కవిజనరంజనము/ప్రథమాశ్వాసము

శ్రీః

కవిజనరంజనము

ప్రథమాశ్వాసము

((శ్రీ రామాకుచమండల । సారతరపటీరపంకచర్చితవక్షా।
క్రూరసురారిసితచ్ఛద । ధారాధరశేషకుధరధారుణినిలయా॥)


కంఠీరవాఢ్యవిక్రమ
కుంఠునకును గుంభిదైత్యకోపాటోపా
కుంఠప్రతాపహరునకుఁ
గంఠేశాలునకుఁ బ్రమథగణపాలునకున్.


సమర్పణంబుగా నా యొనర్పంబూనిన కవిజనరంజనం
బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన.

అయోధ్యాపురవర్ణనము

క.

నూపురము భూపురంద్రికి
గాపురము జయేందిరకును గగనతలస్పృ
గ్గోపురము భాసిలు నయో
ధ్యాపుర మినవంశభూధవాధారంబై.

1


క.

తన్నగరీతల్లజ శుం
భన్నవమణిఘృణివిభాసి పటుసాలశిఖా
భ్యున్నతి కోడుట సుమ్మీ
పన్నగపతి యాశ్రయించె బలిసద్మంబున్.

2

తే.

పటుతరానర్ఘ్యరత్నసంపదల కోడి
కొలువవచ్చెనొకో కోట జలధి యనఁగ
నతిగభీరజలస్థితి నతిశయిల్లి
పరిఘ చెన్నొందుఁ దత్పురవరమునందు.

3


క.

సాలోన్నతి కోడి మహా
శైలములు దదంఘ్రిఁ గొలువఁ జనుదెంచెనెకో
నా లీలాగతి మదశుం
డాలంబు లగడ్త యనుకడలిఁ గ్రీడించున్.

4


క.

వీటిపటుఘోటకనిరా
ఘాటత్వర కోడి పూరిఁ గఱచు హరిణముల్
మాటికిని దదారోహకుఁ
డౌటం బవమానుఁడోడు టబ్బురమగునే.

5


క.

మొగములు వేగలశేషుం
డగణితవాగ్గరిమ కోడు నని పల్కఁగ నా
లుగుమొగములు గల యజుఁ డెన
యగునా వీరికన వీట నలరుదురు ద్విజుల్.

6


క.

పుడమిం బొఱియలు దూఱెడు
పిడుగులు, నడవులనె డాఁగు బెబ్బులి, గుహలం
దడఁగెడు సింహము సరియే
వడిగలతనమునను రాచవారికి వీటన్.

7

ఆ.

చదువు సాము గలిగి క్షత్త్రియుల్ సంపూర్ణ
విద్యులనఁగ వీట వినుతి కెక్కి
సాధులను బరిచ్యుతాధులఁ జేయంగఁ
జాలకుండుదురె ప్రశంస సేయ.

8


క.

వెండిమలనికటభూముల
నుండి ధనార్జన మొనర్చి యొప్పారు కుబే
రుం డెంత యని హసింతురు
మెండగు ధనకోటి వీటి మేటి కిరాటుల్.

9


సీ.

పారిజాతములు సంపాదించితిమి పుష్ప
                  మంజరు ల్గూర్చుట మాకు బరువె?
బలుతీగెమల్లె లుపార్జించితిమి చాలఁ
                  గుసుమము ల్బులుకఁగాఁ గూర్పలేమె?
కణజము ల్నిండ బంగారుతీఁగెలు గూర్పఁ
                  జాలమే మఱి ముత్తెసరులు గూర్ప?
నర్థిఁ బ్రయాగంబు లార్జింప నార్జింపఁ
                  గానోప మెట్లు గంగాజలంబు?
లంచు బహువిధచిత్రధాన్యములుగూర్చి
ధరణిసురపూజనవిధావధాను లగుచు
వఱలుచుండుదు రప్పురీవరమునందు
సుగుణమాణిక్యఖనులైన శూద్రజనులు.

10

సీ.

లోకమోహనకళ ల్చేకొనియుండంగ
                  నతనుబాణము లంట యబ్బురంబె!
మహనీయలీలల మానసం బలరింప
                  నంచబోద లనంగ ననువు పడదె!
గగనమధ్యమనోజ్ఞగతులు శోభిల్లుట
                  జుక్కలంచు వచింప సూటిపడదె!
వలపులు గొలుపు చెల్వములు రాజిల్లుటఁ
                  బుష్పమంజరులని పోల్పఁదగదె!
వీరి నన నూరువిలసనవిజితరంభ
లంచితేక్షావధీరితహరిణ లగుచు
నచ్చరల మీఱఁజాలు నొయ్యారములను
వెలవెలందుక లుందు రవ్వీటియందు.

11


ఉ.

మాముఖనేత్రబాహుకుచమంజిమ లిట్టివి యంచుఁ బ్రేమతో
గాముకకోటికిం దెలుపుకైవడిఁ దమ్ములు నల్లగల్వలుం
గోమలపుష్పదామములు గుచ్ఛము లంగటఁ బెట్టి యమ్ముదు
ర్వేమఱుఁ బుష్పలావికలు వీటను నర్మవచఃప్రవీణతన్.

12


చ.

పురనికటించితోపవనపుష్పితసాలములం గదల్చుచు,
స్సరసులఁ దేలుచు, న్సుమరజఃపటలంబులఁ జల్లులాడుచు,
న్సురుచిరకుంజపుంజములఁ జొచ్చి నటించుచు మందగాములై
కరులవలెం జరించుఁ జలిగాడ్పులు షట్పదశృంఖల ల్దగన్.

13

.

క.

వలపుల పాణింధమములు
మలయానిలముల విహారమందిరములు పూ
విలుతుని యాయుధశాలలు
చలువల జన్మస్థలము లచటి పూదోఁటల్.

14


గీ.

అతులదరచక్రమీనరేఖాంకము లయి
యూర్మికాకంకణద్యుతి నొప్పుమీఱి
చారుపద్మాకరమ్ముల చందమునను
రాజిలుచునుండుఁ బద్మాకరములు వీట.

15


చ.

అనుపమహైమకుడ్యఘటితాంచదనంతమణిప్రభాళిచే
ననయముఁ దత్పురీవరమహాగృహముల్ రెయిదోఁపకుండగా
నొనరుచుటంజుమీ గృహము లొప్పె నిజాంతసమాహ్వయంబులన్
వినుతి యొనర్పఁగాఁదరమె వీటనుగల్గిన రత్నసంపదల్.

16


మ.

అమరద్వీపవతీపయోవిహరణప్రాంచత్సురస్త్రీల, వ
జ్రమయాభ్రంకషమంటపాగ్రముల నిచ్చల్ క్రీడఁ గావించుత
ద్రమణీవారము వేఱ నేఱుపఱుప న్రాదంచుఁగా దివ్యరా
జముఖీపాళికిఁ దమ్మిచూలి యనిమేషత్వంబుఁ గావించుటల్.

17


మ.

అతులోత్సాహము లుప్పతిల్ల నికటోద్యానంబులం బొల్చుకే
కితతు ల్వీటను జిత్రనర్తనకలాకేలి న్విజృంభించు భ
వ్యతరాభ్రంకషరత్నసౌధపటలీవాతాయనవ్రాతనిర్గత
కాలాగురుధూపధూమ్యలు మొయిల్గానెంచి యెల్లప్పుడున్.

18

క.

అనుపమతత్పురనారీ
జనులకు నచ్చరల కంగసౌందర్యము నం
గనుపడ దెక్కువ తక్కువ
కనురెప్పలయందకాని గణుతింపంగన్.

19


సీ.

పద్మాకరములౌట, భవనరాజంబులు
                  విష్ణుపదం బంటి వినుతి కెక్కె
రత్నాకరంబౌట, రమణీయవప్రంబు
                  గగనస్రవంతితోఁ గలసి మెలసె
సుమనోభిరామత శోభిల్లుటను, దోఁట
                  లతులాప్సరస్సమన్వితము లయ్యె
రాజవతంసులై రంజిల్లుటను, నృపు
                  లమలదుర్గాధిపత్యమున మనిరి
భోగులకు నాశ్రయంబయి పొలుచుకతన
సన్నుతికి నెక్కె నది బలిసద్మమనఁగ
నిత్యకల్యాణలక్ష్మిచే నెగడుకతన
నాపురం బొప్పు విబుధాలయం బనంగ.

20


గీ.

ధామములు తత్పురమున ముక్తామయములు
నిత్యకల్యాణసంప దన్వితులు విశులు
సతు లచటఁ గాంతమానసహితచరితలు
మంజులాస్యలు పురిఁ గల్గు లంజె లౌర.

21

సీ.

బహుభాషణత్వంబు పటుశాస్త్ర
                  సంవాదచుంచువిద్వజ్జనస్తోమమంద,
క్రూరభావం బత్యుదారవిలాసవ
                  చ్చంద్రాననాకటాక్షములయంద,
చంచలభావంబు సముదగ్రభద్రదం
                  తావళరాజిహస్తములయంద,
వక్రభావంబు దుర్వారవిక్రమసము
                  ద్భటభటాధిజ్యచాపములయంద,
కాని పురమున జనులందుఁ గానఁబడ ద
నంగ నెంతయు నప్పట్టణము వెలుంగు
హీరమణిమయసౌధాగ్రహేమకలశ
భాజితస్వర్ణదీస్వర్ణపద్మ మగుచు.

22


క.

అలజడిగలారు కలుషము
గలారు నిప్పచ్చరంబుగలవారు రుజల్
గలవా రనభిజ్ఞత్వము
గలారు పురి నెందు లేరు గణుతింపగన్.

23

హరిశ్చంద్రవర్ణనము

క.

ఏతాదృశపురమణికిని
నేత యితం డనుచుఁ బొగడ నెగడి నిజభుజా
శాతాసిగుప్తసకలో
ర్వీతలుఁడై యొప్పి శ్రీ హరిశ్చంద్రుఁ డిలన్.

24

సీ.

తన పృథుకీర్తి ముక్తాచ్ఛత్రమునకు
                  స్వర్ణధరంబు కనకదండంబు గాఁగఁ
దన ప్రతాపసమగ్రదావాగ్నిశిఖకు వ్యో
                  మంబు తదగ్రధూమంబు గాఁగఁ
దన నిర్గళదానధారాంబులహరికిఁ
                  గైలాసశిఖరి సైకతము గాఁగఁ
దన కటాక్షస్యంది ఘనకృపారసవృష్టి
                  కఖిలార్థకోటి సస్యంబు గాఁగఁ
మహినిఁ జెలువొందె మత్తారిమండలేశ
మకుటమణిగణశాణాయమాన చరణ
నఖరపాళి నిజాశ్రిత నళినహేళి
చారుకీర్తి హరిశ్చంద్రచక్రవర్తి.

25


క.

లోకాలోకమహీధర
మే కోట, కులాచలములు కృతకాద్రులు, కే
ళాకూళులు జలరాసులు
శ్రీకరధృతి సాంద్రుఁ డౌ హరిశ్చంద్రునకున్.

26


చ.

అనిమిషశంకరాలయము లౌటను దోసమటంచు నెంచియో
తనఘనశౌర్యకీర్తులవిధంబున నుంటనొ కాక హేమరౌ
ప్యనగము లర్థిసాత్కృతము లై తగఁదున్కలు చేసి పంచఁడే
జనవరమౌళియై తగు త్రిశంకుతనూజుఁడు దానవైదుషిన్.

27

క.

చారుతరతత్ప్రతాపము
హేరాళంబుగ హసించు హేళిం గీలిం
గేరు సదా హీరమణి
న్గీరమణిం దద్విశుద్ధకీర్తిజ్యోత్స్నల్.

28


గీ.

హంససదృశవృత్తి నలరి స్వర్ణాగము
మాడ్కిఁ దనరి యజరమణిని బోలి
తనప్రతాపశోభ తనకీర్తి రుచి యొప్పఁ
బొలుచు నా త్రిశంకుభూపసుతుఁడు.

29


గీ.

ఆతతాయులు గననాతతాయులుగా నొ
నర్చె వసుమతీజనముల నెల్ల
ధర్మ మెడలకుండ ధాత్రిఁ బాలించుచు
నద్భుతంబుగాదె యతని చరిత.

30


గీ.

దివి నవగ్రహయుతమయి తేజరిలుట
యుచితమండ్రు హరిశ్చంద్రుఁ డుర్వియేల
భువి నవగ్రహయుతమయి పొలుపుమీఱె
నద్భుతంబౌను గద తన్మహత్త్వ మరయ.

31


క.

నీతిసమగ్రుండయ్యు న
నీతిం బాలించె ధారుణీతలము నిజ
ఖ్యాతచరిత్రము చిత్రం
బై తనరఁ ద్రిశంకు నరవరాత్మజుఁ డెలమిన్.

32

గీ.

భీమశాంతాది నృపగుణబృందములను
నాతఁడ యధృష్యుఁ డభిగమ్యుఁ డౌచునుండె
ననుచరాళికి సరఘాసమగ్రమధుర
సములచే మధుకోశము చందమునను.

33


గీ.

నాలు గయిదాఱు నెమ్మోము లోలిఁ దాల్చి
ధాతృహరబాహులేయులు దద్గుణములు
సకలముగ సన్నుతింపంగఁ జాలకున్న
జిలువయెకిమీఁడు వేయిమోములు ధరించె.

34


ఉ.

ఆపద లొందకుండ, రుజలందక యుండ, మనుష్యకోటికిం
బాపము చెందకుండ, నొకపట్లను లేములు సోఁకకుండఁగా
నేపఱిపోవ శాత్రవము లేలెఁ ద్రిశంకుజుఁ డాననద్వయ
ద్వీపము లిద్ధకీర్తి రుచిదిగ్విసరంబు సమాశ్రమింపఁగన్.

35

విజయాస్పదపురవర్ణనము

వ.

ఇట్లు మహీపాలనంబు సేయుచుండ.


గీ.

ఇందిరాసుందరీకేళిమందిరంబు
భూవధూటికి మాణిక్యభూషణంబు
సకలసౌభాగ్యరాశికి జననసీమ
పొలుచు విజయాస్పదంబను పురవరంబు.

36


క.

సలలితరంభారామా
వళు లగణితబుధు లనంతవాహినులు సము

జ్జ్వలహరులును సురమణులును
గలుగఁ బురము దివిజపురిఁ దెగడు టబ్బురమే.

37


క.

లలి నలరుగొమ్మలను న
ర్తిలి సద్ద్విజరాజ సంగతిఁ దగి సువర్ణో
జ్జ్వలమై సుమనోభినుతిం
దలరి పురముకోటతోఁట తనరు ఘనశ్రీన్.

38


సీ.

ఏమహీతలనేత యీడితసంత తా
                  శ్రితదయాళుత్వ మామ్రేడితంబు
ఎవ్వరి రూపంబు పృథువిలాసాంబుజ
                  లోచనామణుల కాసేచనకము
ఎవ్వని గుణలతాజృంభణంబునకును
                  ఘనతరన్యాయమార్గం బుపఘ్న
మే మహాభాగుసమిద్ధతీర్థ ప్రదా
                  నైకహస్తము వార్థి కూకుదంబు
అతఁడు జయరమారోహణాయితవిశాల
భుజగుణాఘాతకిణుఁడు దత్పురవరంబు
పాలనము సేయు భూజనుల్ బ్రస్తుతింపఁ
దీర్తిశాలి యుశీనరక్షితిపమౌళి.

39


గీ.

కలశవారాశియందును గల్పవల్లి
మాడ్కి నాకరమునయందు మణిశలాక

వైఖరిని నా నృపాలకవరునియందుఁ
జంద్రమతి యనుకన్యక జనన మొందె.

40

చంద్రమతీవర్ణనము

గీ.

ధీరసౌందర్యమణిసముత్తేజనంబు
నతులవాంఛాలతావసంతాగమంబు
శంబరరిపుప్రతాపాగ్నిసామిధేని
జవ్వనం బంకురించె నాచంద్రముఖికి.

41


క.

చానకు బాల్యముతోనే
నానాటికి సన్నగిల్లె నడుము కుచశ్రీ
తోనే విరివియయి పొదలెను
నాననెఱులతోనె నిగిడె నవభోగేచ్ఛల్ .

42


సీ.

విరులు నఖమ్ములు, వ్రేళ్లు పెసరగాయ,
                  లడుగు లబ్జంబులు, మడమలు వట
ఫలములు, డులులు ప్రపదములు, దొనలు జంఘ,
                  లనంట్లు దొడలు, జఘన మిల, సుడి
బొడ్డు, గౌ దివి భంగములు వళు లా
                  రహి, గిరులు చన్ను, లిగుళ్లు కరములు, భుజ
ములు లత, ల్వీఁపు కదళికాదళ, మఱుత
                  శంఖంబు, తాటిగింజ చిబుక, మధ

రంబు పవడము, ముత్తెము ల్రదము, లద్డ
ములు కపోలములు, తులము ముక్కు, చెవులు
శ్రీ ల్తొన ల్నేత్రములు, బొమ ల్సింగిణు, లర
నెల నుదురు మోము శశి కురు లళులు సతికి.

43


గీ.

వనిత నెమ్మేనఁ బొడము లావణ్యరసము
నకును సుడియయ్యె గంభీరనాభి, తరఁగ
లయ్యెఁ ద్రివళులు, శైవలంబయ్యె నారు,
లేనగువు తేట కమనీయఫేనమయ్యె.

44


గీ.

కలికిచూపులు దనసాయకములకంటె
వాఁడులై లోకవిజయధూర్వహము లౌట
నేమిపని వీనిఁ దాల్పంగ నింక ననుచుఁ
గానపా ల్చేసె దనయంబకముల మరుఁడు.

45


గీ.

అరుణరుచిఁ బొల్చు నెలనాగ యంఘ్రియుగము
లీలఁ బంకరుహశ్రీల నేల లేదె
పద్మలోచనజంఘలు బత్తళికలఁ
జెలఁగి ప్రదరాన్వితములు గాఁ జేయ లేవె.

46


చ.

వనితవిలాసభాగవయవంబులకుం బరికించి చూడఁగా
నెన మఱి లేవు వాని కవియే యెనయంచు మదిం దలంచికా
యనుపమ తన్మనోజ్ఞకరఖాకృతిగా నొనరించె నూరువు
ల్వనజదళాయతేక్షణకు వారిజసంభవు నేరు పెట్టిదో?

47

క.

చెలియఱుత ముత్తెపుసరు
ల్తెలివ్రాలని లోఁతు పొక్కిలి కలుఁగు వలన
న్వెలలి తదపేక్షఁజను చీ
మలచాలన మెఱుఁగుటారు మగువకు నలరున్.

48


చ.

మృగమదపంకిలస్తనమహీధరభూములఁ గ్రీడ సల్పఁగా
నగుతృషనాభికాసరసియందును దూకొనుకంతు నంఘ్రులం
దగులు కురంగనాభము పథంబున రేఖగఁ దోఁచె నాఁగఁ జె
న్నగుమెఱుఁగారు సారసదళాయతనేత్రకు నేత్రపర్వమై.

49


చ.

చెలియవయోనులబ్ధయగు సిబ్బెపుగుబ్బలకల్మి తొంటిలే
ముల డిగనూకఁగా నవి సముత్కటభీతిని బాఱునోఁ గటి
స్థలి దనుఁ జేరనీయక వెసం దఱుమ న్మణి పోవలేక ని
ర్మలరుచి నొప్పు వానినడుమ న్నడుమై వసించె నింతికిన్.

50


క.

కులశైలము లనరాదే
యిల నంబర మొరసియుండఁ బృథుతరకటకం
బు లఁనగరాదె పయోధర
ములు నాభాసిల్లియుండ ముదితకుచంబుల్.

51


క.

కొమచనుపూచెండు లొగిన్
స్వమృదుతఁ గెమ్మోవికెంపున కొసంగి తదీ
యమగు కఠినతఁ గొనియెఁ గా
క మహిని విరిబంతులకును గఠినత గలదే?

52

గీ.

చన్నుగొండలక్రేవల సంభవించు
బాహులతల జనించిన పల్లవములు
పడఁతి కెంగేలు, తత్కరపల్లవముల
జననమొందినకళికలు సకియగోళ్లు.

53


గీ.

శరధిశంఖంబు సతిగళస్ఫురణ కోడి
భరితదరవృత్తిఁ దనదైన శరణము చొరఁ
గమలపుట్టింటిచెలిగానఁ గడుముదమున
జడియకుమటంచుఁ జేపట్టెఁ జక్రపాణి.

54


గీ.

అతివమోము సుధానిధి యనుచు నుండ
నధర మమృతంబు గురియుట యబ్బురంబె
తరుణికుచమండలము సువృత్తత వహించి
కర్కశత్వంబు గనుట యొక్కటియ యరుదు.

55


చ.

చెలువమునెల్లఁ బ్రోవుగను జేసి ప్రవీణత నంబుజంబుల
న్నలున సృజింపరే లవికనద్ద్యుతిహీనములౌటఁ గ్రమ్మఱం
గలువలఱేనిఁ జేసినఁ బగల్ రుచిహీనుఁ డతండు నౌటఁగా
కలికిమొగంబు రేవగలు కాంతిఁ దనర్పఁగఁ జేసె నిమ్మహిన్.

56


గీ.

విద్రుమస్ఫూర్తిఁ దులకించు వెలఁదిమోవి
పల్లవస్ఫూర్తిఁ గల్పించెఁ బద్మజన్ముఁ
డఖలలోకాద్భుతస్థితి నతిశయిల్లు
నింద్రజాలంబు గావించె నేమొ చూడ?

57

క.

తమ్ములకన్నను గన్నులు
తొమ్మిదిగుణములను హెచ్చు తొయ్యలికంచుం
బమ్మ దగక్షియు గోపాం
తమ్మున వ్రాసిననవాంకతం దెలిపెఁ జెవుల్.

58


ఉ.

మేలిపసిండిచాయయును మెచ్చులు గుల్కు మనోజ్ఞవాసనల్
చాలఁగఁ గల్గినందునను సంపెఁగపూ వొకవేళఁ బోల్చినం
బోలుపవచ్చుఁగాకఁ గవిపుంగవు లేమి దలంచి పోల్చిరో
పోలికమాత్రగాక నువుపువ్వు వధూమణినాస సాటియే?

59


గీ.

ముఖజలావణ్యరసపూరమున జనించు
జలచరంబులు గాఁబోలు జలజగంథి
కలికినిడువాలుగన్నులు గాని నాడు
తద్దఁ జపలతఁ గాంచునే తలఁచిచూడ.

60


చ.

ఇరులు గుహాశ్రయంబు గనియె న్జలదౌఘములెల్ల ధారుణీ
ధరమున కేగె షట్పదవితానము కంజవనంబుఁ జొచ్చె సుం
దరహరినీలజాలము తృణంబు గ్రసించెఁ దదీయనైల్యభా
గురుకచమంజిమంబునకు నోడిసుమీ పరికించి చూడఁగన్.

61


ఉ.

కన్నుల చంచలత్వమును, గబ్బిచనుంగవ కర్కశత్వము,
న్నెన్నడమాంద్యముం, గురుల నెక్కొనవక్రత, కౌనుకార్శ్యము,
న్సన్నుతికెక్కెనో నచలసంపద బోఁటి కటింధరించుట
న్వన్నియ కెక్కవే యవగుణంబులు మిక్కిలికల్మి యున్నెడన్.

62

గీ.

గంధగజరాజగామినికనదుదార
హారమణిశర్కరిలకుచాహార్యవిహర
ణమున శ్రమమందఁడయ్యెఁ గందర్పకుండు
భవ్యనిశ్వాసపవనసంప్రాప్తికతన.

63


సీ.

భూభృద్గరిమఁగన్న పొలఁతుకచనుదోయి
                  యరిజయోన్నతిఁ గాంచు టబ్బురంబె!
కరికరాకృతిఁ గాంచు కలకంఠియూరువు
                  లనఁటికంబముల పెం పడఁచు టరుదె!
చంద్రబింబముఁబోలు జలజాస్య నెమ్మొగం
                  బంబుజంబుల గర్వ మడఁచు టరుదె!
చక్రవర్తులలీల సంగ్రహించుపిఱుందు
                  ద్వీపవిజయశక్తిఁ దివురు టరుదె!
యలరుదీగియతో నుద్దియయినయట్టి
కొమ్మ నెమ్మేను వలపులు గొలుపు టరుదె!
విద్రుమస్ఫూర్తిఁ దులకించు వెలఁదిమోవి
కిసలయమనోజ్ఞరుచిఁ దిలకించు టరుదె!

64


గీ.

పరిమళము లేక యుంట బంగరుసలాక
కలికినెమ్మేనితో నుద్ది గాకపోయె
జంపకంబు శిరీషప్రసవమృదుత్వ
గౌరవము లేమి మాదిరిగాకపోయె.

65

సీ.

మేను మించులఁ జేసి వాని చాంచల్యంబు
                  వాలుఁగన్నులయందుఁ గీలుకొలిపి,
శశి నెమ్మొగ మొనర్చి చంద్రునందలి కప్పు
                  కుటిలాలకములందుఁ గుదురుపఱిచి,
కెంపు వాతెఱఁ జేసి కెంపుకాఠిన్యంబు
                  బటువుగుబ్బలయందుఁ బాదుకొలిపి,
విరులు గోళ్లొనరించి విరులసౌరభ్యంబు
                  నిట్టూర్పుగాడ్పుల మట్టుపఱిచి,
నలువ గావింపఁబోలు నీ చెలువ నౌర!
యనఁగఁ జెలువొందె నాచాన హంసయాన
యమృతపుంబావి యరిదియందములదీవి
యాణిముత్తెమ్ము వలరాజునలరుటమ్ము.

66


వ.

ఏతాదృశశ్లాఘాలంఘనజాంఘికసౌంద
ర్యాతిశయంబునం బ్రవర్తిల్లుచు;


క.

వనజాక్షి హరిశ్చంద్రుని
కనదాకృతిరేఖ చిత్రకారులవలనం
గనియును, దచ్చరితంబును
వినియు, నతఁడ తనకుఁ దగినవిభుఁడని తలఁచెన్.

67


క.

జనపాలకుడౌశీనరి
కనదాకృతిరేఖ చిత్రకారులవలనం

గనియును దత్సౌశీల్యము
వినియు నదియ తనకుఁ దగినవెలఁదని తలఁచెన్.

68


మాలిని.

తరుణశశివతంసా, తాపసాంభోజహంసా,
కరిదనుజవిదారా, కాశికాంతర్విహారా,
దురితహరణశీలా, దోర్విభాసిత్రిశూలా,
సరసగుణనికాయా, శైలకన్యాసహాయా!

69


క.

సంయుధ్ధితోగ్రదనుజ శు
భంయుగుణ ధరానిలశిఖిభానుశశినభః
కంయజమానమయాత్మక
సంయమిజనవినుతచరణ! సర్పాభరణా!

70


గద్య.

ఇది శ్రీమదశేషమనీషిహృదయంగమమృదు
పదనీరంధ్ర శుద్ధాంధ్రరామాయణఘటనావైదుషీ
ధురంధ రాడిదము బాలభాస్కరకవితనూభవ సరస
కవిత్వవైభవ సౌజన్యనిధాన సూరయాభిధాన
ప్రణీతం బయిన కవిజనరంజనం బను మహా
ప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.