కవికోకిల గ్రంథావళి-2/నైవేద్యము

విన్నపము.

ద్విపదరచనయందు సంప్రదాయసిద్ధములగు గణములే గాక చంద్రగణములలోని 'నలలము' 'భలము' అను పంచమాత్రాక గణములను, అప్రయత్నపూర్వకముగ పడినచోట అంగీకరించితిని. అట్టి గణభేదమువలన ద్విపదయొక్క యేక గతియందలి విసుగువేసటలు తొలఁగునని నాయుద్దేశము. శీర్షి కలకడ చుక్క గుర్తులుగల కావ్యములన్నియును గేయములు. వానివాని గతిప్రసరణముల ననుసరించి చదువవలయును.

దువ్వూరి రామి రెడ్డి.

ప్రేమాంకము.

దారినిఁ బోవుచుండ నొకతట్టున రత్న మయాచితంబు చే
కూరినరీతి నాయెడఁదకున్ సరిదాఁకిన మిత్రుఁడున్ మనో
హారి, కళాతపస్వి, సరసాత్ముఁడు, మోమునఁ బ్రేమమాధురీ
సారము: చిప్పిలం బరులస్వాంతము లాగెడి యింద్రజాలికుం
డై రమణీయభావకవితాంచితుఁడై చెలువారు రాజమ
న్నారు సఖుండుగాదొరకె నాకుఁ, దదాప్తత కానవాలుగన్
కోరియొసంగితిం గృతినిఁ గూరిమినెచ్చెలి కంకితంబుగన్.

22-12-1924.

పెమ్మారెడ్డిపాళెము.

ప్రియమిత్రుఁడు,

దువ్వూరి రామి రెడ్డి.

నైవేద్యము.

తల్లి, నీయుత్సవముగా0చఁ దరలినార
లనుఁగుఁ దనయులు నై వేద్య హస్తులగుచు;
ధన్యులెల్లరు నాత్మోచితంపుఁ గాన్క
లర్పణము సేయవచ్చిరి; యందికొమ్ము.

స్వర్ణసుమముల నర్చన సలుపువారు
భాగ్యవంతులు నీపాద పద్మములకు;
ఏమి లేనట్టి భిక్షుకుం డేని నేఁడు
కంటి క్రొన్నీటి ముత్యాల కాన్క లిడును.

పూజ్యు లధములు, ధనికులు పుట్టుబీద
లనెడి యెడలేకయెత్తిరి హారతులను;
భక్తిపరవశులైన యాప్రజలగీతి
దిక్కు దిక్కులయందుఁ బ్రతిధ్వనించు.

అమ్మరో, నీదు మందిర ప్రాంగణమున
మండుచున్నది కర్పూర ఖండగణము!
త్యాగపరిశుద్ధమగు నాత్మఁ దలఁగిపోవు
కామమటు ధూమరేఖలు గడలుకొనఁగ.

ప్రొద్దుపొడుపున నీ పాదపూజకొఱకు
కవిని, తెచ్చితి దోసిటఁ గన్నెపూలు;
బలి వితర్దిక నిరతంబు వెలుఁగునటుల
హృదయపు సుగంధదీప మర్పింతుఁ గొనుము.

ఫిబ్రవరి 1921.

_________ 

* కర్ణధారి.

సందెచీఁకటి దెసలఁ జక్క. నలమెం;
  గాఱుమబ్బులు చుక్కగములఁ గ్రమ్మెం;
  బ్రబల వేగాన దుపాను వీచెన్;
  ఆకసము గీకసం బావిలింపన్
  గర్జించె మేఘాలు కంపమెత్తన్
  నటియించు భైరవు జట లోకో నాన్
  నురుగుఁ గ్రక్కెడి కడలి తరఁగగుంపుల్
  చెలియలికట్టపైఁ జిందులాడన్;
  ఉన్మత్తప్రకృతి నృత్యోత్సవంబుల్
  మింటిని మంటిని మేళవింపన్
            గడిమి విడువకు కర్ణధారీ,
            పడవ నడుపుము భయముదీఱీ
   నడిసముద్రంబునఁ బడితినంచున్
   జడివాన నిలువంగ జాలనంచున్
   వడగండ్ల 'బాంబులు' పడునొ యంచున్
   గటికచీఁకటి గన్ను గాననంచున్
   ఒంటినైతిని సాయ ముండదంచుం
   బరిపరి విధముల భావింపఁగం
   బ్రాణ సంశయమునఁ బలవింపఁగన్

సమయంబు గాదిది జడచిత్తుఁడా,
చినిఁగిన తెఱచాప చెఱఁగులెల్లన్
సవరించి, యాత్మవిశ్వాసంబునం
         గడిమి విడువకు కర్ణధారీ,
         పడవ నడుపుము భయముదీఱీ.
పుడమిఁబ్రాఁకెడు చిన్న పురుగువోలెం
గష్టనిష్ఠురవిధి కాలిక్రిందం
బడి చిందుచిందురై ప్రాణమేదం
బుట్టలేదోయి యే పురుషుఁడైనం
గ్రిందికి దింపకు కేతనంబున్;
'సెర్చిలైటులు' వోలెఁ జీఁకట్లలోన్
మెఱసెడిఁ జూడు! క్రొమ్మెఱుఁగుఁదీఁగల్
దారిఁజూపెడు ధ్రువతార పైనన్
మిక్కు మిక్కునవెల్గు మేఘాలలోన్.
జీవనదీపమై చెలఁగు నాసన్
మలపక పాధోధి మధ్యంబునం
          గడిమి విడువకు కర్ణధారీ, ప
          పడవ నడుపుము భయమదీఱీ.

29.5.1922

__________

బాటసారి.

నిశ్శబ్దయామిని నీరవ వీణ
తంతులఁ గదలించు తరుణీలలామ.
యింత తటాలున నేల నిల్పితివి
రమ్యమూర్ఛన లీను రాగంబులెత్తి?
యానందమదిర పొంగారు పాత్రంబుఁ
బెదవులకంటించి పెఱికివైచితివి.
ఆ కణంబానిన యనుభూతివలన
హృదయంబు పిచ్చెత్తి యెగురు నెందెందొ!
యర్ధరాత్రం బాయె; నంధకారంబు
దిక్కుల వ్యాపించెఁ; జుక్కల గములు
మబ్బుచాటునదాఁగి మాయమైపోయె;
జల్లుజల్లున వాన జడివెట్టి కురిసె;
బాటసారిని, వన్యపథమందుఁ జిక్కి
దిక్కు దోఁపక యొంటి ద్రిమ్మరువాఁడ;
ఆరుపఁబోకు గవాక్షంబునందుఁ
గాంతిల్లు దివ్య సుగంధదీపంబుఁ;
దలుపుదీయుమ దీర్ఘ దైనిక శ్రమము
స్వప్న శీత స్పర్శ సమసి సుఖింపఁ,
గాంత, యొక్కింత నేఁ గన్నుమోడ్చెదను.

__________ 

మర్మకవి.

అనవరతంబు నీ వంతఃప్రపంచ
గంభీర నిర్మల గగనంబునందు
నెగిరిపోయెద వోయి, యెటులఁబట్టినను
ఓ మర్మకవిమౌళి, యూహ వంచించి
యేకాననంబున, నే మూలయందొ,
యేపూవుఁబొదరింట నేయాకు సందొ,
వినరాక కనరాక వికసించి తావి
యూర్చెడు క్రొంబువ్వు నోజ నెయ్యెడనొ
వసియించెదవుగాని, వన కుటీరమున
నీ యపూర్వపు సృష్టి నీలాంబరమున
రతనాల విల్లునా రమ్యమైతోఁచు.
అప్సరోవీణల యం దుద్భవించు
రాగంపుగఱులు స్వర్గద్వారమునకు
హృదయంబుఁ గొంపోవు రీతి, నీకావ్య
పుష్పకంపు రసార్ద్ర పులకితాత్ములను
జీవన యాథార్థ్య సీమలం దుండి
కొనిపోవు నందన వన గంధవహము
వీతెంచుకల్పనా శీత నగంపుఁ

గడపటిశృంగంబు కడకొక్క త్రుటిని.
చంద్రకిరణంబుల జనియించినట్టి
యా స్వప్నలోకంపు టచ్చఱబోంట్లు
పటికంపుఁబాత్రల పైయంచు పొరల
ద్రాక్షాసవముఁ దెచ్చి దగ్గఱఁజేఱి
యందీయఁ దమిదీఱ నాని, మత్తెక్కి
యఱగన్నుమోడిచి, యన్నికష్టముల
మఱచి సుఖింతు నీమహిమంబు వలన.
మిన్నుపైఁబడిసను మేలుకొల్పకుము;
ఆనంద రసవార్ధి యం దీఁదనిమ్ము.
కవికులాభరణ, నీకావ్యమాధురికి
వినిమయంబుగ నీయ విశ్వంబునందు
నేమియుఁ గన్పట్ట దీఁడైనయటుల!
ప్రార్థనాంజలి పుటి బాష్పముత్యముల
యుపహార మిచ్చి నేనొక్కవందనము
నర్పించుచున్నాఁడ నందికోవయ్య.

30-5-1922

_________ 

రాధాకృష్ణులు.

_________

రాధ.

ఏమోయిశ్రీకృష్ణ, యింతప్రొద్దాయెఁ
గనులకు నీరూపు కఱవాయెనేమొ!
సంజరంగులలోన సమసె గోధూళి;
వేణుసంగీతంబు వినువీథి ముట్టెఁ;
కాళింది మడుగులో గలఁ బూచియున్న
కలువపూనెత్తావి గాడ్పులు విసరె;
ఆమనితోఁటకు నతిధియౌ పికము
ప్రేమప్రవాహంబు వెలికుబ్బిపాఱ
హృదయ తటాకంపుఁ దుదితూముఁ దెఱచె;
నీయందు లీనమై, నినుఁగాంచు వేడ్క
నాతురపదు మతి నాఁపంగలేక
వాకిట నిలుచుండి వసవీథి నెపుడుఁ;
గనికని నాకన్నుఁగవ నీరుగ్రమ్మె.
ఇంతకక్కస మేల? యింత కసియేల?
చంపనెంచిన నింత చాటుఁదనమేల?
నీ నవ్వు విన్నంత నిన్ను గన్నంత
వచ్చె నాప్రియుఁడంచు భావింతుఁగాని,

యవ్వల స్మృతిదక్క నంతయు నింద్ర
జాల మట్లేడకో జాఱిపోయెదవు!
నిన్ను నమ్మినదాని, నిన్వలచుదాని,
నీపదంబులఁ జిత్త నీరేజ కళిక
నిడు తపస్విని జీవనేంద్రచాపంబు
ఖండించెదేమోయి, కఠినహృదయుండ!

కృష్ణుఁడు


ఓముద్దరాల, నన్నూరక యేల
కానిమాటలు పల్కి కటకటించెదవు?
యమున గట్టులనుండి యాల మరలించి
వచ్చితి నిప్పుడే వనసీమదాఁటి;
కావి దుమారంబు గ్రమ్మిన చేల
మైనఁ దీలేదింక నరయు మోచెలియ.
నిష్కారణపు శంక నిందింపఁ దగదు,
తథ్యమారసి నన్ను దండింపరాదె?
లావణ్యసరసిలో లాస్యంబు లాడు
నీమోముదమ్మి యే నిమిషంబెకాని
చూడకుండిన నాకు శూన్యమౌ జగము.
మున్నటి వలపులు, ముద్దుముచ్చటలు
మఱచి యిట్లాడేదో మతిలేనిదాన!

రాధ

ఔగాని, శ్రీకృష్ణ, యా మాయవలపు
బయలయ్యె, నింతగా వర్ణింపనేల?
వలిపపు వలెవాటుపైఁ బసపుగుర్తు
అతికినట్టుల నేల యయ్యెనో చెపుమ?

కృష్ణుఁడు


మోదుగాకులుగోయ ముదిమోక లెక్కఁ
బువ్వుల రసమంటి పుట్ట మిట్లాయె.

రాధ


తాఁకినఁ గందెడు తనువుపై నేల
గోటిగిచ్చులు పడ్డ గుర్తు లగుపట్టు?

కృష్ణుఁడు


ఇందుకే శంకించితే! పువ్వుఁబోఁడి,
కోరిందపొదలోనఁ గోడెదూ డేఁగ
వెన్నంటి పోయెడివేళఁ గంటకము
లంటి గీతలుపడె, ననుమానమేల?

రాధ


చివురుటాకులువోని చెక్కిళ్ళసొబగు క
లఁగిన రుచి దోఁచు కారణంబేమి?

కృష్ణుఁడు


మావిగున్నల నీడ మధ్యాహ్న వేళ
నలసి నిద్రించెడు నప్పుడు గఱిక
యొరయిక నొక్కింత యొత్తిగిలె నేమొ.

రాధ


అందాల కందమౌ యధరబింబమునఁ
గాటుక మరకలు గనుపట్ట నేల?

కృష్ణుఁడు


నీకన్నులకు సాటి నిలిచి వలపింప
ముదముతోఁ గల్వల ముద్దిడికొంటి;
ఆ రంగు పెదవుల కంటెనో యేమొ!
ఏ నొక్కతప్పిదం బెఱుఁగ నోసకియ.

10-5-1922

_________

వాల్మీకి.

వాల్మీకి కవిచక్రవర్తి, నీవెవరు?
   సరస కవితాలతా శాఖలందుండి
   యామనికోయిల యట్లు గూసెదవు?
   ఎచ్చోటఁ బుట్టితి వేడ పెరిగితివి?
   యేతల్లి చనుఁబాల నింత మహిమంబుఁ
   గాంచితో చెప్పుమ కవిసార్వభౌమ;
   నింగిని భేదించు నీమహాసృష్టి
   యెదుట నీచారిత్ర మెం దడఁగిపోయె?
   గంగానదీ శీతగర్భంబునందు
   నిదురించుచున్నదా నీచరిత్రంబు?
   అభ్రంకష హిమాచలాంతర కటక
   గంభీర గహ్వ రాగాధ శూన్యమున
   మాఱుమ్రోసెడు నె నీమహనీయ వాణి?
   ఓ యాదికవిరాజ, యోదివ్యవాగ్మి,
   యెన్ని యేండ్లునుబూండ్లు నేఁగెనోకాని,
   మున్ను హిమాలయ మోహనాటవుల
   నీవుమీటిన కావ్య నిర్ణిద్రవీణ
   నేఁటికి వినఁబడు నిఖిలదేశముల!
   భావ కిరణంబులు పడుగుపేకలుగ

నీ వల్లినట్టి రమణీయదృశ్యంబు
బంగారుస్వప్నంబు ప్రజలనెల్లపుడు
నానంద రసవార్ధియందుఁ దేలించు.
నీచేయి సోఁకిన నిమిషంబునందె
బంకమన్నైన రూపముఁదాల్చి నిలుచు!
ఈ యింద్రజాలంబు నేడ నేర్చితివి?
యీశిల్ప నైపుణి యెట్టు లలవడియె?
ప్రకృతిభాండారంపు ద్వారంబు దెఱచి
గుప్తరత్నంబులఁ గొల్లగొట్టితివి!
ఆకాశమునఁగల యన్ని తారకలు
కడలి గర్భమునందుఁ గల జీవమణులు
సరితూఁగలేవు నీ సౌభాగ్యమునకు!
భావవారిధిఁ బూల పడవ నడిపించి,
ముత్యాలరేవులో మునిఁగి యడుగంటి,
పలురంగు మణులను వలలీడ్చి తెచ్చి,
నవ్యమౌ కావ్యమండన మొండొనర్చి
విశ్వసాహిత్యంబు వెలిఁగించినావు!
కవితా నభో రవీ, కవిచంద్రులెల్ల
నీ కాంతిపూరంబు నిండారఁ ద్రావి
తమ కళ పెంపొంద దైవాఱుచుంద్రు.
నీ మనోవల్లకీ నినదంబుఁ గాంచ

సాధ్యంబుగామి నాశారద వీణ
నేమూలవైచెనో యెఱుఁగంగరాదు.
నీసృష్టి కెదురుగా నిలిచి నిట్టూర్చి
తమ్మిచూలియునైనఁ దలవంప వలయు.
పుట్టించితివి పో యపూర్వమూర్తులను
హైందవ సామాజి కాదర్శములను;
రామాయణము నీదు రమణీయ భావ
నండన వనిఁ బాఱు నవ్యనిర్ఝరము;
హైందవసంఘ మీ యమృతంపుటూఁటఁ
దరతరంబులనుండి తమిదీఱ నాని
నవజీవనపు శక్తి, నవధర్మరక్తిఁ
గాంచి లౌకికయాత్ర గడిపెడి నహహ!
జాతీయకవి, నమస్కారశతంబు
లర్పించి నీచరణాబ్ద రేణువులఁ
దలఁదాల్చితినిఁ; జంద్ర తారకా భరిత
నీల గగనముక్రింద నిలుచున్నయపుడు
మనుజుని యల్పత మతిఁదోఁచునటుల
నీ ప్రతిభావాహినికి ముందునిల్చి
నా కవిగర్వంబు, నాభావశక్తి
దుమ్ముదుమారమై తూలిపోయెడిని.

24-5-1922



కవి: సన్న్యాసి

[అస్తమయము: సముద్రతీరము. ఒకసన్న్యాసి యింద్రధనువు రంగులు గల గుల్లలను నొడినిండనేరికొని, సముద్రతరంగములు పాదముల నభిషేకించు నట్లు తీరమునఁగూర్చుండి, గుల్లపడవలను దేలించుచుండును. ఇంతలో నొక దివ్యపురుషుఁడు వేణువును మ్రోయించుచు నాకసమునుండి యచ్చోటికి దిగును.]

సన్న్యాసి

(స్వగతము)

సాంధ్యవర్ణాంకిత జలధరదూత
   యనఁగ నెవ్వండీతఁ డంబరమునుండి
   తీరసైకతమున దిగుచున్నవాఁడు!

(ప్రకాశముగ)


   ఎవ్వండవోయి, నీ వివ్వేళయందు
   ఱెక్కలుపుట్టి చరించెడు నింద్ర
   జాలంపు మురళివై స్వర్గంబునుండి
   యవతరించెదవు మానవలోకమునకు?

కవి


   సన్న్యాసితిలక, నే స్వప్నపురవాసి
   శిల్పినిగాని, — నీచేష్టలు గాంచ
   నుబుసుపోకకు వచ్చి యుదధి వీచికల
   గుల్ల పడవలు తేల్చి క్రుంగంగ నవియుఁ
   గన్నీరు నించినగతిఁ గానిపించు.

సన్న్యాసి


స్వప్న పురవాసి, నే జాలరిభంగిఁ
గడలిమధ్యంబునఁ బడవ నడిపించి
మంచిముత్యంబుల మణుల గడింపఁ
బలుమాఱు వలలీడ్వ వత్తునేగాని,
చటుల ఝంఝావాత సంక్షుబ్ధ వార్ధి
కల్లోలములఁజిక్కి కడగానలేక
పడవ తుత్తునియలై పగులునో యంచు
నూహించి, భయపడి యొడ్డుకు నెట్టి,
శూన్యభావంబున శుక్తిపోతములఁ
దీర వీచులయందుఁ దేలించుకొనుచుఁ
గాలంబుఁ గడపెదఁ గపటసంతృప్తి.
ఔ గాని, నీవేమి యాచరించెదవు?
వేణువాదనమె నీవృత్తియా యేమి?

కవి


అంబర చరులైన యధ్వగుల కొఱకు
విశ్వంబునంగల వివిధ నక్షత్ర
గణముల నొండొంటిఁ గలుప రత్నాల
వింటి వంతెనలు కల్పింతు రమ్యముగఁ;
గడలిద్రచ్చిన గాధకావ్యంబు లల్లి

యున్మత్తవీచుల యుద్ఘోషలెల్ల
నిశ్శబ్ద రజనీ వినీలగర్భమున
శ్రావ్యమౌ యప్సరస్సంగీత మటుల
నొనరింప వేణువు నూఁదుచుండెదను.

సన్న్యాసి


ఓమంత్రకాఁడ, నీవేమేమొ నుడివి
మోసగించెదవు సమ్మోహంబుఁగొలిపి.
ఒకచేత నమృత మింకొకచేత విషము
నాను మాను మటంచు నందియిచ్చెదవు!

కవి


అదియె జీవనరహస్యంబు సన్న్యాసి,
చేఁదుతీపులు రెండుఁ జేరియే యుండు,
నొకటి యుండినచోట నుండు రెండవది.
పడవ వ్రీలునటంచు భయపడెదవేని
జలధి దున్నెడు కోర్కిఁ దలపోయఁబోకు.
అలల రాపిళ్ళకు నాగలేవేని
ముత్యాలపై నాస పుట్టంగనేల?
పన్నీరుపువ్వును బడయ నెంచినను
ముల్లు దాఁకునటంచు నల్లాటమేమి?
నీ నీడ నెడఁబాయు నిఖిల యత్నములు
వ్యర్థమౌనని వేఱ వచియింప వలెనె?

సన్న్యాసి


అట్లైన నోశిల్చి, యల్లవిగొ గనుము!
భగ్నమై పడియున్న పడవ చెక్కలను
యాత్రకు యోగ్యమౌనటుల జోడించి
తెరచాపలం గట్టి తెడ్ల నందిమ్ము.

9.6-1922

_________

మాతృమందిరము.

[మాతృమందిర సందర్శన తత్పరులైన కొందఱు యాత్రికులు, కొండ నెత్తమున వొకనాఁటి రేయి గడపి, ప్రొద్దుపొడుపున మేల్కొందురు. కను చూపుదూరమున వారికి మాతృమందిరము కనుపట్టును.]

మొదటి యాత్రికుఁడు

అవనీధరంబుపై ననిల డోలికల
   నల్లనల్లన నూఁగు నంబుదార్భకులు
   బంగారుకలలలోఁ బడి చిక్కుకొనిరి.
   మంచుముత్తెపుఁ దెరలు చించి తొలఁగించి
   పడకింటి కిటికీని బాగుగాఁ దెరచి
   నవ వధూతిలకంబు నాఁ దొంగిచూచు
   దిన రమామణి తూర్పు తీరంబు నందు,

రెండవ యాత్రికుఁడు


విరిసెడి క్రొంబూల వింత నెత్తావి,
చుట్టుపట్టుల నున్న సొగసైన గిరులు,
కర్ణ పేయంబైన ఖగపాళి రుతము,
ఆనందజనకమై యలరు నిచ్చోట!

7

మూడవ యాత్రికుఁడు


మాతృమందిరమున మంగళధ్వనులు,
బంగారు గంటలు పలికించు రవము,
శంఖ నినాదంబు, సామగానంబు
నాలకింపుఁడు! కాలహరణంబు తగదు.

నాల్గవ యాత్రికుఁడు


అమలసౌరభ మీను నగరు ధూపంబు
కర్పూరఖండంబు గనిపించు త్యాగ
మాత్మలో వెలిఁగించు నమృతదీపంబు!

ఐదవ యాత్రికుఁడు


అల్లదే! సోదర యాత్రికులార,
పర్వతశిఖరంబుపై మాతృమంది
రంబు సూర్యాంశుల రమణీయమగుచు
మణిమయ మకుటంబు మాదిరిఁ దోఁచు;
పూజసల్పఁగ ఫల పుష్ప చయంబు
దోసిళ్ళఁ గొనితెచ్చి త్రోవపట్టుదము.
మందిర మార్గంబు మహితవృక్షముల
నీడలఁ జల్లగా నిదురించుచుండు.

పలువన్నెమణులను బఱచిన పోల్కి
రాలిన పువ్వుల రాజిల్లు నేల
సూర్యతాపంబున స్రుక్క.క మున్న
మాతృసాన్నిధ్యంబు మనము చేరుదము.

ఆకాశవాణి


నిలుఁడోయి, నిలుఁడోయి, నిశ్చింతులార,
సత్యమెఱుఁగరు బాల్య చాపల్యమునను;
సరణి యెల్లను బుష్పసంకీర్ణ మనుచుఁ
జల్లనీడలఁ బోవు సమతలం బనుచు
భావించెదరుగాని పరిచితిలేమి,
నిదియె యాత్రికులఁ బరీక్షించు షథము!
మెఱసెడి నదియెల్ల మేలిమిగాదు,
బాహ్యచిహ్నంబుల భక్తుఁడు గాఁడు;
ఎందఱెందఱో యాత్ర కేఁగుదెంచెదరు
విజయ మొందెడివాఁడు వేయింటి కొకఁడు,
అధమ లోహములెల్ల నగ్నిపుటాన
నంతరించును నొక్క యపరంజి దక్క.
దుర్బలచిత్తులు, దుష్ట చేష్టితులు,
కార్యశూన్యులు, మోసగాండ్రును, జడులు
మార్గమధ్యమునుండి మరలెదరు గాని,

తిలకింపలేరు మందిర పుణ్యభూమి.
ధర్మజీవనుల పాదస్పర్శచేత
ననుదిన పావనంబైన దీ పథము!
ఆత్మసమర్పకులౌ వీరవరుల
యస్థులచేఁ బూతమైనదీ పథము!
త్యాగవ్రతుల శోణిత ప్రవాహమునఁ
గడుగంగఁబడిన దీ కఠినంపుఁ బథము!
దీని తత్త్వంబును దెలిసికోలేక
యాటపట్టని యెంచి యరుదెంచినారె?
భోగలాలసులార, పొండు మీపురికి.

[ఇంతలో దారిప్రక్కనఁ బడియున్న యొక పునుక యాత్రికులను జూచి, కలకలనవ్వి, యిటులఁ జెప్పసాగెను:]

పునుక

ఏండ్లు పూండ్లాయె మేమిచ్చోట నొరగి,
దుమ్ము దుమారంబు తొఱ్ఱల నిండి
పుట్టగొడుగులు పచ్చపూరియు మొలిచె;
మాయెమ్ము లెచ్చోట మట్టిలోఁ జివుకు
నచ్చోటఁ దీవియ లల్లి పుష్పించు;
ఆ సుమ మకరంద మానిన నరుఁడు
పరమ విజ్ఞానియై పరిఢవిల్లెడిని.

జననమొందిన యప్డె చావు నిశ్చితము,
మాతృదేవీ బలిమంటప మందు
యజ్ఞ పశువుగ నిల్చు నంతటిభాగ్య
మెవనికి సిద్దించు నిందఱిలోన,
నా మహాపురుషుని యఱకాలి దుమ్ము
ప్రజల శిరం బెక్కి భవ్యంబుసేయు;
ఆతని కన్నుల యం దుద్భవించు
బాష్ప బిందులు దేవభాండారములను
వెలలేని ముత్యాల విధమున నుండు.
ఆ యశస్వి చిర నామాక్షరపంక్తి
యప్సరో గేయమై యలరారుచుండు;
ఆ ధీరు క్రొన్నెత్తు రన్ని దిక్కులను
విజయాంకములు వ్రాసి వ్రేలాడఁగట్టు.
యాత్రికులార, మీయందఱిలోన
నట్టి వీరుండున్న సడుగుపెట్టుండు.

[యాత్రికు లొకరిమొగ మొకరు చూచుకొని దిగాలుపడుదురు; కొందఱు తలకొక్క దారిపట్టుదురు; మఱికొందఱు వేషధారులు నోటఁ దడిలేక వెనుకంజవేయుదురు; ఇంకఁ గొందఱు దుర్బలహృదయులు అందఱకన్న మున్ముందుగ వెనుకకు మరలుటకు యత్నించి గిరిసానువునుండి కూలఁబడుదురు. కాని, యొక్క యువకుఁడు మాత్రము, సజల నయనుండును, పులకిత శరీరుండును, పుష్పాంజలి బద్ధుండునై నిలుచుండి పునుక కిట్లు విన్నవించును: ]

కడపటి యాత్రికుఁడు

ఆటపట్టగు నాకు నఖిల విశ్వంబు,
విశ్రామభూములై వెలయు గ్రహంబు,
లంగంబు చెండుగా నాటాడుచుందు!
విత్తు నశింపంగ వెలువడుఁ జెట్టు,
వత్తి కాలకయున్న వఱలునే కాంతి?
యభ్యుదయ హేతువై యలరుఁ ద్యాగంబు;
అట్టిత్యాగము నాకు నాదర్శకంబు!
బాధలే నా కాప్త బంధువర్గంబు;
బీదతనంబె నాప్రియమైన హక్కు;
లోకహితంబు నాలోచించు పనియె
కఠినంపు విధి; దైవఘటితంబు నదియు.
స్వాతంత్ర్య రథ మెక్కి సంసిద్ధుఁడనుగ
మునుకొంటి; గుఱ్ఱాలఁ బూనింతు నిపుడె.
విజయాపజయములు విధిమూలకములు;
యత్నంబె మనచేత నైన కార్యంబు.
మాతృపాదంబులం బడు భాగ్యమున్న
గిరులైన నన్నడ్డగింపఁ దరంబె?
మార్గ మధ్యంబున మడసితి నేని
మీవలె నెమ్ములు మేదిని వైచి

నక్షత్రములలోన నటియించు చుందు.

పునుక



ఓయి కుమార, నీయుత్త మాశయము
వెలిపుచ్చితివి త్యాగవీరుండ వీవు!
మాతృమందిర బలిమంటప వేది
నాత్మకర్పూరంబు నంటింప వోయి.

ఆకాశవాణి



పూజారి వాఁడుగో! పువ్వుటెత్తులను
దెచ్చి ద్వారముకడఁ దిలకించు వాఁడు.
కాల మమూల్యంబు కదలు కుమార,
కాలిగుర్తు లనంతకాల సికతములఁ
బూర్వవీరుల పోల్కి ముద్రించి పొమ్ము!

5-10-1922

__________

హృదయాభిలాష.


శ్రీగోపపాల, యాశ్రితభక్త జాల,
దివ్య వేణువినోది, దీన శరణ్య,
నలినాక్ష, నాజీవనంపుఁ బాత్రమున
నీ గానసారంబు నిండింపుమయ్య.
ఆనందమున నందు నంగంబుగరఁగి
గీతారస స్రుతి రీతి ననంత
కాలసాగరమునఁ గలసి పోయెదను.
విశ్వ కావ్య కవీశ, వేదాంతవేద్య,
విజ్ఞాన మయమైన విస్ఫులింగమున
నంటింపు నాహృదయంపుఁ గప్పురము.
నిరతంబు నీపాద నీరేజపీఠి
నెత్తావిఁ జల్లుచు నేను వెల్గెదను.
ఓ జగజ్జ్యోతి, నీ యుజ్జ్వలశోభ
నా మనో నేత్రంబునకుఁ దోఁపనిమ్ము,
కన్నులఁ బ్రమదాశ్రు కణములు దొరఁగి
పూజకుఁ బువ్వులై పోనరునో దేవ!

7-10-1922

_________

భవిష్యద్దర్శనము.

సందెముత్తైదువ, సరిగవలిపంబు
వరివెన్ను పాపలు పట్టిలాగంగ
వాత్సల్యమునఁ బైకి వంగెనో యనఁగఁ
జెంగావి నిగ్గులు చేలపై నలమె.
ఈ రామణీయక మీక్షించి యింటఁ
గాలునిలువక యూరి కడపటనున్న
పొలమున విహరింపఁ బోతి నొంటరిగి.
తిన్నతిన్నగ వీచు తెమ్మెరల వలన
వెన్నులు బంగారు వీచులై రేఁగె!
కాంతియు గానంబుఁ గలసి యనూహ్య
మగు నింద్రియవిషయమై కానిపించె.
అచ్చోట నానంద మనుభవించుచును
నొక్కింత కూర్చుండియుంటి నిశ్చలత.
అంతలోఁ గెంజాయ లంతరింపంగఁ
గప్పెను బ్రకృతి నక్షత్ర సంఖచిత
కోమల తిమి రావగుంఠ నాంబరము;
గాలి వీచుటమానెఁ, గదల వాకులును;
అమ్మ పేరెదనాడి యలసి కనుమోడ్చు
పసికూనలటు సరోవర మధ్యమందు

నిశ్చలశాంతిమై నిదురించు నలలు;
గాంభీర్యమును దాల్చె గగనతలంబు;
సగము జాగ్రదవస్థ సగము స్వప్నమున
భావించుచును గట్టుపైన గూర్చుంటి.
సత్యమో, భ్రాంతియో, స్వప్నంబొగాని,
యింద్రజాలము వోలె నెదుటఁగస్పట్టె.
అది సత్యమైయున్న నాశ్చర్యకరము!
అది కలయేయైన నానందమయము!
    * * *
మావితోఁటను బర్ణమంటపమందు
జనరంజకంబైన సభ యొండు జరిగె.
మొగలిరేకులు తమ్మి పూఁదోరణంబు
లందంబు నెత్తావి నర్పించుచుండె.
రారాజు క్రొంబచ్చఱా గద్దె డిగ్గి
యందఱితోఁబాటె యవనిఁ గూర్చుండెఁ;
బనిపాటు లేనట్టి బంటుసిపాయి
త్రుప్పుపట్టినకత్తి తొంటిపై రాయఁ
దనపూర్వ జయములఁ దలపోయుచుండె;
బురదచిట్టలు పడ్డ పుట్టములఁ గాఁపు
నర్తించె నృపపరివారంబుఁ గలసి;
కూలినాలి యొనర్చి కుడుచు నిరుపేద

యజమాని సరిబంతి నాసీనుఁడయ్యె.
సకల మానవజాతి సంతతులు కుల
వర్ణ భేదంబులఁ బాటింపఁ బోక
యొక్క కడుపునఁ బుట్టి యొక చన్నుఁబాలు
ద్రావినరీతి సౌదర్యంబు గలిగి
యన్యోన్య సాహాయ్య మర్థించువారు.
స్ఫటికపాత్రంబున శాంత్యాసవంబు
ధర్మదేవత తెచ్చి తనిపె నందఱిని;
ఏక కుటుంబమై యీప్రపంచంబు
స్వర్గంబు భూమిపై స్థాపింపఁ బడియె.
అభ్యుదయాంశువు లన్నిమూలలను
నవనవోజ్జ్వల జీవనంపు దీపముల
వెలిఁగించుచుండె; నీ విశ్వమంతయును
మానవకళ్యాణ మందిరం బయ్యె.
అంతలో లౌకిక యాథార్థ్యములను
భావంబు వ్రాలెను బక్షివిధాన,
బొగ్గుకంబము లట్లు పొడకట్టుచుండెఁ
దత్ప్రాంతముల నున్న తాళవృక్షములు!
చిమ్మచీకటి నొంటిఁ జిక్కుకొనియుంటి.

1-10-1922

__________

సమరతృష్ణ

సంగరతృష్ణచే స్వాంతంబు రగులఁ
బటు దురాశావేశ పారవశ్యమున
నధికారదాసులై యవనిఁ బీడించు
మనుజ సంతతులార, కనికరములేక
బలహీన జాతులఁ బట్టిచంపెదరు.
దేహంబు నలుపైనఁ దెలుపు పసుపైన
నాత్మబంధులుగారే యఖిలజనంబు?
కామంబు, క్రోధంబు, గర్వంబు, జాతి,
దేశంబు, భాషయన్ దెరలు చింపంగ
సర్వసామాన్యమై చను మానవత్వ
మొక్కతీరునఁ గాకయున్నె వేర్వేఱ?
మానవరక్త సంభార విక్రయము
గావించు నక్రైస్తు ఘాతుకులార,
విజయ మదిరాపాన వీతచిత్తమున
నేల పావనమూర్తి నేను మహాత్ము
మఱియొకమాఱు కర్మాగారపంక్తి
చిమినీలపైకీడ్చి సిలువ వేసెదరు?

నిస్సహాయయు, దాస్య నిగళబద్ధయును
నగు నమాయికజాతి యస్థిపునాదిఁ
గనకమందిరములఁ గట్టుచున్నా రె?
యూలపోయెడినారి యుడుకు నిట్టూర్పు
విసరదే మీచితి వేడిమంటలను?
సొంత యక్కఱకన్న నెంతొ యెక్కుడుగ
వస్తుల నిర్మించి వాని వెలపుచ్చ
జనసంఘముల బానిసలుగఁ జేయుదురె?
ఇట్టి యన్యాయ్య మింకెంతకాలంబు
అవును గాదనకుండ రవులుకొనఁ గలదు?
ఐశ్వర్యవంతుల యఱచేతి ఫలమ,
కష్టజీవుల పాలి కంఠపాశంబ,
ఓ నాగరకత, నీయున్నతాదర్శ
మిదియె యైయుండిన నింకఁ జాల్చాలు!
మానవ హృదయమ్ము మంటవెట్టకుము.
చీఁకట్లుపెనుగాలిఁ జిమ్ముఱెక్కలను
భూమిపై పైఁగప్పి పొదుగంగఁబోకు
కాలకూట జ్వల గ్రక్కు సర్పముల
వాణిజ్య దేవతా, వాయుసామ్రాజ్య
మందుఁ జరించు మాయల మంత్రకత్తె,
అతిదురాశా తృషఁ బతితులౌ జనుల

బంగారు పావలకుఁ బట్టి బంధించి
కొండలం గానలఁ గోనల గుహల
మింటను మంటను వెం'టఁ జీఱాడ
నీడ్చికోఁ బోయెద వేమి నీ మహిమ?
నీపాదచిహ్నల రాపాడి వచ్చు
సంగర పశుశ క్తి చచ్చి చావకయ
యాత్మకృతాపరా ధాంక మై నిలిచి
బహుళ పశ్చాత్తప్త బాష్పపూరములఁ
దన మనోవికృతుల దాహంబుఁ దీర్చు.
శాంతి నానాజాతి సమితి చేకూర్చఁ
జాలునే చిత్తముల సలసలం గ్రాగు
పాషాణ రసములు పైకిఁ బొంగంగ?
సమర పరాజిత శత్రువర్గముల
కొల్ల ద్రవ్యము పంచుకొనువేడ్కఁ బెద్ద
భాగంబులకుఁ బోరు 'పరమ సౌహార్ధ
చక్రవర్తుల' కేల శాంతిపీడనము?
ఖండాంతరంబుల కపటనాటకమ,
కాలమెప్పటికైనఁ గనికరము లేక
నీముసుంగును జీల్చి నిజమూర్తిఁ జూపు.
భావి సంగర ముష్టిఁ బట్టుపడనీక
జగతినిఁ గాపాడ సకలదేశముల

కవిమహాశయు లొక్క కట్టుగావలయు.
ఇదియే నాస్వప్నంబు; నిదియె నాయాశ.
కలయు నిక్కంబగు కాలంబురాదె?
ఓ కవివరులార, యో జగదేక
శాంతి దాయకులార, సర్వజనీన
సేవా సమాసక్త చిత్తాబ్జులార,
అల్లదే! దర్శించుఁ డవతరించెడిని
ఆధ్యాత్మిక యుగంబు! నానాందమఖము!
జ్ఞానహోమాగ్ని మీ కరదీపికలను
వెలిగించి, జెండాలు వినువీథి నెగుర
నఖిల మానవ హృదయధ్వంసి కీట
కములకుఁ దల్లియౌ కటిక దురాశ
సమయింప సంగ్రామ సన్నద్దులగుఁడు
నిభృత శాంత కుటీర నీడములనుండి
కవికోకిలములార, గగనంబు గనుఁడు.
ఎంతవిశాలమై యెంత గాంభీర్య
రామణీయకముల రాజిల్లునదియొ!
లేలెండు తఱి యిదే లెండు సఖులార!

26-10-1922

__________ 

* మేలుకొలుపు.

_________

మేలుకో భారతకుమారా,
మేలుకోరా తరుణధీరా,
                       మేలుకో!
కష్టనిర్భర దాస్యమట్టులఁ
గాఱుచీఁకటి సడలిపోయెను,
భావి ప్రత్యూషమును జాటఁగ
వాఁడుగో! శుక్రుడు రహించెను,
                       మేలుకో!
మంగళ ధ్వనులటుల పక్షులు
మంజులా లాపములు సల్పెను,
మాతృభూమి జయాంకమై రవి
మండలం బుదయించెఁ దూర్పున,
                          మేలుకో!
మేలుకో భారతకుమారా,
మేలుకోరా తరుణధీరా,
                         మేలుకో!

30-10-1922

__________

వాన కాలపువరిచేలు.

క్రొక్కాఱు మబ్బులు గుంపులుగూడి
యాకసంబునఁ దేలు నట్టి తరుణమునఁ
బసినాఁటి యానంద రసము పొంగంగఁ
బలుమాఱుఁ గాంచితిఁ బచ్చవరిచేలు!
వానముత్తెసరాల నల ముసుఁగుఁ దాల్చి
దినలక్ష్మి కోమల దీధితులు చిల్కె;
జల్లులం దడిసిన సస్యపుంజంబు
దుమ్ము కప్పుదొఱంగి తొలకాడెఁ గాంతి;
గాలిలోఁ దడిపచ్చికల తావి విరిసె.
పొగవన్నె మబ్బుపై నెగిరెడి కొంగ
బారు భౌతికరూప బంధంబు లెడపి
పుణ్యలోకముఁ జేరు ముక్తాత్మ మాల
యన భావవీథిఁ దోఁచెను విచిత్రముగ.
వానచిన్కులు సేయు గానంబు నేడు
అఖిల లీలామనోహరమైన బాల్య
కాలంపు స్వప్నంబుఁ గనులఁగట్టించు;
నింద్రజాలమురీతి నిగురొత్తఁ జేసె
నెన్నఁడో మఱచిన పిన్నతనంపుఁ
బొరపొచ్చెములు లేని బుజ్జికోరికెల.

1-11-1922

__________

హతాశ.

_________

అర్ధరాత్రపువేళ, నంబరవీథిఁ
దారలు వికసించు తరుణంబునందు,
స్వర్ణమయంబైన స్వప్నమోహమున
మానవలోకంబు మగ్నమైనపుడు,
ఒంటిగావచ్చి నా యుటజంబు కడకుఁ
దలుపుఁ దట్టుమటంచుఁ జెలికిఁ జెప్పితిని;
'అట్లెెపో' యని తలయాడించె సకియు.
రెండుజాములు దాఁటె రెండేండ్ల పగిది,
వేచియుంటిని--మది విసిగి వేసారె;
నింకైన నరుదేర దేమి కారణమొ?
రమణి దగ్గఱలేని రాత్రులయందుఁ
గడతెంపఁగారాని కాలభారంబు
సీసంపుగొలుసునాఁ జిత్తాంతరమున
వ్రేలెడి నిసి! - యెట్లు వేగింతు నిశను?
ఇంక మాకుఁ బరస్పరేక్షణ ప్రాప్తి
గలుగుట నిజమేని, కన్నీటిబొట్ల
మాలను రచియించి మాయలమారి
చేడియ కర్పించి శిక్షగావింతు.

నా యవివేకంబు నాకుఁ దోఁపింప
నరుణుండు తూర్పున నావిర్భవించెఁ;
బొలతి రానూవచ్చెఁ బోవనుంబోయె!
పచ్చి లత్తుకపూఁతఁ బైదలి యడుగు
ముద్రలు వాకిటి ముంగలం దనరె!
సకియ మేలిముసుంగు సందడి వినియుఁ
బవన కంపిత పర్ణరవ మనుకొంటిఁ;
బ్రేయసి చేతి దీపిక కాంతిఁ గాంచి
యమలతారాశోభ యని భ్రాంతిపడితి;
నెంత ముగ్ధుఁడనైతి! నెంత పొరపడితి!
అభిశప్త జీవనుండైన నేనేడ?
సకియ కంఠ శ్లేష సౌఖ్యమదియేడ?

8-11-1922

__________

శైశవస్మృతి.

శైశవ స్మృతి! యిహ స్వర్గానుభూతి!
వానమబ్బులపై సవారిచేయుచును
వర్షాగమంబున వచ్చితే నీవు!
నవసెడి మనచిన్ననాఁటి నేస్తముల
వానచిన్కులు సల్పు గానములగుండఁ
జెవిలోన గుసగుస చెప్పుచున్నావె?
అల్లిబిల్లులు దిరుగ, నాటలాడంగ,
వాఁగులై వీధులఁ బ్రవహించునీటఁ
గాళ్ళడ్డముగఁబెట్టి కట్టలుగట్టఁ
బ్రతి వానకాలంబు బాల్యంబుఁదాల్ప
నుల్ల మెవ్వేళ నువ్విళ్లూరు చుండు.
ఉల్లాసమున నాడు నోమబ్బులార,
జ్ఞప్తిలేదా మీకు నాముద్దు మొగము?-
మటుమాయ లెఱుఁగని మందహాసములఁ
జిందు సుకుమారంపుఁ జిన్నారి మొగము!
భావింపలేరె నా పసినాఁటి కనుల?_
ఆశ్చర్య మిళిత దివ్యానందమునను

మిమ్ముఁ గన్నట్టి యాకమ్మని కనుల!
మఱవరు గద నాదు చిఱు కేలుగవను? _
ప్రొద్దు నిగ్గులు పైడి పూఁత పూయంగ
సరిగపేటు విధాన మెఱయు మీయంచు
జాలరుం బడయు కోసము చాఁపి చాఁపి
పలుమాఱు వేసటపడిన కేల్గవను!
అట్టి శైశవ మిప్పు డలరునే నాకు?
బాల్యంబు గడచె; యౌవన మంకురించె;
నిరువది యారేండ్లు జరిగె నిష్పటికి.
అంబరచరులార, యంబుదములార,
యే దానధర్మంబు లే జపతపముఁ
బూర్వజన్మంబునఁ బొనరించి నారొ!
యిట్టి నిర్మలవృత్తి, యిట్టి జీవనము,
నెడలేని శైశవం బీపుట్టు వందుఁ
బడసినారలు మీరు పావనాత్మకులు!
కాల హలంబు నా కనుబొమలపైన
నడ్డచాళులు దున్నె; నైన మీరేమొ
పసినాఁటి చిన్నారి ప్రాయంబు విడక
యనుదిన నవ్యులై యలరుచుండెదరు!
మిన్ను నఁ జరియించు మిమ్ముఁ గన్నపుడు

నా వయస్సు గియస్సు భావింపఁ బోక,
వానచిన్కుల నాడ వలతునేగాని,
పరుల యాడికలకు భయపడి, యింటఁ
బట్టి బంధించిన పగిది నుండెదను.

మేఘములు



ఓ మిత్రమా, విధి కుమ్మలింపకుము
ఇంట నీవుండిన నేమి, నీయెడఁద
పిన్నటవలె మాదు బిగి కౌగిలింత
స్పర్శా సుఖంబును బడయుటలేదె?
కాల దౌర్జన్యంబు కాయమును దక్క
నీహృదయం బంటనే యంట లేదు;
ఓయి బాల్యసఖుండ, పోయివచ్చెదము,
మఱల నేడాదికి మనకు దర్శనము.

3-11-1922

___________

అభిసారిక.

మల్లెపూవుల దండ లల్లు సుకుమారి,
పరవశంబైన భావంబున మఱచి
యేల పూఱేకుల నిట్లు చిదిపెదవు?
కడుమెత్తనైన నీ కన్నెమనంబు
నెవ్వాఁడు హరియించె నీ నిశీథమున?
ఈ పూవుఁ బొదరింటి కేఁగెద నంచు
బాసచేసి ప్రియుండు మోసగించెడినొ?
యటుగాక, నీ మృదులాంతరంగమును
బీడించువేదన వెలియార్ప నొక్క
నిర్జన శాంతంబు నిభృతంబునైన
స్థలమునుగోరి యిచ్చటకు వచ్చితివొ?
ప్రణయ దీపమువెల్గి బాట గాన్పింప
నర్ధరాత్రమునందు నభిసరించితివొ?
నీ యంద చందంబు, నీ నీటు గోటు,
నీ ముద్దు మురిపెంబు, నీ విలాసంబు
నెంత వ్యర్థంబాయె నింతిరో నేడు!
చెమరించు నీమోము చిన్నెలయందుఁ
బ్రతిఫలించు నగాధ భావఘర్షణము!

భగ్నాశ నీ విటు పరితపింపంగ
నెడలేక తొరఁగిన కడగంటినీటఁ
దడిసె నీవు రచించు దండ, పూఁబోఁడి.
తనచేతఁ దలపోసి తలవంచు కొనఁగఁ
బ్రొద్దువొడుపున నీ పువ్వుల మాలఁ
బ్రేమదూతి యనంగఁ బ్రియునకుఁ బంపి
మంచికాలము రాక మదినెంచి కొనుము.

3-12-1922


__________ 

గఱిక.

______

దారికోవల క్రేవఁ దనరారు గఱిక,
యెంతమెత్తందన! మెంతటి ప్రోది!
యెంతక్రొత్తందన మిగురొత్త నీవు
మొన్నగాఁ గురిసిన ముత్యాల జడికి
మురిపాల గుబురువై పెరుగుచున్నావె?
దైవసృష్టిని నీకుఁ దావొండుగలదు;
నేనును నీపైన నెనరూనియుందు.
ఏను నీవైతినో యెవరికిందెలియు
మున్నుగతించిన పుట్టువులందు!
ఈవు నేనౌదువో యెవ రెఱుంగుదురు
రాఁబోవుజన్మాల రాకపోకలకు!
గుసగుస చెప్పెదు, గునిసి యాడెదవు.
నీలోన వెలిఁగెడు నిర్మలజ్యోతి
వెలికొత్తఁ బోరాట పెట్టుచున్నదియె?
నీ యందచందంబు, నీ సంతసంబు
నందఁ బాల్గొన నాదు డెంద ముప్పొంగు!
పంచవన్నె ముసుంగు వలిపంబుక్రింద
నొకవేళ నిరువుర మొకరమే యేమొ!

__________

దీపనిర్వాణము.

ఏదిక్కుఁ జూచిన నిసుక యెడారి,
నిబిడాంధకారంబు, నిస్సీమ తలము!
జగతి గర్భంబెల్ల చైతన్య రహిత
గంభీరశూన్యమై కనుపట్టుచుండె.
ఒంటిగా నేనొక్క యొంటెపై నెక్కి
యీ బయలు తరింప నేఁగుచున్నాఁడ.
రేయిఁ బాంథునకు దారిని జూపుచుక్క
లాకసంబున నెందు నగపడవేమొ!
ఒంటెపదముల చప్పు డొకటియు, గాలి
నిటూర్పు సడిదప్ప నిశ్శబ్బవీథి
వేఱు సందడి యొండు వీనులఁ బడదు.
హృదయదౌర్బల్యంబు వదలించి నూత
నోత్సాహముం గొల్ప నొక్క కోకిలయు
నమృత తుల్యంబైన యానందగీతిఁ
బాడ దక్కట! నాదు పాప మేమందు?
పలుమాఱు నాచేతి బంగారుదివ్వె
వెలిఁగింతుఁ గాని, కంపిలి యా నిమేష


మందె పయ్యర వీచి యారిపోయెడిని!
వెలిగించి వెలిగించి విసిగి వేసారి,
పెను దుపాను కరళ్ళ గునిసి త్రుళ్ళింత
లాడు చుక్కానిలేనట్టి పోతంబు
తీరున, విధి యీడ్చు తెఱఁగులనెల్ల
ధూళి బ్రుంగుచు నేడు ద్రొక్కుచున్నాఁడ.

8-12-1922

__________

వీణాప్రియ.

తంత్రులుదెగిన నా ధ్యానవిపంచి
విశ్వమోహనగీతి వెలికూర్చు నీదు
వీణ తంత్రులువేసి బిగియించి మర్శ
నీరవ మూర్ఛన నెఱపించు శ్రుతికి
మేళగించి, రహస్య కేళీగృహంబు
నకుఁ బంపుఁడని ప్రేమ నాప్రాణపతికిఁ
జెప్పిపంపితి దూతిచే నొకనాఁడు.
ఎన్ని యో దినములు నేండ్లును బూండ్లు
గలసిపోయె ననంత కాలశూన్యమున!
హృదయేశుఁడేమొ నా వదనబుఁ గనఁడు,
వీణయుం బంపఁడు, వినిపింపఁ డెట్టి
వార్తయునైన; నాపాపమెట్టిదియొ!
నా గానగర్వంబు, నా సోయగంబు,
నా భూషణప్రీతి, నా వచోరీతి,
నా యభిమానంబు, నా గౌరవంబు,
నాదు కౌలీనంబు, నా సిగ్గుసెరము
తొలఁగి, మేలిముసుంగు వలిపంబుఁ దిగిచి


యంతఃపురము వీడి యలజడికోర్చి
బిచ్చకత్తె విధానఁ బృథ్వి యెల్లెడల
దుమ్ముదుమారంబు గ్రమ్మిన చీర
ధరియించి త్రిమ్మరు తరుణంబునందు
నా ప్రాణనాథుండు, నామనోహరుఁడు
వనకుటీరంబున వసియించి నన్ను
‘రమ్ము నాకోర్కెలరాణి! రమ్మిటకు
నిపు డర్హవైతివి యీదివ్య వీణ
సారింప రమ్ము నాసరస గూర్చుండి.'
అని తియ్యగాఁబల్కి యానందబాష్ప
ములు కన్నులఁ దొరంగ ముద్దాడె నన్ను .

5.12-1922

__________ 

*సేవ.

మముఁగన్న భారతమాత మందిరమున


దివ్వెలై మన ముందామా, పైఁడి
దివ్వెలై మన ముందామా.


పరమ పావని తల్లి పాదపూజల వాడు

 


పువ్వులై మన ముందామా, పొన్న
పువ్వులై మన ముందామా.

 

భారతిదేవి విపంచిక రవళించు


తంత్రులై మన ముందామా, దివ్య
తంత్రులై మన ముందామా.


జన్మభూమీశౌర్య సౌరభ్యములు చల్లు


గీతలై మన ముందామా, భావ
గీతలై మన ముందామా.


కదనవీరులచేతి ఖడ్గ ధారలలోని


మెఱుపులై మన ముందామా, కారు
మెఱుపులై మనముందామా,

16-2-1923

_________ 

* ప్రబోధశంఖము.

ఏల తెలియక సంశయించెదవు?
                         భారతకుమారా,
    డీలుపడి వెనుకంజ వేసెదవు?
    విన్నదనమున మోము వాల్చెదవు?
                         దాసో౽హ మంచును
    జిన్నతనమునఁ గేలుమోడ్చెదవు?
    తెల్ల చర్మము నీకులేదనియో,
                        బలమైననాడులఁ
    జెల్లునెత్తురు పాఱలేదనియో!
    భారతీయుఁడ ననెడి గర్వమునఁ
                        దలయెత్తి నిక్కి
    తేఱిచూడుము సకల లోకమును.
    ఎంతకాలము స్వప్నసింహంబు
                       దడిపించు నిన్ను?
    జింతసేయుము తొలఁగు మోహంబు.


ఏలనోయీ గద్గద స్వనము?
                     ఆక్రోశగానము
చాలుచాలిఁక విఫల యాచనము!
వీరపూజోత్సవపు సమయమునఁ
                    బూరింపలెమ్ము
ఘోరభీషణ విజయ శంఖమును!
ఏల తెలియక సంశయించెదవు?
                    భారతకుమారా,
డీలుపడి వెనుకంజ వేసెదవు?

10-3-1923

_________ 

* రజని.

నిర్మల నీల నభంబునఁ జుక్కలు
               నిండె సజీవ వికాసములన్;
మర్మ విపంచిక నీరవ రజనీ
               మానిని మీటెను మూర్చనలన్.
ప్రాంత కుటీర లతా ద్రుమసౌధము
               లస్పుటతారా కాంతిన్,
వింతగఁ గరఁగెడివో యన ఛాయా
               క్రాంతములై కనుపట్టెన్.
నిశ్చలశాంతిని నిఖిల జగతి సుఖ
              నిశ్వాసము వెడలించున్,
నిశ్చల నిబిడ గభీరానందము
              నిండి సొరలె లోకమునన్ ;
దైనిక కలకల మూర్చితభావము
              తారా శిశిర స్పర్శన్
మానస గగనమునందు విహంగము
              మాదిరి నెగిరెఁ బ్రబుద్ధంబై .
గోరీపైని ప్రదీపిక యట్టులఁ
              గూర్చుంటిని నే నొంటరిగన్


సారెకు జాగ్రత్స్వప్నము నందుఁ బ్ర
            సక్తుఁడనై మఱిమేల్కొంచున్.
అహహా! నామది విశ్వముతోడ ల
            యాన్వితమై నటియిచున్,
అహహా! విశ్వము నా హృత్పాత్రిక
            నాసప రసమున లయ మొందున్.

14-3-1923

__________

* అభిసారిక.

గాలియడుగుల నెవరికోసరము
                      ఓ మోహశీలా,
      కదలివచ్చితి వీ నిశీథమున?
   కాలియందెలు ఘల్లు మనుననియె
                      ఓ వలపురాణీ,
     కేలఁగైకొని మెల్లనడచెదవు!
   పులుఁగు తుటుము తటాన కీచనుచు
                      అర గూర్కి గూళులఁ
     బలుక, వెఱపున దెసలు గాంచెదవు
   నిలిచి యేమని యాలకించెదవు?
                     నీ యడుగుసడికే
     యులికిపడి 'యెవర' నుచు మఱలెదవు!
   తెల్లవెన్నెల నీ దుకూలంబు,
                    మైపూఁత నిగ్గులు
     తెలియరావని యూహ సల్పెదవు!
   నీవు నడచెడి బాట యెల్లెడల
                    వ్యాపించు గందపుఁ
     దావు లెట్టుల గప్పిపుచ్చెదవు?
                    ఓ ముద్దరాలా,
   నీ విహారము బయలు పఱచెదవు.

15-3-1923

* ఆగంతుకి.

_________

చాలు లజ్జా మధుర వినయము!
     ఏల యవగుంఠనము వై చెదు
     పూలదండలు గట్టియున్ మెడఁ
     గీలుకొల్పక కేలఁ జిదిపెదు
                            శోభినీ,
                        యప్సరఃకామినీ!
     సందెవేళలఁ బూలఱేకులు
     క్రింది కురలఁగఁ గాంచి కాంచి మ
     రందబిందులు కన్నుఁ దమ్ముల
     జిందఁ బొగిలెదు ప్రకృతిచేష్టకు,
                            కామినీ,
                         సుందరగామినీ!
     పలుకరించినఁ బలుకవేమొ!
     పులుకుఁ బులుకునఁజూచి, చూపుల
     వెలువరించెదు లలిత హృదయా
     విల కఠోర వ్యసనభారము!
                            ఏలనే
                        మౌనం బేలనే


    ఎపుడు మౌనవ్రతపు టుద్వా
    సపు దినంబులు వచ్చుఁ గోమలి,
    యెపుడు విరియునొ మూకసందే
    శపు నిలీన రహస్య భావము;
                                 పోలునే,
                            చింతన చాలునే!
    తేలివచ్చెడి కల విధంబునఁ
    గాలియడుగులు సందడింపక
    యేల వచ్చితి వీ వసంత వి
    నీల గగన చ్ఛాయ నొంటిగఁ?
                                 బలుకవే,
                          భావముఁ దెలుపవే!
    చీకటులు బలమయ్యెఁ; జుక్కల
    రాక పోకలనేల తలఁచెదు?
    నా కుటీరమునందు వెన్నెల
    సోఁకి తమము నశింప దీపము
                                పెట్టవే,
                          నామది ముట్టవే.

16-8-1923

__________

పిచ్చిబికారి.

________

మాయాకుమారి

ఓయి యాగంతుకా, ఓయి విరాగి,
   పాములు వ్రేలాడు పగిది జడివాన
   కుమ్మరిల నెడలేక కుండపోతలుగ,
   ఝంఝా మరుత్పక్ష చాలితంబగుచుఁ
   బెనఁబడి చెట్లెల్లఁ బెల్లగిలి కూలఁ,
   గన్నుపొడిచిన యట్లు కాఱుచీఁకట్లు
   నలుగడ వ్యాపింపఁ, బలుమాఱు మెఱుఁగు
   తీఁగల వెల్గునఁ దీవ్రతర ఘోర
   భౌతికోన్మత్త దుర్వార ఖేలనము
   కనులకు వ్రేఁగయి కనిపింప, నేమి
   బిచ్చంబుఁ గోరి యీ నెఱగొల్పు రాత్రి
   వచ్చితి వొంటిగాఁ బిచ్చిబికారి?

బికారి


   ఓ యైంద్రజాలిక మాయాకుమారి,
   ప్రళయ లీలోద్యత ప్రకృతిసంగ్రామ

భూమి సింహాసనంబునఁ గొల్వుదీరి
యచల ప్రదీపికయటు వెల్గు నిన్ను
నివ్వేళగాక నే నెవ్వేళఁ గందు?
నీ చేతిభిక్షకై నిఖిలంబు విడచి
కాలవీథిని నొంటిఁ గదలివచ్చితిని.
నీ పాదములకడ నిలిచి వేడెదను;
నీ తేనె చిఱునవ్వు నెఱపి 'కొమ్మ' నుచు
బిచ్చంబు పెట్టుము ప్రేమమై రమణి!

మాయాకుమారి


యేమి బిచ్చంబోయి, యీ నిశీథమున?
ఉత్తచేతుల రాణి; నిత్తఱి నీకు
నేమియ్యఁ గలను?
                   బికారి
                       ఇం కేమికావలయు?
నీ జడకట్టులో నిద్దుర వాడి
నలఁగిన చంపక దళముల మాల
బిచ్చంబు పెట్టుమీ పిచ్చిబికారి
సంతృప్తి నొందును; జాలించు యాత్ర,

20-3-1923

__________ 

* బాష్ప దౌత్యము.

__________

జీవనగంగా హరిత తటంబునఁ
           జింతా వటతరు మూలమునన్,
ఏల యధోముఖవై గడతెంచెద
           వివ్విధి యౌనన నిశలన్?
ఆవలిగట్టున స్వప్న పురంబున
          నవ్యయ నిర్వృతి వనులన్
డోలాఖేలన రతుఁడౌ ప్రియునిఁ గ
          డుంగడు భావన సల్పెదవో?
నీ వయసెల్ల హృదీశుని చింతన
          నిర్మల ధూపము పగిదిన్
గాలెడి నబలా, రేయుం బవళులు
          గందముఁ జిమ్ముచు నల్గడలన్.
ధావమాన శరదంబున శకలపు
          దౌత్యము నమ్మిటు వేచెదవే?
చాలు నిరీక్షణ! చాలిఁకఁ జింతన!
          చాలు రహస్య వియోగహతుల్ !

జీవన సంధ్యా పరిణత బాష్ప స
        చేతన నీరవ, దూతికలన్
గాల పయోనిధిఁ బర్ణపుటంబులఁ
        గదలింపుము ప్రియు కడకున్ ,
హా! విధివశ్యతఁ జేరుదు రవ్వలి
        యంబర చుంబి తటంబున్.
బాలతపస్విని, యెపు డేవేళనొ
       వల్లభుఁ డొసఁగును దర్శనమున్,
శ్రావణ నీరద మాలిక లిరువురి
       శయ్యాడోలికలై యూఁగన్.

22-3-1923

__________

* అతిథి.

తెఱచియుంచితిని జీవన మందిరద్వారంబుఁ
దీర్థవాసీ, కొను మాతిథేయ సత్కారంబు!
ఓ యాత్రికా, ఓ నక్షత్ర మండల పథికా,
యే యజ్ఞాత సాగర శాంత తట తరువీథి,
నే యానందకూల సమీరణ శిశిరచ్ఛాయ
నేకాకివై తిరిగితివోయి, నిశాముఖవేళ?

ఏ యలౌకిక మార్గ సమత్థిత కాంచనధూళి
నీ జీర్ణ వస్త్రమిటు కావిరిపట్టె బికారి?
ఏ నిగూఢ విపంచీరాగము వింటివొగాని,
ఏ చిన్మయానుభవ స్వప్నముఁ గంటివొగాని,
యిటు విహరించెదు ముక్తపథంబున నతిథీ!

26-3-1923

_________

* మోహినీప్రకృతి.

జిలిబిలి తియ్యని రాగములెత్తీ చేసెను గానము సెలయేఱు,
తళతళ వెన్నెల నిగ్గుల నలలుం దాండవమాడెను మైమఱచి;
కలకల కోకిల రవములు రజనీ గాంభీర్యమునకుఁ దోడ్పడియె;
జలజల దేహము పులకించి వ్రేళులు జాఱెను వీణాతంత్రులను.

             ఓరె! నా జీవన శుష్క ఝరంబు
                  పాఱెఁ గూలంకష పూర్ణముగ;
             జాఱెరా, పరలోక జీర్ణతటంబు
                  పూరసంఘర్షణ శీర్ణముగ!
             పగిలెఁ గమండల పాత్రిక !
                  చిగిరించె సంసార వల్లిక!
             తగదిఁక బైరాగి జీవిక !
                  జగమెల్ల నందనవాటిక !

27-3-1923

_________

* జీవన ద్వేషి.

_______

యా మిని

ఏడకయ్యా చిన్న వాఁడా,
  కోడెప్రాయపు వన్నెకాఁడా,
            యేఁగెదవు నడిరేయి వెలుపడి
            వాఁగువఱ్ఱుల దారివంకకు?
                         ఏలరా?
            యీ వింతనడవడి చాలురా!
   ఆకసంబునఁ జుక్కదివ్వెలు
   చీఁకటులఁ గడు బలుచచేయఁగ
            జీవలోకము చల్లనిద్దురఁ
           గేవలము మైమఱచి తేలఁగఁ
                       దల్పమున్
           విడి తిరుగఁ గారణమేమిరా?
   కన్నుబొమ్మలు వంగి సొంపఱి
   చిన్నవోయిన చిన్నె లొలికెడి
           నెట్టివేదన లెట్టిచింతన
           లిట్టితఱిఁ జెలరేఁగె మదిలోఁ?

                           దెల్పరా?
                నాయెద నెత్తురు లోల్కెరా.
               జీవనద్వేషి
     ఓసి వలపుల రేయిసానీ,
     ఓసి కల్వల సిరులరాణీ,
               విసిగి వేసరి జీవబంధన
               విసరమును దెగఁదెంప వచ్చితిఁ
                             గానవే,
               జేసెడు తలంబును జూపవే.

యామిని


     ఓయి ప్రాయపు టందగాఁడా,
     ఓయి ముద్దుల మురిపెగాఁడా
               ఏల యంటెర చీడపుర్వు వి
               శాలజీవన పుష్పదళముల?
                           మానరా,
               యీ పిచ్చియత్నం బేలరా ?
     సరసి నీటను బ్రాణములు విడఁ
     దరలుటయె నిజమేనిఁ జెప్పుమ--
               నా హృదయం బంతకన్న న

                      గాధ, మందు మునింగి తాపము
                                   వాపరా,
                      నీ విసుగువేసట లడఁగురా.
    నేలపై నీ తనువుఁ బాపుట
    చాల నిష్టంబేనిఁ జెప్పుమ—
                      నాదు మెత్తని రొమ్ముతలగడ
                      నాదరంబున మోమునానిచి
                               తూఁగరా,
                      యెడలేని యూరట నొందరా.
    జీవనము నురిత్రాట వీడుట
    నీవు తలఁచెదవేనిఁ జెప్పుమ --
                      జడను నలఁగియుఁ గమ్మతావులఁ
                      గడలఁ జిమ్మెడు పూలదండను
                                నిత్తురా,
                      మరణాభిలాషము మానరా,

_________

* ఆనంద సత్రము .

ఈవసంత యౌవన రజని,
           నీ మృదు తారాకాంతిఁ
బార హీన గంభీర జలధి
           వాయు తరంగాహతుల
మ్రోగెరా నాదు హృదయ మురళి
           మోహన గీతాగతుల!
ఆడెరా నా జీవనపాత్ర
           నానంద ఫేనిల మదిర!
విరిసెరా నా భావమునందు
          విశ్వజనీనానుభూతి!
ఆహ! ఈ మనోహర రాత్రి
          నైతి ననంత స్పర్శి.
ఓరే, విరహ విహ్వలకామి,
          ఓరె, దరిద్ర కుచేల,
ఓరే, నిష్ఠురజీవన పథిక,
         ఓరె, మానవ ద్వేషి,


రండిరా, రారండి! హిమకర
          రంజిత గగన చ్ఛా య
నానంద సత్రద్వారముల
          నన్నింటినిఁ దెఱచితి, రండి!
అతిథులారా, చెఱియొక పాత్ర
         యాసవ రస మానెదము!
ఆ మత్తులోనఁ గరఁగిపోవు
         నైహిక యాత్రా శ్రమము.

30-3-1923.

__________

* ఆమని నిషా .

_______

జాగ్రత్త ! జాగ్రత్త ! మాయ జగత్తని
          శాస్త్రము లెల్లను విప్పెదవు;
భాగ్యము భోగము చంచల మంచును
          బైరాగి ధర్మముఁ జెప్పెదవు;
ఎవ్వారు విందురీ పిచ్చి బోధనము
         లీ మధుమాస నిశీథమున?
ద్రాక్షరసాయన పాత్రిక పెదవులఁ
         దవులఁ దలంతురె చేఁదనుచు ?
ఓయి యతీశ్వర, చాలిఁక బోధన
         మూరక తెల్పకు నీమతము.
ఆనంద భాండము నందు హలాహల
         మయ్యయ్యొ! విరసుఁడ, కలుపకుము,
ఉన్మత్త కోకిల గానము సల్పెడి
         నుద్యాన వాటిక మధురముగ.
పొడవాటి లోద్దుగ కొమ్మల నూఁగెడిఁ
బున్నమ చందురుఁ డుయ్యెలలు.

ఆమని మత్తునఁ జైతన్యలోకము
          ఆనంద పరవశమై సొగియు;
సరిచేయు మో సఖి, భగ్న విపంచిక
         సంధ్యలు పాటలఁ బుచ్చెదము!
సౌఖ్యనదీ రసపూరమునం దంచ
         జంట విధంబున నీఁదుదము!

___________

* లూఠీ.

______

ఎవరురా నావీణా తంత్రుల
           నిట్టుల సళ్ళించి పెట్టిరి?
ఎవరురా నా గంగా తీర్థము
           నిట్టులఁ గలయంపి చల్లిరి?
ఎవరురా నాపూజామాలిక
           నిట్టులఁ దెగద్రెంపి వేసిరి?
ఎవరురా నాగీతాపుస్తక
           మిట్టులఁ బుటలెల్లఁ జింపిరి?
ఎవరురా నా యర్చ వేదిక
           నిట్టుల దీపము నార్పిరి?
ఎవరురా నా హారతి పళ్ళెర
           మిట్టుల బోరల దోసిరి?
చోరుఁ డెవ్వడో యతిథి వేషమునఁ
           జొచ్చెను నా పర్ణశాలను?
నామూల ధనమెల్ల లూఠీగొట్టి
          నన్ను బికారినిఁ జేసెను!

__________

పూర్వజన్మస్మృతి.

_________

శారద చంద్రికా మధుర శర్వరులన్ భవదీయ వేణు గీ
తారవ మాలకించి యెడఁదల్ నిలుపోపక మోహమాధురీ
ప్రేరిత చిత్తలై యభిసరించిన గోపికి లొందినట్టి గం
భీర మనోన్యధల్ కలఁతవెట్టెడి నన్ను యశోద నందనా!

ఏకాలంబున నేయుగంబుననొ యిం కేపూర్వ జన్మంబునన్
నీ కల్యాణ మనోహరాకృతిని నే నిత్యంబు దర్శించిన
ట్లే కన్పట్టెడిఁ గృష్ణ! కానియెడ నిట్లేలా మనోవీథి నీ
యాకారంబు సువర్ణ ముద్రితముగా నానందముం గొల్చెడిన్?

పోతన లేఖినీ మహిమ పూర్ణ సుధారస ధార నాని, నా
చేతము నందు నీస్మృతి విచిత్ర గతిం జివురించెనేమొ! లే
దా తనివార నీచరణ తామరసంబులఁ జింతసేయ నా
కీ తలపోఁతగల్గెనొ గ్రహింప నసాధ్యము లోకమోహనా!

తెలుగుంగైత యొయారిపోకడలలోఁ దీపుల్ పిసాళింప ని
శ్చలభక్తిన్ రచియించెఁ బోతన భవచ్చారిత్రముల్; తత్క
థాకలితానేక విశేషముల్ మనసుఁజక్కన్ రేఁప నాపూర్వజ
న్మలచర్యల్ పొడకట్టు భావమున బింబం బద్దమందుం, బలెన్ .


పూతన పాలుద్రావి విసపు న్నురువుల్ వెలిజాఱ, ముగ్ధశో
బాతరళాక్షులన్ నగవుపట్టఁగ లేక యొకింతమోడ్చుచున్
వ్రేతల గుండియల్ వగులు వేడ్క, జరించెడు నిన్నుఁగాంచి నే
భీతిలి తల్లి జానువులఁ బెట్టునఁ గౌఁగిలినట్లు దోఁచెడిన్.

తరువులు పెల్లగిల్ల, గిరితండము కొమ్ములు వ్రీల, దిద్దిరం
దిరుగుచు నిండ్లు నిండ్లుగనె నింగి సుడింపఁగ రేఁగి వీచు నా
మరుతమునందు నిన్ గగనమధ్యమునం గనుగొన్న నాఁటి యా
వెఱ పిపుడైనఁగాని ననువీడదు; నిద్దుర నుల్కు గొల్పెడిన్.

చీటికి మాటికిం దులిపిచేఁతలు చేసెడి, నిన్నుఁగాంచి యిం
కాటలు మానరా తనయ, యంచు యశోద వచించి త్రాటితో
ఱోటికి నిన్నుఁగట్ట నెగరొప్పుచు మద్దుల సందుకీడ్చి యు
ద్ఘాటనముంబొనర్చు నిను గన్గొని కాలికి బుద్దిసెప్పితిన్ .

మఱిచితి ముద్దుకృష్ణ, యొకమాపటివేళ యశోద మందలోఁ
దిరుగుటఁగాంచి మీఁగడలు దెచ్చి, సకుల్ మనవెంటరాఁగ నం
దఱమును నారగింప, నది తల్లి కనుంగొన, లేచి, మీఁగడే
మెఱుఁగమటంచు నమ్మయొడియెక్కిన నీచెయిదంబుదో? చెడిన్

కన్నీటిధారలం గరఁగిన కాటుక
              మఱకలు బుగ్గల మెఱయుచుండ;
గ్రీఁగంటిచూపుతోఁ గేల్దోయిఁ గౌపీన
              మును మెలిపెట్టుచు, ముద్దులొల్కు .


వినయంబు మూర్తీభవించిన తెఱఁగునఁ
              దలవంచి నిలఁబడి: 'తల్లి, నేను
ఏమిచేసితినంచు' నేమియెఱుంగని
              పసిపాప యట్టులఁ బలికి, విశ్వ

మోహనాలోకనంబుల మోసపుచ్చి,
తప్పులెల్లను మఱపించి, దండనంబుఁ
జేయనుంకించు తల్లి యాశీస్సుఁబడసి
మురిపెముం జిల్కు నిన్ను నే మఱవఁగలనె?

సిగలోని పించెంబు చిన్ని తెమ్మెరలకు
            రతనాలవింటి వర్ణముల నీన,
నీలిమబ్బులవంటి నెమ్మేని నిగ్గులు
           చల్లని శాంతరసంబు గురియ;
మొలత్రాటఁ జెక్కిన మురళి కొండలగాలి
           కొకవింత రాగంబు నూఁదుచుండ;
సగము మెక్కినవెన్క వెగటు గొట్టిన వెన్న
          ముద్ద యెండఁ గరంగి బొట్లుగాఱ,

నలువ దాచినయావులఁ జెలుల వెదుక
నేఁటిపచ్చిక గట్టుల నేఁగుచున్న
నిన్నుఁ గనుగొన్నజ్ఞప్తి నా కున్న దోయి,
యిన్ని జన్మంబులకు నైనఁ జిన్నికృష్ణ!

మటమట యెడలం బసుల మావులక్రిందఁ బరుండఁదోలి చి
క్కటి పెరుగన్నమున్ మిరపకాయలు నంజుచు నారగించి యొ
క్కట గుమిగూడి, యాదవుల గాథలు నీవు వచింపఁగన్ నదీ
తట పవనంబు వీవఁ గడఁదాఁకిన సంజలు నేఁడుఁ గల్గునే?

కాళింది మడుగులో నా
భీల విషజ్వాల లెపుడు వెలిగ్రక్కుచు మా
బాలురఁ బెయ్యలఁ జంపిన
కాళీయఫణి కథలు దలఁపఁ గాయమువడఁకున్.

ఆ సర్పంబు భయంబునం బసులు నీరానన్ విలంబించి యా
కాసారంబును డాయఁబోయి వెనుకోఁగాఁజూచి నాగేంద్ర, చా
వాసన్నంబయియుంట నీ పొగరుఁబోతాటల్ విజృంభించెఁగా
నీ సై లెమ్మని హుంకరించిన నినున్ నేఁడైన నూహించెదన్.
బరబరఁ జేలమున్ నడుముపై బిగియించి, కిశోరసింహ మ
ట్లురవడిఁజూపి, మమ్ముఁగని యోసఖులార, భయంబులేదు; నే
నురగముఁ జంపివత్తు నని యొడ్డుననున్న కుజంబునెక్కి మో
హరమునఁ బాముపై దుమికినప్పటి నీ రభసంబుదోఁచెడిన్.

బుస్సుబుస్సున గాలి భోకొట్టినట్టుల
              విసపు నిటూర్చులు దెసలుముట్టఁ,
బాతాళగర్భంబుఁ బగిలించి శేషాహి
              పైకిలేచిన రీతి ఫణములెత్తి

తోఁకజూడింపంగఁ దోయప్రవాహంబు
           అభ్రంకషోర్ములై యాకులింపఁ,
దరిగొండ మున్నీట గిరికొట్టి నట్టులఁ
           గాళింది మడుగెల్లఁ గలదిరుగుచుఁ,
బ్రాణిభీకర విహరణ పారవశ్య
మునఁ జరించెడి కాళీయు ఘన ఫణముల
మణిగణ ద్యుతి యడుగుఁ దామరలఁ బూఁత
వెట్ట నటియింపవే కృష్ణ, విజయి వగుచు!
   గోవర్ధన గిరి యెత్తి శ
   చీవల్లభు గర్వశాంతిచేసి, మమున్ మా
   గోవుల వానలఁ జావక
   కానవె శ్రీకృష్ణ, దివ్య కారుణ్యమునన్ !

యమునా శ్యామల వీచికా తతుల లాస్యంబుల్ , శరచ్చంద్రికా
కమనీయామల సైకతంబు, మురళీగానంబు బృందావన
ద్రుమవల్లీ కృతడోలికల్ మనమునందుందోఁపఁ బూర్వాను భూ
తములౌ కోర్కెలు మోసులెత్తెడిని రాధాకృష్ణ,యీవెన్నెలన్
చిరవిరహంబునం బసవు స్వీయవిధంబున బృందనేఁడు నీ
చరణ సరోజు సంగతుల సౌఖ్యముఁబాసి కృశించె; గ్రమ్మఱన్
మురళిని మర్మమూర్ఛనలుమ్రోయుచురమ్మిఁకఁ బ్రేమరాజ్య సం
భరణ మనోహరాంగవిభవబుల లోకము మోహపుచ్చుచున్ .

___________

రాజభిక్షుకుఁడు.

_________

పగలెల్ల వరిచేలఁ బనిపాటుచేసి
ప్రొద్దు క్రుంకెడివేళఁ బొలమునువీడి
యిలుసేరి నూకల నిగిరించి, వేడి
సంగటిఁ గుడిచెడి సమయంబునందు,
సన్నచీకటి రూప సౌందర్యగరిమ
మబ్బువాఱుచునుండ, మా కుటీరంపు
ద్వారంబు కడనిల్చి ధరణీవిభుండు
ముసిముసి నవ్వుల మొగమందగింప
సందె కబళము వేఁడెఁ! _ జకితనై నేను
నొడలు కంపింపంగ నొక్కమాటైనఁ
బలుకఁ జాలక మోమువంచి నిలుచుంటి;
నంతనెచ్చోటికో యరిగె రారాజు.
అవి యివియని యెంచ నలవిగానట్టి
చిదురుఁ దలంపులు చీకాకువెట్టఁ
జేతిలోఁ గబళంబు చేతనేయుండ
నూరక కూర్చుండి యున్నతరుణమున
నెచ్చటినుండియో వచ్చి బిచ్చకుఁడు


జాలిపుట్టగ వేఁడె సందెకబళంబు;
కనికరంబున నేను గడియన్న మెత్తి
"యిదిగొ కొమ్మని” చేత నిడితి; బికారి
యానవాలుగ దీని నర్పింతు ననుచు
నుంగరంబొక్కటి యొసఁగి తానేఁగె;
నంత దీపపు వెల్గు నందు నే దానిఁ
గన, రాజముద్రిక యనితోఁచె; నేడు
రాజు భికార్థియై రాఁగతంబేమొ
మాబోఁటి నిఱుపేద మాలకొంపలకు?

__________

మృత్యువు.

________

ఓ మృత్యు దేవతా, యో జగద్రాజ్ఞి,
జంటబిడ్డలపోల్కి జన్మించినారె
జీవితంబును నీవు సృష్ట్యాది యందు!
మనుజుండు నీదివ్య మహనీయమూర్తి
భయ సముత్పాదక బహుళవర్ణములఁ
జిత్రించి యాత్మీయ సృష్టిని గాంచి
భీతచేతస్కుఁడై విభ్రాంతినందు!
మూఢభక్తియుఁ గాలమును బడుగుపేక
యనఁగ, భావమునాడె యట్టులఁ దిరుగఁ
బ్రీతిఁ బౌరాణిక విశ్వాసమనెడి
వల నేసి దైవ విపాకంబుకతనఁ
బాపము! తానందుఁబడి చిక్కుకొనియె.
తప్పించుకొనుటకు దారి గన్పడదు.

    నీ కన్ను బొమ్మలు నీహారఖండ
శిశిరంబులంట! నిర్జీవధావళ్య
జలదంబు నీకన్ను జంటచుక్కలను
గబళించునంట! యో కాలస్వరూపి


ణీ! మానవునితోడ నీవు నెల్లపుడు
దాఁగిలిమూఁతల తందనాలాడి
చేయిఁ జిక్కకయెందుఁ జేరఁబోయెదవొ!
మూఢచిత్తులు నీకు మున్నొసఁగినట్టి
పౌరాణిక విచిత్ర వస్త్రములఁదాల్చి
మహి విహరింతువు మాఱువేసముల!
నీకాలిచప్పుడు సోఁక దిగులొంది
కంపిల్లు మనుజులఁ గని రహస్యముగఁ
జిఱునవ్వు నవ్వెదో చిన్నారిరాణి?
నీ మోసగింపులు, నీ టక్కుఁదనముఁ
జాలింక! నెఱపుము సఖ్యంబు సకియ.
దయ్యాల ముసుఁగేల తాల్చి త్రిమ్మరెదు?
నీ దొంగవేసంబు నే లాగివైతు;
ఎటువంటి నగుమోము, ఎట్టియందంపు
ముసుఁగుఁజీఁకటిలోన మునిఁగియున్నదిర!
కవితల్లజుండగు కాళిదాసైన
నీమోహనాకృతి నీదివ్యమూర్తి
నభినుతింపగ లేక హతమనోరథుఁడు
కావలెనని చెప్పఁగా నన్నుబోఁటి
కర్షక కవియెట్లు కడతేరఁ గలఁడు?
అందంబులకు నెల్ల సందంబ వీవు;

నీకు నీవేసాటి నిఖిల లోకమున!
గారడికొలనులోఁ గలకల నగుచు
నిప్పుడిప్పుడె విచ్చు నిందీవరముల
సరిపోలు మురిపాల చక్కనికనులు

సౌందర్యరాజ్య విజయ లాంఛనములు.
చెమరించు నీలేత చెక్కుటద్దముల
పన్నీరుపువ్వుల పస వెల్లివిరియు;
పచ్చిద్రాక్ష రసానఁ బలుమాఱునాన

వైవ మెత్తగనైన పవడంబుచేత
రచియింపఁబడెనొ యోరమణి, రసార్ద్ర
మైననీవాతెఱ! యానందదాయ
కంబైన వాసంత కల్యవో నీవు!

జీవరత్నకలాప చిత్రమకుటంబు
ఖద్యోతకాంతులఁ గనుబొమలపైనఁ
గురిపించు నోపెండ్లికూఁతురా, మనము
ఆశ్చర్య పారవశ్యంబున నీదు

చంద్రశిలా రమ్యశాల, రహస్య
లీల నన్యోన్యముఁ గేలఁగేలూని
విడిపోని మమతల విహరింపలేదె?
ప్రతినిశ గాఢనిద్రావేళ నీదు


సుఖకర నిశ్శబ్ద చుంబన స్పర్శ
ననుభవించుచు నుందు నలసటదీఱ.
జీవనాంభోధి వీచీమార్గ మందుఁ
బ్రాణికోటులఁ బరపారంబుఁ జేర్చు
నుడుపంబు నేర్పుతో నడుపంగఁ, బ్రకృతి
నియమించెనిన్ను; నో నిశ్చలకర్ణ
ధారిణీ! నవమూర్తి ధరియింపు మింక .
విపులపౌరాణిక విపిన సంచారి
ణీ! రుద్రమృత్యువా! నీకు వీడ్కొలుపు,

_________

బిడ్డ : బాటసారి.

పై బాటలం బోవు నో బాటసారి,
నిసుగులకును నోట నీరూరునట్లు
దోరగిల్లి పసిండి తీరులొలికించు
పండ్లగుత్తులు వీపు పైన వ్రేలాడ
నలసట సోలుచు నరుగుదెంచెదవు.
నీపయనం బింక రేపుమాపులను
ముగియదా యేమి యోముసలి తాతయ్య?

బాటసారి


నీవలె నొకనాఁడు, నిండారఁ బూచి
పచ్చితావులు చల్లు పన్నీరుపువ్వు
పోల్కి నవ్వుచు నేనుబుట్టుతిఁ; గాని
పుడమి సంతను నాదు పొలుపునెత్తావి
వెదచల్లి, కారాకు విధమున నొంటి
నేఁగుచున్నాఁడ మాయింటికి నేఁడు
యుగయుగంబులనాఁటి సొగసైన పసిఁడి

పండ్లబరువులు వీఁపు పై మోచికొనుచు.
పలు గ్రహంబులకును బయనంబు చేసి
భపపిపాస హరించు పండ్లుఫలాలు
అలమట పడియైన నార్జించుకొందు.
ఎనలేని యైశ్వర్య మెపుడు గడించి
విశ్వసామ్రాజ్యంబు విలుతునో గాని
యంతదనుకను నేను నఱికాళు లరగఁ
దిరుగుచుండెద నోయి మురిపాల బిడ్డ!

బిడ్డ


అట్లైన నింకెప్పుడలసట కోర్చి
పండ్లగుత్తులు వీఁపు పైనూఁగులాడ
నీవలెఁ జరియింతు నేను నీబాట.

బాటసారి.


చరియించుచున్నావు చక్కనికూన!

బిడ్డ


నీవలె నేనెపుడు నిఖిలవిశ్వంబు
విత్తంబుఁ గడియించి విలుతునో చెపుమ?

బాటసారి


గడియించుచున్నావు; కడకొక్కనాఁడు
నేను బోయినదారి నీవు రాఁగలవు!

___________

మేలుకొలుపు.

_______

ప్రత్యుష శ్శాంత నిర్మలాంబరమునందు
    నరుణరక్తిమ వ్రాసె జయాంకములను;
    జిమ్మచీకటి తెరలను జింపి వైచి
    మేలుకొనుమమ్మ! యిఁకనైన మేలుకొనుము!

పవలు రేయు నతీంద్రియ స్వప్నములను
    గనుచు నవియెల్ల సత్యమంచని తలంతె?
    కలలకును వీడుకోలుగాఁ బులుఁగు లిపుడు
    గానములు సేయుచున్నవి; కనవొ? వినవొ?

నిద్రయే జీవనంబని నీకు మున్ను
    నూరిపోసిరి మాయలమారు లెవరొ!
    మచ్చు మందుల మతకమ్ము విచ్చిపోవ
    గడపఁ గాల్మెట్టి లేయెండఁ గ్రాఁగుమమ్మ!

అపయశః పంకిలంబైన యాత్మకన్న
    చచ్చుటే కొంత మానరక్షణము సుమ్ము;
    పారతంత్ర్యభరంబున బడలి సడలి
    యదవ త్రావుడు త్రావెదో యమ్మ, నీవు ?

కాలగర్భంబునన్ దాఁగి కానరాని
    భావిదృశ్యంబు కన్నులఁ బడినయట్లు
    నలుదెసలఁ బ్రొద్దువొడుపు నిగ్గులు రచించె
    నభినవ జగంబు; ముసుఁగెత్తి యరయు మమ్మ.

కర్మ, విధిచేష్ట, దైవ నిగ్రహమటన్న
    పిచ్చి వేదాంతములఁ బోయెఁ బెద్దప్రొద్దు;
    ఆత్మవిశ్వాస సూర్యోదయంబు కెలన
    నిద్దుర తమంబు కాలొడ్డి నిలువఁగలదె?

__________

వసంతోదయము.

ఏలొకొ మావులం జివురులెఱ్ఱగఁ, గావ్యరమా కరంబులన్
మేలన మాడునట్లు నునునీడలు దేలుచు నందగించు? నే
మూలనునైనఁ జాల నుపభోగ్యముగా ననిలంబు విచ్చుక్రొం
బూల యనుంగుఁదావి తడిపుప్పొడి తాఁకుల నామతించెడిన్.

ఎవరికి నెఱుంగరాక యే యింద్రజాలి
     కుండు వీచెనొక్క నెమ్మికుంచె నిపుడు!
     చెట్టు చేమలు విలసిల్లెఁ జిత్రగతినిఁ
     బువ్వు లాకులఁ బిందెలఁ బుష్కలముగ.
కోకిలాగంతుకులు మావికొమ్మ లెక్కి
     యాలపించెద రిప్పు డయాచితముగ
     హృదయ సంస్పర్శి రాగంబు! నే నియంత
     వారి కాహ్వానపత్రికఁ బంపినాఁడు?
గఱిక మొదలుగఁ దారకాగణము వఱకుఁ
     గలుగుసృష్టి నీరవభాషఁ దెలుపుచుండె
     నవ నవోజ్జ్వల సుఖజీవనప్రభాత
     దివ్యసందేశమును నేఁడు! తెలిసెఁ! దెలిసె!!
ప్రభువసంతుఁడు నందన వనమునుండి
     యాత్రసేయఁగ భూమిపై కరుగుదెంచె;
     నతఁడు విడిసిన తలము లల్లవిగొ! పచ్చ
     నాకుల గుడారముల పట్నమనఁ జెలంగు.

పండితప్రతిజ్ఞ.

మొన్నటి పుష్యపంచమికి ముప్పదియేండ్లవయస్సు చెల్లె, నిం
కెన్నిదినంబు లీగురువునింట వసింతు? సమస్తశాస్త్రముల్
తిన్నగ నేర్చుకొంటి 'మన తిమ్మయశాస్త్రి కుమారుఁ డెంతలో
మన్నతి కెక్కె' నంచు నను నూరిజనుల్' వినుతింతు రెప్పుడున్ .

సగము ప్రాయంబు విద్యావిచార మందె
కడచె; సంసారసౌఖ్యంబుఁ బడయ నైతి;
గొప్పవారింటఁ బెండ్లాడఁ గోర్కె గలదు,
కాని, దారిద్ర్య దోషంబు కంటకంబు.

ఎవరి నడిగినఁ గాని 'మీ కెంతయాస్తి?
పెండ్లికూఁతురి కే నగ పెట్టఁ గలరు?
ఇంటిమర్యాద లెఱిఁగి మా హెచ్చు నెంచి
పెండ్లివేడుక నడుపంగఁ బ్రీతి గలదె?'

అని, మఱి యేమొయేమొ మరియాదలుగీదలు దెల్ప నోర్పుతో
వినివిని, చీదరించుకొని, పెండ్లిపెడాకులు మానుకొంటి; నై
నను జెలికాఁడు నామనమునం దొక కోరికవిత్తు నాఁటి తి
య్యని నుడికారపుం దడిని నంకురమెత్తఁగఁ జేసి యిట్లనెన్ :

'జను లనుకోఁగ విందు; నెలజవ్వని, తాఁకినఁ గందిపోవు మె
త్తని చివురాకు మేను, కనుదమ్ముల లోకము మోహపుచ్చు మో
హనమగు నింద్రజాల మెదొ యాడుచునుండు, వివిక్త కాననం
బున సెలయేళ్ళకూలములఁ బూఁబొదరిండ్ల నసించునొంటిగన్.

'పేరు కవిత యంట, పెద్దలుం బిన్నలు
గారవింపఁ బెంపు గాంచునంట;
ఇష్టమున్నఁ, గోర్కె లీడేర్పఁ దనకుఁ దా
వరుని సరసహృదయు వలచు నంట!

'కులముం జూడదు, డబ్బు గోరదు, మనఃకూలంకష ప్రేమతో
వలచుం దాను గురూపినైన; నెటు నిర్బంధించి కామింప భూ
వలయాధీశునకైనఁ గానిపని; నీ పాండిత్యముం జూపి యా
పొలఁతిన్ లోగొనుమన్న 'మాటలుమదిం బూరించెఁబేరాసలన్?

అఖిలశాస్త్రపురాణే తిహాసములను
సంస్కృతాంధ్ర కావ్యకలాప సంపుటముల
మూటముల్లెలుగాఁ గట్టి మోసికొంచుఁ
దరలితిని గవితా స్వయంవరమునకును.

జనకుఁ డొసఁగిన దేవతార్చనపుఁ బెట్టె
నంచు చినిఁగిన మడిపట్టుపంచఁ జుట్టి,
చంకఁదగిలించి, వెలిబూది సంచిగూడఁ
బదిలముగ దాఁచికొని దారిఁ బట్టినాడ.

తలయూఁచినపుడెల్లఁ దళతళద్యుతి నింపు
           మకరకుండలములు మాకు లేవు;
పాండిత్యమున కనివార్యలాంఛనమైన
           కాశ్మీరశాలువఁ గప్పలేదు;
లలితంపుఁ గవులగుండెలు ఝల్లుఝల్లన
           గండపెండారంబుఁ గాలఁ దొడుగ;
మునుకొని తనకన్న ముందు బారెఁడు వోవు
           బిరుదు పేర్లెనరైనఁ బెట్టరయ్యొ!

ఐనఁ గానిమ్ము, నా కున్నయంతవట్టు
-కేమి లోపంబు లే దెవ రేమి యన్నఁ
గంచుగంటపు వ్రాయసకాఁడఁ గానె?
మిగత భారంబు దైవము.మీఁద నిడితి.

అని తలపోయుచుం, దుదకు నా కవితాలలితాంగిఁ బెండ్లి యా
డినగతి మోర ఠీవి, నడటెక్కు సుమాళము సందడింప లోఁ
దొనికెడి భావి భోగ పరితోషపు భావన ఱెప్పలార్చుచున్
వనమున కేఁగుచుండె మనపండితశాస్త్రి జయాభిలాషతోన్.

చనిచని కొన్నినాళులు, వసంత శుభోదయవేళఁ గొండదా
పున దిగఁబాఱువాఁక కీరు పుంతలఁ బూఁబొద లందగించు చ
క్కనివనిఁ జొచ్చి, దప్పి నడగాసియుఁ దీఱ జలంబుఁ గ్రోలి, చ
ల్లని పొదరింటినీడఁ బదిలంబుగఁ గూర్కె సుఖంబు చేకుఱన్.

అంతలోన నెండ యారాట మొక్కింత
దొలఁగఁ బూలగాలి తోడ వీచె;
కొండసెలల సడులు, కోయిలపాటలు
మిళితమయ్యె నొడలు పులకరింప.

చివురాకుల్ దెగమేసి పోతరమునం జెంగించుచున్ దాఁటుచున్
దవుదవ్వేఁగుచుఁ గొమ్ము పుట్టుకఱిఁ బంతాలాడి కండూతి వో
వ వడిన్ మున్దల డీలుచున్ హరిణశాబంబుల్ వినోదించుఁ గే
ళి విహారంబుల నిర్భయంబుగను, వల్లీచ్ఛాయ లాసించుచున్.

అట్టి నవమోహనారణ్యమందు నొక్క
మావికొమ్మకు నల్లిన పూవుఁదీవ
తూఁగుటుయ్యెలఁ గూర్చుండి, తునిఁగి రాలు
విరుల జడిగొట్ట నొక వన్యతరుణి యూఁగు.

ఆ వలపించుతొయ్యలి కొయారము నేర్పఁ గలాపి ప్రేమ సం
భావనతోడఁ గుత్తుకను బయ్యెదమీఁదుగ మూఁపుఁజేర్చి పూఁ
దావులఁ జల్లు క్రొవ్వెద తలాపిని మో మరమోపి, మెత్తగం
జేవిరిఱెక్కపై నిమురఁ జెల్వ యొడింగను మోడ్చె హాయిగన్.

కోయిలపాటకత్తె తనకూఁతల తప్పుటెలుంగు దిద్దికోఁ
బాయక యభ్యసించుఁ జెలి పజ్జన పాఠము; గోరువంక క
త్యాయతశిక్ష నైన దొసఁగంతయుఁ బోదు; సమర్థుఁడౌ గురుం
డైయును జక్కఁజేయఁగలఁడా ప్రతిభా పరిహీన శిష్యులన్?

అపుడే నిద్దురలేచి పండితుఁడు, నుయ్యాలూఁగు నాలేమ యం
దపుఁజందంబునురూపురేక వెఱఁగొందంగాంచి యీమించుఁబో
ణి పదాబ్జంబులమ్రొక్కినం దొలఁగవేనిర్మూలమై పాపముల్ !
అపురూపంబిటువంటిమూర్తియని వెయ్యాఱుల్ విలోకించుచున్

పలుకరింప నెంచి, పలికిన నేమేని
బెడఁద వచ్చు నన్న బెంగతోడ
నీళ్ళు నములుకొంచు నెత్తిగోఁకుచు నిల్వఁ,
జూచి చూడనట్లు చూచి చెలువ,

ఉయ్యెల డిగ్గి, పయ్యెదను నోర ముసుంగిడి, జవ్వనంపు లా
గియ్యది యన్న పోల్కిఁ గను లెత్తియు నర్ధనిమీలితంబుగా
న య్యలినీలవేణి నడయందము దోఁపఁగఁ జెట్టుచాటుకుం
జయ్యనఁబోయితేనియలుజాల్కొనఁబల్కెఁదెనుంగుమాటలన్.

సిగ్గు పైకొని చెక్కిళ్ళు జేవురింప
సగముసగముగఁ బల్కె నా సొగసులాడి:
'అతిథులరు, మీకు స్వాగతం 'బన్ననుడులు
పడెను జెవిలోన విని వినఁబడని యటులు.

ముగుద మాట సూదిమొన మోపునంతటి
సందుఁ జేయ నళుకు జాఱవిడిచి,
పండితుండు పల్కె: 'వనిత, నీవేవతెవు?
ఒంటికత్తె విచట నుండనేల?'

అన విని, కాంత: 'నేఁ గవిత నయ్య, వనాంతరసీమలందు రే
యును బవలెప్పుడుం బ్రకృతియుత్సవముం దిలకించుచుం, బికాం
గనలు మయూరముల్ సఖులుగాఁ బరిచర్యలుసల్ప నొంటిగన్
దినములఁ బుత్తు జవ్వనముఁ దీరును దియ్యము శాశ్వతంబుగన్ .

'కలికీ, యెంతటివింత! నీవె కవితా కళ్యాణివా? బాపురే!
తెలియం జాలకయుంటి, నీకొఱకు నే దేశాలు పట్నాలు కో
టలు పేఁటల్ గిరు లేళ్ళుదాఁటుకొని మూటాముల్లెభారంబునన్
దల చెప్పట్టగ బట్టగట్టి విసుగెత్తన్ వచ్చితిం గానకున్.

'నిన్నుఁగూడి ధర్మనియతులఁ బాల్గొనఁ
దలఁచి వచ్చినాఁడ, వలచినాఁడ,
నన్నుఁ ద్రోసిపుచ్చ న్యాయంబె? వైదిక
విధిహితంబుగాఁగఁ బెండ్లియాడు.

'అన్న వేళకు నతిథు లభ్యాగతులును
నింటికరుదెంచి కూర్చుండ, వంట గింటఁ
జేయ నిల్లాలు లే దని చెప్పలేక
తెగఁబడితిఁ గాంత, యాకొఱ దీర్పు మింక.

'హేమంతమున నైన నేటినీట మునింగి,
           మడిదోవతులు పాఁతమైల లుదికి,
యిలు నూడ్చుటాదిగాఁ గల పాఁచిపనులెల్ల
          విసుఁగు వేసట లేక వెళ్ళఁబుచ్చి,

దేవతార్చనవేది దీపంబు వెలిగించి
           బానసంబున వంటపనులఁ దీర్చి,
యిరుగుపొరుగు నిండ్ల కేఁగక తనయిల్లు
           కనిపెట్టుకొని, దూది పెనఁచి దివ్వె

వత్తులను జేయుటో, లేక వలయు విస్త
రంట్లు గుట్టుటో, తడిబట్ట లార్చుటయునొ
గాక యిల్లాలి కింకొక్క కార్యమున్నె?
యట్టి గృహిణీపదంబు నీ కౌను చాన!

'వేదవేదాంగముల్ వివిధ పురాణేతి
            హాసముల్ నాబుద్ధి నరగిపోయె;
పంచకావ్యాల నేపట్టున నేశ్లోక
            మడిగిన వల్లింతు నప్పుడపుడె;
ఆఱేండ్లు పాణినీయుము పీల్చి పిప్పిఁ జే
            సితి, నది నాయందె జీర్ణమయ్యె;
వసుచరిత్రంబున వ్యాఖ్యాన యుతముగ
            శ్లేషభంగుల విమర్శించినాఁడ;

కడకుఁ జిన్నయసూరి వ్యాకరణ మెల్లఁ
బుటలు మలినంబుగాఁగ నెప్పుడును జదివి
సిద్ధివడిసితి; నమరంబుఁ జిత్తశుద్ది
తో నుపాసించి పొందితి దొడ్డఫలము.

'శాకుంతలములోన శతసహస్రములుగ
           వ్యాకృతిదోషముల్ బయలుపఱతు;
భవభూతిసాహిత్య భాండార మెల్లను
          గాసుకుఁ గాకుండఁ గడిగి వైతు;
బాణుని శ్రీహర్షు భారవి ఝాడింపఁ
          దొలిదెబ్బకైనను నిలువఁ గలరె?
తిక్కయజ్వకుఁ దలతిక్క - మాన్పెద నన్నఁ
          దెరపిగా నొకనాఁడు తీఱలేదు;

ఇంకఁ దక్కినవార లదేమి లెక్క?
ముక్కుఁ బట్టినఁ బ్రాణంబు మొదలె పోవు;
కాంత, నాకన్న నేర్పరుల్ గలరె చెపుమ?
నేను ననుఁగూర్చి పొగడుట నియతిగాదు.

'సత్కవి, ప్రబుధవేంకటేశ్వర విజయ వి
లాసకర్త నామది కెక్కులాగు' వ్రాసెఁ
గాని, కొందఱు పాండిత్య గణ్యతా వి
హీనతను దాఁచ, రస మని యేడ్చినారు.'

అని తనమూటముల్లెలు రయంబున విప్పి: 'నెలంత, పొత్తముల్
గనుమ, యధీతమయ్యెనివి; గ్రంథము లెన్నియొమోయలేకయిం
టను బదిలంబు చేసితిని; నా శ్రమ లెల్లను జింతచేసి నన్
గనుమ కృపాకటాక్షములఁ గామిని, నీ మనసేమి చెప్పుమా!'

తనకుఁ బరమశత్రుఁ డెనలేనిఛాందసుం
డింత కెటులొ దొరకె, నింతతోడ
విడువరాదటంచు వెలఁది సంతోషించి,
హాస్య మనుభవింప నభిలషించి:

'ధర్మశాస్త్రమెల్లఁ దనువున జీర్ణించె
నిగమవిధులయందు నిధులు మీరు;
అట్టు లౌట దలఁప కెట్టుల నీనాఁడు
కులటతోడి పొందు గోరినారు?'

అనిన విని, ఛాందసుం డపు డదరి లేచి:
'వెలఁది యేమంటి? వీవెట్లు కులట వైతి?
బహుపతిత్వము స్త్రీలకు భావ్యమగునె?
ధర్మవైరుధ్య మక్కటా! దాపురించె.

'ఇందుకా నేను బలుపాటు లెల్ల సైఁచి
యింత దూరమ్ము వచ్చుట యెమ్మెలాఁడి?
బ్రహ్మచారిని, బ్రాహ్మణపండితుఁడను
కులటసాంగత్య మేరీతిఁ గోరుకొందు? '

అని కపటంబులేని వెత లాననసీమను దేలియాడఁ 'గా
మిని, కులటత్వ మెట్టు లనుమేయము నీయెడ'నన్నఁ గాంతయున్
మనమున నుబ్బుహాస్యరసమాధురి కన్నులఁ జిప్పిలంగ లోఁ
గొని మొగమందు మాయవగఁగూర్చి వచించెఁజరిత్రమంతయున్