కవి జీవితములు/జయంతి రామభట్టు

ఉత్తరరామాయణములో నింతవఱకే తిక్కనవృత్తాంతము గాన్పించును. ఆశ్వాసాంతమునందు వ్రాయఁబడినగద్యమున నీగ్రంథరచన కాలమునాఁటికిఁ దిక్కనసోమయాజి యజ్ఞము చేయ లే దని తేలుచున్నది. ఆగద్య మెద్ది యనఁగా :-

"ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాథన విధేయ తిక్కయనామధేయ ప్రణీతం బైన యుత్తరరామాయణం బనుకావ్యంబునందు"

అని యున్నది. భారతములో "బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి" అని యున్నది. కావున నుత్తరరామాయణకాలమునకుఁ దిక్కనసోమయాజి యాహితాగ్ని కాలేదు. నిర్వచనోత్తరరామాయణములోనితుదియాశ్వాసముతప్ప తక్కిన దంతయుఁ దిక్కనసోమయాజి ప్రణీత మగుటచేత దానికిఁ గారణ మేమై యుండు నని యూహింపనై యున్నది. దాని కాగ్రంథములోని తుదియాశ్వాసమును బూర్తి చేసిన జయంతిరామకవిచే నైన కారణము చెప్పఁబడదయ్యెను. లోకప్రతీతిం బట్టి యాయాశ్వాసములో రామనిర్యాణమును జెప్పవలసి వచ్చు నని వదలినట్లుగా నూహింపనై యున్నది. అట్లే యయినచో భారతములోని స్వర్గారోహణపర్వములో మొదటఁ గృష్ణనిర్యాణంబును, అనంతరము పాండవుల లోకాంతరగమనంబును జెప్పుటయే తటస్థింపదు. అట్లు గావున దీనికిఁ గారణ మేది యైన నుండవలెను. దానిం దెల్పుగ్రంథ సామగ్రి లేదు గావున దాని న్వదలి తుదియాశ్వాసము పూర్తిచేసిన కవివరునివృత్తాంత మిచ్చోఁ గొంచెము ముచ్చటింతము :-

__________

ఉత్తరరామాయణము

8.

జయంతి రామభట్టు.

ఇదివఱకు మనము చెప్పిన జయంతి రామకవీశ్వరునిం గూర్చిన చారిత్ర మాకవిరచిత మైనయా శ్వాసప్రారంభములో గాని లోకమువా


డుకలోఁ గాని కానుపించదు. ఆశ్వాసాంతగద్యములోఁగూడ నొకవిధముగా నున్నది. అంతమాత్రముచేత నతనికవిత్వవిశేషములు వ్రాయఁ జాలి యుండవు. ఆగద్య మెట్లన్నను :-

"ఇది శ్రీమద్భద్రాద్రిధామ వరప్రసాద లబ్ధ కవిత గార్గేయసగోత్రపవిత్ర జయంతి కృష్ణభట్టారక సుభద్రాంబా వరతనూజ రామభట్టప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనునాదికావ్యంబున నుత్తరకాండంబునందుఁ దిక్కనసోమయాజిరచిత శేషంబు గల మీఁదికథయందు శ్రీరాముఁడు కుశలవులకు విద్యాభ్యాసంబు చేయించుటయు, అతిరాత్ర, పౌండరీక, వాజపేయంబు లాదిగా శతక్రతువులు గావించుటయు........నారాయణాఖ్యం బ్రవర్తిల్లి పూర్వరీతిని వైకుంఠ పురప్రవేశంబుననుకథలు గలిగిన యేకాదశాశ్వాసము."

అని యున్నది.

దీనింబట్టి చూడ నీకవి భద్రాద్రిసమీపములోనివాఁ డనియును, గార్గేయసగోత్రుఁ డనియును జయంతి యనుగృహనామము గలరామభట్టనుబ్రాహ్మణుఁ డని స్పష్టమే. ఇతని కాలనిర్ణయము చేయుట మిక్కిలి దుర్ఘుటముగా నున్నది. ఇతఁడు గ్రంథాది నుత్తరరామాయణములోని తుదియాశ్వాసమును జెప్పుటకుఁ గలకారణ మొకపద్యములోఁ జెప్పి యుండెను. దానిం బట్టి తిక్కనసోమయాజి పదియాశ్వాసములు చెప్పి తక్కినది. చెప్పకపోవుటకుఁ గాని యట్టియసంపూర్తి గ్రంథమును దాఁ దెనిఁగించుటకుఁ గాని కారణములు తెలియఁబడవు. ఆపద్యములో నెట్లుండె ననఁగా

"తిక్కనసోమయాజి మును దెల్గున నుత్తరకాండ చెప్పి యం
 దొక్కటి జెప్పఁడయ్యె.................................
 ...............................................
 చక్కనిదేవళంబుపయి స్వర్ణఘటం బిడుపోల్కి దోఁపఁగన్."

అని తాను దెనుఁగించుగ్రంథములోని విశేషముమాత్రము చెప్పెను. కావున నింతకంటెఁ బ్రస్తుత మీగ్రంథవిషయమై వ్రాయము. కాని తిక్కనసోమయాజి చెప్పినపదియాశ్వాసములలోని శయ్యాచమత్కారమును బ్రౌఢిమమును నీపదునొకొండవయాశ్వాసములో లే దనియును నీయాశ్వాసము చదువునపుడు తిక్కనసోమయాజి యీయాశ్వా


సముఁ గూడఁ బూర్తిచేసిన బాగుగ నుండియుండు ననియును దోఁచునని మాత్రము చెప్పెదము.

___________

ఉత్తరరామాయణము.

9.

కంకంటి పాపరాజు.

పైనిర్వచనోత్తరరామాయణము కావ్యముగా రచియింపఁబడి యుండుటఁ జూచి కంకంటి పాపరా జనునతఁ డుత్తరరామాయణము మహా కావ్యముగా రచియించుట కుత్సహించి తిక్కనసోమయాజి చేసిన కావ్యమునే తాను మఱియొకసారి తెన్గుచేయుట చర్వితచర్వణ మనియు, నెచట నైన సమానవర్ణన లున్నచోఁ దనకవిత్వము తిక్కనసోమయాజికవిత్వముతో సరి తూఁగనిచోఁ బాఠకులు త న్నా క్షేపంబుచేసెద రనియు శంక మనస్సులో నుంచుకొని యీక్రిందిపద్యముచేతఁ దన యుద్యమమును వ్యక్తీకరించు చున్నాఁడు. అది యెద్ది యనఁగా :-

"మ. వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యం బై తగం జేసె ను
     త్తర రామాయణ మందున న్మఱి ప్రబంధం బూని నిర్మించు టే
     సరసత్వం బని ప్రాజ్ఞులార నిరసించంబోకుఁడీ రాఘవే
     శ్వరుచారిత్రము లెంద ఱెన్నిగతుల న్వర్ణించినం గ్రాలదే."

ఇట్లు చెప్పియు నుత్తరరామాయణమునే యాంధ్రీకరించుటకుఁ గలకారణము తిక్కనపైని పోటీగా వ్రాయుటకుఁ గాదనియుఁ దాను తరియించుటకు సాధన మనియుఁ దన యుపాసనాదేవుఁడు శ్రీరాముఁ డవుటంజేసి యందులఁకుగాను దా నాగ్రంథ మారంభించితి ననియు నీక్రిందిపద్యములలోఁ జెప్పెను. ఎట్లన్నను :-

"ఉ. మానక కర్మభూమిపయి మానుష దేహముతో హితాహిత
    జ్ఞాన మెఱుంగుబ్రాహ్మణుఁడు చారుకవిత్వము నేర్చి జానకీ
    జానికథ ల్రచింపక యసత్క థ లెన్ని రచించెనేనియున్
    వానివివేక మేమిటికి వానికవిత్వమహత్త్వ మేటికిన్.