు గౌడదేశముం జయించినట్లు మనుచరిత్రలోఁ గలదు. మఱియొక చాటు ధారయుఁ గలదు. రెండవది అతని ఆస్థానకవులలో నొక్కరు చెప్పినట్లుగా నున్నది. పెద్దన్న మొదలగువారు చెప్పిన మఱికొన్ని పద్యములవలన నీ రాయలు లుత్తరహిందూదేశముపై దండెత్తినట్లు తెలియుంగావున గౌడదేశముం గూర్చి చెప్పిన చాటుధార కేవలము కల్పితము కా దని తలఁచవలసియున్నది. ఆచాటువును, పెద్దనచెప్పిన పద్యముల నీ క్రింద వివరించెదను. ఎట్లన :-

"ఉ. గౌళపతీ యనేవు చిలుకా యిటు పల్కుట నీకు న్యాయమా
      మూలల నున్న వారి నిటు ముంగిట. బెట్టెడువారు నుందురే."

      పెద్దన్న చాటుధార :-

"మ. గవను ల్బల్లిదమయ్యె డిల్లి కిల మక్కాకోట మే టయ్యె నీ
       భువనంబెల్ల నదల్చిపుచ్చె ననఁగాఁ బోలేరు సందేరులన్
       దవసంబెక్కె బెడందకోట పురకాం తాగర్భనిర్భేదన
       శ్రవణం బయ్యె భవత్ప్రతాపజయవార్తల్ కృష్ణరాయాధిపా."

       మను చరిత్రములో

"ఆపంచగౌడ ధాత్రీతలం బెవ్వాని, కసివారుగా నేఁగునట్టిబయలు"

కృష్ణరాయ శాసన వివరము కాలనిర్ణయము.

ఆంధ్రులలోనే కాక హిందూప్రభువులు పెక్కండ్రు తమ రేదైన విశేషకార్యములం జేయునపుడు దేవబ్రాహ్మణులకు దానషర్మములు విశేషించి చేయుటయును, వానిని స్థిరీకరించుటకు శాసనములం జెక్కించుటయును గలదు. ఈకృష్ణరాయలు గూడ నట్లే యొనరించె నని అతనిచే నీయంబడిన కొన్ని శాసనములవలనం గాన్పించును. ఇట్టి కృష్ణ రాయశాసనముల సంగ్రహ మాంగ్లేయభాషలో (Mr. Robert Swell) దొరవలన (Lists of Antiquities) అను గ్రంథములో వివరింపఁబడినది. అందులోఁ బెక్కులు (Oriental Govet, Manuscript Library, Madras) అను దానిలో నిలువచేయంబడినవి. కావున పైరెంటి సహాయమునను కృష్ణరాయల దానశాసనము లే యేదేశములలో వ్యాపించియున్నవో తెల్పి అనంతర మతని దిగ్విజయ మెంతవఱకు వ్యాపించెనో యోఁచింతము. అం దాంగ్లేయసంగ్రహ శాసనపట్టికను తెన్గులోఁ దెల్పుదును.

శా. స. గ్రామము పేరు జిల్లావివరము రిమార్కులు
1432 విజయనగరము 1 బళ్లారి * * లోకల్ రికార్డులో 1430-31 సం. శాసనము లున్నవి న్యూయల్ దొర శాసనసంగ్రహము వివరించినను పై రెండుసంవత్సరముల శాసనముల నమ్మినట్లు కానుపించదు.
1432 నిడుముక్కుల కృష్ణ
1432 పాలెము కర్నూలు
1432 బళ్లారి బళ్లారి
1433 కాంచీపురము చెంగల్పట్టు
1434 బళ్లారి బళ్లారి
1435 బళ్లారి బళ్ళారి
1436 విజయనగరము 2 బళ్లారి
1436 సంకలపురము బళ్లారి
1437 కాంచి చెంగల్‌పట్టు
1437 ఉగర్ గోల్ బెల్గాము
1438 నెల్లూరు నెల్లూరు
1438 అమరావతి కృష్ణ
1439 విజయనగరము 3 బళ్లారి
1439 తిరువణ్ణామల దక్షిణార్కాడు
1439 మేడూరు కృష్ణ
1439 కాంచీ చెంగల్పట్టు
1439 అహోబలము కర్నూలు
1439 శ్రీశైలము కర్నూలు
1439 కొమ్మూరు కృష్ణా
ఎరుమెట్టపాల్యము చెంగల్పట్టు
1441 బెజవాడ కృష్ణా
1441 బెజవాడ కృష్ణా
శా. స. గ్రామము పేరు జిల్లావివరము రిమార్కులు
1441 పట్లవీడు కృష్ణ
1441 చేజర్ల కృష్ణ
1441 బాపట్ల కృష్ణ
1441 శ్రీకాకుళము కృష్ణ
1441 బాపట్ల కృష్ణ
1441 కాకాని కృష్ణ
1441 కొండకావూరు కృష్ణ
1441 దుర్గి కృష్ణ
1441 తిరుప్పడిర్కురం చెంగల్పట్టు
1441 కాంచి చెంగల్పట్టు
1442 కలువాయి నెల్లూరు
1443 అన్నియ్యాన్ దక్షిణ ఆర్కాడు
1443 పల్నీ మధుర
1443 విజయనగరము 4 బళ్లారి
1443 మంగళగిరి కృష్ణ
1444 గార్లదిన్నె నెల్లూరు
1444 వల్లభాపురము బల్లారి
1444 కందుకూరు కడప
1444 అనంతసాగరం నెల్లూరు
1445 శివమొగ్గ మైసూరు
1446 ఈఁగలపాడు నెల్లూరు
1443 కొండవీడు కృష్ణ
1449 కత్తెరగండ్ల కడప
1450 గుడిహళ్లీ బళ్లారి * కృష్ణరాయలు శా. స. 1452 లోనే మృతినందినట్లు నిశ్చయము. 1453 లో శాసనము లుండుటకు కారణము లేదు.
1452 కాంచి చెంగల్పట్టు
1452 పాలెము కర్నూలు
1452 విజయనగరము 5 బళ్లారి
1452 కాంచి చెంగల్పట్టు
* 1453 తిరువణ్ణామలై దక్షిణఆర్కాడు
1453 సింగరాయనికొండ నెల్లూరు
తారీఖులేదు సంకలపురం బళ్లారి
తారీఖులేదు పొట్నూరు విశాఖపట్టణము
తారీఖులేదు సింహాచలము విశాఖపట్టణము
తారీఖులేదు ఉండవిల్లి కృష్ణ
ఇట్లు (Antiquities) అనుగ్రంథములో నుదాహరింపఁబడిన శాసనములలో 1 బళ్లారిజిల్లాకు 12 శాసనము లున్నవి. వానికాలముయొక్క వివరము
శా. స. ఇట్లు పండ్రెండు శాసనములు కాన్పించెడిని. ఇందులో నైదుశాసనములు ప్రత్యేకము కృష్ణరాయని ప్రధాన పట్టణ మగువిజయనగరములో నీయంబడినశాసనములై యున్నవి. పైశాసన కాలములలో 1436 మొదలు 1439 వఱకు మూఁసంవత్సరములును, అది మొదలు 1434 వఱకు నాల్గుసంవత్సరములును 1444 మొదలు 1450 వఱ కాఱుసంవత్సరములకాలమును వ్యవధి యున్నది. ఆవ్యవధికాలములే కృష్ణరాయఁడు విస్తార శ్రమసాధ్యము లగుదేశములపై దండయాత్రలు చేయుచు నన్యదేశములలో నున్నట్లు భావించుటకు దగియుండును.
1 - 1432
2- 1434
1434
1- 1435
2- 1436
1436
1 - 1439
1- 1443
1- 1444
1- 1450
1- 1452
1 తేదిలేనిది.
మొత్తము 12

కృష్ణాజిల్లా శాసనములు.

2. ఇందలిశాసనగ్రామములు పూర్వము కృష్ణాజిల్లా నామముతో నొప్పుదేశములోనివి కావు. అవి కృష్ణరాయలకాలము నాఁటికి సీమ లనునామముతో నుండెను. మఱికొంతకాలమున కవి తురుష్కుల యధికారములో కొండవీడు, కొండపల్లి, ఏలూరునిజాంపట్నం సర్కార్లుగా నుండెను. పిమ్మట ఇంగ్లీషువారికాలములోఁ గొన్నాళ్లు గుంటూరుజిల్లా, బందరుజిల్లాలుగా నుండి ప్రస్తుతములో నవి యన్నియు కృష్ణా గోదావరీజిల్లాలోని వైనవి. ఇట్టి చిక్కులలో నుండుటచేత పైగ్రామములు కృష్ణరాయలకాలములో నేసీమలోనివో వివరించలేను.

శా. స. 1432, 1438, 1439, 1439 1441 లోనివి 9. 1443, 1448, 1 తారీఖులేనిది. మెట్టున 17 శాసనములు. ఈసంవత్సరములలోఁ గృష్ణరాయలు ప్రస్తుతపు కృష్ణాజిల్లాలోఁ జేరిన సీమలను జయించె నని చెప్పవలసియున్నది 3. కర్నూలుజిల్లాశాసనములలో శా. స. 1432, 1439, 1452 మెట్టున శాసనములు నాలుగు. కృష్ణాజిల్లాకుఁ బోవుట కీజిల్లా మార్గము కావునను, ఇందుఁ గూడ శ్రీశైలము, అహోబలము మొదలగుదేవస్థలము లుండుటచేతను పైసంవత్సరములలోఁ గృష్ణరాయలు ప్రాగ్దేశములోనే విశేషకాల ముండె నని యూహింపవచ్చును.

4. చెంగల్పట్టుజిల్లా శాసనములో శా. స. 1433, 1437, 1439, 1440, 1441, 1441, 1452, 1453, అనునివి యెన్మిది శాసనములు.

5. బెల్గాంజిల్లాశాసనములు, 1437 ఇది యొక్కటియే శాసనము. ఇట్టి తేదీశాసనములలో నొక్క చెంగల్పట్టుజిల్లాలోనే గాని కానుపించదుకావున నాసంవత్సరమంతయుఁ గృష్ణరాయలు ఆరెండుదేశములలోనే యున్న ట్లూహించవలసి యున్నది.

6. నెల్లూరిజిల్లా శాసనములలో. శా. స. 1438, 1442, 1444, 1444, 1446, 1453, అను నివి యాఱు.

7. దక్షిణ ఆర్కాడుజిల్లా శాసనములలో 1439, 1443, 1453 అను నివి మూఁడు.

8. మధురజిల్లా శాసనము 1443. ఈతేదీశాసనము దక్షిణ ఆర్కాడులో మాత్రము కానుపించును. కాఁబట్టి కృష్ణరాయలావత్సర మారెండుదేశముల కార్యములు నడిపి యుండవచ్చును.

9. కడపశాసనములు 1444, 1449 అనునవి రెండు.

10. మైసూరుశాసనము 1445 అనునిది యొకటి.

11. విశాఖపట్టణముజిల్లా శాసనములలో రెంటికి తేదులు లేవు.

శా. స. 1432 లో బళ్లారి, కృష్ణా, కర్నూలు. 1433 లో చెంగల్పట్టు. 1434 లో బళ్లారి. 1435లో బళ్లారి 1436 లో బళ్లారి. 1437 లో చెంగల్పట్టు, బెల్గాం. 1438 లో కృష్ణా, నెల్లూరు. 1439 లోబళ్లారి, కృష్ణా, కర్నూలు చెంగల్పట్టు, దక్షిణ ఆర్కాడు. 1440 లో చెంగల్ పట్టు. 1441 లో చెంగల్పట్టు, కృష్ణా. 1442 లో నెల్లూరు. 1443 లో బళ్లారి, కృష్ణా, దక్షిణఆర్కాడు, మధుర. 1444 లో బళ్లారి, నెల్లూరు, కడప. 1445 లో మైసూరు. 1446, 1447 లో నెల్లూరు. 1448 లో కృష్ణా. 1449 లో కడప, 1450, 1451 లో బళ్లారి. 1452 లో బళ్లారి, కర్నూలు, చెంగల్పట్టు. 1453 లో నెల్లూరు, దక్షిణఆర్కాడు.

పైసంవత్సరములోఁ గృష్ణరాయఁ డేయేదేశములతో వ్యవహరించుచుండెనో బోధయగును. వీనింబట్టి కృష్ణరాయనిరాజ్యము పైస్థలము లున్నంతవఱకు వ్యాపించియుండె ననుటకు సందియము లేదు. తారీఖులు లేని విశాఖపట్టణపు శాసనములు నేను సంపాదించియున్నాఁ డను. అందుల తారీఖులు వివరింపఁబడియే యుండెంగావున నాజిల్లా అంతయు నందులో నప్పటికాలములో జేరిన కటకపురాజ్యముం గలిసి యున్నవి. ఇదియంతయు న్యూయల్ దొర పుస్తకమునుబట్టి వ్రాయఁ1

కృష్ణరాయల శాసన వివరము.

బడినది. కృష్ణరాయల పూర్వ దిగ్వజయ యాత్రావిశేషములు దెల్పు కొన్ని శాసనములు మనకు లభ్యములైనవి. కృష్ణరాయచారిత్ర విశేషములం దెల్పుట కవి ముఖ్యములుకావున వానిలో ముఖ్యము లగువానిని శకవర్షముల రీతి నమర్చి యీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

శా. స. ప్రభవాది సం.రము గ్రామము విశేషములు.
I. 1437 = యువ. ధరణికోట. ఉదయగిరి, కొండవీడులజయించిన కథ.
II. 1438 = ధాత సింహాచలము. రాజమహేంద్రవరము మొదలు సాధించుట.
III. 1438 = ధాత. అహోబలము. మన్నె వారిని పట్టుకొనుట.
IV. 1441 = ప్రమాది. సింహాచలము. ప్రతాపరుద్రునికడ గైకొనినగ్రామములలోఁ గొన్ని స్వామి కిచ్చుట.

NO. 1ః శాసనము. శా. స. 1437 యువ సం. ధరణికోట:-

స్వస్తి శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరురాయరగండ, అరిరాయవిభాడ, భాషిగె తప్పువరాయరగండ, అష్టదిక్కురాయ మనోభయంకర, పూర్వ దక్షిణ పశ్చిమసముద్రాధీశ్వర, యవన రాజ్యస్థాపనాచార్య, గజపతివిభాడ, శ్రీవీరప్రతాప, శ్రీకృష్ణదేవ మహారాయలు విజయనగరానుండి పూర్వదిగ్విజయయాత్రకు వేంచేసి, ఉదయగిరి దుర్గము సాధించి తిరుమల ప్రేయతరాయ మహాపాత్రుని పట్టుకొని, అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగేడు కేతవరము మొదలైన గిరిదుర్గ స్థలదుర్గాలు అన్ని ఏకధాటిం గైకొని కొండవీటిదుర్గము లగ్గలు పుచ్చుకొని, ప్రతాపరుద్ర గజపతికొమారుఁడు వీరభద్రరాయనిన్ని, కుమారహం వీరమహాపాత్రునికొడుకు వీరమహాపాత్రుఁడు, రాచూరి మల్లఖానుఁడు, ఉద్దండఖానుఁడు, పూసపాటి రాచి రాజు, శ్రీనాథరాజు లక్ష్మీపతిరాజు, జన్యామలక సవాపాత్రుఁడు, పశ్చిమ బాలచంద్రమహాపాత్రుఁడు, మొదలుగాను పాత్రసామంతులను, మన్నెవారిని, జీవగ్రాహముగాను పట్టుకుని వారికి అభయదానమిచ్చి, ధరణికోటకు అమరేశ్వరులకై వేంచేసి, స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1437 అగునేఁటి యువసంవత్సర, ఆషాఢ బ. 12 భానువారమునకు కృష్ణవేణీనదీతీరమందు అమరేశ్వరదేవుల సన్నిధిని తులాపురుష మహాదానము సేయ నవధరించి తమదేవులు, చిన్నా దేవమ్మచేతను రత్నధేను మహాదానమున్ను, తిరుమల దేవమ్మ గారిచేతను సప్తసాగర మహాదానమున్ను, చేయించ నవధరించి తమ తండ్రి నరసారాయణిం గారికిన్ని, తమతల్లి నాగాదేవమ్మకున్ను పుణ్యముగాను అమరేశ్వరదేవుని నై వేద్యమహాపూజలకు ధారాపూర్వకముగాను సమర్పించిన పెద్దమద్దూరిగ్రామ మొకటి చతుర్వేద విద్యాపారగు లైనబ్రాహ్మణోత్తములకు, నూట యెనమండ్రుకు గ్రామములు. 4

2. 1 అద్దంకి సీమలో నిచ్చిన నిడమానూరుగ్రామము.
    1 అమ్మనబ్రోలు సీమలో వల్లూరుగ్రామము
______
__2___
తమపురోహితులకు సర్వక్రతు సర్వతోముఖ వాజపేయయాజు లైనరంగనాథదీక్షితులకున్ను శివాదీక్షితులకున్ను.

2. 1 అమ్మనబ్రోలుసీమలో ధారాపూర్వకముగా నిచ్చిన క్రొత్తపల్లి.
     1 త్రోవగుంట
_______
4._2___

ఈ ధర్మాలు ఆచంద్రార్కముగాను ఎవరు తప్పకనడుపుదురో ఆ పుణ్యపురుషులయొక్క పాదాలు మాశిరస్సున ధరించేము. ఈధర్మములకు ఎవరు హాని తలఁచినా నడుపని పాతకులు తమతల్లిదండ్రులను, బ్రాహ్మణులను, కపిలధేనువులను, కాశిలో గంగాతీరమందు చంపిన పాపాన పోఁగలవారు.

1. శ్లో. స్వదత్తాద్ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనమ్,
        పరదత్తాపహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్.

2. శ్లో. ఏకైవ భగినీ లోకే సర్వేషామపి భూభుజామ్,
        నభోగ్యా నకరగ్రాహ్యా విప్రదత్తా వసుంధరా.

3. శ్లో. సామా న్యో౽యం ధర్మసేతు ర్నృపాణాం
        కాలే కాలే పాలనీయో భవద్భిః,
        సర్వా నేతాన్ భావినః పార్థివేంద్రాన్
        భూయో భూయో యాచతే రామచంద్రః.

అను నీశాసనార్థములవలనఁ దేలిన చారిత్రవిశేషము లెవ్వియనఁగా శా. స. 1437 సంవత్సరము నాఁటికి 1. గృష్ణరాయని కెన్ని బిరుదులున్నవో అవియును, 2. యేయేదేశములు స్వాధీనములైనవో ఆసంగతియును, 3. ఆదేశాధిపతులలో నెవ్వరు స్వాధీనులుకాలేదో ఆవృత్తాంతమును, 4. ఎందఱు బ్రాహ్మణులకుఁ గృష్ణరాయఁడు ఆసమయమున వృత్తు లిచ్చెనో ఆకథయును, 5. రాజపురోహితు లెవ్వరో ఆవివరమును దెలిసినది. కావున వానినన్నిటి నిట సంగ్రహముగా వివరించెదను.

1. కృష్ణరాయనిబిరుదులు.

1. శ్రీమన్మహా రాజాధిరాజ. 2. రాజపరమేశ్వర. 3. మూరు రాయరగండ. 4. అరిరాయవిభాడ. 5. భాషిగెతప్పు వరాయరగండ. 6. అష్టదిగ్రాజ మనోభయంకర. 7. పూర్వ, దక్షిణ, పశ్చిమసముద్రాధీశ్వర. 8. యవన రాజ్యస్థాపనాచార్య. 9. గజపతివిభాడ. 10. శ్రీవీరప్రతాప. మొత్తము 10.

2. శా. శ. 1437 సంవత్సరమునాఁటి కేయేదేశములు స్వాధీనము లైనవి.

1 ఉదయగిరి దుర్గము. 2 అద్దంకిసీమ. 3 వినుకొండసీమ. 4 బెల్లముకొండసీమ. 5 నాగార్జునకొండసీమ. 6 తంగేడుసీమ. 7 కేతవరముసీమ. 8. కొండవీటిసీమ, కొండవీటిదుర్గము. మొత్తము. 8

3. పైదేశాధిపతులలో నెవ్వరు స్వాధీనము కాలేదు. ఎవరు పట్టుఁబడినారు.

1 ప్రతాపరుద్ర గజపతి కుమారుఁడు వీరభద్రుఁడు. 2 కుమారహం వీరమహాపాత్రునికొడుకు వీరభద్రుఁడు. 3. రాచూరి మల్లఖానుఁడు. 4. ఉద్దండభానుఁడు. 5 పూసపాటి రాచిరాజు. 6. శ్రీనాథరాజు లక్ష్మీపతిరాజు. 7 జన్యాముల కసవాపాత్రుఁడు. 8 పశ్చిమ బాలచంద్ర మహాపాత్రుఁడు. మొత్తము. 8.

వీరు స్వాధీనము కాని వారు.

ఉదయగిరి దుర్గాధిపతి యగు తిరుమల ప్రేతరాయ మహాపాత్రుఁడు పట్టుపడినాఁడు.

4. ఆసమయములో కృష్ణరాయ లెందఱు బ్రాహ్మణులకు వృత్తుల నిచ్చెను? 108 చతుర్వేదపారగు లగువారికి.

5. రాజపురోహితు లెవ్వరు? రంగనాథ దీక్షితులు, శివాదీక్షితులు.

వీ రిర్వురును స్మార్తబ్రాహ్మణులుగాన వీరు సర్వక్రతు సర్వతోముఖ వాజపేయ యజ్ఞ దీక్షాపరులుగాఁ గాన్పించుచున్నారు. దీనింబట్టి కృష్ణరాయఁడు కేవల వైష్ణవగురువుల నవలంబించి స్మార్తుల నిరాకరించినట్లుగాఁ గానంబడదు.

నెం. II. శాసనము 1438 సం (ధాత) సింహాచలము.

శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరు రాయరగండ, అరిరాయవి భాడ, భాషిగె తప్పు వరాయరగండ, యవనరాజ్యస్థాపనాచార్య, శ్రీవీరప్రతాప కృష్ణదేవ మహారాయలు విజయనగర సింహాసనారూఢుఁ డై పూర్వదిగ్విజయ యాత్రకు విచ్చేసి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన దుర్గాలు సాధించిరి. సింహాద్రికి విచ్చేసి స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శా. స. 1438 అగునేఁటి ధాతసంవత్సర. చైత్ర. బ. ద్వాదశి వారాన సింహాద్రినాథుని దర్శించి తమతల్లి నాగాదేవమ్మగారికిన్ని, తమతండ్రి నరసారాయణిం గారికిన్ని పుణ్యమునకుగాను దేవునకు సమర్పించిన కంఠమాల 1కి ముత్యాలు 61, వజ్రమాణిక్యాల కడియాలు జోడు 1కి శంఖచక్రాలపతకము 1. పైఁడిపళ్లెము 1కి తూకాలుగా 44282. కానికి మాడలు 2000. తమ రాణీలు తిరుమల దేవమ్మగారిచేతను పతకము 1కి వరహాలు 500. తమచిన్నాదేవమ్మగారిచేత సమర్పించిన పతకము 1కి గా 500. యింతవట్టు సమర్పించిన ధర్మశాసనము.

ఈ రెండవశాసనమువలనఁ దేలిన విశేషములు వివరింపఁబడవలసియున్నది. ఇందు తొల్లిటి శాసనములోని బిరుదులకు వ్యతిరేకమై నవి లేవు. 1437 సంవత్సరములోని ఆషాఢమాసము మొదలు 1438 సంవత్సరము చైత్రమాసమునాఁటికి ననగాఁ దొమ్మిదిమాసములలో గృష్ణరాయలు కొండవీటి దుర్గము, కొండపల్లిదుర్గము, రాజమహేంద్రవరదుర్గము జయించినాఁ డనియును, అట నుండి కళింగదేశముం జయించుటకుఁగాను సింహాచల క్షేత్రమునకు వచ్చి విజయార్థ మై సింహాచలేశుని సేవించి అచ్చోఁ దాన ధర్మముల నడిపెననియుం దేలును.

నెం. 3 రు శా. స. 1438. ధాతసం. అహోబలశాసనం, లోకల్‌రికార్డులు, 10 సంపుటము, 555 పుటలో నహోబలగ్రామము, కైఫీయతు వ్రాయుచు నీపై నుదాహరించిన శాసనము నమరించెను. అది ఎట్లన్నను :-

"స్వస్తి శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరు రాయరగండ, అరిరాయవిభాడ, అష్టదిక్కురాయ మనోభయంకర, పూర్వ, పశ్చిమ, దక్షిణ, సముద్రాధీశ్వర, యవన రాజ్యస్థాపనాచార్య, గజపతి దళవిభాడ, శ్రీవీరప్రతాప శ్రీవీర కృష్ణదేవ మహారాయలు పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి ఉదయగిరి దుర్గమును సాధించి తిరుమల ప్రేతరాయ మహాపాత్రుని పట్టుకొని వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకి, అమ్మనబ్రోలు, తంగేడు, కేతవరము మొదలయిన గిరిదుర్గాలు ఏకధాటిని గై కొని కొండవీటికి విచ్చేసి దుర్గంచుట్టు వాఱుకుని నడచప్పరాలు పెట్టి, కోట పడదోయించి నాల్గుదిక్కులాను లగ్గలు విడిపించి దుర్గం తీసుకుని దుర్గంమీఁద నున్న ప్రతాపరుద్ర గజపతి మహారాజుల కొమారుఁడు వీరభద్రరాయఁడు, కుమార హంవీరపాత్ముని కొడుకు న్నరహరిదేవు శ్రీనాథరాజు, రామరాజు కొడుకు లక్ష్మీపతిరాజు రాచూరి యలువఖానుఁడు, ఉద్దండఖానుఁడి జన్యామల కసవాపాత్రుఁడు, తుమ్మపాలచంద్రమహాపాత్రుఁడు వీరు మొదలైన పాత్రసామంతులనున్ను, మన్నెవారిని జీవగ్రహముగా పట్టుకొని వారికి అభయదానమున్ను యిచ్చి, ధరణికోటకు విచ్చేసి అమరేశ్వర మ హాదేవుని తులాపురుష మహాదానమున్ను చేయ నవధరించి, తిరిగి విజయనగరానకు విచ్చేసి, రత్నసింహాసనస్థుఁడై సామ్రాజ్యము చేయుచున్ను మఱి కళింగదేశదిగ్విజయార్థ మై విచ్చేయుచు అహోబలానకు వేం,చేసి దేవుని దర్శించి, శ్రీవిజయాభ్యుదయ శా. స. 1438 అగునేఁటియువసం. పుష్య శు. 15 శుక్రవారమందు శ్రీ అహోబలదేవునికి కంఠమాల 1, పచ్చలు చెక్కినవజ్రాల మాణిక్యాలపతకము 1, మాణిక్యాల కడియాల జోడు 1, పైడిపళ్లెము 1, కాక 1000 వరహాలున్ను తమ దేవులు సమర్పించిన పతకము 101 తాకట్టున్ను సమర్పించి దేవర అమృతపడి నై వేద్యము అంతరంగ వైభవాల కున్ను, చాగలమఱ్ఱి సీమలోని మద్దూరు అనే గ్రామమున్ను సమర్పించిరి. ఈసేవ ఆచంద్రార్కస్థాయి అయి నడవవలె నని యిచ్చినధర్మ శాసనం.

ఈ శాసనములోని సంగతులు ముఖ్యముగా విచారించవలసినవి. ఇందులో వివరింపఁబడిన శాలివాహన శకముతో సరియైన ప్రభవాది సంవత్సరము వ్రాయంబడ లేదు. ఇది పొరపాటు కావచ్చును. మొదటి శాసనకాలము మొదలు రెండవశాసనసమయమువఱకు నడుమనుండిన తొమ్మిదిమాసములలోఁ గృష్ణరాయఁడు తూర్పుదేశపు దండయాత్ర చేయుచున్నట్లు స్పష్టమే. ఇపు డీశాసనములోఁ గృష్ణదేవరాయలు తిరుగ తనరాజధాని యగువిజయనగరమునకుం బోవుసమయములోఁ జేసియున్న విశేషముల వక్కాణించెను. శా. స. 1438 సంవత్సరము చైత్రమాసము మొదలు పుష్యమాసమువఱకుఁ దొమ్మిది మాసములు పట్టియుండును. కాఁబట్టి యీకాలము గల ప్రభవాది సంవత్సరము ధాత సంవత్సరముగాఁ జెప్పుటయే యుక్తియుక్తముగా నుండును. అయితే కృష్ణదేవరాయలు గతసంవత్సర దండయాత్రలో సింహాచలమునకుఁ దూర్పుననున్న దేశముల స్వాధీనపఱుచుకొనియుండలేదు గనుక నక్కడ నుండి తిరిగి స్వదేశమునకుం బోయి సేనలను ధనముం గూర్చుకొని తూర్పు దండయాత్రకు బయలువెడలిన సమయ మీశాసన సమయము కావచ్చును. శాసనార్థము నట్లె కానుపించును గావున దాని సంగ్రహ మిట వివరించెదను. ఎట్లన్నను :-

కృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి మొదలు పాత్రసామంతులనున్ను మన్నే వారినిన్ని అనువఱకుఁ బూర్వపుశాసనార్థమే తిరుగ వివరింపఁబడినది. ఈశాసనకాలమునాఁటికి నట్టి సామంతులలో నొకరిద్దఱు తప్ప తక్కినవారిని జీవగ్రాహముగా (ప్రాణములతో) పట్టుకొని వారికి నభయదాన మిచ్చె ననునది విశేషము. పైశాసనములోని వారిపేరులు కొన్నియు నీశాసనములో వారిపేరులు సరిపడి యుండకుండుటం జేసి ఆ రెండుపట్టికల నిట వివరించెదను.

మొదటిశాసనము పేరులు. ప్రస్తుత శాసనముల పేరులు.
1 ప్రతాపరుద్ర గజపతికుమారుఁడు వీరభద్రరాయఁడు 1. ప్రతాపరుద్ర గజపతి మహారాయల కొమారుఁడు వీరభద్రరాయఁడు.
2. కుమారహంవీరమహాపాత్రుని కొడుకు వీరమహాపాత్రుఁడు, 2. కుమార హంవీర మహాపాత్రుని కొడుకు నరహరిదేవు.
3. రాచూరి మల్లవఖానుఁడు 3. రాచూరియలువఖానుఁడు.
4. ఉద్దండభానుఁడు, 4. ఉద్దండఖానుఁడు.
5. పూసపాటి రాచిరాజు, " " " " " "
6. శ్రీనాథరాజు, లక్ష్మీపతిరాజు, 6. శ్రీనాథరాజు రామరాజు కొడుకు లక్ష్మీపతిరాజు
7. జన్యామలక సవాపాత్రుఁడు, 7. జన్యాముల కసవాపాత్రుఁడు,
8. పశ్చిమబాలచంద్రమహాపాత్రుఁడు. 8. తుమ్మపాలచంద్రమహాపాత్రుఁడు.

పైపట్టికలలోని పేరులలోఁ గొంచెము భేద మున్నను అవి పాఠాంతరములుగాఁ గైకొనఁదగియున్నవి. పైపట్టికలోని అయిదవపేరు గల పూసపాటి రాచిరాజుపేరు కాన్పించకుండుటకు గారణ మరయవలసియున్నది. ఇది ప్రమాణ మైన నై యుండు నని యెంచి దాని నివర్తించుటకు గ్రంథాంతర మరయుదు నని నలసంవత్సర పంచాంగము పీఠికలోఁ బ్రచురింపఁబడిన కర్ణాటకరాజులపేరులున్న పట్టికం జూడ దానిలో నీక్రిందివిధంబుగఁ గృష్ణరాయ రాజ్యవిశేషము లున్నవి. అవి యును మనచరిత్రమునకు ముఖ్యములే. వాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

శా. స. 1430 - క్షత్త్రియవంశస్థుఁ డగుసాళ్వనరసింహరాయలు ప్రబలెను. ఇతనిమంత్రి సాళ్వతిమ్మయ, ఈనరసింహరాయల యనంతరము కీర్తికాముఁ డగుప్రతాప వీరకృష్ణరాయలు ప్రభుత్వమునకు వచ్చెను. ఇతని మంత్రి అప్పాజీ. కృష్ణరాయలు విభవసంవత్సరమాఘ శు. 14 పట్టాభిషిక్తుఁడాయెను. ఇదే శక సంవత్సరము. (Note ː- ఇందులో వ్రాయంబడిన నరసింహరాయలు కృష్ణరాయని యన్న యగువీరనరసింహరాయలు.)

1435. సుల్తాన్ కుల్లీ ఖద్భుల్ ముల్కు, ఢిల్లిపాద్షాతో యుద్ధము ప్రారంభించి ఆంధ్రదేశమును స్వాధీన పఱుచుకొనియెను.

1435. అమీనాబాద్ బీదర్ ప్రదేశములయందు ప్రారంభింపఁబడినయుద్ధములో మహమ్మదు పాదుషా పరాజితుఁడైనాడు.

1435. కళింగదేశము నేలుచుండిన వీరభద్ర గజపతిరాజును కృష్ణదేవరాయలు జయించెను.

1437. పూసపాటి మాధవవర్మ వెలమవారికి అనేక దుర్మార్గములు చేయు చుండెను.

1441. కృష్ణానదివడ్డున ప్రబలయుద్ధము జరిగినది. అప్పటిలో విజయనగరము నేలుచుండు కృష్ణదేవరాయలను అదిలిషా యెదిరించినందున వారిని కృష్ణదేవరాయలు జయించి తఱిమెను.

1445. విరింజిపురం అప్పయ్య దీక్షితులును, కోటి కన్యాప్రదానముల తాతాచార్యులను పండితుఁడును ప్రబలిరి.

1450. వీరభద్ర ప్రతాపదేవులు కటకమును పాలించెను.

1452. జగదేకప్రసిద్ధుఁ డగుకృష్ణదేవరాయలు మృతి నందెను. గోలకొండలో తానీషా ప్రభుత్వము ప్రారంభించఁబడినది.

అనియున్న పైపట్టికలో పూసపాటి రాచిరాజు విషయము వ్రాయవలసియున్నది. పైదానిలో వ్రాయంబడిన పూసపాటి మాధవవర్మ యే యీ పూసపాటి రాచిరాజు పూసపాటి వారివంశముం జెప్పెడు కృష్ణవిజయాదిగ్రంథములంబట్టి పైరాచిరాజు చేసినవిశేషములు స్పష్టము లగును. ఇపుడు మనమువ్రాయుచున్న కాలములోఁ బూసపాటి వారిలోఁ గృష్ణరాయనితో నెదిరించుటకుఁ దగిన స్థితిలో నున్నవాఁ డీరాచిరాజొక్కఁడే. ఇతనినే వెలమలలో రావువారి వంశచారిత్రములో పూసపాటి మాధవవర్మ యని వివరించిరి. ప్రస్తుతములో నీసంశయ నివారణ చేయుట మనపని కాదు గనుక నీవిషయమై చర్చింపక రాచిరాజు కృష్ణరాయలతోఁ బలము సాధించి పోరుటకుం గలకారణముమాత్రము వివరింపవలసియున్నది. దానికిఁ గారణము రాచిరాజు కేవలశూరుఁ డగుటయేకాక కృష్ణరాయనివలనఁ బరాజితుఁడైన పైవీరరుద్ర గజపతి కుమారుఁడగు వీరభద్ర గజపతియొక్క తోఁబుట్టువునకు భర్తయై యుండుటయు కొండవీటిలోని కేతవర దుర్గాధ్యక్షుఁడై యుంటయు నై యున్నది. అట్టిసంబంధ మున్నందులకుఁ గృష్ణవిజయములోని యీక్రింది పద్యము చాలియుండును. ఎట్లన్నను :-

సీ. నవభారతాఖ్యాననవ్యకావ్యమునకు, నాయకుం డయ్యె నేనరవరుండు
    కటకేశ్వరునిచేతఁ గని కేతవర మాత్మ, పురముగా నేలె నేభూవిభుండు
    నిలి పె భారుహమన్నెనృపగండపెండేర, మెపుడు డాకాల నేనృపతిమౌళి
    యఖిలసద్గుణపతి యక్కమాంబాదేవి, ప్రాణేశుఁడయ్యె నేపార్థి వుండు
    ప్రథితగజపతిరాజ వీరప్రతాప, రుద్రతనయాధినాయకారూఢతమ్మి
    రాజజనకతఁ గాంచె నేరాజతిలక, మతఁ డలరుతమ్మవిభురాచయప్రభుండు.

దీనింబట్టి రాచిరాజు వీర రుద్ర గజపతి యల్లుం డై, అతని కుమారుం డగువీరభద్ర గజపతికి బావమఱఁది అయియున్నాఁడు. వీరభద్ర గజపతి కృష్ణరాయనికి స్వాధీనుఁడైనను నీరాచిరాజు వీరరుద్ర గజపతి సేనలను వెంటఁ దీసుకొని బెజవాడ, వేఁగిదేశములకుఁ బోయి అక్కడ నుండు చిన్న సంస్థానములను దోఁపిడిచేయుచుఁ గృష్ణరాయనికి దూరదూరమున నున్నట్లుగా మఱికొన్ని కైఫీయతులవలనం గాన్పించు. అందులో నొకదానిలో నీపైవిషయముతో పాటు కృష్ణరాయల తూర్పుదేశపు దండయాత్రా విశేషములును ఇదివఱలో మనము వ్రాయుచున్న పాత్రసామంతాదుల స్థితిగతులును, వారిని కృష్ణరాయలు పట్టిన తెఱఁగును విస్పష్టముగా నున్నది. గనుక ఆవృత్తాంతము మట్టుకు వివరించెదను. ఇది చర్విత చర్వణముగా భావించక పాఠకులు దీనిని జదువ శ్రద్ధాళువు లగుదురుగాక.

Local Records Vol. XIX page Į25 to Į88

కైఫీయతు మవుజే చామర్లకోట.

"కపిలేశ్వర గజపతి కుమారుఁ డైనపురుషోత్తమగజపతి ఆంధ్రకళింగ దేశముల ప్రభుత్వముచేసినాఁడు. ఈయనకుమారుఁడైన ప్రతాపరుద్ర గజపతి కళింగాంధ్రదేశము లేలుచుండి పశ్చిమ ముదయగిరి పర్యంతము ప్రభుత్వముచేసిరి. ఉదయగిరి దుర్గములోను గజపతి వారితరపున తిరుమల దేవరాయ మహాపాత్రుని నుంచిరి. కొండవీటిదుర్గములోఁ బ్రతాపరుద్రగజపతి కుమారుఁడు వీరభద్రగజపతి, కుమారహంవీర పాత్రుని కుమారుఁడు నరహరిదేవు, శ్రీనాథరాజు రామరాజు, కుమారుఁడు లక్ష్మీపతిరాజు, జన్యామల కసవాపాత్రుఁడు, సుప్రపాల చంద్ర ,అహాపాత్రుఁడు, పూసపాటి రాచిరాజు, రాచూరిమల్లయఖాను, ఉద్దండభానుఁడు, వీరుతగినసైన్యములతో నుండిరి. కళింగదేశపు ప్రభుత్వము చేయుచున్న ప్రతాపరుద్ర గజపతి కటకపురియందు సింహాసనస్థుండై ప్రభుత్వము చేయుచుండేవాఁడు."

"పశ్చిమరాజ్యమందు విద్యానగర పట్టణమందు నరపతి రాయ సింహాసన మునకు అధిపతు లైనశ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీరకృష్ణదేవరాయమహారాయలు సైన్యముతోఁ గూడ తరలిపోయి, ఉదయగిరి దుర్గము సాధించి, దుర్గముమీఁద నున్న తిరుమల రౌతరాయ మహాపాత్రునిఁ బట్టుకొని, అక్కడనుండి సైన్యముతోఁగూడ కదిలివచ్చి వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకిఁ అమ్మనబ్రోలు, తంగేడు, కేతవరము మొదలయిన గిరిదుర్గ స్థలదుర్గములను సాధించి, కొండవీటికి విచ్చేసి దుర్గము చుట్టువాఱనడ చప్పరములు వెట్టించి, దుర్గము లగ్గలు విడిపించి అందుమీఁదనున్న పాత్రసామంతులను, మన్నెవారిని జీవగ్రాహముగా బట్టుకొని, వారికి అభయదానము నిచ్చి అక్కడినుండి విద్యానగరమునకు విజయముచేసి శా. స. 1438 (A. D. 1515) అగునేఁటి యువనామసంవత్సరమందు కళింగదేశము జయించవలె నని విచ్చేసి కర్ణాటకదేశము విడిచి, జమ్మిలోయఁబడి కోననుంచి కొఠాముమార్గానను పొట్నూరునుండి వడ్డాదిమాడుగులు సాధించి, కటకముమీఁద మోహరముచేసి ప్రతాపరుద్ర గజపతితో యుద్ధముచేయఁగా గజపతి కటకపురి విడిచి పరారీ అయి లేచిపోయినాఁడు. తరువాతను సలహా అయి, నరపతికృష్ణరాయలకుఁ దనకుమార్తెను ఇచ్చినాఁడు. అంతట నరపతికృష్ణరాయలవారు తిరిగీ విద్యానగరమునకు లేచిపోయినారు."

"ఈప్రకారము జరుగుచుండఁగా రావువారనేకొందఱిని, పశ్చిమరాజ్యమందు బెజవాడదగ్గఱ పూసపాటి మాధవర్మ అనేరాజు సహించలేక వారితో యుద్ధముచేసి అపజయము అయినవారినిఁ గలగానుగుల ఆడించి చంపించినాఁడు" అను మొదలగు సంగతులు వ్రాయంబడి యున్నవి. ఇట్లుపూసపాటి మాధవవర్మ వృత్తాంతమే రావువారి వంశావళీ గ్రంథ మగువాసవదత్తా పరిణయ మనుపద్య కావ్యములోఁ గూడ వివరింపఁబడియున్నది. కావున పైవృత్తాంతము లన్నిటింబట్టి పూసపాటి రాచిరాజుమాత్రము కృష్ణరాయలవలన జీవగ్రాహముగాఁ బట్టుకొనంబడి నట్లుగాని పిమ్మట వదలివేయఁ బడినట్లుగాని కానుపించలేదు. తక్కిన పైశాసనాంశముల దృఢపఱుచునట్టిగాథ లీవఱకే మన మీచామర్లకోట కైఫీయతులో వివరించియుంటిమి. గావున నింక నీశాసన విశేషములు వ్రాయమానెదను. అదివఱకు పూసపాటి రాచిరాజును పట్టుకొనుటకుఁ గృష్ణరాయండు యత్నించినను వీరరుద్ర గజపతితోఁ గల్గిన పై నవీనసంబంధబట్టి తనకుఁ దోడియల్లుఁ డైన కారణంబుననైన నాప్రయత్నము మాని మిన్న కుండకపోఁడు. ఇది రాచిరాజు వృత్తాంతము.

నెం 4 శాసనము. శా. స. 1441 సం. సింహాచలము.

"స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1441 అగునేఁటి ప్రమాది నామసంవత్సర శ్రావణ శు. 13 సోమ వారాన శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర మూరురాయరగండ అరిరాయవిభాడ, భాషగిత ప్పువరాయరగండ, యవన రాజ్యాస్థాపనాచార్య, శ్రీవీరప్రతాప కృష్ణదేవరాయలు విజయనగర సింహాసనారూఢుఁడై సింహాద్రినాథునికి తమపేరిట భోగము నడిచేటందుకు ప్రతాపరుద్ర గజపతి మహారాయలచేతను పుచ్చుకున్నగ్రామాలు, కళింగ దండపాటలోనిగ్రామాలు, పెదగానిగ్రామం, 1. అగనంపూడిగ్రామం, 1. అమ్మ చెల్లెపల్లెలు, 1. గంగవరంపల్లె, 1. పిన్న అగనంపూడి పల్లె, ఉభయగ్రామాలు, 2 కి సింహగిరి అప్పనికి నడిచే భోగబలిహరణం కట్టడి దినం 1కి శ్రీఅంగరంగ భోగానకు గంధం, 1. పలం. అగరు, 2. వ, కర్పూరం, 1 చిన్నము. కస్తూరి 2 చిన్నాలు. పన్నీరు 4 చిన్నాలు. కుంకుమపువ్వు, 1 చిన్నం. పువులదండలు 4. మాలెలు. 4. నై వేద్యానకు బియ్యం పుట్టి, 1. పకాళం తు 2. పాయసం తూనికె, 6. డోరలు. 4. ఫేడాలు సోడీలు, 8. సారనత్తులు, 8. అరిశెలు, 8. సాదుమనోహరాలుః 8. చిన్న మనోహరాలు, 4. నందిమెడ్డినం, 8. అప్పాలు, 8. హనకేళీలు, 8. కర్పూరకాలత్తులు బడాలు, 8. కక్కరాలు (చక్కిలాలు,) 4. వెరసి 80 పానకాలు 2. గట్టిగా కులచం, 1. నై వేద్యానకున్ను పేరాలమున్ను కూడా నైనవి యేడు తూములు, వడ్లు ఏఁదుమున్ను కుంచెఁడుపళ్లు, పోఁకలు, 50. తమలపాకులు, 100 మిర్యాల సంబారాలు 27. డబ్బులయెత్తు జాజికాయలు. 10. ఇందుకు వైనము సత్త్రం 30 కి బ్రాహ్మణభోజనం యీ ధర్మానకు యెవరు తప్పితే వారు గంగలో గోహత్యఁ బ్రహ్మహత్య మాతృ పితృహత్య చేసినపాపాన పోతారు.

శ్లో. స్వదత్తాం పరదత్తాం వా యో హరేత వసుంధరామ్,
    షష్టి ర్విర్షసహప్రాణి విష్ఠాయాం జాయతే క్రిమిః.

అని యున్నపైశాసనమును బట్టి యీక్రిందిచారిత్ర మూహింపవలసియున్నది. ఎట్లన్నను. వెనుకటి శాశనమును బట్టి శా. స. 1438 వ సంవత్సరములోఁ గృష్ణరాయలు కటకపుదండయాత్రకై, బయలువె డలి జమ్మెలోయ మార్గముగాఁ బోయి వడ్డాది మాడుగులు మొద లగు సంస్థానములం జయించి కటకముంగూడ స్వాధీనము చేసుకొని కటకేశుఁ డగుప్రతాపరుద్ర గజపతికూఁతుం బరిణయం బై తిరిగీ తనదేశమునకు నీశాసనకాల మగు 1441 సంవత్సరమునాఁటికి సింహాచలము వచ్చి యుండును. ఈసంవత్సరము చేసినశాసనములోఁ గొన్నిగ్రామములు సింహాచలస్వామి కిచ్చి యుండుటచేతను, వెనుకటి శాసనకాలము నాఁటికి భూదానము చేయలేక కేవలము ధనమునే సింహాచలేశ్వరునికి సమర్పించి యుండుటచేతను, కటకదేశజయము తొల్లిటి శాసనమునాఁటికి కాలేదనియు 1441 సంవత్సరముననే అయినదనియును నిశ్చయించవలసియున్నది. ఇందులోఁ బ్రతాపరుద్ర గజపతివలనఁ బుచ్చుకున్న గ్రామములు కళింగదండపాటలోనివి, అని చెప్పుట చేతఁ గృష్ణరాయలు ప్రతాపరుద్ర గజపతిని జయించినను, అతనిరాజ్య మతనికి తిరిగి యిచ్చి వేసియుండె ననియును, తనయొక్క విజయముం జూపుటకుఁగా నాప్రతాపరుద్ర గజపతి దేశములోని కొన్ని గ్రామములు తన స్వాధీనములో నుంచుకొని వానిని సింహాచలేశ్వరునకు సమర్పించె ననియు నూహింప వలయును. పై శాసనములు నాలిగింటిచేతను కృష్ణదేవరాయలు తూర్పు దేశమును జయించుటకై శా. స. 1437 లో బయలుదేఱి కొంతదేశమును స్వాధీనము చేసుకొని విజయనగరమునకుం బోయి తిరుగ 1438 సంవత్సరాంతమున వచ్చి 1441 సంవత్సరము సగమగు వఱకు నుండెననియు నిదియైనపిమ్మటఁ గృష్ణా చెంగల్పట్టు జిల్లాలలోని కార్యములు జరుపుచు 1442 సంవత్సరమంతయు నుండి 1443 సంవత్సరములోఁ దిరుగ దేశములోఁ బ్రవేశించియుండు ననియు నూహింప నై యున్నది.

పైనుదాహరించిన శాసనములన్నియు (Col. Mackenzie Collections) లోనివై గవర్నమెంటువారి ఓరియంటల్ మ్యానస్క్రిప్టులైబ్రరీలోఁ జేరినవై యుండుటచేత నమ్మఁదగిన వనియును, వానివలన మనము పైని నిర్ధారణ చేసిన కథయంతయు విశేషదోషయుక్తమై యుం డదనియుఁ జెప్పవచ్చును. ఇటులనే కృష్ణరాయని కాలముకొని శాసనము లన్నియుం దొరికినఁ గొంతచారిత్రము తేలును. అవి దొరుకుట సుగమముకాదు. కావున పై కళింగ దండయాత్రానంతరము కృష్ణరాయలు చేసిన విశేషములు గ్రంథాంతరములనుండి సంపాదించి సాధ్యమగునంతవఱకు వివరించెదను. ఎట్లన్నను :-

కామలాపురమునకు వాయవ్యము 2 పరువులదూరమునఁ గోకట మనుగ్రామముకు ప్రతినామము కమలాజీ పుర మనునామము పొలిమేరలో వలయవామనముద్ర రాళ్లపై వ్రాసియున్నది. అవి జయసింగు మహారాజు వకీలు కమలాజీ యనువాఁడు అగ్రహారమును చేయించెను. అని స్థలవాసులు వాడుచున్నారు. తరువాత శ్రీకృష్ణదేవరాయలనాఁడు అల్లసాని పెద్దన్న అను ఆంధ్రకవీశ్వరుం డైననందవరీక బ్రాహ్మణుఁడు బహుప్రసిద్ధిగా మనుచరిత్ర మను ఆంధ్రప్రబంధమును చేసినాఁడు. ఆకవీశ్వరునకుఁ గృష్ణదేవరాయలు ఈకోటక మనుగ్రామమును సర్వమాన్యాగ్రహారముగా ధారబోసి యిచ్చినాఁడు. ఈ కవీశ్వరుఁడు బ్రాహ్మణులకు సర్వాగ్రహారముగ నిచ్చి కోకటానికి ప్రతినామము శఠగోపురము అని యీగ్రామన వాకిటివద్ద యిరికిఱాతికి వ్రాసియున్నది. ఇదిగాక యీ కవీశ్వరుఁడు ఈగ్రామమునఁ చెన్న కేశవుని దేవాలయములో నిలువురాతికి వేయించిన శాసనము అన్వయసారాంశము. "శాలివాహన శకవర్షంబులు 1440 అగునేఁటి బహుధాన్య సంవత్సర వైశాఖ శు. 15 లు అల్లసాని చొక్కరాజుగారి కుమారుఁడు పెద్దయ్యంగారు కోకట సకలనాథునిలింగమునకు ఇచ్చిన భూదాన ధర్మశాసనము, శ్రీకృష్ణదేవమహారాయలు మాకును, ఘండికోట సీమలోను పుంబళికెపాలించ నవధరించిన కోకటగ్రామమందును సకలేశ్వరదేవుని నై వేద్యమునకును, దీపారాధనకును చేను ఖ 2 ను సర్వసామాన్యముగా కృష్ణాతీరమందు బెజవాడ మల్లికార్జునదేవుని సన్నిధిని సోమగ్రహణ పుణ్యకాలమందు సహిరణ్యోదక దానధారా పూర్వకముగాను ధారవోసి యిస్తి మని వ్రాసియున్నది. ఇందుకు దిగువనుండేది. శ్రీమన్మహాదేవుని నగరు కోకటం స్థళ కరణం కట్టము మండ్రాజు తిప్పనకొడుకు ముమ్మండ్రాజు కోకటం సకలేశ్వరుని నగరు ఈ బహుధాన్య సంవత్సరమునకు పునఃప్రతిష్ఠ శ్రీకారం మూలానను చేయించెను. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాన్వితః, నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః.

ఇదిగాక యీశాసనమువద్దనే యుండు రెండవశాసనము, ఈ శకసంవత్సరములో నీ కవీశ్వరునినాఁడే కార్తీక బ. 12 లు కోకటము చెన్న కేశవపెరుమాళ్లకు అల్లసాని చొక్కయ్యంగారి పుత్త్రుండు పెద్దయ్యంగారు యిచ్చిన భూదాన ధర్మశాసనము క్రమ మెట్లన్నను :- కృష్ణదేవరాయలు ఘండికోట సీమలోను, మాకు వుంబళిగా నీయ నవధరించిన కోకటానను దేవుని నై వేద్యమునకును, దీపారాధనకును, మేము ఉత్థానద్వాదశి పుణ్యకాలమందు సమర్పించినచో చర్మంచేను ఖ 4. అని వ్రాసియున్నది.

శా. స. 1450 (A. D.) 1528.

కొండపల్లి మాలకాపురములమధ్య నొకఱాతిపలకయున్నది. అందుపైని శా. స. 1450 గల యొక శాసనమున్నది. అది యొక తురుష్కునివలనఁ గొండపల్లికోటను పట్టుకున్నందున నతిని సంతోషమును సూచించుటకుగా నొక సత్త్రము కట్టిననాఁటిదిగా నున్నది. ఈశాసనము దానికిగా నీయంబడిన భూదాన ధర్మశాసనమై యున్నది. రెండవ శాసనములోఁ గృష్ణరాయ నిర్యాణము శా. స. 1452 (A. D. 1530) అయినట్లు కానుపించును.

అదవాని సమీపి గ్రామవృత్తాంతములో శా. స. 1450 లోని కృష్ణరాయని వ్యవహార విశేషములం జెప్పుచు నాగ్రామము నింకను అభివృద్ధి నందించె నని చెప్పెను.

పైని వ్రాసిన తిప్పలూరు గ్రామము అష్టదిగ్గజ కవీశ్వరులకు సర్వాగ్రహారముగా నిచ్చి నందులకు రెండుదాఖలా లున్నవి. వానిలో తిప్పలూరు గ్రామమునకుఁ దూర్పుచొప్పవామిలో నున్నశాసనము :-

శాలివాహన శకవర్షములు 1450 అగునేఁటి సర్వజిత్తు సం. శ్రావణ బ.30 సోమవారము శ్రీకృష్ణదేవరాయ మహారాయలవారు అష్టదిగ్గజకవీశ్వరులకు ధారవోసి యిచ్చిన తిప్పలూరు అగ్రహారమందు దొమ్మర్లు ఇచ్చు పన్ను ఈగ్రామమున నున్న శివ, విష్ణువుల దేవాలయముల యొక్క ఆరగింపులకు సమర్పించిరి.

కామలాపురమునకు రెండుపరుగుల దూరమున నాగ్నేయమున కొప్పులూ రనుగ్రామము కృష్ణరాయలతో చదరంగమాడి గెలుచుకొనిన తిమ్మన్న యనునాంధ్రకవీశ్వరునకు బ్రాహ్మణునకు సర్వమాన్యాగ్రహారముగా నిచ్చెను. ఇందులకు దాఖలా యీకవీశ్వరునిచేతఁ జెప్పంబడినపద్యములో నున్నది.[5] అది యెట్లనఁగా :-

సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ, సూత్రుఁ డార్వేలపవిత్రకులుఁడు
    నందిసింగామాత్యునకును దిమ్మాంబకుఁ, దనయుండు సకలవిద్యావివేక
    చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే, నల్లుండు కృష్ణరాయక్షితీశ
    కరుణాసమాలబ్ధఘనచతురంతయా, న మహాగ్రహారసన్మానయుతుఁడు

తే. తిమ్మయార్యుండు శివపరాధీనమతి య, ఘోరశివగురుశిష్యుండు పారిజాత
    హరణ మనుకావ్య మొనరించె నాంధ్రభాష, నాదివాకరతారసుధాకరముగ.

శా. స. 1485

వేలూరులో నొక గొప్పకోట కలదు. ఒకదేవళమును గలదు. ఈ గుడి కట్టించినవా రనేకవిధములుగా ననేకులుగాః జెప్పంబడుదురు. కృష్ణదేవరాయలు నందులోని వారిలో నొకఁడు. ఇతఁడు (A. D. 1586-77=1509 శా. శ.) సంవత్సరములో దీనిం గట్టించిన ట్లున్నది. (ఈ కాలమునకు 25 సంవత్సరములక్రిందటనే కృష్ణరాయనిర్యాణ మగుటంజేసి పై సంవత్సరము తప్పు) కృష్ణదేవరాయలకుఁ బూ ర్వ మిరువదియైదు సంవత్సరముల క్రిందట నొకరెడ్డి అక్కడ కోటఁ గట్టించినట్లు వాడుక గలదు. అపు డాకాలము శా. స. 1485 సమీప కాల మగును. కృష్ణరాయ లీయూర నుండుసూర్యగుంట చెర్వు త్రవ్వించెను. ఆయనభార్య కృష్ణాజీ అమ్మ యొకగ్రామమును రెండు దేవాలయములును దీని సమీపమునఁ గట్టించెను. మఱియొక కథలోఁ గృష్ణరాయని చాకలివాఁడును, బారికవాఁడును గొండపై పై నుండుకోటలఁ గట్టినట్లు వాడుక గలదు. వారిపేరిటనే అవి నేఁటివఱకుం బిలువఁబడుచున్నవి. మఱి కొందఱి మతములో నీరెండు కోటలును మహారాష్ట్రులవలన గట్టబడినట్లున్నది.

వురటూరు గ్రామమునకుఁ దూర్పు రెండు పరువుల దూరమున కోడూరు గ్రామము మజరా భూమెపల్లిగ్రామము శ్రీకృష్ణరాయలకుఁ గొడుగుపట్టెడు గొడుగుభూమానాయఁడు అనునాయన కోడూరు గ్రామమున కాగ్నేయభాగము సామీప్యమున తనపేరితో పల్లెకట్టించి తెలికెచెర్ల గోపాలాచార్యులకు నేకభోగసర్వమాన్య అగ్రహారములో నిచ్చెను. ఇందుకు దాఖలా యీ భూమిపల్లె పొలిమేరలో వలయ వామన ముద్ర చెక్కి దిగువ వ్రాసియుండునది :-

"శ్రీమతేరామానుజాయనమః తెలికచెర్ల గోపాలాచార్యులకు నేకభోగపుసర్వమాన్యము అగ్రహార మైన భూమానాయని పల్లెకు ప్రతినామ మైన వేదాంతాచార్యపురమునకు వలయశాసనము వామన ముద్ర స్తంభము."

చంద్రగిరిపరిపాలకుల హకీఖత్తు యాదవవంశస్థుల చరిత్రముగా కృష్ణరాయలవంశములో నుండెడు రాజుల చరిత్రములం జెప్పెడు వ్రాఁతమూలములాకోట నున్నవి. వానినుండి సంగ్రహించఁబడినది, తరువాత కాలములో యాదవరాజులలోని యొకప్రభుఁడు విజయనగరము దండయాత్రకై యత్నించి కృష్ణరాయని అధికారబలములను, అతని రాఁబడిని తెలుసుకొని యాప్రయత్నము మానుకొనియెను. అందు లోఁ గృష్ణరాయని దిగ్విజయవిశేషములు సంగ్రహముగా వివరించఁబడినవి. గజపతిరాజు తనకొమార్తెను కృష్ణరాయని కిచ్చి వివాహము చేసి సంధి చేసుకొనె నని చెప్పవలసియున్నది. కృష్ణరాయని మరణకాల మందులో శా. స. 1442 (A. D. 19th november 1531) కార్తిక శు. 8 అనీ యున్నది. ఈతేదీ పొరపాటు కావచ్చును.

శా. స. 1443 (A. D. 1531)

వల్లభాపురములో కృష్ణదేవరాయనివలన తుంగభద్రానదికి అడ్డముగా వంతెన కట్టఁబడినట్లున్నది. ఇది శా. స 1443 లో జరగినది. దీనికి దాఖలా ఆవంతెనకు రెండు వైపుల నుండు రాళ్లపైని శాసనములు చెక్కఁబడినవి.

page 484.

కృష్ణదేవరాయలు పెక్కు కోటలం బట్టుకొనుట.

ఓరుగల్లు రాజులవృత్తాంతములోఁ గృష్ణరాయలు విజయనగరములో రాజ్యము చేయుచు కొండవీడు, కొండపల్లి, ఇనమకొండ, బలవకొండ, నాగార్జునకొండ, మొదలగు కోటలను బట్టుకొనియెను. అతఁ డోరుగల్లులో నుండుతురుష్కులం జయించి ఆస్థలము నాక్రమించుకొనియెను. అతఁడు తాకతీయవంశస్థులకు భుక్తికి సరిపడుమట్టుకు నిచ్చెను. అచ్యుతరాయనికాలములోఁ గూడ నోరుగ ల్లతనిక్రిందనే యుండెను. రామరాయలును సదాశివరాయనితో సమానాధికారిగా నుండెను.

page 656.

కృష్ణరాయలు తనరాజ్యమును దొమ్మిది ఖండములు చేయుట.

కమలాచల నామాంతరము గలగోవిందగిరి కైఫీయతు.

గోవర్ధనగిరిచుట్టును ఎనిమిదికొండలు గలవు. ఇవి యన్నియుఁ గలిసినచో నాపర్వత మష్టదళపద్మమువంటి యాకారము కలదిగాఁ గానుపించును. ఈదేశములో నెనుబదియొక్క (81) కోటలు గలవు. వీనిని ప్రాచీనకాలములో మకుటవర్థనరాయఁడు, విక్రమార్కుఁడు, శాలివాహనుఁడు అను రాజులు పాలించిరి. శకవత్సరము ప్రారంభమైనపిమ్మట దక్షిణదేశమున కధిపతులు విజయనగరములో నుండెడు నరపతిరాజులై యుండిరి. ఈ వంశములో నఱువదినల్గురు (64) పురుషు లుండిరి. (ఇది తప్పుగాఁ దోఁచును) ఆయఱువది నల్గురిలో నరసింగరాయఁడు ప్రథానుఁడు. ఇతఁడు యాదవ వంశస్థుఁడు. విజయనగరముం జయించెను. అతఁడు తనస్వాధీనములో మూఁడుకోట లుంచుకొనెను. నరసింగరాయని కుమారుఁడు కృష్ణరాయలు అతనిమంత్రి సాళ్వతిమ్మన్న. అతని సహాయము వలనఁ గృష్ణరాయలు నలుబది (40) కోటలం జయించెను. శా. స. 1481 (ఇది శా. స. 1451 - 2 కావలెను) వఱకును రాజ్యము చేసెను.

కృష్ణరాయలు దేశమంతయు నొక్కఁడుగాఁ బాలించుటకు నది విస్తీర్ణతలో మిక్కిలి అధికమౌటచేఁ దనమంత్రి నడిగి యతని యనుమతిపైని దానినంతయుఁ దొమ్మిది ఖండములుగా భాగించి యొక్కొక రాజప్రతినిధిని (Viceroy) నియమించి పంపెను. ఇట్టిఖండములలోఁ గర్ణాటదేశ మొకఖండ మైయుండెను. దీని పరిపాలక రాజప్రతినిధి (Governor and Viceroy) ధర్మానాయకుఁడు. అతని వంశస్థులు శా. స. 520 మొదలు శా. స. 688 వఱకు నుండిరి. (ఇందలికాలనిర్ణయము తప్పు)

శా. స. (670 మొదలు 710 వఱకును ద్రవిడదేశము గొండ చోళరాయలు పై తొమ్మిదవ ఖండము గైకొనెను. శా. స. 711 మొదలు 720 వఱకును బాలించెను. పర్వతరాయలు శా. స. 721 మొదలు 780 వఱకును, గోవిందరాయ, అచ్యుతరాయ, విద్యాధరరాయ లనువార శా. స. 781 మొదలు 900 వఱకును బరిపాలించిరి. చిక్కరాయలు 901 మొదలు 970 వఱకుం బాలించెను. శివానీసముద్ర మాధవరాయలు శా. స. 971 మొదలు వేంకటపతివఱకును, అతనివంశములో (1050) వేంకటపతిరాయలు వ్యవహరించెను. సోమశేఖరరాయలు 1081 మొదలు 1110, ఆనె గొందె rరాయలు ఇంతవఱకు నతని వంశ్యులు పాలించిరి. శా. స. 1280 చివరవఱకును దేశము అ రాజకముగా (ప్రభువు లేకుండ) నుండెను. శా. స. 1300 మొదలు 1340 వఱకును ఇమ్మతూరిరాయ లతనివంశ్యులు, శా. స. 1341 మొదలు 1384 వఱకుఁ బాలించిరి. నంజరాయలు 1385 మొదలు 1416 వఱకు, గోవర్ధనరాయలు పాలించెను. జయదేవరాయలు దేశ మాక్రమించుకొని శా. స. 1492 వఱకును పాలించెను. ఇమ్మడి జగదేవరాయలు 1515 చివరవఱకుం బాలించిరి. కుమారజగదేవరాయలు శా. స. 1222 వఱకుం బాలించిరి. (ఇందలికాల మేలెక్కకును సరిపడియుండలేదు.)

page 527.

నెల్లూరిజిల్లాలోని మమతులూరుగ్రామకైఫియ్యతులోఁ గృష్ణదేవరాయలు గజపతిరాజుం జయించినప్పుడు లాకరాజు, చిట్టమరాజు, నారాయణరాజు, అను మువ్వురును ఆస్థలమందుండి వ్యవహరించుటకుఁ బంపెను. ఆ మువ్వురిలో ప్రతిమనుజుఁడును తనపేరితో నొక్కొకమండలము నేర్పఱిచిరి.

కమలాపుర వృత్తాంతములో:-

కమలాపురమునకుఁ బడమర నొక పరువు దూరమున చదిపి రేల అను గ్రామమును బ్రాహ్మణులకు సర్వాగ్రహార మిచ్చినందులకు దాఖలా చదిపి రేల గ్రామమున అగస్త్యేశ్వరుని ప్రాకారము లోతట్టుఱాతికి శాసనమున్నది. అందలి యక్షరములు శిథిలమైనవి. ఆ శాసనములో నాగ్రామస్థుల గోత్రము, సూత్రము, వారి వారికినిర్ణయించిన వృత్తులు వివరముగానున్నవి. మధ్యమధ్య నక్షరములు చెడిపోయినవి గ్రామస్థులు కృష్ణదేవమహారాయలనాఁడు ధారాగృహీత మైన అగ్రహారమని వాడుకొనుచున్నారు.

ఈ చదిపి రేల గ్రామమునకు దక్షిణమున జమ్మాపుర మను నగ్రహారమును కృష్ణదేవరాయలనాఁడే బ్రాహ్మణుల కీయఁబడె నని వాడుక గలదు. ఇందు కొక దాఖలా యున్నది. అది యెద్దియనఁగా నీగ్రామముయొక్క పొలిమేరలోని రాళ్లపైని జమ్మాపురమునకుఁ బ్రతినామ మగు శ్రీరామానుజపురము (కృష్ణరాయపురము) పొలిమేర అని వ్రాయఁబడియున్నది.

page 39.

కృష్ణరాయలు కర్ణాటకదేశమును జయించి విభజించుట.

కర్ణాటక రాజ్యవృత్తాంతములో వీరవిజయరాయలాదేశమునకుఁ ప్రభుఁడుగా నున్నట్లు కలదు. వెల్లాలరాయన్ ఫసలీ 750 లో వ్యవహరించెను. త్రినామలిగుడుకిఁ గొన్ని కార్యముల నతిశయముగాఁ జేసెను. అతఁడురాయల వంశస్థులకుఁ బన్ని చ్చు చుండెను. అతఁడు పడిపోయిన యనంతరము దేశము చిన్న చిన్న ఖండములుగా విభాగింపఁబడి ప్రత్యేక ప్రభువులస్వాధీనమాయెను. అనంతర మది కృష్ణరాయనికి స్వాధీనపడెను. ఇతఁడు కర్ణాటకదేశమున నొక గొప్పసేనను బంపెను. అది 1,00,000 (లక్ష) జనము కలదై యుండెను. దానిలోని సేనాజనులు. 1. విజయప్పనాయఁకుడు, 2. తుపాకీ కృష్ణప్పనాయకుఁడు, 3 విజయరాఘవనాయకుఁడు, 4 వేంకటప్పనాయకుఁడు, నై యుండిరి. ఫసలీ 870 లో విజయనాయకర్ విశేషముగాఁ బన్ను వసూలుచేసెను. అతఁడు వెల్లూరికడ విడిసియుండెను. చిత్తూరి పాలెగాఁడును తొండ్రమండలములోని యితర పాలెగాండ్రను విజయప్పనాయకునితో బేటీ చేసిరి. అతఁడు పైవారలు ఇడ్చుకోవలసిన పన్నులు నిర్ధారణచేసెను. ఇతర పాలెగాండ్రతోటిపాటు కాళహస్తిప్రభుఁడగు బొమ్మిరెడ్డి వృత్తాంతముగూడ జెప్పంబడెను. రాయలయొక్కసర్దారుఁడు వేలూరిమండి జిఁజీపట్టణమునకుం బోయెను. చోళమండలములోని పాలెగాండ్రు ఆసర్దారుని గలుసుగొనిరి. అప్పటిలో వా రియ్యవలసిన కప్పములు నిర్ణయించఁబడెను. విజయప్పనాయకుఁడు జింజీలోనే తన సేనలతో నుండెను. అతఁడు దానిక్రింద నుండు ప్రభువు లగు పాండ్య, చోళ, చీరరాజుల దేశములకుం బోయి కప్పముల నిర్ణ యించి వచ్చెను. తంజావూరు, తిరుచునాపల్లి, మధుర, తిరునగరు రాజులు పైసర్దారుని యిష్టానుసారముగా వ్యవహార కట్టుబాటులకు నంగీకరించిరి. ఈప్రకారముగాఁ దూర్పున నుండుకర్ణాటకదేశము (మయిసూరు మొదలగునవి చేరని దేశము) రాయలయధికారముక్రిందికి వచ్చెను. ఈ దేశమువలన రాయలకు మూఁడు కోటులు రూపాయిలు వచ్చెడివి ఆ దేశమంతయు మూఁడుఖండములు గా నేర్పఱుపఁబడినది. ఆమూఁటిని బరిపాలించుటకు మువ్వురు పరిపాలకులు (Governors) నియమించఁబడిరి. జింజీలో నుండుకృష్ణప్పనాయకుఁడు నెల్లూరు మొదలు కొల్లడం (Colaroon) నదివఱకును బరిపాలించుచుండెను. తంజావూరిలో నుండెడు విజయరాఘవుఁడను. నతఁడు కావేరినది ప్రవహించుటవలన ఫలవంత మై యుండినదేశ మంతయుఁ బాలించెను. దానికి దక్షిణమం దుండుదేశమంతయు వేంకటప్పనాయకునివలనఁ బాలింపఁబడెను. ఇట్టిరాయల యధికారము జెడఁగొట్టుటకు దురుష్క ప్రభువులు కొంద ఱేకీభవించిరి. రాయలతాలూకు రాజప్రతినిధి (Viceroy) అతనిసేనలతోగూడ రాయలసన్నిధికిం బోవ నాజ్ఞాపింపఁబడెను. అది మొదలు జింజీలో నున్న తుపాకీనాయకరు తనస్వాతంత్ర్యముం బ్రకటింప నారంభించెను.

page 69 I

కృష్ణరాయనికిఁ గల్గినశాసనము.

ఆనిగొందెకైఫీయతులో నీక్రింది వృత్తాంతము లున్నవి -

కృష్ణరాయలు నర్మదానదికి దక్షిణమం దుండుదేశమంతయు జయించెను. అతనికి లక్షసేన లుండెను. ఆనిగొందె సర్కారునకు లోఁబడియుండెడు నొకసామంత్రప్రభుఁడు దానిక్రింద నుండునిరువదికోటలు గల దేశమును బాలించుచుండును. కృష్ణరాయని యేనుఁగులబలమంతయు నతనివశములోనే యుండెను. అట్టి సామంతప్రభుఁడు కృష్ణరాయనివలన నొక సమయములో నానె గొందె విడిచి మఱియొక స్థలమున కుం బోవ నాజ్ఞాపింపఁబడియెను. ఆవృత్తాంతము వినినయిర్వురు గోసాయీలు కృష్ణరాయనితో నాసామంతప్రభుఁడు ధర్మాత్ముఁడనియు నతనిని దేశాంతరమునకుఁ బంపకుఁ డనియు విన్న వించుకొనిరి. కృష్ణరాయలు కనికరము లేనివాఁ డై సాధులబోధ లక్ష్యములేనివాఁ డై ఆసామంతుఁడు దేశాంతరము పోక తప్ప దనితీర్మానించెను. అపు డాయిర్వురుమహాత్ములును గృష్ణరాయనికిఁ గొన్నినీతు లుపదేశించిరి. అట్లివానిని వినియైనను లక్ష్యముసేయక కృష్ణరాయలు వారిని వదలి పొ మ్మని యాజ్ఞచేసెను. అపుడాసాధువులు కోపముతోఁ గృష్ణరాయలు సంతానహీనుఁ డౌఁగాక యనియును, అతని సింహాసన మెక్కుటకు న్యాయమగువారసుఁ డుండక పోఁగాక యనియు శపించిరి. వారిశాపానుసారముగనే కార్యములుజరిగె నని కలదు.

కృష్ణరాయని యల్లునకుఁ గల్గినలోపము.

ఇటులనే కృష్ణరాయని యల్లుఁ డగు రామరా జధికారము చేయు చుండఁగా నొక తురుష్కుఁడు (ఫకీరు) హిందువులు గౌరవించెడు నొక సరస్సులో స్నానముఁ జేయుచుండెను. అపుడు రాజభటు లా ఫకీరును బట్టుకొని రామరాజుకడకుం గొంపోయిరి. ఆఫీకీరుతో నతని మతస్థు లిర్వు రుండిరి. అపుడు రామరాజు వారి మువ్వురం గొట్టించి వస్త్రవిహీనులం జేసి వారిని ప్రాణములతో వదలిపెట్టెను అపు డాఫకీరులు ఢిల్లికిఁ (ఆకాలమున తురుష్కప్రభువుల రాజధాని) బోయి విజయనగరమును స్వాధీనము చేసికొనిననాఁడు ఢిల్లీప్రభువులు తురుష్కమతస్థులు కాకపోదు రని వట్టు బెట్టిరి. ఇట్లు ఫకీరులు పెట్టిన మొఱ లాలించి ఆతురుష్క ప్రభువు లపుడే విజయనగరముపై దండెత్తుటకు సన్నాహములు చేయ నారంభించిరి, పిమ్మట విజయనగరము వారివలన ముట్టడింపఁబడెను. అది అయినపిమ్మట రామరాజు వంశస్థులలో మఱికొందఱు ఆనె గొందెపైఁ గొంతకాలమువఱకును గొంచె మధికారము కల్గియుండిరి. రామరాజువంశస్థులలోనివారు టిప్పుసుల్తానుకాలములో నానెగొందె విడిచి షోలాపురమునకు లేచిపోయిరి. వా రిప్పటికి నచ్చటనే యున్నారు.

Mr, Taylor's Catalogue Raisonnee Vol III.

page 55.

పైగ్రంథకర్త తాను చేసిన (Analysis) అనుగ్రంథములోఁ గృష్ణరాయని గుఱించి కొంత వివరించితి నని చెప్పెను.

page 1gi

నెం. 656 లో గృష్ణరాయ అగ్రహారముయొక్క చెర్వువిషయము చెప్పంబడినది. ఈగ్రామములో నుండెడు చెరువులు మూఁడును తెగిపోవుటచేత నచ్చో నుండెడు బ్రాహ్మణ కరణములు కృష్ణరాయని సహాయార్థమై వేడుకొనిరి. కృష్ణరాయలు మిక్కిలి యౌదార్యముతో వారు గోరిన సహాయముం జేసెను.

page 400. (Catalogue Again)

కూరంబరు లనుపేరుగల యొక యారణ్యక శాఖామనుజుల వృత్తాంతమును దెల్పెడు నొకపుస్తకము సన్యాసికృత మైనది కలదు. దానిలో నీప్రజలయధికారము ఆ దొండెచక్రవర్తి అధికారము దనుకను జైనమతము ప్రబలువఱకు నున్నట్లు చెప్పంబడును. ఇంతియకాక యీ ప్రజలయధికారము కృష్ణరాయల అధికారమువఱకును బ్రబలముగా నున్నందులకు దృష్టాంతములు గలవు. వీరు గర్విష్ఠు లై యుండుటంబట్టి వేళ్లాలరు లనుజాతిప్రజలు కూరంబరుల సంహరించుటకుఁ గాను ముందర నారణ్యకులం బంపిరి. కృష్ణరాయల సేనలును, వియ్యాలవా రను పాలగాండ్ర సేనలును గూడి కూరంసర జాతివారిని మూలముట్టుగ సంహరించిరి.

page 430.

Cullattur (కల్లత్తూరు) అను గ్రామములోని ప్రాచీనములైన బంగారు పంట విషయము చెప్పుచు నీగ్రామము కూరంబరులయొక్క రెండవకోట గలదని చెప్పును. ఆదొండచక్రవర్తి వారిని జయించినపిమ్మట ఆకోటను పదిమంది స్వాధీనములో నుంచెను, వారిలో కొండయికట్టవేల్లాలరు నుండెను. వీఱందఱారాజునకుఁగ్రిందివారుగానుండి దేశమును బాలించిరి. ఒకబీద పురోహిత బ్రాహ్మణుఁడు తిరువల్లేశ్వర కోవెలకు వచ్చెను. వచ్చి కల్లత్తూరులో నొకభూమిని నిలిచెను. దేవుఁ డొకనాఁ డా బ్రాహ్మణునకుఁ గాన్పించి యాభూమి దున్నించినపుడు తనతోఁ జెప్పమనికోరెను. ఆబ్రాహ్మణుఁడు నట్లు కావించెను. అపుడు దేవుఁడువాహనముపై నెక్కివచ్చి గుప్పెడు విత్తనములు చల్లి అంతర్ధానము నందెను. తక్కిన విత్తనము లాబ్రాహ్మణునివలననే విత్తఁబడెను. ఆ నస్యము మిక్కిలి గోవగా నెదిగెను. ఆచుట్టపట్ల నుండెడు నితరుల నస్యములు నీరసముగా నెదిగెను. బ్రాహ్మణుని సస్యము మనుష్యున కందనంత యెత్తు ఆయెను. కాని వెన్ను మాత్రము వేయక యుండెను. దాని కా బ్రాహ్మణుఁడు మిక్కిలి చింతించెను. త్రోవంబోవు నొక వెల్లాలరు వాఁడు పైసస్యముయొక్క యొక దంటు తీసి విప్పిచూచెను. అపుడందులో నొకబంగారువె న్నుండెను. అంతట వాఁ డాబ్రాహ్మణునితోఁ దనసస్యముతో నతని సస్యము మార్చుకొ మ్మని కోరియొప్పించి దానికి వ్రాఁతమూలముల నేర్పఱచెను. ఇట్లుండఁ జిర కాలమున కాసస్యము వెన్నులు వేసెను. భూమియును బంగారురంగును బూనెను. ఆ వృత్తాంత మాకాలములో నాదేశముం బాలించుచుండిన హరిహరరాయలు విని సేనాపరివృతుఁ డై వచ్చి సస్యముం గోయించి నూర్పించి దానిని విభాగించి యొకపాలు వ్యవసాయకునకు, నొకపాలు భూస్వామికి, నొక పాలు రాజునకు నిర్ణయించి యెవరిది వారి కిచ్చి తనపాలు తాను గైకొని పోయెను. పైదదినును యిటుకలతోఁ గట్టఁబడిన చప్టాపై నూర్చఁ బడినది. అచప్టా కే కళ్ల మని పేరు. దానింబట్టి ఆ గ్రామమునకు వన్‌వెలెనాత కళ్లత్తూరు, అనగా బంగారు సస్యముగఁ బండునది. అని యర్థము. పైగ్రామములోని కోట తొండమాను చక్రవర్తి కాలము మొదలు కృష్ణరాయని కాలమువఱకును వెల్లార్ హర్, అనఁగా వ్యవసాయదారులను జాతివారి క్రింద నుండునది. ఆ జాతివారితోఁ గృష్ణరాయలు బ్రాహ్మణుల కొక యగ్రహారము కట్టి యియ్యమని ఆజ్ఞాపిం చెను. అపు డాజాతివారు దానింజేయమని తిరస్కరించి పలికిరి. దానికిం గోపించి కృష్ణదేవరాయలు వారిపై దండెత్తిపోయెను. ఆ యిర్వురకు నాఱుమాసములు మహాయుద్ధమాయెను. అందు పైజాతిప్రజ లనేకులు కృష్ణరాయని వలన సంహరింపఁబడిరి. అపు డాప్రజలు కృష్ణరాయనితో సంధిగావించుకొనుట మంచిదిగా నెంచి కృష్ణరాయనియాజ్ఞాను సారముగ నగ్రహారము కట్టి యిచ్చుట కంగీకరించిరి. ఇదియునుగాక రెండు సత్త్రములును గట్టి యం దొకదానికిఁ గృష్ణరాయని నామ ముంచి ప్రకటించిరి.

page 524

కాంచీపురముయొక్క కైఫీయతులో జైనులను శంకరాచార్యుల వారు కొట్టి హిందూమతమును స్థాపించె ననియు నిప్పటికిని జైన కాంచి యనుచిన్న యూ రున్నట్లును, జైను లచ్చో నున్నా రన్నందులకు గృష్ణరాయనివలనఁ గట్టింపఁ బడిన గోడలలోపలను, దేవళములలోపలఁ గూడ జైనవిగ్రహములు లుంచఁబడియున్నవి.

కృష్ణరాయ విజయకథా సంగ్రహము.

1. తురుష్కులను జయించుట, 2. ఒరిస్సారాజుకూఁతుం బరిణయమగుట, 3. సింహాసన మెక్కుట, 4. గజపతిని క్షమించుట, 5. తురుష్కులపై యుద్ధమునకు వెడలుట, 6. సేనానులు లోఁబడుట, 7. అహమదు నగరమును గై కొనుట, 8. గుణాగుణ విచక్షణము, 9. సాళువ తిమ్మరుసు (లేక అప్పాజీ) అను నతఁ డతనిమంత్రి, 10. శిదావిఖాన్ తో ఘోరముగాఁ బోరాడుట మొదలగు నంశము లున్నవి.

ఈ గ్రంథము కృష్ణదేవరాయలు తురుష్కులతోఁ జేసిన యుద్ధ వివరమును, తరువాత వారిం జయించిన రీతియును, గజపతిరాజు అనఁగా నోఢ్రరాజు కుమార్తెను కృష్ణరాయలు వివాహము చేసికొనివారితోఁ జేసిన సంధివిశేషములను విస్తరించుటకునై యున్నది. తురుష్కు లను జయించిన పిమ్మట వారితో స్నేహముగా నున్న గజపతి అధికారము తగ్గించుట అవసర మని కృష్ణదేవరాయని వలన నూహింపఁబడెను. మొదటయుద్ధారంభమైనది. కాని యితరచిక్కులు కల్గుటచేత రాయని యొక్క ముఖ్య మంత్రి యగుఅప్పాజీ చెప్పిన ఆలోచనము ననుసరించి గజపతితో సంధిచేయుటకుఁ బ్రయత్నము చేయంబడెను. అపుడు గజపతి తనకుమార్తెను కృష్ణరాయల కిచ్చి వివాహముచేయుట కంగీకరించెను. అటుపిమ్మట దేశానుచారముగఁ జిలుక రాయబారము వచ్చినట్లును అది రాయనితో గజపతి కూఁతువృత్తాంతమును సౌందర్యాదులును జెప్పినట్లు నుండి పిమ్మట అట్టి వృత్తాంతముల ననుసరించి వివాహమును జరుపఁబడె నని యున్నది.

కథావిశేషములు.

ఈ గ్రంథము వెంగయ్య కవివలనఁ జేయంబడినది ఇతఁడు కాలయ యను నతని కుమారుఁడు. హరిహడిచిన వేంకటభూపాలుఁ డీగ్రంథమునకుఁ గృతిపతి. అతఁడు కృష్ణరాయని చారిత్రమంతయుఁ గావ్యముగాఁ జేయంగోరెను. గ్రంథారంభములో విజయనగర పట్టణముం గూర్చి వ్రాసెను. అనంతరము కృష్ణరాయని తండ్రి యగునరసింహరాయని చారిత్ర విశేషములు వివరింపఁబడెను. అటుపైని నరసింహరాయఁడు విద్యారణ్యస్వామియొక్కయు విరూపాక్షేశ్వరుని యొక్కయుఁ బ్రభావముం గూర్చి నంప్రశ్నించినట్లును, దానికి సమాధానము చెప్పుటలో విజయనగరము కట్టుటకు పూర్వ మున్న విద్యారణ్యుని చర్యలును వివరింపఁబడినవి. అవి యన్నియు నీక్రింది విధంబుగా నుండును ఎట్లన్నను :-

ఈశ్వరుఁడు విద్యారణ్యుల యవతార మెత్తెను. ఆ విద్యారణ్యు లనంతరము శంకరాచార్య పీఠా రోహణముం జేసెను. విద్యారణ్యులు లక్ష్మినిగూర్చి తపస్సు చేసి ఆమెకటాక్షము నంది ఆయడవిలో నొకపట్టణము తనపేరిటఁ గట్టెను. అది లక్ష్మికి నివాసస్థానముగాఁ జేయంబ డినది. మొదట లక్ష్మీదేవి అతని నొకస్థల మన్వేషించు మని కోరెను. అతఁ డపుడు తుంగభద్రానదీతీరమునకుఁ బోయి అచ్చో విరుపాక్ష దేవు నాలయముం జూచి ఆస్థలమాహాత్మ్యముం దెలిసికొని అది రామాయణములోని యొకయితిహాసముం దెల్పుస్థల మవుటంజేసి అది నివాసార్హ మని భావించెను. ఆ పర్వతముపైకి సుగ్రీవుఁ డెక్కఁగా వాలి యెక్క లేక పోయెనఁట. మాల్యవంత మనుపేరుతో నైదుపర్వతము లచ్చో నుండును. యమకూటము, బసవశృంగము, మతంగ పర్వతము, కిష్కింధ అనునవి మిగిలిన నాల్గుపర్వతములు నై యున్నవి. అచ్చటి వారందఱు నాప్రదేశము నివాస యోగ్యమైన దని విద్యారణ్యులకుం దెల్పిరి. ఆసమయమందున నొక చెవులపిల్లి యొకసింహముం దఱుమఁగా నదానిని విద్యారణ్యు లీక్షించెను. అట్టి దాని కాశ్చర్యము నంది అది శూరులకు ముఖ్యస్థానముగా నిశ్చయించెను. ఆస్థలమం దొక పట్టణముం గట్టి విద్యారణ్యస్వామి దానికిఁ దనపేరిట విద్యానగరమ నునామం బుంచెను.

ఈ పైగ్రంథములో మఱికొన్ని కథలు తెల్పంబడిన యనంతరము నరసింహ రాయ లనురాజు పైస్థలవిశేషముల విని తనమంత్రి యగునప్పాజీని పిలిచి తనకుమారుఁ డగుకృష్ణరాయని ఆస్థలమందు పట్టాభిషేకము చేయు మని చెప్పెను. ఆమంత్రియు నటులనే కావించెను. కృష్ణరాయ లపాజీని రాజ కార్యములలో సహాయము చేయఁగోరుచుండెను. అప్పాజీ యట్లే చేయుచుండెను. అనంతరము కృష్ణరాయలు తనరాజ్యములోని కోటలును, ఇతరము లైన దుర్గస్థలములను జూడఁగోరెను. పిమ్మట ననేక రాజకీయ వ్యవహార విశేషములఁ బూర్ణముగాఁ దెలిసికొని రాయ లట్లుగా విన్న సంగతులు యథార్థము లగునో కావో కనిపెట్టుటకు మాఱువేషంబునఁ దిరుగుచున్న కాలములోఁ గృష్ణరాయ లొకప్పు డొక బ్రాహ్మణులయింటి ప్రచ్ఛన్నముగా నుండెను.

అపు డతని హరకారులు వచ్చి అతనితో మాట్లాడుచుండుట చూచి అతఁడు రాజుగా గ్రహించి అచటి బ్రాహ్మణులు కలిసి అతఁ డట్లు వచ్చుటకుఁ గారణ మే మని అతనినే (రాయలను) సంప్రశ్నించిరి. దానికి రాయలు సమాధానముగా నది దుష్టశిచణార్థము శిష్ట రక్షణార్థముగా నని వివరించెను.

సాళువ తిమ్మన్న యనుమంత్రి కృష్ణరాయనికి విశేషధన నిక్షేపములఁ జూపెను. అట్టి సమయములోఁ జారులుగా నుండుహరకారలు విజయపురము ప్రభునియొక్కయు (Bejapoore) నైజాముయొక్కము వ్యవహారములు కొన్నిటిం గృష్ణరాయనికిం దెల్పిరి. నరసింహరాయని సింహాసనమునకుఁ గృష్ణరాయలు వచ్చెననుమాట పై సంస్థానముల ప్రభువులు విని భయాక్రాంతులగుటంజేసియో లేక సహింపఁజాలకనో గాని నైజామును గజపతిరాజును విజయపురపు ప్రభుఁడును తమలోఁ దమ రొకసంధిఁ గావించుకొనిరి. వారిలో గజపతిరాజు జగన్నాథస్వామికి భక్తుఁ డవుటం జేసియు, బ్రాహ్మణపోషకుం డవుటంజేసియు నతఁడు క్షమియింపఁదగినవాఁ డని కృష్ణరాయని ముఖ్య మంత్రి కృష్ణరాయనితోఁ జెప్పెను. అటుపైఁ గృష్ణరాయలు డిల్లీపైకి (అనగాఁ దురుష్కులపైకి) దండెత్తుటకు నిశ్చయించెను. అట్టికార్యము నిర్వహించుటకుఁ దగిన సన్నాహములు ముందుగాఁ జేయంబడెను. పిమ్మటఁ గృష్ణరాయలు తనరాణువం దీసుకొని తరలెను. అట్టిసమయములో ననేకములగుశుభశకునములు గాన్పించెను.

ఇట్లుగా బయలువెడలి కృష్ణరాయలుపైరాజుల దేశములలో నుండెడు సామంతరాజులం జయించి వారిదేశములను స్వాధీనముచేసికొనియెను. ఎదిఱింపకనే లొంగినవారినందఱిని సంరక్షించెను. ఇట్టి యుద్ధములు పెక్కు లైనపిమ్మటఁ గృష్ణరాయలు గోలకొండపై దండయాత్ర నడిపెను. అపుడు లక్షగుఱ్ఱపుదళము గల తురుష్కసేన కృష్ణానదియొక్క అవతలదరిని వచ్చి నిలిచెను. అంతఁ గృష్ణరాయని సేనానులలో నొకఁడు తాను పోయి పైతురుష్కసేనలం జయించెద నని యును దన కాజ్ఞ యొసంగుమనియుఁ గృష్ణరాయనిం బ్రార్థించెను. దానిని విని కృష్ణరాయం డట్లే చేయు మని యాజ్ఞ నొసంగఁగా నాసేనాని తనసేనలతోఁ గృష్ణానది దాఁటి శత్రుసేనలపైఁ బడి యుద్ధము ప్రారంభించెను. అపుడు తురుష్క సేనయును ముష్కరముగఁ బోరనారంభించెను. ఆ యుద్ధము క్రమక్రమముగ నొక చండభండన మాయెను. తురుష్కులలోఁ బెక్కండ్రు హతులైరి. మిగిలినవారు నిలువలేక పలాయితు లైరి.

ఇట్లుగా శత్రువులు పలాయనముచేసిన యనంతరము కృష్ణారాయని సేనానులలోఁ గొందఱు శత్రుపట్టణములను వెంటనే పట్టుకొనుట మంచిది యని విన్నపము చేసిరి. కాని కృష్ణరాయని మంత్రిమాత్ర మట్టిపని చేయఁగూడదనియు నాస్థలములు మిగులఁ జతురంగబలయుక్తములై యున్న వనియుఁ జెప్పి ఆపట్టణములపైఁబోవు యత్నము గజపతిపైఁ బోవం జేయవలయు నని రాయనితో విన్నవించెను. ఇంతియ కాక గజపతియొక్క సేనలు కృష్ణరాయనిసేనలు నడుచునపు డనేకవిధముల మార్గవిరోధముం గల్గించుచుండెననియుఁగూడ విన్నవించెను. అట్టి మంత్రి వాక్యములకుఁ బ్రభుఁడు సమ్మతించి తనసేనల గజపతిపై నడిపించుట కాజ్ఞ యొసంగెను. పిమ్మట గృష్ణరాయని సేనలు గజపతిదేశము పై నడువ నారంభించెను. అట్టిసమయములో నాదేశములో నుండుసామంతప్రభువులు రాయలసేనల నెదిరించుచుండిరి. ఆసేన లోక వ్యూహముగా, గాని సంఘముగాఁగాని చేరి యుద్ధము చేసి యుండలేదు. కావున వారందఱును గృష్ణరాయనివలన సులభముగా జయింపఁబడిరి. కాని కృష్ణరాయలు వారినందఱ నాదరించి గారవించి వారివారిస్థలములు వారికిఁ దిరుగ నిచ్చి కప్పము కట్టుకొని వారిని వారిస్థానములలోనిలిపెను.

అటుపిమ్మటఁ గృష్ణదేవరాయలు ముందు నడిచి అహమదునగరములో (Ahmadnagar)లో తనసేనల నిలిపెను. అపు డచ్చో నుండు తురుష్క సేనలు భయంకర మైనయుద్ధముం జేసి తుదకుఁ బరాజయము నందిరి. అటుతరువాత కృష్ణరాయ లచ్చటనుండు పర్వతదుర్గముం బట్టుకొని తనజయ స్తంభము నచ్చోట నాటించెను. కృష్ణరాయల, సేనలు గజపతిదేశమున కింకను నడుచుచునేయుండఁగా నతనిమంత్రి యగుసాళ్వ తిమ్మన్న కృష్ణరాయనితో నిట్లనియె. గజపతిని మనము నిస్సంసయముగా జయించఁగల్గినను, అతని దేశమునకుం బోవుమార్గ మతిదుర్గమముగా నుండుననియు, ఆకారణముచేత నాప్రదేశములలో జరిగెడుయుద్ధ మతికష్టతరముగా నుండుననియు, కావున నోఢ్రరాజుతో సంధిచేసుకొనుట తగ వని నిశ్చయించి చెప్పెను.

అట్టి మంత్రివాక్యలముకు సమ్మతించినివాఁ డై కృష్ణరాయ లిట్లనియె. అడవియున్న దని చెప్పితివి కావున నది నఱికింపవచ్చును. గజపతి రాజును జయించుట యొక గొప్ప కార్య మనవలసినది లేదు. అతనిని సులభముగా జయించఁగలము. అని యిట్లుగా మంత్రివాక్యముల నిరాదరణచేయుటయేకాక కృష్ణరాయ లహంకరించి సేనలను ముందుకు నడిపెను. ఇట్లుండ మార్గమధ్యములో నుండెడు శిదావుఖాన్ అనునతఁ డఱువది వేలు (60 వేలు) ధానుష్కులతో వచ్చి యెదిరించెను. అతఁడు గజపతిరాజునకు జయము సమకూర్చుటకు నాయ త్తపడి యుండెఁగావున నాయుద్ధము కృష్ణరాయని కతికష్టసాధ్య మాయెను.

కృష్ణరాయలు సమీపించుచుండె ననువర్తమానము నోఢ్రరాజగుగజపతికి వచ్చి చేరెను. అపు డారాజుయొక్క మంత్రులు తమకు సహాయముగాఁ దురుష్కసామంతుల సేనలం గూర్చుకొనుట కర్జ మని విన్నవించిరి. ఇంతియకాక గజపతి చుట్టునుండుసామంతులలోఁ బదియార్గురు లేచి కృష్ణరాయని సేనలతో యుద్ధము చేయ ననుజ్ఞ యిప్పింపుఁడని గజపతితోఁ బ్రార్థన మొనరించిరి. గజపతి రాజును దానికి సమ్మతించి యుద్ధమున కనుజ్ఞ నిచ్చెను. అపుడు గజపతిసేనలు కృష్ణరాయనిసేనలతో యుద్ధమారంభించిరి. కృష్ణరాయ లిట్లుగాఁ బరసేనలు వచ్చుటకు జంకి నిరుత్సాహుఁడై తనమంత్రి యగునప్పాజీ చెప్పినహిత బోధముం జెవిఁ బెట్టనందులకు విచారింప నారంభించెను. పిమ్మట రాయలు తనమంత్రికి వర్తమానంబు పంపి పిలిపించి తా నావఱలోఁ బడినది తప్పుమార్గ మని యొప్పుకొని కార్యసాధక మగుకర్తవ్య మాలోచింపుఁ డని ప్రార్థించెను. అందుపైని అప్పాజీ అపుడు శత్రువుల జయించుట సులభము కా దని విన్నవించెను. అయినను అపుడు కర్తవ్య మా గజపతిసేనలకు భేదము కల్పింపవలె నని చెప్పెను.

పిమ్మట తిమ్మరుసు రాయనికడఁ గొంతధనముం గైకొని గజపతిరాజు సేనానులుగా నుండినపదియాఱు (16) గురు సామంతప్రభువుల పేరిటను భ్రామకము లగువార్తలు గలజాబులు వ్రాసి, సిద్ధపఱిచి వానిలో విలువ గలసొమ్ములు, ధనము, చీచి చీనాంబరములును ఉంచి ఆపెట్టెలును జాబులును తనమనుజుల పరముగా నిచ్చి, వారి నేకాంగులుగాఁ బోయి పెట్టెల నిచ్చినట్లు మరల జాబులు పట్టుకొనిరం డని పంపెను. అట్లుగా నాజ్ఞాపితు లై యాపరిచారకులు గజపతిసేనలకడకుఁ బోవుచుండిరి. అంతట గజపతిసైనికులు రాయనిపరిచారకులఁ బట్టుకొని గజపతికడకుం గొంపోయిరి. గజపతిరాజు ఆజాబులు జదువుకొని, తనసేనానులవర్తనమున కత్యాశ్చర్యము నందెను. ఆ జాబులలోని యంశము లెట్లు నున్న వనఁగా :-

"కృష్ణరాయలు మీరుకోరినపద్ధతుల కంగీకరించె ననియును, ఆపద్ధతులప్రకారము మీరు గజపతిరాజును దనకు నప్పగించెద రేని యిదివఱలో నిర్ణయమైనప్రకారము గ్రామములును, ధనమును, ఆభరణాదికములు మీపరము చేసెదము" అని తిమ్మరుసు వ్రాసినట్లుగా నున్నది. ఇట్లున్న జాబులం జదువుకొని గజపతిరాజు తాను పట్టుబడకుండు నుపాయ మాలోచించుచు నితరులకుఁ దెలియకుండఁ గొంతదూరము నం దున్న యొకస్థలమునకుఁ బోయి రహస్యముగా నుండెను. పైసామంత ప్రభువు లట్టితఱిలో గజపతిరాజు యుద్ధభూమియందుఁ గానరాకుండుటం జేసియు, నతనిక్షేమము తెలియకపోవుటంజేసియు యుద్ధము చాలించిరి. అట్టి సంగతిం దెలిసికొనిన వాఁడు కావునఁ గృష్ణరాయలు తనసేనలను యుద్ధమునకుఁ బురికొల్పక పైసామంతులకు నలజడి కల్గింపక నిల్చియుండెను.

ఇంతలో నప్పాజీ గజపతిరాజు కడకుం బోయి కృష్ణరాయ లాతని యోగక్షేమ మరయుటకుం బంపె నని వర్తమానంబుపనిచె. అట్టి మాట యెట్టిదో యని గజపతి కొంతవఱకు సందేహించి కృష్ణరాయలు న్యాయ మైనరా జగుటచేత నమ్మఁదగినవాఁడుగా నిశ్చయించి అప్పాజీకి సమయ మిచ్చి అతని రాయబారము విని సంతసించి అతనికి విశేషబహుమతులు గావించె. అపుడు తిమ్మరుసు రాయలయోగక్షేమము గజపతికిం దెల్పి రాయలకు మీకొమార్తె నిచ్చి వివాహముచేయుఁ డని గజపతికి విన్న వించిన దానికి గజపతియును నంగీకరించెను. అప్పాజీయు నట్టి వృత్తాంతమున కెంతయు సమ్మతించి అట్టి సంబంధ మవశ్యము జరుగవలసినదిగా బలపఱచి చెప్పెను. పిమ్మట నోఢ్రరాజుకోర్కెపైని యప్పాజీ అతనితో నగరులోనికి బహుమతుల నందుకొనుటకుం బోయెను. ఇట్లుగాఁ బోయి అచ్చట నప్పాజీ రాజ కుమారికం జూచుట కనుజ్ఞాతుండయి యా పెను వీక్షించి తిరిగి వచ్చెను. అట్టిసమయములో గజపతి పుత్త్రి యగుతుక్కారా మనుచిన్నది తనతండ్రి కడ కొకచిలుకం బంపెను. ఆ శుకమును గజపతి అప్పాజీద్వారముగఁ గృష్ణరాయనికడకుం బంపెను. రాయనిదరి నిల్చి యాకీరము తన్నుం బంపిన గజపతి పుత్త్రికయొక్కవిద్యా, రూప, లావణ్యాదికములు రాయనికిఁ దృప్తికర మగునట్లు చెప్పెను. అనంతరము కృష్ణరాయ కళ్యాణములో జరిగిన విశేషములును, రాయలు విజయనగరమునకుఁ దిరుగఁ జనుటయు వివరింపఁబడినది.

నోటు :- ఇది కృష్ణరాయ. విజయ కథాసంగ్రహము. ఫిరిష్తా (Ferishta) అను తురుష్కు చారిత్రకారుఁడును కృష్ణరాయలు తురుష్కులబహుధా పరాజయము నందించె ననియు నొప్పికొని యుండెను. కృష్ణరాయని మంత్రియొక్క యథార్థమైన నామము సాళ్వతిమన్న యనియు, అప్పాజీ అనుపేరు వ్యవహార మగుననియుం జెప్పెను. కృష్ణ రాయని మంత్రి యగునప్పాజీయొక్క బుద్ధిచమత్కారములు దెల్పుకథ లనేకములు దేశములో వ్యాప్తమై యున్నవి. అని టైలరు అను చరిత్రకారుఁడు వ్రాయుచున్నాఁడు.

కృష్ణరాయవిజయములోని కొన్ని యంశములు.

పై నుదాహరించిన కృష్ణరాయవిజయములోని కొన్ని యంశములు మాత్రము సంగ్రహించఁబడినవి. వాటిని గొంచెము విస్పష్ట పఱుపవలయును గావున నీక్రింద వివరించెదను.

1. కృష్ణరాయనికి సహాయులుగా నుండు నితర రాజులు.

1. ఆర్వీటివారు 2. నౌకువారు 3. నంద్యాలవారు 4. వెల్గోటివారు (వెలమలు). 5. పెమ్మసానివారు 6. బూడహరివారు 7. తొరగంటివారు 8. తుళువదొరలు 9. రావెలవారు.

2. కృష్ణరాయని రాజ్యకోశాదుల వివరము.

a. విజయనగరపట్టణమును గట్టించునపుడు విద్యారణ్యస్వాములవారు చేర్చినరూకలు తొంబదియాఱుకోట్లు భూషణములు నాలుగుకోట్లు. అవిగాక విద్యారణ్యులవారి యనంతర రాజులు కృష్ణదేవరాయలనాఁటికిఁ జేర్చినధనము తొమ్మిదికోట్లు.

b. కన్నడరాజ్యమంతయు నెనుబదినాల్గు 84 లక్షలు చెల్లుచుండెను.

c. వేయి జిరాగురాలకు లక్షవంతున నిరువదినాల్గువేల జిరాగురాలు నిరువది నాల్గులక్షలు కాల్బలము.

d. కరికి వేయిచొప్పున నూఱుకరిఘటలకు పండ్రెండులక్షలవరాలు.

e. వేయిమంది భటులకు నిరువదినాల్గువేలచొప్పున లక్షయఱువదివేలప్రజలకు నలుబదిలక్షలు జీతములు. ఈప్రకారముగానే తన్నాశ్రయించియుండు దొరలకు ముజరా యిచ్చుచుండెను.

f. కృష్ణదేవరాయ లధికారమునకు వచ్చునాఁటికి కృష్ణాకావేరి మధ్యదేశ మతనియధికారముక్రింద నుండెను.

కృష్ణరాయలు తురుష్కులపైఁ బోవునపు డున్న సేనల వివరము.

1. భటులు ఆఱులక్షలు 6,00,000

2. గుఱ్ఱములు అఱువదాఱువేలు 66,000.

3. ఏన్గులు రెండు వేలు 2,000.

4. సామంతు లగురాజులు, వెలమలు, కమ్మవారు తోడ నుండిరి. 5. దండయాత్రను వర్ణించిన కవులు, 1. మాదయగారి మల్లన్న, 2. అల్లసాని పెద్దన్న, 3. ముక్కు తిమ్మన్న మొదలగువారు.

3. గజపతిరాజునకు సహాయులై వచ్చిన పాత్రసామంతులు 16.

1. బలభద్రపాత్రుఁడు 2. దుర్గాపాత్రుఁడు 3. భీమాపాత్రుఁడు 4 ముకుందపాత్రుఁడు 5. భీకరపాత్రుఁడు 6. బేరుపాత్రుఁడు 7. రణరంగపాత్రుఁడు 8. ఖడ్గాపాత్రుఁడు 9. అఖండలపాత్రుఁడు 10. మురారిపాత్రుఁడు 11. వజ్రముష్టిపాత్రుఁడు 12. తురగరేవంతపాత్రుఁడు 13. గజాంకుశపాత్రుఁడు 14. అసహాయపాత్రుఁడు 15. మృగేంద్రపాత్రుఁడు 16. పేరు తెలియలేదు.

4 గజపతికూఁతు పేరు తుఖ్కాజీ అంబ.

గజపతికూఁతురు కృష్ణరాయని వెంబడించక మార్గములో నిల్చిపోవుట.

దీనింగూర్చి దేశములో నున్న కథలు మెకంజీదొర రికార్డులంబట్టి టెయిలరు దొర వ్రాసియున్న సంగ్రహమును మఱియొకచో వక్కాణించెదను.

కృష్ణరాయల కాలములోఁ దురుష్కుల యధికార ప్రాబల్యతవారితోఁ గృష్ణరాయలు పోరుట. (కుటుబ్‌షాహి తవారిక్ చరిత్రలో) నుద్తాఖాన్‌కూలీ కుట్బుషా హీజీరా. 918.

పై నుదహరించిన పుస్తకము ప్రస్తుతమం దనఁగా 1893 సం. మందు సజీవు లై యున్న వాలాజావంశస్థుఁ డైన హసనల్లిఖాన్ నవాబుగారియొక్క చెన్నపురి పుస్తక సముదాయములోనిది. (Library)

క్షత్త్రియుల విషయము.

కల్‌కుట్బుషా గోలుకొండ పట్టణమును కట్టించెను. గోలుకొండ రాజ్యాధిపత్యము ఆయన పుచ్చుకొనినపిమ్మట మొదటి యుద్ధము రాజు కొండవద్ద జరిగినది. ఆస్థలము పరిపాలించువాఁడు వేంకటనాయకనాముఁడు. దీనిపిమ్మట దేవరకొండకోట తీసుకొనఁబడెను. పైఁజెప్పిన యుద్ధమైనపిమ్మట పాంకల్, ఖాన్పుర యనుకోటలు తీసుకొనఁబడెను. ఖాన్పురకోట పాంకల్‌కును, కోయిల్ కొండకును మధ్య నున్నది. ఈరెండును బీజనగరు రాజ్యమునకుఁ జెందియున్నవి. కోయిల్ కొండయు పిమ్మట ఆక్రమింపఁబడెను. పిమ్మట చక్రవర్తిషితాబ్‌ఖాన్ అను రాజునకు చెందియున్న కంబముమెట్టు, ఓరంగల్ వేలం కొండ అను నీమూఁడు స్థలముల నాక్రమించుటకు బయలుదేఱెను. వేలంకొండ మొట్టమొదట తీసుకొనఁబడెను. పిమ్మట షితాబ్‌ఖానుఁడు చక్రవర్తి సైన్యమును యుద్ధముచేసెను. షితాబ్ ఖాన్ పాఱిపోయి కంబముమెట్టుకోటయందు దాఁగుండెను. ఈసంగతి నతఁడు దగ్గఱరాజులకుఁ దెల్పివారిసహాయము కోరి వారినందఱిని కంబముమెట్టు వారంగల్ కోటలకు తీసుకొనివచ్చెను. ఘోరయుద్ధ మైనపిమ్మట షితాబ్ ఖానును ఆతనిమిత్త్రులను ఫాదుషా యోడించెను. షితాబ్ ఖాన్ టెళ్లింగానారా జైనరామచంద్రదేవువద్ద శరణుజొచ్చెను. ఈతఁడు విశేషబలము కలవాఁడు. అతిగిరి, ఇంద్రకొండ, నాయలకొండ, కొండపల్లి మొదలగు దుర్గము లీతనిస్వాధీనములాయెను. బాదిషా కంబముమెట్టు దుర్గమును పట్టుకొని, వాని యావదాస్తిని దోఁచికొని. వానికుటుంబమును బంధువులను ఖైదీలనుగాఁ దీసుకొని పోయెను. బాదిషా ఓరంగల్‌కోటను నెవరిచే నెదుర్కొనబడకుండ నాక్రమించెను.

గజపతిరాజు పుత్త్రుఁడైన రామచందర్ టెలింగానాదేశమును బెంగాల్ దేశపు సరిహద్దువఱకు వ్యాపించియున్న ఒరిస్సాదేశమును తన స్వాధీనమం దుంచుకొని, కొండపల్లి రాజధానిగాఁ జేసుకొని రాజ్యము చేయుచుండెను.

ఈరాజు గొప్పధనవంతుఁడు. ఇతని సైన్యము, ధనము, మఱియు నితర మైనవస్తువులు నుత్తరహిందూస్థానపురాజుల సైన్యము మొదలైన వానితో సరిపోల్చఁబడునపుడు వారందఱు నితనికంటెఁ దక్కువవారై యుందురు.

షెటాబీఖాను, రామచందరదేవువద్ద దాఁగొనియున్నప్పు డితని మూఁడులక్షలకాల్బలము, ముప్పదివేలగుఱ్ఱపుదళము, తనరాజ్యము చుట్టుపట్ల నున్న దేశపురాజు లైనవిద్యాధర్, హరిశ్చంద్రుఁడు, ఇంకను మఱికొందఱు టెలింగానా దేశపురాజులు, గలసైన్యముఁ గూర్చికొని పాధిషా నెదిరించుటకు సిద్ధిపడెను. పాదిషా యీసంగతి వినఁగా నే రామచంద్రునిపై నైదువేలగుఱ్ఱపుదళముతో బయలుదేఱెను. రెండు సైన్యములు పిలంకజిన్నరీవద్ద నున్న నదివద్ద కలుసుకొనెను. రామచందరు పదివేల గుఱ్ఱపుదళముతోను, లక్ష కాల్బలముతోను, మూఁడువందలయేనుఁగులతోను మధ్యను నిలువఁబడెను. వానికుడిపార్శ్వమున పదివేలగుఱ్ఱములతోను, లక్షకాల్బలముతోను రెండువందలయేనుఁగుల తోను వానియన్న కుమారుఁ డగువిద్యాధరుఁ డుండెను. వానియెడమపార్శ్వమున పదివేలగుఱ్ఱములతోను, లక్షకాల్బలముతోను, రెండువందలయేనుఁగులతోను హరిశ్చంద్రుఁడు, షెటాబీఖాను, ఇంకను మిగిలిన రాజులును ఉండిరి. విలుకాండ్రు ఏనుఁగులపై నున్నహవుదాలపైఁ గూర్చుండిరి. ఈహవుదాలు తుపాకులు మొదలైనవి పట్టుకున్న వారిచే కాపాడఁబడెను.

ఫాదిషా యిరువదివేలగుఱ్ఱములతో మధ్యను నిలువ బడెను. వానికుడిపార్శ్వమున వానికొడుకు (షాజాడా) హైదర్ ఖాన్ పదునేను వందల గుఱ్ఱములతో నుండిరి. వాని యెడమపార్శ్వమున ఫాట్‌హిఖాన్ పదనైదువందలగుఱ్ఱములతో నుండెను. అప్పుడు జరిగినపోట్లాటలో, విధ్యాధరుఁడు షాజాదాచేఁ జంపబడెను. రామచంద్రుఁడు ఖయిదీగాఁ బట్టుకోఁబడెను. యుద్ధమునకు వచ్చినయితర రాజులు పాఱిపోయిరి. వారియేనుఁగులు ద్రవ్యము ఇతరమైన ఆస్తి ఫాదిషా తీసికొనెను.

అప్పుడు ఫాదిషా కొండపల్లికి బయలుదేఱెను. అక్కడ రేషీడ్ ఖాన్ అను వానిని కోటను తీసుకొమ్మని కొంతసైన్యముతో నుంచి, తాను రాజమహేంద్రవరము, ఏలూరు వైపులకు బయలుదేఱెను.

ఏలూరు ప్రవేశించిన పిమ్మట అతఁడు అక్కడికొండయధికారులను జయించు మని తనసేనానాయకులను బంపెను.. వారు వెళ్లి ఏలూరుపరగణాయం దున్నముఖ్యుల నందఱను జయించి వచ్చిరి.

ఫాదుషా రాజమహేంద్రవరమువద్ద నున్ననదిసమీపమునకు రాఁగానే, ఆదగ్గఱ నున్నయడవులయందు కొందఱు శత్రువులు రాత్రి వేళ నెదిరించుటకై దాఁగుండి రని అతనికిఁ దెలియవచ్చెను. అప్పు డతఁడు పాట్‌హిఖాన్, రస్టమ్‌ఖాను, అనువారలను రెండువేలగుఱ్ఱపు దళముతో పంపెను.

వారిద్దఱు అడవులకు వెళ్లి వారితో యుద్ధము చేయఁగా అశత్రువులు వారియాస్తిని కుటుంబములను వెనుకకు విడిచిపెట్టి కొండలకు పాఱిపోయిరి. ఫాదుషా సేనానాయకులు వారిని ఖైదీలఁగాఁ బట్టుకుని వారిసొమ్ము దోఁచుకొని తమ ప్రభువువద్దకు జయముతో వచ్చిరి.

వాసనాద్రన్ ఒడంబడికచేయుట.

గజపతి.

రామచంద్రదేవు తన రాజ్యమునుండి పాఱిపోఁగానే టెలింగ నాకును, బంగాళా సరిహద్దులకును మధ్య నున్న దేశపు రా జైనవాసనాద్రన్ అనువాఁడు ఫాదుషాతో నొడంబడిక చేసుకొనెను. ఒడంబడిక షరతు లేమనఁగా గోదావరీనది ఒకవైపు సరిహద్దుగా బంగాళాదేశము మఱియొకవైపు సరిహద్దుగాను గల్గి టెలింగనా, ఒరిస్సా దేశములతోఁ గూడుకొనినదేశము తనకు నీయఁబడవలె ననియు, గోదావరినదికి పైగా నున్నదేశమంతయు ఫాదుషాకు నిచ్చివేయుట యనియు. ఈ షరతులకు ఫాదుషా యిష్టపడి యా రాజునకు సంధిషరతులప్రకారము పట్టా యిచ్చెను. అప్పటినుండి ఏలూరు మొదలు ఫాదుషా రాజ్యము వఱకు నున్న పరగణాలు ఫాదుషావలన నేలఁబడెను.

బీజనగరముతో యుద్ధము.

ఫాదుషా టెలంగనా, ఒరిస్సాలపై దండెత్తియుండఁగా, బీజనగరపురా జైన కృష్ణరాజు ఫాదుషా దేశమునకుఁ జుట్టుపట్ల నున్న దేశమును దోఁచుకొని, ఫాదుషా వచ్చు చుండుట విని తాను తన దేశమునకుఁ బోయెను. ఆ సంగతి వినఁగానే ఫాదుషా క్రిందనున్న అమీరులు, కృష్ణానదికి అవతలివైపున నున్నట్టియు, కొండపల్లికి నెదురుగా నున్నటి కొండబీర్ అనుదేశమును తీసుకొమ్మని సలహా యిచ్చిరి. అతఁడు అప్పుడు కొండబీర్ నకు వెళ్లి ఆకోటపై నెదిరించెను. అంతట రాజు సైన్యమును విల్లంకొండ, పెనుగొండవద్దనుండి, రాత్రులు ఫాదుషా సైన్యముల నెదిరించి, సొమ్ము దోఁచుకొనుచుండెను. పిమ్మట ఫాదుషా వారి రెండుకోటలు ముందుగాఁ దీసుకొని, కొండబీర్ కోటను దీసుకొనుటకు నిశ్చయించెను. తరువాత విల్లంకొండ కోటపైకిఁబోయి, దాని నాక్రమించి, సోవాయిల్ ఖాన్ అనువానిని కోటకాపుగా నుంచెను. షాజాదా కొండపల్లిని జయించిన పిమ్మట ఫాదుషా కొండపల్లిని షాజాదా స్వాధీనములో నుంచి కొండపల్లిచుట్టు నున్నరాజుల వలన అల్లరులు జరుగుచుండె నని విని, యాయల్లరు లణఁచి వేయుటకు కొండపల్లికి బయలుదేఱెను.

కృష్ణరాజు ఫాదుషా కొండబీర్‌కోట నెదిరించుట విని, కొండబీరును గాపాడుటకుఁగానే బదివేల కాల్బలము, ఐదువేల గుఱ్ఱపుదళము గలసైన్యము, తనయొక్క చెల్లెలికుమారుని యధికారము క్రింద నుంచి, పంపెను. ఈసైన్యము కొండబీర్ చేరఁగా ఫాదుషా విల్లంకొండ కోట నెదిరించుటయు కొండపల్లి వైపు వెళ్లుటయు వారికిఁ దెలియజేయఁబడెను. వారు విల్లంకొండవద్ద ఫాదుషా లేకపోవుట చూచుకొని విల్లంకొండపైకి బయలుదేఱిరి. అక్కడ సోహియల్ ఖాను, ఎదిరించుకుండ కోట నిచ్చివేయుట కొప్పుకొని మూఁడురోజులు తనకు వాయిదా యిమ్మని కోరెను. తత్క్షణమే అతఁడు బీజనగరము సైన్యములు విల్లంకొండకు వచ్చి కోట నెదిరించినవార్త ఫాదుషాకు పంపించెను. ఫాదుషా విల్లంకొండకు తిరిగివచ్చి బీజనగరపుసైన్యము నోడించఁగాఁ, వారు తమ సొమ్ము విడిచి పెట్టి యుద్ధభూమినుండి పాఱిపోయిరి. ఫాదుషా ఆయాస్తిని తీసుకొనెను. ద్రవ్యమునుమాత్రమే అఱువదియేనుఁగుల పై వేసి తనబొక్కసమునకుఁ బంపించెను.

కొండబీరు తీసుకొనఁబడుట.

ఫాదుషా పిమ్మట కొండబీరుపైకి వెళ్లి కోట నెదిరించెను. ఫాదుషాతో నెదిరించలే మని రాజుసైన్యములు తెలుసుకొని, తాము కో టనిచ్చివేయుచున్నాముగావున తనప్రాణములు రక్షింపుఁ డని ఫాదుషాను వేడుకొనిరి. ఫాదుషా అందుల కొప్పుకొని కోటలో నున్నధనముతోఁగూడ రాజు నాక్రమించి, రాజుయొక్క సైన్యములను వారిదేశమునకుఁ బోనిచ్చెను.

కృష్ణరాజు తనయల్లునిఁ బంపుట.

ఫాదుషా కొండ బీరుకోటను తీసుకొనె ననుభయంకర మైనవార్త వినఁగానే, కృష్ణరాజు తనయల్లుఁ డైనబసవరాజువురపు శివరాజును లక్షకాల్బలముతోను, ఇరువదివేల గుఱ్ఱపుదళముతోను, ఫాదుషానుండి కోటను తిరిగి తీసుకొమ్మని పంపెను. బీజనగరపు సైన్యము వచ్చుచున్నదని ఫాదుషా విని అప్పుడు తన అమీరులను సలహా అడిగెను. అందుకు, వారు, కొండపల్లినుండి కొండబీరునకు కొద్దిరోజులలో రావచ్చును. గనుక కొండబీరుకోట విడిచి కొండపల్లికి పొ మ్మని సలహా యిచ్చిరి. అతఁడు ఆప్రకారముగాఁ జేసెను. రాజుసేనలు ఫాదుషా కొండబీరుకోట విడిచిపెట్టి కొండపల్లి వైపునకుఁ బోయె నని విని, కొండబీరుకోట నాక్రమించి, వారి బరు వైనసామానులు కోటలో నుంచి ఫాదుషా పైకి వెడలెను. ఫాదుషా కొండబీరు పైఁ దిరిగెను. అక్కడ జరిగిన యుద్ధములో, రాజుసేనలు రెండుజాములు పోట్లాడి, ఓడిపోయి కొండబీరుకోటలో దాఁగుండిరి. ఫాదుషా కొండబీరుకోటను ముట్టడించెను. అప్పుడు కృష్ణరాజుసేనలు, ప్రతిసంవత్సరము ఫాదుషా బొక్కసమునకు మూఁడులక్షల పెగోడాలు చెల్లించెద మనిన్ని, ఆస్థలమందే అప్పుడు రెండులక్షలు చెల్లించి, తక్కిన లక్ష చెల్లించువఱకు తమరాజ కుమారులలోఁ గొంతమందిని పూచీదార్లుగా నుంచెద మని చెప్పి ఫాదుషాతో సంధిజేసికొనిరి. ఫాదుషా అందుకు నొప్పుకొని, కొండబీరు తనరాష్ట్రములోఁ జేర్చుకొని వారిని విడిచిపెట్టెను.

కొండపల్లివద్ద అల్లరు లణఁచి వేయుట.

ఫాదుషా కొండబీరుకోట నాక్రమించె నని వినఁగానే కొండప ల్లిలో నున్న నాయికీవారు ఫాదుషా తమవైపు వచ్చునని మిక్కిలి భయపడి, కొండపల్లికోట తాళము లిచ్చి వేసెదమని, అదివఱకు తాము చేసిన పనులను క్షమించు మని వేడి షాజెడాతో సంధి జేసుకొనిరి. అందుపైని షాజెడా వారిని చూచి క్షమించి వారి అప్పటిహక్కులలో నుంచుటకు ఫాదుషాతో సిఫార్సు చేసెను. ఫాదుషా అందుకు సమ్మతించి, వారిని కాన్పురకోటకుఁ బొ మ్మని కొండపల్లికోటను విడిచిపెట్టు మని యాజ్ఞాపించెను. కొండపల్లికోట తుదకు షాజెడా కిచ్చివేయఁ బడెను. ఫాదుషా వలన చేయఁబడిన టెలింగనా యుద్ధముల వృత్తాంతమిది. ఇటనుండి వినికి మీఁద నేను పూర్వము వ్రాసినకథలు వ్రాసెదను.

కృష్ణరాయని ప్రథమవివాహచారిత్రము.

కృష్ణరాయనికి దాసీపుత్రుం డని ప్రసిద్ధి గల్గి యుండుటం జేసి సత్కులీను లగురాజు లేరును గన్నియ నీయ సంశయింపఁ దొడఁగిరఁట. దానికిఁ గృష్ణరాయండును మిగులం జింతించుచుఁ దిమ్మరుసునకుఁ దెల్పిన నాతండు సంశయింపకుము సత్కుల ప్రసూతన యగునొకప్రనవ కోమలిం దెచ్చి వివాహంబు సేసెద నని తెల్పి అప్పుడే బయలువెడలి సేనాపరివృతుండై వినుకొండకుం జనుదెంచి యచ్చో దమకుఁ గప్పము గట్టుగజపతికిఁ దనరాక యెఱిగించి పుచ్చె. సర్వాధికారంబు సేయు కృష్ణరాయనిముఖ్యమంత్రి వచ్చియున్నాఁ డని విని యారాజు నెదురుగ వచ్చి యాతనిం దోడ్కోని గృహంబునకుం జని సగౌరవంబుగ నాతని సత్కరించి మీరాకకుఁ గతం బేమి, దేవరయాజ్ఞ శిరసావహించెదము, సెలవిండనుడుఁ దిమ్మరుసు నవ్వుచు మీరు సత్యవాక్య ప్రామాణికులరు. నాయాజ్ఞ నడిపెద మని తెల్పితిరిగానఁ జెప్పెద వినుండు. మీకూఁతును మారాజశిఖామణి కిచ్చి పరిణయంబు సేయుఁడు. ఇదియ నాయభిమతంబు, అనుడు నారా జేమియు ననలేక వెలంవెలంబా~ఇ కొంతతడవు చింతించి మీయిష్టానుసారంబుగాఁ గార్యంబు నడిపెద నని తాంబూలం బిచ్చి యాతని సాగఁబనిచె. తిమ్మరుసును మిక్కిలి యా నందముతోఁ జనుదెంచి కృష్ణరాయని కాశుభవార్తం దెలిపె. అపుడు కృష్ణరాయం డావనిత సత్కులసంజాత యవుటకు సంతసించెఁగాని దాని రూపలావణ్యంబు లెట్టివో చూడవలె నని తెల్పె. దానికి తిమ్మరుసు మీ కాచిన్నది యక్షిగోచరం బగు టెట్లు గల్గు ననినఁ గృష్ణరాయం డేదియేని యుపాయంబుచే నావనితం జూచి గాని పరిణయంబు గా నని తెల్పె. అట్టిపల్కులు విని తిమ్మరుసు కొంచెము చింతించి మంచిది బయలువెడలుద మని తనపల్లకీలో రాజుంగూడఁ గూర్చుండఁబెట్టికొని రాణువ తోడ నడువఁ గదిలి పెనుగొండ చేరి లగ్న నిశ్చయంబునకుఁ బ్రధానంబునకు వచ్చు చున్నా మని గజపతికి వర్తమానంబుఁ బంచె. ఇట నాగజపతి తిమ్మరుసును బంచి నిజాంతఃపురంబునకుం జని తన బంధుల కవ్వార్తః దెలిపిన వారందఱుఁ గృష్ణరాయని నెంతయు నిందించి నీకూఁతుం గులము తక్కువవాని కిచ్చుట యనుచితం బని కోపించి పల్కఁ దొడంగిరి.

గజపతి అట్టిపలుకులు విని యేమియుఁ బల్క నోరాడక తిమ్మరుసున కేను మాట నిచ్చియుంటిని, నాపలుకు ననుసరించి కార్యంబు నడపెద. ఎవరియదృష్టం బెట్లున్న నట్లగు. పొ మ్మని యాతండుమాత్రము దానికి సమ్మతించె. బందువులందఱును స్త్రీజనంబును దాని కిష్టపడరైరి. అట్లగుటచే వారందఱుం గలిసి కృష్ణరాయని సంహరించియైనఁ దమనింద వాపికొనఁ దలంచిరి.

గజపతి తిమ్మరసుకోర్కె ననుసరించి ప్రధానతాంబూలంబు గొనుటకు నాతని రమ్మని వర్తమానంబు బనిచె. అప్పుడు తిమ్మరుసుం దగుపరివారజనంబులం గొని కృష్ణరాయనికి తాంబూల మందిచ్చువాని వేషం బమర్చి తనకంచుకంబుసంచిలో నాకుల నునిచికొని రాజుచుట్టిన యాకులన్నియుఁ బదిమందియుఁ జూచునట్లుగ నందికొని మఱియొకసంచి నుంచి మొదటిసంచిలోని మడుపులు నములుచు గజపతికోటలో నికిం జనుదెంచె. ఆరాజు నెదురుగ వచ్చి తిమ్మరసును లోనికిం దో డ్కొనిచనియె. అతండు తాంబూలంబు దెచ్చువానిఁ దనతో రమ్మనియె. లోనికిఁ జని తిమ్మరుసు గజపతిం జూచి మాతల్లి యగుభవిష్యత్పట్ట మహిషిని దర్శించు వేడుక గలదు. అనుడు వల్లెయని యారాజు తన యంతిపురి కవ్వా ర్తం బనిచి యాపెకు సన్నాహంబున నుండ నాజ్ఞ యొసంగి యాతనిం దోడ్కొని చనియె. అచ్చో నాచిన్నది సర్వాభరణ భూషితయై మేఘంబుచాటు నుండి బయలువెడలు మెఱపుచందంబున తెర దాఁటి వచ్చి యెదుట నిలచి తిమ్మరుసు నాతనితో నున్న పరిచారకుం జూచె. పరిచారకు నెగదిగంజూచుచో నాపెకు నాతని పా దంబున నున్న పచ్చలమట్టియ గాన్పించె దానిచే నాతండే కృష్ణరాయం డగు నని గ్రహించి గిఱ్ఱున వెనుకకు. దిరిగి లోనికిం జని ఆపరిచారకుండే కృష్ణరాయం డని తమవారికిం దెలి పె. అపు డాయాఁడువారలందఱు నాతనిం దమ కోటలోపలనే మృతినొందింపఁదలంచి యేమియుపాయం బని కల వెలంబడసాగిరి, దీనంతయుం దిమ్మరుసు నిమిషమాత్రంబున గ్రహించి కృతకభృత్యుదిక్కు మొగంబై కనుగీటి యౌరా తమలంబున సున్నం బింతగ వేసితివేలరా యని యుగ్రుండై లేచి తఱిమికొనుచు గృహాంగణంబు లన్నియుం దాఁటి సింహద్వారంబునుండి నిర్గమించె. రాజభార్యలు లోనుండి దేవిడీ బంధింపు మని వర్తమానంబు పంచిరి.అంతకుమున్ను వీరలిరువురును గోట వెలుపట వచ్చి నిల్చిరి. వర్తమానంబు రా వేగమే ద్వార పాలకులు తలుపులు బిగించి మార్గావరోధంబు గల్గించిరి. అంతట దిమ్మరుసు పఱచిన వార్త రాజభార్యలు విని యాతనిఁ బట్టి తెం డని కొందఱిని దుమికించిరి. వారికిని ద్వారావరోధం బే గలుగుటం జేసి మరలివచ్చి యవ్వార్త నగరునకుఁ బంచిరి. ఇటఁ గృష్ణరాయండును తిమ్మరుసుప్రజ్ఞావిశేషంబున నిశ్చింతతో శిబిరంబు లోనికిం జేరె.

గజపతి తనకోటలోని వృత్తాంతమంతయు నరసి తనవారిని వారించి లగ్ననిశ్చయంబు సేయుం డని తిమ్మరుసునకుఁ జెప్పిపంచె. అపుడు తిమ్మరుసు లగ్న నిశ్చయంబు సేసిమారాజులయింటఁ బెళ్ళికుమారుఁడు బాకునకు బాషికంబు గట్టి దానినే వివాహంబునకు బంచెడు నాచారంబు గలదు. సుముహూర్తదినంబునకు బాకుం దోడ్కొని మేమందఱము వచ్చెద మని వర్తమానంబు పంపించె. దాని విని గజపతి తిమ్మరుసుని యాలోచనమునకు సంతసిల్లి వల్లెయనియె. అప్పుడు తిమ్మరుసు కృష్ణరాయని నాతనిపురంబు చేరం బనిచి సుముహూర్తంబునాఁటికి నుత్సవంబుతో బాకుం దెప్పించుకొనియె. ఆబాకునకే గజపతిపుత్త్రిం బరిణయంబు సేయించి మరల దానిని గొని చిన్న దానిని మంచిదినంబున మారాజుకడకుఁ బంచివేయుండని తెల్పి సపరివారంబుగఁ దానుఁ దన ప్రభునిపట్టణంబునకుఁ జనియె.

గజపతియుఁ దనకూఁతుని నల్లునికడకు నంపుతలంపున నొకశుభ దినంబున సర్వసన్నాహంబులుఁ గావించి దాసీదాసాదులను కనకాంబరాభరణంబులను నిచ్చి ప్రయాణంబు సేసె. అపుడు పెండ్లికూఁతు తల్లి మొదలగువారందఱుఁ పెండ్లికూఁతుకడ కరుదెంచి బుద్ధులుసెప్పెడు తెఱంగున రహస్యంబుగఁ గృష్ణరాయల నెటులైనం జంపి తమకొలంబునకు విఖ్యాతి దెమ్మని బోధించిరి. అయ్యబల వీరిబుద్ధులకు నేమియుం బల్కవోడి తా నట్టికార్యంబునకుఁ జాల ననియె. దాని విని వారలు దాసీజనంబులలోఁ గొందఱకు నాతనిం జంపుబుద్ధులం దెల్పి వధూవరులం గదిలోని కనుపుచో నయ్యింతికిఁ గోప్యంబుగఁ గత్తులు గట్టుఁ డనిరి. వారును మంచిదని తత్ప్రయత్నంబుననే యుండిరి. సన్నాహం బైతిమని రాజునకుం దెల్ప నాతండు వారినందఱనానెగొందికి సాగఁబనిచె. వారును కతిపయదినంబులకు రాజధానికి వచ్చి చేరిరి. రాజును తనపట్టమహిషి వచ్చెననుమాట విని యూరును నగరును నలంకరింప భటులం బనిచె. తనరాణికిఁ దగు భవనంబుఁ జూప దాసీజనంబుల నియమించె. వారు నామెం దోడ్కొని చని యాభవనంబున విడియించిరి. ఇట్లు కొన్నిదినంబు లుండం దిమ్మరుసు నూతన రాజదంపతులకుఁ బున స్సంధాన ముహూర్తంబు దైవజ్ఞులచే నుంపించి యానాఁటిరేయి నొకభవనంబు విచిత్రంబుగ నలంకరింపఁ బంచి యందావధూవరులనుఁ బ్రవేశంబు సేయించె. ఆంతకుము న్నా పట్టమహిషి చెలిక త్తియలందఱు లతాంగికి కంటకంబుల నంటించు తెఱుంగున నాలతాంగికి మొలచుట్టును కత్తులఁ గట్టి పైని మృదుదుకూలంబులు కప్పి పయోముఖ విషకుంభంబుంబలె నుండ నలంకరించి యాయింట నొంటిగ నిల్పి వారందఱుఁ దాంబూలంబుల నందికొని యొకరొకరుగ గదిలోనుండి జాఱి తలుపు బిగించిరి. అపుడు కృష్ణరాయం డాలలనామణి కట్టియున్నగాగరఁ దనకాల నొడిసి పట్టి సామీప్యంబునకుఁ జేరదీసె. అపు డాకత్తులమొలనూ లుల్కాపాతంబుంబలె నేలపై నాచిన్నదానియరిష్టంబుఁ దెల్పుచుం బడియె. రాయఁ డాకత్తుల మొత్తంబుఁ జూచి యప్పా యేమి చిత్రము అని తిమ్మరుసును బిలిచె. ఎచ్చటనో నక్కియున్న తిమ్మర నవ్వార్త విని "జాగ్రతో భయం నాస్తి" అని యుత్తరం బిచ్చి యొకభటునిచే సేనల సన్నాహంబున నుండ వర్తమానంబు పంచి వెంటనే కొందఱ దాసీజనంబులఁ బిలువంబంచి దాసీజనం బిదె వచ్చియున్నా రని తెల్పె. అప్పల్కులు విని రాయండు తలుపు విచ్చి వెలికిం జనుదెంచి వారలతో నాచిన్న దానిని దోడ్కొని చని ఆపెజనకునియింట దిగవిడిచి రమ్మని యాజ్ఞ యొసంగె. అపుడు వారొకపల్లకిం దెప్పించి యాచిన్న దాని నం దుంచి యారాత్రియే బయలు వెడలిరి. వీరికి సాహాయ్యంబుగఁ గొన్ని సేనలు తిమ్మరుసుచే నడిపింపఁ బడియె అపు డాచిన్నది తనద్రోహబుద్ధికి రాజుదాక్షిణ్యచిత్తంబునకు గలతారత్తమ్యం బాలోచించి యహహా! యిట్టిపతికి దూరం భైతి. ఇఁకఁ బుట్టినయింటికి వారు చెప్పినకార్యంబు నడుపక యూరక చని తిరిగి వారిముఖ మెట్లు చూచెద. కావున నీసమీపంబున నున్న వనంబులో నుండి నేజేసిన మహాద్రోహంబునకుఁ బ్రాయశ్చిత్తవిధానం బరయుచు భగవంతుని స్మరించుచుండి కాలంబు గడి పెద నని నిశ్చయిం చుకొని యామీఁద పో నని పరిచారకులకుం దెల్పె. అప్పు డందులోని కొందఱుపరిచారకు లవ్వార్త రాజునకుఁ దెల్పిన నాతండు తిమ్మరుసుతో నాలోచన సేసి యామెయెడ సదయుం డై యచటనే యుండుటకు నాజ్ఞ యొసంగి యా పెకు వలయునపుడు కోరినధనం బి మ్మని యాతని కాజ్ఞ యొసంగె. ఇంతియకాక యాపె కచ్చోటనుండ నొక భవనంబు గట్టించి తగుసామగ్రిని దాసీదాసాదులను నియమించె. ఆచిన్నది యచ్చోట ననేక ధర్మకార్యంబులఁ జేయుచు మునివృత్తితోఁ బరంబు జింతింపుచుఁ గాలంబు గడపసాగెను.

ఈమెనామంబు వరదరాజమ్మ యందురు. ఈమెవాసముచేసినవనంబు కడప జిల్లాలోనిది. అచ్చోట దూరదూరంబున నుండునాలుగుపర్వతంబులలోనికి కట్టలు గట్టించి దాని నొక చెఱుపుగ నేర్పఱిచె. తత్సమీపంబున నున్నకొన్ని శిలాశాసనంబులలో వరదరాజమ్మ రూపు చెక్కఁబడియున్న దని వాడుక గలదు. ఈతటాకంబు మిగుల విశాలమై నదియు రమణీయ మైనదియు నెటు జూచిన నాఱుక్రోశంబులు (12 మైళ్లు) కట్టలు కలదియునై యున్నది. ఇం దనేకములైన లంకలు వ్యవసాయపుభూములు చిన్న పల్లెలుంగూడఁ గల వని వినంబడు. ఈచెఱువు సంపూర్ణ మగుచో జరిగె నని చెప్పంబడు నొకకథ కలదు. అది మిగుల నద్భుతంబుగఁ గాన్పించు. ఏదియేని విశేషకార్యంబు నెఱవేర్చు తఱి నిట్టిపనులు జరుగక తప్ప దని యిప్పటికిని కొందఱుహిందువుల యభిప్రాయంబు ఆకథ నీక్రింద వివరింతము.

ఈచెఱువు సిద్ధమగుతఱి రెండుకనములు విశేషవిస్తీర్ణంబుగలవి కట్టలలో నేర్పడెనఁట. దానిం గప్పింప నాయిల్లాలు విశేషంబుగ సొమ్ము వమ్ముచేసిన నది కార్యకారి కాదయ్యె. దానికి వరదరాజమ్మ చింతాకులమానస యై యేమిగతి స్వామీ యని యోచించుచుండె. ఇట్లుండు తఱి వీరియింటి కనుదినంబును మజ్జిగ నిచ్చునొక ముసలిగొల్లది వచ్చి యాపె చింతించుటకుఁ గారణ బడిగె. దాని విని వరదరాజ మ్మ వృత్తాంతం బంతయుఁ దెల్పి యుపాయం బేమియుం కానరాకుండుటంజేసి యిట్లు వగచుచుంటి నని చెప్పె. అపు డాపలుకులు విని యా వృద్ధాంగన యిట్లనియె. అమ్మా దానికి కారణంబు నాకుఁ దెల్లం బయ్యె. ఆచెఱువు నరబలిం గోరుచున్న యది. ఆకనమల నొక్కొక మనుజుని బలి యిచ్చినఁ గట్ట లెప్పటియట్టుల నుండు. ఈపని యెట్లు సిద్ధించు నని విచారింపవలదు. నే దానికిఁ దగునుపాయం బరసితి. నా కిర్వురుసుతులు గలరు. వారినిర్దఱ నాపని నెఱవేఱుప బనిచెద. నీకు సంశయింపం బనిలేదు. వారిని వానియం దుంచి యీసారి కనమలఁ బూడ్పింపుము. కార్యంబు గట్టెక్కు అను నా గొల్లదానిపల్కుల కులికి వరదరాజమ్మ భయకంపిత స్వాంతయై అయ్యయ్యో? యిట్లు పల్కు వెఱ్ఱులు గలరె? సుతుల బలికై యిచ్చెద మని సతు లనవచ్చునే నాచెరువు కనమలు పూడకున్నను మేలాయె నీకొడుకులఁ జంపఁ దలంపకుము. అని బుద్ధులు సెప్ప నట్టిపల్కు లాలింపక గొల్లది యేయుపాయంబుననైనం బురుషులలోఁ బ్రసిద్ధిని జెందినవానిజన్మం బే సఫలంబు. వగవకుము. పోయివచ్చెద నని యింటికిం జని తనపుత్త్రులం గని వారల కవ్వార్తఁ దెలిపి మీనామంబు లీభువి నాచంద్రార్కంబు లై యుండు సుకాలంబు సంప్రాప్తంబయ్యె, సముత్సాహు లై చనుండని తెల్పె. వారును మాతృ వాక్యపరిపాలనదక్షు లై పెండ్లికిం బోవునట్లుగ సంతసంబుతోఁ జనుదెంచి వరదరాజమ్మకుఁ గాన్పించి తల్లీ సుతులనామంబులు జగద్విదితంబు లగున ట్లొనరింపం గరుణింపవే యని పలికిరి. వారిసాహసంబునకు మెచ్చి మీకుఁ బ్రత్యుపకృతిఁ జేయ నే నెంతదాన, అయినఁ గొంతధనం బిచ్చెదఁ గైకొని ధర్మంబు సేసికొం డనుడు వార లిట్లనిరి. తల్లీ మాకు ధనం బేల మాయెడ నీకు దయ గలదేని మా నాంబు లీజగంబున శాశ్వతంబు లై యుండునట్లుగ మా పేరిట రెండూళ్లఁ గట్టింపుఁ డని తెల్పిరి. దానికి వరదరాజమ్మ సంతసించి వాగ్దానంబు చేసెను. అనంతర మా యిర్వురు సోదరులు పొలికలనుకుం జను మహాశూరులభం గి నిర్భయంబుగఁ జని వీరంబు సారించి యాజల దేవతను జయించుభంగిఁ జేతులెత్తుకొని భగవన్నామంబు దలంచుచుఁ జెరియొకకనమం బ్రవేశించిరి. అపు డా చెఱువుఁ ద్రవ్వు పనివాండ్రు వారిపైఁ గొన్ని తట్టల మన్నును ద్రిమ్మరించిరి. తోడనే యాకనమలు మరలఁ దెగక యప్పటియట్ల నుండెనఁట. అనంతరము వరదరాజమ్మ తనవాక్యాను సారంబుగ నాయిర్వురపేరిట రెండుగ్రామంబులు గట్టించె. వారిలో నన్న పేరు పెదకంబఁడు. తమ్మునిపేరు చినకంబఁడు. కావున నాగ్రామంబులకుఁ బెదకంబము చినకంబము నని నామంబు లుంచె. ఇపు డీ రెంటినిం గల్పి కంబమని యొకగ్రామంబుగ వ్యవహరింతురు. కృష్ణరాయపత్నికి ననఁగా నీ వరదరాజమ్మకు తుక్కాజీ యను నామాంతర మున్నట్లును, ఆమె కొన్నిశ్లోకములు కృష్ణరాయనికి దయగల్గునట్లు రచియించె ననియును ప్రతీతి గలదు. ఆశ్లోకము లీక్రింద వివరించెదము.

తుక్కాపంచరత్నములు.

'తుక్కానామ గజపతిపుత్త్రీ కృష్ణదేవరాయ పత్నీ' అని యున్నది.

శ్లోకములు.

1. చర న్వనాంతే నవమంజరీషు న షట్పదో గంధఫలీ మజిఘ్రత్,
   సా కిం నర మ్యా స చ కిం న రంతా బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా.

2. మా కింశుక ప్రకట యాత్మనిమేషమాత్రం మన్మస్తకే విహరతీతి మధువ్రతో౽యమ్,
    కిం మాలతీ విరహ వేదనయా త్వదీయం దృష్ట్వా ప్రసూన మచిరా దనలభ్రమేణ.

3. భ్రమర భ్రమతా దిగ న్తరాళే క్వచి దాస్వాదిత మీక్షితం శ్రుతంవా,
    వద సత్య మపాస్య పక్షపాతం యది జాతీకుసుమానుకారి పుష్పమ్.

4. కుసుమాని లిఖస్తు నామ చిత్రే కతిచి త్కారువిశేషరూఢశిక్షాః,
    సురభిత్వ మమూని కిం లభంతే కిము చైతేషు రసం పిబ న్తి భృఙ్గౌ:.

5. కిం మాలతీం మ్లాయసి మాం విహాయ చుచుంబ తుంబీకుసుమం షడంఘ్రిః,
   లోకే చతుర్భి శ్చరణైః పశు స్స్యా త్స షడ్భి రత్యర్థ పశు ర్న కిం ప్యాత్.

అనునీశ్లోకములు వరదరాజమ్మచేఁ గృష్ణరాయనికిఁ దనయెడఁ దిరుగ ననుగ్రహము గలుగుటకునై రచియింపఁ బడెననియును, అట్టి శ్లోకంబులఁ గృష్ణరాయనిహృదయము కరఁగెనని తెలియును. ఇదివఱలోఁ గృష్ణరాయ విజయములో గజపతి తనకూఁతునిచ్చి కృష్ణరాయనితో సంధిచేసుకొనె నని చెప్పఁబడినది. అది మొదటిదో యీకథ మొదటిదో తెలియఁ జేయుగ్రంథములు దొరకకపోవుటచేత నిపుడు మనము వ్రాయుచున్న గాథ కాధారము లేదు పైగా నీచిన్నది వినుకొండలోనుండు గజపతివంశీయుల పిల్లగాఁజెప్పఁబడును. కాని టైలరు దొర తావ్రాసిన యనాలిసెస్ (Analises) అనుగ్రంథములో మాత్రము కృష్ణరాయనిభార్య విజయనగరమునకుం బోవుచుఁ దా నొక స్థలములో నిలిచి అంతకుఁబైకి బోవ నని చెప్పె ననియు, నాకారణమునఁ గృష్ణరాయ లాపె నచటనే నిల్పి తగినవసతి యేర్పఱిచె నని ఈక్రిందివిధంబుగాఁ దెల్పును [6]

అంతమాత్రమున పైకథ కృష్ణవిజయకథతోఁ గలుపఁ గూడదని తలంచెదను.

కృష్ణరాయలద్వితీయవివాహము.

వరదరాజమ్మ కార్యములనుడువు తఱి మఱిచి పైదానిఁ దెల్పుట కెడమీయమైతిమి మన మీతనిప్రథమవివాహ వృత్తాంతము దెల్పి యూరకుండిన నిఁక నీతండును వరదరాజమ్మపోలిక మునివృత్తి నుండె నని తోఁచనోఁపు. అటుగావున నాతని ద్వితీయ వివాహవృత్తాంతంబును దెల్పుదము. అదియుఁ దొల్లిటికథయట్లే యుండుటంజేసి మరలఁ దొంటి వృత్తాంతమునే చెప్పుచుంటి మని చదువువార లూహింపఁగలరు. కావున మనము ముందుగా నీరెండుకథలకుం గలపోలికఁ జూపి దీనిలో భ్రమ యుండఁగల దని సూచించి కథ వాక్రుచ్చుట మంచిపనికావున నట్లే చేయుదము. వరదరాజమ్మను సాగఁబనిచి కృష్ణరాయఁడు మరల వివాహంబునకు బ్రయత్నంబుఁ జేయుచుండె. ఇట్లుండ నీతనికి నుత్కలదేశంబునకు (Orrissa) దండయాత్రార్థియై చనవలసినపని వచ్చె. అతఁ డచ్చో గొన్నిదినంబు లుండి యాభూమిపాలుని జయించిన నాతండు సంధికినొడఁబడియె ననియు నపుడు కృష్ణరాయం డాతనికూఁతుఁ దన కుద్వాహంబు సేసిన సమాధానంబు కల్గుననియె ననియుం జెప్పితిమి. (ఇపుడు వ్రాయుచున్న గాథ కృష్ణరాయ విజయగ్రంథానంతరగాథ) దాని కాతండు సమ్మతించి తనపట్టణంబు నలంకరింప చాటఁబనిచి తన నగరు నగురు ధూపాది సుగంధవస్తు సంవాసిత మగున ట్లొనరించె. ఆ వార్తలు విని యాభూపతి పుత్త్రిక తాఁ గులహీనుని భార్య గావలసె నేమి సేయుదు దైవమా యని చింతించి తుదకు నాకృష్ణరాయనిం జంపి తానుం జచ్చెద నని నిశ్చయించుకొనియె.

ఇట్లు నిశ్చయించుకొని తనకు మిక్కిలి యిష్టురా లగు తనచెలికత్తెతో నావృత్తాంతంబు మెల్లనఁ దెల్పి తనయుపాయంబున కపాయంబు లేదుగదా యనుడు నయ్యింతి యాచిన్నదానివాక్యము నెంతయుఁ బోషించి యా పెబుద్ధిం భూషించి దానిం దప్పకసేయు మని తెల్పి నిజావాసంబునకుం జని తనకు మిక్కిలి హితురా లగు నొక్క పూఁబోణికి శ్రుతపఱిచె. ఆఁడుదాని నోట నూవుగింజ దాఁగ దను నట్లు అది తనప్రాణసఖితోఁ దెల్పె. అయ్యింతి తననేస్తపుఁగత్తెతో విన్నవించె. ఇట్లీవర్తమానం బానోటనుండి యానోటఁ జేరి క్రమంబుగఁ దిమ్మరుసుచెవిం బడియె. ఆలోఁ గృష్ణరాయలను మంగళస్నానంబునకుం గొంపోయి యభ్యజనంబు గావించుచుండిరి. తిమ్మరు సెంతయు దనలో నాలోచనంబు సేసి యిపు డేమైన నోరు మెదపినఁ గార్యభంగం బౌ నని యెంచి తగునుపాయం బాలోచించుచుండె. ఇచటఁ గృష్ణరాయలఁ దెచ్చి పెండ్లిపీఁటపైఁ గూర్చుండఁబెట్టి యాయంగనామణికి మంగళసూత్రంబు గట్టించి. ఆరాత్రి యొకశుభముహూర్తంబున శ్రీపుష్పయోగం బునకుఁ బంపందలంచిరి. అపుడు తిమ్మరుసు కృష్ణరాయలకడ కరుగుదెంచి. యాతనికి రహస్యంబున నావృత్తాంత మంతయుం దెల్పె. దాని కాతండెంతయుఁ జింతించి యిదియుఁ దొంటిచందం బే యయ్యెనా యని యోచించుతఱిఁ దిమ్మరు సాతనికిట్లనియె. స్వామీ నీవు చింతింపవలదు. నీకు బ్రాణభయం బేమియు లేదు. నేనొక యుపాయంబు వన్ని యున్న వాఁడ .దానిచే నాయింతిమనంబు నుపథంబునకు వచ్చు నని తలంచెద. ఈ దినం బేలిక యేవారికిఁ గాన్పింపకుండ నొకరహస్యస్థలంబునం బడియుండుఁడు. అనితెల్పి యాతనిం బనిచి తిమ్మరుసాపునస్సంధాన భవనంబున కుం జనియందుఁ గృష్ణరాయనికి మాఱుగ నొక విగ్రహంబు సిద్ధంబు సేసి దానిలోఁ దేనే బోయించి హంసతూలికాతల్పంబున దాని నుంచి పైనుత్తరీయంబు గప్పి రాయండు బడలి యున్నాఁడు గావున నాతనిఁ గొంత వఱకు లేపవల దని యచ్చటిస్త్రీజనంబులకుం దెల్పె. వారును జరగనున్న వృత్తాంతంబు దెలిసియున్న వారలే కావున సంతసమేమియులేక వల్లె యని పెళ్ళికూఁతు నచ్చో దిగ విడిచి తలుపుమూసి తమత్రోవం జనిరి. అంతకుమున్నే తిమ్మరుసు నలుదిక్కులు బరికించి యేరికిఁ గానరాకుండఁ గృష్ణరాయల మంచముక్రింద నొదిగియుండె. చెలులందఱుఁ జనినతోడనే యా రాజకన్యక తాను దాఁచి తెచ్చినబాకుం దీసి యారాజు నొక పోటు పొడిచె. తోడనే యందున్న మధు ద్రవంబు పైకిఁ జింది యా యింతిముఖంబుపయిని నోటంబడియెను. దానిరుచి వెంటనే చూచి యాహా? యీరాజురక్తం బింతరుచియై యున్నది. రా జెట్టివాఁడో గదా ! మన కనుభవించుపంతు లేదయ్యె ననుడుఁ దిమ్మరుసు మెల్లన వెలికివచ్చి తల్లీ యారాజు వలయునేని నీ కాతనిం దెచ్చి యొప్పింతు. నీతొంటిబుద్ధి మానునట్లు వరమిమ్ము. అనుడు నాయింతి నిశ్చేష్టితయై కొంత తడ వుండి యాతండు తిమ్మరుసుగ నెఱింగి తాఁ జేసినద్రోహంబునకు క్షమియించి రక్షింప రాజునకుం దెల్పి యాతనిం దోడితె మ్మని ప్రార్థించె. అపుడు తిమ్మరుసు పెండ్లికూఁతుచే బాస లనేకంబులు చేయించి రెండవగదిలోఁ బండియున్న రాయల కవ్వార్తఁ దెలిపి తోడి తెచ్చి యావధూవరులఁ గలిపి యొకరియెడ నొకరికి గల్మషం బుండకుండఁ బ్రమాణంబులు సేయించి వారల దీవించి తనయింటికిఁ జనియె. అతని యాశీర్వచనబలంబుచే నాదంపతులు విశేష మైత్త్రి గల్గి చిరకాలంబు సకలభోగభాగ్యంబు లనుభవించి సంతసమున నుండిరి. ఆచిన్నదాని పేరు తిరుమలదేవి. మొదటి భార్యకుఁ జిన్నాదేవి యను నామాంతరము గలదు.

కృష్ణరాయని సంతానము.

కృష్ణరాయనికిఁ బురుషసంతానము లే దని యిదివఱకే చెప్పి యున్నారము. అతనికి స్త్రీసంతాన మున్నట్లుగ దృష్టాంతము లున్నవి. ఆ గ్రంథములలో నొకటి రామాభ్యుదయము. అందు అళియరామరాజుం గూర్చి వర్ణించుచు.

"ఆపటుకీర్తి రామవసుధాధిపచంద్రుఁడు కృష్ణరాయధా
 త్రీపతిసార్వభౌమదుహితృప్రియుఁడై."

అని చెప్పంబడియున్నది. ఇఁక రెండవగ్రంథము హైద్రాబాదాతురుష్కప్రభువుల వ్యవహారచరిత్రము. అందులోఁ బాదుషా కొండబీరుకోట పట్టుకొనినప్పుడు కృష్ణదేవరాయలు తనయల్లుం డగు "శివరాజు లేక బసవరాజును" నతని లక్షసైన్యములతోఁ బంపినట్లుగా వివరించఁబడి యున్నది. ఈ బసవరాజు బెజవాడలో నధికారము చేయుచుండిన పూసపాటి వంశములోనివాఁడు. ఇతని నాఁ డుదయగిరి దుర్గము మొదలు రాయవేలూరువఱకునుండుదేశము పూసపాటివారి స్వాధీనములో నుండె నని చెప్పియుంటిమి. పై యిర్వురు రాజులయొక్క భార్యలు కృష్ణరాయనికూఁతులుగాఁ గాన్పించుచున్నారు. ఇంక నెవరైనఁ గలరేమొ తెలియదు.

కృష్ణదేవరాయల సాహిత్యవిషయము.

ఈ కృష్ణరాయండు నొక గొప్పకవి. ఈతని ప్రజ్ఞావిశేషంబు లును సాహితీపటిమయు నీతనిచే రచియింపంబడిన యాముక్తమాల్యదం జూచిన గోచరంబవు. ఈతండు తత్పూర్వము రసమంజరీ ప్రముఖ సంస్కృత గ్రంథంబు లనేకంబులు రచియించె. ఈతఁడు గతించిన పిమ్మటఁ గొంద ఱాముక్తమాల్యదకుఁ గవి యీతండు కాఁ డనిరి. దానికివారి వలనఁ గొన్ని కారణంబులు చెప్పఁబడినవి. వానిని సంగ్రహంబుగ నిట వివరింతము.

పెద్దన ముందు మనుచరిత్రంబు వ్రాసె ననియు దానిం జూచి రామభూషణుఁడు వసుచరిత్రము నంతకు నెక్కుడు రససమంచితముగ నొనర్చెననియు దానికిఁ గనలి పెద్దన యాముక్తమాల్యదను వ్రాసెననియు, నది కఠినం బవుటచేఁ దానిఁ దనపేరిటఁ బ్రకటింపక కృష్ణరాయల పే రందుఁ గీల్కొల్పె ననియు దీనికి దృష్టాంతంబుగఁ బెద్దన మనుచరిత్రంబులోఁ జెప్పినపద్యంబులే కొన్ని యం దున్నవనియుఁ నట్టివచోధోరణి పెద్దనకుం దక్క నన్యులకు నలవడ దనియుఁ బల్కుదురు. ఇపుడిపుడు కొంద ఱాధునికులు రెండు గ్రంథంబులు సావథానంబుగఁ జూచి మనుచరిత్రములోనిజాడ లాముక్తమాల్యదలోఁ గానరాకుండుటం జేసియు గొన్ని ఛందోభేదంబులును వ్యాకరణభంగంబులు నిం దుండుటంజేసియు నిది పెద్దనకృతంబు గా దనియు మఱియొకండు కల్పనాంశంబునఁ బెద్దన యంత వాఁ డైనను శాస్త్రంబున నాతనిం బోలె విశేష పరిశ్రమంబు లేనివాఁడు రచించి నట్లున్నదనియు నిర్ణయించిరి. గ్రంథంబున నున్నస్ఖాలిత్యంబులం గూర్చి తర్వాత విచారింతము. అది పెద్దన కవనంబు స్పష్టంబుగఁ గా దనుటకు నిప్పటివారిచే మఱికొన్ని హేతువు లూహింపఁ బడుచున్నవి. అందుల నిజం బాలోచింపక తెలియరాదు.

1. వసుచరిత్రముం జూచి పెద్దన యీర్ష్యచే నాముక్తమాల్యద రచించె నని యుండెనుగదా దానికిఁ గారణం బూహింప వలయు. పెద్దన ప్రబంధమునకు వలయువర్ణనలును దానికిఁ దగు రచనావిశేషం బుల రీతులు నేర్పఱిచి యాంధ్రకవితా పితామహుం డని బిరుదందె. పిమ్మట లక్ష్యగ్రంథంబుగ మనుచరిత్రంబు రచియించి స్వసామర్థ్యంబు సూపె. ఇట్టిపని యీతనికిం బూర్వు లగు నన్నయభట్టారక ప్రముఖ పురాణ కవులును శ్రీనాథప్రముఖ కావ్యజ్ఞులును జేసియుండరైరి. కావున నీతనికి విశేషసన్మానంబు గలిగె. ఇట్టి యుత్తమోత్తమ మగుగౌరవమును బొందినయాతండు రామరాజభూషణుఁడు వసుచరిత్ర రచించె నను నీర్ష్యచే నతనికంటెను గౌరవంబు వడయ నింకొక ప్రబంధంబు వ్రాయ నుద్యోగించినాఁడను మాట యుక్తియుక్తముగ నుండలేదు. ఇంతియ గాక పెద్దనయే యట్లు వ్రాయదొరకొన్న నెట్టిదానినైనను వ్రాయసమర్థుండగుటకు సందేహంబులేదు. కఠిన మాయె నని యెంచిన దాని విసర్జించుఁగాక చించుఁగాక రాజుపే రం దుంచుటకు యత్నించునా. మనుచరిత్రంబు ముం దిడుకొని వ్రాసి రామభూషణుఁడు వసుచరిత్రమును రస సమంవితముగఁ జేయ వసుచరిత్రంబు ముం దిడుకొని భూషణుని కెక్కుడగు పెద్దన యాముక్తమాల్యద వ్రాయ నుద్యోగించిన దాని నెట్టి రసవంతముగఁ జేయవలయు ? అట్లుగాక కఠినమాయెనని యెంచియు రసపుష్టింగూర్చి తలంచియు దాని పండితులకుం జూపుటెట్లు గలుగు దీనిం బరస్పర భేదంబు లుండుటచేత నీయాముక్తమాల్యద పెద్దన కృతం బనుట సరి కా దని తోఁచెడిని.

2. గ్రంథంబున వ్రాసియుండు సంగతులంగూర్చి కొంతయోచించి యావలఁ దొంటి యభిప్రాయంబు స్థిరపఱుతము. "అని యిష్టదేవతా ప్రార్థనంబు సేసి మున్నే కళింగదేశ విజిగీషామనీషన్ దండెత్తిపోయి విజయవాటిం [7] గొన్నిదినంబు లుండి శ్రీకాకుళనికేతనుం డగు నాంధ్ర మథుమథను సేవింపంబోయి హరివానరోపవాసం బచ్చటఁగావింప నప్పుణ్యరాత్రచతుర్థయామంబున నాయీశ్వరుండు స్వప్నంబున సాక్షాత్కరించి యి ట్లనియె:

సీ. పలికి తుత్ప్రేక్షోపమలజాతి పెంపెక్క, రసికు లౌనన మదాలసచరిత్ర
    భావధ్వనివ్యంగ్యనేవధి గాఁగ జె, ప్పితివి సత్యావధూప్రీణనంబు
    శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి, సకలకథాపారసంగ్రహంబు
    శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితిసూక్తి, నైపుణిజ్ఞాన చింతామణికృతి

తే. మఱియు రసమంజరీ ముఖ్యమధురకావ్య, రచన మెప్పించికొంటి గీర్వాణభాష
    నంధ్రభాష యసాధ్యంబె యందునొక్క, కృతినినిర్మింపుమిఁకమాకుఁ బ్రియముగాఁగ.

అని పల్కి యాముక్తమాల్యద రచించుమని భగవంతుండాజ్ఞయొసంగి, అంతర్హితుండైన నిద్రమేల్కాంచి నిండోలగం బుండి విద్వజ్జనుల కత్తెఱం గెఱింగించిన వార లాస్వప్నఫలంబు విప్పి సెప్పి యఖర్వమహిమాతి ధూర్వహుం డగుతుర్వను వంశంబునం బుట్టిన నీ కిట్టి శోభనంబు లే మద్భుతంబు లవధరింపు మని యాతనివంశప్రణాళిక పెద్దనచే మనుచరిత్రంబున వర్ణింపఁబడినరీతిఁ జదివి.

తే. ప్రబల రాజాధిరాజ వీరప్రతాప, రాజపరమేశ్వరార్థదుర్గానటీశ
    సాహితీసమరాంగణ సార్వభౌమ, కృష్ణరాయేంద్ర కృతిని నిర్మింపు మనిరి.

అని పండితులు తనకు నాజ్ఞయొసంగఁ దా నాకృతిని నిర్మించితి నని కృష్ణదేవరాయండు చెప్పిన ట్లున్నయది. మనము తొంటిపల్కులఁ బాటించిన నిది యంతయు బూటకంబు గా వలయు. గ్రంథంబు రచియింప నసమర్థుం డై యొరులచేఁ జేయంబడిన గ్రంథమందుఁ దనపే రుంచ నుంచువాఁడు తాఁ బూర్వ మనేక గ్రంథంబులు రచించినట్లు చెప్పించు కొనుటచేఁ గల్గెడులాభ మపహాస్యంబుకంటె వేఱుండదు. తొంటి సంస్కృతాంధ్ర కవులు స్వకృత గ్రంథంబుల నితరులపేరు లిడునపు డబద్ధము లిట్లాడుట లేదు. ఇట్టిహీనకార్యంబునకు లోఁబడి కృష్ణరాయం డబద్ధంబుల నాడించుకొని పండితుల మొగంబు లెట్లు చూచె నని సంశయంబు వొడమెడిని.

3. ఇంతియకాక పెద్దనయే దీనింగూడ రచించి రాజుపేరిటం బ్రకటింపఁ దొరకొన్నఁ దా నా వఱకు మనుచరిత్రంబునఁ జెప్పినపద్యంబుల దీనియం దుంచ నితరులు స్వకృత మని యెఱింగిన రాజునకుగ్రౌరవహీ నం బగు నని యెంచి వాని నం దుంచుట కెంతమాత్రము నుద్యోగించియుండఁడు. అ ట్లుంచెననుటకుఁ గారణంబును వినము. అతండు క్రొత్తవాని రచించు సామర్థ్యంబు లేమింజేసి వీనినే యం దుంచెనా లేక యివియ లోకంబులోని పద్యములలో రమణీయంబు లనియుంచెనా ? మఱియొకరు పెద్దనకానివారు వీని నిందుంచినా రని యూహించుట యుక్తమై కానవచ్చుచున్నది. పెద్దనపద్యంబు లిం దుండుటం జేసియే యిది యాతని కృతి గా దని కంఠోక్తిగాఁ జెప్పుటకు హేతువైయున్నది గాని యాతనికృతంబే యనుటకుం గాదు. వంశావళి పద్యంబులు కాని వింకొకగొన్ని యం దున్నట్లు మనకుఁ గాన్పించు. అవి పెద్దనపై గ్రంథకర్తకుం గలగౌరవమును సూచించుటకుఁగాఁ గైకొనంబడియె నని యూహించుట యుక్తము.

4. గ్రంథంబున నున్నకథంగూర్చి కొంత యాలోచింతము. వైష్ణవ మతానుసారంబుగ గ్రంథారంభం బున్న యది. కథయు వైష్ణవసంబంధ మైనదే. వైస్ణవధర్మంబులును, తద్రహస్యంబులును, దత్సంబంధేతిహాసంబులు నున్నయవి. కావున నీగ్రంథంబు వైష్ణవమతావలంబకునిచే వ్రాయఁబడిన ట్లూహింపఁబడుచున్నది. పెద్దన స్మార్తుఁడేయని యాతని మనుచరిత్రారంభస్తోత్రపాఠంబులచే నూహింపనయ్యెడి. అయిననేమి పెద్దన పైగ్రంథము రాజుపేరిటఁ బ్రకటించఁ దలఁచెగావున నాతనికి నిష్టం బగు వైష్ణవమతానుసారంబుగనే రచించె నని చెప్పవచ్చు. కాని పెద్దన కీయభిప్రాయంబు మొదటనుండియు నుండినట్లు కానరాదు. ఉండుటకుఁ గూడ ప్రసక్తిలేదు. అనంతర మొక వేళ గ్రంథంబు మార్చుటకుఁ బెద్దన కిష్టంబున్నఁ గృతిముఖంబు మాఱుప యత్నించుఁగాని కథగూడ మాఱుపఁదలఁచఁడుగదా.

కావున వైష్ణవుండే వ్రాసె నని తోఁచెడిని. పెద్దన తాను శఠగోపాచార్యశిష్యుఁడ నని మనుచరిత్ర కృతిముఖమునఁ జెప్పియున్నను స్మార్తులలోని వాఁడే యవుటంజేసి కృతిముఖములోనే స్వమతాచార ము వదల లేకపోయెను. ఇఁక నాముక్తమాల్యదాకారుఁడో ప్రారంభమునందే వైష్ణవమతానుసారముగ స్తోత్రపాఠంబులు చెప్పెను. కథా సందర్భములోఁగూడ భాగవత ధర్మబోధక మైనదాని నెత్తుకొనియె. దీనికి నాలవయాశ్వాసంబులోని యామునాచార్యవర్ణనంబునం గలవైష్ణవమతసాంప్రదాయంబు లే దృష్టాంతములు. ఇతర మతస్థులచే నిది రచింపఁబడిన వైష్ణవభక్తియుఁ బ్రపత్తియుఁ జూపుటకుఁ దగిన వచోధోరణిచేఁ బ్రకాశించుట గడుదుర్లభంబు. కావునఁ దన్మతస్థుఁ డొకఁడు వ్రాసెననుటకు సందియంబు లేదు. కృష్ణరాయండుతాతాచార్యుల శిష్యుండనియు, విశిష్టాద్వైతి యనియు జగత్ప్రసిద్ధి గలదు. ఈతం డీగ్రంథమును రచించె ననుటచే నివియన్నియు నీతనికడ నన్వయించు.

5. రాజులకుం గలసామర్థ్యాతిశయంబు సమీపవర్తు లగుపండితులమూలముగ నూహింపందగియుండు. జగత్ప్రసిద్ధు లగునష్టదిగ్గజంబులు నీతని యాస్థానపండితులేగద. వారివారికవననైపుణింజూచి యొక్కకతఱి నెక్కుడుగ సంతసించి విశేషబహుమతుల నిచ్చుచుండె ననియు, విద్యల భోజుం డనియు విఖ్యాతి గలదు. ఇట్లు భోజునిఖ్యాతి గలిగి యున్నాఁ డని నుడివినచో భోజకృతగ్రంథంబులు కాళిదాసకృతంబులని యేరైన ననుచుండిరా. రాజును ప్రసిద్ధుఁడైన కవి యయ్యెనేని యట్టి మాటలు పుట్ట వని యనవచ్చు. ఈ రాజు లిర్వురును బ్రసిద్ధులైనకవులే. అందు భోజునకు నాతని ముఖంబు చూచువారెల్ల కవులయ్యెదరని వాడుక గలదు. కావున భోజుండు కవియవుటకు సందియ ముండదని యొప్పికొనిరి. కృష్ణరాయల కట్టి విఖ్యాతి లేదు గావునఁ గవి యని సందియంబుపడకుండ సమ్మతింపరైరి. పెద్దనకృష్ణరాయ లుత్ప్రేక్షోపమస్వాభావోక్తులఁ గవనంబు నుడువువారును గఠినవచోధోరణిగలవారును గావున వీరిభేదంబు నరయుట దుర్ల భం బై యుండు. పెద్దనకుఁ బండితఖ్యాతి విశేషంబుగ నుంటం జేసియు నాముక్తమాల్యదలోఁ గొన్ని ప్రౌఢ కల్పన లుండుటంజేసియు మనమీవఱకుఁ దెల్పిన సమానప్రజ్ఞలు కొన్ని యిర్వురకు సహజంబు లవుటంజేసియు అక్కడక్కడ పెద్దన్న పద్యంబులు కొన్ని యిం దుంటంజేసియు నీగ్రంథమునకుఁ గూడఁ బెద్దన యే కవి యని భ్రమగలుగుచున్నది. పెద్దన కృతం బీగ్రంథము కా దనుటకు దృష్టాంతములు పెక్కులు గలవు. అందు ముఖ్యమైనది రేఫ శకట రేఫల మైత్త్రి సమ్మతము. ఇది యీగ్రంథంబులోఁ దఱుచుగఁ గాన నయ్యెడి. దీనికిఁ గొందఱు లాక్షణికులు కొన్ని విధంబులుగను మఱికొందఱు మఱికొన్ని విధంబులుగఁ జెప్పుదురు. ఈగ్రంథంబు నందే కొన్ని ప్రయోగములు గాన్పించుటంబట్టి ఆశబ్దములకు ద్వైరూప్యము లున్నట్లు కొందఱులాక్షణికుల మతము. తొల్లిటి యాంధ్రగ్రంథంబులలో నిట్టివానికి ద్వైరూప్యములు కానరావు గావున నీకవికూడ వీని మైత్త్రికి సమ్మతించినవాఁడే యని మఱి కొందఱిమతము. అందుఁ గొన్నింటి నిచ్చట వివరింతము - "ఆముక్తమాల్యదా కారుండు లఘు రేఫములుగఁ బ్రయోగించిన వాని నితరకవు లట్లు ప్రయోగింప కుండుటచే నతఁడును లఘ్వలఘు రేఫములకు మైత్త్రి చెప్పిన వారిలోఁ జేరినవాఁడని యెంచుట యుక్తము. శైలి లోనగువానిఁ బట్టి చూడ నాముక్తమాల్యద చేసినాతఁడు పెద్దన కాఁ డని దృఢముగా దోఁచుచున్నయది. పెద్దనకవి రచితగ్రంథంబులోని పద్యంబులు కొన్ని యం దున్న వని చెప్పవచ్చెదరేమో దానికిఁ గారణాంతర మేదేని యుండనోవు." నని యలఘుకౌముదికారుల యభిప్రాయంబు. ఇంతియ కాక : -

6. "సదన మిఁ కొక్క మా టరసి చంచలలోచనఁ గానకున్న దూ,
      రెదు మఱి కాని బుద్ధి విపరీతతఁ బొందక చూడుమా"

"అనుదానిలో దూఱు" లఘు రేఫము గలదిగఁ బ్రయోగించినందులకుఁ దిమ్మకవి యాక్షేపించినాఁడు.

2. చ. తరుణులకౌఁగిట న్నునుచుఁ దమ్ము వృథా విరు లెత్తుచేసి మో
        పరులుగఁ జైత్రుడంచుఁ దదభావమనోభవవహ్ని వేల్చి ని
        ర్భరమదుపాళి ధూమము బరాగపునీరును దేనె కట్టి చా
        దరుదుగఁ దాల్పగాఁ గొఱవు లై యెఱుఁగంబ డెఁ గొన్ని భూజముల్.

అని ఇందలి కొఱవిశబ్దము రెండర్థములు గలది. ఒకయర్థము కాలి చల్లారినకఱ్ఱ. రెండవయర్థము కురువక వృక్షము. కురువకవృక్షభవ మగునపుడు గురు రేఫం బుండవచ్చునా యని యొక యాక్షేపణ. ఏమనిన సంస్కృతంబున గురురేఫములు లేవు. తద్భవంబులకుఁగూడ నెచ్చోటను నున్నట్లు గానరాదు. "తద్భవంబుల శకటరేఫ ముండకూడదు" అని కవి సంశయవిచ్ఛేదము. దీని నూహించి ద్వి రేఫవర్ణ దర్పణకారులు నాముక్తమాల్యదలోని శ్లేషరచనవలనను లఘువుగ దీనికిఁబ్రయోగంబు గానరాకుండుటంజేసియు గురువుగ నిర్ణయింపవలసి వచ్చినట్లు చెప్పి యుండిరి.

ఇంతియ కాక యీగ్రంథంబున నచ్చటచ్చటఁ గొన్ని వ్యాకరణ స్ఖాలిత్యంబులుగూడఁ గాననయ్యెడి. వీనిం బట్టి యూహించిన నీగ్రంథంబునకుఁ పెద్దన కృతికర్త యెట్లగు నని తోఁచకపోదు. వానినన్నిఁటి నిట నగపఱుచుట గ్రంథవిస్తర కారణము గావున నేదేని నొకదానిం జూపి ముందువృత్తాంతంబు నుడువుదము.

4. చ. అడుగున నుండియు న్బదిల మై చదలంటెడుకోట, నొప్పు ప్రో
        ల్చెడినికడంకదంచనపుచెతుల గంగను కాసె దూఱు గా
        నడుమున యున్కిఁజేసి యలనాకపురి న్సరికై పెనంగి లా
        వెడలఁగఁ బట్టి వ్రేయుటకు నెత్తెననం జను మల్లుపోరునన్.

ఇందు గంగను కాసె యనుచో సంధి విచార్యము "బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధిలేదు. గంగను కాసె నెల తిచ్చె నని యాధునిక ప్రయోగంబులు గాన్పించు. వీనికిఁబూర్వ కావ్యంబులఁ బ్రయోగంబులు మృగ్యంబులు. అని బాల వ్యాకరణము. ఇంకనుఁ గొన్ని ప్రయోగంబు లిట్టివే యచ్చటచ్చట గాన నయ్యెడి. పెద్దనయే యీ యాముక్తమాల్యదకును మనుచరిత్రమునకును గవియైన రెండవగ్రంథం బగుదీని రచించుతఱి నెక్కుడనుభవము గల్గియుండునా. లేక మొదటరచించిన మనుచరిత్రంబున కెక్కుడనుభవము గల్గియుండునా? రెండవగ్రంథంబును రచించుఱి నే యని సర్వసామాన్యముగఁ దోఁచును. అటులైన నీస్ఖాలిత్యంబు లుంటకుం గారణంబు లేదు. మొదటి దాని కే యెక్కుడు గల్గియుండు ననినఁ జెప్పనేల. ఇట్టి భేదంబులంబట్టిచూడ నిది పెద్దనకృతంబు గా దని స్పష్టంబుగ దోఁచెడిని. దీనియందు మనుచరిత్రంబులోని పద లాలిత్యంబును లేదు. రసపుష్టియు నంతమాత్రంబ. అటు లనినచో దీనికవి కివి యేమియుం దెలియవు గాఁబోలు నని యూహింపఁగూడదు. ఇట్లుండుటకుఁ గారణంబు లుండనోవు. కృష్ణరాయండు పెద్దన మొదలగు కవులరీతిని గురుశుశ్రూష చేసి శ్రమకోర్చి చదువు నభ్యసించి యున్న వాఁడు కాకపోవచ్చు. అయిన నెల్లపుడుఁ బండిత గోష్ఠి నుండువాఁడు గావున ముందు శ్రుతపాండిత్యంబు విశేషంబుగ సంపాదించి పిమ్మట శాస్త్రసంప్రదాయంబులు నేర్చి బుద్ధిమంతుండుగావున కవి యై గ్రంథముల రచియించి యుండు. విద్యలఁ గ్రమశిక్షితుండు గాఁ డనుట కీతనిపదలాలిత్యంబే దృష్టాంతంబు. ఇష్టానుసారంబుగఁ బ్రయోగించిన పదంబు లవుటం జేసి యవి యొకచో నిర్ణీ తార్థంబుకంటె నధికంబుగ వేఱొకచో న్యూనంబుగ నుండిత్వరలో భావద్యోతకంబులు గావు. ఇట్టి చిక్కులు పెద్దన మొదలగు వారి గ్రంథంబులఁ గానరావు. శబ్దంబుల నర్థకాఠిన్య మున్నను, భావకాఠిన్య మింతగా నెందును గానరాదు. ఈ పైఁజెప్పిన హేతువులనుబట్టి యూహింప నీగ్రంథంబు విశిష్టాద్వైతిచేతను సహజపాండిత్యునిచేతను రచియింపఁబడినట్లు గాన్పించెడిని. కృష్ణరాయలయం దీధర్మంబు లన్నియుఁ గాన్పించుటచేత నాతఁడే దీని రచించినాఁ డని నిశ్చయింపఁ దగియున్నది. ఈతఁ డచ్చటచ్చట నాశ్వాసాంతములఁ జెప్పిన పద్యంబులును మననిశ్చయమున కెంతయు బలము నిచ్చు చున్నవి. అం దొక దాని నిట వివరింతము.

మ. ఇది భూమండన కొండవీటిధరణీ భృద్దుర్గపూర్వాద్రిభా
      స్వదిభేశాత్మజవీరభద్రజనజీవగ్రాహరాహూయమా
      ణదృఢాంచద్భుజకృష్ణరాయమహిరాణ్ణామాస్మదాముక్తమా
      ల్యద నాశ్వాసము గద్యపద్యము ద్వితీయం బై మహిం బొల్పగున్.

ఇట్టిపద్యంబులంబట్టి మనకు సంశయంబుతోఁ బనిలేదు. ఇంతియకాక యీ యాముక్తమాల్యద పుట్టుటకకుఁ గవికర్ణ రసాయనము కారణ మని యిదివఱకే వ్రాసియున్నాము దానినే మఱి యొకపరి చూడఁదగును.

కవికర్ణరసాయనముతో సరిగా నుండుటకు నుద్దేశించి రచియింపఁబడినయాముక్తమాల్యదమాత్రము ఆమృదుశైలి నొప్ప దాయెను. కవికర్ణరసాయనములోఁ గల్పనా చమత్కృతులును శాస్త్రసాంప్రదాయములును, పాండితీవిశేషంబులుగూడ నాముక్తమాల్యద కెక్కుడు గా నున్నట్లే పండితుల యభిప్రాయము. అయిన నాముక్తమాల్యద అనేకప్రబంధములకంటె మిన్నయై యున్న దనుటకు సందియము లేదు.

పై రెండుగ్రంథరీతులనే యనుసరించి కవిరాజమనోరంజన మను నొక గ్రంథము కనుపర్తి అబ్బయకవిచే మఱికొన్ని దినంబు లైన పిమ్మట రచియింపఁబడినది. ఆ గ్రంథము మాత్రము కవితాసౌకుమార్యాదులయందుఁ గవికర్ణ రసాయనమును ఆముక్తమాల్యదను మించియుండినను శాస్త్రపాండిత్యాదులలో నారెంటివలె ప్రౌఢముగా నుండదు.

ఆముక్తమాల్యద కృష్ణరాయకృత మయినందుల కింకొక యాధారము.

ఈ నడుమ నొక క్షత్త్రియమిత్త్రుం గలిసికొని ఆముక్తమాల్యద యొక్క కవినిగూర్చి మాటలాడుచుండగాఁ నతఁ డాముక్తమాల్యద కవి క్షత్త్రియుఁ డని చెప్పుటకును, అట్టి క్షత్త్రియుఁడు సామాన్యుఁడు గాక విశేషరాజభోగముల ననుభవించు మహారా జై యుండు నని తెలుపుటకుఁ దగిన దని యా ముక్తమాల్యదలోని యీక్రిందిపద్యంబుఁ జదివె. ఎట్లన్నను:-

శా. తారుణ్యాతిగఁజూతనూత్న ఫలయు క్తైలాభిఘాతస్వనో
     ద్దారా ధూశ్చితశుష్క దంబుహృతమాత్స్యచ్ఛేదపాకోద్గతో
     ద్గారంబున్ గనరార్చుభోగులకు సంధ్యావేళలన్ గేళికాం
     తారాభ్యంతరవాలుకాస్థితహిమాంత ర్నా రికేళాంబువుల్.

అని యీపద్యముం జదివి కేవలము మత్స్యములు తినువాఁడును, అందులోఁగూడ రాజభోగ్యముగా దానిని పచనముచేయువిదములం దెలిసినవాఁడుగాని యిట్టిఅపరూపవర్ణనలు చేయంజాలఁడు. కావున నీ యాముక్తమాల్యద పైలక్షణములు గల్గినక్షత్త్రియుని వలనఁగాని లేక అతనికి సమానుఁ డగుమఱియొకవర్ణాంతరునివలనఁ గాని రచియింపఁ బడవలయునుగాని అట్టిమత్స్యభుక్కులు కానిబ్రాహ్మణు లగుపెద్దనాదులవలన రచియింపఁ బడఁజాలః దని నిష్కర్షించి చెప్పెను.

మా పైసిద్ధాంతములపై వచ్చిన పూర్వపక్షములఖండనము.

కొంతకాలముక్రిందట నముద్రితగ్రంథ చింతామణి కొకరిద్దఱు బుద్ధిశాలురు పెద్దనామాత్యుఁడే ఆముక్తమాల్యదను రచియించినకవి యని కొన్ని జాబులు పంపిరి. వానికిఁగూడ సమాధానములు చెప్పక పై యంశమును సిద్ధాంతీకరించితి మనఁగూడదు గావున వాని నీక్రింద వివరించి చూపెదను. ఎట్లన్నను :-

అముద్రితగ్రంథచింతామణి. సంపుటము. 2

7 నెంబరు సంచిక అ 1886 సం. డిసంబరునెల.

శ్రీమదముద్రితగ్రంథ చింతామణి పత్త్రికాధిపతిగారి సమ్ముఖమునకు.

మీపత్త్రికాచంద్రముపై నేనీక్రిందఁ బొందుపఱుచు చందంబు మందంబైనను మీకు నందించినందుకు నా డెందంబు సందియంబు బొందెడి.

సీ. శ్రీపూండ్లకులరామకృష్ణయార్యోడయ, ర్వీరనాగయకవివీరపత్త్రి
    కా మణ్యముద్రితగ్రంథచింతామణి, చింతామణియుఁబోలె సంతతోన
    శించు నని నిరాశ జేసికొన్న ప్రబంధ, ముల నుద్ధరించుచు మోదములగ
    హృద్యంబు లగుననవద్యపద్యముల, నభేద్యసమస్యల గద్యములను

తే. గీ. గలిగి సత్కవిజీవితములనుగూడ, సంశయాంశస్థలంబులఁ జాటుచుండి
        సింహపురమున వెలువడి సింహ మగుచు వెలయుచుండెడుకాకవిద్విపములకును.

ఇందుఁ బొందుపఱుచుదాని మీపత్త్రికయందు ముద్రించి తావశాభిప్రాయంబు నియ్యఁ గోరెద.

ఆముక్తమాల్యద పెద్దనార్యకృతంబు కా దనియుఁ, గృష్ణరాయకృతంబే యనియుఁ గవిజీవితకా రా ద్యాధునికుల యభిప్రాయం బై యున్నది. ఈదిగువను గనుపఱిచిన కారణంబులచే నయ్యది సరి యని నేఁ దలంపఁజాల. 1. ఈగ్రంథంబు నిక్కంబుగఁ గృష్ణరాయకృతం బేని సర్వజనోపకారియు రాజ్యాధి కారియుఁ గవిజనజీవనాధారకారియు నగురాయం డసమర్థుం డనియు నాముక్తమాల్యదకారుండు కాఁ డనియుఁ బెద్దనయె రచియించి రాయలపేరుబెట్టె ననియు నిట్టి యపవాద పుట్టుటకుఁ గారణంబు గానరాదు. భోజరాజకృతం బగుచంపూ ప్రబంధాదులను గాళిదాసుండు చేసె ననిరే. ఇట్టిపట్టుల నబద్ధంబు పుట్ట దని దిట్టంబుగఁ జెప్ప నొప్పు.

2. లోకంబులో నొకరు గ్రంథంబుఁ జేసి మఱియొకరి పేరుఁ బెట్టుట సర్వసాధారణంబుగా నున్నదిగదా. ఇందుకుఁ బెద్దిభట్టు చేసినవ్యాఖ్యానంబులును పుష్పగిరితిమ్మన కృతం బగుదశావతారచరిత్రము నుత్తర రామాయణంబును దార్కాణంబులు గావున "ఇట్లు హీనకార్యంబునకు లోఁబడి కృష్ణరాయం డబద్ధంబుల నాడించుకొని పండితుల మొగంబు లెట్లు జూచు నని సంశయంబు వొడమెడిని" యనునది సహేతుకంబుగ నుండలేదు.

3. ఈక్రిందిపద్యంబులు, పైయభిప్రాయంబునకు బలీయంబులు.

(a) సీ. కృష్ణరాయలపేరు నిడి నీవు రచియించి,తివి తొల్త విష్ణుచిత్తీయ మనఁగఁ
         గాఠిన్య మర్థంబు గ్రాహ్యంబు గాదు, సాధారణుల కని భూధవుఁడు బలుకఁ
         దరువాత మనుచరిత్రము నొనరించి తు,త్తమకావ్యము మహాద్భుతముగఁబిదపఁ
         బెక్కు కావ్యంబులు పెం పెక్క విరచించి, మంటివి రాజసన్మానమునను

తే. భంగ మొందిన యలరామలింగముఖులు, సాటిరాఁగలవారె నీతోటి నౌర
    యాంధ్రకవితాపితామహ యల్లసాని, పెద్దనార్య విశేషవివేకధుర్య. (చాటువు)

(b) పాండురంగవిజయమునందలి "ప్రౌఢదీర్ఘ సమాస" పదముఖసీసమునందు ద్వితీయచరణము.

"దానితల్లిగ నల్లసానిపెద్దన, చెప్పె మది దుది దప్పి యాముక్తమాల్య, దూ"

(c) అప్పకవీయమునందుఁ బ్రథమాశ్వాసాంతమున "ఆంధ్రకవితాపితామహుఁడు కొనియె ననుటకుఁ గొనె నని చెప్పె" నని అప్పకవివ్రాయుచు నుదాహరణంబుగ విష్ణుచిత్తీయమునందలి "పూనిముకుందునాజ్ఞఁ గను బొమ్మనె గాండివి" యను పద్యంబు వ్రాసె.

[దీనినిఁబట్టి చూడ నాముక్తమాల్యద పెద్దనార్యకృతం బని యప్పకవియభిప్రాయము]

(d) బ్రౌణ్యవైఘంటిక పీఠికయందు విష్ణుచిత్తీయము [ఆముక్తమాల్యద] పెద్దన చేసిన దని వ్రాయఁబడినది. ఈరీతిగనే ఆముక్తమాల్యద వ్యాఖ్యాత యగురామశాస్త్రుల వారును[8] 4. కవికర్ణ రసాయనమును గృతినొందకుండఁ బెద్దన విఘ్నంబుచేసె నని రాయలు కోపించినఁ దత్కోపనివారణార్థంబు రాయల పే రిడి యాముక్తమాల్యదఁ బెద్దన చేసె ననువాడుకయుఁ గలదు.

5. పెద్దన యద్వైతి యై వైష్ణవమతానుసారం బగుగ్రంథంబు నెట్లు రచియింపగలఁ డని యందు రేమో. విశేషపండితుండును "అతులపురాణాగమేతిహాసకథార్థ స్మృతియుతుఁడును" వైష్ణవాచారి యగుశఠగోపయతి శిష్యుండును వైష్ణవమతస్థుండగుకృష్ణరాయల పరమహితుండును నగుపెద్దనకు నీగ్రంథంబుఁ జేయ సుకరంబు గాదె.

6. ఈప్రబంధంబు పెటుకుగా నుండుటకును నచ్చటచ్చటఁ గొన్నిస్ఖాలిత్యంబులు గల్గియుండుటకును గారణంబుఁజూడ నీగ్రంథంబు పెద్దనకృతంబు కాదనియు రాయల కృతం బనియు లోకులకుఁ దోఁచుటకై పెద్దన బుద్దిపూర్వకంబుగాఁ బన్నినయుక్తియై యుండవలె. లేదా, 3(a) పద్యప్రకారము విష్ణుచిత్తీయము మనుచరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమరచిత గ్రంథంబున నొకటిరెండుతప్పు లుండుట సహజంబు.

7. ఆముక్తమాల్యదలోను మనుచరిత్రలోను వంశావళిపద్యంబులును మఱికొన్ని పద్యంబులును నొక్కటిగా నుంటకుం గారణంబు 3(a) పద్యంబు యథార్థమైనచో రాయలయెడ గౌరవముఁ జూపుటకు నాముక్తమాల్యద నుండి పెద్దన మనుచరిత్రమునకుఁ జేకొని వ్రాసి యుండవలె. లేక మనుచరిత్రము పూర్వగ్రంథమైనచోఁ గవులావంశావళి పద్యంబులు చదివినట్టుగా నాముక్తమాల్యదాకారు డాగ్రంథంబులో వానిం జేకొనియుండవలె. మనుచరిత్రములోని పద్యంబులు జగద్వివిదితంబులు. అవి పూజనీయుండగు పెద్దనార్యునిచే విరచితంబులు గావున సభ్యులాపద్యములనే చదివియుండుదురు. గ్రంథకర్త వారు చదివినట్టుగానే గ్రంథమందు వాని వ్రాసె. పెద్దన ఆముక్తమాల్యదను వ్రాసినప్పుడు తన్ను రాయలగాఁ భావించుకొని వ్రాసెనుగాని పెద్దన యనుకొని వ్రాసియుండలేదు. ఈసూక్ష్మంబు తెలిసినఁ బెక్కుసందియంబులు వీడును.

ఇంక విస్తరభీతిచే నెక్కుడు కారణంబులు వ్రాయ విరమించితిని. ఈమీఁదికారణంబులు బాగుగ గ్రహించిన నితరపక్షవాదంబు పూర్వపక్షంబుచేయ సులభంబు. ఈ యంశంబు బి. ఏ. విద్యార్థులకు నావశ్యకంబుగనుక పూర్తిగా ముద్రింపఁ గోరెద. ఆముక్తమాల్యదాకారుఁ డెవడో, విష్ణుచిత్తీయ మనుచరిత్రములలోఁ బూర్వగ్రంథ మెద్దియో యీపత్త్రికారత్నమును జదువుకవివరులు వారియభిప్రాయంబులఁ బ్రకటింపఁ బ్రార్థితులు.

ఇట్లు తమవిధేయుఁడు,

బోడపాటి. రామలింగేశ్వరప్ప

చందాదారు-సబ్‌రిజిస్ట్రారు.

శివకోడు.

గోదావరిజిల్లా.

సెప్టంబరు 27 తేది. 1886.

పైయుపన్యాసమునకు సమాధానము.

ఇట్టి యుపన్యాసము కవిజీవిత గ్రంథకర్త నగునాకొఱ కుద్దేశింపఁబడినను నెల్లూరునం దుండుపత్త్రికకుఁ బంపఁబడుటంబట్టి దాని ప్రకటన సంగతియే కొంతకాలమువఱకు నాకుఁ దెలియలేదు. అనంతరము మఱి కొంతకాలమునకు నముద్రితగ్రంథచింతామణి పత్త్రికాధిపతి తమ చింతామణి మయూఖములు చేర్చిన సంచిక యొకటి కార్యాంతరముపై నాకుఁ బంపఁగా దానిం జూచుచుండి పైయుపన్యాసముం గాంచితిని. అప్పటికిఁ గాలాతిక్రమణమై యుండుటంబట్టియు నాకవిజీవితములు రెండవకూర్పునకుఁ దిరుగ సిద్ధము చేయంబడుటఁబట్టియు వెంటనే నాయభిప్రాయముఁ బ్రకటింపనైతిని. ఇపుడు కృష్ణరాయచారిత్రము ప్రకటించుచున్నాఁడను గావునఁ బైయాక్షేపణలకు సమాధానము వ్రాయక విధిలేకవచ్చినది. కావున దాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను.

(1. పూర్వపక్షము.)

ఈగ్రంథము నిక్కంబుగఁ గృష్ణరాయనికృతంబేని రాయం డసమర్థుం డనియు, నాముక్తమాల్యదాకారుండు కాఁ డనియుఁ బెద్దనయే రచియించి రాయలపేరు పెట్టె ననియు నిట్టియపవాద పుట్టుటకుఁ గారణంబు కానరాదు. భోజరాజకృతంబు లగుప్రబంధాదులను గాళిదాసు చేసె నని యనిరే. ఇట్టిపట్టుల నబద్ధంబు పుట్టదని దిట్టంబుగ జెప్ప నొప్పు.

1. (సమాధానము.)

పెద్దన కృతము లగుపద్యములు కొన్ని మనుచరిత్రలోనివి ఆముక్తమాల్యదలోఁ గానుపించుచుండుటం జేసియు పైయపవాదకుఁ గారణ మని చెప్పితిమి. అట్టిది కా దనుట కేమికారణముచెప్పిరో తెలియదు. భోజునిముఖము చూచు వారందఱును కవు లవుదు రని ప్రతీతి యుండుటబట్టిం భోజుఁడు దాఁటుకొనిపోయెను. కాని లేకున్న భోజకృత గ్రంథంబులును గాళిదాసాదిమహాకవికృతము లని లోకప్రతీతి యేల కలుగకపోవు నని యీవఱకే నేను వ్రాసియున్నాఁడను. కావున దీనికి వేఱుగ సమాధానము చెప్పనక్కఱ యుండదు.

2. పూ. పెద్దబట్టుచేసిన వ్యాఖ్యానములును, పుష్పగిరి తిమ్మన కృతం బగు దశావతారచరిత్రయు నుత్తర రామాయణంబును లోకములో నొకరుచేసి మఱియొకరు పేరు పెట్టుటకు దృష్టాంతము లని యిట్టిపనులు సర్వసాధారణములుగా నున్న వని.

2. న. ఈ పైరెండుపుక్కిటిపురాణములకును గ్రంథ దృష్టాంతములు లేవు. పెద్దిభట్టు అనునది వేఱనుకొనుట భ్రమ. లోకములో నబ్బిశాస్త్రి యని, పిల్లావుధాను లని, బొఱ్ఱబాబు అని, బంగారు అబ్బాయి, అని కొన్ని బాల్య కాలనామంబులు వ్యాపకములో నుండుట గలదు. ఆపేరులు గలవారికి వేఱునామంబులు లే వని యూహించుట లోకానుభవము లేకుండుటం దెల్పును. పెద్దభట్టనునది బాల్యనామము. ఆనామముతో నొప్పునతనిపేరు మల్లినాథుఁడు. వారి యింటిపేరు కొలిచెలమల (కోలాచలము) వారు. అతని కేమహామహోపాధ్యాయుఁ డని బిరుదు కలదు. పెద్దిభట్టు చేసినాఁ డని చెప్పెడు వ్యాఖ్యానగ్రంథము లన్నిటిలో నిట్లె యున్నదిగాని ఇది పెద్దిభట్ట విరచిత మని లేదు. పుక్కిటి పురాణముల నమ్మిన నింతకంటెను బ్రమాదములు గలుగఁగలవు కావున గ్రంథస్థగాథల నమ్ముటకు నుపన్యాసకుం బ్రార్థించెదను. ఇఁక పుష్పగిరితిమ్మన్న దశావతార చరిత్రము చేసి యొకరిపేరిట, నుత్తర రామాయణముచేసి మఱియొకరిపేరిటను బ్రకటించె ననుదానికిఁగూడ వ్రాఁతమూలము లైనయాధారములు లేవు. ఇంతియకాక కంకంటిపాపరాజు చేసినయుత్తరరామాయణములో నిట్టిసందేహము నివారింపఁబడినది. అందులోఁ గంకంటిపాపరాజు తాను గ్రంథము చేయదొరకాని తనమిత్రుఁడును సహాధ్యాయుఁడు నగుపుష్పగిరితిమ్మన్నయొక్క సహాయము నంది తనగ్రంథము రచియించినట్లుగాఁ జెప్పె. ఆపద్య మెట్లున్న దన :-

"తే. అని కిరీటికి శౌరి తోడైనయటుల, నమ్మహాకవి సాహాయ్య మాచరింపఁ
     గృతి నొనర్పగఁ బూనినయేను మొదట, నెంతు మద్వంశవిధ మది యెట్టు లనిన."

ఇట్లు ధారాళముగాఁ జెప్పినపద్యమున కే సందియము నుండఁ గూడదు. నన్నయభట్టారకుఁడు తనకు సహాయుఁడయిన నారాయణ భట్టుంగూర్చి యిట్లె వ్రాసెను. దానికిఁగూడ నారాయణభట్టు భారతము చేసి నన్నయభట్టుపేరు పెట్టె నని చెప్పవచ్చును. ఎట్లన్నను :-

ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
    రాయణుఁ డట్లు తానును ధరామరవంశవిభూషణుండు నా
    రాయణభట్టు వాఙ్మయధురంధరుడుం దన కిష్టుఁడున్ సహా
    ధ్యాయుఁడు వైనవాఁ డభిమతంబుగఁ దో డయి నిర్వహింపఁగన్.

అని నన్నయభట్టును ధారాళముగఁ జెప్పెను. పుష్పగిరితిమ్మన్న పాపరాజునకును, నారాయణభట్టు నన్నయభట్టునకును సహాధ్యాయులని చెప్పియుండ నట్టి సహాధ్యాయు లుభయులు సమానప్రజ్ఞ గలవారని లోక మెందు కూహించదో తెలియదు. పుక్కిటిపురాణముల నమ్మి వ్రాఁతమూలనును దిరస్కరించులోపము మనయాంధ్రులలో నింక నెంతకాలమువఱకుండునో దాని నూహింపలేకయున్నాను. కంకంటి పాపరాజు మఱియొకపద్యములోఁ బుష్పగిరి తిమ్మన్న తనకు సహాయుం డని చెప్పె. ఎట్లన్నను :-

"మ. హనుమద్దివ్యప దారవిందమకరందానంద నేందిందిరా
       త్ము ననేకాంధ్రకృతిప్రకల్పవసమర్థుం బుష్పగిర్యప్ప నా
       ర్యునిసత్పుత్త్రునిఁ దిమ్మనాఖ్యకవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ
       ద్దున నే పిల్వగఁ బంచి కన్న కల సంతోషంబుతోఁ జెప్పినన్."

పాపరాజుప్రజ్ఞావిశేషము లెఱుఁగనివా రాతనియాశ్వాసాంత గద్యములో నుండు కొన్ని బిరుదులం జూచియైన నతని పాండిత్య మరయుదురుగాక. అందులో.

1. చతుర్విధ అనపద్య కవిత్వ విద్యావధానుఁడు. 2. అదునాతనభోజరాజు. 3. బంధురమనిషా విశేషమంథానవసుంధ రాధర శోథితగణితశాస్త్రరత్నాకరుఁడు. 4. విష్ణుమాయావిలాసాభిధానయక్షగాన నిర్మాణ ప్రవీణతానిధానుఁడు. పుష్పగిరి తిమ్మన కవిత్వవిశేషము లతని సమీరకుమారవిజయములోఁ జూడఁదగు. పుష్పగిరితిమ్మన కవిత్వమునకు నీకంకంటిపాపరాజు కవిత్వమునకును అల్లసాని పెద్దనకవిత్వమునకుఁ గృష్ణరాయనికవిత్వమునకుఁ గలభేదమే యున్నది. ఆయుభయులలోఁ బుష్పగిరితిమ్మన, యల్లసాని పెద్దనలు కేవలము కవిత్వవృత్తినే జీవించువారు. ఈపాపరాజును గృష్ణరాయలును రాజకీయవ్యవహార నిమగ్ను లైయుండి విద్యావినోదంబులు చేయువారై యుండిరి. ఆకారణమునఁ బై యిర్వురికవుల సహాయము నీయిర్వురు పండితప్రభువులకుఁ గావలసివచ్చెను.

ఈప్రభువు లిర్వురును వ్యాపారాంతముల నుండువారుకావునఁ గవిత్వవ్యాసంగము చాలినంత చేసియుండకపోవచ్చును. ఆకారణమున నచ్చటచ్చట వ్యాకరణములోని మెఱుగులఁ దేలేక పోవచ్చును అట్టిలోపములను పైకవులిర్వురును సాధ్యమగునంతవఱకు సవరించియుందురు. అట్లున్నను మార్చుటకు వీలులేనియంశములుగాని దిద్దునపుడు మఱిచియున్న యంశములుగాని గ్రంథములయందుఁ జూపట్టి, ఆకవులకవిత్వము లాగ్రంథములు కావనుటకు సాక్షిభూతముము లైయున్నవి.

ఇఁక కంకంటిపాపరా జుత్తరరామాయణము మను గ్రంథముంజేసి యుండెనా లేదా యనుదానినిస్థిరపఱచుట కాతనితమ్ముం డగునరసింహకవి రచియించినవిష్ణుమాయావిలాస నాటకము నుండి కొన్ని వాక్యము లుదాహరించెదము ఎట్లన్నను :-

ద్విపద.

"ఈవిశ్వహితకృతి కేవేల్పు నధిపుఁ, గావింతు నని యాత్మ గణియించునపుడు,
  ఆర్వేలవంశాబ్ధి హరిణలాంఛనుఁడు, గర్వితరిపుమంత్రి గర్వభంజనుడు.
  గురుతరశ్రీవత్స గోత్రపావనుఁడు, పరిలబ్ధమదనగోపాలభావనుఁడు.
  ప్రపితామహునివల్లభప్రభుఁ బోలి, యెపుడు బంధులఁ బ్రోచుహితకీర్తిశాలి.
  కంకంటియప్పయాగ్రణి కుమారుండు, మాయన్న నరసమాంబాగర్భశుక్తి.
  కాయతమౌక్తికం బగుభవ్యశుక్తి, వరవర్ణ్యు వేంకట నరసింహుఁగన్న.
  పరమపుణ్యుఁడు దయాపరులలో మిన్న, సరసుండు పాపరాజప్రధానుండు.

నాకలలో నొక్కనాఁడు గాన్పించి, యేకతంబునఁ గూర్చి యిట్లనిపల్కె.
నాకూర్మిసోదర నరసింహ నీవు, చేకొని ద్విపదగాఁ జేసినయట్టి.
అనుపమ విష్ణుమాయానాటకమున, కనురూప విభుఁ డెవ్వఁ డని తలంచెదవు.
దానికి విభుఁడు సీతామనోహరుఁడె, రసికత నుత్తరరామాయణంబు.
పొసగ నే రచియించి భూవలయమున, వెలయించు టెఱుఁగవే విడువక భక్తి.
సంధ్యాదికృత్యంబు (ఇక్కడ జ్ఞప్తి వచ్చినది)
లొనరించి హితగోష్ఠి నుండి శీఘ్రమున, ననఘుని పుష్పగిర్యప్పన్నతనయు
ఘను సంస్కృతాంధ్రైకకవనాతిదక్షు, మాయన్న సఖుని తిమ్మకవిఁ గృతిస.
హాయునిఁ బిలిపించి యమ్మేటితోడ,నాకన్న కలఁ దెల్పినను సంతసిల్లె."

అని యున్న దానింబట్టి యుత్తరరామాయణము పాపరాజప్రణీతమే యనియు, నపుడు సహాయ మొనరించిన పుష్పగిరి తిమ్మన యనుపండితుఁడే పాపరాజు గతించినపిమ్మటగూడ జీవించియుండి అతనితమ్ముఁడగునరసింహకవి యీ ప్రస్తుతగ్రంథ మగువిష్ణుమాయావిలాసనాటకముం జేయునపుడుగూడ సహాయ మొనరించె నని యుండుటచేతఁ గంకంటిపాపరాజు రచించినగ్రంథము నీపుష్పగిరితిమ్మన సరిచూచెనుగాని ఆగ్రంథము తాను రచియించి పాపరాజుపేరిటఁ బ్రకటించియుండ లేదనియు న ట్లనుట అయుక్తమనియుఁ దేలినది.

పూ 3 (a) ఈక్రిందిపద్యము పైయభిప్రాయమునకు బలీయము

"సీ. కృష్ణరాయలపేరు నిడి నీవు రచియించి, తివి తొల్త విష్ణుచిత్తీయ మనఁగ
     కాఠిన్య మర్థంబు గాహ్యంబు గాదు సా,ధారణుల కని భూధవుఁడు బలుకఁ
     దరువాతమనుచరిత్రము నొనరించి తు,త్తమ కావ్యము మహాద్భుతముగఁ బిదప
     బెక్కు కావ్యంబులు పెం పెక్క విరచించి మంటివి రాజసమ్మానమునను
     భంగ మందిన యలరామలింగముఖులు, సాటి రాఁగ వారె నీతోటి నౌర
     యాంధ్రకవితాపితామహ యల్లసాని, పెద్దనార్యవిశేషవివేకధుర్య." చాటువు.

న. 3. షబాషు! ఇంత విశేషాధార ముండఁగ నిఁక ఆముక్తమాల్యదకుఁ బెద్దన యేల కవి కాకుండును? ఆంధ్రకవిత్వమహత్తును దెలియఁగోరువా రిట్టిపద్యముల నాదరింపవలెఁగదా ! అని ఆశ్చర్యసాగరమున మున్గుటకంటె నీపద్యమునకుఁ జెప్పవలసిన సమాధానము ప్రధాన మైనది లేదు. ఇట్టి పద్యము సముద్రితగ్రంథ చింతామణి ప్రకటించినందులకు విచారపడవలసియున్నది. ఇట్లుగాఁ దల మొల లేనిపద్యముం బట్టి యే కదా ఆముక్తమాల్యలలోని గ్రంథప్రణాళిక నాశ్వాసాంతపద్యముల నిరసించి ఇదివఱలోఁ జేయఁబడియున్న సిద్ధాంతమును దిరస్కరించుట ? కాని అట్లు తిరస్కరించుటకుఁ బూర్వము, ఆముక్తమాల్యద ముందు రచియింపఁబడినదో లేక మనుచరిత్రము ముందు రచియింపఁబడినదో పరిశీలించెదము గాక. ఆపరిశీలన అగువఱకును పెద్దనయే యా రెండుగ్రంథముల రచియించె నని యూహించెదము.

మనుచరిత్రములోఁ జెప్పంబడిన కృష్ణరాయ విజయములు.

1. ఉదయాద్రిని జయించె. 1. కొండవీడు జయించె. 1. వేఁగిదేశమును జయించె. 1. కనకగిరిం జయించె. 1. గౌతమీనదిని దాఁటె. 1. పొట్నూరు జయించెను. 1. మాడుగుల. 1.(వడ్డాది) జయించెను. 1. కటకపురిం గాల్చెను. అపుడు గజరాజు పాఱెను.

ఆముక్తమాల్యదలోఁ జెప్పంబడిన కృష్ణరాయ విజయములలోని విశేషములు.

మనుచరిత్రములోఁ జెప్పిన విజయములన్నియుఁ జెప్పి పిమ్మటఁ కలబరిగె (Kalbarga) లో నుండుయవనప్రభువుల జయించిన ట్లీక్రింది పద్యములో నున్నది

"గీ. తిరుగు హరిపురి సురతరు సురల మరిగి, బహుళహళహళి భరితకల్బరిగనగర
     సగరపురవరపరిబృఢజవనయవన, పృతన భవదసి ననిఁ దెగి కృష్ణరాయ."

అనియున్న దానింబట్టి 1. కలబరిగ. 2. సాగర్ (Sauger) అను రెండు స్థలములలోనుండు దురుష్కప్రముఖుల జయించె. ఇంతియకాక పారసీకదేశము (Pershya) లో నుండెడుఖురాసాన్ (Khorasan) ఖండములోని తురుష్కులం జయించె నని మఱియొకపద్య మున్నది. అది యెట్లనఁగా :-

మ. అలుకన్ ఘోటకధట్టికాఖురపుటీహల్య న్గురాసానిపు
     చ్చలువో దున్ని చలచ్చమూగజమదాసారప్లుతిం గీర్తి పు
     ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తౌ తొల్లి యే
     దులఖానోగ్రకపాలమర్థపహరిద్భూజాంగలశ్రేణికిన్.

ఇది యంతయు మనుచరిత్రానంతర వృత్తాంతమే. ఇట్లు ఘంటా పథముగా మనుచరిత్రమునకుఁ దరువాతికాలములో నాముక్తమాల్యద రచించినందులకు గ్రంథదృష్టాంతము లగపడుచుండఁగా వాని నూహించికొని, లోకములో సంప్రదాయజ్ఞులవలన వాడుకొనంబడుచున్న కవికర్ణరసాయనవృత్తాంతము నమ్మక కృష్ణరాయనికాలములోనికవిత్వమని యూహింప ననువులేని పైచాటుధార పద్యము నమ్మిన నిఁక వందలకొలఁది చారిత్రగ్రంథములు పుట్టవచ్చును. కాఁబట్టి పాఠకు లిట్టిచాటువుల నెంతమాత్రమును విశ్వసించకపోదురుగాక.

పూ. 3 (b) పాండురంగ విజయమునందలి ప్రౌఢదీర్ఘ సమా సపదముఖసీసమునందు ద్వితీయచరణము "దానతల్లిగ నల్లసాని పెద్దనచెప్పె ముది మది దప్పి యాముక్తమాల్యదూ" అని యున్నది.

న. 3. (b) కాని ఈ పద్యచరణమును పైపద్యమును దాని నీపద్యచరణమును బూర్వపక్షము చేయుచున్నవి. ఈపద్య చరణమొకగ్రంథములోనిదే యయియుండిన పైచాటువులోఁజెప్పినగాథ తప్పేగద. కావున నాముక్తమాల్యద (విష్ణుచిత్తీయము) మనుచరిత్రముకంటె మొదట రచియింపఁ బడక పెద్దనవలన నతనిముసలితనములో మదితప్పియున్నపుడు వ్రాయఁబడినదని యూహించెదముకాక. కాని యిట్లుగా నొకదాని నొకటి తిరస్కరించు రెండుదాహరణ లుపన్యాసకునివలనఁ జూపింపఁబడుటకుఁ గారణ మేమో నే నూహింపలేకయున్నాను. ఆముక్తమాల్యదలో నచ్చటచ్చటఁ గాన్పించుస్ఖాలిత్యములు పెద్దన ముసలితనములో నాగ్రంథము వ్రాయంబడుటం జేసి కల్గె నని చెప్పుటకుఁ గానోవు. అటులనే యైనచో (6) నాఱవపూర్వపక్షములోని 3 (a) ప్రకారము విష్ణుచిత్తీయము మను చరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమ రచితగ్రంథంబున నొకటి రెండు తప్పులుండుట సహజంబు" అని వ్రాసిన దాని కర్థమేమో యూహింపలేక యున్నాను. విద్యావిషయకోపన్యాసములలోను, అందులోఁ జారిత్రాంశములఁ బూర్వపక్షము చేయునపుడు నిట్లుగా నేరేనిఁ దాను చేసినసిద్ధాంతమును తానే పూర్వపక్షము చేసికొనుచుండఁగా నిపు డెద్దానికి నేను సమాధానము చెప్పవలసియుండునో యూహింపలేక యున్నాను. మనుచరిత్రకంటె నాముక్తమాల్యద ముం దననిచో నది కా దని చెప్పవచ్చును. లేదా మనుచరిత్రమునకంటె తరువాత ననఁగా దానినైన కా దని చెప్పవచ్చును. ఒకపరి ముందు, మఱియొకపఱి వెనుక నని చేయు పూర్వపక్షమునకు సమాధానము చేయువా రెవరైన దేవాంశ సంభూతులు రావలెనుగాని నాయట్టివాని కది సాధ్యకార్యము కాదు.

అదియటుండ "దాని తల్లిగ నల్లసానిపెద్దన చెప్పె ముది మది తప్పి యాముక్తమాల్యద" అనుదానికి దేనితల్లిగాఁ జెప్పెనో నాకు బోధించలేదు. ఇది పాండురంగవిజయములోని పద్యమఁట. అనఁగా గగనకుసుమములను జంద్రునిలో నుండిలేడి మేయఁగా దానిని శశవిషాణముతోఁ బొడిచినట్లు కాన్పించుచున్నది. పాండురంగవిజయము పుట్టుట హుళక్కి యని రామలింగము చారిత్రములో నిదివఱకే నేను చెప్పియుంటిని. కావున నిపు డద్దానిం జూచుటకుఁ బాలకులం గోరుట కంటె వేఱుసమాధానము వ్రాయను.

పూ. 3. (c) అప్పకవీయమునందుఁ బ్రథమాశ్వాసాంతమున "ఆంథ్రకవితాపితామహుఁడు చెప్పిన విష్ణుచిత్తీయమునం దున్న" పూనిముకుందు నాజ్ఞఁగను బొమ్మనె గాంచి " అనుపద్యము నప్పకవి వ్రాసెను."

స. 3. (c) అప్పకవి చెప్పినదే వేదవాక్య మనుకొనువా రెట్లూహించిన నూహింపవచ్చును. అప్పకవి పైవారి (అనఁగాఁబెద్దన్న యొక్క కృష్ణదేవరాయలయొక్క) కాలీనుఁడు కాఁడని పైవార లిర్వురును శా. స. 1400 కాలమువా రగుటం బట్టియు నప్పకవి శా. స. 1600 కాలపు వాఁ డగుటంబట్టియు నిశ్చయించవలసియున్నది. ప్రస్తుతకాలములో వలెఁ దెన్గుదేశములోని అన్ని భాగముల వారును కలుసుకొనుటకుఁగాని యుత్తరప్రత్యుత్తరములు నడచుటకుఁగాని అవకాశములు లేక యుండుటంబట్టి యితరదేశపు వృత్తాంతములు విశేష విస్పష్టముగాఁ దెలియు నని నిశ్చయించుట కవకాశము లేదు. అట్టిచోఁ గృష్ణాజిల్లాలో నుండెడు నప్పకవికి మిక్కిలి సమీపములో నుండుగోదావరిజల్లాలోనివృత్తాంతములే తెలియరానిచో నిఁక కృష్ణాజిల్లాకు మూఁడునాల్గు జిల్లాలుదాఁటిన పై నుండిన విజయనగరసంస్థానములోని కథాసూక్ష్మములు స్పష్టముగాఁ దెలియు నని యెట్లూహింపఁగలము. గోదావరిజిల్లాలోని వృత్తాంతము తెలియ దని చెప్పియున్నారము. ఆమాట ప్రస్తావరీతిం జెప్పినది కాదు. అతఁడు రాజనరేంద్రునిఁగూర్చియు నన్నయ్యభట్టుంగూర్చియువ్రాయుచు నీక్రిందివిధమున వ్రాసె :-

"ఉ. ఎన్నగ నన్న యాఖ్యకవి యీకలి కాదినిఁ జెప్ప దాని భీ
      మన్న హరించెఁ గ్రమ్మర మహాత్ముఁడు రాజనరేంద్రుపట్టి దా
      మొన్న నొసంగె విప్రునకు మూలమతం డొనరించెఁ డీక నా
      కన్నది మున్ను విన్నదియుఁ గాదు మహాద్భుత మబ్బె నా కిటన్."

దీనిలోని 'కలి కాదిని' అనుదానికి వేఱర్థము లేనందుల కప్పకవీయము రెండవ యాశ్వాసప్రారంభములో నతనివలన మఱియొక పద్యములోఁ జెప్పంబడియెను. అదియెట్లన్నను :-

2. "క. అవధారు శబ్దశాసనుఁ, డవనిఁ గలియుగమున కాది నారాజమహేం
         ద్రవరంబునఁ జెప్పిన యాం,ధ్రవచోవ్యాకరణసూత్రతతిఁ దెనిఁగింతున్."

అని వ్రాసియుండె. దీనింబట్టి అప్పకవికిఁ గలదేశ కాలవిజ్ఞానము యొక్క సిద్ధాంతసామర్థ్యము బోధకాకపోదు. కావున నప్పకవి చెప్పినాఁ డనుమాత్రమున నితరసందర్భము లేనిచో నతని సిద్ధాంతము సుత రాం అంగీకరింపఁగూడదు.

పూ. 3. (d) "బ్రౌణ్యనైఘంటిక పీఠికయందు, విష్ణుచిత్తీయము (ఆముక్తమాల్యద) పెద్దనచేసిన దని వ్రాయఁబడినది. ఈరీతిగ నే ఆముక్తమాల్యదావ్యాఖ్యాత యగు రామశ్వామిశాస్త్రులు పీఠిక యందు వ్రాసియున్నారు. స. 3. (d) "శతాంథాః కూపం ప్రవిశంతి" అను బుధజనోక్తి పుట్టుటకు గారణ మేమై యుండును. ఇటులనే యెవరో పదిమంది విచారణచేయకనే యొకరుచెప్పినా రని యొకరు, వారు చెప్పి రని మఱి యొకరు వ్యవహరించుటనుబట్టి ఆసామెత పుట్టియుండు. బ్రౌణ్యవైఘంటికుఁడును మఱికొందఱు గ్రాంధికులును భట్టుమూర్తియు రామరాజభూషణుఁడు నొక్కఁడే అని నిర్ధారణచేసిరి. ఆవిషయమైనసిద్ధాంతము త్రిప్పుట కెంతశ్రమ తరువాయి పండితుల కాయనో చూడుఁడు. ప్రస్తుతో పన్యాస సిద్ధాంతమును ఖండించుటయు నటువలె యగుఁగదా: ఇంతశ్రమ చేసినను కల్గెడుఫలము పూజ్యమునకంటె వేఱు లేదుకావున నీప్రశ్నము విడిచెదను.

పూ. 4. "కవికర్ణ రసాయనమును గృతినొందకుండఁ బెద్దన్న విఘ్నముచేసె నని రాయలు కోపించినఁ దత్కోపనివారణార్థంబు రాయలపే రిడి యాముక్తమాల్యద పెద్దనచేసె ననువాడుకయుఁ గలదు.

స. 4. "ఈవాడుకయే కల దని యుపన్యాసకునకుఁ దెలిసియున్న యెడల పై 3 (a) లోనిసీసపద్య మేల వ్రాసియుండవలయును. అది నమ్మివ్రాసియున్న యుపన్యాసకునకు దిరుగ నీనాల్గవప్రశ్నము వ్రాయుట కెడ మెట్లు కల్గును. పూర్వోత్తరసందర్భము లేనివ్రాఁతలకు సమాధానము చెప్పగమకించుటకంటె నూరకుండుట యుత్తమ మని తలచెదను.

పూ. 5. "పెద్ధన యద్వైతియై వైష్ణవమతానుసారం బగుగ్రంథంబుల నెట్లు రచియింపఁగలఁ డని యందు రేమో. విశేషపండితుఁడును అతులపురాణాగమేతి హాసక ధార్థస్మృతియుతుఁడును" వైష్ణవాచారి యగుశతగోపయతి శిష్యుండును, వైష్ణవమత దుం డగుకృష్ణరాయల పరమహితుండును నగు పెద్దనకు నీగ్రంథంబు సేయ సుకరంబుగాదె?

స. 5. ఈ పైసిద్ధాంతములో మతసంబంధ మగువిచారణఁగూడ బయలువెడలుచున్నది. ద్వైతాద్వైతశాస్త్రములలో గ్రంథములఁ జేయుట "అతులపురాణాగమేతిహాస కథార్థస్మృతియుతుఁడ" గుటంజేసి పెద్దనకు సుకరమే అని యుపన్యాసకుఁడు యోచించు. ఇదివఱ కాంధ్ర గీర్వాణములలో వేదాంత శాస్త్రాధ్యయనముం జేసిన వారిలో నద్వైత గ్రంథములఁ జేసినవారు ద్వైతగ్రంథములు చేసినట్లుగాని, ద్వైతశాస్త్రాధ్యేత లద్వైతములో గ్రంథములు చేసినట్లుగాని వినలేదు. పరమతనిరాస పూర్వక స్వమతస్థాపనకై కొందఱుపండితులు పరమత పూర్వపక్షములఁ గొన్నిటి నేర్చుకొనియున్నను వానిలో గ్రంథముల రచియించి అయామతములలోని అనుభవశాలులకు మార్గదర్శు లయినారని వినియుండుట అనుభవవ్యతిరేకము. పెద్దన అట్లుగా వైష్ణవమతస్థుఁడు కానట్లు మనుచరిత్రవలనఁ గానుపించినను కేవలము శఠగోపస్వామిశిష్యుఁడ నని చెప్పుకొని నంతమాత్రముచేత విశిష్టాద్వైతభాష్యము నెఱిఁగి దానిసంగ్రహము ఆంధ్రములో గ్రంథరూపము చేసి యున్నఁ జేసియుండెనేమో. అది అనుభవ వ్యతి రేక మైనమాట. అన్యమతస్థులకడ సంస్కృతముగాని మఱియేభాషగాని నేర్చుకొనినవారికిఁ దమగురువులపరమార్థ మతమంతయు దెలుసుకొను ప్రజ్ఞయే యుండిన మహాగౌరవావహకార్యమే. అయితే లో కానుభవము దానికి వ్యతిరేక మై యుండుటచేతను పైసిద్ధాంతము మనస్సునకుఁ బట్టకయున్నది. స్మార్తులలో వైష్ణవమతము నవలంబించి ననియోగులు పెక్కండ్రు గలరు. వారు కేవలము విష్ణునియెడలఁ గల్గుభక్తినిఁబట్టి వైష్ణువులకడ శిష్యులై నును, తమవంశక్రమాగత మగుస్మార్తదేవతో పాసనలు వదులునాచార ముండదు. కేవలము వైష్ణవమత ప్రవర్తకులు శివశక్త్యాదిభిన్న దేవతా నుతులు మాని విష్ణుని ఆయుధాదులను వాహనాదులను తఱుచుగా నుతియించెదఱు. పెద్దన మనుచరిత్రములో నీపైదారిం గైకొనక శివశిక్త్యాదుల నుతియించుటంజేసి అందులో భగవద్విషయమై వివరించునపుడు కేవల శేష శేషిభావము ప్రధానముగాఁ జెప్పక యద్వైతమతస్థు లగు బమ్మెరపోతన మొదలగువారు చెప్పిన విధముననే చెప్పుటచేతను పై గ్రంథకర్త లిర్వురును భిన్ను లని నేనూహించితిని. ప్రస్తుతములో నింతకంటెఁ బాఠకుల కవసరముండదు గనుక నీసంప్రశ్నము విడువవలసినదే అని చెప్పెదను. పూ. 6. "ఈ ప్రబంధము పెటుకుగా నుండుటకును, అచ్చటచ్చట గొన్నిస్ఖాలిత్యములఁ గల్గియుండుటకును గారణంబు జూడ నీగ్రంథంబు పెద్దన కృతంబు గా దని యును, రాయల కృతం బనియు లోకులకుఁ దోఁచుటకై పెద్దన బుద్ధి పూర్వకముగా బన్నిన యుక్తి యై యుండవలెను. లేదా, 3 (a) పద్యప్రకారము విష్ణుచిత్తీయము మనుచరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమరచితగ్రంథంబున నొకటిరెండు తప్పు లుండుట సహజంబు.

స. 6 దీనిలో గ్రంథము పెటుకుగానుండుట యనుదానికర్థము తెలియలేదు. పండితాభిప్రాయ మిది నారికేళ పాకముగ నుండుననిగాని అది యొకలోప మగుపాకము గల దని కాదు. పెద్దన కావలెనని కొన్ని తప్పులు చెప్పినఁ జెప్పుట గల్గుగాని తనకవిత్వముకంటె నధికమైన కవిత్వముగాని తనశక్తికి మించినవర్ణనలుగాని చెప్ప లేఁడుగదా. ఆముక్తమాల్యద మనుచరిత్రమునకంటెఁ గఠినమైనను అంతకంటె వర్ణనాంశములో నధిక మనియే సర్వపండితులవలన నంగీకరింపఁబడును. కావున నిందులోఁ బెద్దన బుద్ధిపూర్వకముగాఁ జేసినయుక్తిగాని చేయఁగల యుక్తిగాని లేదుగావున నీవిషయ మింతకంటె వ్రాయ నక్కఱలేదు. విష్ణుచిత్తీయము మనుచరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమరచిత గ్రంథంబున నొకటిరెండుతప్పు లుండుట సహజం బని చెప్పిన దానికి గ్రంథదృష్టాంతరములు లేవు. ఒకవేళ నుండునెడల భారతమున కంటె ముందుగ రచియింప బడినయుత్తర రామాయణములోఁ దిక్కనవలన నెన్ని తప్పులు వ్రాయంబడినవో హరిశ్చంద్రనలోపాఖ్యానమున కంటె ముందుగ రచియింపఁబడిన వసుచరిత్రమున రామరాజభూషణుఁ డెన్ని తప్పు లుంచెనో, భీమఖండమునకంటెఁ బూర్వము రచియింపఁబడిన శృంగారనైషధమున శ్రీనాథుఁ డెన్నితప్పు లుంచెనో చూపినయెడలఁ బెద్దన మనుచరిత్రమునకంటె ముందుగ రచియించిన ఆముక్తమాల్యదలో నన్నితప్పు లుంచెను. అని చెప్పెదము అటుగానిచో 3 (d) లోఁ జెప్పంబడిన విధముగ నాముక్తమాల్యదకంటె ముందుగ రచియించిన మనుచరిత్రములో నెన్ని తప్పు లుంచెనో యోచింపవచ్చును. ఈపట్టునఁ బెద్దనకవిత్వమునకుఁ గల్గినలోపమును నివారించుటకుఁగాను కుందవరపు కవిచవుడప్ప యనునతనిగ్రంథములోనుండి యొకపద్యము నెత్తి వ్రాసి దానిని నిర్దుష్టము చేసెదను. అది యెద్ది యనగా :-

క. పెద్దనవలెఁ గృతి సెప్పినఁ, బెద్దనవలె నల్పకవినిఁ బెద్దనవలెనా
    యె ద్దనవలె మొ ద్దనవలె, గ్ర ద్దనవలెఁ గుందవరపుకవిచౌడప్పా.

అని యున్నది. ఇట్టి పెద్దనకుం గూడఁ దప్పు లున్నట్లు చెప్పువారి పెద్దఱిక మడుగనేల?

పూ. 7. ఆముక్తమాల్యదలోపలను, మనుచరిత్రంబులోను వంశావళీ పద్యములును, మఱికొన్ని పద్యములును, ఒక్కటిగా నుండుటకుఁ గారణంబు 3 (a) పద్యంబు యథార్థమైనచో రాయలయెడ గౌరవముఁజూపుటకు నాముక్తమాల్యదనుండి పెద్దన మనుచరిత్రమునకుఁ జేకొని వ్రాసియుండవలయును. లేక మనుచరిత్రమే ముం దైనచో నాముక్తమాల్యదాకారుఁ డాగ్రంథములలో వానిం జేకొని యుండవలెను.

సమా. 7. దీనిలో మనుచరిత్రము నాముక్తమాల్యద అనుగ్రంథద్వయ మొకరి కృతమే అని నిశ్చయించుకొని మొదటిదే ముందుగ రచియింపఁబడిన దానిలోనివానిఁ గైకొనుట గాక సమాధానమును, రెండవదియే ముందుగ రచియింపఁబడిన దానిలోనిపద్యములు మొదటిదానికి వచ్చుటకుఁ గారణములును జెప్పంబడినవి. కాని ఆగ్రంథకర్త లుభయులు వేర్వేఱైనచో నెట్లు చెప్పవలయునో ఆసమాధానములు వ్రాయంబడ వాయెను. కావున మన మిపు డీరెండవ ఫక్కికనుబట్టి యూహింపఁగ మనుచరిత్రములోఁ బెద్దనవలన రచియింపఁబడినకృష్ణరాయ వంశావళినే ఆముక్తమాల్యదలోఁ గృష్ణరాయనివలన దనవంశానువర్ణనము స్వకృతముగాక అన్యకృత మని తెలియఁజేయుటకుఁ గైకొనంబడె నని యూహింపవలసియుండును. స్వవంశవర్ణనయే గాక ఆముక్తమాల్యదలోఁ గృష్ణరాయనివలన స్వవర్ణనముగూడఁ జేయఁబడినది. అట్టివర్ణనఁ గృష్ణరాయఁడు స్వయముగఁ జేసికొనఁగమకింపఁడు కావున నన్యకవిరచితమునే అం దుంచఁగోరు ననునది యెంతయు యుక్తియుక్త మగును. "పెద్దన ఆముక్తమాల్యద వ్రాసినప్పుడు తన్ను రాయలఁగా భావించుకొని వ్రాసెనుగాని పెద్దన యనుకొని వ్రాసియుండలేడు "సూక్ష్మంబు తెలిసిన నెక్కుసందియంబులు వీడును"

అనియున్న దానిం గూర్చి వ్రాయవలసినది యొక్కటిమాత్రమున్నది. ఆముక్తమాల్యద యేకారణమున నుద్దేశింపఁబడెనో, యెవరివలన నెపుడు రచియింపఁబడెనో ఆ మీమాంసపై యుపన్యాసమువలనఁ దేల లేదు. ఇపుడు పెద్దన కృష్ణరాయలుగా భావించి వ్రాసెను గావున గ్రంథమంతయు నట్లుగానే వ్రాసె ననియు నది యొక సూక్ష్మ మైనయంశం బనియు దీనిం దెలిసినపెక్కు సందియములు వీడు ననియు నున్న సిద్ధాంతమువలనఁ దేలినది ఏమియు లేదనియు, నేదియేని యొకయభిప్రాయము మనసులో నిమిడించుకొనినచో న్యాయము మనస్సునకుఁ బొడకట్టకయుండఁ దాఁ బట్టినకుందేటికిఁ గాళ్లు మూఁడని చెప్పెడు సిద్ధాంతము తోఁచును. అట్టిచో యుక్తిగాని, శాస్త్రముగాని నిలువంబడఁజాల వని తెలుపవలసినదై యున్నది.

పూ. 8. ఇంక విస్తరభీతిచే నెక్కుడుకారణంబులు వ్రాయ విరమించితిని. ఈమీఁదికారణములు బాగుగ గ్రహించిన నితరపక్షవాదంబు పూర్వపక్షంబు సేయ సులభంబు

స. 8. కాని యుపన్యాసకున కిక్కడికైనను గ్రంథవిస్తరభీతి కల్గినందుల కానందించవలసియుండును. తనకుఁ బాఠకుల కుపకారము చేయుఁగోర్కెయే యున్న యెడల నిదివఱలోఁ జెప్పిన యనేక పూర్వపక్షములు వదులుకొనియే యుండును. అపుడు దానికి సమాధానము వ్రాయువారికి గ్రంథము పెంచవలసినంత యవసరమే లేకపోవును. దానివలనఁ బాఠకులకు నతిసదుపాయము గల్గియుండును. ఇకఁ జెప్పవలసిన యుక్తులు లే వని యిదివఱలోఁ జెప్పిన యుక్తులే నీరసములగుటంజేసి యూహించవలసియున్నది. ఉపన్యాసకునియుపన్యాసము బాగుగ గ్రహించినపిమ్మట నముద్రితగ్రంథచింతామణి పత్త్రికాధిపతిగారు ఆముక్తమాల్యదకారుఁ డెవ్వఁడో, విష్ణుచిత్తీయ, మనుచరిత్రములఁ బూ ర్వగ్రంథ మెద్దియో ఆపత్త్రికలో వ్రాయుటకు నుపన్యాసకునివలనఁ గోరఁబడినట్లు పైయుపన్యాసాంతమువలనఁ గాన్పించునుగదా. పిమ్మట నముద్రిత గ్రంథచింతామణి పత్త్రికాధిపతి పైయుపన్యాసమునకంతకు నతిచమత్కారముగఁ దనయభిప్రాయమిచ్చె. అదియెట్లన్నను :-

తేది 1 జనవరి ఆ 1887 సం. అముద్రితగ్రంథచింతామణిలో

"పైనుదాహరించిన మూర్తి రామరాజభూషణుల భేదమును గుఱించి శబ్దరత్నాకరమును జూచుచో, గతమాసమున బోడపాటి, రామలింగేశ్వరప్పగారు, విష్ణుచిత్తీయమునుగూర్చి వ్రాసిన యంశమునకును బరస్పరము విరుద్ధముగా నున్నది. గావునఁ జదువరులకు నీభేదముఁ దెలుపుటకుగా నీక్రిందివిషయమును బ్రకటించితిమి. 'పత్త్రికాధిపతి' అనియీక్రిందియంశము శబ్దరత్నాకరములోనిది యెత్తివ్రాసెను. ఎట్లన్నను :-

"అల్లసానిపెద్దన. ఈయన కృష్ణదేవరాయలకాలమందలి పండితులలో ముఖ్యుఁడుగా నుండెను. ఇతఁడు స్వారోచిషమనుసంభవ మనునొకకావ్యమును వ్రాసెను. దానిని మనుచరిత్ర మని చెప్పుదురు. అది మృదుశైలియు "అల్లసానివానియల్లికబిగియును" అన్నట్లు కవిత్వ గాంభీర్యము గలిగి శృంగారరసప్రధాన మై యున్నది. అందు నాలవ యాశ్వాసము కేవలాంధ్రపదభూయిష్ట మై యుండును. పూర్వకవితా ధోరణి ననుసరించి యుండుటంజేసి కొన్ని యెడల నైషధమార్కండేయపురాణములయందలివాక్యములకును, నిందలి వాక్యములకు నిసుమంతయేనియు భేద మగపడకయుండును. ఇతఁడే విష్ణుచిత్తీయ మని ప్రసిద్ధిఁ బొందినయాముక్తమాల్యద యనుకావ్యమును వ్రాసినవాఁ డని చెప్పుదురు. శైలి భేదిల్లి వ్యాకరణదోషయుక్త మై యుండుటం జేసి అందుఁ జెప్పబడినయ ట్లది కృష్ణదేవరాయనిచేతనో మఱియొకకవిచేతనో వ్రాయఁబడినది గాని పెద్దనచే వ్రాయంబడినది గా దని తోఁచుచున్నది. స్వారోచిషమను సంభవములోని కొన్ని పద్యము లం దుండుట చేతనే అట్టిదానిని బెద్దనవిరచితముగా జెప్పుట యుక్తము కాదు. పెద్దన తదాస్థాన ముఖ్యపండితుఁ డగుటంజేసి స్వారోచిషమనుసంభవమునందలి పద్యము లిం దుండుటకుఁ గారణ మై యుండు. కావలసియుండినఁ గారణాంతరముల వలసినన్ని కల్పించుకొనవచ్చును.

మఱియు సీతారామాచార్యకృత మగు "అలఘుకౌముది" యందు నాముక్తమాల్యదా విషయమునుగూర్చి వ్రాసిన యంశము పైయభిప్రాయమునకుఁ దోబుట్టువుగాన దాని నిట వ్రాయుదము.

ఇట్లు,

పత్త్రికాధిపతి

"ఆముక్తమాల్యదాకారుఁ డలఘు రేఫములుగాఁ బ్రయోగించినవాని నితరకవు లట్లు ప్రయోగింపకుండుటచేత నతఁడును లఘ్వ లఘు రేఫములకు మైత్త్రిఁ గలుగఁజెప్పినవారిలో నొక్కఁడనియుఁ దలఁపవలయును. శైలి లోనగువానిఁ బట్టి చూడ నాముక్తమాల్యదఁ జేసి నాతఁడు పెద్దన కాఁ డని దృఢముగాఁ దోఁచుచున్నది. పెద్దనకవి విరమించిన స్వారోచిష మనుసంభవమునందు లక్షణదోష మొండేనియుఁ గానరాదు. తద్విరచితం బగుగ్రంథములోని పద్యములు గొన్ని యందున్న వని చెప్పవత్తురేమో, అయిన దానికిఁ గారణాంతరమేమేనియు నుండవచ్చు." అని యిట్లుగా నుపన్యాసకునియుపన్యాసముపై నీయం బడిన పండితాభిప్రాయముం దెలిపి యిపుడు నేను చేసినసంవాదము పై పండితాభిప్రాయములకు విశేషముగా భేదించి యుండ దని తెల్పి యిప్పటి కీసంవాదము మానెదను.

విజ్ఞాపనము.

పాఠకులతో నే నీభాగము ముగించుచుంటి నని విన్నవించుకొనుచున్నాఁడను. ఏమనఁగా - నిదివఱలో వివరింపఁబడినకృష్ణరాయచారిత్రము అతివిపులమైనను పాఠకులు కింకను విపులగాథ లున్న చారిత్రములు చదువవలయు ననుకుతూహలమును బుట్టించును. అట్టిసమయములోఁ జారిత్రము వ్యాపకములో లేనట్టియుఁ గేవలము పుస్తకగాథలే ప్రధానములుగాఁ గలకవులచారిత్రముల నిందుజేర్చుట యుచితముగాఁ గాన్పిం చలేదు. ఇట్టిగాథలన్నిటిం జేర్చిన [9] "కవికావ్య ప్రశంసాచంద్రిక" అనుపేరు గలయొక అనుబంధగ్రంథము ఈకవిజీవితముల వెంటనే ప్రకటింపఁబడుచున్నది. కావున దీనిలో వదలఁబడినవారిచారిత్రములు దీని యనుబంధములోఁ జూచెదరుగాక యని వివరించి యింకొక విజ్ఞాపనయుఁ జేయుచున్నాఁడను. ప్రౌఢప్రబంధకవులం జెప్పిన తోడనే శృంగారబ్రబంధములఁ జెప్పినవారి చారిత్రలును వినునిచ్చవొడమగలదు. అట్టి భాగములోఁ జేర్చఁదగిన వారిలోఁ జారిత్రములు గలవారు శాస్త్రకవులుగూడ నై యుండుటచేత వారిచారిత్రములు 'శాస్త్రకవులు' అను మఱియొక భాగములోఁ జూడవలసియుండును. ఈవఱకే యీకవిజీవితము లైదాఱుఖండములైనది. ఇంతకు విశేషఖండములు చేసినఁ గొన్ని బాధ లున్నవి కావున నీక్రింద వివరింపఁబడు "శృంగారకవులప్రశంస" జూచి ఆకవిత్వ కాల మెట్టిదియో అపుడు పేరందినవా రెవ్వరో చూచి వలయునేని వారిచారిత్రములు 'కవికావ్యప్రశంసాచంద్రిక' అను దీనియనుబంధములోఁ జూచెదరుగాక.

శృంగారప్రబంధకవులప్రశంస.

ఇదివఱలో నాంధ్రభాషలోఁ బుట్టిన ప్రబంధములలోఁ గొన్నిటింగూర్చి వ్రాసియుంటిమి. ఆప్రబంధములు పుట్టిన కాలానంతరమునందనఁగా శాలివాహనశకము 16, 17 వ శతాబ్దములలో బయలు వెడలిన కావ్యములంగూర్చి వివరించవలసియున్నది. పైప్రబంధముల పోల్కినే పైశతాబ్దములకవులు గ్రంథరచన చేయం దొరకొన నంతకంతకుఁ బాకమునందు మార్దవమును వర్ణనాంశములలో శృంగారరసము ప్రధానమగుచు వచ్చెను. ఆకావ్యములఁ దఱుచుగా శృంగారకావ్యములని, శృంగారప్రబంధము లని కొందఱు వివరించిరి. కేవలము ప్రబంధములే యని కొందఱు వివరించిరి. ఎట్లన్న నీగ్రంథములు ద్రాక్షాపాక విలసితములై సర్వజనరంజకము లై యుండి పండితపామర పఠనీయంబులైనవి. ఇట్టికావ్యరచనలో వివిధరసంబులు హృదయాహ్లాదకరంబుగఁ దెచ్చుట సులభము కాదు. ఈకావ్యములు క్రమక్రమముగఁ బంచకా వ్యము లని ప్రసిద్ధి నొందిన గ్రంథములస్థాన మాక్రమించుకొని వానిం గఠినకావ్యము లనిపించి తామే సరసకావ్యము లై సర్వజన పఠన పాఠనములలో నున్నవి అట్టికావ్యము లాకాలములలో నాంధ్రదేశములోని యన్నిదిక్కులఁ బుట్టుచువచ్చినట్లుగాఁ గాన్పించు. ఆగ్రంథముల నన్నిటిం దెల్పుట శ్రమసాధ్యము నుపయోగము లేకుండుటయు నగుఁగావున నట్టి వానిం దెల్పక స్థాలీవులాకన్యాయముగాఁ గొన్నిటినిమాత్రము వివరించెదను. అట్టిపనిఁ జేయుటకుఁ బూర్వమున్న వివిధసీమలు (ఖండములు) దెలియఁబఱచవలసియున్నది. కావున వాని నొకవిధముగా నిర్ణయించుకొని పిమ్మట నట్టిఖండములలోఁ బుట్టినగ్రంథముల వివరించెదను. ఎట్లన్న ను:-

ఆంధ్రదేశమునకుఁ దూర్పున సముద్ర మున్నదిగదా. ఆకారణమున నాసముద్రతీరములనే గంజాము, విశాఖపట్టణము, గోదావరి, కృష్ణా నెల్లూ రనుమండలములు (ఖండములు) న్నవి. ఈమండలములలోని దేశములనే పూర్వము కళింగము, వేఁగి, విదర్భ మనుదేశములుగా వ్యవహరించిరి. ఈవిదర్భదేశము కృష్ణామండలములోనిది. దీనిం బురస్కరించుకొని నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, బళ్లారు లనుమండలము లున్నవి. ఇవి కొంచె మెచ్చుతగ్గుగాఁ గృష్ణానదికి దక్షిణభాగములో నుండును. ఆకృష్ణానది కుత్తరభాగములో బెజవాడ మొదలు హైదరాబాదువఱకుం గల తెనుఁగుదేశము త్రిలింగదేశ మని పూర్వము వాడు కొనంబడు తెలింగానా ఖండము. ప్రస్తుత మది 'గోలకొండ' దేశముగాఁ జెప్పవలసియుండును. కాఁబట్టి, 1. ఖండములోని కళింగ, వేఁగి దేశములకుఁ బ్రాగుదీచీఖండమనియు, 2. ఖండములోని విదర్భదేశము (నెల్లూరుజిల్లాలోని అద్దంకి సీమ) నకు ప్రాగ్దక్షిణఖండమనియు, 3. కృష్ణానదికి నుత్తరముగా నుండు దేశమునకుఁ బశ్చిమోత్తరఖండ మనియు గోలకొండఖండ మనియు, 4. కృష్ణానదికి దక్షిణముగా నుండు ఖండమును దక్షిణఖండ మనియుఁ జెప్పెదను.

ఇట్లుగా నేర్పర్చితిం గావున నాయాఖండములలో నత్యాదరణీయము లగుప్రబంధంబులఁ గొన్నిటి వివరించెదను. ఎట్లన్నను .

గ్రంథనామము. కవినామము. దేశము ఖండము.
1. కవిజనరంజనము. ఆడిదము సూరకవి. 1. కళింగదేశము 1. ప్రాగుదీచీఖండము.
2. శ్రీకృష్ణవిజయము పూసపాటి తమ్మభూపాలకవి. " " " " " " "
1. రసికజనమనోభిరామము. కూచిమంచి తిమ్మకవి. 2. వేఁగి దేశము " " " "
2. రామవిలాసము. ఏనుఁగు లక్ష్మణకవి " " " " " " " "
1. భానుమతీపరిణయము. రెంటూరి రంగరాజు. విదర్భ దేశము (అద్దంకిసీమ) 2. ప్రాగ్దక్షిణఖండము.
2. కవిరాజమనోరంజనము కనుపర్తి అబ్బయకవి. " " " " " " " "
1. చమత్కారమంజరి. వేంకటాచారి. కృష్ణానదికి ఉత్తరము. (గోలకొండసీమ) 3. పశ్చిమోత్తరఖండము.
2. వైజయంతీవిలాసము. సారంగు తమ్మయకవి. " " " " " " " "
1. తారాశశాంకవిజయము. శేషము వేంకటపతికవి కృష్ణకు దక్షిణదేశము. 4. దక్షిణఖండము.
2. బిల్హణీయము పండిపెద్ది కృష్ణస్వామికవి. " " " " " " " "
3. విజయవిలాసము. చేమకూర వేంకటరాజకవి. " " " " " " " "

పైపట్టికలో వివరింపఁబడినవారిలో దక్షిణఖండములో నొకతఱి కవులు విశేషించి యున్నారు. వారు చోళ, పాండ్యదేశములకుఁబోయి యచ్చోఁ బ్రభుత్వముసేయుచున్న నాయకవంశసంబంధు లగువార లపైఁ గృతులిచ్చియుండిరి. కాఁబట్టి వారు కేవలము దక్షిణదేశకవులే కాక చోళ పాండ్యదేశాంధ్ర కవులని కూడఁ జెప్పఁదగియుందురు. ఇట్టి వారి గాథలు చాలభాగము కవికావ్యప్రశంసాచంద్రికలోఁ జూడఁదగు నని చెప్పి యీనావిజ్ఞాపన నిల్పెదను.

____________

శ్రీరస్తు.

కవిజీవితములు.

పురాణకవులచరిత్రము.

20.

బమ్మెర పోతరాజు

ఈ భాగములోఁ బురాణముల నాంధ్రీకరించిన కవులచారిత్రము లుండును. వారిలోఁ బ్రధానుఁడు భాగవతపురాణముం దెనిగించిన బమ్మెరపోతనామాత్యుఁడు. అదియునుగాక అతనికాలము పురాణకవనమునకును ప్రబంధకవనంబునకును నడిమి దగు 'కావ్యరచనా కాలమగుటచేతఁ బ్రాచీనగ్రంథమునకంటె ననఁగా సంస్కృతమాతృకాగ్రంథమునకంటె వర్ణ నాంశములో వేదాంతభాగములోఁ బెంచి యీభాగవతపురాణముఁ బ్రకటించెను. ఇట్టిగ్రంథరచనాప్రధానుఁ డగుపోతనామాత్యునిచారిత్రముఁ బ్రథమములోఁ గైకొనుచున్నారము. ఇతనివలెనే భాగవతకథావిశేషంబులఁ దెనిఁగించుటలో నతిసమర్థుఁడును, అద్వైతశాస్త్రప్రధానం బగువసిష్ఠరామాయణ పద్మపురాణోత్తరభాగాది గ్రంథములఁ దెనిఁగించిన 'మడికిసింగన' యొక్కయుఁ జారిత్రము తెలిసిన వఱకు వెల్లడింపఁబడును. వీరితో నించుమించుగా సరితూఁగు విష్ణుపురాణగ్రంథకర్త యగు 'వెన్నెలకంటి సూరన' అను నతని చరిత్రమును

  1. బీజనగరము
  2. విమర్శించవలెను.
  3. ఇది పొరపాటు. పారిజాతాపహరణమున నిద్దఱుకొడుకుల పేరులు లేవు. ఉన్న దొక్కటే. అచట తిమ్మయయీశ్వరనృపతికిన్ = తిమ్మరాజుకొడుకు కగునీశ్వరరాజునకు, అని యన్వయింప నొప్పును.
  4. చింత్యము
  5. ఇది పొరపాటు. ఈపద్యమున నాసంగతియే లేదు. రాయలతోఁ జదరంగ మాడి మెప్పువడసినది మఱియొక తిమ్మన.
  6. "The Gajapati King's daughter named Ruchi Devi (?) felt disposed to remain near Stambam (Cumbam) and the Rayar directed to do so, While he returned to Vizianagaram. That daughter of Gajapati, Ruchidevi said that as Kristnadevaraya was the son of a Dasi, and she herself of noble tribe illustrious by her birth, she preferred to abide by Kambam. Her father sent her thither large sums of money; she sold those jewels and had a very large water reservoir excavated near Cambam and she distributed very extensive charities
  7. దీని నిపుడు బెజవాడ యందురు.
  8. వావిళ్ల. రామస్వామిశాస్త్రులు పీఠికయందు వ్రాసియున్నారు.
  9. కాల మీతని నీగ్రంథముం బ్రకటింపనీయలే దని తోఁచెడిని.