కవి జీవితములు/వేములవాడ భీమకవి

శ్రీరస్తు.

శ్రీదక్షిణామూర్తయే నమ:

కవిజీవితములు

ప్రథమభాగము

1

వేములవాడ భీమకవి.


ఈకవిశిఖామణి వేములవాడ యనునొకయూర జన్మంబుం గాంచుటంజేసి యిట్టిగృహనామంబు గలిగినది. ఈగ్రామము గొందఱు కృష్ణామండలములోని దందురు. మఱికొందఱు గోదావరీమండలలోనిదే దందురు. కొన్నికొన్ని కారణములచే నిది గోదావరీమండలములోనిదే యని నిశ్చయింపఁబడినది. ఇది కాకినాడకు సమీపమున నున్న యది. దీనికిఁ గొంచెముదూరముననే దాక్షారామము (దక్షవాటిక) అనుగ్రామ మున్నది. అచ్చటనే భీమనాయకస్వామి యున్న వాఁడు. ఆయీశ్వరునికటాక్షాతిశయమున నీతఁ డుద్భవించె ననియు నాతని కీతఁడు కుమారుఁడే యనియు వాడుక గలదు. ఇది యెంతవఱకు నమ్మఁదగినదో మనము చెప్ప లేము. ఇట్టివార్తలు మనహిందువులలోనే కాక క్రైస్తవులు మొదలగు నితరమతములవారిలోనుం గలవు. ఈవిధముననే క్రీస్తువు భగవంతునికుమారుఁ డని జగత్ప్రసిద్ధి గలదు. అట్టివృత్తాంతమును నమ్మువారు దీనిని విశ్వసింతు రని నమ్ముదము. ఇట్టివృత్తాంతములు ప్రతి మతములోనను మహాత్ములంగూర్చి చెప్పునప్పుడు కల్గును. కావున నందఱును నమ్మవలసినదే కాని వేఱు కాదు. అట్టివారిలోఁ గొందఱు నమ్మమనుట కలిగెనేని వారు తమమతము నట్లే గ్రహించి రనవచ్చును. అయినను మన మిపు డావిషయమునుగూర్చి మాటలాడవలసినది లేదు. భీమనజన్మ వృత్తాంతము గొంత వక్కాణింతము. వేములవాడగ్రామములో నొకబ్రాహ్మణుఁడు కాఁపురము సేయుచుండెను. ఆయన కొకకూఁతురు సంతానము లేక వగచు కాలమునఁ గలిగినది. అట్టిశిశువుం జూచి యాబ్రాహ్మణుఁడు మిక్కిలి ప్రేమతోఁ బెంచుచుఁ బెద్దదానిం జేసి వివాహసమయము తటస్థింపఁగానే యొకానొకబ్రాహ్మణకుమారునికి విద్యాబుద్ధులచే నొప్పువాని కిచ్చి వివాహము చేసెను. ఆచిన్న దాని కత్తవారియింటికి వెడలుప్రాయము వచ్చు వఱ కాచిన్న దానిభర్త కాలధర్మము నొందెను. అపు డాచిన్నది విశేషదుఃఖముతో నుండ నాచిన్న దానితలిదండ్రులు దానిని బుజ్జగించి తమయింటనే యుంచుకొని పోషించుచుండిరి. ఇట్లుండఁ గొంతకాల మతిక్రమించినది. ఒకానొకసమయమున నాయూరనుండు మఱికొందఱు బ్రాహ్మణస్త్రీలు శివరాత్రినాఁడు తత్పర్వంబునకై యాసమీపముననే యున్న దాక్షారామమునకుఁ జన నుద్యుక్త లయిరి. అపు డీబ్రాహ్మణునికూఁతురును వాండ్రతోఁ బోవఁ గమకించి తల్లిదండ్రుల నాజ్ఞ యడుగఁగా వారును గూఁతు రిహమునకుఁ గాకున్నఁ బరమునకైనఁ దగుయత్నంబు చేయవలసినదే కావున దీనికి సెల వీయఁ దగు నని తగుధనం బిచ్చి వాండ్రవెంట దాక్షారామముకుఁ బంపిరి.

ఇటు లాబ్రాహ్మణస్త్రీ లందఱు దక్షవాటిం జేరి యచ్చోటున నున్న సప్తగోదావరములో స్నానము చేసి భీమనాథుని దర్శించి స్వ మనోభీష్టములం గోరుచు మ్రొక్కు లిడ సాగిరి. అపు డీ బాలరండయు స్వామికిఁ దనతోడియువతులు మ్రొక్కుటచూచి అవి సఫలము లగునా యయిన నేను మ్రొక్కెద నని యీశ్వరునిదిక్కు మొగంబై "ఓస్వామీ ! నాకు నీయట్టికుమారుఁడు పుట్టెనేని పుట్టెఁడునీరు దీపారాధనచేసి నాలుగుపుట్లయిసుక నై వేద్యము పెట్టెద" నన్నది. అట్టి దీని మనవి యా యీశ్వరుని కెంతయు నమ్మోదకారి యయ్యెనఁట. ఆహా ! ఏమి! ఈశ్వరుని విలాసము ! ఏమి ! యాభక్తసులభత ! ఇట్లు నలువురితో పాటు మ్రొక్కి యింటికి వచ్చి శయనించినయాబ్రాహ్మణ స్త్రీకి స్వప్నమున నాయీశ్వరుఁడు సాక్షాత్కరించి "ఓయువతీ ! నాయట్టిపుత్రుని బడ


యఁగోరితివి; ఆవరము నీకు దయసేయ వచ్చితిని; ఇదె గైకొమ్మని యామెతో నప్పుడే కలసి నీపుత్రునకు నాపేరే యుంచు" మని సెల విచ్చి యంతర్హితుం డయ్యెను.

ఆబ్రాహ్మణి యది యంతయుం జూచి విస్మితయై యొకవిధ మగుకల కావలయును. లేకున్న నీశ్వరుఁ డెక్కడ ? నే నెక్కడ? నన్నుఁ బొందుటయే యాతనికి వలయునా ? అని యూహించి సిగ్గుచేత నీవృత్తాంత మెవ్వరితోడనుఁ జెప్పఁజాల దయ్యెను. ఇట్లుండ నెలతప్పినది. అంతట వేవిళ్ళారంభ మయినవి. దానిం జూచి యాచిన్నది మనంబునఁ గళవళపడసాగినది. అంత మూఁడుమాసంబులు గతించినతోడనే యా చిన్నది గర్భము ధరించినది యని యందఱు ననుమానపడఁదొడఁగిరి. ఇట్లుండ నైదవమాసము సంప్రాప్త మయినది. అప్పటిస్థితిగతుల నాలోచించి యాచిన్నది దోషిణి కావున దీని నిలు వెడలఁ గొట్టినఁ గాని మీయింటికి రా మని యా లేమతండ్రితో నాయిరుగు పొరుగువా రందఱు ననిరి. అపు డాబ్రాహ్మణుఁడు కూఁతుం బిలిచి నిజవృత్తాంతము చెప్పు మనుఁడు నాచిన్నది కన్నీరు నించుచుఁ దా శివునకు మ్రొక్కు విధంబును శివుఁడు తనకు గలలోఁ గన్పించినతెఱంగును నవిస్తరముగాఁ జెప్పిన నాబ్రాహ్మణుఁడు తాను శివపూజాపరుఁడు కావున శివునకు గల్గినమహానుగ్రహమునకు సంతసిల్లి "అమ్మా! నీవు వగవకుము. లోకు లేమనిన ననఁగలరు. నాకు నీవృత్తాంతము సరిపడి యున్న యది" అని యాచిన్న దానిని దగువిధంబునఁ గాపాడుచుండెను. అంత నవమాసములును నిండినవి. అపు డాపె కొకపుత్త్రుఁడు విశేష తేజశ్శాలి జనియించెను. అతని తేజోవిశేషంబులఁ జూచి యాతనికి భీమేశ్వరుం డని నామకరణము చేసెను. ఇదియ వేములవాడభీమకవి జన్మప్రకారము. ఇది యీదేశమున నంతను నట్లే వ్యవహరింపఁబడుచున్నది. ఇఁక నితనిశైశవక్రీడాదికముంగూర్చి యంచుక వ్రాయుదము.

ఈభీమకవి యయిదాఱుసంవత్సరములవఱకుఁ దల్లిపాలనకునై యుండెను. ఇట్లుండి యొకనాఁడు తోడిపిల్లలతో నాటలాఁడ


నం దొకకుఱ్ఱం డీతఁ డన్ని యాటలం గెల్చుకొనుచుంట సహింపలేక యితనిలోపము లెన్నఁదలఁచి "యోకుఱ్ఱలారా ! మన మాతండ్రిలేనివానితో నాఁడ నేల? మనలో మన మాఁడుకొనుదము రండు" అని వారిం బిలుచుకొని పోవుడు భీమకవి మొగము చిన్నఁబుచ్చుకొని యచ్చోటు వాసి పోయి తనతల్లిం గాంచి యిట్లనియె. "అమ్మా ! మాతండ్రి యెచ్చో నున్నాఁడు? ఒకచో నున్న యెడల న న్నీ బాలు రి ట్లనుటకుఁ గారణం బేమి ? తండ్రిలేనివాఁ డని పెక్కుగఁ బల్కి యపహసించుట యేల కల్గె? దీనికిఁ గారణమ్ము దెలుపు మనుఁడు నమ్ముగుద యేమియు నన నోరాడక యూరకుండినది." అది త న్నవమానించుటగా నెఱింగి భీమన యొకఱాయి పెఱికికొని వచ్చి "మాతండ్రిమాట చెప్పెదవా ? లేకున్న నీతల శకలంబులు చేయుదునా; అనుఁడు నాపె భయ మొంది యిట్లనియె. "అయ్యా ! మీయయ్య దాక్షారామపు దేవళములో నున్న యాశిలయే. అతనియొద్దకుం బోయి నీవృత్తాంతమంతయు నడుగు మనుడు వల్లె యని యారాతితో నచ్చటికిం బోయి "యోయీ ! నీవు నాతండ్రివఁట ! నీ వుండ నన్నుఁ దండ్రి లేనివాఁడా యని నాస్నేహితు లన నవసరం బేమి? నీవు నాతండ్రివే యయిన యెడల వారి కందఱకును గాన్పించి నన్నిట్లనకుండఁ జేయుము" అనుడు నాదేవునివలన నేమియు నుత్తరము లేదయ్యెను. "అంతం గోపించి భీమనయేమీ యీమూర్ఖత నీవు మాట్లాడకున్న నీఱాతిచే నీశిరంబు శకలీభూతంబు గావించెదను" అనుడు నాయీశ్వరుఁడు వానియెడ వాత్సల్యము వహించి ప్రత్యక్షంబై నేను నీకుఁ దండ్రినే యగుదును. నీవు నాకు బిడ్డఁడవు. ఈవృత్తాంతము లోకములో నందఱకు నిఁకఁ దెలియును. పొమ్మనుఁడు యంతటితోఁ బోనీయక నే నీకొడుకునే యయిన నే నాఁడినది నాటయుఁ బాడినది పద్యమును నగునట్లు వర మి మ్మనుఁడు నవ్వి యమ్మహామహుం డట్ల వరమిచ్చి యంతర్హితుం డయ్యె. అట్టివరములం బడసి భీమన తల్లికడ కరుదెంచి యావృత్తాంత మాపెకుఁ దెల్పిన నాపెయు హర్షోత్కర్షము నందినది. భీమన నాఁటనుండియు నాబాలురతోఁ


గలియక తనపని తాను జూచుకొనుచుండెను. ఇట్లుండ మఱికొన్ని దినంబులు గతించినవి. అంత నాయూర నొకగొప్పగృహస్థునియింట యొక బ్రాహ్మణసంతర్పణ తటస్థించినది. అపు డాయూర నుండు బ్రాహ్మణు లందఱును భోజనంబునకుఁ బిలువంబడిరి. భీమకవిమాత్రము రండాపుత్రుండని పిలువంబడఁడయ్యెను. దానికి భీమన తనమనమున వగచి కార్య మగుచున్న వారివాకిటఁ గూర్చుండెను. ఇతఁడును వాకిట నున్నాఁ డనువర్తమానము దెలిసి తలుపులు దగ్గఱగా వేసికొని లోపల వడ్డనకారంభించిరి. అపుడు భీమన తనమాహాత్మ్యమును వారలకుఁ జూప నిశ్చయించి, యప్పాలు కప్పలు కావలె ననియు, నన్నము సున్నము కావలె ననియుఁ బాడం దొడంగెను. ఇట్టిపాటకు ననుగుణముగా లోపలఁ గప్పలును సున్నమును నగుడు నచ్చో నుండువారందఱును వెఱిచి దీనికిఁ గారణ మే మన నందులోఁ గొందఱు భీమనపాట విని దీనికి భీమనయే కారణము. ఆయన మహానుభావుఁడు. అట్టివానిం దోడితెచ్చి మనము పూజించితిమేని నీయూపద మాను నని నిశ్చయించి యజమానునిం దోడ్కొని వచ్చి యామహామహుం బ్రార్థించి లోనికిం దెచ్చిరి. అపు డాతడు తిరుగాఁ గప్ప లప్పములు గావలె ననియు, సున్న మన్నము గావలె ననియుఁ బాడినతోడనే యవి యన్నియు నట్లే యయినవి. అపుడు భీమకవి మహత్త్వము సర్వజనులకును గోచరమయినది. నాఁడు మొద లీత డెపుడును నగౌరవం బందఁడయ్యెను.

ఇతఁడు చళుక్యవంశపురాజగు చొక్కనృపాలుసభ నున్నట్లు కొన్నికొన్ని పద్యంబులచేఁ గాన్పించుచున్నది. ఆచొక్కనృపాలుఁడు రాజరాజనరేంద్రునివంశజుఁడు. అతనికిని రాజనరేంద్రునకును గలుగుసంబంధము రాజనరేంద్రచరితంబునఁ జెప్పఁ బడును.

ఈకవి యన్ని సంస్థానంబులం జూచి యా రాజులచే విశేషగౌరవము నందినట్లు వాడుక గలదు. ఇతని కాలములోనే మైలమ భీమన యనునొకదండనాథుఁడు గలఁడు అతనింగూర్చి యితఁడు కొన్నిపద్యములు సెప్పెను. భీమనకవిత్వపటిమఁ జూపుటకు


బఱిచెదము. ఈమైలమభీమనశాసనము అమరావతిలోని అమరేశ్వరుని దేవళముపై నున్నట్లును అది శాలివాహన. సం. 925 యైనట్లును "Elliot Marbles" అనుపుస్తకమువలనం గాన్పించును.

ఇతనిసంతతివారే ఆంధ్రదేశములోని పూసపాటి మహారాజులందఱును అని తెలియుచున్నది. ఇతనితల్లి యగుమైలమాంబవలన నితనికి మైలమభీమన యనునామము గల్గినది. ఆవృత్తాంతమును మఱికొంత యితర వృత్తాంతమును నీభీమకవిచారిత్రాంతమున జూపెదము.

చ. గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్
    హరునయనాగ్ని కొల్మి యురగాధిపుకోఱలు పట్టుకార్లు ది
    క్క రులయురంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీరసం
    హరణగుణాభిరాముఁ డగుమైలమభీమనఖడ్గసృష్టికిన్.

ఈకవి యొకానొకసమయమున గుడిమెట్ట యనుగ్రామమునకుఁ జనియె. అపుడు తనగుఱ్ఱము నొకచోఁ గట్టించి నది కనుమొఱంగి చనియె. దానిని వెదకుటకుఁ దనసాహిణిం బంచిన వాఁడును వెదకివెదకి యతి శ్రీపతిరాజు పోతరా జనునొక రాచకొమారునిచేఁ బట్టువడినట్లును, దన కది సాధ్యము కానట్లును విన్న వించెను. అపుడు భీమనయు గుఱ్ఱంబు తన దై నట్లును, దాను వైదేశికుం డై నట్లును, ముందు జాగ్రత్తగా దాని నుంచుటకు సాహిణికిం జెప్పెద ననియు వర్తమానంబు పంచెను. అది విని యాక్షత్రియుఁడు సరకు సేయఁడయ్యెను. అతనితమ్ముఁ డది కర్జంబు కా దనిన వినడయ్యెను. ఇట్లారాజు తాఁ బట్టినపట్టు విడువకుండుటకుఁ దనలో గోపించి భీమన యీక్రిందిపద్యమును వ్రాసి పంపెను. అదెట్లన్ననుః-

చ. హయ మది సీత - పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని
   శ్చయముగ నేను రాఘవుఁడ[1] జాహ్నవి వారిధి మారుఁ డంజనా
   ప్రియతనయుండు[2]సింగన విభీషణుఁ డాగుడిమెట్ట లంక నా
   జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుఁడీ.

అని యిట్లు శాపం బుంచి యాపద్యం బారాజుకడకుం బంచి భీమన తాను యథేచ్ఛం జనియెను. అ రాజకుమారుఁడు భీమనశాపంబు సరకుగొనకున్న నేఁడవనాఁటికే మృతి నొందెనఁట ఇట్లు కాలవశుం డైనయారాజుయొక్కబంధువు లతనికి నగ్ని సంస్కారంబు గావించుటకు శ్మశానవాటికకుఁ గొనిపోయిన నాతనిభార్య లిరువు రాతనితో నను గమనము సేయం జనుదెంచి యచ్చో విలపించుచు నుండిరి. అంతలో భీమన మరల నాయూరికి నచ్చుచుండెను. అది గాంచి యచ్చో నుండు కొందఱు బుద్ధిమంతు లాయువతులం బోయి భీమనకుఁ బాదాభివందనంబు సేయుఁ డని తెల్పిరి. అట్లనే యా యిర్వురుయువతులును ముఖంబులయందు శోకచేష్టలం దోఁపనీయక యాకవి కెదురుగఁ జని నమస్కారంబులు గావించిరి. వీం డ్రెవరో యిల్లాం డ్రని నిశ్చయించి వాండ్రభక్తికి మెచ్చి "సౌభాగ్యవతీ భవ" "సౌభాగ్యవతీ భవ" అని దీవించెను. అందుల కాయింతు లానందించి "స్వామీ! మే మదియ కోరి వచ్చినవాండ్రము. కావున మాపతివలనియవజ్ఞత సైఁచి మాకుఁ బతిభిక్ష పెట్టుఁడు" అనుఁడు నామహాకవి వారినిఁ బోతనృపునిభార్యఁ గా గ్రహించి మీభర్త ననుగ్రహించితి మని యీక్రిందిపద్యంబు లిఖించెను.

క. నాఁటిరఘురాము తమ్ముఁడు, పాటిగ సంజీవిచేతఁ బ్రతికినభంగిన్
   గాటికిఁ బో నీ కేటికి, లేటవరపుపోతరాజ లెమ్మా రమ్మా.

అనుఁడు నా రాజన్యుఁడు మూర్ఛఁ జెంది తెలిసినవానివలెనే దీర్ఘ నిద్రం జెందక లేచి తనయెదుట నున్న భీమకవిం జూచి రక్షింపు మని నమస్కరించిన నాతఁ డవు నని వానిం దీవించి బుద్ధి గల్గి బ్రతుకు మని తెల్పి యథేచ్ఛం జనియెను. ఈవృత్తాంతము తురగా రామకవి దని కొంద ఱందురు. అప్పకవీయములో నెల్లూరి తిరుమలయ్య చెప్పినట్లున్న యది.

ఈభీమకవి రామగిరిదుర్గమునకుఁ జొక్క భూపాలుతో దండయాత్రకుం జనియె. అచ్చట నానృపాలుని సాహిణిమారుఁ డనుదండనాయకుఁ డెదిర్చెను. అతనిదౌష్ట్య మధికం బగుడు భీమకవి యీక్రిందిపద్య


ము చెప్పి వాని సంహరించి తనరాజునకు జయం బిచ్చెను. ఆపద్య మెట్లన్నను :-

ఉ. చక్కఁదనంబుదీవి యగుసాహిణిమారుఁడు మారుకైవడిన్
    బొక్కి పడం గలండు చలము న్బలమున్గలయాచళుక్యపుం
    జొక్కనృపాలుఁ డుగ్రుఁ డయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్
    మిక్కిలి రాజ శేఖరునిమీఁదికి వచ్చిన రిత్త వోవునే.

ఈకవి యొకానొకసమయంబున నీచొక్కనృపునిసభ నలంకరించి యుండఁగా నాతఁడు "స్వామీ ! మీ రాడినది యాటయుఁ బాడినది పద్యమును నగు ననియు, నేమనిన నది యట్లే యగు ననియు జగత్ప్రసిద్ధి గలదు. దాని నీసభవారికి వినోదార్థ మగుపఱుప వేఁడెదను" అనుఁడు నీ కేది యభీష్ట మనుఁడు నాతఁడు తనమల్లెశాల నున్న స్తంభము వృక్షము సేయుటయే యనియె. దానికి భీమకవి నవ్వి యిట్లనియె.

శా. అనీతాభ్యపదానుశృంగళపదభ్యాలంబిత స్తంభమా!
    నేనే వేములవాడభీమకవి గా నీ చిత్రకూటంబులో
    భూనవ్యాపితపల్లవోద్భవమహాపుష్పోపగుచ్ఛంబులన్
    నా నాపక్వఫలప్రదాయ వగుమా నాకల్పవృక్షాకృతిన్.

అని యిట్లు చదివినతోడనే యాసభవా రందఱును గన నది పుష్పఫలసమన్వితం బగువృక్షం బయ్యెను. అట్టివృత్తాంతమునకు రాజును సభవారును మిగుల సంతసించి మఱల దానిని స్తంభముగ నొనర్పు మనిన దానికి సంతసించి భీమకవి యి ట్లనియె.

ఉ. శంభువరప్రసాదకవిజాలవరేణ్యుఁడ నైన నావచో
   గుంభన సేయ నెంతయనుకూలత నొంది తనూనభావమై
   కుంభినిఁ జొక్క నామనృపకుంజరుపందిటిమల్లెశాలకున్
   స్తంభమురీతి నీతనువు దాల్పును యెప్పటియట్ల యుండుమా.

ఈభీమకవి యొకానొకసమయంబున విజయనగర (కళింగదేశములోనిది) సంస్థానాధిపుఁ డగురాజకళింగగంగును జూచువేడుక నచ్చటికిం జని తనరాక యాతనికిం జెప్పి పుచ్చె. అపుడు రాజకళింగగంగు కా


ర్యాంతర భారంబున నుండుటంజేసి మఱియొకపరి రమ్మని మాఱుపంచె. భీమకవి తనంతటఁ దాను వచ్చి వర్తమానంబు పంపినపుడు రాజు స్వయముగ వచ్చి తనకడ సెలవు గైకొనక యిట్లు వర్తమానంబు పంపుట కుం గోపించి యీక్రిందిపద్యంబు వ్రాసి మఱలఁ బంపెను.

క. శాపానుగ్రహపటువును, ఱాపాడెడికవులనెత్తిఱంపం బనఁగా
   భూపాలసభలఁ బూజ్యుఁడ, నాపేరే భీముఁ డండ్రు నరవర సభలన్.

ఇట్టిపద్యంబు చూచియు రాజు జాగరూకుఁడై యాకవిదర్శనంబునకు రాక మరలఁ దొంటియట్ల యుత్తరం బిచ్చెను. దానిచేఁ గ్రోధారుణితలోచనుం డై భీమకవి యీక్రిందిపద్యము వ్రాసెను. అదెట్లన్నను :-

ఉ. వేములవాడభీమకవి వేగమ చూచి కళింగగంగు దా
    సామము మాని కోపమున సందడి దీఱినవెన్క రమ్మనెన్
    మో మిటు చూప దోష మని ముప్పదిరెండుదినంబులావలన్
    జామున కర్ధమం దతనిసంపద శత్రులపాలు గావుతన్.

అని యిట్లు శాపం బిచ్చి యాతఁడు తనత్రోవం బోయెను. దానికిని కళింగగంగు లక్ష్యము సేయక యూరకుండెను. ఇట్లుండ శాపకాలంబు సంప్రాప్తమయ్యెను. అపుడు తత్సమీపంబున నున్న పర రాష్ట్రమువారు తద్వృత్తాంత మంతయు విని యాతనిపై దండెత్తి వచ్చి యాతనికోట నాక్రమించుకొనిరి. అపుడు రాజకళింగగంగు చేయునది లేక దేశాంతరగతుఁ డయ్యెను. పరులు నిర్భయంబుగ నచ్చో నుండి దేశమును బాలింపందొడంగిరి. రాజకళింగగంగు నేకాకియై దేశ దేశంబులఁ దిరిగి ప్రచ్ఛన్నరూపంబునఁ బగటివేషగాండ్రతోఁ గలిసి యుండి స్వోదరపోషణంబు గావించుచుండెను. ఇట్లుండఁ బెక్కుదినంబులు గడచినవి. అంత నొకనాఁటిరాత్రికాలంబున నీ రాజకళింగగంగు వేషధారులతోఁ బగటియం దుండి రాత్రి మఱియొక యూరికిం బోయి పర రాష్ట్రమువారినృత్తాంత మరయుటకు వచ్చుచుండెను. భీమనయు నొకయందలంబునం గూర్చుండి జోడుదివిటీలు వేయించుకొని విశేష వైభవంబుతో నాతని కెదురుగ వచ్చుచుండెను. వాహకులు భుజములు


సవరించుకొనుటకు నిలిచినపుడు భీమనకుఁ గొన్నిమాటలు వినవచ్చినవి. అటుక్రితము ఎదురుగ వచ్చుచున్న రాజకళింగగంగు భీమకవికడ నున్నదివిటీలఁ జూచుచు నడుచుచుండెను గావునఁ ద్రోవ నున్న యొకగోతిం జూడఁజాలక యందుఁ గూలి పై కెగఁబ్రాఁకుచు ఛీ ! కాలిదివిటీయైనను లేనివానిబ్రతుకు నిరర్థముగదా యనుచుండెను. ఈవృత్తాంతము భీమనచెవులం బడినతోడనే అతఁడు కొంచెము చింతించి "యెవడు రా యాగోతిలో నున్న వాఁడు" అనుఁడు రాజకళింగగంగు "అయ్యా! నేను వేములవాడభీమకవిగారిచేఁ జేయఁబడినజోగి" ననియెను. ఆమాటవిని భీమన "నీవు రాజకళింగగంగువా" యనుఁడు చిత్తమురక్షింపుఁ డని పాదంబులపైఁ బడి మ్రొక్కందొడంగెను. అట్టి కళింగగంగుం జూచి యాతఁ డిట్లనియెను :-

చ. బిసరుహగర్భువ్రాఁతయును విష్ణునిచక్రము వజ్రివజ్రమున్
    దెసలను రాముబాణము యుధిష్ఠిరుకోపము మౌనిశాపమున్
    విసకపుఁబాముకాటును గుమారునిశక్తియుఁ గాలుదండమున్
    బశుపతికంటిమంటయును బండితవాక్యము రిత్త వోవునే.

అనుపల్కుల కుల్కి రాజకళింగగంగు క్షమింపుఁడు క్షమింపుఁ డని నమస్కరించిన భీమన మరల నిట్లనియెను:-

ఉ. రామునమోఘబాణమును రాజశిఖామణికంటిమంటయున్
    దామరచూలివ్రాఁతయును దారకవిద్విషు ఘోరశక్తియున్
    భీముగదావిజృంభణము వెన్నునిచక్రము వజ్రివజ్రమున్
    వేములవాడభీమకవిభీషణవాక్యము రిత్త వోవునే

ఇదియే భీమనచెప్పినపద్యము కావచ్చును. పైపద్యము దీనికిఁ బాఠాంతర మని తోఁచెడిని. ఇట్లని నవ్వుచు నారాజుం జూచి భీమకవి యిట్లనియె

ఉ. వేయుగజంబు లుండఁ బదివేలుతురంగము లుండ నాజిలో
    రాయలఁ గెల్చి సజ్జనగరంబునఁ బట్టముఁ గట్టుకో వడిన్
    రాయకళింగగంగు కవిరాజభయంకరమూర్తి చూడఁ దాఁ
    బోయెను మీనమాసమునఁ బున్నమ వోయినషష్ఠి నాఁటికిన్.

అనుపద్యముచే భీమన రాజుం దీవించి యందు నయాచితముగఁ దననిర్యాణంబు సూచింపఁబడుపదం బుండుటకు నాశ్చర్యం బంది కాలగతి యిట్లున్న దని నిశ్చయించి తనమార్గంబునం బోయెను. అనంతరము రాజకళింగగంగు భీమనకవివరంబు మనంబునఁ దలపోయుచుఁ దిరిగి తా నున్న పగటివేషగాండ్ర మేళంబులోనికిఁ జనియెను. ఆవేషగాం డ్రదివఱకు నచ్చో రాజ్యంబు సేయుచున్నపరరాజుం జూచు చుండిరి. ఆరాజును గాలచోదితుండై భీమకవివరదినంబునాఁ టికి రాజకళింగగంగువేషమును జూచునభిలాషము దనకుఁ గల దనియు నా వేషం బెవరైన వేయఁగలరా యనియు నావేషగాండ్ర నడిగిన వారందఱును సంశయించి యూరకుండిరి. వేషగాండ్రలో నొకఁ డైనరాజకళింగగంగు తాఁ బయలుపడుట కదియ తఱి యని యెంచి యోహితులారా ! నేను కళింగగంగువేషంబు ధరింపఁగలను. అతనిగుఱ్ఱంబును వేషంబును నాయుధంబులును దన కిప్పింపుఁ డని యడుగుఁ డనుఁడు వారును నట్ల కావించిరి. రాజును వానినన్నిటిని నిచ్చుటకు సెల వొసంగెను. ఆమఱునాఁటిసాయంకాలము రాజకళింగగంగు నిజవేషంబు ధరియింపఁగోరి యభ్యంజనస్నా తుండై సాంబ్రాణిధూపంబునఁ దల యార్చి నుదుటఁ దిలకంబు దిద్ది తన దుస్తులఁ గట్టితాజుధరించి కాఁగడావాండ్రం బిలిచి గృహంబు వెలువడి తన ఘోటకసమీపంబునకు వచ్చి దానిపైఁ జెయి వేసి మెల్లనఁ దట్టిన నది తనప్రభుం డవుట గ్రహించి తనసంతసముం జూపురీతి నొకప్లుతంబు గావించినది. దానిం గని కళింగగంగు తాను జయమును గైకొనుట నిశ్చయమనుకొని యశ్వారోహణంబు గావించెను. అట్టి వేషమును జూచి తత్పురంబులోనికొంద ఱాతఁడు నిజమైనరాజు గాని వేషధారి కాఁ డని నిశ్చయించి తోడ నడువ నారంభించిరి. రాజకళింగగంగువేషము వచ్చుచున్న దని తక్కుంగలవేషగాండ్రు చని పరరాజునకుం జెప్పుడు నాతఁ డదికళింగగంగు నవమానించుటకుఁ దగినతఱి యని యెంచి నిండు కొలువుండి వేషంబును లోపలకు రా సెలవొసంగెను. రాజకళింగగంగు సింహాసన సమీపమువఱకు గుఱ్ఱముతోనే వచ్చి యచ్చో దానిని నిల్పి


తాను డిగి చెచ్చెర సింహాసనంబుపైకిఁ జని యం దున్న పరరాజు శిరంబు నఱికి యాతనియట్టఁ గ్రిందికిఁ ద్రోచి తనపరివారంబుం బిలిచి సేనలసన్నాహంబు సేయు మనుఁడు వారందఱునుఁ దమరాజు చిరకాలమునకు వచ్చుట కెంతయు సంతసించి యుద్ధసన్నద్ధులై పరరాష్ట్రసైన్యము నుక్కడంచి మిగిలినవారిం బాఱఁదోలిరి. ఇట్లు రాజకళింగగంగు భీమకవివరప్రసాదలబ్ధి సింహాసననాసీనుండై సుఖంబున రాజ్యంబు సేయుచుండెను. అప్పుడు కళింగదేశమునకు సజ్జనగరము ముఖ్యపట్టణ మని తోఁచెడిని. విజయరామమూర్తినృపుఁడు విజయనగరముం గట్టి ముఖ్యపట్టణము చేసినట్టు వాడుక గలదు. ఇక్కడ భీమకవి కళింగగంగును దీవించి యింటికిం జని తనకు నిర్యాణంబు తటస్థించినది కాఁదలంచి తత్సన్నాహంబున నుండెను. ఇట్లుండ నొకనాఁ డాతనిమాత యతనికి నన్నం బొసంగు చుండ నాపెకడుపున మసి యంటుట చూచి భీమకవి తనతల్లిం బిలిచి నీకడుపు మసి యయ్యె ననియెను. ఆమాట విని యాపె తనకుమారునివాక్య మమోఘ మని యెఱింగినదిగనుక "నాయనా ! యెట్లంటి వనుఁడు భీమన తనకుఁ గాలంబు తటస్థించెం గావునఁ దదనుకూలంబుగనే సర్వంబును జరుగుచున్న దని చెప్పెను. ఆమాటలు విని యాయిల్లాలు మిగుల వగల నొందినది. భీమకవియుఁ దా నిర్దేశించినదినంబునాఁటికి గాలవశుం డయ్యెను.

ఈభీమనచేఁ జేయఁబడినమహాకార్యము లనేకములు గలవు. ఇతఁడు లకోటాప్రశ్నంబులఁ జెప్పుటకు నొకగ్రంథంబును వ్రాసి బెజవాడసమీపంబున నుంచెను. అందుఁ బటలంబు లనియు నర్గ బు లనియు భేదంబులు గలవు. మనప్రశ్నము చేరినకాలముంబట్టి గణితముచేసినచో నిన్నవపటలములో నిన్నవసంచికలో నిన్నవపుటలో నుండు నని చెప్పంబడియుండును. ఆపుటలో మన మడిగినప్రశ్నంబులును దానికిం దగునుత్తరంబులు నుండును. ఇది యొకగొప్పయద్భుత వృత్తాంతము. ఇప్పుడు మన మడుగుప్రశ్నంబులును వానియుత్తరంబులును వేయిసంవత్సరములక్రిందట భీమన యూహించి యుంచెను. ఇది యీశ్వరునిచే నయ్యెడు


వని గాని యొండు గాదు. కావున నిట్టిసంగతి నొనర్చినయాతఁ డీశ్వరవరప్రసాది యని చెప్పుట కేసందియంబును లేదు. ఈగణితమువిషయమై యింక ననేకగ్రంథంబులు రచియించె నని వాడుక గలదు. అం దద్భుతము లింకను గల వందురు.

ఇఁక నీకవిసాహిత్యముంగూర్చి యించుక వ్రాయుదము. ఆకాలములోని వారిసాహిత్య మీతనిసాహితికిం జాల దని వాడుక గలదు. అపుడు రెండర్థములు వచ్చునట్లు పద్యములు చెప్పినవాఁ డీతఁ డొక్కఁ డే యని యనేకులు నిశ్చయించిరి. ఇందులకు దృష్టాంతముగాఁ బింగలి సూరన తనరాఘవ పాండవీయములోఁ జెప్పినపద్యము :-

శా. రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
    కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగు నే నోహో యనం జేయదే
    పాండిత్యంబున నందునుం దెనుఁగుకబ్బం బద్భుతం బండ్రు ద
    క్షుం డెవ్వాఁ డిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.

ఉ. "భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయె కాని యందు నొం
    డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన రటుండ నిమ్ము"

ఈకవి రాఘవపాండవీయ మనుద్య్వర్థికావ్యము పూర్వము రచించె నని వాడుక గలదు. అది యిపుడు ఖిలమయినది. అప్పకవి నన్నయభట్టు దాని నడఁచె నని చెప్పెను. కారణంబు లతనిచేతం జెప్పఁబడినవి యెంతవఱకు నిజమో మన మిపుడు చెప్పఁజాలము. ఇతఁడు విశేషకవి యని శ్రీనాథుడు కాశీఖండములోఁ దన్ను రాజు నుతించి "నీవు భీమనవలెఁ గవిత్వము చెప్పఁగలవు" అనినట్లుగాఁ జెప్పినపద్యము :-

సీ. "వచియింతు వేములవాడభీమన భంగి నుద్దండలీల నొక్కొక్కమాటు"

ఇంక ననేకస్థలంబులలో నీకవిమాహాత్మ్యంబు పేర్కొనఁ బడియె. నన్నయభట్టారకాదులు నీతనివిశేషంబుగా నుతించి చెప్పినపద్యములు నన్నయభట్టుంగూర్చి చెప్పినకథలో వ్రాసియుంటిమి. ఇంతియకాక యీకవి ఛందోవిషయమైనగ్రంథం బొకటి యొనర్చెను దానినే భీమనఛంద మందురు. అది నన్నయభట్టు వ్యాకరణంబునకుఁ బూర్వ


పుది. అందు విశేషించి యీకవిచే రచియింపఁబడినచాటుధా రాపద్యములున్న యవి. అప్పటివార లందఱును దీనింబట్టియే కవిత్వము చెప్పినట్లు ప్రాచీనగ్రంథంబులంబట్టి చెప్పఁదగియున్నది. అందులో యతులం జెప్పి యొకపద్యంబు చెప్పెను. ఆపద్యమును జూచిన నతనికిం గవిత్వమం దున్న ప్రజ్ఞ విదితం బగును. అది యెట్లన్నను :-

సీ. అబ్జగర్భశివస్వరాఢ్యపూజ్యపదాబ్జ, కమలాక్ష మౌనివర్గప్రసన్న
   వైభవాఖండదేవాదిదేవకృపాబ్ధి, యఖిలదిక్పాలకప్రాదినిలయ
   సుతపుణ్యహాస బిందుయుతాననాంభోజ, యతిదయాప్లుతనిజాత్మా మహాత్మ
   స్వచ్ఛపౌరుషకీర్తిసంయుక్తాసంచార, మహిమ నెక్కటి యైనమాన్యచరిత

గీ. పోల్ప నీపోలికకు దైవములును గలరె, సరసమతిపాత్ర భక్తరంజనచరిత్ర
   ప్రాసనిర్భిన్న చండతరాసురేంద్ర, యలఘుయతిగణ్య రఘురామ యథుపి రామ.

ఇందు వళి నామంబులును వాని కుదాహరణంబులు జెప్పుచు నీశ్వరుని సన్ను తించిన ట్లున్నది. ఆహహా! చూడుఁడు ఈకవిప్రజ్ఞావిశేషంబులు? ఇట్టికవింగూర్చి యప్పకవి కొన్ని తప్పుడుమాటలు తనగ్రంథంబులో నతికించిన వాఁడు. వానిం జూచినవారు భీమకవిప్రజ్ఞావిశేషంబు లెఱింగిన యనంతరమున నప్పకవి నపహసింపక మానరు. ఈకవిశిఖామణి కవిత్వములోనివి కొన్ని పద్యంబు లిచ్చోటను వివరింతము.

చ. హరుఁ డధికుండు వింటికిఁ బురాఁతకుకంటెఁ గిరీటి మేటి శం
   కరపురుహూతనందనులకంటెను రాముఁడు నేర్చు నిందు శే
   ఖరకపికేతుభార్గవులకంటెఁ గుమారుఁడు మీఱు నంబికా
   వరనరజామదగ్న్యశిఖివాహుల కెక్కుడు రాఘవుం డిలన్

ఉ. వారక వారకామినులవార్తలు చారుకుచోపగూహముల్
    కోరక కోరశోల్ల సితకుంజములున్ జిగురాకుపానుపుల్
    చేరక చారుకేరళకళింగకుళింగనరేంద్రమందిర
    ద్వారవిహారు లై చెలువు లందక నందకపాణిఁ గొల్వరో.

వేములవాడ భీమకవి కాలనిర్ణ యాదికము.

ఈకవికాలము మన మిదివఱకుఁ దత్కాలీనులను జెప్పుటచేత నొక విధముగా నుడివినారము. అప్పకవీయములోఁ గూడ నితఁడు నన్నయ


భట్టునకు సమకాలమువాఁ డైనట్టుగా ననేక దృష్టాంతములు గాన్పించుచున్నవి ఎట్లన్నను :-

[3]గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి, నట్టిరాఘవపాండవీయము నడంచె
   ఛందము నడంచ నీఫక్కి సంగ్రహించె, ననుచు భీమన యెంతయు నడఁచె దాని.

దీనింబట్టి చూడఁగా భారతమును దెనిఁగించుచు భారతార్థమును జెప్పుచున్న రాఘవపాండవీయమును నన్నయభట్టు పూర్వపక్షము చేసె ననియును, దనఛందస్సు నడఁచుటకుఁగా నీనన్నయభట్టు ఆంధ్రశబ్దచింతామణిని సంగ్రహించెఁ గావున దానిని భీమన యణఁచి వేసె ననియును దేలినది. దేని నేది పూర్వపక్షము సేయుట కేర్పడినను నన్నయభట్టునకును భీమనకును బరస్పరమును వైమనస్య మున్నట్లుగా దీనివలన గోచరం బగును. వీరిర్వురును సమకాలీనులు గాక యుండినచో నిట్టివృత్తాంతము జరుగుటయే తటస్థింపదు. అయితే మన మిపు డీయప్పకవి కథయే అసత్య మని సంవాదార్థమై యోజింతము. ఆపక్షములో నన్నయ భీమనలు సమకాలీను లని మఱికొన్ని సాధనములఁబట్టి మనము నిర్ణయింపవలయును. వీరిర్వురకును సమకాలీనులుగా నున్న మఱికొందఱికాలములు మనము తెలిసికొని యనంతరము ప్రస్తుతాంశ మాలోచింతము.

ఇతఁడు చెప్పినచాటుధారాపద్యములలో నక్కడక్కడ రాజకళింగగంగుంగూర్చియుఁ జొక్క రాజుంగూర్చియు సాహిణిమారుంగూర్చియు శృంఖలరాజుం గూర్చియు వచ్చెడి ప్రస్తావనలనుబట్టి యితఁడు వారితో సమకాలీనిఁ డని యూహించుటకుఁ దగి యుండును గదా! వారికాలంబులు నిదివఱకు నిర్ణయింపఁబడక యుండుటంబట్టి మనము సాధ్యమయినంతవఱకు వాని నిర్ణయముఁగూడ నిప్పుడ చేసి దీని నిర్ణయింతము.

భీమకవి చెప్పిన యీక్రిందిపద్యములంబట్టి భీమకవి రాజనరేంద్రునితండ్రి యగు విమలాదిత్యుని సమకాలీనుఁ డని విస్పష్ట మగుచున్నది. ఆపద్య మెట్లన్నను :

మ. ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం
    దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుం డభీ
    మన నాపేరు వినంగఁ జెప్పితి వెలుంగాధీశ కస్తూరికా
    ఘనసారదిసుగంధవస్తువులు వేగన్ దెచ్చి లాలింపురా.

ఇందలి "వెలుంగాధీశ" యనుపదమునకు విమలాధీశుఁ డని యర్థము కొందఱు చెప్పుదురు. అట్లే యయిన నితఁడే రాజనరేంద్రునితండ్రి. ఇతఁడు శాలివాహన సం. 937 న రాజ్యమునకు వచ్చి శాలివాహన సం. 944 వఱకు రాజ్యముచేసెను. ఇతఁడు రాజ్యమునకు రాకపూర్వము 27 సంవత్సరముల నుండి వేఁగిదేశ మరాజకముగా నున్నట్లు మనకుఁ జాళుక్యవీరవాదశాసనముంబట్టి కాన్పించును. దీనినే సూచించుశాసనములు పెక్కులుగలవు.[4] ఈపద్యమునాఁటికి శాలివాహన సం. 927 పైఁగా నయినది. విమలాదిత్యుఁడు మఱియొక పదిసంవత్సరములకే రాజ్యమునకు వచ్చినట్లు కాన్పించుచున్నది. ఈసమయములోపలనే కళింగనగరమం దుండెడికళింగరాజులు తమ యధికారమును బలపఱుచుకొనినట్లుగాఁ బైగ్రంథమునందే చెప్పఁబడి యున్నది. [5] దీనింబట్టి భీమకవి శాలివాహన సం. 944 నకుఁ బూర్వమందే యున్నట్లుగా నెన్నవలసి యున్నది. ఇదియే నిశ్చయమైనట్లుగా శ్రీనాథుఁడు తాఁ జేయుచున్న కవిస్తుతిలోఁ బ్రారంభమునందు

సీ. "వచియింతు వేములవాడభీమనభంగి, నుద్దండలీల నొక్కొక్కమాటు"

అని భీమకవిపేరు చెప్పి పిమ్మట

"భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాచాప్రౌఢి నొక్కమాటు" అని యనంతర మాంధ్రభాషావాగనుశాసనుం డనంబరఁగిన నన్నయభట్టారకుం గొనియాడెను. అనంతరము తొంటివరుస చెడనట్లుగాఁ దిక్కనసోమయాజిని నెఱ్ఱప్రగ్గడంగూడ వర్ణించి చెప్పెను. ఇప్పద్యముం బట్టిచూడఁగా భీమకవి నన్నయభట్టునకును బూర్వుం డని నిర్ణయింపఁబడినది యగుచున్నది. మన మిదివఱకు వాక్రుచ్చిసచారిత్రను నట్లే స్థిరపఱుచుచున్నది. కావున నిఁక నీవిషయమై నంవాదముతో నవసరము లేదు. మైలమభీముని అమరావతి శాసనమువలన నితనిసమకాలీనుఁ డగునా రాజు శాలివాహన సం. 925 లో నున్నట్లు కాన్పింపఁగా భీమకవి ఆసమీపకాలములో నున్నవాఁ డని చెప్ప నొప్పియుండును. అయినను "వెలుంగాధీశ" యనుపదము విమలాదిత్యునకు వర్తింపకపోవుననిశంకించి యీకథ యింతటితో నిలిపి మఱియొకకథంబట్టి భీమకవికాలమును నిర్ణయింతము. అది రాజకళింగగంగు కాలమునుఁ బట్టి దానింగూర్చి మన మిపుడు నంవాదించి నిర్ధారణ చేయవలసి యున్నది. దీనివిషయమై మనము వ్రాయుటకుఁబూర్వము భీమకవి చేసినకళింగపట్టణముయొక్క వర్ణన నిచ్చోటున వివరింతము. అదెట్లనిన :-

సీ. యోజనద్వయవిశాలోన్నతిఁ జెలువొంది, పట్టణం బమరు శోభావిభూతి
   హాటకరత్న కవాటానుమోదమై, సూటి మించును గంచుకోటమహిమ
   నూటొక్కగుళ్ల చెన్నుగ శివానందమై, నిత్యోత్సవక్రీడ నెమ్మిఁ దనరు
   వంశధా రానదీవా రాశిసంయుత, సాగరసంగవిస్రంభ మమగఁ

గీ. గడిఁది రాజకళింగభూకాంతునకును, దనరునవలక్ష కాళింగ మనఁగ నొప్పి
   శృంఖళద్వీప మనఁగఁ బ్రసిద్ధి మించు, గణనకెక్కుఁ గళింగపట్టణము ధాత్రి.

దీనింబట్టి చూడ శృంఖళరాజనామము రాజకళింగగంగునకుఁ బర్యాయపద మైనట్లుగా సూచించుచున్నది. శృంఖళద్వీప మని ప్రసిద్ధిఁ జెందినకళింగ పట్టణమున కధిపతి గావున నాతని నొకపరి శృంఖళుఁ డనియుఁ గళింగాధిపుఁ డనియు వాడుచు వచ్చెను. ఇతఁడు చాళుక్యశాఖలోనిభాగ మగుగంగవంశపు రాజులలోనివాఁడు గనుక నితనిని గళింగగంగని వాడినట్లుగాఁ గాన్పించును. ఉత్కళదేశపురాజవంశమునకు గాంగేయవంశ మనియు గంగవంశ మనియు గంగేశ్వరుఁ డనుపురుషునిఁబట్టి


నామంబులు గలవు. ఈవంశస్థులలోఁ గొందఱు శాలివాహనశకమునకు నాఱేడుశతాబ్దములకుఁ బూర్వముననే కళింగదేశమునకు వచ్చి యచ్చట స్థిరపడినట్లుగా హిందూ సిలోన్ దేశములయొక్క ప్రాచీనశాసనాదికములంబట్టియు, గ్రీసురోముదేశములలోని ప్రాచీనగ్రంథములం బట్టియుఁ గాన్పించుచున్నది. ఇది కొంతకాలము విశేషాభివృద్ధిగా నున్నట్లును మఱికొంతకాలము దుర్బలముగా నున్నట్లును గాన్పించును. ఇదివఱకు మనము చూపించిన దృష్టాంతములంబట్టి యీవంశమువారికి మరల నధికారప్రాబల్యము శాలివాహన సం. 900 మొదలు కల్గినట్లుగాఁ గాన్పించును. అదిమొదలు చిరకాలము వీరు విశేషవృద్ధిలో నుండి తుదను గృష్ణరాయలకాలములో మఱల నపజయము నందినట్లు గాన్పించును. ఆవృత్తాంతము లన్నియు దేశచారిత్రములో నుచితస్థలములలోఁ గీల్కొల్పుదము. మనము ప్రస్తుతాంశమును మఱలఁ గైకొందముగాక. ఈభీమకవి శృంఖలుని సమకాలీనుఁడనుటకు సందియము లేదు. ఇతఁడు శృంఖళరాజు నొద్దకు వెళ్లినప్పు డారాజు భీమకవిమాహాత్మ్యము దెలియక నీవు కవివై యేమిచేయఁగలవు? నీపే రెవ్వ రని యడిగిన భీమకవి యాగ్రహముతో నీక్రిందిపద్యమును జెప్పె నని కలదు.

సీ. గడియలోపలఁ దాడి నడఁగి ముత్తునియఁగాఁ, దిట్టినమేధావిభట్టుకంటె
   రెండుగడియల బ్రహ్మదండిముం డ్లన్నియుఁ, దుళ్లఁ దిట్టినకవిమల్లుకంటె
   మూఁడుగడియలకుఁ దా మొససి యత్తినగండి, పగులఁ దిట్టినకవిభానుకంటె
   నఱజాములోపలఁ జెఱుపునీ ళ్లినుకంగఁ దిట్టినబడబాగ్ని భట్టుకంటె

తే. నుగ్రకోపి నేను నోపుదు శపియింపఁ, గ్రమ్మరింప శక్తి గలదు నాకు
   వట్టిమ్రానఁ జిగురుఁ బుట్టింప గిట్టింప, బిరుద వేములవాడభీమకవిని.

అని పల్క నారాజు దాని నంతయు ఛలోక్తిగా నెంచి తనసభామంటపమం దున్న స్తంభమును వృక్షముగాఁ జేయఁగలవా యని యడిగినట్లును దానిపైని భీమకవి.

"అనీతాభ్యుపదానుశృంఖలపదాభ్యాలంబిత స్తంభమా"

అనుపద్యము చెప్పినట్లును నటుపిమ్మట నా స్తంభము వృక్షమై యాతనికా లందుఁ జిక్కుకొన భీమకవిం బ్రార్థింపఁగా "శంభువరప్రసాదకవిజాలవరేణ్యుఁడ నైన"

అనుపద్యమును భీమకవి చెప్పి యతనిని మెప్పించి యతని యాస్థానకవిగా నట నుండుటకుఁ గోరఁబడియం దున్నట్లును జెప్పుకొనియెదరు. దీనింబట్టి చూడఁగాఁ జొక్కనృపాలుఁ డనియు శృంఖళుఁ డనియు నామములు గలరాజకళింగగంగునకీతఁడు సమకాలీనుఁ డని స్పష్ట మగుచున్నది. పైసీసపద్యములో భీమకవి తనకు సమకాలీనులుగా నైనను బూర్వులుగ నైనను నున్నవారల నామములు మనకుఁ గొన్ని కొన్ని తెలిపెను. వీరిలో బడబానలభట్టు చాలఁ బ్రసిద్ధిఁ జెందినవాఁడు. అతనింగూర్చి కొంచెము విశేషించి ముచ్చటించుటకుఁ బూర్వము తక్కినమువ్వురును గోపముతోఁ జెప్పినపద్యములు వారివారికవిత్వశైలి చూపుటకును దత్తత్కాలీనుల నామంబులు సూచించుటకును నిట వివరించెదము.

మేధావిభట్టు తాను హఠాత్తుగా [6] సాళువ పెదతిమ్మరాజును సమీపించినపు డతనిపైఁ బద్యముఁ జెప్పుట కిష్టము గలిగి పద్యము వ్రాయుటకుఁ దాటాకు లేక తాటిచెట్టును విరిగి పడు మని చెప్పినట్లుగా నీక్రిందిపద్యమువలనం గాన్పించును. అదియెట్లన్న :-

క. సాళువపెదతిమ్మమహీ, పాలవరుఁడు వీఁడె వచ్చెఁ బద్యము వ్రాయన్
   గేలను లే దా కొకటియుఁ, దాళమ ముత్తునియ లగుచు ధరపైఁ బడుమా.

ప్రౌఢకవిమల్లన గుడి యన్న మరాజుకొఱకు నడిచి పోవునపుడు కొండపల్లిపడమటఁ దనరెండుమడమలలో బ్రహ్మదండిముండ్లు గ్రుచ్చుకొనఁగా నీక్రిందిపద్యముం జెప్పెను. ఎట్లన :-

క. గుడియన్న నృపతిఁ బొడఁగన, నడువంగాఁ గొండపల్లినగరిపడమటన్
   గుడియెడమమడమ గాఁడిన, చెడుముండులు బ్రహ్మదండిచెట్టున డుల్లున్.

బడబాసలభట్టు త్రిపురాంతకమునుండి శ్రీశైలమునకుఁ బోవు


మార్గములోఁ [7] దెనుఁగురాయఁడు గట్టించినచెఱువునీ ళ్లన్నియు నాలుగుగడియలకు నింకిపోవునటులఁ దిట్టెను. ఎట్లన్నను :-

క. బడబానలభట్టారకు, కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
   బిడువేళ నూడి నీలోఁ, బడియెఁ దటాకంబ నీటిఁ బాయుమ వేగన్.

ఈబడబానలభట్టు శాలివాహన సం. 1019 న వెలమవంశస్థులగోత్రఖండచేసెననియు నద్దానింబట్టి యీకవి వారిచే నెల్లపుడు స్మరియింపఁబడవలసిన వాఁడుగాఁ బద్మనాయకచరిత్ర మనువెలమల వృత్తాంతగ్రంథములో వ్రాయఁబడి యున్నది. ఆచరిత్రము వ్రాయుచో నీకవివృత్తాంతంబు వ్రాయుదము. అప్పటికి బడబానలభట్టు మిక్కిలి వృద్ధుగా నుండి యుండును కాఁబట్టి బడబానలభట్టును శాలివాహన సం. 950 సమీపకాలమునఁ బుట్టి యుండ నోవును. ఇది భీమకవికాలమే అగును.

చొక్క రాజుతో యుద్ధమునకు వచ్చినసాహిణిమారునిఁ దదాస్థానమందుండెడుభీమకవి తిట్టి పద్యముఁ జెప్పె ననుటంజేసి యీమువ్వురును సమకాలీనులని వేఱే చెప్పవలసినది లేదు. భీమకవియొక్క కాలనిర్ణయమునకై పైని మనము చేసినచర్చయే తగి యున్నది. కాని కొంద ఱాధునికచారిత్రకులు వాక్రుచ్చినవిధముగా నితఁడు పదుమూఁడవశతాబ్దారంభమున నున్నట్లూహింప వీలు లేదు. చొక్కరాజు శాలివాహనశకము పదుమూఁడవశతాబ్దమువాఁ డైనట్లుగా వ్రాఁతమూలములు లేవు. ఇతని కాలమునకే సాహిణిమారుఁడు నున్నట్లు కాన్పించును. అతనింబట్టి భీమన కాలముగాని చొక్కరాజుకాలము గాని నిశ్చయింప వీలు పడునా ? గుడిమెట్టపోతరాజు భీమకవిగుఱ్ఱమును దొంగిలించె నని యున్న యొక వదంతినిబట్టి భీమకవికాలమును నిర్ణయింప వీలు లేదు. ఆకథ రెల్లూరి తిరుమలయ్య శ్రీపతిరాజు నుద్దేశించి చెప్పినట్లుగా నప్పకవి చెప్పియున్నాఁడు. ఈ ప్రాంతములయందు లేటవరపుపోతరాజుంగూర్చి తురగారామకవి చెప్పె నని వాడుక గలదు. ఇట్టిభేదములతో నొప్పుచుండెడి యీవృత్తాంతమునుబట్టి భీమకవియొక్క కాలము మనము నిర్ణయించుట కేమి


చాలియుండును? న్యూయల్ దొరగారిలీష్టులలో గుడిమెట్టగ్రామములో నొకకోట యున్న దనియును నందుపై నున్న శాసనములనుబట్టి యాకోట 'సాగి పోతరాజు కాకతీయ రుద్రమహారాజుగారి దని యున్నట్లును'వ్రాసి దీనియర్థమేమో యని వ్రాసియుండెను. ఆక్రిందనే పోతనృపునిశాసనమున్నదని చెప్పి యా శాసనము గాని తనకు వచ్చిననకలు గాని యసంపూర్తిగా నుండవలెననియును వ్రాసెను. ఈయనయే బెజవాడశాసనముంగూర్చి వ్రాయుచో నది శాలివాహన సం. 1121 లోనియెవ్వరో యొక పోతభూపతియొక్క యొకశాసన మని వ్రాసెను. అతని యనంతరము వచ్చిన మఱికొందఱియొక్క పేర్లు గలవంశవృక్ష మున్నట్లును చెప్పి యితఁడు చోళవంశపురాజు కానోపు నని వ్రాసియుండెను. రామ విలాస మనుగ్రంథముంబట్టి చూడ నీసాగి పోతరాజు సాగివారు, వత్సవాయవారు, భూపతిరాజువా రని మనదేశమునఁ బ్రసిద్ధిఁ జెందిన క్షత్రియులకు మూలపురుషుఁడుగాఁ గాన్పించెను. ఇతఁడు భీమకవికి సమకాలీనుఁ డని చెప్పుటకు నేవిధమయిన దృష్టాంతములును లేవు. కావునఁ గవిచరిత్రములోఁ జెప్పినప్రకార మిదియును నీతనికాలనిర్ణయమునకుఁ జాలి యుండ లేదు. మనముమాత్రము శ్రీనాథుఁడు చెప్పినపద్యము ననుసరించి భీమకవి నన్నయభట్టుకంటెను బూర్వుం డని నిశ్చయించికొందము.

సీ. వచియింతు వేములవాడభీమనభంగి, నుద్దండలీల నొక్కొక్కమాటు
   భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాచాప్రౌఢి నొక్కమాటు
   వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా,భ్యుచితబంధముల నొక్కొక్కమాటు
   పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠేవ, సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు

తే. నైషధాదిమహాప్రబంధములు పెక్కు, చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడు వనఘ
   యిపుడు చెప్పఁదొడంగినయీప్రబంధ, మంకితము సేయు వీరభద్రయ్యపేర.

ఇట్లని శ్రీనాథునిచే భీమకవి ప్రథమకవిగా వర్ణింపఁబడియెను.

దీనినే స్థిరపఱుచుచు నొక్కపద్యము గాన్పించును. అది నన్నయ భీమకవిని నుతియించి చెప్పిన దని యిదివఱకు వ్రాసియున్నారము. అదెట్లన్నను :

చ. మతి, ప్రభ, నీగిఁ, బేర్మి, సిరి, మానము, బెంపున, భీమునిన్, బృహ
   స్పతి, రవిఁ, గర్ణు, నర్జునుఁ, గపర్ది, సుయోధనుఁ, బోల్పఁ, బూనవా
   మతకరి, తైష్ణు, దుష్కులు, నమానుషు, భిక్షు, ఖలాత్ము నెంచి వా
   క్సతిపు, శశిన్, శిబిన్, గొమరుసామిని, మేరువు, నబ్ధిఁ, బోల్చెదన్.

(ఇది భీమకవి చెప్పినఛందస్సులోఁ జూడనగును.)

ఈభీమకవి గొప్పదైవజ్ఞుఁడని యిదివఱకే చెప్పియున్నాము. దానిం దెల్పుటకు భీమకవీయప్రశ్నలక్షణ మనునొక చిన్నప్రశ్న శాస్త్ర మిందులోఁ జేర్చెదము :-

భీమకవీయ ప్రశ్నలక్షణము.

శ్లో. ప్రష్టోక్తా ద్యాని అంకాని అష్టభాగావశిష్టకే, సూర్యాదితో గ్రహం జ్ఞాత్వా తాని చాష్టోత్తరే శతే. త్యక్త్వా శేషం తు విజ్ఞాయ పునః పృష్టం తథా వద, అంకాని చాష్ట శేషే తు పూర్వవ ద్గ్రహనిర్ణయః. అష్టోత్తరశతే శేషే పునరుక్తాని సంత్యజ, శిష్టాష్టోత్తరశేషేతు అష్టభి ర్హరణే కృతే. శేషే గ్రహంతు విజ్ఞాయ ప్రథమోక్తాంక శేషకే, ఏకం విసృజ్య శేషాంకా నష్టభి ర్గుణయే త్తతః. తస్మిన్ ద్వితీయశేషం తు సంయుక్తే?ఽంక వినిర్ణయః, గ్రహత్రయం నిర్ణయాంకే క్రమాత్తిష్ఠే త్ఫలం భవేత్. అద్యోక్తాంకస్య శేషం తు జ్ఞేయ మాద్యగ్రహేణ హి, తస్మి న్నేకంవిసృజ్యాథ గుణయే చ్ఛేష మష్టధా. గుణితాంకేషు సంయోజ్య ద్వితీయగ్రహసంఖ్యకమ్, మిళిత్వాంకాని యావంతి తచ్ల్ఛోకే౽స్తి గ్రహక్రమః. ఇత్యుక్తం భీమకవినా సర్వలోకోపకారకమ్.

ఆంధ్రభాషచేత నర్థము. ఈప్రశ్నలు చెప్పుక్రమ మెట్టి దనినఁ బ్రశ్న యడిగిన వారిని నూటయెనిమిదింటిలో నీమనస్సునకు వచ్చినన్ని యం కెలు తలఁచుకొని చెప్పు మని యడిగి యతఁ డెన్ని తలఁచుకొన్నానని చెప్పునో యాయం కె లెనిమిదింట భాగింపఁగా శేషించినయం కెలు సూర్యాదిగ్రహములుగా నెఱింగి గ్రహనిర్ణ యము చేయునది. అతఁడు చెప్పినయం కెలు నూటయెనిమిదింట్లో తీసివేయఁగా మిగిలినయంకె లిన్ని యని జ్ఞాపక ముంచుకొనవలయును. మరల నతనిని మునుపటివలెనే యంకెలు తలఁచుకొమ్మని మరలఁజెప్పినయంకెలు మునుపటివలెనే యెనిమిదింట భాగింపగా మిగిలినయంకెలకు సూర్యుఁడు మొదలు క్రమముగా ఫలానాగ్రహ మని యెఱుంగునది. మునుపటివలెనే రెండవమాఱు చెప్పినయంకెలు పూర్వమందు మిగిలినయం కెలలోఁ


దీసివేయఁగా నూటయెనిమిదింటికి నెన్ని యున్న వో యవి పూర్వము వలెనే యెనిమిదింట భాగింపఁగా శేష మెన్ని యంకె లున్నవియో యాయం కెలకు సూర్యుఁడు మొదలు క్రమముగా గ్రహములను నిర్ణయించి మొదటఁ దలఁచుకొనినశేష మంకెలలో నొకటి తీసివేసి మిగిలిన యంకె లెనిమిదింట హెచ్చ గుణించి యందులో రెండవమా ఱడిగిన యం కెల శేషము కలిపిన నెన్నియగుచున్నవో యన్న వశ్లోకములో వచ్చినగ్రహత్రయమును దెలిసికొని శుభాశుభఫలములు చెప్పెడు నిర్ణయము. ప్రథమోక్తాంకశేషము మొదటిగ్రహమునుబట్టి తెలిసికొనవలయును. అందులో నొకటి తీసి వేసి శేషము 8 చే హెచ్చ గుణించి యా హెచ్చగుణించినసంక్యలో 2 గ్రహసంఖ్య కూడఁ గలిపిన నఱువదినాలుగు అంకెలలో నన్నవశ్లోకము చూచుకొనిన నేగ్రహ క్రమము వచ్చునో యాశ్లోకములో నున్నమంచిచెడ్డ లాప్రశ్నకు ఫలముగాఁ జెప్పునది. "అద్యోక్తాంకస్య శేషంతు" అనుదానికి నర్థము. ఎనిమిదియంకెలు తలఁచుకొని రాహువు మొదటిగ్రహ మయినపక్షమునకు నెనిమిదింటిలోఁ దీసి వేసి యేడును నెనిమిదింట హెచ్చ గుణించి రెండవగ్రహసంఖ్య కలుపుకొనవలయును. తొమ్మిదియంకెలు తలఁచు కొనిన రవి మొదటిగ్రహ మగునే నొకటి తీసి వేసి శేషము లేదు గనుక హెచ్చ గుణించుట యక్కఱలేదు. రెండవగ్రహసంఖ్యశ్లోకము నే చూచుకొనవలయును. శ్లోకములఫలము మొదటినుండియుఁ జెప్పెదను. మేకిమేకీమేకిమేకీమెమెమేకీదశైవమే, కిమెమేకీచషణ్మేకీకిమెమేక్యష్టమేకిమే, కీకీమెమెకిమే మేకీషణ్మేమేకీకిమేత్యపి, చతుష్షష్ట్యాత్మకశ్లోక ఫల మేవం ప్రకీర్తితమ్.


శ్లో. రవౌ షట్చ ద్వాదశ చ త్రివింశష్షడ్విగ్ంశతిః, త్రయస్త్రింశచ్చతుస్త్రింశ త్సప్తత్రింశదథోచ్యతే. షడష్టనవచత్వారింశ ద్ద్విపంచాశద్ద్విషష్టికమ్,యఃపం చదశకం శ్లోకం భీమోక్త గ్రంథతత్వగమ్, ఆదిత్యార్క సుధాంశు శ్చేద్విజయశ్శ్రీసమాగమః, ఈప్సితం సుఖసంపత్తిః కల్పవృక్షప్రదర్శనాత్. 1. భానుచంద్రార్కయుక్త శ్చే ద్విదేశగమనం భవేత్, బంధువర్గజనై ర్వేష శ్శాంతివృక్ష ప్రదర్శనాత్. 2. అర్కాంగారాహియుక్తా శ్చేత్స్వస్థానే పూజ్యతే సదా, జ్వరాదిరోగనాశశ్చ లభతే ప్రియదర్శనాత్. 3. అర్క సౌమ్యశని ర్యత్ర దృశ్యంతే కార్యహానితః, శక్రస్యాపి శ్రియం హంతి మారకస్య ప్రదర్శనాత్. 4. సూర్యజీవభృగు ర్యోగా ద్భూలాభ స్సుప్రియం భవేత్, సుఖాప్తి మాయురారోగ్యం లభతే మృగదర్శనాత్. 5. మార్తండశుక్రజీవా శ్చే న్మరణం రోగపీడనమ్, కుక్షిరోగం మానహానిః కారాగృహనిదర్శనాత్. 6. అర్కార్కిబుధసంయోగే బంధుప్రీత్యాచ జీవనం, నష్టస్య లాభదేశత్వం విమానం పూజ్యదర్శనాత్. 7. అర్కాహిభౌమసంయోగే వ్యాధిరోగాదిధైర్యకృత్, మానహాని ర్వినాశ శ్చ కారాగృహనిదర్శనాత్. 8. యత్రేందుభానుసూర్యా శ్చ స్వస్థానే పూజతే సదా, ఈప్సితం సర్వసంపత్తి రైరావతనిదర్శనాత్. 9. చంద్రసోమాహియుక్తా శ్చే త్సర్వసంపత్సమృద్ధయః సువార్తా రాజపూజా చ విజయ శ్రీనిదర్శనాత్. 10. చంద్ర్రాంగారకార్కీ చ వినష్టం లభతే ధనమ్, విజయం సర్వసంపత్తి ర్మహామేరు ప్రదర్శనాత్. 11. సుధాంశుసౌమ్యశుక్రా శ్చే ద్వ్యాధిః క్షామభయం భవేత్, భవేత్సజ్జనవిద్వేషో దావానలనిదర్శనాత్. 12. యథేందుగురుజీవాశ్చ ధనధాన్యసమృద్ధయః, రాజపూజ్యం మహాకీర్తిః పద్మాకరనిదర్శనాత్. 13. యథేందుశుక్ర సౌమ్యాశ్చ దృశ్యంతే తత్ర బంధుభిః, దృశ్యతే సుఖసంవాచ్యం కుంజరస్య ప్రదర్శనాత్. 14. యది చంద్రార్కిభౌమాశ్చ ధనలాభఃప్రియం యశః, బంధుప్రీతి రతిశ్చైవ శ్వేతచ్ఛత్రాదిదర్శనాత్. 15. యథేందురాహుచంద్రాశ్చ పురా భూపభయం భవేత్, పశ్చా ద్రాజ్ఞశ్చ సన్మానం దధికుంభ ప్రదర్శనాత్. 16. యథా కుజార్క రాహుశ్చ బహులాభ స్తథా భవేత్, జయం లాభో నృపా త్పూజా మత్తమాతంగదర్శనాత్. 17. అరచంద్రార్కి సంయోగే ప్రస్థానే భయ ముచ్యతే, స్వస్థానే సుఖ మాప్నోతి కామధేనుప్రదర్శనాత్. 18. భౌమద్వయసితై ర్యుక్తే ధనలాభః ప్రియం యశః, శ్రీలాభంచ నుసంప్రీతిః కామధేను ప్రదర్శనాత్. 19. అరసౌమ్యసు రేజ్యా శ్చే న్నీ చాశ్రయతతో భవేత్, స్వస్థానే సుఖ మాప్నోతి హరిదశ్వస్య దర్శనాత్. 20. అంగారగురుసౌమ్యాశ్చే త్సర్వశత్రుక్షయో భవేత్, స్వస్థానే సుఖమాప్నోతి హరిదశ్వప్రదర్శనాత్. 21. భౌమశుక్రకుజేషు స్యా ద్రాజ్యలాభో థనాగమః, భూలాభో వస్త్రలాభ శ్చ ధరణీధ్రప్రదర్శనాత్. 22. భౌమమందంసుధాంశు శ్చే త్కార్యహాని రనర్థతా, అతిక్లేశశ్చ భవతి శాల్యవృక్షప్రదర్శనాత్. 23. భౌమస్వర్భానుభానూనాం మనసా చింతితం ఫలమ్, మంధుమిత్రధనప్రాప్తి శ్చింతామణినిదర్శనాత్. 24. బుధార్కార్కిషు యుక్తేషు మిత్రతా మధిగచ్ఛతి, ధనలాభం చ విజ్ఞేయం పద్మాకరనిదర్శనాత్. 25. బుధేందుసితయోగే స్యా దతిక్లేశో మహ ద్భయమ్, బంధుమిత్రవిరోధశ్చ శూన్యవాపీప్రదర్శనాత్. 26. సౌమ్యారగురుసంయోగే ప్య నేకశుభదర్శనమ్, స్వస్థానే సుఖ మాప్నోతి తరుణాదిత్యదర్శనాత్. 27. సౌమ్యాత్రయసమాయోగే రాజపూజా ధనాగమః, సౌఖ్యంచ ప్రయత్నం చైవ చూతవృక్షప్రదర్శనాత్. 28. సౌమ్యజీవకుజేషు స్యా ద్రాజ్యలాభో ధనాగమః, శ్రీలాభ స్యా త్సమాయోగే రక్తాంబరనిదర్శనాత్. 29. సౌమ్యశుకేంద్రుసంయోగే ఆరోగ్యం ధనసంపదః, గమనే సుఖ మాప్నోతి కేతక్యాశ్చ ప్రదర్శనాత్. 30. సౌమ్యార్కిభానుసంయోగే ధనోత్సాహవివర్ధనం, సర్వోత్సాహో మనుష్యాణాం బృందావననిదర్శనాత్. 31. బుధో రాహుశ్చ రాహుశ్చ సహసా సర్వసంపదః, స్వస్థానే కార్యసంపత్తి రైరావతనిదర్శనాత్. 32. గురుభానుశ్చ శుక్రశ్చ యాత్రాయాం నిష్ఫలం భవేత్, మిత్త్రస్యాత్మవిరోధశ్చ శూన్యవాపీప్రదర్శనాత్. 33. గురుచంద్రసురేజ్యాశ్చ మహ ద్దుఃఖ మవాప్ను యాత్, ఆత్మార్థం బంధువిద్వేషో భిన్న పత్త్రప్రదర్శనాత్. 34. గురుభౌమబుధేషు స్యా న్నష్ట ద్రవ్యాగమో భవేత్, రాజ్యలాభో మహోత్సాహో దర్పణస్య ప్రదర్శనాత్. 35. గురుసౌమ్యా రసంయోగే ఈప్సితస్య సమాగమః, అతిస్నేహశ్చ సౌఖ్యంచ నవరత్న ప్రదర్శనాత్. 36. గురుద్వయేందుసంయోగే గోత్రబంధువిరోధకృత్, కార్యనాశ శ్చ జాయంతే వసుదేవప్రదర్శనాత్. 37. గురుభార్గవభానుశ్చ విద్యాలాభశ్చ సర్వదా, గురుప్రతిష్ఠా సంపత్తి ర్దేవేంద్రస్య ప్రదర్శనాత్. 38. వాగీశ మందరా హూణా ముదయో రాజ్యసంపదః, మిత్త్రలాభో నృపా త్పూజా కుమారస్వామిదర్శనాత్. 39. జీవాహిమందసంయోగే శత్రుక్షయ మధాగమః, అర్థలాభో భవే త్సౌఖ్యం ఐరావత్యాః ప్రదర్శనాత్. 40. శుక్రభానుశ్చ జీవశ్చ పుత్త్రలాభో ధనాగమః, పుత్త్రసౌఖ్యంచ భాగ్యంచ దావాదిప్రియదర్శనాత్. 41. శుక్ర సౌమ్యబుధేషు స్యా శ్ఛత్రునాశో ధనాగమః, జనాశ్వధనసంపత్తి ర్దీర్ఘజస్య ప్రదర్శనాత్. 42. శుక్రభానుకుజేషు స్యా త్పుత్రలాభో ధనాగమః, స్థానే స్థా నేషు పూజ్యంతే పుష్పవృక్షేప్రదర్శనాత్. 43. కావ్య సౌమ్యేందుసంయోగే రాజకీర్తి ర్ధనాగమః, కార్యసిద్ధిశ్చ విజ్ఞేయా పూర్ణ కుంభప్రదర్శనాత్. 44. కావ్యజీవార్క సంయోగే సర్వకార్యంచ సిధ్యతి, భవేత్సుఖం చ కీర్తించ పూర్ణకుంభప్రదర్శనాత్. 45. శుక్రద్వయభుజంగాశ్చ జన్మపీడాపరాభవః, విదేశగమనేచింతా ఊషరస్య ప్రదర్శనాత్. 46. శుక్రార్కి మందసంయోగే అప్సుతే రాజసంపదః, యాత్రాయా మర్థలాభ స్స్యాల్లతా వల్లీ ప్రదర్శనాత్. 47. శుక్ర రాహుసితై ర్యుక్తే నృపపీడా రణే తథా, చిత్తనాశశ్చ భీతిశ్చ చంద్రికాయాశ్చ దర్శనాత్. 48. యది మందార్క సౌమ్యాశ్చ శత్రుపీడా పరాభవః, దేశే సర్వార్థహానిశ్చ శఫలీశత్రుదర్శనాత్. 49. మందేందుభూమిజాయోగే యేన కేనచ యస్యవా, పుత్త్రలాభో యశశ్చైవ సోడశోపరిదర్శనాత్. 50. మందమంగళచంద్రాశ్చ రాజపూజా ధనాగమః, భవేచ్చ మహతీ లక్ష్మీ స్స్వర్ణ కుంభప్రదర్శనాత్. 51. భవే న్మందజ్ఞ సూర్యేషు వి ద్యా సౌఖ్యం ధనం యశః, అంతే మహద్భయం చైవ కార్యభంగనిదర్శనాత్. మందజీవభుజం గేషు పుత్త్రాలాభో ధనాగమః, యోషిత్సంగం చలభతే క్షీర సాగరదర్శనాత్. 53. శనిశుక్రార్కిసంయోగే స్థానభ్రష్టం స్థిరం యశః, అంతే మహద్భయంచైవ కార్యభంగనిదర్శనాత్. 54. ద్వయార్కికుక్రసంయోగే సంస్థిరాశ్చ సుఖాదయః, గమనే కలహం రూఢిః రూపరాగప్రదర్శనాత్. 55. మందాహిగురుసంయోగే సుస్థిరశ్చ సుఖోదయః, గమనే భూషణం భూతిః పుత్త్రజీవ ప్రదర్శనాత్. 56. రాహుభాను కుజేషు స్యా ద్రాజ్యలాభో ధనాగమః, స్థానే స్థానే తు పూజ్యంతే మిత్త్రలాభప్రదర్శనాత్. 57. రాహుచంద్రేందు సంయోగే యాత్రాసిద్ధి స్సమాగమః, స్నేహవృద్ధి శ్చ భవతి శంఖవస్త్రప్రదర్శనాత్. 58. రాహుమంగళ భానూనా ముదయే మంగళోత్సవః, సర్వశత్రుజయావాప్తి ర్దేవేంద్రస్య ప్రదర్శనాత్. 59. రాహు సౌమ్యభుజం గేషు శత్రునాశో ధనాగమః, కార్యసిద్ధిశ్చ భవతి మహామేరుప్రదర్శనాత్. 60. భుజంగజీవమందేషు తేజోవిజయ వృద్ధయః,రాజపూజా భవే ద్వృద్ధి ర్మహాలక్ష్మీప్రదర్శనాత్. 61. రాహుశుక్రసితేషు స్యా ద్వ్యర్థతా కార్యనాశనం, శత్రుపీడాచ భవతి నష్టచంద్రప్రదర్శనాత్. 62. రాహు ర్మందో గురుశ్చైవ యాత్రా మర్థఫలం భవేత్,పశ్చాత్క్రమేణ సౌఖ్యంచ దధికృత్యనిదర్శనాత్. సరాహురాహు సౌమ్యాశ్చ థనలాభో భవేత్సుఖం, గమనే రాజపూజాచ పూర్ణకుంభ ప్రదర్శనాత్. 64. [8]

సంపూర్ణము.

ఈభీమకవి శాపానుగ్రహసమర్థుఁ డనుటకు మఱియొకకథ గలదు, అదియెట్లనఁగా :-

చామర్లకోట యనుగ్రామమునకు సమీపమున భీమవర మను నొకపట్టణము గలదు. అది పూర్వకాలమున చళుక్యభీముఁడు కుమార భీముఁడు అనునొక రాజ్యవరునకు ముఖ్యపట్టణమై యుండెను. ఒకానొ


క సమయమున భీమకవి యాయూరికిఁ బోయి యుండఁగా నాయూర నుండువా రెవ్వరును భీమకవి నివసించుటకు బస నొసఁగక యుండి రనియు దానికిఁ గనలి భీమకవి యా యూరు త్వరలోనే పాడువడు నని శాపం బిచ్చి యధేచ్ఛం బోయె ననియు నాఁడుమొదలు ఆచళుక్య భీమవరము భూమిలోఁ గలసె ననియుఁ జామర్లకోట భీమవరము గ్రామ వాస్తవ్యులచే నేఁటికిని వాడుకొనంబడుచున్నది. చామర్లకోట కాలువ గుండ రాజమహేంద్రవరమువైపు పోవుచో హుసేనుపురము సమీపమున నొకప్రాచీనదేవాలయము గాన్పించును. ఆదేవళము మొదలు ప్రస్తుతపు భీమవర భీమేశ్వరదేవళమువఱకును పూర్వపుభీమవరములోని యొక వీథి వ్యాపించి యుండె ననియు నటులనే యూరంతయు దానిం జుట్టుకొని యుండె ననియు నాయూరు దిబ్బ చేరు ననుభయము గలవారందఱును ఆపాడు వదలి దానికి అర్ధక్రోశముదూరమున నున్న చామర్లకోటదగ్గర నిపు డుండుభీమవరము కట్టుకొని ప్రవేశించిరనియు వాడుక గలదు. అయితే చామర్లకోటలో నుండెడు కోటయును నీభీమవరమును నవీనములుగా కట్టఁబడి యుండనోవును. ఆకోటకే చామర్లకోట యనునామంబు లేక భీమవరముగానే వాడుక గల్గి యుండు నని శ్రీనాథునికాలమునాఁటికిఁగూడఁ జళుక్యభీమవరనామంబు వ్యా ప్తంబైయుండుటంజేసి యూహింపనై యున్నది. శ్రీనాథుఁడు తనవీథినాటకములో తెనుఁగురాయని కస్తూరి యిప్పించు మని కోరి చెప్పినపద్యములో నీయూరియుదాహరణ మిచ్చి చెప్పినపద్యము.

శా. అక్షయ్యంబుగ పాంపరాయనితెలుంగాధీశ కస్తూరికా
    భిక్షాదానము చేయరా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
    దాక్షారామచళుక్యభీమవరగంథర్వాస్సరోభామినీ
    వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.

రణతిక్కన బ్రతికించుట.

ముప్పదియిద్దఱు నియొగులపద్యములో రణతిక్కనంగూర్చి వ్రాయుచో తిక్కన రణమందు హతు డయ్యె ననియు నతనిభార్య


అతనిశిరంబుతో మాత్రము సహగమనంబు చేయుతలంపున నుండఁగా నంతట నామార్గమున నీభీమకవి తటస్థ మయ్యె ననియు నపుడు రణతిక్కనభార్య యతనికి నమస్కరింప "సౌభాగ్యవతీ భవ" అని దీవింపఁగా నపుడు సమీపమున నున్న వార లాపె పెనిమిటి మృతుండై యుండె నని తెల్పఁగా నాపె వచ్చి తన పెనిమిటిని బ్రతికించి తన్నురక్షింపుఁ డని ప్రార్థించె ననియు దానికి భీమకవి రణతిక్కనశిరంబును, గళేబరంబును గూర్చి యుంచిన బ్రతికించెద ననిన నపు డాపతివ్రత లేచి తనపఁతిశరీరఖండంబులు పైకి వచ్చియుండవలయు నని ప్రార్థింపఁగా నాపె పాతివ్రత్యవిశేషంబున నాఖండంబులు నృత్యము చేయుచు రణభూమి నుండి పైకి నిల్చె ననియు దానికి భీమన సంతసించి యారణతిక్కనను పునర్జీవితుని జేసె ననియు నొకకథ గలదు. ఆసమయంబున భీమకవి చెప్పినపద్య మీక్రింద వివరింపఁబడును గాక.

క. గుణములనిధాన మగుమనరణతిక్కఁడు తాఁ గళేబరంబును శిరమున్
   గణకమెయి గలియ బ్రతుకును, ప్రణుతాఖిలవైరిమకుటభానేతపదుఁడై.

అనినవెంటనే తిక్కన సజీవుఁ డయ్యె నను మొదలగుసంగతులు తెల్పునొకకథ గలదు. అది యెంతవఱకు నమ్మఁదగునో ఆలోచింపవలసి యున్నది. ఈకథ పరశీలించి చూడఁగా నన్నయభట్టారకుఁడు, భీమకవి, తిక్కనకవితండ్రి యగు కొమ్మనామాత్యాదులు నేకకాలీను లని దేశంబునం గలప్రతీతినిబట్టి యిది కల్పింపఁబడియైన నుండవలెను లేదా కొంచె మెచ్చుతగ్గు కాలములో నన్నయతిక్కనాదు లున్నట్లుగా గ్రంథదృష్టాంతములు కాన్పించుచున్నవి గనుక నితఁడును భీమకవిసమకాలీనుఁడై యైన నుండవలెను. పైద్వాత్రింశన్మంత్రిచారిత్రములో నీరణతిక్కన తిక్కనసోమయాజితమ్ముం డనియు నితనితండ్రి కొమ్మనయే యనియు, నితనిని సిద్ధన యనుకొమ్మన యన్న పెంచుకొని నట్లును సూచింపఁబడినది. ఈకథ కేవలము కల్పిత మని చెప్పుట కాధారము లేవియుఁ గానరావు. రణతిక్కనచారిత్రములో నాకథలో నుండు భేదాభిప్రాయంబులు చూపెదము. భీమకవిచారిత్రము వ్రాసి యుంటి


మి కావున నతనిచే రచియింపఁబడిన భీమకవీయప్రశ్న మనునొకచిన్న జ్యోతిషగ్రంథమును, భీమకవిచందమునుగూడ నీచారిత్రముతోడనే వీలయినవఱకు ముద్రించెదము. భీమకవిచందము అతనిచే నతనికుమారున కుపదేశింపఁబడినట్లును ఆకుమారుఁడు దానిని గ్రంథముగాఁ జేసినట్లును ఆచందములోని యీక్రిందిపద్యములవలనం గాన్పించు చున్నది. అదియెట్లన్నను :-

క. పరఁగినవిమలయశోభా, సురచరితుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
   పరిణతుఁ డయ్యును భూభృ, ద్వరవిమలప్రసాదితోద్భవశ్రీయుతుఁడై.

క. కమనీయ సమస్తకళా, గమములకును జన్మ భూమి కావ్యము కావ్యా
   గనువిదుఁడు సర్వవిదుఁ డని, సమయచతుష్టయమునందుఁ జదివిరి మొదలన్.

క. కావునఁగవిత్వతత్త్వము, భూవలయములోనఁ దలఁపఁ బూజ్యం బని స,
   ద్భావమునఁ జెప్పఁ గావ్యక, ళావేదులు పొగడఁ గావ్యలక్షణమహిమన్.

అనువీనివలన భీమకవికి సంతానము కల దనియు నందులో నొకరిచేత గ్రంథము గూడ రచియింపఁబడె ననియు మనకుఁ దెలియుచున్నది. ఆచందము మన మవకాశానుసారముగఁ గాలాంతరమునఁ బ్రకటింప నిశ్చయించినారము గనుక ప్రస్తుతము భీమకవిచారిత్రమున నుడువంబడిన యతని సమకాలీనులచారిత్రము మనకుఁ దెలిసినంతవఱకు వ్రాయుదము. అది దేశచారిత్రములోఁ జేరియుండును.

దేశచారిత్రము.

భీమకవికాలీనులచారిత్రము.

భీమకవిచారిత్రములో నుదాహరింపఁబడిన వారిలో మనము చారిత్రము వ్రాయవలసినవారు :-

1. మైలమభీమన యితనివంశము తెలుఁగు దేశపుక్షత్రియుల విషయమైనగాథలతో నొప్పియుండును.

2. బడబానలభట్టారకుఁడు. ఇతనికాలమున దేశములో వెలమలకు బిరుదులు మొదలగునవి గలిగినవిధము. ఈరెండువృత్తాంతములును మనము పూర్ణముగా వ్రాయుటకుం గమకించిన నిఁక దేశవృత్తాంతము


వ్రాయుట కవకాశమే యుండదు. కావున మనము ప్రకృతము ముందీ రెండుశాఖలవారింగూర్చి చెప్పఁబోవుగ్రంథమునకు సంగ్రహరూపమునఁ గొంత చెప్పినచారిత్రము అనంతరము ఆయాశాఖలవారికి వలయునేని ఆయాగ్రంథములు ప్రత్యేకము ప్రకటింతము. ఇదివఱలో మనము భీమకవిచారిత్రములోని మైలమభీమనవంశస్థులు మనదేశములోనిపూసపాటివా రని వ్రాసి యున్నాము. ఇపు డామైలమభీమనచారిత్రము నుడువుటకుముందు అతనివంశస్థు లగుపూసపాటివారిచేఁ బూర్వమునుండియు సంపాదింపఁబడినబిరుదము లెవ్వియో వానిం దెల్పి వానికాల మెద్దియో నిర్ధారణ చేసి యుంచుదము. ఇది ముందు మనము ప్రకటింపఁబో మైలమభీమనవంశచారిత్రమునకుఁ బీఠిక యై యుండును. అటులనే బడబానలభట్టుచారిత్రము వ్రాయుటకు ముందుగా నతనివలన శాసింపఁబడిన వెలమలలోఁ బద్మానాయకులను వెలమవారిలో ముఖ్యులగు రేచెర్లగోత్రమువారిబిరుదంబులు వ్రాసి యుంచిన దానికి నిది పీఠికయై యుండును గావున నీపత్త్రికలోఁ బూసపాటివారిబిరుదంబులును, వేంకటగిరివారి బిరుదములును, విశదీకరింతము. అవి యెట్లన్నను :-

పూసపాటివారిబిరుదులు.

1. శ్రీమన్మహామండలేశ్వరుఁడు - ఇది మండలాధిపతి యైనందు వలనం గల్గినది.

2. మహీమండలరాయఁడు - ఈబిరుదు మండాలాధిపత్యమున కధికమగుభూములను సంపాదింపగలిగియుండుటను దెల్పును.

3. మన్నెసురత్రాణుడు - దీనినే మన్యసుల్తాన్ అని హిందూస్థానీలోఁ జెప్పుదురు. ఇది యవనభాషలో మనేహాసుల్తాన్ అని యుండును. అనఁగా గొప్పప్రభు వని యభిప్రాయము.

4. దర్భజకులసంభవుఁడు - శ్రీరామచంద్రునికుమారునకుఁ గుశుఁ డని నామంబు గలదు. కుశశబ్దపర్యాయము దర్భ యనియు దర్భజకులజు లనఁగా కుశవంశసంభూతు లనియు నర్థము. 5. హాసబిరుదాంకుఁడు - అనుబిరుదునకు హేసబిరుదగండఁ డని పాఠాంతరము గలదు.

6. ధారాపురీగహనదావధనంజయుండు - దీనికి ధారాపురీశుష్కారణ్యపావకుఁ డను పాఠాంతరము గలదు. ధారాపురము భోజునిముఖ్య పట్టణము. ఈభోజుఁడు విధర్భదేశాధిపతి. దీనికి Bidar అని యవనాదుల వలన నామంబు గలిగినది. ధారాపురిని జయించె నని చెప్పుటచే బీదరని చెప్పఁబడు విదర్భదేశము గూడ నాక్రమింపఁబడె నని చెప్పవలసి యున్నది.

7. గండధనంజయుఁ డని యున్నబిరుదునకు గండలకు ధనంజయుని వంటివాఁ డనియర్థము.

8. మేదినీరాయమృగవేఁటకారుఁడు - దీనికి మేదినీరాయ మృగసముదయచండమృగయుఁ డని పాఠాంతరము. సింహాచలమునొద్ద నున్న పొట్నూరునకుఁ బూర్వము ప్రభువులు మేదినిరావువారు. వీరిలో గృష్ణరాయని నెదిరించినయతనిని కళింగమేదినీవిభుఁ డని పెద్దనవలనం జెప్పఁబడియె. అట్టిమేదినీరాయనామముగల రాజును జయించుటంజేసి యీబిరుదు గలిగినది.

9. వీరకేదారుఁడు - ఇది వీరశ్రేష్ఠుఁ డని తెల్పును.

10. కృష్ణవేణీ జలక్రీడావినోదపరాయణుఁడు - తఱుచుగాఁ గృష్ణానదిలో స్నానముచేయుకుతూహలము గలవాఁడు. కొందఱకాలములో నమరావతియు మఱికొందఱకాలములో బెజవాడయును ముఖ్యపట్టణములై యుండెను. ఈరెండుస్థలములలోపలంగూడ కృష్ణానది ప్రవహించును గనుక నీబిరుదు సర్వత్ర చెల్లును.

11. ఖడ్గనారాయణుఁడు.

12. దుర్జయకులకులాచల కంఠీరవుఁడు.

13. రణరంగ భైరవుఁడు. - ఇవి చారిత్రమునం దెల్పు బిరుదులు కావు. 14. మాళవరాజమస్తకశూలంబు - దీనివలన మాళవరాజును దన వశవరిగఁ జేసికొనియె నని తేలుచున్నది. ఈవంశస్థులలోనిరాచిరాజు అనునతఁడు మాళవరాజును జయించి అతనిమన్యసుల్తాన్‌బిరుదు లాగు కొనియెను.

15. కర్ణాటరాజకందకుద్దాలకుఁడు - దీనికి కర్ణాటసంస్థాన కందకుద్దాళికుఁ డని పాఠాంతరము. కర్ణాటరాజులను మొదలుతోఁ బెల్లగించి యారాజ్య మాక్రమించుకొనె నని భావము.

16. వైరిరాజోరగవైనతేయుఁడు.

17. శౌచగాంగేయుఁడు.

18. వీరసేతు ప్రతాపభాసురుఁడు - చారిత్రోపయోగములు కావు.

19. వామఛురీధరుఁడు - దీనివలన నిప్పటివఱకు నీవంశమువారి వలన కత్తి యెడమభాగమందు ధరియింపఁబడు ననుసాంప్రదాయము తేలుచున్నది.

20. నెల్లూరు, యెలమంచిలి, కంచి, దేవగిరిచూరకారుఁడు - ఈనాల్గిటిరాజ్యరమాచూర కారుఁ డని పాఠాంతరము. దీనిలోఁ జెప్పఁబడిన నాలుగుపట్టణములు నాలుగు రాజధానులు. అందు నెల్లూరు మనుమసిద్ధి రాజుది. ఎలమంచిలి కళింగాధిపునిది. కంచి చోళప్రభునిది. దేవగిరి యాదవవంశ ప్రభువులది. దీనిని తురష్కులు తమస్వాధీనము చేసికొనినతరువాత దౌలతాబా దనునామాంతరముచే వ్యవహరించుచుండిరి. ఈబిరుదు సంపాదించునాఁటికి ఈనాల్గు రాష్ట్రములం జేర్చికొనినట్లు కాన్పించును.

21. ఆంధ్రకటకవజ్రప్రాకారుఁడు - ఆంధ్రదేశ కటకమునకు వప్ర ప్రాకారముగాఁ గలవాఁడు.

22. మానగోవిందనామధేయుఁడు.

23. కుంతకౌంతేయుఁడు. - చారిత్రోపయోగములు కావు.

24. విజయవాటికా సింహాసననాధ్యక్ష మాధవ వర్మాన్వయ లలాముఁడు - విజయవాటి అనియు లేక బెజవాడ అనియు బిజయపుర


మనియు వాకు బా ఉచ్చరింపఁబడును. ఈస్థలమున మొదట సింహాసనము సంపాదించినయతఁడు మాధవవర్మ అతనివంశశ్రేష్ఠుఁడని యర్థము.

25. కనకదుర్గా వరప్రసాద లబ్ధవైభవుఁడు - ఈబెజవాడపట్టణమున వేంచేసియున్న కనకదుర్గామహాదేవిని పయిమాధవవర్మ యుపాసింపఁగ ఆమహాదేవీ కటాక్షమున చతురంగబలములును, అనంతైశ్వర్యమును లభించెను.

26. గరుడ భైరవ ధ్వజప్రాభఁవుడు - గరుడధ్వజము, భైరవ ధ్వజమును గలవాఁడు. ఇది వీరివంశజులలో కొందఱు వైష్ణవులుగా నున్నట్లును, మఱికొందఱు శైవులుగా నున్నట్లును సూచించును.

27. కొలిపాకపురీధవుఁడు. - కొలిపాక యనుపట్టణము అధికారస్థానముగాఁ గలవాఁడు. కొందఱు ప్రభువులకాలములో నిది ముఖ్యపట్టణ మాయెను.

28. సహకారబాంధవుఁడు. -

29. దశలక్షహయ, అష్టసహస్ర గజవల్లభుఁడు. - ఈవిశేష సేనలు కనకదుర్గాప్రసాదమువలన మాధవవర్మకుఁ గల్గినవి. అపు డీ బిరుదు గలిగినది.

30. మల్లికావల్లభుఁడు. -

31. లాట, భోట, చోళ, గౌళాదిరాజపురసర్వస్వాపహారుఁడు. - దిగ్విజయంబు చేసి పైదేశములలోని ధనమును గొల్లగొట్టి వచ్చినవాఁడని యర్థము.

32. పరిచ్ఛేదివంశాభరణము. - మైలమభీముఁడు కారణాంతరమునఁ దనకత్తిం గొని తానే నఱికికొని మృతుం డయ్యెను. కావున నాతనికిఁ బరిచ్ఛేది యనుబిరుదు గలిగినది.

33. బిరుదరాయరాహుత్తవేశ్యాభుజంగుఁడు.

34. కళ్యాణరాజదుర్మదవిభంగుఁడు - ఇందుఁ దెలుపఁబడినకళ్యాణపురము పశ్చిమచాళుక్యులకు ముఖ్యపట్టణము. ఈముఖ్యపట్టణము గలదేశమునకుఁ గుంతలదేశ మని పేరు. ఈపట్టణము తురుష్కులస్వాధీ


న మయిన పిమ్మట నాసమీపమున నుండుబీజపూరు (Bijapore) ఆదేశమునకు ముఖ్యపట్టణ మాయెను. ఆసంస్థానమునకుంగూడ బీజపురరాజ్య మనియే పేరు గలిగెను. అయితే మైలమభీమనకాల మగు శాలివాహన సం. 975 (A. D. 1053) నాఁటికి కల్యాణపుర మనునామమే కలదు. [9]

35. సేతుసీతాచలాస్తోదయాద్రిబిరుదశాసన స్తంభవిభ్రాజితుఁడు - వీరివంశస్థులలో నొకమాధవవర్మ యనురాజు దిగ్విజయార్థము కృష్ణదేవరాయలకాలము నాఁడు బయలుదేరి యనేకస్థలములు జయించి సేతువువఱకును దనజయ స్తంభములు పాతించినట్లు గ్రంథములలో దృష్టాంతము గలదు.

36. భారుహమన్నెగండపెండేర విరాజితుఁడు - దీనికిఁ బాఠాంతరమే యర్థముగా నుండును. ఎట్లన్నను, భారుహమన్యరాజన్యకోటీరకోటిహీరచారు శుష్యమాణసమాశ్రితపాదపంకజుఁడని.

37. కళింగరాయ ప్రళయకాలాభీలుండు - ఇందలికళింగ రాయఁడు రాజకళింగగంగు కానోవును. లేదా కళింగరా జని యయిన ననవచ్చును. మయిలభీమనయును, రాజకళింగగంగును నేకకాలీనులు కావున మొదటియర్థమే యనుకూలించి యుండును.

38. కిమిడిరాయమానవిభాళుఁడు - దీనిపాఠాంతరము కిమిడెరాజ మానతిమిరార్కుం డని యున్నది.

39. గంగిమంగితలగుండుగండఁడు -

40. మండలీకరగండఁడు -

41. కరవాలరుద్రుండు -

42. విమతవీరభద్రుండు 43. బల్లాడగోధూమఘట్టనఘరట్టుఁడు - ఇందలిబల్లాడశబ్దము కటకదేశపుప్రభుఁ డగుభల్లహునియందును వర్తించును బల్లాణ వంశస్థు లని పశ్చిమదేశమున నొకసంస్థానమువారు గలరు. వారికిఁ జెల్లినఁ జెల్లును. కొంతకాలము క్రిందట వీరిరాజ్యము తూర్పునఁగటకమువఱకును, పడమట దేవగిరివఱకును వ్యాపించి యుండుటంబట్టి యీబల్లాడశబ్ద మెట్లన్వయించిన నన్వయింపవచ్చును. లేదా యిద్దఱయెడల వర్తించిన దని చెప్పినఁ జెప్ప నొప్పును.

44. భోజరాజదిశాధట్టుండు - దీనికిఁ బాఠాంతరము భోజరాజదిక్ప్రవీణకీలికీలాక రాళుఁ డని కలదు.

45. చాళుక్యరాజరాజ్యస్థాపనాచార్యుఁడు - చాళుక్యులు పూర్వ చాళుక్యులు పశ్చిమచాళుక్యు లని రెండు తెగలవా రుండిరి. అందుఁ బూర్వచాళుక్యుల ముఖ్యపట్టణము రాజమహేంద్రవరము. పశ్చిమచాళుక్యులముఖ్యపట్టణము కళ్యాణ పురము. ఇదివఱలో 34 వ బిరుదులోఁ గళ్యాణ పురములోని చాళుక్యులఁ గూర్చి వ్రాసియున్నాఁడు గాన నిపు డీ బిరుదు పూర్వరాజ్యమం దుండు రాజమహేంద్రచాళుక్యులకుం జెల్లును. వీరిలో రాజనామము రాజనరేంద్రునకుఁ జెల్లును. ఈరాజనరేంద్రుని తండ్రి యగువిమలాదిత్యుఁడును, మైలమభీమనయును సమకాలీనులు. మైలమభీమన విమలాదిత్యుని యనంతరము రాజనరేంద్రుని వేంగీసింహాసనము నం దెక్కించి యుండిన నుండవచ్చును. లేదా యీవంశములో మఱియొకరికైన నీబిరుదు చెల్లు నని చెప్ప నొప్పియున్నది.

46. ఒడ్డిరాయ మీజాలికవర్ముఁడు - పాఠాంతరము. ఒడ్డిమహీరాయ సముదాయజీవనవిహారసమున్న త్కరవాలుఁడు - ఒడ్డియరాయ మస్తకశూల ధరుఁ డని యింకొక పాఠాంతరము. ఒడ్డిరాయఁ డనఁగా నోఢ్రరాజు. (King of Orissa.)

47. జలదుర్గదీవిమన్నె యనివేశుఁడు - ఇట దీవిసీమలో జలదుర్గము గల్గియుండె నని యభిప్రాయముగా నోవు. ఇది కృష్ణానది తీరములోనిది 48. స్థలదుర్గ కేతవరపట్టణాధీశ్వరుఁడు - కేతవరపురనాయకుఁడు అని పాఠాంతరము.

49. వనదుర్గ మొగలితుర్తిప్రభుఁడు - మొగలితుర్తిరాజధానీంద్రుం డని పాఠాంతరము. దీనింబట్టి మొగలితుఱ్ఱు పూర్వము పూసపాటివారి దనియు ననంతరకాలములో నిది కలిదిండివారి కియ్యఁబడిన దనియు నూహింపవలయును.

50. నగదుర్గానంతగిరిప్రభుండు - ఈయనంతగిరి కృష్ణరాయల కాలమునాఁటికిఁ జాలఁ బ్రసిద్ధి గల పట్టణ మయియున్నది. ఈపట్టణముం జయించి యారాజు బెల్లముకొండ, కొండవీటిసీమయును జయించి నట్లుగా నున్నది. కృష్ణరాయల కాలములో నొకమాధవవర్మ యనునాఁత డిచ్చో నధికారము చేయుచుండెను. అతఁడు మిగులఁ బ్రతాపవంతుఁడు.

51. ఏళరాయరక్కెసరాయఁడు -

52. తెల్లతలాటరాయఁడు - ఈబిరుదములన్నియును శాలివాహన సం. 1650 కాలమున మయిలమ భీమునివంశస్థులలో రాజ్యమును వహించియున్న తమ్మభూపాలునివలనఁ గృష్ణవిజయ మనునాంధ్రకావ్యములో వివరింపఁబడియున్నవి. ఈపైవానిలో నతనిబిరుదులును జేరియే యుండును. తదనంతరకాలము మొద లింగ్లీషువారు మనదేశములోఁ బ్రవేశించి మచిలీబందరు మొదలగుసముద్రతీరపట్టణములను దత్కాల ప్రభుం డగు నానందగజపతిమహారాజువలన సంపాదించువఱకును గల బిరుదంబులును, బైగ్రంథములో వదిలివేసినవియును నీక్రింద వివరించెదము.

53. రేచర్లగోత్ర సముద్భవశుష్కకాసనదాపదహనుండు - అనునీబిరుదు రేచర్లగోత్రోద్భవుం డగు త్రిభువనీరాయబిరుదుం డగుసింగమనీనికిని నా కాలములోని మాధవవర్మకును జరిగినయుద్ధములో బెజవాడసమీపంబున నున్న పెదవీ డనుస్థలము నపహరించి యతనిభా


ర్యగర్భములో నుండుశిశువుంగూడ సంహరింపఁ బ్రయత్నించునపుడు గల్గినది. ఈరేచర్లవారు, వేంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలగు సంస్థానములవారై యున్నారు. పైని జెప్పఁబడినగోత్రమువారికి నీ సింగమనీఁడు మూలపురుషుఁడై యున్నాఁడు. అతని సంహరించుటచే నాబిరుదు గలిగినది.

54. యవనసైనికనికాయమేఘమారుతుఁడు - ఈబిరుదు తురష్క సేనలను జయించుటచేఁ గలిగినది.

55. దక్షిణదిగ్దేశాధిపతివధూలోకపాంచాలుఁడు -

56. పశ్చిమదిగ్రాజమహేశ్వరుఁడు -

57. ఉత్తరదిశానృలోకపాలకమదేభకంఠీరవుఁడు -

58. పూర్వగోత్రాధిపగోత్రవిద్వేషణుడు -

59. చోళభల్లాడధూమఘట్టనఘరట్టుఁడు -

60. దానకర్ణుండు -

61. మానదుర్యోధనుండు. -

62. పావురాయకాకోదరనీలకంఠుఁడు -

63. కంజి, చెంచీ, యెలమంచిలి, నెల్లూరు, ద్వారకాపుర, నిద్ధూమధాముఁడు. - Destroyer of conjeevaram, Jinjee, Yelamanchili, Nellore and Dwarakapura in the State of Baroda.

64. స్థలదుర్గకుంభిలాపుర నికేతనుఁడు - ఈ కుంభిలాపురమునే యిపుడు కుమిలె యని చెప్పుదురు. ఇది స్థలదుర్గముగ నుండెను.

65. పూసపాటిపురాంకుఁడు - ఈబిరుదు పూసపా డనుగ్రామంబునం గలయొకకోటను సంరక్షణ చేయుటంబట్టి పూసపాటివా రని పిలువఁబడిరి. మైలమభీమునివంశమున నమల రా జనునొకప్రభుండు పుట్టెను. అతఁడు. "గీ. పూసపా డనునగరంబుఁ బ్రోచుకతనఁ, బూసపాటిపురాంకుఁ డై పొగడు గనియె." అని యున్నది.

66. చతుర్గోత్రవందనీయుండు - ఆంధ్రదేశంబున నాలుగు గోత్రములు గలక్షత్రియు లున్నారు. ఆనాల్గుగోత్రములవారును మొదట


మైలమభీమునికూటస్థు లగు ముక్కంటిరాజు, బుద్ధవర్మ, మాధవవర్మ మొదలగువారితో నీదేశములోనికిఁ దత్సహాయార్థమై వచ్చియుండిరి. అదికారణముగాఁ దమకుఁ బ్రభువులుగా నుండెడు నీమయిలమ భీముని యన్వయంబులోనివారికి నమస్కరించు నాచారము గలదు. కావున నీబిరుదు గల్గినది.

67. రాయసంస్థాననృప ప్రాణవాయుభుజ గుండు - రాయసంస్థానము కర్ణాటరాజులసంస్థానము. తత్సంస్థాననృపతుల సంహరించె నని కలదు.

68. నిజస్నానోదకకుష్ఠరుజానివారకుండు - వీరిలో నొకరు స్నానముచేసి తనబట్ట పిడిచిననీరు పోసిన నొకకుష్ఠురోగికి వెంటనే గుణమిచ్చె నని కలదు.

69. స్థలదుర్గవిజయనగరశిలాప్రాకారవిభుఁడు - అనంతర కాలములో విజయనగరము స్థలదుర్గముగాఁ జేయఁబడినది. అందు శిలాప్రాకారము గట్టింపఁబడియె. ఇదియ ప్రస్తుతము మైలమభీమునివంశస్థులకు రాజధాని.

70. జలదుర్గభీమపట్టణాధ్యక్షుఁడు - విజయనగరము సమీపమున నుండు భీమునిపట్టణము వీరికి జలదుర్గముగా నుండెను.

71. వనదుర్గమత్స్యపురవిభుఁడు - మాడుగులకు మత్స్యపుర యని నామాంతరము గలదు. ఇది వనదుర్గముగా నుండెను.

72. గిరిదుర్గముఖ్యనందాపురీప్రభుఁడు - ఈనందాపుర మిప్పటి జయపురపుసంస్థానమునకుఁ బూర్వము ముఖ్యపట్టణము. అపట్టణము వీరికి జలదుర్గముగఁ గొంతకాల ముండెను.

73. విజయభేరీప్రముఖవాద్యనవకైరవావనవరబిరుదధౌరేయుఁడు -

74. మననజమణికిరీటకనకచ్ఛత్రమత్స్యధ్వజసింహతలాటవీరకాహళాద్యనేకబిరుదాంకసముజ్వలుఁడు -

75 నీలగిరినాయకప్రతిష్ఠాపకుఁడు - అనఁగా సింహాచలస్వామిని బ్రతిష్ఠచేసె నని యర్థము. 76. అనేక రాజకులసంస్థాననిర్వాహకబిరుద -

77. మహారాష్ట్రాబ్ధిమంథనుండు - వీరిదేశమునకు మహారాష్ట్రసేనలు వచ్చినపుడు వారిని జయించి పాఱఁదోలుటచేతఁ గలిగినది.

78. దేవబ్రాహ్మణక్షేత్రపరిపాలన పాండవాగ్రజుఁడు - వీరి సంస్థానమున వేలకొలఁది బ్రాహ్మణాగ్రహారములును, మాన్యములును, దేవబ్రాహ్మణుల కీయఁబడినవి. అట్టివానిని సంరక్షించె నని యర్థము.

79. గజపతినామాంకప్రభుఁడు - గజపతి యనుబిరుదు సంపాదించెనని యర్థము.

80. యవనపరాసుసైనికభూధరకులిశాయుధుఁడు - యవను లనఁగాఁ దురష్కులను ఫ్రెంచివారినిగూడ జయించె నని యర్థము.

ఆంగ్లేయులు మనయాంధ్రదేశములోనికి వచ్చినపిమ్మట వారివంశజులచే సంపాదింపఁబడినబిరుదు లాయాయుచితస్థలంబులలో వివరింపఁబడును. ఇవి యన్నియు నవీనములు. పై నుదాహరింపఁబడినవి ప్రాచీనములు. కావున వానినిమాత్రమే వివరించియున్నారము.

పైబిరుదాంకము లన్నిటింబట్టి చూడ మైలమభీమునివంశస్థుల కొక్కొక్క కాలములోఁ గొలిపాకయుఁ, గేతవరమును, బెజవాడయుఁ, గుంభిళాపురమును, విజయనగరమును, ముఖ్యపట్టణము లయి యుండెననియును; ధారాపురము, నెల్లూరు, యెలమంచిలి, కంచి, దేవగిరి, కటకపురి, చెంజి, ద్వారకాపురము మొదలగుపట్టణములపై దండెత్తి వెడలి వానిని స్వాధీనపఱుచుకొనినట్టును, మేదినీరాయ, మాళవరాజ, కర్ణాటరాజ, కళ్యాణరాజ, కళింగరాజ, కిమిడిరాజ, భల్లాడ, ఒడ్డియరాయ, ఏళరాయ, రేచర్లగోత్ర, యవనసైనిక, చోళరాజ, పావురాయ, రాయసంస్థాననృప, పరాసుసైన్య జయాంకబిరుదులును, చాళుక్యరాజరాజ్యస్థాపన, అనేకరాజకులసంస్థాన నిర్వాహకబిరుదులు చెల్లినట్లును గాన్పించును. వీని నన్నిటిం బట్టి చూడ నీమయిలమ భీమునివంశస్థు లెంతదేశమునకుఁ బ్రభుత్వము చేసిరో యెందఱు రాజులతో సంబంధము గలిగియుండిరో బోధపడకపోదు. ఇంతవఱకును మనమాంధ్రదేశములోని ప్రాచీనరాష్ట్రమును బాలించెడు మైలమభీమునివంశస్థులచరితము సూచించుబిరుదులం జెప్పితిమి. ఇపుడు భీమకవిసమకాలీనుఁడును రేచర్లగోత్రద్భవుఁడును నగు ఆదిజగన్నాథరా వనుప్రభునివంశస్థులలోఁజెల్లెడు బిరుదావళులఁ జెప్పెదము. అట్టిబిరుదులం జెప్పుటకుఁ బూర్వమీయాదిజగన్నాథరావుంగూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. ఇతఁడు రేచర్లగోత్రనామమునకుఁ బ్రాతి పదిక యగుచెవ్విరెడ్డితండ్రి పోలన్నకు మూలపురుషుఁడు. ఇంతకంటె నీయాదిజగన్నాథరావు వృత్తాంతము పద్మనాయక చారిత్రము పుట్టిన నాఁటికే తెలిసి యుండలేదు. చెవ్విరెడ్డినాఁటికి వీరిగోత్ర మామనగంటి గోత్ర మని యుండెను. రేచఁ డనువానికిఁ జెవ్విరెడ్డి యిచ్చినవరమును బట్టి వానిపే రిడఁగా నాఁటనుండియు నీచెవిరెడ్డి రేచర్లగోత్రముచే నొప్పెను. ఈచెవ్విరెడ్డి కారణాంతరమునఁ బిల్లలమఱ్ఱిభేతాళరెడ్డి యను పౌరుషనామంబు నోరుగంటిప్రతాపరుద్రునివలన సంపాదించి ప్రసిద్ధి నొందెను. వెలమలగోత్రములు నిర్ణయింపఁబడినసమయమునకు ననఁగా శాలివాహన. సం. 1010 నకు రేచర్లవారిలో నప్పనామాత్యుఁ డను నొకప్రభుం డుండెను. ఇతఁడు భేతాళరెడ్డి కెట్టిసంబంధము గలవాఁడో దానిం దెల్పుటకుఁ దగినగ్రంథసహాయము కాన్పించలేదు. ఇతఁడే భేతాళరెడ్డి యగు నని యూహింపనై యున్నది. రేచర్లగోత్రుల కాతని నాఁడు కల్గినబిరుదములు ముందుగ నీక్రింద వివరించెదము.

1. పంచవాద్యేయదళవిఫాలబిరుదు. -

2. కాకతిరాయరాజ్యస్థాపనాచార్యబిరుదు. -

ఇతఁడు కాకతిపోలురా జని చెప్పఁబడును. ఇతఁడు ప్రతాపరుద్రుని మాతామహుఁ డగుగణపతిరాజునకు బితామహుఁడు. ఇతనికాలములో ననఁగా శాలివాహన సం. 990 లో నోరుగల్లుపట్టణము కట్టఁబడినది. అపుడు చెవ్విరెడ్డితండ్రి పోలన్న యోరుగల్లునకు వచ్చినట్లుగాఁ గాన్పించును. ఈబిరుదు సంపాదించినవాఁ డితఁడే కానోవును. 3. చలమర్తిగండ. - ఈబిరుదు ప్రతాపరుద్రుని వంశమువారిలోఁ బ్రాచీనకాలమునుండి చెల్లుచున్నది. భేతాళరెడ్డి వంశమువారు రుద్ర వంశజులకుఁ జేసినయుపకారవిశేషంబుచే సమానప్రతిపత్తిం జూపుట కీయంబడిన ట్లూహింపఁబడును.

4. జల్లిపల్లెవీరక్షేత్రణేభారతీకమల్లా - అనుబిరుదు జల్లిపల్లె యను నొకవీరులుండుస్థలమును జయించుటచేఁ గల్గినది.

5. సోమకులపరశురామ - అనుబిరుదు చంద్రవంశపుక్షత్రియులను సంహరించుటచేఁ గల్గెను. ప్రతాపరుద్రవంశమును జంద్రవంశమే యగును. భేతాళరెడ్డి యావంశములో నుండువారికి భ్యత్యతగానుండెను గావున నీబిరుదు ప్రతాపరుద్రవంశజులకుం గాక తక్కినసోమవంశజులవిషయ మై చెల్లు నని చెప్పవలసి యున్నది. పైని మనము చెప్పినజగన్నాథరావుకాలమునకుఁ గళ్యాణీపురమునం దుండుపశ్చిమచాళుక్యులు మిక్కిలి ప్రబలులుగా నుండి బహుదేశములను స్వాధీనపఱుచుకొని యుండిరి. వారికిని నోరుగంటిప్రభువులకును యుద్ధములు జరిగినందులకు గ్రంథదృష్టాంతములు గలవు. కాఁబట్టి సోమవంశము పేరిటి మఱికొన్ని వంశముల వారిని జయించి స్వప్రభువులకు సహాయ మొనరించె నని చెప్ప నొప్పి యున్నది. అనపోతమనాయఁడు మాదనాయనికాలములో నిది జరిగినది. ఇది శాలివాహన సం. 1350 మొదలు 1400 కాలమువఱకు.

6. యంబిరుదుగండ -

7. సర్వబిరుదకుమారవేశ్యాభుజంగ -

8. ఆమనగంటిపురవరాధీశ్వర - అనుబిరు దాదిజగన్నాథరాజు కాఁపురముండుస్థలముంబట్టి కల్గినది.

9. గజదళవిభాళబిరుదు - కరిఘటలం గొట్టుటచేఁ గల్గెను.

10. గాయగోవాళబిరుదు - శత్రులసంపద నాకర్షించుటచేఁ గల్గెను.

11. కంచికవాటచూరకార - అనుబిరుదు కంచికోటతలుపుల నూడఁగొట్టుటచేఁ గల్గెను. ఈకంచిపట్టణము భేతాళరెడ్డినాఁటికిఁ జోళ


చక్రవర్తులకు ముఖ్యపట్టణమై యుండినది. అట్టిచక్రవర్తిని జయించుటకుఁగాను వారికోటతలుపుల బ్రద్దలుగొట్టె నని యర్థము.

ఇదివఱకుఁ గలబిరుదు లన్నియును జెవ్విరెడ్డినాఁటికే కల్గినట్లు కాన్పించును. ఈక్రిందిబిరుదులు చెవ్విరెడ్డియనంతరకాలమువారివలన సంపాదింపఁబడినవి. అందు ఖడ్గనారాయణభుజాబలభీమ, గండభేరుండ, ప్రతిగండబైరవ, శ్వేతకేతన, వైరితలగుండుగండ, ఛండభీమ, మండలీక రగండ, కోటగిరివజ్రాయుధ, అసహాయశూర, గరుడనారాయణభల్లరగండ, రణరంగభైరవ, వైరిగజాంకుశ, రాహుత్తమల్ల, హన్నిబ్బరగండ, రిపుగజసంచయ పంచానన, సామంతరాయగోపాల, రాయరాహుత్త, సింహతలాట, శాత్రవారణ్యగహనదావానల, పట్టుతలాటాంక, రాయవేశ్యాభుజంగ, ఏకధాటీసమర్థ, కోటలగొంగ, ద్విశాఖకరదీపికాబిరుద, పనఘానబసవశంకర, పరరాజన్యదౌర్జన్యశ్వసనగ్రసనాత్యుగ్రనాగబిరుద, భల్లరగండయనుబిరుదులు చారిత్రోపయోగములు కావు. ఇఁకఁజారిత్రోపయోగము లయినవాని నీక్రింద వివరించెదము. ఇక్కడికి బిరుదుల సంఖ్య 41.

42. కాకతీయరాజ్యస్థాపనాచార్య - అనునది గణపతిదేవునకు సేనానిగా నుండినప్రసాదిత్యునివలన సంపాదింపఁబడినది. గణపతి దేవుని యనంతరము రాష్ట్రములోఁ గల్గినయుపద్రవముల నివారించి యతని భార్యను రాజ్యమున నిల్పుటచేఁ గల్గెను.

43. రాయపితామహబిరుదు - ఇది ప్రసాదిత్యుఁ డనుప్రభునికాలములోఁ గల్గినది. గణపతిదేవుని యనంతరము ప్రతాపరుద్రుని బాల్యమున రాష్ట్రవ్యవహారము గణపతిదేవునిభార్య యగురుద్రమమహాదేవి చేయుచు వచ్చెను. ఆమెకు నీప్రసాదిత్యుఁడు మంత్రియై యుండి రుద్ర మహారాజునకు విద్యాబుద్ధులు గఱపుచు నాతనిచేఁ దాత తాత యని పిలువఁ బడుటచే రాయపితామహుఁ డనుబిరు దందెను. 44. షట్సప్తతిపద్మనాయకగోత్రవందనీయుఁడు. ఇది మొదట ప్రతాపరుద్రునిచే వెలమలకు గౌరవము కల్గించుటచేత నతనికిని అనంతర మట్టియౌదార్యమునఁ గులమువారిని సంరక్షించుటచేత నతనివంశజులకునుగూడఁ జెల్లుచుండును.

45. కోటగిరివజ్రాయుధనాగార్జునపురకోటసాధక. మాహురీపురక్షేత్రశత్రునివారణ, వేములకొండస్థలవైరిరాజజీమూతపవన, ఏకశిలానగరసమీప శాత్రవరాజ్యగహనదహన, చెతంపూఁడిమనవిభాళ, హొన్నెగట్టు, కుదిరిగట్టు, మండలీకరగండ - అనుబిరుదులు పైస్థలములలో నపుడపుడు పౌరుషములఁ జూపుటచేతఁ జెవ్విరెడ్డివంశస్థులవలన సంపాదింపఁబడినవి.


46. పాండ్యగజకేసరి 1. వీరపాండ్య. 2. విక్రమపాండ్య
47. పంచపాండ్యదళవిభాళ 3. పరాక్రమపాండ్య. 4. సుందరపాండ్య. 5. కులశేఖరపాండ్య అను పాండ్యపంచకమును జయించుటచేఁ గల్గెను.

48. హరిత్తోరణబిరుదము. మట్లూదియిమ్మడనురాజుం బరిమార్చి వానికి బిరుదముగా నున్న పచ్చతోరణముఁ గైకొనుటచేఁ గల్గెను.

49. తిరుకాలరాయరాజ్యస్థాపనాచార్య - తిరు కాలరాజునకు మరల రాజ్య మిప్పించుటచేఁ గల్గెను.

50. మత్స్యనాయకగండ - ఇది మాడుగులు ప్రభుని జయించుటచేఁ గల్గెను.

51. కొదమనాయకతలగుండుగండ - కొదమనాయకుని సంహరించుటచేఁ గల్గెను.

52. ధరణీవరాహలాంఛనుఁడు - ఈబిరుదు చాళుక్యులను జయించినపుడు కల్గి యుండ నోవును. చాళుక్యులకు ధరణీవరాహలాంఛనబిరుదు చెల్లుచుండెను. సోమకులపరశురాముఁ డనునది చాళుక్యులను జయించుటచేతనే చెల్లెను. పైదాని నీబిరుదు స్థిరపఱుచుచున్నది. 53. హిందూరాయత్రాణబిరుదు - ఈబిరుదము సింధుదేశాధిపతిని సంరక్షించుటచేఁ గల్గియుండును. సింధువునకే హిం దని పాశ్చాత్యుల వ్యవహారము.

54. హత్తిబ్బరగండ - హత్తు అనఁగాఁ బదియును, నిబ్బర యనఁ గా రెండును గలిసి పన్నిద్దఱు రాజుల జయించుటచేఁ గల్గెను.

55. కఠారినారాయణ - కఠారియుద్ధమున నధికుఁ డని యర్థము.

56. శ్రీశైలసోపానవిమానమంటపప్రాకారనిర్మాణధురీణుఁడు. - ఆంధ్ర దేశమున నుండు స్మార్తమతస్థుల కందఱకును మిక్కిలి యుత్కృష్టస్థానమగు శ్రీశైలము విశేషము నిడివి కలదియై జనులకు దుర్గమముగానుండును. దానంజేసి దానికి సోపానాదికము కల్గించి కైంకర్యము చేయఁబడియెను.

57. మూరురాయరగండఁడు - ఇదికృష్ణరాయనిబిరుదు. అశ్వపతి, నరపతి, గజపతులను జయించుటచేఁ గల్గినది. దీనింబట్టి కృష్ణరాయనికాలములోఁ గూడ నీచెవ్విరెడ్డివంశజులు విశేషప్రబలులై యున్నట్లూహింపనై యున్నది.

58. జగనొబ్బగండబిరుదు. ఇది యద్దంకిసీమకుఁ బూర్వము ప్రభుఁ డైనట్టియు, ననపోతరెడ్డి, యనవేమరెడ్డి మొదలగు ప్రసిద్ధరెడ్డి రాజులకుఁ దండ్రియైనట్టియు, శ్రీశైలములోఁ బాతాళగంగకు సోపానాదికైంకర్యము లొనరించినట్టియు నాదివేమభూపాలునిబిరుదు. శత్రులోకమును జయించినవాఁ డని దీనియర్థము. ఈబిరుదు వేమభూపునకు సహాయము చేయుటచే నైనను లేక యతనిని సంహరించుటచే నైనను గల్గియుండును. కఠారినారాయణుఁ డనుబిరుదు అనవేమరెడ్డితో జరిగినయొక యుద్ధమును సూచించును. కావున రెండవయర్థముఁ జెప్పుటయే లెస్సయైయున్నది.

59. సర్వజ్ఞుఁడు. ఈబిరుదు చెవ్విరెడ్డివంశజులలో సింగమనీనివలనం గైకొనఁబడియెను. ఇది సింగమనీనికిఁ గలవిద్యావైదుష్యాదికముం


బట్టి విద్వాంసులచే నీయఁబడినబిరుద మయి యున్నది. ఈ ప్రభునకు సంస్కృతమునఁ గావ్యనాట కాలంకారములలోన నద్భుతమగు పాండిత్యము గలదని యీతనిచే రచియింపఁబడిన సింగభూపాలీయమును, రూపకపరిభాషయుఁ జూచిన గోచర మగును. ఇతనియాస్థానము విద్యాస్థాన మనియు, నితనిదగ్గర మెప్పువడయుట తన కెట్లు తటస్థించు ననియు, శ్రీనాథునియట్టి కవీశ్వరుఁడు జంకి తాను సింగమనీనిసభకుం బోవునపు డీక్రిందిపద్యమును సరస్వతిం బ్రార్థించుచుఁ జెప్పెను.

సింగమనీనిసర్వజ్ఞత్వస్థాపన కది మిక్కిలి ప్రామాణికవచనమై యుండును గావున దాని నీక్రింద వివరించెదము.

సీ. దీనారటంకాలఁ దీర్థమాడించితి, దక్షిణాధీశు ముత్యాలశాల
   పల్కుతోడై తాంధ్రభాషామహాకావ్య, నైషధ గ్రంథసదర్భముంకుఁ
   బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి, గౌడడిండిమభట్టుకంచుఢక్క
   చంద్రశేఖరుక్రియాశక్తి రాయలయొద్దఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుద

గీ. మెటుల మెప్పించెదో నన్ను నింకమీఁద, రావుసింగన్నభూపాలు ధీవిశాలు
   నిండుకొలువున నెలకొని యుండి యిపుడు, సరససద్గుణనికురంబ శారదాంబ.

ఈశ్రీనాథుఁడు సంస్కృతములోని విద్యానౌషధ మగునైషధమును, నయఃపిండ మని ప్రసిద్ధి కెక్కిన కాశీఖండమును దెనిఁగించి యాంధ్రగీర్వాణసాహితీ సార్వభౌముఁ డని రాయలయాస్థానమున బిరు దందినవాఁడు. అట్టి శ్రీనాథునకు దురవగాహ మగుసాహిత్యాదులు గలసింగమనీనికి సర్వజ్ఞబిరుదు జెల్లిన నేమివింత యున్నది ? ఇతని గ్రంథములును నితనియితరవిశేషాదికములును రావువంశచారిత్రములో యథోచితస్థానంబునఁ బ్రకటించెదము.

60. వెలిగొడుగురాయఁడు - ఈబిరుదు శ్వేతచ్ఛత్రమును బట్టించు కొనుటచేఁ గలిగినది.

61. నాగార్జునకోటనికటప్రకటవికటావశియోబళ రాజరాజీవగజరాజు - అనుబిరుదావళి యోబళరాజును జయించుటచేఁ గల్గినది. 62. వేంకటగిరిపురనిర్మాణాలంకర్మీణ - అనుబిరుదు తన్నా మకపట్టణనిర్మాణమువలనం గల్గినది. ఇది కట్టినపిమ్మట నిందుండు ప్రభులకు వేంకటగిరివా రనియును, సంస్థానమునకు, వేంకటగిరిసంస్థాన మనియు నామంబులు గల్గినవి. వెలుగోటివా రనుగృహనామము ప్రాచీన మగుటం జేసి యానామము గ్రంథస్థముగఁ గాన్పించును.

63. సారెయోబళరాజరాజ్యస్థాపనాచార్యబిరుదు. ఇది సారెయోబళరాజునకుఁ బోయినరాజ్యమును మరల నిప్పించుటచేఁ గల్గెను.

64. కవికల్పద్రుమబిరుదు - ఇది భానుమతీపరిణయమును గృతినందినరాయప్పనాయనికిఁ గల్గి యున్నట్లుగా నాగ్రంథములోఁ గాన్పించు. ఈరాయప్పనాయనికిం గలబిరుదులు మఱికొన్నిటిని గూడఁ జేర్చి యొకపద్య మాగ్రంథమునందు వర్ణింపఁబడినది. దాని నీక్రింద వివరించెదము.

సీ. ఘనజయశ్రీభావకలిమి నెవ్వనివీర, నారాయణాంక మున్నతి వహించు
   హితమహానందచిత్తతఁ దాల్చి యెవ్వాని, గండగోపాలకాంకంబు మెఱయుఁ
   దతసింహబలసమున్నతిచేత నెవ్వాని, యాహవభీమాంక మతిశయిల్లు
   సకలార్థసంధానచాతురి నెవ్వాని, యర్థి మందారాంక మమరి యుండు

గీ. నతఁడు నుతిఁ గాంచు రాయచౌహత్తిమల్ల, రాజవేశ్యాభుజంగ ధరావరాహ
   గాయగోవాళకేళాదిరాయబిరుద, రమ్యగుణహారి వెలుగోటిరాయశౌరి.

అని యిం దుదాహరింపఁబడినబిరుదు లెవ్వి యన అ వీరనారాయణ. 2. గండగోపాల. 3. అహవభీమ. 4. అర్థిమందార. 5. రాయచౌహత్తి మల్ల. 6. రాయవేశ్యాభుజంగ. 7. ధరణీవరాహ. 8. గాయగోవాళ. 9. కేళాదిరాయ అని మఱియొకచో హిందురాయసురత్రాణుఁ డనియు నున్నది. ఇట్టిబిరుదులు సంపాదించిన రాయప్పనాయనికాలము నిర్ణయింప నాధారములు తగినవి దొరకుట లేదు. కొన్ని కొన్ని దృష్టాంతములచే నితండు శాలివాహన సం. 1550 గలకాలమున నున్నట్లు కాన్పించును. 65. రామరాయరాజ్యస్థాపనాచార్యుఁ డనుబిరుదు - యాచసూరుఁ డనునీవంశజునిచేతను రమారమి రాయప్పనాయని కాలమునాఁ డే సంపాదింపఁబడినది.

ఇంతవఱకును జెప్పఁబడినబిరుదములు స్వదేశప్రభువులవలన నాదిజగన్నాథరావువంశజు లగువేంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలగుసంస్థానములవారు సంపాదనము చేసినవియై యున్నవి.

అటుపిమ్మట తురష్కులకాలములోను, హూణప్రభుత్వములోను సంపాదించినబిరుదములు నవీనములు గావున వారివంశచారిత్రములో వ్రాయఁదలఁచి యిప్పటి కిది వ్రాయ విరమించెదము.


  1. సహ్యజ
  2. లచ్చన, అని యప్పకవీయములో దీనికిఁ బాఠాంతర, మున్నది.
  3. వేములవాడభీమకవి భారతము రచించిన ట్లీపద్యమువలనం దెలియఁబడదు. ఆంధ్రకవిచరిత్ర మత మట్లు కాదు.
  4. న్యూయలు దొరగారి దక్షిణ దేశపురాష్ట్ర వృత్తాంతములోఁగూడ "At that period (in A. D. 977) there ensued a period of anarchy in the Eastern Chelukya territories which lasted for 27 years at least" అనఁగా శాలివాహన సం. (క్రీ. శ. 977) 900 గలకాలమున నొక యరాజకావస్థ తూర్పుదేశపు చాళుక్యులలోఁ దటస్థమై యది యించుమించు గా 27 సంవత్సరములదాఁక నున్న దని యర్థము.
  5. (See page 183 of Mr. Sewel's Lists Vol. II.)
  6. ఇతనివంశముంగూర్చియుఁ గాలనిర్ణయముం గూర్చియుఁ బిల్లలమఱ్ఱి వీరన్న చారిత్రములోఁ జూడఁదగును.
  7. ఇతని పేరే భీమకవి "వెలుంగాధీశ" అని చెప్పినట్లు తోఁచెడిని.
  8. ఈకవి నృసింహపురాణమును రచియించినాఁ డనియు, దానిలోనిదే యీపద్యమనియు నీనడుమ ముద్రిత మై వెలసిన నన్నెచోడుని కుమారసంభవ భూమికలో వ్రాయఁబడి కాననయ్యెడిని. /div>

    ఉ. వాండిమి నల్ల సిద్ధిజనవల్లభుఁ డోర్చినరాజు భీరుఁ డై
    యాండ్రను గానకుండ వృషభాంకము పెట్టికొనంగఁ జూచితో
    నేండిదె యేమి నీ వనుచు నెచ్చెలులెల్ల హసింప నంతలో
    మూండవకంటితోడ దొరమూర్తి వహించిన మ్రొక్కి రంగనల్.

  9. ఒక యాంగ్లేయచారిత్రములో, (The capital of the Western Chalukyas was Kalyan or Kalyanapura Someswara. Trylokya mallawas ruling over it as early as in 975 Saka (1053. A. D.) అని యున్నది. ఈబిరుదువలన నీవంశస్థులు కళ్యాణరాజును జయించి యారాజ్య మాక్రమించినట్లు కాన్పించును.