కవి జీవితములు/గ్రంథకర్త పీఠిక

శ్రీరస్తు.

గ్రంథకర్త పీఠిక.

ఆంధ్రభాషాభిమానులతో నిపుడీ గ్రంథము మరల రెండవకూర్పున బ్రకటించునట్టి సంగతి విజ్ఞాపనము చేయుచున్నాడను. ఇది ప్రథమములో నేను స్కూలులో విద్యాభ్యాసము చేయుచున్నతరి నింగ్లీషు భాషలో నుండు "Macaulay's Critical and Biographical Essays of Poets" అను గ్రంథమువంటి గ్రంథ మాంధ్రభాషలో నుండిన నెంతయు నుపయోగకారిగా నుండు నని యూహించి యావిషయమై కొందరు పెద్దలతో సహవాసము చేసి కొంతగ్రంథము సంపాదించి దేశస్థుల యభిప్రాయము లరయుటకు గాను గొంతకొంతగా 1876 సం.రము మొదలు ప్రకటింప నారంభించినాడను. అంతట నందులోని రెండవ భాగము ఆ 1882 వ సంవత్సరములో B. A. పరీక్షకు బఠనీయ గ్రంథముగా నేర్పరుపబడుటంజేసి యాభాగము మాత్రము మరియొకపరి ముద్రించి ప్రకటింపబడినది. అనంతరము మరికొన్నిభాగము లపుడపుడు శ్రీప్రబంధకల్పవల్లి యనుపత్త్రికలో గల్పి ముద్రింపబడినవి. అవియన్నియు నేకసంపుటముగ లేకున్నను, శాలివాహనశకము పదియవ శతాబ్దము మొదలు పదియేడవ శతాబ్దము వరకు నుండెడు కవుల యొక్క చారిత్రములు దొరకినమట్టుకు బ్రచురింపబడినవి. అంతట దేశచారిత్ర విషయమైన్ చేయుచున్న కృషి యధికమగుటచేతను నందులోనే కవిచారిత్రములకు వలయు కాలనిర్ణాయాదికము చేయుటకధారము లనేకము లుండుటంబట్టియు నట్టిపని చేయుట సులభసాధ్యము కాకుండుట చేతను బూర్తిగా గవిజీవితగ్రంథము రెండవకూర్పుగా నచ్చువేయించుటా కవకాశము చిక్కలేదు. ఇట్లుండ, బ్ర. కందుకూరి వీరేశలింగముగారు తమ మిత్రులెవ్వరో తమ్ము గవిచరిత్రములు తిరుగ రచియించుటాకు బ్రేరేపించినారని కవిచారిత్రములను పేరుతో నొకగ్రంథము ప్రాచీనకవులం గూర్చిన భాగమును ముద్రించి ప్రకటించిరి. అందు బెక్కండ్రకవుల పేళ్ళును వారి చారిత్రములును వ్రాసినట్లున్నను చాలభాగ మిదివఱలో నాచే బ్రకటింపబడిన కవిజీవితముల యర్థసంగ్రహమే కాని వేఱుకాదు. ఏవియైన నొకటి రెండుకథలు నవీనముగా గాన్పించుటకు జేర్పబడినను నవి యనవసరమైన చారిత్రములుగా నైనను లేక ప్రత్యేకము కవిత్వశైలిం జూపుటకు


వ్రాయఁబడినపద్యములు నుదాహరణములు గానైన నుండును. అవి యన్నియుఁ జేరి యొకగ్రంథముగా నేర్పడఁగా నందువలన నాంధ్రభాషకుఁ గల్గినలాభమేమయ్యె ననఁగా నదివఱలోఁ గవిజీవితములలో నేర్పఱుపఁ బడిన కాలనిర్ణయములు పూర్వపక్షము లగుటయుఁ గవిచరిత్రములోఁ జేయఁబడిన తద్విషయకోపన్యాసములనుబట్టి యట్టినిర్ధారణ చేయుటకు వీలులేకుండుటయుఁ దటస్థం బయ్యెను. పైమార్గమునే యవలంబించి నెల్లూరుజిల్లాలో మఱియొకబుద్ధిశాలియును గవిజీవితములలోని ప్రధమ భాగమును దనభాషాపాండిత్యమును జూపుచు మాఱిచి మఱికొన్ని యంశముల నిష్టానుసారముగాఁ జేర్చి యొకగ్రంథ మచ్చువేసి ప్రకటించెను. ఇది క్రీ. శ. 1886 సంవత్సరమువఱకై యుండెను. కాని నేను జేయుచున్న దేశచారిత్రము ముగియక యుండుటంబట్టియును గొందఱు నేనదివఱకు చేసిన సిద్ధాంతములఁ బూర్వపక్షము చేయుటంబట్టియును, మరల నాగ్రంథము ముద్రించి ప్రకటింప నవసర మున్నదియు లేనిదియుఁ జూడకుండ ధనవ్యయము చేయ నేల యని యూహించి నేను జేయుచున్నపనినే నెఱవేర్చుచు నుంటిని. అది క్రిందటిసంవత్సరముతో ముగిసినది కావున దానిని బ్రకటించువఱకుఁ జిరకాలము పట్టు నని యెంచి యిదివఱలోఁ దొలుతఁ బ్రకటింపఁబడిన కవిజీవితములను బ్రారంభములోఁ బ్రకటించినచోఁ బాఠశాలలకు మిగుల నుపయోగ మగు నని నా మిత్రులు ప్రేరేపఁగా నే నిపుడు దానిలో నీభాగములను బ్రచురించుచున్నాను. కవిచరిత్రముయొక్క రెండవభాగము ప్రచురింపబడుచున్నది గావున నిపుడు నేనుప్రచురించెడు గ్రంథములో సాధ్యమగునంత వఱకు దానిపైఁ బూర్వపక్షములఁగూడ బ్రకటించెదను. ఇట్టిపని పై గ్రంథకర్తల యెడలఁగాని వారిగ్రంథములయెడలఁగాని నాకొకయసూయ కల్గి యుండుటచేతఁ గాదు. ఎవరికిఁ దోఁచిన సిద్ధాంతమును వారు స్వతంత్రించిచూపిన నది పాఠకుల కుపయోగింపక మిక్కిలి సంతోషముతోఁ జదువుచున్న చారిత్రములు మతఖండనలు గలసంవాదగ్రంథములను భాష్యములు జదివినట్లు చదివి తుదకు ముఖసిధానమై పూర్వపక్షము చేసినవారికిని సిద్ధాంతము చేసినవారికిని నాల్గుదీవెన లిచ్చి పూజించి గ్రంథమును క్రింద నుంచివేయుదురు. అట్టిసన్మానము కలుగకుండఁగఁ బ్రస్తుతము నేను జేయుపూర్వపక్షసిద్ధాంతములు విమర్శన మనుశీర్షికతో


గ్రంథములో వేఱుగ నొకతావున సాధ్యమగునంతవఱకుఁ జేర్చుచున్నాఁడను. అటులనే కాలనిర్ణయము చేయునపుడును దానికి నొకశీర్షిక నిచ్చి వేఱుగనే చేర్చు చున్నాఁడను ఇట్టిసంగతు లన్నియు గ్రంథము చూచినంగాని గోచరములు కావు. పైసంగతు లన్నియు నట్లుండగాఁ దెలుఁగు దేశపుపండితుల నందఱ నొకసంగతి బ్రార్థించుచున్నాఁడను. అది యెద్దిఁయనఁగా భాష యొకరిసొమ్ము గాదు. అటులనే చారిత్రమును. ఇంతియ కాక యిదియొక దేశములోనిదియుం గాదు. గ్రంథానుకూల మైనగాథ లాంధ్రదేశములో నాల్గుతెఱఁగుల నుండువానిఁ గైకొని యిందుఁ బొందుపఱుచుచున్నాఁడను. అట్టివానిలో భేదములుగాని యపసిద్ధాంతములు గాని వచ్చినప్పుడు పండితులు వానిని దెల్పి యదివఱ కొకవేషము వేసికొని గ్రంథమును వినుపించుచున్న చారిత్రకారునిచేతనే దానిని సవరణ చేయించి యతని మర్యాదనునిల్పి యతనికృతజ్ఞతాసూచకము లగువందనముల నందుట మంచిది గదా! కావున నిఁక ముందు ప్రకటింపఁబోవు చారిత్రములకుఁ గానీ కవిచరిత్రములకుఁ గానీ చరిత్రాభిమాను లందఱును నేను బ్రార్థించువిధముననే సహాయము చేసెదరని నమ్మి యున్నాఁడను. అని యిటుల వ్రాయుట కవితాధర్మముం దెల్పుటకుఁగాని పూర్వ పక్షి సేయునాక్షేపణకు జంకి కాదు. అట్టిపూర్వపక్షులమత ఖండనము సేయుచోఁ గొంకు కలలోనను లే దని గ్రంథము చూచినవారికే స్పష్టము కాఁగలదు. అయినను గ్రొత్తమార్గముం జూపుట కెవ్వరైనఁ బ్రయత్నించునపుడు విద్వాంసులు దానిలోనిగుణదోషములఁ దెలిసి దానిని గాపాడుట వారికి సహజధర్మ మని విన్నవించుచున్నాఁడను.

"శ్లో. సామాన్యో౽యం ధర్మసేతు ర్నృపాణాం కాలే కాలే పాలనీయో భవద్భిః,
    సర్వానేవం భావినః పార్థివేన్ద్రాన్, భూయో భూయో యాచతే రామచన్ద్రః."

అని శ్రీరామచంద్రు నంతవాఁడును నీవిధమునఁ దాఁ జేసిన యొక కార్యమును బరిపాలింపవలయు నని ప్రార్థించుచుండ నిఁక నాయట్టికించిజ్ఞానిచే నిట్టిసహాయము ప్రార్థింపఁబడుట కేమియబ్బురము ? కావున నాంధ్రపండితు లీశ్లోకమును బాటించి నన్ను గరుణింతురుగాక.[1]

ఇట్లు, విన్నవించు చరిత్రకారుఁడు

గురుజాడ శ్రీరామమూర్తి.

విజయనగరము.

1. 2. 1893.

  1. ఇది గ్రంథకర్త యొకప్పు డిందలియొక భాగమును బ్రకటించుతఱిఁ జేసినవిజ్ఞప్తి.