కన్యాశుల్కము (తొలికూర్పు)/ప్రథమాంకము
కన్యాశుల్కము
మొదటియంకము
స్థలము - విజయనగరములో బొంకులదిబ్బ
(గిరీశం ప్రవేశించి.)
గిరీశ: సాయంకాలమైనది. పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొనిపెట్టుతానని నెల రోజులైనది పదిరూపాయలు పట్టుకువెళ్ళి డ్యాన్‌సింగు గర్లుకింద ఖర్చు పెట్టినాను. యీవేళ ఉదయము పూటకూళ్లమ్మకూ నాకూ యుద్ధము అయిపోయినది. బుర్ర బద్దలుకొడదామా అన్నంతకోపం వచ్చినది కాని, పూర్ రిచ్చర్డు చెప్పినట్లు పేషన్సు వుంటేనే కాని లోకములో పనిజరగదు.
When lovely woman stoops to folly,
And finds too late that men betray,
What charms can soothe her melancholy,
What arts can wash her guilt away?
ఈలా డబ్బు లాగేస్తే యిదివరకు యెన్ని పర్యాయములు ఊరుకున్నదికాదు. డ్యాన్‌సింగు గర్లు మాట యేదో కొంచెము ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. లేక యెవళ్లయినా నా మీద కోపంకొద్దీ ఉన్న నిజం దానితో చెప్పివేసినారేమో! ఈ వేళ ఉదయంసంగతి ఆలోచిస్తే యిటుపైని తిండిపెట్టేటట్టు కనపడదు. ఇక యీ వూరులో మనపప్పు వుడకదు. ఎటుచూచినా అందరికీ బాకీలేను. వెంకుపంతులుగారి కోడలికి లవ్‌లెటర్ వ్రాసినందుకు యెప్పుడో ఒకప్పుడు సమయంచూసి యెముకలు విరగ్గొట్టేస్తారు.
Can love be controlled by advice?
Will cupid our mothers obey?
శీఘ్రంగా బిచాణా యిక్కడనుండి యెత్తివెయ్యడమే బుద్ధిమంతుడికి లక్షణం. గాని మహాలక్ష్మిని వదలడమంటే యేమీ మనస్కరించకుండా వున్నది.
It is women that seduce all mankind.
Oh! Whistle to me and I will come away, Though father mother and grandmother. Should go mad.
ఎవరా వస్తూ ఉన్నది? నా ప్రియశిష్యుడు వెంకటేశ్వరులులాగు వున్నాడు. ఈ వేళ కిస్‌మిస్ శలవులు యిచ్చివుంటారు. వాడి ముఖం వైఖరి చూస్తే ఫెయిలయినట్టు కనపడుతున్నాడు. వీడికి శలవులలో చదువుచెప్పే మిషమీద వీడితోకూడా వీడి వూరు వుడాయిస్తే చాలా చిక్కులు వదులుతవి. అటు నుంచి నరుక్కురమ్మన్నాడు.
(వెంకటేశ్వర్లు ప్రవేశించుచున్నాడు)
గిరీశ: ఏమివాయి, మైడియర్ షేక్స్‌పియర్. ముఖం వేల వేసినావు?
వెంకటే: ఇక మీరు నాతో మాట్లాడకండి, మీతో సావాసం చెయడముచేత నా పరీక్ష పోయిందని మా మేష్టరుగారు చెప్పినారు.
గిరీశ: నాన్సెన్స్. మొదటినుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మేష్టరుకి నన్ను చూస్తే కిట్టదు. అందుచేత నిన్ను ఫెయిలుచేసినాడు గాని; లేకుంటే నివ్వు ఏమిటి? ఫెయిలు కావడమేమిటి! అతనికీ నాకూ యెందుకు విరోధము వచ్చిందో నీకు తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పేపరులో పెట్టి యేకివేసినాను.
వెంకటే: మీవల్ల నాకు వచ్చినదల్లా చుట్టకాల్చడం వక్కటె. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడమేకాని, ఒకమాటయినా ఒక ముక్క చెప్పిన పాపానపోయినారా?
గిరీశ: డామిట్. యిలాంటి మాటలంటే నాకు కోపము వస్తుంది. ఇది బేస్ యిన్‌గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడుతుండడమే యెడ్యుకేషన్ . నీకున్న లాంగ్వేజి నీ మేష్టరుకైనా వుందీ? విడో మారేజి విషయమై, నాచ్ కొశ్చన్ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను. నా దగ్గర చదువుకొన్నవాడు ఒకడూ అప్రయోజకుడు కాలేదు. పూనాలో డక్కన్ కాలేజిలో నేను చదువుతున్నప్పుడు ది ఇలివెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ ఆఫ్ ఇండియా విషయమై మూడు ఘంటలు ఒక్క బిగిని ఆలాగు లెక్చర్లు యిస్తే ప్రొఫెసర్లు అంతా టర్రు కొట్టేశారు. మొన్న బంగాళీబాబు ఈ వూళ్ళో లెక్చర్లు యిచ్చినప్పుడు ఒకడికయినా నోరుపెగిలిందీ. మనవాళ్లు వట్టి వెధవాయిలోయి. చుట్టకాల్చడం యొక్క మజా నీకేమీ బోధపడలేదు. చుట్ట కాల్చడం నించే దొర్లు యింత గొప్పవాళ్లు అయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషు వాడిని చూశావూ? చుట్టకాల్చడంబట్టె స్టీముయంత్రం కనుక్కున్నారు. శాస్త్రకారుడు కూడా యేమన్నాడో వినలేదా? క. ఖగపతి యమృతముతేగా ।
భుగభుగమని పొంగి చుక్క భూమినివ్రాలెన్ ।
పొగచెటైజన్మించెను ।
పొగతాగనివాడు దున్నపోతైబుట్టున్॥
ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసములో వున్నది. అది అలాగు వుణ్ణీగాని నీ అంత తెలివయిన కుర్రవాడిని ప్రొమోషన్ చెయ్యనందుకు నీ మేష్టరుమీద నావళ్లు మహామండుతూ వున్నది. ఈమాటు వంటరిగా షికారు వెళ్ళుతూన్నపుడు చూచి ఒక తడాఖాతీస్తాను. నీవు శలవులలో యిక్కడ వుంటావా లేక, వూరికి వెళతావా?
వెంకటే: మా వూరికి వెళ్ళాలనివుంది కాని (గద్గద స్వరముతో) ప్యాసుకాలేదంటే మా వాళ్ళు కొట్టేస్తారు.
గిరీశ : నీకు నేనొక వుపాయం చెప్పుతాను. నేను చెప్పినట్టల్లా యెప్పుడూ వింటానని ప్రమాణకం చేస్తావా?
వెంకటే: (అతనికాళ్ళు పట్టుకుని) ఏలాగైనా నన్ను రక్షించాలి మా నాన్నకు మా చెడ్డకోపం. ఇంటికి వెళ్లితే యెముకలు విరగగొట్టేస్తాడు.
గిరీశ : దట్ యీస్ టిరనీ యిదే బంగాళీ కుర్రవాడవుతే యేమిచేస్తాడో తెలిసిందా? కర్ర పట్టుకుని తండ్రయేది తాతయేది ఛమ్డాలు యెక్కకొడతాడు. మీ అగ్రహారంలో మరి యెవరూ స్కూలు కుర్రవాళ్లులో లేరుగద?
వెంకటే: లేరు
గిరీశ : అయితే నేనొక వుపాయం చెప్తాను విను. నేను కూడా నీతో వస్తాను. నువ్వు ప్యాస్ అయినావని చెప్పేదాము. కావలిస్తే అటుంచి వచ్చిన తరువాత టవును స్కూలులో ప్రవేశించవచ్చును.
వెంకటే: మీరు కూడా వుంటే నాకు భయములేదు, మొన్న వేసంగి శలవులలో కూడా మా అమ్మ శలవులలో పాఠాలు చెప్పడానికి మిమ్మలిని తీసుకురమ్మంది.
గిరీశ : ఆల్‌రైట్. కాని నా కిక్కడ చాలా వ్యవహారములలో నష్టము వస్తుంది. మునసబుగారి కొమాళ్లకి శలవులలో పాఠాలు చెప్పితే ట్వంటీ రుపీస్ యిస్తామన్నారు. అయినా నీ విషయంలో యెంత లాస్‌వచ్చినా నేను కేర్ చెయ్యను. మీవాళ్లు బార్ బరస్ పీపిల్ తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో. నీవు నా విషయమై గట్టిగా రికంమెండు చెయ్యవలసియుంటుంది. కొత్త పొస్తకాలు కొనడమునకు ఒక జాబితావ్రాయి కొంచెము డబ్బు చేతిలో వుంటేనే గాని సిగర్సుకి కొంచెము ఇబ్బందిగా వుంటుంది. నోట్‌బుక్కు, పెన్సలు తియ్యి:
- రోయల్ రీడర్.
- మాన్యుఅల్ ఆఫ్ గ్రామరు.
- గోషుస్ జ్యామెట్రీ.
- బాసూస్ ఆల్జిబ్రా.
- బాసూస్ అర్థమెటిక్కు.
- నలచరిత్ర.
- రాజశేఖర చరిత్ర.
- షెప్పర్డ్సు జనరల్ యింగ్లీషు.
- వెంకట సుబ్బారావ్‌స్ మేడిజీ.
యెన్ని పుస్తకాలయినాయి.
వెంకటే: తొమ్మిది పొస్తకాలయినాయి.
గిరీశ : మరొక్కటి వెయ్యి - కుప్పుస్వామి అయ్యర్సు మేడ్‌డిఫికల్ట్. అక్కడికి చాలును. మీవాళ్ళుగాని ఇంగ్లీషు మాట్లాడమంటే తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాలలో వున్న ముక్కలు ఏకరపెట్టెయ్యి. నీ దగ్గిర యేమయినా కాపర్సు వున్నవా? బ్యాంకినోట్లు మార్చలేదు. వక పదణాలుపెట్టి మిఠాయి పట్టుకొనిరా. రాత్రి మరి నేను భోజనము చెయ్యను. మార్కట్‌కు వెళ్ళి బండి కుదిర్చేశి దానిమీద నా ట్రావెలింగు ట్రంక్ పడేసి మెట్టుదగ్గర బండి నిలబెట్టివుంచు. ఇక్కడ కొన్ని పనులు చక్కబెట్టుకొని యెంత రాత్రికయినా వచ్చి కలుసుకుంటాను. గో యట్ వన్స్ మై గుడ్ బోయ్. నీవు బుద్ధిగా చెప్పిన మాటలు వింటూవుంటే సురేంద్రనాధ్ బనర్జీ అంత గొప్ప వాడిని చేసేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యవద్దు.
(వెంకటేశ్వర్లు నిష్క్రమించుచున్నాడు)
గిరీశ: (తనలో) ఈ వ్యవహార మొకటి ఫైసలయింది. ఈ రాత్రి మహాలక్ష్మికి పార్టింగు విజిట్ యివ్వవలెను.
(పైకి) ఠవణింతున్నుతి కాలకంఠ మకుటాట్టాలప్రతోళీమిళత్యవమానామరశింధు బంధురపయ స్సంభార
(ఒక బంట్రోతు ప్రవేశించి.)
గిరీశ: (వినబడనట్టు నటించుచు)
గంభీరవాగ్వ్యవహారైక ధురంధరత్వమగు జిహ్వలోలి మత్తలికిన్! జనికిందల్లికి కారవేళ్లికి ధనుర్జ్వావల్లి నీరుల్లికిన్!!
బంట్రోతు: యంతమందిని పంపించినా యిదుగో యిస్తామని అదుగో యిస్తామని తిప్పుతూ వచ్చేవారట. నేను వాళ్ళలాగు వూరుకునే వాడను కాను.
గిరీశ : అయ్య కోనేటికి తోవయిదే.
బంట్రోతు : యిదెక్కడ చెమిటి మహాలోకము వచ్చిందయా.
గిరీశ : కోమటి దుకాణమా? కస్పాబజారులో కాని ఇటివైపు లేదు.
బంట్రోతు : (గట్టిగా చెవిదగ్గిన నోరుపెట్టి) పొటిగ్రాపుల ఖరీదు యిస్తారా ఇవ్వరా?
గిరీశ : బస రాధారీ బంగళాలో చెయ్యవచ్చును.
బంట్రోతు : (మరీగట్టిగా) మీరూ సానిదీ కలిసి వేయించు కున్న పొటిగ్రాఫు ఖరీదు 16 రూపాయలు. అప్పుడే యిస్తామని యింకా తిప్పలు పెడుతూన్నారు.
గిరీశ : ఓహో నీవా! నింపాదిగా మాట్లాడు. నింపాదిగా మాట్లాడు. రేపు వుదయం తప్పకుండా 8 ఘంటలకు పూటకూళ్లమ్మ యింటికి వచ్చినట్టైనా రూపాయలు అణాపైసలతో ఇచ్చివేస్తాను. మీ పంతులుకు స్నేహమూ మంచీ చెడ్డా అక్కరలేదూ. ఇంత తొందర పెట్టడానికి యేవూరైనా పారిపోతామా యేమిటి.
బంట్రోతు : మాటలతో కార్యము లేదు రూపాయలు నిలువబెట్టి మరీ పుచ్చుకోమన్నారు.
గిరీశ : పెద్దమనిషివి నువ్వూ అలాగే అనడం ధర్మమేనా? రేపు వుదయం యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడుతో సమానము - ఇంకా నీకు నమ్మకము లేకపోతే యిదుగో గాయిత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను.
బంట్రో : కానియ్యండి రేపు వుదయం ఇయ్యకపోతే మాత్రం భవిష్యం వుండదు
(అని నిష్క్రమించుచున్నాడు.)
గిరీశ: (తనలో) ఇన్నాళ్ళకు జంఝ్యపుపోచ వినియోగం లోకి వచ్చింది. ధియాసొఫిస్ట్ చెప్పినట్లు మన ఓల్డు కస్టమ్సుకు ప్రతిదానికీ యెదో ఒక ఉపయోగం ఆలోచించే మన వాళ్ళు నియమించారు. యిప్పుడు నాకు బోధపడ్డది. ఈ పిశాచాన్ని వదుల్చుకునేటప్పటికి తలప్రాణం తోక్కివచ్చింది. చీకటి పడింది. శీఘ్రబుద్ధే:పలాయనంఅని పెందరాళే ఈ వూరునుంచి వుడాయిస్తేనే కాని అబోరు దక్కదు. ఇక బయలుదేరి మహాలక్ష్మి ఇంటికి వెళ్ళవలెను. మేక్ హే వైల్‌ది సన్‌షైన్స్ అన్నాడు. (పైకి) పూజారివారి కోడలు తాజారగ బిందెజారి జర్రున పడియెన్. ఆ పైముక్క మరి జ్ఞాపకమువచ్చినది కాదూ. (చుట్టనోటిలో బెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించుచుండగా తెరదించి వేయవలెను.)
***
(౨స్థలము - కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లుగారి నడవ)
(అగ్నిహోత్రావధానులుగారు కూర్చుని జంఝ్యాలు వడుకుచు కరటక శాస్త్రులు శిష్యునిచేత పేలు నొక్కించుకొనుచు వెంకమ్మ కూర తరుగుచు గనబడుదురు)
వెంకమ్మ : నిన్నటినుంచి కిసిమీశ్శలవులని కుర్రవాడు వుత్తరం వ్రాసినాడు. యెన్నాళ్లైందో చూచి కళ్ళు కాయలుకాచిపోయినాయి. గడియో గడియో వస్తాడు కాబోలు.
అగ్నిహో: ఎందుకు వట్టినే వగచడం. నేను వద్దు వద్దంటూంటే ఇంగ్లీషులో పెట్టావు. మెరక పొలంమీద వచ్చేశిస్తంతా వాడికింద ఖర్చుఅయిపోతున్నది. క్రిందటి సంవత్సరం పరీక్షఫేలు అయిపోయినాడు. మనకి ఇంగ్లీషు అచ్చిరాదని పోరి పోరి మొదటే చెప్పాను. మా పెత్తండ్రి దిబ్బావధానులు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేటప్పటికి వుష్ణంవచ్చి మూడు రోజుల్లో కొట్టివేశింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిందామనుకుంటూండగానే పెద్దఖాయిలా పెట్టిచచ్చినంతైంది.
వెంకమ్మ: మీరు యెప్పుడూ యిలాంటి వాగాయత్తం మాటలే అంచారు. డబ్బుఖర్చు అయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న నాకళ్లయదట మన వాకట్లో జుత్తువిరబోసుకుని గొట్టికాయలు ఆడుకునేవాడు నేమానివారి కుర్రాడికి మునసబీ అయిపోయింది.
అగ్నిహో: మన వెధవాయికి చదువువచ్చేది యేమీ కనపడదుకాని పుస్తకాలకింద జీతం కింద ఇక నాలుగు యేళ్లయేటప్పటికి మనభూమి కడతేరిపోతుంది. ఆ పైని చిప్పా దొప్పా పట్టుకుని బయలుదేరాలి. నిమ్మళంగా ఇంటిదగ్గర వుంటే ఈ పాటికి నాలుగు అర్థాలు చెప్పివేదును. వొద్దంటూంటె యీ వెధవ ఇంగ్లీషుచదువుకింద పెట్టావు.
వెంకమ్మ : మనవాడికి ఒక మునసబు పనైనా, పోలీసు పనైనా అవుతే ఋణాలిచ్చి యీ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడు. సాలుకు వక నూఱు రూపాయీలు ఖర్చుపెట్టడానికి ముందూ వెనుకా చూస్తున్నారు. మీలాగే వాడూ పెద్ద కడుపు వేళ్లాడేసుకుని జంఝాలు వడుక్కుంటూ బతకాలని వుందా యేమిటి? మీకంత భారమనితోస్తే మా వాళ్లు నా పసపూ కుంఖానికి యిచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను.
కరటక: నీ భూమి యెందుకు అమ్మాలి మన సొమ్ము చెడతిని కొవ్వివున్నాడు అతనే పెట్టుకుంటాడు.
అగ్నిహో: అయితే నా కడుపును ఆక్షేపణ చేస్తావషె? యీ మారంటె నీ అన్న వున్నాడని వూరుకునేది లేదుసుమా!
(గిరీశ, వెంకటేశ్వర్లు, ప్రవేశించుచున్నారు.)
వెంకమ్మ: మా బాబు - మా బాబు వచ్చావషోయి (అని లేచి వెళ్లి కవుగలించుకొనుచున్నది)
అగ్నిహో: వెధవాయా. యీ మాటైనా ప్యాసు అయినావా లేదా?
వెంకటే: (తెల్లబోయి జూచుచున్నాడు)
గిరీశ: ప్యాసు అయినాడండి. ఫస్టుగా ప్యాసయినాడు.
అగ్నిహో: యీ తురక యెవడోయి?
గిరీశ : టర్క్! డామిట్, టెల్‌మాన్.
అగ్నిహో: మాన్! మానులావున్నానంఛావు? గూబు పగలగొడఛాను.
వెంకటే: (వణుకుతూ తల్లివైపుచూచి) అమ్మా యీయనే నాకు చదువు చెప్పుతాడు.
కరటక: ఇంటికి పెద్దమనిషి వస్తే అపృచ్ఛపు మాటలాడుతావేమి ఇంగ్లీషుమాట ఆయనేమో కుర్రవాడితో అంటే పుచ్చకాయ దొంగంటే బుజాలు తడుముకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేమి.
(బండివాడు సామాను దించును)
గిరీశ : తమరు యిక్కడా వున్నారు. నన్ను తమరు యరగకపోయి వుండవచ్చును గాని సంస్కృత నాటక కంపెనీలో తమర్ని తరుచుగా చూస్తూ వుండేవాడిని. యిండియా అంతా తిరిగినాను. గాని తమవంటి విదూషకుణ్ణి యక్కడా చూడలేదు. సంస్కృతం, అరవం, మహారాష్ట్రం, యింకా యెన్నో భాషలు మంచినీళ్ల ప్రవాహంలా మాట్లాడుతారు.
అగ్నిహో: (ధుమధుమలాడుచు) యీ శెషభిషలు నాకు పనికిరావు. ఈయన వైఖరి చూస్తే యిక్కడే బసవేసేటట్టు కనబడుతున్నది. నా యింట్లో భోజనం యంత మాత్రమూ వీలుపడదు. వెంకమ్మ: ఆయన వెర్రివాడు, ఆయనమాట గణనలోకి తేకు బాబూ! యాలాగైనా మా వాణ్ణి కడుపులోపెట్టుకుని ఒక ముక్క అబ్బేటట్టు చేయిబాబూ. వాడు వట్టి సత్తెకాలం నాయన. నామోస్తరే.
గిరీశం : అభ్యంతరమేమిటమ్మా, మీవాడు శలవులలో చదువు చెప్పమని యెంతో బతిమాలుకుంటే పోనీ పనికివచ్చే కుర్రవాడుగదా అని వచ్చినాను. లేకుంటే పట్నంలో పంచపక్వ పరమాన్నాలు మానుకుని ఇక్కడ ముతక బియ్యం తినడానిక ఎందుకువస్తాను.
కరటక: (తనలో) వీడు టక్కర్‌లా వున్నాడు.
వెంకమ్మ-- ఈ చదువులకోసమని పిల్లలను వదులుకుని వుండడం వార్లక్కడ శ్రమదమాదులు పడుతూవుండడం, నాప్రాణాలు యెప్పుడూ అక్కడే వుంచాయి. డబ్బంటే యెప్పుడూ వెనకచూడలేదుగదా. మేము కనడం మట్టుకుకన్నాము. మీరే తల్లీతండ్రీ వాడిని యేలాగు బాగుచేస్తారో మీదేభారం.
గిరీశ-- మీరు ఇంతదూరం శలవు యివ్వవలెనా. నా మంచీ చెడ్డా మీకుర్రవాణ్ని అడిగితేనే తెలుస్తుంది. ఇంతెందుకు ఇక మూడుసంవత్సరములు నా తరిఫీతులో వుంచితే క్రిమినల్ లోవర్ అనగా పోలీసు పరీక్ష ప్యాసు చేయించివేస్తాను. డబ్బువిషయమై మట్టుకు మీరు వెనక తీయకుండా వుండాలి.
అగ్నిహో: యీ సంవత్సరం పుస్తకాలకి యెంతైందిరా అబ్బీ?
వెంకటే: పదిహేను రూపాయిలవుతుంది.
అగ్నిహో: ఒక్క దమ్మిడీ ఇచ్చేది లేదు. వీళ్లిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుక తినేసేటట్టు అగుపడుచుంది గాని మరేమీ లేదు. నేను వేదము 82 పన్నాలూ జటాంతం వరకూ పుస్తకాల కింద ఒక దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలాగా కనపడుతుంది.
కరటక: (ముఖంవంకబెట్టి నవ్వుకొనును)
గిరీశం: (కరటకశాస్త్రుల వైపుచూచి) బార్బరస్, చూచారండీ జెన్‌టిల్‌మ్యాను అనగా పెద్దమనిషిని యెలాగు అంటున్నారో- నేను యీ నిమిషం వెళ్లిపోతాను.
వెంకమ్మ-- చాలు. చాలు. బాగానే వున్నది! ఇంటికి ఎవరైనా పెద్దమనిషి వస్తే నాకిదే భయం. ఆయన మాటల కెక్కడికి -బాబూ వెళ్లకండి. అన్నిటికీ నేను వున్నాకదా.
కరటక: అగ్నిహోత్రావధానులూ కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనకా చూస్తూన్నావు. బుచ్చమ్మని అమ్మిన పదిహేను వందల రూపాయిలూ యేమిచేసినావు. గిరీశ : సెల్లింగ్ గర్ల్స్! డామిట్.
అగ్నిహో : ప్రతిగాడిదకొడుకూ అమ్మేవు అమ్మేవు అంచూవుంచాడు. కూరగాయషోయి - అమ్మడానికి - ఆ రూపాయీలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా దానిగతి యేమవును, వడ్డీతో కూడా ఇప్పుడు ౧౮౦౦ రూపాయలు అయినవి. దాని మానాన్న అది బతకవచ్చును.
కరటక: చచ్చాడంటే వాడిది తప్పా? మంచంమీంచి దించివేయడానికి శిద్ధముగా వున్నవాడికి పెళ్ళిచేసినావు. సదశ్యం నాడు వెంకుపంతులుగారు వచ్చారు కారని భోజనాల దగ్గిర కనిపెట్టుకు వుండేసరికి గుడ్లు పేలిచచ్చాడు. అగ్నిహోత్రావధానులూ! నేను యెరగనట్లు చెప్పుతావేమిటి?
గిరీశ : తమరేనా, నులక అగ్నిహోత్రావధానులుగారు. జటలో తమతో సమానులు లేరని రాజమహేంద్రవరంలో అనుకునేవారు.
అగ్నిహో-- మీది రాజమహేంద్రవరంటండీ. ఆ మాట చెప్పారు కారేమి. రామావుధానులు గారు ఖులాసాగా వున్నారా? ఆయన గొప్ప ఘనాపాటీ.
గిరీశ : ఖులాసాగా వున్నారు. నేను ఆయన మేనల్లుణ్ణే నండి నాపేరు గిరీశం అంటారు.
అగ్నిహో: ఆలాగునండీ చెప్పారు కారూ.
గిరీశ : మా మామగారు ఎప్పుడూ ఎవరువచ్చినా మిమ్ములనే పొగుడుతూ వుంటారు.
అగ్నిహో:ఎవరో అనుకుని యిందాకా అన్నమాటలు క్షమించాలి సుమండీ. నేను కొంచెం ప్రథకోపిని.
గిరీశ: దానికేమిటండీ. తమవంటి పెద్దవాళ్ళు అనడమూ - మావంటి కుర్రవాళ్లు పడడం విధి.
కరటక : (తనలో) యీ అగ్నిహోత్రావధాన్లుకి తగినవాడు దొరికాడు.
అగ్నిహో-- చూచారండీ మా కరటకశాస్త్రి వట్టి అవకతవక మనిషి మంచీ చెడ్డా యేమీ తెలియదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యంతలాభం కలిగింది? భూములకి దావా తెచ్చామా లేదా! గిరీశంగారూ నేను యీమధ్య దాఖలుచేసిన అర్జీ పట్టుకొస్తాను దానిమీద యిండారుసు చదవండీ (అని గదిలోనికి వెళ్ళి తీసుకొనివచ్చి చేతికిచ్చుచున్నాడు)
గిరీశ : (కాకితము నెగదిగజూచి) ఎవరో తెలివి తక్కువ గుమాస్తా వ్రాసినట్టువున్నది గాని యెక్కడా అక్షరం పొల్తిలేదండీ. అగ్నిహో: లేదండీ దొరగారు స్వయం చేత్తో వ్రాశారు. మఱి వక్కమారు చూడండి.
గిరీశ : ఆలాగు చెప్పండి - యిది లాటిను భాషను వ్రాసినాడు, ఇంగ్లీషు గాని యింకా నేను లాటినుభాష నేర్చుకొనలేదండి.
అగ్నిహో: మా వకీలు చదివేశాడండీ.
గిరీశ: అది యేమాత్రం పనండి. లాటిను వక రోజులో చదువవచ్చును. జరుగురు లేక నేను చదవడం లేదు.
కరటక: (తనలో) వీడిచర్య గమ్మత్తుగా వున్నది.
వెంకటేశ: మా అబ్బాయీ మీరు వక పర్యాయం ఇంగ్లీషు మాట్లాడుతారూ?
గిరీశం: Twinkle! Twinkle! little star,
How I wonder what you are.
వెంకటేశ: There is a white man in the tent.
గిరీశంః The boy stood on the burning deck
Whence all but he had fled.
వెంకటేశంః Upon the same base and on the same side of it the sides of a trapezium are equal to one another.
గిరీశం: Of man's first disobedience and the fruit of that mango tree, sing Venkatesa my very good boy.
వెంకటేశ: Nouns ending in f or fe, change their f or fe into "ves".
అగ్నిహో: ఈ ఆడుతున్న మాటలకి అర్థమేమిటండీ?
గిరీశ : యీ శలవులలో యే ప్రకారం చదవవలెనో అదంతా మాట్లాడుకుంటున్నాము.
కరటక: అబ్బీ వక్క తెనుగు పద్యము ఏదైనా చదువుతారా?
వెంకటే: పొగచుట్టకు సతిమోవికి
కరటక: చబాష్!
గిరీశ: డ్యామిట్ డోన్ట్‌రీడ్డట్. (మెల్లగా) నల దమయంతు లిద్దరు (అని అందిచ్చుచున్నాడు.)
వెంకటే: నలదమయంతు లిద్దరు మన: ప్రభావానలదహ్యమానులై
కరటక: మనః ప్రభవానలమంటే యేమిట్రా అబ్బాయీ? గిరీశ : స్కూళ్లలో అర్థం చెప్పరండి. పరీక్షకు అర్థం అక్కరలేదు. వేదం చదివినట్టె తెలుగూ చదివిస్తారు.
కరటక: (తనలో) తరిఫీత్ మా చమత్కారంగా వున్నది. వీడికి పెందరాళే ఉద్వాసన చెప్పితేనే గాని అసాధ్యుళ్లా వున్నాడు.
అగ్నిహో: బాగావుందండి మా వాడికి డబ్బు ఖర్చులేకుండా పెళ్ళి అయేసాధనం కూడా ఒకటి తటస్థించింది. ఇటుపైన కలక్టరీదాకా చదువుచెప్పిస్తాను.
వెంకమ్మ: మీ నైజం కొద్దీ ఛిర్రూ కొర్రూ మంటారు గాని మీకుమాత్రం బాబు మీద ప్రేమలేదా యేమిటి పట్నంలో గొట్టాలమ్మ వచ్చినప్పుడు బెంగబెట్టుకుని బాబుని శలవర్జీరాసి వెళ్లిపో రమ్మన్నారు కారా - పెళ్ళీ చెయ్యక చదువూ చెప్పించక తీరుతుందాయేమిటి.
కరటక: డబ్బుఖర్చు లేకుండా కొడుక్కు పెళ్ళి చేస్తావుటోయి బావా! పిల్లలను అమ్మినట్టె అనుకున్నావా యేమిటి? పదిహేను వందలైనా పోస్తేగాని పిల్లను యివ్వరు.
అగ్నిహో: రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లుగారికి చిన్నమ్మిని పద్దెనిమిదివందల రూపాయీలకు అడగవచ్చినారు. ఆయన నాలుగు లక్షలకధికారష, ఉభయ కర్చులూ పెట్టుకుంటారష, పెళ్ళి మహావైభవంగా చేస్తారష, మనమే తర్లి వెళ్ళడం. తాంబూలం పుచ్చుకున్నారు. నిశ్చయం అయిపోయినది, ఆ పద్దెనిమిది వందలూ పెట్టి వెంకడికి పెళ్ళిచేస్తాను.
వెంకమ్మ: అయ్యో! అయ్యో! నాకు తెలియకుండానే? నాకు తెలియకుండానే? యెన్నేళ్ళేమిటి పెళ్ళికొడుక్కి
అగ్నిహో: ఎన్నేళ్లైతే నేమిటి నలభైయైదూ.
వెంకమ్మ: బుచ్చమ్మ మన జీవానికి వుసూరుమని యేడుస్తూంటే సుబ్బిని కూడా యెవడో ముసలి వెధవకు అమ్మ తల్చుకున్నారు. మేనరికము యివ్వాలని ఎంతో ముచ్చటపడుతూన్నాను. ఈ సంబంధము చేసుకుంటే నేను నూతిలో పడకమానను.
గిరీశ : లుబ్ధావధాన్లు మా పెత్తల్లి కుమారుడండి కాని సెల్లింగ్‌గర్ల్స్ కన్యాశుల్కము, డామిట్, యెంతమాత్రమూ కూడదు. అవధానులు మామగారూ. డామిట్ - మల్బారీ దాని విషయమై చాలా యస్సేస్ వ్రాసినాడు. నేను పూనాలో వున్నప్పుడు కన్యాశుల్కము విషయమై ఒకనాడు నాలుగు ఘంటలు లెక్చరిచ్చినాను. సావకాశంగా కూర్చుంటే కన్యావిక్రయము బహు దౌర్జన్యమైన పనని ఈచేత వొప్పిస్తాను.
కరటక: ఈ సంబంధము చేస్తే నీ కొంపకి అగ్గి పెట్టేస్తాను. అగ్నిహో: వీళ్లమ్మా శిఖాతరగా! ప్రతి గాడిదకొడుకూ తిండిపోతుల్లాగచేరి నన్ను అనేవాల్లే! మరింతకాక యింత గింజుకుచచ్చేది యీ సంబంధం చెయ్యకపోతే నేను బారికరాముడే సరి.
(అని వెళ్ళిపోవును).
కరటక: ఏమి అపృచ్ఛపుమాటలంటావయ్యా.
వెంకమ్మ: అబ్బీ యీ సంబంధం చేస్తే నేను నూతులో పడకమానను. నలుగురు బంధువులలో పరువూ ప్రతిష్టా పోవడం సరేగదా అమాంతంగా పిల్లదాని పీక కోసివెయ్యడం కాని మరివకటి కాదు. పెద్దదానిని పక్కలో కుంపటిలాగు ఇంట్లో పెట్టుకు అనుభవిస్తూనే వున్నాము. ఆయనకి మంచీ చెడ్డా వొళ్లునాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించినారు. ఆయన చదువులూ నా నోములూ యెందుకు. తగలేయనా, ఆయనకు యెంతతోస్తే అంతేకాని కావలసిన వారిని సలహాచెయ్యడం అదీ యెప్పుడూ లేదు. ఇంతెందుకూ ఈ సంబంధము అయినట్టాయనా ఒక నుయ్యో గొయ్యో చూచుకోవడమే కాని మరి సాధనం లేదు.
కరటక: (ఆలోచించుచు నిమ్మళముగా) గట్టి అసాధ్యము వచ్చినది - వొట్టి మూర్ఖపు గాడిదకొడుకు యెదురు చెప్పితే మరింత కొర్రెక్కుతాడు. యేమీ పాలుపోకుండావున్నది.
గిరీశ : వెంకమ్మత్తగారూ మీరెందుకాలాగు విచారిస్తారు. సావకాశముగా మామగారు ఒక్క ఘంట కూర్చుంటే కన్యాశుల్కమూ, శిశువివాహమూ కూడదని లెక్చరు ఇచ్చి ఒక నిముషములో ఆయన మనసును మళ్ళించి వేస్తాను.
కరటక: (తనలో) నీవు వొక ఘంట లెక్చరు యిస్తే నీ వంటిమీద అతను రెండు ఘంటలు లెక్చరు ఇస్తాడు. (బిగ్గరగా) అమ్మీ నేనొక సలహా చెపుతాను యీలాగురా. (ఇద్దరును వెళ్ళిపోవుచ్చున్నారు)
గిరీశ : మైడియర్ షేక్‌స్పియర్ ! మీఫాదర్ అగ్గిరాముడోయి, మీ ఇంట్లో యెవళ్ళకీ అతనిని లొంగదీసే యలొక్వెన్సు లేదు. నా దెబ్బ చూడు యీవేళ యేమిచేస్తానో. వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కము విషయమై వ్రాసిన పాంప్లెట్ ట్రంకులోనుంచి తియ్యి. మామగారికి లెక్చర్లు ఇవ్వడానికి కత్తీ ఖటార్నూరాలి.
వెంకటే: మీ లెక్చరు మాట అలాగుండనీండిగాని యీవేళ నాగండము గడిచినది గదా అని సంతోషిస్తూన్నాను. మీరు రాకపోతే మా తండ్రి పెయ్యకట్టుతాడు పట్టుకుని పరీక్ష ఫెయిల్ అయినందుకు చెమడాలు యెక్కకొట్టి వేసును. క్రిందటి మాటు కిసిమిసు శ్శలవులలో తిన్నదెబ్బలు యిప్పటికి మరిచిపోలేదు. గిరీశ: యిలాంటివి తప్పించుకోవడమే ప్రజ్ఞ. యేమైనా డిఫికల్టీ వచ్చినపుడు ఒక ఠస్సా వేసినామంటే బ్రహ్మ భేద్యముగా ఉండవలెను. పోలిటిషన్ అంటె మరేమిటనుకున్నావు, పూజా నమస్కారాలు లేక బూజెక్కి వున్నాను గాని మన కంట్రీయే ఇన్‌డిపెండెంటు అయిపోతే గ్లాడ్‌స్టన్ లాగు దివాన్‌గిరీ చెలాయిస్తును. ఏమివాయి మీ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్ముఇచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్నమునుంచి అరకట్టే తీసుకుని వచ్చినాను.
వెంకటే: నాన్న యివ్వకపోతే అమ్మనడిగి పుచ్చుకుంటాను.
గిరీశ: యూ ఆర్ ఏ వెరి ఇన్‌టిలిజెంటు బోయ్. దట్ ఇజ్ ది ప్రొపర్‌వే. యూ విల్ వన్‌డే బికమ్ ఏ గ్రేట్ పొలిటిషన్.
(బుచ్చమ్మ ప్రవేశించును.)
బుచ్చమ్మ: తమ్ముడూ అమ్మ కాళ్ళు కడుక్కోమంటూంది.
గిరీశ : (తనలో) హౌ బ్యూటిపుల్ క్వైట్ అనెక్స్‌పెక్టెడ్.
బుచ్చమ్మ: అయ్యా మీరు చల్దివణ్ణము తించారా?
గిరీశ: నాట్‌ది స్లైటెస్టు అబ్‌జెక్షన్. యెంతమాత్రమూ అభ్యంతరము లేదు. మీరే వడ్డిస్తారా యేమిటి?
బుచ్చమ్మ: మీకు ఆలిశ్యం వుందా.
గిరీశ : నాట్ ది లీస్టు. యెంతమాత్రమూ ఆలిశ్యములేదు. వడ్డించెయ్యండి. ఇదిగో వెళ్ళి పోవస్తాను. తోవలో యేటివద్ద సంధ్యావందనమూ అదీ చేసుకున్నాను.
(బుచ్చమ్మ నిష్క్రమించుచున్నది.)
గిరీశ: వాట్. యీవిడ మీసిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే?
వెంకటే: అవును.
గిరీశ: యిన్నాళాయి నీకు విడో మారేజి విషయమై లెక్చరిస్తూంటే ఈ కథ యెప్పుడూ చెప్పినావుకావు. మీ ఇంట్లోనే ఒక అన్‌ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగు విడో వున్నదోయి! మైహార్టు మెల్టుస్ నేనే తండ్రినైతే యెవరికైనా ఇచ్చి పెళ్ళిచేసేదును. (తనలో) ఇంత చక్కని పిల్లనెక్కడా చూడలేదు. పల్లెటూరు వూసుపోదనుకున్నాను గాని కాంపేన్ ఓపెన్ చేసి పని జరిగించడముకు మంచాపర్చూనిటీ యీ పల్లెటూరిలో కూడా తటస్తించడం నా అదృష్టం. (పైకి) మీ సిస్టర్‌కి చదువు వచ్చునా. వెంకటే: రాదు.
గిరీశ: (తనలో) అయితె లవ్ లెటర్సు ద్వారా కథనడిపించడముకు వీలులేదు.
(కరటకశాస్త్రి ప్రవేశించుచున్నాడు)
కరటక: మీకోసం వడ్డించి బుచ్చమ్మ కనిపెట్టుకవున్నది.
గిరీశ: యిదిగో వస్తున్నాను. (అని గిరజా సవరించుకొనుచు మీసములు కీటుకొనుచు లోపలికి వెళ్ళుచున్నాడు.)
(వెంకటేశ్వర్లు కూడా అతనితో వెళ్లుచున్నాడు)
శిష్యుడు : (తెరలో తేనిచి)
సతత్రమంచేషు - మంచేషా కుంచేషా?
పుస్తకం చూడాలి
సతత్ర మంచేషు
సతత్ర మంచేషు
సతత్ర మంచేషు
సతత్ర మంచేషు - మూడు పర్యాయములు వల్లెవేయడమైనది.
మనోజ్ఞ వేషాం
మనోజ్ఞ వేషాం
మనోజ్ఞ వేషాం
యింతసేపటికి పట్టుపడినది (కలిపి చదువుచున్నాడు)
సతత్రమంచేషు మనోజ్ఞ వేషాం,
సహ - ఆ రఘు మహారాజు, తత్ర - అక్కడ, మంచేషు - మంచం అంటే మంచంగదా, "షూ" మాటకేమి. మనోజ్ఞ - మనోజ్ఞ మయినషువంటి, వేషాం - అక్కడ నట్టిపోయినది. యిది ఆ నాటకంలో వేషమో భాగవతవేషమో తెలియకుండా వున్నది. గురువుగారి నడగవలెను. (ప్రవేశించుచున్నాడు)
కరటక: అబ్బీ కొత్త శ్లోకము చెప్పనటరా?
శిష్యుడు: పాతశ్లోకము రువ్వేశాను.
కరటక: అయితే రెండు చిడప్పొక్కులు గోకు. (గోకుచున్నాడు)
యేదీ చదువు శ్లోకము.
శిష్యుడు: ఉదయానికి సాపుగా వచ్చింది గాని చల్దివణ్ణం తినగానే అడుగునపడి తెమలకుండా వున్నది. రాత్రల్లా రువ్వుతూనే ఉన్నాను. మీ చిడప్పొక్కులు గోకుతూ మీతో దేశాలంట తిరగడమే కాని మరి నాకు చదువు వచ్చేటట్టు కనపడదు. కరటక: (తనలో) నీ ఆసక్తి నా శ్రద్ధ వక్కలాగే వున్నాయి. నీ బుద్దులు చూస్తే కిందను పెడితే పంటా మీదినిపెడితే వానా లేకుండా వున్నది. (ప్రకాశంగా) చవువు యెందుకురా అబ్బీ? పొట్ట పోషించుకోవడం కోసం గదా? నీకు మా అమ్మినిచ్చి పెళ్ళిచేస్తాను. నీకు పెళ్లికాదన్న భయం అక్కరలేదు.
శిష్యుడు: యన్ని వందలు పుచ్చుకుని కన్యాదానం చేస్తారేమిటి?
కరటక: నీదగ్గిర డబ్బు పుచ్చుకుంటానా? ఆ ఆచారం మా యింటా వంటా కూడా లేదు. ఒక పాతికభూమి పిల్లకు వ్రాసి యిచ్చేస్తాను.
(శిష్యుడు సంతోషమును దెలుపుడు చేయునటుల వికాసముగా ముఖము పెట్టుచున్నాడు)
గాని నేను చెప్పినపని అల్లా చేస్తూ గురుభక్తితో వుండాలి.
శిష్యుడు: మీరు చెప్పినపని యెప్పుడు చెయ్యలేదు?
కరటక: యీవేళ చిన్నమ్మి వివాహం విషమై జరిగిన చర్చ విన్నావుగదా - లుబ్ధావధానులు సంబంధం జరగకుండా చెయ్యవలెను. నీకు ఆడవేషం వేసి తీసుకవెళ్లి అతనికి పెళ్లి చేస్తాను. నీకు మన మహారాజావారి నాటక కంపెనీలో ఆడపిల్ల వేషం అలవాటే గనుక యవరూ భేదించలేరు. ఈడున్నా పొట్టిగా కూడా వున్నావు. ఆడవేషంతో నిన్ను చూచిన తరువాత లుబ్ధావధానులు తప్పకుండా నిన్ను పెళ్ళాడడానికి వప్పుకుంటాడు.
శిష్యుడు: యిదెంతపని.
కరటక: గాని బహుజాగ్రత్తగా వుండాలి. ఏమయినా వ్రాత ప్రోతం వచ్చిందంటే కొంప ములిగిపోతుంది. పదిరోజులు వాళ్ళయింట్లో వుండి యిల్లు గుల్లచేసి గందర గోళం పెట్టివెళ్ళిపోయి రావలెను. మల్లవరంలో నీకోసం కనిపెట్టుకుని వుంటాను.
శిష్యుడు: మీరు చెప్పిన దానికంటె యెక్కువ చేసుకు వస్తాను.
కరటక: యీ పనిలో నేను చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్పకుండా నీకు గొప్ప వుపకారం చేస్తాను. మా పిల్లని కన్యాదానం చేసి నిన్ను యిల్లరికం వుంచుకుంటాను.
శిష్యుడు: మీరే తల్లీ దండ్రీ అని మొదటినుంచీ ఆలోచించుకుంటూనే వున్నాను. మీ ఆజ్ఞకు యెప్పుడూ మీరేవాడిని కాను.
కరటక: ఏదీ శ్లోకం చదువు.
శిష్యుడు: సతత్ర మంచేషు మనోజ్ఞవేషాం.
(తెర దించవలెను)