కవికోకిల గ్రంథావళి-3: నాటకములు/మాధవ విజయము





మాధవ విజయము

20-2-1925

నాటకపాత్రలు

________

పురుషులు

శాంతవర్మ వసంతపురాధిపతి.
మాధవవర్మ శాంతవర్మగారి సాకుడు బిడ్డ.
రాజశేఖవర్మ శాంతవర్మగారి కుమారుఁడు.
విజయవర్మ హోమనగరాధిపతి.
సమర సేనుఁడు సేనాధిపతి.
అచ్యుతవర్మ సుబేదారు.
లతీఫ్‌సాహెబు పాతాళగృహద్వారపాలకుఁడు
పరిచారకులు, భటులు, ద్వారపాలకులు.

- స్త్రీలు. -

_______

యశోధర శాంతవర్మగారి భార్య.
మనోరమ శాంతవర్మగారి కుమారిక.
మాలతి విజయవర్మగారి అన్నకూఁతురు.

మాధవ విజయము.

స్థలము 1 : హేమనగరము.

[విజయవర్మ విశ్రాంతిమందిరమున అటు నిటు తిరుగు చుండఁగా తెర యెత్తఁబడును]

విజయవర్మ : మధ్యాహ్నము కావచ్చినను వీరేల యింకను ప్రయాణ సన్నాహము కావింపకున్నారు? సేవకుఁడు మొదలు సైన్యాధిపతివఱకు అందఱును సోమరిపోతులు ! ఎంతటినేరమునైన మన్నింతునుగాని, సోమరితనమును మాత్రము మన్నింపఁజాలను.

[సమరసేనుఁడు ప్రవేశించును]

విజ : సమరసేనా, యేల యీ యాలస్యము?

సమరసేనుఁడు : గంతగుఱ్ఱములకు సామాను లెక్కించుచున్నారు. నెలదినముల ప్రయాణమునకు వలయు పదార్థములు సిద్ధము చేయించితిని. ఇంకనొక యరగడియలో మనము బయలుదేరుదము.

విజ : తమయింట రెండుదినములు బసచేయవలయునని శాంతవర్మ గారు మన కాహ్వానము పంపిరి.

సమ : మన ప్రయాణమున కభ్యంతరమగునుగదా!

విజ : [చిఱునవ్వుతో] ఆ యాహ్వానము తెప్పించుటకే యీ ప్రయాణము.

సమ : [ఆశ్చర్యముతో] ఏమీ! - ఉత్కళదేశ ప్రయాణము నెపము మాత్రమేనా? [కొంచెము తలయూఁపుచు] పూర్వమువలె మీ రహస్యము లెఱుఁగఁదగునంతటి విశ్వాసపాత్రుఁడను కాకపోయితిని. పనిదీఱిన వెనుక పనిముట్టు త్రుప్పుపట్టుటలో నాశ్చర్యమేమి గలదు?

విజ : సమరసేనా, కొలఁది దినములనుండియు నిష్ఠురముగ మాటలాడుట నీ కలవాటుపడిన ట్లున్నది. నాలోపము నాధారము చేసికొని నాస్నేహితమును నీచముగ దుర్వినియోగపఱచుచున్నావు. నీసాహాయ్యమునకు తగిన యుపకారము నొనర్చితిని. మాయన్న గారి పరిపాలనా సమయమున తక్కువ యుద్యోగమునందున్న నీకు క్రమక్రమముగ సైన్యాధిపత్యము నొసంగితిని. నీకింకను తృప్తికలుగదు. వివేచనా రహితమైన నాయంగీకారమె నీయత్యాశకు సోపానమైనట్లున్నది.

సమ : ప్రభువు లేమి మాటాడినను న్యాయముగనే యుండును. ప్రయోగదక్షులు ఫలసిద్ధికొఱకు ఎంతటికార్యములనైన నొనరింతురు. ఉదారహృదయులైన మీరు కనికరించి నాకు మహాదానమొనరించితిరని యనుకొండు.

విజ : నీ యుద్యోగము నీయోగ్యతకు తగిన బహుమతియనుకొంటివా?

సమ : నా సాహాయ్యమునకు మించని పదవియనుకొంటిని.

విజ : [స్వగతము] నాగుట్టంతయు వీనిచేతిలోనున్నది. విరోధ మపాయకరము. [ప్రకాశముగ] సమరసేనా, నీవు చెప్పినది యథార్థమె. నీఋణము పూర్ణముగ నేను తీర్చుకొనఁజాలను. మనయిరువురిలో నొకరి కొకరికి తెలియరాని రహస్యములులేవు.

సమ : [స్వగతము] విజయవర్మ నా ప్రాముఖ్యము నిప్పుడు గుర్తెఱుఁగుచున్నాఁడు. [ప్రకాశముగ] శాంతవర్మగా రింట మీ రేల బసచేయవలయును?

విజ : శాంతవర్మకు రమణీయవతియైన యొక కుమారిక కలదు. నే నా కాంతను బెండ్లియాడఁ దలంచుకొంటిని.

సమ : ఎంతకాలమునకు సంతోషవార్తవింటిని! అట్లయిన వసంత పురమువఱకె మన ప్రయాణము?

విజ : అవును!

సమ : ఇంత సిబ్బందియు ఇన్ని పదార్థములు అనావశ్యకము కదా?

విజ : మనము దూరప్రయాణము చేయువారివలె నగపడవలయును. నీవు పోయి తొందరగ ప్రయాణ సన్నాహము కావింపుము. అచ్యుతవర్మ కూడ మనతోడ రావలయును.

సమ : అట్లె! [నిష్క్రమించును]

విజ : సమరసేనుఁడు తన ప్రయోజనమును తానెఱుంగును. ఆతఁ డెన్నటికైన అపాయకరుఁడు. ఇప్పటికేనా యవివేకమునకు తగిన శిక్ష నొందితిని. నేను రాజ్యము నేలిన ఆతఁడు నన్నేలుచుండును. ఈకంటిలోని నలుసును తీసివేయునంతవఱకు నాకు సుఖ నిద్రయుండదు.

[సైనికుఁడు ప్రవేశించును.]

సైనికుఁడు : మహాప్రభూ, సిబ్బంది పయనమగుచుండఁగా ఏదో యొక దుశ్శకునము గలిగెను. తరువాత దేవరయాజ్ఙ.

విజ : ఓరీ, మూఢమతుల కేది దుశ్శకునమో అదియే ధీమంతులకు శుభశకునము. నేను తలంచిన కార్యమునకు విఘ్నము వాటిల్లదు. ఇప్పుడే కదలవలయును. నాగుఱ్ఱము నాయత్తపఱపింపుము. పొమ్ము.

సైని : ఆజ్ఞ [నిష్క్రమించును]

విజ : తమకార్యములెల్లను పూర్వనిర్ణీతములని భ్రమించు అవివేకులను జూచినప్పుడెల్ల నాకు జాలికలుగుచుండును. సంకల్పశూన్యుల కంతయు పూర్వనిర్ణీతమె. దౌర్బల్యమునకు మంచి యాశ్రయ మీమెట్టవేదాంతము!

ఏల యింకను ఆలస్యము? [నిష్క్రమించును.]

_________

స్థలము 2 : వసంతపురము.

_______

[రాజప్రసాదమున నొక గది. శాంతవర్మ పట్టుమెత్తలు కుట్టిన సోఫాపై కూర్చుండియుండును. యశోధర దగ్గఱగా నొకపీఠముపై కూర్చుండియుండును. తెరయెత్తఁబడును]

శాంతవర్మ : మన పిన్ననాఁటి కాలము వలెకాదు. ఇప్పు డంతయు తలక్రిందుగ మాఱిపోవుచున్నది. మహాభారతమును వ్రాసిన వ్యాసమహార్షి ఏమంత తెలివి తక్కువవాఁడా? కలియుగ ధర్మమునంతయు ముందుగనె యోచించి వ్రాసి పెట్టెను. ఇప్పుడంతయును తూచా తప్పకుండ జరుగుచున్నది. ఈకాలమున పిన్న యెవఁడు? పెద్దయెవఁడు? లేకున్న తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినకపోవుదురా?

యశోధర : ఈ కొద్దిపాటివిషయమును మీరింత గొప్పచేసి చింతించుట యెందుకు? మనోరమ లేక లేక కలిగిన చిన్నారి కూఁతురు. నిండు గారాబమున సాఁకి సంతరించితిమి. కావుననే కన్యాత్వసహజమైన చనవుతో అంతవిడువక పట్టు పట్టి యున్నది. ఆబిడ్డ కింకను పెండ్లియీడు మించలేదు.

శాంత : పదునేడేండ్లు నెత్తికివచ్చిన కన్యక యింకను ఒడిలోని పసిపాప యనుకొంటివా?

యశో : మనోరమ వినయవివేకములులేని బాలిక కాదు.

శాంత : బాలిక!

యశో : నేను బ్రతిమాలినప్పుడెల్ల "అంత తొందరయేమి?" అని నన్ను వారించుచుండును.

శాంత : యుక్తవయస్కను అవివాహితనుగ నింట నుంచికొనుట యుచితముకాదు. ఆఁడువారి మర్మములు ఆఁడువారికే తెలియును. మనోరమ మనస్సు ఎవనియందైన లగ్నము కాలేదుగదా?

యశో : [చిఱునవ్వుతో] నేనుకూడ అట్లే సందేహించి యడిగితిని. సిగ్గుచేత తలవంచుకొని మాటాడదు.

శాంత : అట్లయిన ఏదోకొంత దాపఱికమున్నది. ఎంతతెలివిగల వారైనను కన్యలు కన్యలే గదా! మనము బాల్యచాపల్యమును గౌరవింప రాదు - సాధ్యమయినంతవఱకు పూర్వాచార గౌరవమును నాచేతులార భగ్నము చేయను.

యశో : యోగ్యులయిన వరులు మీదృష్టిలో నెవరైన నున్నారా?

శాంత : నేను చాలకాలమునుండి యోచించుచున్నాను.

                      "శ్రీయును కులమును రూపును
                       ప్రాయము శుభలక్షణంబు, బాంధవ విద్యా
                       శ్రేయము గల వరునకు"

కన్య నియ్యవలయునని మహాభారతములో వ్యాసభగవానులు నొక్కి చెప్పియున్నారు. బిడ్డలయెడ తల్లి దండ్రుల బాధ్యత అంతతేలిక గాదు సుమా.

యశో : అయితే యింతవఱకు మీరు వరుని నిర్ణయింపలేదు?

శాంత : ముప్పాతిక పాలు నిర్ణయించినట్లే. మరల ఆలోచించి రేపు చెప్పెదను - నీవెవరినైన నిశ్చయించితివా?

యశో : నానిశ్చయముతో ఏమిప్రయోజనము? మీయిష్ట మేగదా నెరవేరవలయును. మనోరమ యిప్పటికిని పసిబిడ్డవలె పెరుగుచున్నది.

శాంత : ఆమాటనే నే ననవద్దని చెప్పినది.

యశో : నన్ను చూడనిదే యొక్కనిమిషమైన నుండలేదు. నాకును అట్టిమరులే యున్నది.

శాంత : అట్లయిన కూఁతురికి పెండ్లిచేయవా?

యశో : ఎవనినైన నొక జమీందారుకుమారుని ఇంట నుంచుకొని మనోరమ నియ్యవలయునని నాకోరిక. అందఱ మొక్కచోటనే యుందుము.

శాంత : [నవ్వుచు] ఔనౌను! స్త్రీజన సహజమయినదే యీ కోరిక! ఎవనినో యొక యనామకును తెచ్చుకొని ఇంట, నుంచుకొనవలయును, ఆతనికి కూఁతురి నియ్యవలయును! ఆడు గడుగునకును పారతంత్ర్యమను భవించుచు, అదవ త్రావుడు త్రావుచు, దెప్పెనలను సహించుకొనుచు, లజ్జలేని కీలుబొమ్మవలె ఆతఁడు అంత:పురమున కొలువుదీరి యుండవలయును ! మనకూఁతు రా దురదృష్టవంతునిపై అధికారము చేయుచుండుటచూచి మన మానందింపవలయును! చక్కనియూహ!

యశో : ఏల మీరిట్లు గేలిసేయుచున్నారు? ఆతఁడేల యనామకుండుగ నుండవలయును? ఏల యదవ త్రాగుడు త్రాగవలయును?

శాంత : ఇంకను వివరింపుమందువా? మనకొక కుమారుఁడు కలఁడు. మనకన్న తక్కువ శ్రీమంతుఁడు కానిదె యేజమీందారుని కుమారుఁడైన మన యింట బ్రతుకుట కిష్టపడఁడు. ఆకు ముల్లుపైఁ బడినను ముల్లు ఆకుపైఁ బడినను ఆకే చినుఁగును. యశోధరా, ఇల్లఁటము నీచము. నీవొక్కకూఁతురి సంగతినే తలపోయిచున్నావు. నేను అల్లుని విషయముగూడ ఆలోచించు చున్నాను. ఆతఁడెంతటి స్వాతంత్ర్య ప్రియుఁడయ్యును మనయిష్టానుసారమె ప్రవర్తింపవలయును.

[రాజశేఖరుఁడు ప్రవేశించును.]

శాంత : రాజశేఖరా. సమయమునకే వచ్చితివి. కూర్చుండుము?

రాజ : [తండ్రిప్రక్కనకూర్చుండి] అవును! సమయమునకే వచ్చితిని, నేఁడే సర్దారు పంజాబు గుఱ్ఱముల బిడారును వజ్రపురికి కదలించుచున్నాఁడు. ఈసమయము తప్పిన నొకకుంటి గుఱ్ఱము కూడ మనకు దొఱకదు.

శాంత : గుఱ్ఱపు బిడారేమిటి?

రాజ : పంజాబుసర్దారు కందుకకేళి యలవడిన బొమ్మలవంటి యవనాశ్వములను అమ్మకమునకై మన పట్టణమున నిల్పియున్నాఁడు.

శాంత : రాజశేఖరా, నీ కందుకకేళి పిచ్చి మితిమీరుచున్నది. నిరుడు కొన్నవికాక ఈ యేడును గుఱ్ఱములు కొనవలయునా? ప్రతిసంవత్సరమును వానిపోషణమునకు తరిబీదునకు రెండులక్షల రూపాయలు ఖర్చు పెట్టుచున్నావు. ఒక్క పందెమైన గెలిచితివా? మహాభారతమున -

రాజ : [విసుగుతో] మీ మహాభారత పురాణ శ్రవణమునకు తీఱికలేదు. నేను పదిగుఱ్ఱములు కొనవలయును.

యశో : [కన్నురుముచు] ఆ! శేఖరా, నీవింకను మట్టు మర్యాదలు నేర్చుకొనవు.

శాంత : [కోపముతో] ఈ యవిధేయత నేనొక్కక్షణమై నోర్చుకొనను. [భార్యతట్టుతిరిగి] ఇదియంతయు నీగారాబము - నీ చనవు - వీనికి తృణీకరభావము తుంటరితనము హెచ్చి పోవుచున్నది. మాధవునికిని వీనికిని ఎంతయో తారతమ్యము గలదు.

రాజ : అవునవును. మాధవుఁడు మీకడుపునఁబుట్టిన బిడ్డకదా!

శాంత : కాకపోయిన నేమి? పరాయిబిడ్డయే యోగ్యుఁడుగ నగపడుచున్నాఁడు.

యశో : కుమారునిబాల్య చాపల్యమును మన్నింపుఁడు. ఇంకను ఆటప్రాయమేగదా. [రాజశేఖరునికి కనుసైఁగచేయుచు]

రాజ : నాతొందరపాటు మన్నింపుఁడు.

శాంత : నీవు మహాభారతమును చదివి మట్టు మర్యాదలు నేర్చుకొనవలయును.

రాజ : [మంచిబిడ్డవలె] అటులనె చదివెదను.

శాంత : శేఖరా, మే మిరువురము మనోరమ వివాహ విషయము మాటాడుచుంటిమి. ఎవనినైన నొకని యిల్లఁటముతెచ్చి పెట్టవలయునని మీతల్లి కోరిక. నీయభిప్రాయమేమి?

రాజ : [ఆశ్చర్యముతో] ఇల్లఁటమా! నాకుసమ్మతముగాదు.

యశో : ఎందువలన?

రాజ : ఒక యొరలో రెండుకత్తులు మెలఁగుటకు వీలులేదు.

శాంత : నిజము, నిజము.

రాజ : ఇప్పటికే మాధవునితో నాతల విసిగి బట్ట కట్టుచున్నది. ఆతఁడొక మహారాజు కొమారునివలె లేనిపోని యాత్మగౌరవముతో విఱ్ఱవీఁగు చుండును. ఎవనినో యొక యజ్ఞాతజన్ముని మనము సాఁకి సంతరించినంత నె యా దరిద్రుఁడు మనతో సాటియగునా? మాధవుఁడు నన్నొక పూరిపుల్లకు కూడ సరకుచేయఁడు. కొఱవితో నెత్తి గోకికొనునట్లు ఆతఁడొకఁడు చాలక మఱియొకనిని తెచ్చి పెట్టుకొనవలయునా?

శాంత : నీవు దురభిమానివి. మాధవుఁడు అవిధేయుఁడు గాఁడు మన సంస్థానమున పెరిగిన బిడ్డ మనవలె నుండక మఱి యెట్టులుండును?

రాజ : పుట్టుకలో తారతమ్యములేదా? రాజసము మనకు సహజముగాని యేబిచ్చకత్తె బిడ్డకో అది యెట్లు తగియుండును?

శాంత : ఆతఁడు బిచ్చకత్తె బిడ్డయేయైయుండిన యెడల అంతటి రూపలావణ్యము, అంతటి గౌరవప్రీతి యలవడియుండదు. ఆతని జన్మరహస్యము ఎపుడైన నొకప్పుడు వెల్లడికాకమానదు. అప్పుడు మనము పశ్శాత్తప్తులము కావలసిన యవసరము నుండదు.

రాజు : నాకన్న నాతడంత రూపవంతుఁడా? గొప్పతనమంత కాఱిపోవుచున్నదా? ఎత్తి పెంచిన మరులు మిమ్మట్లు పలికించుచున్నది. సమయము వచ్చినపుడు మాధవుఁడు తనయంతరమును దా నెఱుంగునుగాక!

శాంత : శేఖరా, నిష్కారణముగ మాధవుని అవమానించిన నిన్ను మన్నింపను.

రాజ : [చివుక్కునలేచి] నేను సర్దారుతో మాటాడవలయును. [నిష్క్రమించును]

యశో : మాధవునిపై రాజశేఖరునకు అసూయ నానాఁటికి హెచ్చు చున్నది. వారిరువు రిఁకమీఁద పొంది పొసఁగి యుండుట దుర్లభము.

శాంత : నా కిరువురును సమానులే! మాధవుని గౌరవ ప్రీతి మనవానికి గిట్టదు. అసూయ నింద్యమని మహాభారతములో చెప్పఁబడియున్నది.

[మాధవవర్మ ప్రవేశించును.]

శాంత : మాధవా, యేమి?

మాధవవర్మ : విజయవర్మగారి విడిదికై మోతీమహలును సిద్ధపఱపించితిని. వారు మన పట్టణము దాపునకు వచ్చిరని పోలిమేరకాపు చెప్పిపంపెను.

శాంత : మఱచియుంటిని. ఎదురేఁగుటకు కొంత సిబ్బందితో రాజశేఖరుని పంపెదము. గుఱ్ఱపు రౌతులను ఆయత్తపఱచుము.

మాధ : అట్లే. [నిష్క్రమించును.]

శాంత : మాధవుని చూచినప్పు డెల్ల నాకు వాత్సల్యముతోడ గౌరవమును కలుగుచుండును. ఆతని మొగముపై నేదో గంభీరమైన చింత పొడకట్టుచుండును. నీ వెప్పుడైన గమనించితివా?

యశో : అవునవును! మాధవుని చిఱునవ్వు నే నెప్పుడును చూచి యెఱుఁగను.

శాంత : అదినాకుఁగూడచిత్రముగ తోఁచినది.

యశో : మనమెంత ప్రేమతోనాదరించినను సొంతతల్లిదండ్రులు లేని లోపమును పూర్తి చేయఁజాలము.

శాంత : మాధవునికిఁగూడ పెండ్లియీడు వచ్చినది. ఆతఁడు స్వతం త్రముగను గౌర వోచితముగను బ్రతుకుటకు మనబాధ్యత నెట్లు నెరవేర్పవలయునో నాకు తోఁపకున్నది.

యశో : ప్రస్తుతము విజయవర్మగారి యాతిథ్యమునకు వలయు ఏర్పాటులు చేయించుఁడు.

శాంత : చక్కగ జ్ఞప్తిచేసితివి [లేచి] మతిమఱపు వార్థక్యమునకు అనివార్యముగ నున్నది. [నిష్క్రమించును.]

యశో : మనోరమ మాధవుని చూచినపుడెల్ల నాకు పట్టరాని దు:ఖము కలుగుచుండును. ఇరువురికి చక్కని యీడుజోడు. వారిచేష్టలు చూపులు అనురాగ గర్భితములుగ కనుపట్టుచుండును. అయ్యో! సఫలముగాని కోరికలె మిక్కిలి యనురూపముగ నుండును!

[మనోరమ ప్రవేశించును.]

మనోరమ : [అమ్మను కౌఁగిలించుకొని] అమ్మా, ఒంటిరిగా కూర్చొనియేమి చేయుచున్నావు? ఇప్పుడు మనయింటికి అతిథు లెవరో వత్తురఁటకదా!

యశో : నిజమేనమ్మ.

మనో : ఆ జమీన్ దారుని గురించేనా నాయన సమయము దొరకిన నప్పుడెల్ల చాల గొప్పగా పొగడుచుండినది?

యశో : అవును! మీనాయనగారు అల్లుని సంపాదించు కొనుచున్నారేమొ!

మనో : [ఆశ్చర్యముతో] ఏమీ! అమ్మా, నీవుకూడ నన్ను ఎగతాళిపట్టించుచున్నావు?

యశో : కాదు కాదు; మీనాయన యుత్సాహముచూచి నేనటూహించితిని; ఒకవేళ విజయవర్మయె తగిన వరుఁడని మీ నాయన నిర్ణయించిన నీవేమి తలంతువు?

మనో : నే నా వరునికి అర్హముకాని వధువును.

యశో : ఆ వరుఁడే నిన్ను వరించునెడల?

మనో : వివాహము మానుకొందును.

యశో : తల్లిదండ్రుల నవమానించి నట్లౌనుగదా?

మనో : బ్రతికియున్న వారికిఁగదా యావిచారము!

యశో : (మనోరమను ప్రక్కకుఁ జేరఁ దీసికొని) మనోరమా, నీ రహస్యము చెప్పుకొనుటకు నాకన్న నమ్మకము గలవార లెవరుందురు? తల్లికి కూడ తెలియరానంత దాపఱిక మేమున్నది? నా యెదుట నీకేమి సిగ్గు?

మనో : అమ్మా, నేను దురదృష్టవతిని, [తల్లియొడిలో వ్రాలి దు:ఖించును.]

                      అంటరాని పాపాత్మక యంచుఁ దలఁచి
                      యముఁడె ద్వేషించి నన్ విడనాడె నేని
                      ఏకభుక్తంబు వెలిచీర హితవు గాఁగ
                      బ్రహ్మచర్యంబు వహియించి బ్రతుకుదాన.

యశో : చిట్టి తల్లీ, ఏల యిట్లు లోలోన కుములుచున్నావు? ఇంత నిరాశ యెందుకు?

                      కలుగునొ యాఁడుబిడ్డ యని కానక కానక నిన్నుఁగంటిఁ గాం
                      త లెపుడు సల్పియుండని వ్రతంబుల నోముల నాచరించి; నీ
                      లలితపుఁగాలు సేతులు నిలాతల మంటినఁ గందునంచుఁబు
                      వ్వులు పఱపించితిన్ గునిసి పోకల నీవటు దోఁగియాడఁగన్.

ఉయ్యెలను సైతము నమ్మలేక నిన్ను నా యొడియందె యుంచుకొని సాఁకితిని, అట్టినీవు నాయెదుట "అమ్మా నేను దురదృష్ట వతిని" అని పల్కిన మాట నాహృదయమును చీల్చివైచినది. నా కడుపులోమంట పెట్టినది. నేనును ఆఁడుపుట్టువు పుట్టినదాననె. నీ వనుభవించుచున్న దు:ఖమును ఒకప్పుడు నేనును అనుభవించితిని; నీ కోరికను తండ్రి గౌరవింపకుండిన నుండునుగాక? తల్లియేల యాదరింపకపోవును?

మనో : [కొంచెము లజ్జతో] అమ్మా, మాధవుని సహవాసము లేని దిన మొక్కయుగముగఁదోఁచుచుండును. ఆయనతోడ పాచికలాడుచున్న తరుణమున కాలము నిర్దయముగ నెగిరిపోవుచుండును. అమ్మా, యీసంగతి తండ్రికెఱిఁగింప వలదు. నా యపరాధమునకు మాధవుఁడు శిక్ష ననుభవింప వలసి వచ్చును.

[రాజశేఖరుఁడు ప్రవేశించును.]

రాజశేఖరుఁడు : విజయవర్మగారు వచ్చిరి. మీ రిఁక అంత:పురములోనికిపొండు.

[అందఱు నిష్క్రమింతురు]

________

స్థలము 3 : విడిది గృహము.

________

[విజయవర్మ సోఫాలో నానుకొనియుండును. ప్రక్కన చిన్నకూజాపైని పళ్ళెరములో పన్నీరుచెంబు, గంధపుగిన్నె, వెలిగించిన సాంభ్రాణివత్తులు, పండ్లు పెట్టఁబడియుండును. పరిచారకుఁడు సురటివేయుచుండును. తెర యెత్తఁబడును.]

విజయవర్మ : [స్వగతము] అన్నియు నాయభీష్టమునకు అనుకూలముగనె జరుగుచున్నట్లున్నవి!

[శాంతవర్మ ప్రవేశించును]

విజ : [లేచి] విచ్చేయుఁడు!

శాంతవర్మ : [కూర్చుండి] చాలదినములకు పునర్దర్శనము! మీకు కుశలమేగదా?

విజ : [కూర్చుండి] మీబోఁటి పెద్దల యాశీర్వాదమువలన మాకందఱకు కుశలమె. ఆదరణ పురస్పరమైన మీ యాతిథ్యమును గుఱించి మీ యెదుట చెప్పుట ముఖస్తుతిగ నుండవచ్చును. నన్ను మీబంధువర్గములో నొక్కనిగ తలంచి గౌరవించితిరి.

శాంత : మీరు మా యాతిథ్యమును స్వీకరించుట కంగీకరించుటయే మా భాగ్యము.

విజ : నేనంత వినయమునకు పాత్రుఁడనుగాను.

శాంత : మార్గాయాసము శ్రమించునట్లు కొంత విశ్రమింపుఁడు. క్రొత్తస్థలమని మీసౌఖ్యమునకు భంగము కలిగించుకొనఁబోకుఁడు.

విజ : మీ సౌజన్యమువలన నా కిది పరస్థలముగ తోఁచుటలేదు.

శాంత : మీబంధుప్రీతి కొనియాడఁదగినది [స్వగతము] నామనస్సు కూడ ఈతని వంకకే పరుగెత్తుచున్నది. మనోరమకు ఈతనినే దైవము నిర్దేశించెనేమో! [ప్రకాశముగ] రఘుపతివర్మగారిని నే నెఱుంగుదును. వారికి మీ రేమి కావలయును?

విజ : ఆయన న సవతితల్లి కుమారుఁడు. పెద్దవాఁడు; వేఁటలో పులివాతఁబడి మరణించెను.

శాంత : అవునవును! ఆయన యకాలమరణమును విని మేమును దు:ఖించితిమి. రఘుపతివర్మగారి కొక కుమారుఁడుండెనని విని యుంటిని.

విజ : దురదృష్టవశమున ఆబిడ్డయు విషజ్వర పీడితుఁడై పసిప్రాయమందె మరణించెను. ఒక్క కుమారిక మాత్రము కలదు.

శాంత : అయ్యో! అట్టులనా? ఈప్రస్తావము మీకు దు:ఖము పురికొల్పినట్లున్నది!

విజ : పదునెనిమిది సంవత్సరములు గడచినను స్మృతియింకను క్రొత్తదిగనేయున్నది.

శాంత : మీరు వివాహ ప్రయత్నము లేమియు చేసియుండలేదా?

విజ : ఎన్నిప్రయత్నములు చేసినను దైవానుకూల్యము లేనిదే ఫలింపవు.

శాంత : [స్వగతము] దైవభక్తిసంపన్నుఁడు. [ప్రకాశముగ] మామలేని లోపమును నా వలన తీర్చుకొన తలంచితిరి. నేనాలోపమును యథార్థముగ పూరింప సమకట్టితిని.

విజ : మీ మాటలు నా కర్థమగుటలేదు!

శాంత : నా కొక కుమారిక కలదు.

విజ : [ఆశ్చర్యము] అటులనా? నేను వినియుండలేదు. నాభాగ్యము ఫలించినది.

శాంత : మీవంటి యల్లుఁడు మాకు దొరకుట పూర్వపుణ్యము! మీయంగీకారమును అంత:పురమున తెలిపివచ్చెదను.

విజ : అంత తొందర పడకుఁడు. ఈ సంబంధము మీకు నచ్చినట్లు తక్కినవారికి నచ్చవలయునుగదా?

శాంత : వారెవ్వరును నా కవిధేయులుగ నుండఁజాలరు. ఎవడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : స్వామి!

శాంత : మాధవుని యిచ్చటికి రమ్మనుము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

శాంత : మాధవునితో మీరు ప్రొద్దుపుచ్చుకొనవచ్చును. ఆతఁడు వివేకి; మట్టుమర్యాద లెఱిఁగిన గుణవంతుఁడు.

[మాధవవర్మ ప్రవేశించును.]

విజ : కూర్చుండుఁడు.

మాధవవర్మ : [నిలిచియుండును]

విజ : అయ్యా, యీయన మీపుత్రుఁడా?

మాధ : [చింతతో మొగము వ్రేలాడవేసుకొనును] [స్వగతము] ఈనిష్కపటహృదయుఁడు నా యనాథచరిత్రమంతయు చెప్పివేయునేమో.

శాంత : కాదు, కుమారునివలె పెంచుకొంటిమి.

విజ : [స్వగతము] మాలతి పోలికలు ఈతనిమొగమునందు పొడకట్టుచున్నవి. [ప్రకాశముగ] ఏమీ! మీ యౌరసుఁడు కాఁడా?

మాధ : మరల ఇప్పుడే వచ్చెదను. [నిష్క్రమించును]

శాంత : ఇప్పటికి షుమారు పదు నెనిమిది సంవత్సరములకు పూర్వము ఒక నాఁటిరాత్రి ఎవరో మా హజారపు సోపానములపై వానిని పడవేసిపోయిరి. ప్రొద్దున నే పరిచారిక యొకటి మా కీసంగతి యెఱిఁగించెను. మేము పోయి చూచితిమి. ఆబిడ్డ మృతినొందినవానివలె నగపడెను. అంతట వైద్యుని రప్పించి పరీక్షింపఁజేసితిమి. శిశువునకు మూర్ఛరోగమనియు కొంతసేపటికి స్మృతికలుగవచ్చుననియు ఆతఁడు చెప్పెను.

విజ : వింతగా నున్నది!

శాంత : మధ్యాహ్న మగునప్పటికి ఆబిడ్డ యేడువసాగెను. మా కప్పటికి సంతానము లేనందున దైవదత్తమని ఆపసిబిడ్డను పెంచుకొంటిమి.

విజ : అప్పటి కా బిడ్డకు ఎంత వయస్సుండినది?

శాంత : బహుశా మూడు సంవత్సరము లుండవచ్చును.

విజ : ఆ పరిచారిక యిపుడున్నదా?

శాంత : రెండుసంవత్సరములకు పూర్వము మరణించినది.

విజ : ఓహో!

శాంత : మాధవుఁడెచ్చటికి పోయెను? - మీరు కొంచెము విశ్రమింపఁడు.

[నిష్క్రమించును.]

విజ : [ఆలోచనామగ్నుఁడయి తిరుగుచు] - పదునెనిమిది - సంవత్సరములకు పూర్వము! - అప్పటికి రెండుమూడు సంవత్సరముల బాలుడు! - స్మృతితప్పి మృతునివలె పడియుండెను! ఇంతవఱకు కొంచె మించుమించు సరిపోవుచున్నది! మాలతి మొగము పోలికలు గలవాఁడు మఱియెవ్వఁడుగ నుండును? ఓ! వంచింపఁబడితిని. ఆవైద్యుఁడు నన్ను మోసగించి విషమునకుమాఱు మరణమువంటి మైకము కప్పించు నేదియో మత్తుపదార్థమునిచ్చియుండును. అవునవును! బాలునిశవమును దహనము చేయవలయునని నేనంటిని. శిశువు గావున భూమిలో నిక్షేపించుట యుక్తమని ఆవైద్యుఁడు చెప్పెను. ఆ నాఁటి రాత్రియే నిక్షేపింపఁబడెను. ఆతఁడే రహస్యముగ ఆ శిశువును తెచ్చి సంతానరహితులైన వీరి హజారపు ముంగిట ఏలయుంచి పోయియుండరాదు? తరువాత రెండుమూడుదినములకే యాతఁడు కాశీయాత్రకనిచెప్పి యూరువెడలెను. ఇంతవఱకు పోబడియే లేదు. అన్నియు సరిపోవుచున్నవి. ఇది యథార్థమైయుండునా? లేక నాభావనయా? వానికి కుడితొడపై పెద్ద పుట్టుమచ్చ యుండవలయును; ఆ యానవలె సత్యమును నిర్ణయింపఁగలదు.

[మాధవవర్మయు సమరసేనుఁడును ప్రవేశింతురు]

విజ : విచ్చేయుఁడు.

సమసేనుఁడు : మాధవవర్మగారు మనలను చాల స్నేహముతో విచారించుచున్నారు. మన పరివారమున కంతయు సంతృప్తికరముగా నేర్పాటులు గావించిరి.

విజ : మాధవవర్మగారికి మనము కృతజ్ఞులము.

మాధవవర్మ : ఇందు నా యోగ్యతయేమియు లేదు. అంతయు శాంతవర్మగారి యుత్తరువు.

విజ : మిమ్ములను గాంచినప్పటినుండియు మీయెడల నాకు బంధుప్రీతి పొడముచున్నది. శాంతవర్మగారు మిమ్ము సొంత కుమారునివలె ఆదరింతురని తలంచెదను.

మాధ : అవును. తండ్రివలె నన్ను నాదరింతురు. [స్వగతము] ఈతని గాంచినంతనె నిర్ణిమిత్తముగ నాకు వికర్షణము కలుగుచున్నది. ఇతఁడు మా కుటుంబ రహస్యములను నెమ్మదిగ జాఱఁదీయుటకు యత్నించు చున్నాఁడు.

విజ : రాజశేఖరవర్మగారుకూడ మిమ్ము సోదరప్రీతిలో చూచు చుందురు గదా?

మాధ : అవును.

విజ : [స్వగతము] నా యుద్దేశమును వీఁడు గ్రహించియుండును; ప్రత్యుత్తరములు ప్రోత్సాహకరముగలేవు. [ప్రకాశముగ] మీరేయేగ్రంథములు చదివితిరి? మహాభారత ప్రియులైన శాంతవర్మగారు మీ కాపురాణమును చెప్పించియుందురు.

మాధ : చెప్పించిరి. [స్వగతము] ఈతఁడు సూక్ష్మబుద్ధి. శాంతవర్మగారి లోపమును కనిపెట్టెను.

విజ : మీకు జ్యోతిషమును గుఱించి యేమైన తెలియునా?

మాధ : తెలియదు.

సమ : [స్వగతము] ఏల యీతని నిన్ని ప్రశ్నలడుగు చున్నాఁడు? దేనికో గుఱిపెట్టి నట్లున్నది.

విజ : సాముద్రికా శాస్త్రమున పరిచయముగలదా?

సమ : ఈశాస్త్రములన్నియు మాధవవర్మగారికేల తెలియును?

విజ : తెలిసియుండిన మేలె. శాంతవర్మగా రీలాటి శాస్త్రములు చెప్పించియుందురని యూహించితిని. సామాన్యమైన పుట్టుమచ్చల శాస్త్రము గూడ మీకు తెలియదా?

మాధ : తెలియదు మీకు తెలియునా?

విజ : కొంతవఱకు తెలియును.

మాధ : నా కుడితొడపై అరచేయియంత మచ్చగలదు. దానికి ఫలితమేమి?

విజ : [ఉద్రిక్త చిత్తుఁడై] సత్యముగనా? చెప్పుము!

మాధ : కలదు [స్వగతము] ఏలయిట్లు కలత చెందుచున్నాఁడు?

విజ : మిత్రమా, నీ వదృష్టవంతుఁడవు.

మాధ : పరాశ్రయున కేమి యదృష్టము?

సమ : [స్వగతము] ఈతనికి ప్రతికూలమైన రహస్య మేదియో బయటఁబడినది. అది అంతముఖ్యమైనదిగాకున్న ఇంతకలవర మెందుకు?

విజ : నాకు ప్రయాణాయాస మింకను తీఱలేదు. కొంచెము విశ్రమించెదను.

మాధ : అట్లే. [స్వగతము] ఈతని చర్య దురూహ్యముగనున్నది. పుట్టుమచ్చ యనినంతనె సంక్షుబ్ధ మానసుఁడయ్యెను!

[నిష్క్రమించును]

విజ : [కోపముతో] ఇప్పు డన్ని సందియములు తీఱినవి, నాప్రయోగమింత వ్యర్థమైపోవునా? నా మాయాజాలములో తగుల్కొనిన యొక ఈఁగ ఇట్లు తప్పించుకొని వెడలిపోవునా? [ఱెప్పవాల్పక బయ లవలోకించును]

సమ : మీరేల యిట్లు కలఁత చెందితిరి? ఇందుకు పుట్టుమచ్చయే కారణము కాదుగదా?

విజ : [ఆ మాటలు విననియట్లు] బిడ్డయుఁ దండ్రి ననుసరించెనని నమ్మియుంటి? ఆ! నే నుద్దేశింపని మూలనుండి హఠాత్తుగ పిట్టపిడుగు నెత్తిపై జాఱెను.

సమ : కడచిన విషయమును జ్ఞప్తికి తెచ్చుచున్నారు.

విజ : ఆవిషయము ఇంకను గడవలేదు. ప్రత్యక్షముగా నగపడుచున్నది. మనము అవివేకులమైతిమి. వంచింపఁబడితిమి. నరేంద్రుఁడు బ్రతికియున్నాఁడు. వాఁడే ఈ మాధవవర్మ.

సమ : [ఆశ్చర్యముతో] అటులనా! మన మొకటి తలఁచిన దైవమొకటి తలఁచెను. ఇదెట్లు సంభవించెను?

విజ : ఆవైద్యుఁడే యిందుకు మూలమైయుండును. ఇంతమాత్రమునకే నేనేల యపజయము స్వీకరింపవలయును? ఎట్టి యభ్యంతరములైనను నా యాశా ప్రదీపము నార్పలేవు. నిరుత్సాహమెట్టిదో నే నెఱుంగను. నా హృదయముపదను పెట్టినయుక్కు విఘ్నపరంపరలారా, మీతో పంతము వైచెదను. నా భావ్యభ్యున్నతికి మార్గము నరికట్టు మిమ్ము నా యూర్పుగాలిచే పటాపంచలు గావించెదను. భాగధేయమునకు విధేయత శిక్షించెదను.

సమ : ఇంకను మన చేయి దాఁటలేదు.

విజ : సమరసేనా, పొమ్ము. పొమ్ము. చెల్లాచెదరైన నాభావములను ఏకాంతమున చిక్క బట్టవలయును.

సమ : మరల దర్శించెదను. [నిష్క్రమించును]

విజ : ఉపకరణ సమీకరణమునందు పొరపడితిని. పొరపాటు మానవ సహజము. ఇందు విధిచేష్టయేమి?

                     మానవుఁడైనవాఁడు పదిమాఱులు యత్నము సల్పియున్ జయ
                     శ్రీని వరింపఁడేని చలచిత్తులు ప్రాప్తమటండ్రు దానినిన్;
                     మాన యుతుల్ తదుక్తిని బ్రమాణముగాఁ గయికోరు; చూచెదం
                     గాని యదృష్టమే యొకటి గల్గిన, దానికి నాకు యుద్ధమే!

[ఏవగింపుతో] ఆ! తూ - విధి - విధి.

[తెర జాఱును]

________

స్థలము 4 : అంత:పురము

________

[తెరయెత్తునప్పటికి యశోధర దీనవదనయై పైఁటకొంగుతో కన్నీరు తుడుచుకొనుచుండును. రాజశేఖరుఁడు ప్రవేశించును]

రాజశేఖరు : అమ్మా, యెందుకు రమ్మంటివి?

యశోధర : నాయనా, యిటురమ్ము, కూర్చుండుము.

రాజ : [అమ్మప్రక్కన కూర్చుండును.]

యశో : శేఖరా, యిఁక మనమేమిచేయఁగలము? మీ తండ్రిపట్టిన పట్టు విడువకున్నాఁడు. ముసలితనపు ముక్కోపము; నేనేమి చెప్పఁబోయినను అవిధేయనని శంకించుచుండును. తండ్రినిశ్చయమును విని మనోరమ రేయుం బవలు తనలో తాను కుమిలి కుమిలి పరితపించుచున్నది. రెండుదినముల నుండియు మంచినీరైన త్రావక కృశించుచున్నది. కన్నీరు నించి నించి కనుఱెప్పలు వాచిపోయియున్నవి. ఆ బిడ్డదురవస్థ చూచినప్పుడు కన్నకడు పెట్లు దరికొనక పోవును? నాయనా, యీఁడువారి మనసుకోఁతలు మీకేమి తెలియును?

రాజ : అమ్మా, మనోరమను విజయవర్మకిచ్చి వివాహము చేయుట నాకును అంత సమ్మతముకాదు. నిన్న ఆయన విడిదికి పోయియుంటిని. నేను పోవునప్పటికి ఏలనో కోపోద్రిక్త మానసుఁడైనటుల నిప్పులు గ్రక్కు వాడిచూపులతో బయ లవలోకించుచుండెను. ఆతతాయి క్రూరస్వభావమును ప్రతిబింబించుచుండిన ఆతని ముఖము నన్ను చూచిన తత్క్షణమె దరహసిత దీప్తమై వింతగొల్పినది.

యశో : నాయనా, ఆయన అంతకోపపడుటకు మనమేమి యగౌరవము చేసితిమి?

రాజ : ఆయన నడవడి యేదో కొంతచిత్రముగ నున్నది!

యశో : అట్టి కపటాత్ముని మీతండ్రి యెట్లు సద్గుణసంపన్నుఁడని నమ్మెను?

                      కడుపు చుమ్మలువాఱఁగఁగాంచి పెంచి,
                      నేఁడు చేసేతఁ గూఁతురిఁ బాడుకూప
                      మునఁ బడంగ నెట్టులఁ ద్రోతు? ముప్పుదప్పు
                      సరణి లేదొక? నీవైన సాయపడవొ?

రాజ : అమ్మా, చింతిల్లకుము. నాయనకు మరల చెప్పి చూచెదము. వినఁడేని ముహూర్తము వేళకు మనోరమ నెచ్చోటికైన దాఁటవేసికొని పోయెదను. ప్రస్తుత మంతకన్న వేఱు ఉపాయములేదు.

యశో : విజయవర్మగారు అవమానింపఁబడినట్లు కోపగించు కొందురుగదా!

రాజ : ఆతనికోపము మనల నేమిసేయును?

[మాధవవర్మ ప్రవేశించును]

మాధవవర్మ : అమ్మా -

రాజ : మాధవా, మేమిప్పుడు నీవు వినఁగూడని కుటుంబ రహస్యములు మాటలాడుకొనుచున్నాము. తరువాత రమ్ము.

మాధ : [కోప మడఁచుకొన్నవానివలె నటించి నిష్క్రమించును.]

యశో : శేఖరా, మాధవునియెడ నీప్రవర్తనము చాల నింద్యముగ నున్నది. నిర్హేతుకముగ వానిని నీ వవమానించుచుందువు. మానమర్యాద లెఱిఁగిన మాధవుఁడు నీ పొగరుబోతుమాటల కెంత నొచ్చుకొనియుండును?

రాజ : వానిని నేను వ్యర్థముగ దూషించుటలేదు. మన కుటుంబమున వాని యంతరమును వాఁడెఱుంగవలయును. మీచనవును వాఁడు దుర్వినియోగ పెట్టుచున్నాఁడు. నాయెదుటకూడ మనోరమతో స్వేచ్ఛగ మాటలాడుచుండును. వారిరువురు పాచికలాడునప్పుడు నేను కోరినను వారు నన్ను ఆటలోనికి రానియ్యరు. వారిరువురి కలుపుఁగోలుతనము నా కేవము పుట్టించుచున్నది.

యశో : కుమారా, పిన్నటినాఁటనుండియు మీరు ముగ్గురొక్క చోట పెరిగితిరి. ఒక్కకంచమున గుడిచి, యొక్కమంచమున నిదురించితిరి. మొన్న మొన్నటి వఱకు పరమాప్తులుగ నుంటిరి. మాధవుఁడు నీ యసూయకు పాత్రుఁడు కాఁడు. గొప్పబుద్ధివహింపుము. మనోరమ యింకను బాల్య వినోదముల విడనాడదు.

రాజ : అమ్మా, నీ వేమైన ననుకొందువుగాక, నేను మాత్ర మొక మాటచెప్పుచున్నాను: ఇఁకమీఁద మనోరమ మాధవునితో కలసిమెలసి యుండరాదు. నీకుమారిక ప్రవర్తనమునకు నీవు బాధ్యురాలవు. తెలిసికొమ్ము.

[నిష్క్రమించును]

యశో : ఇఁకమీఁద వారిరువురు కలసిమెలసి యుండరు. రాజశేఖరుఁడు తండ్రియంతవాఁడు. పట్టినపట్టు విడువఁడు. అయ్యో, మాధవా, నీ వెప్పుడైన వెడలవలసినవాఁడవేనా! ఏపల్లెతయో పెంచుకొనియున్న నీకిట్టి యిక్కటులు వచ్చియుండవుగదా! రాజశేఖరుని యుద్దేశ మటుండనిచ్చి మనోరమకును మాధవునకుఁగల చనవును కొంతమట్టుకు తగ్గించుటయే యుచితమని నాకును దోఁచుచున్నది . వారిరువురికి పరిణయము దుస్సాధ్యము! అట్టియెడ పరస్పరానురాగము హృదయానుతాపమునకు మూలము కాఁగలదు. అన్యాపదేశముగ మాధవున కీ సందర్భములన్నియు తెలియఁజెప్పెదను.

[నిష్క్రమించును.]

[తెర జాఱును.]

________

స్థలము 5 : విడిది యిల్లు.

_________

[విజయవర్మ సోఫాపై నానుకొని యొక పుస్తకము చదువుచుండును. తెర యెత్తఁబడును]

విజయవర్మ : చాణక్యుఁ డొక్కఁడే నా మనస్సుకెక్కిన నీతివేత్త! సాంసారిక రాజకీయ ధర్మముల నాతఁడు భేదము నిరూపించెను. కార్యదక్షులు ఫలసిద్ధికొఱకు నెంతటి కార్యములనైన నొనరింతురు.

[సమరసేనుఁడు ప్రవేశించును.]

విజ : ఏవైన క్రొత్త విశేషములు కనుఁగొంటివా?

సమరసేనుఁడు : [కూర్చుండి] తమరి దగ్గఱ విశేషములు వినవచ్చితిని.

విజ : అంతియేనా? - సమరసేనా, చిన్నబహుమానముతో ఎట్టి పరిచారకుని నోటితాళములైన ఊడిపోవును. ఈకుటుంబ రహస్యములన్నియు గ్రహించితిని. మనోరమ మాధవుని వలచియున్నదఁట! తల్లికిని కుమారునకును నాసంబంధ మంగీకారము కాదఁట.

సమ : అటులనా! ఇంట నందఱును ప్రతికూలురైనపుడు శాంతవర్మమాత్ర మేమి చేయును?

విజ : ఆతని కోఁతిపిడికిలిపై నాకు నమ్మకము గలదు - కాక పోయినను నాకొక యుపాయము తోఁచుచున్నది.

సమ : సూచింపుఁడు! తత్క్షణమె నిర్వహించెదము.

విజ : రాజశేఖరుని రహస్యముగ మన దుర్గమున దాఁచియుంచ వలయును. వాని సాహాయ్యములేనిదే రాణి స్వతంత్రముగ నేమియు చేయఁజాలదు.

సమ : అట్లయిన ఎప్పటికిని రాజశేఖరవర్మ మనదుర్గమును ప్రాణముతో వదలరాదు.

విజ : అవును! అది నిశ్చయము.

సమ : మఱియొకటి యాలోచింపుఁడు. పుత్రహీనుఁడైన శాంతవర్మ మాధవు నింటనుంచుకొని మనోరమ నిచ్చి వివాహము చేయవచ్చును; అట్లే అగునేని మన ప్రయత్నములన్నియు విఫలములగును.

విజ : [నవ్వుచు] సమరసేనా, నేనంత మూఢుఁడననుకొంటివా? పరస్పర ద్వేషముండుటవలన రాజశేఖరుని మాధవుఁడే చంపెనని రూపింపవచ్చును.

సమ : మీరు ప్రతిభావంతులు; మీయెదుట నేను మందమతిని.

విజ : మనోరమ మాధవునిపై ఆస వదలుకొనకతప్పదు.

సమ : శాంతవర్మకు మీరుతప్ప వేఱుగతి యుండదు.

విజ : ఇట్టిసందర్భముల వివాహము కొంచెమాలస్యమైనను జరిగితీరును.

సమ : పెండ్లికూఁతురితోడ అరణముగ రాజ్యమును హస్తగతమగును.

విజ : నా భావిజీవితమును ప్రభాతమువలె స్వర్ణమయమై పొడకట్టుచున్నది!

సమ : మీ యనుచరుని జీవితముగూడ నట్లే యొనర్పవలయును.

విజ : సమరసేనా, నిన్ను మఱతు ననుకొంటివా? వసంతపురమున రాజప్రతినిధియగుట కంత తీసిపోవు.

సమ : [సంతోషముతో] మీ చిత్తము, నా భాగ్యము.

విజ : మన మిప్పుడు ఊహ్యమైన యానందము ననుభవించుచు కర్తవ్యమునుమఱవరాదు. నేనిచ్చట కొన్నిదినము లుండవలసివచ్చును. నీవు పరివారమును దీసికొని హేమనగరమునకు వెడలుము. మన మాలతీదేవికి ఇచ్చటి వృత్తాంతము లేవియు తెలియఁగూడదని పరిచారకుల హెచ్చరింపుము.

సమ : అట్లె. [స్వగతము] మాలతితో సంభాషించుటకు తరుణము దొరకినది.

విజ : మాధవుని వేఁటనేర్పును రాజశేఖరునియొద్ద అగ్గించి వానిలో అసూయ ప్రేరేపితిని; రాజశేఖరుఁడు తన నైపుణ్యము నా యెదుట ప్రదర్శింప నువ్విళ్ళూరుచున్నాఁడు. ఈనాఁడు సాయంకాలమె మే మిర్వురము అరణ్యమునకు వత్తుము; మన పరివారములోని కొందఱుమాఱువేషములుధరించి అచ్చట వేచియుండవలయును. సమయముచూచి ఆతని కాలుసేతులు బంధించి గుఱ్ఱముపై వేసికొని ఈ నాఁటిరాత్రియె పట్టణముజేర్చి పాతాళగృహమున దాచవలయును. ఇచ్చటను అచ్చటను ఈ రహస్యము ఎవ్వరికిని తెలియఁగూడదు.

సమ : అట్లే యొనర్చెదను.

విజ : [పుస్తకము చేతికి తీసికొని చూచుచుండును]

సమ : [స్వగతము] ఈతని యొక్కొక్కరహస్యమును నావాంఛాపూర్తికి ఒకొక్క సోపానమగుచున్నది. మాలతిని నేను పెండ్లిచేసికొని తీఱవలయు. ఆకాంతపై ననురాగము నాకు నానాఁటికి హెచ్చుచున్నది. ఎన్ని దినములు దాఁచఁగలను. ఏల దాఁచవలయును?

విజ : [తలయెత్తి జూచి] సమరసేనా ఇచ్చటనే యున్నావా? నిదురలేని కలలు గనుట నాసేనాధిపతులకు తగిన యుద్యోగము కాదు.

సమ : శిలాక్షరప్రాయమైన మీవాగ్దానము నామనమున మధుర స్వప్నము సృజించినది.

విజ : అందుకు నాపైన సొడ్డు పెట్టెదవా? తీఱికచూచి వాగ్వాద వినోదము ననుభవింతము. నీకప్పగించిన కార్యము కాలయాపనము సేయక నిర్వహింపుము.

సమ : [తలవంచుకొని] నా సేనకు తగిన ప్రతిఫలము ముట్టునని నా కేమి నమ్మకము?

విజ : ఏమీ! నీ సందేహము వింతగొల్పుచున్నది. సమరసేనా, నా మొగముచూచి మాటాడుము. నిన్నెప్పుడైన మోసము చేసియుంటినా? - పొమ్ము, పొమ్ము, బేలవు కాకుము.

సమ : మీకు రాజ్యము చేకూరినది. వివాహమును కాఁబోవుచున్నది -

విజ : ఇదియొక క్రొత్తవిషయముకాదు.

సమ : క్రొత్తవిషయమే చెప్పెదను, నాకును పెండ్లిచేసికొనఁ గోరిక కలదు.

విజ : [నవ్వుచు] ఇందుకా యింత యుపోద్ఘాతము? అటులనే చేసికొమ్ము; నాకును సంతోషమెగదా!

సమ : వసంతపురమున రాజప్రతినిధి కాఁబోవు నాకు వధువుకూడ అనురూపవతిగ నుండవలయును.

విజ : [స్వగతము] చాలదూరము అంగ వేయుచున్నాఁడు. [ప్రకాశముగ] కన్యకను నిర్ణయించుకొంటివా?

సమ : నిర్ణయించుకొంటిని.

విజ : ఎవరు?

సమ : [క్రిందిచూపుతో] మాలతీదేవికి నేనంత తగని వరుఁడనుగాను.

విజ : [పిడు గడఁచినట్లు నిర్విణ్ణుఁడయి] మాలతీదేవికి నేనంత తగని వరుఁడనుగాను! [కోపముతో] తగిన వరుఁడని యెవరు చెప్పిరి?

సమ : నే ననుకొంటిని.

విజ : [కోపముతో] సమరసేనా, నీవు తలక్రిందుగా నడచుట లేదుగదా? నీకు చిత్తచాంచల్యము గలిగినదా? లేక కల గనుచున్నావా? ఇతరుఁడవే యైయున్న ఈ యసంగత ప్రలాలములకు నిన్ను మన్నించి యుండను. హాస్యాస్పదుఁడవు కాకుము.

సమ : మాలతీదేవిపై మీకు ప్రీతిలేదు. ఆకన్యను శిక్షించుటకు గా నాకిచ్చి వివాహము చేయుఁడు.

విజ : నీవు బుద్ధిమంతుఁడవేని ఈవిషయమై మఱొక్కమాటయైన నెత్తకుము. ఇంత తారతమ్య మెఱుంగనివాఁడవని నే నెన్నఁడును తలంప లేదు.

సమ : ఇదియే కడపటి మాటయా?

విజ : ముమ్మాటికి.

సమ : ఏనుఁగు తన నెత్తిపయి తానే మన్నుచల్లుకొనును.

విజ : ఓరీ, నీచుఁడా, నను బెదరించి లోఁగొనఁ జూచెదవా?

సమ : మాధవవర్మకే నేనట్టి సాహాయ్య మొనరించియుందునేని - [నిష్క్రమించును.]

విజ : ఈ రహస్యముకూడ వీనికి దెలిసిపోయెను! నా తెలివితక్కువ తనమునే నిందించుకొనవలయును. నానాఁటికి వీనికి నాపై నధికారము హెచ్చుచున్నది. ఈ దుర్మార్గుఁడు బ్రతికియున్నంత వఱకు నాగుండెలు కుదుటపడవు - సమరసేనా,

[పలుఁకడు] సమరసేనా, [పలుకఁడు]

[అటు నిటు తిరుగును]

ఇంతలో నెచ్చటికిపోయెను? మాధవుని యొద్దకుపోయి యుండఁడు గదా? సమరసేనా.

[పలుకఁడు] ఎవఁడురా అక్కడ?

పరిచారకుఁడు : స్వామి.

విజ : సేనాధిపతి ఎచ్చటికిపోయెనో త్వరితముగ పిలిచికొనిరమ్ము.

పరి : ఆజ్ఞ. [నిష్క్రమించును]

విజ : [అటునిటుతిరుగుచు] ఆతఁడెక్కడకు పోయియుండును? ఇంత యనాలోచితముగ కార్యముచేయునా? చేయఁడు; చేయఁడు, ఏల యింతవఱకు రాఁడు? - సమరసేనా.

[సమరసేనుఁడు ప్రవేశించును.]

సమరసేనుఁడు : నన్ను పిలిపించితిరా?

విజ : ఆఁడుదానివలె అలగిపోవుట ఎప్పుడు నేర్చుకొంటివి? కూర్చుండుము.

సమ : [నిలువఁబడి] నాతోడ మీకు పనితీఱినది; నే నిఁక నుండిన నేమి పోయిన నేమి?

విజ : [కూర్చుండి] కూర్చుండుము. మంచిబుద్ధితో ఈవిషయమును మరల నాలోచింపుము. నీకోరిక యసంగతమని యిప్పటికే నీకు తోఁచియుండును. మనము లోకదూషణమునకుఁ బాల్పడుదుము; వింత వింత కింవదంతులు పుట్టును.

సమ : కింవదంతులకు క్రొత్తగా భయపడుచున్నామా? అసమ్మతి నింతశాఖాసంక్రమణముగ నుపదేశించుట యెందుకు? ఔనా - కాదా, ఒకమాటచెప్పుఁడు. పోయెదను.

విజ : సమరసేనా, నీపై ద్వేషముతో నిట్లు చెప్పుటలేదు. లోకుల యాడికోలుకు వెఱచి సందేహించితిని. నీకంత యావశ్యకమని తోఁచినప్పుడు నీ యభీష్టము నెఱవేర్చియే తీరుదును. నీకింకను సందేహమా?

సమ : నా సందేహము తీఱినది.

విజ : ఇఁక త్వరితముగ వెడలిపొమ్ము. జాగరూకుఁడవై అంతయు నిర్వహింపుము.

సమ : పోయివచ్చెదను. మరణపర్యంతము మీమేలుమఱవను. [నిష్క్రమించును.]

విజ : న న్నావేశించిన పిశాచము తొలఁగినటులైనది. ప్రతిపదము నందును వీనిదే నాకు చింత; నాజీవిత మీ నీచుని మూలమున దుర్భోగ్యమగు చున్నది. ఏలాటి సందేహమున కెడమియ్యని స్నేహముతో ప్రవర్తించి సమయముచూచి మట్టు పెట్టెదను.

[రాజశేఖరుఁడు ప్రవేశించును]

రాజశేఖరుఁడు : వేఁటకు వచ్చెదరా?

విజ : నాకు కొంచెము తలనొప్పిగానున్నది; అయినను నీ వెను వెంటనే వచ్చెదను.

రాజ : ఆలసింపకుఁడు [నిష్క్రమించును.]

విజ : రాజశేఖరుఁడు తనవేఁటనైపుణ్యము చూపుటకు నువ్విళూరుచున్నాఁడు కాఁబోలు!

[అచ్యుతవర్మ ప్రవేశించును]

అచ్యుతవర్మ : జయము, జయము!

విజ : అచ్యుతవర్మా, సమరసేనుఁడు ప్రయాణ సన్నాహము చేయుచున్నాఁడా?

అచ్యు : మే మిఁక ఆతని అధికారము లెక్కసేయము. నా అధీనములోనుండు పరివారము ముందర ఆతఁడు నన్ను నీచముగ నిందించెను. ఆ గర్వాంధుఁడు ఏలినవారిని సైతము లెక్కసేయుటలేదు.

విజ : ఆతఁడేమైన నొడలుతప్ప త్రాగియున్నాఁడా?

అచ్యు : ఇదియంతయు దేవరవారి యాదరణమువలన వచ్చిన కండ కావరము. లేక యుండిన అతని నప్పుడే -

విజ : ఇటురమ్ము [తిన్నగా] వానిపై నా కాదరము పోయినది. ఆ నీచుఁడు నాదయకు పాత్రుఁడు కాఁడు. వాని యుద్యోగమును నీవు నిర్వహింప నభిలషింతువా?

...అచ్యు : దేవర కరుణ.

విజ : మిగత విషయము నీ వూహింపఁగలవు. సమయము చూడుము, ఇచ్చటకాదు; తెలిసినదా?

అచ్యు : గ్రహించితిని.

విజ : పొమ్ము నీయదృష్టము నీచేతిలోనున్నది.

అచ్యు : మహాభాగ్యము.

[నిష్క్రమించును.]

విజ : రాజశేఖరుఁడు నాకొఱకు వేచియుండు నేమొ.

[నిష్క్రమించును.]

తెరజాఱును.

________

స్థలము 6 : అరణ్యము

_________

[మనోరమయు చేటికయు ప్రవేశింతురు.]

చేటిక : అమ్మా, యింక మన మింటికి మళ్ళదాం, రాణిగారితో గూడ చెప్పిరాలేదు. అన్నయ్యగారు చూస్తే కోపగించుకొంటారు.

మనోరమ : శ్యామలా, నాకు అంత:పురముకంటె ఈయరణ్యమె వేయింతలు సుఖప్రదముగనున్నది. ఇచ్చట చెట్టుచేమలు పనికిమాలిన బోధ లొనరించి ప్రాణము విసిగింపవు.

శ్యామల : తండ్రిగారు పట్టినపట్టు విడువరు; మొన్నవచ్చిన క్రొత్త దొరగారు పెద్దదొరగార్ని మచ్చుమందుసల్లి లోపఱచుకొన్నట్లుంది.

మనో : మా నాయన ఉత్సాహవంతుఁడు, సదుద్దేశముతోనే నా హృదయమును చిందఱవందఱగ త్రొక్కుచున్నాఁడు - ఏమే, మాధవుని ఈవేళ చూచితివా? రెండుదినములనుండియు నాకంటి కగపడుటలేదు.

శ్యామ : ఆయన్ని ఈనాటి ప్రొద్దున చూచాను. అమ్మా, ముందటి మాదవయ్య దొరగారుకారు- ఆనడుపు ఆచూపులు మాఱిపోయినాయి. పిచ్చివాడిలాగా తిరుగుతుంటాడు.

మనో : నా దు:ఖాగ్ని హృదయదాహకమైనను తల్లి యోదార్పుల చే కొంత చల్లవడుచున్నది. పాపము! మాధవుని ఊరడించువారెవరు? - శ్యామలా, మాధవుని గంభీర స్వభావమును నీవెప్పుడైన కనిపెట్టితివా? తన దు:ఖము వెవరితోనైన చెప్పికొనఁడు; భారమును అసహాయుఁడుగ వహించును.

శ్యామ : నిన్న మన శేకరయ్యదొరగారు ఎందుకో కోపగించుకొన్నారు. ఆయన వినిపించుకోకుండా తలవంచుకొని వెళ్ళిపోయినారు.

మనో : మాధవుఁడు నివుఱుగప్పిన నిప్పు.

[మాధవవర్మ అన్యాయత్త చిత్తుఁడయి క్రింద చూపుతో ప్రవేశించును.]

శ్యామ : అమ్మా, వారుగో! మాదవయ్య దొరగారు, ఇక్కడికే వస్తున్నారు.

మనో : [ఆతురతతో] ఏఁడి? - [చూచి] పాతాళ పర్యంతము నంటుచూపు! మొగ మేదియో ఘోరనిర్ణయమును ప్రకటించుచున్న్నది! - మాధవా, ఏమి యీ స్వరూపము?

మాధవవర్మ : [మెల్లఁగ తలయెత్తిచూచి] మనోరమా, యదృశ్య శక్తి యాహ్వానము బలవత్తరము. స్వతంత్ర జీవిత యాత్రా మహాసముద్రావర్తనమున ఏకాకినై దుముకఁ బోవుచున్నాను. వీడ్కొలుపుము.

మనో [కలఁతచెంది] నీమాటలు నాకర్థమగుటలేదు. ఏమి యాత్ర? వీడ్కొలుపుట యేమి?

మాధ : ఇంకొక్క నిమిషమైనను ఈ యవమానకరమైన జీవనమును గడపఁజాలను. ఓర్పునకుఁగూడ నొక మేరయుండును. నే నెవ్వఁడను? మీ యింట నే నేల యదవత్రావుడు త్రాగుచుండవలయును? అజ్ఞాతజన్ముఁడను, పవిత్రమగు మీ కులీనత కేల కళంకము తేవలయును?

మనో : మాధవా, నిన్నెవరైన దూషించిరా? రాజశేఖరుఁ డేమైన కానిమాటలు పల్కెనా? తండ్రితొందరపడి కోపగించుకొనలేదుగదా?

మాధ : ఒక్కరాజశేఖరుఁడేకాఁడు, నేను జూచు ప్రతిపదార్థమును న న్నవమానించుచున్నది. పారతంత్ర్య విషవాయువునందు నాయౌవన కుసుమము వివర్ణమయి జీర్ణించిపోవుచున్నది. కఱకుటమ్ములను నిష్కవచమైన నావక్ష:స్థలముతో నెదుర్కొనఁగలను గాని, మర్మభేదకములగు నెత్తిపొడుపు లను. అన్యాపదేశ దూషణములను సహింపఁజాలను. ప్రత్యక్షముగ నీవు నాహృదయమును చూడఁగలుగుదువేని, ఒక్కొక్క యణుమాత్రస్థలము నొకొక్కక్షతము! ఒకొక్కక్షతమును రక్తస్రావి! ఒకొక్క రక్తబిందువును నాజీవిత సారము!

మనో : అయ్యో! నీవెన్నడును నింత కలఁత నొందియెఱుఁగవు. ఆ పొగరుఁబోతు రాజశేఖరుఁడే నిన్ను మితిమీఱ నొప్పించియుండవలయును.

శ్యామ : అనుమానమెందుకమ్మా? నిజంగా నే వుండవచ్చును.

మాధ : మనోరమా, నేను బిచ్చకత్తె బిడ్డనని తూలనాడినందుకు నాకేమి యవమానములేదు; లోకమున నందఱును భాగ్యవంతులుగ నుండరు. - నేను జారిణీకుమారుఁడనా? తన యపవిత్రకళంకమును కప్పిపుచ్చటకు మాతల్లి నన్ను నిశ్చింతముగ పాఱవైచినదా? [సంక్షుబ్ధ చిత్తుఁడయి] మాతల్లిజారిణి! దుస్సహము - ఓరి రాజశేఖరా, నేను మీతండ్రికి మరణ పర్యంతము ఋణపడియుండనియెడల - [కత్తిపైచేయి వేయును.]

మనో : ప్రాణమిత్రమా, నన్నుగుఱించియైన ఆబాలిశుని నీచోక్తులు మన్నింపుమని వేడికొనుటకును నోరాడకున్నది.

మాధ : వీడ్కొలుపుము. కాలయాపనమగు చున్నది. నీయనురాగ స్మృతి యను మహాప్రదీపమును చేతనుంచుకొని నాజీవితకాళరాత్రి నంతయు నిర్బయముగఁ గడపెదను. [కదలును.]

మనో : [చేయిపట్టుకొని] నీవు నిజముగ వెడలవలయునా? ఇంకొక యుపాయములేదా?

మాధ : నే నింకొక్క నిమిషమైన యీయింట నుండఁజాలను. ఈ బూటకపు జీవనము నాకు నరకము వెలెనున్నది. రాజులయింట నునికి - సర్వసౌఖ్యము లనుభవించుచున్నట్టు లగుపడుట - హృదయముమాత్రము బయటి కగపడని ఱంపకోఁతలతో జర్జరితమగుట! ఇది యేటి బ్రతుకు?

మనో : నీయూరడింపులతో నాహృదయభారమును దేలిక పఱచుకొనఁ దలఁచి యుంటినిగాని, నీదు:ఖమును చూచి నాసొదమ్రింగి కొంటిని. మాధవా, అన్న యపరాధమునకు నాపై కసితీర్చుకొందువా?

మాధ : నా మానత్యాగము నీసౌఖ్యమునకు గోరంతయైన నుపకరించు నెడల, అదియేగాదు ప్రాణత్యాగముకూడ నాకిష్టమె.

మనో : మన యనురాగలత నిరాలంబముగ కృశింప వలసినదేనా?

మాధ : మాటిమాటికి పొడిచి చంపెదవు? నేను రాజపుత్రుఁ డను కాను.

మనో : నీవు స్మృతిని భగ్నముచేయలేవా?

          మాధ : స్మృతిని గాలంబు నశియింపఁ జేయుమందు
                    నీకడన యున్న దయసేయుమో కులీన,
                    నీరమైనను విషమైన నీ వొసంగ
                    నమృతరసమట్లు తనివార నానువాఁడ

మనో : మాధవా, నీసహవాసములేని బ్రతుకు నాకు జీవస్మరణము, నేను నిశ్చయించు కొంటిని.

మాధ : [దు:ఖోద్వేగముతో] ఏమనుచున్నావు? ఈయజ్ఞాత జన్ముఁడు, ఈకులహీనుఁడు, ఈపరాన్న భోక్త. - దుస్సాధ్యము, దుస్సాధ్యము! నీవేడ, నేనేడ? ఏల యీపిచ్చిభ్రమ గొల్పుచున్నావు? దురదృష్టమునకు భ్రాంతి; భ్రాంతికి ఆశాభంగము; ఆశాభంగమునకు అకాలమరణము; చక్కని సంతాన పరంపర!

                    వనితా, నీవొక ధావమాన మధురస్వప్నంబవై మన్మనో
                    ఘనమార్గంబునఁ దేలియాడెదవు దక్కన్ రాని దూరంబునన్,
                    నను నచ్చోటికి రమ్మటంచుఁ గనుసన్నన్ బిల్తువేగాని, నీ
                    వనుమానింపవు నా విపక్షతను; పేరాసల్ వృధా వేదనల్!

మనో : మాధవా, నీకు మరణింప నిచ్చకలదా?

                    అదిగో! యాగిరి శృంగమెక్కుదము సంధ్యారక్తవర్ణాంకితాం
                    బుద రమ్యాంబర భిత్తిపై మన వపుర్మూర్తుల్ మషీచిత్ర సం
                    పదరూపింప, నభుక్తమౌ వలపుతాపంబుల్ శమింపంగఁ, బే
                    రెద కౌఁగిళ్ళ సుఖించి క్రిందినదిలోనే దూకి నిద్రింతమా?

శ్యామ : అన్నయ్యగా రిక్కడికే వస్తున్నారు!

మనో : ఏఁడి! విజయవర్మగారు గూడ వచ్చుచున్నారు. నే నిఁక బోయెదను. అన్న కోపగించు కొన్నను సహింపుము.

[విజయవర్మ రాజశేఖరులు ప్రవేశింతురు]

రాజశేఖరుఁడు : [స్వగతము] వీ రిచట మాటలాడుచుండి, మమ్ము చూచి మనోరమ చెట్లచాటునకు పోయినది. [ప్రకాశముగ] ఓరి, నీకింకను జ్ఞానములేదా? నీ యంతరమును నీ వెఱుంగవా? మాయమాటలతో ఆ యమాయికను లోఁబఱచుకొన యత్నించుచున్నావా? ఓరి దుర్జాతీ, నిన్నిప్పుడే యీవనదేవతలకు బలియిచ్చెదను.

[కత్తిదూసి మాధవునిపైకిపోవును. అంతలో మనోరమ రాజశేఖర మాధవుల మధ్యకువచ్చి రాజశేఖరుని పట్టుకొని,]

మనోరమ : అన్నా, తొందరపడకుము, మాధవుఁడేల యింతటి పగవాఁడాయెను?

మాధ : [గంభీర నిర్లక్ష్యభావముతో] రాజశేఖరా, యా యాట వస్తువును దాఁచియుంచికొనుము.

రాజ : [కోపముతో] ఏమీ, ఈకరవాలము నీహృదయ రక్తమును ద్రావునపుడు విషవ్యాళమని తెలిసికొందువు.

మాధ : [రాజశేఖరుని కరవాలమును పెరికి కొంచెముదూరముగ పడవైచి] మహానాయకుఁడా అదిగో! నీకరవాలము మట్టిదాఁకి కఱకు మాయును. చక్కగ తుడిచి యొరలో దాఁచిపెట్టికొమ్ము.

మనో : మాధవా, నీవుకూడ అన్న కోపమునకు తగునట్లు ఆటలాడుచున్నావు.

రాజ : ఓరి కృతఘ్నుఁడా, నిన్నింతవఱకె చంపకుండినది తప్పు

[క్రిందపడియున్న కత్తితీసికొని పైకిదూకును]

మనో : అన్నా, మన్నింపుము, మన్నింపుము.

రాజ : వెడలిపొమ్ము! సిగ్గులేనిదానా, మాన మర్యాదలెఱుఁగవు. పరపురుషుల యెదుట స్వచ్ఛంద విహారిణివలె నాట్యమా డెదవు.

మనో : [మాధవుని తట్టు అర్థగర్భితముగ చూచి వెడలిపోవును]

రాజ : ఓరీ, నీవు తిన్నయింటికి ద్రోహము సల్పువాఁడవు. చిన్ననాఁటనుండి మాయింట పెరిగిన దోషమున పాపశంకచే నిన్ను మన్నించితిని. వెడలిపొమ్ము. ఇఁక మా దివాణమున నడుగు పెట్టకుము. [విజయవర్మ దగ్గఱకుపోయి] మన మిఁక పోదము రండు.

విజ : [స్వగతము] అంతయు నా యాలోచన కనుకూలముగనే పరిణ మించుచున్నది! ఈయసదృశ లావణ్యవతి కొఱకైన మాధవుని తుద ముట్టింపవలయును. [ప్రకాశముగ] మిత్రమా, నాకు తలనొప్పి మఱింత హెచ్చుచున్నది; నేను కొంత తడవు విశ్రమింపవలయును [జనాంతికము] నీవు మాధవునిపై కనుపఱచిన శౌర్యము నా కచ్చెరువు గలిగించినది. భేష్! రాజశేఖరా, భేష్! [వీపుతట్టును.]

రాజ : [జనాంతికము] కనికరముతో వానిని చంపక వదలితిని; లేకున్న ఇంతవఱకెవాని కళేబరముపై కాకులు గ్రద్దలు గీగావులాడుచుండెడివి. మీరు ఇంటికి పోయెదరా?

విజ : నుదుట తైలము రాచికొని కొంత విశ్రమించిననేగాని యుపశమించునట్లులేదు.

రాజ : నేను పోయెదను.

విజ : నీవు ఒంటరిగా వేఁటా డెదవా?

రాజ : ఈ యరణ్యము మాకు చిరపరిచితము.

[నిష్క్రమించును.]

విజ : [స్వగతము] వెడలుము. పాతాళగృహముగూడ చిర పరచితము కాఁగలదు. [నిష్క్రమించును.]

మాధ : [అదోముఖుఁడై అటునిటు తిరుగుచు] మనోరమ నాస్థితిని మఱింత ఘోర మొనరించుచున్నది. నేను వెడలి పోవుదు నేని ఆసుకుమార హృదయ తప్పక ప్రాణ పరిత్యాగము కావించుకొనును. ఇన్ని దూషణములకు, అవమానములకు నగ్గమయి ఇఁక నేనెట్లు వారి దివాణమున నివసింపఁగలను? ప్రియసఖీ, ఎట్టివిషమ సంఘటనము తెచ్చిపెట్టితివి! ఎట్టి పిచ్చి యాస పురికొల్పితివి!

                     ప్రతి ఫలించిన చంద్ర బింబంబుగాంచి
                     యురముపై నిదురించుచు నున్నదనెడి
                     భ్రాంతిని సుఖించుఁ గుముదా కరంబు సరసి;
                     ఎంతదూరమ్ము, రెంటికి నెంత యెడము!

[నేపధ్యమున:] ఓమాధవా, పంది, చచ్చితిని - చచ్చితిని - పంది. [అని దూరమునుండి వినఁబడును.]

మాధ : ఏమది? [ఒరనుండి కత్తిలాగికొని పరుగెత్తును]

తెరపడును.

________

స్థలము 7 : కొలువుకూటము.

__________

[శాంతవర్మయు విజయవర్మయు కూర్చుండి, తెరయెత్తునప్పటికి సంభాషించు వైఖరిలో నుందురు.]

శాంతవర్మ : [దు:ఖముతో] అయ్యో! యింకెక్కడి రాజశేకరుఁడు! ఇంకను బ్రతికియున్నాఁడా? రాత్రియంతయు దివిటీలువేయించి యడవి యంతయు వెదకించితిని - మీరేల వాని నొంటరిగ వదలివచ్చితిరి?

విజయవర్మ : నేనెంత బ్రతిమాలినను వినక యుత్తరపు దిక్కునకు పోయెను. నేనుగూడ వెంబడింపఁ దలఁచితినిగాని, గొడ్డటితో చీల్చినట్టు తలనొప్పి పుట్టుచుండెను. విశ్రమింపవలయునని యింటికి వచ్చితిని. మాధవవర్మగారు మాత్రము అడవియందే యుండిరి.

శాంత : ఏమీ, మాధవుఁడచ్చట నుండెనా? మాధవుఁడేఁడి? - మాధవా.

[మాధవవర్మ ప్రవేశించును.]

శాంత : నీవుకూడ వేఁటకు పోయియుంటివా?

మాధవవర్మ : లేదు. ఏదూరదేశమైన పరుగెత్తి పోవుటకు పోవుచుంటిని కాని, నావిధి మరల నన్ను వెనుకకు మరలించినది.

శాంత : ఇదియేమి వెఱ్ఱి?

మాధ : ఇంతవఱకు పరగృహ వాసముయొక్క దైన్యమును పారతంత్ర్యమును నేనెఱుంగను. మీవాత్సల్యముచేత మైమఱచి యుంటిని. ఆ మధురస్వప్నమునుండి రాజశేఖరుఁడు నన్ను మేల్కొలిపెను. పదిజన్మము లెత్తినను మీ ఋణము నేను తీర్చుకొనఁజాలను; లేక యుండిన మాయిరువురిలో నెవరైన నొకరు మరణించియుందురు.

శాంత : [తత్తరముతో] ఏమీ! ఏమిజరిగినది?

మాధ : నేను అరణ్యమున కెఁగునప్పటికి మనోరమయు దాసియు నచ్చట నుండిరి. నే నామె యొద్ద సెలవు పుచ్చుకొనుచుంటిని, అంతలో విజయవర్మ గారును రాజశేఖరుఁడును అచ్చటకు వచ్చిరి. ఆఁతడెట్లు నన్ను నిందించినదియు వీరెఱుంగుదురు.

విజ : పాపము! మాధవవర్మగారు చాల యోర్పువహించి యుండిరి. [స్వగతము] మూఢుఁడా, నీ సత్యభాషిత్వమె నీమెడకు నురిత్రాడును బిగించును లెమ్ము.

మాధ : నన్ను సాఁకి సంతరించినవారియెడ కృతఘ్నుఁడనుగనుండఁ జాలను. నావలన మీకుటుంబ శాంతికి భంగమేల కలుగవలయును? నన్ను విడనాడుఁడు. రాజశేఖరుఁడు తిరిగివచ్చునప్పటికి నే నింట నుందు నేని ఆతఁడు నన్నొక మనుష్యునిగ లెక్కింపఁడు.

[ఇరువురు పరిచారకులు ఒక విరిగిన కత్తిముక్కను, తలపాగను తీసికొని ప్రవేశింతురు]

ఒకపరిచారకుఁడు : [దు:ఖగద్గద స్వరముతో] పొద్దున్నే పోయి మల్లీ అడివంతా గాలించి గాలించి వెతికినాం పుట్టపుట్టా చెట్టుచెట్టూ సూశినాం. అరణ్యకుల్యానదికి దగ్గిరగా ఈకత్తితునక, యీతలగుడ్డ పడివుండింది.

శాంత : [ఆతురతతో] ఏవి! ఏవి!

[చేతులు చాఁపును. పరిచారకులు తలగుడ్డను కత్తిముక్కను అందింతురు.]

విజ : ఇది నిన్న రాజశేఖరవర్మ చుట్టుకొనిన తలపాగవలెనున్నది.

శాంత : [తలగుడ్డను కౌఁగిలించుకొని దు:కించుచు] అయ్యో! నా బిడ్డ నెవరో చంపిరి. కత్తితునుక నెత్తురు తడిసియున్నది. అయ్యో! నాయనా, నీకేలయిట్టి ఘోరమరణము ప్రాప్తించినది? [దు:ఖించును]

విజ : [నిట్టూర్చుచు] అయ్యో ఎంతకష్టము! నేనెంత దురదృష్టవంతుఁడను! మీయింట నే నతిథినై యుండునప్పుడే యిట్టియిక్కట్టులు వాటిల్ల వలయునా?

శాంత : ఇందుకు ఎవరేమి సేయుదురు? దైవము మాయెడ క్రూరము. ముసలి ముప్పున నిట్టి పుత్రశోక మనుభవించుటకు మేమెవరికేమి యెగ్గుచేసితిమి?

మాధ : ఇదియంతయు స్వప్నమువలెనున్నది. నేను నమ్మఁజాలను. రాజశేఖరుఁడు మరణించి యుండఁడు.

శాంత : నీమాటలే సత్యమగుఁగాక!

పరిచారకుఁడు : అక్కడ ముగ్గురు నలుగురు మనుష్యులు పెనగులాడిన లాగా అడుగు గుర్తు లగుపడు తున్నాయి.

మాధ : అచ్చట చచ్చిపడియున్న అడవిపంది కళేబరమును చూచితిరా?

పరి : లేదండి దొరగారు.

మాధ : [ఆలోచించుచుండును.]

శాంత : [ఆతురతతో] మాధవా, నీకేదో కొంత తెలిసినట్లున్నది, దాఁచిపెట్టకుము. అడవిపంది యేమిటి - చెప్పుము? రాజశేఖరు నెవరు చంపిరి? ఆక్రూరకర్ముఁడెవ్వఁడైనఁ గాని వానిని కండలు కండలుగ చెక్కించి గ్రద్దలకు వేయించెదను. ఆ హంతకుఁడు నేన యైనను నన్ను మన్నించుకొనను.

విజ : మీరు ఘోరప్రతిజ్ఞచేయుచున్నారు. ఆడినమాట తప్పరని నాకు తెలియును. తొందర పడకుఁడు.

శాంత : ఇంతకన్న నాకు దు:ఖజనక మే మున్నది? వార్ధక్యమున నాయూఁతకఱ్ఱను విఱిచి వైచిరి. నాకు మృత్యుమందిరమునకు దారిచూపించిరి. నాజీవితశేషమును ఘోరదండనముగ నొనరించిరి. మా పితృదేవతలు నీతాపనీరమునకైన నోచుకొనరు కాఁబోలు! - మాధవా, ఆ అడవి పందిని గుఱించి యేమిచెప్పితివి? [ఆలకించి] ఆఁగుమాఁగుము. రాజశేఖరుని కంఠస్వరమువలెనున్నది. [అందఱును ఆతురతతో చూతురు] రాజశేఖరా, -

[పరిచారకుఁ డొకఁడు ప్రవేశించును]

పరిచారకుఁడు : ఇక్కడ ఎవ్వరూ లేరండి దొరగారు.

శాంత : [కోపముతో] ఓరి దున్నపోతా నీవఁటరా, పొమ్ము, పొమ్ము. నీపాడుమొగము చూపింపకుము.

పరి : [నిష్క్రమించును]

శాంత : మాధవా, యేమంటివి? [తలపాగ తెచ్చిన పరిచారకుల తట్టుతిరిగి] మీరు పోయి మరల ఆతీర ప్రదేశమునంతయు వెదకుఁడు. రాజశేఖరుఁడు బ్రతికియున్నవార్త తెచ్చినవారికి గొప్పజాగీరు నిప్పించెదను. పొండు!

పరి : చిత్తం. [దణ్ణముపెట్టి, నిష్క్రమింతురు]

శాంత : మాధవా, ఆ అడవిపంది సంగతి యేమి?

మాధ : విజయవర్మగారును రాజశేఖరుఁడును వేఁటకై వెడలిన చాలసేపు వఱకును నాకేమియు తోఁపక యున్మత్తునివలె నచ్చట తిరుగుచుంటిని. 'అడవిపంది - అడవిపంది - చచ్చితిని, చచ్చితిని' అని కేక వినఁబడెను.

శాంత : [ఆతురతతో] రాజశేఖరుని కేకయా? తరువాత?

మాధ : నే నట్లే యూహించితిని.

శాంత : నాయనా, నీవు తత్క్షణమె పరుగెత్తలేదా?

మాధ : పరుగెత్తితిని. నేను పోవునప్పటికి ఆ పంది రాజశేఖరునిపైకి దుముకుచుండెను. ఆతఁడు దానిని కత్తితో తప్పించుకొనుచుండెను. నే నొక్కనిమిష మాలసించి యుందునేని బెదరియుండిన ఆ యేదుపంది పాపము! రాజశేఖరుని చీల్చి వేసియుండును.

శాంత : దానిని పొడిచి నీవు రాజశేఖరుని కాపాడితివా? నిన్ను సాఁకిసంతరించిన ఋణమును తీర్చుకొంటివిగదా?

మాధ : దాని డొక్కలో నా కరవాలముతో నొక్కపోటు పొడిచితిని. అది రాజశేఖరుని వదలి నాపైకి దుమికెను. నేను తప్పించుకొని కత్తి నూడబెరుకునంతలో నది యొరఁగఁబడెను. అందువలన నాకరవాలము మొన విరిగిపోయెను, ఆ తునకయే యిది.

విజ : అట్లయిన దాని కళేబర మేమైయుండును? ఒకవేళ అడవి మృగములు తిన్నను అస్థిపంజరమైన నుండవలయునుగదా?

మాధ : అదియె దురూహ్యముగనున్నది.

విజ : తరువాత అచ్చటనుండి మీ రిరువురు కలిసికొని వచ్చితిరా?

మాధ : రాజశేఖరుఁడు కలవరమంది కొంతవఱ కచ్చటనే నిలిచి యుండెను. నాచేత రక్షింపఁబడెనన్నభావము ఆతనికి లజ్జాకరముగ నుండుటను గ్రహించి నే నచ్చటనుండక ఇంటివంకకు మరలివచ్చితిని. ఇంతవఱకె నాకుతెలియును.

విజ : [స్వగతము] ని న్నురితీయించుట కింతకన్న నెక్కుడవసరము లేదు.

శాంత : అట్లయిన రాజశేఖరుఁడేఁడి?

మాధ : నేనుకూడ అదేప్రశ్న అడుగవలయును. - నా కేదియో కొంత సందేహము కలుగుచున్నది. మరల నొకమా ఱాప్రదేశమునకు పోయి చూచివచ్చెదను.

విజ : ఉపయోగమేమి?

శాంత : అయిననుపోనిండు. పొమ్ము, పొమ్ము; యథార్థము తెలిసికొని రమ్మ.

మాధ : [నిష్క్రమించును]

విజ : [స్వగతము] అచ్చట తలపాగయు కత్తితునకయుఁ దప్ప నింక వేనేమియు దొరక నందున చాలమేలయ్యెను. మాభటుల తలగుడ్డలు చిక్కియుండిన! - [ప్రకాశముగ] మాధవవర్మ సుస్వభావముకలవాఁడు. సత్యమె చెప్పినట్లు తోఁచుచున్నది. అయినను రాజశేఖరుని వృత్తాంతము తెలియువఱకు ఆయన సాహాయ్యము మన కావశ్యకము. ఆయన పరదేశమునకు పాఱిపోవ నిర్ణయించుకొన్నవానివలె నగపడుచున్నాఁడు. ఆ యుద్దేశము నిన్న నే యంకురించినట్లున్నది.

శాంత : [స్వగతము] ఈమాటలలో నేదియో కొంత యనుమానము ధ్వనించుచున్నది. సత్యముగ నుండకుండనుగాక! [ప్రకాశముగ] అయ్యా, మీకు మాధవునిపై నేమైన నను మానము తట్టినదా?

విజ : మాధవవర్మ వినయవంతుఁడు. మీయెడ పితృభక్తి చూపుచుండును. నాకును అతనిపై సోదరప్రీతి జనించినది. అయినను - [కొంచెము నీళ్లు నములును.]

శాంత : ఏదియో చెప్పఁదలఁచి సంకోచించుచున్నారు.

విజ : ఏమియులేదు. యథార్థము దెలిసికొనునంతవఱకు ఎవరిపైనను నేరము మోపుట న్యాయముకాదు. అందులో మీ యింట నిండు గారాబమునఁబెరుగుచుండీ, మీ కెన్నగఁడు నపకార మొనరించియుండని గుణవంతునిపై నాకేల సందేహముకలుగును? అయినను మానవస్వభావము స్థిరమైనది కాదు. రాజశేఖరుని హత్యకు కారణ ముండితీరవలయును.

శాంత : ఈ విషయమును మీరు శ్రద్ధతో విచారించుఁడు. ఇఁక మీకన్న నా కెవరుదిక్కు?

విజ : నిన్న జరిగిన విషయములన్నియు పునరాలోచించిన కొంతవఱకు సత్యము నూహింపఁ గలము. మీరే యాలోచింపుఁడు.

శాంత : నాపుత్రుని హత్యనుగుఱించి నే నాలోచించుటలో ఒకవేళ అకాంక్షితముగ పక్షపాతము వహించిన వహింపవచ్చును; మీరు నిర్మల హృదయులు, న్యాయతత్పరులు, మీరె వివరింపుఁడు.

విజ : మే మరణ్యమునకుఁ బోవునప్పటికి మనోరమయు తానును మాటలాడుచుండిరని మాధవవర్మయె చెప్పియుండెను.

శాంత : అవును!

విజ : వారిని చూచినంతనె మీ కుమారుఁడు 'చంపెద' నని కత్తిదూసి మాధవవర్మపైకి దూఁకెను.

శాంత : రాజశేఖరుఁడు గర్వాంధుఁడు; మాధవుఁడు అవమానము సహించువాఁడు కాఁడు. వా రిరువు రెప్పుడైన కలహింతురని నే నెఱుంగుదును.

విజ : మాధవవర్మకూడ కత్తిపై చేయిపెట్టెను.

శాంత : అట్టులనా! ఓరి కృతఘ్నుఁడా.

విజ : కాని, ప్రక్కన నుండిన నన్నుచూచి యూరకుండెను.

శాంత : మీరు లేనిసమయమునకు వేచియుండెను కాఁబోలు!

విజ : తర్వాత నే నింటికి వచ్చితిని. వా రిరువురు అరణ్యమందే యుండిరి. అట్టిస్థితిలో వారిని వదలి వచ్చుట అపాయకరమె; అయినను నాతల గొడ్డటితో చీల్చినట్లు నొప్పియెత్తుచుండెను; కొంతదూరము వచ్చి వెనుకకు తిరిగి చూచితిని. మాధవవర్మ ముందుకు వెనుకకు నడచుచుండెను. ఆతని చర్యలన్నియును చిత్తసంక్షోభమును దెలుపుచుండెను.

శాంత : చక్కగ కనిపెట్టితిరి. చంపుదునా వద్దా యను వితర్కముతో వాఁడట్లు తిరుగుచుండెను కాఁబోలు! ఎంతటి దుర్మార్గుఁడు!

విజ : తరువాత - ఎట్లుఊహించుటకును తోఁపకున్నది. రాజశేఖరుఁడు ఆత్మహత్యచేసికొని యుండవలయును.

శాంత : ఆత్మహత్య చేసికొనవలసినంత యవసరమేమి కలదు? అంతయు స్పష్టము! మాధవుఁడే వధించి యుండవలయును.

విజ : అదియు సంభవమె. అయినను నేనంత తొందరగ అభిప్రాయపడను.

శాంత : మీరు వానిపైఁగల యభిమానముచే వెనుకముందులాడు చున్నారు. నాకును వానిపై వాత్సల్యము కలదు. ఎట్టి దురవస్థ!

విజ : మీరట్లు తలఁపకుఁడు. నాకు ఆతని కన్నను రాజశేఖరుని కన్నను సత్యముపై నెక్కు డభిమానము. నాసోదరుఁడె యిట్టి హత్యగావించి యుండిన నేను వానిని వదలిపెట్టను కాని, మొదట సత్యము నెఱుంగవలయును.

శాంత : ఇప్పటికే యెఱింగితిమి.

విజ : మాధవవర్మ రాజశేఖరు నేల చంపవలయును?

శాంత : ఒడలెఱుఁగని కోపమువచ్చి చంపియుండును.

విజ : అంతమాత్రము చాలదు. మాధవవర్మయే మీ కుమారుని వధించెనని నిర్ణయించుకొందు మేని అందుకు నగాధమైన కారణ ముండవలయును. అతఁడు మనోరమను రహస్యముగ వలచియుండవచ్చును; రాజశేఖరుఁడది యెఱింగి అతనిని మాటిమాటికి నిందించుచుండవచ్చును. ఆ యాటంకమును దొలఁగించుకొని మనోరమను పరిణయ మాడుట కీ వథ కావించి యుండవచ్చును. ఇదియంతయు మన యూహ; సత్యము కాకపోవచ్చును.

శాంత : [చిత్తోద్వేగముతో] ఇంకను సందేహమేల? ఆదుర్మార్గుఁడే నా కుమారుని వధించెను. వాఁడు కడుపులో కన్నులు గలవాఁడు. ఎంత దూర మాలోచించెను! ఓరి మాధవా, యిందుకా నిన్ను కన్నకొడుకు వలె సాఁకి సంతరించినది? పాముపిల్లకు పాలుపోసి పెంచుచుంటిని; తుట్టతుద కదియే నాకన్నులు పొడిచెను. అట్టి సౌజన్యము - అట్టి మొగము - రాక్షసహృదయమును దాఁచు ముసుఁగులైన యెడల లోకములోని సుజనులందఱిని వధింపుఁడు; అట్టిమొగములను చెక్కివేయుఁడు. ప్రపంచమంతయు కపటనాటకము! మనసులో చంపునిచ్చ - మాటలలో తేనెతీపు! ఓరీ ఆతతాయి, స్వామిద్రోహి, కృతఘ్నుఁడా, నీవు బ్రతుకఁ దగవు. నిన్ను శిక్షించి లోకమునకు మేలు చేసెదను. నీవు తగిన మరణదండన నునుభవింతువుగాక!

విజ : మీరు తొందర పడుచున్నారు; ఇంకను విచారింతము. రెండు దినము లాలసింపుఁడు.

శాంత : రెండు నిమిష లాలస్యమైన సహింపనోపను. కాలయాపనము నా మనోనిశ్చయమును సడలింపవచ్చును - ఎవఁడురా అక్కడ బంటు?

బంటు : ఆజ్ఞ.

శాంత : మాధవుఁడు వచ్చిన వెంటనే కారాగృహమునకు పంపింపవలయుననియు ఎంతబ్రతిమాలినను నా దర్శన మిప్పింపఁగూడదనియు, నా కుమారు నెచ్చట ఆక్రూరాత్ముఁడు వధించెనో అచ్చటనే వధ్యశిల నాటి వానిని ఖండింపవలయుననియు మామాటగా దండనాధికారికి తెలియఁజేయుము. పొమ్ము.

బంటు: చిత్తం [నిష్క్రమించును.]

విజ : ఎంత కష్ట మెంతకష్టము!

శాంత : అయ్యో! రాజశేఖరా, నాకన్నులఁ గట్టుచున్నావు.

[దు:ఖించును.]

తెరజాఱును.

_________

స్థలము 8 : అంత:పురము

__________

[మనోరమ ముసుఁగుపెట్టుకొని పండుకొనియుండును. తెరయెత్తఁబడును, యశోధర ప్రవేశించును]

యశోధర : [పడక ప్రక్కకుపోయి మనోరమపై చేయివైచి] అమ్మా, లేచి కూర్చుండుము.

మనోరమ : [తల్లి మాటవిని లేచికూర్చుండును]

యశో : [మనోరమ ప్రక్కనకూర్చుండి బుజ్జగించుచు] చిన్నితల్లీ కొంచెము పాలైనను పుచ్చుకొనుము; శోషవచ్చును.

మనో : అమ్మా, నీవుకూడ మాధవుఁడే వధించియుండు నని నమ్మెదవా?

యశో : అందఱును వాని మీఁదనే యనుమాన పడియున్నారు, ఎట్లు నమ్మవచ్చును? ఎట్లు నమ్మకపోవచ్చును?

మనో : మాధవుఁడింత ఘోరకృత్యమునకు తెగించియుండునని, నేను నమ్మఁజాలను. నాయెదుటను విజయవర్మగారి యెదుటను అన్న నీచముగ పరాభవించినను రోషమునంతయు దిగమ్రింగి గాంభీర్యమూర్తియై నిలుచుండిన శాంతచిత్తుఁడు, 'తండ్రికి మరణ పర్యంతము ఋణపడియున్నాన'ని చెప్పిన కృతజ్ఞుఁడు అన్నను వధించియుండునా? - కలలోనివార్త! అమ్మా, నాకదేలనో విజయవర్మగారిపై ననుమానము వొడముచున్నది. వనమున మాధవునిపై విషయపూరితమైన క్రూరదృష్టిని ప్రసరింపఁజేసెను. ఆచూపు ఇప్పటికిని నామనమున నంకితమైయున్నది.

యశో : మాధవునిపై ఆయన కేమి కంటగింపు?

మనో : మాకు పరస్పరానురాగము గలదని గ్రహించియుండును.

యశో : ఆయనంత దు:స్వభావుఁడుగ నగపడుటలేదు. మాధవునిపై విజయవర్మగారికి మొట్టమొదట అనుమానమె కలుగలేదఁట! కాని, అప్పటి సందర్భములను ఆలోచింపఁగా నిజము మీతండ్రిగారికే తోఁచినదఁట! ఒక విజయవర్మగారేమి? అందఱును మాధవుని సందేహించుచున్నారు. నిజము దేవుని కెఱుక. - మాధవా, నాకడుపు నిట్లు నేలపాలు చేసితివా? [దు:ఖించును.]

మనో : అయ్యో! అమ్మకూడ నమ్ముచున్నది! అందఱును నమ్ముచున్నారు. ఇందఱు నమ్మునది సత్యము కాకయుండునా? మాధవా, నీవు నరహంతకుఁడవా? నీచేతులు మాయన్న నెత్తుటిలో తడిసి శీతలసుకుమార స్పర్శను గోల్ఫోయి రాక్షసము లైనవా?

                       లలిత పల్లవ పేశలంబైన హృదయంబు
                              అన్నహత్యకు నెట్టులాసగొనియె?
                       దీనరక్షా దీక్షనూని చేపట్టిన
                              కత్తి కీదుర్గతి కామ్యమగునె?
                       అత్యంతదు:ఖంబు నపనయించి సహించు
                              ధీరత్వమెయ్యెడ పూరిమేసె?
                       నిను సాఁకి సంతరించిన వృద్ధజనకుని
                              కిదియె కృతజ్ఞతాస్పద సమర్చ?

                       వలపువెన్నెల చిలికు నీ కలికినుదుట
                       ఆతతాయి యటన్న రక్తాక్షరములు
                       ప్రజ్వరిల్లునె? యెంతటి పాతకంబు
                       నకుఁ గడంగితి వీవు? మన్ననయుఁ గలదె?

ప్రియసఖుఁడా, మనకు మరణపర్యంతము వియోగము!

యశో : అమ్మా, మాధవునకు మరణదండనముకూడ విధింపఁబడినదఁట!

మనో : [దు:ఖముతో] ఏమీ! - మరణదండనమా? హృదయేశ్వరా, నా హృదయము నాకిచ్చిపొమ్ము, నీతోడ నరకమునకు తీసికొని పోకుము. [తల్లియొడిలో నొరగి దు:ఖించును.]

యశో : చిట్టితల్లీ, యూరడిల్లుము. పుత్రశోకముతో వకావకలైన నా హృదయమును మఱింత కలఁచఁబోకుము.

మనో : అమ్మా, మాధవుని వధించుటవలన అన్న బ్రతికివచ్చునా? ఏ పరదేశమునందైన అతనిని ప్రాణముతోనుండనీయరాదా? - మాధవా,

                      పెండ్లిమంటపమునఁ బ్రియముతో నాచేతి
                      పూలమాల తొడవు పొందనున్న
                      నీదు కంఠమిపుడు నిర్దయమౌ గండ్ర
                      గొడ్డటికి బలియంబ గోడుపడునె!

అమ్మా, యిఁక నన్నేమిచేసెదవు?

[తల్లి, యొడిలో యొరగి దు:ఖించును.]

యశో : తల్లీ, యూరడిల్లుము. అనివార్యదు:ఖ మనుభవించియే తీరవలయును.

మనో : మాధవా, అమూల్యమైన నీ రక్తము వధ్యశిలను పునీతము చేయనున్నదా?

                      ఎచ్చట నెత్రులొల్కిప్రవహించునొ యయ్యెడలన్ గులాబిపూ
                      ల్విచ్చుత! కమ్మతావులటు వీచుత నీస్మృతి! తోఁటదాసినై
                      పుచ్చెదఁగాలముం గనులబుంగలఁ బాదుల నీరువోయుచున్;
                      అచ్చపు నాదు జీవితపు హారతి నెత్తెద నీ సమర్చకున్.

తెరపడును.

_________

స్థలము 9 : కారాగృహము.

_________

[వెలుతురు తక్కువగ నుండును. మాధవుఁడు ఉద్రిక్త చిత్తుఁడై యటునిటు తిరుగుచుండును.]

మాధవుఁడు : నన్నేల వీరీ యంధకార కారాగారమున బంధించిరి? నేనేమి యపరాధ మొనరించితిని? రాజశేఖరుని దుర్మరణమునకు నేను కారకుఁడనని యనుమానపడిరా? ఎంత అన్యాయము? బాల్యమునుండి నా స్వభావము నెఱింగిన శాంతవర్మయు నన్ను సందేహించెనా? పుత్రశోకమున మతిచెడి సత్యాసత్య వివేక శూన్యుఁడయి తన క్రోధమునకు నన్ను బలియీయ నెంచెనా? లేక యిది యంతయు విజయవర్మ కపట కృత్యమైయుండు నా? ఆతఁడు నా పుట్టుమచ్చ సంగతి విని సంక్షుబ్ధచిత్తుఁడాయెను. నాజన్మ రహస్యము విజయవర్మ యెఱుంగునా? - అదియెట్లు సంభవించును? = శాంతవర్మయె పొరపడియుండును. నాపక్ష మూను వా రెవ్వరు? కృతఘ్నుఁడు ఆతతాయి అను పాపకళంకమును వహించి నిరయసదృశమైన ఈకారాగారమున మరణపర్యంతము క్రుళ్ళవలయునా? అభ్భా! ... మనోరమ యేమనుకొనుచున్నదో! భ్రాతృహంతనని నన్ను దూషించుచున్నది కాబోలు! ఘోరవిధీ, నేను నీ యజ్ఞపశువునా?

[నేపథ్యమున గంటలు వినఁబడును]

[ఆలకించి] నిశ్శబ్దయామినీ గభీరతను భంగించుచు అశుభ సూచక కఠోర కంఠస్వరముతో ఆగంట "అవును అవును" అనిమ్రోగుచున్నది! [ఆలకించి] అదిగో1 తలుపులో తాళపుచెవి తిరుగుచున్న ఘర్ఘ రధ్వని వినఁబడుచున్నది. నన్ను వధ్యశిలయొద్దకు తీసికొనిపోవ రాజభటులు వచ్చు, చున్నారు కాఁబోలు!

[విజయవర్మ ప్రవేశించును]

మాధ : [సంక్షుబ్ధచిత్తుఁడయి] నీవా నన్ను వధింపవచ్చినది? [విజయవర్మ రెండుచేతులు గట్టిగ పట్టుకొనును]

విజయవర్మ : మిత్రమా, శాంతింపుము. నిన్ను బంధవిముక్తుని చేయవచ్చితిని.

మాధ : [చేతులు వదలు పెట్టి] అటులనా? మన్నింపుఁడు. మన్నింపుడు; తప్పదలఁచితిని. మీరొక్కరే నాకు పరమమిత్రులు. సత్యైక పక్షపాతలు. నా నిరపరాధిత్వమును దెలిసికొని నన్ను విడిపింపవచ్చితిరా? శాంతవర్మగారి సందేహము తీఱినదా? నిజమెన్నటికైన దాఁగదు; విడిపింపుఁడు, విడిపింపుఁడు. ఇంక నొక్క నిమిషమైనను ఆత్మనాశనమైన యీ కారాగార దుర్గంధవాయువును పీల్చుకొనఁజాలను.

విజ : కరుఁణాపాత్రుఁడా, నీకు మరణదండనముకూడ విధింపఁబడినది.

మాధ : [నిర్విణ్ణుఁడైచూచి మరల నుద్రిక్తచిత్తముతో] ఏమీ? నాకు మరణ దండనమా! నన్ను విచారింపకయె శిక్ష విధించితిరా? ఇది దండనము కాదు; కుట్ర - హత్య - నరబలి. ధర్మశాస్త్రములు బలవంతుల దౌర్జన్యమున కుపపత్తి కల్పించుటకే వ్రాయఁబడెను కాఁబోలు. మానవసంఘ మంతయు ప్రహసనము. [ఆలోచనాబద్ధచిత్తుఁడయి క్రిందిచూపుతో అటునిటు తిరుగుచు] నేను ఆతతాయిని! - ప్రళయంకరజ్వాలోద్గారి భూకంపము ఒక్క పెట్టున ఈ దుష్టప్రపంచమును కబళించునుగాత!...

నిశ్చయముగ నే నపరాధినని రూఢమైనదా? - నీవాజ్ఞను నిర్వహింప వచ్చితివా?

విజ : మిత్రమా, శాంతిల్లుము. నీకు తోడ్పడవచ్చితిని.

మాధః శాంతి! శాంతి! ఎక్కడిశాంతి? కటికవాని గండ్రగొడ్డలిని నిరపరాధుని కంఠముపై పెట్టి శాంతి బోధించుచున్నావు.

                       కఱకుటమ్ముల మేను గాఱింపఁబడిన కే
                                సరికి శాంతము నేర్పఁజాలుదేని,
                       జ్వాలాప్రచండమై జ్వలియించు దవవహ్ని
                                కోరిమి శిక్షింప నోపుదేని,
                       భిన్నోన్ముఖంబైన భీకరాగ్ని గిరీంద్ర
                                మునకు వాకట్టంగఁబూనుదేని,
                       ఝంఝామరుద్భిన్న సాగరోర్మికలకు
                                మహిత సంక్షోభంబు మాన్పుదేని

                       నాకు—నిరపరాధునకు—వినష్టమధుర
                       జీవితాశునకు— వ్యధావిశీర్ణమతికి—
                       మృత్యుభావన్మోత్తున—కింక నీవు
                       శాంతి శాస్త్రంబు బోధింపఁజాలుదేమొ!

విజః మాధవా, బహుభాషలకు సమయముకాదు. ప్రతినిమిషము నీ ఆయువును హరించుచున్నది. నీహితము కోరియుండనియెడల అర్ధరాత్రమున నేనేల రహస్యముగ ఈకారాగృహమునకు వత్తును?

మాధ : [ఆశ్చర్యముతో] రహస్యముగనా—మీమాటలు నా కర్థమగుటలేదు!

విజ : బేలవు! రేపు నీమరణదండనము నిర్వహింపఁబడును. నేనేమి సాహాయ్య మొనరించినను ఈరాత్రియే యొనర్పవలయును. ఒకఅశ్వమును కొంత ద్రవ్యమును ఆయత్తపఱచియున్నాను. తప్పించుకొని వెడలిపొమ్ము. ఎచ్చటనైన పరదేశమున బ్రతుకవచ్చును. ఎంతటి అవివేకియైనను ఇట్టి యనుకూల సమయమును వ్యర్థపుచ్చఁడు. రమ్ము, రమ్ము. [చేయిపట్టుకొని లాగికొని పోఁబోవును.]

మాధ : [చేపట్టు వదలించుకొని] ఏమి? - నేను దొంగవలె పాఱిపోవలయునా?

                       ఆతతాయి యన్న యంక మామరణంబు
                       చాకివాని ఖరము నాటిమోసి
                       భారభూతమైన బ్రతుకు సంరక్షింప
                       యశముకన్నఁ బ్రాణ మంత తీపె?

విజ : తొందరపడుము; కానిమ్ము, కానిమ్ము. వెనుకముందు లాడకుము. నీ ప్రాణము - తరుణము.

మాధ : నా నిరపరాధిత్వమును మీరు శంకించుచున్నారా?

విజ : [విసుఁగుతో] వ్యర్థప్రసంగము - వెడలుము. నీకు జీవితము పైన ఆసయున్నట్లులేదు.

మాధ : నన్ను మీరు కనికరించి తప్పింపవచ్చితిరా? మీ సదుద్దేశమునకు కృతజ్ఞుఁడను కాని, మీ సాహాయ్యము నంగీకరింపఁజాలను. సర్వసాక్షియైన భగవంతుఁడొకఁడు కలఁడు. ఆ కరుణామయుఁడు నన్నిట్లు నిస్సహాయునిగ వదలి పెట్టఁడు.

విజ : ఓరీ బాలిశుఁడా! - పరస్పరకబళనొద్యత ప్రాణిసంకులమైన యీప్రపంచము - నిశ్చేత సాంధకారశక్తి ప్రేరిత భూతప్రళయ నాట్యరంగమైన యీప్రపంచము - కరుణామయుని సృష్టియనుట కల్ల, అవివేకము. మాధ : నీవు కలిపురుషుఁడవు.

విజ : కానిమ్ము, ఆపురాణపురుషుఁడే నామూలమున నీకు తోడ్పడ నున్నాఁడు. అందు కేమందవు?

మాధ : సర్వశక్తి సంపన్నుఁడైన నియంత యిట్టి నీచకృత్యమునకు పురికొల్పఁడు. ఆకరుణామయుని సందేశ మెప్పుడును వంచనాకృతితో పొడకట్టదు. మీరు హితశత్రువులు; వెడలిపొండు, నా మనోనిశ్చయమును భేదింపకుఁడు.

విజ : [కరుణామయముగ] మాధవా, ఎంత పొరపడుచున్నావు! నూరేండ్లు బ్రతికిన వృద్ధుఁడైనను మరణించుట కిష్టపడఁడు. అయ్యో! నీవు యువకుఁడవు. మధురమైన ప్రాపంచిక సౌఖ్యముల రుచిచూచి యెఱుఁగవు. నీవెంతకాలము బ్రతుకవలయునో, ఎన్నిసౌఖ్యము లనుభవింపవలయునో ఎంత సంతానమును పడయవలయునో యెవ రెఱుంగుదురు? ఎట్టి నికృష్టుని కైనను బ్రదుకు తీపుగదా! నీకేలయింత వైరాగ్యము? - నీవు నిరపరాధుఁడవు. వెనుక నైనను శాంతవర్మగారు పశ్చాత్తప్తులు కాఁగలరు. నీవు బ్రతికియుండిన పొరపాటు దిద్దికొనవచ్చును. ఎంత పశ్చాత్తాపమైనను మరణించిన నిన్ను పునర్జీవుని కావింప నేరదు. [భుజముపై చేయివేసి] నా మాటవినుము.

మాధ : [స్వగతము] ఇదియు సమంజసముగనేయున్నది. నిరపరాధుడఁనని తెలిసియు నేనేల బ్రతుకఁగూడదు? ఇతరుల యవివేకమునకు నేనేల బలికావలయును? - ఎట్లయినను లోకము నన్ను సందేహించును. [ప్రకాశముగ] నేను తప్పించుకొని పాఱిపోయిన లోకు లేమందురు? హత్య చేయకుండిన ఇంత రహస్యముగ నేల పలాయనము కావలయు నని సందేహంపరా? ఇంకను నొక్కదినము కలదు. అంతలో సత్యము తెలియవచ్చును.

విజ : నిన్నాదరింపని లోకులతో నీ కేమిపని? లోకులు కాకులు జీవితము నీయది. చేతిలోని నీటిని దిగవిడచి మబ్బులోని నీటి కాసించు చున్నావు. ఒకవేళ మనోరమయె...

మాధ : ఆ పావనహృదయనామము నిచ్చోట వచింపకుఁడు. ఆ పేరునకుఁగూడ కల్మషమంటుకొనును.

విజ : ఆ కాంతయె నిన్ను తప్పించు కొని పొమ్మని చెప్పునెడల?

మాధ : అట్లెన్నటికిని చెప్పదు. నేను నరహంతకుఁడనని ఆ కాంత నమ్మదు; ముమ్మాటికి నమ్మదు.

విజ : [విషపునవ్వుతో] నమ్మదు, నమ్మదు. ఆఁడువారు చక్కెర పూఁత విషగుటికెలు; మూఢులు రసాయనమని నమ్మి సేవింతురు. ప్రేమ యవివేకుల స్వర్గము! కొనుటకును అమ్ముటకును వీలైన అంగడివస్తువు! శృంగారవతులు కాముకుల గంతగాడిదలఁజేసి అనురాగ సంభారము మోయింతురు! భ్రాంతినుండి మేక్కొనుము - ఎన్నిమణుగుల ప్రేమయైనను, ఎందఱు ప్రియురాండ్రయినను నీజీవమునకు సరిరారు. ఇవన్నియుజీవితముకొఱకె...

మాధ : [కోపముతో] నీ నిర్హేతుక దూషణము స్త్రీజాతి కంతటికి నాపాదించినను విశేషముగ మనోరమ కన్వయించునట్లు ధ్వనించు చున్నది. నిరూపింపకున్న నిన్ను ప్రాణములతో వదలను. [భుజముపట్టుకొనును]

విజ : [నిర్లక్ష్యముగ] మాధవా, నీవింకను బాలుఁడవు. వేచియుండుము, స్వానుభవమె బోధించును.

మాధ : నీవు వంచకుండవు. నాకు దృష్టాంతము కావలయును.

విజ : [చిఱునవ్వుతో] లేనియెడల?

మాధ : నీవు క్రక్కిన విషమును నీ నోటనే తినిపించెదను.

విజ : శెబాష్, మాధవా శెబాష్. [నవ్వును]

మాధ : నీ నవ్వుచాలించి నా కానవాలుచూపుము.

విజ : చూపెదను. ఉండుము. [జేబిలో వెదకుచు కనబడనియట్లు నటించి] ఆహా! యెక్కడనో జాఱిపడిపోయినది!

మాధ : పరనిందాపాతకుఁడా, నీ టక్కులు కట్టిపెట్టుము. నీదూషణము నుపసంహరించుకొనుము.

విజ : [మరల వెదకుచు] కొంచెము నిదానించుము. - ఆ! దొరకినది. ఆనవాలు. -

[మాధవుని చేతికి జాబు నిచ్చును.]

మాధ : [ఆతురతతో విప్పిచదువుచు] ముసుగులో అక్షరములు స్పష్టముగ - నగపడుటలేదు - 'మహారాజశ్రీ - విజయవర్మగారికి - మనోరమ విన్నపము - కారణాంతరములచేత...'

విజ : ఆయుత్తరముకాదు [మాధవునిచేతిలోనుండి తీసికొనఁబోవును. మాధవుఁడియ్యక దానిని చదువఁబోవును] అది ప్రేమలేఖ సుమా, నీవు చదువ కూడదు.

మాధ : మనోరమ యక్షరములవలె నున్నవి!

విజ : అన్యుల ప్రణయలేఖను చదువుట మర్యాదకాదు. [తీసికొనఁబోవును.]

మాధ : [ఉత్తరము విజయవర్మ కియ్యక కొంచెము ప్రక్కకు పోయిచదువును] '...కారణాంతములచేత నామనసు మాఱినందున మిమ్ములనె వివాహమాడెదను -'

[చేతిలో జాబును ఉండగ నలుపును. నలుపుచుండఁగా జాబు అజ్ఞాతముగ క్రిందపడును. మాధవుడు కన్నులు పచ్చగ పోవుచున్న వానివలె, చెక్కిళ్లు రెండు చేతులమధ్య ఇరికించుకొని కూర్చుండును.]

విజ : [ఆ జాబుతీసికొని సరిపఱచిచూచుచు] ఇది దొంగజాబుకాదు! అక్షరముల నానవాలు పట్టితివా? స్త్రీలు విశ్వాసపాత్రలు - ప్రాణపదములు - వారి వాగ్దానములు శిలాక్షరములు.

మాధ : నేనే మందమతిని.

విజ : కాదు, ప్రేమ సంభారము మోయుచున్న గాడిదవు.

మాధ : వంచింపఁబడితిని.

విజ : ఆడింపఁబడితివి.

మాధ : [స్వగతము] ఈజాబు నిక్కువమా, కల్పితమా? మనోరమ అక్షరములవలె, నున్నవి. బాతృహంతకుఁడనని ఆ కాంత నన్ను పరిత్యజించెను కాఁబోలు. [లేచి - ప్రకాశముగ] ఒక్క నిమిషమైన మనోరమతో మాటలాడ సెలవిచ్చెదరా?

విజ : ఆ కాంత నీ మొగము చూచుటకైన నిష్టపడదు.

మాధ : [హఠాత్తుగ పిచ్చివానివలె] నీవు మనోరమను పెండ్లి యాడెదవా? [విజయవర్మ పైకిరేగి రెండుచేతులతో గొంతుపట్టుకొని కుదిలించును]

విజ : [కష్టముతోతప్పించు కొని, మెడ తడవుకొనుచు స్వగతము] ఈదరిద్రుని చేతిలో నెంతబలమున్నది!

మాధ : [శక్తి తరగినవానివలె బెంచిపై కూలపడును]

విజ : [స్వగతము] వీడు వెడలునట్లులేదు. నన్నెవరైనచూచిన నాయత్నమంతయు నిరుపయుక్తమగును. పాప! మీ పిచ్చివాఁడు అది మనోరమ జాబనియే నమ్మెను! [ప్రకాశముగ] కడపటిమాట - వెడలెదవా, లేదా?

మాధ : పొమ్ము, పొమ్ము, నన్నొంటరిగ వదలిపెట్టుము.

విజ : చావుము, చావుము. ప్రజ్వలించుచున్న చితి వేయినాలుకలతో నీకై నిరీక్షించు చున్నది [నిష్క్రమించును]

మాధ : ఇంక నే నెవరి కొఱకు బ్రతుక వలయును? తల్లి శీతలకరుణా కటాక్షముల యాదరింపు నే నెఱుఁగను. తండ్రియుత్సంగ సౌఖ్యము కఱవయ్యెను; బంధువులు లేరు; స్నేహితులు లేరు; ఏకాకిని. నన్ను ప్రాణ పదముగ ప్రేమించు మనోరమయు ద్వేషించెను. జీవించుట నరకమైన యెడల చావు తప్పించు కొనుట యవివేకము. మనోరమ యిప్పటికిని నా హృదయముపై అధికారము చేయుచున్నది. ప్రేయసీ, భ్రాతృహంత నని నీవు నన్ను పరిత్యజించినను నేను నిన్ను ద్వేషింపఁజాలను. స్వప్నమందైన మరల నిన్ను చూడఁగలనా? ఎంత మంద భాగ్యుఁడను? నిదుర యుండినఁగదా స్వప్నము!

                     గున్న మావిచిగుళ్ళ కోమలత్వముగేరు
                             నంగుళి స్పర్శల యమృతరసము,
                     అరవిచ్చు సెలవుల నంకురించియు సిగ్గు
                             తెరగప్పు చిఱునవ్వు తేనె తెరలు;
                     అత్యంత శోక శుష్కాంతరంగముఁ దేర్చు
                             క్రేగంటి చూపుల ప్రేమ మదిర
                     సరస సల్లాప చేష్టా భీష్ట గోష్ఠుల
                             గొన్నట్టి స్మృతిపాయసాన్న భిక్ష,

                     అన్నియుంగూడి పరలోక యాత్రయందు
                     దారి బత్తెంపు కొఱఁతను దలఁగఁజేయ,
                     నీ మనోహరమూర్తి నిర్ణిద్రకాంతి
                     కాగడావేయ నిశ్చింతఁ గదలువాఁడ.

                                        [నేపద్యమున కోడికూఁత వినఁబడును.]

[ఆలకించి] అదిగో! కోడికూఁత వినఁబడుచున్నది. వేగుజామయ్యె కాఁబోలు. కాలమా, యెంతనిర్దయముగ నెగిరిపోవుచున్నావు? ఇఁక నొక్క దినము - ఒక్కదినము! [దు:ఖోద్వేగముతో] తరువాత - వధ - వధ - నరబలి - నరబలి -

తెరపడును.

_______

స్థలము 10 : విజయవర్మ స్వగృహము.

_________

[మాలతీదేవి కూర్చుండియుండును; చెలికత్తెయగు రజని నెమలికన్నుల విసనకఱ్ఱతో విసరుచుండఁగా తెరయెత్తఁబడును]

మాలతీదేవి : రజనీ, మా పినతండ్రిగారు పరివారమును పంపివేసిరఁట కదా? వారముదినములలో నింటికి వత్తురని వింటిని.

రజని : వారము దినాలే పడుతుందో నెలదినాలే పడుతుందో మన కెలా తెలుస్తుంది?

మాల : వారి నడిగి నీవేమైన సంగతులు తెలిసికొంటివా?

రజ : దొరగారు పెండ్లిచేసుకొనిగాని రారఁట!

మాల : [ఆశ్చర్యముతో] ఏమీ? పెండ్లియా? ఎప్పుడు? ఎవరు చెప్పిరి?

రజ : నే విన్నాను.

మాల : పెండ్లికార్యముకూడ నింతరహస్యముగ జరుగవలయునా? ఇంకేమైన సంగతులు గలవా?

రజ : పరివారం వచ్చినతోటే పాతాళగృహం దగ్గిర తలుపులు తీసినట్లు సందడైందట.

మాల : ఇంకొక రహస్యము కాఁబోలు! రజనీ, ఆద్వారపాలకును దగ్గఱ మెల్లఁగా ఆసంగతి తెలిసికొనివచ్చెదవా?

రజ : వాడు ఱాతి గుండెగలమనిషి. అయినా పోయివస్తా.

మాల : పొమ్ము, ఎట్లయిన తెలిసికొనిరమ్ము.

రజ : [నిష్క్రమించును.]

మాల : నా కనుమానము తట్టుచున్నది. ఎవనినో పట్టితెచ్చి యచ్చట బంధించి యుండవలయును. మా పినతండ్రి యెవ్వని సంసారమున కెసరువెట్టెనో గదా! ఆక్రూరకర్ముని పినతండ్రియనుటకు నాకు సిగ్గగుచున్నది.

తాను పెండ్లియాడినవెంటనే నన్నే పాళెగానికో యిచ్చి యిల్లు వెడలించును. నామేలు కోరు వా రెవ్వరు? తల్లిదండ్రులులేని బిడ్డలగతి యిట్టిదేకదా!

రాజ్య తృష్ణచే మాతండ్రిని రహస్యముగ చంపించిన యాపాపాత్ముని చూచినప్పుడు దు:ఖమును దిగమ్రింగికొనుట యసాధ్యముగ నున్నది. ఎప్పుడెప్పుడీ హంతకుని మొగము చూడక తప్పించుకొందునా యని వేయి దేవుళ్ళకు మ్రొక్కుచుందును. నాకోర్కె యింకను ఫలింపలేదు.

మాతండ్రి యెక్కుచుండిన గద్దియపై అతఁడు సుఖాసీనుఁడై యుండఁగాంచి నాహృదయము పెనములో వేఁగినట్లు ఆవిళ్ళు గ్రక్కుచుండును. మాతల్లి ఆ దు:ఖముతో మంచముపట్టి నవసినవసి మరణించినది. ఆఁడువారి గోడు తప్పక తగులునందురు! ఆ పరమ పతివ్రత శాపమెప్పుడు ఈ కుటిలాత్ముని ధ్వంసముచేయును; మాయన్నయైన బ్రతికియుండరాదా?

[రజని ప్రవేశించును.]

మాల : తెలిసికొని వచ్చితివా?

రజ : ఎవరో రాజపుత్రుడివలె వున్నాడు.

మాల : [ఆశ్చర్యముతో] రాజపుత్రుఁడా? పాపము! రజనీ, రమ్ము, నీవొకపని చేయవలయును.

[ఇరువురు నిష్క్రమింతురు.]

________

స్థలము 11 : పాతాళగృహము.

________

[లోన కొంచెము చీఁకటిగనుండును. రాజశేఖరవర్మ బెంచిపై కూర్చుండియుండును. ద్వారపాలకుఁడైన లతీఫ్‌సాహెబు రాజశేఖరునికి కనఁబడక ప్రక్క నుండును.]

రాజశేఖరుఁడు : [అటునిటుతిరుగుచు] ఎవఁడురా, యిక్కడ పరిచారకుఁడు? ఎంత అరచినను ఒక్క తొత్తుకొడుకైన హెచ్చరించుకొనఁడు. - ఓరీ, - ఎవడురా అక్కడ? - [పలుకరు]. వీరెవ్వరో పశుప్రాయులు. మట్టు మర్యాద లెఱుఁగని మూర్ఖులు.

లతీఫ్‌సాహెబు : అరె! ఎవడ్రా యీమణ్సి? చెవుకోసిన మేకలాగా పుకార్‌చేస్తాడ్. బందెఖానాలోగూడా పరిశారకుళ్ళు పట్టుదిళ్ళూ కావాలావుంది.

రాజ : మా దివాణమందేయైన నొకొక్క పరిచారకుని గుఱ్ఱపు కమిచీతో పట్టలురేగఁ గొట్టియుందును.

లతీ : దౌలత్ సూస్కుంతే రాజాకి బేటాలాగానే వుండ్యాడ్.

రాజ : [గాలి యాఘ్రాణించి మొగము చిట్లించుకొని] ఛీ, ఛీ, ఎక్కడపట్టినను దుర్గంధము; దుమ్ము దుమారము; కిచకిచమని గబ్బిళముల వాగ్వాదములు. వీరి కిల్లు చిమ్ముటకైన నౌకరు లేఁడు కాఁబోలు. మెత్తలు కుట్టిన సోఫా యొక్కటియైనలేదు. తుదకొక్క మేజాబల్లయైనను కుర్చీయైన నుండ కూడదా?

లతీ : [నవ్వుచు] పడకటిల్లు అనుకొన్నాడ్‌ లాగావుంది.

రాజ : [బెంచిపైన కూర్చుండి మట్టియైన చేతులు చూచుకొని లేచి చొక్కా వెనుకతట్టు మట్టిమఱకచూచుకొని] అబ్బే! నాగుడ్డలన్నియు మలినమైనవి. నన్నీ యింట దింపిన పెద్దమనుష్యునికి బుద్ధి చెప్పించెదను. నేను రాజపుత్రుఁడనని యెఱుఁగక యిట్టి నికృష్టమైన విడిది యేర్పఱచి యుందురు.

లతీ : అరెతోబా ! ఈ యద్మీయింకా అదే లోకంలో వుండ్యాడ్! బందెఖానా అయా, యిది బందెఖానా - పిచ్చివయా.

రాజ : ఎచ్చటనో మాటయలుకుడు వినవచ్చుచున్నది. ఎవడురా అక్కడ? ఈయింటి యజమానుఁడెక్కడకు పోయెను. నన్ను పస్తు పెట్టఁదలంచెనా యేమి? ఏమి మొఱకుదనము! నాకిష్టమైన తినుబండములనైన అడిగి తెలిసికొనుటకు వంటవాఁడింకను రాఁడు.

లతీ : తినుబండాలూ - వంటవాడు వస్తాడ్ వస్తాడ్! సజ్జరొట్టె పప్పుపుల్సు తెస్తాడ్! అరె దివానా ఆద్మి!

రాజ : ఉక్క పుట్టి చెమటకాఱుచున్నది. సురటివేయు నౌకరి యైనఁలేడు. ఈరాత్రి గడచుటయె దుర్భరముగ నున్నది.

లతీ : ఒంటి స్తంబం మేడామె వుండి గాలీ బోజనంచేస్తావుండ్యాడ్ లాగా అనుకొంటుండ్యాడ్! లస్తర్లు, పట్టె మంచాలు, పరుపు దిండ్లూ, బోగం పిల్లా, బొమ్మాయిపిట్టా కావాల్నా శెప్పండి సర్కార్, తెప్పిస్తాన్. [నవ్వును]

రాజ : ఇచ్చట నెవ్వరును కాపురముండునట్లు కనిపించదు. నా కేదియో సందేహము పుట్టుచున్నది. దయ్యమునోటినుండి బ్రహ్మరక్షస్సు నొడిలో పడితినా? ఈ మూల మెట్లగపడుచున్నవి. ఎక్కడికి పోవునో చూచెదను. [పోఁబోయి వెనుకకుతగ్గి] అంధకార కూపమువలెనున్నది.

ఎంత వితర్కించినను నా కేమియుఁ దోఁచకున్నది. నన్నుఁగట్టితెచ్చిన వారును వారినుండి తప్పించి నన్నిచ్చటికిఁ గొనివచ్చి రేపుప్రొద్దుననే మా పట్టణమునకు పంపెదమని చెప్పిన కపటాత్ములును ఒక్క గూడెమువారేయై యుందురా? తలంచుకొలఁది నాస్థితి భయంకరమగుచున్నది. మాతల్లిదండ్రు లెట్లు దు:ఖించుచున్నారోగదా? నన్ను వారెట్లు కనుగొని తప్పింపఁగలరు?

[నాలుగుమాలలు తిరిగిచూచి బెంచిపై కూర్చుండును.]

తప్పించుకొని పోవుటకైన దారిలేదు. [ఆలోచనా నిమగ్నుఁడై యుండును]

లతీ : మాకీబలే దాహం చేస్తావుంది. రజనీ పోసిన సారాయి కొంచెం మజాపట్టిస్తాన్ [ప్రక్కన కూర్చుండి కూజాలోని సారాయిత్రాగును] జమ్‌జమా మజాబలారే! రజనీకి నామీద బలే యిష్వాసం వుంది. [కైపెక్కినట్లు నటించుచు] రజనీ! క్యామజా! క్యాతమాషా, సొర్గం పాతాహళం నరకం పాపం, పుణ్యం, సబ్ దీంట్లోనే వుండాయ్. యిద్యా, బుద్ధి గొడ్డుగోదా, యిల్లూవాకిలి, పిల్లా పిసుగు, అంతా దరోబస్త్ దీంట్లోనే గుటగుటా గుటగుటా మున్గిపోతుందిబే, అరరే యే క్యారే - నాకళ్ళునట్టందాని పావడాలాగా గిర్గిరా గిర్గిరా - [పడిపోవును.]

రాజ : అన్నియు కఠినశిలానిర్మితములైన కుడ్యములు. నాజీవితాశ శిథిలమగుచున్నది.

[మెట్లపైనుండి అవగుంఠనము వైచికొన్న మాలతియు, దీపముపట్టుకొని రజనియు ప్రవేశింతురు.]

రాజ : [స్వగతము] ఎవ్వతె యీనారీమణి? నాభాగ్యదేవతవలె ప్రసన్నమైనది!

మాలతి : [స్వగతము] ఎవఁడో సుందరుఁడైన రాజపుత్రుఁడు.

రజని : నేను మెట్ల తలుపుదగ్గిఱ వుంటాను.

[నిష్క్రమించును.]

రాజ : కాంతా, నీవు స్వర్గమునుండి నరకలోకమున జాఱిపడిన యచ్చర పూవుబోణివా?

మాల : మీ రెవ్వరు?

రాజ : ఇదియేమి వింత? కాలుసేతులుకట్టి తెప్పించినవారికి నన్నేల తెలియదు?

మాల : మీ దేపట్టణము?

రాజ : ఇదియేమి మాయలాడితనము? కాంతా, యిట్టి స్వయంవరములుకూడ లోకమున నుండునా?

                      ఓరచూపుల, మాటల, నొప్పిదముల,
                      నడల, యొయ్యారములఁబ్రేమనాటకముల
                      మగల వలపింత్రు మగువలు; మడఁతి, వరునిఁ
                      జాపకట్టుగఁ దెచ్చిన జాణనీవె!

మాల : [నవ్వుకొని స్వగతము] పాప మీ రాకొమారుఁడు పొరపడెను. [ప్రకాశముగ] మిమ్ము తెప్పించినవా రితరులు; మీకు సాహాయ్యము చేయుతలంపుతో నే నిచ్చటకు వచ్చితిని.

రాజ : [ఆశ్చర్యముతో] అటులనా! కాంతా, నాయధిక ప్రసంగమును మన్నింపుము.

మాల : [చిఱునవ్వుతో] ఒకొకప్పుడు అధికప్రసంగముగూడ ఇంపుగనే యుండును.

రాజ : నేనెప్పుడును నీవంటి యువతీమణిని చూచి యెఱుఁగను; సౌందర్య సౌజన్యముల కింతటి పొత్తుకుదిరియుండుట యరుదు.

                     ఆరిపోయెడు దివ్వెకు నాజ్యమటుల
                     నీ కటాక్షము ప్రాణేచ్ఛ నింపెమదిని;
                     నీ మనోజ్ఞత యీ పొగగీమెకాదు
                     నా మనంబును వెలిగించె హేమగాత్రి.

మాల : [స్వగతము] మా పినతండ్రి దుష్కార్య మింకొక విధముగ వరప్రసాదిమయ్యెను. ఈసుందరాంగుని చూచి నప్పటినుండియు నామనము నావశము కాకయున్నది. [ప్రకాశముగ] రాజకన్యక లిట్లు పరపురుషులతో మంతనములాడుచుండుట యుచితముకాదు. మీరెవ్వరైనదియు తెలియక నే నెట్లు తోడ్పడఁగలను?

రాజ : లతాంగీ, నేను వసంతపురము నేలు శాంతవర్మగారి కుమారుఁడను.

మాల : [ఆశ్చర్యముతో] శాంతవర్మగారి కుమారుఁడవా?

రాజ : ఏల యట్లు వెఱఁగుపడితివి? మాతండ్రిని నీవెట్లుఱుఁగుదువు?

మాల : ఎఱుఁగను. ఎప్పుడో ఆపేరు వింటిని.

రాజ : [స్వగతము] నేనింతకుముందు గమనింపలేదు. మాధవుని మొగము పోలికలు ఈకాంత కున్నట్లు తోఁచుచున్నది!

మాల : మీకు సోదరియున్నదా?

రాజ : ఉన్నది. ఏల?

మాల : ఆమెకు వివాహమైనదా?

రాజ : ఇంకను కాలేదు. విజయవర్మయను నొక జమీన్‌దారుని కియ్యవలయునని నాయనగారి కోరిక; ఆసంబంధము నాకిష్టములేదు. మా తల్లికిని నచ్చలేదు.

మాల : [స్వగతము] ఆ దుర్మార్గుని పన్నుగడ ఇప్పు డర్థమయ్యెను. అంతరాయము తొలఁగించుట కొఱకీ దౌర్జన్యము సల్పియుండును.

రాజ : మనోహరీ, నన్నెవరు పట్టితెప్పించిరి? నే నెచ్చటనున్నాను? నీవెవ్వతెవు?

మాల : [ఆలోచనా నిర్మగ్నయై యుండును]

రాజ : నీకు తల్లిదండ్రు లున్నారా?

మాల : మా పినతండ్రి రాజ్యాశకు బలియైరి?

రాజ : ఆ దుశ్చరితుఁడెవ్వఁడు?

మాల : మిమ్ము తెప్పించిన యతఁడు.

రాజ : [ఆశ్చర్యముతో] మీపినతండ్రియా?

మాల : మా పినతండ్రియే కాదు; మీయింటి యల్లుఁడుకూడ!

రాజ : [పిడుగడఁచినట్లు నిలబడి] ఏమీ! విజయవర్మయా? ఓరి దుర్మార్గుఁడా, అతిథిజన కలంకుఁడా, గోముఖవ్యాఘ్రమా, ఏమి మాయనాటకమాడితివి? ఇంకను మాతలిదండ్రులు బ్రతికియుందురా? మాధవుఁడు చాల బుద్ధిశాలి. విజయవర్మ చర్యలను ఆతఁడు శంకించుచునే యుండెను.

మాల : మాధవుఁ డెవడు?

రాజ : సాఁకుడు బిడ్డ?

మాల : ఎవరు సాఁకిరి?

రాజ : మాతల్లిదండ్రులు. కొన్ని సంవత్సరములకు పూర్వము ఒక పసిబాలుఁడు మూర్ఛతగిలి మావాకిట పడియుండెను. మాతల్లిదండ్రుల కప్పటికి సంతానము లేనందువలన వాని నెత్తి పెంచుకొనిరి.

మాల : రాజులు పెంచుకొనఁదగినంతటి బిడ్డయా ?

రాజ : రూపవంతుఁడె.

మాల : అప్పటికి వాని వయస్సెంత?

రాజ : రెండుమూఁడు సంవత్సరము లుండవచ్చునని చెప్పిరి.

మాల : మాయన్నకూడ ఆప్రాయముననే మరణించెనఁట! [స్వగతము] ఆశా! ఎంత పిచ్చిదానవు. మరణించినవారు తిరిగి వత్తురా? [ప్రకాశముగ] ఆతఁడు క్షత్రియుఁడని అనిపించుకొనఁదగియున్నాఁడా?

రాజ : [సగర్వముగ] సౌందర్యమున నన్ను మించువాఁడు కాఁడు; అయినను కొంచెము బలిష్ఠ కాయుఁడు. తల్లి దండ్రులులేని బిడ్డయని యందఱును వానిని ఆదరించుచుందురు. గర్విష్ఠుఁడు. తానొక సార్వభౌముని కుమారునివలె నటించుచుండును. నీ మొగముచూచిన అతఁడు జ్ఞప్తికివచ్చును.

మాల : ఈమందభాగ్య కంతటి యదృష్టమా? ఆతనితొడపై పెద్ద పుట్టుమచ్చయున్నదా?

రాజ : [ఆశ్చర్యముతో] నీకెట్లు తెలియును?

మాల : [ఆతురతతో] ఉన్నదా? చెప్పుఁడు.

రాజ : ఇది యేమిచిత్రము! ఆనాఁడు విజయవర్మకూడ మాధవుని పుట్టుమచ్చ విషయము విన్నపుడు సంక్షుబ్ధచిత్తుఁడయి వెలవెలబోయెనఁట!

మాల : మచ్చయున్నదా? మాయన్న బ్రతికియున్నాఁడు! అన్నా - అన్నా - [మూర్ఛిల్లఁబోవును. రాజశేఖరుఁడు పట్టుకొని బెంచిపై కూర్చుండపెట్టును]

రాజ : మాధవుని జన్మరహస్యము తెలియవచ్చినది. - లతాంగీ, యూరడిల్లుము.

మాల : అన్నా, మరల నీ వా హంతకుని కంటఁబడితివా? [లేచి] ఇంకొక్క నిమిష మాలస్యమైన కార్యముచెడును. ఆ రాక్షసుఁడు మీ సోదరిని వివాహమాడఁబోవుచున్నాఁడు. మా అన్నవిషయమై నా కనుమానము కలుగుచున్నది. మనము తక్షణమె రహస్యముగ వెడలిపోవలయును. నాకు గుఱ్ఱపుస్వారి తెలియును. బాణ ప్రయోగమెఱుఁగుదును.

రాజ : కదలుము. [ఇద్దఱు మెట్లపైనుండి పోవుదురు]

తెరపడును.

_________

స్థలము 12 : సమరసేనుని గృహము

________

[సమరసేనుఁడు అటునిటు తిరుగుచుండఁగా తెరయెత్తఁబడును]

సమరసేనుఁడు : విజయవర్మకు వివాహమయి వచ్చినవెంటనే నా వివాహమును గుఱించి మరల హెచ్చరించెదను. మాలతిపై నానాఁటికి నాకు వలపు హెచ్చుచున్నది! ఆ కాంత నన్నుఁ బరిణయమాడునా? ఎట్లయినను పినతండ్రి యాజ్ఞకు మాఱాడఁజాలదు. నేను మాలతినే పెండ్లియాడిన యెడల రాజ్యాధిపత్యము వహించుటకుఁగూడ వీలుండును. మాధవునికి తన జన్మ రహస్యము నెఱిఁగింతును. నేను సైన్యాధిపతినగుటవలన సేనయంతయు నన్ననుసరించును. మాధవుఁడు నాకు మఱఁదియగుటయే గాక కృతజ్ఞుఁడుగ నుండును. [సగర్వముగ] ఆతని పేరు పెట్టి నేనే రాజ్యమునంతయుఁ పరిపాలింపఁగలను.

[నేపథ్యమున కలకలము]

అర్ధరాత్రమున కోటలో ఏమి యీకలకలము! [ఆలకించును]

[నేపథ్యమున - "దొంగలు, దొంగలు, పట్టుకొనుఁడు, కొట్టుఁడు, దివిటీ తెండు, హా, హా" యిత్యాది]

సమరసేనుఁడు : దొంగలా?

[అచ్యుతవర్మయు కొందఱు సేవకులును ప్రవేశింతురు]

సమ : అచ్యుతవర్మ, ఏమి యీ కలకలము?

అచ్యుతవర్మ : మనము పాతాళగృహమున బంధించి యుండిన కైది తప్పించుకొని పాఱిపోయెను.

సమ : [ఉద్రిక్తుఁడై] ఎట్లు తప్పించుకొనెను?

అచ్యు : బయటి తాళములు వేసినట్లే యుండెను.

సమ : లోపలకూడ మెట్లున్నవి. అచ్చటచూచితిరా? పొండు. పొండు.

[రజని ప్రవేశించును]

రజని : [దు:ఖించుచు] చిన్నదొరసానమ్మకూడ కనఁబడలేదు; గుఱ్ఱాలు పరిగిస్తుండిన శబ్దమైంది.

సమ : [కోపోద్రిక్తుఁడై] ఆ! ఇదియంతయు మాలతీదేవి పన్నాగము పరుగెత్తుఁడు, పరుగెత్తుఁడు. గుఱ్ఱముల నాయత్తపఱచుఁడు. భటులను లేపుఁడు. పొండు. - మా యాలోచన లన్నియు భగ్నమై పోయినవి. ఇంకను ఇచ్చటనేయున్నారా? పొండు. నా గుఱ్ఱము నాయత్తము చేయుఁడు.

[సేవకులు నిష్క్రమింతురు. అచ్యుతవర్మ అచ్చటనే యుండును.]

ఆలసించిన మన ప్రాణములమీఁదికి వచ్చును. అచ్యుతవర్మా, మనముకూడ పోవుదము రమ్ము. [నిష్క్రమించును]

అచ్యు : నేను వేచియుండిన సమయ మిప్పుడు దొరకినది. అడవిలో తప్పుదారి తీసి ఈతని నచ్చట తెగటార్చి విజయవర్మగారికి నే నిచ్చినమాట చెల్లించుకొనెదను.

[నిష్క్రమించును]

__________

స్థలము 13 : అడవి

_________

[అంతయు కొంచెము చీఁకటిగనుండును. భటులు కొందఱు పుల్ల దివిటీలు పట్టుకొనియుందురు. కొందఱు విచ్చుకత్తులతో నిలఁబడియుందురు. మాధవవర్మ వధ్యశిలయొద్ద నిలఁబడియుండును. కటికవాఁడు గండ్రగొడ్డలి భుజముపై పెట్టుకొని యుండును; తెర యెత్తఁబడును]

మాధవవర్మ : ఓదౌర్జన్యరాక్షసీ, ఎందఱు నిరపరాధులు, సత్యవంతులు, ధర్మబద్ధులు నీరథచక్రముల క్రిందపడి నుగ్గు నూచయిపోవుచున్నారు? ఎందఱి యస్థిపంజరములతో నీ భోగమందిరము నిర్మింపఁబడుచున్నది? ఎందఱి యమాయకుల రక్తపూరము తీఱరాని నీతృషను తీర్చుచున్నది? - సత్యమా, నీవెల్లప్పటికి దు:ఖభారవాహివె!

ఆపద్బాంధవా, దీనసంరక్షకా, జగదీశ్వరా, నేను నిరపరాధుఁడను. నీవు సర్వజ్ఞుఁడవు. నేను దౌర్జన్యమునకు బలిపశువును. నీవు సర్వశక్తిమంతుఁడవు. కరుణామయుఁడవు. -

                     పాదుచేసి నీరు పాఱించి, మొలకను
                     నాటి పెంచినావు తోఁటయందు;
                     పూఁత పిందె కాయ పొడసూపు నదనున
                     చెట్టుమొదలు నఱకు చిత్రమేమి?

మహాప్రభూ, నీయుద్దేశమేమి? నీలీల దురూహ్యము!

నేను సంతోషముగ మరణింతును. ప్రేమ సూత్రములతో నిహలోకమునకు నన్ను బలవంతముగ బంధించు నేప్రాణియునులేదు. నా దురదృష్ట జీవిత కావ్యమున కడపటి యాశ్వాసము రక్తాంకితాక్షరములతో పరిసమాప్తమగుచున్నది!

[జోబిలోనుండిన చేతిగుడ్డనుతీసికొని దానిని చూచుచు]

సచేతనములకన్న నచేతనములే విశ్వాసపాత్రములు! నీవు నా కన్నీటిధారల మాధుర్యము నెఱిఁగిన దానిలో నూరవపాలు మీస్వామిని యెఱిఁగి యున్నయెడల? - మనోరమా, నీవు ప్రణయ బహుమానముగ నొసఁగిన యీ రుమాలు గుడ్డయె నాశవమునకు కడపటి యలంకారము!

[భటులు కన్నీరునింతురు; రుమాలుగుడ్డ కన్నులకు కట్టుకొని]

దైవమా, నీయభీష్టము నెఱవేరుఁగాక! ఓయీ, నీవిధిని నిర్వర్తింపుము. [వధ్యశిలపై తల పెట్టును]

కటికవాఁడు : [స్వగతము] ఇంత నెమ్మదిగా సచ్చిపొయ్యె మారాజును నేనెప్పుడు సూళ్ళేదు. [ప్రకాశముగ]

                         అన్నెము పున్నెము ఎఱగను నేను అంతా మాదొరదే;
                         ఆకలిబాదకు నౌకరిచేస్తా, అంతే నా యెఱిక,
                         తప్పుడు నౌకరి కొప్పుకుంటిని తప్పదునాకింక,
                         కళ్ళుమూసుకుని పాపముచేస్తే కర్మమంటదంట!
                         పడసు దొరోరిని సంపబోయితే గడగడ వణుకును చెయ్యి.

[రాజశేఖరుఁడు, పురుషవేషధారిణియైన మాలతియు ప్రవేశింతురు]

రాజశేఖరుఁడు : ఆవెలుతు రేమి? ఆ1 వధ్యశిల

మాధ : ఏల యాలసించెదవు? నిమిషయాపనము దుస్సహముగ నున్నది.

రాజ : మాధవుని కంఠస్వరమువలె నున్నది.

కటి : [తొందరగ చదువును]


                      గండ్రగొడ్డలికి సత్తెమువుంటె కాళమ్మవుంటె
                      వొక్క యేటుకే మొండెమునుంచి పూడిపోవు సిరసు.

                                                                    [గొడ్డలి పైకెత్తును]

రాజ : ఊడిపోదురా నరపిశాచీ, ఊడిపోదు. [ఎత్తిన గొడ్డలిని పట్టుకొనును]

కటిక : [తిరిగిచూచి] ఒయ్యొ, ఒయ్యొ, దెయ్యం, దెయ్యం. చిన్న దొరయ్య దెయ్య మయ్యాడు. [పెద్దకేకవేయును, భటులు భయపడుదురు]

రాజ : నేను మరణించితిననుకొని యుండిరా?

మాల : నేను సందేహించినట్లే యైనది. మనము సమయమునకు రాకున్న!

మాధ : [మెల్లఁగ తలయెత్తి కన్నులకు గట్టుకొని రుమాలువిప్పి] ఏమి దయ్యమురా? [రాజశేఖరుని చూచి] ఆ! నన్ను బ్రతికించుటకై స్వర్గమునుండి పరుగెత్తుకొని వచ్చితివా?

రాజ : [మాధవుని కౌఁగిలించుకొని] మాధవా, యిదియేమి దురవస్థ?

మాధ : నీవు నిజముగ బ్రతికియున్నావా? స్వప్నము కాదుకదా? [రెండు భుజములు పట్టుకొని కుదలించును]

కటిక : [భటులతో జనాంతికము] మణిశిలాగే వుండాడు. సావలేదురో, అయ్య.

మాధ : నిన్ను హత్యచేసితినని మీతండ్రి నాకు మరణదండనము విధించెను.

రాజ : అయ్యో! ఎంత ప్రమాదము. ఒక్కనిమిష మాలస్యమై యుండిన తీఱరాని దు:ఖము ననుభవించి యుందుము.


               మాధ : ఒక్కక్షణములోన నుత్కట దు:ఖంబు
                        మఱుక్షణంబునందు మాఱుపాటు!
                        కలలువోలెఁ దోఁచుఁ గలుములు లేములు!
                        బలు తుపాను కడలి పడవ నరుఁడు.

మాల : [సందేహించుచువచ్చి] అన్నా, మాయదృష్టవశమున బ్రతికితివి. [కౌఁగిలించుకొని కన్నీరునించును]

మాధ : రాజశేఖరా, యీ ప్రియబంధు వెవ్వఁడు?

రాజ : మీ సోదరి.

మాధ : [ఆశ్చర్యముతో] నా సోదరి! నేనెవ్వఁడను?

రాజ : విజయవర్మ అన్నకుమారుఁడవు. మీతండ్రిని ఆతఁడు వేఁటలో చంపించెను. నిన్నును శిశుప్రాయమున చంపింపఁబోయెను; నన్నీ పాతాళగృహమున బంధింపఁజేసినదియు అతఁడె. ఇది యంతయు నిన్ను వధింపించి మనోరమను పెండ్లియాడుటకు చేసిన పన్నాగము.

మాధ : [ఉద్రిక్తచిత్తుఁడై కటికవానిచే గొడ్డలి పెరుకుకొని] ఓరి దుర్మార్గుఁడా, చచ్చితివి. చచ్చితివి. [పరుగెత్తును]

తెరపడును

_______

స్థలము 14 : వివాహమంటపము.

________

[తెరయెత్తఁగనే పుష్పమాలాంకృతులైన మనోరమా మాధవులు, మాలతీరాజశేఖరులు; మఱియు రాజబంధువులు పౌరోహితుఁడు తక్కుంగల ఇతర సభాసదులు అగపడుదురు.]

పౌరోహితుఁడు : [ఆశీర్వదించుచు]


                     అల యరుంధతియు వసిష్ఠునటుల మీరు
                     నిత్య మన్యోన్య మధుర దాంపత్యగరిమ
                     నాయురారోగ్య విభవసౌఖ్యంబు లొంది
                     పుత్రపౌత్రాభివృద్ధిగఁ బొల్త్రుగాత!

సంపూర్ణము.

_________

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.